Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-27

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

బదిలీ చేయించుకొని గుండె బరువుతో మా ప్రాంతానికి..

రైలు ఆదోని దాటి శరవేగంగా పోతావుంది. ఎక్కడ చూసినా రేగడి పొలాలే! పొలాల్లో కొర్ర, పత్తి, జొన్న పైర్లు కళకళలాడతా ఉండాయి. కొర్ర చేన్లు కోతకొచ్చినాయి. పైర్లల్లో నుంచి పచ్చని పైరువాసన హాయిగా తగులుతా వున్నా, ఇంకొగ వైపు మీనాక్షి, మొన్న పార్కులో అన్న మాటలు దేన్నో తాకుతా ఉండాయి. మీనాక్షి గుర్తుకు రాగానే ముఖం బిగుసుకొని పోయింది. అనుకోకుండా కండల్లో నీళ్లు కమ్ముకుండాయి. బాధ మనసు నిండా ముసురుకోసాగింది.

బుక్కరాయసముద్రంలో డ్యూటీలో చేరుతానే మా బండమీదపల్లి దగ్గరే కదా, ఊరికి పోయి నాయనోళ్ళకు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన విషయం చెప్పినాను. అందరూ సంతోషపడినారు. ‘పోన్లే నాయినా, దగ్గిరే గదా, రొండు మూడు వారాలకు ఒగసారన్నా కండ్ల ముందర కనిపిత్తాంటావు, అదే సాలు,’ అంటా అమ్మయ్య ఆనందంతో పొంగిపోయింది. అదే రోజే శింగనమలలో హెడ్మాస్టర్ సార్ వాళ్ళను కలుసుకొని, బుక్కరాయసముద్రంలో చేరిన సంగతి చెప్పి, ఇక్కడ నా డ్యూటీ పద్మూడు పల్లెలు సార్ అని తెలిపి, ఆ ఊర్ల పేర్లు చెప్పినాను. ‘యాడ బుక్కరాయసముద్రం, యాడ బాట్లో కొత్తపల్లి రా? ఆ ఊరికి సుమారు ఎనిమిది పది మైళ్ళ దూరం ఉంటాదేమో! ఊరకనే ఒక సైకిల్ కొనుక్కోరా!’ అని సలహా ఇచ్చినాడు సార్. ఏ సైకిల్ తీసుకోవల్లన్నా నూటా యాభై నూటా అరవై రూపాయలకు పైననే కదా! అన్ని డబ్బులు పెట్టి సైకిల్ కొనల్లంటే, ఐదారు నెలల జీతం డబ్బులు ఇంటికి పంపకుండా ఉండల్ల! అది సాధ్యమయితాదా? అని సారోళ్లకు చెప్పకుండా మనసులోనే అనుకొని, బాడుగసైకిల్ గురించి ఆలోచిస్తా ఊరికి వచ్చి, అన్నం తిని కొంచెం బియ్యమూ బ్యాళ్లూ, చిట్లం పొళ్లూ, చింత తొక్కూ మూట కట్టుకొని అనంతపురం బస్సెక్కి రాత్రి 9 గంటలకు బుక్కరాయసముద్రం చేరుకుండాను.

బుక్కరాయ సముద్రంలో రెండు నెలల కాలం గడిచిపోయింది. ఊరి చివర కొట్టాలపల్లికి పోయే రస్తాలో కురవ మల్లయ్య ఇంటిపైన బాడుగకు తీసుకున్న రూము బాగానే ఉంది. బాడుగ రెండు రూపాయలు. రెండు మూడు వారాలు ఉదయం ఐదు గంటల లేచి, అన్నం వండుకొని, ఎనిమిది గంటల లోపలే అన్నం తిని, మలేరియా కిట్ తగిలేసుకొని, పల్లెలకు డ్యూటీకి నడుచుకుంటా పోయినాను. వడియం పేట పొర్రాళ్ల, బాట్లో కొత్తపల్లికి పోయినప్పుడల్లా చాలా కష్టం అయ్యేది. నడుచుకుంటా డ్యూటీకి పోయి రూమ్ కొచ్చేటప్పటికి సాయంత్రం నాలుగు గంటలు అయ్యేది. ఆకలితో కండ్లకు మబ్బు వచ్చేది. అది భరించలేక సద్ది కట్టుకొని పోయి తినడం అలవాటు చేసుకుండాను. రెండు వారాలు అయినంక బాడుగ సైకిల్ మాట్లాడుకొని సాయంకాలం 3 గంటలకల్లా రూమ్‌కి వచ్చి పయిటాల అన్నం తినడం మొదలుపెట్టినాను. నీలంపల్లి, రేగడి కొత్తూరుకు పోయిన రోజు మనసు నిమ్మలంగా ఉంటాది. అక్కడ పెద్దిరెడ్డి వాళ్ల ఇంటికీ నాగలింగారెడ్డోళ్ల ఇంటికీ పోయినప్పుడు బంధువుల ఇంటికి పోయినట్ల ఉంటాది. ఆ ఊర్లకు పోయినప్పుడు రాత్రిపూట అక్కడే నిలుస్తాను. అట్ల నిలిచినప్పుడు బాడుగసైకిల్ తీసుకొనిపోతే రాత్రి బాడుగ ఇవ్వాల్సి వస్తాదని, ఆ పొద్దు సైకిల్ తీసుకొని పోయేది లేదు. నా ఉద్యోగం విషయం తెలుసుకుని చెన్నమ్మ పిన్నమ్మ బాధపడతా, ‘కాదురా పాపోడా, అంత చదువు చదువుకొని, ఈ పనికిమాలిన ఉద్యోగానికి యాల చేరితివిరా? ఉద్యోగం ఇప్పించిన మీ సారు, ఇప్పిస్తా ఇప్పిస్తా ఇట్లా ఉద్యోగమా ఇప్పిచ్చేది? ఏదన్నా ఆఫీసులో గుమాత్తాగానో కడాకు బిల్ల జవాన్ గానో ఇప్పీగూడదా?’ అని అంగలార్చింది.

చెన్నమ్మ పిన్నమ్మ చెప్పినంక నేనూ ఆలోచన చేసినాను. అవును కదా, హెడ్మాస్టర్ సార్ నాకు ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో క్లర్క్ ఉద్యోగమో జవాన్ ఉద్యోగమో ఇప్పించి ఉంటే బాగుండేది కదా, ఆయనకు జిల్లా పరిషత్తులో మంచి పేరుందంట! ఆయన ప్రయత్నం చేసుంటే ఆ ఆఫీసులో క్లర్క్‌గా ఉద్యోగం ఇప్పించలేడా? ఆ ఉద్యోగానికి ఎస్ఎస్ఎల్సీ పాసయితే చాలంట! శింగనమల హైస్కూల్లో క్లర్క్‌గా పని చేసే శ్రీనివాసులు సార్ ,ఎస్ఎస్ఎల్సీ ఫెయిల్ అయినోడు.మొదట రికార్డు అసిస్టెంట్‌గా వచ్చినాడు. నాకు ఆ రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించినా బాగుండేది కదా! అవన్నీ జిల్లా పరిషత్ చైర్మన్ చేతిలో ఉంటాయంటారు, మరి చైర్మన్ దగ్గర హెడ్మాస్టర్ సారుకు పలుకుబడి ఉందో లేదో! ఏమాత్రం అవకాశముండినా సార్ నాకు జిల్లా పరిషత్తులో ఉద్యోగం ఇప్పించకుండా ఉండేవాడా ?ఈ ఉద్యోగం అయినా ఎస్ఎస్ఎల్సీ పాసయినోళ్లందరికీ వచ్చిందా? సార్ సహాయం చేయబట్టే కదా ఇదైనా నాకు వచ్చిండేది! చెన్నమ్మ పిన్నమ్మోళ్ళు పెద్ద రైతులు. అందుకే వాళ్లకు ఈ ఉద్యోగం పనికిమాలినదిగా కనిపిస్తా ఉంటుంది. నన్నొగ కొడుకు మాదిరి చూసిన ఆ పిన్నమ్మ, నేను పెద్ద ఉద్యోగానికి పోతానని అనుకోనుంటాది. అందుకే పాపం అట్ల బాధపడింది.

అనుకుంటా వాళ్లకు నా మీదున్న ప్రేమకు మురిసిపోతా ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయినాను. ఆ మాదిరిగానే నీలంపల్లి పెద్దిరెడ్డోళ్ల ఇంట్లో కూడా!

మా చెరువు మాగాణిలో మడి కోతలు మొదలైనాయని, ఆదివారం ఆదివారమే కాకుండా సెలవులుండే నాడు కూడా ఊరికొచ్చి వరి కోతలకో, కుప్పగొట్టేకో వడ్లమూటలు మోసేకో కూలి పోతే బాగుంటాదని నాయన పదేపదే చెప్పడంతో, నేను నాలుగు ఆదివారాలు మరొగ రెండు దినాలు మా ఊరి మాగాణి లోకి కూలికి పోయినాను. మడి కోతులన్నీ నెలకల్లా అయిపోయి, పది మూటలు కూలి గింజలు జమయినాయి. ఇంట్లో ఆరు దినాలకు నా కూలి గింజలే నూటా ఇరవై శేర్లయినాయి. అవి చూసి నాయనకు తృప్తి కలిగింది. అయితే ఊర్లో కొంతమంది ఉద్యోగం చేసే వానివి, కూలి పనికి ఎందుకొచ్చినావు రా అని అన్నారు. ఇంకా కొంతమంది, ఏమర్రా కూలి చేయడం చిన్నతనమా? వాడేమయినా షావుకారి కొడుకుగా పైనుంచి వూడిపడినాడా? పైగా ఆ పిల్లోనికి లేని చిన్నతనం మీకెందుకర్రా? అని అన్నారు. నేను అందరి మాటలూ విన్నాను. ఉద్యోగం చేస్తా కూలికి పోగూడదని, పోతే చిన్నతనం అని అనుకుండే కంటే సేద్యం పనులకు దూరం కాగూడదని అనుకోవడం మేలు కదా అని అనుకుండాను.

ఆ పక్క తలపాటు పెట్టుకుండే యోగ్యత లేని వాళ్ళం!

