[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
మా హెడ్మాష్టరూ – మేమూ
మా స్కూలు హెడ్మాష్టర్ వెంకటస్వామి సారని ముందు చెప్పినాను గదా! ఆయన మా వూరికి బాగా అచ్చొచ్చినాడు.
నేను వొగటోక్లాసులో చేరక ముందే మా హెడ్మాష్టర్ సారు మా వూరి స్కూల్లో పని చేస్తావుండాడు. ఆయనది సొంతూరు బుక్కరాయసముద్రం. బురుజు పక్కన అప్పస్వామి వాళ్లింట్లో బాడుగకు వుంటాడు. అది చిన్న ఇల్లు, హాల్లోనే వొగ పక్కన బచ్చలీ దాని పక్క నీళ్లు కాచుకోడానికి ఆలికాగుంది. వంట చేసుకోడానికి సపరేటుగా వొగ రూముంది. మా సారుకు ఆ ఇల్లు, కేవలం వంట చేసుకోడానికీ, స్నానం చెయ్యడానికే! రాత్రింబగళ్లూ ఆయన స్కూల్లోనే వుంటాడు. వారానికో రెండు వారాలకో వొగసారి వాళ్లూరికి పొయ్యొస్తాడు. ఆయన మా వూర్లో కాపురం పెట్టలేదు. ఒంటిరిగానే వుంటాడు. జతగాళ్ళం మేము ఏడెనిమిది మంది ఆయన దగ్గరే వుంటాం. మా సారు, వూరినుండి వొచ్చేటప్పుడు వంట సరుకులన్నీ వెంట తెచ్చుకుంటాడు. రెండు మూడు రకాల చిట్లంపొళ్లూ తిరగమోత పెట్టిన చింతకాయ తొక్కూ తెచ్చుకుంటాడు. ప్రతిదినమూ ఆయన పొద్దుబుట్టకముందే లేచి, వూరవతలుండే మంచికంటి రామరంగయ్యోళ్ల తోట దగ్గరికి పోతాడు. మా వూరికంతా అదొక్కటే తోట, కపిలబావి తోట. ఎండకాలంలో వూర్లో వుండే రెండు బావులూ ఎండిపోయినా, ఆ తోటబావి ఎండిపోదు. వూర్లో మంచినీళ్లకు ఇబ్బంది కలిగినప్పుడు వూరోళ్లు రామరంగయ్యను అడిగి ఇంటికి రెండు కడవల ప్రకారం నీళ్లు తెచ్చుకుంటారు. అది పెద్ద దిగుడుబావి. వూరందరూ దాన్ని ‘మంచికంటోళ్ల పెద్ద బాయి’ అని అంటారు. రామరంగయ్యోళ్లు తోటలోనే కాపురం. కోమటోళ్ళయినా సొంతంగా సేద్యం చేయిస్తారు. కపిల తోలేటప్పుడు ఆ నీళ్లను కడవల్లో తెచ్చుకోనీయరు. బావిలోకి దిగి, కడవలు ముంచుకొని రావల్సిందే? అది గుడకా ఇంటికి రెండు కడవలే! ఉదయం తొమ్మిది గంటల లోపలే! అయితే మాదిగోళ్లను బాయిలోకి దిగనీయరు. రామరంగయ్య భార్య లక్ష్మమ్మ అంతా గమనిస్తా కంట్రోలు చేస్తావుంటాది. అట్లాటి తోట దగ్గరికి పోయి మాహెడ్మాస్టర్ సార్, వేపపుల్లతో పండ్లు తిక్కుతా తోటంతా తిరిగి కపిల కాలువలో ముఖం కడుక్కొని వొస్తాడు. ఆయన అయ్యవారు కదా, అందుకే లక్ష్మమ్మ ఏమీ మాట్లాడదు. ఒగసారి సార్ వెంటపోయి అదంతా గమనిచ్చి, చదువుకొని నేనూ అయ్యవారుగా పోతే జనం గౌరవిస్తారని మనసులో అనుకుండాను. తోట దగ్గర్నుండి వొచ్చిన తర్వాత మా సారు పొయ్యిమింద అన్నానికి పెడతాడు. కట్టెల పొయ్యి ఇల్లంతా పొగచుట్టుకుంటాది. వొక్కొక్కసారి పొయ్యిలో కట్టెలు సరిగామండవు. వూపిరిగొట్టంతో వూదల్ల. అట్లనే అవస్థపడి అన్నం వండుకుంటాడు. పొద్దున్నే మా జతగాళ్లకు అందరికీ ఇంటికాడ పనులుంటాయని ఆ సారు ఎవర్నీ తన వంటపనికి రమ్మని చెప్పడు. ఇంటి పనంతా అయి పోయినప్పుడు నేనూ, ఈడిగోళ్ళ కొండన్నా, జానగొండ నారాయణా, ఇంకా వొగరిద్దరం హెడ్మాష్టర్ సారింటికి పోయి ఆయన చెప్పినవి చేస్తావుంటాం. అట్ల చెయ్యడంవల్లనే మేము వంటచేసేది నేర్చుకుండాం. అయితే ఆయన యానాడూ మాకు అన్నం గంజి వొంచేపని చెప్పలేదు. గంజి వొంచేటప్పుడు మా చేతుల మీదికో, కాళ్లమీదికో వేడివేడి గంజి పోసుకుంటామేమోనని ఆ పని మాతో చెయ్యనీయలేదు.మా హెడ్మాష్టర్ సార్ వొగ అయివారు మాదిరి కనిపిచ్చడు. ముతక పంచె గోసికట్టు మింద ముతక జుబ్బా తొడుక్కొని అచ్చం రైతు లెక్కన వుంటాడు. మట్టసంగా తలకాయ గుడకా దువ్వుకోడు, పాఠం గుడకా మొరటు, మొరటుగా నవ్వుతా బేల్తా చెప్పుతాడు. అయినా మా పిల్లోళ్లందరికీ ఆయన పాఠమంటే భలే ఇష్టం. మాటలంటే మరీ ఇష్టం. అందరమూ భయపడకుండా ఆయన పాఠాలు వింటాం. అందుకే ఆయన చెప్పిన పాఠాలూ, మాటలూ మాకు బాగా గ్నాపకముంటాయి.
చిన్నప్పటి నా జతగాడు జానగొండ నారాయణ
మనిషి రైతు మాదిరి వున్నెట్లే తినేతిండి గుడకా రైతుతిండి మాదిరే వుంటాది. రెండు మూడు కురాకులు కావల్లని కోరుకోడు. చిట్లంపొడో, చింతకాయతొక్కో, పప్పో యాదుంటే దానితో కడుపునిండా తింటాడు, కంటినిండా నిద్రబోతాడు. కూళ్లూ, కువాడమూ లేని మనిషి.
చదువుకుండే పిల్లోళ్లు ఎవురయినా స్కూలు మానేస్తే మా హెడ్మాష్టర్ సార్ చాలా బాధపడతాడు. నన్నూ, కొండన్ననూ వెంటబెట్టుకొని స్కూలు మానేసిన పిల్లోళ్ల ఇండ్ల దగ్గరకి పోయి ఇంట్లో పెద్దోళ్ళతో నగుసారంగా మాట్లాడి పిట్టకథలు చెప్పి, అందర్నీ నవ్వించి, చదువుకోవడంవల్ల కలిగే లాభాలేమిటో చెప్పి, ఆ పిల్లోళ్లు మల్లా బడికి వొచ్చేతట్ల చేస్తాడు. ఇంటికొచ్చిన మా సారుకు ఆ ఇంటోళ్లు శెనక్కాయలో, అలసందులో, పెసులో, చెయిసంచి నిండాపోసి ఇచ్చేకి వొస్తారు వాళ్లు. గిమ గిమా అంటే గుడకా ఆయన తీసుకోడు. ‘నేను మీ కంటే పెద్దరైతునని’ తన వ్యవసాయం గురించి చెప్పుతాడు. వాళ్లుతెచ్చిన చెయిసంచి పక్కచూసి నా ప్రాణం తండ్లాతుంది. మా హెడ్మాష్టర్ ఆ బ్యాగుతీసుకోనొన్చి మాకిస్తే బాగుండదా అని నేను ఆరాటపడతాను.
సరోజతో నాకు ముక్కు చెంపలంటే ఇష్టం!
నేను నాలుగో క్లాసుకొచ్చినాను. మా క్లాసులో మేము పదిమంది పిల్లోళ్లం. అందులో ఇద్దరు ఆడపిల్లోళ్లు, వొగరు ఎలకంటి పెద్దపాపయ్యశెట్టి బిడ్డ సరోజ, ఇంకొగరు రుద్రవరం సూరయ్యశెట్టి బిడ్డ కాంతమ్మ. మా క్లాసులో అందరిపైకీ మంచి మార్కులు వొచ్చేది సరోజకు. ఆ పాప తర్వాతనే నేనూ, శివపురం కృష్ణారెడ్డి! సరోజ లెక్కల్లో ఫస్టు, నేను తెలుగువాచకంలో ఫస్టు. శివపురం రంగారెడ్డి, మావూరి కొండన్నా మిగతా అందరూ మొద్దునాయళ్లే. ఎక్కువగా ముక్కు చెంపలు వేయిచ్చుకుండేది వాళ్లే! సరోజ తెల్లగుంటాది. ముక్కు మాత్రం అంత బాగుండదు. నవ్వితే చెంపల్లో గుంతలు పడతాయి. వేరేవాళ్లకు ముక్కు చెంపలు వేసినప్పుడు గెలుపు తనదే అని మూతి అదొక రకంగా పెట్టి నవ్వుతాది. ఆ నవ్వు నాకు భలే ఇష్టం! అట్లే చూడల్లనిపిస్తాది నాకు. కాంతమ్మ వాళ్ల నాయన సూరయ్య మాదిరే నల్లగుంటాది. నల్లగుండినా మొగం చాలా కళగా వుంటాది. ముక్కు సూది ముక్కు, కొస్సిగా వుంటాది. నాకు సరోజతో ముక్కు చెంపలు వేయిచ్చుకోవల్లని భలే ఇష్టం. అట్లే ఆ పాపకు ముక్కు చెంపలు వెయ్యల్లని గుడకా! అయితే మా హెడ్మాష్టర్ సార్ నాకు ఆ అవకాశమే కల్గిచ్చలేదు. ఈ రోజు రెండు ఛాన్సులూ నాకొచ్చినాయి. సరోజ పద్యం తప్పు చెప్పింది. నేను గడగడ కరెక్టుగా చెప్పినాను. సారు ముక్కు చెంపలు వెయ్యమన్న్యాడు. నేను సరోజ కొనముక్కు పట్టుకొని కొంచెం గట్టిగానే ముక్కు చెంపలు వేసినాను. పాపం చెంప సురుక్కుమనిందేమో కన్నీళ్లు కారుస్తా నాపక్క చూసింది. “లే గాడిదా, ముక్కు చెంపలు వెయ్యమంటే అంత గట్టిగా వేస్తావేమోయ్?” అని సారు నన్ను గట్టిగా అరిచినాడు. “గట్టిగా యెయ్యిలేదు సార్, రోంత మెల్లగానే యేసినాను” అని నేను సమాధానం చెప్పినాను. “మొగ పిల్లోళ్లకు యేసినట్ల ఆడపిల్లోళ్లకు ముక్కు చెంపలు అంత గట్టిగా వెయ్యకూడదు రా దొంగ బడవా! లేదులే సరోజా, నా బంగారు తల్లీ! వూరుకో. ఈసారి నీకు ఛాన్సొచ్చినప్పుడు ఈ కర్రోని చెంపలు పగలగొడుదువులే” అని నన్ను దండిస్తా, సరోజను సముదాయిచ్చినాడు మా సారు.
