Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-32

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

వొగ పనిమనిషి కొడుకు వైస్ ఛాన్సలర్ అంట!

అగ్రికల్చర్ కాలేజీ కాంపౌండ్ లోకి అందరమూ చేరుకుండాం. ఆ ప్రెమిసిస్ అంతా చూస్తా నేను ఆశ్చర్య పోయినాను. అంతా చిట్టడవి. అన్నీ కంపచెట్లు. చిత్తూరు రోడ్డుకు రైల్వే లైనుకు దగ్గరగా మూడు బిల్డింగులు కట్టినారు. నాలుగోది హాస్టల్ బిల్డింగ్ కడతా ఉండారు. అది తయారైతే మేము దాంట్లోకి పోతామని, ఆ కొత్త హాస్టల్ బిల్డింగ్‌లో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రూమ్ అలాట్ చేస్తారని మొత్తం 360 ఎకరాల్లో తమ కాలేజీ ఉందని గర్వంగా చెప్పినాడు కోనయ్య. ప్రస్తుతానికి వెటర్నరీ కాలేజీ రోడ్డు గుండానే తమ కాలేజీకి రావల్లని, బిల్డింగ్స్ అన్నీ కట్టడం అయినంక తమ కాలేజీకి వేరే రోడ్డు వేస్తారని, మమ్మల్ని కాలేజీలోకి పిలుచుకొని పోయినాడు కోనయ్య. అక్కడున్న శిలాఫలకాలను చూసి కాలేజీ ఈ మధ్యనే ప్రారంభమైందని అర్థమైంది నాకు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నూకల రామచంద్రారెడ్డి 27-10-1961 నాడు తిరుపతి అగ్రికల్చర్ కాలేజీకి శంకుస్థాపన చేసినాడు. కాలేజీ బిల్డింగుల నిర్మాణం కోసం దేవస్థానం 40 లక్షల రూపాయలు, ఒక బొంబాయి వ్యాపారవేత్త 20 లక్షల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలుసుకొని అబ్బురపోయినాను. పెద్ద పెద్ద షావుకార్లకు లక్ష రూపాయలంటే ఒక రూపాయితో సమానమేమో! ఎన్నో కోట్లు డబ్బుంటే కదా లక్షలు లక్షలు విరాళాలు ఇవ్వగలిగేది! అంతంత డబ్బు ఎట్ల సంపాదిస్తారొ! అనుకుంటా 20-3-1965 నాడు భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆ కాలేజీని ప్రారంభించినాడని తెలుసుకుండాను.

వ్యవసాయ శాస్త్రం చదువుకోడానికి ఎంత భారీ ఎత్తున కాలేజీ కడతా ఉండారు! మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అగ్రికల్చర్ కాలేజీలు ఉండేది మూడే నంట! ఒకటి హైదరాబాదులో, రెండోది గుంటూరు జిల్లా బాపట్లలో, మూడోది తిరుపతిలోనే అంట! వెంకటేశ్వర స్వామి దయ వల్ల తిరుపతిలో ఎన్ని విద్యాలయాలో! ఎన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉండారో!ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయో వుండాయో!

ఆలోచిస్తా మీటింగుకు పోయినాం. మీటింగ్ హాలు చూసి అబ్బురపోతా కోనయ్య ఎంత అదృష్టవంతుడు? అందరికీ ఇటువంటి చోట చదువుకోవడానికి వీలయితుందా? అని అనుకుంటా అద్భుతమైన మెత్తని సీటు మీద స్నేహితులతో కలిసి కూర్చుండాను.

ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన శ్రీ ఓ పుల్లారెడ్డి గారిని ఒక ప్రొఫెసర్ వేదిక మీదికి ఆహ్వానించి పరిచయం చేసినాడు.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి1964 వరకు అనుబంధంగా ఉండిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల 1964 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోకి వెళ్లిందని, కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయానికి మహా మేధావి, బ్రిటిష్ గవర్నమెంట్ లో ఐసిఎస్ సాధించిన ఒ.పుల్లారెడ్డి గారు బాధ్యతలు చేపట్టి వ్యవసాయ ప్రధానమైన దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన పరిణామాలకు రూపకల్పన చేస్తున్న వ్యవసాయ ప్రేమికుడని, అంతటి ధీశాలి గత జీవితం లక్షలాదిమంది పేద విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిదాయకమైనదని, ఆయన జీవిత నేపథ్యాన్ని వివరించినాడు.

ఓ పుల్లారెడ్డి గారు ఒక నిరుపేద రైతుబిడ్డ. అనంతపురం జిల్లా కదిరి తాలూకా దొరిగల్లు దొరగారి సహాయ సహకారాలతో చదువుకొని పై చదువులకు లండన్‌కు వెళ్లి పట్టుదలతో ఐసిఎస్ సాధించి పైకెదిగిన మహా కార్యశూరడు! వొగ నిరుపేద రైతుబిడ్డగా చిన్నతనంలో కష్టాలు కన్నీళ్లు బాధలు అన్నీ అనుభవిస్తూ స్వయంకృషితో మహా విద్యావంతుడై ఆంధ్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ అయి, విశ్వవిద్యాలయాన్ని దేశంలో అత్యున్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతున్న మహా విద్యావేత్త అని, సాంప్రదాయకమైన వ్యవసాయ వంగడాల వల్ల సమకూరే వ్యవసాయ ఉత్పత్తులు దేశాభివృద్ధికి దోహదపడవని గ్రహించి, అన్ని రకాల కొత్త వంగడాల రూపకల్పన విషయంలో రసాయనిక ఎరువుల క్రిమిసంహారక మందుల తయారీలో వ్యవసాయ శాస్త్రవేత్తలకు తగిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి బాటలు వేసినాడని గొప్పగా పుల్లారెడ్డి గారిని గురించి తెలియజేసినాడు. ఆ మాటలతో నా ఒళ్ళు గుగుర్పాటు చెందింది. పుల్లారెడ్డి గారి జీవితం నన్ను కళ్ళు తెరిపించింది. నేనే పేదవాన్ని అనుకుంటే లక్షలాదిమంది దుర్భర దారిద్ర్ం నుంచి అత్యున్నత స్థాయికి చేరుకుండారని, ఆయన జీవితం నా వంటి వానికి గొప్ప స్ఫూర్తిదాయకమని నిర్ణయించుకుండాను. పుల్లారెడ్డిగారు ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడినారు. మీటింగు అయిపోయిన తర్వాత అందరమూ కోనయ్య ఉంటున్న హాస్టలుకు పోయినాం.

హాస్టల్ దగ్గర కోనయ్య తన సీనియర్ విద్యార్థిని పరిచయం చేస్తూ ఈయన పేరు మల్రాయుడు, మన ప్రాంతం వాడే, బుక్కరాయసముద్రం నేటివ్ ప్లేస్ అని చెప్పసాగినాడు. అతన్ని చూడగానే నేను వెంటనే గుర్తించినాను. బుక్కరాయసముద్రం మాగాణిలో మడకలు దున్నడానికి పోయిన దినాలు, అక్కడ బోయగిరిలో రామస్వామి దేవాలయంలో దిగి పది రోజులపాటు పడిన కష్టాలు, దేవాలయం దగ్గర ఉన్న ఇంట్లో మల్రాయున్ని చూసిన సందర్భాలు అన్నీ మనసులో మెదిలినాయి. అతడు నన్ను చూస్తూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అడిగినాడు. ఎక్కడ చూసినారో చెప్పండి అని నేను రెండుసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. నేనే విషయాన్ని సందర్భాన్ని చెప్పినాను అప్పుడు గుర్తించినాడు మల్రాయుడు.

దొరిగల్లు భూస్వాముల దుర్మార్గాలు – షరీఫ్ ఖాన్ కథనం!

స్నేహితులందరమూ కోనయ్య హాస్టల్ రూమ్‌లో కూర్చుండాం. మల్రాయుడు గుడకా మాకు తోడైనాడు. అందరమూ దొరిగల్లు దొరగారి విషయాన్ని ప్రస్తావించకుండాం. అనంతపురం జిల్లాలో నన్నూరు ఐన్నూరెకాల భూములుండే చిన్న చిన్న భూస్వాములు ప్రతి తాలూకాలో పదీ పదైదు మంది ఉండారు. చాలా పెద్ద భూస్వాములు ఉరవకొండ దగ్గరుండే కౌకుంట్ల కేశన్న, పుట్టపర్తి దగ్గరుండే పాముదుర్తి బయపరెడ్డి, కదిరి దగ్గరుండే దొరిగల్లు దొరలు వీళ్లు ముగ్గురేనని కేశన్నకు దాదాపు మూడు వేల ఎకరాల నల్ల రేగడి భూములుండాయని జనమంతా చెప్పుకుంటా ఉండారని ఆ భూములే గాక దాదాపు అనంతపురం జిల్లాలోని కల్లు వ్యాపారమంతా అతని ఆధీనంలో ఉందని కేశన్నను గురించి నాకు మా నాయన చెప్పిన విషయం అంతా వివరించినాను.

దొరిగల్లు భూస్వాములు చాలా దుర్మార్గులని, వాళ్ళ దుర్మార్గాలను గురించి మా ప్రాంతంలో చాలా భయంకరంగా చెప్పుకుంటారని, అటువంటి వాళ్ళు తమ దగ్గర పనిచేసే ఒక నిరుపేద రైతు బిడ్డను ఉన్నత చదువులు చదివించినారన్న సంగతి, వాళ్ళ దుర్మార్గమైన జీవితాల్లోని మరొక కొత్త కోణాన్ని త తెలుపుత ఉందని, దొరిగల్లుకు సమీపంలో ఉన్న కొడవండ్లపల్లి వాసిగా మన షరీఫ్ ఖానుకు దొరిగల్లు భూస్వాముల దురాగతాలు చాలా తెలిసే ఉంటాయని, అందులో నిజమెంతో కల్పితమెంతో షరీఫ్ చెప్పాలని మిత్రుడు వీరభద్రాచారి అడిగినాడు. షరీఫ్ కొంచెం సేపు మౌనంగా ఉండి ఏమి గుర్తుకొచ్చిందో ఏమో, కండ్లల్లో నీళ్లు నింపుకొని బరువుగా నిట్టూర్పు విడిచి చెప్పుసాగినాడు.

మా తాత ముత్తాతల కాలం నుంచి దొరిగల్లు దొరల దౌర్జన్యాలు సాగుతానే ఉండాయి. ఎవురూ వాళ్లకు ఎదురు చెప్పే వాడే లేడు. ఎవురైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్లకు భూమ్మీద నూకలు చెల్లినట్లే! కొత్త మనిషి వాళ్ళ ఇంటి పరిసరాల్లో పారాడితే చాలు రెడ్డి మనుషులు వాన్ని ఎత్తుకొని పోయి దొర ముందర నిలబెడతారు. వాని మీద ఏదైనా అనుమానం వస్తే స్తంభానికి కట్టేసి కొరడాలతో కొడతారు. ఆ ఊర్లో యా మొగోనికి పెండ్లి జరిగినా కాపురానికొచ్చే కొత్త కోడలు ఫస్ట్ నైట్ దొర దగ్గర పండుకోవలసిందే! శోభనం దొర ఇంట్లోనే! కాదు గీదని ఎదురు తిరిగితే కొరడాలతో కొట్టి బలవంతంగా లొంగదీసుకుంటాడు.

