[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
కులానికి మాదిగ, గుణానికి బుద్ధుడు!
నల్లన్న సార్ చాలాసేపు మాట్లాడి నా విషయం అంతా తెలుసుకొని, నన్ను తన వెంట వాళ్ళ ఇంటికి పిల్చుకొని పోయినాడు. కాళ్లూ ముఖం కడుక్కున్న తర్వాత కాఫీ ఇచ్చినాడు. కాఫీ తాగుతా, “ఇదంతా ఎస్సీ కాలనీ సార్! మేము ఎస్సీలం! నా పేరు ఎం. నల్లన్న! ఎం అంటే మాదిగ! మీకు అభ్యంతరం లేకపోతే జీతం వొచ్చేవరకు ఈ సందు కార్నర్లో, మాదే వొక షాపు రూమ్ ఉంది! అందులో మీరు ఉండొచ్చు! జీతాలు రెండు మూడు నెలల వరకు రాకపోవచ్చు! మీ పోస్ట్ అప్రూవల్ కు పోయి రావల్ల! అప్రూవల్ వొచ్చేవరకు జీతం రాదు.” అని ఆయన వాస్తవ విషయం చెప్పగానే నాకు భయం అయింది. దిగులు పడతా, “అవునా సార్, రెండు మూడు నెలల వరకు జీతం రాదా” అని ఆందోళనగా అడిగినాను.
“ఏం పర్వాలేదు సార్! నేనుండాను కదా! మీకు కావల్సిన సహాయం చేస్తాను” అని హామీ ఇచ్చినాడు నల్లన్న సార్. అప్పుడు ఆయన నాకు ఒక దేవుని మాదిరి కనిపించినాడు. కాఫీ తాగినంక వాళ్ల షాపు దగ్గరికి పిల్చుకొని పోయి వాకిలి తీసి చూపించినాడు. పర్వాలేదు బాగుంది, మా బండమీదపల్లెలోని మా గూడుమిద్దె కంటే ఎన్నోరెట్లు బాగుంది. కరెంటు లైటుంది. కింద బండ పరుపు, కావల్సినన్ని గూళ్లుండాయి. చాలా సంతోషం అయింది. నేను సంతృప్తి పడతా ఉంటే, “బాత్రూం లేదు సార్, మా ఇంటి ముందుండే మా బాత్రూములో స్నానం చేసుకోవచ్చు! లేకుంటే, దగ్గర్లో కోనేరుంది, దాన్ని సిద్ధ యంగన్న బావి అని అంటారు, ప్రతిరోజూ సాయంకాలం అందులో స్నానం చేసి రావచ్చు” అని నల్లన్న చెప్పినంక బాత్రూం విషయం నాకు గుర్తొచ్చింది. “ఏం పర్వాలేదులెండి సార్, ఎట్లో అడ్జెస్ట్ చేసుకుంటాను. మీరు పక్కనే ఉంటారు, అదే నాకు ధైర్యం!” అని నవ్వుతా అన్నాను. నల్లన్న సార్ నా భుజం తట్టుతా, “మనం పేదోళ్ళం, పరస్పరం సహాయం చేసుకోకుంటే ఎట్ల సార్?” అంటా వాళ్ల పాపను పిలిచి, నా రూములో కసువు నూకించినాడు. వొగ నీళ్ల బిందెను తెప్పించినాడు. ‘కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అన్నీ సర్దుకోండి, నేను తర్వాత వొచ్చి కలుస్తాన’ని చెప్పి వాళ్ళింటికి వెళ్లిపోయినాడు నల్లన్న.
ఆలోచిస్తా ఉంటే ఏదో కొత్త శక్తి, కొత్త ధైర్యం కలగసాగింది నాకు. సంతోష పడతా సామాన్లన్నీ సర్దుకుండాను. అంతలోనే నల్లన్న సార్ వొచ్చినాడు. ఇద్దరమూ టౌన్ లోకి పోయినాం. ఎమ్మిగనూరు రోడ్డు పక్కన నిర్మల్ టాకీస్ దగ్గరికి పోతా, వొగ దిగుడు బావిని చూపినాడు నల్లన్న. చూసి ఆశ్చర్యపోయినాను. సిద్దయంగన్న బావి అదేనంట! చతురస్రాకారంలో నాలుగు వైపుల నుంచి బావిలోకి మెట్లుండాయి! ఆ మెట్లు, మా అనంతపురం జిల్లా జడ్జి కోర్టులో ఉన్నట్లు అద్భుతంగా ఉండాయి! అవి రాళ్ల మాదిరి లేవు, పెద్ద పెద్ద మొద్దులు కట్ చేసి తోపడా పట్టి వజ్రంబంకతో కరిపించినట్లు, వరుసలు వరుసలుగా, చూపు తిప్పుకోలేనంత అందంగా వుండాయి! పది పది మెట్ల తర్వాత మూడు నాలుగు అడుగుల వెడల్పుతో నాలుగు వైపులా ప్లాట్ఫార్మ్ మాదిరి ఒక అడుగు మందం బండలు పరిచినారు. గోధుమ రంగులో చేసి కోసిన మైసూర్ పాకు ముక్కల్ని వరుసగా వొగ వరుస తర్వాత మరొగ వరుసను పైనుంచి కిందికి పేర్చినట్లు ఉండే మెట్లను, కోనేరు చుట్టూ పైన అదే రాళ్లతో నడుములెత్తు గోడగట్టి, గోడమీద నున్నగా మలిచి పరిచిన అర్ధడుగు మందం గల బండలను, కోనేరు బావిలోకి మనుషులు మాత్రమే పోవడానికి వీలుగా నాలుగు వైపులా చేసిన చిన్న సందులను చూసి నేను అబ్బురపోయినాను. ఆ మాదిరిగా ఉండే కోనేరు బావిని నేను ఎన్నడూ చూడలేదు. కింద, నీళ్లు బాగుండాయి. ఎంత లోతు ఉంటాయని నల్లన్నను అడిగినాను. సుమారు మూడు నాలుగు మట్ల లోతుంటాయని అన్నాడు. బావిలో ఈత కొట్టకుండా మెట్ల మీద కూర్చొని స్నానం చేయొచ్చునని సంతోషపడతా, నిర్మల్ టాకీస్ దగ్గరికి నల్లన్నతో కలిసి పోయినాను. అమరశిల్పి జక్కన్న సినిమా ఆడుతా ఉంది. అద్భుతమైన సినిమా సార్, ఆ పాటలు విని తీరాల్సిందే అని నల్లన్న చెబుతా ఉంటే కొన్నాళ్ళయినంక చూడల్లని అనుకుండాను.
ఇద్దరమూ కొంచెం సేపు ఎమ్మిగనూరు రోడ్లో వాకింగ్ చేసి ఇంటికొచ్చినాం. రాత్రి మా ఇంట్లో భోంచేయండి అని ప్రేమగా పిలిచినాడు నల్లన్న. నేను ఈరోజే అన్నం చేసుకోవడం మొదలు పెడతాను సారన్నాను. ఆయన బలవంతం చేసినాడు. నేను బిడియ పడతా సరే అన్నాను. రేపు ఉదయమే అన్నం వండుకోవడానికి కిరోసిన్ స్టవ్ ఏర్పాటు చేసినాడు సార్. నేను దగ్గర్లో ఉండే అంగట్లో వొగ సీసా నిండా కిరసనాయిల్ తెచ్చుకొని రేపటికి అన్నీ సిద్ధం చేసుకుండాను.
ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి స్టవ్ మీద అన్నానికి పెట్టి బయట సందులో సైడ్ కాలువ దగ్గర, గోపాల్ పండ్ల పొడితో పండ్లు తిక్కుకొని ముఖం కడుక్కునే లోపల అన్నం అయింది. రూమ్ తలుపులేసి, బిరబిరా సిద్ధ యంగన్న కోనేరు దగ్గరికి పోయి, స్నానం చేసి వొచ్చి, ఊరి నుంచి తెచ్చుకున్న శనగిత్తనాల పొడీ చింత తొక్కూ కలుపుకొని అన్నం తిన్నాను. ఆఫీసుకు ఏ డ్రెస్సు వేసుకొని పోతే బాగుంటాదో ఆలోచన చేసి, కడాకు మా శింగనమల హైస్కూల్లో ఎసిసి ఆఫీసర్ సత్యనారాయణ సార్ ఇచ్చిండే ఖాకీఅంగీ ఖాకీనిక్కర్ తొడుక్కొని, టక్ చేసుకుకొని, ఎసిసి బూట్లు వేసుకొని ఆఫీసుకు బయలుదేరుతా, పక్కనుండే ఇంట్లోకి పోయి నల్లన్న సార్‌కు నమస్కరించి దీవించమని అడిగినాను. ఆయన నా దగ్గరికి వొచ్చి నన్ను ఎదకు హత్తుకొని, “నన్ను సార్ అని పిలిచొద్దు తమ్ముడూ! వయసులో నీకంటే పెద్దవాన్ని కాబట్టి, అన్నా అని పిలువు, ఓకే తమ్ముడూ, బెస్ట్ ఆఫ్ లక్! మన మలేరియా ఇన్స్పెక్టర్ హనుమంతుతో జాగ్రత్తగా ఉండు. మాకూ అతగాడే ఇన్స్పెక్టర్! చాలా పనికిమాలినోడు. వానికి లంజల పిచ్చెక్కువ! పైగా టౌన్ ఔట్ స్కర్ట్స్ లో ఉండే కల్లుభావి, నాగనాథ హల్లీ ప్రాంతాల్లో చాలా ఇండ్లు అదే బాబతే! పేదోళ్లు మల్ల, ఏం చేస్తారు పాపం! పెళ్లి గాని పిల్లోనివి నువ్వు, జాగ్రత్త!” అని నాకు తెలియని వొగ కొత్త విషయం చెప్పి భుజం తట్టినాడు నల్లన్న.
నేను 9-30 గంటలకు ఆఫీస్ చేరుకుండాను. మా మలేరియా ఇన్స్పెక్టర్ హనుమంతు 10 గంటలకు వొచ్చినాడు. నాకు మలేరియా కిట్ ఇచ్చినాడు. అందులో రెండు మూడు పుస్తకాలు, పెన్సిళ్లు, బ్లేడ్ ప్యాకెట్లు, కామాక్విన్ టాబ్లెట్లు, వొగ బాక్సూ, బ్లడ్ స్మేర్ స్లైడ్సుండే రెండు చిన్న బండిల్సూ అన్నీ జాగ్రత్తగా పెట్టినారు. భుజానికి కిట్ తగిలేసుకొని, ఇన్స్పెక్టర్ హనుమంతు వెంట బయలుదేరినాను. ఆయన తన సైకిల్ని నన్ను తొక్కమన్నాడు. అయ్యో, నాకు సైకిల్ తొక్కడం రాదు సార్ అన్నాను. సైకిల్ తొక్కడం రాదేమయ్యా? మరి పల్లెలకు పోయి డ్యూటీ ఎలా చేస్తావు? అని ప్రశ్నించినాడు.
తప్పకుండా తొందరగా నేర్చుకుంటాను సార్ అని వినయంగా చెప్పి, ఆయన వెంట కల్లుభావికి బయలుదేరినాను. ఆయన సీటు మీద కూర్చొని నన్ను వెనక క్యారియర్ మీద కూర్చోమన్నాడు. నేను ఆ మాదిరిగానే కూర్చొని, రెండు కాళ్లూ వొగవైపు పెట్టుకుండాను. ‘అట్ల కాదయ్యా, అటు వైపొక కాలూ ఇటు వైపొక కాలూ వేసుకొని, ఫెడల్ మీద పాదాలు పెట్టి నాతో పాటు నువ్వూ తొక్కల్ల!’ అని సూచించినాడు. నేను ఆయన చెప్పినట్లే చేయడానికి ప్రయత్నించ సాగినాను. నేను సైకిల్ మీద కూర్చోవడం అదే మొదటిసారి! ఫెడల్ మీద కాళ్లు పెట్టి అతని కాళ్ల మాదిరే ముందుకూ వెనక్కీ తొక్కసాగినాను. నాకు సాధ్యం కాలేదు. కాళ్లు వెనక్కి తీసుకున్నప్పుడు ఫెడల్ తిరుగుతా నా పాదాల పైన తగులుతా ఉంది. కొంతసేపు చూసి, ‘ ఏమయ్యా, ఫెడల్ మీద కాలు పెట్టి గట్టిగా ముందుకు తొక్కడానికి కూడా రాదే? నీ చేత అయ్యెల్లేదు, కిందికి దిగు’ అని నన్ను దించి, తానూ దిగినాడు.
