[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
ఆరు నోట్లు – నిధి దొరికినట్లు పొంగిపోయినాను
కాలేజీలో స్టైఫండ్ ఇస్తా ఉండారని తెలిసి అందరము కాలేజీకి పోయినాం. ఆఫీస్ క్లర్కు సూర్యనారాయణ, ప్రశాంతంగా పేర్లు పిలుస్తా ఒక్కొక్కరికి ఆరు నూర్ల రూపాయలు ఇచ్చినాడు. ఐదో పదో పట్టుకొని ఇస్తాడేమో అనుకున్నాం. కానీ పాపం, ఒక రూపాయి కూడా పట్టుకోకుండా ఇచ్చినాడు సూర్యనారాయణ. నూరు రూపాయల నోట్లు ఆరు చేతికి తీసుకుంటా ఉంటే నా చేతులు వొణికినాయి. యానాడూ అన్ని దుడ్లు నేను ఒకేసారి చూడలేదు. ఏదో పెద్ద నిధి దొరికినంత సంతోషమైంది నాకు.
భాస్కర్ నాయుడు రెండు జతలు బట్టలు, జత చెప్పులు, ఒక సూట్‌కేసు కొనుకుండాడు. మమ్మల్ని ఏమైనా కొనుక్కోండి అని ప్రేరేపించినాడు. నారాయణస్వామీ నేనూ అందుకు అంగీకరించలేదు. అందరమూ రూముకొచ్చి రాత్రికి ఊరికి బయలుదేరల్లని అనుకుండాం. ఎండాకాలం సెలవులు దాదాపు రెండు నెలలని, రూము ఖాళీ చేద్దామని స్వామీ నేనూ అన్న్యాం. సెలవులయినంక మనకు ఇంత అనుకూలంగా ఉండే రూము మళ్లా దొరకల్ల కదా! రెండు నెలల బాడుగ వృథాగా ఇవ్వబడుతుందని, ఖాళీ చేసిపోతే మళ్లా వస్తానే కొత్త రూము దొరికేదంకా ఎక్కడుంటాం అని భాస్కర్ నాయుడు రూమ్ ఖాళీ చేసేకి ఇష్టపడలేదు. అయితే మేము అంగీకరించలేదు. చివరికి నెల పూర్తీ కాకముందే ఆ నెల బాడుగ ఇచ్చి, మేము రూము ఖాళీ చేస్తా ఉండాం అని రూము ఓనర్‌తో చెప్పినాం. సరే మీ ఇష్టం అన్నాడు వోనర్.
అందరమూ పుస్తకాలు, బట్టలు, సామాన్లన్నీ సర్దుకుండాం. నేను భాస్కర్ నాయునికీ స్వామికీ ఇవ్వవలసిన చేబదులు 8 రూపాయలు ఇచ్చేసి పై జోబిలో 12 రూపాయలు పెట్టుకొని మిగతా దుడ్లన్నీ చాలా జాగ్రత్తగా లోపల డ్రాయర్ జోబీలోకి దరుక్కొని జోబికి పిన్నుసూది వేసుకుండాను. కాలేజీలో స్కాలర్షిప్ డబ్బులు తీసుకునేటప్పుడు రామలింగా మైలారప్పా నారపరాజూ గంపన్నా రామిరెడ్డీ రాత్రి ధర్మవరం రైలుకు బయలుదేరే విషయం మాట్లాడినారు. అందరమూ తొందరగా రైల్వే స్టేషన్‌కు చేరుకుండాం. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఉన్నప్పుడయితే రైలు కన్సషన్ టికెట్ కోసం కాలేజీ వాళ్ళు రైల్వే వాళ్లకు ఒక లెటర్ ఇస్తారు. ఇప్పుడు అట్లా లెటర్ ఇస్తే 40%తో మూడు రూపాయల 15 పైసలకి ట్రైన్ టికెట్ వచ్చేదని బాధపడతా ఐదు రూపాయలా పావలా ఇచ్చి టికెట్ తీసుకుండాను.
9 గంటలకు రైలు బయలుదేరింది. పొద్దుబోయ వరకు కాలేజీ విషయాలు, విద్వాన్ కోర్సులోని పాఠ్యాంశాల విషయాలు, లెక్చరర్ల విషయాలు, తిరుపతిలో సంవత్సర కాలం గడిపిన సంగతులు ఎన్నో మాట్లాడుకుండాం. నాకైతే తిరుపతిలో గడిపిన సంవత్సరకాలం ఒక కల మాదిరి కనిపించసాగింది. ఎస్ఎస్ఎల్సీతో ఆగిపోయిన నా చదువు, నేను ఊహించని ఒక కొత్త మార్గంలో సాగుతా ఉంది. గురువర్యులు చిత్తరంజన్ దాస్ గారి చల్లని దయవల్ల ఈ మార్గం నాకు అబ్బింది. ఆయన ఆశీస్సులతో ఈ సాహిత్య మార్గంలో నా జీవితమూ మా కుటుంబ జీవితమూ బాగుపడతాయన్న నమ్మకం కలుగుతావుంది. ఈ కావ్యాలు, ఈ సాహిత్యం, ఈ వాతావరణం నాలో నిరుడు లేని ఆలోచనను, కొత్త అభిరుచులను కలిగిస్తా ఉండాయి. ఈ సాహిత్యానందం ఎంత రుచికరంగా ఉందో! ఏడుకొండలవాని ప్రసాదం ఎంత మధురంగా ఉందో! ఇదంతా ఆ స్వామి దయా ప్రసాదమేనేమో?
సీటు పలక మీద, కిటికీ పక్కన పెట్టుకున్న మూట పైన తలవాల్చి, కాళ్లు ఆర జాపు కొని ఆలోచిస్తా, ఎక్కడో చూస్తున్న కళ్ళల్లో ఎందుకో కన్నీళ్లుబికి చెక్కిళ్ల మీద జారుతా పెదవుల మీదికొచ్చినాయి. ఆ కన్నీళ్లను పెదవులతో నోట్లోకి వొత్తుకుంటా, కండ్లు మూసుకుండాను. చాలాసేపటికి నిద్ర పట్టింది.
అనంతపురంలో రైలు దిగి బస్సెక్కి పది గంటలకల్లా మా ఊరు చేరుకుండాను. అమ్మయ్యా పిల్లలందరూ నన్ను చూసి సంతోషపడినారు. అమ్మయ్య చేతికి తిరుపతి ప్రసాదం లడ్డు ఇచ్చినాను. ప్రసాదాన్ని, కుంకుమను దేవరమూల పెట్టి, అందరినీ కాళ్లు మొగాలూ కడుక్కోమని చెప్పి తానూ కడుక్కొని దేవరమూల దీపం వెలిగించి, ప్రసాదం పొట్లానికి మొక్కుకుంది. ఒక లడ్డు ముద్దను అందరికీ తలాకింత పెట్టింది. చిన్నాయనోళ్ళకు అర్థం లడ్డు ఇచ్చింది. అందరూ కండ్లకు అద్దుకొని ప్రసాదాన్ని సంబరపడతా తిన్నారు. కాశీ దారాలు ఒక్కొక్కరి చేతికి ఒకటి కట్టింది. రామే వాళ్ళ రామక్కత్తకు, చాకలి చౌడక్క పెద్దమ్మకు తిరుపతి ప్రసాదము కాశీ దారాలు పంపించింది అమ్మయ్య. రిబ్బన్లు చెంపపిన్నీలను ఇస్తానే మురిసిపోయినారు పెద్దక్క వెంకటలక్ష్మి. ఇచ్చిన రబ్బర్ పీపీలను చూసి గంతులేసినారు పెద్దన్న, జయమ్మ.
రోంతసేపు అయినంక, నిన్న కాలేజీలో ఆరు నూర్లు స్టయిఫండ్ ఇచ్చినారని చెప్పి, నాయన చేతికి మున్నూరు రూపాయలు ఇచ్చినాను. మిగతా మున్నూర్లు ఏమి చేసినావు అని నాయన గట్టిగా అడిగినాడు.
“హెడ్మాస్టర్ సారుకు మొత్తం ఇన్నూర్రు పాయలు ఇయ్యల్ల, ఇదిగో రాసి పెట్టినాను చూడు. స్టైఫండ్ వచ్చినప్పుడు ఇస్తువు లేరా అని చేతికి కొంత, మనియార్డర్ ద్వారా కొంత పంపినాడు. అది ఆయనకు ఇవ్వకుంటే ఎట్ల నాయనా? నేను స్నేహితులకు ఇవ్వవలసిన చే బదుల్లు, వచ్చే రైలు ఛార్జి అంతా 20 రూపాయలు అయిపోయినాయి. ఇంక నా దగ్గరుండేది 80 రూపాయలే! నేను ఒక జత బట్టలన్నా తీసుకోవల్ల కదా! కొన్ని పుస్తకాలన్నా కొనుక్కోవల్ల కదా!” అని నేను గట్టిగానే జవాబు ఇచ్చినాను. నాయన చాలాసేపు గొణిగినాడు. వినినంత సేపూ విని, “యాల అట్ల గొనుగుతా వుండావు? ఆ సారు దయదల్సి ఆ దడ్లు పంపిచ్చకుంటే, వాడు తిరపతిలో అడక్కతింటా సదువుకోవల్లనా? వాడు వచ్చినప్పుడు బియ్యం గింజలు మాత్రం తీసుకొనిపోతాడు. యానాడేగాని దరిచ్చి ఒగ యాబై రూపాయలు వాని సేతిలో పెట్టింటివా నువ్వు? ఆడ, ఏమి తింటావుండాడో, ఎన్ని అవత్తలు పడతావుండాడో ఆ బిడ్డ! టయిపండు వొచ్చిందని అంత లెక్క నీ సేతికి తెచ్చిత్తే ఇంగా గొనుగుతాండావే? ఎవురన్నా యింటే గుద్ధల్తో నగుతారు! ఆ వొడుగూరు సెండ్ర్రాయుడోల్లు ఆ పిల్లోనికి కోనయ్యకు నెలకు నూర్రూపాయలు పంపిత్తారంట! ఆ పిల్లోడు గుడకా తిరపతిలోనే చదువుకుంటా ఉండేది! నీ కొడుకు ఆ పల్లోన్ని సాటవగా తీసుకుండాడా? లేదే! మనకూ వాల్లకూ ఏమి సాటవని, ఉండే దాంట్లోనే సర్దుకొని, ఎంత సాపం వుంటే అంతే కాల్లు జాపుకొని, ఆ యెడ్మాట్టర్ సారు పంపిచ్చే దుడ్లతోనే కన్నతిప్పలు పడతా, చదువుకుంటూ వుండేవాడు, గవుర్మెంట్ జీతం లెక్కన నెలకు 30 రూపాయిల మోయిన తెచ్చిత్తే సంతోసపడకుండా ఆ వంతన కొనిగేకి నీకు నోరెట్ల వత్తావుంది?” అంటా అమ్మయ్య అక్కసపడతా నాయనను మందలించింది.
అమ్మయ్య అడిగిన దానికి నాయన దగ్గర జవాబు లేదు. అందుకే ఏమీ మాట్లాడలేదు. నాకయితే ఊరికి వొచ్చినాన్న నన్న సంతోషం పక్కకు ఎగిరిపోయింది. సీతయ్య కయ్యలు కొరివిపల్లి వాళ్ళ మడి వేసవి పంట బాగా అయిందని తెలిసి మనసు నిదానమయింది. గడ్డివాములు ఇంకా కల్లాల దగ్గరే ఉండాయని, తొందరగా గడ్డి అంతా దొడ్లోకి మూసుకోవల్లని అమ్మయ్య చెప్పింది.
సాయంకాలం రోడ్లో మోరీ దగ్గర మిత్రులందరినీ కలుసుకుండాను. కోనయ్య గుడకా తిరుపతి నుంచి వచ్చినాడు. ఏజీబీయస్సీ వాళ్లకు గుడకా శెలవులంట! అందుకే కోనయ్య ఊరికి వచ్చినాడు. చాలా దినాల తర్వాత మా ఊరి జతకాళ్కందరితో కలిసి మాట్లాడడం భలే సంతోషం అయింది నాకు. నాగభూషణం కుళ్లాయప్ప బీఎస్సీ సెకండియర్ ముగించుకుండారు. ఓబుళ నారాయణ, ఈడిగ కొండన్న చదువు మానేసినారంట! వాళ్ల కుటుంబాలు బాగుండాయి. అట్లా వాళ్లు చదివు ఎందుకు మానేసినారో మాట్లాడుకుండాం.