ఇంక ఇల్లంటే, అది ఇల్లు కాదు. రాజమహలే! వాళ్ళ పూర్వీకులు పాలగాల్లంట! అందుకే ఇంటి చుట్టూ కోట గోడ! లోపల పెద్ద బురుజు! ఇంటికి దగ్గరగా మూడు నాలుగు ఎకరాలంత దొడ్డి! పొలాల్లో ఉండే మాసూలంతా దొడ్లో ఉండే షెడ్లలోనే! పరిసరాల్లో ఉండే పంట భూములన్నీ వాళ్ళవే! మా కదిరి తాలూకా వేరుశెనగ పంటకు ప్రసిద్ధి కదా, వర్షాలు బాగా వచ్చి ఒక రకంగా పంట పండితే కారుకు లక్ష మణువులు అంటే 25 వేల బస్తాలు శనక్కాయలు అయితాయి దొరకు. అంత పంట వచ్చినా అతగాళ్లకు ఇంకా ఆశ! అందుకే దగ్గరుండి తాండాల్లోని సుగాలోళ్ళను ఎరుకలోళ్ళను సుమారుగా ఒక నూరు మంది సైనికుల్ని పెట్టుకొని వాళ్లతో దొంగతనాలు చేయించి, వచ్చిన దొంగ సొమ్ములు తాను సగం తీసుకొని మిగతాది వాళ్లకు పంచుతాడు! దొంగతనం చేసినోళ్లు ఎవురైనా పోలీసులకు దొరికితే వాళ్ల మీద కేసు లేకుండా అంతా దొర చూసుకుంటాడు! మా ప్రాంతంలో యా దొంగతనమూ దొరకు తెలియకుండా జరగదు.

ఇదంతా ఎట్లన్నా కొల్లబోనీ, పొలాల్లో దొడ్లల్లో పనిచేసే కూలోళ్లకు కూలి, రెడ్డి ఎంత ఇస్తే అంతే! అదెట్లా ఇదెట్లా అని మాట్లాడేకి వీల్లేదు! ఎవుడైనా నీలిగి మాట్లాడినాడా వాడు మళ్ళీ కనిపించడు. ఏమైనాడో గుడకా ఎవురికీ తెలియదు. మూడెకరాలంతుండే దొడ్లో చివర ఒక మూల పెద్ద గుంత తవ్వించినాడంట! కనిపించకుండా పోయిన వ్యక్తులు, ఆ గుంత లోపల మళ్లీ తవ్విన చిన్న చిన్న గుంతల్లో మట్టిలో శాశ్వతంగా కలిసి పోతారంట! ఆ గుంత దగ్గరికి, దొరకు చాలా నమ్మకస్తులైన ఐదారు మంది తప్ప ఇంకెవురూ పోవడానికి వీలుండదంట! దొర పొలాల్లోకి కూలికి పోతావుండిన మా దగ్గర బంధువు కనిపించకుండా పోయినాడు నారాయణా! అట్లే ఈ మధ్యనే నా జతగాడొకడు పెళ్లి చేసుకుండాడు. కొత్తపెళ్లికూతురు కాపురానికి వచ్చింది. అమ్మాయి బాగుంటాది. ఆమె మీద రెడ్డి కన్ను పడింది. వచ్చిన రెండో రోజే ఆమె ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. వాడు మతి చెడి ఊరు వొదిలి పోయినాడు.

ఇదర్రా మా దొరిగల్లు దొరల కథ అని చెప్పి మళ్ళీ మాట్లాడలేకపోయినాడు షరీఫ్. బాధతో ఆవేదనతో అతని గొంతు పూడుకుపోయింది. మా గుండెలు బరువయిపోయినాయి. మనం రాజరిక వ్యవస్థలో ఉండామా ప్రజాస్వామ్యంలో ఉండామా అని అందరమూ ప్రశ్నించుకుండాం. ఎవురి ప్రశ్నకూ జవాబు కనిపించలేదు అందరమూ టౌన్లోకి బయలుదేరినాం. ఎటూ ఇంత దూరమొచ్చినారని కోనయ్య మాకు వెటర్నరీ కాలేజీని చూపించినాడు. దాని పేరు శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల. దాన్ని గుడకా వెంకటేశ్వర స్వామి డబ్బులతోనే దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కట్టినారు. ఆ పేరుతో కళాశాలను మొదట బాపట్లలో అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి 1955లో ప్రారంభించినాడని, ఆ తర్వాత అక్కడి నుంచి 1957లో తిరుపతికి మార్చబడిందని తెలిసి, శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో ఎస్వీ యూనివర్సిటీ ఏర్పడినట్లే తిరుపతిలోని ఈ కాలేజీలన్నీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశువైద్య విశ్వవిద్యాలయం అనే పేర్లతో భవిష్యత్తులో మార్పు చెందవచ్చునని, భక్తి పేరుతో భక్తులందరూ స్వామి హుండీలో వేసే సొమ్మంతా ఈ విధంగా ఉపయోగపడు తున్నందుకు అందరమూ చాలా సంతోషపడినాం. కోనయ్య వెటర్నరీ కాలేజీ విషయాలు చెప్పుతా అందులో పని చేసే లెక్చరర్ డాక్టర్ ఘంటశాస్త్రి, పరమ నిష్ఠాగరిష్ట బ్రాహ్మణుడని, అటువంటి సనాతన బ్రాహ్మణుడు తన ఇంట్లో ఎన్టీ రామారావు శ్రీకృష్ణుని వేషంలో ఉన్న ఫోటోకు ఫ్రేమ్ కట్టించి పూజిస్తాడని అనడంతో అందరమూ ఆశ్చర్యపోతా ఇల్లు చేరుకుండాం.

విద్వాన్ ప్రిలిమనరీ పరీక్షలు – నా బలహీనతలు!

విద్వాన్ ప్రిలిమినరీ పరీక్షలు దగ్గరయ్యే కొద్దీ కొంచెం ఆందోళన మొదలైంది. పరీక్షల భయంతో కాదు. అసలు పరీక్షలంటే అంతరాంతరాళాలలో ఎక్కడా కించిత్తు గుడకా భయం లేదు. ఫెయిల్ అయితానేమో నన్న సందేహం ఏ కోశానా లేదు. ఎందుకంటే కాలేజీలో చేరిన ఐదారు నెలలకే ప్రతి సబ్జెక్టు కరతలామలకమయినట్లు అనిపించ సాగింది. వ్యాకరణం, చందస్సు, అలంకారాలు విద్వాన్ విద్యార్థులకు నేనే బోధించగలనన్న ఆత్మవిశ్వాసం ఏర్పడింది. అందుకే ఈ పరీక్షలంటే భయం ఏమాత్రమూ లేదు. నా మిత్రులకు నా రూమ్‌మేట్సుకు చాలా మందికి ఈ పరీక్షల్లో అందరికంటే నాకే ఎక్కువ మార్కులు వస్తాయన్న విశ్వాసముంది. నాపై వాళ్ళకున్న విశ్వాసాన్ని నిలబెడతానా లేదా అని మాత్రం మనసులో ఆందోళన అప్పుడప్పుడు కలుగుతావుంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఆందోళనను తగ్గించుకుంటా ధైర్యంగా చదువుతా పరీక్షల హాల్ టికెట్ తీసుకుండాను.

మొదటి దినం ప్రబంధాల పేపర్ ప్రశ్నపత్రం చూడగానే చాలా సులభంగా తోచింది. అన్నీ అనుకున్న ప్రశ్నలే వచ్చినాయి. రాయడానికి పూనుకుండాను. ఆరు ప్రశ్నలకు జవాబులు రాయల్ల. సమయం మూడు గంటలు. అయితే ఒక ప్రశ్నకే గంట సమయం తీసుకుండాను. మిగిలిన రెండు గంటల సమయంలో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయల్ల.ఎట్ల రాయల్ల? సమయం సరిపోదు. ఆలోచన రాగానే ఆందోళన మొదలైంది. ఒళ్లంతా చెమట పట్టింది. జవాబులు తెలియక పోవడం వల్ల కలిగిన భయాందోళన కాదు. సమయం సరిపోదని అనుకోవడంతో కలిగిన ఆందోళన. ఆందోళన పెరిగింది. వీర్య స్థలనం అయ్యింది. అట్లే ధైర్యంతో పరీక్ష రాసినాను. అన్నీ తెలిసిన ప్రశ్నలే! ఇచ్చిన 12 ప్రశ్నలకు తగినంత సమయం ఇస్తే అలవోకగా రాయగలను. కానీ టైం అడ్జస్ట్ చేసుకోలేక పరీక్ష తృప్తిగా రాయలేక అసంతృప్తిగా పరీక్ష హాల్లోనుంచి బయటకు వచ్చి, ప్యాంటు వెనక వైపున ఏర్పడిన మరకనంతా చాటుకు పోయి కర్చీఫ్‌తో తుడుచుకొని, సిగ్గుతో తలొంచుకొని రూముకు చేరుకుండాను.

మనసంతా ఒక గంట సేపు వికలమయ్యింది. ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? ఇంతకు ముందు కవిత్వ పోటీలకు ఇట్లనే జరిగింది! ఎవురికీ జరగని విధంగా నాకే ఎందుకు జరుగుతా ఉంది? భయాందోళన కలిగినప్పుడల్లా ఇట్ల జరిగితే ఎంత కష్టం? ఇది ఏదేమైనా జబ్బ! జబ్బయితే దీనికి మందు ఉంటుందా? డాక్టర్ దగ్గరికి పోయి ఏమని చెప్పాల్ల? ఎంత సిగ్గుచేటు? విపరీతమైన కామ వాంఛను పెంచుకోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందేమో! ఇది నా బలహీనతేమో! ఏమైనా ఇట్ల కాకూడదు! నన్ను నేను ఓవర్‌గా ఊహించుకోవడం వల్లనే ఈ భయాందోళనలు కలుగుతున్నాయేమో! ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవడం మంచిది!

చాలాసేపు ఆలోచన చేసి జరిగిన దానికి దిగులు పడనవసరం లేదనుకొని పేపర్లు ఎవరు దిద్దిన పాస్ మార్కులకు ఢోకా ఏమి ఉండదని ధైర్యం తెచ్చుకొని రేపటి సంస్కృత పరీక్షకు ప్రిపేర్ సాగినాను. సంస్కృతం, నాటకాలు, జనరల్ నాలెడ్జ్ వ్యాకరణం అలంకారాల పరీక్షలు పేపర్లూ తృప్తిగా రాసినాను. పరీక్షలలో నా చేతి వ్రాత బాగుండి ఉంటే ఈ పరీక్షలలో 75% మార్కులు తగ్గవని, నా చేతి వ్రాత సరిగా ఉండనందు వల్ల ఎక్కువ మార్కులు రాకపోవచ్చునని, అయినా సెకండ్ క్లాస్ తప్పక వస్తుందని నిర్ధారించుకుండాను.

