[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
ఉడుతకు ఉడుతాభక్తితో –
వెంకటసత్యం వెళ్లిపోయిన నాలుగు దినాలకే ఆప్తమిత్రుడు ఆశావాది తిరుపతికి వచ్చి నన్ను కలుసుకుండాడు. ఊహించని విధంగా ఆ ప్రియ మిత్రుడు రావడంతో పరవశించిపోయినాను.తాను హిందీ సబ్జెక్టులో పాసై బి.ఏ పూర్తి చేసుకున్నాను, ఎంఏలో చేరబోతున్నాను, ఆ పని మీదనే వొచ్చినానని చెప్పడంతో పరమానందం అయింది నాకు. ఆ మిత్రునికి సహకరించడానికి రెండు దినాలు కాలేజీకి సెలవు పెట్టి మిత్రుని వెంట యూనివర్సిటీకి పోయినాను. యూనివర్సిటీ ఆఫీసులో బి.ఏ పాస్ సర్టిఫికెట్ తొందరగా తీసుకొని పోయి అనంతపురం పీజీ సెంటర్లో ఎంఏలో చేరల్లని మిత్రుని ఆరాటం. అయితే రెండు రోజులైనా మిత్రుని పని కాలేదు. మూడోదినం సర్టిఫికెట్ చేతికొచ్చింది. ఈ మూడు దినాలూ చదువు పక్కన పెట్టి మిత్రుని పనిలో నిమగ్నమైననాను.
ఆత్మీయ మిత్రుడు, నా సాహిత్య ప్రయాణంలో చేదోడుగా ఉంటున్న మిత్రుడు, అటువంటి మిత్రుని పనుల కోసరం కొంతకాలాన్ని త్యాగం చేయడం, ఏదో ఒక విధంగా ఖర్చును భరించి అయినా ఆ మిత్రునికి అతిథ్యమివ్వడం నా ధర్మంగా భావించినాను. రాకరాక వొచ్చిన మిత్రునికి నా నికృష్టమైన అన్న పానీయాలతో ఆతిథ్యం ఈయలేను కదా! మాకు అలవాటు లేని, పరిస్థితుల కారణంగా మేము మరచిపోయిన టిఫిన్లూ హోటల్ భోజనాలూ మిత్రునికి ఏర్పాటు చేయడానికి నాకు బరువైనా ఇష్టంగా చేసినాను. మూడోదినం మా రూము మిత్రులందరమూ రైల్వే స్టేషన్‌కి వెళ్లి ఆశావాదిని రైలెక్కించి వీడ్కోలు పలికినాం.
మూడు దినాలు యూనివర్సిటీకి తిరగడానికీ టిఫన్లకూ భోజనాలకూ దాదాపు 20 రూపాయలు ఖర్చయినాయి. చేతిలో ఉన్న దుడ్లన్నీ అయిపోయినాయి. చిన్నచిన్న ఖర్చులకు మిత్రుల దగ్గర 20 రూపాయలు అప్పు చేసినాను. ఊరికి నాయనకు ఒక 20 రూపాయలు పంపమని జాబు రాసినాను. రెండు వారాలయినంక నాయన బాధపడతా 15 రూపాయలు పంపినాడు. హెడ్మాస్టర్ సార్ 25 రూపాయలు పంపినాడు.
ఖర్చులకు డబ్బులను గురించి దిగులు పడతా, దిగులుతోనే మనసును చదువు మీదికి మళ్ళిస్తా చదువుకో సాగినాను. ఫైనల్ ఇయర్లో భాషా శాస్త్రం, అలంకార శాస్త్రం కష్టమనిపించ సాగినాయి. ఇట్లా పరిస్థితులలో, మిత్రులు ఏదో ఒక పని మీద తిరుపతికి రావడం, వాళ్ళ కోసరం కాలేజీకి సెలవు పెట్టడం వల్ల, భాషా శాస్త్రం అలంకార శాస్త్రం క్లాసులకు పోకపోవడంతో కొన్ని పాఠాలు అయిపోయినాయి. ఆ పాఠాలను అర్థం చేసుకోవడానికి కష్టమయ్యింది. ఇట్లా పరిస్థితులలో సొంతూరు నుంచి తిరుమలకు పోవడానికి నాలుగైదు దినాలకు ఒక గుంపు వచ్చి నా సహాయం కోరడం, వాళ్లకు సహాయ పడమని నాయన జాబు రాయడం, నేను అయిష్టంగానే వాళ్ల కోసరం కాలేజీకి సెలవు పెట్టడం అంతా చాలా ఇబ్బందిగా మారసాగింది.ఇది ఇట్లుంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు, ఆశావాది తండ్రి పక్కీరప్ప సార్ నేరుగా కాలేజీకి వచ్చినాడు. ఆయనను నేనెప్పుడూ చూడలేదు. ఆయన అనంతపురం జిల్లాలో ఎక్కడో ఎలిమెంటరీ స్కూల్లో హయ్యర్ గ్రేడ్ టీచరుగా పనిచేస్తా ఉండాడని ఆశావాది మాటల సందర్భంలో ఒకసారి చెప్పినట్లు తెలుసు. ఆయన తనను పరిచయం చేసుకొని, ఆశావాదికి అనంతపురం పీజీ సెంటర్లో ఎంఏలో చేరడానికి సీటు రాలేదని, బాధపడతా చెప్పి, ఎలాగైనా సహాయం చేయమని ప్రాధేయపడినాడు. ఆ మాట వింటానే నేను మనసులో బాధపడతా, మిత్రునికి ఎం.ఏ లో సీటు ఇప్పించడానికి నేను ఎంతటి వాడ్ని? అది నా చేతన అయితాదా? అని అనుకుంటా ప్రొఫెసర్ జీరెడ్డి చెన్నారెడ్డిగారిని గుర్తు చేసుకుండాను.వెంటనే ఆయనను నాగ సిద్ధారెడ్డి సార్ దగ్గరికి పిల్చుకొని పోయి విషయం చెప్పి ఎలాగైనా సహాయ పడాలని కోరినాను. ఆయన అష్టా విధానిగా ఆశావాది పేరు విని ఉండడం వల్ల, అయ్యో నారాయణా, నీ మిత్రుడు నాకు శిష్యుని వంటి వాడే కదా, తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి తన లెటర్ హెడ్ మీద వాళ్ళ బావ జీరెడ్డి చెన్నారెడ్డి గారికి ఉత్తరం రాసి ఇచ్చినాడు. ఆయనే పర్సనల్‌గా చెన్నారెడ్డి సార్ దగ్గరికి వస్తాడని ఆశపడిన నేను కొంత అసంతృప్తి చెంది ఆ లెటర్ తీసుకొని మిత్రుని తండ్రి పకీరప్ప గారిని వెంటబెట్టుకుని పోయి చెన్నారెడ్డి గారిని కలుసుకొని లెటర్ ఇచ్చినాను.
చెన్నారెడ్డి సార్ మమ్మల్ని పిలుచుకొని పోయి, యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో ఎవరినో కలిసి మాట్లాడినాడు. చాలా ఆలస్యమైందని, అనంతపురం పీజీ సెంటర్లో తెలుగు ఎమ్ ఏ ఫస్టియర్‌లో ఉన్న 40 సీట్లూ భర్తీ అయిపోయినాయని, ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేమని అన్నాడాయన. నేను చెన్నారెడ్డి సార్‌ను ప్రాధేయపడి అడిగినాను. ఆయన నా మాటలకు కరిగిపోయినాడేమో, మమ్మల్ని అక్కడే కూర్చోమని చెప్ఫి, ప్రిన్సిపాల్ గారి రూములోకి వెళ్లి చాలాసేపయినంక బయటకొచ్చి, “శాంతి నారాయణా, మా నాగసిద్ధుడు చెప్పినాడు కాబట్టి పట్టుబట్టి, అక్కడ,అనంతపురం పి.జి సెంటర్లో ఎమ్.ఏ. ఫస్టియర్ తెలుగు తరగతిలో ఒక సీటు అదనంగా ఇప్పించినానయ్యా! ఈ లెటర్ తీసుకొని పోయి అక్కడ చూపిస్తే ఆశావాది ప్రకాశరావును చేర్చుకుంటారు. తొందరగా వెళ్ళండి” అని చెప్పుతా నా భుజం తట్టినాడు. నాకు పరమానందమయింది. మిత్రునికి ఎం.ఏలో చేరడానికి సహాయపడినానన్న సంతోషంతో పొంగిపోయినాను.
మిత్రునికి నా ప్రయత్నం వల్ల, జీరెడ్డి చెన్నారెడ్డి గారి సహాయం వల్ల ఎంఏ లో సీటు వచ్చిందని ఎంత సంతోష పడినానో ఆ సంతోషమంతా, పక్కీరప్ప గారు చార్జీలకు డబ్బులు లేవని, ఒక పది రూపాయలు సర్దమని అడగగానే గాలికి ఎగిరిపోయింది. ఇదేమిటి, ఈయన నన్ను చార్జీలకు డబ్బులు అడగడమేమిటి? మిత్రులతో రెండు శేర్లు బియ్యం బదులుగా ఇప్పించుకొని, మర్యాద కాపాడుకోవడానికి హోటల్ నుంచి కరీస్ తెప్పించి భోజనం పెట్టినాను. నా బతుకే అతుకుల బొంతగా మారింది. అటువంటి నేను ఇతనికి చార్జీలకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను? ఈయన టీచర్‌గా పనిచేస్తా ఉండాడు కదా! చార్జీలకు తెచ్చుకోకుండా ఎట్లొచ్చినాడు? ఇప్పుడు ఏమి చేయల్ల? ఈయనేమో నోరు తెరిచి అడిగినాడు! ఏమి చేయల్లబ్బా? అని నసుగుతా, ఒక రెండు రూపాయల సర్దగలను, నా పరిస్థితీ బాగలేదు అని అన్నాను. అవునా నారాయణా అని అంటా, అదే ఇమ్మన్నాడు. నా ప్రాణం పిసికినట్లయింది. నా ఇబ్బందిని చూసి సన్నప్ప రెండు రూపాయలు ఇచ్చినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. మిత్రులందరూ, అతడు చార్జీలకు డబ్బులు అడగడం గమనించి చాలా బాధపడినారు. నేను మూగవాడినై చాలాసేపు ఆలోచన చేసి, ఏమి బతుకులు ఇవి అనుకుంటా బరువుగా నిట్టూర్చినాను.
పక్కీరప్ప గారు వెళ్ళిపోయిన వారం దినాలకు, మిత్రుడు ఆశావాది నుండి ఉత్తరం వచ్చింది. “శాంతీ, నీ ప్రయత్న ఫలితంగా ఎంఏలో చేరినాను. నువ్వు చేసిన సహాయం మరువలేనిది” అని మిత్రుడు రాసిన మాటలు మనసును ఊరడింపజేసినాయి.