ఉద్యోగంలో చేరి సంవత్సరం కావొచ్చింది. బుక్కరాయ సముద్రానికి వచ్చినంక ఉద్యోగం బరువైంది. పద్మూడు పల్లెలకు పోయి, ఇంటింటికీ తిరిగి డ్యూటీ చేయడం చాలా కష్టమైపోయింది. పైగా డిపార్ట్మెంట్ పర్మనెంట్ కాదంట! ఏమవుతుందోనని మనసు లోపల భయం పెరగసాగింది. ఈ ఉద్యోగాన్నీ వొచ్చే జీతాన్నీ వొదిలేసి టీచర్ ట్రైనింగ్ పోదామనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఒగ సైకిల్ కొనుక్కుంటే ఉద్యోగం పని కొంచెం సులభమయితాది. సైకిల్ కొనుక్కోవల్లంటే, కనీసం 150 రూపాయలు కావల్ల! జీతంలో నెలకొగ ఐదు రూపాయలయినా మిగిలించుకుండేకి వీలుగాకుండా ఉంది. జీతం వస్తానే ప్రతినెలా 45 రూపాయలు నాయనకు పంపల్ల! ఒకొక్కసారి 50 రూపాయలు పంపమంటాడు నాయన. ఎట్ల పంపల్ల? రూమ్ బాడుగా, సైకిల్ బాడుగా, వారానికి రెండుసార్లు హోటల్లో తెచ్చుకుండే పప్పుచారుకూ, ముఖం సబ్బూ బట్టల సబ్బులకూ వారానికి ఒగసారి కాఫీ చేసుకుండేకీ జీతంలో మిగిలిన పదైదు రుపాయలు చాలడం లేదు. ఆదోనిలోనే జీవితం బాగుండేది! 30 రూపాయలు నాయనోళ్ళకు పంపించి ఇంక మిగతా 30 రూపాయలతో హాయిగా కాలం గడిచిపోతా ఉండేది! బుక్కరాయసముద్రానికి రావడం చాలా పొరపాటని అనిపిస్తా వుంది.

రకరకాల ఆలోచనలతో బాధపడతా, ఒగరోజు నేరుగా శింగనమలకు పోయి హెడ్మాస్టర్ సారుకూ జయమ్మక్కకూ చెప్పి కన్నీళ్లు పెట్టకుండాను. జయమ్మక్క నన్ను వోదారుస్తా, ‘ఆదోని నుంచి మీ నాయనోళ్ళకు ఎంత పంపుతా ఉంటివో ఇప్పుడూ అంతే పంపురా! ఉద్యోగం చేస్తా, ప్రతి ఆదివారమూ ఊరికి పోయి కూలిపనులు చేస్తావుండావా? నువ్వెట్లా మనిషివి రా? వింటా ఉంటేనే కడుపు తరుక్కొని పోతా ఉంది.ఇప్పటికే మీ నాయనకు మీరు ఐదు మంది పిల్లలు. ఇప్పుడు మీ అమ్మయ్య మళ్లీ గర్భవతి అని అంటావుండావు. ఇంకా ఎంతమంది పిల్లల్ని పుట్టించుకుంటారంట! అందర్నీ నీ వాతన పడేయడానికే అంత మందిని పుట్టించుకున్నది! ఆస్తిపాస్తులు ఏముండాయని అంతమంది పిల్లల్ని పుట్టించుకుంటా ఉండారు? ఇంటికి పెద్ద కొడుకయి పుట్టడం నీ దురదృష్టం రా! – సరే నువ్వు పో, ఏదో ఒకటి ఆలోచన చేస్తాం’ అని ఇద్దరూ వోదార్చి పంపినారు.

***

భయంకరమైన ఎండలలో నానా అవస్థలు పడతా ఉద్యోగ ధర్మాన్ని నూటికి నూరు శాతం చేస్తా ఉండాను. నాతోపాటు ఉద్యోగంలో చేరిన బాలన్న చేతగాక ఉద్యోగాన్ని వొదిలేసినాడని తెలిసింది. ఆ యప్ప ఉద్యోగాన్ని వొదిలేసినా బతకడానికి సొంతూరు సోదనపల్లిలో ఆస్తిపాస్తులుండాయి. మాకేముండాయి? కూలికి పోతే తప్ప జరగదు కదా! బాధ్యతగా ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని, దొంగ రిపోర్టులు హెడ్ ఆఫీస్‌కు పంపుకుంటా ఇన్‌స్పెక్టర్‌కు ఐదో పదో ముట్టజెప్పుతా ఉంటే ఇదయినా కష్టమైన ఉద్యోగం ఏమీ కాదు! కానీ అట్ల చేయడం నాకు చేతకాదు. చూస్తాం, కష్టపడితేనే కదా ఫలితం!

హెడ్మాస్టర్ సార్ ఏదో ఒగ మంచి దారి చూపకపోతాడా అనే ఆశతో కష్టాన్ని భరిస్తా ఉద్యోగం చేస్తా ఉండాను. జూన్ నెల వెళ్ళిపోయింది. జులై నెల మొదటి వారంలో హెడ్మాస్టర్ సార్, స్కూల్ పీవన్ గౌస్ పీరాను బుక్కరాయసముద్రంలో నా దగ్గరికి పంపినాడు. గౌస్ పీరా, నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు, స్కూల్లోనా సారోళ్ల ఇంట్లోనా పనిచేసేవాడు. గౌస్ పీరా అంటే స్టూడెంట్స్ అందరికీ భలే ఇష్టం! చాలా మంచి మనిషి! తెల్లగా లీనుగా ఎంతో అందంగా, అంతకంటే అమాయకంగా ఉండేవాడు! అందరూ ఇతన్ని చిన్న పీవన్ అనేవాళ్ళు! అబ్దుల్లా పెద్ద ఫీవన్!

గౌస్ పీరా నా రూముకొచ్చి, ‘హెడ్మాస్టర్ సార్ నిన్ను రమ్మన్నాడయ్యా! రేపు మీ నాయనను పిలుచుకొని రావల్లంట’ అని చెప్పి పోయినాడు. నేను సాయంకాలానికే మా ఊరు చేరుకొని, హెడ్మాస్టర్ సార్ రమ్మన్న విషయం ఆయనతో చెప్పి చెప్పినాను. మరుసటి దినం ఉదయం నాయనను పిలుచుకొని స్కూల్ దగ్గరికి పోయి హెడ్మాస్టర్ సార్‌ని కలుసుకుండాను. సార్ నా చేతికి ఒగ పేపరిచ్చినాడు.అది తిరుపతి ఓరియంటల్ కాలేజి నుంచి వచ్చింది. ఎస్ నారాయణ S/O వెంకటస్వామి, బి. విద్వాన్ నాలుగు సంవత్సరాల కోర్సులో చేరడానికి ఎంపిక కాబడినాడు. జులై 20 తేదీలోగా కాలేజిలో చేరవలెను అని టైపు చేసిన అక్షరాలు, కింద కాలేజీ సీలు, దానిపైన పచ్చ ఇంకుతో సంతకం ఉండాయి. నాకు ఏమీ అర్థం కాలేదు.

 “మీ తెలుగు పండిట్ గురుమూర్తి చదివి వచ్చిన విద్వాన్ కోర్సురా అది! తిరుపతి ఓరియంటల్ కాలేజీలో అదొక కోర్సు. అందులో నీకు సీటు వచ్చింది. అది నాలుగు సంవత్సరాల కోర్సు. వెంటనే నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నెక్స్ట్ వీకే పోయి తిరుపతి ఓరియంటల్ కాలేజీలో చేరల్ల!.. ఏమి వెంకటస్వామీ, నీ కొడుకుని తిరుపతిలో ఒక మంచి కాలేజీలో చేరుస్తా ఉండాను. ఇప్పుడు చేస్తా ఉండే ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి వచ్చే వారంలో వాడు తిరుపతిలో చేరుతాడు. ముందుగా చెప్పితే నువ్వు ఒప్పుకోవని, నేనే అప్లికేషన్ తెప్పించి, అన్ని రాసి, ఆ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండే నాగసిద్ధ రెడ్డి గారికి పంపినాను. ఆ కోర్సుకు చాలా డిమాండ్ ఉందని, సీట్లు దొరకడం కష్టమని చెప్పి, తన పరపతినంతా ఉపయోగించి ఆయన నీ కొడుకుకు సీటు ఇప్పించినాడు. ఆ కోర్సు చదివి వస్తానే వెంటనే నీ కొడుకుకు హైస్కూల్లో తెలుగు పండిట్‌గా తప్పకుండా ఉద్యోగం వస్తాది! ఆ ఉద్యోగం వస్తే వాని జీవితమూ బాగుపడతాది, మీ అందరి జీవితాలూ బాగుపడతాయి.” అని నేను నమ్మలేని విషయం చెప్పినాడు హెడ్మాస్టర్ సార్. నాకు మాటలు రాలేదు. భయంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. నాయన ముఖం పాలిపోయింది. నోరు ఎండుకుపోయినట్లుంది. కొంచెం సేపు ఏమీ మాట్లాడలేకపోయినాడు. చివరికి ఎంతో దిగులుతో పెదవులు విప్పినాడు.

“కాదయ్యా తిరుపతి పక్క తలపాటు పెట్టి పండుకుండేకే యోగ్గిత లేనోల్లం. అట్లాటి మా పిల్లోడు, తిరుపతిలో నాలుగేండ్లుండి సదువుకోవల్లంటే మాట్లేమయ్యా? లచ్చినంగా ఉండే ఉద్యోగమూ జీతమూ వొదిలేసి మావాడు సదువుకుండేకి అంత దూరం పోతే, మా బతుకులు ఏం గావల్లయ్యా? నక్క నాగలోకానికి పొయ్యేకి అయితాదా? తినే కూట్లో దుమ్ముపొయ్యొద్దు సార్!” అని నాయన చాలా బాధపడతా చెప్పుతా ఉంటే నాకూ అట్లే అనిపించింది.

 “అది గాదు వెంకటస్వామీ, ఇప్పుడు వీడు నెలకు ఎంత జీతం తీసుకుంటా ఉండాడో అంత వీనికి స్టైఫెండ్ ఇస్తారు. కాకపోతే నెల నెలా ఇవ్వకుండా సంవత్సరానికి ఒగసారి ఇస్తారు. అంతే తేడా!” అని హెడ్మాస్టర్ సార్ కొత్త విషయం చెప్పి ఆశ కల్పించినాడు. అంతవరకు వాని ఖర్చులకు పంపల్లంటే నా చాతనయితాదా సార్ అని నాయన ప్రశ్న వేసినాడు. ‘వానికి ఇంట్లో వుండేవి అన్నో ఇన్నో బియ్యమూ, కొంచెం చిట్లంపొడి, కొంచెం చింతొక్కు ఇచ్చి పంపండి చాలు! ఖర్చులకు నేను నెలనెలా అంతో ఇంతో పంపుతా ఉంటాను. సంవత్సరం ఆఖరులో స్టయిఫండ్ తీసుకున్నంక వాడు నాకు ఇస్తాడు లే’ అని హెడ్మాస్టర్ సార్ మాటిచ్చాడు. నాయన ఏమీ మాట్లాడలేదు.