ఈ సంవత్సరం ఎండాకాలం సెలవుల్లో రూమ్ ఖాళీ చేయకూడదని రూములోని మిత్రులందరమూ నిర్ణయించుకుండాం. పరీక్షలయిపోగానే నేను స్టయిఫండ్ చెక్కును తీసుకొని బ్యాంకులో క్యాష్ చేసుకుండాను. ఊర్లకు బయలుదేరడానికి ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవల్లని రూము మిత్రులందరూ అనుకుండారు. ఎందుకో నాకు ఈ మధ్యలో కొండకు పోడానికి ముందున్నంత భక్తిశ్రద్దలు లేవు. అయనా అందరితో కలిసి కొండకు బయలుదేరినాను. సర్వదర్శనం ఆలస్యం అవుతుందని నాగసిద్ధారెడ్డి సార్ ద్వారా కొండమీదకి ఒక రికమండేషన్ లెటర్ కూడా తీసుకున్నాం. ఆ లెటర్ బాగా పనిచేసింది. గుడి దగ్గరికి పోయిన అర్ధగంటలో స్వామి వారి దర్శనమైంది. అయితే ఈసారి ఎందుకో దేవుని గుడిలో, పోయిన సంవత్సరం మాదిరి ఒళ్ళు గుగుర్పాటు చెందలేదు. భక్తి భావమేదీ కలగలేదు. ఎందుకో తెలియదు. నిర్లిప్తంగా దర్శనం చేసుకుని వచ్చినాను. రూములో ఉండే మిత్రులందరికీ చెప్పి నేనూ నారాయణస్వామీ ఊరికి బయలుదేరినాం. సన్నప్ప ఓబులేసు మొదటి సంవత్సరం విద్యార్థులు కాబట్టి వాళ్లకు లాస్ట్ వర్కింగ్ డే వరకు క్లాసులు జరుగుతాయని మాతోపాటు బయలుదేరలేదు. నేను ఈసారి స్వామితో పాటు రేణిగుంట మీద రైల్లో బయలుదేరి తాడిపత్రిలో దిగి అక్కడి నుంచి బస్సులో ఊరు చేరుకుండాను.

సాహిత్యాధ్యయనమూ, కూలి పనులూ సమాంతరంగా!

తిరుపతి నుంచి వచ్చిన మరుసటి దినమే శింగనమలకు పోయి గురువుగారిని పలకరించడం అలవాటైపోయింది అందుకే బయలుదేరినాను. వేసవి పంట వరిమళ్ల కోతలకాలం. నేను శింగనమలకు పోతే పదీ పదైదు శేర్ల కూలిగింజలు ఇంటికి రావని నాయనకు బాధ. అయితే నాకు గురువుగారిని కలుసుకోవాలన్న తపన. తపన కంటే తిరుపతి నుంచి వచ్చిన వెంటనే ఆయనను కలుసుకోవడం నా ధర్మం. ఆయన దయ లేకుంటే నా చదువే లేదు కదా! నాకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో విద్యాభిక్ష పెట్టిన ఆ గురువుగారు అంతే ముఖ్యం కదా! అందుకే ఇంట్లో నాయనతో ఘర్షణపడి శింగనమలకు పోయి గురువుగారిని కలుసుకుండాను. ఇంట్లో సారొక్కడే ఉండాడు. జయమ్మక్క పిల్లలు సెలవులకు కడపకు పోయినారని, నాలుగైదు దినాల్లో వస్తారని చెప్పినాడు సార్.సరిగ్గా నేను పోయే సమయానికి గుమస్తా కాఫీ వడగట్టి సారుకు ఒక కప్పులు పోసి ఇచ్చి మిగిలింది కప్పులో పోసుకొని తాను తాగుతా వుండాడు. సార్ నన్ను చూసి తన చేతిలో ఉన్న కాఫీ కప్పును నాకు ఇచ్చినాడు. వద్దన్నా సార్ వినలేదు. గుమస్తా తన మటుకు తాను కాఫీ తాగుతా ఉండాడు. సారు తాను తాగకుండా తన కాఫీ కప్పును నాకు ఇవ్వడం నేను తీసుకోవడం నాకు సిగ్గనిపించింది. గురువు గారి ఇంట్లో నా స్థానం ఏమిటో తెలిసి కూడా గుమస్తా అట్ల వ్యవహరించడం నాకు చివుక్కుమనిపించింది. ఆ సందర్భంలో మనసు ఇబ్బంది పడినా నా పట్ల గురువుగారికి ఉన్న శిష్య వాత్సల్యం ఎంత గొప్పదో తలుచుకొని పొంగిపోయినాను.

ఈ గురు శిష్యుల బంధం, నా మీద గురువుగారికి ఉన్న ప్రేమానురాగం ఇట్లనే చెక్కుచెదరనీకుండా కాపాడు స్వామీ అని మనసులో భగవంతున్ని ప్రార్థించినాను.

గుమాస్తా వెళ్లిపోయిన తర్వాత కాలేజీలో స్టయిఫండ్ ఇచ్చినారని సంవత్సరం పొడుగునా సార్ ఎంఓ ద్వారా పంపిన డబ్బులన్నీ రాసిపెట్టిన పేపర్ చూపించి లెక్క వేసి ఇచ్చినాను. తీసుకోవడానికి సార్ నిరాకరించినా ప్రాధేయపడి చేతికిచ్చినాను. తర్వాత నా చదువు విషయాలు, రాసిన పద్యాల సంగతి, కథల విషయము అన్నీ చెప్పినాను. ఈ మధ్యలో ఆశావాది ప్రకాశరావు స్కూల్లో అష్టావధానం చేసినాడని, అవధానం గొప్పగా లేకపోయినా చక్కగా మాట్లాడినాడని, సాహిత్యం బాగా చదువుకున్నాడని నువ్వు అంతకన్నా ఉన్నతంగా తయారు కావాలని దీవించినాడు. స్కూల్ లైబ్రరీలో కొన్ని నవలలు ప్రాచీన కావ్యాలు తీసుకొని ఊరు చేరుకుండాను.

రేడియోలో మా ఊరి పేరు విని ఊరంతా విస్తుపోయింది!

భయంకరమైన ఎండలు. అంత ఎండల్లో మొదట నాలుగైదు దినాలు వరి కోత పనిలో చాలా అవస్థపడినాను. చదువుకుంటా సేద్యం పనులకు మట్టి పనులకు దూరం కావడంతో అలవాటు తప్పి, మొదట శరీరం సహకరించలేదు. ఏ పని అయినా దానికి దూరమైతే అది చేయడం కష్టమేనేమో! శరీరం నీడ సుఖానికి మరిగితే ఎండ కష్టాన్ని భరించలేదేమో! నీడ సుఖాన్ని ఎండ కష్టాల్ని రెండింటిని సమానంగా భావించే శ్రమజీవులు అందుకేనేమో, దేనికీ పొంగి పోకుండా దేనికీ కుంగిపోకుండా జీవిస్తారనుకుంటా రెండు వారాలపాటు నిర్విరామంగా మడికోతల పని చేసినాను. చేస్తా చాలా బాధపడినాను.

సొంత పని అయితే ఎంత బరువైనా ఇది నాది అనే భావన మనసుకు తృప్తినిస్తుంది. ఎవురూ దానిని కూలి పని అని అనరు. ఎంత చేతనైతే అంత చేసుకోవచ్చు. కూలి పని అట్ల కాదు కదా! ఆ పని ద్వారా వచ్చేది కూలే కదా! పనిచేసే వానిని కూలివాడనే కదా అనేది! అది కష్టమైనా బరువైనా చేయకుంటే కూలి ఇచ్చేవాడు దండిస్తాడు కదా! విద్వాన్ చదువుతా ఇంకా ఎన్నాళ్ళీ కూలి పనులు! పేదోడు ఎంత పెద్ద చదువులు చదువుతున్నా, ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే వరకు పొట్టకూటి కోసరం ఏదో ఒక పని చేయక తప్పదేమో! రేప్పొద్దున ఉద్యోగం వచ్చినా అది గుడకా ఒక రకమైన కూలిపనే కదా! అందుకే కదా, గవర్నమెంట్ ఉద్యోగస్తున్నయినా పల్లెటూరోళ్లు గవర్నమెంట్ నౌకరీ అని అనేది! అయినా, ఊర్లో కొంతమంది చిన్నచిన్న రైతులు గుడకా తమ సొంత పనులన్నీ అయిపోయినంక వేరే వాళ్ళ పొలాల్లోకి కూలి పనులకు పోవడం లేదా! చదువు సందెలు లేని వాళ్ళు అట్లా పోతారు గాని చదువుకుంటా ఉండే రైతుల కొడుకులు, కోనయ్య గానీ ఓబుల నారాయణ గానీ మాదిగ కుళ్లాయప్ప గానీ ఎవురూ కూలి పనులకు పోరు కదా!

రకరకాల ప్రశ్నలు వేసుకుంటా, బాధపడుతా, కష్టాలు కన్నీళ్ళలో నుంచి పైకి వచ్చిన ఓ పుల్లారెడ్డి వంటి గొప్పవాళ్ళను గుర్తుకు తెచ్చుకొని సమాధానపడుతా పొలాల కోరుగింజలూ కూలిగింజలూ అన్నీ ఈ సంవత్సరం భత్యానికి ఇబ్బంది పడకుండా సరిపోతాయని ఊరట చెందుతా తీరిక దొరికినప్పుడు చదువుకోసాగినాను. స్కూల్ లైబ్రరీ నుంచి తెచ్చుకున్న శ్రీకాళహస్తీశ్వర మహాత్యం కావ్యాన్ని చదివి శ్రీ,కాళము, హస్తి ఆ మూడింటి నిర్మలమైన శివ భక్తిని ధూర్జటి మహాకవి మహోన్నతంగా చిత్రీకరించిన విధానాన్ని అర్థం చేసుకొని పరవశించిపోయినాను. ద్వివేదుల విశాలాక్షి రాసిన ‘వైకుంఠపాళి’ నవలను చదివి ఈ మాత్రం నవల నేను రాయగలనుకుండాను. అట్లే లత రాసిన ‘రక్తపంకం’ నవలను చదివి పెదవి విరుస్తూనే అందలి శృంగారవర్షనలతో భావోద్రేకానికి లోనై నన్ను నేను తమాయించుకుండాను. ఇటువంటి నవలలు చదవకూడదని అనుకుండాను.

సాయంకాలం పూట పోస్ట్ మాస్టర్ సూరయ్య వాళ్ళ ఇంటిదగ్గర బజార్లో వచ్చిపోయే గ్రామస్తులందరూ వినేటట్లు రేడియో పెడతారు. అందులో సేద్యం ముచ్చట్లు వార్తలు సినిమా పాటలు వస్తాయి. సాయంకాలం పొద్దుపుచ్చుకోవడానికి సూరయ్యోళ్ల ఇంటి దరిదాపుల్లో ఉండే రైతులు, పెద్దమనుషులు బజారులో అరుగుల మీద కూర్చొని రేడియో కార్యక్రమాలను వింటా ఉంటారు. నేను గుడకా బజార్లో పెద్దోళ్లకు కొంచెం ఎడంగా కూర్చొని రేడియో కార్యక్రమాలను వినసాగినాను. రేడియోలో హైదరాబాద్ విజయవాడ రేడియో స్టేషన్లు ప్రసారం చేస్సే కార్యక్రమాలు సరిగా రావని సూరయ్య ఎప్పుడూ కడప రేడియో స్టేషన్ పెడతాడు. రెండు వారాల నుంచి ప్రతి మంగళవారం సాయంత్రం రేడియో సమస్యా పూరణ కార్యక్రమాన్ని వింటా, వచ్చే వారం ప్రసారం చేయడానికని ఇచ్చిన సమస్యను జాగ్రత్తగా వింటా రాసుకొని, ఆ రాత్రి లోపలే సమస్యను పద్యంలో పూరించి తెల్ల కాగితం పైన రాసి నా పేరును ఊరి పేరును స్పష్టంగా పేర్కొని మరుసటి దినమే పోస్ట్ చేస్తా ఉండాను. అట్లా రెండు వారాలు రాసి పంపినాను. రెండు వారాలు నేను పూరించి పంపిన పద్యం రేడియోలో రాలేదు. రెండు వారాలూ రేడియోలో నా పద్యం వస్తుందని ఆశతో ఎదురు చూడడమూ రాకపోయేసరికి నిరాశ చెందడమూ నిరాశతో నా దౌర్భాగ్యాన్ని గురించి అసహ్యించుకుంటా బాధపడడమూ ఇదే సరిపోయింది. అయినా ఆశ చావలేదు. మూడో వారానికి సమస్యాపూరణ పద్యాన్ని పంపినాను. మంగళవారం వచ్చింది.

