[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
గద్య పద్యాల మధ్య నేను – ఏదీ వద్దంటున్న ఇంటి పరిస్థితి!
రచనాసక్తి రోజు రోజుకూ నాలో పెరగసాగింది. అయితే ఏది రాయాల? చందోబద్ధమైన పద్యమా? కథనా? అష్టావధానాలు చేయల్లనుకుంటే పద్యసాధన చేసే తీరల్ల! అవధానంలో ధారణ కంటే ధార ముఖ్యమైనది. ఛందస్సు మీద మంచిపట్టు ఉన్నప్పుడే పద్యధార అలవోకగా వస్తుంది. అవధానం చక్కగా చేస్తాడన్నది ప్రచారమైనప్పుడే అవధానాలకు అవకాశాలు వస్తాయి. అయితే ఎంత చక్కగా చేసినా అందరికీ అవకాశాలు రావు. దానికి కులబలం బాగా పనిచేస్తున్నట్లు అర్థమయితావుంది. వీటికి తోడు రూప సౌందర్యం లావణ్యం కొంత పని చేస్తాయనిపిస్తుంది. దానికి గౌరిపెద్ది రామ సుబ్బశర్మ సారే పెద్ద తార్కాణం! అంత గొప్ప పాండిత్య వైదుష్యమున్నవాడే అవధానంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇంక నేనెంతటి వాణ్ని? కుల నేపథ్యమూ లేదు, అపారమైన పాండిత్యమూ లేదు. రూప సౌందర్యం అసలే లేదు. అటువంటి నేను పద్యధారను బాగా అలవర్చుకున్నా అవధానమార్గంలో రాణించగలనా? ఇవి ఏవీ లేని నేను, నిలకడగా ఏదైనా మంచి కథ నెన్నుకొని పద్య కావ్యం రాస్తే మేలేమో! అయితే పద్య కావ్య నిర్మాణానికి నిరంతరం ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మంచిది. పద్యాలను అల్లడం ఒక వ్యసనంగా మార్చుకున్న నేను కావ్యరచనకు పూనుకుండే వరకు ఏమైనా ఖండికలు రాయడం మేలనుకొని, రాసి పత్రికలకు పంపితే ఏ పత్రికా ఇంతవరకూ ఒక ఖండికనైనా ప్రచురించలేదు. ఇటువంటప్పుడు పద్యం రాయడమా మానడమా? ఏదీ పాలు పోవడం లేదు.
రెండు నెలల కిందట భారతి మాసపత్రికకు పంపిన ‘పయనం’ గేయం, ‘తరణి’ పద్యఖండిక తిరిగొచ్చినాయి. మనసంతా వికలమైంది. తగినన్ని స్టాంపులు అతికించిన కవరు పంపడం వల్ల అవి తిరిగొచ్చినాయి. పంపడానికీ తిరిగి రావడానికీ అనవసరమైన పోస్టల్ ఖర్చులు! ఈ విధంగా ఎన్ని కవర్లు తిరిగొచ్చినాయో! వీటికంతా అనవసరమైన ఖర్చే కదా! మా విద్వాన్ బ్యాచ్‌లో దాదాపు మున్నూరు మంది స్టూడెంట్స్ ఉండారు. వాళ్లకు ఎవురికీ లేని ఈ దురద నాకే ఎందుకు? మాచిరాజు, ఆచారి,శివగౌడ్ ముగ్గురూ పద్య రచన చేస్తా వుండారు. వాళ్ళెవురూ తాము రాసిన పద్యాలను పత్రికలకు పంపడం లేదు. మరి నేనే పంపడమెందుకు? వెనదిరిగి వచ్చిన దాండ్లను చూసి బాధపడడమెందుకు? పద్యాలు రాయడం, పత్రికలకు పంపడం అనే ఈ వ్యసనం నుంచి బయటపడలేనా?
ఈ ఆలోచనలతో రెండు దినాలు గడిచిపోయినాయి. మూడో దినం ఆంధ్రజ్యోతికి పంపిన కథ వెనుదిరిగి వచ్చింది. కాసేపు బాధపడినాను. ఇంక మూడు నెలల కిందట పంపిన ‘పరాజతులు’ నవల అదెంత మాత్రమో! అది గుడకా వెనక్కి రావొచ్చు! వస్తే రచనావ్యాసంగానికి స్వస్తి పలికేది మేలు అనుకుంటా కాలేజీకి పోయినాను.
నాగసిద్ధారెడ్డి సార్ ఆధునిక సాహిత్య పాఠ్యాంశంలో భాగంగా నవలాప్రక్రియను గురించి తెలుపుతా, ప్రస్తుతం వివిధ పత్రికల్లో సీరియల్స్‌గా వస్తున్న నవలల్ని ఏకిపారేయసాగినాడు. యువకులను పెడదో పట్టించే విధంగా ఈరోజు నవలలు వస్తున్నాయని, చాలా నవలలు వాస్తవ జీవితానికి విరుద్ధంగా అభూత కల్పనతో, రోత పుట్టించే వర్ణనలతో, పచ్చి సెక్స్ బుక్స్ మాదిరి వస్తున్నాయని, అటువంటి నవలల్ని సాహిత్యం అని అనుకోవడం మూర్ఖత్వమని, కాలక్షేపం కోసం రాసిన అటువంటి నవలల్ని చదివి మీ మెదడులను పాడు చేసుకోవద్దని చాలా ఆవేదనతో చెప్పినాడు నాగసిద్ధారెడ్డి సార్. ఆయన మాటలు నిజమనిపించినాయి. కొన్నాళ్ల కిందట చదివిన నవలలు గుర్తుకొచ్చి, చేతికొచ్చిందని ప్రతి నవలను చదవడం పొరపాటు అనుకుండాను.
సాయంత్రం రూముకు వచ్చేసరికి పెద్ద కవర్ ఒకటి వచ్చింది. దాని మీద నా అక్షరాలే! అర్థమైంది నా ‘పరాజితులు’ నవల వెనక్కి వచ్చింది. నేను మౌనంగా ఉండడం చూసి రూము మిత్రులు బాధపడినారు. ఇప్పుడు వస్తా ఉండే ప్రేమ నవలలకు దేనికీ ఇది తీసిపోదని, శృంగార వర్ణన తగినంత మోతాదులో లేనందు వల్ల పత్రికల వాళ్లకు నచ్చలేదేమోనని, నవలలను ఒక స్త్రీ పేరు మీద పంపితే బాగుండేదని నా తృప్తి కోసం రకరకాలుగా మాట్లాడ సాగినారు. నాకు పెద్దగా బాధనిపించలేదు. క్లాసులో నాగ సిద్ధారెడ్డి సార్ మాటలు విన్న తర్వాత నా నవల వెనుదిరిగి వచ్చినందుకు నేను ఫీల్ కాలేదు. అయితే మనసులో ఎక్కడో ఏదో కుచ్చుకో సాగింది. రెండు దినాలు మౌనంగానే కాలేజీకి వెళ్లి వచ్చినాను. మూడోదినం నన్ను నేను పరామర్శించుకుండాను.
ఒక దశకు చేరుకుండే వరకు ఏ రచనలూ చేయకుండా ఉండడమే మంచిది! అప్పుడైనా అనుకున్నది దక్కకపోతే ఇట్లే జీవితాంతమూ చీకటి వెన్నాడితే చేయగలిగేదేముంది? చీకట్లోనే నడవక తప్పదు. కానీ చీకటి తర్వాత వెన్నెల రాకుండా ఉంటుందా? అయినా ఎందుకింత తర్కం? సింగమనేని అన్నట్లుగా కొన్ని వందల కథలు నవలలు నేను చదివినా సముద్రమంత సాహిత్యంలో నేను చదివింది ఎంత? నేను చేసిన ప్రయాణం ఎంత? పదీ పదైదు కావ్యాలు చదవగానే, ఇన్నూరు మున్నూరు పద్యాలు రాయగానే, ముప్పై నలభై కథలు, పదీపన్నెండు నవలలు చదవగానే, పద్యఖండికలూ కథలూ నవలలూ రాయడమేనా? రాసిన ప్రతిదీ పత్రికలకు పంపడమేనా? పంపగానే ప్రచురిస్తారని ఆశపడడమేనా? ఏమో మరి, ఇది బాల్య చాపల్యం కావచ్చునేమో! బాల్య చాపల్యమే అయితే, పత్రికలలో వచ్చే పద్యాల ముందు, ప్రేమకథల ముందు నా రచనలు తీసిపోయినవని ఎవరైనా ఎత్తిచూపగలరా?
నన్ను నేను ప్రశ్నించుకుంటా, నా సాహిత్య ప్రయాణాన్ని విమర్శించుకుంటా, నా తృప్తి కోసం నన్ను నేను సమర్థించుకుంటా, పాఠ్యపుస్తకాలను చదువుతా ఆపేస్తా, పాఠ్యేతర రచనలను చదువుతా, నా పద్యాలతో కథలతో సరిచూస్తా కాలేజీకి పోతూ వస్తూ ఉండాను. మధ్యలో జంధ్యాల గారి కరుణామయి కరుణశ్రీ పద్య కావ్యాన్ని, ముళ్ళపూడి వెంకటరమణ రాసిన అనామిక నవలను చదివినాను. రెండు పుస్తకాలూ పెద్దగా నచ్చలేదు. ఆ మాత్రం నేను రాయగలననుకుండాను. నాగసిద్ధారెడ్డి సార్ సూచించిన రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబారావు, మహీధర రామ్మోహనరావు వంటి గొప్ప రచయితల నవలలు ఏదీ కాలేజీ లైబ్రరీలో దొరకలేదు. యూనివర్సిటీ లైబ్రరీకి పోయి చదువుకుందాం అనుకుంటే,అది చాలా దూరం. అంత దూరం నడుచుకుంటూ పోతే ఆ నవలలు అందుబాటులో ఉంటాయో లేదో తెలీదు. కొనుక్కొని చదువుకుందాం అనుకుంటే అది నా చేతనయ్యే పని కాదు. అందుకే మా కాలేజీలో ఏ పుస్తకాలు అందుబాటులో ఉండాయో అవి తెచ్చుకొని చదవడం, సగం పుస్తకం చదివేటప్పటికీ అది నాగసిద్ధారెడ్డి సార్ చెప్పినట్లు పరమ చెత్తగా అనిపించడం, అది వాపసిచ్చి మరొకటి తెచ్చుకొని చదవడం, ఏదీ హృదయాన్ని అర్ద్రం చేసి ఆలోచింపజేయక పోవడం ఇట్లనే దినాలు గడిచిపోతుండడంతో అన్నీ పక్కన బెట్టి పాఠ్యాంశాలను చదవడానికి గట్టిగా కూర్చుండాను.