శాంతిశ్రీ ఖండకావ్యం-ప్రచురణకు ఆరాటం
విద్వాన్ ఫైనల్ ఇయర్ పబ్లిక్ పరీక్షలే నా భవిష్యత్తును నిర్ణయించేదని, దేనిపైనా మనసును లగ్నం చేయకూడదని అనుకుంటా, పాఠ్యాంశాలను బాగా చదవడానికి పూనుకుండాను. ఒక వారం దినాలు పట్టుదలగా చదువుతానో లేదో, అవధానమిత్రుల ప్రేరణతో పద్య రచనల పైకి దృష్టి మళ్లుతుంది. ఏదో అంశం పైన కొన్ని పద్యాలు రాస్తాను. అట్ల రాసిన పద్యాలు అన్నింటినీ కలిపి ‘శాంతిశ్రీ’ పేరుతో ఒక ఖండకావ్యం ప్రింట్ చేయించుకోవాలని మిత్రుడు ఆశావాదికి పంపినాను. ఆయన అక్కడక్కడ చిన్నచిన్న సవరణలు చేసి నాకు పంపుతా, ఈ ఖండకావ్యానికి జమ్మలమడక మాధవరాయశర్మ గారిచే ముందు మాటలు రాయించమని సూచిస్తా, ఆయన అడ్రస్ పంపినాడు. ఖండకావ్యం టైటిల్ బాగుందని మెచ్చుకుండాడు. నేను వెంటనే మాధవరాయ శర్మ గారికి ముందుమాటలు రాయమని అభ్యర్థిస్తా, నా ‘శాంతిశ్రీ’ ఖండకావ్య పద్యాలను పంపినాను. నా చేతి వ్రాత అందంగా ఉండదని, రూములో ఉన్న మిత్రుడు వెంకటరమణతో ఫెయిర్ కాపీ చేయించి పంపినాను. మిత్రులందరికీ శాంతిశ్రీ టైటిల్ బాగుందని మెచ్చుకుండారు.
నేను విద్వాన్ కోర్సులో చేరిన కొన్నాళ్లకే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ ఖండకావ్యాలు, పుష్పవిలాపం, కుంతీవిలాపం పద్యాలు బాగా ప్రసిద్ధి పొందడంతో,కొత్త కవులు తమ పద్య కావ్యాలకు, తమ పేర్లకు చివర శ్రీని చేర్చుకో సాగినారు. అది నన్ను బాగా ఆకర్షించింది. నేను గుడకా నా ప్రథమ ఖండకావ్యానికి శాంతిశ్రీ అని పేరు పెట్టినాను.
నా పద్యాలను మాధవరాయశర్మ గారికి పంపిన రెండో వారం నుంచి ఆయన జాబు కోసరం ఎదురు చూడ సాగినాను. ఆయన సహృదయంతో జాబు రాసినాడు. “మీ పద్యములు, భావనలు బాగుగనే ఉన్నవి. చదువుచున్నాను. తీరిక చూసుకొని సవివరముగా ఉత్తరము వ్రాయుదును. నీ గురువులు గౌరిపెద్ది వారికిని చేబ్రోలు వారికిని నా నమస్కారములు తెలుపుము” అని విషయం తెలిపినాడు. నేను ఆ సాయంకాలమే గౌరిపెద్ది గారిని కలుసుకొని, ముందుమాట కోసరం నేను ఖండకావ్యాన్ని పంపిన విషయం చెప్పకుండా, మీకు జమ్మలమడక వారు నమస్కారాలు తెలపమన్నాడు సార్ అని అన్నాను. ఆయన సంతోషించి, జమ్మలమడక వారు నీకెందుకు ఉత్తరం రాసినాడు, ఆయనతో నీకెట్ల పరిచయం అన్న ప్రశ్నలేవీ అడగనందుకు సంతోషం అయింది.
ఆశావాది సూచన ప్రకారం శతావధాని సివి సుబ్బన్న గారికి పద్యాలలో ఉత్తరం రాసినాను ఆయన బదులు రాస్తా సంస్కృత సమాస ప్రయోగాలు తగ్గించమని సరళమైన తెలుగులో ఏమాత్రమూ దోషాలు లేకుండా పద్యాలు రాయమని, నేను రాసిన పద్యాలలోని రెండు దోషాలను ఎత్తి చూపినాడు. ఆయన బదులు జాబు రాసినందుకు, అవధానాల వైపు ప్రోత్సాహ పరిచినందుకు సంతోషపడతా, దోషాలను ఎత్తి చూపినందుకు సిగ్గుపడతా నన్ను నేను పరామర్శించుకో సాగినాను. నా ఖండకావ్యానికి జమ్మలమడక వారు ముందుమాట రాయడంలో ఎందుకు ఆలస్యం చేస్తా ఉండారో ఊహించుకుండాను. ఆ విధంగానే అవధాన మిత్రుడు మాచిరాజు కూడా నేను రాసిన పద్యాల ఉత్తరంలో రెండు దోషాలను తెలుపుతూ ఉత్తరం రాయడంతో అంతర్ముఖీనుడనయి, నా అత్యుత్సాహానికి బ్రేకులు వేసుకో సాగినాను.
చెదురుతున్న మనస్సూ- పడుతున్న అవస్థలూ!
మంచాల వీధిలో మా రూము అన్నింటికీ సౌకర్యంగా ఉండడంతో బాగా చదువుకుంటా, సాయంకాలం పూట మాడీ పైకి పోయి ఈజీ చైర్లో కూర్చొని, తిరుపతి కొండల వైపు చూస్తా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పద్యాలో గేయమో రాస్తా, మనసును నొప్పించిన వార్తలనూ బజారులో చూసిన పేదల దయనీయ స్థితిగతులనూ మననం చేసుకుంటా, ఆ అంశాలను కథలుగా మలచడానికి ప్లాన్ వేసుకోసాగినాను. ఈ పని వారం రోజులుగా చేస్తా ఉండాను. చేస్తా చేస్తా, నాలుగు రోజుల కిందట పక్కింటి వాళ్ళ మాడీ పైన ఎవురో ఇద్దరు ముగ్గురు పిల్లలు మాట్లాడతావుంటే విన్నాను. ఒక వ్యక్తి రెండు మూడు సార్లు దగ్గింది. ఆ దగ్గు ఆసహజంగా, ఎవరో వినల్లని దగ్గినట్లు అర్థమైంది. ఆ దగ్గును మూడు నాలుగు రోజుల నుంచి విన్నట్లు గుర్తుకు తెచ్చుకొని, ఈజీ చేర్లో నుంచి పైకి లేచి చూసినాను. లంగా పవిట వేసుకున్న ఒక అందమైన అమ్మాయి నా వైపు చూసి మెల్లగా ఒక చిరునవ్వు నా పైకి విసిరి,ఇద్దరు చిన్నపిల్లల్ని పలకరిస్తా, తన ప్రయత్నం ఫలించిందన్నట్ల విజయ మందహాసం చిందిస్తా మాటిమాటికీ వోరగా చూడసాగింది.
ఆమె అట్ల చూస్తా ఉంటే నేను చూడకుండా ఉండలేకపోయినాను. నేను తన వైపు చూస్తా ఉండానని తెలిసి, సిగ్గుపడతా, పిల్లల్ని మాట్లాడించినట్ల నటిస్తా, పెదవుల్ని ముని పళ్ళతో నొక్కుకుంటా, నాలుగైదు సార్లు వోరగా చూసింది. ఆ సిగ్గుబుగ్గల్లో నాకు ఉమావతే కనిపించడంతో నా నరాలు జిల్లుమన్నాయి. ఆమె నా వైపు చూసినప్పుడు ఒక చిరునవ్వును అందించల్లని అనిపించి, ఎవురైనా గమనిస్తా ఉండారేమోనని అటూ ఇటూ చూడ సాగినాను. అంతలోనే ఆమె కిందికి దిగిపోతా, తల తిప్పి ఒక చిరునవ్వు చిలకరించి వెళ్ళిపోయింది.
ఆమె మాటిమాటికీ నన్ను చూస్తా, సిగ్గుపడతా, వోరగా చూస్తా ఉంటే శరీరంలో ఏదో తెలియని ఆందోళనతో ఒళ్ళు చెమట పట్టింది. పెదవులు వొనక సాగినాయి. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా వొచ్చి, ఈజీ చేర్లో కూర్చొని, బరువుగా నిట్టూరుస్తా, ‘ఓరి నాయనో, దేనిమీదా ధ్యాస లేకుండా నిమ్మలంగా చదువుకుందామనుకుంటే ఇక్కడా మనసు చెదిరిపోయే రకంగా ఉందే! మిద్దె పైకి రాకుంటే బాగుండేదేమో! ఈ అమ్మాయి వారం రోజుల నుంచి నన్నే అబ్జర్వ్ చేస్తా, నేను చూడల్లని దగ్గిందేమో! దగ్గుతో తన ఉనికిని తెలిపిందేమో! ఎంత అందంగా ఉంది మనిషి! ఆ సిగ్గుబుగ్గల్లో ఎంత అందమైన సొగసులు! ఎంత మోహన రూపం! ఉమావతి చెల్లెలేమో!’ అనుకుంటా ఆలోచించసాగినాను.
వొగ మనోహర రూపాన్ని అందుకోలేక, అందీ అందని దాన్ని మరిచిపోలేక, వీధిలైటు వెలుతుర్ని మింగాలని ఆశపడి వచ్చి రెక్కలు కొట్టుకుంటా కింద పడి, మరొక వెలుతుర్ని ఆశించి భంగపడుతున్న రెక్కల పురుగు మాదిరి మనసు గాయపడింది కదా! ఇప్పుడు మరొక వెలుతురు దీపమా? తిరుపతిలో ఏ ఇంటికి పోయినా ఈ ఆకర్షణలు తప్పవా? నా రూపంలో ఏముందని స్త్రీ ఆకర్షితురాలు అయితా ఉంది? ఒక అందమైన అమ్మాయిని ఆకట్టుకునే రూపం కాదు కదా నాది! మరి ఎందుకు అందమైన అమ్మాయిలు నా వైపు చూస్తా మనోహరంగా తమ చిరునవ్వుల వోరచూపులతో ప్రాణాలను తోడేస్తున్నారు? నేను సభ్యతగా గంభీరంగా ఉండడమే ఆకర్షణగా ఉందా? లేకుంటే నా చదువు ఆకర్షిస్తా వుందా? నా చదువూ సభ్యతా సంస్కారాలే నాకు అందాన్ని ఇస్తా ఉండాయా? ఈ గుణాలే అందాన్ని ఇస్తే, వీటిని నేను దుర్గుణాలుగా మార్చుకోలేను కదా!
ప్రేమ అనేది ఒకరికే అంకితం కావల్ల గాని ఒకరిని మనసారా ప్రేమించిన తర్వాత మరొకరి మీదికి మనసు మల్లడమంటే, అది వ్యామోహమే కానీ ప్రేమ ఎట్లయితాది? అయితే ఉమావతి విషయంలో గానీ ఆదోని మీనాక్షి విషయంలో గానీ నాది ప్రేమారాధన కాదా?వాళ్ళ ప్రేమను అందుకోలేకపోవడంలో నా దయనీయ కుటుంబ పరిస్థితులే కారణంగానీ ఆరాధించిన నా హృదయం కారణం కాదు కదా! స్త్రీని నా మనసెంత నిర్మల హృదయంతో ఆరాధించినా, నా పేదరికం కారణంగా ఆరాధనా మూర్తిని నేను అందుకోలేనప్పుడు, అందని దానికి అర్రులు చాస్తా ,అందుతున్న దానిని అందుకోడానికి ధైర్యమూ త్యాగమూ లేనప్పుడు అనవసరంగా హృదయాన్ని నలుపుకోవడమెందుకు?