సరోజ తలొంచుకొని చాలా సేపు ఏడ్చింది. ఏడుస్తూ రెండు మూడు సార్లు నా పక్క కోపంగా చూసింది. నేను నిజంగా ముక్కు చెంపలు అంత గట్టిగా వేసినానా? మా అమ్మయ్య ఇంట్లో చాలా సార్లు నా చెంపలు వాయిచ్చింది. నేను అట్ల కొట్టినానా? యేమో, కోమటోళ్ళ పాప, పెద్ద షావుకారి బిడ్డ, ఇంట్లో యెప్పుడూ చెంపదెబ్బలు తినలేదేమో! సుకుమారంగా పెరిగిన ఆడపాప! నా చేతివేళ్లు గరుసుగా వుండాయి. చెంపదెబ్బలు గట్టిగా తగిలినాయేమో! ఆ పాపకు చెంపదెబ్బలు వెయ్యల్లని నేను ఎందుకు అనుకుండానో? థూ.. థూ, ఇంగెప్పుడూ ఆడపిల్లోళ్లను ఏడిపిచ్చగూడదు.
మనసులో అనుకుంటా హెడ్మాష్టర్ సార్ రాయమని చెప్పిన ఏడో ఎక్కం పదిసార్లు రాసి, సార్ దగ్గర పలక పెట్టినాను. సరోజ నాకంటే ముందే రాసి, సార్ దగ్గర పలక పెట్టింది. అందరూ రాసి, పలకలు సార్ దగ్గర పెట్టినారు. అంతలోనే వొంటేలుకు బెల్లు కొట్టినారు.
పిల్లోళ్ళందరూ కేకలు వేసుకుంటా బయటికి పోతావుండారు, నేను వరండాలో సరోజ దగ్గరికి పోయి, “సరోజా, నేను ముక్కు చెంపలు అంత గట్టిగా కొట్నానా?” మెల్లగా అడిగినాను. “నాతో నువ్వేం మాట్లాడొద్దురా దబ్బడి ముక్కోడా!” అని కోపంగా పక్కకు వెళ్లిపోయింది సరోజ, నాకు తెలుసు, సరోజకు నా మింద కోపమొచ్చింటుందని, నాతో మాట్లాడదని, మాట్లాడకపోతే మాన్లే, మళ్లీ అయినా తప్పకుండా మాట్లాడుతాదిలే! కానీ నన్ను దబ్బడి ముక్కోడని తిట్టింది. ఎవురూ నన్ను అట్ల తిట్టలేదు. నిజంగా నేను దబ్బిడి ముక్కోన్నేనా! దబ్బిడి ముక్కోన్నయితే నన్ను అందరూ కాకపోయినా, వరసయినోళ్ళయినా ఈ రకంగా నన్ను అడ్డపేరుతో పిల్చల్ల కదా! నా కంటే నాలుగేండ్లు పెద్దోడు ఆ కురవ రాముడు. అందరూ ఆ మామను, లే కొమ్మోడా, ఏమోరు కొమ్మోడా అని పిలుస్తారు గానీ ఎవురూ పేరుబెట్టి పిల్చరు. నేను గుడకా ‘కొమ్ము మామా’ అనే పిలుస్తాను. ఆ మామకు తలకాయి మింద పునక, కొమ్ముమాదిరి వుంటాది. అట్లే, అట్టేవాళ్ల గోవిందు మామను సొట్టలు సొట్టలుగా నడుస్తాడని అందరూ సొట్టోడని అంటారు. ఆ రకంగా నన్నెవురూ దబ్బిడి ముక్కోడా అని అన్లేదు గదా! మరి సరోజ యెంత మాటనింది! కోపమొస్తే అట్లనా తిట్టేది? సరోజ అట్లన్నెప్పుడు యెవురయినా వినింటే, అందరూ నన్ను ఆ పేరుతోనే పిలిస్తే యెట్ల? అనుకుంటా నేను ఇంటికి పరిగెత్తి పోయినాను, బయట జలాటి బండ మీద అమ్మయ్యా, పెద్దక్కా బట్టలు ఉతుకుతా వుండారు.
“అమా, నాది దబ్బడి ముక్కా మా?” అని దగ్గరికిపోయి అడిగినాను. “నీది దబ్బడి ముక్కని యెవురన్న్యారు నా బంగారు కొండా? మీ నాయిన ముక్కుపడే నీ ముక్కు గుడకా సన్నగా, బొగు సొగుసుగా వుంది. మనింట్లో యెవురికీ దబ్బిడి ముక్కు లేదు గదా” అంటా అమ్మయ్య నా ముక్కును మెచ్చుకుంది. “మల్ల ఆ పాప నన్ను దబ్బిడి ముక్కోడా అని అనిందే!”
“యా నాసవితి అట్ల కూసిండేది? సూపిత్తువు పద, దాని పండ్లు పగలగొడ్తాను” అంటా అమ్మయ్య పైకిలేచింది కోపంగా.
ఆ పాప పేరు చెప్పితే అమ్మయ్య బడికాటికొచ్చి ఆ పాపను జుట్టుపట్టుకొని కొట్టినా కొడతాది!. అమ్మయ్య శానా కచ్చిదని, యెవురికీ భయపడే రకం కాదని, బొగు శెరత్తయిన మనిషని వూరందరికీ తెలుసు. అమ్మయ్యా, రామేవాళ్ల రామక్కా నోరెత్తినారంటే ఇంగెవురూ ఆ అంచన పంచనుండరు. ఇప్పుడు సరోజ పేరు చెప్పితే అమ్మయ్య బడికాడికొచ్చి అన్నంత పనీ చేస్తాది. సరోజ కోమటోళ్ల షావుకారి బిడ్డ. ఎలకంటి పెదపాపయ్య అమ్మయ్యను ఇంటికి పిలిపిచ్చి దండిస్తాడు. అమ్మయ్య ముందూ యెనకా చూడకుండా మాట్లాడతాది. అది మనసులో పెట్టుకోని ఆయన ముందుముందుకు గుత్తకు చేసుకుండేకి వొగ మడికయ్య గుడకా ఇయ్యకపోతే యెట్ల? ఇదంతా నాయనకు తెలిస్తే యెట్ల?
‘ఓయమ్మా! ఇంత చిన్న సంగతి పెద్ద సంగతయితాదే! వూరకనే అదంతా యాల’ అని మనసులో అనుకొని, “ఐదో తరగతి పిల్లోడెవురో వూరకనే అట్లన్న్యాడు లేమా!” అని పరువెత్తుకుంటా బడిదగ్గరికి పోయినాను. అంతలోనే లోపలి బెల్లు కొట్టినారు. వొంటేలుకు పోయిన పిల్లోళ్లందరూ లోపలికొచ్చి కూర్చుండారు. లోపలి బెల్లు కొట్టినంక రోంతసేపు చూసి హెడ్మాష్టర్ సార్ లెక్కల క్లాసు మొదలు పెట్టినాడు. అంతకు ముందు ఏడో ఎక్కం పదిపదిసార్లు రాయిచ్చిన పలకల్ని వొక్కొక్కటి తీసుకొని చూసి తప్పులు రాసినోళ్లను పైకిలేపి దాన్ని నోటికి చెప్పమని అడుగుతా వుండాడు. అడిగినోడు తప్పు చెప్పితే పక్కనోన్ని లేపి అడుగుతా వుండాడు. వాడు కరెక్టుగా చెప్పితే వానితో తప్పు చెప్పినోనికి ముక్కు చెంపలు వేయిస్తావుండాడు.
నేను సరోజ పక్క చూస్తా, ఆ పాప నన్ను దబ్బిడి ముక్కోడా అని తిట్టిందని మనసులో అనుకుంటా బాధపడతా వుండాను. హెడ్మాష్టర్ సార్ నా పలకలో తప్పులుం డాయేమో, నన్ను పైకి లేపి ఏడోఎక్కం చెప్పమన్నాడు. నేను తప్పు చెప్పినానేమో, వెంటనే సరోజను లేపి అడిగినాడు. ఆ పాప గడగడమని కరెక్టుగా చెప్పింది. ఆ పాపతో నాకు ముక్కు చెంపలు వెయ్యమన్నాడు. ఆ పాప సిగ్గుపడతా నా ముక్కు పట్టుకోకుండా మెత్తగా చెంపల మీద పౌడర్ పూసినట్ల మెల్లగా చేతుల్ని తాకిచ్చింది. అది చూసి మా సార్ “అల్లెల్లెల్లే.. నారాయణ గానికి సరోజ పౌడరు పూస్తావుందేమర్రా” అని అంటానే పిల్లోళ్లందరూ కసిక్కుమని నగినారు.