విద్వాన్ మూడో సంవత్సరం సగం కాలం గడిచిపోయినా అలంకార శాస్త్రం కొరుకుడు పడలేదు. అలంకారాలను బోధించే కుప్పుస్వామి పిలపిళ్లై రస సిద్ధాంతాన్ని గురించి చెప్పుతున్నాడు. భరతుని నాట్య శాస్త్రం నుంచి మొదలుపెట్టి భట్టలోల్లటుడు, అభినవ గుప్తుడు, ఆనందవర్ధనుడు ఇంకా ఎవురెవురో అలంకార శాస్త్రవేత్తలను, వాళ్లు ప్రతిపాదించిన రస సిద్ధాంతాలను, విభావ, అనుభావ, స్వాతికభావ, వ్యభిచారి భావాలను, వాటి సంయోగం చేత ఏర్పడే స్థాయీభావమును కుప్పుస్వామి సార్ ఎంత చెప్పినా తలకాయకు ఎక్కడం లేదు. ఒక్కొక్క ఆలంకారికుడు ఒక్కొక్క రససిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తా, ధ్వన్యాలోకం వంటి అలంకార శాస్త్ర గ్రంథాలను రాసినారని, అవన్నీ చదివినప్పుడే రససిద్ధాంతం సమగ్రంగా అర్థమవుతుందని పిళ్లై సార్ చెప్పుతా ఉంటే, ఓరి నాయనో, ఒక మహాకవి రాసిన కావ్యాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఇంత సోది ఉందా అని తలకాయ పట్టుకొని, అలంకార శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి నానా అవస్థలు పడసాగినాను.
ఇట్లాంటి సమయంలోనే ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. నాయన ఎవురి చేతనో పెద్ద ఉత్తరం రాయించినాడు. చదవగానే గుండె బరువైంది. మూడెకరాల మడి కోరుకు దొరికిన ఈ సంవత్సరమే చెరువుకు నీళ్లు సరిగ్గా రాలేదంట! ఇంటి పరిస్థితి ఏమి బాగ లేదని నాయన చాలా బాధపడుతా జాబు రాయించినాడు. ఇంటి పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలు చూసుకోకుండా నేను హాయిగా చదువుకోడానికని తిరుపతికి చేరుకుండానంట! మా తిప్పలు ఆ భగవంతునికి తప్ప నీకు అర్థం కావు అని ఇంకా ఏవేవో రాయించినాడు నాయన. అంతా చదువుకొని సాయంకాలం మిద్దె పైకెక్కి ఏకాంతంగా కూర్చొని కన్నీళ్లు కారుస్తా నాలో నేను కుమిలిపోయినాను.
నేను ఇంటి బాధ్యతలు గాలికొదిలేసొచ్చి ఇక్కడ హాయిగా సుఖంగా చదువుకుంటా వుండానా? ఈ హాయినీ సుఖాన్నీ నేను ఇంటి నుంచి అంతా మూట కట్టుకొని వచ్చి ఆనందంగా అనుభవిస్తూ ఉండానా? ఇంట్లో అందరూ కష్టపడతా ఉంటే ఆ కష్టాన్నంతా నేను లాక్కొని వచ్చినానా? నిజంగా వాళ్లందరూ నన్ను చదివించడానికే కష్టపడతా వుండారా? వాళ్ల ఆకలి తీర్చుకోవడానికి ఏ మాత్రమూ కాదా? నేను ఇక్కడికి వచ్చి చదువుకోకుండా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళతో పాటు కూలికి పోతే వాళ్ల కష్టాలన్నీ తీరిపోతాయా? నాయన ఎందుకింత దుర్మార్గంగా ఉత్తర రాయిస్తా ఉండాడు? ఇటువంటి మనిషి రేప్పొద్దున నేను ఉద్యోగంలో చేరినంక ఇంకెంతగా బాధ పెడతాడో? ఈ బాధకంతా కష్టాలకంతా కారణం, ఆరేడు మందిని పుట్టించుకోవడం వల్లనే కదా! ఇదే విషయం నేను నిలదీసి అడిగితే ఏమని జవాబు చెప్పుతాడు? మా కాలేజీలో నా వంటి దరిద్రం నా కొడుకు ఎవుడైనా ఉండాడా? వారానికి ఒకనాడయినా కమ్మగా కడుపునిండా తింటావుండానా? ఒక జత బట్టలైనా మంచివి కుట్టించుకుండానా? కాళ్లకు స్లిప్పర్స్ తప్ప చెప్పులు కొనకుండా, సంవత్సరానికి ఆరు నూర్లు స్టైఫండ్ ఇస్తావుండారు, అదంతా నా దగ్గరే పెట్టుకుంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా! ఒక్క పైసా ఇంటికి పంపాల్సిన పని లేదు కదా! నాకు నెలనెలా తాను యాభయ్యో అరవయ్యో పంపించినట్లు, నా స్టైఫండ్ రాగానే అంతా ఇవ్వాలంటాడు. ప్రతినెలా ఇరవై ముప్పై పంపిన హెడ్మాస్టర్ సార్ సంగతేమిటి? ఆయనకు ఇవ్వాల్సిన డబ్బు స్టెఫండ్ వచ్చినప్పుడు ఇవ్వకపోతే ఎట్ల? నేను ఆయనకే పుట్టినానా? లేకుంటే ఆయనకు నేను పేగు బంధాన్నా?
రకరకాల ఆలోచనలతో ప్రశ్నలతో మనసంతా వికలమై రెండు దినాలు పుస్తకం ముట్టుకోలేదు. ఏదీ రాయల్లని అనిపించలేదు. మిత్రుడు కోనయ్య వచ్చి ఏదో మ్యూజియంలో మంచి ప్రోగ్రామ్స్ ఉండాయని బలవంతంగా పిలుచుకొని పోయినాడు. మ్యూజియంలో మొదట ఫ్యామిలీ ప్లానింగ్ బోర్డు తగిలించి ఏదేదో చెపుతా ఉంటే, మొదట అక్కడికి పోయినాం. ఆడవాళ్లు మర్మావయాల ఫోటోలను చూపుతా, వ్యాసెక్టమీ ట్యూబెక్టమి ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతాయో, ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో సిగ్గూ బిడియం లేకుండా వివరిస్తా వాటి మీద ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టడానికి ప్రయత్నిస్తా ఉండారు. మ్యూజియంలోని రకరకాల ప్రోగ్రాములను చూస్తా ముందుకెళ్లినాం. అక్కడ ఒక హాల్లో డాన్స్ ప్రోగ్రాం జరుగుతా ఉంది. నేను విముఖత చూపినాను. కోనయ్య బలవంతంగా పిలుచుకొని పోయినాడు. ఎప్పుడూ అటువంటి కార్యక్రమాలకు పోయే సాహసం నేను చేయలేదు. డాన్స్ ప్రోగ్రాములకు వేరే టికెట్ కోనయ్య వేరే టికెట్లు తీసినాడు.
డ్యాన్స్ మొదలైంది. మంచి వయసులో ఉండే యువతులు అంగాంగ ప్రదర్శనతో వెకిలి చేష్టలు చేసుకుంటా వయ్యారంగా కులుకుతా వొచ్చినారు. స్టేజి మీద వాళ్లను చూస్తా ఈలలు వేయనారు పోకిరీ నాయాళ్లు. కోనయ్యా సుబ్బన్నా చొంగ కార్చుకుంటా చూస్త ఉండారు. రికార్డు డాన్స్ మొదలైంది. నాకు చూడటానికి సిగ్గయింది. అయితే ఆడవాళ్ళ హోయలును, అవయవ సౌష్టవాలను చూసి శరీరం అంతా ఏదేదో అయింది. చాలాసేపు చూస్తే స్థలనం అయిపోతాదని అనిపించింది. ఇంక చాలని కోనయ్యను లాక్కుని బయటికి వచ్చి, ఎవురైనా చూస్తే ఏమనుకుంటారు? మనం ఇటువంటి ప్రోగ్రామ్సుకు రావడం సభ్యతగా ఉంటాదా అని మెత్తగా మందలించినాను.
చూసినంత మాత్రాన ఏమయితాది నారాయణా? లైఫ్‌లో ఎంజాయ్మెంట్ ఇప్పుడుగాక ఇంకెప్పుడు చేస్తాం? అని చాలా తేలికగా మాట్లాడినాడు. అతనితో వాదించడం ఇష్టం లేక మౌనం వహించినాను.
అందరమూ అక్కడ నుంచి బయలుదేరినాం. రేపు ఆదివారం కావడంతో ఈ రాత్రికి మీ రూములోనే ఉంటానన్నాడు కోనయ్య. అందరూ ఇష్టంగా అంగీకరించినారు. ఈ విధంగా ఇంతకుముందు చాలా సార్లు కోనయ్య ఒకటి రెండు రోజులు మా రూములోనే ఉండిపోయినాడు. ఉన్నప్పుడు తానే హోటల్ నుంచి కర్రీస్ తెప్పిస్తాడు. అతడు మాతో ఉండడం నాకు అభ్యంతరం లేదు. కానీ సినిమా విషయాలు ప్రస్తావించి సెక్స్ విషయాలే ఎక్కువ మాట్లాడుతాడు. నా జూనియర్స్ ముందర అట్లా మాట్లాడడం నాకు ఇబ్బందిగా ఉంటుంది.
రాత్రి నా అవస్థ వర్ణనాతీతం! కళ్ళు మూసుకొని పండుకుండాను. కళ్ళల్లో ఆ డ్యాన్స్ దృశ్యాలు మెదల సాగినాయి. భరించలేకపోయినాను. రాత్రి ఒక పొద్దప్పుడు డ్రాయరంత తడిసిపోవడంతో మెలకువ వచ్చి చూసుకుండాను.