చదువుకోవడం వీళ్లకు ఇష్టం లేదు. పెద్దోళ్లకు అసలే ఇష్టం లేదు. బచ్చు నాగభూషణమూ అంతే! ఇంకా కాపోళ్లలో బడగొర్ల ఎర్రప్ప, పెద్దగొర్ల నరసమ్మ మనవడు రామిరెడ్డి, మంచికంటి రామరంగయ్య పెద్దకొడుకు అశ్వత్థ నారాయణ, ఓబుల నారాయణ, రుద్రవరం వెంకటేశంశెట్టి, రామే వాళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్లందరూ చదువుకునేకి ఇష్టం లేక కొందరు, ఫెయిల్ అయినందువల్ల కొందరు చదువు మానేసినారు. ఇప్పుడు మన ఊర్లో నువ్వూ కోనయ్యా ఎలకంటి నాగభూషణం, తిరుపాల్ శెట్టి, నేను అంతే, మనం ఐదుగురమే కాలేజీల్లో చేరి చదువుకుంటా ఉండేది! పక్క పల్లెల్లో గుడకా మన సీనియర్స్ జూనియర్స్ ఎవురూ పై చదువులకు పోయినట్లు కనిపించడం లేదు.
అందరి విషయ సూక్ష్మంగా కుళ్లాయప్ప చెప్పడంతో, నేను కొంచెం గర్వంగా పొంగిపోయినాను. వెంటనే అనంతపురం ఆర్ట్స్ కాలేజీ చదువుకుండే నా జతకాళ్లతో చదువుకోలేనందుకు మనసులో కొంచెం బాధపడతా, ఎంత ప్రాప్తమో అంతే కదా, ఈ మాత్రమైనా చదువుకోవడానికి అవకాశం కలగడం అది నా అదృష్టమే కదా, అని నన్ను నేను సమాధానపరుచుకుండాను. నాగభూషణం, కుల్లాయప్పా, వాళ్ళ ఇంగ్లీష్ లెక్చరర్లను గురించి ఇంగ్లీషు కవులు షేక్స్పియర్,వర్డ్స్ వర్త్, కీట్స్, షెల్లీలను గురించి, వాళ్ల పాఠాలను గురించి వివరిస్తా ఉంటే, అట్లాంటి ఇంగ్లీష్ మహాకవుల సాహిత్యం చదువుకుండే అవకాశం రానందుకు మనసులు కొంచెం బాధపడినాను. నేనూ మా విద్వాన్ కోర్సులోని పాఠాలను గురించి సాహిత్య గ్రంథాలను గురించి గౌరి పెద్ది రామసుబ్బశర్మ, నాగసిద్ధారెడ్డి వంటి లెక్చరర్లను గురించి, వాళ్ళ టీచింగ్ గురించి, నేను సొంతంగా పద్యాలు రాస్తున్న సంగతిని గురించి, అష్టావధానం చేయల్లనుకుంటున్న విషయం గురించి ఎంతో గర్వంగాను ఉత్సాహంగాను చెప్పినాను. అందరూ విస్తుపోయినారు. ‘నువ్వు పద్యాలు కూడా రాస్తా ఉండావా నారాయణా? అయితే మన ఊరి మీద ఒక పద్యం చెప్పు’ అని కుళ్లాయప్ప అడిగినాడు.నేను కొంచెం సేపు ఆలోచన చేసి “నీతి నియమములకు ఖ్యాతి చెందిన పల్లె పేదదైన బండమీద పల్లె” అని రెండు పాదాలు ఆటవెలది పద్యంలో చెప్పినాను. అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకుండారు. అష్టావధాని ఆశావాది ప్రకాశరావు పరిచయమా అని అడిగినాడు కుళ్లాయప్ప. పేరైతే విన్నాను గానీ పరిచయం లేదన్నాను. మన ప్రాంతమేనంట, ఏ ఊరో స్పష్టంగా తెలియదు, మా మాదిగ కులస్థుడేనంట! అని కుళ్లాయప్ప తనకు తెలిసింది చెప్పినాడు. అతనిది ఏ వూరో, ఎక్కడుంటాడో తెలుసుకొని, కలుసుకోవల్లని అనుకుండాను. అందరమూ అనేక విషయాలు మాట్లాడుకొని చీకటి పడుతుండగా ఇల్లు చేరుకుండాం.
రాత్రి అమ్మయ్య చింతచిగురు గంజిరాకు పెట్టి చేసిన పప్పన్నం కడుపునిండా తిని, అందరమూ లాగిట్లో కూర్చుండాం. కొండ కింద ఊరు కదా, చాలా సెగగా ఉంది. గాలి వీచలేదు. ఆకల్లాడలేదు. అందరమూ నెల దినాలనుంచి మిద్దె పైన పండుకుంటా వుండామని, నేల చెల్లారడానికి రెండు సార్లు నీళ్లు చల్లి వచ్చినామని పెద్దక్క చెప్పింది. నేను దున్నపోతులకు గాట్లో గడ్డి వేసి, నాయనోళ్ళకు మంచాన్ని మిద్దె పైన ఏసొచ్చినాను. కాసేపయినంక ఇంటికి బీగం వేసి అందరమూ మిద్దె పైకి చేరుకుండాం. చిన్నాయన జేజి కిందనే ఇంటి బయట పండుకుండారు.
నేను లాటిన్ వెలుతురులో చదువుకోసాగినాను. చుట్టుపక్కలుండే మిద్దెల మీద జనం సవాలు చేసుకుంటా మాట్లాడుకుంటా ఉండారు. దూరంగా ఉండే బోయగేరిలో నుంచి ఆడోళ్ళు పాడే వెన్నెల పదాలు, కురవోళ్ల ఇండ్ల కాట్నుంచి కోలాటం శబ్దాలు, వడ్డే వాళ్ళ ఇండ్ల దగ్గర నెట్టి కంటోళ్ల ఇంటి బయల్లనుంచి ఆడపిల్లల పిస్తీపీ ఆటల శబ్దాలు,రాముల గుడి దగ్గర నుంచి తాళాలు కొడతా పాడుతా ఉండే భజన పాటల రాగాలు అన్నీ వినిపిస్తా ఉండాయి. అయితే అవేవీ చదువుకోవడానికి అంతరాయం కలిగించలేదు.
నాయన రాముల భజన ముగించుకొని వచ్చినాడు. వస్తానే, రేపట్నుంచి కల్లాల దగ్గరుండే వరిగడ్డి దొడ్లోకి మొయ్యల్లని చెప్పినాడు.
రేపు శింగనమలకు పోతానని మర్నాడు నుంచి మోస్తానని నాయనతో చెప్పినాను నేను.
పది గంటలు కావొచ్చింది. అన్ని చోట్ల నుంచి వచ్చే శబ్దాలన్నీ ఆగిపోయినాయి. గాలి కూడా ఆగిపోయింది. విపరీతమైన ఉడకబెడతా ఉంది. మా ఇంటి మిద్దె కొంచెం తగ్గులో ఉంటాది. తూర్పు వైపునుండే వరట్ట
రంగయోళ్ల గారమిద్దె మా ఇంటి కంటే ఒక మూడడుగులు ఎత్తుగా ఉంటాది. అందువల్లనే మాకు గాలి వీచలేదేమో అనిపించింది. లేచి ఆ ఇంటి పొత్తల గోడ మొరుము మీద కూర్చొని చూసినాను. అక్కడ గాలి కొంచెం తగులుతున్నట్లు అనిపించింది. ఆ మిద్దెమీద ఎవురో ఐదారు మంది పండుకుండారు. రంగయోళ్ళు మిద్దెక్కి పండుకోరు. మళ్ల వాళ్లు ఎవురయి వుంటారు? బహుశా కురవకొండన్నోళ్లేమో! నేనూ రేపటి నుంచి ఈ ఎత్తుమిద్దె మీద పండుకుండేది మేలని అనుకుంటా, మొరుము దిగొచ్చి, లాటీను ఆపుచేసి, పుస్తకాలు పక్కన పెట్టి, రెండు గోనెసంచి పట్టలు పొడుగ్గా పరుచుకొని, తలకింద రాగిసరుగు దిండు పెట్టుకొని, పండుకుండాను.
మంచం మీద నాయనోళ్లు రెండు దిండ్లు వేసుకుండారు. పిల్లోళ్లు రెండు దిండ్లు తలకాయల కింద పెట్టుకుండారు. నాయన ఈ మధ్యలో రాగిసరుగుతో నాలుగైదు దిండ్లు తయారుచేసినట్లుందని అనుకుంటా, పండుకుండాను. రోంతసేపటికే నిద్ర కమ్ముకుంది.
పోస్టు రన్నర్ ఉద్యోగాన్ని వద్దన్నాను
రాత్రి నాయనతో చెప్పినట్లే శింగనమలకు బయలుదేరినాను. అంతకుముందే కాయలోళ్ల గోపాల్ అన్నను అడిగి తెలుసుకుండాను, హెడ్మాస్టర్ సార్ ఊర్లో ఉండాడో లేదోనని. హెడ్మాస్టర్ సార్ ఊర్లో ఉన్నాడని సెలవుల్లో యాటికీ పోలేదని గోపాలన్న చెప్పినాడు. ఆయన మా ఊరి పోస్ట్‌మ్యాన్. మా మా వూరిది బ్రాంచ్ పోస్టాఫీస్. దానికి పోస్ట్‌మాస్టర్ మా ఊరి రుద్రవరం సూరయ్య. ఆయనను మేము పిన్నయ్యా అని పిలుస్తాం. ఆయన మా నాయనను అన్నా అంటాడు. గోపాలన్న, శింగనమల నుంచి మా వూరికీ మా వూరినుంచి శింగనమలకు పోస్టు బ్యాగులు తీసుకుని పోతా తీసుకొని వస్తా ఉంటాడు. గోపాలన్న గుర్తుకొచ్చినాడు. వెంటనే గోపాలన్నా సూరయ్యా పోస్టల్ ఉద్యోగాల్లో చేరిండే సంగతంతా జ్ఞాపకమొచ్చింది.