చెదిరిన మనసుతో రకరకాలుగా తర్కించుకుండాను. నేనుగా ఆమె వైపు చూడగూడదని గట్టిగా నిర్ణయించుకుండాను. ఏమయినా, మగవానిలో సౌందర్యారాధన దృష్టి ఉన్నప్పుడు ప్రతి అందమైన యువతీ మగవాన్ని సమ్మోహన పరుస్తాదేమో! సృష్టిలో స్త్రీ మూర్తిని మించిన ఆకర్షణ ఇంక దేనిలోనా లేదేమో! ఆకర్షణకు లోనై, మనసును జారవిడుచుకుంటే ఇంక మనిషికి దేనిమీదా ధ్యాస పోదేమో! ఒక లక్ష్యాన్ని సాధించడానికి పూనుకున్నవాడు ఎవుడూ ఈ తేనెలో చిక్కుకోడేమో! అనుకుంటా కిందికి దిగి వచ్చినాను.
***
ఈ మధ్యకాలంలో మనసు చెదిరినప్పుడల్లా దాన్ని బాగు చేసుకోవడానికి సినిమాలు ఎక్కువ చూడబట్టినాను. సినిమాకు పోయినప్పుడల్లా ఇంటర్వెల్ సమయంలో బయటికి పోకుండా అక్కడనే కూర్చొని, అనవసరంగా సినిమాలకు డబ్బూ సమయమూ వృథా చేస్తావుండానని బాధపడతా, సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకుండాను. మళ్లీ మనసుకు బాధైన నాడు నా నిర్ణయాన్ని నేనే ఉల్లంఘిస్తా ఉండాను.
సాయంకాలం పూట ప్రతిరోజూ మాడి పైకెక్కి,ఆమె ఇంటి వైపు చూడకుండా ప్రశాంతంగా ఒక మూల కూర్చొని చదువుకో సాగినాను. నేను పైకి పోయినప్పుడల్లా ఆమె గమనిస్తా ఉందేమో, అదే పనిగా దొంగదగ్గు దగ్గుతా సంకేతమిస్తుంది.ఆమె దగ్గడాన్ని నేను వింటానే ఉండాను.అయితే పైకి లేచి చూడగూడదని గట్టిగా నిర్ణయించుకున్నందువల్ల ఆ పని చేయలేదు. ఆమె ఏమనుకుందో ఏమో, రెండు రోజుల నుంచి ఆ దగ్గు వినిపించలేదు. దాంతో నాలో క్యూరియాసిటీ పెరగసాగింది.
నిన్న బజారు నుంచి ఇంటికి వస్తా ఉండాను. ఆమె, వాళ్ళ ఇంటిముందు నిల్చుకొని ఉంది. దగ్గరికి వచ్చినంక నా వైపు కోపంగా చూసి, పక్కకు తిరిగి, కేకరిచ్చి ఎంగిలి మూసి, లోపలికి పోయి దభిల్లున వాకిలి తలుపులేసింది. ఆ దృశ్యాన్ని చూసి నేను అవమానంగా ఫీలయితా రూములోకొచ్చి ఈజీ ఛేర్‌లో పండుకొని కళ్ళు మూసుకొని నా దయనీయతను తలుచుకొని చాలాసేపు బాధపడినాను. ఇంక జీవితంలో ఆమెను చూడగూడదని నిర్ణయించుకుండాను.
ఎంత ఉక్కపోస్తే మాత్రం యువతి ఆ మాదిరిగా పండుకోవచ్చునా-?
మంచాల వీధిలో దాదాపు ఇండ్లన్నీ అంటుమిద్దెలే! మేమున్న ఇంటి వెనకలున్న ఇల్లు గుడకా అంటుమిద్దే! ఆ ఇంట్లో ఒక నర్సు ఉంటా ఉంది. అది, వాళ్ళ సొంతం ఇల్లంట! ఆమె రూయా ఆసుపత్రిలో పనిచేస్తా ఉంది. మనిషి చామన ఛాయలో చాలా అందంగా ఉంటాది! చక్కని స్ట్రక్చర్‌తో ఆకర్షణీయమైన రూపం! వయసు 40 సంవత్సరాలంట! ఇద్దరు పిల్లలు! ఇద్దరూ పదేళ్ల లోపలున్న పిల్లలే! భర్త లేడు!తల్లి వుంది!
వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మళ్లీ కాలేజీకి వచ్చిన మా రూము మిత్రులందరమూ రాత్రిపూట మాడీ యెక్కి చదువుకొని, అక్కడే పండుకుంటా వుండాం. అందరూ, కడప కర్నూలు అనంతపురం చాలా వేడి ప్రాంతాలని అంటారు గాని తిరుపతికి వచ్చినప్పటి నుంచి నేను గమనించిన విషయం ఏమంటే, వేసవిలో రాత్రిపూట అనంతపురం కంటే తిరుపతిలోనే వేడి ఎక్కువని, కారణం, తిరుపతి పక్కనే కొండలుండడమే అని! అందుకే తిరుపతిలో చాలామంది రాత్రిపూట మిద్దెల మీద పండుకుంటారు. అట్లనే మేమూ నర్స్ వాళ్లూ మాడీ పైనే పండుకుంటా ఉండాం!
ఈ సంవత్సరం తిరుపతిలో నిరుడు కంటే వేడి ఎక్కువ అనిపించ సాగింది. ఫ్యాన్ లేకపోతే ఒక పది నిమిషాలు కూడా రూములో కూర్చోడానికి సాధ్యం కావడం లేదు. అందుకే రాత్రి కొంచెం ఎర్లీగా భోజనాలు ముగించుకొని, మా మిత్రులందరమూ మాడీపైకి ఎక్కుతావుండాం! సుబ్బన్న మాత్రం రూము లోనే చదువుకుంటా పైకి రాడు. మిగతా ముగ్గురం పదకొండు గంటల వరకు చదువుకొని పండుకుంటాం.
నర్స్ వాళ్ళింటికీ మేమున్న ఇంటికీ మధ్యలో జానడెత్తు మొరుము ఉంది. మేము మొరుము వైపు తలపాటు పెట్టి పండుకుంటాం. నాకు పిల్లప్పటి నుంచి మా ఊర్లో మా ఇంటి మిద్దెమీద దక్షిణం తలపాటు పెట్టుకొని పండుకోవడం అలవాటయింది. నర్స్ వాళ్ళు ఆ మొరుముకు కొంచెం దూరంగా పడుకుంటా ఉంటారు. నర్స్ పేరు మెర్సీ! ఆమె పిల్లల పేర్లు విల్సన్, మాధవి. పోయిన సంవత్సరం నుంచి నర్స్ మా అందరికీ పరిచయమైంది. ఆ పరిచయంతో మేము అప్పుడప్పుడు ఆసుపత్రికి పోయి దగ్గు, పడిశము, చలీజ్వరాలకు మందులు ఇప్పించుకొని వొస్తా ఉంటాం. దానితో మాకూ ఆమెకూ చనువేర్పడింది! ఆ చనువు వల్ల మా సుబ్బన్న, ఆమెతో అతిగా మాట్లాడుతుంటే ఒకసారి నేను రూములో దండించినాను. అప్పటి నుంచి అతడు మాడీపైకి ఎక్కడం మానేసినాడు.
ఒక వారం దినాలనుండి నర్స్ వాళ్ళు మాకు దగ్గరగా వచ్చి పడుకుంటా ఉండారు.ఆమె పిల్లలు తొమ్మిది గంటలకే వొచ్చి, రెండు మాటలు మాట్లాడి పండుకుంటారు.ఆమె మూడు దినాల నుంచీ మేమంతా పండుకున్నాక,మాడీపైకి వొచ్చి తన పిల్లల పక్కన పండుకుంటావుంది. నాలుగో దినము నుంచి మేము పండుకోక ముందే వచ్చి మాతో మాటలు పెట్టుకుంటా ఉంది. మాట్లాడడమే కాదు తన చెస్ట్ కనిపించే విధంగా మాట్లాడుతావుంది. మేము తన మాటల్లో మాటలు కలిపి మాట్లాడకపోయినా ఐదు నిమిషాలకు ఒకసారి పలకరించ సాగింది. సన్నప్పా రమణా, మేం పండుకుంటామని చెప్పి దూరంగా వెళ్లి పండుకుండారు. వాళ్లు అట్ల దూరంగా పోయినంక, “నాకు వరూధిని కథ తెలుసుకోవాలని ఉంది మాష్టారూ! మీరు విద్వాన్ చదువుతున్నారు కదా, ఆ కథలన్నీ మీకు బాగా తెలిసుంటాయి! ఆ కథ కాస్త చెప్పండి మాస్టారూ” అని బోర్ల పండుకొని, తల పైకెత్తి గోముగా అడిగింది. అట్లడుగుతా ఉంటే నాకు గిలిగింతలు పెట్టినట్లు కాసాగింది. తల పైకెత్తి చూడకుండా ఉండలేకపోయినాను. చూసి నేనే సిగ్గుతో తలొంచుకొని, ‘సారీ సిస్టర్, రేపు ఒక ఎగ్జాకు ప్రిపేరవుతున్నాను. వీలున్నప్పుడు చెబుతాను లేండి’ అని పుస్తకం పైన చూపు నిలిపినాను. నా చూపులేమో పుస్తకం మీద ఉండాయి కానీ మనసేమో ఆమె అందాలను చూస్తా జారిపోసాగింది. ఆమె మాటల్లోని తమకమూ ఆరాటమూ మత్తుగా మనసును కవ్విస్తావుండాయి. నేను మౌనంగా అవస్థపడతా వుండాను. ఆమె చిరు కోపం నటిస్తా, ‘మీరు నిజంగానే ప్రవరుని మల్లే ఉన్నారు, ఏమిటి మాస్టారూ’ అంటా పండుకుంది. దేవుడా రక్షించినావు అనుకుంటా ఊపిరి పీల్చుకుండాను.
ఆమె తమకపు మాటలతో నాకు పిచ్చి పట్టినట్లయింది. చదువు మీద దృష్టి కేంద్రీకరించలేక పుస్తకాలు ఎత్తిపెట్టి మిత్రుల దగ్గరికి వెళ్లి పండుకోవాలనుకుండాను. మనసు వినలేదు. ‘ఇక్కడే పండుకుంటే ఏమౌతుంది? ఒక పొద్దప్పుడు నీ పక్కకొచ్చి పండుకుంటుందేమో అని భయపడతా ఉండావా? వొస్తే రానీ! వొచ్చే అవకాశాలుండాయి! ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటావా? ఎన్నాళ్ళు ఇట్లా ఆరాటపడుతావు? గోల్డెన్ ఛాన్స్! నా మాట విని, ఇక్కడే పండుకో! ఈ వరూధినిని వొదులుకోవద్దు’ అంటా మనసు రెచ్చగొట్ట సాగింది.వెంటనే హృదయం హెచ్చరించింది–
ఆమెకు ఎంతో తమకమూ ఆరాటమూ ఉన్నా నీ దగ్గరికి ఎట్లా వస్తాదని అనుకుంటా ఉండావు? ఇదేమి నిర్జన ప్రాంతమా? ఆమె మాటల ఆంతర్యమూ నీ మౌనమైన ఆరాటమూ నీ రూము మిత్రులకు తెలియదని అనుకుంటా ఉండావా? పిచ్చివాడా, వాళ్లు నిద్రపోయినారని ఊహిస్తా ఉండావా? జాగ్రత్త! ఈ ప్రదేశం స్త్రీ సంగమానికి అనువైనది కాదని గుర్తుపెట్టుకో! అంతేకాదు, ఆమె నెల్లూరు నెరజాణ అని మరిచిపోవద్దు! ఇద్దరు పిల్లల తల్లి ఆమె!ఆమె పట్ల నీ నైతిక విలువలు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, జాగ్రత్త!