“ఏమి సరోజా, ముక్కు చెంపలెయ్యమంటే నారాయణగానికి పౌడర్ పూస్తివి? ముక్కు చెంపలంటే చెంపలకు పౌడర్ పూసేదా? కాంతమ్మ నీకు ముక్కుచెంపలేసి చూపిస్తాది. వెయ్యమందునా?”, అని అడిగినాడు హెడ్మాష్టర్ సార్. “వొద్దు వొద్దు సార్” అని నా ముక్కు పట్టుకొని గట్టిగా రెండు చెంపదెబ్బలు వేసింది సరోజ. నాకేమీ చురుక్కుమనిపిచ్చలేదు. గట్టిగా వుండే నా దవడ చెంపల్ని కొట్టి సరోజ వేళ్ళు చురుక్కుమని అనిండాయేమో! సరోజ వేళ్ళూ అరచేతులూ ఎంత మెత్తగుండాయో! కోమటోళ్ళ, బాపనోళ్ళ చేతులన్నీ ఇట్లనే మెత్తగుంటాయేమో అనుకుంటా పలకమీద కూర్చుండాను. అవును చెప్పడం మరిచిపోయినాను, నాలుగోతరగతికి వస్తానే మేము పిల్లోళ్లందరమూ ఐదారడుగులు పొడుగుండే చెక్కపలకల మీదే కదా కూర్చుండేది!
నన్ను గట్టిగా ముక్కుచెంపలు కొట్టి పలకమీద కూర్చొని కసి దీర్చుకున్నదాని మాదిరి ముసిముసిగా నవ్వుతావుంది సరోజ. ఆ నవ్వును చూసి నేను కోపగించుకున్నోని మాదిరి ముఖం పెట్టినాను. నా ముఖాన్ని చూసి సరోజ ఇంకా ఎక్కువ నవ్వుతా తలకాయి కిందికి వొంచి పావడా అంచును నోటికి అడ్డం పెట్టుకుంది. అది చూసి పక్కనుండే కాంతమ్మ, సరోజ తొడగిచ్చి యేదో సైగ చేసింది. సరోజ నోటికి అడ్డం పెట్టుకున్న లంగా అంచును కిందికి అనుకుంది. ఆ పాప, ముఖంలో సన్నగా తారాడతావుండే నవ్వు నాకు ఎంతో సొగుసుగా కనిపిచ్చింది. చాలా దినాల నుండీ నా మనసులో మెదిలాడే కోరిక తీరింది.
మా ఇంటి మూలాలు మొగోళ్ళవి కాదు, ఆడోళ్ళవి!
మా బండమీదపల్లిలో, మొత్తం మా గ్రామ పంచాయితిలో మా నాయనను అందరూ సవుటి దాసప్ప గారి వెంకటస్వామి అని అంటారు. తమలపాకులు అమ్ముతాడు కాబట్టి ఆకుల వెంకటస్వామి అని గుడకా అంటారు. సవుటి దాసప్ప, మా నాయన తల్లిగార్లకు తాతంట! ఆ దాసప్పకు జయమ్మ, గంగమ్మ, నాగమ్మ మనవరాళ్లంట, వాళ్ళు ముగ్గురూ సవుటి దాసప్ప కొడుకు పిల్లలో, కూతురు పిల్లలో, మా నాయనకే తెలియదంట! ఆ ముగ్గురిలో జయమ్మ చాలా అందంగా వుండేదంట. ఆయమ్మను శింగనమల భోగమోళ్ల యింటికిచ్చి పెండ్లిజేసినారో, ల్యాక అమ్మేసినారో ఎవురికీ తెలియదంట! మొత్తానికి మా పెద్దజేజి జయమ్మ శింగనమల భోగమోళ్ల ఇంటికి చేరింది.మా సొంతం జేజిని (మా నాయన తల్లని) గంగమ్మను, గుత్తి దగ్గరుండే గుత్తి అనంతపురం ఉప్పర సంజప్పకిచ్చి పెండ్లిచేసినారు. చిన్న జేజి నాగమ్మను తాడిపత్రి దగ్గరుండే ‘చిన్నపడమల’లో వొగ ఉప్పరోళ్ల ఇంటికిచ్చినారు. మా నాయన వెంకటస్వామి గుత్తి అనంతపురంలోనే పుట్టి, పెరిగి పెద్దవాడయినాడు. మా నాయనకు ముగ్గురు తమ్ముళ్లు. చిన్నప్ప, వన్నూరప్ప, నారాయణప్ప. మా జేజయ్య సంజప్పకు, గుత్తి చెరువు మరవవంక గట్టున వొగ ఎకరా చవుడు భూమి వుంది. ఏటిగట్టున వుండడంతో, పొలం పక్కనే వొగవొగ గుంత తవ్వుకొని, యాతంతో నీళ్ళు తోడి పోసుకోవడానికి అనుకూలం చేసుకొని, ఏట్లో నీళ్ళున్నప్పుడు రాగిపంట పెట్టుకుండేవాళ్లు. పండిన ఆ రాగ్గింజలతో కుటుంబం గడవక అందరూ కూలి పనులకు పొయ్యేవాళ్లు.
గుత్తి అనంతపురం దగ్గర విపరీతమయిన తాటి తోపులు. చెరువు మరవ వంకలో గట్ల పొడవునా దట్టంగా ‘పుల్లజమ్ము’ పొదలు. గుత్తి పరిసరాల్లో చింతతోపులు. వొగరు సీజన్లో తాటి ముంజలు అమ్మి, వొగరు ఏట్లోని ‘పుల్లజమ్ము’ కోసుకొని వొచ్చి ‘సిరిచాపలు’ అల్లి, వొగరు కాపోళ్ల ఇండ్లల్లో జీతం పనిచేసి, అట్ల తలావొగ పనిచేసి బతికేవాళ్ళంట. నాయన మాత్రం ఎక్కువగా రంపపు కోతలకు పోయేవాడంట! యా పూటకు ఆ పూట తిండికి కష్టంగా వుండే కుటుంబం కావడంతో నాయనకు ఇరవైఐదు సమ్మత్సరాల వయసొచ్చినా పెళ్లి కాలేదంట! ఆ ఇంటికి ఆడపిల్లను ఇవ్వడానికి ఎవురూ ముందుకు రాలేదంట! ఇంగ వానికి పెళ్లి కాదేమోనని మా నాయన అమ్మమ్మవాళ్ళు తమ మనవణ్ణి తమ దగ్గరికే బందమీదపల్ల్లెకే పిలిపిచ్చుకొని తామే సాక్కుండారంట! దానితో మా నాయన మకాం మారిపోయింది. బందమీదపల్లె చేరుకున్నెంక నాయన పూర్తిగా పెళ్లి మింద దృష్టిపెట్టుకొని బరువైన రంపపు కోతల పనికిపోతా వెయ్యి రుపాయలు కూడబెట్టుకుండాడంట! వాళ్ల తాత సవుటి దాసప్పకు మా శింగనమల చెరువు మాగాణి కింద చాకిరేవు గుట్టదగ్గర ‘గుట్టకింద కయ్యలు’ పేరుతో వొగటిన్నర ఎకరా మాగాణి వుండేదంట! ఆ గుట్టకింద కయ్యలమడిని ఇప్పటికీ సవుటి దాసప్పోళ్ల మడికయ్యలే అని అంటారు. ఆ మడికయ్యల్ని నేను గుడకా చూసినాను. పురు సవుటినేల! దాంట్లో తోకొడ్లు, చెన్నంగి తప్పా ఇంగ యారకమయిన వొడ్లూ పండవు. పనికిమాలిన భూమి! అట్లా చవుటి కయ్యల్ని గుడకా నిలుపుకోల్యాక ఎప్పుడో అమ్ముకుండారు.
బండమీదపల్లెకు చేరుకున్నెంక మా నాయన ఆలోచనంతా తన పెళ్లి గురించేనంట! సవుటి దాసప్పగారి వెంకటస్వామిగా మా నాయన చాలా హుషారుగా పెండ్లి సంబంధాల కోసరం ఆరాటపడేవాడంట! ఆ కాలంలో పెండ్లికూతురు తల్లిదండ్రులకు ‘ఓలి’ ఇస్తేగానీ మొగోళ్లకు పెండ్లి అయ్యేది కాదంట! అట్లా టైంలో మా నాయన దగ్గర వెయ్యి రుపాయలు వుండాయంట!
బండమీదపల్లెకు వొచ్చిన తర్వాత మా నాయనకు వాళ్ళ అమ్మమ్మల కారణంగానో యేమో, వూర్లో వుండే అన్ని కులాల పెద్దోళ్లూ స్నేహితులైనారు. వాళ్ళల్లో పెదగొర్ల నారపరెడ్డోళ్ళ నరసమ్మకు మా నాయనంటే చాలా మర్లు. ఆయమ్మ మా నాయనకంటే చాలా పెద్దది. వాళ్లింట్లో ఆ యమ్మదే పెత్తనమంతా. ఆస్తిపాస్తులు బాగుండే రెడ్డెమ్మ. మొగుడు ఎప్పుడు చనిపోయినాడో యేమో, యెప్పుడూ మంచికంటి రంగస్వామి ఆ యమ్మ యింటి దగ్గరే వుంటాడు. వాళ్లిద్దరికీ యెప్పుడు జత కుదిరిందో యేమోగానీ అది వూరందరికీ తెలిసిండే సంగతే! అందుకే గావల్ల ఆయనింట్లో గానీ, ఆ యమ్మ ఇంట్లో కానీ యెవురూ వాళ్లిద్దరినీ తప్పుపట్టలేదు. అయితే పెదగొర్ల నరసమ్మ మాత్రం రంగస్వామి వాళ్లింటికిపోయి కూర్చోవడం నేనెప్పుడూ చూడలేదు. అట్లా పెదగొర్ల నరసమ్మ వొగనాడు నాయనను ఇంటికి పిలిపిచ్చుకొని, “అది గాదు రా యెంగడసామీ, పెండ్లి జేసుకుండేకి బొగుతొందర పడతాండావంటనే, యేమి జోబీలో వుండే దుడ్లు యెక్కిరిత్తాండాయా నీకు పెండ్లి గాలేదని? తిక్కనాయలా, రోంతన్నా గ్నానముందేమి రా నీకు? బతుక్కోడానికి ఆయికట్టు కింద సెంటుభూమి లేదే! యెట్ల బతకల్లనుకుండావు రా? బుద్దిలేనోడా, నోర్మూసుకొని పోయి, ఆ రొడ్డిపల్లి కరాసింగు (క్రాసింగ్) కాడ అనంతపురమూ తాడిపత్రి రోడ్డు పక్కనే యాభై రూపాయిలకు వొగ యెకరా లెక్కన దొరుకుతాది, నీ జోబీలో వుండే లెక్కకు ఇరవైయెకరాలు, మంచి కండగలిగిన పొలమొత్తాది. ముందు ముందుకు పెద్ద ఆత్తి (ఆస్తి) అయితాది. ఆత్తి పాత్తులుంటే కోరిన పిల్ల దొరుకుతాది, నా మాటిని బయల్దేరు. రెడ్డిపల్లి కాపోల్లదే కావల్సినంత పొలముంది, నేనొచ్చి ఇప్పిత్తాను’ అని మంచిమాటల్తో ‘అరువు’ చెప్పిందంట! దానికి మా నాయన “అయ్యో! పోక్కా, వూపుగెడ్డి మొలిసే ఆ న్యాల నాక్యాల” అని ముఖం పక్కకు తిప్పుకొని యింటికి పోయినాడంట!
