[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
బాహ్య ప్రపంచంలో నా మొదటి అష్టావధానం
ఉదయం పదకొండు గంటలకల్లా కణేకల్లు చేరుకుండాను. ఊరును చూడగానే నాలుగు సంవత్సరాల కిందట కనేకల్లు మాగాణిలో సరిగ్గా ఇట్లా సమయంలోనే మడకలు దున్నడానికి వచ్చిన రోజులు గుర్తుకొచ్చినాయి. అప్పుడు నేనొక అవధానిగా ఇక్కడికి వచ్చి అష్టావధానం చేస్తారని ఊహించినానా? ఇది ఊహకు అందని పరిణామం! జీవితాన్ని కాలం ఏ మార్గంలో నడిపిస్తాదో అని అనుకుంటా హైస్కూలుకు వెళ్లి మిత్రుడు ఆశావాదిని కలుసుకుండాను. ఆయన పరవశించిపోతా, నా చేయి పట్టుకొని హెడ్మాస్టర్ గారి రూముకు పిలుచుకొని పోయి పరిచయం చేసినాడు. నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఆయనను గమనించినాను. పేరు నాగరాజారావు. బ్రాహ్మణుడు. అయితే అచ్చం నామాదిరే ఉండాడు! నా కలరే! నా గొగ్గిరి పండ్లే! గౌరవంగా ఆత్మీయంగా పలకరించినాడు. పక్కనున్న వ్యక్తిని చూపి, ఈయన నారాయణప్ప గారు, అసిస్టెంట్ హెడ్మాష్టర్. మీ సామాజిక వర్గమే అని పరిచయం చేసినాడు ఆశావాది. నన్ను ఆయన ప్రత్యేకంగా పలకరించి ఇంటికి భోజనానికి పిలిచినాడు. నేను మిత్రుని ఆతిథ్యం స్వీకరించాలి సారీ సార్ అని వినయంగా చెప్పినాను. అంతలోనే పీరియడ్ అయిపోయిందేమో, సీనియర్ తెలుగు పండిట్ సీతారామరాజు వచ్చినాడు. ఆయన పంచ కట్టును చూడగానే గుర్తించి వినయంగా నమస్కరించినాను. ఆయన మొదట పలకరించిన తీరును గమనించగానే చాలా అహంభావి అనుకుండాను.
మధ్యాహ్నం స్కూలు వదలగానే ఆశావాది వెంట బయలుదేరినాను. ఊరి బయట మడికట్లల్లో యాభై అరవై మట్టి మిద్దెలు. అది వేరే ఊరనుకుండాను నేను. అది హరిజన వాడంట! పచ్చి పెల్లలతో కట్టిన మట్టి మిద్దెలోకి నన్ను పిలుచుకొని పోయినాడు ఆశావాది. ఐదారు మంది పిల్లలు వంట చేస్తా ఉండారు. ఒకరు పప్పుగిత్తితో పప్పు ఎనుపుతా ఉండాడు. ఇంకొకడు పొయ్యి మీద నుంచి అన్నం తపెలను కిందికి దించి, దానిమీద సిబ్బి పెట్టి, గంజి వొంచుతావుండాడు. మిత్రుడూ నేనూ కాళ్లూ ముఖాలూ కడుక్కొని వచ్చి చాప మీద కూర్చుండాం. నేను మిద్దెనంతా పరిశీలించి చూసినాను. మట్టి గోడలకు సున్నం పూసినారు. గోడలన్నీ కింది భాగంలో ఉప్పు దొర్లినాయి. కిందంతా మట్టి ఫ్లోరింగే. మట్టి మీద పేడతో చిక్కగా అలిగినారు. నేను అంతా గమనిస్తా మిత్రునితో మాట్లాడుత ఉండగానే పిల్లలు పప్పుకు తిరగవాత పెట్టినారు. ఇద్దరు పిల్లలు పల్యాలను కడుక్కొని వచ్చి అన్నం, పప్పు వడ్డించి మా ముందర పెట్టినారు. నేను అన్నం తింటా అడగకుండా ఉండలేక అడిగినాను, ఊర్లో ఇల్లు దొరకలేదా అని. మిత్రుడు నవ్వుతూనే చెప్పినాడు, మన సమాజం ఇంకా అంతస్థాయికి ఎదగలేదు శాంతీ! నేను స్కూల్లో జూనియర్ తెలుగు పండిట్‌గా చేరడానికి రాకముందే, మా కులం ఈ ఊరంతా ప్రాకింది. దానికి కారణం మన తెలుగు పండితులు సీతారామరాజు అని నవ్వినాడు ఆశావాది. ఆ నవ్వు వెనక దాగిన బడబాగ్ని నాకు అర్థమైంది. మనసు లోపల బాధపడుతూనే మిత్రుని అమృతతుల్యమైన ఆతిథ్యాన్ని తృప్తిగా స్వీకరించినాను.
మధ్యాహ్నం స్కూలు ప్రారంభమైన అరగంట తర్వాత విద్యార్థులందరినీ U ఆకారంలో ఉన్న హైస్కూల్ బిల్డింగ్ మధ్యలోని బయలు స్థలంలో వరుసలు వరుసలుగా కూర్చోబెట్టినారు. దగ్గరలో ఉన్న ఎర్రగుంట హై స్కూల్ విద్యార్థులు, టీచర్లు, ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల టీచర్లు వచ్చినారు. గ్రామ పెద్దలు నలభై యాభై మంది హాజరైనారు. టీచర్లు, గ్రామ పెద్దలు వరండాలో కూర్చుండారు. అసిస్టెంట్ హెడ్మాస్టర్ ఉప్పర నారాయణ సార్ వేదిక మీదికి, సభాధ్యక్షులు నాగరాజరావు గారిని, అవధానిని, పృచ్ఛకులను ఆహ్వానించి, మా ఉప్పర సామాజిక వర్గానికి చెందిన శాంతి నారాయణ గారు విద్వాన్ చదువుతూ విద్యార్థిగానే అవధానం చేయడానికి సాహసించడం మా కులానికి గర్వకారణం అని, మా తెలుగు పండిట్ సీతారామరాజు మిగతా పెద్దలు ఈ చిరంజీవిని ప్రోత్సహించి దీవించాలని కోరినాడు. సభ ప్రారంభమైంది.
అధ్యక్షుడు మాట్లాడుతా అవధానం వినోద విద్యయే గాని శల్య పరీక్ష కాదని కొన్ని మంచి మాటలు చెప్పినాడు. ఆ మాటలన్నీ నన్ను ఆశీర్వదించే పద్ధతిలో, సీతారామరాజును మెత్తగా హెచ్చరించే రీతిలో సాగినట్లు నాకు అర్థమయినాయి. ధైర్యం వచ్చింది. అధ్యక్షుల వారి మీద, పాఠశాల మీద, ఉప్పర నారాయణప్ప సారు పైన, నమస్కారాత్మకంగా తేటగీతి ఆట వెలది పద్యాలను అశువుగా చెప్పినాను. ఆశావాది చెప్పినప్పటి నుంచి సీతారామరాజు గారు శల్య పరీక్షకు విజృంభించకుండా ఒక మంచి పద్యం చెప్పాలని మనసులోనే అల్లుకొని, ఒక్కసారిగా ధారగా మహాస్రగ్ధర వృత్తంలో అతని వైదుష్యాన్ని స్తుతిస్తూ చెప్పినాను. ఆ పొగడ్త విన్న తర్వాత ఆయన ముఖం వెలిగిపోయింది. నేను కోరుకున్నదీ అదే అనుకొని, అవధానం ప్రారంభించినాను. సీతారామరాజు గారు నిషేధాక్షరి నిర్వహించడానికి నేను చెప్పిన పద్యం, మహాస్రగ్ధర పద్యం అని, ఆ ఛందస్సులో పద్యం చెప్పడం సాహసమని మెచ్చుకుంటా, సత్యనారాయణ స్వామిని స్తుతిస్తూ కందపద్యం చెప్పమని నిషేధించడానికి పూనుకుండాడు. నేను సంస్కృతంలో ఏకాక్షర పదాలలో చాలా తేలికగా ఆయనకు చిక్కకుండా మొదట పాదం చెప్పినాను. అర్థం చెప్పమన్నాడు ఆయన. పద్యం నాలుగు పాదాలు పూర్తి అయినాక చివర్లో చెప్పుతానన్నాను.తర్వాత ఎర్రగుంట నుంచి వచ్చిన తెలుగు పండిట్ సమస్యని ఇచ్చినాడు
“తూరుపుకొండ శంకరునితో కదియంగనెవగాంధి పుట్టెడిన్” సమస్యను, ఉత్పలమాల పద్య పాదాన్ని వినగానే అది సీతారామరాజు తయారు చేసి మరొక తెలుగు పండితునితో అడిగించినాడని అర్థమైంది. ఇదేమి మీ సమస్య, ఒక వాక్యానికీ మరొక వాక్యానికీ సంబంధమే లేదే అని అందరూ అనుకోసాగినారు. కొందరు తూర్పు కొండ శంకరునితో కలుస్తానే గాంధీ ఎట్లా పుడతాడు? అడిగేదాంట్లో ఏమైనా అర్థం ఉందా అని గట్టిగానే అడిగినారు. వాళ్ళ వాయిస్ నా వైపు ఉందని సంతోషమయింది. వెంటనే స్ఫురించింది. క్రమాలంకారం మొదటి పాదం చెప్పినాను. నేను క్రమాలంకారంలో చెప్పుతున్నానని తెలుసుకొని బాగా పట్టుకున్నావన్న మాట, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అన్నమంతా చూడాల్సిన పనిలేదు. ఇంకేముంది మిగిలిన మూడు పాదాలు చెప్పేసేయ్ అని సీతారామరాజు అన్నాడు. నేను అధ్యక్షుని పృచ్ఛకుని అనుమతి తీసుకొని మిగతా మూడు పాదాలు అల్లి చెప్పినాను.
“సూరుడు పుట్టు దేశమది; సుందర మంజుల దివ్యరూపియై
శారద ప్రేమగాత్రయయి,శర్వతనూభవు గాంచెనెప్పుడో
భారత పారతంత్ర్యమును పారగదోలుటకై మహాత్ముగా
తూరుపుకొండ; శంకరునితో కదియంగనె గాంధీ పుట్టడిన్.”
పద్యం చెప్పి క్రమాలంకారమును వివరించినాను. శారద అనే పదానికి పార్వతి అని కూడా అర్థం ఉందని తెలిపినాను. నా మాటలు విని చదువుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టినారు. ఈ విధంగానే దత్తపది, న్యస్తాక్షరి, ఆశువు, వర్ణన పద్యాలను చెప్పి గంటలు 15 కొట్టినారని తెలిపినాను. టీచర్లందరూ శభాష్ అని మెచ్చుకుండారు. అవధాని ఇంకా పిల్లవాడు, సాధన చేస్తే రాణించగలడు. ధార చక్కగా ఉన్నది. ధారణ మెరుగుపడవలెను అని ప్రశంసిస్తూనే లోపాన్ని ఎత్తి చూసినాడు సీతారామరాజు. తర్వాత హెడ్మాస్టర్ నాగరాజుగారు శాలువా కప్పి అర్థ నూట పదహారు రూపాయలు ఫలతాంబులాలిచ్చి సత్కరించినారు. సంపూర్ణ విజయం కాకపోయినా, సంతృప్తి గానే అవధానం ముగించినాననుకొని, మిత్రుడు ఆశావాది అభిప్రాయాన్ని అడిగినాను. అతడు అభినందించి సంతృప్తిని వ్యక్తం చేసినాడు.