చాలాసేపు మౌనంగా మనసుకూ అంతరంగానికీ మధ్య నలిగిపోయి చివరికి మిత్రుల వద్దకు పోయి పండుకుందామని పైకి లేచినాను. ఆమె తన ఎదల మీదున్న బ్రాను తీసి పక్కన పడేసింది. పల్చని పైటకొంగు గుడకా వొక స్తనాన్నే కప్పివుంచింది! పాలార బోసినట్లున్న వెన్నెలలో ఆమె రెండవ స్తనం, మధు కలశం మాదిరి కనిపిస్తావుంది! చూడగానే నరాలు జివ్వుమన్నాయి. మెల్లగా వెళ్లి ఆమెను హత్తుకోవల్లని మనసు ఉర్రూతలూగింది. వెంటనే కంట్రోల్ చేసుకొని, ‘ఏమిటీ మనిషి? సిగ్గులేకుండా ఇట్ల పండుకుంది? ఇది మితిమీరిన బరితెగింపా, లేక ఉక్కపోతకు దిక్కు తెలియక ఇట్ల పండుకుందా?’ అనుకున్నాను.
మనసును బలవంతంగా మిత్రుల దగ్గరికి నడిపించి పండుకుండాను. రాత్రంతా నరకయాతన! ఆ యాతన నుండి బయటపడే సులభమైన అలవాటైన మార్గం, నిక్కర్ని తడుపుకోవడమే! అంతా అయినంక మత్తుగా నిద్రలోకి జారుకుండాను.
ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం, వొగ అద్భుత నిర్మాణం!
ఏ అంతరాయమూ లేకుండా మా విద్వాన్ ఫైనల్ ఇయర్ పాఠాలు బాగా జరుగుతావుండాయి. విద్యార్థులందరూ పోటీపడి చదువుతా వుండారు. తెలుగు భాషా చరిత్ర పరీక్ష పేపర్ కోసం భద్రిరాజు కృష్ణమూర్తి, జి.యన్ రెడ్డి వ్యాసాలు, గంటి జోగి సోమయాజులు గారి ఆంధ్ర భాషా వికాసం మొదలైన వాటి కోసం ఎగబడి తెచ్చుకొని చదువుతావుండాం. సాహిత్య చరిత్ర పరీక్ష పేపర్ కోసం పింగళి లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర, జి నాగయ్య గారి తెలుగు సాహిత్య చరిత్ర వ్యాసాలు, తిమ్మావజ్ఝల కోదండ రామయ్య గారి శైవ సాహిత్య వ్యాసాలు, కందుకూరి వీరేశలింగం ఆంధ్ర వాఙ్మయ చరిత్ర, సినారె గారి ఆధునికాంధ్ర కవిత్వం-సంప్రదాయములు, ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర 13 సంపుటాల కోసం నానా అవస్థలు పడి వాటిని సంపాదించి పరిశీలించసాగినాం. అయితే అవి ఏవీట సమగ్రంగాను తృప్తిగానూ కనిపించేవి కాదు.
ఇట్లా సమయంలోనే ఆయా విషయాల్లో నిష్ణాతులైన సాహిత్య వేత్తలను పిలిపించి వాళ్ల ప్రసంగాలను మా లెక్చరర్లు ఏర్పాటు చేయ సాగినారు. ముఖ్యంగా నాగ సిద్ధారెడ్డి సార్, అన్నింటిలోనూ చొరవ తీసుకొని పెద్దల ప్రసంగాలను వినే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించ సాగినాడు. ఎవరైనా సరే, తాము తెలుసుకునే విషయాలు చదవడం కంటే వినడం వల్లనే బాగా అర్థమవుతాయని వాళ్ళ అభిప్రాయం. అందుకే శైవ సాహిత్యం గురించి ప్రసంగించడానికి తిమ్మవజ్ఘల కోదండరామయ్యను పిలిపించినారు.నన్నె చోడుని పైన ఆయన రాసిన కవిరాజ శిఖామణి గ్రంథం మాకు పాఠ్యంశంగా ఉంది. అందుకే ఎంతో గౌరవంతో శ్రద్ధగా ఆయన ప్రసంగాన్ని విన్నాం. రెండు గంటల పాటు అద్భుతంగా మాట్లాడిన ఆయన ప్రసంగం నన్ను ముగ్ధున్ని చేసింది. శైవ సాహిత్య స్వరూపం, జాను తెలుగు స్వభావం అరటిపండు వొలిచి పెట్టినట్లయింది. సాహిత్యంలో కృషి చేస్తే ఆ మాదిరిగా చేయాలన్న ప్రేరణ కలిగింది. మళ్లీ కొన్నాళ్లకే ఆరుద్రను పిలిపించినారు. ఆరుద్ర గారు తెలుగులో గొప్ప అభ్యుదయ సాహిత్య వేత్తగా, సినీ గీత రచయితగా మా అందరికీ తెలుసు. అయితే సమగ్రాంధ్ర సాహిత్యం పేరుతో పూర్తీ వ్యావహారిక భాషలో ఆయన వెలువరించిన 13 సంపుటాలు ఆయనకు తెలుగు సాహిత్యంలో మహోన్నతమైన కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టినాయి. ముఖ్యంగా పామరులకు గుడకా సులభంగా అర్థమయ్యే పద్ధతిలో ఆంధ్ర సాహిత్య చరిత్రను వ్యావహారిక భాషలో రాయడం ఒక గొప్ప ప్రయోగం! ఆయన సహృదయంతో వినయశీలంతో చేసిన సాహిత్య పరిశోధన, వివాదాస్పదంగా మారిన ప్రాచీన కవుల స్థల కాలాదుల విషయాలలో ఆయన సహేతుకంగా ప్రతిపాదించిన అంశాలు మహోన్నత సాహిత్య వేత్తలను అబ్బులు పరుస్తావుండాయి. అటువంటి ఆరుద్రగారు మా కళాశాలకు వొచ్చినారు.
సమగ్రాంధ్ర సాహిత్యం 14వ సంపుటి విడుదల సభ! ఆ సభకు మా ప్రిన్సిపాల్ సుదర్శనాచార్యులు గారు అధ్యక్షత వహించినారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు ముఖ్య అతిథి! ఆరుద్ర గారు ప్రత్యేక అతిథిగా కూర్చుండారు. రాళ్లపల్లి వారు ఆరుద్ర గారి సాహిత్య పరిశోధనకు అబ్బురపోతా, తాను ఒక సాహిత్య విమర్శకునిగా సమగ్రాంధ్ర సాహిత్య సంపుటాలను మురిసిపోతా గుండెలకు హత్తుకున్నానని, మొత్తం 13 సంపుటాలను తాను ఇప్పటికి రెండుసార్లు చదివినానని చెప్పడం కంటే, అవి నా చేత ఇష్టంగా చదివించినాయని చెప్పడం సమచితంగా ఉంటుందని ప్రశంసించినాడు. తర్వాత ఆరుద్ర గారు ఎంతో ఉన్నతంగా మాట్లాడినారు.తెల్లని లూజు పైజామా మీద నశ్యం పొడి కలర్ జుబ్బా తొడుక్కొని, నల్లని గిరిజాల జుట్టు గడ్డం పెంచుకొని, తెల్లగా ఉన్న ఆరుద్ర గారు చాలా అవలీలగా మాట్లాడుతా, రాళ్లపల్లి అంతటి మహా సాహిత్యవేత్త, ఉత్తమ సాహిత్య విమర్శకుడు, నా సమగ్రాంధ్ర సాహిత్య సంపుటాలన్నీ గుండెలకు హత్తుకొని రెండు సార్లు చదివినారంటే నా సాహిత్య పరిశోధనకు అంతకు మించిన సర్టిఫికెట్ కానీ సత్కారం గానీ మరొకటి అవసరం లేదు, నా కృషి సార్థకమైంది, నా జన్మ ధన్యమైంది అని పరవశించి పోయినాడు. ఇంత చిన్న వయసులో తెలుగు సాహిత్యాన్నంతా మథించి ,ఆ సాహిత్య సారాన్నీ, ఆయా కవుల కాల పరిస్థితులనూ, సామాజిక రాజకీయ సమస్త విషయాలనూ ఈయన ఎట్లా ఆకలింపు చేసుకుండాడో, ఆ పరిశోధన కోసం ఎంత శ్రమించినాడో అని ఆలోచిస్తా, అబ్బుర పోతా, నా సాహిత్య కృషినీ నా అల్పత్వాన్నీ తలుచుకొని నాలో నేను సిగ్గుపడినాను.
మాయ పొరల్లో నుంచి బయటపడి విద్వాన్ ముగించుకొని-
మా పక్కింటి అందాల చిలక నిరాశాజనిత చీత్కారంతో ఒక రోజంతా బాధపడి ఆ వలపు వలలో చిక్కుకోనందుకు ఊరట చెందుతా, మనసును పుస్తకాల పుటల్లోకి బలవంతంగా మళ్లించి చదువుకో సాగినాను. పుస్తకాల పుటల్లోని ఛందోలంకారాలు మనసును ఆకర్షించసాగినాయి. కావ్య, నాటకాలు హృదయాన్ని ఆర్ద్రం చేయసాగినాయి. కాళిదాసు, భవభూతి వంటి సంస్కృత కవులు, కవిత్రయ కవులు, శైవ కవులు, సంధియుగ, ప్రబంధ యుగకవులు, భరతుడు, హేమచంద్రుడు,విశ్వనాథుడు, ఆనంద వర్ధనుడు, అభినవ గుప్తుడు, భట్టలోల్లఠుడు,భట్ట నాయకుడు మొదలైన ఆలంకారికులు, నాటకకారులు, భావ కవులు, అభ్యుదయ కవులు, తెలుగు భాషాసాహిత్య చరిత్రకారులు వందలాది మంది మనసులో నిరంతరం మెదల సాగినారు.
ఆ మహోన్నత సాహిత్య మూర్తులను ఇంటా బయటా స్పృశిస్తూనే, ఒకవైపు పద్యాలు అల్లుతా, అవధాన మిత్రులతో కలిసి అవధాన విద్యను అభ్యాసం చేస్తా ఉండాను. మరొక వైపు గేయ రచన సాగిస్తా ఉండాను. ఇంకొక వైపు కథలు రాస్తా ఉండాను. అందులో భాగంగా, ఆశావాది సూచించినట్లు తెలుపుతా, హైదరాబాదు నుంచి నిమ్నజాతి రచయితల మహాసభలు నిర్వహించే నిర్వాహకులు, తమ సంకలనం కోసం పద్యాలు రాసి పంపమని కోరడంతో రాసి పంపినాను. వాళ్లు నా పద్యాలన్నీ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలియజేసినారు. ఆ విషయాన్ని నా అవధాని మిత్రులకు చెప్పగానే వాళ్ళు నన్ను విమర్శించినారు. నిమ్న జాతులంటే మాదిగ మాలలని, నీ పద్యాలు వాళ్లు వేసే సంకలనంలో వేస్తే, నిన్ను సాహిత్య లోకమంతా దళితునిగా అంటే మాదిగ గాను మాలగాను భావిస్తుందని, కాబట్టి ఆ పద్యాలను వేసుకోవద్దంటూ వెంటనే జాబు రాయమని సలహా ఇచ్చినారు. ఈ దేశంలో దళిత బహుజనులు అందరూ నిమ్న జాతి వారేనని, నన్ను లోకం మాదిగగా మాలగా అనుకున్నా పర్వాలేదని నేను చెప్పడంతో వాళ్లు నోరు మూసుకుండారు.