ఆరేండ్ల కిందట ఒకనాడు పోస్టల్ ఇన్‌స్పెక్టరంట, ఆయన మా వూరికొచ్చినాడు. పెద్ద మనుషులందరినీ చావిట్లో కలిపి, మీ ఊరి పంచాయితీకి ఒక బ్రాంచ్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఒక బ్రాంచి పోస్టుమాస్టర్, ఇక్కడి నుంచి సబ్ పోస్ట్ ఆఫీస్‌కు అక్కడి నుంచి బ్రాంచ్ ఆఫీస్‌కు సీలు వేసిన పోస్టల్ బ్యాగు తీసుకుని పోవడానికి తీసుకొని రావడానికి ఒక పోస్ట్ రన్నర్ ఉంటారు. ఆ రెండు ఉద్యోగాలకు కొద్దిగా చదువుకున్న వాళ్ళు కావాలి! ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. పోస్ట్‌మాస్టర్‌కు నెలకు 40 రుపాయలు, పోస్టు రన్నర్‌కు 25 రూపాయలు జీతం ఇస్తారు. పోస్ట్‌మాస్టర్ తన ఇంట్లోనే ఒక రూము పోస్ట్ ఆఫీస్ కోసం ఏర్పాటు చేసుకోవాలి! ఆయనకు కావలసిన సీలు, లక్క, కొవ్వొత్తులు, పోస్ట్ బ్యాగులు, అమ్మడానికి పోస్ట్ కార్డులు, ఇంగ్లాండ్ లెటర్స్, పోస్టల్ కవర్లు, మనీ ఆర్డర్ ఫారాలు అట్లాంటివన్నీ పోస్టల్ డిపార్ట్మెంట్ సప్లై చేస్తాది. పోస్ట్ మాస్టర్, వాటికంతా లెక్కలు పై అధికారికి తప్పకుండా చూపాలి! మనియార్డర్లు వచ్చినప్పుడు, ఇక్కట్నుంచి ఎవరైనా మనియార్డర్ చేసినప్పుడు, డబ్బుల విషయంలో పోస్ట్‌మాస్టర్ బాధ్యతగా ఉండాలి! ఏమైనా తేడాలు వస్తే అది నేరమవుతుంది! అన్ని విషయాల్లోనూ ఇద్దరూ జవాబుదారులే! పోస్ట్‌మాస్టర్ ఏర్పాటు చేసుకున్న ఆఫీసు రూముకు డిపార్ట్మెంట్ బాడుగను చెల్లిస్తుంది. పోస్టుల్ రన్నరుగా పనిచేసిన వాళ్లకు విద్యార్హతలను బట్టి ముందు ముందుకు ప్రమోషన్ ఉంటుంది. అని అన్నీ వివరంగా చెప్పినాడు
పోస్ట్‌మాస్టర్‌గా బాధ్యతతో పనిచేయడానికి టీచర్లు గానీ రెడ్డీ కరణాలు గానీ ఉంటే మేలన్నాడు ఇన్‌స్పెక్టర్. ఎవురూ ముందుకు రాలేదు. పోస్ట్ రన్నరుగా పనిచేయడానికి నన్ను ఉండమన్నాడు నాయన. నేను అంగీకరించలేదు. నేనే కాదు, నాతో పాటు చదువుకుంటా ఉండేవాళ్లు ఎవురూ ఒప్పుకోలేదు. గోపాలన్న అప్పటికే ఎనిమిదో తరగతిలో ఫెయిల్ అయ్యి వ్యవసాయం చేసుకుంటా ఉండాడు. వాళ్ళ నాయన వెంకట్రాముడు కొడుకును పోస్టల్ రన్నరుగా పనిచేయడానికి ఒప్పించినాడు. సూరయ్య పోస్టుమాష్టర్‌గా పనిచేయడానికీ బరువు బాధ్యతలు మోసుకోవడానికీ అంగీకరించినాడు. ఆ తర్వాత పోస్టల్ ఇన్‌స్పెక్టర్, దండోరా వేయించినాడు. రుద్రవరం సూరయ్య గోపాలన్న తప్ప వేరే వాళ్ళు ఎవరూ ఆ ఉద్యోగాల కోసరం ముందుకు రాలేదు. దాంతో ఇన్స్పెక్టర్ దండోరా ప్రకటనను, సూరయ్య గోపాల్ ఆ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న సంగతిని ఊరి పెద్ద మనుషుల సమక్షంలో ప్రకటించి, వాళ్ళిద్దరికే ఆ ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తున్న విషయాన్ని ఒక పేపర్ మీద రాసి దాని మీద తాను సంతకం చేసి పెద్ద మనుషులందరి చేత సంతకాలు చేయించి దాని నకలు కాపీని తీసుకుండాడు ఇన్‌స్పెక్టర్. నలుగురిని పెద్ద మనుషులను వెంటబెట్టుకొని సూరయ్య పిన్నయ్య ఇంటికి పోయి ఆఫీసును ఏర్పాటు చేయబోయే రూమును చూసి సంతృప్తి చెందినాడు ఇన్‌స్పెక్టర్. రేపే సింగనమల సబ్ పోస్టాఫీసుకు వచ్చి పోస్ట్ బాక్సును మిగతా పరికరాలన్నీ తెచ్చుకోవాలని చెప్పి సూరయ్య ఇంట్లోనే భోంచేసి పోయినాడు ఇన్‌స్పెక్టర్.
జరిగినదంతా గుర్తుకు తెచ్చుకొని, నాయన చెప్పినట్లే నేను పోస్టల్ రన్నర్‌గా చేరివుంటే నా బతుకు గోపాలన్న మాదిరే కదా, ఇప్పుడు నెలకు జీతం 35 రూపాయలే కదా, అదేమన్నా జీతమా? అదొక గవర్నమెంట్ ఉద్యోగమా? ఎన్నేండ్లు చేస్తే ప్రమోషన్ వస్తాది? పొరపాటున నాయన మాటలు విని పోస్టల్ రన్నరుగా చేరి ఉంటే ఎస్.ఎస్.ఎల్.సి చదువుకుండేవాన్నా? విద్వాన్‌లో చేరి ఉండేవాన్నా? అమ్మయ్య నాయన మాటలను తీసి పడేయకుంటే ఈ పొద్దు నా బతుకు గోపాలన్నయ్య బతికే కదా! టపాల్ ఉండినా లేకపోయినా సీల్ వేసిన బ్యాగు దినామూ శింగనమలకు మోసుకొని పోయి అక్కడినుంచి అట్లాటి బ్యాగు మోసుకొని రావాల్సిందే కదా! ఉదయం పదిగంటల నుంచి పోస్టుమాస్టర్ పంచన ఉండాల్సిందే కదా! ఆయన ఇంటి పనులు కూడా చేస్తా, పోస్టు రన్నర్‌గా ఉండూరులో పని చేసినంత కాలమూ ఆయన దయా దక్షిణ్యాల మీద బతకాల్సిందే కదా!
అనుకుంటా బరువుగా నిట్టూరుస్తా, ఆ ఉద్యోగం తప్పిపోయినందుకు ఊరట చెందుతా హెడ్మాస్టర్ సారోళ్ల ఇంటికి చేరుకుండాను. సార్ నేరుగా ఇచ్చిన, ఎం.ఓ. ద్వారా పంపిన డబ్బుల లిస్టు చూపించి అంతా ఇన్నూరు రూపాయిలు అయిందని, కాలేజీలో స్టయిఫండ్ ఇచ్చినారని, సార్ చేతికి ఇన్నూరు ఇచ్చినాను. రెండో సంవత్సరానికి కావల్లకదా, నీ దగ్గరే పెట్టుకోరా అన్నాడు సార్. నేను బలవంతంగా ఆయన చేతికిచ్చి సాయంకాలం వరకు ఉండి ఆ లోపల మిత్రులు వెంకటసత్యం, బాబు,తిప్పన్నా రాధాకృష్ణలను కలుసుకొని బయలుదేరి వచ్చి ఇల్లు చేరుకుండాను.
***
పెద్దక్కా వెంకటలక్ష్మీ నేనూ ముగ్గురం కలిసి రెండు దినాల కల్లా కల్లాల్లో ఉండే వరిగడ్డి అంతా దొడ్లోకి మోసినాం. అంతా వెయ్యి కట్టల గడ్డి, పాతది ముంగార్లది 600 కట్టల గడ్డి, అంతా వొకే వామి వెయ్యల్లనుకుండాం. నాయన రెండు దినాలు ఆకులమ్మేకి పోకుండా గడ్డివామి వేసేకి నిలిచినాడు. వామి, బడగొర్ల నాగిరెడ్డోళ్ల గడ్డివామి మాదిరి వేస్తే బాగుంటాది నాయనా అని నా కోరికను చెప్పినాను. అట్ల వెయ్యల్లంటే నాలుగైదు వేల కట్టల గడ్డి కావల్లన్నాడు. చిన్నదైనా ఆ మాదిరే వేసుకుందాం అన్నాను
ఆరు బారలు పొడవు రెండు బారలు వెడల్పుతో గడ్డివామికి ‘ఆయం’ పెట్టినాడు నాయన. వరిగడ్డి కట్టలను లవెలుపల వైపు మడిచి చుట్టూ పెట్టినాడు. అట్ల ఆరు వరసలు పెట్టి వామిని పైకి లేపినాడు. ఆటికి నడుములెత్తు లేచింది వామి. అక్కడి నుంచి కట్టలను జానెడు బయటికి యెల్లిడిసి వామి వేసినాడు. నేను కింద నుంచి ఒక్కొక్క కట్టను పైకి విసురుతా ఉంటే దాన్ని తీసుకొని చిక్కగా పేరుస్తా గట్టిగా తొక్కుతా వామివేసినాడు నాయన. మొత్తం వామి వేయడానికి రెండు దినాలు పట్టింది. పునాదిరాళ్ల మాదిరి మడిచిన గడ్డికట్టల పై వరుసలో బయటకు వచ్చిన గడ్డి పోసలన్నీ కొడవలితో ఒకే లెవెల్ ఉండేటట్ల కోసేసినాడు. పక్కనే ఉన్న కాలువ గుంతలోని నీళ్లల్లో ఐదారు వరిగడ్డి కట్టల్ని ముంచి బాగా నానిపి, దాన్నంతా వామి దగ్గరికి తీసుకొని పోయినాను. నాయన ఒకచోట కూర్చొని మొద్దు పోయిన ఒక కొడవలి లిక్కికి తడిసిన పది వరిగడ్డి పోసల్ని కరిపించి కొడవలిని తిప్పుకుంటా వెనక్కి పొమ్మన్నాడు. నేను ఆ ప్రకారంగా రెండు చేతులతో కొడవలిని తిప్పుతా మెల్లగా తడిసిన గడ్డిని పూరి పెడతా వెనక్కి పోతా ఉండాను. నాయన రెండు చేతులతో తడిసిన గడ్డిని పురితాడుకు అందిస్తా ఉండాడు. ఆశ్చర్యంగా వరిగడ్డి పురితాడు తయారయితా ఉంది. ఐదారు బారల పొడవైనంక, దానిని చుట్ట చుట్టి పక్కన పెట్టినాడు నాయన. ఆ ప్రకారంగా ఎనిమిది తాళ్లను తయారుచేసినాం. అవి తాళ్లు కాదు, యెంటెలు! ఒక్కొక్కటి ఏడెనిమిది కేజీల బరువుండే పదారు రాళ్లను గడ్డివామి దగ్గరికి తెచ్చి పెట్టినాను. నాయన మళ్లా వామి పైకెక్కి యెంటెను పురి వొదులుగాకుండా, ఒక కొనను నాకందించినాడు. నాయన చెప్పినట్లే నేను ఆ యెంటె కొనకు ఒక రాయిని బిగించి కట్టినాను. వామి అవతలి వైపుకు పోయి, యెంటె రెండో కొనకు ఆ మాదిరిగానే ఒక రాయిని బిగించి కట్టినాను. నాయన వామి పైన్నుంచే, యెంటె రాళ్లను ఇరువైపులా సమానమైన ఎత్తులో ఉండే విధంగా అడ్జెస్ట్ చేసినాడు. ఆ ప్రకారంగా నాలుగడుగుల ఎడమతో ఎనిమిది యెంటెలను గడ్డివామి మీద దిగేసినాం. ఇప్పుడు గడ్డివామి, నాగిరెడ్డోళ్ల వామి మాదిరే కనిపిస్తా ఉందని మురిసి పోయినాను.
కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల..
ఎండకాలం సెలవులు అయిపోవచ్చినాయి. అమ్మయ్య మళ్లీ గర్భవతి అని తెలిసి కొంచెం బాధయింది. ఇప్పటికే ఆరు మంది పిల్లలం. ఈ ఆరు మందికి తోడు ఇంకా ఒకరో ఇద్దరో తోడైతే కుటుంబ భారం ఎంత కష్టం! కుటుంబ నియంత్రణ పద్ధతిని చాలామంది పట్టణాలలో పాటిస్తా ఉండారు. మేమిద్దరం మాకిద్దరు అనే నినాదం పట్టణాల్లో బాగా పనిచేస్తా ఉంది. ఎక్కువమంది పిల్లల్ని కంటే చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టమయితాదని చదువుకున్న వాళ్లు ఉద్యోగస్తులు ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటా ఉండారు. ఆపరేషన్ వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తావున్నా, ప్రభుత్వ ఆసుపత్రులలో దానికోసరం ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంటునే ఏర్పాటు చేసి, ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకు కొంత ఆర్థిక సాయం అందజేస్తామని, ఇద్దరు ముగ్గురు పిల్లలు కలగగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే తల్లుల ఆరోగ్య స్థితి బాగుపడుతుందని, పిల్లల పోషణ స్థితి మెరుగుపడుతుందని, దానివల్ల జనాభా వృద్ధి తగ్గి దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుందని ఎన్ని హితవు మాటలు చెప్పినా పల్లెల్లో చదువు లేని కారణంగా ఆ మాటలు చెవికెక్కడం లేదు. ఆడవాళ్లు ఆపరేషన్ చేయించుకుంటే విపరీతంగా లావైపోతారని, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత బరువు పనులు చేయకూడదని, మగవాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఏ కారణం చేతనయినా వాళ్ల భార్యలు గర్భవతులైతే లేనిపోని అనుమానాలతో కుటుంబ సంబంధాలు చెడిపోతాయని, అట్లాంటి తప్పుడు ప్రచారాలతో పల్లెల్లో మొరటజనం చాలామంది, కుటుంబ నియంత్రణ పట్ల ఆసక్తి చూపడం లేదు. మా అమ్మానాన్నలు గుడకా మొరటతనం వల్ల కుటుంబ నియంత్రణ పాటించడానికి ఇష్టపడకపోవడం వల్లనే అమ్మయ్య మళ్ళీ గర్భవతి అయింది.
