[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
ఇట్లా తిండితో ఆరోగ్యం చెడిపోతాది నారాయణా!
ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న 48 రూపాయలలో తిరుపతికి చేరే సరికి ఆరు రూపాయలు అయిపోయినాయి చే బదులు తెచ్చుకున్నోళ్లకు ఇవ్వగా మిగిలింది 30 రూపాయలు. హెడ్మాస్టర్ సార్ నవంబర్లో పదో 15 రుపాయలు పంపుతాడను కుండాను. పంపలేదు. రూమ్ బాడుగ,స్టవ్ కిరసనాయిలు ముఖం సభ్యులు,బట్టల సబ్బులు అట్లాంటివి తీసుకోక తప్పడం లేదు. బట్టల సబ్బుతో ఉతుకున్న బట్టలు ఇస్త్రీ చేయించుకోవడం లేదు. ఇస్త్రీ చేయించుకోకుండా ఉతికిన బట్టలు తొడుక్కొని కాలేజీకి పోవడానికి చాలా నామోషి అనిపించ సాగింది. ఆటికీ అప్పుడప్పుడు ఉతుకున్న ట్రౌజర్లు పూర్తి అరకముందే, భాస్కర్ లేనప్పుడు, ఇస్త్రీ మడతల మాదిరి మడతలేసి, తలదిండు కింద పెట్టుకొని, పండుకుంటే ఇస్త్రీ చేసినట్లే ఉంటాయని ఆ పని చేసుకోసాగినాను. కానీ కాటన్ శ్లాగుల్ని అట్ల చేయడం కష్టం అనిపించడంతో ఇస్త్రీ చేయించుకోవలసి వస్తా ఉంది. ఇస్త్రీకి డబ్బులు బరువనిపించ సాగింది. కొనుక్కోవలసిన పుస్తకాలు కొనుక్కోలేదు. కాలేజీకి పోయినా ఎక్కడికి పోయినా దిగులు వేదన అసంతృప్తి గుండెను నలపసాగినాయి. మిత్రులతో కలవడానికి మనసు రావడం లేదు.
భాస్కర్ ఎక్కువసార్లు హోటల్లోనే తినొస్తాడు. హోటల్ తిండి బోర్ కొట్టినప్పుడు హోటల్లో కూరలు తెస్తాడు. కోడిగుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకుంటాడు. ఆ కూరలూ ఆమ్లెట్లూ తానొకడే తినలేడు కదా! అతడు బ్రతిమాలి మాకు ఆమ్లెట్స్ వేస్తాడు. మాకు కోడిగుడ్లు అపురూపం.
మా ఊర్లో అయితే కోడిగుడ్లు తినడం అంటే అది సంసారంలో జిగి ఉండే వాళ్ళ వ్యవహారం. పెట్టకోడిని పెంచినా అది పెట్టిన గుడ్లన్నీ పొదిగేయడమే గాని తినేది ఉండదు. అందుకే నాకు కోడిగుడ్డు తినడం ఒక వరమనిపిస్తాది. అట్లాటి కోడిగుడ్లు తెచ్చుకొని భాస్కర్ తినడమూ మా ఇద్దరికీ చెరొక ఆమ్లెట్ వేసి ఇయ్యడమూ మాకు ఇష్టం ఉన్నా బిడియబడతా వద్దంటూనే తినడమూ, ఇది స్వామికీ నాకూ చాలా ఇబ్బంది అనిపించసాగింది. పప్పూ సాంబార్ చేసుకోవడానికి నేను తెచ్చిన కందిబేడలు అయిపోయినాయి. మా ఇద్దరి దగ్గర చిట్లం పొళ్లు మాత్రం కొద్ది కొద్దిగా ఉండాయి.
నారాయణస్వామి అప్పుడప్పుడు హోటల్ నుంచి సాంబారూ పప్పూ తెస్తా తాను తెచ్చినప్పుడు నాకూ కొంచెం సర్దుకుంటాడు. అతడు నాలుగు సార్లు హోటల్ నుంచి కూరలు తెప్పిస్తే నేను ఒకసారైనా తెప్పించల్ల కదా! తెప్పించడానికి శక్తి లేక, తెప్పించకుండా ఉండటానికి మనసొప్పక, డబ్బులు లేని నా చేతగాని తనానికీ సభ్యతతో వూగులాడే మనసుకూ మధ్య హృదయం నలిగిపోసాగింది.
భాస్కర్ ఏదో అర్జెంటు పని మీద నాలుగు రోజులు సెలవు పెట్టి ఊరికి పోయినాడు. భాస్కర్ లేనప్పుడు మాకు ఇద్దరికీ కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. మా పేద తిండేదో ఇబ్బంది లేకుండా తింటాం. నాకయితే, స్వామి గుడకా నా పక్కన లేకుంటే నేను హాయిగా మాచిరాజు శివరామరాజుతో కలిసి గోవిందరాజు స్వామి గుడికి పోయి ప్రసాదం పెట్టించుకొని కడుపునిండా తిని రావొచ్చునని అనిపించ సాగింది. అట్లా చాలాసార్లు తినొచ్చినాను కూడా. తినొచ్చినప్పుడల్లా ఈ మిత్రులతో కలిసి ఉండటం కంటే ఎక్కడైనా ఒక రెండు రూపాయలకు బాడుగ కొట్టం దొరికితే నేను ఒక్కడినే ఉండొచ్చు కదా, ఒక్కన్నే ఉంటే నా లేమి తనమూ నా త్యాపల బతుకూ నా దీనస్థితీ నా గుట్టూ ఇతరులకు తెలిసే వీలుండదు కదా, నా బాధలూ నాకన్నీళ్లూ నాకే సొంతమయ్యేటివి కదా అని అనుకుండాను.
మధ్యాహ్నం మూడో పీరియడ్ వరకు క్లాసులు ఉండడంతో నేను గోవిందరాజస్వామి గుడికి ప్రసాదం కోసరం పోవడానికి వీలు కాలేదు. స్వామీ నేనూ రూముకొచ్చి అన్నం వండుకొని భోజనానికి కూర్చుండాం. పోయిన వారంలో రెండుసార్లు స్వామి మిట్ట వీధి మెస్‌లో ఒకసారి పప్పు ఒకసారి సాంబారు తెచ్చినాడు. తెచ్చినప్పుడల్లా మా దగ్గర ఉండే చిట్లంపొళ్లూ చింతతొక్కూ కొంచెం వాడుకుంటే, తెచ్చిన హోటల్ కూర ఇద్దరికీ తృప్తిగా సరిపోతాది. ఈ వారంలో ఒకసారైనా నేను హోటల్ కూర తీసుకొని రావల్కనుకుండాను. హెడ్మాస్టర్ సార్ నుంచి ఎంఓ రాలేదు. చేతిలో పైసా లేదు. అందుకే మౌనంగా బాధపడతా అన్నం వండినాను. స్వామి గుడకా హోటల్ కూర ప్రస్తావన చేయలేదు. ఇద్దరమూ చిట్లం పొడితో అన్నం తింటా ఉండాము. అంతలోనే సింగమనేని నారాయణ మా రూముకొచ్చినాడు. బోంచేద్దాం రా అన్నా అని పిలిచినాను. నేను మొదటి నుంచి ఆయనను అన్నా అని సంబోధిస్తా ఉంటాను. ఆయన చాప మీద కూర్చొని గోడకు అనుకొని, ‘ఏమి కూర చేసుకుండారు?’అని అడిగినాడు. కూరేమీ చేసుకోలేదని అన్న్యాను నేను.
‘కొంచెం మజ్జిగ నీళ్లయినా తెచ్చుకోండి నారాయణా! ప్రతిపూటా ఇట్ల కారం పొళ్లతో చిట్లం పొళ్లతో తింటా ఉంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఒక పూటైనా కొంచెం మజ్జిగన్నం తినకుంటే ఎట్లర్రా?’ అని మందలించే పద్ధతిలో సలహా ఇచ్చినాడు. అప్పుడప్పుడు తెప్పించుకుంటామని ఈరోజు వీలు కాలేదని అబద్ధం చెప్పినాం.
పాఠాల విషయం అడిగినాడు. బాల వ్యాకరణం సంస్కృత శబ్దమంజరి కంఠస్థం చేసినారా అని ప్రశ్నించినాడు. నేను అన్నీ వల్లించినాను. బాల ప్రౌఢవ్యాకరణ సూత్రాలు వెనకనుంచి తనకొచ్చునని, ఆ రెండు వ్యాకరణ గ్రంథాలూ బట్టీ పడితే, వ్యాఖ్యానాలు సులభంగా అర్థమవుతాయని, అర్థమైతే వ్యాకరణం పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చునని, విద్వాన్ కోర్సు నాలుగు సంవత్సరాలు పెట్టడం వృథా అని, ఒక సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు చదివి పక్కన పడేయొచ్చునని చాలా తేలికగా చెప్పినాడు. తాను విద్వాన్ కోర్సులో చేరకముందే ఆధునిక సాహిత్యం అంతా చదివినానని, శ్రీ శ్రీ మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి కావ్యాలు నాలుక మీద ఉండాయని, రెండు కవితలు గడగడా చెప్పినాడు.నేను ఆశ్చర్య పోయినాను. ఈ మనిషికి అవకాశం ఇస్తే విద్వాన్ ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా ఇప్పుడే రాయగలడేమో అనిపించింది. అందుకేనేమో, ఓరియంటల్ కాలేజీలో ఈ మనిషి అంటే అంత గౌరవం అనుకుండాను.గౌరీ పెద్ది రామసుబ్బశర్మ అచ్చన్న శాస్త్రి తప్ప మిగిలిన లెక్చరర్లందరూ సింగమనేనిని ప్రత్యేకంగా చూస్తారని, కొంతమంది లెక్చరర్లు సింగమనేని దృష్టిలో అమాయకులని, స్టూడెంట్స్ అంతా అనుకోవడాన్ని గుర్తుచేసుకొని అతని మాటలను శ్రద్ధగా విన్నాం.
ప్రధాని శాస్త్రి మరణం – రకరకాల పుకార్లు!
సంక్రాంతి సెలవులకు ఊరికి వచ్చినాను. మా చెరువు మాగాణి కింద వరిమళ్ల కోతలు అయిపోయినాయి. మడి కోతలు ముమ్మరంగా ఉంటే, నేను కనీసమంటే రెండు మూటలు కూలి గింజలు తెస్తానని ఆశతో అర్ధపరీక్షలు అయిపోయిన దినమే బయలుదేరి ఊరికి చేరుకుండాను. మడి కోతలన్నీ అయిపోయినాయని తెలిసి నిరాశపడినాను. అయితే చెరువులో నీళ్లు దండిగా ఉండాయని, వేసవి పంట పెట్టుకోవడానికి మళ్లల్లో మడకలు దున్నే పనులు మొదలైనాయని, శెలవులంతా బాడుగ మడకలకు పోతే, ముప్పై నలభై రూపాయల కూలి డబ్బులు చేతికొస్తాయని తృప్తిపడినాను.
