[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
నా సహ విద్యార్థుల మధ్య అష్టావధాన సాధన!
తీర్థకట్ట వీధిలో మేమున్న ఇంటిపైన నాలుగు రూములలో అందరూ మా ఓరియంటల్ కాలేజీ విద్యార్థులే! రెండు వారాలకు ఒకసారి నా క్లాస్మీట్సును, కొంచెం పద్య రచన పైన చందస్సు పైన పట్టున్న మిత్రులను మా రూముకు పిలిపించుకొని అష్టావధానాలు చేయడం మొదలు పెట్టినాను. నా సాధనను బలపరుస్తా వెంకటశివగౌడ్ వీరభద్రాచారి వచ్చేవాళ్లు. వాళ్లు కూడా నా మాదిరిగానే అష్టావధాన సాధన చేస్తా ఉండారు.
దసరా సెలవులు అయిపోయినంక మొట్టమొదట తీర్థకట్టవీధిలో మా రూములో ఒక ఆదివారం నన్ను అష్టావధానం చేయమని రూములో నా జూనియర్ మిత్రులు, నారాయణస్వామీ కోరినారు. నేను సరే అని అంగీకరించి మిత్రులు శివగౌడ్, వీరభద్రాచారి, నందవరం కేశవరెడ్డి, బాబు ప్రకాష్, జ్ఞానచంద్ర లను విషయం చెప్పి, మా రూముకు ఆహ్వానించినాను. మా జిల్లావాళ్లు మా బ్యాచ్ విద్వాన్లో దాదాపు 20 మంది ఉండారు. వాళ్లందరినీ ఆహ్వానించినాను. శివరామరాజు, శివగౌడు, వీరభద్రారి, మిత్రులతో వేరువేరుగా మాట్లాడి నా అష్టావధానానికి ఎనిమిది మంది పృచ్ఛకులను ఏర్పాటు చేసినారు. శివరామరాజు అధ్యక్షునిగా కూర్చుండాడు. శివగౌడ్ నిషేధాక్షరి, ఆచారి సమస్య, జ్ఞానచంద్ర దత్తపది, స్వామి వర్ణన, కేశవరెడ్డి న్యస్తాక్షరి, షరీఫ్ ఖాన్ అధికప్రసంగం, బాబు ప్రకాష్ న్యస్తాక్షరి, సన్నప్ప గంటలు, అట్లా ఎనిమిది మంది పృచ్ఛకులుగా కూర్చుండారు. శివరామరాజు అధ్యక్షునిగా అష్టావధానాన్ని సూక్ష్మంగా వివరించి శుభాకాంక్షలు తెలిపినాడు. మూడు గంటలలో అవధానం ముగించినాను. కొంతమంది పరవాలేదని, కొంతమంది అద్భుతం అని, ఇది ఇంకా తొలి ప్రయత్నమే కాబట్టి ముందు ముందు చక్కగా అవధానం చేయగలవని గౌడ్ ఆచారి తమ తమ అభిప్రాయాలను తెలిపినారు. అద్భుతమైన ధార అని, ధారణ ఇంకా బలపడాలని మరికొందరన్నారు. మాకు తెలియదు, ఒక సంవత్సర కాలంలోనే యతిప్రాసల దోషాలు లేకుండా పద్యాలల్లడం ఎట్ల నేర్చుకున్నావని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసినారు.
సాయంకాలం ఏడు గంటలయింది. మా సన్నప్ప శివగౌడు కలిసి అందరికీ టీ బిస్కెట్స్ ఏర్పాటు చేసినారు. అదయిన తర్వాత నెక్స్టు శివగౌడ్ అష్టావధానానికి అందర్నీ ఆహ్వానించినాడు. సరే అని అందరూ వెళ్ళిపోయినారు. మిత్రుడు నారాయణ స్వామి సలహా ఇస్తా కొంచెం భయపడినట్లుంది నారాయణా, నువ్వు నిర్భయంగా చేయగలిగితే బాగా చేయగలవు. పద్యం రాగయుక్తంగా చెప్పడం చాలా బాగుంది. మిత్రునిగా తొలి అవధానమే విజయవంతంగా చేయడం మిత్రునిగా నేను గర్వపడతా ఉండాను అని తన సంతృప్తిని వ్యక్తం చేసినాడు. నేను అవధానంలో అల్లిన పద్యాలు మిత్రులకు గొప్పగా అనిపించినా నాకు తృప్తిగా లేవని, ఇంకా మంచి శైలితో పద్యాలు అల్లాలని, నిరంతరం సాధన చేయాలని నిర్ణయించుకొని రూమ్ మిత్రుల సహకారానికి ధన్యవాదాలు తెలిపి గురువుగారికి విషయం తెలుపుతా ఉత్తరం రాసినాను. ప్లాన్ వేసుకుంటున్న నవలలను రాయడానికి మొదలుపెట్టినాను.
ఆమె గుడికి వస్తుందేమో అని సందేహిస్తూ..
విద్వాన్ ఫస్టియర్ అయిపోయినంక వేసవి సెలవులు వదిలేటప్పుడు ఇచ్చిన స్టయిఫండ్‌లో, నేను అమ్మయ్య దగ్గర దాచి పెట్టింది 80 రూపాయలే! తిరుపతికి వచ్చి రెండో సంవత్సరంలో చేరే నాటికి అందులో నా దగ్గర మిగిలింది 60 రూపాయలే! ఈసారి దసరా సెలవులకు ఊరికి పోగూడదని, బియ్యము, చింతతొక్కు, చిట్లంపొడులు ఎక్కువగానే తెచ్చుకుండాను. అయితే రూము బాడుగ, స్టౌలోకి కిరసనాలు, టూత్ పేస్టు, బట్టల ఇస్త్రీ, అప్పుడప్పుడు హోటల్నుంచి కర్రీసు, పుస్తకాలు,తప్పని పరిస్థితులలో కాఫీ టీలు ఇటువంటి దాండ్లకంతా ఖర్చులు ఉంటాయని దగ్గరున్న డబ్బును జాగ్రత్తగా వాడుకోసాగినాను. ఎంత జాగ్రత్తగా వాడుకున్నా మూడు నెలలకంతా చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సన్నప్పతో, నారాయణస్వామితో చేబదులు పది రూపాయలు ఇప్పించుకొని, హెడ్మాస్టర్ సారుకు జాబు రాసినాను, ఒక 30 రూపాయలు పంపమని. ఈ సంవత్సరంలో డబ్బులు పంపమని రాయడం ఇదే మొదటిసారి కాబట్టి తప్పకుండా పంపుతాడని ఆశతో ఎదురు చూస్తావుండాను.
మా రూములోకొచ్చి చేరిన సన్నప్ప ఆర్థిక స్థితిగతులను గమనించిన తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది. అవసరమైతే ఆ పిల్లోడు సర్దుకుంటాడని ఊరట చెందినాను. మాలో వాళ్ల కుటుంబం కొంచెం జరుగుబాటు న్న కుటుంబం అని తెలుసుకుండాను. ఆ పిల్లోడు గుడకా మంచి సౌమ్యుడని, ఏ దురలవాట్లు లేవని ఎంతో వినయశీలి అని అర్థం చేసుకుండాను. దాదాపు ఓబిలేసు గుడకా అటువంటి వాడే! వాళ్ల బండమీద పల్లిలో మంగళ వృత్తితో పాటు భూమీ బుట్రా ఉన్నవాళ్లే అని సంతోషపడినాను. నా మీద ఎంతో గౌరవం కలిగిన ఆ పిల్లలిద్దరూ వాళ్లే ముగబడి వంట చేయడం, రూమును శుభ్రపరచడం నాకెంతో ఊరట కలిగించింది. అయితే నిరంతరం వాళ్లే వంటపని చేయడం నాకిష్టం ఉండదు. అందుకే ఒక్కొక్కసారి వాళ్లను మందలించి వంట చేస్తాను. వాళ్లు నన్నూ స్వామినీ ఎప్పుడూ ఫ్రెండ్స్‌గా భావించరు. నేనెప్పుడూ వాళ్లకు గౌరవనీయమైన అన్ననే! అందుకే ఎక్కడికి పోవాలన్నా అడిగి పోతారు.
రూము వరకు నాకు సౌకర్యం గానే ఉంది. ఎంత అనుకూలంగా ఉన్నా నా అవసరాలన్నింటికీ దుడ్లు కావాల్సిందే కదా! ప్రతిదానికీ వాళ్లు దుడ్లు ఖర్చుపెడతా ఉంటే పెడతారులే పెట్టనీలే అని నేనేమీ తెలియనట్లు ఉండలేను కదా! మధ్యాహ్నం పూట హోటల్ నుంచి వాళ్లు పప్పు సాంబారు రసము పెరుగు తెప్పిస్తా ఉంటే నేను నా వంతుగా కనీసం వారానికి ఒకసారి ఏదయినా తెప్పించకుండా దొబ్బి తినుకుంటా ఉండలేను కదా! నలుగురికీ అవన్నీ ఒక రోజయినా తెప్పించల్లని అనుకున్నా కనీసం ఒక రూపాయి అయినా కావల్ల కదా! ఆ ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేని నా దైన్య స్థితిని తలుచుకొని కుమిలి పోతాను. అట్లా కుమిలిపోయినప్పుడు మనసంతా వికలమైతాది!ఈ చదువెందుకనిపిస్తాది! ఒక్కొక్కసారి జీవితం పైనే విరక్తి పుడతాది!
హెడ్మాస్టర్ సార్ పది దినాలైనా దుడ్లు పంపలేదు. కాలం రోజురోజుకు బరువు కాసాగింది. చదువు మీద మనసు పోవడం లేదు. పద్యాలు రాయడానికి బుద్ధి పుట్టడం లేదు. ఈ దయనీయస్థితి నుంచి ఎట్ల బయటపడి చదువుకోవల్లనో అర్థం కావడం లేదు. సీరియస్‌గా ఆలోచన చేసినాను. ఆలోచనల్లో రామలక్ష్మి మెదిలింది. వాళ్ల నాయన లగిశెట్టి సీనయ్య పెద్ద షావుకారి. రామలక్ష్మికి డబ్బులతో కొదవ ఉండదు. నోరిడిసి అడిగితే ఆమె తప్పకుండా డబ్బు సర్దుతాది! తనుకు నేనంటే చాలా ఇష్టం! అయితే ఏమని అడిగేది? అడిగితే ఏం బాగుంటాది? ప్రేమను నటిస్తా, తనకు నేను సన్నిహితమైతే అడక్కపోయినా ఇవ్వగలదు. అట్ల నటించడం ఎంత అసహ్యం? ఆమెకు సన్నిహితమైతే చివరికి ఆ సాన్నిహిత్యం ఎంతవరకు పోతాదో? నా అవసరాల కోసరం రామలక్ష్మికి సన్నిహితమైతే నేను జయమ్మక్కకు ఇచ్చిన మాట తప్పినట్లే కదా! మాట తప్పడం కంటే పస్తు పండుకుండేది మేలు కదా!