వాతావరణం ప్రశాంతంగా ఉంది. పశువుల, మేకల అరుపులు మనుషుల కేకలు ఏవీ లేవు. కడప రేడియో స్టేషన్ క్లియర్ గా వస్తా ఉంది. పాడిపంటల కార్యక్రమం అయిపోయిన తర్వాత సమస్యాపూరణ కార్యక్రమం వచ్చింది. మొదటి వ్యక్తి పద్యం అయినంక ఇప్పుడు సి బండమీపల్లె నుండి పంపిన శాంతి నారాయణ గారి సమస్యాపూరణ వినండి అని వినపడగానే ఆరుగుల మీద కూర్చున్న పెద్ద మనుషులు అరే, రేడియోలో మన బండమీదపల్లె పేరొచ్చిందే అని ఆశ్చర్యపోతా పద్యాన్ని విన్నారు. పద్యమంతా అయిపోయినంక రెండోసారి నా పేరు మా ఊరి పేరు చదివినారు. వింటా నేను పొంగిపోయినాను. శరీరమంతా పులకరించింది. పెద్ద మనుషులందరూ మన ఊరి పేరు నిలబెట్టినావు నారాయణా! శభాష్ అని పొగడబట్టినారు. వాళ్ళ పొగడ్తలతో నా ఆనందానికి హద్దులు లేవు. కళ్ళకు ఏదో వెలుగు కనిపించింది. ఆ విషయం క్షణాల్లో ఊరంతా ప్రాకిపోయింది. అమ్మయ్య మురిసిపోయింది. నాయన ముఖంలో ఆనందం విరబూసింది. ఇదే కదా నేను కోరుకున్నది! ఇంట్లో ఒక చిన్న ట్రాన్సిస్టర్ ఉండి, అమ్మయ్యోళ్లు వినుంటే ఎంత బాగుండేది! ఊర్లో ప్రతి ఇంట్లోనా రేడియోలు ఉంటే, చుట్టుపక్కల పల్లెలంతా రేడియోలు ఉంటే, మా ఊరి పేరు రేడియోలో విని ఎంత ఆశ్చర్యపోయే వాళ్ళు! అనుకుంటా ఉబ్బితబ్బిబ్బయిపోయినాను. ఈ చిన్న ప్రశస్తి మనసులోని బాధలన్నింటినీ పటాపంచలు చేసింది.

గురుత్వం లేని కొందరు గురువులు!

రేడియా వల్ల కలిగిన ఉత్సాహంతో ప్రతి వారం రేడియోకు సమస్యా పూరణ పద్యాన్ని పంపసాగినాను. రెండు వారాలకు ఒకసారి నా సమస్యాపూరణ పద్యాలు రేడియోలో చదవడం, మా ఊరి పెద్ద మనుషులు వినడం, వాళ్లు నా పద్యానికి అర్థ వివరణ అడగడం, నేను చెప్పడం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగించింది. నా పద్యాలను రేడియో పండితులు గుర్తించినారని, నేనొక పద్య కావ్యాన్నో ఖండకావ్యాన్నో రాయగలనని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుండాను. ఈ లోపల నా సమస్యాపురాణ పద్యాలను రేడియోలో విన్నాడేమో మా హై స్కూల్ టీచర్, ఒకనాడు క్లాసులో, మాంసం తిని మీ నాలుకలు మందమైపోయినాయిరా! అందుకే తెలుగు పదాలను మీరు స్వచ్ఛంగా పలకలేరు. అట్లా వాళ్లకు శూద్రులకు మీకెందుకురా చదువు అని దుర్భాషలాడిన భారతం సుబ్రహ్మణ్యం అయ్యవారు నన్ను రమ్మని మా ఊరి పోస్టు రన్నర్ గోపాలన్నతో చెప్పి పంపించినాడు. నేను ఉత్సాహంతో శింగనమలకు పోయి మొదట గురువు హెడ్మాస్టర్ సార్ కు నా రేడియో సమస్యాపూరణ పద్యాల విషయం చెప్పి తర్వాత సుబ్రహ్మణ్యం సార్ను కలుసుకుండాను. నేనూహించినట్లుగానే ఆయన నా సమస్యాపూరణ పద్యాలు విన్నాడు. అందుకే నన్ను అభినందించినాడు. అయితే ఆ అభినందనలో ప్రేమ లేదు. “నేను పూరించి మూడు నాలుగు వారాలు పద్యాలు పంపినాను, నా పద్యాలు రేడియోలు రాలేదు నారాయణా, కడప రేడియో స్టేషన్లో నీకు ఎవురైనా తెలిసిన వాళ్ళున్నారా” అని అడిగినాడు. నాకెవురూ తెలిసిన వాళ్ళు లేరు సార్ అని చెప్పి ఆయన రేడియోకు పంపిన పద్యాలను ఇప్పించుకొని చూసినాను.

పద్యాలలో యతి గణ ప్రాస దోషాలు కనిపించినాయి. ఋ రు, ము మ లకు యతి చెల్లదని, కృ జృ వంటివి సంయుక్తాక్షరాలు కాదని, అందుకే దానికి ముందున్న హ్రస్వాక్షరం గురువు కాదు కాబట్టి ప్రకృతిలోని మూడు అక్షరాలు లఘువులే అని, కృ క లకు ప్రాస చెల్లదని వివరంగా చెప్పినాను. అవునా నారాయణా అని ఆయన అదొక రకంగా ఫీల్ అయ్యి, పద్యాలు రాసిన ఒక నోటుబుక్కు నా చేతికిచ్చి, ఈ పద్యాలను కొంచెం సరిదిద్దు నారాయణా అని అడిగినాడు. లోకం పోకడ పేరుతో 200 పద్యాల ఖండకావ్యం అది. నేను నాలుగైదు పద్యాలను చూసి గణ యతి ప్రాస దోషాలను గమనించి “ఇంటికి తీసుకొని పోయి రెండు మూడు రోజుల్లో సరిదిద్ది తెస్తాను సార్” అని చెప్పి ఊరికి వచ్చినాను.

పనులేమీ లేనందువల్ల ఇంటి పక్కన ఉండే చెట్టు కింద గోనెసంచి పరుచుకొని కూర్చొని, చాలా ఆసక్తిగా సుబ్రహ్మణ్యం సార్ రాసిన పద్యాలు చూసినాను. ప్రతిపద్యంలోనా గణ యతి దోషాలు కనిపించినాయి. కంద పద్యాలలో లెక్కలేనన్ని దోషాలు! పద్యాలన్నిటినీ సరిదిద్దే బదులు భావం చెడకుండా నేనే వేరే పద్యాలు రాసిచ్చేది మేలనుకున్నాను. ఆయన శబ్ద దోషాలను చూసి, ఒకనాడు మాంసం తిన్న నాలుకలను దూషించిన మాటల్ని గుర్తు చేసుకొని నవ్వుకుంటా, ఇది ఈ బ్రాహ్మణ పండితుని భాషా అని ప్రశ్నించుకుంటా, మూడు రోజులలో పద్యాలన్నీ సరిదిద్ది ఎత్తి రాసి ఆయన లోకం పోకడ కావ్యాన్ని ఆయనకు చేర్చి వచ్చినాను. ఆ తరువాత నాలుగు రోజులు గట్టిగా కూర్చొని ‘పూజ’ పేరుతో ఎనిమిది, ‘తరణి’ (సూర్యుడు) అనే టైటిల్‌తో పది పద్యాలు ‘తరుణి’ టైటిల్‌తో పదారు పద్యాలు రాసినాను.

***

భారతం సుబ్రమణ్యం సార్ పద్యాలన్నీ తప్పులు రాసినాడని వాటిని నేను సరిదిద్దినానని నాయనతో చెప్పగానే సంతోషపడి, “‘భారతమోళ్లమడి’ ఆ సారోళ్లదే, గుత్తకు చేసుకుంటామని నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడప్పా! రేపే పోయి అడుగు నాయనా” అని ఎంతో ఆశపడతా చెప్పినాడు నాయన. అవును, నేను అడిగితే సుబ్రహ్మణ్యం సార్, తప్పకుండా వాళ్ల మడి మాకు గుత్తకు ఇస్తాడని అనుకుండాను.

భారతమోళ్ల మడి మా ఊరి బోయ గిరి వెనక పక్కనే, పెద్ద కాలువ మొదటి తీరు కింద ఉండే రెండున్నర ఎకరాల అద్భుతమైన మడి! ఉదయం లేస్తానే బోయగిరి మొగోళ్లందరూ చెంబు పట్టుకొని పోయి ఆ మడిలో దొడ్డికి కూర్చుంటారు. ఆ గేరి పశువులన్నింటినీ ఎండాకాలంలో ఆ మడి కయ్యల్లోకి తోలుతారు. అందువల్ల ఆ మడి చాలా సారవంతంగా ఉంటాది. ఢిల్లీ భోగాలపంట ఆ మడిలో అద్భుతంగా పండుతాది. ఆ మడిలో ఢిల్లీభోగాలు ఒక కారుకు నాలుగు పుట్లకు (50 పల్లాలకు) తక్కువ కావు. అట్లాంటి మడి కోరుకో గుత్తకో చేసుకుండేకి దొరికితే మా అదృష్టం పండినట్లే! నేను రిక్వెస్ట్ చేసి అడిగితే సుబ్రహ్మణ్యం సార్ ఇవ్వకుండా ఉంటాడా?

ఎంతో నమ్మకం పెంచుకొని శింగనమలకు పోయి సుబ్రహ్మణ్యం సార్ను కలుసుకుండాను. అవీ ఇవీ మాట్లాడుతా, మా ఊరి దగ్గర ఉన్న మడి విషయం ప్రస్తావన చేసి కోరుకో గుత్తకో మాకు ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసినాను. ఆయన ఏమీ మాట్లాడకుండా కొంచెం సేపు మౌనంగా ఉండి పెదవులు విప్పినాడు

“కాదురా, మా మడి గుత్తకు చేసుకుండేంత యోగ్యత ఉందా మీకు? తాడూ పేడూ లేని మీరు మా మడిని కోరుకో గుత్తకో చేసుకునే మొనగాళ్లా? నాలుగు పద్యాలు రాస్తానే మా మడిని గుత్తకు అడిగేంత ధైర్యం వచ్చిందా నీకు? కూలి చేసుకొని బతికే మీలాంటి వాళ్లకు మా మడిని గుత్తకు ఇస్తానని కలలో కూడా అనుకోవద్దు నారాయణా” అని లోపలికి వెళ్లి పోయినాడు. ఆయన దురహంకారంతో మాట్లాడిన మాటలు నా గుండెలను తాగినాయి.