నాయన కోరుకు చేసిన సీతయ్య కయ్యలు, కొరివిపల్లి వాళ్ళ మడి వారం దినాల కిందట కోసినారు. సీతయ్య కయ్యల్లో కేసరొడ్లు పుట్టెడు అయినాయని, మన కోరు భాగానికి ‘పందుం’ వడ్లు వచ్చినాయని, కొరిపల్లి వాళ్ళ ఒకటింకాలు ఎకరా మడిలో ఢిల్లీభోగాల పంట, అనుకున్నంత కాలేదని, మన కోరు భాగానికి ఎనిమిది పల్లాలు వచ్చినాయని నాయన చెప్పినాడు. అమ్మయ్య, పెద్దక్క, వెంకటలక్ష్మి ముగ్గురూ చేసిన కూలి గింజలు ఐదు మూటలు అయినాయని అమ్మయ్య చెప్పింది. సుంగిడికీ నాగుకూ తెచ్చుకున్నవి అన్నీ పోనూ పది మూటల వడ్లు కార్తీకం పంటలో మిగిలినాయని, ఇప్పుడు పెట్టే ఎండకారు పంటలో ఈ మాత్రం ఇంటికి వస్తే, సంవత్సరం బత్యం గింజలకు ఇబ్బంది ఉండదని నాయన ధైర్యంగా చెప్పుతా ఉంటే నాకు చాలా సంతోషమైంది. ఈ ప్రకారంగా నాలుగేండ్లు గడిచి పోయేటట్ల చూడు భగవంతుడా అని కనిపించని దేవునికి మనసులో మొక్కుకుండాను.
మా రెండు కోరుమళ్ళల్లో నారు పోసేకి, కయ్యల్లో ఇరుసాలు దున్ని అదును చేసి పెట్టినాను. ఎవురయినా పిలిస్తే బదులు మడకల కోసరం దున్నడానికి పోతావుండని, మన మళ్లు నాటకం టైముకు బదులు మడకలోళ్లు వస్తే, మడకల కూలిబెడద ఉండదని, ఎవురూ పిలవకుంటే మన మళ్లల్లోనే ఇరుసాలు దున్నుతా ఉండని చెప్పి నాయన ఆకుల గంపెత్తుకొని పల్లెలకు పోయినాడు. నేను మొదట సీతయ్య కయ్యల్లో శాడ, అడ్డసాల దున్నుతా ఉంటే పెద్దక్క, వెంకటలక్ష్మి మట్టసంగా పెల్ల తొక్కినారు. మూడు దినాల్లో రెండు మళ్లల్లో ఇరుసాలు దున్ని వరికొయ్యల పెల్ల తొక్కినాం. నాలుగోదినం పని లేకపోవడంతో హెడ్మాస్టర్ సారోళ్లను పలకరించడానికి శింగనమలకు పోయినాను. నా చదువు విషయమంతా సారోళ్ళకు చెప్పి, నేను రాసిన కొన్ని పద్యాలను చూపించినాను. హెడ్మాస్టర్ సార్ చాలా సంతోషపడి, నవంబర్లో డబ్బులు పంపనందుకు కొంచెం బాధపడి, ‘ఎంత ఇబ్బంది పడినావో ఏమోరా? మీ నాయన కూడా పంపినాడో లేదో’ అని సార్ చాలా ఫీలయితా అడిగినాడు. నేను తలకాయొంచి కన్నీళ్లు కారుస్తా, నా కష్టాలను మెల్లగా చెప్పినాను. అక్కయ్య నన్ను చూసి బాధపడింది. ‘సారీ రా. స్కూల్ పనుల్లో మునిగిపోయి నీకు డబ్బులు పంపల్లనే ఆలోచనే రాలేదు. సరే సెలవులు అయిపోయినంక తిరుపతికి పోయే ముందు ఒకసారి వచ్చి పో! ఇరవయ్యో ముప్పయ్యో ఇస్తాను’ అని చెప్పినాడు హెడ్మాస్టర్ సార్. తరువాత పదో తరగతి వరకు నా క్లాస్మేట్ గా వుండిన బాబు విషయం చెప్పి బాధపడినాడు సార్.
బెస్త బాబు పదవ తరగతి అయిపోతానే ఎందుకో స్కూలు వొదిలేసినాడు. నా మాదిరే చాలా పేదవాడు. బాబు వాళ్లకు పదీ పన్నెండు మేకలుండాయి. వాళ్ల నాయన, శింగనమల చెరువులో చేపలు పట్టుకొని వచ్చి అమ్ముతాడు. వాళ్ళమ్మ మేకలను కాస్తాది. ఒక్కొక్కసారి బాబు కూడా మేకలు కాసేకి పోతాడు. ఆ పని తప్ప వేరే పని తెలియదు బాబుకు. చాలా సుకుమారంగా పెరిగినాడు. తల్లిదండ్రులకు బాబు ఒక్కడే కొడుకు. వాళ్ళమ్మ ప్రోద్బలంతో బాబును హైస్కూల్లో చేర్చినారు. బాబు, వెంకట సత్యం మాదిరే చాలా ఇంటెలిజెంట్. నాకు సహాయపడినట్లే బాబుకు కూడా ఎనిమిదో తరగతి నుంచి స్పెషల్ ఫీజు, పుస్తకాలు అన్నీ మా హెడ్మాస్టర్ సారే చూసుకుండాడు. అట్లాంటి బాబు, పదవ తరగతి అయిపోతానే సడన్‌గా స్కూలొదిలేసి, మేము ఎస్ఎస్ఎల్సీ అయిపోయినంక, తాను మళ్లా స్కూల్లో చేరినాడు. కారణం ఏమిటని ఆరా తీస్తే తెలిసింది. మా ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్‌లో జొన్నలగడ్డ వెంకటసత్యం ఉండాడు. అతడుండగా ఎస్ఎస్ఎల్సీ పబ్లిక్ పరీక్షలో తాను స్కూల్ ఫస్ట్ రాలేనని, బాబు అదే పనిగా స్కూల్ మానేసి, మా తర్వాత బ్యాచ్‌లో ఎస్ఎస్ఎల్సీలో స్కూల్ ఫస్ట్ వచ్చినాడు. అది తెలిసి నేను ఆశ్చర్యపోయినాను. బాబు ఎస్ఎస్ఎల్సీలో రాయలసీమలో ఫస్ట్ రావడంతో, హెడ్మాస్టర్ సార్, బాబును ఎంబిబిఎస్ చదివించల్లని వాళ్ల నాయనోళ్ళకు నచ్చజెప్పి, అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో పి.యు.సిలో చేర్చి, ఖర్చులన్నీ చూసుకుంటా ఉండాడు. బాబు, ఏమి ఆలోచన చేసినాడో ఏమో, హెడ్మాస్టర్ సారుకు తెలియకుండా పోస్టల్ పరీక్ష రాసి, క్లర్కుగా సెలెక్టయి, కాలేజీ చదువును వొదిలేసి, సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్ క్లర్కుగా ఉద్యోగంలో చేరి, విషయమంతా సార్‌తో చెప్పినాడంట బాబు. తన మాట వినకుండా బాబు మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నాడని సార్ బాధపడతా చెప్పడం విని నా కండ్లు చెమ్మగిల్లినాయి.
వెంకటసత్యం, శంకర్ అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతా సెలవులకు ఊరికి వచ్చినారని తెలిసి, వెళ్లి పలకరించినాను. శంకర్ వాళ్ళ బావ, మదన గోపాల్ సార్ నన్ను చూసి పరవశించి పోయినాడు. నేను మిగతా మిత్రులందరినీ కలుసుకొని వాళ్లతో సాయంకాలం వరకు గడిపి మా ఊరికొచ్చినాను.
మా ఊరి మాగాణిలో రొట్టే పుల్లప్పోళ్ల మడిలో రెండు దినాలు, నేసే బుడ్డన్నోళ్ళ మడిలో మూడు దినాలు మా దున్నపోతులతో మడకలు దున్ని, మొత్తం ఐదు బదులు మడకలు చేసినాను. ఈ ఐదు దినాలు మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు గెనాలు చెక్కే పనికి పోయి రోజుకు రెండు రూపాయలు ప్రకారం పది రూపాయలు కూలి డబ్బులు ఎత్తి పెట్టుకుండాను. ఇంకా ఎవరయినా కూలికి పిలుస్తారేమోనని ఆశగా ఎదురుచూసినాను. ఎవురూ పిలచలేదు. ఇంట్లో మూడు పూటలా కమ్మగా తింటా పనికి పోతావుంటే పని చేసినట్లే అనిపించలేదు. ఈ ప్రకారంగా ఇంట్లో బత్తెం గింజలూ, సెలవులకు వచ్చినప్పుడల్లా చేతినిండా కూలి పనులూ ఉంటే నా చదువు ఖర్చులకు అయ్యే డబ్బులన్నీ నేనే కూడా పెట్టుకోవచ్చు కదా అనుకుండాను.
సంక్రాంతి పండగ అయిపోయినంక వెంటనే తిరుపతికి బయలుదేరకుండా ఒక వారం దినాలు కూలికిపోయి ఎట్లన్నా గానీ అంతా ఒక నలభై రూపాయలు కూడ పెట్టుకుంటే, హెడ్మాస్టర్ సారు ఇరవై ఇస్తే పాఠ్యపుస్తకాలు కొనుక్కోవచ్చునని ఆలోచన చేసి హెడ్మాస్టర్ గారిని కలుసుకుండేకి శింగనమలకు పోయినాను. సార్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఘట్టప్ప స్వామి, సత్యమూర్తి సారు హాల్లో కూర్చొని పేపర్ చదువుతా బాధపడతా ఉండారు. నేను హాల్లోకి పోయి, అంతకుముందే వచ్చిన తిప్పన్న దగ్గర కూర్చుండాను. దేశ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి రష్యాలో హఠాత్తుగా చనిపోయినాడని, ఆ విషయమే సార్ వాళ్ళు మాట్లాడతా ఉండారని చెప్పినాడు తిప్పన్న. అవునా, అయ్యో అని నేను ఆశ్చర్యపోతా వాళ్ల మాటలు వినసాగినఉంది.