రకరకాల ఆలోచనలతో గుండె బరువయ్యింది. అట్లే క్లాసులో కూర్చొని పరధ్యానంగా పాఠం వింటా ఉండాను. అంతలోనే ఇంటర్వెల్ బిల్లు కొట్టినారు. నేను దిగులు పడతా క్లాసులోనే కూర్చుండాను. సడన్‌గా రామలక్ష్మి వచ్చి పిలిచింది. నేను బయటకొచ్చి ఏమి రామలక్ష్మీ అని ప్రశ్నించినాను.
“నారాయణా, నేను ఆ లక్ష్మిదేవి వాళ్ళ రూములో ఉండలేను. ఎక్కడైనా వేరే రూము చూడప్పా! నువ్వూ సన్నప్పా మీ పక్కనే నాకు సపరేటుగా ఒక రూమ్ చూస్తే, నేనొక్కదాన్నే ఉంటాను. మీరు పక్కనుంటే నాకు భయం ఉండదు. కావలిస్తే మీ రూమ్ రెంట్ కూడా నేనే ఇస్తానులే!” అని బాధపడతా అడిగింది. ఆమె అట్లా అడగడంలో ఏదో ఇబ్బంది పడుతున్నట్లు నాకు అనిపించింది. నేను కొంచెం సేపు ఆలోచన చేసి సన్నప్పను అడిగి చెప్పుతానన్నాను. ఆమె వెళ్లిపోయింది.
నేను మూడో పిరియడ్ మధ్యలో బయటకు వచ్చి ఆకలిగా ఉంటే గోవిందరాజ స్వామి గుడి వైపు వెళ్ళినాను. వెళ్తా వెళ్తా, రామలక్ష్మి పొరపాటున నన్ను చూస్తాదేమోనని సందేహిస్తా, నమ్మాళ్వారు గుడి చాటుకొచ్చినాను. అంతలోనే శివరామరాజు కలుసుకుండాడు. ఇద్దరమూ దైవ దర్శనం చేసుకొని, ఆకులగిన్నెల నిండా ప్రసాదం పెట్టించుకొని పక్కనుండే మండపంలో కూర్చొని తినసాగినాం. నాకైతే ప్రసాదం తిన్నంత సేపూ, అకస్మాత్తుగా రామలక్ష్మి వచ్చి చూస్తే ఏమనుకుంటాదోనని సందేహించినాను. అదృష్టవశాత్తు రాలేదు. నిమ్మలంగా కాకపోయినా కడుపునిండా తిని నీళ్లు తాగి ఊపిరి పీల్చుకుండాను.
శివరామరాజూ నేనూ ప్రబంధ కవులను గురించి చర్చించుకుంటా మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చొని చదువుకుండాం. నేను చదువుకుంటూనే రామలక్ష్మి అడిగిన విషయం గురించి ఆలోచన చేయ సాగినాను.
రామలక్ష్మి నిజంగానే లక్ష్మీదేవి వాళ్ళ రూంలో ఇబ్బంది పడతావుందేమో! అది ఏమి ఇబ్బంది అయి ఉంటుంది? లేక ఏదో ప్లానుతో నాకు దగ్గరగా రావల్లని అనుకుంటా వుందా? మేముండే రూముపక్కనే తనకొక రూము తీయిస్తే, మా రూమ్ రెంట్ గుడకా తానే కడతాదంట? ఎందుకు కడుతుంది? సన్నప్ప రూములో లేనప్పుడు వ్యాకరణము, చందస్సు చెప్పించుకుండే నెపంతో నా దగ్గరికి రావల్లని ఆలోచించిందేమో!
అట్ల అనుకోగానే వొళ్లు జిల్లుమనింది. నరాల్లో ఏదో పోరాడ సాగింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగా తాను వచ్చి వగలు చేష్టలు చేస్తా నన్ను ప్రేరేపిస్తే, స్త్రీ సంగమం కోసరం ఆవు రావురావురుమంటా ఉండే ఈ శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలనా? ఆ స్థితిని ఊహిస్తా ఉంటేనే ఏదేదో అయిపోతా ఉంది. ఇంక ఆమె నేనూహించినట్లు దగ్గరికి వస్తే ఎంత కష్టం?
ఎక్కువగా ఆలోచించడం ఇష్టం లేక సన్నప్పతో ఈ విషయం చెప్పవలసిన అవసరం లేదనుకొని సన్నప్ప అందుకు అంగీకరించలేదని రామలక్ష్మితో అబద్ధం చెప్పడానికి నిర్ణయించుకుండాను. పోతన చెప్పిన “వారిజాక్షులందు వైవాహికములందు” అనే పద్యాన్ని గుర్తుచేసుకొని అబద్ధం చెప్పినా పర్వాలేదనుకుండాను. ఈ అబద్ధం చెప్పిన తర్వాత, ‘అయితే మనమిద్దరమే ఒక రూమ్‌లో ఉందాములే నారాయణా’ అని ఆమె తెగించి అడిగితే అప్పుడెట్ల? — అంత తెగించి అడగలేదులే అని గట్టిగా అనుకుండాను.
సాయంకాలం కాలేజీ వొదిలిన తర్వాత రామలక్ష్మి దగ్గరకు వచ్చి, సన్నప్పతో మాట్లాడితివా నారాయణా అని అడిగింది. నేను వెంటనే తడబడకుండా సన్నప్ప ఒప్పుకోలేదమ్మా అని అబద్ధాన్ని సత్యంగా గట్టిగా చెప్పినాను. ఆమె నిరుత్సాహంగా వెళ్ళిపోయింది. నేను ఊపిరి పీల్చుకుండాను. ఆ తర్వాత రామలక్ష్మి నన్ను పలకరించడం తగ్గించింది. నా మనసుకు నిమ్మలమయ్యింది.
మా కుంటి చిన్నాయన చనిపోయినాడు
విద్వాన్ రెండో సంవత్సరం అర్ధ పరీక్షలు (షాన్మాసిక పరీక్షలు) దగ్గర్లో ఉండాయి. అయినా పరీక్షల్ని గురించి దిగులు లేకుండా మామూలుగా చదువుతా, అవధానం ప్రాక్టీస్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వసాగినాను. శివ గౌడు వీరభద్రాచారి శివరామరాజు ఎవురు అవధానం చేసినా వాళ్ల కోరిక మేరకు పోయి నిషేధాక్షరి సమస్య ఆ రెండింటిలో ఏదో ఒకటి నిర్వహించడానికి పోతా ఉండాను. శివగౌడు పద్య శైలి సంస్కృత సమాసభూయుతంగా, ఆచారి శైలి చాలా సరళంగా, శివరామరాజు పద్యరచన ఆ రెండింటి సమ్మిళితంగా ఉండడం గమనించ సాగినాను. సంస్కృత ఏకాక్షర పదనిఘంటువును బాగా చదివితే అవధానంలో నిషేదాక్షరి అంశంలో పృచ్ఛకునికి అందకుండా తప్పించుకోవచ్చునని తెలుసుకుండాను. సమస్యను సులభంగా పూరించడానికి విశేషమైన భాషాపాటవం, విషయ చాతుర్యం అవసరమని అర్థం చేసుకో సాగినాను. శివగౌడు కంటే వీరభద్రాచారి అవధాన పద్యాలు అర్థవంతంగా ఉంటాయని శివరామరాజు పద్యాలు సరళంగానే ఉన్నా చదవడం పేలవంగా ఉండి సభను రంజింపజేయదని గమనించినాను.
అర్ధపరీక్షలు మొదలైనాయి. కుంటి చిన్నాయన చనిపోయినాడని నాయన రాయించిన ఉత్తరం వచ్చింది. బండమీదపల్లె నుంచి శింగనమల సబ్ పోస్టాఫీస్‌కు పోయి అక్కడి నుంచి అనంతపురం వెళ్లి అనంతపురం నుంచి నాకు చేరడానికి ఐదు రోజులు పట్టిందని, ఉత్తరంలోని తేదీని చూసి అర్థం చేసుకొని బాధపడినాను. చనిపోయిన రోజే తెలిసుంటే, నేను దగ్గర్లో ఉంటే కడచూపుకు పోవడానికి అవకాశం ఉండేదని, ఒకవేళ నాయన శింగనమలకు పోయి టెలిగ్రామ్ ఇచ్చినా తిరుపతి నుంచి చార్జీలు పెట్టుకొని పోయి చూసి రావడం ఈ స్థితిలో తనకు సాధ్యమై ఉండేది కాదేమోనని, చిన్నాయన మరణ వార్త ఆలస్యంగా తెలియడం వల్ల తాను అవస్థ పడడం తప్పిందేమోనని అనుకుంటా పేదరికంలోని లేమితనం రక్తసంబంధ బంధాలను గుడకా ధ్వంసం చేస్తాయని, చిన్నాయనను తలుచుకొని రోజంతా బాధపడినాను. బాధతోనే పరీక్షలు రాసినాను. పరీక్షలు అయిపోయినాయి.
టికెట్ తీసుకోలేదని పోలీసాయన జాడించి కొట్టినాడు!
తొందరగా ఊరికి పోవల్లన్న తాపత్రయంలో రైల్వే కన్సెషన్ టికెట్ కోసరం అప్లై చేయలేదు. అందరితోపాటు బయలుదేరి రైలెక్కినాను.
చేతిలో నాలుగు రూపాయలే ఉండడం గుడకా టికెట్టు తీసుకోకపోడానికి వొక కారణం. నేను రైలు చాలా రద్దీగా ఉండడం వల్ల సన్నప్ప, ఓబిలేసు ఒక పెట్టెలో, నేనొక పెట్టెలో ఎక్కినాం. కష్టపడి కూర్చోవడానికి సీటు సంపాదించినాను. పాకాల నుంచి రైలు రద్దీ ఇంకా ఎక్కువైంది. ఆ రద్దీలో ఎంతసేపటికీ నిద్ర రాలేదు. పీలేరు దాటినంక కునుకు పట్టింది.