“వెంకటస్వామి ఆ మాత్రం కూడా ధైర్యం చేయలేవా? నాలుగేండ్లు నీ కొడుకు ఇంట్లో అవిటివాడై పండుకున్నాడనుకో! అప్పుడు వానికి మీరు తిండి పెట్టరా? ఇదీ అంతే అనుకోండి” అని సార్ కోపంగా చెప్పినాడు.

“అయ్యో, అంత మాట యాలంటావులే సార్! నీ ఇష్టప్రకారమే కానీలే!” అంటా నాయన నిష్టూరంగా అన్నాడు.

“వెంకటస్వామీ, నువ్వు బాధ పడవద్దు! నేను బలవంతం చేయడం లేదు. నీకు రమ్యమైతేనే పంపు. ఇప్పుడు ఆ కాలేజీలో స్టైఫెండ్ ఇస్తున్నారు. ముందు ముందు చేరే వాళ్లకు ఇస్తారో లేదో తెలియదు. ఇప్పుడు చేరిన వాళ్లకు మాత్రం నాలుగేళ్లు తప్పకుండా ఇస్తారు. ఆ కాలేజీలో నా స్నేహితుడు నాగ సిద్ధారెడ్డి ఉన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు” అని ధైర్యం చెప్పినాడు హెడ్మాష్టర్ సార్.

“సరే సార్, ఆరం బారం అంతా నీదే! వాడు బాగా సదువుకొని రుద్దిలేకి రావల్లనే గదా నువ్వు చెప్తా ఉండేది!” అని కడాకు నాయన ఒప్పుకుండాడు. నాకు ఒగ వైపు ఆనందమూ మరొగ వైపు భయమూ ఇంకా ఏవేవో శరీరం నిండా ముసురుకుండాయి. మలేరియా ఆఫీసులో రమణా సార్‌ని కలుసుకొని, రాజీనామా లెటర్ ఇచ్చి, ఒక తెల్ల కాగితం పైన రెవెన్యూ స్టాంప్ బ్రతికించి, సంతకం చేసి ఇచ్చి రమ్మన్న్యాడు హెడ్మాస్టర్ సార్. ఆ లోపల రమణాతో నేను కలుస్తాను అన్నాడు. అన్నింటికీ నేను తల ఊపి నాయనతో ఇంటికొచ్చినాను.

కలలోనైనా ఊహించని తిరుపతికి నేను!

అమ్మయ్య సంతోషపడతా భయపడతా, “కానీ లే నాయినా!నువ్వు సదువుకుండేది కావల్ల. ఎట్లో మా తిప్పలు మేము పడతాం పో! అన్నిటికీ ఆ బగమంతుని మాదిరి ఆ సారుండాడు” అని ఆనందంగా ఒప్పుకుంది.

అన్నీ హెడ్మాస్టర్ సార్ చెప్పినట్ల చేసొచ్చినాను. అమ్మయ్య నాకు వంట చేసుకుండేకి కావాల్సినవన్నీ సర్దసాగింది. నేను నా సర్టిఫికెట్లు, సార్ నా చేతికిచ్చిన అడ్మిషన్ లెటర్ అన్నీ సర్దుకుండాను. సాయంత్రం ఏడు గంటలకల్లా అనంతపురం రైల్వే స్టేషన్ చేరుకోవల్ల. అక్కడ రైలెక్కి ధర్మవరంలో దిగి పాకాలకు పోయే రైలెక్కి పాకాలలో దిగి, అక్కడ వేరే రైలక్కల్లని తెలుసుకుండాను. రెండు రైల్లు మారల్లని తెలుస్తానే కొంచెం భయం అయింది. నాతోపాటు ప్రయాణం చేసే వాళ్లు దండిగా ఉంటారు కదా అని ధైర్యం తెచ్చుకో సాగినాను.

పయిటాలకంతా అమ్మయ్య నాకు కావలసినవన్నీ రెడీ చేసింది. అమ్మా నాన్నలకు జేజీ చిన్నాయనకు కాళ్లకు నమస్కరించినాను. చిన్నాయన రెండు రూపాయలచ్చినాడు. నాయన ఐదు రూపాయలచ్చినాడు. అమ్మయ్య బొగ్గిట్లో పెట్టుకోనుండే రూపాయి నోట్లు రెండు, నాలుగు అర్ధ రుపాయ రూలకలూ, రెండు పావలా బిళ్లలు వద్దంటున్నా ఇచ్చి, ‘బాగా సదువుకోవల్ల బంగారూ! ఇన్ని అవత్తలు పడతాఉండి గుడకా నిన్ను పై సదువులు సదువుకుండేకి పంపిత్తా వుండామనేది నువ్వెప్పుడూ మర్సి పోగూడదప్ప! రోంత బయంగా జాగర్తగా ఉండల్ల నాయినా’ అని దగ్గరికి పిల్చుకొని పొదివి పట్టుకొని కన్నీళ్లు కార్చింది. పర్వాలేదులేమ్మా జాగ్రత్తగా ఉండి, చదువుకుంటాను అని బయలుదేరినాను. బయలుదేరుతానే కట్టెల మోపు ఎదురయింది.

పయానం అయిపోతాండారు అనేది గుడకా ల్యాకుండా, కట్టెల మోపెత్తుకోని అట్లొత్తివి గిదమ్మా? అని కట్టెల మోపాయమ్మను దండించింది అమ్మయ్య. అయ్యో, సూల్లేదక్కా అని ఆయమ్మ కట్టెల మోపును పక్కన దించింది. రోంతసేపు కుచ్చో నాయినా అని అమ్మయ్య కూర్చోమనింది. పర్వాలేదులేమా! పిల్లులూ కట్టెల మోపులూ పల్లెల్లో అడ్డం రాకుండా ఉంటాయా అని ఒగ నిమిషం అమ్మయ్య తృప్తి కోసరం కూర్చొని బయలుదేరినాను. నాయనా అమ్మయ్యా వెంకటలక్ష్మీ పెద్దన్నా రోడ్డు వరకు నా వెంట వొచ్చినారు. అమ్మయ్య గబగబా నడుస్తా, మల్లా ఎవురైనా కొండలో నుంచి కట్టెల మోపూలు ఎత్తుకొని వస్తారేమోనని రోడ్డు దగ్గరికి పోతా, ఎవురో మోపెత్తుకొని వస్తా ఉంటే వాళ్ల నెత్తి మీదుండే మోపులు కిందికి దింపించింది.

 అందరమూ రోడ్లో చేరుకుండాం. ఒక అర్థగంట కల్లా బస్సొచ్చింది. బ్యాగులన్నీ తీసుకొని బస్సెక్కినాను. అందరికీ చేతులూపి చెప్పి కూర్చుండాను. బస్సు కదిలి స్పీడందుకుంది.దేనికో దూరం అవుతా ఉన్నెట్ల, ఇంకొగ కొత్త లోకంలోకి పోతా ఉన్నెట్ల అనిపించడంతో కనుగుడ్ల మీద నీళ్లు పారాడినాయి. పక్కనుండే ఒగాయమ్మ, ‘యాల నాయినా ఆడపిల్ల మాదిరి అట్ల యేడుత్తాండావు’ అని అడగడంతో నాకు పౌరుషం వచ్చింది. తల్లిదండ్రులకు దూరమైపోతా ఉంటే కండ్లల్లో నీళ్లొచ్చినాయి లేమ్మా, అంతే, అని అన్నాను. అవునా నాయినా? దానికల్లా మొగోనివి, కండ్ల నీళ్లు కార్సల్లనా? ఆడోల్లు శానఠ మర్లుగా ఉంటారు కాబట్టి ఇట్లా తబ్బుడు కన్నీళ్లు పెట్టుకుంటారు. మీకేమి నాయినా,మొగపిల్లోల్కకు? అని అనింది. నాకు ఎటెట్లో అయ్యింది.

ఆడోళ్లకేనా తల్లిదండ్రుల మీద, పుట్టిన ఊరు మీద మనసుండేది, మర్లుండేది? మగవాళ్లకు ఉండవా? ఉండగూడదా? మగవాడు కన్నీళ్లు పెట్టకూడదా? కన్నీళ్లు కారిస్తే ఆడోళ్లని అనుకుంటారా? మల్ల నాకు ప్రతి చిన్నదానికీ నాకు కన్నీళ్లొస్తాయే? అట్ల రాగూడదా?

ఎన్నో ఆలోచనలు ప్రశ్నలు మనసులో మెదిలినాయి. అంతలోనే అనంతపురం వచ్చింది. బస్సు దిగి లగేజంతా మోసుకొని పోతా ఉంటే జట్కావాళ్ళు వెంటబడినారు. రైల్వే స్టేషన్‌కి రెండు రూపాయలు బాడుగ అడిగినారు. నోరెత్తకుండా ముందుకు నడుస్తా, ఊరు నుంచి బస్సులో వచ్చినందుకు రూపాయి చార్జి అయితే, ఈడుండే రైల్వే స్టేషన్‌కు బాడుగ రెండు రూపాయలా అనుకుంటా స్టేషన్ చేరుకొని ఊపిరి పీల్చుకుండాను. చేరుకున్న అర్థగంటకే రైలొచ్చింది. ఏడున్నర లోపలే ధర్మవరంలో దిగినాను. ప్లాట్ఫామ్ బోర్డు మీద ధర్మవరం జంక్షన్ అని రాసినారు. పాకాలకు పోయే లైన్ లేకుంటే అది జంక్షన్ అయ్యేది కాదు. విశాలంగా ఉండే ఫ్లాట్‌ఫామ్ మీద జనమే లేరు. పాకాలకు పోయే రైలు మూడో ఫ్లాట్ఫామ్ మీద ఉందని చూసి ధర్మవరం నుంచే బయలుదేరుతుందని, పాకాల వరకే పోతాదని, అక్కడ, తిరుపతికి పోయేకి కాట్పాడి రైలెక్కల్లని తెలుసుకొని టికెట్ తీసుకుండాను. టికెట్ ఐదు రూపాయలా పావలా! ఇన్నూటా ఇరవై రెండు కి.మీ అని టికెట్ మీద ఉంది. జాగ్రత్తగా టికెట్లు ట్రౌజర్ లోపలి జోబీలో పెట్టుకొని, సామాన్లన్నీ తిరుపతికి పోయే ఒయ పల్లెటూరి మనిషి దగ్గర పెట్టి, స్టేషనంతా తిరుగుతా, రైల్వే వాళ్లని అడిగి తెలుసుకుండాను. ధర్మవరం పాకాల లైన్, బ్రిటిష్ వాళ్ళు 1891లో, అంటే దాదాపు 74 సంవత్సరాల కిందటనే ఏర్పాటు చేసినారని విని ఆశ్చర్యపోయినాను. ఆ లైన్ మీటర్ గేజి అంట! అదొకటే కాదు, బెంగుళూరు హైదరాబాదు విజయవాడ హుబ్లీకి పోయే లైన్లన్నీ మీటర్ గేజ్ లైన్లేనని తెలుసుకుండాను. ధర్మవరం పట్టణం కాకపోయినా దీన్ని రైల్వే జంక్షన్ ఎందుకు చేసినారో నాకు సందేహం కలిగింది. ఒగ పెద్దాయనను గార్డును అడిగినాను. బ్రిటిష్ వాళ్లు, వాళ్ల సౌకర్యం కోసం తాలూకా కేంద్రాలన్నిటిని కలుపుతా రైల్వే లైను నిర్మాణం చేసినారని, అందుకే అనంతపురం నుండి దక్షిణానికి బెంగళూరుకు నేరుగా మామిళ్ళపల్లి మీద పోవల్సిన లైనును అదే పనిగా ఆగ్నేయ మూలకు ధర్మవరానికి తెచ్చినారని, బ్రిటిష్ వాళ్ల ఆలోచనలను మెచ్చుకుండాడు. ఎనభై తొంభై ఏండ్లకు ముందు నుంచే ధర్మవరం పట్టుచీరలకు పేరు పొందిందని, అందుకే వ్యాపారస్తుల సౌకర్యం కోసం దీన్ని జంక్షన్ చేసినారని గార్డు చెపుతా ఉంటే బ్రిటిష్ వాళ్ళ దూరదృష్టి ఎంత గొప్పదో అర్థమైంది నాకు. పట్టు, పట్టు చీరలకు ప్రసిద్ధమైన ధర్మవరాన్ని ఒగసారి చూడల్లనిపించింది నాకు.

