Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-36

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

బ్యాంకుల జాతీయీకరణ వొక విప్లవాత్మక చర్యంట!

జులై నెల రెండు వారాలు గడిచిపోయినా పెద్దగా వర్షాలు పడలేదు. చెరువులోకి పంటకు సరిపోయేటన్ని నీళ్లు రాలేదు. ఏమి రాకపోతే ఇంటి పరిస్థితి యేమయితాదో యేమో! ప్రతి సంవత్సరమూ వర్షాలపైన ఆధారపడిన వాళ్ల బతుకులన్నీ మా మాదిరిగానే దిగులు పడతావుంటాయేమో! మొన్ననే తుంగభద్ర డ్యాము నుండీ హైలెవల్ కెనాలుకు నీళ్లొదిలినారంట! ఇంకొగ వారం దినాలకల్లా అవి పెనకచెర్ల డ్యాముకు చేరుకుంటాయంట! ఈ నెలాఖరుకల్లా కాలువ కిందుండే భూములకు నీళ్లొదులుతారంట! ఆ కాలవ కిందుండే ఆయకట్టోళ్లకు యా దిగులూ వుండదేమో! ఈ చెరువు కిందుండే పెద్దమనుషులందరూ సన్నకారు రైతుల్నీ, కాలీనాలీ జనాన్నీ అతి తెలివితో వూరకనే గబ్బులేపిరి! అతగాళ్లందరూ వొప్పుకోనుంటే, శింగనమల చెరువు మాగాణి గుడకా హైలెవల్ ఆయకట్టుకింద చేరిపొయ్యిండేది! అట్ల చేరిపొయ్యింటే, ఈ పల్లెల్లోని బీదాబిక్కికి ఈ రకమైన దిగులుండేదా? చెరువుకు యెగదాలుండే తుంగభద్రకాలువ మాగాణిలో నుంచీ ‘పులుసు’నీళ్లు దండిగా వొస్తాయని, అట్లొచ్చే ‘ఉద్దరనీళ్లు’ వున్నెప్పుడు మనమెందుకు తుంగభద్ర ఆయకట్టు కిందికి జేరి, దెంగుమాలినంత పన్నుభారం భరించల్ల? అని అతి తెలివి జేసినారు తప్పుడునా కొడుకులు! ఆ హైలెవల్ కాలువ మాగాణిలో నుంచీ పులుసునీళ్లు చెరువులోకి జారొచ్చేదెన్నడు? సకాలంలో వానలు పడక, చెరువులోకి నీళ్లు రాక, ఆ పులుసునీళ్ల కోసరం కాసుకొని చెరువు కింద పంపటలు పెట్టుకుండేదెన్నడు?

పంట పెట్టుకుండే ‘సాయి’ వెళ్లిపోతావుంటే బాధపడతా, జిల్లా పరిషత్ ఛైర్మన్ గారిని కలిసొచ్చి మూడువారాలయినా ఉద్యోగానికి ఆర్డర్స్ రాకపోవడంతో దిగులు పడతా, తోటలుండే పల్లెలకు మా వూరి కూలిజనంతో కలిసి కూలిపనులకు పోతా, మూడునాలుగు రోజులకొక సారి సింగనమలకు పోయి ఉద్యోగం ఆర్డర్స్ గురించి తెలుసుకుంటా దినమొక యుగంగా కాలం గడపసాగినాను. నా వంటి పేదోళ్ల పరిస్థితి ఈ రకంగా వుంటే, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఇందిరమ్మ, ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేసిందని, మధ్యతరగతి రైతులూ, పెద్దరైతులూ, వ్యాపారస్తులూ, రకరకాల కులవృత్తులోళ్లూ సంబరపడి పోతావుండారు. వాళ్లందరూ ఎందుకంతగా సంబరపడతా వుండారో తెలుసుకుండాను.

ప్రయివేట్ వ్యక్తుల ఆధీనంలో నడస్తూ, 50 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లున్న 14 బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేసింది! ప్రజల సంక్షేమం కోసం ఈ బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంకు కనుసన్నల్లో నడుస్తాయి! జాతీయమైన బ్యాంకుల శాఖలు పల్లెలకు విస్తరించి, వ్యవసాయ దారులకూ చిన్న, పెద్ద పరిశ్రమలు పెట్టుకుండే వాళ్కు ఋణాలిస్తాయి! చిన్నచిన్న రైతులకు అందుబాటులో వుంటాయి! వడ్డీవ్యాపారస్తుల ‘బెడద’ తగ్గుతుంది! ధనవంతుల, రాజకీయ నాయకుల పెత్తనం తప్పుతుంది! పెద్దపెద్ద గ్రామాలకంతా బ్యాంకుల శాఖలు విస్తరించడం వల్ల దేశాలు లక్షలాది నిరుద్యోగ విద్యావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి! దేశ గ్రామీణవ్యవస్థ, వ్వవసాయ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది! చిన్న పెద్ద పరిశ్రలు ఎక్కువ సంఖ్యలో పెరిగి లక్షలాదిమంది ప్రజలకు నిరంతరం బతుకుదెరువు కలుగుతుందట!

 అంతా తెలుసుసుకొని, మా వంటి భూమిలేని, ఏ వృత్తీ లేని, కేవలం కూలిపనులు చేసుకొని బతికేవాళ్లకు బ్యాంకుల జాతీయీకరణ వల్ల తక్షణం కలిగే ప్రయోజనాలు ఏమీ లేవని బాధపడుతూనే, కోట్లాది మంది జీవితాలకు వెలుగునిస్తుందని అనుకోసాగినాను. నిజంగా ఇది దేశచరిత్రలో వొక విప్లవాత్మక పరిణామమేనని అందరితో పాటు సంతోష పడుతూ, ఇంత అద్భుతమైన, చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్న ఇందిరాగాంధీ ధైర్యసాహసాలకూ, సామాజిక దృష్టికీ మనసులో జోహార్లు అర్పిస్తూ, ఏ నాటికైనా కొంత భూమి కొని వ్యవసాయం చేసుకున్నప్పుడో, వొక చిన్నపాటి పరిశ్రమ పెట్టుకున్నప్పుడో బ్యాంకుల ఋణసహాయం పొందవచ్చునని ఆశపడుతూ, ఉద్యోగం ఆర్డర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూడసాగినాను.