రాత్రి నారాయణప్ప గారి ఇంట్లో మిత్రులం ఇద్దరమూ ఆతిథ్యం స్వీకరించినాం. రాత్రంతా ఆశావాదితో అనేక విషయాలను చర్చించినాను. మాటల సందర్భంలో బి.ఏ. డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీలో ఫెయిల్ అయినానని, అందుకే జూనియర్ పండిట్‌గా ఉద్యోగంలో చేరినానని, ఈ సంవత్సరం బి.ఏ పాస్ అవగానే పీజీ సెంటర్లో ఎంఏలో చేరుతానని చెప్పినాడు ఆశావాది. అద్భుతమైన అతని స్నేహ వాత్సల్యంలో పరవశించిపోయి మరుసటి రోజు ఉదయమే బయలుదేరి మా బండమీదపల్లెకు చేరుకుండాను.
వచ్చే స్టైఫండ్ అంతా ఇవ్వమంటే నా గతేమిటి?
కణేకల్ హైస్కూల్లో సన్మానం చేసిన విషయం చెప్పి, ఉలన్ శాలువాను అమ్మానాన్నలకు చూపించినాను. దాన్ని చూసి ఇద్దరూ పరమానందం చెందినారు. నిజానికి చలికాలంలో నాకు కప్పుకోవడానికి అది నాకు బాగా పనికొస్తుందని దాన్ని వాళ్లకు చూపకూడదనుకుండాను. అట్లే అర్థ నూటా పదహార్ల విషయం కూడా చెప్పకూడదని అనుకుండాను. కానీ మనసొప్పుకోలేదు. ఆ విధంగా తల్లిదండ్రుల దగ్గర దాచడం మంచిపద్ధతి కాదనుకుండాను. వాళ్లు సంతోషపడడమే కదా నేను కోరుకుంటా ఉండేది అని శాలువాను చూపించినాను. దాన్ని చూస్తానే దీన్ని నాకీ బూసీ! కప్పుకుండేకి శానా బాగుంటాది అని అమ్మయ్య అడిగింది. కోరక కోరక కోరుకుంది అమ్మయ్య. చలికాలంలో అమ్మయ్య పడే ఇబ్బంది కంటే నా ఇబ్బంది ఎక్కువా అని మనసులో అనుకొని అమ్మయ్యకు సంతోషంగా ఇచ్చినాను. సన్మానం చేస్తూ అర్ధ నూట పదహారు రూపాయలు ఇచ్చినారని నాయనకు 25 రూపాయలు ఇచ్చి చార్జీకి మూడు రుపాయలు ఫోను ఇంక నా దగ్గర 30 రూపాయలు మిగిలినాయని, అవి చేబదుళ్లకు, ఒక నెల రూమ్ బాడుగకు ఖర్చులకు సరిపోతాయని చెప్పినాను.
నాయన కొంచెం సేపు ఆలోచన చేసి, రేపు నెల స్టయిపండు ఇస్తారు కదా, అందులో 500 రుపాయలు పంపమన్నాడు. నాయన అట్ల అడుగుతానే నాకు చాలా బాధయింది. మొదట స్టైఫండ్ 600 రూపాయలు ఇచ్చినోళ్ళు, పోయిన సంవత్సరం నుంచి 540 రుపాయలే ఇస్తా ఉండారు. అందులో 500 రూపాయలు ఇంటికి పంపితే నా గతేమిటి? నేను తిరుపతి బజార్లో అడుక్కొని తినల్లనా? నన్ను భిక్షాటనం చేసుకుంటా చదువుకోమని పంపినాడా నాయన? ఎందుకు ఈ మనిషి ఇంత నిర్ధాక్షిణ్యంగా తయారైనాడు? నేను చదువుకుంటా ఉన్నా నా కూలి ద్వారా ఇంటికి ఎంత రావల్సి ఉందో అంత ఇవ్వల్సిందేనని నాయన లెక్కేసి అడుగుతా వుండాడా? సెలవులకు వొచ్చినప్పుడల్లా నేను కూలికి పోయి,కూలి దొడ్లు ఏరోజుకారోజు ఇస్తానే ఉండాను కదా! పుట్టించుకున్న కన్న కొడుకును ఎనిమిదేండ్ల వయసు నుంచి నలిపేసినారే! బుద్ధి వచ్చినప్పటి నుంచి ఏనాడైనా నేను పని చేయకుండా సుఖపడినానా? పసితనం నుంచి ఇట్లా నలిపి వేయడానికేనా నన్ను పుట్టించుకున్నది? వచ్చిన స్టయిఫండంతా ఇంటికిస్తే హెడ్మాస్టర్ సార్ పంపిన డబ్బులు నేనెప్పుడియ్యల్ల? అసలు సంవత్సరంతా నాయన పంపింది ఇన్నూరే కదా! మరి ఐన్నూర్లు పంపమని అడగడానికి నాయనకు నోరెట్ల వచ్చింది? తాను నాకు పంపిన దుడ్లకు వడ్డీ లెక్క వేస్తా ఉండాడా?
ఆలోచన చేస్తా ఉంటే బాధతో కూడిన కోపం మనసులోనుంచి తన్నుకొని వచ్చింది. “నేను తిరుపతి వీధుల్లో అడక్కతిని చదువుకోవల్లనా? నాకు పుస్తకాలు, కాలేజీ ఫీజు, రూము బాడుగ, బట్టలు అట్లాంటి ఖర్చులు ఏమీ ఉండవా?” అని చాలా కోపంగా అడిగినాను. అడిగిన దానికి నాయన గుడకా కోప్పడినాడు. “నీ కత చూస్తా ఉంటే, వొంగి గుద్ద దెంగించుకున్నట్లుంది! సేతికొచ్చినోనివి సేతికి అందకుండా ఇంట్లో నుంచి చదువుకుండేకని దెంకోని పోయి, ఆడ సుకంగా నువ్వుంటే, ఈడ ఎన్నాల్లని నేను సంసారాన్ని మొయ్యల్ల?” అని నోటికి వచ్చినట్లు మాట్లాడసాగినాడు నాయన. ఆ మాటలు వింటానే నాకు కన్నీళ్లొచ్చినాయి. నా కన్నీళ్లను చూసి అమ్మయ్య భరించలేక పోయింది.
“సదువుకుండే వాన్ని యాలట్ల నలసక తింటావు? అట్ల నలసక తినే బదులు రోంత యేందన్నా యిసమిచ్చి సంపు! అప్పుడన్నా నీ మనుసు సల్లబడతాది! ఈ సంసారాన్నంతా నువ్వొగినివే మోత్తా వున్నెట్ల, యేందో బొలే తల్లట పడతావుండావు?” అని అమ్మయ్య నాయనను అంటుకుంది. దాంతో నాయ కోపగించుకుంటా, యెట్లన్నా దెంగిచ్చుకోండి అని బజారుకల్ల వెళ్లిపోయినాడు. నేను అమ్మయ్యతో నాకు నెలకు వచ్చే ఖర్చును గురించి చెప్పినాను. “మీ నాయిన మాటలకేం గానీ, నువ్వు గుడకా దుబారా కర్చు సెయికుండా సదువుకో నాయినా! సూత్తా వుండావు కదా! అందరమూ యావల్లన కట్టపడతా ఉండామో! ఏమంటే, నువ్వు తిరపతికి పోయినప్పట్నుంచీ చెరువుకు సకాలంలో నీల్లొత్తాండాయి గాంగ సరిపాయ! ల్యాకుంటే ఏమయితాండేదో” అని అమ్మయ్య జాగ్రత్తలన్నీ చెప్పి నాకు తిరుపతికి కావాల్సినవన్నీ మూటగట్ట సాగింది. నేను శింగనమలకు పోయి హెడ్మాష్టర్ సారోళ్లను కలిసి కణేకల్లు అవధాన, సన్మాన విషయమంతా చెప్పినాను. కణేకల్లులో నేను అష్టావధానం చేసినట్లు వచ్చిన పేపర్ వార్తను చూపించినాడు సార్. నేను చాలా సంతోషపడి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఊరికి వచ్చి తిరుపతికి బయలుదేరినాను
వీరభద్రాచారి శతకం – స్పర్ధతో పెరిగిన పట్టుదల
తిరుపతికి చేరుకొని కాలేజికి పోయి మిత్రులందరికీ కణేకల్ అవధాన విషయం చెప్పి వార్తాపత్రికను గర్వంగా చూపినాను. అందరూ సంతోషంతో అభినందించినారు. మధ్యాహ్నం సుప్రసిద్ధ శతావధాని సీవీ సుబ్బన్న గారు రాసిన ఉత్తరం చూసి ఎంతో సంతోషమైంది. ఉత్తరంలో కణేకల్ అవధాన విషయం ప్రస్తావించి అభినందించినాడు. ఆయన మాటలు, అందమైన దస్తూరి చూసి మురిసిపోయినాను. ఒక గొప్ప సాహిత్యవేత్త దృష్టిలో నేను పడినందుకు పొంగిపోయినాను. సాయంత్రం మిత్రుడు వీరభద్రాచారి రూముకు పోయినాను.
అతడు సాదరంగా పలకరించి తాను ముద్రించబోయే తిరుమల రాయ శతకాన్ని చూపించినాడు. తిరుమల రాయ మకుటంతో కందపద్యాలన్నీ చాలా బాగుండాయి.ఆ శతకానికి బెళ్ళూరి శ్రీనివాసమూర్తి గారు రాసిన ముందు మాటలు చూపించినాడు. బెల్లూరి శ్రీనివాసమూర్తి అనంతపురం జిల్లాలో మంచి పేరున్న కవి అని, ఆయన మధుర కవి, కళాతపస్వి బిరుదాంకితుడని,తపోవనం, వివేకానంద, కావ్యగంగ, శిల్పవాణి వంటి కావ్యాలు రాసిన గొప్పకవి అని,చాలా సహృదయుడని ఆశావాది చెప్పిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆచారిని మనసారా అభినందించినాను. అభినందించినానే కానీ మనసులో నేనెప్పుడు ఆచారి మాదిరి, విద్యార్థిగా ఉన్నప్పుడే శతకమో ఖండకావ్యమో కథల పుస్తకమో అచ్చు వేయించుకొని మిత్రులందరికీ రచయితగా పరిచయం అయ్యేది అని కలత చెందినాను. ఏదైనా ఒక అర్థవంతమైన మంచి మకుటంతో నేనెందుకు శతకం రాయలేకపోయినాను? అనవసరమైన పనికిమాలిన అంశాల పైన పద్యాలు రాయకుండా ఒక శతకమో చక్కని ఖండకావ్యమో రాసి ఉంటే ఎంత బాగుండేది! అని ఒక రోజంతా దిగులు చెంది స్పర్ధతో కొన్ని పద్య ఖండికలు గేయాలు రాసి భారతి జ్యోతి పత్రికలకు పంపినాను.
సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్ళొచ్చినప్పటినుంచి కాలేజీ సరిగా జరగడం లేదు. హిందీ వ్యతిరేక ఉద్యమం నాలుగైదు రోజులు ఉధృతంగా జరగడం, రెండు రోజులు స్తబ్దతగా ఉండడం, మళ్లీ విజృంభించడం అంతా చూసి చాలా బాధ పడసాగినాను. ఇంకా రెండు మూడు వారాలు ఊర్లోనే ఉండి ఉంటే అరవై డెబ్బై రూపాయలు కూలి చేతికొచ్చిండేది. అందులో సగం ఇంట్లో ఇచ్చినా, మిగతా సగం నేను తెచ్చుకోనుంటే ఒక నెల దినాలు ఖర్చులకు సరిపోయేది! అని దిగులుపడుతా ఉద్యమానికి కారకురాలైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుకుంటా, ఎంత తిట్టినా ప్రభుత్వాలపైన ఆగ్రహం చెందినా పేదవాని కోపం పెదవికి చేటనుకోసాగినాను. యూనివర్సిటీ విద్యార్థులు మా కాలేజీ దగ్గర గొడవ చేసినప్పుడు నలుగురితో పాటు నారాయణా అని అనుకొని ఒక గంట సేపు ఉద్యమంలో పాల్గొని మెల్లగా జారుకొని ఇంటికి వచ్చి పద్యాలో కథలో రాయసాగినాను.
రెండు వారాలపాటు హిందీ ఉద్యమం కారణంగా కాలేజీకి పోకుండా పట్టుదలగా కూర్చొని అంతకు ముందు మొదలుపెట్టిన బాటసారికోసం, పరాజితులు కథలను పూర్తి చేసినాను రక్తపు ముద్ద పిలిచింది కథను రాయడానికి పూనుకుండాను. మధ్య మధ్యలో అవధాన పద్యసాధన కోసరం నేతాజీ మీద రోజుకు ఒకటి రెండు పద్యాలు రాసినాను. అన్నీ రెండు మూడు సార్లు చదువుకొని ప్రచురణార్హమైనవేనని ఆత్మవిశ్వాసం కలిగిన తర్వాత ఫేర్ కాపీ చేసి పెట్టుకుండాను.
మొన్న రేడియోలో ‘కన్నీటి ధార’ రేడియో నాటికను వినినప్పటి నుంచి ఆ కథ నన్ను వెంటాడింది. ఈరోజు ఆశ్చర్యకంగా ఆ నాటికను రాసిన రచయితను కలిసినాను. అతడు మా కాలేజీ ఫైనల్ విద్యార్థి. మా భాస్కర్ నాయుడుకు రూమ్మీట్.చాలా సంతోషమైంది. నా బాటసారి కోసం కథను చదివి చాలా బాగుందన్నాడు. ఇంత పెద్ద కథల్ని ఈ దౌర్భాగ్యం పత్రికలు ప్రచురించవని, ఇంకా కొన్ని కథలు కలిపి నువ్వే ఒక సంకలనంగా తెచ్చుకుండేది మేలని భుజం తట్టి అభినందించినాడు. నాకు ధైర్యం వచ్చింది. ఈ మాత్రం మా జిల్లా వాడు సింగమనేని నారాయణ ప్రోత్సహించకపాయ కదా అని బాధపడినాను. కొంతమంది ఇతరులు ఎదుగుదలను చూసి ఈర్ష్యతో వాళ్లను నిరుత్సాహ పరుస్తారేమో అనుకుండాను. మిత్రుడేమో కథను మెచ్చుకొని పత్రికల పట్ల చులకనగా మాట్లాడి, ఇంకా కొన్ని కథలు రాసి నన్నే సంకలనం వేసుకోమన్నాడు. సూచనేమో బాగుంది కానీ అంత తాహత్తు నాకెక్కడుంది? ఎవరైనా ప్రింట్ చేయించడానికి ముందుకు వస్తే వాళ్లకే అంకితం ఇవ్వవచ్చు. కానీ ఎవురు ముందుకొస్తారు? అయినా నా మొదటి పుస్తకాన్ని, నాకు ఈ దారి చూపి సహాయపడుతున్న గురుదేవుడు చిత్తరంజన్ దాసు గారికి అంకితం ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం ఆత్మ ద్రోహం కాదా? ఎవరైనా ఆర్థిక సాయం చేసినంత మాత్రాన వాళ్లకు నా మొదటి రచన అంకితం ఇస్తే, నేను నా గురువుగారి విషయంలో కృతఘ్నుణ్ణి కాదా? నా జీవితాన్ని ఆదుకుంటా ఉండే ఆ గురుదేవుని సహాయం ముందు, ఇతరులు పుస్తక ముద్రణకు చేసే సహాయం ఏ పాటిది? ఆలస్యమైనా పరవాలేదు, విద్యార్థి దశలోనే నా రచనలను పుస్తక రూపంలో తెచ్చుకోవాలనే కోరిక తీరకపోయినా పర్వాలేదు, నా మొదటి పుస్తకం గురువుగారికి అంకితం ఇచ్చినప్పుడే నాకు తృప్తి అని నిర్ణయించుకుండాను.
స్టైఫండు – కొత్త బట్టలు
ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలోనే స్టయిఫండ్ ఇవ్వడంతో కాలేజీలో విద్యార్థులందరూ ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బైనారు. దీనికంతా కారకుడైన ప్రిన్సిపాల్ సుదర్శనాచారి గారిని పొగడ్తలతో ముంజెత్తినారు. నాకు ఇంత ముందుగా స్టయిఫండ్ ఇవ్వడం ఇష్టం లేదు. ఇస్తే తొందరగా ఖర్చయిపోతాదని, వేసవి సెలవులు అయిపోయిన తర్వాత, కాలేజి రీ-వోపన్ అయినంక చాలా ఇబ్బంది పడాల్సి వస్తాదని దిగులు! అయినా తీసుకోక తప్పలేదు!
కణేకల్లులో సన్మానం ద్వారా చేతికి వచ్చిన డబ్బులతో అనంతపురంలోని ఒక జత కొత్త బట్టలు కొనుకోవడం వల్ల ఇంట్లో నాయన బాధపడతాడని కొనుక్కోలేదు. కానీ ఇప్పుడు తీసుకుండేది మేలని, మిత్రులతో కలిసి బట్టల షాపుకు పోయినాను. నేను నా యోగ్యతకు తగినట్లు కొంచెం తక్కువ ధర బట్టలనే సెలెక్ట్ చేసుకుండేకి చూసినాను. నా వెంట వచ్చిన మిత్రులిద్దరు ఎక్కువ ఖరీదు బట్టలు తీసుకుంటా నన్నూ ఆ క్వాలిటీ బట్టలే తీసుకోమని బలవంత పెట్టినారు. నేను అంగీకరించలేదు. పోనీ ఈ టెర్రి కాటన్ వైనా తీసుకో, కాలేజీ స్టూడెంట్స్‌గా లోక్లాస్ బట్టలు వేసుకుంటే నవ్వుతారు అని చులకనగా మాట్లాడినారు.నేను సీరియస్ అయినాను. మంచమున్నంతే కాళ్లు చాపుకోవల్ల భాస్కర్! నన్ను శ్రీమంతుని వైన నీతో పోల్చి చూడొద్దు! అని గట్టిగా అన్నాను. మనం వేసుకుండే విలువైన బట్టల వల్ల మన విలువ పెరగదు. బట్టల విలువకు నేను ప్రాధాన్యం ఇవ్వను. విద్యార్థిగా సింపుల్‌గా నీట్‌గా ఉండడమే నాకిష్టం! నా ఇష్టాయిష్టాలు నా ఆర్థిక స్తోమతను బట్టి ఉంటాయి! అంటూ భాస్కర్ నోరు మూయించినాను. అసలు బట్టల షాపుకు భాస్కర్ వంటి డబ్బున్న మిత్రుల వెంట రావడం నాదే పొరపాటని బాధపడుతా నా అభిప్రాయమూ నా శక్తి మేరకే ఒక ప్యాంటుకు షర్టుకు బట్టలు తీసుకొని, నాకు సరిపోయే టైలరుకు కుట్టించడానికి ఇచ్చినాను. డబ్బులు దగ్గర ఉంటే సుమారుగా ఖర్చయిపోతాయని నాయనోళ్లకు 250 రుపాయలు, హెడ్మాస్టర్ వాళ్ళకు 200 రు.లు ఎంఓ చేసి మిగతా డబ్బులు ఏప్రిల్ వరకు ఖర్చులకని నా దగ్గరే పెట్టుకుండాను.
కళాశాల వార్షికోత్సవం – రామారెడ్డి అష్టావధానం
మా సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా బ్యాచ్ విద్యార్థులందరూ నిశ్చయించినారు. అందులో ‘ఎ’ విద్వాన్ విద్యార్థులు మా తెలుగు ‘బి’ విద్వాన్ విద్యార్థులు అందరూ కలిసినారు. ఆ సందర్భంలో ఏ విద్వాన్ విద్యార్థులు, అచ్చన్న శాస్త్రి మొదలైన లెక్చరర్లు కళాశాల వార్షికోత్సవ సమయంలో నరాల రామారెడ్డి చేత అష్టావధానం చేయించి, కాలికి వెండి గండపెండెరం తొడిగి, వెయ్యిన్నీ నూటాపదహారు రూపాయలతో సత్కరించాలని నిర్ణయించుకొని, అందుకు విద్యార్థుల నుండి కొంత డబ్బు వసూలు చేయాలనుకుండారు. కాలేజీలో మా ‘బి’ విద్వాన్ విద్యార్థులు 80 శాతం మంది ఉన్నారు. మన కళాశాల విద్యార్థిచే అష్టావధానం చేయించి గౌరవించడం వరకైతే బాగుందని, మన విద్యార్థికి మనమే గండ పెండెరం తొడిగి,వెయ్యిన్నీ నూటాపదహార్లు డబ్బులు ఇవ్వడమేమిటి అని కాలేజీ ‘బి’ విద్వాన్ విద్యార్థులు అడిగినారు. ‘బి’ విద్వాన్ విద్వాన్ విద్యార్థులు గుడకా నలుగురు అష్టావధానాలు చేస్తా ఉండారు, వాళ్లందరి చేత వచ్చే సంవత్సరం ఈ మాదిరిగానే అవధానం చేయించి, అందరికీ గండపెండేరాలు తొడుగుతారా? అని మిత్రుడు శివగౌడ్ ప్రశ్నించినాడు. అతనికొక్కనికే కొమ్ములొచ్చినాయా అని నిలదీసినాడు. మా ‘బి’విద్వాన్ ఫైనల్ విద్యార్థి కాలేజీ యూనియన్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కులాభిమానంతో నరాల రామారెడ్డి అవధాన సత్కారాలకు అనుకూలంగా మాట్లాడినాడు. మొత్తం కాలేజీలో ఎక్కువ మంది విద్యార్థులు మా బ్యాచ్ వాళ్లే కావడంతో శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ సాగలేదు. దాంతో రామారెడ్డికి గండపెండెరం 1116 రూపాయలు సత్కార విషయం పక్కనపెట్టి, కాలేజీ తరఫున అవధానం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినారు.
కళాశాల వార్షికోత్సవానికి ముందు మా సీనియర్ విద్యార్థులకు మా బ్యాచ్ వాళ్ళందరూ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినారు. ‘బి’ విద్వాన్ ఫైనల్ విద్యార్థులు, మా బ్యాచ్ మూడో సంవత్సరం విద్యార్థులు అందరూ కలిసి దాదాపు 400 మంది ఒక హాల్లో సమావేశమైనారు. సీనియర్స్ నుంచి విశ్వనాథమయ్య, మాచిరాజు, మరి కొంతమంది మాట్లాడినారు. నేను రెండు మాటలు మాట్లాడి రెండు వీడ్కోలు పద్యాలు చదివినాను. అందులో ఒకటి
జీవిత సైకతస్థలిని చెన్నుగ రమ్య విహారమాడగా
బోవు నవీన భావ పరిభూషిత ధీశ్రితులార ఇయ్యవే
మా వదనాబ్జ వాక్జనిత మంగళ గీతములందుకొండు మీ
బావిని వెల్గజేయుడు సువాగ్జిత కీర్తిసతీ తటిత్ప్రభల్!