టైం కావొచ్చిందని మూడో ఫ్లాట్ఫార్మ్ మీదికి పోయినాను. అంతలోనే రైల్లో లైట్లు వెలిగినాయి. నేను ఒగ పెట్టెలోకి ఎక్కినాను. అన్నీ చెక్క పలకల సీట్లే! ఒక్కొక్క దాని మీద నలుగురు కూర్చోవచ్చు! జనం లేకుంటే పండుకోవచ్చు! జనం అంత రద్దీగా లేరు. గుంతకల్లు నుంచి ఆదోనికి పోయే రైలు చాలా రద్దీగా ఉండేది. అందుకే కూర్చోవడానికి కూడా కష్టం అయ్యేది. ఇది ధర్మవరం నుంచే బయలుదేరుతుంది కాబట్టి రద్దీగా లేదనుకుంటా, సంచిలో నుంచి జంఖానం తీసి పరిచి మిగతా మూటలన్నీ సీటు కిందికి దురికినాను. సీటు మీద కూర్చుంటే అందనంత పైనుండే లగేజీల పలక మీద ప్రయాణికులు తమ తమ సామాన్లు పెట్టుకుండేక అనుకూలంగా ఉందని సంతోషపడినాను. అంతలోనే ఎదురుగా ఉండే సీట్లోకి ఇద్దరు ప్యాసింజర్లు వచ్చినారు. వాళ్ళవేనేమో, రెండు బట్టల ఘట్టాలు మోసుకొచ్చి సీటు కింద పెట్టినారు రైల్వే కూలోల్లు.

“మనకు, తిరుపతికి సరిగా బస్సుల సౌకర్యం లేకపోవడంతో ఈ పనికిమాలిన ప్యాసింజర్ రైల్లో పోవల్సిన ఖర్మ పట్టుకుందప్పా! పోనీ, ప్యాసింజర్ రైలయినా మూడు నాలుగు రిజర్వేషన్ బోగీలు వేయకుండా అట్లే కాలం గడుపుతా ఉంది రైల్వే డిపార్ట్మెంట్. రిజర్వేషన్ సౌకర్యం ఉంటే హాయిగా పండుకొని పోవచ్చు. ఈ జనరల్ కంపార్ట్మెంట్లలో రాత్రిపూట పండుకోడానికి వీలుకాదు. ఈ లైన్ మీద ఇక్కడి నుంచి పాకాలకు, పాకాల నుంచి ధర్మవరానికి రెండే రెండు రైల్లు. బ్రిటిషోడు వేసిన రెండు రైల్లు తప్ప స్వతంత్రం వచ్చి ఇరవై ఏండ్లు కావొచ్చినా ఒక్క కొత్త రైలు వేసేకి గుడకా మన గవర్నమెంట్‌కు చేతకాలేదు. బ్రిటిషోడు వేయకుంటే ఈ పాకాల రైల్వే లైన్ మనం చూసే వాళ్ళం కాదేమో!”

వాళ్లు అట్ల మాట్లాడుతావుంటే నాకు భలే ఆసక్తి కలిగింది వినడానికి. మొత్తం రైలంతా జనరల్ బోగీలేనని, రైల్లో రిజర్వేషన్ బోగీలు వేరే ఉంటాయని అర్థమైంది నాకు. రిజర్వేషన్ బోగీలో పోతే రాత్రి పండుకోవచ్చునేమో! దాంట్లో నా యట్లా వాళ్లందరూ ఎక్కడానికి వీలు కాదేమో! దాంట్లో సీట్లు ఎట్లుంటాయో ఏమో! ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. అన్నీ వాళ్ళను అడిగినాను. రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేయల్లంటే జనరల్ టికెట్‌కు నాలుగింతలు రేటు ఎక్కువగా ఉంటాదంట! అందుకే బీదా బిక్కి రిజర్వేషన్ బోగీలో పోలేరంట! డబ్బులుండి టికెట్ కొనగలిగితే ఎవరైనా బోగీలో పోవచ్చునంట! అయితే కొన్ని దినాలు ముందే రిజర్వేషన్ చేసుకోవల్లంట!

అంతా విని, ఓయమ్మా, అది నాయట్లా వానికి అయ్యే పని కాదులే అనుకోసాగినాను. అంతలోనే రైలు కదిలింది. టైం తొమ్మిది అయింది. రైలు ముందుకు పోతా ఉంటే చల్లని గాలి హాయిగా తగల సాగింది. ప్రయాణం పగలయ్యుంటే బాగుండేది. కొత్త ప్రదేశాలన్నీ చూసుకుంటూ పోయి ఉండొచ్చు అనుకుంటా పండుకుండాను.

తెల్లవారుజాము కల్లా పాకాల వచ్చినట్లు ఉందేమో, ప్యాసింజర్లు అందరూ దిగుతా ఉండారు. బయట పండ్లులు దిక్కొని ముఖం కడుక్కుండేకి వీలయితాదో కాదో అని, బోగీలోనే తిక్కుకుండాను. రైల్వే వాళ్ళు వచ్చి దిగమన్నారు. పాకాల జంక్షన్ అని బోర్డు మీద కనిపించింది. స్టేషన్ అంతా చూసినాను. ధర్మవరం కంటే పెద్ద జంక్షన్ అనిపించింది.

తిరుపతికి పోయే రైలు ఎక్కడుందని స్టేషన్లో అడిగినాను. కాట్పాడి నుంచి వస్తాదన్నారు. కాట్పాడి అనేది ఒక ఊరేమో, అదేం పేరు అనుకుంటా ఒకరిని అడిగినాను. అది తమిళనాడులో ఉంటుందన్నారు. చదువుకున్నోళ్లు చదువురాని వాళ్లు అదొగ రకమైన యాసతో ప్రతి పదాన్నీ దీర్ఘం తీస్తా మాట్లాడుతుంటే భలే సొగసుగా వినిపిస్తా ఉండాయి వాళ్ళ మాటలు. “య్యోవ్, మొన్న సందికీ యాటికయ్యా పూడ్సింటివి? నేనొచ్చి నిన్ను పట్టుకుండేకి పుడికి పుడికి కాల్లు పచ్చి పుండ్ల మాదిర్తో అయిపూయిడ్సె. యేమి గెనకార్నె మున్న్యేదయ్యా, ఇంటి తావన ల్యాకుండా పూడ్సినావు?” అని ఒగ పల్లెటూరాయన ఇంకొగ పల్లెటూరాయనను దండిస్తా ఉండాడు. నేను మురిసిపోతా వాళ్ల మాటలు వినసాగినాను. చిత్తూరు జిల్లా వాళ్ళందరూ ఇట్లనే మాట్లాడుతారేమో! నాలుగేండ్లు తిరుపతిలో ఆ జనం మధ్యలో ఉంటే, ఆ యాసను ఆ పదాలను నేర్చుకోవచ్చునని అనుకోసాగినాను. అంతలోనే రైలొచ్చింది. చాలా రద్దీగా ఉంది. కొంతమంది దిగినారు. నేను కష్టపడి రైలెక్కినాను. కొంచెం సేపటికి రైలు కదిలింది. కూర్చోడానికి సీటు దొరకలేదు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసేకి వీలు కాలేదు. అనంతపురం జిల్లాలో మాదిరి కాకుండా అంత కొండ ప్రాంతం. పొలాలన్నీ సరిగా కనిపించలేదు. కానీ అన్ని చిన్నచిన్న చెలికలు.

చంద్రగిరి వచ్చింది. చంద్రగిరి పేరు వినగానే శ్రీకృష్ణదేవరాయలు, మహామంత్రి తిమ్మరుసు, చరిత్ర పాఠాలు అన్నీ గుర్తుకొచ్చినాయి. తిరుపతిలో విద్వాన్ చదువుతా మధ్యలో వీలైనప్పుడు చంద్రగిరి చూడల్లనుకుండాను. అనుకుంటా ఎడమవైపున చూసినాను. అవి తిరుపతి కొండలని తెలుస్తానే ఎందుకో ఒళ్లంతా గగుర్పాటు! వెంట్రుకలు నిక్కబొడుచుకుండాయి. ఆ ఏడుకొండల స్వామిని తలచుకుంటా ఉండగానే తిరుపతి వెస్ట్ స్టేషన్ వచ్చింది. ఎవురూ దిగలేదు. అనుమానమొచ్చింది. పక్కనుండే వాళ్ళని అడిగినాను. ఇక్కడ కాదు దిగాల్సింది, నెక్స్ట్ స్టేషన్ అన్నారు. టైం తొమ్మిది అయింది.