జాబిల్లి చందమామ మీద మనిషి పాదాలా?

పగలంతా మడిలో పనిచేసి అలిసిపోయి ఇంటికొచ్చినాను. అమ్మయ్య కాచిన వేడి వేడి నీళ్ళు పోసుకొని, సాయంత్రం రేడియో వార్తలు వినడానికి బజార్లోకి పోయి జతగాళ్లతో కలిసి అరుగుమీద కూర్చుండాను. అంతలోనే, ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది, అద్దంకి మన్నార్ అని చదవడం మొదలుపెట్టినాడు. ఈరోజు 20-7-1969 వ తేదీ ప్రపంచ ఖగోళ శాస్త్రంలో ఒక అత్యద్భుతమైన దినం! చల్లని చందమామను జాబిల్లి, వెన్నెలరేడు అని కవులందరూ తమ తమ కావ్య శృంగార వర్ణనలలో యువతుల అందమైన ముఖాలకు ఉపమానంగా చెప్పిన గుండ్రని అందాల చందమామ, హాలాహలం తాగి వేడెక్కిన ఈశ్వరున్ని చల్లబరచడానికి ఆయన జటాజూటం ఎక్కిన చల్లని చందమామ నిజంగా వెన్నెలముద్ద కాదని, అది మన భూగోళం మాదిరే మట్టిమైదానాలూ మట్టి దిబ్బలూ రాళ్లూ రప్పలూ ఉండే ఒక ఉపగ్రహం అనీ, ఈ రోజు మన మానవులిద్దరు చంద్రుని మీద దిగి నడిచి అమెరికా పతాకాన్ని ఎగరవేసి చరిత్రను సృష్టించచినారు. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్జ్ ఆల్డ్రిన్ అనే ఇద్దరు అమెరికా వ్యోమగాములు,అపోలో మిషన్లో అమెరికా నుంచి బయలుదేరి నాలుగు రోజులు ప్రయాణం చేసి సుమారు నాలుగు లక్షల మైళ్ల దూరంలో ఉన్న చంద్రునిపైన మనిషి ప్రత్యక్షంగా కాలు మోపడం అంతరిక్షంలో మానవుడు సాధించిన తొలి విజయం!అందుకే ఈ రోజు ప్రపంచ విజ్ఞానశాస్త్ర రంగంలో ఒక చరిత్రాత్మకమైన దినం!

రేడియోలో వార్త వినగానే నేను ఆశ్చర్యపోతా, మానవుడు భవిష్యత్తులో సాధించలేనిది ఏదీ ఉండదేమోనని అనుకో సాగినాను. అక్కడున్న పెద్దమనుషులందరూ కాదురా నారాయణా, చంద్రుడు దేవుడు కదా, ఆ దేవుని మీదికి మనిషి ఎట్ల పోతాడప్పయా? చంద్రుడు గుడకా మన భూమి మాదిరే ఉంటే రాత్రిపూట వెన్నెల ఎట్ల కాస్తాది? మన భూమ్మీదనుంచీ పోయిన మనిషి, చంద్రుని మీదికి ఏమి బొక్కబెట్టుకొని పొయ్యింటాడా? అన్నీ సుళ్లకూతలు కాదేమిరా అని నవ్వినారు. విమానాల్లో అమెరికా, రష్యాలకు పోతావుండే విషయమూ, ఒకరోజులో భూమిని పదేడుసార్లు చుట్టి 24 గంటల లోపలే 17 రాత్రులను, 17 పగళ్లను రష్యా వ్యోమగామి చూసిన సంగతిచెప్పి, వాళ్ళను నమ్మించడానికి చూసినాను. చాలా విషయాలు చెప్పిన తర్వాత నిజమే అయ్యిండొచ్చునని, అంతా తెల్లోని మాయర్రా అని అనుకుంటా ఇండ్లకుపోయినారు.

నేను అన్నం తిని అమ్మానాన్నలతో కొంచెం సేపు మాట్లాడి మిద్దెమీదికి పోయి వెళ్ళకిలా పండుకుండాను. ఆషాఢ మాసం గాలి తగ్గింది. ఆకాశంలో మబ్బులూ మోడాలూ లేవు. పౌర్ణమి ఇంకా చాలా రోజులుంది. అందుకే నలభై యాభై శాతం గుండ్రంగా ఉండే చందమామ కనిపిస్తా ఉండాడు.

ఈ చందమామ మీదికి మానవుడు పోయి నడిచినాడంట! ఎంత ఆశ్చర్యం! చందమామ గుడకా ఒక భూగోళమేనంట! అక్కడ మట్టి మైదానాలు, కొండలు, గుట్టలు ఉండాయంట! వంకలూ వాగులూ చెరువులూ సముద్రాలూ లేవో? అసలు నీళ్లుండాయో లేదో! అక్కడ కూడా ఒక వర్షాలు పడతాయో! మట్టి ఉన్నప్పుడు చెట్లూ చేమలూ ఉండొచ్చునేమో! భూమి మీద ఉన్నట్లే జీవరాశులు ఉంటాయేమో! అక్కడ మానవులు ఉండారేమో! ఉంటే ఏ ఆకారంలో ఉంటారో? నాలుగులక్షల మైళ్ల దూరంలో ఉండే చంద్రుడి మీదికి మానవుడు చేరుకొని అక్కడ నడుస్తా, అమెరికా జాతీయ పతాకాన్ని నాటినాడంటే మానవుడు ఎంత విజ్ఞానవంతుడు! ఇంతటి విజ్ఞానానికి మనిషి మెదడే కదా కారణం! మెదడులో దాగిన విజ్ఞానంతో మానవుడు ఏ పనినైనా సాధించవచ్చునేమో!ఈ ప్రపంచంలో సర్వోన్నతులు విజ్ఞాన శాస్త్రవేత్తలే కదా! విశ్వంలోకి చూస్తా ఏవేవో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుండాను.