బాగా నిద్రపోతున్న సమయంలో మా బోగీలో అలజడయ్యింది. కళ్ళు తెరిచి చూసినాను. అందర్నీ టికెట్ చూపమని అడుగుతా ఉండాడు టిసి. అతని వెంట పోలీస్ కానిస్టేబుల్ ఉండాడు. నేను కిటికీ వైపు ముఖం తిప్పి నిద్రబోతున్నట్లు కూర్చొని, భగవంతుడా టిసి నా దగ్గరికి రాకుండా చెయ్ అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకోసాగినాను. ఆయన కరుణించలేదు. టిసి దగ్గరికొచ్చి నన్ను లేపి టికెట్ అడిగినాడు. నేను వినయంగా తీసుకోలేదు సార్ అన్నాను. పక్కనున్న పిసి నా కాలర్ పట్టుకొని, “ఈ రైలు మీ అబ్బ సొమ్మనుకుండావేమోయ్?” అని జాడించి చెంప మీద గట్టిగా కొట్టినాడు.
గూబ గుయ్యిమనింది. చెంప మీద అంత గట్టి దెబ్బ ఇంతవరకు నన్నెవురూ కొట్టలేదు. చెంప చుర్రుమనసాగింది. కానిస్టేబుల్ ఎంత గట్టిగా కొట్టినాడో, చెంప మీద వాతలు పడినాయి. బాధతో అతని వైపు చూసి ఫలఫలా కన్నీళ్లు కార్చినాను. నా కన్నీళ్ళను చూసి అతడేమనుకుండాడో ఏమో, కాదు బాబు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడం నేరం కదా! ఇంతకూ ఏమి చదువుతున్నావు అని కోపం తగ్గించుకొని అడిగినాడు.
తిరుపతి ఓరియంటల్ కాలేజీలో విద్వాన్ చదువుతుండాను సార్.మా చిన్నాయన చనిపోయినాడని తెలిసి ఆత్రంగా బయలుదేరుతా కన్సెషన్ టికెట్ కోసం అప్లై చేయలేదు. ఫుల్ టికెట్ తీసుకోవడానికి నా దగ్గరుండే నాలుగు రూపాయలు చాలవని తీసుకోలేదు సార్ అని చెప్పుతా ఉంటే నాకు కన్నీళ్లాగ లేదు. టికెట్టు తీసుకోలేని దయనీయ స్థితి వొకవైపు, పది మందిలో అవమానం అయిందని వొకవైపు, చెంపదెబ్బ బాధ వొకవైపు, అన్నీ హృదయాన్ని పిసికేయడంతో దుఖ్ఖం పెల్లుబికి వొచ్చింది.
“అవునా బాబూ! సారీ నాయనా!” అని నా తల నిమురుతా ఓదారుస్తా, ‘అంత పెద్ద చదువు విద్వాన్ చదువుతా వుండావు, టికెట్టు లేకుండా రైల్లో ప్రయాణం చేయగూడదని నీకు తెలుసు కదా! అయితే నీ పరిస్థితిని చూస్తా ఉంటే బాధ అయితాది! ఇంకెప్పుడూ టికెట్టు లేకుండా రైల్లో ప్రయాణం చేయొద్దు’అని నా పక్కనే చాలాసేపు కూర్చొని నన్ను కొట్టినందుకు చాలా ఫీలయినాడు. అతని పశ్చాత్తాపాన్ని చూసినంక నా చెంప దెబ్బ బాధ మటుమాయమైపోయింది. ఆయన డ్రెస్ మీద గౌరవం పెరిగింది. పోలీసులలో, ఎదుటి మనిషి కన్నీళ్ళను చూసి, ఆ కన్నీళ్ళ వెనకున్న దుర్భర పరిస్థితిని అర్థం చేసుకొని కరిగిపోయే వాళ్లు గుడకా కొందరు ఉంటారని తెలుసుకొని జీవితంలో ఇంకెప్పుడూ టికెట్టు లేకుండా రైల్లో ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుండాను. నన్ను కరుణించింది వెంకటేశ్వర స్వామి కాదని, మనిషిలో ఉండే మానవత్వం అని, మనిషిని ఆదుకుండేది సాటి మనిషే కానీ వేరే ఎవురూ ఆదుకోరని కూడా అర్థం చేసుకుండాను.
ఆ సందర్భాన్ని గొప్ప అవమానంగా భావిస్తా ఇల్లు చేరుకుండాను. నన్ను చూసి చిన్నాయన చనిపోయిన విషయాన్ని గుర్తు చేసి అందరూ ఏడుస్తా కన్నీళ్లు కార్చినారు. జేజి, ఇంక నాకు దిక్కెవరు నాయనా అని బాధపడింది. నేను ధైర్యం చెప్పి ఓదార్చినాను.
నేను చదివిన హైస్కూల్లో నా మొదటి అష్టావధానం!
ఈ సంవత్సరం వాన కారు పంట బాగా పండిందని మా కోరు భాగానికి కేసరొడ్లు, ఢిల్లీ భోగాలు పదైదు మూటలు ఇంటికి వచ్చినాయని, నాగు గింజలు సుంగిడి గింజలు అన్నీ పోను ఎనిమిది మూటలు మిగిలినాయని, కూలి గింజలు గుడకా ఆ మాత్రం వచ్చినాయని తెలిసి సంతోషమైంది. తిరుపతిలో చేరినంక కొంచెం కాలం కలిసొచ్చినందుకు మనసు తృప్తి పడింది. ఈ సంవత్సరం గుడకా ఎండకారు పంటకు చెరువులో నీళ్లు సరిపోతాయని, అందరూ వరి నారులు పోసుకుండారు. నాయన చెప్పకపోయినా మళ్లల్లో పనులకు పోవడం మంచిదని, ఇంట్లో తిండిగింజలకూ నా చదువుకూ ఇబ్బంది కలగకుంటే చాలు, ఇంటి సేద్యంగానీ బాడుగ మడకపనులు గానీ కష్టమనిపించవని అనుకుంటా వారం దినాలు పయిటాల వరకు మడకదున్నే పనికి పోతా, పయిటాల నుంచి గట్టిగా చదువుకోసాగినాను. నిన్న బాడుగ మడకలలో వెనకమడక తోలుతా, పొలాల్లో ఆనందంగా సేద్యాలు చేసుకుంటా ఉండే రైతుల వైపు చూసి, మనసులో రైతు మీద ఒక పద్యం అల్లుదామనుకొని ప్రయత్నం చేసినాను. వెనక మడక తోలడం వల్ల, అది కూడా పెద్ద మడికయ్యలో ముందుమడక వెంట తోలడం వల్ల ఆలోచన చేయగలిగినాను.
పెద్ద కయ్య దాదాపు పాతిక ఎకరా ఉంటాది. అదంతా దున్నే లోపల మనసులో సీస పద్యం తయారైంది. పరమానందం అయింది. ఇంటికి వచ్చి డైరీలో రాసి పెట్టినాను. ఈ సంవత్సరం నుంచి వీలైతే ప్రతి రోజూ డైరీలో ఒక సొంత పద్యం రాయల్లని నిర్ణయించకుండాను. పద్యం బాగానే తయారయిందని అనిపించింది.
నా రైతు పట్టుచో నాగలి కాదది
ముత్యాల విత్తుల పోహలింపు
నా రైతు ముట్టుచో పారలు గావవి
పగడాల వన్నెల భాగ్య సరులు
నా రైతు వొంగితే భారము కాదది
బంగారు పంటకు వన్నె వాటు
నా రైతు పలికితే నానుడి కాదది
భారతమాత వాగ్భాగ్య గరిమ
రైతు సిరి పంట ఈ దేశ ప్రజల నోము
పంట, అట్టి నా రైతును పాదాచారి
వై కలుసుకొని మనసార అమలినమగు
పలుకు పరిమళమందించవయ్య సఖుడ
పొలంకయ్యలో చెమట వెంట తయారైన పద్యాన్ని కాగితం మీద చూసి తృప్తి చెందినాను.
తిరుపతికి బయలుదేరడానికి నాలుగు రోజుల ముందు గురువుగారిని కలుసుకుండాను. స్కూల్లో అష్టావవధానం ఏర్పాటు చేస్తాను, చేయగలవేమిరా అని సార్ అడిగినాడు. నేను కొంచెం సేపు తటపటాయించి చేస్తాను సార్ అని అంగీకరించినాను. అయితే ప్రశాంతంగా మెంటల్‌గా ప్రిపేర్‌గా! ఎల్లుండి ఏర్పాటు చేస్తాను అని సార్ టైం ఫిక్స్ చేసినాడు. ఆయన దగ్గర సెలవు తీసుకొని ఊరు చేరుకొని విషయం నాయనకు చెప్పినాను. అట్లంటే ఏమిటోనప్పా అని అడిగినాడు నాయన. వివరించి చెప్పినాను. కయి జేత్తావన్నమాట అంటా అమ్మయ్యా నాయనా సంతోషపడినారు.
రెండు దినాలు పనికి పోకుండా ఇంటి బయట వేప చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకోసాగినాను. మొదట గురువుగారికి నమస్కరిస్తా ఒక పద్యం చెప్పితే బాగుంటుందనుకుండాను. తెలుగు పండిట్ గురుమూర్తిసారు, జూనియర్ తెలుగు పండిట్ సారు, భారతం సుబ్రమణ్యం సారు తప్పా తెలుగు సాహిత్యంతో పరిచయమున్న టీచర్లు స్కూల్లో ఇంకెవురూ లేరు కదా, మరి పృచ్ఛకులుగా ఎవురు కూర్చుంటారో అని ఆలోచన చేసినాను. భారతం సుబ్రమణ్యం సార్ సాహిత్యంతో బాగా పరిచయమున్న వ్యక్తి అని, శూద్రులు అంటే గిట్టని ఆ మహానుభావుడు కఠినమైన అంశాన్ని ఇచ్చి ఇబ్బంది పెడతాడేమోనని కొంచెం సేపు భయపడి, అవధానమంటే అన్నిటికి సిద్ధంగా ఉండల్లని ధైర్యం తెచ్చుకుండాను.