“మీరు సైకిల్లో పోయి, ఆ విలేజ్ దగ్గర ఉండండి సార్. నేను నడుచుకుంటా వొస్తాను పదండి” అని చెప్పి ఆయనను పంపించి నేను నడక మొదలు పెట్టినాను. సైకిల్ తొక్కడం రానందుకు నాకు సిగ్గు అనిపించింది. నిజమే, సైకిల్ తొక్కడం నేర్చుకోవాల్సిందే. అయితే ఎక్కడ నేర్చుకోవల్ల? శింగనమలలో సైకిల్ షాపులు లేవు. ఊర్లో పెద్ద పెద్ద షావుకార్ల దగ్గరే మొన్న మొన్నటి వరకు సైకిల్లు లేవు. ఫిర్కా కేంద్రం శింగనమలలోనే సైకిల్ లేనప్పుడు, ఇంక మా బండమీదపల్లె వంటి పల్లెల్లో సైకిల్ ఎక్కడుంటాది? చుట్టుపక్కల పల్లెల్లో, నేను పదవ తరగతికి వొచ్చేవరకు సైకిల్ ఎక్కడా చూసింది లేదు. చిన్నప్పుడు ఐస్ క్రీమ్ డబ్బా పెట్టుకొని, వొగరిద్దరు అనంతపురం నుంచి సైకిల్ మీద వొచ్చినప్పుడు చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అది రెండు చక్రాల మీద ఎట్ల ముందుకు పోతాదో, దాని మీద కూర్చొని, కింద పడిపోకుండా మనిషి ఎట్ల తొక్కుతా ముందుకు పోతాడో చూసినోళ్లందరికీ ఆశ్చర్యమే! మళ్లీ వొగసారి, కొర్రపాడు నాగిరెడ్డి కొడుకు గోపాల్ రెడ్డి, కొత్త సైకిల్ మీద వొచ్చినాడని ఊర్లో ఉండే మొగోళ్లందరూ గుంపులు గుంపులుగా వొచ్చి చూసి ఆశ్చర్య పోయినారు. ఆ సైకిల్ పేరు హర్క్లెస్ సైకిల్ అని విని, దాని రేటు అడిగినారు. నూటా యాభై రుపాయలని అతడు చెప్పుతానే అందరూ నోరెళ్లబెట్టినారు. అట్లాంటి వూర్లో, ఆ పరిస్థితుల్లో నేను సైకిల్ తొక్కడం ఎట్ల నేర్చుకుంటాను?
నన్ను నేను ప్రశ్నించుకుంటా కల్లుభావి దగ్గరికి చేరుకుని, మా ఇన్స్పెక్టర్ని కలుసుకుండాను. నేను ఇంటింటి దగ్గరికి పోయి, వాకిలి దగ్గర నిల్చుకొని, “ఏమమ్మా ఇంట్లో అందరూ బాగుండారా?” అని అడగసాగినాను. వొగ పదిండ్ల తర్వాత వొగ ఇంటి దగ్గర అడుగుతానే, ‘నాయనా, నా కొడుకు మెయిలో బాగలేదు. సలి సలి అయతాదంట! ఏంటివన్నా గుళికలు ఉంటే ఈ సామీ’ అని ఒక పెద్దామె అడిగింది. నేనూ మా ఇన్స్పెక్టర్ లోనికి పోయినాం. చలి జ్వరము ఎప్పటినుంచి ఉంది, ఇంట్లో ఇంకా ఎవరికైనా ఉందా అని వివరాలడిగినాం. ఆమె కొడుకుకు నా వయసుంటాది. దగ్గరికి రమ్మని చెప్పి, కిట్టులో ఉండే నీడిల్ బాక్స్ లోని వొగ నీడిల్ తీసుకొని, టించర్ బాటిల్లో కొంచెం దూది అద్ది అతని వేలికొనను క్లీన్ చేసి, ఎడమ చేతి వేళ్ళతో అతని వేలు పట్టుకొని, కుడిచేయి బొటనవేలు చూపుడువేలు మధ్యలో, నీడిల్ పట్టుకొని మెల్లగా అతని వేలికొనకు కుచ్చినాను. కొంచెం రక్తం చుక్క బయటికొచ్చింది. ఆ రక్తాన్ని, నా దగ్గరున్న గ్లాస్ స్లైడ్‌కు మధ్యలో అంటించుకుండాను. ఇంకొగ స్లైడ్ మూలమొనతో ఆ రక్తాన్ని మెల్లగా గుండ్రంగా, పెనుము మీద దోశ పిండి పోసి రౌండుగా తీడినట్ల తీడినాను. స్లైడ్ మీద రక్తం బాగా ఆరిపోయిన తర్వాత దానిమీద క్లీన్‌గా ఉండే మరొగ స్లైడ్ పెట్టి, తెల్లకాగితం చుట్టి ప్యాక్ చేసి, దాని మీద తేదీ, అతని పేరు తండ్రి పేరు, వయస్సు, ఊరి పేరు రాసి భద్రంగా కిట్‌లో పెట్టి, ఐదు రోజులకు కామాక్విన్ టాబ్లెట్స్ ఇచ్చి రోజుకు రెండు వేసుకోమని చెప్పి ఇన్స్పెక్టర్తో బయటికి వొచ్చినాను.
వాకిలి పంచ బాగా తెల్లగా ఉంది. దానిమీద చార్ట్ వేసి, పైభాగంలో ఇంటి యజమాని పేరు, చార్ట్ లోపల తేదీ, పేషెంట్ పేరు, వయస్సు, సర్వెలెన్స్ వర్కర్ పేరు, ఇన్స్పెక్టర్ పేరు అని వరుసగా నిలువుగీతలపైన హెడ్డింగ్స్ రాసి, దాండ్ల కింద అడ్డంగా గీత గీసినాను. ఆ గీత కింద అన్నీ ఫిలప్ చేసి, సంతకం చేసి, తేదీ వేసినాను. ఇన్స్పెక్టర్ హనుమంతు గుడకా సంతకం చేసినాడు. ఇంకొగ సందులో వొగింట్లో పదేండ్ల అమ్మాయికి గుడకా చలీ జ్వరం ఉందని తెలుసుకొని, అక్కడా వొగ బ్లడ్ స్మైర్ తీసుకొని టాబ్లెట్స్ ఇచ్చి, ఇంటి పంచన ఇంతకుముందు రాసినట్లే ఛార్టులో రాసినాను. ఇద్దరమూ సంతకాలు చేసినాం. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయినాడు. నేను సాయంకాలనికి మలేరియా యూనిట్ ఆఫీసుకు చేరుకొని ప్యాక్ చేసిన బ్లడ్ స్మైర్ స్లైడ్స్ ఇచ్చి, రికార్డు పుస్తకంలో సంతకం చేసొచ్చి, నా రూమ్ చేరుకుండాను.
రాత్రి భోజనం చేసినంక కొంచెం సేపు నల్లన్న సార్‌తో మాట్లాడుతా, కల్లుభావి విశేషాలు చెప్పినాను. ఆ ఇద్దరి కేసులూ మలేరియా అని తేలితే పెద్ద హెడ్డేక్ అని, డిపార్ట్మెంట్ అంతా వొచ్చి వాలుతాదని, మొత్తం ఊరంతా సందులు గొందులన్నీ డిడిటి పౌడర్ చల్లల్లని, ఫినాయిల్ స్ప్రే చేస్తారని, జోనల్ ఆఫీసర్ ఐఎల్ నరసయ్య వొచ్చినా రావొచ్చునని, జాగ్రత్తగా ఉండల్లని హెచ్చరించినాడు నల్లన్న.
పండుకుండాను. ఎంతసేపటికీ నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు మనసులో మెదల సాగినాయి.
ఉద్యోగ జీవితంలో మొదటి రోజు గడిచిపోయింది. నేను కల్లుభావిలో చలీ జ్వరంతో బాధపడే వాళ్ళ రక్తాన్ని పరీక్ష కోసరం స్లైడ్స్ మీద బ్లడ్ స్మెయిర్ చేయడం, ఆ స్లైడ్స్‌ను ప్యాక్ చేయడం అంతా చూసి ఇన్స్పెక్టర్ మెచ్చుకుండాడు. నాకు సంతోషమయింది. ఉద్యోగం అయితే కష్టమైందేమీ కాదు. ఇంటింటి దగ్గరికీ పోయి ఏమమ్మా, ఇంట్లో అందరూ బాగుండారా అని అడగడం కొంత నగుబాటుగా కనిపించినా, మలేరియాను గుర్తించడానికి ఇంటింటికి వెళ్లి రక్త నమూనాలు సేకరించడం మంచిదే అనిపిస్తుంది. ఏమాత్రం వ్యాధి లక్షణాలున్నా కామాక్విన్ మాత్రలు అద్భుతంగా పనిచేస్తాయని నల్లన్న చెప్పినాడు. దోమల ద్వారా వొచ్చే ఈ వ్యాధిని నయం చేసుకోవడానికి శక్తి లేని పేదలకు ఇది గొప్ప వరమే కదా! దీనికోసరం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టడం ఎంత మంచి విషయం! ఇటువంటి ప్రోగ్రాముల వల్లనే దేశంలో కలరా, మసూచి, ప్లేగు వంటి వ్యాధులు దాదాపు మటుమాయమయినాయంట! ఈ NMEP ప్రోగ్రాం వల్ల అమెరికాలో మలేరియా పూర్తిగా నిర్మూలించబడినట్లు, ఈ దేశంలో గుడకా మలేరియా పూర్తి కంట్రోల్ కావచ్చు! ఇటువంటి ప్రోగ్రాంలో సర్వేలెన్సు వర్కర్ డ్యూటీ ఒక చిన్న డాక్టర్ డ్యూటీ వంటిదే అనిపిస్తుంది! పల్లెల్లో చదువు రాని మొరటోళ్లు కొంతమంది ఈ డ్యూటీని హేళనగా చూస్తారు గానీ వాళ్లందరూ ఈ డిపార్ట్మెంట్ సేవలను పేదా ధనికా తేడా లేకుండా ఉపయోగించుకునేటట్లు గవర్నమెంట్ రేడియోల ద్వారా దినపత్రికల ద్వారా నిరంతరము తెలియజేస్తే ఎంత బాగుంటాది! అప్పుడు ప్రజల్లో ఉండే చులకన భావము తగ్గిపోతాది కదా! వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి కదా!
ఉద్యోగం అయితే తృప్తినిచ్చేదే కానీ జీతమే చాలా తక్కువ. నూరు నూటాఇరవై రూపాయల జీతం అయితే చాలా బాగుండేది! దీంట్లోనే పని చేస్తా, ప్రైవేట్‌గా చదువుకోడానికి వీలయితాదేమో చూడల్ల! ఎట్లైనా తొందరగా సైకిల్ తొక్కేది నేర్చుకోవల్ల అనుకుంటా నిద్రలోకి జారుకుండాను.
ఆదోని, రెండో బొంబాయంట!
మలేరియా సర్వెలెన్స్ వర్కర్‌గా నా డ్యూటీ చేయడానికి పడమటి ఆదోనిలో వీధి వీధిలో పారాడినాను. నాకు అలాట్ చేసిన కల్లుభావి, ధనాపురం, నాగనాథహళ్లి, ఇస్వి పల్లెల్లో సందు సందులోనా తిరిగినాను. తిరుగుతా ఆదోని చుట్టుపక్కల ఉండే పల్లెల్లోని వ్యవసాయాన్నీ పంటలనూ చూసినాను. ఆదోని గొప్ప వ్యాపార కేంద్రంగా ఎందుకు మారిందో గమనించ సాగినాను.
ఆదోనికి దరిదాపుల్లో పెద్దపెద్ద చెరువులు గానీ, కనీసం పెన్న మాదిరుండే నదులుగానీ యావీ లేవు. అందుకే వరి పండే మాగాణి కనిపించలేదు. ఎక్కడ చూసినా నల్లరేగడి పొలాల్లో పత్తిపంటే ప్రధానంగా ఉన్నట్టుంది. తెల్లజొన్న కూడా పండిస్తారని తెలిసింది. కల్లుభావికి పోయే దారిలో కొఠారి కాటన్ మిల్స్, మంత్రాలయానికి పోయే రోడ్డు పక్కన రాయల్ కాటన్ మిల్స్ ను చూసి ఆశ్చర్యపోయినాను. అట్లే ఆదోని కాటన్ మిల్స్, శ్రీ లక్ష్మీ కాటన్ మిల్స్, శ్రీ భవాని జిన్నింగ్ మిల్స్, అలీ కాటన్ మిల్సును చూసి, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వేలాది మంది జనాలను గమనించి అబ్బురపోయినాను. వొక్కొక్క ఫ్యాక్టరీ ఎంత పెద్దదో! ఎంత మందికి బతుకుదెరువు కల్పిస్తా ఉందో! ఇందుకేనేమో ఆదోనిని రెండో బొంబాయి అని పిలుస్తా ఉండేది!