“నమ్మడానికే వీలుకాకుండా ఉంది సత్యమూర్తి! ఉన్నఫలంగా ప్రధానమంత్రి శాస్త్రి చనిపోవడమేమిటి? చనిపోయిన వెంటనే ఆ వార్త ఎందుకు బయటకు రాలేదు? ఆయన ఆరోగ్యం గురించి ఇంతకుముందు ఎన్నడూ ఏ వార్తా లేదు కదప్ప! అదీ, తాష్కెంట్ ఒప్పందం పైన సంతకం చేసిన రోజు రాత్రే ఆయన చనిపోవడం చూస్తే ఏదో అనుమానంగానే ఉంది. ఈ రోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా, లాల్ బహదూర్ శాస్త్రి మీద విష ప్రయోగం జరిగినట్లు అనుమానిస్తూ రాసినాయి. ఎంత ఘోరం జరిగిపోయింది ఘట్టప్ప! అంతా నిరాడంబరుడు, నీతికీ నిజాయితీకి నిలువెత్తు రూపం, దేశంలో హరిత విప్లవానికీ శ్వేత విప్లవానికీ పునాది వేసినవాడు, 18 సంవత్సరాలలో నెహ్రూ సాధించలేని దేశాభివృద్ధిని 18 నెలలలోనే సాధించిన అద్భుత పరిపాలనదక్షుడు, గొప్ప కార్యశీలి, జై జవాన్ జై కిసాన్ నినాదంతో అటు భారత సైన్యంలోనూ ఇటు కర్షకులలోనూ స్థైర్యాన్ని నింపిన వ్యక్తి, నిన్న జరిగిన యుద్ధంలో పాకిస్తానుకు తగిన గుణపాఠం చెప్పిన మహా ధైర్యవంతుడు అకస్మాత్తుగా వెళ్లిపోవడం దేశానికి చాలా లాసప్పా! మళ్ళీ అటువంటి పీఎం ఈ దేశానికి రాడు” అంటా హెడ్మాస్టర్ సార్ చాలా విచార పడసాగినాడు.
“నిజమే సార్! శాస్త్రి పొట్టివాడైనా చాలా గట్టివాడు. అటువంటి నీతివంతుడైన పరిపాలకుడు ఒక పదేండ్లపాటు ప్రధానిగా ఉండి ఉంటే, దేశం బాగా డెవలప్ అయి ఉండేది. దేశ రాజకీయాలు కూడా నైతిక విలువలతో కొనసాగేటివి. ఏమి చేస్తాం,మన దురదృష్టం. ఇది దేశమంతా విచారించవలసిన దురదృష్ట సంఘటన. ఇది చూస్తా ఉంటే, ఏదో కుట్ర కారణంగానే ఆ మహావ్యక్తి కన్ను మూసినాడనిపిస్తాది. ఈ సంఘటన వెనక ఎవరి హస్తముందో మరి?” అని ఘట్టప్ప స్వామి బాధపడినాడు.
“ఈ రెండవ పాకిస్తాన్ యుద్ధంతో భారతదేశ సత్తా యేమిటో ఆగ్రదేశాలకు స్పష్టంగా తెలిసే విధంగా, లాల్ బహుదూర్ శాస్త్రి గొప్ప వ్యూహమే పన్నినట్లుంది. అగ్రదేశాలు రెండూ, ఆసియాలో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి పాకిస్థాన్ ను కేంద్రంగా చేసుకోవల్లని అనుకున్నట్టు తోస్తాది. నెహ్రూకూ సోవియెట్ యూనియన్‌కూ ఉన్న సాన్నిహిత్యం వల్ల భారత్‌కు నచ్చజెప్పి పాకిస్తాన్ను సంతోషపెట్టల్లని ఆ నెపపంతో దానిని పావుగా వాడుకోవల్లని,తాస్కెంట్ ఒప్పందం పైన సంతకం చేయించడానికి రష్యా ప్రధాని కోసిగిన్, శాస్త్రి పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చినాడో లేక మన దేశ నాయకులు ప్రధాని పదవి పైన కన్నేసి, అత్యంత నిగూఢంగా, తాము చేసే పనిని గంధర్వుల చేత చేయించినట్లు చేయించినారో అంతా మిస్టరీగా ఉంది దాస్! అందులో మా నాయమ్మ ఇందిరాగాంధీ పేరు గుడకా వినిపిస్తా వుంది. అధికార దాహం ఎంత చెడ్డదో మనకు చరిత్ర చెబుతుంది కదా” అని సత్యమూర్తి రకరకాల అనుమాలను లేవలెత్తినాడు. ఆయన మాటలు వినినంక నాకు మా సోషియల్ పాఠాల్లోని మొఘల్ చక్రవర్తులు గుర్తొచ్చినారు. ఏమైనా వాళ్ల మాటలు వల్ల లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం తెలిసింది.
“ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పైన దాదాపు విజయం సాధించినా భవిష్యత్తులో మాటిమాటికీ ఆదేశంతో ఇటువంటి యుద్ధాలు తప్పవేమో అనిపిస్తాది సత్యమూర్తీ!బ్రిటిష్ పాలకులు డివైడ్ అండ్ రూల్ పాలసీతో భారతదేశాన్ని తమ బడిలోకి తెచ్చుకొని పరిపాలన చేసినంతవరకు చేసినారు. మొత్తం దేశాన్ని తమధీనంలోకి తెచ్చుకోవడానికి దుర్మార్గమైన ఆ రాజనీతిని అమలుపరిచినారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్లు దేశాన్ని వదిలిపోతూ కూడా భారతదేశాన్ని నిర్వీర్యం చేయడానికి అదే రాజనీతిని ప్రయోగించి, దేశంలోని హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపడం వల్ల దేశంలోని వాయవ్య ప్రాంతాలలోని చాలామంది ముస్లింలు ముఖ్యంగా ముస్లిం రాజకీయ నాయకులు తమకు ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించడమూ, దేశ విభజన సమయంలో దేశాల సరిహద్దు నిర్ణయాల కారణంగా మత కలహాలు చెలరేగడమూ, లక్షలాదిమంది ముస్లింలు హిందువులు మరణించడమూ, దానితో రెండు దేశాల మధ్య స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచే తొలగించలేని దుర్మార్గమైన శత్రుత్వం ఏర్పడడమూ, ముస్లింలు ఎక్కువగా ఉన్న కాశ్మీర్‌ను తమ దేశంలో విలీనం చేసుకోవడమే తమ దేశ ప్రధాన లక్ష్యమని పాకిస్తాన్ భావించడమూ అన్నీ వరుసగా జరిగినాయి ఘట్టప్పా! కాశ్మీర్ పూర్తిగా ఏదో ఒక దేశంలో విలీనమయ్యే వరకు రెండు దేశాల మధ్య ఇటువంటి యుద్ధాలు జరుగుతానే ఉంటాయనిపిస్తుంది.”
“1947లో జరిగిన మొదటి పాకిస్తాన్ యుద్ధం నెహ్రూ గారి అలసత్వం కారణంగా మన దేశం పోగొట్టుకున్న పాక్ అక్రమిత కాశ్మీర్ సమస్య ఐక్యరాజ్యసమితిలో నానుతా వున్నా దాన్ని పొందడానికి భారత ప్రభుత్వమూ దానిపైన పట్టు వదలకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్రభుత్వమూ నిరంతరమూ ఘర్షణ పడుతూనే ఉండాయి. 1962లో జరిగిన హిందూ చైనా యుద్ధంలో ఇండియా అపజయం పొందినప్పటి నుంచి పాకిస్తాన్ మరీ చెలరేగిపోతా ఉంది సత్యమూర్తీ! ఆ అలుసుతో ఆపరేషన్ జబ్రాల్టర్ పేరుతో పాక్ సైన్యం కాశ్మీర్ లోకి యుద్ద సన్నాహంతో చొచ్చుకొని రావడంతో, లాల్ బహుదూర్ శాస్త్రి పాకిస్తానుకు దిమ్మతిరిగేటట్లు లాహోర్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించడంతో దిక్కు తెలియని స్థితిలో అపజయాన్ని మూటగట్టుకోక ముందే పాకిస్తాన్ అగ్రదేశాల సహాయంతో యుద్ధ విరమణకు పూనుకొని, తాస్కెంట్ ఒప్పందం కుదుర్చుకుంది సత్యమూర్తీ! అయితే యుద్ధశాంతి కోసం తాష్కెంట్ ఒప్పందం పైన సంతకాలు చేయడానికి తాష్కెంటుకు అంటే రష్యాకు వెళ్లిన రెండు దేశాల అధిపతులలో ఒకరు ఆథిత్యం ఇచ్చిన దేశంలో మరణించడం ప్రపంచంలో ఇదే ప్రథమం ఘట్టప్ప! తమ దేశానికి అతిథిగా వెళ్ళిన మన దేశాధినేత మరణం విషయంలో రష్యా మౌనం వహించడం, పక్క గదిలోనే ఉన్న మన ప్రధాని అధికారిక డాక్టర్‌కు కూడా ప్రధాని మరణ వార్త తెలియక పోవడం, ప్రధాని డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించకపోవడం, ఇదంతా తెలిసి భారత ప్రభుత్వం నోరెత్తక పోవడం ఈ శతాబ్దంలోనే ఆశ్చర్యం కలిగించే విషయ మప్పా” అని హెడ్మాస్టర్ బాధగా బరువుగా నిట్టూర్చినాడు.
అంతా విని నా పెదవులు ఆరిపోయినాయి. రాజ్యాలు రాజ్యాధికారాలు ఇంత దుర్మార్గంగా ఉంటాయా అని ఆశ్చర్యపోతా, సాయంకాలం వరకు సారోళ్ల దగ్గరే ఉండి, సాయంత్రం సార్ ఇచ్చిన 25 రూపాయలు తీసుకొని బయలుదేరి ఇల్లు చేరుకుండాను.
నాలుగో తరగతి చదివినోని చేతిలో దేశ ప్రధానులు!