అవధానం చేసే రోజు రానే వచ్చింది. ఉదయం పది గంటలకంతా అన్నం తిని అమ్మా నాయనలకు పాద నమస్కారం చేసి, బయలుదేరి గురువుగారింటికి చేరుకుండాను. సార్ పలకరించి, ఏమిరా నారాయణా, ధైర్యంగా అవధానం చేస్తావు కదా అని అడిగినాడు. చేస్తాను సార్ అని ధైర్యంగా చెప్పినాను. నేను చదువుకున్న హై స్కూల్ బిల్డింగ్ ఆవరణలో అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేసినాడు సార్. పది బెంచీలు వేసి వాటి మీద పెద్ద భవాని జంఖానాలు రెండు పరిపించి వెనక వైపున నాలుగు రౌండ్ దిండ్లు వేయించినారు. దిండ్ల ముందర మధ్యలో రెండడుగుల ఎత్తున స్టాండ్ మైకు పెట్టినారు. పక్కన ఒక హ్యాండ్ మైక్ ఉంది. బిడిఓ ఆఫీస్ సత్తార్ సాబ్ మైకులను సౌండును టెస్టు చేసి గ్రామ్ ఫోన్ రికార్డు పాటలు పెట్టినాడు. అదంతా చూసి నేను కొంచెం భయపడతా, మొన్న ఓరియంటల్ కాలేజీలో పద్య పోటీలు జరిగిన సందర్భాన్ని గుర్తుచేసుకొని నాకు నేను ధైర్యం తెచ్చుకుండాను.
గ్రామ పెద్దలు ఘట్టప్ప, సత్యమూర్తి, మరి కొంతమంది వచ్చినారు. అందరూ హెడ్మాస్టర్ సార్ రూమ్‌లో కూర్చుండారు. టీచర్స్ రూమ్‌లో కూర్చున్న నన్ను రమ్మన్నారు. నేను వెళ్లి అందరికీ నమస్కరించి గోడకు అనుకొని నిలుచుకుండాను. ఆరేడు మంది నాకు పాఠాలు చెప్పిన గురువులుండారు. నన్ను వాళ్ళ పక్కన కూర్చోమన్నారు. మొదట బిడియ పడతా నేను కూర్చోలేదు. ఇప్పుడు నువ్వు అష్టావధాన పండితునివి నారాయణా! ఏం పర్వాలేదు, కూర్చో అని సత్యమూర్తి స్వామి చెప్పినా కూర్చోలేదు. రేయ్ తిక్క నాయలా, కూర్చోరా అని హెడ్మాస్టర్ గట్టిగా చెప్పినంక కూర్చుండాను. అతిథులకు మా టీచర్లందరికీ టీ బిస్కెట్స్ తెప్పించినాడు సార్. టీ కాఫీలు అయిపోయినంక బెల్లు కొట్టినారు. విద్యార్థులందరూ వేదిక ముందుకొచ్చి కూర్చుండారు.
సత్యనారాయణ సార్ అతిథులను వేదిక మీదికి ఆహ్వానించినాడు. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినాడు. నేను వేదిక మీదకి పోయి మోకాళ్ళ మీద కూర్చొని, గురువు దేవుడైన హెడ్మాస్టర్ గారి పాదాలకు మొక్కి నా స్థానంలో కూర్చుండాను. కూర్చున్న తర్వాత సత్యనారాయణ సార్, నిన్నటి మా విద్యార్థి, ఇప్పుడు విద్వాన్ కోర్సు చదువుతూ విద్యార్థిగానే మన స్కూల్లో అవధానం చేయడానికి పూనుకోవడం మాకందరికీ గర్వకారణం అని అనగానే అందరూ చప్పట్లు కొట్టినారు. గురుమూర్తి సార్ ముందుగానే అందరితోనూ మాట్లాడి నిర్ణయించినాడేమో పృచ్ఛకులు ఎనిమిది మందిని వేదికపైకి ఆహ్వానించినాడు.
సభకు అధ్యక్షునిగా గ్రామ ప్రెసిడెంట్ ఘట్టప్ప మధ్యలో కూర్చుండాడు. ఆయనకు ఇరువైపులా నేను హెడ్మాష్టర్ సారు కూర్చుండాం. పంచమి నాటి చంద్రుని ఆకారంలో రెండు వైపులా నలుగురు నలుగురు గురువులు పచ్చకులుగా కూర్చుండారు. అధ్యక్షునిగా ఘట్టప్ప స్వామి నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత హెడ్మాస్టర్ సార్ నా గురించి కాసేపు మాట్లాడసాగినాడు.
ఊదు కడ్డీలు పొగ పరిమళం మత్తుగా ఉంది. సభంతా నిశ్శబ్దంగా ఉంది. దాదాపు 150 మంది విద్యార్థులు నా వైపు ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తా ఉండారు. గురువులు ఇతర టీచర్లు ఊరి పెద్దలు ఆసక్తిగా వింటా ఉండారు. ఆ వాతావరణం నన్ను ఉత్తేజ పరుస్తా ఉంది. హెడ్మాస్టర్ మాట్లాడిన తర్వాత గురుమూర్తి సార్ అష్టావధానాన్ని గురించి సూక్ష్మంగా వివరించినాడు.
అవధానం ప్రారంభమైంది. నేను మొదట గురుస్తుతి చేసినాను.
శ్రీకరమ్ములు మద్గురు చిత్తరంజ
నార్యు పదపద్మజమ్ములు అవి మదీయ
భవితకు వెలుగుదారులు పరమ భక్తి
నంజలింతునా భవ్య దయార్ద్రమూర్తి
కెల్ల వేళల నా చదువిది తరింప
అని పంచ పాద తేటగీత పద్యాన్ని కొంచెం రాగయుక్తంగా చెప్పినాను. భారత సుబ్రహ్మణ్యం సార్ గణాల ప్రకారం రాసుకున్నాడేమో ఎక్సలెంట్ అని గట్టిగా అన్నాడు. తర్వాత అధ్యక్షుని మీద ఒక ఆట వెలది, సభను ఉద్దేశించి ఒక సీస పద్యం అంతకుముందే మనసులో అల్లుకున్న దానిని అశువుగా చెప్పుతున్నట్లు నటిస్తా కొంచెం వేగంగా చెప్పినాను. సత్యమూర్తి స్వామి శెభాష్ అని అంటా చప్పట్లు కొడతానే సభంతా మారుమోగేటట్లు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టినారు.
మొదట సుబ్రహ్మణ్యం సార్ నిషేధాక్షరి సరస్వతీ స్తుతి చేయమని నిషేధించడానికి పూనుకుండాడు. రెండు నిమిషాల్లో కందపద్యం మొదటి పాదం చెప్పినాను. ఆయన నన్ను పట్టుకోలేక పోయినాడు. గురుమూర్తి సార్, “చందమామను ముద్దాడ సాగె చీమ” అనే సమస్యను ఇచ్చినాడు. రేడియో సమస్యా పురాణ కార్యక్రమంలో విన్నాడేమో సారు, సులభమైన సమస్య అని సంతోషం అయింది. నాలుగు రౌండ్లల్లో నాలుగు పాదాల ప్రకారం అన్ని అంశాల మీద పద్యాలు చెప్పడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుందని, పల్లెలకు పోయే పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క పద్యం ఒక్క రౌండ్లోనే చెప్పమన్నాడు హెడ్మాస్టర్ సార్. ‘అంతే మరి, అన్నం ఉడికిందో లేదో అన్నమంతా ముట్టుకొని చూడాల్సిన పనిలేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు’ అని సత్యమూర్తి స్వామి గట్టిగా అన్నాడు. సరే సార్ అని సమస్యను పూరిస్తా ఈ పద్యం చెప్పినాను
“శని మహాత్ముని నోడింప సర్వభోగ
ముల వదలి గండ్ర చీమలు తొలచినట్టి
చెట్టు తొర్రలో దూరిన శివుని మీద
చందమామను ముద్దాడ సాగె చీమ”
ఈ సమస్యా పూరణను రాసుకొని, బ్రహ్మాండం అంటా గురుమూర్తి సార్ ఆనందంతో చప్పట్లు కొట్టినాడు. సభంతా చప్పట్లతో మారుమోగింది. వర్ణన అడగడానికి పృచ్ఛకునిగా కూర్చున్న సత్యనారాయణ సార్, అవధాని గారూ, మీరు రైతుబిడ్డ కదా, రైతు మీద ఒక పద్యం చెప్పండి అని అడుగుతానే నాకు ఆనందమైంది. నన్ను మీరు అని సంబోధించినందుకు, రైతు మీద పద్యం చెప్పమని అడిగినందుకు పరవశించి పోయినాను. మొన్న మడికయ్యల్లో మడక దున్నుతా మనసులో అల్లుకొని ఇంటికి వచ్చి పేపర్లో రాసుకున్న సీస పద్యాన్ని నిదానంగా నిబ్బరంగా ప్రశాంతంగా రాగయుక్తంగా చెప్పినాను. హెడ్మాస్టర్ సార్ పొంగిపోయినాడు. సత్యమూర్తి స్వామి పైకి లేచి, ‘వుయ్ ఆర్ ప్రౌడ్ అఫ్ యు నారాయణా! నిన్ను చదివిస్తున్న నీ గురువు చిత్తరంజన్ దాస్ జీవితం ధన్యమైంది’ అని అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేసినాడు. సభ కరతాళ ధ్వనులతో పది నిమిషాల పాటు దద్దరిల్లింది.గురువుగారు పొంగిపోయినారు.
సైన్స్ టీచర్ కృష్ణమూర్తి సార్, ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని గురించి ఆశువుగా ఒక పద్యం చెప్పమని అడిగినాడు.
“శింగనమల చెర్వియ్యది చెరువుగాదు
రైతుల బడుగు జీవుల బ్రతుకుతెరువు
ఋష్య శృంగుని కొండది పృథివిలోన
కొంగు బంగారుదండ భక్తులకునెల్ల”
అని సునాయాసంగా చెప్పినాను. అట్లే దత్తపదితో ఒక పద్యం చెప్పమని హిందీ సార్ అడిగినాడు. “పస్తులు లేని మా బ్రతుకు పచ్చని చెట్టుగ మారుటెన్నడో” అని చెప్పినాను. డ్రిల్ మాస్టర్ చిదంబర రెడ్డి సార్ ఎనిమిది గంటలు కొట్టినాడని తెలియజేసినాను.
అవధానమంతా అయిపోయినంక హెడ్మాస్టర్ సార్ ఆనందంతో పరవశించిపోతా నారాయణ నా శిష్యుడైనందుకు గర్వపడుతున్నానని పొగిడి, ఎప్పుడు తెప్పించినాడో ఏమో, కొత్త పంచ, జుబ్బా గుడ్డలు మెడలో వేసి ఇవి మీ నాయనకు నారాయణా అంటూ తాంబూలంలో అర్ధ నూటా పదహారులిచ్చి సత్కరించినాడు. ఘట్టప్ప స్వామి సత్యమూర్తి స్వామి ఇద్దరూ కలిసి అర్ధ నూటాపదార్లు చేతికిచ్చి అభినందించినారు. అంతా అయిపోయినంక సారోళ్ల ఇంటికి పోయి విషయమంతా చెప్పుతానే జయమ్కక్క చాలా సంతోషపడింది. సార్ ఎంతో ఆనందపడతా ఇట్లనే బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి అవధానివి అవుతావు రా! అయితే అవధానం చాలా కష్టమైన ప్రక్రియ. అవధానిగా కంటే రచయితగా ఎదిగి మంచి రచనలు చేయడానికి ప్రయత్నం చెయ్ అని సూచన చేసినాడు. ఇద్దరి దగ్గర సెలవు తీసుకొని ఊరికి బయలుదేరినాను.