తిరుపతి ఈస్ట్ స్టేషన్లో దిగినాను. స్టేషన్ అంతా జనంతో కిటకిటలాడుతా ఉంది. స్టేషన్లో ఉండే జనంలో దాదాపు సగం బోడిగుండ్లే! అందరూ దాదాపు మొరటోళ్లే! పల్లెటూరోళ్లే! వాళ్లను చూస్తా, ‘ఏమి తిరుపతికి చదువుకున్నోళ్లు ఎక్కువగా రారో?’ అనుకుంటా స్టేషన్ బయటికి వచ్చి గోవిందరాజస్వామి దేవాలయం ఎక్కడో అడిగినాను. గోపురం చూపించి అదే అన్నారు జట్కా వాళ్ళు సైకిల్ రిక్షా వాళ్ళు ఎక్కడికి పోవల్లని అడుగుతా వచ్చినారు. ఏమీ వద్దని నేను నడుస్తా గోవిందరాజు స్వామి గుడి దగ్గరికి పోయి ఒక షాప్ మనిషిని, ఓరియంటల్ కాలేజీ ఎక్కడ అని అడిగితే ఆయన చూపించినాడు. అక్కడికి చేరుకొని కాలేజీ బిల్డింగ్ ఏదీ లేకపోవడంతో, ఆ షాపు వాడిని తిట్టుకుంటా, ఒగ గుడి ముందు భాగంలో ఉండే బోర్డ్ వైపు చూసినాను. ప్రాచ్య కళాశాల అనే అక్షరాల కింద ఓరియంటల్ కాలేజీ అని రాసినారు. నేను ఆశ్చర్యపోతా లోపలికిపోయి చూసినాను. మధ్యలో గుడి, గుడి చుట్టూ రాతి స్తంభాలుండే గదులు, గదుల్లో బెంచీలు చూసి, ఇదే ఓరియంటల్ కాలేజి అని నిర్ధారించుకొని, గదుల్లోకి పోతా ఉండే విద్యార్థులను అడిగినాను. అవును ఇదేనప్పా, నమ్మాల్వారు సత్రం ఇదే, ఓరియంటల్ కాలేజి కూడా ఇదే అని నవ్వుతా చెప్పినారు వాళ్లు. సత్రంలో కాలేజీ ఏందబ్బా అనుకుంటా నాగ సిద్ధారెడ్డి సార్ ఎక్కడుంటాడని అడిగి తెలుసుకొని నేను వచ్చిన విషయం చెప్పినాను.

“అవునా? అనంతపురం నుంచి వచ్చినావా? నా పేరు గంపన్న. మాది ఉరవకొండ తాలూకా” అని పక్కనుండే వాళ్ళను పరిచయం చేసినాడు. ఆంజనేయులు, రామిరెడ్డి, శివశంకర్, రామచంద్రరావు, లక్ష్మీకాంతా రాజారావు అందరూ ఉరవకొండ గుంతకల్ ప్రాంతాల వాళ్లని, విద్వాన్ సెకండియర్ చదువుతున్నారని తెలిసి ధైర్యం వచ్చింది నాకు. అంతలోనే ఒకతను, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లని ఖద్దరు పంచే అంగీ తొడుక్కొని, ఒక నోట్బుక్ చేతిలో పట్టుకొని హుందాగా గంభీరంగా వచ్చినాడు.

“నారాయణా, ఈయన అనంతపురం దగ్గరలో ఉండేవాడే! పేరు సింగమనేని నారాయణ” అని గంపన్న పరిచయం చేసినాడు. నేను ఆయనకు నమస్కారం చేసి, నా విషయం చెప్పినాను. ఆయన నా భుజం మీద చెయ్యి వేసి, ‘మాది మరూరు బండమీదపల్లె, నీది సింగనమలబండ మీద పల్లెనా? భలే కలిసినామే! కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నువ్వొచ్చి కలుసు నారాయణా’ అని చెప్పి క్లాసుకు పోయినాడు. ఈయన రూపమూ పంచకట్టూ అంతా చూసి, ఎవురూ స్టూడెంట్ అని అనుకోరేమో! ఆశ్చర్యం! స్టూడెంట్‌గా పంచ కట్టుకొని కాలేజీకి రావడం నిజంగా ఆశ్చర్యమే! అనుకుంటా బ్యాగులను తీసుకొని ఆఫీస్ రూమ్ దగ్గరికి పోయినాను. గంపన్న వచ్చి నన్ను నాగ సిద్ధారెడ్డి సార్ దగ్గరికి పిల్చుకొని పోయినాడు. నేను ఆ సార్కి నమస్కారం చేసి,హెడ్మాస్టర్ సార్ ఇచ్చిన కవరిచ్చినాను. అది విప్పి చదివి, ఓహో చిత్తరంజన్ పంపించినాడా? నువ్వేనా నారాయణ? వెరీ గుడ్ అని, నేను తెచ్చిన అడ్మిషన్ లెటర్ తీసుకొని నన్ను ఆఫీసులోకి పిలుచుకొని పోయినాడు.

ఓరియంటల్ కాలేజీలో విద్వాన్ కోర్సులో చేరిక!

నేను అడ్మిషన్ ఫీజు కట్టి కాలేజీలో 2 బి విద్వాన్ కోర్సులో చేరినాను. 2 బి విద్వాన్ అంటే తెలుగు విద్వాన్ అని, 2ఎ విద్వాన్ అంటే సంస్కృత విద్వాన్ అని, ఎ విద్వాన్ వాళ్లకు తిరుపతి దేవస్థానం వాళ్లకు హాస్టల్ వసతి ఉందని నాగ సిద్ధారెడ్డి సార్ చెప్పుతా, “తెలుగు నేల మీద ఉండే దేవస్థానానికి తెలుగంటే చిన్న చూపు. దేశంలో ఎవరికీ మాతృభాష కాని సంస్కృతం అంటే ఎనలేని గౌరవం. అంతా ఈ పంగనామాల వాళ్ల అధిపత్యం. దీన్ని విద్యార్థులు మీరే బద్దలు కొట్టల్ల” అని ఎంతో అసహనంతో అన్నాడు. నాకు నిజమే అనిపించింది. తరగతి గదుల్లోకి పోయి వచ్చే పూజాలను చూసినాను. అందరూ గోసి పంచ కట్టుకొని, ఉత్తపయితో ఉండాలరు. జంద్యాలు వేసుకొని, పిలక జుట్లు మూడు నామాలు పెట్టుకుండారు. కొంతమంది రెట్టలకు, గడ్డం కింద గంధం పూసుకుండారు. ఎవురి కాళ్లలోనా చెప్పులు లేవు. వాళ్లందరూ పూజారులు కాదని, ఓరియంటల్ కాలేజి లెక్చరర్లని తెలిసి ఆశ్చర్య పోయినాను. అంతమంది పూజార్ల మధ్యలో నాగ సిద్ధారెడ్డి, పార్థసారధి, కృష్ణమ నాయుడు ముగ్గురే శూద్ర లెక్చరర్లని గంపన్నోళ్లు చెప్పినారు.

ఇద్దరు ముగ్గురు లెక్చరర్లు రాలేదని గంపన్నోళ్లు ఇండ్లకు బయలుదేరినారు. సింగమనేని నారాయణ నన్ను తన వెంట పిలుచుకొని పోయినాడు. ఒగ సర్కిల్ దగ్గరికి పోయినాం. సర్కిల్ మధ్యలో ఏదో మంటపం ఉంది. అది నాలుగ్గాళ్ల మంటపమని, ఇప్పుడు మనం పోయేది బండ్ల వీధి అని చెపుతా కుడిపక్కకు తిరిగి కొంచెం ముందుకు పోయి, ఒక సందులోకి దూరి, ఈ ఇంటిపైనే నేను ఉండేది. మా పక్కనున్న రూములు రెండు ఖాళీగా ఉన్నట్లున్నాయి. మొదట, నేనుండే రూము చూస్తువు రా. నీకు నచ్చితే, ఓనర్‌తో మాట్లాడదాం అని పైకి పిలుచుకొని పోయినాడు. నేను సామాన్లు కింద పెట్టి, పైకి పోయి చూసినాను. బాగుంది రూము. బాడుగ ఐదు రూపాయలంట! రూములో ఆంజనేయులూ తానూ ఇద్దరుండారంట! రూము ఖాళీగా ఉంటే మాట్లాడమన్నాను. కిందికి దిగొచ్చి ఓనర్‌తో మాట్లాడినాడు. రెండు దినాల కిందటనే ఫిలప్ అయినాయని, ఖాళీగా రూములు లేవని, తమ పక్క సందులోని ఇంటి ఓనర్‌తో మాట్లాడినాడు సింగమనేని నారాయణ వాళ్ల ఓనర్. వచ్చి రూము చూడమని, నచ్చితే ఇస్తానన్నాడు ఆయన. నేను వెంటనే పక్క సందులోకి పోయి, పైన అప్ స్టేర్లో ఉండే రూము చూసినాను. బాగుంది. నాలుగు రూములకూ ఒక పక్క రెండు బాత్రూములూ రెండు లెట్రిన్లూ ఉండాయి. కొళాయిలు ఉండాయి. లైట్లుండాయి. చాలు, ఇంకేం కావల్లని అనుకొని, బాడుగ ఎంతో అడిగినాను. ఐదు రూపాయలన్నాడు. ఇద్దరు మాత్రమే ఉండాలన్నాడు. ముగ్గురుంటే బాడుగ ఆరు రూపాయలు అన్నాడు. సరే అని ఒప్పుకుండాను. నాకొక్కనికే బాడుగ బరువైతాదని, నా జతకు ఒకరో ఇద్దరో చేరితే పరవాలేదని సింగమనేనితో అన్నాను. మన అనంతపురం నుంచి వచ్చే ఎవరో ఒకరు వస్తారని ఆయన భరోసా ఇచ్చినాడు. నేను రూములో చేరిపోయినాను. మరుసటి రోజు నా రూమ్ లోకి నారాయణస్వామి చేరినాడు. అతడు తాడపత్రి దగ్గరుండే యాడికి నుంచి వచ్చి నాతోపాటు ఓరియంటల్ కాలేజీలో చేరినాడు.

***

కాలేజీలో చేరి రెండు నెలలయింది. లెక్చరర్లు అద్భుతంగా పాఠాలు చెపుతా ఉండారు అంతా సాహిత్యమే! చరిత్ర, సైన్సు, లెక్కలు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులే లేవు, ఒక్క అక్షరం గుడకా ఇంగ్లీషు ప్రస్తావనకు రాదు. పురాణ-కావ్యాలు, సంస్కృతం, తెలుగు గద్య పద్య నాటకాలు, జనరల్ వ్యాసాలు, వ్యాకరణం-చందస్సు, అలంకారాలు ఈ ఆరు సబ్జెక్టులు విద్వాన్ కోర్సులో ఉంటాయని, పురాణ కావ్యాల సబ్జెక్టు కింద ఎనిమిది కావ్యాలు చదవవలసి ఉంటాదని తెలిసి విస్తుపోయినాను. మొదటి సంవత్సరంలో బాల వ్యాకరణం రెండవ సంవత్సరములో ప్రౌఢవ్యాకరణం మొత్తం సూత్రాలు కంఠస్థం చేయవలసి ఉంటుందని, ఈ రెండు వ్యాకరణ గ్రంథాలకు రెండు మూడు వ్యాఖ్యాన గ్రంధాలు ఉన్నాయని, అందులో దూసి వ్యాఖ్య ప్రమాణ గ్రంథం అని తెలుసుకుండాను. సంస్కృత సబ్జెక్టుకు మొదట సంవత్సరంలో శబ్దమంజరి, కాళిదాసు రఘువంశ కావ్యములో మొదటి మూడు సర్గలు, మేఘసందేశ కావ్యం, రెండో సంవత్సరానికి కుమార సంభవం సిలబస్‌లో నిర్ణయించినారు. చందోలంకార సబ్జెక్టుకు అనంతుని ఛందో దర్పణం ప్రతాపరుద్ర యశోభూషణంగా నిర్ణయించినారు. నాటకాలు సబ్జెక్టు కింద పాండవ విజయం, ముద్ర రాక్షస నాటకం, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు అనేకాంశాలకు చెందిన వ్యాసాలు రెఫరెన్స్ బుక్స్ సూచించినారు.