గ్రేడ్-2 పండిట్‌గా ఉద్యోగం – తీరని పేరాశ!

హెడ్మాస్టర్ జ్వరం నుంచి కోలుకున్నంక జిల్లా పరిషత్తుకు పిల్చుకొనిపోయినాను. మేము పోయేలోపల పోస్టింగ్ ఆర్డర్స్ అయిపోయినాయి. సార్ తాపత్రయపడతా తెలుసుకుండాడు. అప్పటికే నా కేరాఫ్ అడ్రెస్‌కు సారోళ్ల ఇంటికి కవర్ వెళ్లిపోయిందంట! ఆఫీస్‌లో మేనేజ్‌ చేసి ఆర్డర్ కాపీ బయటికి తెచ్చినాడు సార్. నన్ను మరూరు బండమీదపల్లి హైస్కూల్‌కు గ్రేడ్-2 తెలుగు పండిట్‌గా వేసినారు. అది తెలిసి మనసు చాలా అసంతృప్తి చెందింది. చైర్మన్ తరిమెల రామచంద్రారెడ్డి తీయగా, ఎంతో దయగలవానిగా మాట్లాడిన మాటలన్నీ బూటకం అని మనసులో తిట్టుకుండాను. సార్ గుడకా బాధపడినాడు. తనకు జ్వరం వచ్చి సుస్తిగా లేకపోయుంటే ఆఫీసుకొచ్చి డిప్యూటీ సెక్రటరీతో మాట్లాడి శింగనమలకు పోస్టింగ్ ఆర్డర్స్ వేయించేవాడినని ఫీలయినాడు. చైర్మన్ తమ్ముడు ఆదినారాయణరెడ్డికీ నాకూ విభేదాలుండాయి, నువ్వు కేరాఫ్ అడ్రస్‌గా నా అడ్రెస్ ఇవ్వడం వల్ల చైర్మన్ రామచంద్రారెడ్డి అదేపనిగా నీ రిక్వెస్ట్ లెటర్ కన్సిడర్ చేయలేదేమో నారాయణా! చూస్తాం,నువ్వు ట్రైనింగ్ ముగించుకొని ఫుల్లీ క్వాలిఫైడ్‌గా వొచ్చినప్పుడు ఆరు నూరైనా నిన్ను శింగనమల హైస్కూలుకు వేయించుకుంటానురా అని శపథం చేసినాడు. గురువు. ఆయన, జరిగిన పొరపాటుకు బాధ పడుతావుంటే, “ఏం పర్వాలేదులే సార్, ఉద్యోగం వచ్చింది. మరీ రిమోట్ యేరియాకు వేయలేదు కదా సార్! తాత్కాలికంగా పోయి బండమీదపల్లిలో చేరుతాను. డిసెంబర్ వరకు పనిచేసి జనవరిలో రెండో బ్యాచ్‌లో చేరి పండిట్ ట్రైనింగ్ ముగించుకుంటాను. వొచ్చే సంవత్సరం ఇట్లా సమయానికల్లా ఫుల్లీ క్వాలిఫైడ్‌గా వొచ్చి మీ సహాయంతో మన హై స్కూలుకే వస్తానులే సార్” అని ఆయనను ఊరడించినాను. అదీ నిజమేలేరా అని ఆయన నా భుజం తట్టి, ఊరికి పోయి రెండు మూడు రోజులకల్లా శింగనమలకు రమ్మన్నాడు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకొని మా బండమీదపల్లెకు బయల్దేరినాను.

ఇంటికి చేరుకొని తెలుగు పండితునిగా ఉద్యోగం వచ్చిందని, అయితే శింగనమలకు కాకుండా మరూరు బండమీదపల్లెకు వేసినారని చెప్పగానే నాయన బాధపడినాడు. శింగనమల హై స్కూలుకు వేసి ఉంటే చాలా బాగుండేదని, ఇంట్లో తిని డ్యూటీకి పోయి వచ్చేకి భలే అనుకూలంగా ఉండేదని నిరాశ వ్యక్తం చేసినాడు. ఉద్యోగం వచ్చినందుకు సంతోషపడకుండా, ఉండూరులోనే ఉండి, పక్క పల్లె శింగనమలలో ఉద్యోగం చేస్తే ఏమీ ఖర్చు కాకుండా నా జీతమంతా మిగులుతుంది కదా అని నాయన ఆలోచన. అందుకే నిరాశ పడసాగినాడు. సదువు అయిపోతానే గవుర్మెంటులో నౌకిరీ వొచ్చినందుకు సంబరపడకుండా నీదెప్పుడూ వొగటే ఏడుపేనా అని అమ్మయ్య నాయనను పంగిచ్చింది.

నాకు హైస్కూల్లో ఉద్యోగం వచ్చిందన్న సంగతి ఊరంతా పాకింది. పాత జతగాళ్లందరూ ఇంటి దగ్గరికొచ్చి సంతోషం వ్యక్తం చేసినారు.లింగనపల్లి చెన్నారెడ్డి, రామే వాళ్ల నారాయణరెడ్డి ఇంకా ఐదారు మంది మెచ్చుకుండారు. చావిట్లో నాయనను కలుసుకొని అభినందించినారు. ఉద్యోగం, శింగనమల హైస్కూల్లో అయి ఉంటే బాగుండేదని పెదవి విరిచిన నాయనను తలా ఒక మాట మాట్లాడి, “ఏమి గవర్నమెంటు నీ సంకలో ఉందనుకుండావా వెంకటస్వామీ?మేలుమేలోళ్లు గవర్నమెంటు ఉద్యోగం కోసరం అంగలారుస్తూ ఉండారు.నువ్వు కలగనింటివా నీ కొడుకు ఇంత పెద్దచదువు చదువుకుంటాడని, చదువు ముగించుకొని వొస్తానే గవర్నమెంటు ఉద్యోగస్తుడు అయితాడని? మీ కుటుంబమంతా ఆ హెడ్మాష్టర్ సారు ఫోటో పెట్టుకొని పూజించల్లనుకో” అని నాయనను దండించినారు.