మా నాయన పెదగొర్ల నరసమ్మ మాటలు విని రెడ్డిపల్లి క్రాసింగు దగ్గర అనంతపురము- తాడిపత్రి రోడ్డు పక్కనే ఇరవై ఎకరాలపొలం కొనుక్కొని వుంటే ఈరోజు ఎంత ఆస్తి అయ్యేదో! మెయిన్ రోడ్డు పక్కన అంత పొలం వుంటే తమ కుటుంబం ఇట్లుండేదా? ఎట్లుండేదో యేమో! నేను పుట్టేవాన్నో కాదో! నేను పుట్టకుంటే ఈ ఆలోచన్లన్నీ యాల? అన్నీ తిక్కతిక్క ఆలోచన్లు! జరిగిపోయిండేదాన్నీ, జరగనిదాన్నీ యాలనుకోవల్ల?
ఆ ప్రకారంగా మా నాయన, సవుటి దాసప్పగారి వెంకటస్వామి తన ముత్తాత బిడ్డకు బిడ్డకొడుకుగా బండమీదపల్లె మనిషైనాడు. ఇరవై ఎకరాల పొలాన్ని కొనే స్తోమత వుండి, ఆ పొలాన్ని వొగ గడ్డిపాస మాదిరిచూసి అది వొద్దనుకొని, చాలా లేటు వయసులో, గుత్తికి ఆమడదూరంలో వుండే ఎర్రతిమ్మరాజు చెరువుకు చెందిండే కేశమ్మను పెండ్లి చేసుకుండాడు. ఆ కేశమ్మే, మా అమ్మయ్య!
బండమీదపల్లె కోట్లో వొగగూడు మాదిరుండే మట్టిమిద్దె మా నాయన అవ్వోళ్లది. ఆ అవ్వ తీరిపోయినంక ఆయమ్మ ఆస్తిగా వుండే గూడుమిద్దెకు, మా నాయన వారసుడైనాడు. బండమీదపల్లెలో వుండే ఆ గూడుమిద్దే మా నాయనోళ్ల రాజభవనం! ఆ రాజభవనమే మా నాయనకు వొగ అంతఃపురం! దాన్నొదిలి, మా నాయన, తన తండ్రిగారి మూలాలుండే వూరికి, తల్లిదండ్రులూ, తమ్ముళ్లూ, దాయాదులూ, బంధువులందరూ వుండే సొంతూరికి, తాను పుట్టి పెరిగిన న్యాలతల్లి గుత్తిఅనంతపురానికి పోడానికి ఇష్టపడలేదు. యాలంటే, బండమీదపల్లె లోని తన సొంత గూడుమిద్దె కంటే ఇంగా అద్దుమానంగా గుత్తిఅనంతపురంలో వుండే తన తండ్రి సంజప్ప తడకల గుడిసెలోకి పోయి ఆడ తల్లీ, తండ్రీ, ముగ్గురు తమ్ముళ్ల బరువు బాద్దెతలన్నీ మోసేదానికి ఇష్టం ల్యాక పోలేదు. అట్ల, రక్తసంబంధం వుండే తన వాళ్లందర్నీ వొదిలేసి, మా నాయన, సవుటి దాసప్పవో, ఆయన బిడ్డవో, ఆ బిడ్డ బిడ్డవో మూలాలుండే బండమీదపల్లి లోని గూడుమిద్దెలో స్థిరపడి పెండ్లి చేసుకుండాడు. ఆయన పెద్ద కొడుకునే, శాంతి నారాయణ అను నేను! మా నాయనకూ మా అమ్మయ్యకూ పెండ్లియినంక నేను మూడేండ్లకు పుట్టినానంట! నాకు రెండేండ్ల వయసొచ్చేటప్పటికల్లా మా నాయన తల్లి, మా సొంతజేజి గంగమ్మ, ఏమి జరిగిందో యేమో, గుత్తిఅనంతపురం నుండి మా నాయన దగ్గరికే వొచ్చి చేరుకుందంట! ఇంగ, నా పేరుకు ముందు ‘సవుటి’ అని ల్యాకుండా ‘శాంతి’ అనే పేరు యెట్ల వొచ్చిందో తర్వాత తెలియజేస్త్తాను.
భోగమోళ్లకు అమ్ముడు బోయిన మా పెద్ద జేజి
మా నాయన సవుటి దాసప్పగారి వెంకటస్వామి అయినప్పుడు, మా మూలపురుషుడు సవుటి దాసప్పే కదా! ఆ సవుటి దాసప్ప యెట్లుండేవాడో యా రూపురేఖల్తో వుండేవాడో, యా వేషంతో వుండేవాడో, మా యిల్లూ, ఇంటి పక్కన పెద్దమ్మగుడీ కట్టిచ్చిండేవాడు అతడో కాదో, ఆ పెద్దమ్మ గుడికి పూజచేయడంవల్ల దాసప్ప అయినాడో కాదో, చవుటి మడికయ్యలుండడం వల్ల సవుటి దాసప్ప అయినాడో కాదో, మా నాయనకు ఏవీ తెలియవంట! తాను పుట్టకముందే తన పెద్దమ్మ జయమ్మను శింగనమల బోగమోళ్లకు అమ్మేసినారంట! తనకు యుక్తవయసు వొచ్చిన తర్వాత తన పెద్దమ్మను చూసినాడంట! తన తల్లిగార్ల ముగ్గురిలో పెద్దమ్మ జయమ్మా పిన్నమ్మ నాగమ్మా చాలా అందగత్తెలంట! వాళ్ళిద్దరిలోనా తన పెద్దమ్మ జయమ్మ సినిమా యాక్టరున్నెట్ల భలే అందమైన మనిషంట! అందుకే భోగమోళ్ళు ఆయమ్మను బేరమాడి, కొనుక్కోని పోయినారేమోనని నాకు అనిపిస్త్తాది.
అయితే, మా నాయన తన పెద్దమ్మ, పిన్నమ్మల అందచందాలను యెప్పుడూ మెచ్చుకుంటా వుండేవాడేగానీ, యానాడూ తన సొంతతల్లి గంగమ్మ జేజి, వయసులో యెట్లుండేదో ప్రస్తావించేవాడు కాదు. ముగ్గురు అక్కచెల్లెళ్లలో నడిమధ్య మనిషైన మా సొంత జేజి అందవికారంగా యెట్లుంటాది? సామాన్యంగా, వుండదని నేను అనుకుండాను. అందంగా వుండే మా సొంత జేజిని మా నాయన, మా అమ్మయ్యకు భయపడి ఆమె అందాన్ని మా పిల్లోళ్ల దగ్గరగానీ, ఇతరుల దగ్గరగానీ ప్రస్తావించేకి జంకేవాడేమో!మా జేజి అంటే, మా నాయనమ్మ గంగమ్మను నేను మూడు నాలుగేండ్లున్నప్పుడు చూసినట్లు నాకు మసకమసవొగ గుర్తుంది. ఆ చూసింది గుడకా మా ఇంట్లో కాదు, చావిట్లో! అక్కడ చూసినప్పడు ఆయమ్మ మాజేజి అని తెలియదు. ఎవరో పిచ్చిది అనుకుండాను. అప్పుడు ఆయమ్మ వొంటి మింద సరిగా బట్టలులేవు. ఉండినవి చినిగిపోయి, మన్నూ మశానమంతా పూసుకోని, గబ్బుగబ్బుగా వుండాయి. ఎన్నాళ్లయిందో స్నానం లేక, శరీరమంతా దుమ్ముబట్టి వుంది. చెమటతోనో, ఎవురయినా నీళ్లుపోసినప్పుడు దోసిలితో తాగడంవల్లనో, శరీరమూ మాసి చిరిగిపోయిన బట్టలూ మట్లుమట్లుగా చాలా గలీజుగా వుండాయి. ముక్కుల్లో చీమిడీ, నోట్లో జొల్లూ కారుతావుంది. లోపలకి పీక్కొనిపోయిన గుంతకండ్లల్లో పిసురు గట్టుకొని వుంది. ఆ పిసురు మింద ఈగలూ, చీటీగలూ వాల్తావుండాయి. ఆ ముక్కూ మొగం పోలికలు యాడో చూసినట్ల అనిపిచ్చసాగింది నాకు.