నేను ఆదోనిలో ఉద్యోగంలో చేరినప్పుడు మగ పిల్లవాణ్ణి కనింది. అప్పుడు కూడా ఒక రోజంతా బాధపడినాను. బుక్కరాయసముద్రంలో పనిచేసేటప్పుడు ఒకరోజు పనిమీద ఊరికి వచ్చినాను. కుటుంబ నియంత్రణ వాళ్లు ప్రచారానికి వచ్చి, పిల్లలెంతమంది అని అడిగినారు. అప్పుడు నాయన గుడకా ఇంటి దగ్గరే ఉండాడు. అమ్మయ్య గర్వంగా ఆరు మంది అని చెప్పగానే వాళ్లు సున్నితంగా మందలించినారు.
“బాగ జెప్పుతాడావమ్మా? ఎంతమందిని కంటే మీకేమినట్టం? ఏమి, నీ ఇంటికొత్తారా మా పిల్లల్లు బువ్వ పెట్టమని? ఆ బగమంతుడుండాడు! నారు బోసినోడు నీరు బొయ్యడా” అని ఆ హెల్త్ వర్కర్‌ని అమ్మయ్య కోపంగా దండించింది. అప్పుడు నాయన కూడా అదే మాటన్నాడు. దాంతో ఆ హెల్త్ వర్కర్ మౌనంగా వెళ్ళిపోయింది. అప్పుడు నేను గుడకా మాట్లాడి ఉంటే బాగుండేది! కానీ మాట్లాడలేకపోయినాను. ఇప్పుడు అమ్మయ్య మళ్లా గర్భవతి అని తెలిసి అమ్మయ్యను గట్టిగా మందలించేకి నోరు రాలేదు. భయం. ఎందుకంటే, అమ్మయ్య సపోర్టు వల్లనే నేను చదువుకుంటా ఉండాను. నేను మందలిస్తే అమ్మయ్య ఏ విధంగా రియాక్ట్ అయితాదో ఏమో? భలే పౌరుషమైన, శరత్తయిన మనిషి అమ్మయ్య! ఇటువంటి వాళ్లకు కుటుంబ నియంత్రణవల్ల కలిగే ప్రయోజనాలు, అధిక సంతానం వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వం వాళ్లు ఏవయినా బుర్రకథల ద్వారానో నాటికల ద్వారానో ఫిల్మ్‌ల ద్వారానో తెలియజేస్తే బాగుంటుందని అనుకోసాగినాను.
గాండ్లపర్తి పెద్దక్క ఎంత గొప్ప తల్లి!
గాండ్లపర్తి వెంకటరెడ్డి, నేను హైస్కూల్లో చదివేటప్పుడు నాకు బద్దేగుండ్ల జతగాడు. నాకంటే మూడేండ్లు పెద్దోడు. అందుకే నేను వెంకటరెడ్డిని అన్నా అని పిలుస్తా ఉంటాను. మాగాణి కింద మంచి మడీ, కొండల సందులో మంచి చేనూ నిరంతరం పాడీ అన్నీ ఉన్న పెద్ద గారమిద్దె కుటుంబం వాళ్లది. వెంకటరెడ్డి తండ్రి బొంత నరసప్పది మా ఊరు కాదు, గాండ్లపర్తి. మునెప్పోళ్ల ఇంటికి ఇల్లటం వచ్చినోడని మొన్న మా నాయన చెప్పితే తెలిసింది నాకు. మునెప్పది మా ఊరయితే మరి గాండ్లపర్తి మునెప్ప అని ఎందుకు పిలుస్తారో నాయనని అడిగినాను. కొన్ని తరాల కిందట మునెప్ప పూర్వీకులు అనంతపురం అవతల ఉండే గాండ్లపర్తి నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడినారని, అట్లనే వడగూరు చెన్రాయుని పూర్వీకులు గుడకా వడుకూరు నుంచి వచ్చి స్థిరపడినోళ్లే అని చెప్పినాడు నాయన. పూర్వకాలంలో ఎవురు ఎక్కడినుంచి ఎక్కడికి పోయి స్థిరపడినారో వాళ్ల ఇంటి పేర్లను బట్టి ఆలోచిస్తే, వాళ్ల మూలాల్లోకి వెళ్లి పరిశోధిస్తే, తెలుస్తాదని, మా నాయన గుడకా బండమీద పల్లె వాడు కాదని, మా నాయన మూలాలు గుత్తి అనంతపురంలో ఉండాయని ఆలోచిస్తా చావిట్లో కూర్చొని వెంకటరెడ్డోళ్ల ఇంటి వైపు చూస్తా ఉండాను.
ఆ ఇల్లు చాలా పెద్దది. దక్షిణం ముఖంగా ఉండే పెద్దగారమిద్దె. పడమటి గోడకు ఒక చిన్న కిటికీ మాత్రమే ఉంది. మా వూర్లో, చుట్టుపక్కల పల్లెల్లో దాదాపు అందరి ఇండ్లూ కిటికీలు లేనివే! అన్నీ అంటూ మిద్దెలే! ఇట్లాంటి మిద్దెలు, మా ఊర్లోనే కాదు, మొత్తం మా ప్రాంతంలో, దాదాపు రాయలసీమలో అన్ని పల్లెల్లోనా కనిపిస్తాయి. టౌన్లల్లో మాదిరి పల్లెలో ఏ ఇంటికీ కిటికీలుండవు. మరి వెలుతురు రావల్లంటే మిద్దెలపైనుండే గవాక్షులు తీసుకోవల్సిందే! రైతుల ఇండ్లల్లో, ఇంటి లోపలే పశువులు, గాటిపాడు, జెగితి మీద ఒకపక్క వంటగది, మరొకపక్క కొట్టిడీ ఉంటాయి. జెగితి మీదనే ధాన్యం మూటలు! అందుకే ఎండాకాలంలో ఆ ఇండ్లల్లో విపరీతమైన ఉడక! ముసలీ ముతకోళ్లు లోపల ఉండలేరు. అందుకేనేమో, వెంకటరెడ్డి తాత గాండ్లపర్తి మునెప్ప చాలా దినాల నుంచి ఇంటి వసారాలో ఒక అరుగుపైన నులక మంచం మీద పడుకుంటా ఉండాడు.
వారం రోజుల నుంచి చూస్తా, నేను ఆశ్చర్యపోతా ఉండాను. ఆ తాత, బాగా దసిలిపోయి, పూర్తీ మెత్తబడినాడు. శరీరమంతా ముడతలు ముడతలు పడింది. చూపు తగ్గిపోయింది. మూతినీ నోట్లో నాలుకను మాటిమాటికి ముందుకూ వెనక్కీ చాపుతా మడుచుకుంటా ఏదో వొదురుతా వుంటాడు. మంచం మీద ఎక్కువ సేపు కూర్చోలేడు. ఒకడే పండుకోలేడు, లేయలేడు. పైకి లేపి కట్టె చేతికిస్తే కాసేపు నిల్చుకోగల్గుతాడు. ఆ తాతకు కూతురు సేవ చేస్తా ఉంది. ఆయమ్మ పేరు పెద్దక్క. ఆ సేవను చూస్తే, చూసే వాళ్లకే అసహ్యమయితాది!
మునెప్ప తాత ఏ సైగ గొంతుతో పిలిచినాడో యేమో, ఆ పెద్దమ్మ పెద్దక్క, లోపల నుంచి పరిగెత్తి వచ్చింది. నేను చావిట్లో అరుగు మీద కూర్చుని చూస్తా ఉండాను. ఆ పెద్దమ్మ,ఆ తాతను మంచం మీద నుంచి పైకి లేపి, నిలబెట్టి, పక్కనుండే కట్టెను ఆసరాగా ఇచ్చింది. కట్టెను పట్టుకొని పెద్దమ్మ వైపు వీపు తిప్పి నిల్చుకుండాడు ఆ తాత. ఆ పెద్దమ్మ,ఆ తాత గోసి పంచెను నడుముల పైకి ఎత్తి, మడిచి, ఒక బకెట్టును పిర్రలకు ఆనిచ్చి పట్టుకుంది. ఆ తాత కక్కసు చేసినాడు. చేసేదంతా అయిందని అడిగి తెలుసుకొని, బకెట్ కింద పెట్టి ముడ్డి కడిగింది. మూత్రం పోయడానికి బకెట్టును ముందు పక్క పెట్టింది. అయిన తర్వాత నీళ్లతో కడిగి వొల్లంతా తుడిచి, గోసి పంచెను కిందికి దించి, గోసి ఎగజెక్కింది. బకెట్ తీసుకొని పోయి మలమూత్రమంతా దిబ్బలో పడేసి వచ్చింది.
ఇది కథ కాదు. ప్రత్యక్షంగా చాలా సార్లు చూసిన, చూస్తున్న దృశ్యం! అదంతా చేస్తున్నా ఆ తల్లి ముఖంలో అసహ్యం కానీ అసహనం గానీ నాకు కనిపించలేదు. చంటి పిల్లవాడు పాలు తాగుతా ఉచ్చ పోసి కక్కసు చేస్తే, ఏమాత్రం అసహ్యించుకోకుండా, బిడ్డకు సేవ చేసే ఒక కన్నతల్లి కనిపించింది ఆ పెద్దమ్మలో! మరెందుకు మా సొంత జేజి దిక్కులేనిదై, పిచ్చిదాని మాదిరి చావిట్లో పడింది? ఈ కాలంలో కన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఎంతమంది పిల్లలు ఈ మాదిరి చూసుకుంటా ఉండారు? ఆ పెద్దక్క ఏ నీతి కథలు చదువుకుంది? ఆ అమ్మకు చదివే రాదు కదా, మరి ఆ అమ్మకు అంతట సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? పసిపిల్లగా తాను తల్లిదండ్రుల వొడిలో చేసిన నానా యాగినంతా శుభ్రపరిచిన తల్లిదండ్రులను ప్రతిరోజూ జ్ఞాపకం చేసుకుంటా ఉంది! అది, ఒక మనిషి తన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో చేయవలసిన సేవను బాధ్యతను గుర్తు చేస్తావున్నట్లు నాకు రీజూ కనిపిస్తాది. అయితే, ఆయమ్మ తన తండ్రికి చేస్తున్న సపర్య, ఇతరులకు ఆదర్శమవుతుందా? మానవత్వంతో ఒక మనిషి నిర్వర్తించే బాధ్యతను ఆదర్శమనుకోవచ్చునా? బాధ్యతను నిర్వర్తించడంలో అసహ్యతను చూడని వెంకటరెడ్డి తల్లి ఎంత గొప్ప వ్యక్తి! అనుకుంటా ఆ మహాతల్లికి మనసులో నమస్కరించి ఇల్లు చేరుకుండాను.
నీతి ముందు ఆరాటం ఓడిపోయి..