ఆరు సబ్జెక్టుల కింద తెలుగు సాహిత్యంలోని కావ్య నాటకాలలో, వ్యాకరణం చందస్సు అలంకారాలలో సంస్కృత కావ్యాలలో విద్వాన్ ప్రిలిమనరీ అయిపోయేలోగా సాహిత్యంలో లోతైన పరిచయం ఏర్పడుతుందని, వ్యాకరణం సంస్కృత సబ్జెక్టులలో తప్ప మిగిలిన సబ్జక్ట్స్‌లో లెక్చరర్లు మార్గదర్శకులై విద్యార్థుల్ని అందులో చొచ్చుకొని పోవడానికి ఆసక్తిని రేకెత్తించే స్ఫూర్తిదాతలుగా పనిచేస్తా ఉండారని తెలిసిపోయింది.

ప్రబంధ కావ్యాల బోధనకు నాగ సిద్ధారెడ్డి సార్ వస్తారు. ఆయన పాఠ్య బోధన, ఆయన పద్య పఠనం, పాఠ్యాంశం ఆధారంగా అనేక సామాజిక రుగ్మతలను విశ్లేషించే తీరు నన్ను ప్రాచీన సాహిత్య జగత్తులోకి లాక్కొని పోసాగింది. అట్లనే, గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారి సంస్కృత పాండిత్య వైదుష్యం, అపారమైన సంస్కృత సాహిత్య పరిజ్ఞానం, పాఠ్య బోధన సమయంలో పాండిత్య వైదుష్యంతో కూడిన గర్వాతిశయం, ఆయనకు గొప్ప అలంకారంగా కనిపిస్తా, సాహిత్య విద్యార్థులకు అమితమైన ఆకర్షణలుగా కనిపించసాగినాయి. ఆయన పాండిత్య వైదుష్యం, గర్వాతిశయంతో కూడుకొన్న పాఠ్య బోధన, మాటల్లో చేతలలో జీవన విధానంలో కనిపించే నిబద్దత, నైతిక నిష్ఠత, రాజీపడని ఉదాత్తమైన ఆత్మాభిమానం నన్ను సాహిత్య అధ్యయనం వైపు ప్రేరేపించినాయి.

పెద్ద పెద్ద బిల్డింగులు, అద్భుతమైన ఫర్నీచర్, విశాలమైన గ్రౌండ్ అట్లాటివన్నీ లేకపోయినా కళాశాల వాతావరణం, సాహిత్యాన్ని బోధించే లెక్చరర్ల నిరాడంబరత, వాళ్ల వాళ్ల సబ్జెక్టులో అద్భుతమైన పరిజ్ఞానం, నాలో తెలుగు సాహిత్య అధ్యయనం పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచినాయి. అన్ని పాఠ్యపుస్తకాలను కొనుక్కోవల్లని అంతులేని ఆశ. నా ఆశను తీర్చుకోవడం సాధ్యం కాలేదు. స్నేహితుల దగ్గర నిర్ణీత సమయానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి కావ్యాలు, బాలవ్యాకరణం, అనంతుని ఛందస్సు, అలంకార గ్రంథాలు, నాటకాలు ఒక్కొక్క సబ్జెక్టుకు చెందిన పుస్తకాలు తెచ్చుకొని చదవసాగినాను. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన రామమూర్తి, కేశవరెడ్డి జ్ఞానచంద్ర, తిరుపాలు, బాబు ప్రకాష్,భాస్కర్ నాయుడు, వీరభద్రాచారి నాకు తమ దగ్గరున్న సాహిత్య గ్రంధాలను కాలనియమంతో ఇచ్చి చాలా సహకరిస్తా ఉండారు. వాళ్ల దగ్గర అందుబాటులో లేని పుస్తకాలను కళాశాల గ్రంధాలయానికి వెళ్లి వెతికి చదువుకోసాగినాను. గ్రంథాలయంలో కావల్సిన పుస్తకాలను అందిపుచ్చుకోవడానికి వీలు కావడం లేదు. సెలవు దినాల్లో విడిచేసిన బట్టలు ఉతికి ఆరేసి, వంట చేసుకొని అన్నం తిని, గ్రంథాలయానికి పోయేసరికి నాకు కావల్సిన పుస్తకాలు వేరే వాళ్ళు చదువుతా ఉండడం చూసి ఎంతో నిరాశ చెందసాగినాను. ఒక పూట పస్తు పండుకొని చినిగిపోయిన అంగీలు తొడుక్కొని అయినా అవసరమైన పుస్తకాలను కొనుక్కోవడం మంచిదని అనుకోసాగినాను.

గోవిందరాజస్వామి ప్రసాదమే ఒక పూట భోజనం!

తిరుపతిలో చేరిన రెండు నెలలకే ఊరి నుంచి తెచ్చుకున్న బియ్యము, చిట్లంపొడి, చింతతొక్కు అయిపోవచ్చినాయి. పూర్తి అయిపోయినంక ఏమి చేయల్లనో యేమో అనే దిగులు చుట్టుకోసాగింది. దిగులుతో చదువు మీదికి మనస్సు పోవడం లేదు. నిన్న ఒక అరపావు బియ్యంతో అన్నం చేసుకొని కొద్దికొద్దిగా చిట్లంపొడి అన్నం తింటా ఉంటే, ‘ఏం నారాయణా, అన్నం అంత తక్కువ తింటివి’ అని రూమ్మీట్ నారాయణస్వామి అడిగినాడు. అరకడుపుకే తినిన విషయం దాచి పెట్టి, ఆకలిగా లేదన్నాను. అన్నం తినినంక ఇద్దరమూ కాలేజీకి పోయినాం. సంస్కృతం వ్యాకరణం ప్రబంధాల క్లాసులు జరిగినాయి. నాలుగో పీరియడ్ లెక్చరర్ లేకపోవడంతో స్టూడెంట్స్ అందరూ ఇండ్లకు వెళ్లిపోయినారు. నారాయణస్వామి బి సెక్షన్. వాళ్ళ క్లాస్ జరుగుతా ఉంది. నాకు ఆకలి ఎక్కువ కాసాగింది. రూముకు పోదామని కాలేజీ గేటు దాటి బయటికొచ్చినాను. ఎదురుగా గోవిందరాజు స్వామి దేవాలయం. లోపలికి పోయేకి గోపురం లేని పెద్ద ద్వారం ఉంది. దేవాలయం కట్టినప్పుడే ఆ ద్వారం నమ్మాళ్వార్ కోసరం పెట్టినారేమో! గుడి ప్రాకారం కట్టిన రాళ్ల వంటి రాళ్లతోనే పెద్ద పెద్ద మెట్లు నాలుగు భద్రంగా కట్టినారు.

మెట్ల మీదుగా నేను కిందికి దిగి కుడి వైపు చూసినాను. చాలామంది ఒక్కొక్కరు రెండు ఆకు దొప్పళ్లో ప్రసాదం పులిహోర, పెరుగన్నం పెట్టించుకొని గర్భగుడి ముందున్న ద్వారం దాటి ముందుకు వస్తా ఉండారు. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రసాదాన్ని చూసి నోట్లో నీళ్లూరినాయి. ఆశ కలిగింది. దేవుని దర్శించుకొని రాకుంటే ప్రసాదం పెట్టరేమోనని దర్శనం కోసరం క్యూలో నిలబడి నాను. దర్శనం చేసుకొని పోయే వాళ్లకు ప్రసాదం పెడతా ఉండారు. వెడల్పు ఆండాల్లో ప్రసాదం తక్కువగా కనిపిస్తా ఉంది. నా ముందర ఉండే ఇరవై ముప్పై మంది భక్తులు నిదానంగా ముందుకు పోతా ఉండారు. నాలో ఆత్రం పెరగసాగింది. కొంతమంది హారతి పళ్లెంలో దక్షిణ వేస్తానే, హారతి ఇచ్చి, వాళ్ల చేతుల్లో ఏవో ఆకులు పువ్వులు పెట్టి, అదెందో కిరీటం మాదిరిండే వెండి కప్పు వాళ్ళ తలకాయల మీద పెట్టి తీస్తా ఉండాడు పూజారి. అట్క చేసేటప్పుడు క్యూ లైన్ ముందుకు సాగడం లేదు. నాకు ఆరాటం ఎక్కువైపోతా ఉంది. మధ్యలో ఎవరో టెంకాయ పూలు, ఏందో టికెట్టు ఇచ్చినారు పూజారికి. ఆయన దేవునికి టెంకాయ కొట్టి, వాళ్ళ పేర్లూ గోత్రమూ అడిగినాడు. వాళ్లు చెప్పినారు. పూజారి రామిరెడ్డి నామశ్చ, చెన్నమ్మ నామశ్చ అని అందరి పేర్లూ చదివి హారతిచ్చి, వాళ్లకు ప్రత్యేకంగా ఒక టెంకాయ వొప్పు పూలు ఇచ్చి, చిన్న ఇత్తిలి గెంటితో ఇత్తలి గిన్నెలోని తీర్థం పోయసాగినాడు. దాంతో క్యూ కదలడం లేదు. ఇంకా ఆలస్యమైంది. కడాకు దగ్గర దగ్గరకు పోయినాను. గర్భగుడి దగ్గర నుంచీ మధ్యలో ఇనప రాడ్లకు లావుపాటి నూలుతాడు కట్టినారు. అది భక్తులు చేతులతో పట్టుకొని పట్టుకొని మాసిపోయి ఉంది. కింద కాలుబ్బండలన్నీ జిడ్డు జిడ్డుగా ఉండాయి. గర్భగుడి అంతా నెయ్యి వాసన వస్తా ఉంది.