ఆ దిక్కులేని పిచ్చిదానికి జుట్టంతా ఎవురు కొరిగిచ్చినారో యేమో గానీ, తలకాయ మీద బెత్తెడెత్తు పెరిగిన వెంట్రుకలు తెల్లగా నల్లగా నిక్కబొడుచుకొని దుమ్మురేగి వుండాయి. వొగ తిక్కదాని మాదిరి వొదురుకుంటా, రోంతసేవు బజారంతా తిరుగుతా, రోంతసేవు చావిట్లో కూర్చుంటా, పిచ్చిపిచ్చిగా నవ్వుతా, ఏడుస్తావుంది. యెవురవ్వా నువ్వు అని అడగల్లని నేను రోంత దగ్గరికిపోయినాను. ఎవురో తూర్పుగేరి బోయోళ్లాయమ్మ నాపక్క చేయి చాపి, “అవ్వా నీ పెద్ద మనవడొచ్చివాడు సూడు” అని, నాతో “లే నారాయనిగా, యీ ముసిల్ది మీ సొంతం జేజిరా” అని చెప్పడం వింటానే నాకు భయమయ్యింది. వెంటనే ఇంటికి పరిగెత్తి పోయి అమ్మయ్యతో చెప్పినాను. చెప్పుతానే మా అమ్మయ్య నన్ను జాడిచ్చి కొట్టింది. ఇదంతా నాకు కొద్దికొద్దిగా గుర్తుకుంది. అమ్మయ్య నన్ను తిట్టి, కొట్టడం వల్లనేమో నేను మళ్లీ ఆ జేజిని చూల్లేదు. ఎక్కడికెళ్ళి పోయిందో గుడకా నాకు తెలియదు. అయితే మా నాయన కన్నతల్లి ఎందుకట్లయ్యిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో మా నాయనను అడగల్లని చాలాసార్లు అనుకొని, అడగలేక వొక్కన్నే వున్నెప్పుడు ఆ జేజిని గుర్తుచేసుకొని బాధపడసాగినాను. మా నాయనా అమ్మా వుండి మా జేజి అట్ల కావడం, దిక్కులేని పిచ్చిదానిగా చావిట్లో పడుండడం తలుచుకొని నాయంతకు నేను దిగులు పడతా, వూర్లో పెద్దోళ్లెవరూ మా నాయన్నూ, అమ్మయ్యనూ దండించలేకపోయినారా? అని వూర్లోవాళ్ళనూ అమ్మా నాయనల్నీ తిట్టుకుండాను. చాలా దినాలు, దిక్కులేని మా జేజిరూపం నా మనసులో మెదిలాడేది! నేను పెద్దయి నంక మా గంగమ్మ జేజి విషయమంతా మా నాయనను అడగల్లని అనుకుండాను.
ఎందుకో మా నాయన చెప్పలేదు కానీ, మా సొంతం జేజి, మా చిన్నజేజి నాగమ్మ మాదిరే నాకు కనిపిచ్చింది. కానీ కొంచెం నల్లగా వున్నెట్లు గ్నాపకం. అయితే ఆ జేజి పుట్టడమే అట్ల సావునలుపుతో పుట్టిందో, సరిగా కూడూ, నీళ్లూ ల్యాక చిక్కిపోయి, ఆ రకంగా తయారయ్యిందో నాకు తెలియదు. తెలిపేవాళ్లు గుడకా యెవురూ లేరు. నేను పెద్దయినంకయినా తెలుసుకోగలనో లేదో!
వొగరోజు అనుకోకుండా వాళ్లింటికి
మా నాయన ఎన్నోసార్లు చెప్పేవాడు, తన పెద్దమ్మ జయమ్మ గొప్ప అందగత్తె అని, ఆయమ్మ కొడుకు బోగం వెంకటస్వామి అని, శింగనమలలో అతడు పెద్ద పరపతి వుండే మనిషి అని! పెద్దషావుకారి అని! తనను సొంత తమ్మునిగా ప్రేమగా చూస్తాడని సందర్భం వొచ్చినప్పుడల్లా ఎంతో ఇష్టంగా చెప్పేవాడు మా నాయన. అంత ఇష్టంగా చెప్పుకుండే ఆ యింటికి వొగసారి పోయిరావల్లని నా మనసు ఆరాటపడేది.
మూడు నాలుగు నెలలకు వొగసారి శింగనమల కుమ్మరోళ్లు ఎద్దుల బండిలో కొత్త కుండలూ, కాగులూ, ముంతలూ, మూకట్లూ చాలా వైనంగా వేసుకొని వొచ్చి మా వూర్లో గింజలకు అమ్ముకొని పోతావుంటారు. ఎందుకో ఆరేడు నెలలయినా వాళ్లు రాకపోవడంతో శింగనమలకు పోయి కొత్తకుండలు తీసుకొనిరమ్మని అమ్మయ్య నాయనను పురమాయిచ్చింది. నాయన వెంట నేనూ బయలుదేరినాను. శింగనమలకు చేరుకోగానే మొదట నన్ను వాళ్ల అన్నయింటికి అంటే, మా పెద్దజేజి కొడుకుగా, మా పెదనాయనగా, నేను మనసులో అప్పుడప్పుడు అనుకుంటా వుండే వాళ్లింటికి పిల్చుకొనిపోయినాడు.
ఇంటిని చూస్తానే నేను ‘వోయమ్మా’ అని అబ్బురపోయినాను. ఇల్లు చాలా పెద్దది. గారమిద్దె. ఇంట ముందరుండే పెద్ద అరుగుల మింద పాలిష్‌పట్టిన బెలుంబండలు పరిచినారు. ఇంట్లో కిందా, పైనా అంతా బండపరుపే. నాయన చెప్పినట్ల పెద్దషావుకార్లే అనుకుండాను. నాయనను చూసి వొగ పెద్దాయమ్మ “రాప్పా, వీడేనా నీ పెద్దకొడుకు?” అని పలకరిచ్చింది. నాయన చెక్కకుర్చీ మీద కూర్చొని “అవునొదినా వీడే నాపెద్ద కొడుకు. నాలుగో తరగతి సదువుతా వుండాడు” అని బదులిచ్చినాడు. మా నాయన కుర్చీలో కూర్చోవడం చూస్తానే నాకు సంతోషమయింది. ఆ పెద్దమ్మ నాపేరడిగింది. నేను తలకాయెత్తి చెప్పినాను. చెప్పుతా యెదురుగా గోడమీదుండే ఫోటోల పక్క చూసినాను. వొగ పెద్దఫోటో కిందన కీ.శే. జయమ్మ అని రాసినారు. ఫోటోకు ముత్యాలసరం వేసినారు. ఆ ఫోటోలో వుండే జయమ్మ సినిమా యాక్టర్ మాదిరే చాలా అందంగా వుంది. ఆయమ్మ మా నాయనకు పెద్దమ్మ అని సంతోషపడినాను. ఇంగొగ ఫోటోకింద లక్ష్మిదేవి అని రాసినారు. ఆయమ్మ యెవురో నాకు అర్థం కాలేదు. దాండ్లకింద మా నాయన మాదిరిగానే వుండే ఫోటో దిగవభాగంలో బి. వెంకటస్వామి అని రాసినారు. ఆ యప్ప మా పెదనాయన అని నాకు అర్థమయింది. మా ఇంట్లో మా జేజిది గానీ, మా నాయనోళ్లవి గానీ వొక్కఫోటో గుడకా లేదు. ఈ మాదిరి పెద్దోళ్ళ ఫోటోలు మా ఇంట్లో గుడకా వుంటే యెంత బాగుండేదో కదా అని నా మనసులో అనుకుండాను.
అట్ల అనుకుంటా వుండంగనే, నా కంటే రోంత పెద్దోళ్లిద్దరు ఇంట్లోకొచ్చి మా నాయనను చూసి, “యేం చిన్నాయనా బాగుండావా? ఈ పిల్లోడేనా నీ పెద్దకొడుకు? శానా హుషారుగా వుండాడే!” అంటా నా తల మింద చెయ్యేసినాడు వొగన్న. నేను నవ్వుతా వాళ్ళవైపు చూసినాను. ఆ యమ్మ మా పెద్దమ్మ అనీ, వాళ్లిద్దరూ ఆ పెద్దమ్మ కొడుకులనీ అర్థం చేసుకుండాను. నాయనతో వాళ్లందరూ మాట్లాడతాంటే విని, ఇంత పెద్దింటి షావుకార్లు నాయన బంధువులని తెలుసుకొని సంబరపడసాగినాను. అంతలోనే నాయన మాదిరిగా వుండే వొగ పెద్దయ్య ఇంట్లోకొచ్చి నాయనను పలకరిచ్చి, అదొగ రకమైన కుర్చీలో కూర్చుండాడు. ఆ కుర్చీ యావోతీగల్తో వెదురుబొంగులకు అల్లి చేసినట్టుంది. అట్లాది నేనెప్పుడూ చూల్లేదు.
అందరూ రోంతసేపు మాట్లాడు కున్నెంక “మేము పొయ్యొస్తామన్నా” అని నాయన పైకి లేచినాడు. “భోంచేసి పోదుర్లేప్పా, కూచ్చోండి” అని ఆ పెద్దమ్మ అనింది. “అమ్మిడి పొద్దప్పుడు తినొచ్చినాం లేమ్మా? పయిటాల పొద్దుకల్లా యింటికి పోతాం గదా!” అని నాయన బదులు చెప్పినాడు. “రోంత కాఫీ అయినా చేసీ గూడదా” అని పెదనాయన పెద్దమ్మ పక్కచూసినాడు. పాలయిపోయినాయని, వుంటే చేసీలేనా? అని అనింది ఆ పెద్దమ్మ. “ఆ పిల్లోని సేతిలో తినేకి యేందన్నా రోంత పెట్టనన్నా పెట్టు” అని అంటా నాపక్కజూసి “సదువుకుంటాండావా? యెన్నో క్లాసు?” అని తలకాయి ఆడిస్తా అడిగినాడు. నేను నాలుగో క్లాసని గట్టిగానే చెప్పినాను.
“ఐదోక్లాసుదంకా సదివిచ్చి యాదో వొగ పన్లేకి ఇరికీ రా! జాబు సదివేదొస్తే సాల్లే” అని ఆయప్ప మా నాయనకు సలహా ఇచ్చినాడు. ఆ మాటలు వింటానే, నాకు బాధయింది. నేను సదువుకుంటే వీళ్ళకెందుకు నొప్పి? పేదోళ్లంటే పెద్దోళ్లందరికీ యిట్ల సన్నసూవు యాలనో అని అనుకుంటా ఫోటోలో అంత అందంగా వుండే పెద్దజేజిని యెవురు యెవురికి యెందుకమ్మినారో? కొంచెం పెద్దయినాక తెలుసుకోవల్లని అనుకుంటా నాయన వెనక యెల్లవారినాను. అంతలోనే ఆ పెద్దమ్మ తాలు, తాలు సన్నోడా అని కొట్టిడీలోకి పొయ్యొచ్చి నా చేతిలో వొగ బెల్లపుంట పెట్టింది. దాన్ని చూసి నేను వద్దనలేదు. కానీ తీసుకోడానికి బుద్ధిపుట్టలేదు.