మాగాణిలో రైతులందరూ ఎండ కారు పంటకు నార్లు పోసి ఎవురి మడిలో వాళ్లు మడకలతో దున్నుకుంటా ఉండారు. బాడుగ మడకలతో దున్నించుకోవడానికి నన్నెవురూ పిలచకపోవడంతో నాకు దిక్కు తోచలేదు. నార్లు వచ్చే వరకు కూలోళ్లకు ఊర్లో పనులు లేకపోవడంతో మా ఊరోళ్ళు గోకుడు శనక్కాయల కోసరం మాల్యవంతం, బండ్లపల్లి పప్పూరు, బత్తలపల్లి ప్రాంతాలకు గుంపులు గుంపులుగా యెల్లవారినారు. ఒక వారం దినాలు పోతే ముప్పై నలభై రూపాయల కూలి తెచ్చుకోవచ్చునని నేనూ మాల్యవంతానికి బయలుదేరి, ఇంతకుముందు ఆరేడేండ్ల కిందట దిగిన చావిట్లోనే మా గేరోల్ల గుంపుతో పాటు దిగినాను. కొన్నేండ్ల నుంచి చేని కూలికి దూరమైనందువల్ల, మొదట రెండు దినాలు గోకుడు శనక్కాయలు పెంకుతో కెదరడం కష్టం అనిపించింది. అనిపించినా చలికి ఇబ్బంది పడతానే, తిరుపతి చదువు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వారం దినాలు నానా అవస్థలు పడి, 40 రూపాయలు కూలి శనక్కాయ డబ్బులు జమయినంక, ఇంక చాలనుకొని, మరీ ఆలస్యం అయితే పాఠాలు, ముఖ్యంగా వ్యాకరణం చందస్సు పాఠాలు జరిగిపోతాయని ఆలోచన చేసి, ఊరికి తిరిగొచ్చినాను. నా తిరుపతి ప్రయాణానికి అమ్మయ్య అన్నీ రెడీ చేసింది. నాయన నా శనక్కాయ కూలీ డబ్బులు ఐదో పదో ఇచ్చి పొమ్మన్నాడు. నేను పెట్టబోయే ఖర్చులన్నీ లిస్టు చెప్పినాను. “తిరపతిలో చదువుకుండే వానికి ఐదో పదో నువ్వీకుండా వాని కూలి దుడ్లు అడిగేకి నీకు నోరెట్ల వొచ్చింది?” అని అమ్మయ్య నాయనను మందలించింది. దాంతో నాయన ఏమీ మాట్లాడలేదు.
మరుసటి దినం తిరుపతికి బయలుదేరినాను. అమ్మయ్య, తన వరి కోతల కూలి గింజలు ఒక అర్థ మూట రామే వాళ్ళ ఇంట్లో పెట్టి, నాయనకు తెలియకుండా అమ్మి 15 రూపాయలు రహస్యంగా నా చేతికిస్తా చెప్పింది. చెప్పుతా, ఈ దుడ్లతో బట్టలు కొనుక్కోమనింది. అమ్మయ్య అట్ల అంటా ఉంటే నాకు కనుగుడ్ల మీద నీళ్లు పారాడినాయి. ఎండల కాలం సెలవులకు వచ్చేటప్పుడు కొండపైకి పోయి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రసాదము, కాశీదారాలు తీసుకొని రమ్మన్నారు పిల్లోళ్లు. సరే అని, నేను అమ్మానాన్నలకు, జేజి చిన్నాయనలకు పాద నమస్కారం చేసి, బియ్యము సరుకులు కట్టిన మూటను ఎత్తుకొని, గుడ్డలు పుస్తకాలు పెట్టుకున్న కొత్త ట్రంకు పెట్టిని చేతిలో పట్టుకొని బస్సెక్కి అనంతపురంలో దిగి, అక్కట్నుంచి ధర్మవరం చేరుకొని పాకాల రైలెక్కినాను.
పాకాల రైలు మెల్లగా పోతావుంది. ఊరికి వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందర సినిమా రీలు మాదిరి తిరిగినాయి. వచ్చినప్పటి నుంచి పుస్తకం ముట్ట లేదని ట్రంకు పెట్టెలో ఉండే రఘువంశం కావ్యాన్ని చేతికి తీసుకుండాను. రైలు పెట్టెలోని లైట్ వెలుతురులో అక్షరాలు బాగా కనిపిస్తా ఉండాయి. అయితే అక్షరాల్లో శ్లోకం కనిపించకుండా అమ్మయ్య కనిపించ సాగింది.
తల్లి ప్రేమ అంటే ఇదేనేమో! కని, పాలిచ్చి పెంచిన మమకారం ఎంత అద్భుతమైనది! ఎక్కడో దూరంగా ఉండి వంట చేసుకొని, చిట్లం పొళ్లు చింతతొక్కుతో దిగినంత తిని, చదువుకుంటా ఉండే నాకు, ఐదో పదో ఇవ్వకుండా, నా కూలి డబ్బుల్ని ఆశిస్తూ ఉండాడు నాయన. తిరుపతిలో చదువుకుంటా నేను ఏమీ అవస్థ పడతా ఉండానో అని దిగులు పడతా, తన కూలి గింజలు కొన్ని వేరే చోట దాచి పెట్టి, అవి అమ్మి రహస్యంగా 15 రూపాయలు ఇచ్చి, బట్టలు కొనుక్కోమని చెప్పింది అమ్మయ్య. అంతేకాకుండా నాయనతో గట్టిగా చెప్పి, నా పుస్తకాలు గుడ్డలు పెట్టుకుండేకి కొత్త ట్రంకు పెట్టెను కొనిచ్చింది అమ్మయ్య. ఊర్లో ఉ ఉన్నన్ని దినాలు కమ్మగా చేసి పెట్టి, ఆడ, ఏమి చేసుకొని తింటావో ఏమో, మనిషివి కట్టెపుల్ల మాదిరి అయిపోయినావు, ఈడుండే రొన్నాల్లయినా కడుపునిండా తిను నాయనా అని కన్నీళ్లు కార్చింది .అవి,ఏడుస్తా కార్చిన కన్నీళ్లు కాదు, నా క్షేమం కోసం నా కన్నతల్లి ఆరాటపడే హృదయంలో నుంచి పెల్లుబికి వచ్చిన మమకారపు వానచినుకులు! ఆ కన్నీళ్ల వానచినుకుల వెనక దాగిన తల్లి ప్రేమ, ఎంత గాఢమైనదో, ఆ తల్లికి తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ఈ సంవత్సరం గడిచిపోయిందని అనుకున్నా ఇంకా మూడేండ్ల వరకు, సెలవులకు వచ్చినప్పుడల్లా అమ్మయ్య ఇట్లనే నాకోసరం ఆరాటపడతా బాధపడతానే ఉంటాదేమో! హెడ్మాస్టర్ సార్ నన్ను టీచర్ ట్రైనింగ్ పంపించి ఉంటే బాగుండేది! అదయితే, రెండు సంవత్సరాలే! అది గుడకా అనంతపురంలోనే! వారం వారం ఇంటికి పోయి వస్తా ఉండొచ్చు! అట్లా అయ్యుంటే అమ్మయ్య ఇంతగా బాధపడేది కాదు. అయితే టీచర్ ట్రైనింగులో స్టైఫండ్ ఇయ్యరు కదా! అన్నీ ఆలోచన చేసే హెడ్మాస్టర్ సార్ నన్ను విద్వాన్‌లో చేర్పించినట్లుంది. అంతేగాకుండా నన్ను హై స్కూల్ టీచర్ గానే చూడల్లనుకున్నాడేమో! నాయన మోసే కుటుంబ భారమూ అమ్మయ్య తల్లి ప్రేమలోని ఆరాటమూ గురువుగారి ఆశయమూ అన్నీ తీరడానికి ఇంకా మూడున్నర సంవత్సరాల అవస్థ పడతా చదవక తప్పదు. వాళ్ల కోసరమే కాదు, అవమానాలు పొందిన మా బండమీదపల్లెలోనే కాదు, శింగనమల ప్రాంతంలోనే అందరికంటే గొప్పగా చదువుకొని తలెత్తుకొని తిరగల్ల!
అనుకుంటా ఉంటే దవడలు బిగుసుకుండాయి. మనసు ఓరియంటల్ కాలేజీ వైపు చూడసాగింది. రైలు స్పీడందుకుంది.
***
ఊరి నుంచీ వచ్చిన తర్వాత పాఠాలు బాగా జరుగుతా ఉండాయి. ఏ అంతరాయమూ లేకుండా కాలేజీ నడుస్తా ఉంది. బాలవ్యాకరణం సమాసపరిచ్ఛేదం అయిపోయింది. సెలవులకు ముందే మొదలుపెట్టిన ముద్రారాక్షసం నాటకం పూర్తీ అయింది. శూద్రక మహాకవి రాసిన సంస్కృత నాటకం ఎట్లుందో తెలియదు గానీ, తిరుపతి వెంకట కవులు తెలుగులో అనువాదం చేసిన ముద్రారాక్షస నాటకం అద్భుతం అనిపించింది. అందులోని నాందీ ప్రస్తావనలు,అలంకార శాస్త్రం చెప్పిన లక్షణాలను తిరుపతి వెంకట కవులు ఎంత చక్కగా నాటకంలో చూపించినారో అనుకొని, అందులోని ‘కథోద్గాథ’ ప్రస్తావన ఎంత అద్భుతంగా ఉందో చదివి మురిసిపోయినాను.
పూర్వకాలంలో నాటకం ప్రదర్శించే సమయంలో రంగస్థలం మీదికి మొట్టమొదట ప్రవేశించిన పాత్ర ఎవరో ప్రేక్షకులకు తెలిసేది కాదు. వారికి తెలియజేయడానికి నాటకంలో నాటక రచయితలు నాందీ ప్రస్తావనలు అనే రెండు అంశాలను మొదట రాయడం ఒక ఆనవాయితీగా పెట్టుకుండారు. అలంకార శాస్త్రంలో ఆలంకారికులు కావ్య లక్షణాలను వివరించినట్లే నాటక లక్షణాలనూ వివరించినారు. అందులో ‘ప్రస్తావన’ అనే నాటక లక్షణం గురించి చెప్పినారు –
నాటక ప్రదర్శనానికి ముందు, నాంది అయిపోయిన తర్వాత, నటీ సూత్రధారులు ఇద్దరు ప్రవేశించి, సొంత విషయాలు మాట్లాడుకుంటా ప్రదర్శించబోయే నాటకం పేరును, నాటక కథా వస్తువులను ప్రస్తావించి, మొదట ప్రవేశించే పాత్ర పేరును సూచిస్తారు. వాళ్ల మాటలను బట్టి మాటల్లో ప్రస్తావించే అంశాలను బట్టి, రంగస్థలం మీదికి మొదటి పాత్ర ప్రవేశిస్తుంది. ఈ విధంగా పాత్రను ప్రవేశపెట్టే ప్రస్తావనను ‘కథోద్గాథ’ ప్రస్తావన అని అలంకారికులు పేర్కొన్నారు. ఇటువంటి ప్రస్తావనే ముద్రారాక్షస నాటకంలో తిరుపతి వెంకట కవులు రమణీయంగా చెప్పినారు.