నిన్న కోనయ్యా నేనూ వాళ్ల బావి చేను దగ్గరికి పోయి చాలా విషయాలు మాట్లాడుకుండాం. అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులకు అద్భుతమైన హాస్టల్ కడతావుంరని ఆడ పనిచేసే వాళ్ళల్లో నలుగురు అమ్మాయిలు బలే ఉండారని లొటక లేసుకుంటా చెప్పినాడు. అటువంటి విషయాలు నాతోనూ ఓబుల నారాయణతోనూ చెపుతా ఉంటాడు కోనయ్య. వాళ్లిద్దరికీ ఆడపిల్లల పిచ్చి చాలా ఎక్కువ. నాకూ ఆరాటం ఉంది కానీ నేను స్త్రీని మనసుతో చూస్తాను. ఆమె ఇష్టడితే ఎంత బాగుంటుందని అనుకుంటాను.
ఆ విషయాలు మాట్లాడతా ఆవుల నారాయణ బిడ్డ పొడుగు ముక్కుపిల్ల రామలక్ష్మి భలే ఉంటాదని, అద్భుతమైన రూపం అని వర్ణిస్తా ఎట్లైనా సరే ఆ పిల్లను పడేసుకోవల్లని అనిపిస్తాదని, దానికి గుడకా నేనంటే భలే ఇష్టమని తన మనసులోని కోరికను చెప్పినాడు. ఆ పాప నీకు చెల్లెలు వరసయితాది కదా కోనయ్యా, మీ కులవోల్ల పాపే కదా, ఆ పాప మీద నీకు మనసు పోవడమేంది? ఎవరికైనా తెలిస్తే అసహ్యం కాదా? వద్దు వద్దు కోనయ్యా అని నేను డిస్కరేజ్ చేసినాను
“నన్ను అన్నయ్యా అని అంటానే ఆ పిల్ల నాకు చెల్లెలయిపోతాదా నారాయణా? ఆ వరసలన్నీ ఊరకనే పీల్చుకోవడానికే! ఏమి, ఆ పిల్ల మా చిన్నాయన కూతురా మా పిన్నమ్మ కూతురా? కాదు గదా! మా కురవోళ్ల పిల్ల అయినంత మాత్రాన అది నాకు చెల్లెలు వరస అయితాదా? ..ఎట్లుంటుంది పిల్ల! పిటపటలాడుతా కండ్లతోనే మత్తెక్కిస్తాది! దాని నడుము, ఆ గుబ్బలు, ఆ బుగ్గలు, గుర్తొస్తే చాలు నరాలు జివ్వుమంటాయి! చూడు, అప్పుడే మావాడు ఎట్ల నిగిడినాడో” అని టక్కున ప్యాంటు జిప్పు తీసి చూపించినాడు. చూస్తానే నా నరాలు జివ్వుమన్నాయి. వెంటనే తేరుకొని, ‘యేయ్ కోనయ్యా, ఏమిటది? సిగ్గు లేదా? ఎవురైనా చూస్తే ఏమనుకుంటారు?’ అని అటూ ఇటూ చూసినాను. “ఏమనుకుంటారు, ఆడపిల్లలయితే చాటుకు పోయి చూస్తా లొటకలేస్తారు. నువ్వు సాహిత్యం చదువుకుండావు, ఆ మాత్రం రాసిక్యం లేకుంటే ఎట్ల? దున్నపోతు దున్ని దున్ని చావల్ల, మొగోడు..” అని బూతు మాటలు ఎంతో ఇష్టంగా అన్నాడు. “నీ దగ్గరుంటే నాకు పిచ్చి పడతాది స్వామీ! గొంది చేన్లో నుంచి ఎవురో వస్తా ఉండారు, జిప్పు వేసుకో ప్లీజ్” అని ప్రాధేయపడినాను. జిప్పు వేసుకుండాడు. అంతలోనే దుంపల తిమ్మన్న తాత, ఆ తాత భార్య ముసలమ్మ, తమ్ముడు, అతని భార్య రామలక్ష్మి వచ్చినారు. నేను వాళ్లతో పాటు ఇంటికొచ్చినాను. సాయంకాలం వరకు మనసులో ఆలోచనలు సందడి చేసినాయి.
అన్నం పొద్దుకు చెంబులూ పల్యాలూ అన్నం తపెలా పప్పుకుండా గరిటెలూ చెంబులూ లోటాలీ అన్నీ మిద్దె మీదకు చేర్చినారు పిల్లలు. అందరూ సాయంత్రమే రెండుసార్లు నీళ్లు చల్లడంతో మిద్దె మీద చల్లగా ఉంది. పున్నమి వెన్నెల పాలారబోసినట్టుంది. వైశాఖమాసం పోవచ్చినా వాతావరణంలో ఉడక తగ్గలేదు. అందుకే చుట్టుపక్కలోళ్ళందరూ మిద్దెల మీద బోంచేస్తా ఉండారు. ఒకరినొకరు పలకరించుకుంటా, కురాకులను గురించి అడుగుతా, నవ్వుతా బేల్తా భోజనాలు ముగించి ఎంగిలి తట్టలన్నీ కిందకు తీసుకొని పోయి కడిగి ఎత్తిపెట్టి చాపలు దిండ్లు తీసుకొని పండుకోవడానికి మళ్లీ మిద్దెలు మీదికి వస్తా ఉండారు.
నేను కొంచెం సేపు నాయనోళ్ళతో మాట్లాడి, చాపా దిండూ లాటీనూ పుస్తకాలూ తీసుకొని, రంగయ్యోళ్ల మిద్దె మీదికి పోయి చదువుకుంటానని చెప్పి మొరుమెక్కి ఆ మిద్దె మీదికి చేరుకుండాను. చౌడు ముక్కలను, వడ్ల గింజలంతుండే రాళ్లను చాపతో పక్కకు తోసి, చాప పరుచుకొని చదువుకుండేకి కూర్చుండాను. ఆ మిద్దె మీద మధ్యలో ఉత్తర దక్షిణంగా ఇంకొక చిన్న మొరుముంది. ఆ మొరుముకు అవతల దూరంగా ఎవురో ఇద్దరు ముగ్గురు అప్పుడే పండుకుండారు. నన్ను గమనించి పలకరించినారు వాళ్లు. ముగ్గురూ ఆవుల నారాయణోళ్లని అర్థమైంది నాకు. వాళ్ల కూతురే, కోనయ్య ఇష్టపడిన పొడుగు ముక్కు రామలక్ష్మి! అయితే వాళ్ల పక్కన పండుకున్నది ఆ పిల్ల కాదని, ఆ పిల్ల తల్లి తండ్రి చెల్లెలు అని తెలుసుకుండాను. ఆవుల నారాయణోళ్ళు రెండు మాటలు నాతో మాట్లాడి, నేను చదువుకుంటా ఉండానని వాళ్లు మెల్లగా మాట్లాడుకోసాగినారు.
కొంచెం సేపయినంక ముక్కు పిల్ల రామలక్ష్మి, నీళ్ల చెంబు తీసుకొని పైకొచ్చి, నన్ను గమనించిందమో, ‘తిరుపతాయప్పా, ఆడ తిరుపతిలో సదివిండేది సాలక మల్లా ఇంటికొచ్చి చదువుతా వుండావా? లచ్చినంగా తిని పండుకోకుండా, సిదిగి సిదిగి యాల సన్నగయితావు?’ అని చలోక్తులు విసిరింది రామలక్ష్మి. ఆ మాటలకు నాకు నవ్వొచ్చి ఆ వైపు చూసినాను. వేయి రేకులతో విచ్చుకున్న గులాబీ పువ్వు మాదిరి వగలు పోతావుంది. ఆ పిల్ల నన్ను ఎప్పుడు చూసినా ఎగసక్యాలు చేస్తా జాన్తనమాడుతా మధ్యలో ఒకసారి అది కాదన్నయ్యా అని అంటాది! ఆ మాట వింటానే నన్ను నేను సర్దుకుంటాను. ఇప్పుడు అదే మాదిరి తమాషాగా మాట్లాడతా ఉందనుకొని ఒక చిరునవ్వు నవ్వి పుస్తకం పైన దృష్టి పెట్టినాను. ఆ పాప మంచినీళ్ల చెంబు వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి, రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోతా ‘అంతగా సిదిగితే, నీ అంత చిదిగిన పెండ్లాం నీకు దొరకల్లంటే, అది అయ్యే పని కాదులే! ఇంగ పండుకో’ అంటా కిందికి వెళ్లిపోయింది. ‘ఎంత చమత్కారమైన మనిషి ఈ పిల్ల! అంత ఈజీగా మాట్లాడడమంటే అందరికీ సాధ్యం కాదేమో! ఈ పిల్ల మీద మనసుండే మొగోనికి ఈ మాటలు గిలిగింతలు పెట్టకుండా ఉంటాయా?’ అని కొంచెం సేపు ఆ పిల్లను గురించి, కోనయ్యను గురించి ఆలోచన చేసినాను.
ఈ చమత్కారాలు, చలోక్తులు విని ఈ పిల్లకు తన మీద మోజుందని కోనయ్య భ్రమపడినాడేమో! అయినా వయసొచ్చిన అందమైన యువతి, ఇట్ల మాట్లాడితే యా మొగోడయినా మోజు పడకుండా ఉంటాడా? అని అనుకుంటా మనసు పక్క దారి తొక్క సాగింది. వెంటనే మనసును దారిలోకి తెచ్చుకొని సీరియస్‌గా చదువుకో సాగినాను.
వొక గంటసేపటికల్లా సద్దు మణిగింది. అందరూ నిద్రపోతా ఉండారు. అంతలోనే కొండన్న బిడ్డ తిమ్మప్ప ఎవర్నో ఒక చిన్న పిల్లను పిలుచుకొని మిద్ది పైకొచ్చింది. నన్ను చూసి, ‘ఏం బూసీ, చదువుకుంటా వుండావా?’ అంటా నా దగ్గరికొచ్చి, నా చెక్కిలి గిచ్చి, దూరంగా పోయి పండుకోవల్లని అనుకుందేమో, అక్కడ పండుకోనుండేది తన చిన్నాయనోళ్ళని తెలుసుకొని, మొరుము అవతల, నేను చదువుకుంటా ఉండే చోటుకు బారెడు దూరంలో చాపపరిచి పండుకుంది. దండిగా స్థలం ఉంది కదా, ఇంకా కొంచెం దూరంగా పోయి పండుకుంటే మేలు కదా అని మనసులో అనుకుండాను.
కురవోళ్ల కొండన్న తమ్ముడు ఆవుల నారాయణ, కొండన్నోళ్ల గుంపంతా వరట్ట రంయ్యకు ఆపూ అండా. అందుకేనేమో వాళ్లంతా ఎండాకాలంలో రంగయోళ్ళ మిద్దె మీదికొచ్చి పండుకుంటారు. కొండన్న భార్య కానుపు సమయంలో చనిపోతే రెండో పెళ్లి చేసుకుండాడు. ఆ యప్ప మొదటి భార్య కూతురే తిప్పమ్మ. తిప్పమ్మ నా కంటే ఐదేండ్లు పెద్దది. కొండన్నను ఎదురు పార్టీ వాళ్లు నల్లపరెడ్డోళ్లు చంపేసినారు. ఆయప్ప చనిపోయేనాటికి రెండో భార్యకు ఇద్దరు పిల్లలు. వీళ్లందరికీ పెద్దదిక్కయిన ఆవుల నారాయణ, తన అన్న కుటుంబం పట్ల బాధ్యత తీసుకొని, తిప్పమ్మను ఆమె మేనమామకు ఇచ్చి పెళ్లి చేసినాడు. మొగుడు చేతగానోడని మొగుణ్ణి వదిలేసి తిప్పమ్మ పుట్టింటికి వచ్చి చేరుకుంది. చేరుకున్న తర్వాత ఆమె మీద చాలామంది దృష్టిపడింది. అయితే ఆమె అగ్గి లాంటిదని, తండ్రి మాదిరి పౌరుషమైన వ్యక్తి అని, ఎవురూ ఆమెకు దగ్గర య్యందుకు ధైర్యం చేయలేదు. అయితే ఆమెను గురించి అమ్మాయ్యోళ్ళు కొంచెం పెదవి విరుస్తా ఉంటారు. అది ఎందుకో నాకు తెలియదు. అటువంటి తిప్పమ్మ నాకు బారెడు దూరంలో పండుకోవడంతో ఈ ఆలోచనలన్నీ నాలో మెదిలినాయి.