నాగనాథ హల్లి డ్యూటీ ముగించుకొని టౌన్ లోకి వొస్తా, కాటన్ మిల్స్ గురించి మనసులో అనుకుంటా రైల్వే గేటు దాటొచ్చి, ఎడమవైపుండే టీజీఎల్వి హై స్కూల్ పక్క చూసినాను. విశాలమైన గ్రౌండ్లో స్కూల్ బిల్డింగ్ కొత్తగా కట్టినట్లుంది. నేను అనంతపురంలో ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు రాసిన కాశెంశెట్టి రాధాకృష్ణయ్య గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్ కంటే ఇంకా బాగుందని కొంచెంసేపు రోడ్లో నిలబడి చూసినాను. టౌన్లల్లో, టౌన్ల పక్కన ఇంతింత భూమిని హైస్కూళ్లూ కాలేజీలూ కట్టడానికి గవర్నమెంట్‌కు దానం చేసిన భూస్వాములు ఎంత గొప్పవాళ్లో! వాళ్లు కేవలం పేరు కోసరం లక్షల విలువ చేసే ఆస్తిని త్యాగం చేయడం ఎంత గొప్ప విషయం! అది వాళ్ళ అక్రమ సంపాదన అయ్యి ఉండొచ్చు! అయినంత మాత్రాన అందరూ ఇంతింత ఆస్తిని త్యాగం చేస్తారా? అనంతపురంలో గుడకా డిగ్రీ కాలేజీకి ఆ సాయిబులు 80 ఎకరాలకు పైబడి భూమిని దానం చేయడం సామాన్యమైన విషయమా? ఇటువంటి పెద్ద షావుకార్ల గొప్ప బుద్ధి వల్ల గవర్నమెంట్ కు ఎంతో బరువు తగ్గిపోతావుంది! ఎంతోమంది చదువుకోడానికి అవకాశం కలుగుతావుంది! ఉస్తిపల్లి సుబ్రమణ్యం ముందుకు రాకపోయి ఉంటే, శింగనమలలో హైస్కూలు లేకపోయి ఉంటే నేను చదువుకోనుందునా? ఆ చదువే లేకపోతే ఈ మాత్రం ఉద్యోగమైనా తనకు వచ్చిండునా? పెద్దోళ్ల త్యాగాలను గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తా ఇల్లు చేరుకుండాను.
ఒగ జత బట్టలు ఒంటిమీద, మరొగ జత బావి బండమీద!
ఉద్యోగంలో చేరి రెండు నెలలు దాటిపోయినా ఇంకా జీతం రాకపోవడంతో దిక్కు తెలియలేదు. నల్లన్న దాదాపు 30/- రూపాయల వరకు చేబదులు ఇచ్చినాడు. ఇంకా అడగడానికి మనసు రాలేదు. ఇంకా జీతం ఇవ్వలేదని, చాలా ఇబ్బందిగా ఉందని, పదో ఇరవయ్యో పంపమని నాయనకు జాబు రాస్తే వారం దినాలకే నాయన బదులు రాసినాడు. ఉద్యోగంలో చేరినా జీతం ఎందుకియ్యరు? నువ్వు జీతం డబ్బులతో జల్సా చేసుకుంటా, మమ్మల్ని మర్చిపోయినావు. ఎంతో కష్టపడి నిన్ను చదివించినందుకు మాకు బాగా బుద్ధి చెబుతా ఉండావు అంటా నాయన చాలా బాధపడతా జాబు రాయించినాడు. నిజమే, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, నన్ను చదివించినారు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వొచ్చిందని మురిసిపోయినారు. ఉద్యోగంలో చేరి రెండు నెలలైనా నాకు జీతం రాలేదంటే వాళ్ళు మాత్రం నమ్ముతారా? ఏ రకంగా వాళ్ళని నమ్మించల్ల? దరిదాపుల్లో ఉంటే నాయనను ఆఫీసుకు పిలుచుకొని వొచ్చి వాస్తవ విషయం తెలపొచ్చు.
నన్ను గురించి ఇంట్లో అందరూ ఏమనుకుంటా ఉండారో! సీతంపల్లిలో కులస్తులందరికీ నాయన నా గురించి చెడ్డగా చెప్పినాడేమో! చెప్పినా నేనేం చేయగలను? నాకు జీతం రానందువల్ల నాయనోళ్లకు ఇంతవరకూ ఏమీ పంపలేకపోయినాను. అది నా తప్పు కాదుగదా! నా పరిస్థితిని నాయన అర్థం చేసుకోవల్లగదా! నల్లన్న సార్ లేకపోతే ఈ కొత్త ప్రాంతంలో నా గతేమిటి? చిన్నాయనోళ్ళకు జాబు రాసి పదో పదైదో పంపమని అడగడానికి మనసొప్పదు. హెడ్మాస్టర్ సార్ చాలా సహాయం చేసినాడు. కాబట్టి ఆయనకూ రాయలేను. బియ్యం అన్నీ అయిపోయినాయి. స్టౌలో కిరసనాయిలు, డబ్బీలో చిట్లంపొడి, తలకాయకు అంటించుకుండే ఆముదమూ, అన్నీ ఇంకొగ రెండు మూడు దినాలకు సరిపోతాయి అంతే! వొచ్చే నెలలో జీతాలు రావొచ్చునని అంటా ఉండారు. అంతవరకు బియ్యమూ అప్పుడప్పుడు, పప్పు చేసుకుండేకి వొగ అర్ధ శేరు కందిబేళ్లు, వొగ కాల్ కేజీ వొట్టి మిరపకాయలు, వొక పావు ఉప్పు ,కాసింత పసుప్పొడి కావల్ల! ఎట్ల చెయ్యల్లనో యేమో దిక్కుతోచలేదు. ఆటికీ, దినానికి రెండు పూటలే తింటా ఉండాను. పప్పు చేసినప్పుడు అమ్మయ్య తిరగవాత పెట్టేది. ఇప్పుడు పప్పుకు తిరగవాత పెట్టల్లంటే మంచి నూనె, తెల్లవాయలు, కరివేపాకు, ఆవాలగింజలు కావల్ల గదా! అవి కావల్లంటే రెండు మూడు రూపాయలు కావల్ల! ఎవురిస్తారు? ఏం, తిరగవాత పెట్టుకోకుంటే పప్పు బాగుండదా? బాగుంటుందో బాగుండదో, కడుపు కింత తినల్ల! ఆకలి అయినప్పుడు రుచేమి పశేమి? పల్లెలకు డ్యూటీకి పోయినప్పుడు చేన్లల్లో గురగాకో పాయిలాకో చెంచిలాకో పీక్కోనొచ్చి పప్పు చేసుకుంటాను. తిరగవాత పెట్టకపోయినా పప్పు బాగుంటాది కదా!
తిండిని గురించి వొగ దిగులైతే తొడుక్కునే బట్టలను గురించి ఇంకొగ దిగులు! హెడ్మాస్టర్ సార్ ఇచ్చిన ఎసిసి డ్రెస్ ఖాకీ అంగీలు రెండూ వీపు మీద చినిగిపోయినాయి. దినామూ తొడుక్కుంటా పిండుకుంటా ఉంటే ఎన్నాళ్లుంటాయి? లోపల బనీను లేక, చెమటకు తడిసీ తడిసీ మెత్తబడి, మొన్న ఉతికినప్పుడు పిగిలిపోయినాయి. ఇంక ఉండేది, కల్లూరు శనక్కాయల మిల్లులో పనిచేసిన కూలి డబ్బులతో కుట్టించుకోనుండే రెండు ట్రౌజర్లూ రెండు శ్లాగులూ రెండు పాత నిక్కర్లే! ఇవీ చినిగిపోతే తర్వాత నా గతేమిటి? చినిగిపోయిన శ్లాగులు తొడుక్కొని డ్యూటీకి ఎట్ల పోవల్ల? అమ్మయ్యన్నా దగ్గరుంటే చినిగిపోయిన బట్టలు కుట్టేది! చినిగిన అంగీలను సూదితో కుట్టుకుండేది నాకు రాదు! రాదనుకుంటే జరిగే పని కాదు! చినిగిన బట్టల్ని కనిపించనట్లు కుట్టుకోవడం నేర్చుకోవల్సిందే!
సిద్ధయంగన్న కోనేరుబావిలో బట్టలు పిండుకుంటా ఉంటే రకరకాలుగా ఆలోచనలు రాసాగినాయి. ఆదివారం కాబట్టి తీరికగా ఆలోచన చేస్తా బట్టలన్నీ ఉతికి ఆరేసినాను. లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి, నడుముకు టువ్వాలు చుట్టుకొని, బట్టలన్నీ ఆరే వరకు అక్కడే ఉండి, మధ్యాహ్నానికంతా రూముకొచ్చినాను. ఇంకా కొంచెం తడిగా ఉన్నప్పుడే ట్రౌజర్లూ నిక్కర్లూ శ్లాగులూ సరిగా మడతలు వేసి దిండు కిందనో ట్రంకుపెట్టె కిందనో పెట్టుకుంటే ఇస్త్రీ చేయించుకోవల్సిన పనిలేదని రూముకు చేరుకుంటానే ఆ పని చేసినాను.
ఆదోని మెడలో పులిగోరు జామియా మసీదు!
సాయంకాలం నల్లన్న వెంట బజారుకు బయలుదేరి టౌన్ విశేషాలన్నీ చూసుకుంటా పోతా ఉండాను. వొగ పల్లెటూరి మనిషి నల్లన్నను పలకరించినాడు. నల్లన్న ఎవురినో అడిగినాడు. “నాను చూసి లేను సారూ! ఆ యప్పికీ సెంగన్ని మంది న్యాత్తులుండ్రి కిదా, ఇంగ యాడ కనిపిచ్చీని? మాపుటికి మా సుంకులమ్మ గుడికెళ్లి వచ్చేన్య. అబ్బుడు నాను సెప్పుతాలే సారూ!” అని బదులచ్చినాడు. ఆ మాటలు నాకు చాలా కొత్తగా అనిపించినాయి. మా పల్లెల వాళ్ల మాటలకు వీళ్ల మాటలకు చాలా తేడా ఉందనిపించింది. మొరట మాటలైనా ఎంత మృదువుగా ఉండాయో! మాటల్లో ఎంత అమాయకత్వం ఉందో! మాటల్లోని యాస ఎంత సొగసుగా ఉందో! అనంతపురం నుంచి తూర్పున తాడపత్రి దాటుతానే భాషలో యాసలో మార్పు, ఉత్తరాన గుత్తి గుంతకల్లు దాటగానే ఇంకొగ రకమైన ఉచ్చారణ, ముప్పై నలభై మైళ్లలోనే భాషలో ఎందుకింత మార్పు జరుగుతాదో ఆలోచిస్తా ముందుకు పోతా ఉండాను. అంతలోనే ఏదో పెద్ద దర్గా వచ్చింది. నల్లన్నను అడిగినాను. అది దర్గా కాదు, షాహి జామియా మసీద్ అని చెప్పుతా నన్ను లోపలికి పిలిచినాడు. మసీదు చుట్టూ కోట గోడ మాదిరి గారతో కట్టిన ఎతైన గోడ, మధ్యలో నాలుగంతస్తుల ఎత్తున్న ముఖద్వారం, ఆ ద్వారానికి రెండంతస్తుల ఎత్తున్న పెద్ద తలుపుల్ని చూసి నేను ఆశ్చర్య పోయినాను. మా శింగనమలలోని దర్గా దీనికి దిష్టి తియ్యడానికి గుడకా పనికిరాదేమో అనుకుంటా, నల్లన్న వెంట లోపలికిపోయి చుట్టూ చూస్తా, దొమ్మలు గుద్దుకో సాగినాను. దాదాపు పదెకరాల విస్తీర్ణం మధ్యలో మసీదు కట్టినారు. దాని ముందర పెద్ద కోనేరు ఉంది. అది లోతుగా ఏమీ లేదు. రెండు మెటికల వరసలు నాలుగు వైపులా ఉండాయి. ముస్లింలు మసీదు లోపలికి పోయి నమాజు చేసుకుండే ముందు,అందులో కాళ్లూ చేతులూ కడుక్కుంటారని నల్లన్న చెప్పగానే ముస్లింలకు ఎంత భక్తినిష్ఠలు అని అనుకుంటా మసీదు వైపు చూసినాను.
ఐదు ద్వారాలు కమాన్(ఆర్చి) తిప్పి కట్టినారు. ముందు భాగంలో ఎనిమిది గోపురాలు, ఆ చివరా ఈ చివరా పెద్ద గోపురాలు, మసీదు మధ్యలో గుండ్రంగా చాలా పెద్ద గోపురం, చుట్టూ గోపురాలు,వెనక భాగంలో గుడకా ఆ చివరా ఈ చివరా ఎత్తైన పెద్ద గోపురాలు అద్భుతంగా కనిపిస్తా ఉంటే మెచ్చుకో సాగినాను. మసీదు పైనున్నవి గోపురాలు కాదని, అవిట్ని మీనారాలు అని అంటారని, నల్లన్న సార్ చెప్పగానే, నాకు చార్మినార్ సిగరెట్ ప్యాక్ పైనుండే బొమ్మ గుర్తుకొచ్చింది. మసీదు పైన మధ్యలో పెద్దగా ఉండే మీనార్,హిందువులు దేవునికి పూజ చేసే సమయంలో వొగ తెల్లని నీళ్ళ చెంబు పైన చుట్టూ మామిడాకులు పెట్టి మధ్యలో జుట్టు తీయని టెంకాయ పెట్టినట్లు కనిపిస్తా ఉంది. ఐదు కమాండ్ల ద్వారాల పైనుండే నల్లరాతి పలకల్ని చూడమన్నాడు నల్లన్న. చూసినాను. పదైదు రాతి పలకల మీద ఉర్దూ భాషలో ఏవో రాసినారు. అవి పర్షియన్ భాషలో రాసిన ఖురాన్ శ్లోకాలని, హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైనదో ముస్లింలకు ఖురాన్ అంతే పవిత్రమైనదని నల్లన్న సార్ వివరించినాడు.