ఇందులో నటి తమ ఇంటి ముందర కల్లాపి చల్లి ఇంటి గడపకు పూజ చేస్తా ఉంటాది. అప్పుడు ఆమె భర్త బయటనుంచి ఇంటికి వస్తూ ఆమెను చూసి, ఏమిటే ఇంటిముందు అలికి, గడపకు పూజ చేస్తా ఉండావు? ఏమిటి విశేషం? అని ప్రశ్నిస్తాడు.
అయ్యో తెలియదా స్వామీ? ఈరోజు, చంద్రగ్రహణం కదా అని అంటుంది. అప్పుడు తెరవ వెనకనుంచి ఆ మాటలు విని, ఎవడురా నేనుండంగా చంద్రునికి గ్రహణం పట్టించువాడు అని గట్టిగా గర్జిస్తాడు. ఆ గర్జన విని, చాణుక్యుడు వస్తున్నట్లుంది మనం వెళ్ళిపోదాం పద అని నటీ సూత్రధారులు ఒకవైపు నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు నుంచి చాణక్యుడు రంగస్థలం మీదకి ప్రవేశించి, ఎవడురా నా చంద్రగుప్తునికి గ్రహణం పట్టించువాడు అంటూ కోపావేశంతో అటూ ఇటూ తిరుగుతాడు. నాటకం ప్రారంభమవుతుంది.
ఇది చదువుతా, నాగసిద్ధారెడ్డి సార్, ప్రస్తావనలోని బ్యూటీని వివరించి, చెప్పుతావుంటే వింటా పరవశించి పోయినాను. విద్వాన్‌లో అన్ని సబ్జెక్టుల పైకీ తెలుగు ప్రబంధాల సబ్జెక్టు చాలా ఆసక్తిని కలిగిస్తా ఉండడంతో, ఆంధ్ర మహాభారతంలోని ఆది సభా అరణ్య విరాట పర్వాలను ఎంతో ఇష్టంగా చదవసాగినాను. ప్రబంధ కావ్యాలను కూడా చదవాలని, అవి కొని తెచ్చుకోవల్లని అనుకుండాను. మొత్తం తెలుగు కావ్యాలను, ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ వాళ్లు ప్రింట్ చేసి, ఒక రూపాయి వెలతో సాహిత్య లోకానికి అందించేందుకు పూనుకుండారని తెలిసి చాలామంది మా విద్వాన్ విద్యార్థులు తిరుపతి బజార్ స్ట్రీట్‌లో ఉండే వెంకట్రామ బుక్ షాపులో అడ్వాన్సులు కడతా ఉండారు. నేను కూడా వసుచరిత్ర, మనుచరిత్ర మొదలైన ఐదు ప్రబంధాలకు ఐదు రూపాయలు అడ్వాన్స్ కట్టి రసీదు తెచ్చుకుండాను.
జనవరి 24వ తేదీ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఎన్నికైనట్లు రేడియో వార్తలు వచ్చినాయని, ఆమె ప్రధానమంత్రి అయిన విధానాన్ని నాగ సిద్ధారెడ్డి సార్ క్లాసులో క్షుణ్ణంగా వివరించినాడు. అదంతా విని నేను ఆశ్చర్యపోయినాను.
కేవలం నాలుగో తరగతి చదువుకున్న ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను భారతదేశ ప్రధాన మంత్రులుగా చేయగలిగిన మహా మేధావి! అతడే, మన ద్రావిడ జాతులకు చెందిన కామరాజ్ నాడర్! ఇది దక్షిణ భారతావనికి గర్వకారణం!
కామరాజ్ నాడర్, జవహర్లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోయిన తర్వాత, తమిళనాడుకు 1954లో ముఖ్యమంత్రి అయిన కామరాజ్ నాడర్, చదువుకున్నది కేవలం నాలుగో తరగతి వరకే! రాజ్యపాలనకు ప్రజాస్వామ్య దేశంలో కావలసినది రాజకీయ రాజనీతి చాతుర్యాలే కానీ, పెద్ద చదువులు డిగ్రీలు కాదని నిరూపించిన వ్యక్తి కామరాజ్ నాడర్! డిగ్రీలు లేకపోయినా పరిపాలన అనుభవంతో తన అభిప్రాయాలను సింపుల్ ఇంగ్లీషులో వ్యక్తం చేయగలిగిన మహా విజ్ఞాని అతడు.
లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ఒక సందర్భంలో నీలం సంజీవరెడ్డి కామరాజుతో, కాబోయే ప్రధానమంత్రి మీరే అని అన్నప్పుడు,you are talking a little more.I know my legs! నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావ్ నేనేమిటో నా నడకలేమిటో నాకు తెలుసు అని సంజీవరెడ్డిని నోరు మూయించినాడట కామరాజ్! అంతకన్నా ఎక్కువ ఇంగ్లీష్ భాషా చాతుర్యం పరిపాలకునికి ఎందుకు?
నెహ్రూ చనిపోయే నాటికి కామరాజ్ నాడర్, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. నెహ్రూ చనిపోయిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందనే విషయం చర్చకు వచ్చింది. నెహ్రూ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా, అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయి పేరు ప్రస్తావన కొచ్చింది. మొరార్జీ దేశాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్గం వాడు. నెహ్రూకు ఇష్టమైన వాడు కాదు. కామరాజ్ నాడర్ నెహ్రూ వర్గం కాబట్టి, అతనికి కూడా మొరాజీ అంటే అయిష్టమే! ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక సిండికేట్ నడిచేది! ఆ సిండికేట్లో కామరాజ్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి, అతుల్యఘోష్, ఎస్కే పాటిల్,ఈ ఐదు మంది ముఖ్యులు
వీరిలో కామరాజ్ అభిప్రాయమే ప్రధానం! కామరాజ్ అన్నీ ఆలోచన చేసి, మొరార్జీ అతివాది, మన మాట వినడు అనే అభిప్రాయంతో లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ పార్టీ సిండికేట్ అంటే కామరాజు నాడర్ ప్రతిపాదించనాడు. ఇంక రెండో మాట లేకుండా శాస్త్రి ప్రధానమంత్రి అయినాడు. అటువంటి శాస్త్రి ఆకస్మికంగా మరణించినాడు. ఆయన మరణం తర్వాత మళ్లీ భారత ప్రధాని ఎవరనే విషయం కాంగ్రెస్ పెద్దల ముందుకు వచ్చింది.
మురార్జీ దేశాయ్ ఈసారి ఎలాగైనా తానే ప్రధాన కావాలనుకున్నాడు. కేంద్ర మంత్రివర్గంలో నెహ్రూ కాలం నుంచి కీలక పదవుల్లో ఉన్నవాడు. ఆ రోజుల్లో ఐసిఎస్ అయిన గొప్ప మేధావి. అటువంటి వాడు ప్రధానమంత్రి కావల్లంటే కాంగ్రెస్ సిండికేట్, కామరాజ్ నాడర్ ఆమోదం పొందాల్సిందే! తప్పదు! అందుకే మొరార్జీ దేశాయ్ కామరాజ్ నాడర్ని ప్రత్యేకంగా కలుసుకొని, తన ఆకాంక్షను వెలిబుచ్చినాడు. కామరాజ్ ఏమీ మాట్లాడలేదు. మౌనమే సమాధానం. అది అర్థం చేసుకొని, మీరు ఎవరి పేరును ప్రతిపాదించినా నేను పోటీ చేస్తానన్నాడు మొరార్జీ. అందుకు కామరాజ్ సమాధానం, it is your wish! అంతే! ఇందిరాగాంధీకి మురార్జీకీ మధ్య పార్లమెంటులో పోటీ జరిగింది. ఇందిరాగాంధీ నెగ్గి ప్రధానమంత్రి అయింది. దటీజ్ కామరాజ్!
నాగ సిద్ధారెడ్డి సార్ చెప్పినదంతా విని నేను ఆశ్చర్య పోయినాను. నేనే కాదు, క్లాసులో ఉన్న విద్యార్థులందరూ విస్తుపోయినారు.
రూయా హాస్పిటల్ నిర్మాణానికి 55 లక్షలంట!
మా విద్వాన్ బ్యాచ్‌లో మున్నూరు మంది విద్యార్థులుండారు. అందులో మా రాయలసీమ వాళ్లే ఎక్కువ. అన్ని సబ్జెక్టులలోనూ రాయలసీమ విద్యార్థులే సాహిత్య అధ్యయనంలో ముందంజలో ఉండారు. నరాల రామారెడ్డి, మాచిరాజు శివరాజు, విశ్వనాథమయ్య, లక్ష్మీకాంతారాజారావు, భారతి, ఇంకా 56 మంది మా సీనియర్స్ గొప్ప సాహిత్య వేత్తలుగా కాలేజీలో పేరుపొందినారు. సింగమనేని నారాయణ విద్వాన్ కోర్సులో చేరే నాటికే రెండు నవలలు రాసిన నవలా రచయితగా లెక్కలోకొచ్చినాడు. వాళ్లను ఆదర్శంగా తీసుకొని నేనూ నా క్లాస్మీట్స్ వెంకట శివగౌడు, వీరభద్రాచారి, అష్టావధానాలు చేయల్లని పద్య రచనలను సాధన చేయడానికి పూనుకుండాం. మా ముగ్గురికీ అష్టావధానాల విషయంలో నరాల రామారెడ్డి, శివరాజు వాళ్ళిద్దరే స్ఫూర్తి. నాగసిద్ధారెడ్డి సార్ చెప్పే ఆధునిక సాహిత్య ప్రభావంతో నాకు గేయ కవిత్వం, కథ, నవలా రచయినల మీద గుడకా మనసు మర్ల సాగింది.