రెండు దినాలు అయినంక ఆర్డర్స్ వొచ్చుంటాయేమోనని శింగనమలకు పోయొస్తానని బయలు దేరినాను. కోరుకు చేసిన మడిలో వరి నాటే పని ఉంది. అది నాకు తెలుసు. అందుకే నిన్నా మొన్నా మడిలో పిట్టక దున్ని గెనుములు పారతో చెక్కినాను. అయినా ఇంట్లో తృప్తి లేదు. నాయనా అమ్మయ్యా ఇద్దరూ గొనుగుతా, వొచ్చిన ఆర్డర్స్ వెనక్కి పోతాయా? సందకాడదంకా ఉండి వరి నాటేదంతా అయిపోయినంక శింగనమలకు పోయి రావచ్చు కదా అని అన్నారు. “ఏం మాట్లాడతా ఉండారు మీరు? ఈ పని ముఖ్యమా, నేను ఉద్యోగంలో చేరేది ముఖ్యమా? ఇందుకోసరమేనా నేను నానా అవస్థలు పడి చదువుకోనుండేదీ మీరు చదివించిండేదీ? ఎప్పుడెప్పుడు చేతికి ఆర్డర్స్ వస్తాయా అని నేను తండ్లాడుతావుంటే, ‘పని పని’ అని మీ ఆలోచనే మీది! ఆర్డర్స్ వచ్చుంటే తీసుకొని వెంటనే వస్తాను కదా” అని కోపంగా అన్నాను.

‘సరే పోప్పా! వొగ గంటలోపల తిరుక్కోని రాపో’అని చాలా బాధగా అన్నారు. వాళ్ల పద్ధతి చూసి నాకు మండింది. ‘శింగనమలకు విమానం ఏదైనా ఉందా? గంటలోపల వొచ్చేకి?’ అని నేను కోపంగా అన్నాను.

‘సరే పోప్పా, నీ బుద్ధిబుట్టినప్పడే రాపో! యానాడు గాంగ నువ్వు వొల్లొంచి పన్జేసినావని, సేత్తావని మాకు నమ్మకముంది?’ అని నిష్టూరంగా మాట్లాడినాడు నాయన. ఆ మాటలు వింటానే నా హృదయం కాలిపోయింది. ఈ చదువూ సర్టిఫికెట్లూ అన్నీ కాల్చి బూడిద చెయ్యల్లని అనిపించింది. అంతులేని బాధతో శరీరం ఉడికిపోయింది. ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవాలనిపించింది.

ఇంటికొచ్చి కాసేపు కొట్టంలో అరగోడ మీద కూర్చొని సీరియస్‌గా ఆలోచన చేసి శింగనమలకు బయలుదేరినాను. మా దొడ్డి దగ్గర ఇరుక్కంతు దాటి, మాగాణి మళ్లల్లో గెనుముల మీద మౌనంగా నడుస్తా ఉండాను.

నేను ఏనాడూ పనిచేయలేదా? విద్వాన్ సదువుకుంటా ఉండినా; ఎంత చదివినా చదవాల్సింది సముద్రమంత ఉందే అదంతా చదివేదెన్నడని అనిపించినా; చిన్నప్పుడు ఆకలితో అలమటించినా; చలికీ ఎండకూ శరీరం నీరసించిపోయినా; బరువైనా; చేతగాకపోయినా; అవమానంతో మగ్గిపోయినా; పనిచేయనిదెన్నడు? వొళ్లు దాచుకున్నదెప్పుడు? సుఖ పడిందెప్పుడు? ఎంత కఠినంగా నిష్టూరంగా మాట్లాడినాడు నాయన? ఈ మనిషి రేప్పొద్దున నేను ఉద్యోగంలోకి చేరినంక ఇంకెంత సతాయిస్తాడో యేమో!

అనుకుంటావుంటే కళ్ల నిండా నీళ్లు కమ్ముకుండాయి. దారి కనిపించడం లేదు. ఏకధాటిగా కారుతా ఉండే కన్నీళ్లను తుడుచుకోవల్లని అనిపించలేదు. ఉద్యోగం వొచ్చిందన్న ఆనందం మటుమాయమైపోయింది. ఆదోనిలో పనిచేసేటప్పుడూ తిరుపతిలో చదువుతా చాలా కష్టంగా ఉందని జాబు రాసినప్పుడల్లా ఎన్నెన్ని నిష్టూరం మాటలు! హెడ్మాస్టర్ చేస్తున్న సహాయాన్ని ప్రస్తావించినప్పుడల్లా అక్కసుతో ఎన్నెన్ని దెప్పిపొడుపులు!

దారి పొడవునా రకరకాల ఆలోచనలు! ఆలోచనల్లో మనసునూ శరీరాన్నీ నలిపివేసిన విషాద సంఘటనలు! మాసిపోని గాయాలు! మరిచిపోలేని జ్ఞాపకాలు! ఒకదాని తర్వాత ఒకటి మనసు లోపలున్న కళ్లముందు కనిపిస్తావుంటే కండ్లల్లో ఎక్కడ గడ్డకట్టుకొని ఉండాయో కరిగి కరిగి ఉబికి ఉబికి పొంగిపొర్ల సాగినాయి కన్నీళ్లు. ఎట్లో మనసును రాయి చేసుకొని శింగనమలకు చేరుకొని సారోళ్లను కలిసినాను. ఆర్డర్ కాపీ వచ్చింది. దాన్ని నా చేతికిస్తా చాలా బాధపడి నాడు సార్.