నేను ముస్లింలకు పవిత్రమైన ఖురాన్ గురించి వినడం అదే మొదటిసారి. మసీదును ఏదో అద్భుతమైన ఎర్రరాయితో కట్టినారు. రాళ్ల మధ్య గార గానీ సిమెంట్ గానీ ఏమీ లేదు. రాళ్లను రంపం మిషన్‌లో కోయించుకొని వొచ్చి అతికించినట్ల ఉండాయి. రాళ్ల మధ్యలో ఆ కాలంనాటి ఏదో అద్భుతమైన బంకను అతికించినారేమోనని అడిగినాను. అవి గ్రానైట్ రాళ్లని, మన పార్లమెంటు భవనాన్ని ఇట్లాంటి రాయితోనే కట్టినారని చెప్పినాడు నల్లన్న. ఇద్దరమూ లోపలికి పోయినాం. మాతో పాటు ఎంతోమంది హిందువులు, సిక్కులు, బ్రాహ్మణులు వొచ్చి చూసి విస్తుపోతా, ఫోటోలు తీసుకోసాగినారు. నేను మసీదు పైనుండే కుడి ఎడమల్లోని మీనార్లలోని గొలుసులను చూసి ఎంత అందంగా ఉండాయో అని ఆశ్చర్యపోతా, లోపల స్తంభాలపైన అత్యద్భుతంగా ఎంతో పనితనంతో తిప్పిన కమాండ్లను చూసి మరింత విస్తూ పోయినాను. దేవాలయం లోని గర్భగుడి మాదిరి ఉన్న ప్రాంతాన్ని గమనించి, మసీదు పైన మధ్యలో ఉండే పెద్ద మీనార్ కింద ముఖ్యమైన భాగం ఇదే కావొచ్చునని, అక్కడ విగ్రహం ఏదైనా ఉందేమోనని కండ్లతో వెతుకుతా నల్లన్నను అడిగినాను.
ముస్లింల మసీదుల్లో విగ్రహాలు ఉండవని, వాళ్లు విగ్రహారాధనకు వ్యతిరేకమని, ఆ మతంలో ఉండే గొప్పతనం అదేనని నల్లన్న చెప్పుతా ఉంటే నేను నమ్మలేకపోయినాను. తరువాత ఆ మసీదును ఎవురు ఎప్పుడు కట్టించినారని వివరాలన్నీ అడిగినాను. ఆయన పూస గుచ్చినట్ల చెప్పినాడు.
బీజాపూర్ సుల్తాన్ సికిందర్ ఆదిల్షా దగ్గర గవర్నర్ గా పనిచేసిన సిద్ధి మసూద్ ఖాన్, ఈ జామియా మసీదును 1662లో, అంటే ఇప్పటికి దాదాపు 300 సంవత్సరాల కిందట కట్టించినాడు. తన మిత్రుడు షహనాజ్ నుండి పదెకరాల భూమిని కొని దాదాపు 20 లక్షల దీనారాలు ఖర్చు పెట్టి, ఇరాన్ దేశం నుంచి ఇంజనీర్లను పిలిపించి, కట్టించినాడు. ఇది ఆదోని పట్టణానికి నడిబొడ్డులో ఉంది. ముందు భాగంలో మార్కెట్, వెనక అరబిక్ హై స్కూల్, కుడివైపున పూల బజారు, ఎడమవైపున షరాఫ్ బజారు ఉండాయని అన్నీ చూపించినాడు నల్లన్న. ఇది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన మసీదులలో వొగటని, ఇందులో వెయ్యి మంది ఒగేసారి కూర్చొని నమాజ్ చేసుకోవచ్చని, అన్ని మతాల కులాల వాళ్లూ వొచ్చి దీన్ని చూసి పోతారని, ముస్లింల మసీదైనా మతసామరస్యానికి ఇది కేంద్రమని, ముస్లింల మీద మతం పేరుతో దాడులు జరిగితే మాత్రం ఇది పులిగోరు మాదిరిగా మారుతాదని నల్లన్న మసీదు గొప్పతనాన్ని ఎంతో ఇష్టంగా చెప్పినాడు. దీన్ని ఎంతో శ్రమపడి కట్టించిన మసూద్ ఖాన్ కు ఈ మసీద్ అంటే అంతులేని ప్రేమ అని, ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు, ఆదోని కోటను ముట్టడించడానికి వచ్చి బ్రహ్మాండమైన ఆ కొండ కోటను కూల్చడానికి చేతగాక, మసూద్ ఖాన్‌కు ఎంతో ఇష్టమైన ఈ జామియా మసీదును కూల్చివేస్తానని బెదిరించడంతో, మసీదు మీదున్న ప్రేమను వొదులుకోలేక ఔరంగజేబుకు లొంగిపోయినాడని చరిత్రకు సంబంధించిన విషయాలు చాలా ఇంటరెస్టింగ్ గా చెబుతా ఉంటే ఆసక్తిగా విన్నాను. నల్లన్న టౌన్లో పుట్టి పెరిగినోడు అయినందువల్ల ఎన్నో విషయాలు తెలుసుకుండాడని , ఎంతయినా పల్లెటూరి వాళ్లకంటే పట్నం మనుషులు అన్ని విషయాల్లోనా తెలివిగా ఉంటారని అనుకుంటా ఇల్లు చేరుకుండాను.
గవర్నమెంట్ ఉద్యోగిగా తొలి జీతం – అంతులేని ఆనందం!
ఉద్యోగంలో చేరిన మూడు నెలల తర్వాత నాలుగో నెల మొదటి వారంలో జీతాలు ఇచ్చినారు. యూనిట్ ఆఫీసులో ఇన్స్పెక్టర్ హనుమంతు అక్విటెన్స్ రిజిస్టర్లో రెవెన్యూ స్టాంప్ మీద సంతకం చేయించుకొని, వొగ నెల రెగ్యులర్ జీతము అంతకుముందు రెండు నెలల అరియర్స్ అంతా కలిపి 180 రూపాయలు చేతికిచ్చినాడు. గవర్నమెంట్ ఉద్యోగిగా తొలి జీతం చేతికి అందుకుంటా ఉంటే ఏదో చెప్పలేనంత ఆనందం శరీరమంతటా నిండుకుంది. నాతో పాటు నల్లన్నా మిగతా సర్వెలెన్స్ వర్కర్సూ రెగ్యులర్ జీతాలు తీసుకుండారు. నాతోపాటు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆంజనేయులు గుడకా నామాదిరిగానే జీతం తీసుకుండాడు.
ఆంజనేయులూ నేనూ ఇంతకుముందు రెండు మూడు సార్లు కలిసినాం. మనిషి మంచివాడు. నా మాదిరిగానే ఒంటరిగా ఎక్కడో ఉండాడు.
ఇన్స్పెక్టర్ నవ్వుకుంటానే అడగడంతో మేమిద్దరం కొత్త వాళ్లం, ఆఫీసులో ఉన్న వాళ్లందరికీ మిరపకాయ బజ్జీలు కాఫీలు తెప్పించినాం. బిల్లు రెండు రూపాయలు అయింది. ఆఫీసు నుంచి బయటికి వొచ్చినంక నల్లన్నకు ఇవ్వాల్సిన చేబదులు 30 రూపాయలు ఇచ్చి వేసినాను. ఇంటికి వొచ్చినంక, నల్లన్న సార్ పరిచయం చేసిన చిల్లరంగట్లో ఇవ్వాల్సిన పది రూపాయలు చెల్లించినాను. సీతంపల్లికి పోయి నాయనోళ్లకు డబ్బులు స్వయంగా ఇచ్చి వచ్చేది మేలు కదా, మనియార్డర్ చేస్తే అది చేరడానికి వారం దినాలు టైం పడుతుంది కదా, అని ఆలోచన చేసినాను. సీతంపల్లికి పోయి రావడానికి రైలూ బస్సు చార్జీలు కనీసం అంటే 12 రూపాయలు అవుతాయని, ఇంకొగ మూడు నాలుగు రూపాయలు వేసుకుంటే వొగ ట్రౌజరూ శ్లాగూ కుట్టించుకోవచ్చునని ఆ ఆలోచన మానుకొని, నూరు రూపాయలు మనియార్డర్ చేసినాను. ఆ విషయమూ జీతాల విషయమూ తెలుపుతా హెడ్మాస్టర్ సారుకు, చిన్నాయనోళ్లకు ఉత్తరాలు రాసినాను. రాత్రి పప్పు అన్నము వండుకొని తృప్తిగా తిని పండుకుండాను.
***
టైం టేబుల్ డ్యూటీ ప్రకారం నిన్న నాగనాథ హళ్లికి పోయినాను. కల్లుభావి కంటే ఊరు పెద్దది. అందరూ వొగ రకమైన మధ్యతరగతి రైతులు. మంచి కష్టజీవులు. అందుకే చాలా జీనుత్తంగా బతుకుతా ఉండారు. దాదాపు అందరిండ్లలోనా మూడుపూటలా జొన్న రొట్టెలూ జొన్న సంగటే! అమ్మడానికి ఊర్లోకి యేవొచ్చినా జొన్నలు పోసే కొంటారు. ఆ కొనే వాళ్లను చూస్తానే, మా ఊర్లో వడ్లు పోసి కొనే మా ఊరి ఆడోళ్లే, ముఖ్యంగా మా అమ్మయ్య గుర్తొచ్చింది. రేగడి చేండ్లల్లో ఎట్టికి పండే కాసరకాయలు మాత్రం కొనరు. ప్రతి ఇంట్లోనా వారానికి కనీసం రెండుసార్లన్నా కాసరకాయల వేపుడుకూర వొండుతారు. రేగడి జొన్నరొట్టెలు చేయడంలో ఈ పల్లెలన్నీ ప్రసిద్ధి! పల్చగా పూరీల మాదిరి తెల్లజొన్న రొట్టెలు పెనాల మీద పొంగుతా, వెండి రేకులు మాదిరి కనిపిస్తా ఉంటే, ఆ పొంగులో నుంచి జొన్నకమురు వాసన వొస్తా ఉంటే నోట్లో నీళ్లు ఊరుతాయి. మొన్న వారం కిందట వొగరోజు తొమ్మిది గంటలకే నాగనాథ హల్లికి చేరుకొని వొగ ఇంటి పంచన నిలుచుకొని, గోడమీద ఛార్ట్ వేసి ఇంట్లో అందరూ బాగుండారా అమ్మా అని అడిగినాను. అందరూ బాగుండారని ఆ ఇంటి యజమానురాలు, యాల పొద్దుకొచ్చిండావు, వొగ రొట్టి తినయ్యా అని పిలిచింది. నేను వొద్దన్నాను. ఆమె బలవంతం చేసింది. వాళ్ళు సంసారం బాగుండారని నాకు తెలుసు. ఇంట్లో ఉండే యజమానుడు కూడా బ్రతిమాలినాడు. సరే అని నేను చేతులు కడుక్కొని లోపలికి పోయి కూర్చుండాను. ఆ పెద్దమ్మ కూతురు కావొచ్చు, వేడివేడి రొట్టె కాకరకాయ పొడికూర వొగ పళ్లెంలో వేసుకొని వొచ్చి నా ముందర పెట్టి, “పుండికూర పొప్పు సేస్యామ్య, యెయినా సారూ” అని అడిగింది. పుండి కూరంటానే, చిన్నప్పుడు పత్తికొండలో, మా పెద్దమ్మోళ్ల ఇంట్లో గోగాకు పొప్పు గుర్తొచ్చింది నాకు. గోగాకును ఈ ప్రాంతంలో పుండికూర అంటారనుకొని వెయ్యమ్మా అన్నాను. ఆమె పుండికూర పప్పు వేసింది పల్చని జొన్నరొట్టెలకు ఆ రెండు కూరలూ అద్భుతమైన కాంబినేషన్ అనుకుంటా, రెండు రొట్టెలు లాగించేసినాను. అమోఘమైన రుచి! ఈ టేస్ట్, ఎవురికయినా సరే, ఈ పల్లెలకు వొచ్చి, ఈ రైతుల ఇండ్లల్లో తింటే తప్ప తెలియదనుకుంటా, వాళ్లకు థ్యాంక్స్ చెప్పి, బయటకొచ్చినాను.
ఈ ప్రాంతం పల్లెల్లో ఆడవాళ్లు ఎక్కువగా ముతక చీరలు కట్టుకొని, బయటకొస్తే, తలకాయల మీద కొంగులు కప్పుకోవడం నాకు కొత్తగా అనిపించింది. రెండు మూడు నెలల నుంచి బాగా గమనిస్తా ఉండాను. వొగరిద్దరు పిల్లలైన ఆడవాళ్ళందరూ నోట్లో అదేందో వస్తువు పెట్టుకుంటారంట! తెల్లని పండ్ల సందుల్లో నల్లగా కనిపిస్తా వుండేది చూసిచూసి, వొగరోజు నల్లన్నను అడిగితే, అది ‘దాసెన’ అని చెప్పినాడు. దాసెన అంటే వొగ రకమైన నస్యం పొడి అంట! నోరు వాసన రాకుండా పండ్లకు రుద్దుకుంటారంట!