ఇట్లా మాటిమాటికీ స్ఖలనం కావడం మంచిది కాదేమో! ఒట్టి కారం మెతుకుల తిండికే ఇట్లయితే ఇంక పుష్టికరమైన తిండి తింటే ప్రతిరోజూ ఇట్ల స్ఖలనం చేసుకోవల్సిందేనేమో! ఈ విధంగా నేనొక్కన్నేనా లేదంటే యువకులందరి పరిస్థితీ ఇట్లేనా? దీనికంతా కారణం విపరీతంగా కామ వాంఛలు పెంచుకోవడమే కదా! కోనయ్య ఎప్పుడు కలిసినా శృంగార విషయాలు మాట్లాడుతాడు. మరి ఇతని పరిస్థితి ఏమిటి? రకరకాలుగా ఆలోచిస్త నిద్రలోకి జారుకుండాను.
ఉదయం నీరెండలో బాగుంటుందని మిద్దె మీదికి పోయినాడు కోనయ్య. దాదాపు తొమ్మిది గంటలు కావొచ్చింది. మా పక్కింటి వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు. మా వయసున్న యువకుడు ఎవురినో తిడతావుండాడు. కోనయ్య గబగబా పైన్నుంచి దిగొచ్చినాడు. మేము మాడీలో బాడుగకు ఉండాం కదా! ఇంటి ఓనర్సు కింది పోర్షన్లో ఉండారు. వాళ్ళింటి ముందుకు వచ్చి పక్కింటి వాళ్ళు, “పనికిమాలిన పోకిరీ నాయాళ్లకు ఇల్లు బాడుగకు ఇస్తే, పక్కన మేము సంసారం ఉండాల్నా వద్దా” అంటూ మా ఇంటి ఓనర్స్‌ను ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతా ఉండారు. మా ఇంటి ఓనర్సూ పక్కింటి వాళ్ళూ ఇంతకు ముందు రెండుసార్లు వాదులడుకుండారు. మా ఇంటి ఓనర్ భార్య బయటకు వచ్చి వాళ్ళతో వాదులాటకు దిగింది. ఓనర్ మా రూముకొచ్చి ‘ ఏందయ్యా ఇదంతాను?’ అని అడిగినాడు. కోనయ్య సంజాయిషీగా చెప్పుతా, ఆ అమ్మాయి ఇంటి బ్యాక్ సైడ్ ఉండే దొడ్లో చెంబు కిందికేసింది. నేను చూడగానే సైగ చేసింది. అంతలోనే వాళ్ళన్న వచ్చి చూసినాడు. అంతే జరిగిండేదండీ! సారీ అని అన్నాడు
నాకు విషయం అంత అర్థమైంది. ఓనర్‌కు సర్ది చెప్పినాను. అతడు రెండు మాటలు దండించి వెళ్లిపోయినాడు. నేను కోనయ్యను మందలించినాను. అమ్మాయి అన్న రౌడీ ఎలిమెంట్ అని, కిందికి పిలిచి దుర్భాషలాడితే, నీ మీద చేయి చేసుకుంటే పరిస్థితి ఎంత ఆక్వర్డుగా ఉంటుందని సున్నితంగా దండించినాను. సారీ ఫ్రెండ్స్ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని బాధపడినాడు కోనయ్య. ఒక అర్థగంటకల్లా పరిస్థితి అంతా సద్దుమణిగింది. మిగతా మిత్రులు ముగ్గురూ మౌనంగా ఉండడంతో, సాయంకాలం వరకు మాతో గడపాలనుకున్న కోనయ్య, వాళ్ళ కాలేజీకి బయలుదేరినాడు. అతను ఒక్కడే పోవడం శ్రేయస్కరం కాదని మేమందరమూ అతనికి తోడుగా గాంధీ బజారు వరకు పోయి రిక్షా ఎక్కించి వొచ్చినాం. మా వాళ్లు ముగ్గురూ కోనయ్యను బ్యాడ్ గానే కామెంట్ చేసినారు. నేను సర్ది చెప్పినాను.
***
పక్కింటి అమ్మాయి వాళ్లు, ఏం పని చేస్తారో నాకు తెలీదు. ఏడెనిమిది సెంట్ల స్థలం మధ్యలో కొట్టం! కొట్టానికి ముందు వెనకాల విశాలమైన బయలు! వెనకున్న బయల్లో ఆ అమ్మాయి మొక్కలకు నీళ్లు పోస్తా ఉంటాది! నేను మిద్ది మీదికి పోయిన ప్రతిసారి ఆ అమ్మాయి అదే పని చేస్తా ఉండడంతో నాకు కొంచెం అనుమానం వచ్చింది. ఒక సాయంత్రం వాళ్ళమ్మ ఆ అమ్మాయిని గట్టిగా పిలిచింది. అప్పుడు తెలిసింది నాకు అమ్మాయి పేరు వనజాక్షి అని. ఒక రోజు నేను కాలేజీ నుంచి వస్తూ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న అమ్మాయిని స్పష్టంగా చూసి ఆశ్చర్య పోయినాను. ఆదోని నుంచి మీనాక్షి వచ్చిందనుకుండాను. అచ్చం మీనాక్షి పోలికలే! మిద్దె మీద నుంచి చూసినప్పుడు సరిగా అబ్జర్వ్ చేయలేదు గాని అచ్చం మీనాక్షే! పేరు వేరే! రెండు పేర్లలోనా ఐదు లఘువులే! అవి తగణం! ఇది సలం! రెండూ ఇంద్రగణాలే! ఎంత అద్భుతం! అదే అందం! అదే కలర్! అదే ముఖం! అవే కళ్ళు! మగవాన్ని వేటాడే కళ్ళువెనకటి ఆదోని కథ, పునరావృతం అయితాదా? అయితే ఎట్ల చేయల్ల? మళ్లీ మనసు ఈ వనజాక్షి ఊహల్లో తేలుతా పిరికితనంతో నలిగిపోతాదేమో! ఇప్పుడేమి గతి?
అనుకుంటా మిద్దె మీదికి మెట్లెక్కుతా ఆమె వైపు చూసినాను. వోర చూపులు విసిరింది. ఎక్కడో తాకినాయి. భగవంతుడు ఆడవాళ్లను ఇంతందంగా ఎందుకు సృష్టిస్తాడో? మగవాళ్ళ ప్రాణాలను తీసి ఆ చూపుల్లో మత్తును ఎందుకు అతుకుతాడో? అనుకుంటా, ఎందుకొచ్చిన తంటా అని ఆమెను గురించి అనుకోవడం మానేసి నాను. తర్వాత తెలిసింది వనజాక్షి అన్న పెద్ద రౌడీ ఎలిమెంటని! ఇంతలోనే కోనయ్య కారణంగా మొన్న ఆక్వర్డు సిట్యుయేషన్! తొందరగా వేరే రూము చూసుకుండేది మేలని నిర్ణయించుకుండాను. అంతలోనే, వోనర్స్ కూడా రూము వొదలండని చెప్పినారు.
ఓరియంటల్ కాలేజీ డబ్బా రేకుల కాలేజీకి మార్పు
కపిల తీర్థానికి వెళ్లే రోడ్లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజిని అటువైపు వెళ్ళినప్పుడు నాలుగైదు సార్లు చూసినాను. దాన్ని డబ్బా రేకుల కాలేజీ అని పిలుస్తారు. ఏ కారణం చేతనో మా కాలేజీ ఆ డబ్బా రేకుల కాలేజీ బిల్డింగుల్లోకి మార్చినారు. దానికి దగ్రగా వుంటుందని మేము మంచాలవీధిలోకి మారినాం. ఆ ఇంటి ఓనర్ వెంకటేష్, దేవస్థానంలో క్షౌరశాల మిరాశిదారు. మిరాశిదారులకు దేవస్థానం నుంచి మిరాశి వస్తాదంట! అందుకే ఆ కుటుంబం బాగా నాగరికతగా ఉంది. మా పల్లెల్లో ఉండే మంగలోళ్ల మాదిరి లేదు. ఆ కుటుంబంలో అందరూ చాలా డీసెంట్ గా ఉండారు.
వెంకటేష్ రూపంలోనూ వేషధారణలోను చాలా రిచ్‌గా కనిపిస్తాడు. ఆనందానికీ అందచందాలకూ హుందాతనానికీ నాగరికంగా వుండడానికీ అన్నిటికీ డబ్బే కారణమేమో! కాలేజికి దగ్గరగా ఉంటుందని, రూము విశాలంగాను, రెండు బాత్రూములు ఉండాయని బాడుగ కొంచెం ఎక్కువైనా సరే అని రూములోకి చేరినాం. ఎండాకాలం సెలవుల్లో మేము ఖాళీ చేసి పోతే మళ్ళీ చేరడానికి ముందున్న రూము బాడుగను అన్నిచోట్ల పెంచుతా ఉండారు. అయ్యో, చదువుకుండే పిల్లలు కదా అని ఎవురికీ దయాదాక్షణ్యాలే లేవు. తిరుపతిలో అందరికీ బిజినెస్ మైండే! కోనయ్య కారణంగా రూము మారడం వల్ల పది రూపాయలు రూము బాడుగ పెరిగిందని అందరము కోనయ్యను తిట్టుకుండాం.
మా కొత్త కాలేజీ రేకులదైనా విశాలంగా ఉంది. చుట్టూరా కాంపౌండ్! మధ్యలో పెద్ద పెద్ద చీమ చింతకాయల, యెలక్కాయల చెట్లు! కాలేజీ పక్కనే ఉత్తరం వైపు పాలిటెక్నిక్ కాలేజీ!కాలేజికి తూర్పు వైపు గేటు దాటగానే కపిల తీర్థం రోడ్డు! రోడ్డుకు అవతలి వైపు విశాలమైన గ్రౌండ్! ఆ గ్రౌండ్‌కు పక్కనే, ఉత్తరం వైపున నాగసిద్ధారెడ్డి సారోళ్ల ఇల్లు! దక్షిణం వైపున్న రోడ్డుకు దగ్గరగానే గాలి వీధి! పార్థసారథి సార్, చేబ్రోలు సుబ్రహ్మణ్యం సార్, ఆ ప్రాంతంలోనే ఉండేది! పాఠ్యాంశాలలో ఏ సందేహం వచ్చినా కాలేజీ గురువులందరూ దగ్గర్లోనే ఉండారని నాకు చాలా సంతోషం అయింది.