గర్భగుడి దగ్గరికి పోయినంక, లోపల ఉండే దేవుణ్ణి చూసినాను. గోవిందరాజస్వామి ఎందుకో, కుడివైపు వొడ్డి పక్కకు తిరిగి, కుడి చెయ్యి మడుచుకొని, కిరీటం పెట్టుకోనుండే తలకాయ కింద దిండు మాదిరి తవ్వ పెట్టుకొని, రెండు కాళ్లూ చాపుకొని పండుకుండాడు. చాపుకున్న ఎడమ కాలిపైన తొడ వరకు ఎడమ చేయిని చాపుకుండాడు. కాళ్ల దగ్గర ఇద్దరు ఆడోళ్లు కాళ్లొత్తుతా ఉండారు. అందరూ ఆదిశేషుని చుట్టల మీదనే ఉండారు. ఆదిశేషుడు, గోవిందరాజస్వామి తలమీద పడగలు విప్పి నీడబడుతా ఉన్నట్లుండాడు. అంతా గమనిస్తా స్వామికి మొక్కుకొని తీర్థం తీసుకొని ప్రసాదం పెట్టే వాళ్ల దగ్గరికి పోయినాను. పులిహోర ప్రసాదం అయిపోయిందేమో, అంతా ఊడ్చి పిడికెడంత పెట్టినాడు బాపనయ్య. రెండో ఆయన గుడకా మిగిలిన పెరుగన్నమంతా ఆకు దొప్పనిండా పెట్టి అండాను ఖాళీ చేసినాడు. ప్రసాదం ఆ మాత్రం అయినా దక్కినందుకు సంతోషపడతా బయటికొచ్చి వొకచోట కూర్చొని ఆవురావురుమని తిన్న్యాను. ఎంత కమ్మగా వుందో పులిహోర! ఎంతద్భుతంగావుందో పెరుగన్నం, కాదు కాదు దధ్యోదనం!

***

నిన్నటి అనుభవంతో ఈరోజు రెండో పీరియడ్ అయిపోతానే గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని ప్రసాదాలు రెండూ ఆకు దొప్పల నిండా పెట్టించుకొని, గర్భగుడి పక్కనుండే మంటపంలోకి పోయి ఒక చోట కూర్చుని కడుపునిండా తృప్తిగా తిని, నీళ్లు తాగి మళ్లా అక్కడికే పోయి కూర్చుండాను. మా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న మా సీనియర్ మాచిరాజు శివరామరాజు నా మాదిరే ప్రసాదం పెట్టించుకొని వచ్చి కూర్చుండాడు. నేను నమస్కారం చేసి పరిచయం చేసుకుండాను. ఆయనది కర్నూలు జిల్లా చాగలమర్రి అంట! అష్టావధానాలు చేస్తా ఉండాడంట! ఆయనను చాలా సందేహాలు అడిగినాను. ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్పినాడు. అతను చెప్పిన దాని ప్రకారం –

తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో విష్ణుమూర్తి దేవాలయం పైన క్రిమి కంఠుడు అనే శైవ మతరాజు వొకడు దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలో పడేసినాడు. కొంతమంది పూజారులు విష్ణువు ఉత్సవ విగ్రహాలను రహస్యంగా తీసుకొని వచ్చి తిరుపతిలో ఉన్న రామానుజాచార్యులకు అప్పగించినారు. ఆయన చిదంబరంలోని విష్ణుమూర్తి మాదిరిగా శిలా విగ్రహాన్ని చెక్కించి 1130వ సంవత్సరంలో ప్రతిష్ఠించి, తన శిష్యుడైన యాదవరాజు చేత దేవాలయాలనన్నీ, చుట్టూ ప్రాకారాన్నీ, దేవాలయానికి ఎదురుగా చతురస్రాకారంలో నాలుగు వైపులా అద్భుతమైన మెటికలున్న(మెట్లు) కోనేరునూ నిర్మింప చేసినాడు. మొదట ఉన్న ఎత్తైన గోపురం గాలిగోపురం. లోపల గర్భగుడికి ముందర చిన్న గోపురం. చతుర్భుజములతో శంఖచక్ర గదాయుధాలతో నాభీకమలంతో సాక్షాత్తు విష్ణు రూపంలో శేషశయనుడైన గోవిందరాజస్వామి, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అన్న. తమ్మునికి పెళ్లి చేయడానికి కుబేరుని దగ్గర అప్పుచేసి తెచ్చిన ధనాన్ని తవ్వతో కొలిచి కొలిచి అలసిపోయి, దిగువ తిరుపతిలో తవ్వను తలదిండుగా పెట్టుకొని పండుకొని గోవిందరాజస్వామి విశ్రాంతి తీసుకుంటా ఉండాడు.

మాచిరాజు చెప్పిన మాటలు నాకు నమ్మబుద్ధి కాలేదు. అన్నీ అనుమానాలే! తిరుపతిలో విష్ణుమూర్తి రూపంలో ఉండే గోవిందరాజస్వామి సాక్షాత్తు విష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామికి ఎట్ల అన్న అయినాడో, కుబేరుని దగ్గర అప్పు తీసుకోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏవేవో ప్రశ్నలు వెయ్యల్లని అనుకొని, మానుకుండాను. గోవిందరాజు స్వామి వెంకటేశ్వర స్వామికి అన్న అయితే నేమి, కాకుంటే నేమి? నా వంటి ఎంతోమంది ఆకలి గొన్న వాళ్లకు దేవాలయం ఆకలి తీరుస్తా వుంది. ఈ దేవాలయ ప్రాకారం లోపలే చిన్నాచితకా రకరకాల చిన్నచిన్న గుళ్లను నమ్ముకొని ఎంతోమంది పూజార్లు బతుకుతావుండారు. పూజా సామాగ్రిని అమ్ముకుంటా ఎన్నో వందల మంది జీవిస్తా ఉండారు. మా ఓరియంటల్ కాలేజీతో పాటు ఎన్నో కాలేజీలు నడుస్తా ఉండాయి. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పేరుతో ఒక యూనివర్సిటీ ఏర్పడింది. అక్కడ కొన్ని వందల మంది ఉద్యోగాలు చేస్తా ఉండారు. కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉండారు. అట్లాంటప్పుడు నేను అడ్డ ప్రశ్నలు ఎందుకే వెయగయల్ల?

మనసులో అనుకుంటా ఆయన మాటలన్నిటినీ ఊకొట్టినాను. ఆయనతో పాటు చాలా సేపు చదువుకుండాను. ఆ తర్వాత లోపల ఉండే కళ్యాణమంటపాన్నీ, యాగశాలనూ, చుట్టూ ఉండే మంటపాలనూ, అందులోని స్తంభాలనూ, దాండ్ల మీదున్న శిల్పాలనూ, పై కప్పులనూ, కప్పు అంచుల్లో రాళ్లను రాగిరేకుల మాదిరి వొంచిన పనితనాన్నీ, అరుగుల అంచులన్నీ ఎక్కడా తేడా లేకుండా తాడు మాదిరి అల్లినట్లు చెక్కిన గొప్పతనాన్నీ చూసి ఆశ్చర్య పోయినాను. బండరాళ్లను అంత అద్భుతంగా ఎట్ట చెక్కినార అబ్బుర పోయినాను. సుమారు ఇరవై అడుగుల ఎత్తుతో కట్టిన ప్రాకారాన్నీ ప్రాకారంలో- రంపంతో కోసిన దూలాల మాదిరుండే అయిదారు అడుగులు తొమ్మిది పది అడుగుల రాత్రి దూలాలను, మధ్యలో గారా సిమెంటు ఏమీ లేకుండా పొందించిన నైపుణ్యాన్నీ చూస్తా దొమ్మలు గుద్దుకోసాగినాను.

 గోపురాక కింద ఇరవై అడుగుల ఎత్తుతో అమర్చిన చెక్క తలుపులు, చిన్న గోపురానికీ గాలిగోపురానికీ మధ్యలో నలభై అడుగుల ఎత్తున్న నాలుగు కాళ్ల మంటపాలు అన్నీ గొప్ప కట్టడాలే! రోజూ ఎంతోమందికి అన్నం పెట్టే ఆ దేవాలయం చుట్టూ తిరిగి, ప్రాకారాన్ని అంతా చూసి, మాచిరాజుతో పాటు కోనేరు దగ్గరికి పోతానే నాకు మాటలు రాలేదు. అంత పెద్ద కోనేరు ఎప్పుడూ నేను చూడలేదు. చూస్తానని అనుకోలేదు. ఆదోనిలో చూసిన సిద్ధయంగన్న కోనేరు దీని ముందర దిగదీయాల్సిందే అనుకుంటా, మాచిరాజు వెంట కోనేరు పై మెటిక మీద చుట్టూ తిరిగినాను.పెద్ద పెద్ద రాజకీయ సభలన్నీ ఇక్కడే జరుగుతాయని, గొప్ప వ్యక్తుల మీటింగులకు వచ్చే జనం ముప్పై నలభై వేల మంది వరకు కోనేరు మెట్లమీదా పైనా కూర్చొని వింటారని, ఎప్పుడో ఆరేడు వందల ఏండ్ల కిందట కట్టిన కోనేరు మెట్లు చెక్కుచెదరలేదని ఆయన చెప్పుతా ఉంటే నేను అబ్బుర పోతా, అప్పటి వ్యక్తుల నిర్మాణ నైపుణ్యానికి మనసులోనే నమస్కరించినాను.

తానూ పేదవాన్నేనని, కూటికీ గుడ్డకూ ఇబ్బంది పడుతున్నానని, గోవిందరాజ స్వామి దేవాలయంలో ప్రసాదం పెట్టే శర్మ గారికి తన పరిస్థితిని అంతా చెప్పడంతో ఆయన దయ తలచి ప్రసాదం పులిహోర, దధ్యోదనం తాను తినగలిగినంత పెడుతున్నాడని, ఒక్కొక్క రోజు స్వీట్ పొంగల్ నెయ్యితో అద్భుతంగా చేస్తారని, నన్ను కూడా మధ్యాహ్నం లోపల వీలు చూసుకుని రమ్మన్నాడు మాచిరాజు. సామాన్యంగా మూడో పీరియడ్ వ్యాకరణం క్లాస్ ఉంటాదని కృష్ణమ నాయుడు సార్, వ్యాకరణం సరిగా చెప్పడం లేదని, దూసి వ్యాఖ్యను చూసుకుంటే చాలని, అర్థం కాని సూత్రాలను నేను చెప్పగలనని మాచిరాజు నాకు ఆప్త బంధువు మాదిరి హామీ ఇచ్చినాడు. ఒక రోజులోనే ఆయన నాకు, నేను ఆయనకు దగ్గరయినాం. పేదరికమే మనుషుల్ని ఏకం చేస్తాదేమో అనుకుంటా ఆయన దగ్గర సెలవు తీసుకొని రూముకు చేరుకుండాను.