“మీ సారు నాకు చెప్పలేదు నారాయణా! నిన్ను బండమీదపల్లి హైస్కూలుకు వేసినట్లు వచ్చిన ఆర్డర్ కాపీ చూసినంక నాతో చెప్పినాడు రా. నిన్ను తప్పకుండా శింగనమలకే వేస్తారని, నువ్వు ప్రశాంతంగా చదువుకోడానికి సత్యమూర్తి వాళ్ళింటి దగ్గర మీ సార్ నీకోసం ఒక మంచి రూము మాట్లాడి పెట్టినాడంట! ఆ విషయం చెప్పి చెప్పి మీ సారు బాధపడినాడు నారాయణా! నిన్ను ఇక్కడికే వేసింటే, మా ఇంటికి వొక పెద్ద కొడుకుగా నువ్వు ఇక్కడే ఉంటే చాలా బాగుండేదప్పా!” అని జయమ్మక్క చెప్పుతావుంటే నా కళ్లల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లినాయి. “నాకు ఆ అదృష్టం లేదక్కా! నేను చదువుకున్న హైస్కూలుకు తెలుగు పండిట్‌గా వొస్తానని, సార్ స్టూడెంటుగా పైకొచ్చి, సార్ దగ్గరే పని చేస్తానని నేనూ చాలా ఆశపడింటినక్కా! అంతా నా దురదృష్టం! మీ నీడలో ఉంటే ఎంత బాగుండేదో” అని అంటా ఉంటే నా గొంతు బొంగురువోయింది. “నువ్వేమీ బాధ పడొద్దు రా! ఒక ఐదారు నెలలు పనిచేసి సెకండ్ బ్యాచ్‌లో పండిట్ ట్రైనింగ్ ముగించుకొని రాపో! ఎలాగైనా సరే వచ్చే సంవత్సరం నిన్ను క్వాలిఫైడ్ పండిట్‌గా ఇక్కడికే వేయించుకుంటానుపో! పొద్దున్నే బయలుదేరి, రేపే డ్యూటీలో జాయిన్ అయిపో!” అని ఆశీర్వదించినాడు. ఇద్దరికీ నమస్కరించి ఊరికి బయలు దేరినాను.

దారిలో నడుస్తుంటే జయమ్మక్క చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. నేను శింగనమలకే తెలుగు పండిట్‌గా వొస్తానని సార్ నా కోసం ఒక మంచి రూమ్ మాట్లాడి పెట్టినాడంట! నేను ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళ దగ్గరే ఉంటానని అనుకున్నారంట! ఎంత చల్లని మాట! ఆ మాటతో అంతకుముందు గుండెల్లో భగభగ మండిన బడబాగ్ని అంతా చల్లారిపోయింది. హృదయం ఆర్ద్రమైంది. నా బాధనూ కన్నీళ్లనూ అర్థం చేసుకుండేది వాళ్లే! నేను వాళ్లకు దగ్గరగా లేకపోయినా, ఎక్కడున్నా వాళ్లకు పెద్ద కొడుకుగానే ఉంటాను! ఉండడం నా బాధ్యత!

గట్టిగా నిర్ణయించుకొని హృదయాన్ని తేలిక పరుచుకొని ఇంటి దగ్గరికి పోయి ఆర్డర్ కాపీని భద్రంగా ఎత్తిపెట్టి, వరి నాటుతున్న మడి దగ్గరికి పోయి సాయంకాలం వరకు పనిచేసినాను. సాయంకాలం ఇంటికొచ్చినంక నాయనకు ఉద్యోగం ఆర్డర్ కాపీ చూపించి, రేపు బండమీదపల్లెకు పోయి ఉద్యోగంలో చేరి, మర్నాడు ఆదివారం కాబట్టి రేపు సాయంత్రానికి తిరిగొస్తానని, ఆదివారం సాయంత్రానికల్లా వంట చేసుకోడానికి కావాల్సినవన్నీ సర్ది పెట్టాలని అమ్మయ్యతో చెప్పినాను. హిందూపురం రోడ్లోపోతే మరూరు దగ్గర బస్సు దిగి నాలుగు మైళ్లు నడిచిపోవల్లని, తగరకుంట బస్సుకు పోతే పాలచర్ల దగ్గర బస్సు దిగి నాలుగు మైళ్ళు నడిచి రావల్లని, ఊరికి నేరుగా బస్సు లేనట్లు తెలుసుకుండానని, పోయిన వెంటనే ఒక రూము బాడుగకు చూస్తానని వివరంగా చెప్పినాను. ఉద్యోగంలో చేరిన నెలలో జీతం రాకపోవచ్చునని, గవర్నమెంటులో ఖాళీగా ఉండే ఉద్యోగంలో కొత్తగా చేరినంక ఆ పోస్టు గవర్నమెంటులో అప్రూవల్ అయినంకనే జీతం ఇస్తారని హెడ్మాస్టర్ చెప్పినాడని, నెల మొదట్లోనే రెండో తేదీనాడు ఉద్యోగంలో చేరుతా ఉండాను కాబట్టి,ఆ హైస్కూల్ హెడ్మాస్టర్ రెండు మూడుసార్లు ఆఫీసుకు తిరిగి పోస్ట్ అప్రూవల్ చేయించుకొని వస్తే మొదటి నెల జీతం రావొచ్చునని ముందుగానే చెప్పడం మంచిదని నాయనతో చెప్పినాను.నాయన సరే అన్నాడు.

మరూరు బండమీదపల్లెలో నా ఉపాధ్యాయ వృత్తి ప్రారంభం!

తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి ఆర్డర్ కాపీ జోబిలో పెట్టుకొని ఒక చిన్న బ్యాగులో టువ్వాలు పెట్టుకొని అమ్మా నాయనల కాళ్లకు మొక్కి బయలుదేరి ఫస్ట్ బస్సు ఎమ్మిగనూరు బస్సెక్కి అనంతపురంలో దిగి, పవర్ ఆఫీస్ వరకు నడుచుకుంటూ పోయి ధర్మవరం బస్సెక్కి మరూరు దగ్గర దిగి బండమీదపల్లి మట్టిరోడ్డు ఎక్కినాను. రోడ్లో హై స్కూల్ పిల్లలు పోతా ఉండారు. వాళ్లను కలుసుకున్నాను. కానీ నేను ఎవరైనదీ చెప్పలేదు. వాళ్లతో మాట్లాడుకుంటా నడుస్తా ఉండాను. సింగం నారాయణ, రామ్మూర్తి గుర్తుకొచ్చినారు. వాళ్ళిద్దరిదీ ఆ ఊరే! రామ్మూర్తి, కర్నూలు పండిట్స్ ట్రైనింగులో ఉన్నాడు. సింగమనేని నారాయణ నాకన్నా ఒక సంవత్సరం సీనియర్ కాబట్టి ఈపాటికి ట్రైనింగ్ ముగించుకొని ఎక్కడో ఒకచోట ఉద్యోగంలో చేరే ఉంటాడు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పెద్దలను కలుసుకోవాలని అనుకుండాను. అట్లే మా రుద్రవరం సూరయ్య బిడ్డ కాంతమ్మను బండమీద పలికే ఇచ్చిన విషయం గర్తుకొచ్చి, వాళ్లనూ కలుసుకుండేది మేలనుకుంటా నడుస్తా ఉండాను.

చుట్టూరా అన్నీ చేన్లే! అయితే చేన్ల నిండా పిచ్చిరాళ్లే! ఏ చేనూ కండగలిగిన నేల కాదు. ఎక్కువగా సద్ద, ఎర్రజొన్న, కొర్ర, కందిపైర్లే! ఎక్కడా ఒక పెద్ద చెట్టయినా లేదు. నీళ్లు దప్పికైతే తాగడానికి నీళ్లు నిలిచిన ఒక మంచి గుంతైనా లేదు. ఆ పొలాలను చూసి చాలా వెనకబడిన ప్రాంతమని అనుకుండాను.

పది గంటలకంతా బండిమీదపల్లె చేరుకొని పిల్లల వెంట స్కూల్ దగ్గరికి పోయి చూసి ఆశ్చర్య పోయినాను. రెండే రెండు పెంకుల రూములు! మిగతావన్నీ తలుపులు లేని పీర్లచావిడి రూములు! వెనకవైపున రెండు కొట్టాలు! అంతా గమనిస్తా, ఎటువంటి స్కూలుకు వేసినారబ్బా అనుకుంటా, హెడ్మాస్టర్ రూమ్ లోకి పోయి హెడ్మాస్టర్‌కు నమస్కారం చేసి ఆర్డర్ కాపీ ఇచ్చినాను. చూసి, “మీరేనా నారాయణ? నాకు రెండు రోజులు కిందటనే ఆఫీసులో మీ ఆర్డర్ కాపీ ఇచ్చినారు. నా పేరు బుడ్డయ్యనాయుడు” అని పరిచయం చేసుకొని టీచర్లందరినీ పిలిచి పరిచయం చేసినాడు. “ఈరోజు ఆగస్టు రెండో తేదీ ద్వాదశి, జాయిన్ అవుతారు కదా” అని స్మూత్ గా అడిగినాడు. “అష్టమైనా అమావాస్య అయినా చేరుతాను సార్” అని చెప్పి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినాను. అక్వటెన్స్ రిజిస్టర్లో నా పేరు రాసి నాడు క్లర్కు. నేను సంతకం చేసిన తర్వాత వివరాలన్నీ అడిగినాడు హెడ్మాస్టర్. అన్నీ చెప్పి, శింగనమల హెడ్మాస్టర్ చిత్తరంజన్ దాస్ గారి శిష్యుణ్ణి అని చెప్పుకుండాను. అవునా, ఆయన గ్రేట్ హెడ్మాస్టర్! ఆయన అనుకొని ఉంటే శింగనమలకే వేయించుకొని ఉండేవాడు కదా అని, కాసేపైనాక, లేదు లేదులే, ఆయనకూ ఛైర్మన్ రామచంద్రారెడ్డికీ రిలేషన్స్ సరిగా లేవులే. అందుకే మీకు శింగనమలకు పోస్టింగ్ రాలేదు. ఏమైతేనే లేండి, మా స్కూలుకు విద్వాన్ చదువుకున్న మీరు రావడం మా పిల్లల అదృష్టం అని కాఫీ తెప్పించినాడు హెడ్మాస్టర్.