ఏమి చూసుకొని ఈయనకు ఇంత అహంకారం? కూలి చేసుకొని బతికే నాలాంటి వాడు చదువుకుంటా వుండాడన్న ఈర్ష్యతో ఇట్లా మాట్లాడుతున్నాడా? లేక తరతరాల నుంచి వచ్చిన బ్రాహ్మణ కుల దురహంకారమా? ఈయన ఆస్తి చెరువు కింద అంతా ఏడెనిమిది ఎకరాలు ఉందో లేదో, ఆ మాత్రానికే ఇంత మిడిసిపాటా? పోనీ ఉద్యోగం అన్నా పెద్దదా అంటే అదీ కాదు. సెకండరీ గ్రేడ్ టీచర్! పేదవాళ్లంటే, కూలి జనం అంటే ఎంత చిన్నచూపు ఈయనకు! ఈయన బ్రాహ్మణ మదం అనగల్లంటే, విద్వాన్ అయినంక ఎట్లైనా సరే, నేను తెలుగు పండిట్‌గా ఈయన కంటే హై క్యాడర్లో, ఇదే స్కూలుకు రావల్ల! నేను ఏమిటో ఈయనకు చూపించల్ల!

పండ్లు బిగబట్టి ఒక కసి నిర్ణయాన్ని మనసులో ఏర్పరచుకుంటా గురువుగారింటికి వచ్చి విషయం చెప్పినాను. అతనికి బ్రాహ్మణ దురహంకారమని, ఆ దురహంకారానికి జ్ఞానోదయం కలగాలంటే, నువ్వు ఇదే హైస్కూల్‌కు పండిట్‌గా వచ్చి, అతడు ఆరో క్లాసుకు, నువ్వు ఎస్ఎస్ఎల్సీకి పాఠం చెప్పల్లరా! అని గురువు హెడ్మాస్టర్ సారు నాలో చైతన్యం రగిలించినాడు. నేను వారి దగ్గర సెలవు తీసుకొని ఊరికి వచ్చి నాయనకు విషయం అంతా చెప్పినాను. నాయన నిరాశ చెందుతా బాధపడినాడు.

విద్వాన్ ప్రిలిమినరీ ఫలితాలు నా ఊహల్ని చెడిపేసినాయి!

వ్యవసాయ పనులేవీ లేకపోవడంతో నాయన వెంట వర్తన పల్లెలకు ఆకుల గంపెత్తుకొని పోకుండా నేను ప్రత్యేకంగా ఆకులు గంపెత్తుకొని మా చెరువు కట్ట కింద పల్లెలకు పోతా ఉండాను. ప్రొద్దున్నే అంబడి పొద్దున్న అన్నం తిని శింగనమల, గోవిందరాయునిపేట, శివపురం, పెరవలి, సోదనపల్లి, జలాలపురం, మా కొండల అవతలున్న సాములూరు, చెన్నంపల్లి, కొరపాడు పల్లెలకు రోజుకు ఒక పల్లెకు పోయి ఆకుల అమ్ముకొని పయిటాల కల్లా ఇల్లు చేరుకోవడం, పైటాల అన్నం తిన్న తర్వాత ఇంటి పక్కనుండే వేప చెట్టు కింద గోనెసంచి పట్టమీద కూర్చొని పద్యాలో కథలో రాయడం అలవాటు చేసుకుండాను. ఈ దినకృత్యంలో గోవిందరాయుని పేటలో రామలింగారెడ్డి సోదనపల్లిలో రాజశేఖర్ రెడ్డి నన్ను గమనించి ఏమి నారాయణా, విద్వాన్ చదువుతా ఉండేవానివి ఇదేమిటిట్ల అని ఆశ్చర్యంగా, నేను చేస్తున్న పని దయనీయమైనదిగా ఉన్నట్లు అడిగినారు.

ఇందులో తప్పేముంది మిత్రమా? పల్లెల్లో టౌన్లలో చిన్న పెద్ద అంగళ్లు పెట్టుకొని వస్తువులను అమ్మడానికి, ఒక్కొక్కసారి చదువుకున్నోళ్ళు అంగట్లో కూర్చోరా? వాళ్ళు నీడ పాటున కూర్చొని అమ్ముతారు, నేను పల్లెలు పల్లెలు తిరిగి అమ్ముతా ఉండాను. సరుకులు అమ్మడం అనేది ఒక్కటే కదా! ఒక చోట కూర్చొని అమ్మడం పల్లెలకు తిరిగి అమ్మడం అంతే కదా తేడా! అని నేను తలెత్తి ఏమాత్రం ఫీల్ కాకుండా బదులిచ్చినాను నేను. అట్ల సోదనపల్లెలో రాజశేఖర్ రెడ్డితో చెప్పుతున్నప్పుడు ఇద్దరు మొరట మనుషులు కల్పించుకొని, ‘ఆ పిల్లోడు పల్లెలు పల్లెలు తిరిగి ఆకులమ్మడంలో తప్పేముంది రెడ్డీ?ఏమి దొంగతనమో లంజరికమో చేస్తావుండాడా బిడియ పడేకి?’ అని నేను చేసే పనిని సమర్థించినారు. వాళ్ల మాటలు నా పనిని, చిన్నతనంగా భావించి అడిగినోళ్లకు, అట్ల భావిస్తున్న నాకు భలే సమాధానం ఇచ్చినట్లయినాయి. నా అపోహలు, బిడియపడడాలు పటాపంచలయినాయి.

ఆకుల గంపెత్తుకొని పల్లెలకు పోయి ఆకులమ్మడం, కూలి పనులున్నప్పుడు కూలికి పోవడం తప్పేమీ కాదన్న అభిప్రాయాలు బలపడే కొద్దీ న్యూనతాభావం నాలో తగ్గుతా వొచ్చింది. చదువు మీదా రచనల మీదా మనసు, దృష్టి పెట్టసాగింది. రెండు కథలు రాసి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక వారపత్రికలకు పంపినాను. చాలా రోజుల కిందటే మొదలుపెట్టిన ‘పరాజితులు’ నవలారచనను పూర్తి చేసి, పరిశీలించమని కోరుతూ తెలుగు పండిట్ గురుమూర్తి సార్‌కు పంపినాను కదా, దాన్ని ఆయన ఈపాటికి చదివే ఉంటాడని ఆయన దగ్గరికి వజ్రకరూరుకు పోవల్లనుకుండాను.

తెలుగు పండిట్ గడ్డం గురుమూర్తి సార్ మాకు పండిట్‌గా వచ్చేనాటికే ఆయన రాసిన నాలుగైదు కథలు వారపత్రికలలో పబ్లిష్ అయిన విషయం నాకు తెలుసు. కథా రచయితగా పత్రికలకు ఎక్కిన గురుమూర్తి సార్ నా నవలలను చదివి తన అభిప్రాయం చెపుతాడన్న ఆశ నన్ను తొందర పెట్టసాగింది. విద్వాన్ విద్యార్థిగా ఉన్నప్పుడే నా రచనలను పుస్తక రూపంలో చూసుకోవాలన్న ఉబలాటం రోజురోజుకు పెరగసాగింది. ప్రింట్ అయి వచ్చిన నా పుస్తకాన్ని చూసి గురువుగారు, తల్లిదండ్రులు చూసి సంతోష పడుతా ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూడాలన్న అభిలాష ఎక్కువ కాసాగింది. ఆ అభిలాషతో తెలుగు పండిట్ గురుమూర్తి సార్ను సెలవుల్లో వాళ్ళ సొంతూరు వజ్రకరూరులో కలుసుకోవడానికి బయలుదేరినాను. ఇటీవల రాసిన పద్యాలను కూడా చూపించల్లని తీసుకొని వజ్రకరూరు చేరుకుండాను. ఆయన నన్ను ప్రేమగా ఆదరించి నా ఉత్సాహాన్ని మెచ్చుకుంటా, “ఇప్పుడే నవలను ప్రింట్ చేసుకోవాలని ఉబలాటపడొద్దు నారాయణా! రెండు మూడు సార్లు నీ నవలను నువ్వే చదువు. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పుడు నవల చక్కగా తయారవుతుంది. తొందరపడొద్దు. విద్వాన్‌లో చేరి సాహిత్యం చదవబట్టి రెండు సంవత్సరాలే కదా అయింది. దీన్ని పబ్లిష్ చేసే ముందు మహీధర రామ్మోహన్ రావు, కొడవటిగంటి, బుచ్చిబాబు, రావిశాస్త్రి వంటి ప్రముఖ రచయితల నవలలు కొన్ని చదువు. అట్లే కాళీపట్నం రామారావు, చాసో, బీనాదేవి, మధురాంతకం, కేతు విశ్వనాథరెడ్డి వంటి ప్రసిద్ధ కథా రచయితల కథలు పుంఖాను పుంకంగా చదువు” అని సలహా ఇచ్చినాడు. శింగమనేని నారాయణ కూడా ఇంతకుముందు ఇట్లనే సలహా ఇచ్చినాడు. కానీ ఫలానా రచయితల పుస్తకాలు చదవమని ఒక్క పుస్తకం పేరూ, ఒక్క రచయిత పేరూ చెప్పలేదు. గురుమూర్తి సార్ మాకు సంవత్సర కాలం తెలుగు పాఠాలు చెప్పిన గురువు. నామీద ఎంతో శిష్యవాత్సల్యం ఉన్న మనిషి. అందుకే కల్మషం లేకుండా సలహా ఇచ్చినాడని అనుకుంటా పద్యాలను చూపించినాను. పద్యాలు చాలా బాగున్నాయి. ధార అద్భుతంగా ఉంది. పత్రికలకు పంపించు అని చెప్పినాడు. ఆయన మాటలకు ఒకవైపు సంతోషపడుతా మరొకవైపు విచారిస్తా మా ఊరు చేరుకుండాను.

గురుమూర్తి సార్ చెప్పిన నవలలను చదవల్లంటే సెలవులు అయిపోయినంక మళ్ళీ తిరుపతికి పోయిన తర్వాతనే వీలయ్యేదనుకొని ప్రబంధ కావ్యాలను చదువుకోసాగినాను. అంతలోనే విద్వాన్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలు వచ్చినాయి. నా క్లాస్ మీట్స్ ఊహించిన ఊహలు చెదిరిపోయినాయి. వాళ్ళందరూ నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందని గొప్పగా ఊహించినారు. పరీక్షలు రాసేటప్పుడు టైం అడ్జెస్ట్ చేసుకోలేక నేను రాసిన విధానాన్ని బట్టి, నా వ్రాతను బట్టి నాకు సెకండ్ క్లాస్ తప్పకుండా వస్తాదనుకుండాను. కానీ థర్డ్ క్లాసులో పాసయినాను. మనసంతా అవమానంతో రగిలిపోయింది. ఈ ఫలితానికి నన్ను నిరంతరం వెన్నంటి వేదించే దురదృష్టం కారణమా లేక నా స్వయంకృతాపరాధమా? నేను ఆఫ్ట్రాల్ ఈ ప్రిలిమినరీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేనంత అసమర్థుణ్ణా? ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న జ్ఞానచంద్ర గానీ భారతి గానీ వ్యాకరణ, అలంకార, చందస్సుల్లో నా ముందు నిలబడగలరా? ఇంక సెకండ్ క్లాస్ తెచ్చుకున్న వాళ్ళెవురూ నాతో పోటీకి రాదగిన వాళ్లే కాదు కదా! మరెందుకు ఇట్లా అయింది? ఇది నా దురదృష్టమేనా? పరీక్షలలో ఏ ప్రశ్నకు ఎంత జవాబు రాయల్లనో అంత రాయకుండా తెలిసిందంతా రాయడం వల్లనా?