కొంచెం వయసైన చదువు రాని ఆడవాళ్లందరూ కాళ్లల్లో పెద్దపెద్ద వెండి కడియాలు వేసుకోవడం గమనించి, నేను నా చిన్నప్పుడు మా అమ్మయ్య వేసుకున్న కడియాలను గుర్తుకు తెచ్చుకుండాను. అయితే మా ప్రాంతంలో ఇప్పుడు ఆడవాళ్లు కాళ్లల్లో వెండి కడియాలు వేసుకుండే పద్ధతి ఎక్కడా కనిపించదు. అందుకే ఈ ప్రాంతం ఇంకా పూర్వ సంప్రదాయాలతోనే ఉందనుకుండాను.
కొన్ని కులాల్లో మగవాళ్లు సల్లడాలు కట్టుకుంటా వుండారు. నా వయసుండే పెదోళ్లందరూ పట్టీల నిక్కర్లు, బట్టతో కుట్టించిన కట్ బనియన్లూ తొడుక్కుంటా ఉండారు. మధ్యతరగతి రైతులు బిల్లగోసి పంచలూ , పెద్ద రైతులు కొంతమంది ఖద్దరు పంచెలూ జుబ్బాలూ, మరికొంతమంది గ్లాస్కోమల్లు పంచల పైన తెల్లని బెన్నీ షర్టులూ తొడుక్కొని, ఆ తెల్ల డ్రెస్సులతోనే రేగడిలో గెలెమూ, చెక్కల గుంటకా తోలుతా ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయినాను. మా ఊర్లో, మా పల్లెల్లో కనిపించని టైరుబండ్లు ఈ పల్లెల్లో ఎక్కువగా ఉండాయని అనుకుంటా, సుమారుగా నా డ్యూటీ ముగించినాను. మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఇన్స్పెక్టర్ వొచ్చినాడు. నేను డ్యూటీ ముగించిన సందుల్లోకి పిలుచుకొని పోయి, నేను ఇండ్లలో ఆరోగ్య విషయాలు అడిగినానో లేదో ఆరా తీసి, నేను వేసిండే ఛార్ట్ మీద సంతకం చేసి, బాగా తిరిగినావు కదయ్యా, సరే అటువైపు పోదాం రా అని నన్ను ఊరి బయట ఉండే ఇండ్ల దగ్గరకు పిలుచుకొని పోతా, వొగ ఇంటి వసారా కిందికి చేరుకుండాడు. తన రికార్డ్స్ అన్నీ బయట అరుగు మీద పెట్టి, లోపలికి పోయి, ఎవరితోనో మాట్లాడి ఐదు నిమిషాలయినంక బయటకొచ్చి, “నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, నాకు లోపల మాట్లాడే పనుంది, ఒక అరగంట మాట్లాడొస్తాను. నువ్వు అంత వరకు ఇక్కడే ఉండు. ఎక్కడికీ పోవద్దు” అని చెప్పి మల్లా లోపలికి పోయినాడు.
ఎక్కట్నుంచో వొచ్చిన ఇతనికి ఈ పల్లెల వాళ్ళతో ఏమి సంబంధాలు అని ఆలోచన చేస్తా, నేను వసారాలోనే కూర్చుండాను. దాదాపు అర్ధగంట సేపయినంక బయటకొచ్చినాడు ఇన్స్పెక్టర్ హనుమంతు. నాతో మాట్లాడతా దగ్గరికి వచ్చి” ఏమయ్యా, లోపలికి పోయొస్తావా?” అని మెల్లగా అడిగినాడు. నేను “లోపలికి ఎందుకు సార్” అని అర్థం కాక అడిగినాను. “నువ్వు ఉత్త అమాయకుని మాదిరుండావే? లోపల ఇద్దరు ఆడవాళ్లుండారు, నీకు ఎవరు ఇష్టమైతే వాళ్లు వస్తారు. ఇద్దరూ బాగున్నారు. రెండు రూపాయలే. కావల్లనుకుంటే తొందరగా పోయి రాపో” అని చాలా ప్రేమతో చెప్పినాడు. నాకు వెంటనే నల్లన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి.
“వద్దు సార్, నాకు ఇష్టం లేదు” అని తల అడ్డం తిప్పినాను.
“నువ్వు ఎట్లా వానివయ్యా? మంచి యువకునివి, వద్దంటావు? అనుభవం లేకుంటే నేర్పిస్తారు పో” అని ప్రేరేపించినాడు.
“నో నో సార్, ఐ యాం సారీ” అని తలదించుకునే, అడ్డం తిప్పుతా అన్నాను. “సరే నీ ఇష్టం” అని లోపలికి పోయి ఇంటోళ్లకు చెప్పి బయటకొచ్చి బయలుదేరినాడు హనుమంతు. ఆ ఆడోళ్లు ఎవరైనా బయటికి వస్తారేమో, వాళ్ళ ముఖాలు చూస్తాం అని అనుకుంటా, ఒక క్షణం వాకిలి వైపు చూసినాను. ఎవురూ రాలేదు. నేను హనుమంతు వెంట బయలుదేరినాను.
సైకిల్ తొక్కే వీరుడైనాను!
నేనూ ఆంజనేయులూ కలిసి రామ్ జలకు పోయే వీధిలో వొగ ఇల్లు బాడుగకు మాట్లాడినామని, రోజూ వంట చేసుకొని డ్యూటీకి పల్లెలకు పోవడం కష్టమయితా ఉందని, పైగా ప్రతిరోజూ చిట్లంపొడీ చింత తొక్కుతో తినీ తినీ సాలయిపోయిందని నల్లన్నకు చెప్పినాను. అది విని ఆయన చాలా సంతోషపడినాడు. ఆయన అనుమతితో వాళ్ల రూము వొదులుతా, మూడు నెలల బాడుగ పది రూపాయలు ఇవ్వబోయినాను. ఆయన తిరస్కరించినాడు. నేను బ్రతిమాలడంతో ఐదు రూపాయలు తీసుకుండాడు.
రామ్ జలకు పోయే వీధిలో తూర్పుముఖంగా ఉండే చిన్నగారమిద్దే మా ఇల్లు. వొగ చిన్న హాలు, సపరేటుగా వంటగది, బచ్చలిగదీ ఉండే మా కొత్త ఇంటి బాడుగ ఐదు రూపాయలు. పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఇంటి పని వంట పని చేసేకి వొగ పెద్దాయమ్మను మాట్లాడుకుండాం. ఆ యమ్మకు నెలకు ఐదు రూపాయలు జీతం. అన్నీ బాగా కుదిరినాయి. కడుపుకింత కమ్మగా తినడానికి అవకాశం కలిగింది.
నాయన నుంచి డబ్బులు ముట్టినట్లు ఉత్తరం వచ్చింది. సంతోషపడతా ఇంకా ఇరవై రూపాయలు పంపించి ఉంటే బాగుండేదని ఉత్తరములో తెలిపినాడు నాయన. నా మనసు చివుక్కుమనింది. వెంటనే చేసిన చేబదుళ్ల విషయమూ నా గుడ్డల విషయమూ తెలుపుతా ఉత్తరం రాసినాను. ఒగ జత బట్టలు కుట్టించుకుండాను. చాలా కాలం నుంచి సైకిల్ తొక్కడం నేర్చుకోవల్లని మనసులో ఉండే కోరిక బయటకొచ్చింది. స్నేహితుడు ఆంజనేయులుతో చెప్పినాను. ప్రతి ఆదివారం నేర్పుతానన్నాడు ఆంజనేయులు. చెప్పిన మాట ప్రకారం తానే గుర్తు చేసి బాడుగ సైకిల్ షాప్ దగ్గరికి పిల్చుకొని పోయినాడు. రెండు గంటలకు అర్ధణా బాడుగ ప్రకారం బాడుగసైకిల్ తీసుకొని, రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉండే ఎమ్మిగనూరు రోడ్డు వైపు పోయినాం.
ఆంజనేయులు, నన్ను సీట్ మీద కూర్చొని ఫెడల్ మీద పాదాలు పెట్టి గట్టిగా హేండిల్ పట్టుకోమన్నాడు. నేను అతడు చెప్పినట్ల చేసినాను. అతడు కూడా ఎడమ చేతితో హ్యాండిల్, కుడి చేతితో సీటు కింద ఉండే స్ప్రింగ్ పట్టుకొని, కాళ్ళతో ఫెడల్ తొక్కమని నాతో చెప్పుతా, స్టాండ్ ను వెనక్కి అన్నాడు. హ్యాండిల్ మీద ఉండే నా చేతులకు బ్యాలెన్స్ చిక్కలేదు. ఫెడల్స్ మీద పాదాలతో తొక్కడడానికి చేతకాలేదు. హ్యాండిల్ సరక్కన పక్కకు తిరిగింది. తన వైపు వొరుగుతా ఉండే సైకిల్ని గట్టిగా పట్టుకుండాడు ఆంజనేయులు. నేను అతడు చెప్పినట్లు హేండిల్‌ని గట్టిగా పట్టుకొని మల్లా తొక్కడానికి ప్రయత్నించినాను. ఈసారి హ్యాండిల్ సరక్కన కుడిపక్కకు తిరిగింది. వొరిగిపోతా ఉండే సైకిల్ని పట్టుకోడానికి వీలుగాక వొదిలేసినాడు ఆంజనేయులు. నేను దబ్బన కిందపడినాను. నామీద సైకిల్ పడింది. నొప్పితోనే నవ్వుతా నేను పైకి లేచి, సైకిల్ తొక్కేది నేర్చుకోవడం చాలా కష్టమే, నేర్చుకున్న ప్రతి మనిషీ ఈ ప్రకారంగా దెబ్బలు తగిలించుకొని ఉంటాడు అని అనుకుంటా, మల్లా ప్రయత్నం చేసినాను. వొగ గంట సేపయినంక రోడ్డు పక్కనుండే చెట్టుకు సైకిల్ని ఆనించి, రాళ్ల మీద కూర్చుండాము. ఆంజనేయులు, నేను సైకిల్ హ్యాండిల్ ఎట్ల పట్టుకోవల్లో, ఫెడెల్స్ మీద కాలు పెట్టి ఎట్ల తొక్కల్లనో అంతా వివరిస్తా, ముఖ్యంగా భయపడకూడదని, కింద పడిపోతానేమో అనుకున్నప్పుడు బార్ మీదికొచ్చి నేలకు కాళ్లు ఆనించల్లని చెప్పుతా చూపించినాడు. ఏమైతేనేం రెండు గంటలకల్లా సైకిల్ హ్యాండిల్ మీద చేతులు పెట్టి నడుస్తా సైకిల్ నడిపించడం నేర్పించినాడు ఆంజనేయులు.
ఇద్దరమూ రాళ్ల మీద కూర్చొని సైకిల్ నిర్మాణాన్ని గురించి మాట్లాడుకుండాం. నాకయితే అందులోని ప్రతి భాగమూ ఆశ్చర్యాన్ని కలిగించింది.రోడ్లో మొరటోళ్లు సైకిల్స్ తొక్కుకుంటా ఎక్కడెక్కడో చూసుకుంటా మాట్లాడుకుంటా పోతా ఉంటే నాకు సిగ్గనిపించి,పట్టుదల పెరిగింది. ఆదివారం నాడే కాకుండా రోజూ సాయంకాలం పూట గుడకా సైకిల్ తొక్కడం నేర్చుకోసాగినాను.వొగ వారం దినాలయినంక నేను వొక్కడినే బాడుగసైకిల్ తీసుకొని పోయి ప్రాక్టీస్ చేసినాను. రెండు వారాలకంతా సైకిల్ తొక్కడం బాగా నేర్చుకుండాను.
అందాల మంచినీటి సరస్సు రామ్ జల!
అందరూ చెప్పుతా ఉంటే ‘రామ్ జల ఏమిటిది? ఏముందక్కడ? ఆ కొండల మీద కనిపించే కట్టడాలు ఏమిటివి? వొగ సారి పోయి చూసొస్తే మేలు కదా’ అనుకుంటా నల్లన్నను అడిగినాను. ఆయన ఈ ఆదివారం సాయంకాలం పోదామన్నాడు.
నేనూ ఆంజనేయులూ నల్లన్నతో కలిసి బయలుదేరినాం. మేము ఉండే చోటికి అందుకున్నట్లు కొండలు, కొండ దిగువ పెద్ద వనము దగ్గరగా కనిపించినా సుమారుగా రెండు మైళ్ళకు పైగానే దూరం ఉందనిపించింది. ఆదివారం కావడంతో పిల్లలు పెద్దలతో కలకలలాడతా ఉంది ఆ ప్రాంతమంతా. చెరువు కట్ట కింద మంచి పార్కు చేసినారు. పార్కు నిండా పిల్లలు బిలబిలమంటా ఆడుకుంటా ఉండారు. అవతలి వైపు పెద్ద చెరువు ఉన్నట్లుందని కట్ట ఎక్కి చూసినాను. అద్భుతం! రెండు పెద్ద కొండల సందులో గొంది మాదిరుంది. రెండు కొండలకు ఆనించి, కట్ట కట్టినారు. చెరువు నిండితే ఎక్కువైన నీళ్లు కిందికి పోవడానికి మరవ పెట్టినారు. ఆ మరవను బట్టి చూస్తే, అదేమీ పెద్ద యేరు కాదు. సుమారయిన వంక! ఆ వంకకు అడ్డంగా కట్టగట్టి నీళ్లు నిలిపినారు. నీళ్లు చెరువు నిండా ఫుల్లుగా ఉండాయి. కొండల సందులో దూరంగా ఎగదన్నినట్లుండాయి. నీళ్లకు అవతల ఉత్తరం వైపున కొండలు కనిపిస్తా ఉండాయి. వర్షాలు పడినప్పుడు ఆ కొండల్లోని నీళ్లన్నీ కిందికి జారొచ్చి వంకగా ఏర్పడినట్లుంది. ఆ వంకకు అడ్డంగా చెరువు కట్ట నిర్మించినట్లుంది. మా శింగనమల, అనంతపురం, గుత్తి, కణేకల్ చెరువులంత పెద్ద చెరువు కాదు. చిన్నపాటి చెరువు. ఈ చెరువును ఎవరు కట్టించినారో నల్లన్నను అడిగినాను. విజయనగర రాజులని కొంతమంది, బీజాపూర్ సుల్తానులని కొంతమంది అనుకోవడమే కానీ స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవన్నాడు నల్లన్న. రామ్ జల అనే పేరు ఎందుకొచ్చిందో గుడకా తెలియదన్నాడు.