నా రెండు పద్యాలను ఆచారి, శివగౌడు పద్యాలను మొత్తం ఆరు పద్యాలను శ్రీనివాసరెడ్డి ప్రింట్ చేయించి అందరికీ పంచినాడు. అట్లే సింగమనేని నారాయణ చౌదరి క్రుంగిపోయే విధంగా హృదయం మండిపోయే రీతిగా ఒక గేయాన్ని రాసినాను.
మా విద్యార్థి నాయకుడు, మా సీనియర్ విద్యార్థి శ్రీనివాస్ రెడ్డి, పట్టుబట్టి తన మిత్రుల చేత కొంత డబ్బును కలెక్ట్ చేసి, కళాశాల వార్షికోత్సవంలో నరాల రామారెడ్డి అష్టావధానాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ అవధానంలో నన్ను నా మిత్రులను పృచ్ఛకులుగా వేసుకుంటారని అనుకుండాం. కానీ అందరినీ రెడ్ల విద్యార్థులను,’ఎ’ విద్వాన్ విద్యార్థులను మాత్రమే పృచ్ఛకులుగా వేసుకుండారు. దానితో మా బి విద్వాన్ అవధాన మిత్రులు నలుగురికి ఒళ్ళు మండింది. అయితే అవధాన వేదిక మీద మా గౌరిపెద్ది రామసుబ్బశర్మ సార్ అధ్యక్షునిగా, ప్రిన్సిపాల్ గారు ముఖ్యఅతిథిగా కూర్చోవడంతో వాళ్ల మీదున్న అమితమైన గౌరవం చేతను భయము చేతను సభ్యత చేతను నేనూ నా అవధాన మిత్రులు ముగ్గురూ ఆ అవధాన కార్యక్రమాన్ని బహిష్కరించలేకపోయినాం. రామారెడ్డి మమ్మల్ని ముగ్గురినీ ఎంత చులకనగా భావించినా, అతని అవధాన పాండిత్యాన్నీ భాషావైదుష్యాన్నీ నేను మెచ్చుకోకుండా ఉండలేకపోయినాను. అవధానంలో, సాహిత్యంలో పెద్దగా పట్టు లేని విద్యార్థులు పృచ్ఛకులుగా కూర్చోవడంతో రామారెడ్డి అవలీలగా, తనకు వీళ్లా పృచ్ఛకులన్న తూష్ణీం భావనతో నల్లేరు మీద బండి నడక మాదిరి ఒకటిన్నర గంటలోనే అవధానం అద్భుతంగా చేసినాడు. కాలేజీ ప్రిన్సిపాల్ గారు పరవశించిపోయి, కాలేజీ తరఫున 516/- రూపాయలు ఇచ్చి కాశ్మీర్ శాలువా కప్పి సత్కరించినాడు. అతని అవధానాన్ని మెచ్చుకుంటానే, మమ్మల్ని, అవధానం చేస్తున్న మిత్రులను పృచ్ఛకులుగా కూర్చోబెట్టనందుకు మిత్రులం మేము ముగ్గురమూ చాలా బాధపడుతా, ఒక వ్యక్తి సాహిత్య వికాసానికీ ప్రచారానికీ కులం గుడకా బాగా పనిచేస్తాదేమోనని చర్చించుకుండాం.
గాడేపల్లి గారి మాటలు ఆత్మవిశ్వాసాన్ని పెంచినాయి!
విద్వాన్ కోర్సు అయిపోయేలోగా ఖండకావ్యంగా నా పద్యాలు కాకపోయినా కథాసంపుటి అయినా అచ్చు వేయించుకోవాలన్న ఆరాటంతో గాడేపల్లి కుక్కుటేశ్వర రావు గారి ముందుమాటల విషయమై ఆశావాదికి రెండు వారాల క్రితమే ఉత్తరం రాసి అతని బదులు జాబుకై ఎదురుచూస్తా ఉండాను. గాడేపల్లి కుక్కుటేశ్వర రావు గారు ఆశావాదికి ఆత్మీయ గురువు. మంచి అష్టావధానిగా గాను, కథా నవలా రచయితగాను మంచి పేరున్న వ్యక్తి. వారపత్రికలలో ఆయనవి రెండు మూడు సీరియల్స్ నేను చదివి, ఆయన మీద గౌరవం పెంచుకుండాను. నేను తెచ్చే నా మొదటి కథా సంపుటికి ఆయనతో ముందు మాటలు రాయించుకోవాలని అనుకుండాను. అందుకే ఆశావాదికి ఉత్తరం.
ఆశావాది నుంచి కవరొచ్చింది. అందులో రెండు ఉత్తరాలు, ఒకటి నాకు మరొకటి గాడేపల్లి గారికి. కుక్కుటేశ్వరరావు గారు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ నుంచి చిత్తూరు కాలేజీకి ట్రాన్స్ఫర్ అయినారని, కథలన్నీ ఫెయిర్ కాపీ చేసి ఆయన దగ్గరికి తీసుకొని పోయి తన ఉత్తరం అందజేయమని రాసినాడు ఆశావాది. నేను వెంటనే తిరుపతి నుంచి చిత్తూరుకు పోయి మిత్రుని ఉత్తరాన్ని నా కథలను అందజేసినాను. నా కథల్లో ఒకటి చదవమన్నారాయన. ‘బాటసారి కోసం’ కథను చదివినాను. ఓకే ఫైన్! అని మెచ్చుకొని, ఒక వారం దినాల్లో బ్రీఫ్‌గా ముందుమాట రాసి పంపుతానని, చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకొని కమ్మని భోజనం పెట్టినాడు. భోంచేస్తా నేను అష్టావధానం సాధన చేస్తా ఉండానని, బయట రెండు అవధానాలు చేసినానని, మా కాలేజీలో రామారెడ్డి కాకుండా ఇంకా ముగ్గురు అవధానాలు చేస్తా ఉండారని వాళ్ల పేర్లు చెప్పినాను. ఆయన చాలా సంతోషపడినాడు. నేను ఆయన ప్రేమాదరణకు, ఉన్నత హృదయానికి పొంగిపోతా, ఆయన దగ్గర సెలవు తీసుకొని తిరుపతికి చేరుకుండాను.
రెండు వారాలైనాక గాడేపల్లి గారు ఉత్తరం రాస్తూ, తమ కళాశాలలో నరాల రామారెడ్డి గారి అష్టావధానం ఏర్పాటు చేస్తున్నామని, వీలుంటే ఆ కార్యక్రమానికి వస్తే, అట్లే తన ముందుమాటలతో మా పాటు కథలు తీసుకొని పోవచ్చునని సూచించినారు. నేను రామారెడ్డిని కలుసుకొని అవధాన విషయం అడిగినాను. అతడు అలా అహంకార పూరితంగా మాట్లాడుతా, నువ్వు వస్తే వాళ్లు నిన్ను పృచ్ఛకునిగా వేసుకోరు, చార్జీలు కూడా ఇవ్వరు అని కరాకండిగా చెప్పినాడు. అతని మాటలు నా హృదయాన్ని కుచ్చినాయి. పోగూడదనుకుండాను. కానీ గాడేపల్లి గారు ఆ అవధానంలో తప్పకుండా ఏదో ఒక స్థానంలో కూర్చుంటారని ఇతని బోడి అవధానం కోసం కాకపోయినా గాడేపల్లి గారి కోసరమయినా పోవల్లని నిర్ణయించుకుండాను.
***
చిత్తూరులో గాడేపల్లి కుక్కుటేశ్వరరావు సార్ రెండోసారి తమ ఇంట్లో ఆతిథ్యమిచ్చి, నా కథలకు తాను రాసిన ముందు మాటలను చూపించి, ప్రింటింగ్ ఖర్చులు చాలా అవుతాయి అన్న ఎరుకతో అదే పనిగా సూక్ష్మంగా రాశానని, ముందుమాటలు పాఠకులకు చదివి తీరాలన్న ఉచ్చుకతను కలిగించాలని, కలిగించే విధంగా తక్కువగా రాశానని, మంచి కథాసాహిత్యాన్ని చదువుతూ రాస్తూపోతే నీకు మంచి భవిష్యత్తు ఉందని ప్రేమగా దీవించినాడు. ఆయన రాసిన మాటలు నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించినాయి.
చిత్తూరు డిగ్రీ కాలేజీలో నరాల రామారెడ్డి అష్టావధాన సభ ప్రారంభమైంది. కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ నరసింహారావు సభకు అధ్యక్షత వహించినారు. గాడేపల్లి సార్ అష్టావధాన ప్రక్రియ విశేషాలను, తిరుపతి వెంకట కవులను, వాళ్ళ తరువాత ప్రసిద్ధులైన అవధానులను పేర్కొని, చిన్న వయసులోనే అవధాన ప్రక్రియలో దూసుకొని పోతున్న నరాల రామారెడ్డిని, ఆశావాదిని ప్రశంసించినాడు. చివర, చిరంజీవులయిన కొంతమంది ఓరియంటల్ కాలేజీ విద్యార్థులు అవధానులుగా తయారవుతా ఉన్నారని, మా పేర్లను పేర్కొన్నాడు. ఆయన మాటలు విని నేను పొంగిపోయినాను.
అష్టావధానం ప్రారంభమయ్యింది. గాడేపల్లి సార్ దత్తపదిగా చిత్తూరు, పుత్తూరు, కొత్తూరు, ముత్తూరు పదాలతో భారతార్థంలో ఒక పద్యం చెప్పమని అడిగినాడు. ఆ పదాలను పెట్టి భారతార్థం ఎట్ల చెప్పాడనానికి అయితాది? నేను ఈ పదాలతో భావతార్థంలో పద్యం చెప్పగలనా అని ఆలోచింపసాగినాను. రామారెడ్డి ఒక్క నిమిషం సేపు ఆలోచన చేసి, “చిత్తూరుద్వయమయ్యె….” అని ఒక శార్దూల పద్య పాదాన్ని అలవోకగా చెప్పినాడు. నాకు అర్థం కాలేదు. నాకే కాదు చాలామందికి అర్థం కాలేదు. అధ్యక్షుడు ఆ పద్యపాదములోని సొగసును గురించి చెప్పుతా, భారత యుద్ధంలో భీమసేనుని గదా ఘాతముతో దుర్యోధనుని ఊరుద్వయం (తొడల జంట) చిత్తయింది అని, ఆ పదాన్ని అద్భుతంగా విరిచినాడు అవధాని, భేష్ అని మెచ్చుకుండాడు. ఆ పదాల విరుపును విని నేను ఆశ్చర్య పోయినాను.
రెండు గంటల లోపల రామారెడ్డి దిగ్విజయంగా అవధానాన్ని ముగించినాడు. కాలేజీ వాళ్ళు రామారెడ్డిని అద్భుతంగా సత్కరించినారు. ఆ సత్కారం నన్ను గిలిగింతలు పెట్టింది. సమ్మోహపరిచింది. అటువంటి సన్మానాన్ని కలగంటా, గాడేపల్లి గారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి తిరుపతి చేరుకుండాను.
ఖేదంతో తనువు – మోదంతో మనసు!