ఆ ఇంటిని చూసి, వాళ్లందరూ మా నాయనతో మాట్లాడేదంతా విని, ‘ఈ పొద్దు పయిటాల బువ్వ ఈడే తినచ్చు. పరమాన్నమూ, పప్పు, చారూ చేసింటారు. బాగా కడుపునిండా తినొచ్చు’ అని మనసులో ఆశగా అనుకుండాను. అట్ల అనుకోవడం నాది తప్పేనేమో! పేదోళ్లకు ఆశలు దండిగావుంటాయి. అవన్నీ తీరతాయా?
బెల్లపుంటను తినకుండా నిక్కరజోబీలో పెట్టుకొని నాయనెంట కుమ్మరోళ్ల గేర్ల్లో చిన్న కాలువ దగ్గరుండే కుమ్మరవామి దగ్గరికి చేరుకుండాను. కుమ్మరాయప్ప నాయనను ప్రేమగా పలకరిచ్చినాడు. నన్ను గురించి అడిగి, “పిల్లోన్ని యెట్లన్నాగానీ బాగా సదివిచ్చుకో యెంగడ సామీ! ఇగో, ఈడు నా కొడుకు గుడకా నాలుగో కలాసే” అని తన కొడుకును చూపిచ్చినాడు. వాళ్లమాటల్లో ఆ పెద్దయ్య పేరు సుబ్బన్న, పిల్లోని పేరు నాగన్న అని తెలిసింది.. నాదగ్గరి కొచ్చి పిల్లోడు మాట్లాడినాడు. నా మాదిరే వుంటాడు. ఆ పిల్లోన్ని నేను గంజికేంద్రంలో చూసినాను. అదే గుర్తు చేసినాను. ఆ పిల్లోడూ గుర్తు చేసినాడు. ఇద్దరమూ జతగాళ్లమయినాం. వాళ్ళమ్మయ్య నాకూ, మా నాయనకూ వొగ చిన్న సిలవరితట్టలో రెండు కర్జికాయలిచ్చింది. నాయన తినకుండా ‘లోటా’తో నీళ్లు తాగి, కర్జికాయలు రెండూ నన్నే తినమన్న్యాడు. నేను కొంచెం బిడియపడతా కర్జికాయలు తిని, నీళ్లు తాగినాను. కడుపు సల్లబడింది.
నాయన రేటు మాట్లాడి వొగ కాగూ, రెండు అన్నం కుండలూ, రెండు మూకట్లూ, రెండు చిన్న కడవలూ తీసుకుండాడు, కుమ్మరి పెద్దయ్య కాగులో వరిగడ్డి దురికి మూకట్లూ, అన్నం కుండలూ పగలకుండా వొనారుగా కాగులో పెట్టిచ్చినాడు. నాయన కాగును భుజం మింద పెట్టుకొని కుడిచేతితో వొగ కడవను పట్టుకుండాడు. ఇంగొగ కడవను నేను తీసుకుండాను. “కడవ జాగర్త పాపోడా” అని సుబ్బన్న పెద్దయ్య చెప్పుతావుంటే మేము మా వూరికి బీటి మడికట్లల్లో నడుచుకుంటా యెల్లవారినాం.
శింగనమల నుండి మా వూరికి మడికట్ల దావ (దారి) సరిగాలేదు. గెనాల మింద కడవ పట్టుకొని నడిచేకి నాకు కష్టమనిపిచ్చింది. నేను కిందపడితే మట్టికడవ పగిలిపోతాది. పగిలిపోతే నాయన కంటే అమ్మయ్య గట్టిగా తిడతాది. అందుకే కడవను ఆ చేతితో రోంత సేపు, ఈ చేతితో రోంత సేపు పట్టుకొని జాగ్రత్తగా గెనాలమిందా, గెనాల కిందా నడుస్తా యేంటేంటివో ఆలోచిస్తా అడుగులు ముందుకేసినాను. నాయనా, నేనూ ఇద్దరమూ పయిటాల కల్లా ఇల్లు చేరుకుండాం. మట్టికుండలు యావీ పగల్లేదని అమ్మయ్య సంతోషపడింది.
శింగనమల విషయాలన్నీ చెప్పి, నిక్కర జోబీలో వుండే బెల్లపుంట తీసి అమ్మయ్య చేతికిచ్చినాను. “ఆ బోగం నా సవితి ఇత్తే మనం తినల్లనా? ఈ పనికిమాల్నోడు మీ నాయిన, సిగ్గుల్యాక నిన్ను వాల్లింటికాటికి పిల్సకపోయినాడా?” అంటా ఆ బెల్లపుంటను విసిరిపారేసింది. అది చూసి నేను అబ్బురపోయినాను.
అమ్మయ్యకు, మా సొంతం జేజి అంటే, శింగనమల పెద్ద జేజివాళ్ళ కుటుంబమంటే ఎందుకంత కోపమో నాకు అర్థం కాలేదు. అడిగితే అమ్మయ్య కొడుతుందని భయంతో అడగలేదు. కొంచెం పెద్దోన్నయినంక అంతా తెలుసుకోవల్లని అనుకుండాను. ఇదీ యిప్పటి వరకు నాకు తెలిపిన మా యిద్దరి జేజెమ్మల కథ ఇంక, మా యింటి పక్కనుండే మా చిన్న జేజి, కుంటి చిన్నాయనల కత చెప్పల్ల.
మా చిన్నజేజి నాగమ్మను తాడిపత్రి దగ్గరుండే ‘చిన్నపడమల’కు యిచ్చి పెండ్లి చేసినారంట. ఆ యమ్మ అత్తగారింట్లో ఇమడల్యాక అత్తపోరూ మొగునిపోరూ భరించల్యాక చెప్పాపెట్టకుండా ఆ వూరినుండి పారొచ్చేనాటికి ఐదు నెలల నిండుమనిషంట! పుట్టింటికి పారొచ్చిన మనిషి మళ్లీ అత్తగారింటి గడప తొక్కలేదంట. అపుడు మా నాయన ఐదారేండ్ల పిల్లోనిగా గుత్తిఅనంతపురంలోనే వుండాడంట, ఆ సమయంలోనే మా చిన్న జేజి నాగమ్మ పుట్టింట్లోనే కాన్పయ్యిందంట! కొడుకు పుట్టినాడంట! ఆయప్పే మా చిన్నాయన నారాయణప్ప. మా నాయన తాను పుట్టిపెరిగిన వూరునూ, కన్న తల్లిదండ్రులనూ వొదిలి బండమీదపల్లి సవుటి దాసప్పగారి ఇంటినీడకు వొచ్చేసరికి మా చిన్నాయన నారాయణప్ప మా వూరి స్కూల్లో నాలుగో తరగతి చదువుకొని, మానేసి, చాలా అల్లరచిల్లరగా తిరుగుతా పెరిగినాడంట! వయసొచ్చినాక దుడుకుగా తయారయినాడంట! అట్లున్నప్పుడే మాయమ్మ కేశమ్మతో మా నాయన పెండ్లయి మా యమ్మ పుట్నింటి నుండి అత్తగారింటికి వొచ్చింది. వొచ్చిన రెన్నాళ్లకే యింట్లో గొడవలూ, రగడలూ, రంపులంట!
ఇంట్లో మొగున్నొదిలేసి వొచ్చిండే చిన్నత్తంటే మా యమ్మకు సరిపోయేది కాదంట! దానికితోడు అల్లరచిల్లరగా తిరిగే మరిది కాని మరిది! అతని పలకవే మాయమ్మకు నచ్చేది కాదంట! మా నాగమ్మ బేజికీ, మా యమ్మకు పచ్చిగడ్డివేస్తే భగ్గుమనేదంట!
కూలికిపోతే కుండ కాలల్ల, ల్యాకుంటే కడుపు కాలల్ల. వుండేది వొగ మట్టిగూడు మిద్దె, వొగ కొట్టం! ఎవురిది ఎవురు దోసుకుంటారు! కలిసిమెలిసి వుంటే, తమ సంపదా, తమ రాజ్యమూ ఎక్కడ కలసిపోతాయో అని దిగులా వీళ్లకు? అమ్మకు ఆ చిన్న జేజిపైన ఎందుకంత అక్కసు! నాయన అమ్మయ్యను ఎందుకు అదుపు చేయలేకపోయినాడో నాకు అర్ధమయ్యేది కాదు.
నాకు మూడేండ్ల వయసంట మా చిన్నాయనకు పెండ్లిచేయల్లని అనుకొని వొగ మంచిరోజు చూచి అనంతపురం చెరువుకు పైదాలుండే ఉప్పరపల్లికి పెండ్లిపెత్తనానికి పోవల్లని అనుకుండారంట! అంతలోనే ఘోరం జరిగిపోయిందంట!
మా చిన్నాయన కుంటోడయ్యిండే కత!