బయట మొట్టమొదటి అవధానం! అదీ, నేను చదువుకున్న స్కూల్లో! నాకు చదువు చెప్పిన గురువుల సమక్షంలో! గురువులందరూ ముఖ్యంగా హెడ్మాస్టర్ సారు, సత్యమూర్తి స్వామి మెచ్చుకొని మనసారా దీవించినారు. 116 రూపాయలు డబ్బులు, నాయనకు కొత్త బట్టలు ఇచ్చి సన్మానం చేసినారు! ఎంత అదృష్టవంతుణ్ణి! ఈ అదృష్టమంతా హెడ్మాస్టర్ సార్ దయతోనే కదా! ఇటువంటి అద్భుతమైన అవకాశం ఎవరికీ రాదేమో! ఎంత గొప్ప సందర్భం! ఎంత గొప్ప సత్కారం! ఈ సభకు నాయనా అమ్మయ్య వచ్చి చూసి ఉంటే ఎంత బాగుండేది!
ఆలోచన చేస్తా నడుస్తా, ఇంటిదగ్గర రచయితగా ఎదిగి మంచి రచనలు చేయడానికి ప్రయత్నించు అని సార్ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని అవధానిగా కంటే రచయితగా ఎదగడమే మంచిదా, సార్ ఎందుకన్నాడు ఆ మాటలు అని తర్కించుకుంటా ఇల్లు చేరుకుండాను. విషయమంతా విని కొత్త బట్టలు చూసి పొంగిపోయినారు నాయనా అమ్మయ్య.
మరుసటి రోజే ప్రయాణమై తిరుపతి చేరుకొని మిత్రులందరికీ నా ఆనందాన్ని పంచినాను. అవధానం చేసిన విద్యార్థి అని ఆంధ్రప్రభ దినపత్రికలో వార్త వేసినారని కోనయ్య సంతోషపడతా వచ్చి పేపర్ చూపించినాడు. అది చూసి గురువులు సన్మానం చేసిన నాటికంటే ఎక్కువ ఆనందం పొంది కాలేజీలో మిత్రులందరికీ చూపించి వాళ్ళ అభినందనలతో పొంగిపోయినాను.
యూనివర్సిటీ కాన్వకేషన్ – డాక్టరేట్ పొందాలన్న ఆకాంక్ష
ఈరోజు అంటే 21-1-1967 వ తేదీ శనివారం సాయంకాలం యూనివర్సిటీలో కాన్వకేషన్ ఉందని, గవర్నర్ పట్టం తాను పిళ్లై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గజేంద్ర గడ్గర్ వస్తున్నారని తెలిసి మిత్రులతో కలిసి యూనివర్సిటీకి పోయినాను.విశ్వవిద్యాలయ గ్రంథాలయం దగ్గర ఓపెన్ ప్లేస్‌లో బ్రహ్మాండంగా వేదికను ఏర్పాటు చేసినారు. షామియానాల కింద బేర్లు బేర్లుగా వేసిన కుర్చీలలో డిగ్రీ పట్టాలు తీసుకునే విద్యార్థులందరూ లాయర్ల మాదిరి నల్లగౌన్లు తొడుక్కొని తలకాయల మీద పలకల క్యాపులు పెట్టుకొని కూర్చుండారు.
క్యాపుల పైన జడగుచ్చుల మాదిరి అవేవో వేలాడుతా ఉండాయి. కొంతమంది ఎర్ర పట్టీలున్న గౌన్లు తొడుక్కుండారు.
మేము షామియానాల చుట్టూ తిరిగి ఒక వైపున కూర్చున్నాం. ముందు వరసలో ఎవరో ఒక మంత్రి, చిత్తూరు జిల్లా కలెక్టర్, టిటిడి ఈవో ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూర్చుండారు. మొత్తం కుర్చీల కింద టార్పాళ్లు పరిచినారు. వేదిక ముందర కుర్చీల మధ్యలో వొదిలి ఉండే పదడుగుల వెడల్పు ఉన్న రెండు దారుల్లో ఎర్రని కార్పెట్ పరిచినారు. నాలుగడుగుల ఎత్తు 50, 60 అడుగుల వెడల్పు ఉన్న స్టేజి మీది ఎర్రని తివాచీ పరిచి, పూలతో పూల హారాలతో అంగరంగ వైభవంగా అలంకరించినారు. పురాణాల్లో వర్ణించిన ఇంద్రసభ మాదిరుంది వేదిక.
ఒక తెల్లని కారొచ్చింది. అది అంబాసిడర్ కారంట! ఎంత ముద్దుగా ఉందో! కారులో నుంచి ఇద్దరు ఆఫీసర్లు దిగొచ్చినారు. అందులో ఒకాయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వామనరావంట! ఆయన రాగానే కలెక్టర్, టిటిడి ఈవో, మంత్రులు అందరూ పైకి లేచి నిలబడి నమస్కరించినారు. అది చూసి కలెక్టర్ హోదా కంటే వైస్ ఛాన్సలర్ హోదా పెద్దదేమో, అందుకే ఆయన రాగానే వీళ్ళు పైకి లేచి నిలబడినారేమో అని మేము అనుకోసాగినాం. వైస్ ఛాన్సలర్, వేదిక మీద సింహాసనాల మాదిరున్న కుర్చీలను సర్దుతా ఉండే వాళ్లకు ఏవేవో సూచనలు ఇచ్చి వెళ్లిపోయినాడు.
ఒక పదైదు నిమిషాలయిన తర్వాత షామియానాల పక్కనున్న రోడ్లల్లో పోలీస్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు గట్టిగా అరుస్తా పక్కనుండే జనాన్ని దూరంగా పంపించినారు. అంతలో ఒక పోలీస్ జీప్ హార్ను కొట్టుకుంటా వచ్చింది. దాని ముందర రెండు కార్లు వచ్చినాయి. దాని తర్వాత పెద్దగా పొడవుగా ఉన్న ఒక నల్ల కారు వచ్చి నిలబడింది. అందులో నుంచి గవర్నర్ దిగినాడు. షామియానాల చివర మిలిటరీ బ్యాండ్ సెట్ రెడీగా ఉంది. గవర్నరు మిగతా పెద్దోళ్ళందరూ రెడ్ కార్పెట్ మీద నిలబడినారు. బ్యాండ్ సెట్ వాళ్లు బ్యాండ్ వాయించుకుంటా మెల్లగా షామియానాల కింద ఉన్న కార్పెట్ మీద నడుస్తా డయాస్ వైపు రాసాగినారు. కూర్చున్న వాళ్ళందరూ పైకి లేచి మౌనంగా నిలబడినారు. నేను నా మిత్రులు నలుగురమూ నిలబడి, ఆ బ్యాండ్ మేళాల డ్రమ్ముల శబ్దము, గవర్నర్, వైస్ ఛాన్సలర్ ఇంకా ఎవురో పెద్దపెద్ద వాళ్లు రెండు మూడు రకాల నల్లగౌండ్లు తొడుక్కొని తలకాయల మీద పలకల టోపీలు పెట్టుకొని గంభీరంగా మెల్లగా నడిచొస్తావుంటే మొత్తం కాన్వకేషన్ సభంతా నిశబ్దంగా నిలుచుకోనుంది. చూస్తా నేను గగుర్పాటుకు గురైనాను. శరీరం అంతటా వెంట్రుకలు నొక్కబొడుచుకుండాయి.
గవర్నరు ఇంకొకరు ఎవురో వేదిక మీద కెక్కిపోయి మధ్యలో ప్రత్యేకంగా ఉండే రెండు సింహాసనాల కుర్చీలో కూర్చుండారు. మిగతా పెద్దోళ్ళు ఆ సింహాసనాలకు ఇరువైపులా కూర్చుండారు. గవర్నర్ వెనకాల ఒకాయన పోలీస్ సూపరెంట్ డ్రస్సులో జబర్దస్తీ గా నిలబడి ఉండాడు. గవర్నర్, వైస్ ఛాన్సలర్, చీఫ్ గెస్ట్ ప్రత్యేకమైన డ్రస్సుల్లో ఉండారు. గవర్నర్ మాట్లాడడానికి ముందు అందరూ పైకి లేచి నిలబడగానే జాతీయ గీతం మ్యూజిక్ వేసినారు. అదయిన తర్వాత గవర్నర్ ఒక ఐదు నిమిషాల సేపు మాట్లాడినాడు తర్వాత ముఖ్య అతిథి గజేంద్ర గడ్గర్ కావొచ్చు, 15 నిమిషాల సేపు ప్రసంగ పాఠం చదివినాడు. అదయినంక తెల్లగౌన్లు నల్ల గౌన్లు పలకల టోపీలు పెట్టుకున్న వాళ్లు ఒక్కొక్కరు వాళ్ల పేర్లు చదవగానే గవర్నర్ దగ్గరికి పోయి ఆయన చేతుల మీదుగా రౌండుగా చుట్టిన పట్టా పత్రాన్ని తీసుకుంటా ఉండారు.అట్లా ఒక్కొక్కరు తీసుకుంటున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తా ఉండారు. ఆ దృశ్యాలను చూస్తా, నేను ఆ విధంగా పిహెచ్ డి చేసి, గవర్నర్ ద్వారా పట్టా తీసుకోగలనా పిహెచ్ డి చేయల్లంటే ఎం ఏ అయిపోవల్ల కదా, ఎలాగయినా సరే ఉద్యోగంలో చేరిన వెంటనే ఎంఏ కంప్లీట్ చేసి ఆ తర్వాత పీహెచ్డీ చేసే తీరల్ల, నా పేరుకు ఎడమ పక్కన డాక్టర్ అని పేరు చివర ఎం.ఎ;పిహెచ్ డి అని రాసుకోవల్లని నిర్ణయించుకుండాను.
దేశ చరిత్రలోనే తొలిసారి ప్రాంతీయ పార్టీ అధికారంలోకి!
హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలలో తప్పనిసరి బోధనాంశంగా కేంద్ర ప్రభుత్వం నిర్బంధం చేయడానికి పూనుకోవడం క్రమక్రమంగా ఎక్కువ కావడంతో దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పెరగసాగినాయి. మిగతా రాష్ట్రాలలో హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఎట్లున్నా తమిళనాడు ప్రజానీకంలో మాత్రం చాప కింద నీళ్ల మాదిరి ఆ హిందీ వ్యతిరేక భావన మెల్లగా విస్తరించ సాగింది. ద్రావిడ భాషా సంస్కృతుల పట్ల అమితమైన గౌరవాభిమానాలున్న ప్రజలు వాళ్ళు! అందుకే ఇతర భాషా సంస్కృతులు తమిళ భాష పైన సంస్కృతి పైన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినాయని, తెలుగు భాషలో సంస్కృత భాషా పదాలు సమ్మిళితమైనట్లు తమిళ భాషలో కాలేదని, అదే ఆ భాష స్వచ్ఛతకు ఆత్మ గౌరవ ప్రాంతీయ గౌరవ స్థితికి నిదర్శనమని నాగ సిద్ధారెడ్డి సార్, సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవాడు. తమ భాషా సంస్కృతులను ఉత్తరాది భాషా సంస్కృతుల ఆధిపత్యం నుండి కాపాడుకోవడానికి పెరియార్ రామస్వామి నాయకర్ ద్రావిడ ఉద్యమాన్ని లేవదీసినాడని, ఆ ఉద్యమ ప్రభావంతోనే ద్రవిడ మున్నేట్ర కజిగం అనే పేరుతో ద్రవిడ ప్రగతి శీలా సమాఖ్య ఏర్పడిందని, దానికి నాయకత్వం వహించిన అన్నా దొరై, దాన్ని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీగా 1949 లోనే మార్చి, ఉత్తరాది సంస్కృతికీ దాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకీ వ్యతిరేకంగా తన పార్టీ భావజాలాన్ని బలంగా జనంలో చొప్పించినాడని నాగ సిద్ధారెడ్డి సార్ సందర్భంగా వచ్చినప్పుడల్లా తెలియజేసేవాడు.
నాగసిద్ధారెడ్డి సార్ చెప్పిన మాటల్లోని సత్యం ఇప్పుడు కనిపించసాగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమొళులు తమ ఆత్మ గౌరవాన్ని చాటుతా ద్రవిడ మున్నేట్ర కజిగం పార్టీని తమిళనాడులో అధికార పీఠం ఎక్కించినారు. దేశ చరిత్రలో రెండు దశాబ్దాలుగా తనకు ఎదురులేదనుకుంటా ఉండే కాంగ్రెస్ పార్టీగోడలు బీటలు వారినాయి. తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ దక్షిణాదిలో ముఖ్యమైన తమిళనాడులో రాష్ట్ర అధికార పీఠమెక్కింది. పార్టీ నాయకుడే కాదు వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక సంచలన విషయంగా అందరూ చెప్పుకో సాగినారు. కాంగ్రెస్ పార్టీని, దేశ రాజకీయాలను శాసిస్తా అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కామరాజు నాడర్ డీఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఒక విద్యార్థి శ్రీనివాస్ చేతిలో ఓడిపోవడం దేశ రాజకీయాలలో మహా సంచలన వార్తగా మారింది. ఒక్కసారిగా మొదటిసారిగా 36 మంది డియంకే పార్టీ ఎంపీలు పార్లమెంటులోకి అడుగు పెట్టి, దేశ ప్రజలందరూ దక్షిణ భారతదేశంలో వైపు చూసేటట్లు చేయడం ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అది విని నేనూ మా అవధాన మిత్రులందరూ ఆశ్చర్యపోయినాం.
ఈ ఎన్నికలలో మా ప్రాంత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి పార్లమెంటులో ఎంపీగా అడుగుపెట్టి లోక్‌సభ స్పీకర్ కావడం విని సంతోషంతో పొంగిపోయినాను.
ఆయన జన్మస్థలం ఇల్లూరును, ఆయన వ్యవసాయాన్ని చూసుకుండే గుమస్తాను, అక్కడ చావిట్లో గడిపిన దినాలను గుర్తు చేసుకుండాను. తన నియోజకవర్గమైన శింగనమలను గురించి, ఆ చెరువుకు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నీళ్లు తెచ్చే విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తాడని ఆశపడినాను. దానికంటే ముఖ్యమైనది మా నీలం సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్లమెంటులో స్పీకర్‌గా పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి పూనుకున్నాడని దేశంలోనే తెలుగు వాడంటే ఏమిటో తెలియజేసినాడని తెలిసి మురిసి పోయినాను.
నరాల రామారెడ్డి స్ఫూర్తితో అవధానాల వైపు..
రోజులు గడిచే కొద్ది పద్య రచన మీద విపరీతమైన వ్యామోహం పెరగసాగింది. ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేస్తున్నప్పుడు, టాయిలెట్‌కు పోయినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, కాలేజీకి పోతున్నప్పుడు ఎల్లవేళలా పద్యాలు అల్లడం, అనుకున్న పద్ధతిలో పద్యం తయారు కాక విసుగు చెందడం గణ, యతి, ప్రాస, ప్రాసయతుల దగ్గర అవస్థ పడడం, సునాయాసంగా రెండు మూడు పద్యాలు తయారైనప్పుడు సంతోషించడం, ఎంత గింజుకున్నా రెండు పాదాలైనా దొరలనప్పుడు బాధపడడం నిరంతరం ఒక వ్యసనంగా మారిపోవడంతో మెదడు నలిగిపోసాగింది.
నాలుగు రోజుల కిందట యూనివర్సిటీ కాలేజీలో నరాల రామారెడ్డి అష్టావధానం జరిగింది. రామారెడ్డి విషయం చెప్పి అవధానం చేస్తున్న ఓరియంటల్ కాలేజీ మిత్రులందరినీ పిలిచినాడు. అవధానం చేయడానికి అర్రులు చాస్తున్న నేను శివగౌడ్ శివరామరాజు ఆచారి యూనివర్సిటీకి పోయినాం. ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి తెలుగు డిపార్ట్మెంట్ తరఫున రామారెడ్డి అవధానం ఏర్పాటు చేసినాడు. మీటింగ్ హాలు బ్రహ్మాండంగా ఉంది.
అవధాన సభకు రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ అధ్యక్షత వహించినాడు. ఆయన అప్పటికే సుప్రసిద్ధ సాహిత్యవేత్త అని, గొప్ప ఆధునిక సాహిత్య విమర్శకుడని, వేమన పైన గొప్ప విమర్శ గ్రంధం, నాటకోపన్యాసాలు రాశాడని, గాధాసప్తశతి ప్రాకృతం నుండి తెలుగులోకి అనువదించిన మహా పండితుడని, మాకు పాఠ్యాంశమైన సారస్వతావలోకమును గురించి వివరించే సమయంలో నాగ సిద్ధారెడ్డి సార్ రాళ్లపల్లి గారి గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పినాడు. అటువంటి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారిని మేము చూడడం అదే మొదటిసారి. ఆయన పిలక జుట్టును, నుదుటి మీద ఉండే పంగనామాలను, గాంధీతాత మాదిరి పై మీద అంగీ లేకుండా కప్పుకున్న పల్చటి వస్త్రాన్ని, ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయినాను నేను. రూపమేమో మొత్తం సాంప్రదాయమైనది. ఆలోచనలు ఆధునికమైనవి. రెండూ పొత్తు కుదరనివి. ఎవరైతేనేం, అంతటి గొప్ప వ్యక్తి రామారెడ్డి అవధాన సభకు అధ్యక్షుడని నేను అబ్బురపోయినాను.
పీజీ విద్యార్థులతో హాలంతా కిటకిటలాడుతా ఉంది. వేదిక మీద పృచ్ఛకులుగా అందరూ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేసే పంగనామాల బాలకృష్ణయ్య, తల్లావజ్ఝల కోదండరామయ్య, నాగయ్య, మద్దూరు సుబ్బారెడ్డి, సదాశివరెడ్డి ఇంకా ఎవురో ముగ్గురు అందరూ హేమాహేమీలే! రామారెడ్డిని వేదిక పైకి పిలిచినప్పుడు కరతాల ధ్వనుల మారుమోగినాయి. అది చూసి నేను మురిసిపోయినాను. మనల్ని గుడకా పృచ్ఛకులుగా వేసుకొని ఉండొచ్చు కదా అని నేను ఆశను వ్యక్తం చేసినాను. మా ముగ్గురి కంటే సీనియర్ అవధానిగా పరిచయమైన శివరామరాజునయినా తీసుకోనుంటే బాగుండేది అనుకుండాం.
“మనం ఎవరమూ రెడ్లూ కమ్మలమూ కాదు గదా! ఎవరిలో అయినా, ఎంత టాలెంట్ ఉన్నా, పైన చేయి అందించేవాడు ఒకడుండల్ల నారాయణా! రామారెడ్డి జి.ఎన్.రెడ్డి ఇద్దరూ రెడ్లు, అంతే! అదే పెద్ద అభయహస్తం రామారెడ్డికి” అని వీరభద్రాచారి వ్యాఖ్యానించినాడు.
అవధానం మొదలు కావడానికి ముందు రాళ్లపల్లి గారు మాట్లాడుతా నా వరకు నాకు ఈ సర్కస్ గారడి విద్య పట్ల సదభిప్రాయం లేదు. తెలుగు సాహిత్యంలో ఇదొక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొనడానికి పనికొస్తుంది గానీ ఇందులో తయారయ్యే పద్యాలలో సాహిత్య కళ ఉండదు. అష్టావధాన శతావధాన పద్యాలలో కళాత్మకత సాధించడం అది తిరుపతి వెంకట కవులకే సాధ్యమైంది. వారైనా నాటక రచనల వల్లనే సుప్రసిద్ధులైనారు. ఒక ప్రయోజనాత్మకమైన కథా వస్తువును పద్యరచనతో కళాత్మకంగా మలిచినప్పుడే అది సాహిత్యమవుతుంది. కానీ అప్పటికప్పుడు ఏదో ఒక అంశం పైన ఛందోబద్ధంగా పద్యాన్ని తయారు చేస్తే అది సాహిత్యం కాదని నేను నమ్ముతాను. అందుకే రాయబ్రోలు సుబ్బారావు అంతటివాడు, ఈ వేగాతి వేగోక్తి నుంచి తనకు విముక్తి కలిగించమని సరస్వతీదేవికి విన్నవించి విరమించుకుండాడు. అని కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినాడు.