విద్వాన్ మూడో సంవత్సరం అయిపోయింది. వేసవి సెలవులు వొదిలినారు. తొందరగా ఊరికిపోయి గురువు హెడ్మాస్టర్ గారికి ‘రక్తపుముద్ద పిలిచింది’ కథల సంపుటికి గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు రాసిన ముందుమాటలు చూపించి ఆ గురువుగారి సహాయంతో కథలను పుస్తక రూపంలో తెచ్చుకోవల్లని మనసు ఉబలాట పడసాగింది. రూము మిత్రులు కొండకు పోయి వచ్చి ఊర్లకు బయలుదేరుదాం అన్నారు. కొండకు పోవడానికి నాకు మొదట ఉన్నంత ఉత్సాహం ఇప్పుడెందుకో కొంచెం తగ్గింది. అయినా మిత్రులు బలవంతం చేయడంతో మెట్ల మార్గంలో బయలుదేరినాను. మాకు కోనయ్య గుడకా తోడయినాడు. తొమ్మిది గంటలకల్లా తిరుమల చేరుకొని, సర్వదర్శనానికి పోయినాం. ఎన్నెన్ని రంగుల, భాషల మనుషులో! వికారమైన అందమైన రకరకాల రూపాలు! దేశం నలుమూలల నుంచి వచ్చిన మనుషులు, విద్యాలయాలన్నింటికీ సెలవులైనందువల్లనేమో, వయసైన పిల్లలు మూగినారు. అందాలన్నీ చూడల్లంటే తిరుమలకొస్తే చాలర్రా అంటా కోనయ్య లోటక లేస్తా చెప్పసాగినాడు. చెప్పడమే కాదు, క్యూలో మాతోపాటు రాకుండా మెల్లగా అడుగులు వేస్తా, వెనకల వొచ్చే అందమైన అమ్మాయిల గుంపులో కలిసిపోయినాడు. సుబ్బన్న గుడకా కోనయ్యకు తోడైనాడు. నేను వెనక్కి తిరిగి చూసినాను. ఇద్దరూ అమ్మాయిలను రాసుకుంటా ముందుకు కదులుతా ఉండారు. అమ్మాయిలూ అట్లనే నడుస్తా ఉండారు. వాళ్లందరిలో భక్తికంటే రక్తి ఎక్కువగా పొంగిపొర్లుతావుందనుకుంటా, చివరి గడప దగ్గర దేవునికి దండం పెట్టి వెనుదిరిగినాను. ఇంతకు ముందు వెనుదిరిగి వచ్చేటప్పుడు గుడకా మాటిమాటికీ వొంగి వొంగి వెంకటేశ్వర స్వామికి మొక్కిన మనసు, ఇప్పుడు అవతలి క్యూలోని మిత్రుల వైపు, కన్నులు తిప్పనీయని అమ్మాయిల అందచందాల వైపు చూడసాగింది. గుడి బయటికొచ్చిన మిత్రులతో ‘ఏమప్పా, స్వామి దర్శనంతో పాటు దేవీదర్శనం బాగా చేసుకుండారా లేదా’ అని ఎద్దేవా చేసినాను.
“స్వామిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు, ఈ దేవీదర్శనాలు మళ్లా రావు కదా” అని ఇద్దరూ బిడియ పడకుండా అన్నారు. వాళ్లనూ, కొంతమంది వయసైన పిల్ల నాయాల్లనూ చూసి, ఈ కొండకు చాలామంది రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే అందమైన ఆడోళ్ళను చూడడానికే వస్తారేమో! భక్తి పేరుతో ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నీ విహార కేంద్రాలుగా మారుతా ఉండాయేమో అని అనుకుంటా, ఆ విషయాలనే చర్చించుకుంటా కొండ దిగి వచ్చి రాత్రికే ఊర్లకు బయలుదేరినాం.
***
శింగనమలకు పోయి హెడ్మాస్టర్ సార్‌ని కలుసుకొని కథలను, గాడేపల్లి గారు రాసిన ముందు మాటలను చూపించినాను, సార్ చదివి “చాలా బాగా రాసినాడు రా, దగ్గరే పెట్టుకోనుండు. వీలైనప్పుడు ప్రింట్ చేయిస్తాను” అని అన్నాడు. ఆ మాటలు నాకు తృప్తి కలిగించలేదు. ఎంతో ఉబలాట పడతా వచ్చి నిరుత్సాహంతో ఇంటికి చేరుకుండాను. ఎండాకాలం వరిమళ్లల్లో కోతలన్నీ అయిపోయినాయి. కోరుకు చేసుకోడానికి ఒక ఎకరమయినా మడి దొరకలేదని, కేవలం కూలి గింజలతోనే సంవత్సరమంతా గడపల్లని, మడికోతల సమయానికైనా నేను వచ్చి ఉంటే ఇంకొక మూడు పల్లాల కూలి గింజలు ఇంటికొచ్చేటివని, నాయన చాలా బాధపడినాడు. అట్లా అంగలారుస్తా ఉండే నాయనకు ఏమని బదులు చెప్పల్లనో నాకు అర్థం కాలేదు. విద్వాన్ చదువు చాలా కష్టమైందని, కాలేజీలో పాఠాలు బాగా జరిగే సమయంలో సెలవులు పెట్టి కూలి పనులు కోసం నేనొస్తే జరిగిపోయిన సంస్కృత పాఠాలు, అలంకారాలు తర్వాత అర్థం చేసుకోవడం చాలా కష్టమని, ముమ్మరంగా జరిగే క్లాసులు పోగొట్టుకొని, పాఠాలు అర్థం కాక పరీక్షల్లో ఫెయిల్ అయితే నా గతేమిటని నాయనకు తెలిసే విధంగా ఎవురు చెప్పుతారు? ఎంత సేపూ, మళ్లు దున్నేటప్పుడు, వరిమళ్లు కోసేటప్పుడు నా వల్ల వచ్చే కూలిడబ్బులు, కూలిగింజలు రాలేదని అంగలార్చడం తప్ప నాయనకు నా పరిస్థితి అర్థమయ్యేది ఎట్లా? తల్లిదండ్రులు తమ పిల్లలకు తమ కష్టాలు రాగూడదని కోరుకుంటారు గానీ వాళ్లు కూలికి పోయి కూలి డబ్బులు తేకపోయిరే అని అనుకుంటారా? హెడ్మాస్టర్ సార్ ఆదుకోకపోయి ఉంటే, అమ్మయ్య సపోర్ట్ చేయకపోయి ఉంటే, తన విద్వాన్ చదువును నాయన మధ్యలోనే ఆపేసేవాడేనేమో! పుట్టించుకున్న కన్న పిల్లల కష్టాన్ని పసితనం నుంచి ఆశించడం తండ్రికి ధర్మమేనా? నేను ఊరి షావుకార్ల ముందరే వాళ్ళ పిల్లలను తలదన్నే విధంగా కసితో చదువుకుంటా పేపర్లలో రేడియోలలో పేరు తెచ్చుకోవడం చూసి ఊరి పెద్దమనుషులు మెచ్చుకుంటా ఉంటే గర్వంతో పొంగిపోతా ఉండే నాయనేనా, చదువుకుంటా ఉండే తన కొడుకు కూలి గింజల కోసరం అంగలారుస్తా వుండేది?
అంతా తలుచుకొని ఒంటరిగా ఉకూర్చొని రెండు దినాలు కుమిలి పోయినాను. అసలు బడి మెట్లెక్కకుండా, అందరి పేద పిల్లల మాదిరి అక్షరజ్ఞానం అనేది లేకుండా ఉంటే, ఇంత వేదన ఉండేది కాదేమో! నేను చదువుకోబట్టేకదా ఇన్ని ఆలోచనలు, ఈ సంఘర్షణంతాను! చూస్తా ఉంటే భవిష్యత్తు భయంకరంగా ఉంటాదేమో! ఈ గంపెడు పిల్లల బరువు బాధ్యతలన్నీ మోయవలసిందే నేమో! మనసు నిమ్మలంగా వుండి, ఇటువంటి వేదనలేమీ లేకుంటే మోయవచ్చు, ఇంటి పెద్ద కొడుకుగా ఆ బరువు బాధ్యతలు మోయడం నా ధర్మమే! కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులు నా నుండి ఆ బాధ్యతను కోరుకోవడం తప్పుకాదు. అయితే ఆ బాధ్యతలన్నీ మోయగలిగిన స్థితికి నేను చేరుకోవల్లంటే నేను చదువుకోవల్ల కదా!
మనసులో బాధపడతా సీరియస్‌గా ఆలోచన చేసి, బాధపడడం వల్ల నష్టపోయేది నేనే అనుకొని, నా బాధను తెలుసుకుండే వాళ్ళు, పంచుకుండే వాళ్ళు ఎవురూ లేరనుకొని, బాధను మనసులోనే దిగమింగుకొని, ఏ పని చెప్పితే ఆ పని చేయడానికి పూనుకుండాను.
మాగాణిలో వరిమళ్లన్నీ కోసిన తర్వాత రైతులందరూ కల్లాల పక్కనే వరిగడ్డి వాములేసినారు. కల్లాలన్నీ అయిపోయినంక ఆ గడ్డినంతా దొడ్లల్లోకి చేర్చుకుండేకి పూనుకుండారు. వరి కోసిన మడికయ్యల్లో నేలంతా పచ్చిపచ్చిగా ఉండడంతో కూలోళ్ళతో కల్లాల దగ్గర్నుండి వరిగడ్డి అంతా దొడ్లల్లోకి మోయించుకుంటా ఉండారు. వరిగడ్డి సాయంకాలం వరకు మోస్తే మూడు రూపాయలు కూలి. వరుసగా పది దినాలు గడ్డి మోసే కూలికి పోయినాను.
భయంకరంగా ఎండలు కాస్తా ఉండాయి. వైశాఖమూ పొయిశాకమూ రెండూ ఒకటే అన్నట్టుంది వాతావరణం. మడికయ్యల్లో తడి ఆరిన కయ్యల్లోనా గెనాల మీదా గడ్డి మోపెత్తుకొని నడచల్ల. ఒక్కొక్క మోపులో పదైదు పదారు వరిగడ్డి కట్టలు వేసుకుంటే ఒప్పుకోరు. సుమారుగా 30 కట్టలు వేసి రెండు పగ్గాలతో బిగించి కట్టిన మోపును ఒక్కడే నెత్తిమీదికి ఎత్తుకోవడానికి సాధ్యం కాదు. మోపును నిలబెట్టి, వంగి వీపుకు కరిపించుకొని మెల్లగా మెడల మీద వేసుకొని అడ్డం తిప్పుకోవల్ల! గడ్డిమోపును దొడ్ల వరకు నెత్తి మీదనే మోసుకొని రావడం చాలా కష్టమే కాదు, చాలా బరువు కూడా! అందుకే వరిగడ్డి మోసే వాళ్ళందరూ మోపును మెడల మీదనే వేసుకొని గుణక పరుగుతో వస్తారు. మోపును మెడలమీద వేసుకుంటే అంత బరువు అనిపించదు. అయితే ఎండలు మండిపోతా ఉండటం వల్ల ఎండవేడికి గడ్డిపోసలు రాసుకొని రాసుకొని మెడల మీద పుట్టే సెగకు తలకాయ వెంట్రుకల్లో నుంచి, ముఖంలో నుంచి, ఒంట్లో నుంచి పొంగి కిందికి కారే చెమటతో బనియను, డ్రాయరు తడిసి నీళ్లల్లో పిండేసినట్ల అయిపోతాయి.