ఆ మధ్యలో వొగ మంచి కవితా వస్తువు మనసుకు తట్టింది. ఒక తాగుబోతు తన విలాసాలకై సంసారాన్ని నాశనం చేసుకుంటాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. మద్యపాన వ్యసనానికి బానిసగా మారి, వాడొకనాడు సురా పానశాల దగ్గర దీనంగా దేవురిస్తా ఉంటాడు. అది గమనించిన వాని స్నేహితుడొకడు వానిని పక్కకు పిలుచుకొని పోయి, నీ దీనావస్థను చూడలేకున్నాను రా, నువ్వు నాకు ఇవ్వవలసిన బాకీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, నాలుగు చుక్కలు సారాయి నీళ్ల కోసం నువ్వు ఇంత దీనంగా దేవురించుకుంటా ఉండటం చాలా బాధగా ఉంది రా, ఈ దురవస్థ నుండి నువ్వు బయట పడాలంటే నేనొక ఉపాయం చెప్పుతాను విను, ఎందుకూ పనికిరాని చేతగానిదైన నీ తల్లిని చంపి ఆమె గుండెను వేకువ సమయం లోపల తెచ్చి నా చేతికిస్తే, నిన్ను రుణ విముక్తున్ని చేయడమే కాకుండా ప్రతిరోజూ నీకు కావల్సినంత సురను అందిస్తాను అని సలహా ఇస్తాడు. అది విని వాడు అత్యుత్సాహముతో తన ఇంటికి వెళ్లి, తన కోసం బిచ్చమెత్తి, కాసింత కవళాన్ని కొంగులో కట్టుకొని తనకోసం ఎదురుచూస్తున్న తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపి, రక్తమోడుతున్న ఆమె గుండెకాయను చేతులో పట్టుకొని, సమయం మించిపోతుందని మిత్రుని దగ్గరికి ఆత్రంగా బయలుదేరుతాడు. అప్పుడు ఆ తల్లి గుండెకాయ, “జాగ్రత్త నాయనా! నా రక్తం చేత దారి అంతా బురదగా మారింది. ఆత్రంగా పోతూ జారి పడేవు, జాగ్రత్తగా వెళ్ళు నాయనా!” అని హితోపదేశం చేస్తుంది.
ఈ హృదయ విదారకమైన కవితా వస్తువుని తీసుకొని ‘మాతృప్రేమ’ శీర్షికతో 30 పద్యాలను రాసినాను. పద్యాల నడక చక్కగా తృప్తిగా సాగింది. రెండు మూడు రోజులు ఆ పద్యాలను మాటిమాటికీ చదువుకొని తృప్తి చెంది భారతి పత్రికకు పంపినాను. అట్లే అనంతపురం కాలేజీ తెలుగు లెక్చరర్ గంగప్ప గారు రేడియోలో, రామరాజు గారి నాటక విమర్శ ప్రసంగం చేయగా విని ఆ ప్రేరణతో మూడు రోజులు గట్టిగా కూర్చొని, ‘రక్తసంతర్పణ’ శీర్షికతో వొగ రేడియో నాటికను రాసి విజయవాడ రేడియో కేంద్రానికి పంపినాను.
విద్వాన్ ఫైనల్ పరీక్షలు దగ్గరికి వస్తా ఉండాయి. మా బ్యాచ్ విద్యార్థులందరూ శివ గౌడ్, ఆచారి, నేను మా ముగ్గురిలో ఒకరి చేత కాలేజీలో అష్టావధానం చేయించాలని, ఎవరు చేస్తారో మీరే ముగ్గురూ మాట్లాడుకొని, ఒకరి పేరు చెప్పండని, నిర్ణయం మాకే వొదిలేసినారు. చదువుతున్న కాలేజీలో అవధానం చేయడానికి ముగ్గురికి ఇష్టమే! అయితే, ఒక్కడే కదా చేయవలసింది! పోటీపడి మిత్రులం, భేదాభిప్రాయాలు తెచ్చుకోవడం ఎందుకని, నేను అవధానం చేయనని పోటీ నుండి విరమించుకుండాను. వాళ్ళిద్దరూ నేనంటే నేను అని గట్టిగా పట్టుబట్టినారు. నేను శివగౌడును సమర్ధించినాను. చివరికి శివగౌడ్ అవధానమే ఖరారయింది. అవధానం రేపనగా, ముందు రోజు ఇంటర్వెల్ సమయంలో మా క్లాస్‌మీట్ లీలావతి నా దగ్గరికి వచ్చి, “ మీరెందుకు పోటీ నుంచి విరమించుకున్నారు? మీరే చేయొచ్చు కదా! మీరే అవధానం చేస్తారని ఆశపడ్డాను! రేడియోలో మీ సమస్యా పూరణలు చాలా విన్నాను! మీరు పోటీ నుంచి విరమించుకోవడం మా అమ్మాయిలకు ఎవరికీ ఇష్టం లేదు” అని మెల్లగా చెప్పింది. నేను కరిగిపోయినాను. “పోటీపడి స్నేహాలను చెడుపుకోవడం నాకు ఇష్టం లేదండీ, మీ అభిప్రాయానికీ అభిమానానికీ ధన్యవాదాలు” అని ఆమె ముఖములోకి చూస్తా చెప్పినాను. “ఏమో నాకైతే చాలా అసంతృప్తిగా ఉంది” అంటా సిగ్గులు చిముకరించింది.అబ్బా,ఆ ముఖంలో ఎంత అద్భుతమైన కాంతి! ఆ సిగ్గుల్లో ఎన్ని మనోహరాలు! ఆ కళ్ళల్లో ఎన్ని అగాధాలు!
మనసు చెదిరిపోయింది. అవధానం నేను చేసి ఉంటే బాగుండేది కదా, నేనే చేస్తానని నాగసిద్ధారెడ్డి సార్ తో ఒక మాట చెప్పి ఉంటే, ఆ చాన్స్ నాకే వచ్చేది కదా, ఎంత పొరపాటు చేసినాను, లీలావతికి ఎంత అసంతృప్తి కలిగించినాను, అని అనుకుంటా లీలావతిని తలుచుకోసాగినాను
లీలావతిని సంవత్సర కాలం నుంచి గమనిస్తానే ఉండాను. మనిషి నాజూకుగా ఎంత సొగసుగా ఉంటుందో, అంతే గంభీరంగా ఉంటుంది! ఎప్పుడూ కాలేజీకి ఒంటరిగా చాలా సభ్యతగా వస్తాది! ఎవరితోనా ఎక్కువగా మాట్లాడదు! నాలుగైదు నెలల నుంచి ఆమె డీసెన్సీ నన్ను ఆకర్షించ సాగింది! స్త్రీ అట్ల ఉండడం నాకు చాలా ఇష్టం! ఆమె డీసెన్సీకి ముగ్ధుణ్ణయి నాలుగైదు సార్లు ఆమెను ఫాలో అయినాను. అయినానే గానీ, ఎప్పుడూ దగ్గిందీ లేదు! తుమ్మిందీ లేదు! నేను వస్తున్నానని సంకేతాలు తెలిపిందీ లేదు! ఆమె కూడా అంతే! ఏనాడూ వెనక్కి తిరిగి చూడలేదు!మెయిన్ రోడ్లో నుంచి వాళ్లింటి సందులోకి తిరిగేటప్పుడు ఒక్క క్షణకాలం పక్కకు తిరిగి చూడడం గమనించినాను! ఆ చూడడంలో ఎంతో డిగ్నిటీ కనిపించింది!ఆ హుందాతనమే నన్ను ఆకర్షించింది! ఆ ఆకర్షణతో, ఒకటి రెండుసార్లు మనసులో అనుకుండాను, ఆమె ఎక్కడుంటాదో తెలుసుకోవాలని! వెంటనే ఛీఛీ, అంత చీప్‌గా బిహేవ్ చేస్తే ఆమె నా గురించి చెడ్డగా అనుకోదా? అనుకుంటే ఎంత నామోషి! ఆమె మనసులో నామీద చెడ్డ అభిప్రాయం కలిగితే ఎంత కష్టం! ఒక మగవాని మీద స్త్రీలో దురభిప్రాయం ఏర్పడితే ఆమె అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడదు కదా! ఆమె మనస్తత్వానికి భిన్నంగా నేను వ్యవహరించి, ఆమె దృష్టిలో నేనై నేను చులకన కావడం ఎందుకు? వద్దు వద్దు ఆమెను ఫాలో కావడం మంచి పద్ధతి కాదు అని గట్టిగా నిర్ణయించుకుండాను.
మా క్లాసులో దాదాపు 150 మంది విద్యార్థులు ఉండారు. మా క్లాస్ రూమ్ ఒక చిన్న హాలు మాదిరి ఉంటాది. బెంచీడెస్కులు అన్నీ మూడు వరసల్లో ఉంటాయి. నేను, దక్షిణం గోడవారగా ఉన్న వరుసలో, మూడో బెంచీడెస్కులో ఎడమవైపు చివరన కూర్చుంటాను. లీలావతి, ఉత్తరం గోడ వారన ఉన్న వరుసలో మూడో బెంచీడెస్కులో కుడివైపు చివరన కూర్చుంటాది. మా బెంచీ డెస్కుల వరుసల మధ్యలో మరొక వరుస బెంచీడెస్కులు ఉంటాయి.
ఒక రెండు నెలల కిందట నేను నా సీట్లో కూర్చొని, డెస్క్ మీద మడిచిన చేతుల్ని కలిపి, ఊదబొడిచి, తలొంచుకొని పాఠం వింటావుండాను.రస సిద్ధాంతాన్ని వివరిస్తున్న పిళ్లైసారు పాఠం, ఆసక్తికరంగా లేదు. వినబుద్ధి కాలేదు. లీలావతి పాఠం వింటావుందో లేదో చూద్దామని, తల ఎడమవైపు వొంచి కుడివైపు ముఖం తిప్పి, అందరి చేతుల కిందున్న సందుల్లో నుంచి చూసినాను.
ఆశ్చర్యం! ఆమె కూడా నా మాదిరే తల వొంచి చూస్తా ఉంది! ఎప్పటినుంచి చూస్తా వుందో ఏమో, నేను తన ముఖం వైపు చూడగానే గమనించి, ఒక విజయదరహాసంతో, సిగ్గు సొగసులను గుమ్మరిస్తా తల పైకెత్తుకుంది. నేను పరవశించి పోతా, అట్లే చూడ సాగినాను. నేను చూస్తా వుండానో లేదో అని మూడు నాలుగు సార్లు చూసి సిగ్గుపడతా, తల తిప్పుకొని, ఎదమీది పైటను సర్దుకోసాగింది. నేను తల పైకెత్తకుండా తమకంతో అట్లే చూడ సాగినాను. ఆమె గుడకా చివరికి నా మాదిరే, తల పైకెత్తకుండా నన్ను చూస్తా, సిగ్గుల చిరునవ్వుల్ని వెదజల్ల సాగింది.పరవశించిపోతా నేనూ చిరునవ్వుతో ఆమెను చూడసాగినాను.