ఇంటర్వెల్ లోపలే టీచర్లందరూ సన్నిహితులైపోయినారు. సీనియర్ సోషల్ అసిస్టెంట్ ఆంజనేయులు, లెక్కల టీచర్ రామకృష్ణ, సైన్స్ టీచర్ గోపీనాథ్, గ్రేడ్-1 పండిట్ వెంకటస్వామి, హిందీ పండిట్ సుబ్బారావు, పిఇటి భీమిరెడ్డి, సెకండరీ గ్రేడ్ టీచర్ దశరథుడు అందరూ లవ్లీగా నిర్మలంగా ఉండడం చూసి సంతోషమయింది. హై స్కూల్ ఎన్విరాన్మెంటూ బస్సు సౌకర్యమూ సరిగా లేకపోయినా ఫ్రెండ్లీగా ఉండే స్టాఫ్ ను చూసి తృప్తి చెందినాను. హెడ్మాస్టర్ సార్ నన్ను ఏడవ తరగతిలోకి పిలుచుకొని పోయి, పిల్లలకు పరిచయం చేసి, తెలుగు సాహిత్యం బాగా చదువుకున్న సార్ మీకు తెలుగు పండితునిగా వొచ్చినాడని చెప్పి వెళ్ళిపోయినాడు. పాపం పిల్లలకు బెంచీలూ డెస్కులూ లేవు. అందరూ నేల మీదనే కూర్చుండారు. పిల్లల్ని అందరినీ పేర్లు, వివరాలు అడిగి తెలుసుకున్నాను. అందరూ పల్లెటూరి అమాయకత్వంతో నిర్మలంగా ముద్దు ముద్దుగా కనిపిస్తూ ఉంటే చూస్తా, ఇంత చిన్న పిల్లలకు పెద్ద పెద్ద విషయాలు, నా సాహిత్యము చెప్పితే అర్థం చేసుకునే స్థితిలో లేరని నిర్ణయించుకొని, వేమన శతకములోని వాళ్లకు తెలిపిన మేడిపండు చూడ మేలిమై యుండును అనే పద్యాన్ని రాగయుక్తంగా వినిపించి, దాని భావాన్ని, వేమన మహాకవి ఆంతర్యాన్ని చిన్నచిన్న మాటల్లో చెప్పి పిల్లలందరినీ నా వైపు తిప్పుకుండాను. అట్లా పిల్లల్ని ఆకట్టుకుంటా ఉంటే ఎప్పుడు టైం అయిపోయిందేమో, బెల్లు కొట్టినారు. మూడో పీరియడ్ అయిపోయింది. ఇది నా ఉపాధ్యాయ జీవితంలో ప్రప్రథమ తరగతి పాఠం!

మధ్యాహ్నం టీచర్స్ నాకు హోటల్ నుంచి క్యారియర్ తెప్పించినారు. ఈ ఊర్లో హోటల్ కూడా ఉందా అని అడిగినాను. ఒక కుటుంబం చిన్న మెస్ పెట్టుకుందని, ముందుగా వాళ్లకు చెప్పితే, పప్పు,చారు, అన్నము, ఒక చట్నీ చేసి పంపుతారని గోపీనాథ్ చెప్పినాడు. ఆయనొక్కడే సింగిల్‌గా ఉండాడని, మిగతా టీచర్లందరూ ఫ్యామిలీలతో ఉండారని తెలిసింది. భోజనం అయిన తర్వాత రామ్మూర్తి ఇంటికి పోయినాను. రామ్మూర్తి చిన్నతమ్ముడు ప్రభాకర్ రావు 9వ తరగతి విద్యార్థి, మా స్కూల్లోనే చదువుతా ఉండాడు. ప్రభాకర్, నన్ను వాళ్ళమ్మానాన్నలకు పరిచయం చేసి, విద్వాన్‌లో మన రామ్మూర్తి అన్నయ్యకు క్లాస్మేట్ అని చెప్పినాడు. వాళ్లు ప్రేమగా పలకరించినారు. రామ్మూర్తి తండ్రి హనుమంతరావు ఆ ఊరికి కరణం. వాళ్లది పాత ఇల్లు. అయినా చాలా పెద్దది. ఇంట్లోకి రెండు నడవలు! ఇల్లంతా తూర్పు మొగం! దక్షిణం నడవగుండా నేరుగా ఇంటి హాల్లోకి పోవచ్చు! ఉత్తరం నడవగుండా ఇంటి ఉత్తరం వాకిలి ఉండే దొడ్లోకి దారి! నడవలకు ఇరువైపులా పెద్ద అరుగులు! అరుగుల పైన ఇంటికి ఉత్తర దక్షిణ భాగాల్లో రెండు రూములు! నడవల మధ్యలో సుమారు 50 అడుగుల పొడవున్న వసారా! రెండు నడవల పక్కన అరుగుల మీద ఉన్న రెండు రూములలో మ్యాథ్స్ టీచర్ రామకృష్ణ బాడుగకు వుండాడని తెలిసింది.

రామ్మూర్తి అమ్మా నాన్నలు ఇద్దరు భోం చేయండని, కనీసం కాఫీ అయినా తాగండని బ్రతిమాలినారు. నేను స్కూల్లో భోంచేసినానని, ఈరోజు సాయంకాలం ఊరికిపోయి మళ్లీ సోమవారం వంట సామాన్లన్నీ తీసుకొని వొస్తానని, వొచ్చినంక ఒక రూము బాడుగకు తీసుకుంటానని అన్నాను. ఎక్కడా వొద్దు, నేరుగా ఇక్కడికే రండి అని, అవతలి నడవగుండా లోపలికి పోతే, మాదే ఒక రూము ఉందని అందులో మీరు ఉండొచ్చునని ప్రేమగా చెప్పి రూమ్ చూడమన్నారు. స్కూలుకు టైం అవుతుందని సోమవారం వచ్చినప్పుడే చూస్తానని వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని స్కూల్ వైపు పోతా, మా ఊరి సూరయ్య కూతురు కాంతమ్మను, ఆమె భర్త రామకృష్ణను పలకరించి, నేను స్కూల్ దగ్గరికి చేరుకున్నాను.