దొడ్లో గడ్డిమోపు కిందికేసి పగ్గాలు ఊడబీక్కొని మల్లా కల్లం దగ్గరికి పోయేటప్పుడు చిన్నగా గాలి తగిలితే, చెమటతో తడిసిన ఒంటి మీదుండే బట్టలు చల్లగా తాకుతా ఉంటే ఆ కష్టంలో గుడకా అదొక సుఖమనిపిస్తాది. ఆ సుఖంతోనే మనసు పద్యాలను అల్లడానికి తాపత్రయపడతాది. దొడ్డి దగ్గర్నుంచి కల్లం కాడికి చేరుకుండే లోపల పద్యం తయారైతే ఆ కష్టంలో గుడకా ఆదొక తృప్తి. ఒక్కొక్కసారి పద్యం పూర్తి తయారు కాదు. తయారు కానప్పుడు మనసంతా విరక్తి చెందుతాది. వేదన పడతాది. ఈ బండ బతుకులో, నికృష్టమైన ఈ స్థితిలో పద్యాలు అల్లక పోతే కొంపలేమయినా మునిగిపోతాయా అని మనసుకు సమాధానం చెప్పుకుంటాను.
ఈ రకంగా కష్టపడతా వారం దినాలు గడిపినాను. ఎనిమిదో దినం గడ్డిమోపుల్ని, ఊర్లో బజారు గుండా మోసుకుంటా పోయి ఊరవతల ఉండే దొడ్లో వేసి మల్లా తడవ కోసరం కూలోళ్ళతో కలిసి కల్లంకాటికి పోతావుండాను. పయిటాల పొద్దు కావొచ్చింది. శింగనమల పిల్లోడు ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు రాసి బతుకుదెరువు కోసరం ఒక డొక్కు సైకిల్‌కు ఐస్ క్రీమ్ పెట్టెను తాడుతో గట్టిగా బిగించుకొని, దుడ్లు లేనోళ్లు ఐస్ క్రీములకు వడ్ల గింజలు కొలిచేస్తే అవి పోసుకోవడానికి సైకిల్ బార్ కింద గోనిసంచి ఏర్పాటు చేసుకొని వొచ్చినాడు. కాళ్లల్లో చెప్పులు లేవు. చినిగిపోయిన అంగీ నిక్కర తొడుక్కుండాడు. సందు సందూ తిరుగుతా ఐస్ క్రీమ్ అమ్ముతా ఉండాడు. వాడు నన్ను గుర్తుపట్టినాడేమో ‘ఏమన్నా బాగుండావా? నీ పేరు నారాయణ కదన్నా! నువ్వు ఎస్ఎస్ఎల్సీలో ఉన్నప్పుడు నేను ఆరో క్లాసులో ఉంటిని. అప్పుడు నువ్వు మా స్కూల్ పీపుల్ లీడర్ కదన్నా! మాది, శింగనమల చిన్న కాలవగేరి. గాజుల కాశీం తమ్ముని కొడుకును. నా పేరు గౌస్ పీరా’ అని నన్ను పలకరించి తనను పరిచయం చేసుకుండాడు. వానితో రెండు మాటలు మాట్లాడి నేను ముందుకు పోయినాను
గౌస్ పీరాదీ నా బతుకే కదా! వాని వొంటిమీదుండే బట్టల మాదిరి నా గుడ్డలు ఎప్పుడూ అంత అద్దుమానంగా లేవు కదా! చూస్తా ఉంటే వాని పరిస్థితికంటే నాదే మేలేమో! ఏమీ ఫీల్ కాకుండా ఆ పిల్లోడు, ఎండలో సందు సందు తిరుగుతా ఐస్ క్రీమ్ అమ్ముతా ఉండాడు. ఇట్లాంటి పేదోళ్లు ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది ఉండారో! మరి వాళ్లకు ఎవురికీ లేని బాధా వేదనా నా ఒక్క నికే ఎందుకు? ఈ ప్రపంచంలో నాకు ఒక్కనికే బాధలన్నీ ఉన్నట్ల నేనెందుకు ఇంతగా ఫీల్ కావల్ల? ఇంకొక సంవత్సరం కష్టపడితే ఆ తర్వాత ఉద్యోగంలో చేరితే ఈ కష్టాలన్నీ ఉండవు కదా!
నన్ను నేను ఓదార్చుకొని కష్టాలనూ బాధనూ మరిచిపోయి, అవకాశం ఉన్నప్పుడల్లా కూలిపనులకు పోసాగినాను. బాధను మర్చిపోగానే మనసు పూర్తిగా పద్యాలు అల్లడం వైపు తిరిగింది. పోయిన వారం రేడియో సమస్యాపూరణ చేసి పంపివుంటిని. అది తప్పకుండా ఈరోజు రావచ్చునని, సాయంకాలం తొందరగా ఇంటి పనులు ముగించుకొని బజారులో పంచాయతీ రేడియో దగ్గర అరుగు మీద కూర్చుండాను. నా జతగాళ్లు గుడకా ఐదారు మంది వచ్చి కూర్చుండారు. పెద్ద మనుషులు అరుగు మీద కూర్చొని రేడియో వింటా ఉండారు. రేడియోలో సౌండ్ సరిగా రావడం లేదని సూరయ్య పిన్నయ్య దగ్గరికి పోయి కడప స్టేషన్ సరిగా పెట్టమని కోరినాను. ఆయన స్టేషన్ అడ్జెస్ట్ చేసి పెట్టినాడు.
రేడియో క్లియర్‌గా వొస్తావుంది. నేను చెప్పిన ప్రకారం నాయన గుడకా వచ్చి పెద్దమనుషుల దగ్గర కూర్చుండాడు. సమస్యా పూరణ కార్యక్రమం మొదలయింది. గత వారం ఇచ్చిన సమస్యను “కలవె సమర్ధులకసాధ్య కార్యములెందున్” అని చదివి వినిపించి, పూరణ చేసి పంపిన వారు ‘శాంతి నారాయణ, సి బండమీదపల్లె’ అని అంటానే అందరూ ఆశ్చర్యపోతా నిశ్శబ్దంగా కూర్చొని వినసాగినారు.
అల హనుమంతుడు శ్రీరా
ముల కార్యార్థియయి చని సముత్తాల మహా
జలధిని దాటెను రయమున
కలవె సమర్ధులకసాధ్య కార్యములెందున్
అని క్లియర్‌గా వినిపించినారు. అందరూ మా ఊరి పేరు రేడియోలో విని ఆశ్చర్యపోతా నన్నూ మా నాయననూ మెచ్చుకుండారు. ఆ పద్య భావాన్ని రామేవాళ్ళ నారాయణ వివరించి చెప్పినాడు. లింగనపల్లి చెన్నారెడ్డి, ‘ఎంత బాగా కైజేసినావురా నారాయణా, ఇదంతా పూరవ జలమంలో నువ్వు చేసుకోనుండే పున్నెమనుకో! — యెంగడసామీ, ఇట్లా వాడు ఊరికి వొగడుంటే సాలు! ఈ సగ్యాల ఇంత సన్న వయసులోనే లెక్క కొచ్చినోడు ఎవురుండారప్పా?’ అని పొగుడుతా ఉంటే నాయన పొంగిపోయినాడు. నేను నాయన పక్క చూస్తా కరిగిపోయినాను.
ఆ ఆనందంతో, “నేను రెండు పద్యాలను పంపించినా మామా, రెండూ చదువుతారనుకుండాను. ఎందుకో చదవలేదు. ఆ పద్యం గుడకా చదువుదునా మామా” అని అడిగినాను. “అయ్యో చదువోయ్” అని నారాయణరెడ్డి మామ ఉత్సాహంగా అన్నాడు. నేను జేబులో ఉండే పేపర్ తీసి,
తెలియంగరాని ఈ భూ
వలయంబునునొక దినమున పదునేడుతరుల్
చులకన తిరిగె గెగారిన్
కలవె సమర్ధులకసాధ్య కార్యములెందున్
అని చదివి, 1961లో నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు రష్యా దేశానికి చెందిన అంతరిక్ష వ్యోమగామి గెగారిన్ ఒక దినములో అర్థం కాని ఈ భూగోళం చుట్టూ 17 సార్లు తిరిగినాడని, సమర్ధులైన వారికి సాధ్యం కాని పనులేవీ లేవని వివరించినాను. శభాష్ అని అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టినారు. ఆ తర్వాత సెలవుల్లోనే నా సమస్యాపూరణ పద్యాలు నాలుగు సార్లు ప్రసారమయినాయి. మిత్రుడు ఆశావాది వారం వారం మెచ్చుకుంటా జాబు రాసినాడు. నన్ను మా బండమీదపల్లి షావుకార్లందరూ రేయ్ ఒరేయ్ అని పిలవడం మానేసి రావోయ్ నారాయణా, రాప్పా కవీ అని ప్రేమగా మాట్లాడించబట్టినారు. అయితే మాకిష్టమైన వాళ్ళ మల్లను కోరుకో గుత్తకో మాత్రం ఇవ్వలేదు. సూరయ్య పిన్నయ్య నామీద ప్రేమతో మా నాయనను ఇంటికి పిలిపించుకొని వాళ్ళ జొన్ను మడి కోరుకు చేసుకోండన్నాడు. ఆ మడి చెరువులో నీళ్లు లేకపోయినా బుగ్గ కాలువ నీళ్లతో పంట అయితాది. కానీ అది ఢిల్లీభోగాలు పండే భూమి కాదు. కేసరొడ్ల పంట పెడితే పైరు మనిషెత్తు పెరిగి మంచిపంట అయితాదని, మూడెకరాల జొన్ను మడిని చేసుకుండేకి నాయన సంతోషపడినాడు.
పొలాల్లో పనులన్నీ అయిపోయినాయి. చదువుకుండేదంతా అయిపోయినంక వెంకటాపురం, కొర్రపాడు పల్లెల్లో తోట పనులకు పోయి ఆ కూలి దుడ్లతో పుస్తకాలు కొనుక్కోమని కూలికి పోడానికి చేతకాకుంటే పొద్దున పూట్ల ఎండ బలిసే లోపల గోవిందరాయునిపేట, సోదనపల్లి, పెరవలి చెన్నంపల్లి, శివపురం పల్లెలకు పోయి ఆకులు అమ్ముకొని వస్తా ఉండని నాయన కూలికి పోయే విషయం నా ఇష్టానికి వొదిలేసినాడు. నేను నాయన చెప్పినట్లే చేస్తా, మధ్యాహ్నం నుంచి ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటా ఏవైనా ఆలోచనలు వచ్చినప్పుడు పద్యాలు రాయసాగినాను. రెండు గేయాలు రాసినాను. పరాజితులు అనే కథను ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీకి పంపినాను.
కులాల విషయంలో నేను మీ మాట వినను!
మిత్రుడు ఆశావాది నన్ను కలుసుకొని రేడియోలో వచ్చిన సమస్యాపూరణ పద్యాలను చదివి అభినందించల్లని ఆరాటపడతా మొన్న సడన్‌గా పల్లెలోని మా ఇంటికొచ్చినాడు. ఆ విషయం తెలిసి నేను సూరయ్యోళ్ల జొన్నుమడి దగ్గర నుంచి పరిగెత్తి వొచ్చినాను. మిత్రుడు పొంగిపోతా నన్ను ఆలింగనం చేసుకొని అభినందించినాడు. నాయన అమ్మయ్యలకు నమస్కారం చేసినాడు. మేమిద్దరమూ ఇంటి పక్కన వేపచెట్టు కింద మంచం మీద కూర్చొని సాహిత్య చర్చల్లోకి దిగినాం. అమ్మయ్యా పిల్లలూ కొట్టంలో వంట పనిలోకి దిగినారు.