మా ఓరియంటల్ కాలేజీ డబ్బా రేకుల కాలేజీలోకి మారిన తర్వాత ప్రిన్సిపాల్ సుదర్శనాచారి గారు, కాలేజీలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు విద్యార్థులందరూ కాలేజీలో ఉండే బయలు ప్రదేశంలో, తరగతి వారీగా నిల్చుకొని ప్రేయర్ చేయల్లని, ప్రేయర్ తర్వాతనే కాలేజీ తరగతులు జరగల్లని రూల్ పెట్టినాడు. కాలేజీ మొత్తం వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షంతో నడుస్తా ఉందని, అందువల్ల ఆ దేవదేవుని ప్రతి దినమూ ఒక ఐదు పది నిమిషాల పాటు ప్రార్థించడం మన ధర్మం అని ఆయన అభిప్రాయం. అందుకే కాలేజీ మారిన రెండో రోజు నుంచే ప్రేయర్ జరుగుతా ఉంది. ఆ ప్రేయర్ సమయంలోనే ప్రిన్సిపల్ గారు అప్పుడప్పుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన బిళ్ళగోసి పంచపైన చేతుల కప్పులుండే తెల్లని షర్టు వేసుకుంటాడు. దానిపైన పొడవైన నెహ్రూ కోటు ధరిస్తాడు. తలపైన సర్వేపల్లి రాధాకృష్ణన్ మాదిరి తెల్లని కర్ణాటక రుమాలును తలపాగా పెట్టుకుంటాడు. వెంకటేశ్వర స్వామి మాదిరే కనుబొమ్మల మధ్య నుంచి నొసటి పై వరకు మూడు నామాలు తీసి ఉంటాడు. రెండు చెవుల్లోనూ వొంటి రాళ్లకమ్మలు మెరుస్తా ఉంటాయి. అందరూ ఆయనను సంస్కృతంలో మహా పండితుడని అంటారు. ప్రసంగంలో ఏవేవో శ్లోకాలు కోట్ చేస్తా ఉంటాడు. మంచి ఉపన్యాసకుడు కాకపోయినా చాలా డెప్త్‌గా మాట్లాడతాడు.
దైవప్రార్థన నిండా శృంగారమేనా?
ఎవురూ నేర్పకుండానే జాతీయ గీతం జనగణమన కంఠస్థం అయినట్లే మా కాలేజీ ప్రార్థన శ్లోకం నాకు నోటికొచ్చింది. ప్రేయర్లో ‘ఎ’ విద్వాన్ విద్యార్థులు ఇద్దరు స్పీడుగా చెప్పుతా వుంటే విద్యార్థులందరమూ యాంత్రికంగా పలుకుతావుంటాం. దాని భావం లోకి ఎప్పుడూ తొంగిచూడలేదు. ఈ రోజు ప్రొద్దున్నే ఎవురింట్లోనో రేడియోలో సుప్రభాతం వస్తా ఉంది. అంతకు ముందెప్పుడూ నేను ప్రొద్దున్నే సుప్రభాతం వినలేదు. ఈ రోజు విని ఆశ్చర్య పోయినాను. రోజూ మా కాలేజీలో మేము పాడే ప్రార్థన గీతమే అది! జాగ్రత్తగా విన్నాను. వింటా నేను నోటితో మెల్లగా పలుకుతా దీని అర్థం ఏమిటని ఆలోచించినాను. మూడు సంవత్సరాల నుంచి సంస్కృతం చదువుకుంటా సమాస పరిజ్ఞానాన్ని పుంలింగ స్త్రీ లింగ శబ్ద స్వరూపాలను తెలుసుకుంటా ఉండాను. అందువల్ల ఆ శ్లోకంలోని ప్రతి పదానికీ అర్థం బోధపడింది.
కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణ నీలతనో! కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకటపతే! అంటే లక్ష్మీదేవి చనుమొనల మీదున్న కుంకుమతో నియతము (నిరంతరము) ఎర్రనైన నీల వర్ణ తనువు గలవాడా నీకు విజయమగుగాక అని అర్థం. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడానికి ఈ శృంగార వర్ణన అవసరమా? లక్ష్మీదేవి చనుమొనల మీద ఉన్న కుంకుమతో నీలవర్ణుడైన వెంకటేశ్వర స్వామి నిరంతరమూ ఎర్రగా కనిపించాలంటే ఆయన నిరంతరమూ ఆ లక్ష్మీదేవిని కౌగిలించుకొనే ఉంటాడా? ఆ కౌగిలిలో ఉన్న దేవున్ని కవి ప్రార్థించడమేమిటి? వేరే సందర్భం కవికి కనిపించలేదా? పైగా ఆ తల్లి చనుమొనలను కవి చూడడమేమిటి? చనుమొనలు ఆలింగనాలు ప్రార్థనలో ప్రస్తావించాలా? పక్కనున్న లక్ష్మీదేవి ధవళ కాంతి వల్ల రంగు మారిన సుందరమైన వాడా అని అనవచ్చు కదా! అయినా వెంకటేశ్వరుని నీలవర్ణ దేహ కాంతిని మార్చడం ఎందుకు? కవికి నీలిరంగు నచ్చలేదా? భక్తిలో శృంగార పదప్రయోగాలు, భావనలు, లేకుండా ప్రార్థన శ్లోకం రాయడానికి వీలు కాదా? విదేశీయ మతదేవతలను ఆ దేశాల భక్తులు ఈ విధంగానే ప్రార్థిస్తారా? అన్యమత భక్తులు ఈ దైవప్రార్థన శ్లోకంలోని అర్ధాన్ని తెలుసుకుంటే ఎంత అసహ్యించుకుంటారు?
రకరకాలుగా నాలో ప్రశ్నలు మొదలయినాయి. సాహిత్యంలో ప్రబంధ కావ్యాల నిండా శృంగార వర్ణనలే! శృంగారం, కవులకు కృతిపతులయిన రాజులకు అంత ఇష్టమైన అంశమేమో అని నాలో నేను నవ్వుకుండాను.
త్రిపురనేని మధుసూదనరావు రాకతో కాలేజీ షేకయ్యింది!
డబ్బా రేకుల కాలేజీ భవనాల్లోకి మా ఓరియంటల్ కాలేజీ మారిన కొన్నాళ్లకే త్రిపురనేని మధుసూధనరావు సార్ మాకు తెలుగు సాహిత్య చరిత్రను బోధించడానికి వచ్చినాడు. వచ్చిన మొదటి దినమే తన కంచుకంఠంతో గంభీరంగా మాట్లాడినాడు. తనను గురించిన ఉపోద్ఘాతంలోనే తానేమిటో తన భావజాలమేమిటో తెలియజేసినాడు. మనిషి చూడడానికి నా మాదిరే ఏమీ బాగుండడు. నల్లగా అమ్మవారు పోసిన మచ్చల ముఖంతో బట్టతలతో పొట్టిగా వికారంగా ఉంటాడు. ఎప్పుడూ ప్యాంటు షర్టు టక్ చేసుకొని, క్లాసులోకి వస్తున్నప్పుడు బయటికి పోతున్నప్పుడు సిగరెట్ కాలుస్తా ఉంటాడు. మొదట చూడగానే ఈయన పాఠమేమి చెపుతాడబ్బా అనుకుండాను. ఆయన మాట తీరు వినగానే నా ఆలోచనలన్నీ తారుమారైనాయి.
ఫుల్స్టాప్ లేకుండా ఒక పేజీ అంత సుదీర్ఘమైన, సమాస భరితమైన వాక్యం వినగానే నేను ఆశ్చర్యపోయినాను. అల్లసాని పెద్దన ఉత్పలమాల మాలిక పూత మెరుంగులున్ పసరు పూప బిడంగులు అంటా ఎక్కడా ఆపకుండా గడగడ 34 పాదాల చంపక మాలికా పద్యాన్ని చెప్పి, దాని అర్థం చెప్పి, ‘ఏముంది ఇందులో? ఇదా కవిత్వం? ఎవరికోసం? ఎవరిని ఉద్ధరించడానికి ఈ పదాడంబరం?’ అని ప్రాచీన కావ్యాలన్నీ ప్రేలాపనలన్నాడు. మదోన్మత్తులైన రాజులను నిద్రపుచ్చడానికి పనికొస్తాయన్నాడు. ప్రాచీన సాహిత్యమంతా రాజులను సంతృప్తి పరచడానికి, పనికిమాలిన కథల చుట్టూ అల్లిన అనవసర వాచాలత్వమన్నాడు. అవధానం గారడీ విద్య, సిల్లీ థింగ్ అన్నాడు. తెలుగులో అసలైన ప్రజాసాహిత్యం గురజాడతో ప్రారంభమై శ్రీశ్రీతో పరిఢవిస్తా ఉందన్నాడు.
త్రిపురనేని మధుసూదనరావు సార్ మాటలు నాకు వెగటనిపించినాయి. ప్రాచీన సాహిత్యం పునాదులు లేకనే ఈయన ఇంతటి వాడైనాడా? అష్టావధానం ఈయనకు సిల్లీ కావచ్చు. ఈయన మెచ్చింది రంభనా? ప్రాచీన సాహిత్యమంతా చెత్త అని కుక్క మొరిగినట్లు మొరుగుతా ఉండాడు. కుక్కలు మొరిగితే సంప్రదాయ కవులు, అవధానులు భయపడతారా? ప్రాచీన కవుల మాదిరి ఒక పద్యం రాయగలడా? ఇతడు ఆ మహాకవులను మించిన సాహిత్యకారుడా? రచయిత తన ప్రతిభను చాటుకోవడానికి ఏ సాహిత్య ప్రక్రియ తనకు అనుకూలమైనదో దాన్ని ఎంచుకుంటాడు. ప్రాచీన సాహిత్యాన్ని ముఖ్యంగా ప్రబంధ కవులను సంస్కృత భాషా పండితులను వేదాంత వేత్తలను చీల్చి చెండాడుతున్న ఆయన సాహిత్య దురహంకారాన్ని అందరూ భరించలేకపోయినారు. అయితే మహా సాహిత్య అధ్యయనం చేసి, భారత భాగవత పురాణాలను ప్రబంధ కావ్యాలను ఔపోశనం పట్టిన ఆయనకు ఎదురు నిలిచి ప్రశ్నించే ధైర్యం విద్యార్థులకే కాదు సంస్కృత పండితులెవరికీ లేకపోవడంతో త్రిపురనేని సార్ ప్రతి క్లాసులో రూములో విరుచుకు పడి పాఠం చెప్పుతా ఉండడంతో కాలేజీలో ప్రకంపనలు పుట్టినాయి. కాలేజీ అంతా షేక్ కాసాగింది. గౌరిపెద్ద రామసుబ్బశర్మ, అచ్చన్న శాస్త్రి వంటి మహా పండితులు ఆయన మాటలను పూచికపుల్లతో సమానంగా భావించినారు. నాకైతే గౌరిపెద్ది వంటి పండితులకు త్రిపురనేని సారుకు ఒక వేదిక మీద డిబేట్ ఏర్పాటు చేస్తే, వాదనలో ఎవురు నెగ్గుతారో చూడల్లనిపించింది. అయితే త్రిపురనేని సార్ హేతువాదం ముందు, గంభీరమైన భాషావైదుష్యంతో చేసే వాదన ముందు ఎవురూ నిలబడలేరేమో అని అనిపించింది నాకు.