అప్పుడప్పుడు ఇంటి దగ్గరికి వెళ్లి నాగసిద్ధారెడ్డి సార్ను కలుసుకొని ప్రబంధాలలో అర్థం కాని పద్యాల అర్థ వివరణను అడిగి తెలుసుకుంటా ఉండాను. ప్రతి పద్యానికీ ప్రతిపదార్థం చెప్పడమూ తెలుసుకోవడమూ చాలా కష్టమైన పని అని, కొన్ని కావ్యాలు సటీకా తాత్పర్యాలతో వచ్చినాయని, అవి ఒకటి రెండు కొని క్షుణ్ణంగా చదివితే ఆ పదార్థ జ్ఞానంతో మిగతా కావ్యాలు నువ్వే చదివి అర్థం చేసుకోగలవని శ్లేషార్థ ద్వ్యర్థి కావ్యాలు క్రమంగా అర్థమవుతాయని, విస్తృతమైన అధ్యయనం వల్ల భాషాసంపద, పాండిత్యం పెరుగుతుందని, విద్వాన్ అయిపోయేలోగా కొన్ని వేల పద్యాలు కంఠస్థం కావాలని, మూడు నాలుగు ఇష్టమైన కావ్యాల పైన అథారిటీ సాధించుకోవాలని, ఆ అధ్యయనం పద్య రచనకు బాగా ఉపయోగపడతాదని నాగసిద్ధారెడ్డి సార్ స్పష్టంగా చెప్పి ఇంకాఎన్నో విషయాలు తెలియజేసినాడు. కావ్యాలకంటే ఆంధ్ర మహాభారతాన్ని నిరంతరమూ చదవాలని, ముఖ్యంగా తిక్కన భారతం చదవడం వల్ల భాషా సాహిత్య విషయాలే కాకుండా విస్తృతమైన విషయపరిజ్ఞానం అబ్బుతుందని సూచించినాడు. ఆయన చెప్పినట్లే వసుచరిత్ర, మనుచరిత్రల టీకా తాత్పర్య గ్రంథాల కోసరం విశ్వ ప్రయత్నం చేసినాను. ఎక్కడా దొరకలేదు. చేమకూర వెంకన్న విజయ విలాసం కావ్యానికి తాపీ ధర్మారావు రాసిన ‘హృదయోల్లాస’ వ్యాఖ్యాన గ్రంధం దొరికింది. అది మనోహరమైన వ్యాఖ్యానమే! అయితే విజయ విలాసం జటిలమైన కావ్యం కాదు.
ఈ ఏడెనిమిది నెలల కావ్య పఠనం వల్ల, వ్యాకరణ జ్ఞానం వల్ల, విజయ విలాసం హాయిగా అర్థమయితాది కానీ భట్టు మూర్తి, అల్లసాని పెద్దన వంటి మిగతా కవులు తమ పాండిత్య ప్రతిభనంతా గుమ్మరించి రాసిన కావ్యాలను చదవగానే అర్థం చేసుకోవడం కష్టమనిపించడంతో, మా సీనియర్ విద్యార్థులు, సాహిత్యాన్ని మథిస్తున్నటువంటి శివరామరాజు విశ్వనాథమయ్య చక్రాల లక్ష్మీకాంత రాజారావుల దగ్గరికి వెళ్లి అర్థం కాని కావ్య పద్యాలన్నిటికీ అర్థ తాత్పర్యాలు, ధ్వని వ్యంగ్య విశేషాలను రాసుకొని రావడం అలవాటు చేసుకుండాను. నేను తెలుసుకున్న దాన్ని మిత్రులకు చెప్పుతా, నాతో పాటు పద్య రచన చేస్తున్న వెంకట శివగౌడు, వీరభద్రాచారి, గొప్ప పండితపుత్రుడు, చాలా తెలివైన జ్ఞాన చంద్ర మొదలైన వాళ్లతో చర్చిస్తా, ప్రాచీన సాహిత్యాన్ని ఎంతో ఇష్టంగా చదువుకో సాగినాను. ప్రబంధ కావ్యాల చర్చలతో మా క్లాస్ మిత్రుల మధ్య నా ఐడెంటిటీని పెంచుకోసాగినాను. ఇట్లా ఆసక్తిగా చదువుకుంటా, సెలవు దినాలలో నారాయణస్వామితో కలిసి తిరుపతిలో ఒకదాని తరువాత మరొకటి ముఖ్యమైన కట్టడాలను ప్రాంతాలను చూస్తా ఉండాను.
నిన్న సాయంకాలం స్వామితో కలిసి, తిరుమల కొండకు భక్తులు నడుచుకుంటా వెళ్లే నడకదారి ప్రారంభమయ్యే చోటుకు చేరుకుండాను. ఆ ప్రాంతాన్ని అలిపిరి అని అంటారంట! అలిపిరి అంటే ఏమో నాకు అర్థం కాలేదు. ఎవరైనా పూజారి కనిపిస్తే అడుగుదామనుకుండాను. ఎవురూ కనిపించలేదు. మెట్లు ప్రారంభమయ్యే చోట కొన్ని సత్రాలుండాయి. ఆ సత్రాలలో చాలామంది భక్తులుండారు. వాళ్లు ఆ వేళప్పుడు కొండ ఎక్కి తిరుమలకు చేరుకోవడం కష్టమని అక్కడ నిలిచిపోయినారనుకుండాను. అక్కడ పాదాల మంటపం దగ్గర కనిపించిన ఒక పెద్దాయనను అడిగినాను అలిపిరి అంటే ఏమిటని. పూర్వకాలంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వెంకటేశ్వర స్వామి భక్తులు ఇక్కడున్న మండపాలలో అలసట తీర్చుకునే వాళ్లని, భక్తుల అలసటను తీర్చే ప్రాంతం కనుక దీన్ని అలిపిరి అని అంటారని ఆయన చెప్పడంతో అర్థమైంది నాకు. అక్కడ కుడి వైపుకు వేసిన తార్రోడ్లో బస్సులు పోతా వస్తా ఉండాయి. బస్సుల్లో కొండపైకి పోయే భక్తులూ కొండ దిగే భక్తులూ గోవిందా గోవిందా అని గట్టిగా అరుస్తా ఉండారు. బస్సులు పోతా వస్తా ఉండే ఆ తార్రోడ్డు వైపు చూస్తా, దూరంగా కపిలతీర్థం కొండల పైకి వెళ్లే బస్సులను గమనిస్తా ఆశ్చర్యపోసాగినాను. కొండమీదికి రోడ్డు ఏ విధంగా వేసినారో ఆ రోడ్లో బస్సులు ఏ విధంగా పోయి వస్తా వుండాయో అంతా అగమ్య గోచరంగా కనిపించసాగింది నాకు. ఒక కొండమీదికి వేసిన రోడ్డును ఇంతకుముందెన్నడూ నేను చూడలేదు. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీర్ గా పేరుపొందిన మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఆ రోడ్డు ప్లాన్ వేసినాడని తెలుసుకొని,ఆ మహానుభావునికి మనసులోనే నమస్కరించి, అక్కడినుంచి నేరుగా దక్షిణం వైపు వెళ్లే రోడ్డు పక్కనే కట్టిన ఆసుపత్రిని చూసి ఇద్దరమూ అబ్బురపోతా లోపలికి పోయినాం.
దాని పేరు శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా గవర్నమెంట్ హాస్పిటల్. ఉత్తర భారతదేశం నుండి వ్యాపారం కోసరం వచ్చి ఇక్కడే స్థిరపడిన రాధాకృష్ణ రుయా తన తండ్రి పేరు మీద రామ నారాయణ రుయా హాస్పిటల్ కట్టించడానికి భారీగా విరాళం ఇచ్చినాడంట! ఆ విరాళానికంటే ఎక్కువగా టీటీడీ కూడా పెద్ద ఎత్తున విరాళం ఇచ్చిందంట! ఇది,ఆ భారీ విరాళాలతో శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ కోసం కట్టించిన బిల్డింగని, ఈ బిల్డింగ్ నిర్మాణానికి 10-4-1959 న అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి మొరార్జీ దేశాయ్ పునాదిరాయి వేసినాడని, మూడున్నర సంవత్సరాల లోపల హాస్పిటల్‌తో పాటు మెడికల్ కాలేజీ బిల్డింగ్ తయారయిందని, 24- 9-1962లో అప్పటి కేంద్ర హోం మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి వచ్చి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌ని ప్రారంభించినాడని, బిల్డింగ్ నిర్మాణం ఖర్చు దాదాపు 55 లక్షల రూపాయల అయిందని తెలిసి మేమిద్దరమూ విస్తుపోయినాం.
హాస్పిటల్ ప్రాంతమంతా తిరిగి చూసినాం. రెండంతస్తుల బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో! ఇట్లాచోట డాక్టర్ కోర్స్ చదవల్లంటే మనట్లా వాళ్లకు సాధ్యమయ్యే పనేనా అని ఇద్దరమూ మాట్లాడుకుంటా బిల్డింగ్ ఎంట్రెన్స్ దగ్గరున్న శిలాఫలకాలను చూసి, మాకు ఆసుపత్రి వివరాలన్నీ చెప్పిన పెద్దమనిషి ఎంత కరెక్టుగా చెప్పినాడో అనుకుంటా, వెనక వైపు పోయినాం. అంతా చిట్టడవి. ఒక్క ఇల్లు కూడా లేదు. దక్షిణం వైపున దూరంగా ఐఎస్ మహల్, జ్యోతి టాకీస్ కనిపిస్తా ఉండాయి. ఇద్దరమూ బయటకు వచ్చి మంచాల వీధి, మాడవీధి, మిట్టవీధి, ఆకుతోట వీధి అడ్డ రోడ్లన్నీ దాటుకొని, మా బండ్ల వీధికి చేరుకుండేటప్పటికి సాయంత్రం ఆరు కావొచ్చింది. రూము చేరుకొని ముఖాలు కడుక్కొని టీ తాగల్లని బుద్ధిబుట్టి, భాస్కర్ నాయుడ్ని పిలుచుకొని ముగ్గురం బండ్ల వీధి మెయిన్ రోడ్లో టీ కొట్టు దగ్గర బెంచ్ మీద కూర్చున్నాం, మూడు సింగిల్ టీలు ఇమ్మని చెప్పి.
ఆ టీ తయారు చేసేది నేను అనంతపురంలో ఆదోనిలో చూడలేదు. అది రాగి కేట్లీ అంట! ఒక మూరెడెత్తుండే కేట్లీ మధ్యలో ఒక పొగ గొట్టంలో నుంచి పొగ బయటికి పోతావుంది. టీ చేసే మనిషి ఆ గొట్టంలోకి నాలుగు బొగ్గులు వేసి కేట్లీ కింద ఒక ప్లేట్లోకి రాలిన బూడిదను పక్కనుండే ఒక గంపలోకి వేసి చేతులు కడుక్కొని, పక్కన స్టవ్ మీద సన్నని మంట మీద కాగుతా ఉండే పాల గిన్నెలో నుంచి చిన్న స్టీలు గెరిటతో మీగడంతా పక్కకు నూకుతా, ఒక్కొక్క గాజు గ్లాసులో ఒక్కొక్క గెరిటెడు పాలు పోసినాడు. మాతోపాటు ఇంకా ముగ్గురు టీ కోసం కాచుకొని ఉండారు. ఆ టీ కొట్టాయన ఒక వైపున ఉండే కేట్లీ కుండలో దిగేసిన బట్ట ఫిల్టర్ని దానికుండే కాడతో బయటకు తీసి, ఒక్కొక్క గ్లాసులోకి డికాషన్ కార్చి మల్లా ఫిల్టర్ని కేట్లీకుండలోకి దిగేసినాడు. పాలూ డికాషనూ కలిసిన టీ,చిన్న గ్లాసుల్లో ముక్కాలు గ్లాసంత అయ్యింది. కుడి చేతిలో కాడ గిన్నె ఎడమ చేతిలో టీ గ్లాస్ పట్టుకొని మనిషినంతా టీ గ్లాసులోకి వొంచినట్ల వొంగుతా టీని తిరగ్గొట్టి మా చేతులకు అందించినాడు.