నాయన కొంచెంసేపు ఆశావాదితో మాట్లాడి “నాకు మీ నాయన పక్కీరప్ప తెలుసు సార్” అని అన్నాడు.
“నన్ను మీరు సార్ అని పిలవడం ఏమిటి? నేను మీ కొడుకులాంటి వాడిని నాయనా” అని ఎంతో వినయంగా నాయనకు సూచించి, నా గురించీ నా పద్యాలను గురించీ మెచ్చుకుండాడు. పాపం అర్థం కాకపోయినా నాయన సంతోషపడినాడు.
భోజనాలన్నీ తయారయినాయేమో, అమ్మయ్య నన్ను ఇంట్లోకి పిలిచింది. నేను ఏం మా అంటా పోయినాను. నాయనా అమ్మయ్యా ఇద్దరూ, అతడు మాదిగ కులస్తుడని, బయట అరుగు మీద కూర్చొని భోంచేస్తాడులే అని మెల్లగా అన్నారు. ఆ మాటలు వింటానే నాకు కోపమొచ్చింది. మహా కవి పండితుడు నండూరి రామకృష్ణమాచార్యులు, సద్బ్రాహ్మణుడు. అట్లాంటి వాడే ఆశావాదిని దేవుని గదిలో తన పక్కన కూర్చోబెట్టుకొని పూజ చేయడమే కాకుండా భోజనం చేసినాడు. ఆయన భార్య ఇద్దరికీ భోజనం వడ్డించింది. ఆ బ్రాహ్మణులకే లేని కులం పట్టింపులు మనకెందుకమ్మా అని గట్టిగా చెప్పినాను. ఇద్దరు అయిష్టంగా గొణిగినారు. దాంతో నాకు చాలా కోపమొచ్చింది. ‘అమ్మా, ఈ కులాల విషయంలో నేను మీ మాట వినను. ఇద్దరమూ కలిసి ఇంట్లోనే భోం చేస్తాం. మీకు ఇష్టం లేకపోతే నేను కూడా భోం చేయను’ అని మెల్లగానే సీరియస్‌గా చెప్పినాను. దాంతో ఇద్దరూ మెత్తబడినారు.
ఇంట్లో దేవరమూల జంఖానం మడతలు వేసి పరిచింది పెద్దక్క. నాయన ఏమి ఆలోచన చేసినాడో ఏమో, అంగట్లోకి పోయి రెండు విస్తరాకులు తెచ్చినాడు. వెంకటలక్ష్మి మా ఇద్దరికీ రెండు కంచు గ్లాసుల్లో మంచినీళ్లు పెట్టింది. అమ్మయ్య పాత ఢిల్లీ భోగాల అన్నమూ తిరగవాత పెట్టిన చింతాకు పప్పూ వడియాలూ వడ్డించింది. అన్నం తింటా, “ఈ పప్పును దేనితో చేసినారమ్మా? చాలా అద్భుతంగా ఉంది” అని మెచ్చుకుంటా అడిగినాడు మిత్రుడు. “చింతచిగురు, ఇసకసెంచిలాకు పెట్టి చేసినానయ్యా!” అని అమ్మయ్య చెప్పింది. “ఎన్నాళ్లయిందో ఇట్లాంటి కమ్మని భోజనం తినక” అంటా తృప్తిగా తిన్నాడు మిత్రుడు. కట్టు చారును గుడకా మెచ్చుకుండాడు. అమ్మయ్య, కులాలు గిలాలు అన్నీ మరిచిపోయి పొంగిపోయింది.
భోజనాలయిన తర్వాత ఇద్దరమూ కొంచెం సేపు మాట్లాడుకుండాం. మాట్లాడతా “అయ్యో చెప్పడం మర్చిపోయాను శాంతీ! ‘సాహితీప్రియ’ మాసపత్రికలో నీ గేయం ప్రచురించినారు. ఆ పత్రికను మొన్ననే ఒక మిత్రుడు చదివిస్తానని తీసుకొని పోయినాడు. పత్రిక తెచ్చి చూపించి నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే అతడు ఊర్లో లేడు” అని ఆశావాది చెప్పగానే నాకు మహదానందం అయింది. ఆ పత్రికను మిత్రుడు తీసుకొని రానందుకు అసంతృప్తి చెందుతా పత్రికలో నా అక్షరాలను చూసుకోవల్లని మనసు ఆరాటపడసాగింది. కణేకల్లుకు వెళ్ళగానే ఆ పత్రికను తిరుపతికి పంపుతానని అడ్రస్ రాసుకొని అందరికీ చెప్పి మిత్రుడు వెళ్లిపోయినాడు.
కూటి కోసరం కోటి విద్యలు- దొమ్మరాట!
ఇంకొక వారం దినాలకు సెలవులన్నీ అయిపోతాయని, కాలేజీ ఓపెన్ అయితానే విద్వాన్ ఫైనల్ ఇయర్ క్లాసులో కూర్చోవల్లని ఉబలాట పడతా, చదువుకుంటా, ఏదో మంచి ఆలోచన తట్టడంతో పద్యాలు అల్లుతావుండాను. అంతలోనే మా ఇంటి వెనక సందులో దండోరా తప్పెట శబ్దం వినిపించింది.
ఏందో అని వింటా ఉంటే తెలిసింది, చావడి దగ్గర దొమ్మరాట జరుగుతాదని. పుస్తకాలన్నీ ఎత్తిపెట్టి అందరితోపాటు దొమ్మరాట చూడడానికి పోయినాను. ఇంతకుముందు మూడు నాలుగుసార్లు దొమ్మరోళ్లు వొచ్చి చావిడి దగ్గర దొమ్మరాట ఆడిపోయినారు. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క రకమైన ప్రదర్శన ఇచ్చి పోతుంది.ఈ గుంపులో ఏ ఆటలు ఆడుతారో అని జనమంతా చుట్టుకుండారు. చావట్లో పెద్ద మనుషులు కూర్చుండారు. పనులేవీ లేకపోవడంతో దాదాపు ఊరంతా చావిడి దగ్గరికి చేరుకుంది.
తిప్పేసిన ఇంగ్లీష్ ‘V’ ఆకారంలో అటువైపు ఇటువైపు రెండించెల ఇనుప పైపులు బిగించినారు.ఆ రెండు పైపుల మధ్యలో ఇనుప వైరును బిగించినారు. ఈసారి వచ్చిన దొమ్మరోళ్లు కొత్తవాళ్లు. వీళ్లను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఇద్దరు యువతీ యువకులు భార్యాభర్తలేమో తెలీదు గానీ ఎంత అందంగా ఉండారో! ఇంత అందమైన మనుషులు ఇట్లా దోమ్మరాటలు ఆడుకుంటా పల్లెలన్నీ తిరుగుతా అడుక్కొని తింటా ఉండారా? మెరుపుతీగ మాదిరి ఈమె ఎంత అద్భుతంగా ఉంది! ఈమె అనుకుంటే పెద్ద షావుకారి ఇంటి కోడలు కాలేదా? ఇతడు ఎంత నాజూకుగా ఉండాడు! ఇతన్ని మోహించి వచ్చిన ఈమె పెద్ద సంపన్న కుటుంబానికి చెందిన మనిషై ఉండొచ్చునేమో! లేదంటే ఈమె అందానికి ముగ్ధుడై ఈమె వెంట వచ్చిన ఇతడు గొప్పింటివాడై ఉండొచ్చునేమో! అడుక్కు తినేవాళ్లు గుడకా ఇంత అందంగా ఉంటారా? అనుకుంటా వాళ్ళిద్దరిని కన్నార్పకుండా చూడసాగినాను. అతని అందం నాకుంటే ఆమెను ఎగరేసుకొని పోవల్లని అనిపించేటంత ఆమె మోహన రూపాన్ని అట్లే చూడసాగినాను. ఆమె సిగ్గూ బిడియమూ లేకుండా తన ఒంటి మీదున్న పంజాబ్ డ్రెస్సు తీసి పక్కన పడేసింది. ఒంటికి అతుక్కొని పోయిన ముంజేతుల వరకున్న జాకెట్టు, అట్లే నడుము దగ్గరనుంచి పాదాల కింది వరకు పల్చని రబ్బర్ మాదిరి అతుక్కునిపోయిన సర్కస్ డ్రస్సు అద్భుతంగా ఉన్నాయి. ఆ డ్రెస్‌లో కనిపించే ఆమె అందాలు మాటలలో చెప్పనలవిగానివి! నా వయసు పిల్ల నాయాళ్లందరూ ఆమెను కండ్లతో మింగేస్తా ఉండారు. ఆడోళ్లందరూ ముక్కుల మీద వేలేసుకొని చూస్తా ఉండారు.
ఆట మొదలైంది. ఒక పదేళ్ల పిల్లగాడు కింద కూర్చొని, డ్రమ్ము కొడతా ఉండాడు. ఆమె అతని భుజాల మీదికి ఎక్కి నిలబడింది. కిందున్న ఒక నడి వయసు మనిషి వాళ్లకు ఏమయితాడో ఏమో, ఒక పొడవైన వెదురు బొంగును ఆమె చేతికి అందించినాడు. దాన్నందుకొని ఆ మోహనాంగి, ఆ అందగాని భుజాల మీద నుంచి పైపుల మీద రెండంగుళాల మందమున్న వొక చిన్న పలక మీదికి ఎక్కింది. వెదురు బొంగును రెండు చేతులతో పట్టుకొని ఆమె వైరు మీద మెల్లగా నడుస్తావుంది. కిందున్న యువకుడు ఆమె వైపు చూస్తా కింద నడుస్తా ఉండాడు. ఆమె కింద పడితే ఎంత కష్టం అనుకుంటా జనం ఆశ్చర్యంగా చూస్తా ఉండారు.ఆమె అవలీలగా అవతలి వైపున్న పైపుల మీదికి చేరుకుంది. జనం ఈలలు వేస్తా చప్పట్లు కొడతా మెచ్చు కుండారు. ఆమె మల్లా అదే మాదిరి తీగమీద ఇవతలున్న పైపుల మీదికొచ్చింది. జనంలో ఆనందాశ్చర్యాలు పెల్లుబికినాయి. మాగాణిలో ఒక జానెడు వెడల్పున్న గెనుముల మీద నడవడానికే మనుషులు ఇబ్బంది పడతారే, ఒక చిన్న తీగ మీద అంత ఎత్తులో ఈ అమ్మాయి ఎట్ల నడుస్తాది?కాళ్ళ కింద ఏదైనా అయస్కాంతం ఉందా అని జనమంతా అనుకోసాగినారు.
ఆటలో రెండో ఐటమ్! సైకిల్ చక్రమంతున్న వొక ఇనుపరింగుకు చుట్టూ బట్టపేలికలు చుట్టి, కిరసనాయిల్ తో తడిపి అగ్గిపుల్ల గీసి అంటించినారు. మండుతా ఉండే ఆ రింగును ఆమె, నడివయసు మనిషి చెరొకవైపు నిలుచుకొని కడ్డీలతో లాగి పట్టుకుండారు.మరొక పిల్లగాడు, మండుతున్న రింగుకు ఇవతలి వైపున రెండు బారల దూరంలో రెండు పరుపులు (బెడ్స్) ఒక దాని మీద ఒకటి పరిచినాడు.ఆ అందగాడు,రింగుకు అవతలి వైపున దూరంగా పోయి స్పీడుగా పరిగెత్తుతా వచ్చి మండుతున్న రింగులోకి కబ్దూరు పోసి,పరుపు మీద రెండు చేతులూ మోపి పైకి పల్టీ కొట్టి నేల మీద నిలుచుకుండాడు. అది చూస్తా జనమంతా అబ్బురపోయినారు.