ఒగ వారం రోజుల నుండి రాత్రిపూట వొగ చిరుత పులి, వూర్లోకి వొచ్చి ఇండ్ల బయటుండే పశువుల్ని చంపి, ఊరగొండలోకి ఈడ్చుకొని పోతావుందంట! అది గమనిచ్చి, వూరి పెద్దోళ్లలందరూ రకరకాలుగా మాట్లాడుకొని, కడాకు తుపాకీతో చిరుతపులుల్నీ, కత్తేగొరకల్నీ, కాల్చిచంపే కొండన్నను బుక్కరాయసముద్రం నుండి పిలిపిచ్చినారంట! ఆయప్ప మా వూరికొచ్చి చిరుతపులి కోసరం మాటువేసి కాచుకొనివుండాడంట!ఆ రోజు చిరుతపులి మా ఊరగొండ పైన కనిపిచ్చిందంట! వెంటనే కొండన్న తుపాకి పట్టుకొని పదిమందిని వెంటబెట్టుకొని కొండెక్కుతావుంటే, చిరుతపులి ఆయప్ప కంట బడిందంట! దూరంనుండే తుపాకీని గురిబెట్టి పేల్చినాడంట! గురి తప్పడంతో చిరుతపులి భయంతో నెట్లునెట్లు ఎగురుకుంటాపోయి, పైన ఎత్తైన పెద్దగుండ్ల కిందుండే గవిలోకి దూరుకుందంట! దాంతో దిక్కుతోచక కొండన్న కొంచెంసేపు ఆలోచనచేసి, నలభై యాభై వరిగడ్డికట్టలు తీసుకొని రమ్మన్నాడంట! ఎదిగిన పిల్లనాయాళ్లు ఉత్సాహంతో మోపులు మోపులు వరిగడ్డి తెచ్చి కొండన్న చెప్పినట్లు అదంతా గవిలోకి దురికినారంట! వరిగడ్డిని అంటిస్తే గవిలోపలుండే చిరుతపులి వేడికి, పొగకూ తట్టుకోలేక, దిక్కుతోచక బయటకొస్తుందని, అప్పుడు తుపాకితో కాల్చిచంపుతానని, జనమంతా జాగ్రత్తగా వుండల్లని హెచ్చరిచ్చినాడంట! ఏమి జరుగుతుందో చూడల్లని వయసొచ్చిన పిల్లనాయాళ్లందరూ గవికి దగ్గరగా వుండే గుండ్లెక్కి కేకలు వేస్తావుండారంట! మా చిన్నాయనా, మరొగ పదిమంది ‘గవి’ గుండ్ల పైకి ఎక్కి చిరుతపులిని తుపాకితో కాల్చడాన్ని చూడల్లని ఉత్సాహంతో కేకలు వేస్తావుండారంట! గుండ్ల కిందుండే గవి, గుండ్ల పైవరకూ సొరంగం మాదిరి వుండే సంగతి పైనుండే వాళ్లకు ఎవురికీ తెలీదంట!
గవిలో నుండి చిరుతపులి యారకంగా బయటకొస్తాందో చూడల్లని జనమంతా ఉత్సాహంతో కేకలేస్తావుండారంట! గవిలోకి దురికిన వరిగడ్డి మంటలు ధగధగమంటూ పైకి లేచినాయంట! పచ్చి కల్లకంపలు తెచ్చి రాగాలకట్టెలతో కొంతమంది మంటల్లోకి వేసి దురుకుతా వుంటే, పొగ, గవి సొరంగంగుండా గుండ్లపైకి పోయిందంట! చిరుతపులి గవిలోపల పొగకూ, వేడికి తట్టుకోలేక మంటల్లో బయటికి వురికి రావడానికి భయపడిందేమో, దిక్కుతోచక సొరంగం పైకి గట్టిగా గాండ్రిస్తా పోయిందంట! అది వూహించని పైనుండే మనషులు, వొక్కసారిగా గాండ్రిస్తా వొచ్చిన పులిని చూసి భయపడి, క్షణాల్లో కిందికి దిగడానికి వీల్లేక, దిక్కుతోచక ‘దేవుడా వెంకట్రమణా’ అంటా పైన్నుంచీ కిందికి కండ్లుమూసుకొని దుముకినారంట! కొండరాళ్ళమింద పడిన మిగతా వాళ్లందరికీ కాళ్లూ చేతులూ విరిగిపోయినాయంట! మా చిన్నాయన నారాయణప్పకు మాత్రం, కొస్సిగావుండే వొగ పెద్దరాతి సోగమింద పడడంతో నడుములు పూర్తిగా విరిగిపోయినాయంట! అందరూ మా చిన్నాయనను చచ్చిపోయినాడని అనుకుండారంట! ఊరంతా అబుగుబులై అందర్నీ అనంతపురం పాతూరు ఆస్పత్రిలో చేర్చినారంట. మిగతా వాళ్లందరూ పదిపదైదు దినాల్లోపల విరిగిన కాళ్లకూ, చేతులకూ కట్లు కట్టిచ్చుకొని వూరు చేరుకుండారంట! మా చిన్నాయన మాత్రం మూడు నెలలు ఆస్పత్రిలోనే వుండి ప్రాణాలతో బయటపడి, నడుములు విరిగిన కుంటివాడై ఇల్లు చేరుకుండాడంట, ఆసుపత్రిలో వున్న ఆ మూడు నెలలూ మా నాయన మా చిన్నాయనను చాలా బాగాచూసుకొని కాపాడినాడంట!
ఇదీ, మా చిన్నజేజి కొడుకు, మా చిన్నాయన నారాయణప్ప కుంటివాడైన కత. ఆ తర్వాత ఏమి జరిగిందో యేమో నేను మావూరి బడిలో చేరేటప్పటికి చిన్నజేజీ, కుంటి చిన్నాయనా కడగాల పోయి, మా గూడుమిద్దె పక్కనే మరొగ చిన్న గూడుమిద్దెలో కాపురముండారు. మా రెండిండ్లకూ పొత్తలగోడ వొగటే! ఆ యింటిముందర గుడకా చెదిరిపోయిన బోదగడ్డి, చినిగి చిల్లులుపడిన తడకల కొట్టముంది. ఆ కొట్టం ఇట్లా వుంది.
పడమర వైపున కొమురు గోడ. దాని మింద నుండి తూర్పు వైపున్న వరట్ట రంగయ్యశెట్టి ఇంటిగోడలోకి దూర్చిన ఇంజాప. దానికి సపోర్టుగా మధ్యలో కొమురు గోడంత ఎత్తుగా నిట్రాయి. ఇంజాపమీద నుండి ఉత్తరం గోడమీదికి ఏటవాలుగా వెదురు బొంగులు. దక్షిణం వైపునగోడ లేకుండా, మధ్యలో చిన్న నిట్రాయి మిందున్న ఇంజాప మిందికి ఏటవాలుగా వెదురు బొంగులు. ఈ కొట్టానికీ గూడుమిద్దెకూ మధ్యలో కొంచెం బయలు.కొట్టం మధ్యలో గాటిపాడూ, గాడూ వుండాయి. పశువులయితే లేవు. ఎప్పుడుండేవో ఎవురికీ తెలియదు. ఆ కొట్టం కిందుండే పడమటి అరుగు మీద కూర్చొని చదువు కోవడమంటే నాకు భలే ఇష్టం. కొట్టం దక్షిణం వైపున గోడ లేకుండా బయలుగా వుంటాది కాబట్టి ఎండ కాలంలో బాగా గాలి వస్తుంది. చల్లగా వుంటుంది. మా అమ్మయ్య మా చిన్నజేజితో ఎప్పుడూ కొట్లాడుతా వుంటాది. కొట్లాడినప్పుడు ఆ కొట్టంలోకి పోవడానికి ఇష్టమున్న్యా మనసు రాదు. అమ్మయ్య అరుస్తుందేమోనని నాకు భయం.
మా ఇంట్లో అయితే, పనులున్నెప్పుడు మా అమ్మయ్య కూలిపనికి పోతాది. మా నాయన తమలపాకుల గంపెత్తుకొని పోయి వూరూరూ తిరిగి ఆకులమ్మి నాలుగైదు దినాలకొగ సారి నాలుగు రకాల గింజలు తెస్తాడు. శెలవులప్పుడు నేనూ కూలిపనులకు పోతాను. పనుల కాలంలో ఎట్లోగట్ల మా ఇంటోల్లందరమూ కడుపుకింత తింటాం. కానీ మా చిన్న జేజి ముసిలాయమ్మ అయితా వుంది. మా చిన్నాయన కుంటోడు, ఇద్దరూ కూలి పనులకు పోలేరు. మేము తినేదే వాళ్ళకు రవ్వంత పెట్టల్లని నేనూ, చెల్లెలు పెద్దక్కా అనుకుంటాం. అయితే ఎప్పుడు పెట్టల్ల వాళ్ళకు? అమ్మిడి (అంబలి) పొద్దు బువ్వతినేటప్పుడు అమ్మయ్య ఇంట్లోనే వుంటాది. నేను ప్రతి దినమూ దేవరకొండకు పోయి పసులకు గడ్డికోసుకొని వొచ్చి గాట్లోవేసి ముఖం కడుక్కుంటాను. అంతలోనే పెద్దక్క దున్నపోతుల్ని కట్టేసే గాటిపాడు కింద, ప్యాడాగసువు నూకి దిబ్బలోవేసొచ్చి, పసులకూ, మాకూ ఏడెనిమిది కడవల నీళ్లు తూరుపు బావిలో చేదుకొని వొచ్చి తొట్టీ, పొంతా, ఇంట్లో మంచి నీళ్ళ కాగూ నింపుతాది.. అంతలోనే అమ్మయ్య, ముద్దగెలికి యాదోవొగ వూరుమిండి నూరి పళ్ల్యాల్లో వేస్తాది. అందరమూ కుచ్చోని తింటాం. పయిటాలకు కుండలో ముద్ద కొంచెం మిగిల్తే మిగులుతాది, ల్యాకుంటే లేదు. ముద్ద తింటానే నేను బడికి పోతాను. పెద్దక్క ఎంగిలి తట్టలూ, కుండలూ కడిగి దున్నపోతుల్ని మేపుకొని వచ్చేకి తోలుకొని పోతాది. అమ్మయ్య కూలిపనికి యెల్లవారిపోతాది. ఇంకెప్పుడు జేజికీ, చిన్నాయనకూ మేము తినేదాంట్లోనే కొంచెం పెట్టేది?
మా చిన్నాయన నారాయణ బొగు (భలే) పౌరుషమైన మనిషి. అదవోడయినా మాటపడే రకము కాదు. మా చిన్న జేజీ అంతే! వాళ్లిద్దరూ ఏమనుకుండారో యేమో, నాలుగైదేండ్ల కిందట్నుంచీ అనప గుగ్గిళ్లూ, అలసంద గుగ్గిళ్లూ, కర్జికాయలూ, పాకంపొప్పూ ఇంటి దగ్గరేచేసి, వూర్లో అమ్ముకోనొచ్చి బతుకుతా వుండారు. ఇంటిముందర, రంగయ్యోళ్ళ ఇంటి గోడకింద రెండు పొయ్యిలు ఏర్పాటు చేసుకొని, ఆ పదార్థాలన్నీ తయారుచేస్తాడు చిన్నాయన. అవన్నీ వొగ గంపలో గిన్నెల్లో పెట్టుకొని మా జేజి అమ్ముకోనొస్తాది.