ఏదీ పాలు పోకుండా నన్ను నేను అసహ్యించుకుండాను. ఇంతటితో చదువు చాలిస్తే మేలేమో! విద్వాన్ ప్రిలిమినరీ పాసైనా చాలు, జూనియర్ తెలుగు పండిట్‌గా ఉద్యోగం వస్తాదంట! ఇంతటితో మానేయడం మంచిదేమో! ఎన్నాళ్ళని దౌర్భాగ్య దేవతతో పోరాడేది? ఎన్నాళ్ళు ఈ సంఘర్షణ జీవితం? ఫస్ట్ క్లాస్ వస్తాదని, నీకు రాక ఇంకెవురికి వస్తుందని నా గురించి గొప్పగా ఊహించిన మిత్రులకు ముఖం చూపించేదెట్ల?

మూడు నాలుగు రోజులు నలిగిపోయినాను. పాసైనందుకు అమాయకంగా తల్లిదండ్రులు సంతోషపడినారు. కానీ అట్లా పాస్ కావడం ఒక గొప్పేనా అని నలిగిపోతా ఉండే నా మానసిక సంఘర్షణకు గల కారణాలు వాళ్లకేం తెలుసు పాపం? అయినా చాలామంది నా క్లాస్మీట్స్ ఫెయిల్ అయినారు కదా! రూమ్‌మీట్ స్వామి, మైలారప్ప, బాషూలాల్, కదిరి వెంకటరమణ ఇంకా కొంతమంది ఫెయిల్ అయినారు కదా! అంతెందుకు, పుట్టపర్తి నారాయణాచార్యులు మహా పండితుడు కదా, ఆయన రాసిన పెనుగొండలక్ష్మి అనే కావ్యం విద్వాన్ వాళ్లకు పాఠ్యపుస్తకంగా పెట్టినప్పుడు ఆయన విద్వాన్ కోర్సులో చేరి తన కావ్యం పైన పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు సరిగా రాయక ఫెయిల్ అయినాడంట! దీన్ని బట్టి చూస్తే అతిగా చదివి తెలుసుకొని పరీక్ష రాస్తే ఇట్లనే జరుగుతుందేమో!

అనుకుంటా, నన్ను నేను ఓదార్చుకుండాను. విపరీతమైన సాహిత్య అధ్యయనం చేసినంత మాత్రాన ఒక ప్లాన్ ప్రకారం పరీక్షలు రాయకుంటే ఎంతటి విద్యుత్తు ఉన్నా, ఫెయిల్ కాక తప్పదని, అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ పరీక్షలకు పనికిరాదని నిర్ణయించుకుని, చిన్నయ్య సూరి తాబేలు కుందేలు కథను గుర్తు చేసుకుండాను.

అవధానం, పద్యరచనా వ్యసనాలను మానుకోలేక..

వేసవి సెలవుల తర్వాత కాలేజీ రీవో ఓపెన్ అయ్యి రెండు వారాలైనా సరిగ్గా క్లాసులు జరగడం లేదు. ప్రిలిమినరీ పరీక్షలలో ఫెయిల్ అయిన వాళ్లు కొంతమంది మళ్ళీ కాలేజీలో కనిపించడం లేదు. కాలేజీ వాతావరణాన్ని చూసి ఇంకా రెండు మూడు వారాలు ఊర్లోనే ఉండి వచ్చుంటే బాగుండేది అనుకుంటా చదువు మీద దృష్టి పెట్టకుండా పద్యాలు రాయడం, అవధాన మిత్రులతో కలుసుకొని పరస్పరం సమస్య, దత్తపది మొదలైన అంశాలను అడగడం, పూరించడం, విశేషమైన యతిప్రాసలతో పద్యాలు అల్లడం, దృష్టాంతంగా ప్రాచీన కవుల ప్రయోగాలను చూపడం, అదే చదువు అనుకోవడం నిత్యకృతమైపోయింది. నేను, ఆ మిత్రులు కన్నెత్తి చూడని కథ నవల అధ్యయనం చేస్తా, కథలు రాసి అవధానం మిత్రులు ఎవరికీ చెప్పకుండా పత్రికలకు పంపడం మొదలుపెట్టినాను. గురుమూర్తి సార్ సూచన ప్రకారం ఒక్కొక్క శీర్షిక కింద కొన్ని కొన్ని పద్యాలను భారతి పత్రికకు పంపినాను.

ఈ సంవత్సరం రూము వాతావరణం గతం కంటే బాగుందనిపించ సాగింది. నారాయణ స్వామి సెలవులు అయినాక చాలా రోజుల వరకు రాకపోవడంతో, ఇద్దరు జూనియర్ విద్యార్థులు చాకల సుబ్బన్న వెంకటరమణ మా రూములో చేరినారు. ఇద్దరూ అనంతపురం దగ్గరున్న పల్లెల వాళ్ళే! సుబ్బన్నది బుక్కరాయసముద్రం. రమణాది పర్వత దేవరపల్లి. అగ్రికల్చర్ బీఎస్సీ మిత్రుడు చెప్పడంతో మంగలి ఓబులేసును వేరే మిత్రుని రూములోకి చేర్చి సుబ్బన్నను మా రూములో చేర్చుకుండాను. ఇద్దరూ వినయవంతులే. నామీద గౌరవం కలిగిన మిత్రులే.

నలుగురమూ దాదాపు ఒకే ప్రాంతం వాళ్ళం కావడంతో రూములో బాగా అడ్జెస్ట్ అయినాం. వ్యాకరణము అలంకారాలు చందస్సు వాళ్లకు అర్థం కానప్పుడల్లా నేను వివరిస్తూ ఉంటాను. దానికి ప్రత్యుపకారంగా వంట విషయంలో అన్ని వాళ్లే చూస్తా ఉంటారు. అందుకే నా రచనా కార్యక్రమాలు అంతరాయం లేకుండా సాగిపోతా ఉండాయి. పద్యాలు కథలు రాయడానికి బాగా అనుకూలమైంది. కానీ రాసినవన్నీ మంచి శీర్షికతో పత్రికలకు పంపడం, కథలు పంపిన రెండు వారాల లోపే వెనుతిరిగి రావడం, పద్యాలు పంపిన పత్రికల వాళ్లు రెండు మూడు నెలలైనా ప్రచురించకపోవడం మనసును శోభ పెట్ట సాగినాయి. మనసు వేదన చెందిన అప్పుడల్లా సినిమాకు పోవడం, సినిమాలో అందమైన హీరోయిన్ల వయ్యారాలను డాన్స్ సీన్లను గుర్తుకు తెచ్చుకొని విపరీతమైన కామవాంఛతో రగిలిపోతూ రేత స్థలనం చేసుకోవడం అలవాటుగా మారిపోయినాయి. పత్రికలలో నా పద్యాలు కథలు పబ్లిష్ అయితే మా క్లాసులో ఉండే జనాభాయీ లక్ష్మీదేవి సుజాత భారతి ఇంకా అందమైన అమ్మాయిలు చదివి నాకు స్నేహితురాళ్లయితే ఎంత బాగుంటుందో అని మనసు కామోద్రేకంతో ఆరాటపడుతుంది. ఆ ఉద్రేకం తగ్గినంక నా రచనలు అమ్మాయిలను ఆకర్షించడానికి కాదు కదా, గురువులు తల్లిదండ్రులు నా రచనలను చూసి ఆనందించి గర్వపడాలని కదా నేను కోరుకున్నది అని మనసును కంట్రోల్ చేసుకుంటా పద్యాలను రాయడం ఒక వ్యసనంగా మార్చుకుండాను.

అప్పుడప్పుడు కోనయ్య షరీఫ్ ఖాన్ మొదలైన మిత్రులు వచ్చి కలుస్తారు. అదీ ఇదీ మాట్లాడుతూ అమ్మాయిల ప్రస్తావన తెస్తారు. స్త్రీలను గురించి నీచంగా మాట్లాడుతారు. నేను వాళ్ళ మాటలను ఖండిస్తాను. స్త్రీల రూపాల మీద డ్రస్సుల మీద పనికిమాలిన కామెంట్స్ చేస్తారు. అది చెడిపోయిందని, బజారు సరుకని జనాభాయిని గురించీ లక్ష్మీదేవిని గురించీ, అది పెద్ద బండి అని భారతిని గురించి నాలుక ఉందని ఏదేదో వాగుతారు. స్త్రీ చెడిపోతే పురుషుడు గుడకా చెడిపోయినట్లే కదా, అసలు చెడిపోవడం అంటే ఏమిటి, అదేమైనా వస్తువా, స్త్రీ వ్యామోహంతో మగవాడు ఏదేదో వాగితే వాగినోడు శీలవంతుడా అని నేను మిత్రులను నోరు మూయిస్తాను. స్త్రీ సౌందర్యాన్ని చూసి సౌందర్యానుభూతితో ఆరాధన భావం పెంచుకోవాల గానీ చులకన చేసి మాట్లాడడం మంచిది కాదని మందలిస్తాను. మందలిస్తాను గాని నా మనసు నిండా స్త్రీ సంభోగేచ్ఛ ఉంది కదా, అది తప్పు కదా అని నన్ను నేను ప్రశ్నించుకొని స్త్రీని ప్రేమతో కోరుకోవడం వేరు, సంస్కార రహితంగా మాట్లాడడం వేరు అని నా కోరికను సమర్ధించుకుంటాను.

పద్య, కథా సృజనతో సాహిత్య లోకంలో తొందరగా గుర్తింపు పొందాలన్న కోరిక, స్త్రీతో సంభోగ కాంక్ష,ఇతర మిత్రులందరి మాదిరి మంచి డ్రెస్ వేసుకోవాలన్న ఆశ, ఆశను నెరవేర్చుకోలేక నిరాశ వీటన్నింటి మధ్య మనస్సూ శరీరమూ నలిగిపోసాగినాయి. బాధతో ఒక్కొక్కసారి ఈ దౌర్భాగ్యమైన జీవితం గడిపే బదులు చచ్చిపోయేది మేలు అనుకుంటాను. వెంటనే అంతరాత్మ మేల్కొని అది పిరికిపంద చర్య, కోటానుకోట్ల మంది అత్యంత దయనీయంగా హృదయ విదారకంగా గడుపుతూనే ధైర్యంగా జీవిస్తున్నారు, వాళ్లకంటే నీ బతుకు ఎన్నో రెట్లు మేలు కదా, చచ్చిపోయి ఏమి సాధిస్తావు, ఎక్కడ అవమానింపబడినావో అక్కడే తలెత్తుకొని నేనేమిటో నిరూపిస్తానని నిర్ణయించుకొని కసిగా చదువుతున్నది చనిపోవడానికేనా? అని నిలదీయడంతో పిరికితనంతో కూడిన ఆలోచనలన్నీ పక్కనపెట్టి మరింత పట్టుదలతో చదవసాగినాను.