అట్ల మొదలైన మా చూపుల చిరునవ్వుల కలయిక, రోజురోజుకూ సాంద్రమయ్యింది! కాలేజీ వదలగానే ఆమె వెళ్ళిపోతాది! వెళ్ళిపోతా కాలేజ్ గేటు దగ్గర చాలా సభ్యతగా తలతిప్పి ఒకసారి వెనక్కి చూస్తాది! నేను తనను ఫాలో అయితా ఉండానో లేదో చాలా డీసెంట్‌గా గమనిస్తాది! నేనూ డీసెంట్‌గా ఫాలో అవుతాను! ఆమె వెనక్కి తిరిగి చూడదు! నేను వికారాలు ఏవీ చేయను! ఆమె, రోడ్డు నుంచి తమ ఇంటి సందు వైపు తిరిగినప్పుడు మాత్రం ఒక్కసారి తల తిప్పి నన్ను చూస్తాది! అంతకన్నా ఆమె ఏ సంకేతాలు చేయదు! నేను అంతకుమించి ఒక స్టెప్పు ముందుకు వేయను! ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయనప్పుడు నేనెందుకు చెయ్యల్ల? మా వ్యవహారం ఎంత మాత్రమే అయినా, ఆమె నా వైపు చూడని రోజు, కాలేజీలో కనిపించని రోజు నా ప్రాణాలు తండ్లాడుతాయి! ఆ రోజంతా ఏ పని చేయడానికీ మనసొప్పదు!
ఇదంతా మిత్రుడు శివగౌట్ ఎట్లా గమనించినాడో తెలియదు గానీ, ఒకరోజు “ఏమప్పా, నీ మూగ ప్రేమ ఎంతవరకు వచ్చింది? నీ ప్రేమ మూర్తి లీలావతి ఏమంటుంది?” అని డైరెక్ట్ గా అడిగినాడు. నేను కొంచెం ఇబ్బంది పడతా, “అట్లాంటిదేమీ లేదు గౌడ్” అని మాటలు దాటవేసినాను. “నా దగ్గర దాపరికం ఎందుకు శాంతీ? ఈ విషయం నాకే కాదు, కొంతమంది మిత్రులు గుడకా పసిగట్టినార్లే! నీ అంతకు నీవు, ఆమె అంతకు ఆమె, ఒకరికొకరు చిరునవ్వులు చిందించుకుంటా మూగగా ఆరాధన భావంతో చూసుకుంటా ఉంటే, మీ ప్రేమ సఫలం అయ్యేదెప్పుడు శాంతీ? ఎవరో ఒకరు బయటపడల్ల! మనసు విప్పి మాట్లాడల్ల! ఇద్దరూ ఎక్కడో ఒకచోట కలుసుకొని మాట్లాడుకుంటే కదా, మీ అభిప్రాయాలు పరస్పరం అర్థమయ్యేది! లీలావతి చాలా డీసెంట్ లేడీ అని చాలామంది అనుకుంటా వుంటారు!నీ ఆరాధన భావం నాకు తెలిసినంక నేను ఆమెను గమనించినాను! వెరీ నైస్ లేడీ! మన వాళ్ళు ఐదారు మంది ఆమెకు లైన్లు వేయడానికి చూసి చివాట్లు తిన్నారని తెలిసింది! నీ మనస్తత్వానికి సరైన జోడీ! ఆలస్యం చేయకుండా ఆమెతో మాట్లాడేందుకు ధైర్యం చెయ్! ఇంకేముంది, అయిదారు వారాలకు అకడమిక్ ఇయర్ అయిపోతాది! ఆ తర్వాత పరీక్షలు! సో, బెస్ట్ ఆఫ్ లక్” అని చెప్పి వెళ్లిపోయినాడు. నాలో ఏవేవో ఆలోచనలు ముసురుకుండాయి.
తానొక్కడే కాదు చాలామంది మిత్రులు లీలావతిని, తన మాదిరే చాలా డీసెంట్ లేడి అని గుర్తించినారంట! ఎవరో కొంతమంది ఆమె వెంటపడి చీవాట్లు తిన్నారంట! ఎవరో ఆ ప్రబుద్ధులు? అతగాళ్లు, ఎప్పుడూ అయిదారు మంది బాయ్ ఫ్రెండ్స్‌తో తిరిగే జనాభాయి, లక్ష్మీదేవి మాదిరే లీలావతి గుడకా ఉంటాదని అనుకుండారేమో! తన లీలావతి అతగాళ్లకు బాగానే బుద్ధి చెప్పినట్లుంది! అందుకే కదా, తాను ఆమెను ఆరాధిస్తున్నది! అయితే గౌడ్ చెప్పినట్ల, ఎన్నాళ్లీ మూగ ప్రేమ? ధైర్యం చేసి,కలిసి మాట్లాడకపోతే, తన మనస్సు ఆమెకూ ఆమె మనస్సు తనకూ తెలిసేదెట్ల?
అయితే ఆమెను కలుసుకుండేదెట్ల? కలుసుకోవల్లంటే ఫాలో కావల్సిందేకదా! ఫాలో అయితే ఆమె ఏమనుకుంటాదో! కథ అడ్డం తిరిగి, ఆమె తననూ చీవాట్లు పెడితే అప్పుడు తన పరిస్థితి యేమిటి?ఆ అవమానాన్ని తాను భరించగలడా? అయినా తాను ధైర్యం చేసి ఫాలో అయితే ఆమె నన్ను చీవాట్లు పెడుతుందా? ప్రతిరోజూ తనను చూసి సిగ్గులు పోతా, చిరునవ్వులు చిందించే లీలావతి తననెందుకు చీవాట్లు పెడుతుంది? పెడుతుందని అనవసరంగా తానెందుకు అపోహపడల్ల? అయినా కలుసుకొని పలకరించడానికి తానే యెందుకు ముందుగా ప్రయత్నించల్ల? తనను మూగగా ఆరాధిస్తున్నప్పుడు ఆమె గుడకా తనను కలుసుకోడానికి ఉబలాట పడల్లకదా! అటువంటి ప్రయత్నం ఆమెలో తనకెప్పుడూ కనిపించలేదే? మరిప్పుడు యేమి చేయల్ల?
తనతో పాటు విద్వాన్ చదువుకొని,తనను మూగగా ఆరాధించిన ఆ గంభీరమూర్తి,ఆ ఉన్నత సంస్కారవతి, ఆ అపురూప సౌందర్య మనస్వి, లలిత మిత వచస్వి, తనకు జీవిత భాగస్వామిని అయితే తన అదృష్టం పండినట్లేకదా! మరి తన ఆశ సఫలమయితాదో విఫలమయితాదో!
ఒక రోజంతా ఆలోచన చేసి, రెండవరోజు ఆమెతో ఎలాగయినా మాట్లాడల్లని నిర్ణయించుకొని కాలేజికి పోయినాను. ఆమె రాలేదు.మూడు రోజుల తర్వాత వొచ్చింది. సాయంత్రం కాలేజీ వొదిలినారు. ఆమెను ఫాలో అయి దగ్గరగా పోయినాను.వొళ్లంతా చెమట పట్టింది! నోరు ఆరిపోయింది! మాట పెగల్లేదు! ఆమె రెండు మూడు సార్లు నా వైపు వోరగా చూసి సిగ్గుతో పెదవులు కొరుక్కోసాగిందే కానీ పెదవి విప్పలేదు.
“ఏమిటీ మనిషి?క్లాసులో ప్రతిరోజూ నన్ను చూసి, చిరునవ్వులు వొలకబోసే మనిషి ఇప్పుడొక మాట పలకరించవచ్చు కదా! ఆత్మను చంపుకొని సిగ్గు విడిచి ఇంత దగ్గరగా వొచ్చినా పల్లెత్తు మాట మాట్లాడదే?మాట్లాడితే నోటిముత్యాలు రాలిపోతాయా?” నన్ను నేను ప్రశ్నించుకుండాను.
తర్వాత ఆ మాదిరిగానే మూడు సార్లు ప్రయత్నించినాను.కానీ మాట్లాడించడానికి ధైర్యం రాలేదు.ఆమె వాలకాన్ని చూసి మనసొప్పలేదు.
“ప్రతిసారీ మాట్లాడించడానికి నువ్వు వెంపర్లాడుతావుండావే గానీ ఆమె నీ మాదిరి ఆరాటపడిందా? నువ్వే ఎందుకు అంతగా దిగజారల్ల? పరీక్షలు దగ్గరికి వొస్తావుండాయి! నీకు చదువు ముఖ్యమా ఆమె వెంట పడడం ముఖ్యమా? నీ లక్ష్యాన్ని మరిచిపోయినావా?” అంతరాత్మ నిలదీసింది.
రెండు రోజులు సీరియస్ గా ఆలోచన చేసి,నాలోని స్త్రీ వ్యామోహాన్ని నిందించుకుంటా, మనసును పూర్తీ కట్టడి చేసుకుండాను.
***
విద్వాన్ ఫైనల్ పరీక్షలు అయిపోయినాయి. ఒక్క భాషా శాస్త్రం పేపర్ తప్ప అన్ని పరీక్షలూ తృప్తిగానే రాసినాను. భాషా శాస్త్రం పేపర్ గుడకా ఒక రకంగా రాసినాను. మొత్తం పైన ఫస్ట్ క్లాస్ రాకపోయినా సెకండ్ క్లాస్ తప్పకుండా వస్తాదన్న ధైర్యం కలిగింది. నాలుగు సంవత్సరాల తిరుపతి ఓరియంటల్ కాలేజీ జీవితంలో పడిన కష్టాలకూ కడగండ్లకూ అనుభవాలకూ అనుభూతులకూ మర్చిపోలేని సంఘటనలకూ ఆ వీధులకూ బజారులకూ ఆ మనుషులకూ కేట్లీ టీకొట్టులకూ సినిమా హాళ్ళకూ శేషాచలం కొండలకూ చాలా దినాలు అన్నం పెట్టి ఆకలి తీర్చిన గోవిందరాజ స్వామి దేవాలయానికీ మా పాత కొత్త ఓరియంటల్ కాలేజీలకూ విశ్వవిద్యాలయ సౌందర్యాలకూ చివరికి మా గురువులకూ నమస్సులు అర్పించి, వీడ్కోలు పలికి, ముటా ముల్లె సర్దుకుని అనంతపురానికి బయలుదేరినాను.
మధురమైన అనుభూతులేవీ పొందకపోయినా ఆ ప్రాంతంతో నాలుగు సంవత్సరాలుగా ముడి వేసుకున్న బంధాలను తెంచుకొని బయలుదేరుతా ఉంటే మనసులోని తడి నిశ్శబ్దంగా జివజివ లాడింది. హృదయాంతరాళాల్లో ఎక్కడో లోపల మాటలకందని మర్లు, ఏదో మూగ వేదన పొందసాగింది. అక్కడే ఉండాలని అనుకున్నా నాదన్నది ఏదీ లేదని, ఉన్నా అందుకోలేనని, అందినా అబ్బదని, బలవంతంగా మనసును పుట్టిన నేలవైపు మళ్లించి వికారమైన మనసుతో ఊరు చేరుకొని,పరీక్షల ఫలితాలొచ్చే వరకూ తప్పదనుకొని, శ్రమజీవులలో వొకనిగా మారి చెమట బిందువులను ఆస్వాదించసాగినాను.