తిప్పమ్మ అందంలో మా ఉప్పరోళ్ల రామలక్ష్మికి ఏమీ తీసిపోదు. రంగు మాత్రమే తేడా! కొంచెం సావు నలుపు రంగు! వాళ్ళమ్మ కలరే! చదువుకున్నోళ్ళు చామన చాయ అంటారు! ఆ రంగుతో తిప్పమ్మ చాలా అందంగా ఉంటాది! ఆమె అంగ సౌష్టవం మగవాన్ని చూపు తిప్పుకోనీయదు! కళ్ళల్లో ఏవో తెలియని కోరికలు బుసలు కొడతా ఉన్నట్లే ఉంటాయి! ఈ మధ్యనే ఆమెను వరట్టరంగయోళ్ల ఇంట్లో రెండు మూడు సార్లు చూసినాను. ఆ చూపులు చురకత్తి మాదిరి ఎక్కడో తాకినట్లయితే ఒళ్ళు జిల్లుమంది. అటువంటి తిప్పమ్మ ఈ రాత్రిపూట నాకు దగ్గరగా పండుకుంది. నాలో ప్రకంపనలు మొదలైనాయి. మాటిమాటికీ పుస్తకం మీద ఉన్న చూపులు ఆమె వొంటిమీదికి మర్ల సాగినాయి. పైటకొంగు పక్కకు తీసి, కొంగుతో గాలి విసురుకుంటా ఉంది. ఎదమీద రెండు దాన్యం రాశుల మాదిరి, వసుచరిత్రలోని గిరికాదేవి వక్షోజాల మాదిరి, పైకి ఉబ్బుకొని ఉండాయి. అటువైపు నుంచి చూపులు పక్కకు తిప్పుకో బుద్ధి కాలేదు. కూర్చొని ఈ పిల్లోడు తనవైపే చూస్తావుండాడే అని ఆమె అనుకుంటాదేమో, నన్ను గమనిస్తాదేమోనని లైట్ ఆపు చేసి పుస్తకాలు ఎత్తిపెట్టి ఇటువైపు తిరిగి పండుకుండాను.
వయసులో ఉండే ఆడమనిషి వక్షోజాల మీద పయట తీసేసి సిగ్గు లేకుండా ఇట్లా పండుకుంటే ఎట్ల? రంగయ్యోళ్ల అంగట్లో చూపులతో తాగేసే దాని మాదిరి చూసిన మనిషి, ఇక్కడ నేను చదువుకుంటానని తెలిసే పండుకోవడానికి వచ్చిందేమో! ఏం బూసీ, చదువుకుంటావుండావా అని నా చెక్కిల్ని యాల గిల్లింది? కొన్నేండ్ల కిందట, నీలంపల్లిలో ఋషింగప్ప పెండ్లాం గుడకా ఇట్లనే, బూసీ అని చెక్కిలి గిల్లింది. ఆయమ్మంటే పెద్దాయమ్మ, చిన్న పిల్లల మీద ప్రేమతో అట్ల చేసి ఉండొచ్చు! మరి మంచి వయసులో ఉండే ఈమె అట్ల నా చెక్కిలిని గిల్లొచ్చునా? నేనేమి చిన్న పిల్లోడినా? ఆ గిల్లడంలో ఏదో తాకినట్లయ్యింది. నన్ను కోరుకుంటా వుందేమో! మొగుడు లేడు పాపం!
అనుకోగానే వొళ్లు జివ్వుమనింది. మనసు ఆరాటపడింది. ఇటు వైపు తిరిగిన వానని అటువైపు తిరిగి బోర్లా పండుకొని మనసును అదుపు చేసుకోలేక, ఆమె వైపు చూసినాను. ఒళ్ళు జిళ్ళు మనింది. నరాలన్నీ జివ జివ లాడినాయి. ఆమె రవిక కిందున్న ఉక్స్ తీసేసింది. రెండు జున్ను ముద్దల మాదిరి కనిపిస్తా ఉండాయి! నాలుగడుగులు జరిగి చేతులు చేస్తే చాలు అందుతాయి! మెల్లగా జరిగి ఆ దృఢమైన వక్షోజాలను పట్టుకోవల్లని మనసు తహతహలాడింది. శరీరం పొగలుగక్కుతా, అంతులేని ఆరాటంతో ఊగిసలాడింది. ఎన్నాళ్ళ నుంచో ఆవురావురుమంటా ఉండే కోరికలు బుసలు కొట్టినాయి. ఒక్క క్షణకాలం అంతరాత్మలో ఏదో మెదిలాడింది. అంతే! నీతి ముందు ఆరాటం ఓడిపోయింది! పైకి లేచి అన్నీ తీసుకొని మా మిద్దె మీదికొచ్చినాను. ఉయ్యాలలో ఉన్న రెండేళ్ల పిల్లోడు ప్రసాద్ మెదిలినాడేమో, ఉయ్యాల ఊపుతా అమ్మయ్య నన్ను చూసి ఏమప్పా ఇంగా పండుకోలేదా అని అడిగింది.
ఆ తిప్పమ్మ పెద్దగా గురక పెడతా ఉంది మా! అందుకే నిద్ర రాలేదు. అని అపద్దం చెప్పి మా పిల్లోళ్ల పక్కన చాప పరుచుకొని పండుకుండాను.
ఆ తుడుగుది వచ్చిందేమి ఆటికి? రేపటి నుంచి ఆటికి పోద్దు నాయినా! దూడపిల్లోనివి అని సలహా ఇచ్చింది అమ్మయ్య. నేను పండుకొని అమ్మయ్య చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తా నిద్రలోకి జారుకుండాను.
నన్ను చూసి విద్వాన్ చదవడానికి ఇంకా కొందరు..
ఎండాకాలం సెలవులు అయిపోయినాయి. నేను తిరుపతికి బయలుదేరల్లని హెడ్మాస్టర్ గారిని కలవడానికి శింగనమలకు పోయినాను. నన్ను చూసి మా సార్ నా క్లాస్‌మీట్ రామలక్ష్మిని వాళ్ళ నాయన లగిశెట్టి సీనయ్యను ఈ సంవత్సరమే ఎస్ఎస్ఎసీ పాసైన బోయ సన్నప్పను ఇంటి దగ్గరికి పిలిపించినాడు. తిరుపతి ఓరియంటల్ కాలేజీ విషయాలు, విద్వాన్ కోర్సు లగువూ బిగువులు, స్టైఫండ్ విషయాలు అడిగింది రామలక్ష్మి. అన్నీ చెప్పినాను. వ్యాకరణము, చందస్సు, అలంకారాలు బాగా చదవల్లని బిఏ డిగ్రీలో ఉండే తెలుగు పాఠాలకు విద్వాన్ కోర్సులో చదివే సాహిత్యానికి ఏనుగుకూ దోమకూ ఉన్నంత తేడా అని చెప్పినాను. సీనయ్య శెట్టి రకరకాల డౌట్స్ అడిగినాడు. అన్నీ వివరించినాను. రామలక్ష్మి, సన్నప్ప ఇద్దరూ విద్వాన్ కోర్సులో చేరడానికి సిద్ధపడినారు.
వాళ్ళిద్దరికీ పాఠ్య విషయాల్లో సహాయ సహకారాలన్నీ అందించల్లని, నువ్వుండావన్న ధైర్యంతోనే వీళ్లిద్దరూ విద్వాన్ చదవడానికి తిరుపతికి వస్తా ఉండారని హెడ్మాష్టర్ సార్ నాకు గట్టిగా చెప్పినాడు. రామలక్ష్మి వాళ్ళ నాయన సీనయ్య చాలా ప్రాధేయ పూర్వకంగా అడిగినాడు. సన్నప్ప వాళ్లన్న బాలప్ప, నా చేతులు పట్టుకొని, నారాయణా, నా తమ్ముడు నీకు తమ్ముడనుకో, మావాడు నీ రూములో నీ దగ్గరే ఉంటే వానికి ధైర్యం వస్తాది. మాకు దిగులుండదు అని అభ్యర్థించినాడు. నేను సరే అన్నాను. నా భరోసాతో వాళ్లు పోయినారు. నన్ను ఇంటి దగ్గరే కాసేపు ఉండమని చెప్పి సార్, పోస్ట్‌మాస్టర్ సుబ్రహ్మణ్యం దగ్గరికి పోయినాడు.
జయమ్మక్క నాకు కాఫీ ఇచ్చి మాట్లాడుతా, ‘నారాయణా చూస్తా ఉంటే ఆ పిల్ల, నేరుగా నీ రూముకే వచ్చేటట్లుంది రా! జాగ్రత్త! అది అసాధ్యురాలు! మీ సార్ దగ్గరే వగల చేష్టలు చేస్తా ఉంటాది. నువ్వు ఆ పిల్లకు చనువియ్యద్దు! చదువు విషయంలో ఏమైనా సందేహాలు అడగడానికి వస్తే, కాలేజీలోనే చెప్పు! నీ రూము వరకు రానిచ్చుకోవద్దు!’ అని జాగ్రత్తలు చెప్పింది. “రూము వరకు ఎందుకు రానిచ్చుకుంటానక్కా? ఏదున్నా కాలేజీ ప్రిమిసెస్ లోనే మాట్లాడుతాను. ఎట్టి పరిస్థితుల్లోనా రామలక్ష్మికి చనువు ఇవ్వనని మీకు మాటిస్తున్నానక్కా” అని గట్టిగా చెప్పినాను.
గురువుగారు ఇంటికి వచ్చినంక ఇద్దరితోనా చెప్పి మా పల్లెకు బయలుదేరినాను. బీటి మళ్లల్లోని సీల్దావలో నడుస్తా ఉంటే రామలక్ష్మీ, వాళ్ల నాయనా మనసులో మెదిగిలినారు.
రామలక్ష్మి ఎస్ఎస్ఎల్‌సి వరకు హై స్కూల్లో నా క్లాస్‌మీట్. బాగానే ఉంటాది చూడ్డానికి. కొంచెం ఎల్లు పండ్లు. క్లాసులో ఉమావతి మాదిరి డిగ్నిఫైడ్‌గా ఉండేది కాదు. క్యారెక్టర్ ఎటువంటిదో నాకు తెలియదు. అయినా జయమ్మక్క చెప్పినంత చీప్ బిహేవియర్ కాదనిపిస్తుంది. ఆమె, సీనయ్య ఉంపుడుగత్తె బిడ్డ అయినందుకు జయమ్మక్క ఆ విధంగా ఆలోచన చేసిందేమో! వాళ్లమ్మ సీనయ్యకు ఉంపుడుగత్తె అయినంత మాత్రాన ఆమె కూతుర్ని గురించి తప్పుగా ఎందుకు ఆలోచించల్ల? సీనయ్య గుడకా పెద్ద షావుకారే కాదు, మనసున్న పెద్ద మనిషని బాబు నాతో చాలా సార్లు చెప్పినాడు.