ఆటలో మూడో ఐటమ్. ఒక అడుగంత వ్యాసార్థం ఉండే ఇనుపరింగును చూపినాడు ఆ అందగాడు. నడి వయసు మనిషి వ్యాఖ్యానం చేస్తా చుట్టూ తిరుగుతా జనానికి ఇనపరింగును చూపించినాడు.అది నిజంగా ఇనుపరింగే! రబ్బర్ రింగు కాదు. దాన్ని ఆ యువకుడు చేతికి తీసుకొని రెండు చేతులూ పైకెత్తి చేతుల తర్వాత తలను రింగులోకి దూర్చి దాన్ని నడుముల వరకు తెచ్చుకుండాడు.ఆ రింగులోకి ఆ అందాల యువతీ దూర సాగింది. ఆమె తన తలను భుజాలను ఆ రింగులోకి దూర్చడానికి అవస్థ పడతా ఉంటే నాకు చూడబుద్ధి కాలేదు. ఇంత అందమైన దంపతులిద్దరూ ఎంత అవస్థ పడతా ఉండారు? వీళ్ళ శరీరాల్లో ఎముకలు ఉండాయో లేదో! ఉంటే ఇద్దరు మనుషులు ఆ ఇనుపరింగులోకి ఎట్లా దూరగలరు? ఇది సాధ్యమేనా? అని ఆశ్చర్యపోతా బాధపడినాను.
ఆ తర్వాత మళ్లా నాలుగైదు ఐటమ్ లు ఆడినారు. చివర నడివయసు మనిషి అందరికీ మొక్కుతా అమ్మలారా అయ్యలారా, మీ ఊరి దాపుకొచ్చినాం. సహాయం చేయండి అని అడుగుతానే ఒక్కొక్కరు చాటల నిండా వడ్లు తెచ్చి పోసినారు. దాదాపు ఐదారు పల్లాల వడ్లు జమయినాయి. కొంతమంది దుడ్లు ఇచ్చినారు. అది యాభై రూపాయలు అయింది. నాకయితే ఆ దంపతుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవల్లని అనిపించింది. కానీ వాళ్లు ఏమీ మాట్లాడకుండా వాళ్ల సవారి బండిలో కూర్చుండారు. నేను ఇంటికొచ్చినాను. రాత్రి పొద్దుబోయే వరకు వాళ్ళ రూపాలు, విన్యాసాలు, ఇనుపరింగులో దూరుతున్న వాళ్ళ కష్టాలు మనసులో మెదల సాగినాయి.
వొక మాసపత్రికలో నా తొలి కవితాపుష్పం!
వేసవి సెలవులు అయిపోయినాయి. తిరుపతికి చేరుకొని కాలేజీకి పోయి విద్వాన్ ఫైనల్ ఇయర్ క్లాసులో కూర్చుండాన కూర్చోగానే ఏదో తెలియని ఆనందం! ఇంక కొన్నాళ్ళకు విద్వాన్ శాంతి నారాయణ, తెలుగు పండిట్ అని రాసుకుంటాను కదా! విద్వాన్ అయిపోగానే వెంటనే తెలుగు పండిట్ గా ఉద్యోగం వస్తాదంట! జిల్లా పరిషత్ వాళ్లు ఉద్యోగం ఇచ్చేటప్పుడు నేను చదివిన సింగనమల హైస్కూల్‌కే నన్ను పండిట్‌గా వేస్తే ఎంత బాగుంటాది! హెడ్మాస్టర్ సారుకు జిల్లా పరిషత్తులో మంచి పలుకుబడి ఉందంట! ఎట్లయినా సరే గురువుగారిని గట్టిగా అడిగి శింగనమలకు వేయించుకోవల్ల!
అనుకుంటా ఉంటే మనసుకు ఏదో హాయి అనిపించింది. మొదట రెండు మూడు రోజులు క్లాసులు సరిగా జరగలేదు. మిత్రులందరూ ఊర్ల నుంచి ఒక్కొక్కరు రాసాగినారు. పరస్పరం సెలవుల విశేషాలు చెప్పుకోసాగినాం. ఒక వారం రోజుల తర్వాత ఆశావాది నుండి పోస్టల్ కవర్ వచ్చింది. దాన్ని చూస్తానే అదే అయ్యుంటుందని బిరబిరా ఓపెన్ చేసి చూసినాను
‘సాహితీ ప్రియ’ మాసపత్రిక! గబగబా పేజీలు తిప్పినాను. మధ్య పేజీలో అర్ధం పేజీ నిండా నా గేయం! నా అక్షరాల తొలిముద్రణ రూపం! నా తొలి కవితాపుష్పం పత్రికలో వచ్చింది! చూసి పరవశించి పోయినాను. నా ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో మిత్రులందరికీ చూపించినాను. వాళ్ల అభినందనలతో మురిసి పోయినాను. ఇట్లా ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక ఆంధ్రజ్యోతి వారపత్రికలలో వస్తే ఎంత బాగుంటాది! వేలాదిమంది చూసి చదువుతారు కదా అని ఆశపడినాను. ఒక మాసపత్రిక నా రచనను ఆమోదించడం, నాకు, నూతనోత్సాహంతో పాటు, నాకు నా పైన విశ్వాసం కలిగించింది. ఆ విశ్వాసంతో ఇంతవరకు రకరకాల అంశాల పైన రాసిన పద్య ఖండికలన్నీ ఫెయిర్ కాపీలు చేసి పరిశీలన కోసం ఆశావాదికి పంపినాను. ఆ మిత్రుడు మెచ్చుకుంటా, నా పద్యాలలో అక్కడక్కడ చిన్నచిన్న మార్పులు చేసి, పది దినాల కల్లా తిరిగి పంపుతా నండూరి రామకృష్ణామాచార్యుల చేత ముందుమాట రాయించమని సూచిస్తా ఉత్తరం రాసినాడు.
ఆశావాది చేతి వ్రాతను చూసి మురిసిపోయినాను. ఇతనిది ఎంత అందమైన దస్తూరి! నేనెందుకు ఇంతందంగా గుండ్రంగా అక్షరాలు రాయలేక పోతావుండాను? ఇంత అందంగా అద్భుతంగా రాయగలిగిన వాడు బిఏ డిగ్రీలో ఎట్ల ఫెయిల్ అయినాడు? ఇతడు ఫెయిల్ అయినందువల్ల, జూనియర్ తెలుగు పండిట్‌గా కణేకల్ హైస్కూల్లో చేరడం వల్లనే కదా ఇతడు నా అవధాన విషయం తెలుసుకోవడం, ఆ హై స్కూల్లో నా చేత అవధానం చేయించడం మొదలైనవన్నీ జరిగిండేది! ఈ విద్యా సంవత్సరంలో తప్పకుండా హిందీ పరీక్ష రాసి బిఏ కంప్లీట్ చేసుకొని అనంతపురం పీజీ సెంటర్లో ఎంఏలో చేరల్లని మిత్రుడు అనుకుంటా ఉండాడు. మిత్రుడు ఎంఏ అయిపోయినంక డిగ్రీ కాలేజీ లెక్చరర్ అయితే నాకు అండగా ఉంటాడు కదా! నేను ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులున్నా, గట్టిగా చదివి, మంచి మార్కులతో విద్వాన్ పాసయితే బాగుంటాదని కష్టమైన పాఠ్యాంశాల పైన దృష్టి పెట్టినాను. ఆశావాది సూచన ప్రకారం 70 పద్యాలను నండూరి వారికి, ముందు మాటల కోసం అభ్యర్థిస్తూ పంపినాను.
జొన్నలగడ్డ వెంకటసత్యం నాకు గొప్ప మిత్రుడు!
కాలేజిలో క్లాసులు సీరియస్‌గా జరుగుతా ఉండాయి. మిగతా వ్యవహారాలన్నీ పక్కన పెట్టి చదువులో పూర్తిగా నిమగ్నమైనాను. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు నా హై స్కూల్ క్లాస్‌మీట్ జొన్నలగడ్డ వెంకటసత్యం కనిపించినాడు. ఆ స్నేహితుడిని చూడగానే పరమ సంతోషం అయింది. రూముకు పిలుచుకొని వచ్చినాను. మా రూములో ఉన్న మా హై స్కూల్ స్టూడెంట్ సన్నప్పను చూసి సత్యం అభినందించినాడు. తాను బీఎస్సీ ఫస్టు క్లాసులో పాసయినానని చెప్పగానే నాకు చాలా ఆనందమైంది.
వెంకటసత్యం చాలా తెలివైన విద్యార్థి. ఎస్ఎస్ఎల్సీలో యూనివర్సిటీ ఏరియాలో అంటే రాయలసీమలో అతడే ఫస్ట్! అందుకే మా హెడ్మాస్టర్ సార్, మా హైస్కూల్లోని బోర్డుమీద ‘అవర్ బెస్ట్’ అని రాయించిన విద్యార్థుల లిస్టులో వెంకట సత్యమే మొదటివాడు. అతనికి వచ్చిన మార్కుల పక్కన ఎస్వీ యూనివర్సిటీ ఏరియాలోని అత్యధిక మార్కులు అని కనబరిచినారు. కేవలం తరగతి మార్కుల విషయంలోనే కాదు, జీవితంలో అన్ని విషయాలలోనూ వెంకటసత్యం ఉన్నంతంగా ఉంటాడు. నిరాడంబరుడు. నిగర్వి. మితభాషి. ఎస్ఎస్ఎల్సీ వయసు నాటికే అతని అలవాట్లు, ఆలోచనలు, సభ్యత, సంస్కారము ప్రతిదీ ఆదర్శప్రాయంగా ఉండేది! పేదరికంలో నుంచి వచ్చిన నాకెందుకు అతని నడవడిక అలవాడలేదు? అతనికి లేని ఈ అమ్మాయిల మీద వ్యామోహం, ఆరాధన నాకెందుకు? అతని మాదిరి దేని మీదా దృష్టి పెట్టకుండా, వయసు చేసే పనికిమాలిన చేష్టలు చేయకుండా, చదువుకొనుంటే అతనిని ఒక ఆదర్శంగా తీసుకొని, అతని మార్గంలో నడిచి ఉంటే ఎంత బాగుండేది! అతని జీవన శైలి ఎవరికైనా స్ఫూర్తిదాయకం కదా! నేనెందుకు అతని నుంచి స్ఫూర్తి పొందలేదు?
వెంకటసత్యం గురించి అట్లా ఆలోచన చేయగానే, ఎస్ఎస్ఎల్సీ పబ్లిక్ పరీక్షల సమయంలో అతడు చేసిన సహాయం, ప్రేమాదరణ గుర్తుకొచ్చి కనుగుడ్ల మీద నీళ్లు మెదిలినాయి. శింగనమల హైస్కూల్ విద్యార్థులలో ఇప్పటికి ఉన్నత విద్యలో అతడే మొదటి వాడని, భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అందుకోగలడని అనుకుంటా యూనివర్సిటీలో ఆ గొప్పమిత్రుని పనులకు సహకరించి తృప్తిచెందినాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