***
వేసవి తీవ్రంగా ఉంది. నేను తిరుపతి నుంచి వొచ్చిన వారం దినాలకే మాగాణిలో వరిమళ్ల కోతలన్నీ అయిపోయినాయి. మడి కోతలు ప్రారంభం కాకముందే, పరీక్షలన్నీ అయిపోయినా నేను అదే పనిగా రాలేదని నాయన నన్ను దండించినాడు. నేను పని దొంగనని నాయన ఆరోపణ. నేను నాగభూషణం శెట్టిని పిలుచుకొని వచ్చి, హాల్ టికెట్ చూపించి, పరీక్షలు ఎప్పుడు ప్రారంభమైనాయో నాయనకు వివరించమన్నాను. అతడు వాస్తవం చెప్పి, “యే పరీక్షల కోసం తిరుపతిలో నాలుగేండ్లు చదివినాడో ఆ పరీక్షల్ని వొదిలేసి నారాయణ మడి కోతలు పనికి యెట్లొస్తాడని అనుకుండావు మామా” అని నిలదీసినాడు. దాంతో నాయన ఏమీ మాట్లాడలేకపోయినాడు. చదువుల విలువ తెలియక పోవడం వల్ల నాయనకు నా పరిస్థితిని మరొకరి ద్వారా చెప్పించడం చాలా బాధ కలిగించింది. దానికంటే, నా నిజాయితీని నాయన అనుమానించడం మరింత కుంగదీసింది. దీనికంతా కారణం అంతులేని పేదరికమేనని నన్ను నేను సముదాయించుకుంటా, పరీక్షల ఫలితాలొచ్చే లోపల ఏమి చేయల్లనో తెలుసుకోవాలని గురువుగారిని కలుసుకుండాను. ఆయన సూచన ప్రకారం, అనంతపురానికి పోయి, విద్వాన్ ఫైనల్ పరీక్షలు రాసినట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసినాను.
ఊరి దగ్గర కూలి పనులు గానీ ఇంటి పనులు గానీ ఏమీ లేవు. విద్వాన్ పరీక్షా ఫలితాలు రావడానికి ఇంకా కొంచెం టైం పట్టవచ్చునని, ఈ లోగా ఏదైనా ఒక మంచి కథ రాయాలని నిర్ణయించుకొని రెండు మూడు రోజులు ఆలోచన చేసినాను. మంచాల వీధిలో నాకోసరం ఆశపడి నిరాశతో నన్ను ఈసడించిన మా పక్కింటి పేదమ్మాయి భగ్న ప్రేమను ఊహించుకొని “సుప్త భుజంగాలు” పేరుతో ఒక కథ రాసినాను.
బిచ్చగాళ్ళు కూడా కులాన్ని చూస్తారా?
ప్రతిరోజూ సాయంకాలం పూట ఊరి మిత్రులతో కలిసి రోడ్లోకి వాకింగ్ వెళ్లడం అలవాటయింది. దాన్ని వాకింగ్ అనడం కంటే మిత్రులతో కాలక్షేపం చేయడం అనొచ్చు. తిరుపాలు, కుల్లాయప్ప,నాగభూషణం, ఓబుల నారాయణ ఇంకా ఇద్దరు ముగ్గురు చదువుకున్న మిత్రులందరమూ రకరకాల విషయాలపైన చర్చించుకుంటా, వాదోపవాదాలు చేసుకుంటా ఉంటాం. కోనయ్య వొచ్చినప్పుడు మా మాటలు కొంచెం రసవత్తరంగా సాగుతాయి.నాగభూషణం, తిరుపాలూ కోనయ్యా ఇంగ్లీషు చదువులు చదివిన తమకు చాలా విషయాలు తెలుసన్నట్లు ఫోజులు పెడతా ఉంటారు. నేను సాహిత్యం చదువుకోవడం వల్ల ఆయా కాలాల సామాజిక చారిత్రక విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాను. ఎన్ని సామాజికాంశాలు ప్రస్తావించినా నా చదువు వాళ్ళ చదువులకన్నా తక్కువ అని వాళ్ళ అభిప్రాయం. అది వ్యక్తం చేసినప్పుడు నేను ఖండిస్తూ ఉంటాను. కులాలూ మత భావనలూ కొంతమంది స్వార్థపరులైన అగ్రకులాల వాళ్ళు తమ ఆధిక్యత కోసరం, కష్టపడకుండా బతకడం కోసరం కల్పించినవే అని నేను గట్టిగా మాట్లాడినప్పుడు వైశ్య మిత్రులందరూ నాతో వాదులాడుతారు.కొన్ని సందర్భాలలో ఆ మిత్రులందరూ నాతో మాట్లాడరు.చాలా విషయాలలో కోనయ్య నన్ను బలపరుస్తాడు.
నిన్న సాయంకాలం నేనూ కోనయ్యా రోడ్లోకి వాకింగ్ పోయే సందర్భంలో ఒక చిన్న సంఘటన జరిగింది. తాడిపత్రి-అనంతపురం రోడ్లో నుంచి మా ఊర్లోకి తిరిగే మట్టిరోడ్డు పక్కన ఒక సత్రమూ, సత్రానికి తూర్పు వైపున అశ్వత్థం కట్టా ఉండాయని ఇంతకుముందు తెలిపినాను కదా! ఆ సత్రంలో మూడు నాలుగు బిచ్చగాళ్ల కుటుంబాలు దిగినాయి.ఆ సత్రానికి కొంచెం ఎడంగా, మా ఊరగొండ దడిలో టెంకాయ నీళ్ల వంటి కమ్మని నీటి చలమ గుడకా ఉందని ఇంతకు ముందు తెలిపినాను. సెలవులకు ఊరికొచ్చినప్పుడు, నేను అప్పుడప్పుడు ఆ చలమనీళ్లు తాగుతా ఉంటాను.
చెలమకు ఎదురుగా ఉండే ఎలకంటి చిన్న పాపయ్యోళ్ళ బీటిచేనులో కొంతమంది ఎరుకల వాళ్ళు గుడారాలేసుకొని వుండారు.ఆ గుడారాల ఆడోళ్ళు, తపెలలు తీసుకొని వొచ్చి చెలమలో నీళ్లు నించుకుంటా ఉండారు. సత్రంలో ఉన్న బిచ్చగాళ్లిద్దరు వచ్చి, ఎరికలోళ్లూ మాదిగా మాలోళ్లూ ఈ చెలమలోకి దిగి నీళ్ళు ముంచుకోగూడదని అడ్డుకో సాగినారు. దాంతో వాళ్ల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. నేనూ కోనయ్యా వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకొని విస్తుపోతా, సత్రంలో ఉండే వాళ్లను మందలించినాం. “మా ఊర్లో ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకొని బతికే మీరు, కులం పేరుతో ఎరుకల వాళ్లను చెలమ దగ్గరికి రావొద్దని అడ్డుకోవడం ఏమిటి? ఇంతకూ మీరు ఏ కులం వాళ్లు? బిచ్చగాళ్లకు కులం ఏమిటయ్యా? మా ఊరోళ్లకు లేని కులం పట్టింపులు మీకెందుకు? మీ కులం పైన మీకంత గౌరవం ఉన్నప్పుడు, బిచ్చం అడిగే సమయంలో మీకు కులం కనిపించదా?” అని తగులుకుండాం. “మేము కాపులం సార్! కాపుదనమోల్ల ఇండ్ల కాటికి మాత్రమే పోయి అడుక్కుంటామయ్యా! ఈ ఎరికలోల్లు ఎంగిలి చేసిండే నీల్లు మీరు తాగుతారేమయ్యా” అని మమ్మల్ని ప్రశ్నించినారు. వాళ్ల సమాధానం విని ఆశ్చర్యపోతా, నేను చెలమలో నీళ్లు దోసిట్లోకి తీసుకొని తాగి, వాళ్ల కంపం విడిపించినాను. మా ఊరోళ్లు గుడకా వాళ్లను మందలించినారు.
రాత్రంతా సమాజంలోని నిచ్చెన మెట్ల కుల దురహంకారాన్ని గురించే ఆలోచన చేసినాను. ఎంత ఆలోచన చేసినా కుల జాడ్యానికి తగిన మందు కనిపించలేదు. చివరికి వీటికంతా పరిష్కారం, రచనల ద్వారా మనుషులను చైతన్యపరచడమే అనుకొని ఒక నాటికకు ఆ రాత్రే మనసులో స్కెచ్ వేసుకుండడాను.నాలుగు దినాలకు నాటిక తయారయింది. రెండుసార్లు కొట్టి వేసి తిరిగి రాసి ‘నిచ్చెనమెట్ల మనుషులు’ అని పేరు పెట్టి మూడు నాలుగు సార్లు చదువుకొని, ప్రస్తుతం రేడియోలో ప్రసారమవుతున్న ఏ నాటికకూ తీసిపోదన్న విశ్వాసంతో విజయవాడప రేడియో స్టేషన్‌కు పంపినాను.
విద్వాన్ పరీక్షా ఫలితాలు-అసంతృప్తిలో కొంత సంతృప్తి!
నాగసిద్దారెడ్డి సార్ రాసిన ఉత్తరాన్ని బట్టి జూన్ నెలాఖరులో విద్వాన్ ఫైనల్ ఫలితాలొస్తాయని ఎదురుచూడ సాగినాను. నాలుగైదు రోజుల నుంచి మనసులో ఏవో తెలియని భయాందోళనలు చోటు చేసుకోసాగినాయి.భయం కలిగినప్పుడల్లా అంతరాత్మ మేల్కొని ఎందుకట్ల భయపడతావు? నువ్వు పాస్ కాకపోతే నీ క్లాస్‌లో ఎవరు పాసయితారు? అని మనసుకు ధైర్యం చెప్పసాగింది. నిజమే, నేను పాస్ కాకపోవడం ఏమిటి?భూమ్యాకాశాలు ఏకమయినా అయిట్ల జరగదులే అని ధైర్యం తెచ్చుకో సాగినాను.