అవధానం మొదలయ్యింది. రామారెడ్డి నూనూగు మీసాలతో చాలా అందంగా ఉండాడు. పద్యాన్ని రాగయుక్తంగా చెప్పకపోయినా గంభీరమైన కంఠం. అద్భుతమైన ఉచ్చారణ. రాళ్లపల్లి గారిని జియన్ రెడ్డి గారిని రెండు పద్యాలలో బ్రహ్మాండంగా స్తుతించినాడు. ఆ పద్యాలు ముందుగా అల్లినవే! ఆ కిటుకు మాకు తెలుసు కాబట్టి అప్పటికప్పుడు వెళ్లినట్లు నటన! రామారెడ్డి సంస్కృత ఏకాక్షర నిఘంటువును బాగా కంఠస్థం చేసినట్టుంది. నిషిద్ధాక్షరి పమగనామాల బాలకృష్ణయ్యకు ఎక్కడ దొరకాలేదు. సమస్య దత్తపది అన్నీ అవలీలగా లాగించినాడు. అంతా ఒకటిన్నర గంటలో అవధానం చేసినాడు. రాళ్లపల్లి గారు రామారెడ్డి ధారను ధారణను మెచ్చుకుండాడు. చివర అద్భుతమైన సన్మానం. పట్టు శాలువా కప్పి 516లతో సత్కరించినారు. ఇంకా ఎవురెవరో రామారెడ్డికి శాలువల కప్పి పూలహారాలు వేసి సన్మానం చేసినారు. యువ విద్యార్థుల కరతాళ ధ్వనులతో హాలంతా దద్దరిల్లిపోయింది
మేము రామారెడ్డిని కలుసుకొని చేతులు కలిపి అభినందించి బయలుదేరినాం. నా చూపులు రోడ్డు మీద ఉండాయి గాని మనసునిండా రామారెడ్డి అవధానం, విద్యార్థుల కరతాల ధ్వనులు, సన్మాన హంగామా కనిపిస్తా ఉండాయి. సద్యః ఫలితం అంటే ఇదేనేమో! అవధానం అయిపోయిన వెంటనే సన్మాన సత్కార ఫలితాలు శ్రోతల అభినందన కరతాల ధ్వనులు పెద్ద పెద్ద వ్యక్తుల దృష్టికి ఎక్కడం, రేపు వార్తాపత్రికలలో ఫోటోతో కూడిన వార్త! శ్రమకు తగిన ఫలితం! ఇంతకన్నా ఇంకేమి కావల్ల!
అద్భుతం, మహాద్భుతం! మిత్రులతో రూము చేరుకుండాను. ఆ తరువాత నాలుగైదు దినాలు ఆ అవధాన దృశ్యాలే వెంటాడినాయి. పద్యాన్ని అమత అలవోకగా అల్లగలగడం నేర్చుకోవల్ల! సాధన చేయల్ల! విషయపరిజ్ఞానం కోసం ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదవల్ల! ఆ మాదిరిగా రెండు మూడు నెలలకు ఒక అవధానం చేస్తే 116 లతో సన్మానం పొందితే విద్వాన్ చదువు ఇబ్బంది లేకుండా ముగించొచ్చు! అయితే ఎవురు అటువంటి అవకాశం నాకు కలిగిస్తారు? కలిగించినా, రామారెడ్డి మాదిరి అలవోకగా అవధానం చేయగలనా? ఆయన ప్రొద్దుటూరు రెడ్డి! సంపన్నమైన ప్రాంతం నుంచి వచ్చినాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉండి ఉంటాయి. పైగా ఏ విద్వాన్ హాస్టల్ వసతి ఉంది. వాళ్లకు కూటికీ గూటికీ దిగులు ఉండదు. అందుకే ప్రశాంతంగా చదువుకుంటా, కావలసినంత సాహిత్య పాండిత్యాలను సమకూర్చుకున్నాడు. నా బతుకు అట్లా కాదు కదా! నిరంతరం కూడు గూడు గురించే దిగులు! ఈ దిగులే వెంటాడుతా వేధిస్తా ఉంటే ఇంకెట్ల నేను చదువుకోగలను? చదువుకున్న దానిని ధారణ పట్టగలను? అయినా పట్టుదలతో సాధించల్ల! ఎట్లైనా సరే సాధించల్ల!
మనసులో గట్టిగా నిర్ణయించుకొని, దృఢ సంకల్పంతో ఒకవైపు చదువుకుంటా మరొకవైపు పద్య రచన సాధన చేయసాగినాను. పద్యధార సరళంగా అర్థవంతంగా కుదిరినప్పుడు, సామాజికాంశాలను వస్తువులుగా చేసుకొని బిచ్చగాళ్లపైన, మునిసిపాలిటీ స్కావెంజర్ల పైన, బజార్లలో రైల్వే స్టేషన్లలో బతుకులీడుస్తున్న అనాథల పైన పద్యాలు రాసి ఒక మంచి శీర్షిక పెట్టి ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక భారతి వంటి పత్రికలకు పంపడం మేలని రాయడం మొదలుపెట్టినాను.నా ప్రోద్బలంతో సన్నప్ప ఒక ట్రాన్సిస్టర్ రేడియో తెచ్చినాడు. అందులో వారానికి ఒకసారి సమస్యాపూరణ కార్యక్రమం వింటా వచ్చే వారానికి ఇచ్చే సమస్యను రాసుకొని ఒక గంట లోపల సమస్య పురాణ చేసి కడప రేడియో స్టేషనుకు పంపసాగినాను.
అందని దానికోసం ఆరాటపడుతూ నిరంతర సంఘర్షణతో..
పత్రికలకు పంపినవన్నీ తిరిగి వస్తా ఉండాయి. అదీ, తగినన్ని స్టాంపులు కరిపించిన కవర్ జతపరిచినప్పుడే పంపిన పద్యాలు తిరిగొస్తాయి. వచ్చినప్పుడు ఆ దినమంతా నిరాశానిస్పృహలు! కవర్ జత చేసి పంపకుంటే ఎన్నాళ్ళైనా ఏమీ తెలియదు. పంపిన పద్యాలను రెండు మూడు సార్లు మళ్లీ పరిశీలిస్తాను. శబ్ద దోషాలు గానీ ఛందో దోషాలు గానీ వెతికినా కనిపించవు. పద్య ధార, విషయం, భావం పేలవంగా ఉన్నాయా అని, పత్రికలలో ప్రచురింపబడిన పద్యాలతో పోల్చి చూస్తాను. దేనికీ తీసిపోనట్లు కనిపిస్తాయి. మరెందుకు పత్రికల వాళ్ళు ప్రచురించడం లేదు? పత్రికల కార్యాలయాల్లో తెలిసిన వాళ్ళో ప్రమోట్ చేయగలిగిన వాళ్ళో ఉండల్లనా? అనామకుణ్ణి! నాకెవురు ఈ వయసుకే పరిచయం అవుతారు? శాస్త్రి శర్మ రెడ్డి చౌదరి అని పేర్ల చివరన ఉండల్లనా? చూస్తా ఉంటే ఉండల్లనేమో!
నిరంతరం ఇవే ప్రశ్నలు! కాలేజీకి పోయి పాఠాలు వినడానికి గుడకా ఒక్కొక్కసారి బుద్ధి పుట్టదు. అంతులేని నిస్పృహ! రాసిన పద్యాలను అవధానం మిత్రులకు చూపించి వాళ్ళ అభిప్రాయాలను అడుగుతాను! ఎక్సలెంట్‌గా ఉండాయని అభినందించి, పత్రికలలో రానంతమాత్రాన ఫీల్ కావలసిన అవసరం లేదని ఓదారుస్తారు. వాళ్ల పద్యాలు కూడా ఏ పత్రికలోనూ రాలేదని తెలిసి, కొంచెం వూరట చెందుతాను. మాచిరాజు పద్యాలు ఒకటి రెండుసార్లు భారతిలో వచ్చినాయి అని కొద్దిగా ఈర్ష్య పడతాను. వెంటనే రామారెడ్డి పద్యాలు కూడా చాలాసార్లు పత్రికల నుంచి తిరిగొచ్చినాయని తెలిసి మాచిరాజు పద్యాలను పదే పదే పరిశీలిస్తాను.
పత్రికల వ్యవహారం ఇట్లుంటే రేడియో స్టేషన్ వాళ్లయినా ప్రోత్సహిస్తారని సమస్యా పూరణ కార్యక్రమానికి పద్యాలు పంపితే 15 నిమిషాల కార్యక్రమంలో ఆరేడు మంది సమస్యా పురాణం పద్యాలను వినిపించినప్పుడు తప్పక నా పురణపద్యాన్ని సెలెక్ట్ చేసుకుంటారని ఆశపడి పంపి సాగినాను. కానీ ఎప్పుడూ నా పద్యాన్ని ఎంపిక చేసుకోలేదు. దాంతో మరింత కుంగి పోసాగినాను. ఒక వైపు కుంగిపోతా మరొకవైపు మరింత పట్టుదలను పెంచుకోసాగినాను. పోయిన వారం ఆకాశవాణి సమస్యా పూరణ కార్యక్రమంలో “దారము లేని హారము నితంబిని నీకెవరిచ్చిరో గదే!” అనే సమస్యను ఇచ్చినారు. నేను జాగ్రత్తగా ఆ సమస్యను ఉత్పలమాల పాదముగా, చెప్పుతున్నప్పుడే గుర్తించినాను. ఇదే కాదు ప్రసిద్ధ వృత్త పద్యాలలో ఆటవెలది తేటగీతి మొదలైన ఉపజాతి పద్యాలలో ఒక పాదం విన్న వెంటనే అది ఫలానా పద్యపాదమని సులభంగా గుర్తించగలగడం అలవాటైపోయింది. శృంగార రస స్ఫోరకమైన పై సమస్య పాదాన్ని రాసుకొని, శృంగారభరితంగానే పూరించాలని ఒక గంట సేపు ఆలోచన చేసి సమస్యను పూరిస్తా, పద్యం అల్లి స్వామికి వినిపించినాను. స్వామి మురిసిపోతా మెచ్చుకుండాడు.
“మారునికేలిలో నలసి మత్తిలి అట్టులె శయ్యనింప,మం
దారపు హారమాయెదను తత్తను భారము చేత నొక్కులన్
హారము వోలె జేయ నుదయాననె స్నానము చేయబోవు నా
చారు మనోహరాక్షిగని సారసవాక్కుల కాంతుడిట్లనెన్
దారము లేని హారము నితంబిని నీకెవరిచ్చిరో గదే!”
పంచ పది ఉత్పలమాలను స్వీకరిస్తారో లేదో అని సందేహిస్తూనే పంపినాను.