భలే రుచిగా ఉంది టీ. టీ కంటే, కేట్లీలో అతడు టీ తయారు చేసే పద్ధతి చాలా నైపుణ్యంగా బాగుంది. బజారులో ఇంటి ముందర ఒక నల్లని బెలుంబండ పొందేసుకొని, బండమీద ఒక పక్క స్టవ్ మీద పాల గిన్నె, ఇంకొక పక్క కేట్లీ పెట్టుకొని, తాగిన టీ కప్పులను ఒక నీళ్ల బకెట్లో కడుగుతా, అతడు చేసే టీ వ్యాపారం ఎంత లక్షణంగా ఉందో అనిపించింది నాకు. టౌన్లల్లో పట్టణాలలో ఇట్లా చిన్నచిన్న వ్యాపారాలతో ఎంత హాయిగా బతకొచ్చు, పెద్దగా పెట్టుబడులు లేని,నష్టమే తెలియని ఈ బతుకు దెరువులు ఎంత బాగుండాయి! సాయంకాలానికి మనిషి పదీ పదైదు రూపాయలు సులభంగా సంపాదించుకుంటాడేమో!
ఆలోచిస్తా టీ తాగి,టీ డబ్బులు నేనే ఇచ్చి తృప్తి పడినాను. ముగ్గురమూ రూమ్ లోకి వెళ్లి కొంచెం సేపు రూయా హాస్పిటల్ని గురించి మాట్లాడుకుండాం. లాల్ బహదూర్ శాస్త్రి మన కాలేజీ ప్రిన్సిపల్ సుదర్శనాచారికి కాశీ విద్యాపీఠంలో శాస్త్రి కోర్సు చదివేటప్పుడు క్లాస్‌మేట్ అని, 1964 నవంబర్లో ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి తిరుపతికి వచ్చినప్పుడు అదే పనిగా టైం కేటాయించి, మన ప్రిన్సిపాల్ గారిని కలుసుకొని పోయినాడని, మన సుదర్శనాచారి గుడకా పొట్టివాడైనా చాలా గట్టివాడని, ఈయన వల్లనే మన బి విద్వాన్ వాళ్లకు స్టైఫండ్ ఇస్తున్నారని భాస్కర్ నాయుడు చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యమైంది.మనసులోనే ఆయనకు నమస్కరించినాను.
ఏడుకొండలవాని ప్రసాదం ఎంత మధురం!
విద్వాన్ ఫస్టియర్ పరీక్షలు అయిపోయినాయి. పేపర్లన్నీ తృప్తిగానే రాసినాను. మిత్రులందరికీ క్లాస్ ఫస్ట్ నువ్వే వస్తావులే అని పొగిడినారు. పరీక్షల సమయంలో బాగా రాయల్లని ముఖ్యంగా ప్రబంధాల పేపరు డ్రామా పేపరు తెలిసినంత ఎక్కువ రాయల్లని స్పీడుగా రాసినాను. స్పీడుగా రాస్తే నా రాత బాగుండదు. అక్షరాలు అందంగా ఉండవు. పరీక్షల్లో రాత సరిగా లేకపోతే మార్కులు బాగా రావని ఎస్ఎస్ఎల్సీ పరీక్షల్లో నాకు వచ్చిన మార్పులను బట్టి తెలుసుకుండాను. అక్షరాలు అందంగా ఉండి ఉంటే నాకు ఎస్ఎస్ఎల్సీలో ఫస్ట్ క్లాస్ వచ్చేది. రాకపోయినా శంకరప్ప గానికంటే నాకు మార్కులు ఎక్కువ వచ్చేవి. అందుకే ఈ పరీక్షల్లో గుడకా మిత్రులు ఊహించినంతగా నాకు మార్కులు రాకపోవచ్చు. అయినా ఈ పరీక్షల మార్కులు రేపు సంవత్సరం రాబోయే విద్వాన్ పరీక్షలకు ఉపయోగపడవు కదా అని అనుకుండాను.
ఎల్లుండి స్టైఫండ్ ఇస్తారని కాలేజీలో చెప్పడంతో ఆ లోపల తిరుమల కొండకు నడుచుకుంటా పోదామని మిత్రులందరమూ నిర్ణయించుకొని తెల్లవారుజాముననే లేచి బయలుదేరినాం. భాస్కర్ నాయుడు కొండెక్కి నడవడం తన చేతకాదని, తాను బస్సుకొస్తానని, అందరమూ కొండమీద కలుసుకుందామని తాను ఆగిపోయినాడు. మేము అలిపిరి చేరుకొని మోకాళ్ళ మెట్లెక్క సాగినాం. నేను మా ఊరి దేవరకొండకూ బుష్యశృంగుని కొండకూ పోయి గడ్డి కోసుకొని, అంత పైన్నుంచి గడ్డిమోపులు ఎత్తుకొని రావడం పిల్లప్పటి నుంచీ అలవాటు వుండడం వల్ల,మోకాళ్ళ మెట్లెక్కి గాలిగోపురం దగ్గరకి చేరుకోవడానికి నాకేమీ కష్టం అనిపించలేదు. అయితే నారాయణస్వామీ మైలారప్పా చాలా అవస్థ పడసాగినారు. మా వెంట వచ్చిన భక్తులు కొంతమంది గాలిగోపురం దాటినంక ఎక్కడా పెద్దగా ఎక్కేది ఉండదని, మధ్యలో రెండు మూడు మైళ్ళు అంతా చదునుగా ఉంటుందని చెప్పడంతో మా మిత్రులు ఇద్దరూ కొంచెం ఊరటపడినారు.
గాలి గోపురం దాటినంక నడక బాగా స్పీడుగా సాగింది. మూడు చోట్ల బస్సు రోడ్డు వెంబడి నడిచినాం మూడోసారి రోడ్లో నడిచేటప్పుడు ఆ లోయను చూసి నేను ఆశ్చర్యపోయినాను. ఆ లోయను అవ్వాచారి లోయ అని అంటారంట! భయంకరమైన లోయ! దట్టమైన ఫారెస్ట్! రోడ్డు అంచుల్లో నాలుగడుగుల ఎత్తు గోడ కట్టినారు. రోడ్డు ఒంపులో బస్సు వచ్చింది. ఒంపులో బస్సు తిరుగుతా ఉంటే బస్సులో ఉండే భక్తులందరూ గోవిందా, ఆపదమొక్కుల వాడా, వెంకటరమణా, గోవిందా అని గట్టిగా అరవసాగినారు. ఎవురో ఇద్దరు, బస్సు తిరిగినప్పుడు కడుపులో చేయి పెట్టి తిప్పినట్ల అయిందేమో వాంతి చేసుకోసాగినారు. మేము స్పీడుగా నడుస్తా చివరి కొండ దగ్గరికి చేరుకుండాం. ఆ కొండ పేరు మోకాళ్ళ మెట్టు అంట! అక్కడి నుంచి ఎడమవైపు చూపుతా, ఆ కింద కనిపించేది శ్రీనివాస మంగాపురమని, మంగాపురం నుంచి కొండ కింది వరకు వచ్చి శ్రీవారి మెట్టు మార్గం గుండా కొండెక్కి వస్తే రెండు కిలోమీటర్ల దూరమేనని, అలిపిరి గుండా మనం వచ్చిన మార్గం పదకొండు కిలోమీటర్లు ఉంటాదని ఒక భక్తుడు చెప్పుతా ఉంటే వింటా అటువైపు చూస్తా, మోకాళ్ళ పర్వతం దగ్గరికి చేరుకుండాం. ఆ కొండ పూర్తీ నిలువుగా ఎత్తుగా ఉంది. అందరమూ కొంచెం ఆయాసపడతా ఎక్కి కొంత దూరం పోయినాం. కింద కొండదడి పక్కన, మైదానంలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడి కనిపించింది. బంగారు గుడిగోపురం ఉదయ భాస్కరుని కిరణాలతో తళ తళ తళ మెరిసి పోతావుంది. ఉత్సాహంతో నడుస్తా అందరమూ ముందుకు పోయినాం. భాస్కర్ అప్పుడే వచ్చి మా కోసరం రోడ్లో ఎదురు చూస్తూ ఉండాడు. అందరమూ కలుసుకుండాం. ఎడమ పక్కన తలనీలాల మండపంలో భక్తులు కొంతమంది గుండు తీయించుకుంటా వుండారు. మాలో రామలింగప్ప గుండు తీయించుకుండేకి ఉబలాటపడినాడు. మేమందరమూ నిరుత్సాహపరిచినాం.
దర్శనానికి టైమయితాదని గబగబా కోనేరు దగ్గరకి బజారు గుండా పోయినాం. కోనేరులో నీళ్లు ఫుల్లుగా ఉండాయి. అయితే నీళ్లు పచ్చగా గుడ్డు పట్టి ఉండాయి. కొంతమంది ఆ నీళ్లలోనే మునుగుతా ఉండారు. మేము కాళ్లు కడుక్కొని అరచేతుల్లో నీళ్లు తీసుకొని తలకాయల మీద చల్లుకొని దర్శనానికి పోయినాం. జనం పల్చగా ఉండారు. అంత రద్దీగా లేదు. మొదటి గోపుర ద్వారం దాటి లోపలికి పోయినాం. అక్కడ భక్తులు నిల్చుకున్న క్యూలోకి చేరుకుండాం. క్యూ మెల్లగా కదులుతా రెండవ ద్వారం దాటింది. అక్కడి నుంచి ఎడమవైపు గోడ వారగా క్యూలో భక్తులు పోవడానికి ఇనుప పైపులు బిగించినారు. ఆ గోడవారగా కొంత దూరం పోయిన తర్వాత ఆ క్యూ దారిని కుడివైపునకు తిప్పి గుడి మొదటి గడప దగ్గరికి కలిపినారు. ముఖ్యమైన వ్యక్తులు క్యూలో రాకుండా మొదటి గడప దగ్గర క్యూలో వెళ్లే వాళ్లలో కలుసుకుంటా ఉండారు. బ్రహ్మోత్సవాల సమయంలో ధర్మ దర్శనం చేసుకుండే వాళ్ళకు మొదటి గోపురం బయట నుంచీ గుడి ప్రాకారం వెనక వైపు నుంచీ ప్రారంభమయితాదంట! అది తెలిసి, ఓయమ్మా అనుకుంటా మిత్రులతో కలిసి క్యూలో ముందుకు పోతావుండాను.