జూన్ వెళ్లిపోయింది.విద్వాన్ ఫలితాలు తప్పకుండా వస్తాయని అనిపించడంతో శింగనమలకు బయలుదేరినాను.ఆశ్చర్యంగా మడికట్లల్లో కట్టెలమోపు ఎదురైంది. మాగాణి దారిలో కట్టెలమోపు రావడం ఏమిటి? ఏదైనా కీడు జరుగుతుందా? విద్వాన్ ఫెయిల్ అయితానా? అయినా కట్టెలమోపు ఎదురుకావడానికీ పరీక్ష ఫలితాలకూ సంబంధం ఏమిటి? కుటుంబమంతా సీతంపల్లికి బయలుదేరినప్పుడు గుడకా కట్టెలమోపు ఎదురైంది. ఎదురైనందువల్ల కొత్త నష్టమూ లేదు, లాభమూ లేదు.బతుకుబండి నడకలో కొత్త ఇబ్బందులేవీ కలగలేదు.ఇంకా చెప్పల్లంటే వెనకటి జీవితం కంటే సీతంపల్లిలోని జీవితమే కొంత మెరుగని అనుకోవచ్చు. ఇంకా, విద్వాన్ చేరడానికి బయలుదేరినప్పుడూ ఆదోనిలో ఉద్యోగంలో చేరడానికి ప్రయాణమైనప్పుడూ ఎవరో తుమ్మినారు కదా, పిల్లులు రెండు కాట్లాడుకుంటా వొచ్చి, కాళ్లను తాకినాయి కదా, అయినా కొత్త కష్టాలమీ కలగలేదే అని అనుకుంటా సింగనమల చేరుకుండాను. “పేపర్లో మీ రిజల్ట్స్ వేసినారు, నంబరెంత రా?” అని అడిగినాడు హెడ్మాస్టర్ సార్. “784” అని చెప్పినాను.వెంటనే సార్, ఆంధ్రప్రభ దినపత్రికను చూసి, “ఫస్ట్ క్లాస్‌లో ఇద్దరే పాసయినార్రా, అందులో నీ నంబర్లేదు” అని అట్లే చూసి, “సెకండ్ క్లాస్‌లో పాసయినావు రా” అని పేపర్ చూపించినాడు. “నీకు ఫస్ట్ క్లాస్ వస్తాదనుకున్నాను రా, ఫస్ట్ క్లాస్ లో పాసయిండేది ఇద్దరే! వాళ్ళు చాలా బ్రిలియంట్స్ అయ్యుంటారు.దీన్ని బట్టి చూస్తా వుంటే, విద్వాన్ చాలా కష్టమైన కొర్సే అనుకుంటాను. పోనీలేరా,అన్ని కష్టాల్లోనూ సెకండ్ క్లాస్ తెచ్చుకున్నావంటే చాలా గ్రేటే! ఇంక రెండు మూడు రోజుల్లో తిరుపతికి పోయి, తొందరగా పాస్ సర్టిఫికెట్ తెచ్చుకో! వెంటనే ఉద్యోగానికి అప్లై చేద్దాం” అని సంతోషపడతా చెప్పినాడు హెడ్మాస్టర్ సార్. తల్లి లాంటి జయమ్మక్క మురిసిపోతా స్వీట్ చేసి పెట్టింది.
నేను హై స్కూలుకు పోయి మా టీచర్లందరికీ విషయం చెప్పి, సంతోషంగా కాఫీలు తెప్పించినాను. అందరూ ప్రేమతో ఆశీర్వదించినారు. తొందరగా తిరుపతికి పోయి, టీసీ విద్వాన్ పాస్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే, ఎంప్లయ్‌మెంట్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించి, ఆ నంబర్ కనబరుస్తా తెలుగు పండిట్ ఉద్యోగం కోసం అప్లై చేసుకుంటే, జులై ఆఖరుకల్లా పోస్టింగ్స్ ఇస్తారని చెప్పి హెడ్మాస్టర్ సార్ తొందరపెట్టినాడు. నాకంటే గురువుగారికే, నన్ను తెలుగు పండిట్‌గా చూడల్లని, నేను చదివిన శింగనమల హైస్కూల్లోనే, తాను చదివించిన విద్యార్థిని తన సహాధ్యాపకునిగా నన్ను సమాజానికి చూపించి ఆనందించల్లని అభిలాష. అందుకే తొందర చేసినాడు. నేను కోరుకుంటా ఉండేదీ అదే! అందుకే ఇంట్లో అమ్మానాయన, పనుల కాలం ఒక పది దినాలు నేను కూలి పనులకు పోతే ముప్పై నలభై రుపాయలు కూలి డబ్బులు వస్తాయని గొణుగుతా ఉండినా అదేమీ పట్టించుకోకుండా తిరుపతికి పోవడానికి నిర్ణయించుకుండాను. అయితే తిరుపతికి పోయి రావల్లంటే ముప్పై నలభై రుపాయలు ఖర్చయితాది. అదే డబ్బులతో రెండు జతల బట్టలు కుట్టించుకోవచ్చు కదా అని మనసు తండ్లాడింది. ఇప్పుడు బట్టలు కంటే విద్వాన్ పాస్ సర్టిఫికెట్ తెచ్చుకొని, ఉద్యోగం కోసరం జిల్లా పరిషత్తుకు అప్లికేషన్ పెట్టుకోవడమే ముఖ్యం.
వాస్తవానికి విద్వాన్ పాసయితానే పండిట్ ట్రైనింగ్ గుడకా ముగించుకో వల్ల. అది కర్నూలు బిఇడి కాలేజీలో ఐదు నెలల కోర్సు. అది పాసయితేనే తెలుగు పండిట్ పోస్టుకు ఫుల్లీ క్వాలిఫైడ్ అయినట్లు లెక్క! అందుకే విద్వాన్ మిత్రులందరూ వెంటనే పండిట్స్ ట్రైనింగ్ చేయల్లని నిర్ణయించుకుండారు.నేనూ అదే అనుకుండాను. కానీ ఇంటి పరిస్థితులు ఏమీ బాగ లేవు. ఇంకా నా చదువు కోసరం నాయన ఏమాత్రం భరించే స్థితిలో లేడు. గురువుగారిని కూడా ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదనుకుండాను. అందుకే వెంటనే ఉద్యోగంలో చేరి ఐదారు నెలలు పనిచేసి కొంత డబ్బు మిగిలించుకొని, పండిట్స్ ట్రైనింగ్ రెండో బ్యాచ్ లో జనవరిలో చేరి, ఈ ఐదారు నెలల్లో మిగిలించుకున్న డబ్బులతోనే ట్రైనింగ్ ముగించుకోవల్లని, ఇటు ఇంటి వాళ్ళకూ అటు గురువుగారికీ బరువు కాగూడదని గట్టిగా నిర్ణయించుకొని తిరుపతికి బయల్దేరినాను.
తిరుపతిలో అన్నీ సవ్యంగానే జరిగినాయి.ఓరియంటల్ కాలేజిలో టీసీ మరియు కాండక్ట్ సర్టిఫికెట్, యూనివర్సిటీలో విద్వాన్ పాస్ సర్టిఫికెట్ అన్నీ రెండ్రోజుల్లో చేతికొచ్చినాయి.నాతో పాటుండిన సన్నప్ప వాళ్ల రూమూ వాళ్ళ ఆథిత్యమూ ఉండడం వల్ల తక్కువ ఖర్చుతోనే తిరుపతికి వచ్చినపని సునాయాసంగా నెరవేరింది.తిరుపతికి చేరుకున్న రోజు లీలావతి గురించి మనసు కొంచెం ఆరాటపడినా, టీసీ కోసం కాలేజీకి వెళ్లినప్పుడు ఆమె కనిపించినా హృదయం ఉద్విగ్నత చెందలేదు. ఆలోచనంతా ఉద్యోగం మీదనే!
తిరుపతి నుంచి తిరిగొచ్చిన వెంటనే అన్నీ గురువుగారు చెప్పినట్లే చేసినాను. ఎంప్లాయ్మెంట్ ఆఫీసుకు పోయి విద్వాన్ క్వాలిఫికేషన్‌తో పేరు రిజిస్టర్ చేయించి ఎంప్లాయిమెంట్ కార్డు తెచ్చుకుండాను. గురువుగారు నా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కనబరిచి, విద్వాన్ పాస్ సర్టిఫికెట్ నంబర్ వేసి ఉద్యోగానికి అప్లికేషన్ టైప్ చేయించి అనంతపురం జిల్లా పరిషత్తుకు రిజిస్టర్ పోస్టులో పంపినాడు. రెండు మూడు రోజుల్లో వీలు చూసుకొని అనంతపురానికి పోయి జిల్లాపరిషత్ ఛైర్మన్ తరిమెల రామచంద్ర రెడ్డిగారిని కలుసుకొని కుటుంబ విషయాలన్నీ చెప్పిశింగనమల హై స్కూల్ తెలుగు పండిట్‌గా వేయండని రిక్వెస్ట్ చేసుకోమన్నాడు సార్.ఆయన ఇల్లు కోర్టురోడ్డులో ఉంటుందని సూచించినాడు.నాలుగైదు దినాల్లో జిల్లా పరిషత్తుకు పోయి నేను చెబుతానన్నాడు.
నేను మరుసటి దినమే అనంతపురానికి పోయి ఒక తెల్ల పేపర్ మీద నా వివరాలన్నీ తెలుపుతా అభ్యర్థన రాసి, చైర్మన్ రామచంద్రా రెడ్డిగారింటికి పోయినాను. నేను మలేరియా సర్వెలైన్స్ వర్కర్ ట్రైనింగ్ సమయంలో మిత్రుడు బాలన్నతో కలిసి కోర్టురోడ్డుకు పోయినదంతా గుర్తుకొచ్చి, నేరుగా ఆయన ఇంటికి పోయి బయట నిల్చుకుండాను. ఐదు నిమిషాలకు ఆయన లోపల్నుంచి హాల్లోకొచ్చినాడు.ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు! తెల్లని రూపం! తెల్లని ఖద్దరుపంచె మీద జుబ్బా వేసుకొని ఎంత అద్భుతంగా ఉండాడో! నా వైపు చూసి, “ఎవుర్రా పాపోడా? లోపలికి రా” అని పిలిచినాడు.నేను రెండు చేతులెత్తి నమస్కారం చేసి భయం భయంగా మెల్లగా లోపలికి పోయి విషయం చెప్పి ఉద్యోగం దరఖాస్తు పేపర్ చేతికిచ్చినాను. ఆయన దాన్ని పైపైన చూసి, “బండమీదపల్లెలో విద్వాన్ చదువుకున్నోళ్లు వుండారేమిరా? ఎవురి పిల్లోడు నువ్వు?” అని అడిగినాడు చైర్మన్. ఆ అడగడంలో, దర్పం కంటే ఈ ప్రాంతం పట్ల ప్రేమ, చిన్న చిన్న కులాల్లో విద్వాన్ చదువుకున్నోళ్లుండారా అన్న ఆశ్చర్యం, పర్వాలేదే అన్న ఒక సహృదయత నాకు కనిపించినాయి.నేను వినయంగా నా విషయం చెప్పుతూ ఉంటే నా కనుగుడ్ల మీద నీళ్లు పారాడినాయి. ఆయన చిరునవ్వుతో మాట్లాడిస్తా, పేపర్ మీద సంతకం చేసి, “శింగనమలకే వేస్తాను పోరా పాపోడా, ఈ పేపర్ తీసుకొని పోయి జిల్లా పరిషత్తులో డిప్యూటీ సెక్రటరీ ఉంటాడు, నా పేరు చెప్పి అతని చేతికిచ్చి పో! ఏం బాధపడొద్దు! వారం దినాలకల్లా పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాను పో” అని చల్లని మాట అన్నాడు. నాకు ఆ మాటల్లో అమృతం కనిపించింది.నేను సంతోషపడతా, ఆ పేపర్ తీసుకొనిపోయి జిల్లాపరిషత్ ఆఫీసులో ఇచ్చి, నేరుగా శింగనమలకు పోయి హెడ్మాస్టర్ సారోళ్ల ఇంట్లో విషయమంతా చెప్పినాను.మా సార్ జ్వరంతో పండుకొని ఉండాడు. అయినా ఆ స్థితిలో కూడా ఆప్యాయంగా పలకరించి, “నేను జ్వరం తగ్గిపోగానే ఆఫీసుకెళ్లి పర్స్యూ చేస్తానులేరా? నువ్వు చైర్మెన్ గారిని కలిసి రావడం మేలయింది. ఊరికి పోయి ఇంటి దగ్గరే ఉండు” అని ఆశీర్వదించాడు. నేను సాయంకాలానికల్లా ఊరు చేరుకుండాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