మధుసూదనరావు సార్ పాఠం చెప్పుతా ఉండంగానే బయట వెలగ చెట్టు కొమ్మల్లో నుంచి నాలుగైదు వెలగ పండ్లు నేల మీద పడినాయి. ఆ పండ్ల కోసరం ఎదురుగా ఉండే శిరోమణి తరగతుల్లో నుంచి ముగ్గురు సంస్కృత పండితులు, నలుగురు విద్యార్థులు పరుగెత్తుతా వొచ్చినారు. అందరూ సగం బోడి గుండ్లు చేయించుకొని వెనక కొప్పులు కట్టుకుండారు. ఎవురి ఒంటిమీదా అంగీలు లేవు. పల్చని తెల్ల బట్టలు కప్పుకొని, బిల్ల గోసి కట్టుకుండారు. అందరి పయి మీదా జంద్యాలు వేలాడుతా వుండాయి. వాళ్ల రూప వేషాలు వాళ్ల కులాన్ని తెలుపుతా వుండాయి.
కొమ్మల్లో నుంచి రాలిన వెలగ పండ్ల కోసరం ఆ పండితుల ఆరాటాన్ని చూసి వాకిలి దగ్గర కూర్చున్న మా క్లాస్ విద్యార్థులు గట్టిగా నవ్వినారు. సీరియస్‌గా పాఠం చెపుతున్న మధుసూధనరావు సార్ కోపంగా, ‘ఏమైంది? ఏమిటి ప్రాబ్లం? ఎందుకు నవ్వుతున్నారు?’ అని అడిగినాడు. నవ్విన మా విద్యార్థులు బయట జరుగుతా ఉండే దృశ్యాన్ని చూపించినారు. ఆయన చూసి నవ్వుతా, ‘అదీ ఈ బాపనయవార్ల విద్వత్తు, ఏమి చేస్తాం పాపం’ అని ఎగతాళిగా వ్యాఖ్యానించినాడు. ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నాకైతే చాలా బాధయింది. ఎవురి వ్యామోహం వారిది. వ్యామోహాలకు ఎవురూ అతీతులు కారేమో! ఒక వస్తువు మీది వ్యామోహానికీ మనిషి మీది వ్యామోహానికీ తేడా ఏమీ ఉండదేమో అనుకుంటా మనసు లోపల నవ్వుకుండాను.
మా కాలేజీ విద్యార్థులలో ఒక్కొక్కరు మెల్లమెల్లగా త్రిపురనేని సారుకు సన్నిహితులుగా మారసాగినారు. క్లాస్ వరకే విద్యార్థులను విద్యార్థులుగా భావించే త్రిపురనేని సార్, బయట విద్యార్థుల భుజాల మీద చేతులు వేసి మాట్లాడగలిగే ప్రేమతో ఉండడం చాలామందికి నచ్చ సాగింది. అట్లా ఆయనకు స్నేహితుల మాదిరి తయారైన విద్యార్థులు శింగమనేని నారాయణ, భారతి మొదటి వరుసలో కనిపిస్తారు.
నా పంచ కట్టూ, నా పెద్దరికం!
మా క్లాస్ టీచర్స్ దాదాపు అందరూ పంచా షర్టు వేసుకొని వస్తారు. అందరూ దాదాపు బిళ్ళ గోసి కడతారు. నాగసిద్ధారెడ్డి సార్ మాత్రం ఒక్కొక్కసారి పొట్టి శ్లాగు ప్యాంటు, ఒక్కొక్కసారి పంచ కట్టుతో వస్తాడు. ఆయన పంచ కట్టు డిఫరెంట్‌గా ఉంటాది. దాన్ని సైకిల్ కట్టు అని అంటారంట! మా స్టూడెంట్సులో నిరంతరం కాలేజీకి పంచ కట్టుకొని వచ్చేది సింగమనేని ఒక్కడే! అతడు పార్థసారథి సారు, సముద్రాల లక్ష్మయ్య సారు కట్టే పంచ కట్టు చాలా స్టైలిష్‌గా ఉంటాది. విద్యార్థులలో అప్పుడప్పుడు మా సీనియర్స్ శ్రీనివాసులురెడ్డి, మాచిరాజు గోసి పంచ కట్టుకొని వస్తా ఉంటారు. సింగమనేని నారాయణ పంచ కట్టును చూసి నేను ఆ మాదిరి పంచ కట్టుకొని కాలేజీకి పోవల్లని విద్వాన్ మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అనుకుంటా, ఈ మధ్యనే సింగమనేని నారాయణను షాపుకు పిలుచుకొని పోయి అతడు కట్టే పంచెలు కంటే కొంచెం తక్కువ తక్కువధర పంచెను, షర్టుగుడ్డను తీసుకుండాను. షర్టు కుట్టించుకుండాను. నాకేమో నెహ్రూ కాలర్ జుబ్బా కుట్టించుకోవల్లని ఆశ. ఎందుకంటే మా కాలేజీలో పంచపైన జుబ్బా తొడుక్కొని ఎవురూ రారు. అయితే టైలర్ తనకు జుబ్బా కుట్టేది రాదని చెప్పడంతో షర్టే కుట్టించుకుండాను.
పంచా షర్టుల మీద కంటే ప్యాంటు షర్టు ఇన్‌షర్ట్ చేసుకోవడం పైనే నాకు మోజెక్కువ! ఆ మోజు, నేను హైస్కూల్లో పదో తరగతిలో ఉన్నప్పుడే మొదలయింది. మా హెడ్మాస్టర్ సారు, సత్యనారాయణ సారు పిఈటి చిదంబర రెడ్డి సారు స్కూలుకి ఎప్పుడూ ఇన్షర్టుతోనే వచ్చేవాళ్లు. ముఖ్యంగా హెడ్మాస్టర్ సార్ ఆదరాబాదర ఇన్‌షర్టు చేసుకొని వచ్చినా ఎంతో అందంగా ఉండేది. వాళ్లను చూసి నేను ఆ విధంగా ప్యాంటు షర్టు ఇన్‌షర్ట్ చేసుకోగలనా అని ఆశపడే వాన్ని.అందుకే విద్వాన్ మూడో సంవత్సరంలో చేరినప్పటి నుంచి ఇన్‌షర్ట్ చేసుకొని కాలేజీకి పోతా ఉండాను. సరిగ్గా ఆ సమయంలోనే ప్యాంటు బెల్ట్ పట్టికి, ఇరువైపులా సైడ్సులో బకల్స్ పెట్టడం ఒక ఫ్యాషన్‌గా వచ్చింది.ప్యాంటు కింద, బాటమ్ పట్టీని ఫోల్డ్ చేయించి కుట్టించినాను. టక్ చేసినప్పుడు సైడ్ బకల్స్తో ప్యాంటు బెల్టు పట్టిని బిర్రుగా బిగించుకోవచ్చు. సైడ్లలో బకల్స్ పెట్టి కుట్టించుకుంటే ప్యాంటుకు మళ్ళీ సపరేటుగా లెదర్ బెల్టు కొనుక్కోవలసిన అవసరం ఉండదు.
అట్లా సైడ్ బకల్స్ ప్యాంటు తొడుక్కొని షర్టును ప్యాంటు లోపలికి దోపి ఇన్‌షర్ట్ చేసుకొని,కాళ్లకు స్లిప్పర్స్ తొడుక్కొని కాలేజీకి పోయిన మొదటి దినం మిత్రులందరూ స్లిప్పర్సుకు బదులు బూట్లు వేసుకొని వచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేదన్నారు. అట్ల వాళ్లు మెచ్చుకుంటా ఉంటే అప్పుడు నా రొమ్ములు ఉబ్బుకుండాయి. నా క్లాస్ మీట్స్, మా ప్రాంత మిత్రులు ఎవురూ ఇంతవరకు ఇన్‌షర్ట్ చేసుకొని రాలేదు. మొదట రెండు మూడు రోజులైన తరువాత, నా వంటి బుడ్డా పకీర్ నాయాళ్లు, ఇట్ల డౌలుగా కాలేజీకి రావడం తగునా అని నన్ను నేను విమర్శించుకుండాను. చివరికి అది అలవాటైపోయింది. అయితే ఎవరెంత చెప్పినా మనసు పీకినా, బూట్ల జోలికి పోలేదు. అంత తాహత్తు నాకు లేదనుకొని ఆ ఆలోచన చేయలేదు.
ఇప్పుడు పంచ అవసరమా అనుకుండాను. తెచ్చుకుండాను, కట్టుకోక తప్పదు. అయితే పంచ కట్టుకోవడం రాదు. అందుకే సింగమనేని నారాయణ దగ్గరికి పోయి అతని మాదిరి పంచ కట్టుకోవడం నేర్చుకొని వచ్చినాను. ఒక అనుకూలమైన రోజు చూసుకుని, పంచ కట్టుకొని షర్టు తొడుక్కుండాను. రూములో ఉండే మిత్రులు ఈ డ్రెస్సులో చాలా బాగుండావన్నారు. చాకలి సుబ్బన్న పొగిడింది పొగిడిందే! పంచా షర్టులకు గంజి పెట్టించి ఇస్త్రీ చేయిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నాడు. ఏమైతేనేమి స్టైల్ గా ఒక నోట్ బుక్ చేతిలో పట్టుకొని మిత్రుల వెంట కాలేజీకి పోయినాను. నా క్లాస్ మీట్స్ అందరూ నా పక్క చూడడమే! చాలామంది బ్రహ్మాండంగా ఉందన్నారు.ఈ డ్రస్సులో కంటే నువ్వు ప్యాంటు ఇన్‌షర్ట్ చేసుకొని వస్తేనే బాగుంటావన్నారు. మొత్తం మా విద్వాన్ బ్యాచ్ 300 మందిలో పంచ కట్టుకొని కాలేజీకి పోయిన వాళ్లలో నేనే మొదటి వాన్ని. అట్లా పోయినప్పుడల్లా, నాది బడాయి కాదా? నా యోగ్యతేమిటి, నేను పంచ కట్టుకొని కాలేజీకి పోవడమేమిటి? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుంది! నేను ఇతరులను చూసి అనుసరించవలసింది వేషధారణ కాదు,వాళ్ళ విద్యా వైదుష్యం! పరీక్షలలో వాళ్లు సాధించిన ఫలితాలు అని అనుకుంటా నన్ను నేను పరామర్శించుకుంటా నా బ్యాక్‌గ్రౌండ్‌ను గుర్తు చేసుకుండాను.