మొత్తం కమ్మని నెయ్యి వాసన! కింద బండలన్నీ నేతి బట్టతో తుడిచినట్లు జిడ్డు జిడ్డుగా ఉండాయి! అంతా ఆశ్చర్యంగా చూస్తా మెల్లగా ముందుకు పోతా, మొదటి గడప దగ్గరికి చేరకుండాం. ఎవురో పెద్ద పెద్ద షావుకార్లు ఆఫీసర్లు నేరుగా వచ్చి అక్కడ క్యూలో కలుసుకుంటా ఉండారు. ఆ మనుషులు ఎక్కడెక్కడ నుంచి వచ్చినారో ఎంత అందంగా ఉండారో గమనిస్తా, మొదటి గడప దాటినంక కంచుగొలుసుల కింద వేలాడుతున్న పెద్ద పెద్ద కంచార్తులలో నెయ్యి ఒత్తుల దీపాలు వెలుగుతావుండాయి. క్యూలో కదులుతా మెడిమల మీద నిలబడి నిక్కినిక్కి చూసినాను. దూరంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తా ఉండాడు. తలమీద పెట్టిన కిరీటంలో వజ్రాలు, బంగారు శంఖచక్రాలలో పొదిగిన వజ్రాలు దీపాల వెలుతురులో మెరుస్తా ఉండాయి. స్వామి విగ్రహాన్ని నిక్కి నిక్కి వొంగి వొంగి చూస్తా ఉండాను. చూస్తా ఉంటే నా వెంట్రుకలు నిక్కబొడుచుకుండాయి. శరీరంలో ఏదో గగుర్పాటు పుట్ట సాగింది. స్వామి దర్శనం చేసుకొని వెనుదిరిగొచ్చే వాళ్లు మాటిమాటికి వెనుదిరిగి చూస్తా వెనక్కి కదులుతా ఉండారు. ఒక పదిమంది వెనక నుంచే నేను స్వామి వైపు చూస్తా ముందుకు పోయి చేతులెత్తి మొక్కు కుండాను. మా కుటుంబం కష్టాలు తీర్చు స్వామీ అని మనసులో కోరుకుండే లోపల పదా పదా పదా అంటా పూజారి తొందరగా పెట్టినాడు పది సెకండ్ల సేపు కూడా నిలుచుండేకి వీలు కాలేదు. వెనుదిరిగి మాటిమాటికీ చూస్తా గాలీ వెళుతురు లేని గుడిలో సెగకు చెమట కారుతా ఉన్నా బయటికి రాలేక రాలేక వచ్చినాను. భక్తులందరికీ గుడిలో నుంచి బయటికి వచ్చే కడ్డీల గేటు దగ్గర ఒక పూజారి ప్రసాదం పెడతా ఉంటే పెట్టించుకుండాం. ఏవో ఆకులతో చేసిన గిన్నెలో ప్రసాదం పైన నెయ్యి తేలుతా ఉంది. అది స్వీట్ పొంగలంట! దాంట్లో శనక్కాయ బేసనాల మాదిరుండేవి గోడంబి దబ్బలంట! తింటా ఉంటే వెంకటేశ్వర స్వామి కండ్ల ముందర కనిపించినాడు. ఈ గుడిలో బాపన స్వాములందరూ ప్రతి రోజూ ఇట్లాంటి ప్రసాదం కాబట్టినంత తింటారేమో! దినానికొగ రకమైన ప్రసాదం!ఎంత అదృష్టవంతులు వీళ్లు! పూర్వజన్మ సుకృతం అంటే ఇదేనేమో! తిరుమలలో ఉండే వాళ్లు ప్రతి రోజూ దేవుని దర్శనానికి వచ్చి ఇట్ల ప్రసాదం పెట్టించుకొని తింటారేమో! ముక్తికి ముక్తి, భుక్తికి భుక్తి! ఎంత అదృష్టం అని మనసులో అనుకుంటా చెప్పడానికి వీలుగా నంత మధురమైన స్వీట్ పొంగలి ప్రసాదాన్ని తిన్నాను.
ప్రసాదం తినినంక భాస్కర్ నాయుడు మైలారప్ప హుండీలో కానుకలు వేసి వచ్చినారు. అందరమూ లడ్డు అమ్మే కౌంటర్ దగ్గర లడ్డు ముద్దలు కొనుక్కుండాం. ఒక్కొక్క లడ్డు రేటు పావలా. పల్లెలో అమ్మయ్యా పిల్లలూ అడిగిన విషయం గుర్తుకు తెచ్చుకొని, నేను ఒక రూపాయి ఇచ్చి నాలుగు ప్రసాదం లడ్డు ముద్దల్ని తీసుకుండాను. భాస్కర్ ఒకేసారి పది లడ్లు నాలుగు వడలు తీసుకున్నాడు. తిరుపతి లడ్డు మాదిరి ప్రపంచంలో ఇంకెక్కడా లడ్డు చేయలేరని, దీని రుచే ప్రత్యేకమైనదని, అంతా ఆవు నెయ్యితోనే చేస్తారని, ప్రతి దినమూ చేసిన లడ్డు మీద దేవుని తీర్థం చిమురిస్తారని, అందుకే ఇది రుచికి మధురమైనదీ పవిత్రమైనదీ అని భాస్కర్ చెపుతా అందరికీ తినడానికి మళ్లా రెండు లడ్లు ఒక వడ తీసుకుండాడు. అందరమూ ధ్వజస్తంభానికి మొక్కొని, బయటి బజారు మెట్ల మీద కూర్చొని భాస్కర్ ఇచ్చిన ప్రసాదం లడ్డూ వడా తిని నేను పరవశించి పోయినాను.
అందరమూ దేవాలయం బయట ప్రాకారమంతా చూడల్లని మొత్తం చుట్టేయసాగినాం. వెనకవైపు అంతా అడవి! ఇండ్లే లేవు. కొంచెం గలీజుగా కనిపించింది. దూరంగా ఏవేవో పూల తోటలు అరటి తోటలు కనిపించినాయి. ఇంత ఎత్తైన కొండమీద ఇంత విశాలమైన బయలు ప్రదేశం ఎట్లుందో, అంతా ఆ దేవుని మహిమ అనుకుంటా ప్రాకారాన్ని చుట్టేసినాం. ఆ ప్రాకారాన్ని చూస్తా నేను అబ్బురపోయినాను. దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ప్రాకారం బాడిశతో చెక్కినట్లు మలిచిన పెద్ద పెద్ద సోగరాళ్లు అంత పైకెత్తి ఎట్ల కట్టినారో నాకైతే ఏమీ అర్థం కాలేదు. గోవిందరాజస్వామి గుడి గుడకా అంతే!ఆ కాలం మనుషులు ఎన్నేండ్లు ఎంతగా శ్రమపడినారో, ఇంత పెద్ద పెద్ద దేవాలయాలు కట్టడానికి?ఎంత బలమైన మనుషులో వాళ్లు?
అంతా ఆశ్చర్యంగా భావిస్తా బజారు వీధిలోకి చేరుకుండాం. నేను స్టైఫండ్ తీసుకున్న తర్వాత ఇస్తానని భాస్కర్‌తో రెండు రూపాయలు బదులుగా ఇప్పించుకొని,ఒక అణాకు కాశీ దారాలు,పావలాకు ఒక కంచు మరచెంబు, ఒక అణాకు నాలుగు రిబ్బన్లు ఒక అణాకు కుంకుమపొడి గంధం పొడి కొనుక్కుండాను. బజారులో వస్తువులు ఒక హోటల్లో తల ఆరణాలకు మంచి ప్లేటు భోజనం తిని దేవస్థానం బస్సెక్కినాం. ఆ బస్సులో తిరుగు తిరుమలకు పోయిరావల్ల అని తిరుపతికి వచ్చినప్పటి నుంచి అనుకుంటా ఇప్పటికీ వీలైందని సంతోషపడతా, బస్సులో కూర్చుండాను. ఒక్కొక్కరికి అర్ధరూపాయి బస్సు చార్జీ. బస్సు కండక్టర్ లేడు. కిందనే ఆఫీసులో టికెట్లు తీసుకొని భక్తులు బస్సు లెక్కుతా ఉండారు. సీట్లన్నీ ఫుల్ అయితానే బస్సు కదిలింది. కింది నుంచి పైకి పైనుంచి కిందికి అర్థగంటకొక బస్సు ఉందంట!
నేను తిరుపతి కొండల లోయల్ని చూడల్లని అదే పనిగా కిటికీ దగ్గర కూర్చుండాను. బస్సు మోకాళ్లమెట్ట కిందికి దిగుతావుంది. ఫర్లాంగుకు ఒక వొంపు,వొంపు దగ్గర బస్సు తిరుగుతా ఉంటే, కిందికి చూస్తా ఉంటే నా గుండె కాయలు ఆవటించినాయి. బస్సు మోకాళ్ల మెట్టు దిగి కొంచెం ముందుకు పోయి ఎడమవైపు తిరిగింది.అవ్వాచారి లోయపైన నిట్ట నిలువుగా ఉండే కుండ దడిలో ముందుకు పోతా ఉండే బస్సులో నుంచి లోయలోకి చూసి భయపడి సాగినాను. డ్రైవర్ ఒక క్షణం ఏమారినా, బ్రేక్ ఫెయిల్ అయినా టర్నింగ్స్ లో ఎదురుగా వచ్చే బస్సు కొంచెం తాకినా పైసల్! బస్సు లోయలో అగాధం లోకి పడిపోతుంది! ఎంత సాహసమైన ప్రయాణం! పుణ్యం కథ దేవుడెరుగు! జరగరానిది ఏదైనా జరిగితే ఎంత ప్రమాదం! ఎందుకు ఈ దేవతలు ఇంత భయంకరమైన కొండల మీద ఉంటారు? ఓరి నాయనో, ఇంకెప్పుడూ రాకూడదు అనుకుంటా కిటికీ దగ్గర భాస్కర్ని కూర్చోమని చెప్పి నేను సీటు లోపల వైపుకు జరిగినాను. బస్సు అలిపిరి దగ్గరికి చేరుకున్నాక మనసులో అలజడి తగ్గింది. దేవుడా ప్రాణాలు కాపాడినావు అంతే చాలు అనుకుంటా మిత్రులతో రూము చేరుకుండాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