మొన్న ఒకసారి గురువర్యులు గౌరి పెద్ది రామసుబ్బశర్మ గారి అష్టావధాన కార్యక్రమానికి అవధానం మిత్రులతో కలిసిపోయినాను. గురువుగారు మహా పండితుడైనందువల్ల పద్యాలు సంస్కృత సమాస భుయుతంగా, నారికేళ పాకంతో ఉండాయి. అవధానం జనరంజకంగా లేదు. చతురోక్తులు, సరసోక్తులు ఏవీ లేవు. పద్యాలు గంభీరంగా చెప్పినాడు. కానీ వినసొంపుగా లేవు. ప్రౌఢపాండిత్య గరిమతోకూడిన పద్యాలు సామాన్యులకు అర్థం కావు. క్లాసులో సంస్కృత కావ్యాలను అద్భుతంగా బోధించగలడు గాని అవధానం చేయడానికి ఆయన పండిత గాంభీర్యం పనికిరాదనిపించింది. ఆయన పద్యశైలి పండిత రంజకమే కానీ పామర రంజకం కాదనిపించింది. అవధానంలో రక్తి కట్టించే అప్రస్తుత ప్రసంగం విషయంలో ఆయన తీరు సరిపోదనిపించింది. ఆయన అవధానం చూసిన తర్వాత విద్వాన్ అయిపోయే లోపల మేము ముగ్గురం అవధానం అవలీలగా చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. అయితే పృచ్ఛకులుగా ఈ మాదిరి ఉద్దండ పండితులు కూర్చొని అవధానిని శల్య పరీక్ష చేయడానికి పూనుకుంటే అవధానం చేయడం కష్టమని, విశేషమైన పాండిత్యాన్ని సమగ్ర సాహిత్య పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే తప్ప ఎప్పుడైనా ఎక్కడైనా సరే దిగ్విజయంగా నెగ్గుకొని రాలేమనిపించింది.

టాప్‌లెస్ కార్లో ఇందిరాగాంధీ ఊరేగింపు – ఒళ్ళు జలదరింపు

ఈరోజు తేదీ 23-8-1967. ఈ రోజే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తొలిసారిగా తిరుపతి వస్తూ ఉంది. టాప్‌లెస్ వాహనంలో ప్రజలందరికీ అభివందనాలు తెలుపుతా గాంధీ బజారు గుండా బహిరంగ ప్రదర్శనమిస్తా ఊరేగింపుగా వెళ్లుతుందని, మధ్యాహ్నం నుంచి కాలేజీకి సెలవు ఇచ్చినారు. మేము మిత్రులందరమూ బజారు చేరుకుండాం.

టైమ్ ఐదు కావొచ్చింది. జనం తండోప తండాలుగా వచ్చినారు. వీధులన్నీ సందులన్నీ జనంతో కిటకిటిలాడుతా ఉండాయి. ఇసుక వేస్తే కింద పడనంత జనం! చీమల పుట్టలు పగిలినట్లు జనం! చిత్తూరు జిల్లా ప్రజానీకమంతా తిరుపతికి చేరుకుందేమో అన్నంత జనం! ఎక్కడా ఒక వాహనం గాని సైకిల్ రిక్షా గాని సైకిల్ గాని కనిపించలేదు. బస్సులూ కార్లూ ఏవీ తిరుపతిలోకి రాకుండా ఊరి బయటే ఆపేసినారంట! ఎంతటి పెద్దవాళ్ల కార్లయినా సరే, ఏవీ బజార్లోకి రాకుండా పోలీసోళ్ళు కట్టుదిట్టం చేసినారంట! కొన్ని వందల మంది పోలీసోళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు డియస్పీలు అడుగడుగునా వాళ్లే! ఇందిరాగాంధీ సరిగ్గా ఐదున్నర గంటలకు వస్తాదని గాంధీ బజార్లో రోడ్డుమీద ఎవురినీ తీగనికుండా బారికేడ్ల అవతలే ఉండల్లని మైకులలోఅనౌన్స్ చేస్తా ఉండారు. ఎవురోఒక పోలీసధికారి పోలీసులకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ సైరన్ జీపులో స్పీడుగా ముందుకెళ్లినాడు. పోలీసులు విజిల్ వేస్తా జనం ఎవురే గాని రోడ్డు మీదకు పోకుండా చూస్తా ఉండారు.

టైం ఐదున్నర కావొచ్చింది. చిన్నగా వానజల్లు పడసాగింది. జనం ఒక్కసారిగా కేకలు వేయసాగినారు. అలజడి మొదలైంది. పోలీసులు అలర్ట్ అయినారు. అంతలోనే కాంగ్రెస్ జెండా ఉన్న కార్లు తిరుపతి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి మన ప్రియతమ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మన తిరుపతి ప్రజలకు అభినందనలు తెలపడానికి ఇంకొక 15 నిమిషాల్లో వస్తున్నారు. మనమందరం ఇందిరా గాంధీ గారికి గౌరవంగా అసాధారణ స్వాగతం పలకాలి అని చెప్పుతూ ముందుకెళ్లినారు. ప్రజలందరూ వానజల్లులో తడుస్తూనే కట్టు కదలకుండా నిల్చుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి జేజేలు పలుకుతా ఉండారు.అంతలోనే వానజల్లు ఆగిపోయింది.

టైం ఆరు దాటింది. ఒక పోలీస్ జీప్ హార్న్ ఇచ్చుకుంటూ స్పీడుగా వచ్చింది. దాని వెనకాల ఐదారు పోలీస్ వాళ్ల వాహనాలు ఒక వైట్ కార్లో పోలీస్ డిజిపి కారు, అటువంటివే ఏడెనిమిది తెల్లకార్లు కాంగ్రెస్ జెండాలతో వచ్చినాయి. వాళ్లందరూ మంత్రులు ఎమ్మెల్యేలంట! ఆ కార్ల వెనకాల మళ్ళీ ఒక పెద్ద కార్లో పోలీస్ ఎస్కార్ట్, దాని వెనక రోడ్డుకు అటువైపున మూడు ఇటువైపున మూడు బుల్లెట్ మోటార్ సైకిళ్ల పైన ఇనుప టోపీలు పెట్టుకున్న మిలిటరీ పోలీసులు, ఆ మోటార్ బైకుల మధ్యలో టాప్‌లెస్ జీపులో రెండు చేతులతో నమస్కరిస్తా ఇందిరాగాంధీ నిల్చుకుంది. ఆమె ముందర చేతులతో పట్టుకోవడానికి పైపు బిగించినారు. ఆమె ఒకసారి ఎడమ చేతితో పైపును పట్టుకొని ప్రజల వైపు చూస్తా కుడి చేయెత్తి ఊపుతా ఉంది. ఒకసారి రెండు చేతులెత్తి నమస్కరిస్తా ఉంది. ఆమె నిల్చుకున్న జీపులో, పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గాంధీ టోపీ పెట్టుకొని కూర్చుండాడు. ముందు వైపున డ్రైవర్ పక్కన ఆమె కొడుకు సంజయ్ గాంధీ, తెల్లని జుబ్బా పైజామా డ్రెస్ తో కూర్చున్నాడు.

జీపు మెల్లగా ముందుకు పోతావుంది. మేము దగ్గరగా మన దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముద్దుల కూతురు ఇందిరాగాంధీని కన్నార్పకుండా చూసినాం. గులాబీ కలర్ పూలతో కుంకుమ కలర్ పెద్ద బార్డర్ పెట్టి నేసిన గులాబీ కలర్ కాటన్ చీర కట్టుకొని, కుంకుమ రంగు రవిక తొడుక్కొని, మెడలో రుద్రాక్షల మాదిరిండే పూసలహారం వేసుకొని, కత్తిరించుకున్న గిర్దాల జుట్టుతో ఇందిరాగాంధీ ఎంత సౌందర్యంగా ఉందో! 50 ఏళ్ల వయసులో భారత దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తిరుపతికి రావడం, ఆమెను దగ్గరగా చూడడం ఎంత గొప్ప అనుభూతి! దేశ ప్రధానమంత్రిగా బయటికొస్తే ఇంత ఆర్భాటమా? ఇంత అట్టహాసమా? అబ్బబ్బ! ఆమె జీపు వెనక మళ్ళీ ఒక ఎస్కార్ట్, దాని వెనుక దాదాపు డెబ్బై యెనభై వాహనాలు సైలెంటుగా ఒకదాని వెనక ఒకటి మెల్లగా సాగిపోతావుండాయి. ఇందిరాగాంధీ ఆ ఊరేగింపు వొంటిలో ఏదో జలదరింపును కలగజేసింది. వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకుండాయి.

ప్రజాస్వామ్యంలో రాజులు అంటే వీళ్లే కదా! రాజరిక వ్యవస్థలో ఏ రాజుకు దక్కి ఉంటుంది ఈ గౌరవం? ప్రజలు నీరాజనాలు పట్టడం అంటే ఇదే కదా! ఎంతో గొప్పదృష్టవంతులకే కదా ఈ గౌరవం దక్కేది! ఏమి భాగ్యం వీళ్ళది! పూర్వ జన్మలో ఎంత పుణ్యం చేసుకుండారో ఇంత అదృష్ట జీవితం పొందడానికి? ఇదంతా పూర్వజన్మ సుకృతమేనా? నావంటి వాళ్ళ దౌర్భాగ్య జీవితమూ పూర్వజన్మ సుకృతమేనా? ఈ అదృష్ట దురదృష్ట జీవితాలకంతా పూర్వజన్మ సుకృతమైతే ఎవురూ ఏమీ కష్టపడకపోయినా ఏది జరగాలని వుందో అది జరుగుతుందా? అదృష్టంలో గుడకా తరతమ భేదాలుంటాయేమో! చాలా గొప్ప అదృష్టవంతులు మాత్రమే ఇటువంటి హోదా పొందుతారేమో! ఈరోజు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరు భారత దేశంలోని 51 కోట్ల మంది ప్రజలకు, చదువు వచ్చిన వాళ్లకూ రాని వాళ్లకూ అందరికీ తెలుసు!అట్లే ప్రపంచంలోని రాజకీయ నాయకులకు, విద్యావంతులందరికీ ఇందిరా గాంధీ పేరు తెలిసే ఉంటాది! ఎంత భాగ్యవంతురాలీమె! అనుకుంటా ఆశ్చర్యపోతా మిత్రులతో కలిసి రూముకు చేరుకుండాను.

అష్టావధానమే అతని శ్వాసా ధ్యాసేమో!