రాయలసీమలో చెరువులన్నీ కట్టించింది విజయనగర రాజులే కానీ నవాబులు చెరువులు కట్టించినట్లు ఎక్కడా వినలేదని, దీన్ని గుడకా విజయనగర రాజులలో ఎవరో వొకరు కట్టించి ఉంటారని, పక్కనుండే కొండ పేరు ‘రణ మండల ఆంజనేయస్వామి కొండ’ అయినప్పుడు, కొండ పేరు చెరువు పేరు హిందువుల పేర్లే అయినప్పుడు, దీన్ని నవాబులు కట్టించలేదనిపించింది నాకు. ఎవురు కట్టించినా, ఆదోని ప్రజల దప్పిక తీర్చడానికి ఈ రాం జల చెరువు వొక్కటే ఆధారమని నల్లన్న స్పష్టం చేసినాడు. ఆదోనికి ఆ పేరు ఎట్లొచ్చిందని అడిగిన దానికి నల్లన్న కొంత చరిత్రను చెప్పినాడు.
ఈ ప్రాంతాన్ని అశోకుడు పరిపాలించినట్లు, అశోకుడు జొన్నగిరి వద్ద వేయించిన శాసనాల వల్ల తెలుస్తుంది. జొన్నగిరి అశోకుని కాలంలో సువర్ణగిరి పేరుతో ప్రసిద్ధి పొందింది. సువర్ణగిరి కాలక్రమంలో జొన్నగిరిగా మారింది. శాతవాహన రాజుల తర్వాత ఈ ప్రాంతాన్ని యాదవ రాజులు పరిపాలించినారు. అందుకే ఈ కొండను యాదవ గిరి అని, ఈ ప్రాంతాన్ని యాదవ అవని అని అంటారు. యాదవ అవని అనే పేరే యాదవానిగా ఆదవానిగా మార్పు చెందింది.
నల్లన్న చెప్పిన చరిత్ర ఎంతవరకు నిజమో అనుకుంటా, చరిత్రలోని విషయాలు ప్రజల్లో ఉండే అభిప్రాయాలు పొంతన లేనివని చర్చించుకుంటా ఇల్లు చేరుకుండాం.
***
ప్రతినెలా జీతం తీసుకుంటానే 35 రూపాయలు నాయనోళ్ళకు పంపుతా ఉండాను. అట్లా మూడు నెలలు వరుసగా పంపడంతో నాయనోళ్లు ప్రొద్దుటూరు సీతంపల్లి నుంచి సొంతూరు బండిమీదపల్లెకు తిరిగొచ్చినారు. చెరువు కింద వరికోతల కాలానికి ముందుగానే తిరిగొచ్చినారని మనసు ఊరట చెందింది.
ఆదోనికి ఉద్యోగంలో చేరడానికి వొచ్చేటప్పుడు “జీతం వచ్చినప్పుడు ఇస్తువు లేరా, పెట్టుకో” అని హెడ్మాస్టర్ సార్ ఇచ్చిన ఇరవై రుపాయలు ఆయనకు ఇయ్యల్లని చాలాసార్లు అనుకొని ఇవ్వలేకపోయినాను. ఎట్లైనా సరే, వొచ్చే నెల జీతం నాయనోళ్ళకు పంపకుండా హెడ్మాస్టర్ సార్‌కు ఇయ్యల్లని అనుకొని, అదే విషయమే నాయనకు జాబు రాసినాను. ఇవ్వమని నాయనా బదులు రాసినాడు. సంతోషమయింది.
జీతం తీసుకొని శనివారం లీవు పెట్టి తెల్లవారుజాముననే లేచి బొంబాయి – మద్రాస్ మెయిల్‌కు బయలుదేరి, గుంతకల్లులో దిగి, పది గంటలకల్లా అనంతపురం చేరుకుండాను. అనంతపురాన్ని చూస్తానే సంతోషం అయింది. బస్టాండ్ దగ్గర పూలూ పండ్లూ తీసుకొని, తాడిపత్రి బస్సెక్కి మా చెరువు మరవకొమ్మ దగ్గర దిగి, చెరువు వైపు, మాగాణి వైపు చూసినాను. చెరువు ఫుల్లుగా నీళ్లతో కళకళలాడతా ఉంది. చెరువునూ దూరంగా కనిపిస్తా ఉండే శింగనమలనూ మాగాణినీ చూసి మనసు పరవశించిపోయింది. సంతోషంతో అడ్డదావలో నడుస్తా, అయిన వరి పొలాల్లో వెన్నులు చిరుగాలికి బరువుగా ఉగుతా మత్తుగా శబ్దం చేస్తా ఉంటే ఆనందంతో మురిసిపోతా, శింగనమల చేరుకొని సొంతింటి లోగిట్లోకి చేరుకున్నట్ల పొంగిపోయినాను. హెడ్మాస్టర్ సారోళ్ల ఇంట్లోకి అడుగు పెడతానే కన్నతల్లి పొత్తిళ్లలోకి చేరుకున్న పసిపిల్లోని మాదిరి కరిగిపోయినాను.
నన్ను చూస్తానే జయమ్మక్క కన్నతల్లి మాదిరి మురిసిపోయింది. పూలూ పండ్లూ ఇచ్చి అక్క పాదాలకు నమస్కరించినాను. ఉద్యోగ విషయాలన్నీ ప్రేమతో అడిగింది జయమ్మక్క. అన్నీ చెప్పినాను. అంతలోనే హెడ్మాష్టర్ సారొచ్చి, నన్ను చూసి ఆనందపడినాడు. ఉద్యోగ విషయాలన్నీ చెప్పి, సార్‌కు ఇరవై రూపాయలు ఇవ్వబోయినాను. సార్ తీసుకోలేదు. “నేను ఇచ్చినవన్నీ ఇవ్వగలవేమిరా నువ్వు? పోరా, తిక్కనాయలా! ఈ ఇరవై రూపాయలు మీ నాయనికే ఈ పో” అని మందలించినాడు.
స్కూల్ వొదిలినారేమో, పిల్లలందరూ ఇంటికొచ్చినారు. అందరినీ చూస్తానే సంతోషం అయింది .సూరీనీ రాధనూ కొంచెం సేపు ఆడించినాను. బాగున్నావా అన్నా అంటా రవి దగ్గరకి వొచ్చినాడు. అందరితోపాటు కూర్చొని భోంచేసినాను. బ్యాగ్ తీసుకొని ఊరికి బయలుదేరుతా ఉంటే, త్వరలో అనంతపురం దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయిస్తాలేరా అని హెడ్మాస్టర్ సార్ కొత్త ఆశలు కలిగించినాడు. సరే సార్ అని నేను బయలుదేరి సాయంకాలానికల్లా బండిమీదపల్లెలో మా ఇంటికి చేరుకుండాను. నన్ను చూస్తానే అమ్మయ్య ఆనందంతో కన్నీళ్లు కారుస్తా వొచ్చి నన్ను కరుసుకొని కడుపుకు ఆనించుకొని తల నిమరసాగింది. పిల్లోళ్లందరూ దగ్గరికొచ్చి కరుసుకుండారు. చిన్నాయనా జేజీ సంతోషంతో మురిసిపోయినారు.
దాదాపు రెండేండ్ల తర్వాత కలుసుకోవడంతో పిల్లల్లో ఏదో మార్పు కనిపించింది. అమ్మయ్య మనిషి బాగా తగ్గిపోయింది. మల్లా గర్భవతి అని అర్థమయింది. పెద్దక్కా, వెంకటలక్ష్మీ బాగా ఎత్తయినారు. పెద్దన్న మోటిడిసినాడు. జయమ్మ సుమారుగా పెద్దగయింది. బ్యాగులో తెచ్చిన అరటిపండ్లు తీసి తలా వొగటి ఇచ్చింది అమ్మయ్య. నేను శింగనమలకు పోయి వచ్చిన విషయం చెప్పి, హెడ్మాష్టర్ సారు డబ్బులు తీసుకోలేదని పది రూపాయలు నాయన చేతికీ ఐదు రుపాయలు అమ్మయ్యకూ ఇచ్చినాను. పిల్లల చేతిలో మూడు రూపాయలు పెట్టినాను. రాత్రి అన్నం పొద్దు వరకు జతగాళ్లతో గడిపినాను.
ఆదివారం ఆరేటి నారాయణ పొట్లి కోసినాడని నాయన రెండు కుప్పలు నంజిరి తెచ్చినాడు. చిన్నాయనోళ్లకు కూడా అమ్మయ్య కురాకు చేసింది. అందరూ కలిసి భోజనం చేస్తా ఉంటే ఎంతో ఆనందమైంది. మనసులో అనుబంధం కువకువలాడింది. పయిటాల వరకు అందరితో సంతోషంగా గడిపి బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకల్లా ఆదోని చేరుకుండాను.,
కళ్లు కళ్లు కలిపిన రామ్ జల పార్క్!
ప్రతి ఆదివారం సాయంకాలం రామ్ జల పార్క్‌కు పోయి వొగ గంట సేపు గడిపి ఇంటికొస్తాను. ఆదోనికొచ్చిన తరువాత నల్లన్న సారూ ఆంజనేయులూ తప్ప ఎవురూ నాకు స్నేహితులు కాలేదు. దానికి కారణం, నేను కొంచెం రిజర్వుడ్‌గా ఉంటాను. కలివిడిగా అందరితోనూ మాట్లాడడం నాకు చేతకాదు. నాకు స్నేహితులయ్యే వాళ్ళు ఎవురూ తారసపడలేదు. పార్కుకు పోయేటప్పుడు వొచ్చేటప్పుడు మౌనంగా హుందాగా తలొంచు కొని నడుస్తా ఉంటాను. రెండు వారాల కిందట వొకామె, నా వెనక వస్తా, కొంచెం దగ్గింది. ఆ దగ్గు సహజంగా వొచ్చిన దగ్గు మాదిరి లేదు. అదే పనిగా దగ్గినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూసినాను. ఆమె నా వైపు చూసి వెంటనే తలొంచుకుంది. వొంచుకున్నా దొంగచూపులు కనిపించినాయి. ఏమోలే మనకెందుకు అనుకొని, నేను ముందుకు అడుగేసినాను. ఆమె వెంటనే ‘హేయ్–ఇశ్చొ ఇశ్చొ’ అని అనింది. నన్నేనేమో అని నేను కొంచెం ఇబ్బందిగా వెనుదిరిగి చూసినాను.
కాంపౌండ్ గేటు దగ్గర పండుకున్న కుక్కను అదిలిస్తా వోరగా నన్ను చూస్తా, నేను చూడగానే తలదించుకొని, గేటు తీసి లోపలికిపోయింది. ఆమె వెంట కుక్క ముడ్డి తిప్పుతా పోయింది. ఆమెను చూస్తానే నాకు ఉమావతే అనిపించింది. అచ్చం ఉమావతి మాదిరే ఉంది. ఉమావతేనా? అంతా నా భ్రమ గానీ, ఉమావతి ఇక్కడికి ఎందుకొస్తుంది? అనుకుంటా మళ్ళీ వెనక్కి తిరిగి చూసినాను. ఆమె గేటు వేస్తా నా వైపే చూస్తా ఉండడం గమనించినాను. ఆమె సిగ్గుతో పెదవులు వొత్తుకుంటా గేటు వేసి లోపలికి వెళ్ళిపోయింది. నా మనసులో తీయనిదేదో పారాడుతా ఉంటే ఇంటి వైపు అడుగులు వేసినాను.
ఆ కాంపౌండులో ఉండే పెద్ద కొట్టం వాళ్లదేనేమో! చాలా పెద్ద కాంపౌండ్! సుమారుగా ఏడెనిమిది సెంట్లు ఉంటాదేమో! రామ్ జలకు పోయే మెయిన్ రోడ్లో ఇంటి స్థలం చాలా పెద్దదే! అమ్మాయి ఏమి చదువుకుంటా ఉందో? దాదాపు నా వయస్సే! ఉమావతి చిన్నాయన కూతురో లేకుంటే సొంతం చెల్లెలో అన్నట్లుంది. వాళ్ల నాయన ఏం పని చేస్తున్నాడో? కొట్టములో ఉండారంటే కొంచెం పేదోళ్లే అనిపిస్తాది. మా ఇంటికి దగ్గరే! వాళ్ళ ఇంటి కాట్నుంచి పదో ఇల్లే మాది! మేము ఈ ఇంటికొచ్చి మూడు నెలలు అయింది.ఎప్పుడూ కనిపించలేదే ఈమె?