సీనయ్య శెట్టి ఒక రకంగా చూస్తే మంచివాడే అనిపిస్తుంది. శింగనమలలో అందరి పైకీ అతడే పెద్ద షావుకారి అని, పెద్ద భూస్వామి అయినా రైతుల పట్ల, తమ కౌలు దారుల పట్ల సానుభూతి ఉండే మనిషని అందరూ అంటారు. అయితే కొంతమంది, భార్యను పెట్టుకొని మరొక ఆడ మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్న శెట్టి అని, మా లక్ష్మిదేవి లాంటోళ్లు మూతి తిప్పుతారు కానీ ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదనిపిస్తుంది. ఉంచుకున్న ఆమె భోగమోళ్ల ఇంటి మనిషైనా అతనెప్పుడూ ఆమెను ఉంపుడుగత్తెగా భావించలేదంట! ఆమె పేరు అలివేలమ్మంట! ఆమెకు పెండ్లి కాక ముందు నుంచే ఈ సీనయ్యతో సంబంధం ఉందంట!అది తెలిసి కూడా ఆమె తల్లిదండ్రులు ఆమెను వేరే ఊరికిచ్చి పెళ్లి చేసినారంట! అయితే, అలివేలమ్మ, మనసును చంపుకొని మొగునితో కాపురం చేయలేక, సీనయ్య మీదున్న ప్రేమ కంటే అపారమైన నమ్మకంతో ఈయన దగ్గరికి వచ్చి చేరుకుందంట! జరిగిన ఈ పరిణామాలన్నీ ఆమె పుట్టినింటోళ్లు గాని మెట్టినింటోళ్లు గాని ఎవురూ ప్రతిఘటించనూ లేదంట, తప్పు పట్టనూ లేదంట! భర్తను వొదిలేసి వచ్చిన అలివేలమ్మను మంచి మనసుతో సీనయ్య శెట్టి ఆహ్వానించినాడంట! ఎంత మంచి మనుషులు వాళ్లు! మా ఊర్లో రెడ్డి బిడ్డ కురవకొండన్నతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఎంత గొడవ జరిగింది! ఊరికి ఎంత చెడ్డ పేరొచ్చింది! ఇరువైపుల వాళ్లూ ఆడమనిషి మనసును అర్థం చేసుకొని దురహంకారంతో పట్టింపులకు పోకుంటే, పట్టువిడుపులు ఉంటే ఎంత బాగుంటాది! ఏ గొడవలూ ఉండవు కదా! అలివేలమ్మ సీనయ్య దగ్గరకు వచ్చినంక పదకొండు మంది పిల్లల్ని కనిందంట! అంతమంది పిల్లల్ని కనడం, ఆమె ఆరోగ్యపరంగా కుటుంబ నియంత్రణ దృష్ట్యా తప్పే కావచ్చు! కానీ ఆ దంపతుల ప్రేమ ఎంత బలమైనది! సీనయ్య మొదటి భార్యకు సంతానం కలగని కారణంగానే ఇదంతా అనుకున్న్యా, మానవీయ కోణంలో అతడు మంచి కుటుంబ విలువలున్న మనిషే కదా! అటువంటి మనిషి కూతురు రామలక్ష్మి చదువు విషయంలో ఆమెకు నేను సహకరిస్తే తప్పేముంది?
ఆలోచిస్తా ఇల్లు చేరుకుండాను. రేపే నా తిరుపతి ప్రయాణం అని తెలిసి అమ్మయ్య నాకు కావలసినవన్నీ సర్దసాగింది.
***
నేనూ నారాయణస్వామీ ఈసారి తిరుపతి తీర్థకట్ట వీధిలో రూము తీసుకుండాం. బండ్ల వీధి రూము కంటే చాలా పెద్ద రూమ్. నలుగురం ఉంటామని చెప్పడం వల్ల బాడుగ 12 రూపాయలకు తక్కువ ఇవ్వనన్నాడు ఓనర్. అయినా అనుకూలంగా బాగా ఉందని ఒప్పుకుండాం. ఆ తర్వాత నాలుగు దినాలకే శింగనమల నుంచి సన్నప్ప వచ్చి మాతో జాయిన్ అయినాడు. ఆ తర్వాత శింగమనేని వాళ్ల ఊరబ్బాయి ఓబులేసును సింగమనేని చెప్పడంతో చేర్చుకుండాం. చేరేటప్పుడే వాళ్లిద్దరికీ మా కండిషన్స్ చెప్పినాం. వాళ్లు ఇష్టంగా అంగీకరించినారు.
మా ఓరియంటల్ కాలేజీలో సన్నప్ప చేరేనాడే నా క్లాస్‌మేట్ రామలక్ష్మి గుడకా చేరింది. అడ్మిషన్ విషయంలో వాళ్లిద్దరికీ నా వంతుగా సహాయపడినాను. మా బ్యాచ్ లోనే వేరే సెక్షన్లో ఉన్న లక్ష్మీదేవికీ జనాభాయికీ రామలక్ష్మిని పరిచయం చేసినాను. లక్ష్మీదేవి తన రూములో చేర్చుకుంటానన్నది. లక్ష్మీదేవిది మా ప్రాంతమే, వజ్రకరూరు దగ్గర ఎద్దులపల్లి. వారం రోజులైన తరువాత కాలేజీలో రామలక్ష్మి నన్ను కలుసుకొని, తన రూమ్ మీట్ లక్ష్మీదేవి కోసరం ఎవురెవరో మగ పిల్లలు వస్తా వుంటారని, అది తనకు ఇబ్బందిగా ఉందని, జనాభాయి ఇంకా ఓవర్ అని, ఇద్దరికీ తాము కాలేజీలో అందరికంటే అందగత్తెలమన్న పొగరుందని, తనతో ఫ్రెండ్లీగా ఉండరని బాధపడతా చెప్పింది. దానికి నేనేమి చేయగలను? అర్థం కాలేదు. “అమ్మాయిలు ఎవరు ఏ విధంగా ఉంటారో, వాళ్ల మనస్తత్వాలేమిటో నాకు తెలియవు కదా, నువ్వే నీ అభిరుచికి తగిన అమ్మాయిలతో స్నేహం చేసి వాళ్లతో కలిసి ఉండడం మంచిది రామలక్ష్మీ! ఎవురితో కలిసి ఉండాలో అది నువ్వు నిర్ణయించుకోవల్సిందే!” అని స్పష్టంగా చెప్పి, నా నిస్సహాయతను వ్యక్తం చేసినాను.
ఆమె ఉత్తరం నాలో కసి పెంచింది!
కాలేజిలో పాఠాలు బాగా జరుగుతా ఉండాయి. బాలవ్యాకరణం పూర్తి కంఠస్థం చేసినాను. ప్రౌఢవ్యాకరణం గుడకా సగం వరకు నేర్చుకుండాను. చందస్సు యొక్క సౌందర్యాన్ని, యతిప్రాసల భేదరూపాలను, ప్రయోజనాలను తెలుసుకొని సొంత పద్యాలలో వాటిని సాధన చేయసాగినాను. అట్లే అలంకారాల రకాలను, కొన్ని అలంకారాల బహు రూప భేదాలను అర్థం చేసుకోసాగినాను.
రామలక్ష్మి మళ్లీ ఒకసారి కాలేజీలో కలుసుకొని బాలవ్యాకరణం సంధి పరిచ్ఛేదంలో చాలా సూత్రాలు అర్థం కాలేదని వివరణ కోరింది. అది నాకు తేలికైన అంశం కాబట్టి రోజూ కొన్ని సూత్రాలను వివరించ సాగినాను. నేను వివరిస్తా ఉన్నప్పుడు ఆమె మనస్సు వ్యాకరణ సూత్రాల మీద కాకుండా నన్ను చూస్తా వగలు పోతా ఉండడం గమనించినాను. ఆమె ఆకలి చూపులను అర్థం చేసుకుండాను. ఒకటి రెండు సార్లు శరీరంలో ఏదో పారాడింది. జయమ్మక్కకు మాట ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి వెంటనే మనసును కంట్రోల్ చేసుకొని, సీరియస్‌గా దృష్టి సారిస్తే తప్ప సంధి సూత్రాలు కొన్ని అర్థం కావని, ఆమెను పాఠంలోకి మళ్లించి సంధులను వివరించినాను.
నిన్న సడన్‌గా రామలక్ష్మి, ఉమావతి ప్రస్తావన తెచ్చింది. ఉమావతి ఇక్కడే పద్మావతి మహిళా కాలేజిలో చదువుతా ఉందని, వేసవి సెలవుల్లో శింగనమల సింగ్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు తనతో చెప్పిందని అంటా ‘నువ్వు ఎప్పుడైనా కలుసుకుండావా నారాయణా? కలుసుకొని ఉంటావు లే’ అని అదొక రకంగా చూస్తా అడిగింది. నాకు ఆమె వ్యంగ్యంగా మాట్లాడిన తీరు, ఆ మాటల్లో దాగిన ఈర్ష్య, ఎత్తిపొడుపు అర్థమయినాయి.
‘అవునా? ఉమావతి ఇక్కడ చదువుతావుందా? నాకు తెలియనే తెలియదే!’ అని కొంచెం ఆసక్తిగా అన్న్యాను. వెంటనే, ఆ విధంగా నా ఆసక్తిని వ్యక్తం చేయకుండా, మామూలుగా అనాసక్తిగా, ఏమో నాకు తెలియదే అని ఉంటే బాగుండేదని అనుకుండాను. రామలక్ష్మి నా ఆసక్తిని పసిగట్టిందేమో, ‘ఇప్పుడు బీఎస్సీ సెకండియర్ చదువుతావుంది. రేపు నేను వాళ్ల కాలేజీకి పోవల్లనుకుంటా ఉండాను. ఇద్దరమూ వెళ్లొస్తాం రా నారాయణా’ అని నన్ను రమ్మనంది రామలక్ష్మి. నేను ఒక క్షణం ఆలోచన చేసి ‘లేదులే రామలక్ష్మీ, నాకు రేపు వేరే పని ఉంది’ అని అబద్ధం చెప్పినాను. ఆమె సరే అని వాళ్ళ క్లాసులోకి వెళ్లిపోయింది.
ఉమావతి ఇక్కడే చదువుతా ఉందని తెలిసినప్పటి నుంచి ఏదో చెప్పలేని ఉద్వేగం పెరగసాగింది. రామలక్ష్మితో పాటు పోయి చూసొస్తే బాగుంటుంది కదా, ఎట్లుందో ఏమో ఒకసారి పలకరిస్తే తప్పేముంది? అయినా రామలక్ష్మీ వెంట పోతే ఏం బాగుంటాది! ఆమె ఏమైనా నా గురించి చెడ్డగా అనుకుంటాదేమో!
మనసులో రకరకాల ప్రశ్నలు సందేహాలు మొదలయినాయి. చివరికి రామలక్ష్మి వెంట పోగూడదనుకుండాను. రామలక్ష్మి పోయి మాటల సందర్భంలో నా గురించి ప్రస్తావించకుండా ఉంటుందా? ప్రస్తావించినప్పుడు ఉమావతి ఏమంటుందో? ఏ విధంగా రియాక్ట్ అవుతుందో? తెలుసుకోవల్ల. తెలుసుకున్న తర్వాతనే,పోవడమా వద్దా అని నిర్ణయించుకోవడం మంచిదని నిశ్చయించుకుండాను. అయినా రోజంతా మనసు నిండా ఉమావతే నిండిపోయింది.
తెల్లారింది. రాత్రి అయింది. మళ్ళీ తెల్లారింది. రామలక్ష్మి ఉమావతి దగ్గరికి వెళ్లొచ్చి ఉంటాది. నా గురించి తప్పకుండా చెప్పి ఉంటాది. చెప్పినప్పుడు ఉమామతి ఏం మాట్లాడిందో! ఎస్ఎస్ఎల్సీలో నా మీదున్న ఒక రకమైన ఇష్టాన్నీ స్నేహాన్నీ అట్లే ఉంచుకోనుంటుందా? ఏమో! రామలక్ష్మితో మాట్లాడితే తెలుస్తాది అనుకుంటా, మనసు రామలక్ష్మిని కలుసుకోవడానికి తొందరపడసాగింది. ఇంటర్వెల్లు సమయంలో రామలక్ష్మిని కలుసుకొని మాట్లాడుతా అడిగినాను.
‘మాటల సందర్భంలో నీ పేరు ప్రస్తావించి విద్వాన్ సెకండియర్ చదువుతున్నాడని చెప్పినాను నారాయణా! అవునా అని అంతకుమించి ఉమావతి ఏమీ మాట్లాడలేదు’ అని చెప్పి క్లాసుకు వెళ్లిపోయింది రామలక్ష్మి. అది విన్నప్పటి నుంచి మనసు నిరాశపడతా కొంచెం అవమానంగా ఫీల్ అయింది. రెండు దినాలు తర్కించుకొని, ఒక ఉత్తరం రాసి కవర్లో పెట్టి పోస్ట్ చేసినాను. ఉత్తరం రాసేటప్పుడు, కవర్ని తపాలా పెట్టెలో వేసేటప్పుడు ఎందుకో చేతులు కొంచెం వొణికినాయి. గుండె వేగంగా కొట్టుకుంది. కవర్ పోస్ట్ చేసినప్పటి నుంచి, ఉమావతి రిప్లై ఇస్తుందా లేకుంటే ఉత్తరం చదివి చించిపడేస్తుందా అని మనసు రకరకాలుగా ఆలోచించ సాగింది. ఐదో దినమే ఉమాపతి నుంచి రిప్లై లెటర్ వచ్చింది. చదివి మనసు వికలమయిపోయింది. శరీరం నిండా ఏదో చెప్పలేని వికారం నిండుకుంది.