ఆదివారం కావడంతో మిత్రులందరమూ రూములోనే ఉండాం. మధ్యాహ్న భోజనం అయిన తర్వాత నేనూ సన్నప్పా రమణా కాలేజీ విషయాలు మాట్లాడుకుండాం రమణ వ్యాకరణంలో ఏవో సందేహాలు అడిగితే వివరిస్తా ఉండాను. సన్నప్ప గుడకా శ్రద్ధగా వినసాగినాడు. సుబ్బన్న అర్ధగంట నుంచి అద్దం ముందు నిల్చుకొని మాటిమాటికీ క్రాఫ్ దువ్వుకుంటా దువ్వెన తిప్పి వెంట్రుకలను నొక్కులు పడేటట్ల గట్టిగా నొక్కుకుంటానే ఉండాడు. నేను చాలాసేపటి నుంచీ అతన్ని నేను గమనిస్తా ఉండాను. చూసి చూసి,ఇంక సాధ్యం గాక, ‘ఏమయ్యా సుబ్బన్నా, అట్ల దువ్వెనతో నువ్వు ఎంత గట్టిగా నొక్కినా ఆ కుంతలాలు శకుంతలాలు కావు గానీ, ఊరకనే ఆ డ్రామా కంపెనీ వాళ్ళ దగ్గరికి పోయి నొక్కులు నొక్కులుండే ఒక మంచి విగ్గు తెచ్చుకొని పెట్టుకో సరిపోతాది! పెళ్లి చూపులకు ఏమైనా పోతా ఉండావా, అర్థగంట సేపటి నుంచి ముస్తాబు అయితానే ఉండావు? ఇంతకూ నువ్వు చదువుకుండేకి వచ్చి నావా లేక షోకులు చేసుకుండేకి వచ్చినవా సుబ్బన్నా? బాత్రూంలోకి పోయి ఒళ్ళు తిక్కుంటావు తిక్కుంటావు, అర్ధ గంట సేపు తిక్కుంటావు! అట్లే అద్దం ముందర గుడకా’ అని జాడిచ్చినాను. దాంతో నంగిగా నవ్వుతూ, మా దగ్గరకు వచ్చి కూర్చుండాడు సుబ్బన్న. ఆ తర్వాత చందస్సును గురించి యతి ప్రాసలను గురించి మాట్లాడుకుండాం.

ఎవురో ఒక వ్యక్తి వాకిలి దగ్గరికి వచ్చి శాంతి నారాయణ గారున్న రూం ఇదేనా అండీ అని నన్ను అడిగినాడు. ‘నేనే శాంతి నారాయణండీ! మీరెవరు? రండి లోపలికి’ అంటూ పైకి లేచినాను. ఆయన నాకు నమస్కారం చేసి ‘నేను ఆశావాది ప్రకాశరావు నండీ! మీ ఊరు పక్కనున్న పెరవలి మాది!’ అని అనగానే నేను ఆశ్చర్యపోతా ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సంతోషపడతా చాప మీద కూర్చోబెట్టినాను. కాసేపు మాట్లాడుకున్న తర్వాత జోబిలో ఉన్న న్యూస్ పేపర్ కటింగ్ చూపి ఇది మీరు చదివిన సింగనమల హైస్కూల్లో అవధానం చేసినట్లు వచ్చిన ఆంధ్ర ప్రభ న్యూస్ పేపర్ కటింగ్ అని చూపి అభినందించినాడు. దాదాపు పది నెలల కిందటి పేపర్ కటింగ్ చూసి నేను ఆశ్చర్య పోయినాను. నేను శింగనమలలో అవధానం చేసినట్లు న్యూస్ పేపర్లో వార్త వచ్చినప్పటి నుంచి ఆయన నన్ను కలుసుకోవడానికి తాపత్రయపడిన విషయం అంతా విని నేను సిగ్గుపడుతా, ప్రస్తుతం తాను తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న కణేకల్ నుంచి అదేపనిగా నన్ను కలుసుకోవడానికి వచ్చినాడని తెలుసుకొని నేను అబ్బురపోయినాను. నా మిత్రులు కూడా ఆశ్చర్య పోయినారు.

ఆశావాది ప్రకాశరావు తాను ఎన్ని అవధానాలు చేసినదీ ఎక్కడెక్కడ పనిచేసినదీ చెప్పుతా ఉంటే విని మురిసిపోయినాను. తాను బెలుగుప్ప దగ్గర ఉన్న సీరిపికొట్టాల పల్లెలో పనిచేస్తున్నప్పుడు అంటే రెండు సంవత్సరాల కిందట, తమ హైస్కూల్లో సివి సుబ్బన్న గారి చేత అష్టావధానం చేయించినామని, 32 సంవత్సరాల వయసున్న సుబ్బన్న గారిని 32 కాండ్ల ఎద్దులు కట్టిన బండిలో ఊరేగించినామని ఆయన చెప్పుతా ఉంటే నాకు నోట మాట రాలేదు. ఈయనకు అష్టావధానమే శ్వాసా ధ్యాసేమో! అందుకే నేను విద్యార్థిగా అవధానం చేసినానని, తమ పక్క ఊరి వాన్నని, అదే పనిగా అంత దూరం నుంచి నన్ను కలుసుకోవడానికి వచ్చినాడని, ఎంత గొప్ప అవధాన ప్రేమికుడీయన అని అనుకుంటా కాసేపు ఆనందంతో మాటలు రాని వాణ్ణయి పోయినాను. ఆ సాహిత్య ప్రేమికుడు, అవధాన ఆరాధకుడు, తాను ప్రస్తుతం పని చేసే కణేకల్ హైస్కూల్లో అష్టావధానం చేయడానికి నన్ను ఆహ్వానించినాడు. నేను మహాభాగ్యంగా అంగీకరించినాను. సాయంత్రం సాహిత్య మిత్రునికి మిత్రులందరమూ కలిసి ఆతిథ్యమిచ్చి రైలెక్కించినాము.

శ్రీశ్రీ మహాప్రస్థాన పఠనం – శరీరమంతా చైతన్యానుభూతి!

ఆధునిక సాహిత్యాన్ని బోధించే సమయంలో నాగసిద్ధారెడ్డి సార్ శ్రీశ్రీ మహాప్రస్థానంలోని గేయాలు కొన్ని మహాద్భుతంగా చదివి దటీస్ శ్రీశ్రీ అని ఒక్కసారిగా ఆపినాడు. మొత్తం క్లాసురూములో ఏవో నిశ్శబ్ద సెగలు రగులు కుండాయి. నా నరాలు ఉప్పొంగినాయి

ఇన్నాళ్లూ సాహిత్యం అంటే రామాయణ భారత భాగవత పురాణాలు, కావ్య ప్రబంధాలు, నాటకాలు, వ్యాకరణ ఛందోలంకారాలు ఇవే అనుకొని, వాటిలోనే దేవులాడుతున్న నా వంటి విద్యార్థులకు నాగసిద్ధారెడ్డి గారి శ్రీశ్రీ మహాప్రస్థాన కావ్య పఠనాన్ని వినడంతో దిమ్మ తిరిగింది. ప్రాచీన తెలుగు సాహిత్యమంతా, రాజస్థానాల్లో రాజుల కథలు, రాణుల కథలు బ్రాహ్మణ జీవితాలు వాటిని ఆధారం చేసుకొని ఉదాత్తమైన కథావస్తువే కావ్యాల ఇతివృత్తంగా ఉండాలన్న కొన్ని నిరంకుశ నియమాలను అనుసరించి వచ్చిందని, ఆ నియమాలను బద్దలు కొడుతా, సామాన్య ప్రజల జీవితాలే కావ్య వస్తువులుగా ఆధునిక సాహిత్యం ఒక కాంతిపుంజంగా దూసుకొని వొచ్చిందని, ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ అప్పారావు వేగుచుక్క వంటి వాడని ఆయన ముత్యాలసరాలు వ్యవహారిక భాషలో రాసిన కన్యాశుల్కం నాటకం ఆధునిక సాహిత్యానికి దిక్సూచిక వంటిదని, ఆ మార్గాన్ని వదిలి తెలుగు కవిత్వం భావ కవిత్వం పేరుతో ఆకాశవీధుల్లో విహరిస్తూ దిగిరాను దిగిరాను దివి నుండి భువికి దిగి రానంటూ స్వేచ్ఛా విహారం చేస్తున్న సమయంలో కొరడా పట్టుకుని తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించిన నవయుగ వైతాళికుడు శ్రీశ్రీ అని గొప్ప భావోద్వేగంతో చెప్పినాడు నాగసిద్ధారెడ్డి సార్. శ్రీశ్రీ మహా ప్రస్థానం అంతా ఆయన నోట్లో ఉందేమో, నిమిష నిమిషానికీ శ్రీశ్రీ కవితల్ని కోట్ చేసినాడు, పొలాలనన్నీ హలాల దున్నీ ఇలాతలంలో హేమం పిండగ/జగానికంతా సౌఖ్యం నిండగ/విరామమెరుగక పరిశ్రమించే/బలం ధరిత్రికి బలి కావించే. కర్షకవీరుల ఖాయం నిండా/ కాలువగట్టే ఘర్మజలానికి/ ఘర్మజలానికి ధర్మజలానికి/ ఖరీదు లేదోయ్ అంటూ నాగసిద్ధారెడ్డి సార్ ఆవేశంతో మృదంగం వాయించినట్లు లయబద్ధంగా పాడుతా ఉంటే మొత్తం క్లాసంతా పిన్ డ్రాప్ సైలెన్స్! వింటా ఉంటే నా వెంట్రుకలు నిక్కబొడుచుకుండాయి.

శ్రమజీవుల ఘర్మజలాన్ని ధర్మజలంగా భావించిన మొట్టమొదటి మహాకవి శ్రీశ్రీ! కర్షకులను వీరులుగా కార్మికులను ధీరులుగా సాహిత్యంలో పట్టంకట్టి వారికి కావ్య గౌరవం కల్పించిన ప్రజా కవి శ్రీశ్రీ! అందుకే ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక యుగ కర్త శ్రీశ్రీ! అంటూ సార్ శ్రీశ్రీని మహోన్నతంగా వివరిస్తా ఆయనే రాసిన దేశ చరిత్రలు వినిపిస్తా నైలునదీ నాగరికతలో/సామాన్యుని జీవన మెట్టిది/తాజ్ మహల్ నిర్మాణానికి/రాళ్లెత్తిన కూలీలెవ్వరు/సామ్రాజ్యపు దండయాత్రలో/సామాన్యుని సాహసమెట్టిది/ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్/ అది మోసిన బోయీలెవ్వరు అని చదువుతా ఉంటే క్లాసంతా గంభీమైన నిశ్శబ్దంతో ఉండిపోయింది! నా దవడలు బిగిసుకొని పోయినాయి! మనసు నిండా తుఫాను చెలరేగినట్లయింది! ఒళ్లంతా జేవురించింది! ఇది కదా సాహిత్యమంటే! విద్వాన్‌లో చేరకుంటే ఈ మహాకవి శ్రీశ్రీ పేరు విననైనా వినగలుగుతానా? భావోద్వేగంతో నన్ను నేను మరచిపోయినాను. నా మాదిరే అందరూ! క్లాస్ అయిపోయింది! అందరమూ నాగసిద్ధారెడ్డి సార్ చుట్టూ ముసురుకుండాం. మహాప్రస్థానం కాపీలు దొరుకుతాయా సార్ అని ఆదుర్దాగా అడిగినాం. ఆయన చెప్పినాడు. అమితోత్సాహంతో నలభై యాభై మంది విద్యార్థులం ఆయన వెనక స్టాఫ్ రూము వరకు పోయి పదీ పదైదు నిమిషాలు పాటు ఆయనతో ఎంతో గౌరవంగా మాట్లాడి వెనుదిరిగినాం.

నేను కాలేజీ అయిపోగానే అలస్యమైతే వెంకట్రామ బుక్ స్టాల్లో మహాప్రస్థానం కాఫీలు దొరుకుతాయో లేదోనని రూముకు పోకుండా నేరుగా పోయి ఒక కాపీ కొనుక్కొని ముద్దు పెట్టుకుండాను. రూము కొచ్చి ఆవురావురుమని చదివినాను. అయితే కొన్ని కవితలు అర్థం కాలేదు. అర్థం కాకపోయినా ఆ గేయాలలో అద్భుతమైన లయ, మాటలకందని లోతైన భావం నన్ను కట్టిపడేసినాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version