ఆలోచిస్తా ఇల్లు చేరుకుండాను. రాత్రి నిద్ర పట్టలేదు. కళ్లనిండా ఆమె రూపమే! ఆ వోర చూపులే! ఆ సిగ్గుముఖమే! ఆ ఉంగరాల వెంట్రుకలే! ఆ బుల్లి గడ్డమే! నేను పరిచయం లేని పరాయి మగవాన్ని కదా, నా వైపు వోరగా చూస్తా సిగ్గుపడడం ఏమిటి? అట్ల చూడడాన్ని నేనెందుకు ప్రశ్నించుకోవల్ల?.. ఆ చూపులు ఎంతో హాయినిస్తా ఉండాయి కదా! ఏదో చెప్పల్లని అనుకుంటా ఉండాయి కదా!.. అది నా భ్రమేనా? నిజంగా ఆ చూపులు నాకేదో చెప్పల్లని అనుకుంటా ఉండాయా?
రకరకాల ఆలోచనలతో తీయని ఊహలతో నిద్రలోకి జారుకుండాను.
పేదవాడు, పిరికివాడు ప్రేమకు అర్హుడు కాదేమో!
ప్రతిరోజూ తొందరగా డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చి ఎర్లీగా పార్కుకు పోవల్లని అనుకుంటాను కానీ వీలు కావడం లేదు. పైగా జోనల్ ఆఫీసర్ ఐఎల్ నరసయ్య తనిఖీ ఉంటాదని వారం రోజుల నుంచీ చెపుతా ఉండారు. అందుకే డ్యూటీలో సాయంకాలం దంకా ఉంటాను. డ్యూటీ ముగించుకొని ఇల్లు చేరుకుండేసరికి చీకటి పడతా ఉంది. చీకటి పడినంక పార్కుకు పోతే ఆమె అంతవరకూ పార్కులో ఉంటాదో లేదో? అసలు ప్రతిరోజూ ఆమె పార్కుకు పోతాదో లేదో? ఇదంతా గమనించల్లంటే నేను ప్రతిరోజూ ఆమె కోసమే డ్యూటీ ఎగరగొట్టి రావల్ల! అట్ల వొచ్చినప్పుడు పైనుండి ఆఫీసర్లు ఎవురైనా చెకింగుకు వొస్తే, నేను డ్యూటీలో లేనని ఉద్యోగంలో నుంచి తీసేస్తే?
ఆ ఆలోచన రాగానే భయమయింది. తనతో ఏదో మాట్లాడల్లని అనుకుంటా ఉండే అమ్మాయిని, తన వైపు వోరగా చూస్తా, చూసినప్పుడు సిగ్గుపడే అమ్మాయిని ఫాలో అయి, మెల్లగా మాటలు కలిపి మాట్లాడుతా, ప్రేమిస్తా, తన ప్రేమను తెలిసినప్పుడే కదా ఆ అమ్మాయి మనసు తెలిసేది! తనకు అది సాధ్యమయ్యే పనేనా?
ఆలోచిస్తా ఆదివారం కోసరం ఎదురుచూసి సాయంకాలం పార్కుకు పోయినాను. ఆ అమ్మాయి పార్కులో స్నేహితురాళ్లతో మాట్లాడుతా నన్ను చూసి, గలగల మాట్లాడుతుండే మనిషి చటుక్కున గొంతు తగ్గించి మెల్లగా మాట్లాడసాగింది. వాళ్లు కూర్చున్న చోటుకు దగ్గరగా ఆ అమ్మాయికి ఎదురుగా నేను కూర్చోవల్లని అనుకుండాను. అనుకోగానే వొళ్ళు చెమట పట్టింది. నన్ను నేను తమాయించుకొని, అయినా అట్ల కూర్చోవడం సభ్యతగా ఉండదనుకొని, దూరంగా పోయి కూర్చుండాను. వాళ్లు నాకు బాగా కనిపిస్తా ఉండారు. నా కోసరం ఆమె కళ్లు వెతుకుతా వుండాయి. నన్ను గమనించిందేమో, మాటిమాటికి నన్ను చూస్తా ఉంది. నేను నవ్వు ముఖంతో ఆమెను చూడసాగినాను.
ఈరోజు ఎట్లైనా సరే,ఆ అమ్మాయితో మాట్లాడల్లనుకొని, అట్లే గట్టిగా కూర్చుండాను. వొగ అర్ధగంట అయినంక వాళ్లందరూ పైకి లేచినారు. వాళ్లు లేస్తానే నేను లేయడం బాగుండదని ఆట్లే కూర్చుండాను. ఆ అమ్మాయి నా వైపు చూసి ఏదో సంకేతం ఇచ్చింది. నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదని చేతితోనే ప్రశ్నించి, ఎవురైనా గమనించినారేమోనని అటూ ఇటూ చూసినాను. ఎవురూ గమనించలేదు. అయినా గుండె దడ దడ కొట్టుకో సాగింది. వాళ్లందరితోపాటు ఆమె వెళ్లిపోతా ఉంది. ధైర్యం చేసి, పైకి లేచి, వాళ్ల వైపు అడుగులు వేస్తా, వాళ్లు కూర్చున్న స్థలం దగ్గరికి పోయినాను. అంతలోనే వాళ్ళు గేటు దాటి పోయినారు. నేను ప్చ్ ప్చ్ ప్చ్ అనుకుంటాం వొచ్చి అక్కడే ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చొని కొండవైపు తిరిగి, పైన కనిపిస్తా ఉండే దేవాలయాన్ని చూసి కళ్ళు మూసుకొని ఆలోచించసాగినాను. వెనకనుంచి ఎవురో మెల్లగా దగ్గినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూసినాను. ఆమే!!! గుండె దడదడలాడింది. ఆమె పచ్చికలో ఏదో వెతుకుతా ఉంది. పలకరించడానికి అవకాశం వచ్చింది. “ఏమిటి వెతుకుతా ఉండారు? ఏదైనా పోగొట్టుకుండారా?” అని ధైర్యంగా అడిగినాను.
“అవునండీ! మనసును పోగొట్టుకున్నాను!” అంటా ఆమె వెతకసాగింది. నాకు అర్థమైంది. ఆమె ముఖంలోకి ప్రేమగా చూస్తా, చిరునవ్వు నవ్వినాను. ఆమె కూడా అందంగా నవ్వుతా ఏదో వస్తువును వెతుకుతున్నట్టే నటిస్తా, “మీ పేరు నారాయణ కదా! మీ ఇంట్లో పని చేసే వంట మనిషి రాఘవమ్మ చెప్పింది లేండి. ఆ ఆంటీ మా వెనకింట్లోనే ఉంటాది! నా పేరు మీనాక్షి!ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతున్నాను. నేను పోగొట్టుకున్నది ఇక్కడ లేదు లేండి.” అని నా వైపు చూసి అందంగా నవ్వింది. నేను ఆమె మాదిరే పోగొట్టుకున్న వస్తువును వెతుకుతున్నట్లు చూస్తా, ముసిముసిగా నవ్వసాగినాను. మళ్లా ఆమే, “ రేపు మా హైస్కూలుకు సెలవు. ఫ్రెండ్స్ అందరమూ రణ మండల ఆంజనేయస్వామి గుడికి పోతున్నాం. అది చెప్పడానికే వొచ్చినాను” అని ఎంతో ఆశగా చెప్పింది.
“అయ్యో, మాకు రేపు వర్కింగ్ డే కదా!” అంటా ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసినాను.
“లీవు పెట్టేకి వీలు కాదా? ఏమో మీ ఇష్టం! రావాలనుకుంటే ఎట్లైనా రావచ్చు! మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, బాయ్” అని చెప్పి వెళ్ళిపోయింది. ఆలోచిస్తా ఇంటికి బయలుదేరినాను.
రేపు లీవు పెట్టేకి అయితాదా? ఇన్స్పెక్టర్ హనుమంతును అడగల్ల! రేపు తొందరగా ఆఫీసుకు పోతే తెలుస్తాది.
ఎంత ధైర్యం మనిషికి? ఏమైనా, టౌన్లో ఉండే వాళ్లే ధైర్యస్థులు! ఎంత చక్కగా ఉంది మనిషి! బ్యూటిఫుల్? ఎంత ఇంటెలిజెంట్‌గా మాట్లాడింది! ఏదైనా పోగొట్టుకున్నారా అని అడిగితే అవును మనసును పోగొట్టుకున్నాను అని ఎంత అద్భుతంగా సమాధానం చెప్పింది! నేనెందుకు అమె మాదిరి ఇంటలిజెంట్‌గా మాట్లాడలేకపోయినాను? చాలా రోజుల నుంచి ఆమె నన్ను అబ్జర్వ్ చేస్తా ఉందేమో! అందుకేనేమో, ఆమె చాలాసార్లు పార్కులో నా వైపు వోరగా చూస్తా చిరునవ్వు నవ్వేది! నేను గమనించలేకపోయినాను. నా పేరు, నా ఉద్యోగము అంతా రాఘవమ్మ ద్వారా తెలుసుకుంది అంటే, నన్ను ఇష్టపడింది అని అర్థమయితా ఉంది! రేపు ఆఫీసులో లీవు ఇవ్వకుంటే ఏమిటి పరిస్థితి? రేపు నన్ను ఆంజనేయస్వామి గుడికి ఎందుకు రమ్మనింది?
ఆలోచిస్తా ఇల్లు చేరుకుండాను. రాఘవమ్మ వంట చేస్తా ఉంది. ఆంజనేయులు ఇంట్లో లేడు. మీనాక్షిని గురించి రాఘవమ్మను అడిగినాను. తమది వాళ్ల వెనకిల్లేనని, మీనాక్షి తమ ఇంటిపిల్ల మాదిరే ఉంటాదని, చాలా మంచి పిల్లని, పుత్తడి బొమ్మ మాదిరి ఉంటాదని, వాళ్ళ నాయన రంగయ్య మున్సిపాలిటీలో జవాన్ అని, నోరు సచ్చినోడని, ఇంట్లో పెత్తనమంతా ఆ పిల్ల తల్లిదేనని, ఈ పిల్లకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ మహాతల్లి తన అన్న కొడుకుకు ఈ పిల్లనిచ్చి పెళ్లి చేయల్లని చూస్తా ఉందని, ఆ పిల్లగాడు ఆరో క్లాసో ఏడో క్లాసో చదువుకొని ఇక్కడే రాయల్ కాటన్ మిల్లులో పనిచేస్తా ఉండాడని, ఉత్త తాగుబోతులోడని అంటా కన్నీళ్లు పెట్టి, “కుందనం బొమ్మ మాదిరుండే ఆ పిల్లను ఎవురు కాపాడుతారయ్యా? వాడు చూస్తే తాగుబోతులోడే కాదు, పెద్ద రౌడీ నా కొడుకు! వొచ్చే నెలలో పెండ్లి పెట్టుకుంటారంట! ఏమయితాదో ఆ పిల్ల బతుకు పాపం? రంగయ్యన్నకు వొక్కతే కూతురు! పేరుకు కొట్టమే గానీ ఆస్తిపాస్తులు బాగుండాయి సారూ! వాళ్ల బోయ కులంలో ఇంత మాత్రం కలిగినోళ్లు తక్కువేనయ్యా” అని మీనాక్షి పరిస్థితినంతా చెప్పింది రాఘవమ్మ. ఆమె మాటలు విని నాకు పరిస్థితి అర్థం అయింది.
రాత్రి పొద్దుపోయేదాకా నిద్ర రాలేదు. రక రకాల ఆలోచనలు మనసులో మెల్లగా మెదల సాగినాయి.