నేను బడిలోచేరి చదువుకుంటావుండానని మా చిన్నాయనకు తెలసి వొగసారి బడినుంచి పయిటాల బువ్వకు ఇంటికొచ్చినప్పడు నన్ను పిలిచినాడు. అమ్మయ్య ఇంట్లోలేదని నేను భయపడకుండా పోయినాను, చిన్నాయన చాలా సంతోషపడి దగ్గరికి పిలిచి ప్రేమగా తల మింద చెయ్యేసి, బాగా చదువుకొని “మన వంశానికి మంచిపేరు త్యావల్ల బంగారు తండ్రీ! మీ నాయన చదివీకుంటే నేను చదివిస్తాలే! అన్నిట్లోనా నువ్వు ఫస్టు రావల్ల” అని అంటా వొగ పేపర్లో నాలుగు కర్జికాయలూ, పాకంపొప్పు పెట్టి ఇచ్చినాడు. అప్పడు నేనింగా మూడో తరగతిలోనే వుండాను. అప్పట్నుండీ మా కుంటి చిన్నాయనంటే నా మనసులో యేదో తెలియని మర్లు.
మా చిన్నాయన బీడీలు తాగుతాడు. నన్ను చాలాసార్లు పిలిచి వొగ అణా నా చేతిలో పెట్టి, మూడు బొట్లకు బీడీలు తెమ్మని, వొగ బొట్టు నన్ను తీసుకోమని చెప్పేవాడు. వరట్ట రంగయ్య మేకమార్కు బీడీలు మూడు బీడీలు తీసుకొని, మిగతా తొమ్మిది బీడీలుండే కట్టా, వొగ తూటుబొట్టూ నా చేతికిచ్చేవాడు. అది తీసుకొనివొచ్చి మా చిన్నాయనకు ఇచ్చేవాణ్ణి. నేను యిట్ల చిన్నచిన్న పనులు చేసినప్పడల్లా చిన్నాయన నా చేతిలో వొగ తూటుబొట్టో, వొగ కర్జికాయో, పాకంపొప్పుపలకో చేతికిచ్చేవాడు. అది గుడకా జేజి లేనప్పుడే!ఆ పొద్దు అమ్మయ్య పరకలగడ్డి చిక్కునంతా ఇడిపిచ్చల్లని ఇంట్లోనే వుంది. పెద్దక్క అమ్మకు సాయపడతా వుంది. నేను బడికిపోయి ఇంటికొస్తా, వాళ్ల కొట్టంలోకి తొంగి చూసినాను. కొట్టంలోగాని, పొయ్యిదగ్గరగానీ ఎవురూ లేరు. జేజి గంపెత్తుకొని వూర్లోకి పోయినట్లుంది. ఇంట్లో చిన్నాయన మూలుగుతా వుండాడు. నేను వాకిలి దగ్గరికిపోయి చూచినాను. ఈతచాప మింద చిన్నాయన బోర్లపండుకొని మూలుగుతా వుండాడు. నేను పలకరిచ్చినాను. “వీపూ, నడుములూ నస్తావుండాయి, రోంత తొక్కుదురా బంగారూ!” అని నన్ను పిల్చినాడు. “బుక్కులు ఇంట్లోపెట్టి అమ్మయ్యకు చెప్పొస్తానుండు చిన్నాయనా”, అని నేను పరుగెత్తి మా యింటికి పోయి అమ్మయ్యతో విషయం చెప్పినాను. వేరే మాట్లాడకుండా తోక్కిరాపో నాయనా అని అమ్మయ్య చెప్పడంతో నాకు సంతోషమయ్యింది. వెంటనే చిన్నాయనోళ్ళ యింట్లోకి పరుగెత్తిపోయి, చిన్నాయన వీపుల మిందికి మెల్లగా ఎక్కినాను. నేను తొసక్కుండా వుండడానికి గోడపక్క తిరిగి గోడ మింద అరచేతులు వూదబొడిసి వీపులమింద అడ్డంగా నిలబడి పాదాలను మెల్లిగా వొగదాని తర్వాత వొగటి జరుపుతూ మెడల దగ్గర్నుండీ పిర్రలవరకు, పిర్రల దగ్గర నుండి మల్లా మెడవరకు తొక్కసాగినాను.
చిన్నాయనకు ఎడమవైపున పూసపిర్రా, పూసతొడా చిన్నగుండాయి! ఇంతకుముందు చాలాసార్లు చిన్నాయన వీవుల మిందకెక్కి తొక్కినాను. మొదటిసారి తొక్కినప్పుడే “యేమి చిన్నాయనా, ఎడం పక్కన పిర్రా తొడా చిన్నగుండాయే?” అని అడినప్పుడు ఆ చిరుతపులి సంగతి, తాను పైనుండి కొందికి దుమికిండే సంగతిచెప్పి, అప్పుడు నడుము విరిగి అట్లయినాదప్పా అని అన్న్యాడు. అందుకే నేను జాగ్రత్తగా చిన్నాయన నడుముపై తొక్కల్లని తెలుసుకుండాను.
నేను వీపులమింద తొక్కుతా వుంటే చిన్నాయనకు సుగిచ్చినట్లుందేమో నువ్వు తొక్కుతావుంటే ఎంతబాగుందిరా అని మెచ్చుకోసాగినాడు. అంతలోనే జేజి వొచ్చింది. నేను చిన్నాయన వీపుల మింద తొక్కేది చూసి సంతోషపడతా గంపలో వుండే గిన్నెల్ని పక్కకుపెట్టి, గింజలన్నీ వొగ మూల పోసింది. చిన్నాయన వీపుల మింద తొక్కేదంతా అయిపోయినంక జేజి నాకు మిగిలిన గుగ్గిళ్ళన్నీ వొగ చిన్నగిన్నెలోవేసి యిచ్చింది. నేను సంతోషంగా తీసుకొనిపోయి గుగ్గిళ్ల గిన్నెను అమ్మయ్య చేతికిచ్చినాను. అమ్మయ్య మా నలుగురికీ తలాకిన్ని పెట్టి తానూ నాలుగు గుగ్గిళ్లను నోట్లువేసుకొని, కొంచెం ఉప్పు తక్కవుందని చిటికెడు ఉప్పు కలుపుకొని తినింది. అమ్మయ్య ఎప్పడూ అంతే! మాకు ఉప్పు సరిపోయినా పప్పులోనా, వూరుమిండిలోనా, తాను సపరేటుగా కొంచెం ఉప్పువేసుకొని తింటాది. వొగసారి తాను తినే పద్ధతిలో ఉప్పు ఎక్కువవేసి పప్పుచేసి అమ్మయ్య అందరికీ కంచు పళ్ల్యాల్లో అన్నం వడ్డిచ్చింది. నాయన పప్పు కలుపుకొని అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని ఉప్పు ఎక్కువైందని అన్నం పళ్ల్యాన్ని అమ్మయ్య మిందికి విసిరేసి, ‘పడుమడ్లకు పుట్టినదానా’ అని ఇంకా ఏంటివేంటివో గబ్బుగబ్బు మాటల్తో అమ్మను తిడతా కోపంగా విసురుగా పైకిలేచి బయట లోగిట్లోకి పోయి మంచమ్మీద కూర్చుండాడు.
నాయన అమ్మయ్యను తిట్టడమూ, బువ్వ తినకుండా పైకిలేచిపోవడమూ చూసి నాకు భలే బాధయింది. అమ్మయ్య కళ్లనిండా నీళ్ళు పెట్టుకుంది. నేనూ, పెద్దక్క ‘అవును మా, పప్పులో రోంత ఉప్పు యెక్కువయింది’ అని మెత్తగా అమ్మయ్యను వోదార్చినాం. అమ్మయ్య చాలా పౌరుషమైన మనిషి. తానూ బువ్వ తినకుండా బయటికిపోయి అరుగుమీద కూర్చొని వదరసాగింది.
‘రోంత పొరపాటు జరక్కుండా వుంటాదా? అంతమాత్తరాన పళ్ల్యాన్ని ఇసిరి పారేసి కూడంతా న్యాలపాలు జేసి అంతంత మాటలు అనల్లనా’ అని గొనగసాగింది. “యెందేందో గొనుగుతా నాకు పిత్తరం రేపద్దు. అంటా” నాయన పైకిలేచి బజారువైపు పోజూసినాడు.
“యాలపొద్దు బువ్వ తినకుండా యాటికి పోతావు? పొరపాటయింది లే. యాదన్నా రోంత వూరుమిండి నూరుతాను” అని లోపలకొచ్చింది. నాయన కోపం తగ్గిందేమో, వెనక్కి తిరిగి పసుల కొట్టంలోకి పోయినాడు. పక్కింట్లో జేజి కొట్టం దగ్గరికొచ్చి వినిందేమో, వెంటనే గుగ్గిళ్లచారు తెచ్చి, నాయనను పిల్చి “యాలపొద్దయింది, బువ్వతిందువు రాప్పా? పప్పులో యింత ఉప్పు ఎక్కువయితే కూటిమింద అలిగితే యెట్ల” అంటా అమ్మయ్య చేతికి గుగ్గిళ్ల చారుగిన్నె యిచ్చింది. నాయన మౌనంగా వొచ్చి బువ్వతిన్న్యాడు. అంతటితో ఆ రోజు ఉడుకు చల్లారింది. అప్పట్నుంచీ అమ్మయ్య యా కురాకు చేసినా, ఉప్పు మాకు సరిపోయ్యే రకంగా వేసి, తాను తినే కురాకులో రోంత ఉప్పు కలుపుకొని తింటాది. ఆ రకంగా నేను చిన్నాయన వీపులు తొక్కడమూ, జేజి సంతోషంగా గుగ్గిళ్ళు ఇవ్వడమూ, దానికి అంతే సంతోషంతో అమ్మయ్య గోగాకు పప్పు జేజివాళ్లకు పంపడమూ చూసి నా మనసు ఆనందంతో గంతులేసింది. జేజి, అమ్మయ్య ఎప్పుడూ ఈ మాదిరిగా వుంటే ఎంత బాగుంటాది అని అనుకుండాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