నా పంచ కట్టును చూసి అవధానమిత్రులు వీరభద్రాచారి శివగౌడ్ మరుసటి వారంలో పంచ కట్టుతో కాలేజీకి వచ్చినారు. ఆవేషంలో ఆచారి బాగా కనిపించినాడు. శివగౌడును చూసి కోతికి కుళ్లాయి కట్టినట్లందని అతని సన్నిహితులు ఎదురుగానే అన్నారు. వాళ్లు హేళన చేయడం కంటే, ఇంటర్వెల్ సమయంలో బయటికి పోతున్నప్పుడు శివగౌడ్ పంచ కట్టు పుసుక్కున ఊడిపోయింది. అప్పుడు శివగౌడ్ పరిస్థితి వర్ణనాతీతం! లోపల డ్రాయర్ ఉండబట్టి సరిపోయింది. లేకుంటే పరువు పోయేది కదా అని సన్నిహితులు మందలించినారు. నేను దగ్గరికి పోయి మిత్రునికి పకడ్బందీగా పంచ కట్టించినాను. రెండు మూడు రోజులు మా క్లాస్ మీట్సందరూ నవ్వుకోవడానికి, శివగౌడ్ ఊడిపోయిన పంచ సంగతి ఆహారం అయ్యింది.
***
సన్నప్ప, సుబ్బన్న ఊరికి పోయి వస్తామని అడిగినారు. అంత అవసరమైన పనులు ఉన్నాయా, మనం చదువుకోవడానికి ఇంత దూరం వచ్చినాం, చిన్నచిన్న పనుల కోసం అంత దూరం పోయి రావడం అనవసరమైన వ్యయ ప్రయాసలు కదా, పైగా వర్కింగ్ డేస్‌లో పాఠాలు బాగా జరుగుతున్నప్పుడు నాలుగైదు రోజులు ఊరికి పోతే కష్టం కదా అని సున్నితంగా నా అయిష్టాన్ని వ్యక్తం చేసినాను. దాంతో ఇద్దరూ మౌనం వహించినారు. మళ్ళీ నేనే అర్జెంటు పనేమయినా ఉందా అని అడిగినాను. రేపు శింగనమల ఉరుసు జరుగుతుంది, మా నాయనోళ్లు రమ్మని ఉత్తరం రాసినారన్నా! నువ్వు అంగీకరిస్తేనే పోతాను, లేకుంటే లేదు అని సన్నప్ప నా అంగీకారానికి వొదిలేసినాడు. సుబ్బన్న ఏదో గొనిగినాడు.
నేను కొంచెం సేపు ఆలోచన చేసినాను. పాపం పిల్లోల్లోళ్లు, నా పెద్దరికం పైన ఎంతో గౌరవం ఉంచి నా పర్మిషన్ అడిగినారు.నేను ఇటువంటి సందర్భాలలో పెద్దరికం గానే వ్యవహరించడం మంచిది కదా అని తర్కించుకొని, సరే వెళ్లి తొందరగా రాండని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాను. రాత్రి రైలుకు బయలుదేరడానికి సన్నద్ధమైనారు వాళ్ళు.
మధ్యాహ్నం భోజనం సమయానికి సరిగ్గా నరాల రామారెడ్డి మా రూముకు వచ్చినాడు. అంతకుముందే వెంకటరమణ, హోటల్లో కర్రీస్ తెచ్చినాడు. ఇంక భోజనానికి కూర్చోవడమే ఆలస్యం. అప్పుడొచ్చినాడు అవధాన మిత్రుడు.అతడు అష్టావధానిగా కాలేజీ విద్యార్థులందరికీ తెలుసు. అందుకే మా వాళ్లు గుడకా గౌరవంగా సార్ అంటూ నమస్కరించినారు. భోంచేద్దాం రామారెడ్డీ! నువ్వూ మాతోపాటు కూర్చుందువు. ముఖం కడుక్కొని రాపో అని బోంచేయడానికి పిలిచినాను. అవునా నారాయణా, సరే, ఆ హాస్టల్లో పనికిమాలిన కూడు పెడతారప్పా. తిని తిని బేజారయిపోయింది. ఏం చేస్తాం, తినక తప్పదు అని,మాతో పాటు తినడానికి సంసిద్ధం వ్యక్తం చేసినాడు.
“హాస్టల్ భోజనమే సరిపోనప్పుడు ఇంక మా చింతతొక్కు చిట్లం పొళ్లతో తినగలుగుతావా నువ్వు? తినగలిగితే అంతకంటే సంతోషమేముంది రామారెడ్డీ” అని నేను మా తిండిని గురించి చెప్పినాను.
“నా జీవితమూ అదే నారాయణా! నేనూ చింతతొక్కు ఊరుమిండితో తినే వాన్నే!” అని పరోక్షంగా తన పేదరికాన్ని సూచించినాడు. నేను సంతోషపడతా అతనితో చేయి కలిపినాను.
నలుగురకు చేసుకున్న అన్నం, ఐదుమంది సర్దుకొని తిన్నాం. “అమృతం తిన్నంత తృప్తిగా ఉంది ఫ్రెండ్స్, చాలా రోజులైంది ఈ మాదిరి చిట్లం పొళ్లతో ఊరుమిండితో అన్నం తినక” అని ఇష్టంగా తిని కాసేపు మాట్లాడి వెళ్లిపోయినాడు రామారెడ్డి.
చెప్పులు కొనల్లని ఆరాటం, లేమి తనంతో సంఘర్షణ!
రెండు సంవత్సరాల కిందట తీసిన స్లిప్పర్స్ శిథిలావస్థలో ఉండాయి. అక్కడికీ చాలా సున్నితంగా వాడుకుంటా ఉండాను. అయినా బాగా అరిగిపోయినాయి. కాళ్ళ కింద వేసుకొని తిరిగితే అరిగిపోకుండా ఎన్నాళ్ళుంటాయి? అవి వేసుకొని కాలేజీకి పోవడానికి అభిమానం అడ్డు రాసాగింది. ఏదో చిన్నతనంగా మనసు ఫీల్ అవసాగింది. మనసు ఫీల్ అయితే నేనేం చేయగలను? మనసును సంతృప్తి పరచల్లంటే చెప్పులు కొనల్ల! కొనల్లంటే డబ్బులు కావల్ల! ఒక రకమైన చెప్పులు కొనాలన్నా కనీసం పది రూపాయలు కావల్ల! పది రుపాయలంటే మాటలా? ఎక్కడ నుంచి తెచ్చేది! మనసులకేమో కొత్త చెప్పుల మీద ఆరాటం! అరిగిపోయిన ఉంగటం కింద పిన్నీసు వేసుకున్న చెప్పులు తొడుక్కొని పోవల్లంటే ఏదో చిన్నతనం! కొనలేని పరిస్థితిని తలుచుకొని బాధ! మనసు నిండా కోరిక! బాధలన్నింటికీ కోరికలేనేమో కారణం? వొట్టికాళ్లతో కాలేజీకి పోతే ఎవురైనా అడుగుతారా? ఎందుకు అడుగుతారు? మరి ఇతరులు ఎవురూ అడగనప్పుడు, వేలెత్తి చూపనప్పుడు, బాధపడడం ఎందుకు? మనిషి ఇతరుల కోసమే బతుకుతున్నాడా? పల్లెల్లో పెద్దపెద్ద షావుకార్లు గుడకా చెప్పులేసుకుని తిరగరే! బండమీదపల్లెలో సుంకు రంగయ్య, ఎలకంటి పాపయ్య వంటి కోమటోల్లే చెప్పులేసుకోరు కదా! మరి నాకెందుకు చెప్పుల మీద ఆరాటం? ఇది చదువు, విజ్ఞానము, నాగరికత నేర్పిన పాఠమా? ఇంతకూ చదువుకుండే వాళ్లకు చెప్పులు అవసరమా? మనిషికి కూడూ గూడూ గుడ్డే కదా అవసరం! ఇంకా యేవేవో అవసరమయి నందువల్లనే కొత్త కొత్త వస్తువులు పుట్టుకొచ్చినాయేమో! సైకిల్లు, కార్లు, జీపులు, బస్సులు రైల్లు అన్నీ మనిషి అవసరాల కోసరమే కదా! అవసరమైన వస్తువులు, కొనగలిగిన వాళ్లకు పరవాలేదు కానీ కొనగలిగిన వాళ్లను చూసి కొనలేని వాళ్లు బాధపడక తప్పదేమో! పేదవాళ్లు టవున్లకు పట్టణాలకు వచ్చి ఇతరులను చూసి వాళ్ళ మాదిరి ఉండాలనుకోవడం వాత పెట్టుకోవడమేనేమో! ఇవేవీ తెలియని పేదోనికి ఈ వేదనలు ఉండవేమో!
రకరకాలుగా ఆలోచిస్తా మానసికంగా వేదనపడుతా సంఘర్షణ చెందుతా నానా అవస్థలు పడి పది రూపాయలు పెట్టి కొత్త చెప్పులు కొనుక్కుండాను.కొనుకుండేవరకు మనసు నిమ్మల పడలేదు.
అష్టావధానమా, కథా రచనా, ఏది మంచి దారి?