తిరుపతిలోని ప్రసిద్ధ స్థలాలన్నీ చూసే కోరికతో..

కాలేజీలో చేరినప్పటి నుంచీ తిరుమల కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవల్లని కొండపైకి బస్సులు యెట్ల పొయ్యొస్థాయో చూడల్లని చాలాసార్లు అనుకుండాను. కానీ పోయి రావల్లంటే బస్సు చార్జీలూ ప్రసాదానికీ ఎట్ల లేదన్నా ఒగటిన్నర రూపాయి కావల్ల! ఆ దుడ్లతో స్టౌలో నెలకు అయ్యేటంత కిరసనాయిల్ వస్తాది కదా! పోనీ పోయేటప్పుడు మెట్లెక్కి పోయి, వచ్చేటప్పుడు బస్సెక్కి వచ్చినా ముక్కాలు రూపాయి కావల్ల! పోవడమూ రావడమూ రెండుసార్లూ నడకతో అయితే కాళ్ల నొప్పులొస్తే ఎంత కష్టం? తిరుమలకు పోయినప్పుడు భోజనమెట్ల?

రకరకాలుగా ఆలోచన చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం వాయిదా వేసుకుండాను. పోడానికి చేతగాక పోయినా, దేవస్థానం నీలం బస్సుల్లో పోతా వస్తా అడవినంతా చూడల్లని కోరిక బాగా పెంచుకుండాను. కొండమీదికి పోయి వచ్చే బస్సులు మామూలు బస్సుల మాదిరి కాకుండా వేరే రకంగా ఉంటాయేమోనని, ఆ బస్సుల్ని చూడల్లనుకుండాను. దేవస్థానం బస్సులకు వేరే బస్టాండు, గోవిందరాజస్వామి కోనేరుకు తూర్పు పక్కన దగ్గర్లోనే ఉంటాది. అది, మేముండే బండ్ల వీధికి చాలా దగ్గర. ఒగ సెలవు రోజు సాయంకాలం నేనూ నారాయణస్వామీ టౌన్ చూడల్లని మొదట టిటిడి బస్టాండ్‌కు పోయినాం. టికెట్ల కోసరం ఫర్లాంగు పొడవుండే క్యూలైన్ చూసి ఓయమ్మా అనుకుండాను. భక్తులతో ఫుల్ అయితానే ఒగ బస్సు బయలుదేరింది. అది మామూలు బస్సు మాదిరే ఉంది. కాకపోతే కొంచెం పొడవు తక్కువ. బస్సు బయలుదేరగానే బస్సులో కూర్చున్నోళ్లంతా ఒక్కసారిగా గట్టిగా గోవిందా, ఏడుకొండల వాడా, వెంకటరమణా అని గట్టిగా అరవసాగినారు. వాళ్లను చూసి అట్ల నేనెప్పుడు పోయిరావళ్లనో అనుకుంటా, బస్టాండుకు పోయినాం. బస్టాండు అనంతపురం బస్టాండ్ కంటే చాలా పెద్దదేమీ కాదు. ఆంధ్ర రాష్ట్రంలోని వేరే జిల్లాలకు పోయే బస్సులు రెండు మూడు కనిపించినాయంతే! చిత్తూరు జిల్లా బస్సులే ఎక్కువ. తమిళనాడు బస్సులు బస్టాండులోనా రోడ్లమీదా ఎక్కువ కనిపించినాయి. బస్సుల మీద అన్నీ తమిళం అక్షరాలే! వేరే రాష్ట్రాల నుంచీ వచ్చే బస్సుల పైన తమిళం తప్ప వేరే అక్షరాలు రాయకుంటే, ఆ బస్సు ఏ ఊరికి పోతుందో తెలుసుకోవడం ఎట్ల?అని ఆలోచిస్తా, పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లోకి పోయినాం. తూర్పుకు పోయే రైల్వే ట్రాక్,పదీ పన్నెండు మైళ్ళు పోగానే రేణిగుంట జంక్షన్ వస్తాదని, తాను తాడిపత్రిలో, మద్రాసుకు పోయే రైలెక్కి రేణిగుంటలో దిగి వస్తానని నారాయణస్వామి చెప్పడంతో నాకు అర్థమైంది. పగటి పూట అనంతపురానికి పోవల్లనుకుంటే, రేణిగుంటలో బొంబాయికి పోయే రైలెక్కి తాడిపత్రిలో దిగిపోవచ్చునని, ఆ లైను మీద నేను ప్రయాణం చేసిండే ఎర్రగుంట్ల తాడిపత్రి గుంతకల్లు ఆదోని రైల్వే స్టేషన్లను గుర్తుకు తెచ్చుకుండాను.

ఇద్దరమూ మాట్లాడుకుంటా, స్టేషన్ నిండా తిరుమలకు పోయి గుండు చేసుకొని, గుండ్ల మీద పచ్చగా గంధం పూసుకొని వచ్చిన జనాన్ని చూసి, ఎక్కువగా అరవోళ్లే అనుకుంటా, స్టేషన్ అంతా తిరిగినాం. స్టేషనుకు దక్షిణం వైపున నాలుగైదు రైలు కమ్మీలు మాత్రమే ఉండాయి. కమ్మీలకు అవతలి వైపున ఊరేమీ లేదు. అన్నీ పొలాలే! తిరుపతికి దక్షిణం హద్దు రైల్వే స్టేషన్ అని అర్థమైంది మాకు.

వీలున్నప్పుడల్లా ఒక్కొక్కసారి ఒగ వైపు పోయి తిరుపతినంతా చూడల్లని అనుకుండాం. స్టేషన్ దగ్గర్నుంచి కరణాల వీధి గుండా నడుస్తా ఆ చివరి చివరికి పోయి, ఎడమవైపు తిరిగి,ఆ చిన్న వీధి గుండా ముందుకు పోయినాం. అక్కడ రైల్వే గేటు వేసినారు. గేటు దాటి అట్లే ముందుకు, బండి జాడగుండా పోతే, రాయల చెరువు అనే ఊరొస్తాదంట! ఆ వీధికి రైల్వే గేటే హద్దు! గేటు దాటినంక అన్నీ పొలాలే! ఆ పొలాల్లో రాయల చెరువు రస్తా పక్కన కడతా ఉండేది పళని సినిమా థియేటర్ అని తెలుసుకొని, ఆ అడవిలోకి సినిమా చూసేకి ఎవురొస్తారబ్బా అని అనుకుంటా, ఇద్దరమూ వెనుదిరిగి, కరణాల వీధి టర్నింగులో ఉత్తరం వైపు ముందుకు పోయినాం. కొంచెం దూరం పోతానే ఒగ సర్కిల్ వచ్చింది. ఆ సర్కిల్లో నుంచి పడమటికి పోతే యూనివర్సిటీ వస్తాదంట! తూర్పుకు గాంధీ బజారెంట పోతే నాలుగ్గాళ్ల మంటపం సర్కిల్ వస్తాదంట! పడమరకు పెద్ద బజారు గుండా, తిరుమల కొండమెట్లు ప్రారంభమయ్యే చోటికి అలిపిరి దగ్గరికి పోవచ్చునంట! అటువైపు ఇంకొగ రోజు పోవచ్చునుకొని, గాంధీ బజారు వైపు తిరిగి రెండు వైపులా ఉండే అంగళ్లను చూసుకుంటా నడుస్తా వుండాం. అన్ని రకాల వస్తువులు దొరికే పసుపర్తి షాపు, పెన్ స్టోర్స్ దాటి ముందుకు పోయి, ఏదో మహల్ మాదిరుండే పెద్ద భవనాన్ని చూసి లోనికి పోయినాం. దాని పేరు హథీరాం బావాజీ మఠం!

హథీరాం బావాజీ దాదాపు 600 సంవత్సరాల కిందట ఉత్తర భారతదేశం రాజస్థాన్ నుంచి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి భక్తుడై ఆ స్వామికి ప్రీతిపాత్రుడైనాడని, స్వామితో పాచికలాడే వాడని, ఆయన బంజారాల తెగకు చెందిన వాడని, వెంకటేశ్వర స్వామితో పాచికలాడి స్వామి వారి ఆస్తులన్నీ గెలుచుకున్నాడని, అప్పటినుండి తిరుమల దేవాలయం అతని ఆధీనంలోకి పోయిందని, హథీరాం తర్వాత ఆయన వారసులే మహంతుల పేరుతో తిరుమల తిరుపతి దేవాలయాల నిర్వహణ బాధ్యతలన్నీ తీసుకుండారని, ఈస్టిండియా కంపెనీ వారు ఈ దేవాలయాల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారని, 1843లో ఉత్తర జిల్లా కలెక్టర్ టిటిడి నిర్వహణ అధికారం హథీరాం పీఠాధిపతికి అప్పగించినాడని, వెంకటేశ్వర స్వామికి ప్రియ మిత్ర భక్తుడైన హథీరాం బావాజీ పేరు మీద నిర్మించబడిన మఠమే ఇది అని, మఠంలో ఉన్న ఒక పూజారి మా కోరిక మీద సవివరంగా తెలియజేసినాడు. అదంతా విన్న తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టూ ఎన్ని కథలో ఎంతమంది భక్తుల వృత్తాంతాలో అనుకుంటా బయటకొచ్చినాం.

భవన నిర్మాణం చెక్కుచెదరకుండా అద్భుతంగా ఉంది. ఇటుక గార స్తంభాల మీద కమాన్లు తిప్పి కట్టిన రెండు అంతస్తుల భవనం కొన్ని వందల సంవత్సరాలైనా రవ్వంత గానీ శిథిలం కాకుండా, తిరుపతి పట్టణం నడిబొడ్డులో ఒక స్మారక చిహ్నంగా ఉందని, ఈ భవనాన్ని దేవస్థానం వాళ్లు భద్రంగా కాపాడితే బాగుంటుందని అనుకుంటా, ఆ బజారులో మెరికల మాదిరుండే భీమా విలాస్ అప్సర హోటల్స్ ను చూసి, అవి రెండూ చాలా కాస్ట్లీ హోటల్స్ అని తెలుసుకొని విద్వాన్ కోర్సు ముగించుకుండే లోపల ఒకసారైనా ఆ హోటల్స్‌లో కాఫీ తాగల్లని అనుకుంటా నాలుగ్గాళ్ల మంటవాన్ని చూసి మా శింగనమలలో ఉండే తలబాల మంటపాన్ని గుర్తు చేసుకుంటా మిత్రునితో కలిసి రూముకు చేరుకుండాను.

(ఇంకా ఉంది)

Exit mobile version