నేను రాసింది లవ్ లెటర్ కాదే! హై స్కూల్ చదివే రోజుల్లో కొన్ని సందర్భాలను పేర్కొని గొప్ప సంస్కారవంతురాలైన నువ్వు నా స్నేహితురాలు కావడం నేను గర్వంగా భావిస్తున్నాను. నీ చల్లని హృదయంలో పేదవాన్నైన నాకు ఒకింత స్థానం దక్కడం అది నా అదృష్టం అని మురిసిపోతుంటాను. నువ్వు అనుమతిస్తే వచ్చి నిన్ను చూడాలని నాలుగు మాటలు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇంతే కదా నేను రాసింది! ఆ మాటలు తనను నొప్పించి ఉంటే ఆ ఉత్తరాన్ని చించిపడేసి తాను మౌనంగా ఉండొచ్చు కదా! లేదా నాకు అటువంటి ఆలోచన లేదు, ఇంకెప్పుడూ నాకు ఉత్తరం రాయొద్దు అని రెండే రెండు మాటల్లో తన అభిప్రాయాన్ని తెలపొచ్చు కదా! ‘పేదవానివని జాలి చూపితే అది ప్రేమ అనుకున్నావా? నీ అంతస్తు ఏమిటి నా అంతస్తు ఏమిటి? నన్ను ప్రేమించేంతటివానివా నువ్వు? నీ వంటి వాని మీద జాలి చూపడం నాదే పొరపాటు. పేదవానివని జాలి చూపితే అది నా హృదయంలో నీకు స్థానం ఉందని అనుకోవడం నీ భ్రమ. నీ అవివేకం. సంస్కారవంతునివైతే ఇంకెప్పుడూ నాకు ఉత్తరం రాయవద్దు.’
ఉమావతి ఉత్తరం నాలో వినిపించని అలజడిని రేపి నన్ను మూగవాన్ని చేసింది. అందులోని ప్రతి అక్షరమూ నన్ను వెక్కిరించసాగింది. నన్ను నేను అసహ్యించుకోసాగినాను. నన్ను నేను నిందించుకుండాను. వెంకటసత్యం బాబు వంటి మిత్రులకు లేని స్త్రీ వ్యామోహం తనకే ఎందుకని ప్రశ్నించుకుండాను. నాది వ్యామోహమా ప్రేమా అని తర్కించుకుండాను. నాది వ్యామోహం కాదు, ప్రేమే అని నాకు నేనే జవాబు చెప్పుకుండాను. తొండపాడు తిర్ణాలలో కనిపించిన సుంకులు, ఆదోనిలో ఒకరోజు పరిచయమైన మీనాక్షి వాళ్లిద్దరిపైన తనకు కలిగింది ప్రేమా వ్యామోహమా అని నన్ను నేనే ప్రశ్నించుకొని నా ప్రశ్నకు జవాబేది చెప్పుకోలేక నలిగిపోయినాను. స్త్రీ ప్రేమను పొందడానికీ వ్యామోహం చల్లార్చుకోవడానికీ రెండింటికీ అర్హత లేని నేను అనవసరంగా ఎందుకు తపన చెంది, విలువైన కాలాన్ని వృథా చేసుకోడం?
ఒక వారం రోజులు రకరకాల ప్రశ్నలతో అర్థరహితమైన జవాబులతో అంతులేని ఆలోచనలతో విపరీతమైన సంఘర్షణకు లోనై చివరికి గుండె నిబ్బరం చేసుకొని ఆత్మపరిశీలన చేసుకుండాను. నన్ను నేను చూసుకుండాను. మా కుటుంబాన్ని, నా బాల్యాన్ని, పస్తులున్న దినాలను, పుట్టిన ఊరులో బతకడం కోసం తల్లిదండ్రులు నేను పొందిన అవమానాలను, అవమానం పొందిన చోటనే నిటారుగా గౌరవంగా గర్వంగా నిలబడల్లని చిన్నప్పుడే మనసులో నిర్ణయించుకున్న పట్టుదలను, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను, వాళ్లు నా మీద పెంచుకున్న ఆశలను, గురువుగారి ఆశయాన్ని అన్నీ గుర్తుకు తెచ్చుకుండాను. అవన్నీ గుర్తుకు రాగానే చదువుపట్ల మరింత కసి పెరిగింది. పళ్లు బిగుసుకుండాయి. మనసులో పంతం పెరిగింది. మా ఊరోళ్లకు,నేను మనసులో ఆరాధించిన ఉమావతికి,అందరికీ నా చదువు, నా ఉద్యోగ జీవితం ద్వారానే నేనేమిటో నిరూపించాలన్న పట్టుదలను కసిని మనసు నిండా నింపుకుండాను. ఆ కసితోనే ఒకవైపు చదువుతా మరొకవైపు అష్టావధానిగా పేరు తెచ్చుకోవల్లని, జాతి పద్య ఛందస్సును ఉపజాతి పద్య ఛందస్సును సాధన చేయడానికి పూనుకుండాను. కథా రచయితగానో నవలా రచయితగానో రూపొందల్లని నిశ్చయించుకుండాను.
ఒత్తిడి, ఆందోళనలతో అట్ల జరుగుతుందా?
ఎంతో ఆసక్తితో ఇష్టంగా ఒక వైపు కావ్యాలను చదువుతా ,ఇంకొకవైపు పద్యరచనకు పూనుకుండాను. నాలుగైదు నెలలకల్లా ఏడెనిమిది సాధారణ చందస్సులలో పద్యాలను అల్లసాగినాను. నిమిషానికి ఒక పద్యం చెప్పగలనన్న ధైర్యం క్రమంగా పెరగసాగింది. లేమితనం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు మరిచిపోతా కాలేజీకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, ఆమె నడక పైన, చకచకాలాడే జడ పైన, మేని ఒంపు సొంపుల పైన మూడు నాలుగు పద్యాలు తయారు కాసాగినాయి. దయనీయంగా భిక్షాటనం చేస్తున్న ముసలి వాళ్లో పసిపిల్లలో కనిపించినప్పుడు హృదయం ద్రవీభవించి సునాయాసంగా పద్యాలు పెల్లుబక సాగినాయి. శివగౌడు తోడయినప్పుడు వాడొక పాదం నేనొక పాదం క్షణాల్లో అల్లుతా పోసాగినాం. శివగౌడు గుడకా నామాదిరే నిరంతరం శృంగారాభిలాషి. అయితే నా కన్నా పొట్టివాడు. అయినా చాలా అందగాడు. చక్కని కన్నులూ ముక్కూ పలువరసా వానివయితే అవేవీ సరిగా లేని దురదృష్టం జాతకున్ని నేను. అందుకే పద్య రచన, అష్టావధాన కళల్లో ప్రతిభనూ అభినవేశాన్నీ చాటుకొని స్త్రీని ఆకర్షించుకోవల్లని అంతరంగంలో ఎక్కడో బలమైన ఆకాంక్ష నాలో పెరగసాగింది.
అటువంటి సమయంలో ఒకరోజు మా కాలేజీలో పద్య కవిత్వ పోటీలు పెట్టి పాల్గొనదలచిన వాళ్లు పేర్లు ఇవ్వాల్లన్నారు. నేను ఉత్సాహంతో నా పేరు ఇచ్చినాను. ఆచారి, శివగౌడు, శివరామరాజు ఇంకా ఇరవై మంది తమ పేర్లు ఇచ్చినారు. ఏ విషయం పైన పద్యాలు రాయాళ్లని అడిగినాను. విషయం ముందుగా చెప్పము, నాలుగు నిమిషాలు ముందు మాత్రమే విషయం ప్రకటిస్తామని నిర్వాహకులు తెలియజేసినారు. పోటీ పడుతున్న వాళ్లందరమూ హాల్లో కూర్చుండాం, ప్యాడ్ మీద తెల్ల కాగితం పట్టుకొని. అచ్చన్న శాస్త్రి సార్ హాల్లోకి వచ్చి మీ ఇష్ట దైవాన్ని గురించి తొమ్మిది పద్యాలకు తక్కువ కాకుండా ఒక గంట లోపల వ్రాయాలి అని చెప్పి నాలుగు నిమిషాలయిన తర్వాత ప్రారంభించమన్నాడు. కవిత్వానికి ఇచ్చిన అంశం నాకు నచ్చలేదు. పద్యరచన చేస్తున్న వాళ్లందరూ తమ ఇష్ట దైవం పైన పద్యాలు తమ శైలిలో రాసే ఉంటారు. వాటిని ఎత్తి రాయడమే కదా ఇది! ఆశు కవిత్వ పోటీ ఎట్ల యితాది అని ప్రశ్నించల్లనుకుండాను. ఎవురికీ లేని బాధ తనకే ఎందుకని పద్యాలు రాయడానికి పూనుకుండాను.
కొన్నాళ్ల కిందట శ్రీరామచంద్రుని పైన మనసులో అల్లుకున్న మూడు పద్యాలను మొదట రాసి నాలుగవ పద్యం రాయడానికి మొదలుపెట్టి 20 నిమిషాలలో నాలుగు పద్యాలు రాసినాను. ఆ తరువాత మంచి భావంతో దార దొర్లలేదు. టైం గడిచిపోతావుండడంతో ఆందోళన కలగసాగింది. ఇతరుల కంటే పద్యాలు బాగా రాయల్లన్న ఆలోచనతో మనసులో ఒత్తిడి పెరిగింది. దాదాపు పదైదు పద్యాలు రాయల్లని బలంగా అనుకొని అర్థవంతంగా రాస్తానో లేదోనని ఆందోళన చెందుతా భయపడ సాగినాను. దాంతో యూరిన్ వచ్చినట్లయింది. సార్‌ను అడిగి బాత్రూముకు పోయినాను. యూరిన్ రాలేదు. లోపల నిక్కరంతా వీర్య స్కలనంతో తడిసిపోయింది. అదంతా ప్యాంటుకు అంటుకుంది. ఛీ ఛీ అనుకుంటా, కర్చీఫ్ తో దాన్నంతా తుడుచుకొని వచ్చి కూర్చుంమడాను. అతి కష్టం పైన 12 పద్యాలు రాసి, పేపర్ అచ్చన్నశాస్త్రి గారికిచ్చి బయటికొచ్చి, మిత్రుడు స్వామితో చెప్పి అడిగినాను.
ఎందుకంత టెన్షన్ పడినావు? ఒక గంటలో తొమ్మిది పద్యాలు రాయడం నీకు కష్టమా? అనవసరమైన ఆందోళనతో భయపడినట్లుండావు. అందుకే అట్ల అయ్యుంటుంది. లేదా కాలు మీద కాలు వేసుకుని కాలును అల్లాడించినందువల్ల అవుట్ అయి ఉంటుందేమో అని కారణాన్ని ఊహించినాడు. ఆందోళనతో భయపడితే కూడా వీర్యస్ఖలనం జరుగుతుందా? బహుశా అందుకే అయిందేమో! క్లాసులో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఎన్నోసార్లు కాలు అల్లాడిస్తా ఉంటానే!అప్పుడెప్పుడూ స్ఖలనం కాలేదే? అనుమానం లేదు, భయాందోళన వల్లనే ఇట్ల అయగయుంటుందని నిశ్చయించుకుండాను. జరిగిందేదో జరిగింది గాని ఆ పోటీలో ప్రథమ బహుమతి రాలేదు. ద్వితీయ బహుమతి వచ్చినందుకు ఊరట చెందినాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