ఓరియంటల్ కాలేజీలో దాదాపు సాంప్రదాయ సాహిత్య వాతావరణమే! ఐదారు మంది శూద్రులు ఉండినా 90 శాతం మంది లెక్చరర్లు సనాతన బ్రాహ్మణులే! వాళ్ల దృష్టిలో గేయం, కథ, నవల వంటి రచనలేవీ సాహిత్యం కాదు.వేమన శతక కర్తను వాళ్లు కవిగానే భావించరు. వాళ్ళ మధ్యలో నాగ సిద్ధారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు ఇంద్రాణి భక్తవత్సల రెడ్డి వంటి లెక్చరర్లు మాత్రమే ఆధునిక సాహిత్యాన్ని గురించి ప్రస్తావిస్తారు. నాగసిద్ధారెడ్డి సార్ ప్రాచీన సాహిత్యాన్ని ఎప్పుడూ ద్వేషించడు. ఆ పునాదుల మీదనే ఆధునిక సాహిత్యం పుట్టుకొచ్చిందని, పునాదులు బలంగా లేకుంటే కొత్తదేదీ నిలబడదని ఆయన అభిప్రాయం.అందుకే తిక్కన భారతాన్ని ఎంత గొప్పగా బోధిస్తాడో అంతే గొప్పగా శ్రీశ్రీ కవిత్వాన్ని వివరిస్తాడు. అందుకే ఆయన పాఠమంటే నాకే కాదు, ఎక్కువమంది విద్యార్థులకు ఇష్టం! భారతాన్ని మించిన ఇతిహాసం మరొకటి లేదని, తిక్కనను మించిన కవి మరొకరు లేడని, భారతం గొప్ప రాజనీతి గ్రంథమని, ధర్మరాజు పైకి గొప్ప ధర్మాత్మునిగా కనిపించినా మహారాజనీతి చతురుడని, విరాట ఉద్యోగ పర్వాలు తిక్కన మహాకవి వైదుష్యానికీ ప్రతిభకూ రాజనీతికీ గొప్ప నిదర్శనాలని, ఆయన ఇంగ్లీషు భాషలో ఇంతటి రచన చేసి ఉంటే ప్రపంచ సాహిత్యంలో తిక్కనను తలదన్నే వాడు ఇంకొకడు ఉండేవాడు కాడని, నాగసిద్ధారెడ్డి సార్ ఆ పర్వాలను బోధిస్తున్నప్పుడు నేను ప్రపంచాన్ని మరిచిపోతాను. ఆయన వల్లనే నాకు ప్రాచీన సాహిత్యం పైన గౌరవం, ఆధునిక సాహిత్యం పైన ప్రేమాసక్తి ఏర్పడినాయి.
త్రిపురనేని సార్ ప్రాచీన సాహిత్యాన్ని తీవ్రంగా చాలా కర్కశంగా దూషిస్తాడు. సామాన్య ప్రజానీకం యొక్క కష్టసుఖాలను పట్టించుకోని సాహిత్యం సాహిత్యమే కాదని, రాజరిక వ్యవస్థలో రాజాంతఃపురాలకు చెందిన కథలు కాకరకాయలు అభూత కల్పనలు ప్రజాస్వామిక వ్యవస్థలో పాఠ్యాంశాలుగా చేయడమేమిటి, నాన్సెన్స్ అని తీవ్రంగా విమర్శిస్తాడు. గౌరిపెద్ద రామసుబ్బశర్మ సార్ త్రిపురనేని భావాలకు పూర్తి విరుద్ధంగా, వ్యాస కాళిదాసాది మహాకవులను ఆకాశానికి ఎత్తి ప్రశంసిస్తాడు. సముద్రాల లక్ష్మయ్య సార్, రాచరిక వ్యవస్థలో రాజులే సాహిత్య పోషకులు కాబట్టి, రాజుల కథలే కథాంశాలుగా స్వీకరించినారు, ఇప్పుడు రాజులు లేరు, ప్రజలే సాహిత్య పోషకులు.కాబట్టి ప్రజా జీవితాలే ఈనాటి సాహిత్య కథాంశాలు.దేని విలువ దానిదే! కావున ప్రాచీనార్వాచీన సాహిత్యాలను సమంగా భావిస్తా సమన్యయ పద్ధతిలో చాలా ప్రశాంతంగా వివరిస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు సాహిత్య రచన చేయల్లనుకుండే వాళ్లు,ఏది ప్రాసంగికమో ఏది సముచితమో ఏది అప్రస్తుతమో అనుచితమో నిర్ణయించుకొని రచనలు చేయడం మంచిదని సూచిస్తాడు.
అధ్యాపకుల విభిన్నమైన అభిప్రాయాలలో దేనిని అనుసరిస్తే బాగుంటుందో కొన్నాళ్లు తీవ్రంగా తర్కించుకుండాను.అష్టావధానాల మార్గంలో ముందుకు పోవల్లనుకుంటే పద్య రచనను బాగా సాధన చేయల్ల! పద్య శైలీ విన్యాసాలు సౌందర్యవంతంగా రూపొందాలంటే ప్రాచీన సాహిత్యాన్ని బాగా చదవల్ల! కొన్ని వేల పద్యాలను కంఠస్థం చేయల్ల! అవధానాలకు అవకాశం రాకుంటే, ఒక మంచి కథావస్తువును ఎన్నుకొని కావ్యం రాయడమో, జంధ్యాల పాపయ్య శాస్త్రి మాదిరి ఖండకావ్యం రాయడమో నిర్ణయించుకోవల్ల! అయితే పద్య ఖండికలను భారతి వంటి ఒకటి రెండు మాసపత్రికలు తప్ప వారపత్రికలు ఏవీ ప్రచురించవు. ఆ పత్రికలన్నీ కథలకు, సీరియల్సుకు ప్రాధాన్యం ఇస్తా ఉండాయి. కథ, నవల ఈ రెండు ప్రక్రియలూ సమకాలీన సామాజిక విషయాలను గురించి రాయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏది రాసినా తొందరగా పేరు తెచ్చుకోవల్ల! విద్వాన్ కోర్సు అయిపోయే లోపల విద్యార్థిగానే పద్య కావ్యమో కథల పుస్తకమో నవలో పుస్తక రూపంలో తెచ్చుకొని తల్లిదండ్రులకు గురువులకు సంతోషం కలిగించల్ల! సమాజంలో అవధానిగాను కవిగాను రచయితగాను గుర్తింపు పొందల్ల!
పగలూ రాత్రీ ఇంటా బయటా ఎక్కడికి పోయినా ఇవే ఆలోచనలు! వీటితోనే పగటి కలలు! ఈ ఆలోచనలతోనే, ఒకవైపు అశువుగా పద్యాలు అల్లుతా, మిత్రులు ఏది అడిగినా ఏదో ఒక పద్యంలోనే సమాధానం చెప్పసాగినాను. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, అమ్మాయి నడక మీద ఒక పద్యం, వొంపు సొంపుల మీద ఒక పద్యం మనసులోనే అల్లసాగినాను. మిత్రుడు శివగౌడ్ తోడైతే వాడొక పాదం నేనొక పాదం మిత్రులకు చెప్పసాగినాము. అమ్మాయిలు కనిపిస్తే వాళ్ల అందచందాల మీద పద్యాలు దొర్లినాయి గానీ వికృత చేష్టలు వెకిలినవ్వులు దొర్లలేదు. మనిషి సౌందర్యవంతంగా సంస్కారవంతంగా కనిపిస్తే ఆరాధన భావంతో సౌందర్యానుభూతితో పదుల కొద్దీ పద్యాలు రాసి, శివగౌడు నేను పరస్పరం పద్యాల బాగోగులు చర్చించుకోసాగినాం.
పద్యాలల్లడం ముగించినంక కాలేజీ లైబ్రరీలో రెండు మూడు వారపత్రికలలోని ప్రేమ కథలు చదివి,ఈ మాత్రం నేను రాయలేనా అనుకొని కథా రచనకు పూనుకొని రెండు వారాలలో రక్తపు ముద్ద పిలిచింది పేరుతో ఒక కథను రాసి సింగమనేని నారాయణకు చూపించినాను. ఇప్పుడే రాయొద్దన్నాడు. బాగా చదివిన తర్వాత రాయమన్నాడు. నేను తీసుకొని పోయిన కథను క్షుణ్ణంగా చదవకుండానే ఆ మాటలన్నాడు. ఆ మాటలు అనగానే అతని మనస్తత్వం కొంత అర్థమైంది నాకు. శ్రీ శ్రీ మహాప్రస్థానం కవితలు ప్రస్తావనకు వచ్చినాయి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే కవిత అర్థం కాలేదన్నా అని అడిగినాను. అదే కాదు, చాలా కవితలు నాకు నిజంగా అర్థం కాలేదు, ఆ కవితల నేపథ్యాన్ని ఆంతర్యాన్ని చెప్పుతాడని ఆశించి అడిగినాను. నేను అడిగిన దానికి వెటకారంగా మిగతా కవితలన్నీ అర్థమయినాయా అని హేళనగా ప్రశ్నించినాడు. ఆ హేళనలో శ్రీశ్రీని అర్థం చేసుకోగలిగినంత మొగోనివా నువ్వు అని ధ్వని అతని పెదవుల మీద పారాడుతా వెక్కిరించింది. అతని హేళన విధానంతో మనసు చివిక్కుమనింది. నాకంటే ఇతడు బాగా చదువుకున్నవాడు, నవల, కథా రచయితగా కొంత గుర్తింపు పొందినవాడు, ఒకే ప్రాంతానికి చెందినవాడు, తప్పకుండా తగిన సూచనలు సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తాడని ఆశపడినాను. కానీ ఇతడు రచయితను కావాలని ఉబలాటపడుతున్న నా ఉత్సాహాన్ని ఈ విధంగా ఆదిలోనే నిరుత్సాహపరుస్తాడని నేను ఊహించలేదు. ఇంకెప్పుడూ నా రచనలు ఏవీ ఇతనికి చూపించకూడదని నిర్ణయించుకుండాను. ఇతని మాటలు, వేషము, వ్యవహారము, అన్నీ భూస్వామి లక్షణాలని, భూస్వామి పేదవాని పనితనాన్ని ఎప్పుడూ మెచ్చుకోడని, సింగమనేని పట్ల ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుండాను.