సమస్యా పూరణ చేసిన వాళ్ళ పేర్లను చెప్పి పద్యాలను రేడియోలో వినిపిస్తా ఉండారు.ఇద్దరూ నా మాదిరే పంచపద ఉత్పలమాలలో సమస్యాపూరణ చేసినారు. దాదాపు నా భావాన్నే కొంచెం సరసంగా చెప్పినారు.వాళ్ల పేరు కోడూరు సాంబిశివరావు,ప్రభాకరశాస్త్రి అని చెప్పి పద్యాలను వినిపించినారు. నా పూరణ పద్యం గుడకా వస్తుందని ఆశపడినాను. రాలేదు. వాళ్ళు ఎవురో, ప్రభాకర్ శాస్త్రి, కోడూరు సాంబశివరావు పేర్లు విన్నవే! ప్రసిద్ధులు కాబట్టి వాళ్ళ పద్యాలను తీసుకుండారేమో! ఈ ఆలోచన రాగానే మనసులో అసంతృప్తి జ్వాలలు రగులుకుండాయి
పద్యాలు రాస్తున్న సమయంలోనే రెండు కథలు రాసి ఆంధ్రప్రభకు, జ్యోతికి పంపినాను. నాలుగైదు గేయాలు రాసి భారతికి, ఆంధ్రపత్రిక వారపత్రికకు పంపినాను. రెండు నెలలైనా పత్రికలలో రాలేదు. కథలు తిరిగి వచ్చినాయి. చాలా రోజుల నుంచి రాస్తున్న పరాజితులు నవలను పూర్తి చేసి శింగమనేని నారాయణకు చూపించినాను. అతడు ఒక పది పేజీలు చదివి, నువ్వు ఎన్ని నవలలు చదివావని అడిగినాడు. నాలుగైదు చదివినానని వాటి పేర్లు చెప్పినాను
‘ఇంకా 20, 30 నవలలు చదువు. ఈ నవలను ఒక పది సంవత్సరాల తర్వాత మళ్లీ నువ్వే చదువు. అప్పుడు కూడా బాగుందని నీకు అనిపిస్తే, ఎవరినైనా పబ్లిషర్స్ ను అప్రోచ్ అయి, ప్రింట్ చేయించు’ అని నవల బాగుంది బాగలేదని ఏమీ చెప్పకుండా సలహా ఇచ్చినాడు. నేను ముఖం జాలేసుకుని రూముకొచ్చి ఆలోచన చేయ సాగినాను.
కొన్నాళ్ల కిందట నా పద్యాలను చూపించినప్పుడు ఒక లెక్చరర్ చదివి దోషాలను ఎత్తి చూపి కావ్యాలను అలంకార శాస్త్రాలను బాగా అధ్యయనం చేయమన్నాడు. శింగమనేని నారాయణ 20, 30 నవలలను బాగా చదివి అందరి భాషా శైలిని, సంభాషణలను, శిల్పచాతుర్యాన్ని బాగా ఆకలింపు చేసుకోమన్నాడు. మొత్తానికి అందరూ సాహిత్య సృజనకు ఇప్పుడేమంత తొందర అనే అభిప్రాయాన్ని ఇండైరెక్టుగా సూచించినారు. నిజమేనేమో, బాగా అధ్యయనం చేస్తే తప్ప పద్య రచనకు, కథానిక నవలా రచనకు పూనుకోగూడదేమో, అయితే, నేను చదువుతున్న భారతి పత్రికలోని పద్యాలు, వార పత్రికల్లో వస్తున్న కథలు సీరియల్స్ నా రచనల కంటే ఏమంత గొప్పగా లేవు కదా, నా రచనలు వాటికి ఏమీ తీసిపోవు కదా, మరెందుకు నా పద్యాలను కథలను పత్రికలు ప్రచురించడం లేదు, బహుశా నా దురదృష్టమే దీనికంతా కారణమేమో, అదృష్ట దేవత నన్ను కరుణించదేమో, ఆ వగలాడి నన్ను కన్నెత్తి చూడదేమో, ఎప్పుడు నా జీవితంలోకి వెలుగొచ్చేది?నా రచనలను అచ్చులో చూసుకుండే భాగ్యం నాకిప్పుడే కలగదా?
రకరకాలుగా నా దురదృష్ట జీవితాన్ని గురించి చింతిస్తా, అయినా నేను చదివిన సాహిత్యం ఎంత? సాహిత్యం చదవబట్టి ఇంకా రెండేళ్లయినా కాలేదు కదా! అప్పుడే సత్కార సన్మానాల కోసం ఆరాటపడితే ఎట్ల? ఇన్నూరు మున్నూరు పద్యాలను కష్టపడి రాసినంత మాత్రాన ఒక కవిగా గుర్తింపు పొందాలని అనుకోవడం అవివేకం కాదా? కాళిదాసంతటి మహాకవి, “మందః కవి యశః ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్ ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామనః” అని ఎంతో వినయంగా చెప్పుకుండాడు కదా, అటువంటప్పుడు నేనెంతటి వాడ్ని? అర్హత లేకనే పేరు కోసం ప్రాకులాడడం, అందని దానికి అర్రులు చాచడం, ఆశించినది అందకపోవడంతో సంఘర్షణ చెందుతా బాధపడుతా ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవల్ల? అని నన్ను నేను ప్రశ్నించుకుంటా, నాకు నేనే సమాధానం చెప్పుకుంటా పాఠ్యాంశాల పైన దృష్టి పెట్ట సాగినాను.
సాహిత్య విద్యార్థులకు సంస్కారం లేకపోతే ఎట్ల?
కోనయ్య వాళ్ళ కాలేజీలో పెద్ద ఫంక్షన్ ఉందని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పుల్లారెడ్డి వస్తున్నాడని ఆయన మన జిల్లా వాడని చెప్పి నన్ను, మరికొంతమంది మిత్రులను ఆహ్వానించినాడు. విద్వాన్లో నా క్లాస్‌మీట్ ఆచారి, షరీఫ్ ఖాన్, బాబుప్రకాష్లను గుడకా బిలిచినాడు కోనయ్య. మా ఊరి వానిగా నాకు మిత్రునిగా చాలాసార్లు మా కాలేజీకీ నా దగ్గరికీ వస్తా పోతా ఉండడంతో మా కాలేజీలోని నా స్నేహితులు కొంతమంది ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు కోనయ్యకు మంచి మిత్రులైనారు. వైస్ ఛాన్సలర్ పుల్లారెడ్డి కదిరి ప్రాంతం వాడని, ఆ ప్రాంత విద్వాన్ మిత్రులను ప్రేమగా పిలిచినాడు. అందుకే నాతోపాటు కదిరి ప్రాంత మా విద్వాన్ మిత్రులు, వీరభద్రాచారి అందరము కలిసిపోయినాం. మాతో కలిసి షరీఫ్ ఖాన్ రావడం నాకు ఇష్టం లేదు. వాడు పేదరికం నుంచి వచ్చినా చదువు విషయంలో గట్టి వాడే కాకుండా నా అష్టావధానాలలో పృచ్ఛకునిగా పాల్గొని నాకు సన్నిహితుడే అయినా ఈమధ్య కాలంలో వాని బిహేవియర్ నచ్చక వాన్ని పలకరించడం తగ్గించినాను.
మా కాలేజికి ఇంద్రాణి లెక్చరర్‌గా వచ్చింది. ఇటీవలె తన చదువును పూర్తీ చేసుకొని టిటిడిలో పలుకుబడిని ఉపయోగించి ఉద్యోగం సంపాదించింది. రెకమండేషన్‌తో వచ్చినా, ఆమె మంచి విద్యత్తు ఉన్న మనిషే! అట్లనే ఛాయాదేవి గారు కూడా! ఇద్దరూ ఎంత పండితులో అంత అందగత్తెలు! ఛాయాదేవి చాలా హుందాగా గంభీరంగా సభ్యతగా ఉంటుంది. క్లాసులో విద్యార్థుల వెకిలి చేష్టలను సహించదు. పైగా ఆమె శ్రీమతి. అందుకే ఆమె ఎవరికీ చనువియ్యదు.
ఇంద్రాణి లెక్చరర్ ఛాయాదేవి గారి కంటే భిన్నంగా ఉంటుంది. చామన ఛాయతో చాలా అందంగా ఉంటుంది. అందంతో పాటు కొంచెం వగలు పోతా ఉంటాది. ఆమె క్లాసులోకి వస్తే ఎవురూ లెక్చరర్ అని అనుకోరు. దాదాపు మాకు సమ వయస్కు రాలే! ఆమె కన్నా ఐదారేండ్ల వయసుండి, భార్యా పిల్లలున్న విద్యార్థులు మా క్లాసులో ఉండారు. అటువంటప్పుడు ఛాయాదేవి గారి మాదిరి హుందాగా వుండల్ల! కానీ ఇంద్రాణి లెక్చరర్ ఛాయాదేవిగారికి భిన్నంగా సరసోక్తులు విసురుతా వయ్యారాలు పోతా ఉంటుంది. పైగా పెండ్లి కాని మనిషి! అందుకే, ఆమె పాఠం వినకుండా మా క్లాసులో కొంతమంది చొంగ కార్చుకుంటా, ఆమె వైపు చూస్తా ఉంటారు. అందులో షరీఫ్ ఖాన్ మొదటివాడు. వాడు ఈ మధ్యలో ఆమెను ద్వంద్వార్థాలతో మాట్లాడుతా శృంగార పద్యాల్లోని స్తనములు, గుబ్బలు, చన్గవలు, వక్షోజాల వంటి పదాలను ఒత్తి పలుకుతా వాటిని వివరించమని నిలదీసి అడుగుతా ఉండాడు. ఆమె వివరించకుండా దాటవేస్తూ ముందుకు పోతే వాడు ఏకవచన ప్రయోగంతో సంభోదిస్తా, భారతంలో ద్రౌపది నల్లగా ఉన్నా మహా సౌందర్యవతి అని, ఆమెను కృష్ణ అని కూడా అంటారు కదా, ఆ మాదిరిగానే నిన్ను కృష్ణ అని పిలవచ్చునా మేడమ్ అని కుసంస్కారంగా ప్రశ్నించినాడు. ఆమె గడుసరిగా జాణతనంతో బదులిచ్చి వాని నోరు మూయించింది. అప్పటినుంచి షరీఫ్ ఖాన్ మీద నాకు చులకన భావం కలగసాగింది. అందుకే వానిని పిలవద్దని చెప్పినా పిలిచినాడు కోనయ్య. తప్పని పరిస్థితుల్లో నేను వానితో కలిసి పోవాల్సి వచ్చింది.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