రేపు ఆఫీసులో నాకు లీవ్ ఇస్తారో లేదో? వొకవేళ ఇస్తే, తాను చెప్పినట్లు నేను ఆంజనేయస్వామి గుడి దగ్గరికి పోతే, మీనాక్షి ఏం మాట్లాడుతాదో? తనకు మేనమామ కొడుకుతో పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఏమడుగుతాదో? ముక్కూ ముఖం తెలియని నన్ను ఇష్టపడినట్లు చెప్పి, వెంటనే ఎవురికీ తెలియకుండా లేపుకొని పొమ్మంటుందా? వొకవేళ మీనాక్షి అదే కోరితే, నేను ఆ పని చేయగలనా? శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకొని పోయినట్లు పోగలనా? అది తన చేతనైతాదా? పైగా వాడు పెద్ద రౌడీ నాయాలంట! అయినా వాడు ఏమి చేస్తాడులే గానీ, ఇప్పటికిప్పుడు మీనాక్షిని రహస్యంగా పిలుచుకొని పోయేకి వీలయితాదా? పోవల్లనుకుంటే ఈ ఉద్యోగం వొదిలిపెట్టి పోవాల్సిందే కదా! అది నాకు సాధ్యమయితాదా? అమ్మా నాయనా వొప్పుకోవల్ల కదా! ఒకవేళ కష్టపడి వొప్పించుకోవచ్చుననుకో, ఇంత అందమైన అమ్మాయిని చేసుకుంటానంటే వాళ్లు మాత్రం కాదంటారా? కులం బోయోళ్లంట! ఏ కులమయితే ఏముంది గానీ, ఈ ఉద్యోగం కథ? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులు, నేనీ ఉద్యోగం వొదులుకుంటానంటే అంగీకరిస్తారా? ఊర్లో వాళ్ళందరూ అసహ్యించుకోరా? బంధువులందరూ ఆడిపోసుకోరా? ముఖ్యంగా హెడ్మాస్టర్ సారూ జయమ్మక్కా ఎంత ఏవగించుకుంటారో? నిన్నగాక మొన్న వొగ చిన్న ఉద్యోగం లోకి చేరుతానే, వీడేమిటి, ఇట్ల చేసినాడని అసహ్యించుకుంటే, నేను మళ్లా వాళ్ళ ముఖం చూడగలనా? వొచ్చిన ఈ ఉద్యోగం పోగొట్టుకొని నేనెక్కడ ఉండల్ల? ఉద్యోగం రెండు మూడేండ్లు చేసినంక, పర్మనెంట్ అయితే, ఏదో వొగటి ఆలోచన చేయొచ్చు! ఇప్పటికిప్పుడు అంత సాహసం చేయడమంటే, ఉండే కష్టాలకు బాధలకు తోడు కొత్త కష్టాలు కొనితెచ్చుకోవడమే కదా! బాగా చదువుకొని, పెద్ద ఉద్యోగంలో చేరి, అవమానించినోళ్ల కండ్ల ముందర తలెత్తుకొని తిరగల్లని ఆశపడిన నేను, ఇంకా ఏదీ సాధించక ముందే నిరుద్యోగిని అయితే ఎంత అవమానం?
చూస్తాం, రేపు మీనాక్షిని కలుసుకున్న తర్వాత, ఆమె అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కదా ఇదంతా ఆలోచించాల్సింది!అని నిర్ణయించుకొని నిద్ర పోయినాను.
ఉదయం తొందరగా తయారయి ఆఫీసుకు పోయినాను. పోతా పోతా ఆఫీసులో అబద్ధం చెప్పల్లని నిశ్చయించుకుండాను. నేను పోయేసరికి ఇన్స్పెక్టర్ హనుమంతు వచ్చినాడు. నన్ను చూసి, “ఏమయ్యా డ్యూటీకి పోకుండా ఆఫీసుకొచ్చినావు? జోనల్ ఆఫీసర్ నరసయ్య, మన యూనిట్లో చెక్ చేయడానికి వొస్తా ఉండాడు కదా!” అని భయపెట్టినాడు. “పత్తికొండలో మా పెద్దమ్మకు యాక్సిడెంట్ అయిందని, మా బంధువొచ్చి చెప్పిపోయినాడు సార్, అందుకే లీవు పెట్టి పోవడానికి వొచ్చినాను సార్” అని నిర్భయంగా అబద్ధం చెప్పినాను. “అయ్యో, ఎట్లయ్యా మరి? సరే యూనిట్ ఆఫీస్ దగ్గరికి పోదాం రా” అని పిలుచుకొని పోయినాడు. ఆయన నా లీవు లెటర్ చూసి దాన్ని నా వైపు విసిరేసి, “యు బ్లడీ ఫెలో! ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నావా? ఇంటికి పోవాలనుకుంటున్నావా? – మిస్టర్ హనుమంతూ, ఇతన్ని వెంటనే ఈ రోజు డ్యూటీ ఉండే విలేజ్‌కి పీల్చుకొని పో” అని సీరియస్‌గా చెప్పినాడు. ఇన్స్పెక్టర్ నన్ను బయటికి చెయి పట్టుకొని వచ్చి, ‘నారాయణా, జోనల్ ఆఫీసర్ విజిట్ వస్తే నా గొంతు మీది కొస్తాదయ్యా! ప్లీజ్, పోదాం రాప్పా’ అని నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకుండాడు. ఇద్దరమూ సైకిల్ తొక్కుతా అర్ధగంటలో కల్లుభావి చేరుకుండాం.
హనుమంతు పది నిమిషాలు నా దగ్గరుండి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయినాడు. రెండు నిమిషాలు మీనాక్షిని గురించి ఆలోచన చేసి, జోనల్ ఆఫీసర్ విజిట్ రావచ్చునేమో, డ్యూటీలో పర్ఫెక్ట్గా ఉండడం మంచిదనుకొని, నా పని మీద దృష్టి పెట్టినాను. నెల కిందట మలేరియా ఉండొచ్చు అని అనుమానంతో రక్తం నమూనాలు తీసుకొని, టాబ్లెట్స్ ఇచ్చిన ఇంటి దగ్గరికి పోయి అడిగినాను. వాళ్లు చాలా సంతోషపడి, జ్వరం పూర్తీ తగ్గిపోయిందని, టాబ్లెట్స్ బాగా పనిచేసినాయని సంతృప్తి చెందుతా మాట్లాడినారు. నేను ఇంటి పంచ మీద ఉన్న ఛార్ట్‌లో సంతకం చేస్తా ఉండగానే రెండు జీపులొచ్చి ఆగినాయి. మా జిల్లా మలేరియా ఆఫీసర్ సూర్యప్రకాష్ రావు సార్, ఆదోని యూనిట్ ఆఫీసర్, ఇంకా ఎవురో ఇద్దరు ఆఫీసర్లు రికార్డ్స్ పట్టుకొని, అటువైపు ఇటువైపు వినయంగా వొస్తా ఉండారు. వాళ్లకు రెండు అడుగుల ముందు భాగంలో వొగ ఆఫీసర్, టక్ చేసుకొని, టై కట్టుకొని, కోటు తోడుక్కొని గంభీరంగా వొస్తా ఉండాడు. ఆయనను చూసి జోనల్ ఆఫీసరనుకొని, వినయంగా నమస్కారం చేసినాను. ఆయన నా దగ్గరికి వొచ్చి పేరడిగినాడు. ధైర్యంగా చెప్పినాను. ఇంటి యజమానినీ ఇంట్లోవాళ్లం దరినీ పిలిచినాడు. వాళ్లందరూ బయటకొచ్చినారు. మలేరియా అనే అనుమానంతో రక్త నమూనా ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పి, ఎవరని అడిగినాడు. నేనే సార్ అన్నాడతడు. జోనల్ ఆఫీసర్ అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగినాడు. ఆ ఇంటి వాళ్ళు తడబడకుండా చెప్పి, “ఈసార్ ఇచ్చిన మాత్రలు బ్రహ్మాండంగా పనిచేసినాయి సార్! చలీ జ్వరమూ కంప్లీటుగా తగ్గిపోయినాయి సార్” అంటా నన్ను చూపించినారు. ‘వెరీ గుడ్! ఇప్పుడు అందరూ బాగున్నారు కదా!’ అని అడుగుతా, ఇంటి పంచమీదున్న చార్ట్‌ను చూసి, దానిమీద ఆయన గుడకా సంతకం చేసినాడు. ఆ తర్వాత నా వైపు చూసి, “ఎక్సలెంట్ మై డియర్ బాయ్!” అని నన్ను మెచ్చుకొని ముందుకెళ్లి పోయినాడు. నేను సంతోషంతో పొంగిపోతా ఇంకా పదిండ్ల దగ్గర డ్యూటీ చేసి గుడి దగ్గరికి పోయి కూర్చుండాను. మీనాక్షి మనసులో మెదిలింది. వొగ ఆడపిల్ల ఎంతో ఇష్టపడితే తప్ప వొగ మగ పిల్లవాన్ని ఫలానా చోటికి రమ్మని చెప్పదు కదా! ఎంత ఇష్టపడిందో మీనాక్షి! వొగ రోజైనా వొగ మాట యినా మాట్లాడని మీనాక్షి, నన్నెందుకు ఇష్టపడి ఉంటాది? చాలా రోజుల నుంచీ నన్ను గమనించి ఉండొచ్చు! నా స్మైలింగు చూపుల్ని పసిగట్టి ఉండొచ్చు! ఓరచూపులతో తన ఇష్టాన్ని తెలిపి ఉండొచ్చు! అంత మాత్రాన ఆంజనేయస్వామి గుడి దగ్గరికి రమ్మంటుందా? ఏమో అక్కడైతే మనసు విప్పి తన ప్రేమనూ ఇష్టాన్నీ చెప్పల్లనుకుందేమో! రాఘవమ్మ ద్వారా నా మంచితనాన్ని తెలుసుకొని, పార్కులో నా సభ్యతను గమనించి, నన్ను ఇష్టపడిందేమో! లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో! నేను కూడా ఆ చూపులతోనే కదా ఆమెను లైక్ చేసిండేది! ఇవన్నీ కాకుండా, దుర్గుణాల కారణంగా తన మేనమామ కొడుకును పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక, మీనాక్షి నా గురించి తెలుసుకొని నన్ను ఇష్టపడిందా?
ఏమైనా ఈరోజు ఆమె రమ్మనిన చోటికి పోయి ఆమెతో మాట్లాడడానికి వీలుగాక పోయింది. నేను పోనందుకు ఏమనుకుంటా ఉందో తాను? మళ్లీ కనిపిస్తుందా మీనాక్షి? కనిపించినా మాట్లాడుతాదా? కలుసుకోడానికి అవకాశం ఇస్తే, నా మనసులోని అభిప్రాయాలన్నీ మీనాక్షితో చెప్పల్ల!
పరిపరి విధాలుగా ఆలోచన చేస్తా చీకటి పడే సమయానికి ఇంటికొచ్చి గబగబా ఫ్రెషప్ అయి, రామ్ జల పార్కుకు బయలుదేరిపోతా, మీనాక్షి వాళ్ళ ఇంటి వైపు చూసినాను. ఎవరూ కనిపించలేదు. ఇంటి వాకిలి వేసినారు. పార్కులో ఉంటాదేమోనని ఆశ పడతా పోయి, పార్క్ అంతా గమనించినాను. మీనాక్షి ఎక్కడా కనిపించలేదు. తర్వాత వొగ వారం దినాలు చూసినాను. కనిపించలేదు. సిగ్గిడిసి రాఘవమ్మను అడిగినాను. ‘ఇంట్లోనే ఉందయ్యా! నిన్న మాట్లాడినాను’ అని రాఘవమ్మ చెప్పింది. ఆపైన ఆమెను అడగడానికీ, ఆమె దగ్గర నా మనసు చెప్పడానికీ నాకు బుద్ధి పుట్టలేదు. మనసును గట్టి చేసుకొని ఆదివారం పైన ఆశ పెట్టుకుండాను. ఆదివారం రానే వొచ్చింది. సాయంకాలం అయింది. ఎంతో ఆరాటంతో పార్కుకు పోయినాను. మీనాక్షి గానీ ఆమె ఫ్రెండ్స్ గానీ ఎవరూ కనిపించలేదు. మనసంతా వికలమైంది. ఇంటికి బయలుదేరినాను.
వొగ అందమైన యువతిని ప్రేమించడానికి అర్హత ఉండల్ల! ఊరకనే ప్రేమిస్తే సరిపోదు! ఆ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి ధైర్యమూ త్యాగమూ ఉండల్ల! ఇవేవీ లేనప్పుడు ఆడదాని కళ్లల్లోకి కళ్లు కలపగూడదు! పిరికివాడు ఏమీ సాధించలేడు!
నన్ను నేను ఈసడించుకుంటా ఇంటికొస్తున్నాను.దగ్గరికొస్తానే చూపులు మీనాక్షి వాళ్ల ఇంటి వైపు పోయినాయి. ఇంటి వాకిలి తీసినారు కానీ మీనాక్షి కనిపించలేదు. గుండె బరువుతో ఇల్లు చేరుకుండాను.
ఆ తర్వాత వారం రోజులు గడిచిపోయినాయి. రోజురోజుకూ గుండె బరువు పెరగసాగింది. ఏదో తెలియని బాధ గూడు కట్టుకోసాగింది. ఇంక భరించడం సాధ్యం గాక, హెడ్మాస్టర్ గారికి ఉత్తరం రాసినాను ప్రాధేపడతా. రాసిన పది దినాలకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వొచ్చినాయి. అనంతపురం దగ్గర ఉండే బుక్కరాయ సముద్రానికి ట్రాన్స్ఫర్ చేసినారు. నల్లన్న సార్‌ను కలుసుకొని, కృతజ్ఞతలు చెప్పి, ముటా ముల్లె సర్దుకుండాను. బయలుదేరడానికి ముందు, ఆశ చంపుకోలేక, మీనాక్షి వాళ్ల ఇంటి వైపు వెళ్లి చూసినాను. ఇంటి తలుపులు వేసినారు. మీనాక్షి కనిపించలేదు. నిరాశతో వెనుదిరిగి వచ్చి, రాఘవమ్మతో, ‘మీనాక్షిని కలుసుకోడానికి ఎంతో ప్రయత్నం చేసినానని ఆమెతో చెప్పమ్మా’ అని చెప్పి వొగ రెండు రూపాయలు ఆమె చేతిలో పెట్టి రిక్షా ఎక్కి రైల్వే స్టేషన్ చేరుకుండాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