ఇంటికి వచ్చి రక్తపు ముద్ద పిలిచింది కథను ఆంధ్రజ్యోతికి, తెగిన విపంచిక పద్య ఖండికను భారతి మాసపత్రికకు పంపినాను. పద్యమూ కథా రెండింటిని సమాంతరంగా రాయడానికి పూనుకుండాను. పది రోజుల తర్వాత కథ, పద్యఖండిక వెనక్కి తిరిగొచ్చినాయి. తిరిగొచ్చిన నా రచనలను చూసి అంతులేని నిరాశకు గురైనాను. పత్రిక వాళ్లను, నా దౌర్భాగ్యాన్ని తిట్టుకుండాను. ఏది చేసినా ఏమి రాసినా నన్నావరించిన దురదృష్ట రాక్షసి తొలగిపోనంతవరకు నా బతుకు ఇంతేనేమో, ఆ రాక్షసికి నా కౌగిలి అంతగా హాయినిస్తా ఉందేమో, దాని సర్పపరిష్వంగంలో నుంచి నేను బయటపడలేనేమో, ఇంతకూ అది నన్ను కౌగలించుకుందో, నేను దాన్ని కౌగిలించుకుండానో, నేను ఆశించిన నా కలల రాణి స్వర్గతుల్యమైన కౌగిలి నాకు లభించలేదు గానీ ఈ మహారాక్షసి ధృతరాష్ట్ర కౌగిలి దక్కింది. దీని బంధం నుంచి బయట పడతానో లేక అందులోనే నలిగిపోతానో యేమో అని బాధపడతా ఆ బాధతోనే ‘వీడని కౌగిలి’ అనే పేరుతో ఒక కథ రాసి ఆంధ్రప్రభకు పంపించినాను.
ఆశావాది తోడ్పాటుతో అవధాన ప్రయాణం!
హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రమైంది. ప్రతిరోజూ కాలేజీకి పోవడమూ, ఉద్యమకారుల ఊరేగింపు కాలేజీ దగ్గరకు వచ్చి గట్టిగా స్లోగన్ ఇవ్వడమూ, మా కాలేజీ పిల్లలందరూ క్లాసులను బహిష్కరించి ఊరేగింపులు చేరడమూ, వాళ్లతో పాటు కొంత దూరం వెళ్లి మెల్లగా జారుకొని రూముకు రావడమూ వారం దినాలనుంచి నిత్య కృత్యమైంది. ఈరోజూ అట్లే జరిగింది. రూముకొవచ్చి హిందీ భాషను బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలలో పాఠ్యాంశంగా చేయల్లని అనుకుంటా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి ఇందిరాగాంధీని బాగా తిట్టుకుండాను. ఈ మహా తల్లి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఏమవుతుందో ఏమో అని భయపడా సాగినాను. భయపడుతానే దొరికిన ఖాళీ సమయాన్ని వృథా చేయడం ఎందుకని కాసేపు చదువుకోవడం కాసేపు పద్య రచనకు పూనుకోవడం కాసేపు కథకు ప్లాటును ఆలోచించడం చేస్తా ఉండాను.
మధ్యాహ్నం బజారుకుపోయిన సన్నప్ప స్పీడుగా నడిచొచ్చి, అన్నా బజార్లో మీ క్లాస్‌మీట్ ఉమాపతి కనిపించింది. ఏదో షాపింగ్ వచ్చినట్లుంది అని చెప్పినాడు. చెప్పగానే మనసు ఆమెను చూడల్లని ఆరాటపడింది. ముఖంలో ఏ భావమూ చూపించకుండా అవునా, ఎక్కడ కనిపించింది అని మామూలుగా అడిగినాను. పశుపతి షాపు దగ్గరన్నాడు సన్నప్ప. సరే అని నేను మౌనంగా ఆలోచించసాగినాను. పోయి చూసొస్తే బాగుంటాది కదా, పోయి కనిపిస్తే పలకరించకుండా ఉంటుందా? అని మనసు ఊగిసలాడింది. రవ్వంతైనా మనసుంటే ఆ విధంగా ఉత్తరం రాస్తాదా? నీ అంతస్తెక్కడ నా అంతస్తెక్కడ? పేదవానివని జాలి చూపితే, అది ప్రేమనుకుండావా? అని నీ ముఖానికి మసిబూసిన దాన్ని , ఏ ముఖం పెట్టుకొని చూడ్డానికి పోతావు? నీకు అభిమానం లేదా? పోయి ఆమెకు నువ్వు వెదురుపడినా నిన్ను పలకరిస్తుందని అనుకుంటా ఉండావా? ఆమె నీ మీద జాలి చూపడానికి నువ్వు ప్రేమ బిచ్చగానివా? ఆమె ప్రేమను నువ్వు భిక్ష మడిగినా ఆమె నీ వైపు కన్నెత్తి చూస్తుందనుకుండావా? అంటా అంతరాత్మ వెక్కిరించింది. ఆమె రాసిన ఉత్తరమంతా గుర్తుకొచ్చి పళ్ళు బిగుసుకుండాయి. నన్ను తన దురాహంకారంతో అవమానించిన మనిషిని చూడాలనుకోవడం అవివేకమనుకొని, మనసును అదుపు చేసుకుండాను.నా అంతరాత్మకు అనుకూలంగానే హిందీ వ్యతిరేక ఉద్యమం కారణంగా మరుసటి రోజు నుంచి కాలేజీకి 15 దినాలు సెలవులు ప్రకటించినారు. అందరము ఊర్లకు బయలుదేరినాం.
ఉత్తరంలో తెలిపినట్లు గానే ఆశావాది ప్రకాశరావు వస్తాడని కూలి పనికి పోకుండా ఇంటి దగ్గరే ఉండాను. మిత్రుడు వస్తాడని అమ్మను కూడా పనికి పోకుండా నిలిపినాను. నేను కోరినట్లే అమ్మ, పప్పు చారు వడియాలు చేసింది.అతడు ఫలానా కులమని చెప్పకుండా, నాకు మంచి మిత్రుడని, పెద్ద కవి అని, అదే పనిగా నన్ను చూడడానికే వస్తావుండాడని అబద్ధం చెప్పినాను. ఆశావాది ప్రకాశరావు కులం చెప్పితే అతనితో కలిసి కూర్చొని భోంచేయడానికి ఇంట్లో అంగీకరించరని, అతనిని బయట కూర్చోబెట్టి ఆతిథ్యం ఇవ్వడం సంస్కార లక్షణం కాదని గట్టిగా మనసులో అనుకుండాను. నాయన అతని కులం గురించి అడిగితే అబద్ధం చెప్పి అతని దగ్గర నా పరువు కాపాడుకోవల్లని, ప్రాణ విత్త మాన భంగమందు బొంక వచ్చు నఘము పొందదధిప అని చెప్పిన పోతన పద్యాన్ని గుర్తు చేసుకుండాను.
మధ్యాహ్నం భోజన సమయానికి ఆశావాది ప్రకాష్ రావు వచ్చినాడు. కాళ్లు ముఖము కడుక్కున్న తర్వాత వేప చెట్టు కింద నులక మంచం మీద ఇద్దరమూ కూర్చొని చాలా సేపు మాట్లాడుకుండాం. తాను డిగ్రీ చదివేటప్పుడు పైడి లక్ష్మయ్య గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్‌గా పనిచేసినాలడని, శ్రీశైలం దేవస్థానం చైర్మన్‌గా ఉన్నప్పుడు భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని శ్రీశైలానికి పిలిపించినాడని, ఆ సందర్భంలో జరిగిన మీటింగులో తాను పంచరత్న పద్యాలు చదవగా ఉపరాష్ట్రపతి తనకు బాల కవి బిరుదునిచ్చి సత్కరించినాడని ఆశావాది చెప్పగానే నేను అబ్బురపోయినాను. కలెక్టర్ జోగప్పగారి పోద్బలంతో ఇప్పటికి 16 అవధానాలు చేసినాడని తెలుసుకున్న తర్వాత అతని పైన గౌరవం పెంచుకుండాను.
భోజనం అయిన తర్వాత కొంచెం సేపు అవధానంలోని మెలకువలను, ట్రిక్కులను స్నేహపూర్వకంగా తెలిపినాడు ఆశావాది.ఈ సంక్రాంతి సెలవులు అయిపోయినాక జనవరి 17వ తేదీ తమ హైస్కూల్లో నా అష్టావధానం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కణేకల్లుకు రావడానికి బస్సు చార్జీలు మూడు రూపాయలు నా చేతికిచ్చినాడు. అక్కడ గ్రేడ్ వన్ తెలుగు పండిట్ సీతారామరాజు గొప్ప పండితుడే కాదు మహా గర్విష్టి అని, అతని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండల్లని, హెడ్మాష్టర్ నాగరాజరావు చాలా సహృదయుడన, అచ్చం నీ మాదిరే ఉంటాడని, సీతారామరాజు పైన ఒక స్తుతిపద్యం వేస్తే కరిగిపోతాడని సూచించినాడు ఆశావాది. నన్ను మాటిమాటికి మీరు మీరు అని గౌరవ వాచకంతో సంభోదిస్తా ఉంటే, మనం పక్కపక్క పల్లెల వాళ్ళం, మన మధ్య ఈ గౌరవ సంభోదనలు ఎందుకు మిత్రమా అని నేను చొరవ తీసుకొని నవ్వులు చిముకరించినాను. ఆ తర్వాత ఆశావాది నన్ను ‘శాంతి’ అని పిలవ సాగినాడు. అట్ల పిలవడంతో నాకు సంతోషమయింది. తిరుపతిలోనా ఇక్కడ మా ఇంటి దగ్గరా కొన్ని గంటలపాటు సాగిన మా పరిచయం అన్యోన్యంగా మారింది. సాయంకాలం కావస్తుండగా ఆశావాది మా అమ్మా నాయనలకు నమస్కారం చేసి, వాళ్ళ ఊరు పెరవలికి వెళ్లిపోయినాడు. వెళ్లిపోయిన తర్వాత నాయన అడిగినాడు, ఈయన పెరవలిలో ఎవరి సంబంధమని. నేను వాస్తవం చెప్పినాను. అమ్మా నాయనా కొద్దిగా ఇబ్బందిగా ఫీలైనారు. నేను గాంధీ మహాత్ముని గురించి చెప్పి హోటలుకు పోతే మన పక్కన ఏ కులస్తుడు కూర్చొని భోంచేస్తాడో అక్కడ మనం అన్నం తినే ప్లేట్లో ఏ ఏ కులస్థులు తిన్నారో మనకు తెలుస్తాదా నాయనా? ఇంకా ఈ కాలంలో గుడకా కులాలు, మతాలు అనుకుంటే ఎట్ల? మనమేమైనా వాళ్ళ ఇంటికి మన పాపను ఇస్తా ఉండామా? అని ఎదురు ప్రశ్నలు వేసినాను. దాంతో వాళ్లేమీ మాట్లాడలేదు.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