***

ఊర్నుంచి వంట సామాన్లన్నీ తీసుకొని వచ్చి రామ్మూర్తి వాళ్ళ ఇంట్లో లోపల దొడ్డి వైపున్న రూములో దిగినాను. వాళ్లు పూర్తి సంప్రదాయ బ్రాహ్మణులైనా, నేను రామ్మూర్తికి విద్వాన్‌లో క్లాస్‌మీట్ కావడంతో నాకు వాళ్ళు, ఇంటి దొడ్లో రూమ్ ఇచ్చినారు. స్నానానికీ వంట చేసుకోవడానికీ బాగా సౌకర్యంగా ఉంది. దొడ్లో నుంచి ఉత్తరం వైపున్న నడవగుండా ఇంటి బయటకి రాగానే చేదబావి, నీళ్లకు అనుకూలంగా ఉంది. నేను సామాన్లను రూములో సర్దుకుని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ తిన్నాను. టిఫిన్ తింటా ఇంటి మెయిన్ హాల్లో ఒకవైపున్న చిన్న బిల్లబావిని చూసి ఆశ్చర్య పోయినాను. బయట నీళ్లు చేదుకొని వొచ్చేకి ఇబ్బంది అవుతుందనో, శూద్రులందరూ వాడే బావినీళ్లు ‘అంటు’ అవుతుందనో ఇలాంటి సాంప్రదాయ బ్రాహ్మణులు ఎంత అద్భుతంగా ఇంట్లోనే బిల్లబావి ఏర్పాటు చేసుకున్నారు! ఆచార సంప్రదాయాల మీద ఎంత శ్రద్ధ వీళ్లకు! అని అనుకుంటా, వొక ముసలాయమ్మ బోడిగుండు మీద తెల్లచీర కొంగు ముసుగేసుకొని, చీరను మొగోళ్ల గోసి మాదిరి కట్టుకొని,పూజా సామాగ్రి పట్టుకొని, హాల్లో నుంచి దొడ్డి వాకిలి గుండా దొడ్లోకి పోతా ఉంటే గమనించినాను. ఆ పెద్దాయమ్మ సావిత్రమ్మ, హనుమంతరావు గారికి మేనత్తంట! ఆ పెద్దాయమ్మనూ రామ్మూర్తి వాళ్ళమ్మ నాగమణెమ్మనూ వాళ్ళ కట్టూ బొట్టూ నిష్టనూ చూసి, ఇట్లాంటి వాళ్లు, వాళ్ల ఇంట్లోని దొడ్డిరూమును నాకివ్వడం గ్రేట్ అనుకుంటాను.

పది గంటలకు స్కూలుకు పోయినాను. మొదటి పీరియడ్ ఏడవ తరగతికి పద్య భాగంలో పాఠం చెప్పినాను. మొదట కొంచెం ఇబ్బంది పడతానేమో అనుకొని జంకినా, నాలుగైదు నిమిషాలకే తేరుకొని ఆనందంగా పాఠములో మునిగిపోయి పద్యాలను రాగయుక్తంగా, చదువుతున్నప్పుడే పిల్లలకు అర్థమయ్యే విధంగా సంధి పదాలను విడదీసి చదివినాను. పిల్లలు నిశ్శబ్దంగా ఆసక్తిగా పాఠం లోకి మనసుపెట్టి వింటా ఆకర్షితులైనారు. వాళ్ల ఆసక్తీ సంతోషమూ వాళ్ళ ముఖాల్లో కనిపించింది. అది నన్ను మరింత ఉత్సాహపరిచింది. పీరియడ్ టైం ఎప్పుడైపోయిందో ఏమో, బెల్లు కొట్టినారు. క్లాసులో నుంచి బయటకొస్తా ఉంటే పిల్లలు నెక్స్ట్ పీరియడ్ అయ్యవారు రాలేదు, మీరే పాఠం చెప్పండి సార్ అని బ్రతిమాలినారు. నేను హెడ్ మాస్టర్ని అడిగి ఆ క్లాస్‌కే పోయి పాఠం చెప్పినాను.

మూడో పీరియడ్ మా క్లాసుకు రండి సార్ మా క్లాసుకు రండి సార్ అని వెంటపడినారు పిల్లలు. నేను, నాది కానీ క్లాసుకు పోయి తెలుగు పాఠం చెప్పడం సభ్యతగా ఉండదు కదా, అది నా సీనియర్ని అవమానించడం కదా అని నిరాకరించినాను. అది గమనించి మా గ్రేడ్ -1 పండిట్ వెంకటస్వామి, వెళ్లి రాపోండి అని పర్మిషన్ ఇచ్చినాడు. 9వ తరగతికి పోయినాను. పిల్లలందరూ కొంచెం పెద్ద పిల్లలు. చావడి రూములో ఉన్న బెంచీల మీద కూర్చుండారు. నేను వాళ్ళ తెలుగువాచకం లోని పాఠం చెప్పకుండా విద్యార్థులు తెలుగు సాహిత్యానికి చెందిన పాఠాలు ఎందుకు చదవాలి, చదవడం వల్ల ఉపయోగం ఏమిటి, మానవ జీవితానికి సైన్సు లెక్కలు సోషియల్ పాఠ్యాంశాలు మాత్రమే అవసరమా, తెలుగు పాఠాలు ఏమి నేర్పుతాయి, మానవునికి నీతీ నియమాలు జీవిత ధర్మాలు జీవన విధానాలు మొదలైన సామాజిక విషయాలను లెక్కలు సైన్స్ పాఠాలు చెపుతాయా అనే విషయాలను నైతిక కోణంలో వాళ్ల స్థాయిలో చెపుతా కొన్ని పద్యాలను రాగయుక్తంగా వినిపించి వివరించినాను. విద్యార్థులు ముగ్ధులై విన్నారు. అప్పుడు అనిపించింది, పెద్ద పిల్లలకు తెలుగు పాఠం సంతృప్తిగా చెప్పవచ్చునని!

మధ్యాహ్నం హనుమంతరావు గారి ఇంట్లోనే భోజనం. ఇంట్లో హాల్లో ఒక పక్క నాగమణెమ్మ బండల మీద నీళ్లు చిముకరించి, విస్తరాకులో అన్నం వొడ్డించింది. మా ఇంట్లో మా అమ్మ వొండినట్లు అన్నం పొడిపొడిగా కాకుండా కొంచెం మెత్తగా ఉడికించిన అన్నం పెట్టి, అందులోకి గుమ్మడికాయల సాంబారు వొడ్డించింది. ఆ అమ్మయ్య గిన్నెలోని సాంబారును గెరిటితో కొంచెం ఎత్తులో నుంచి అన్నం మీదికి పోసింది. అది చూసి నేను, బ్రాహ్మణులు కదా మరి అనుకుంటా తృప్తిగా భోంచేసినాను. నాగమణెమ్మ కూరల్లో అమృతం కలిపి చేసిందేమో, ఎంత కమ్మగా ఎంత రుచికరంగా ఉన్నాయో అనుకుండాను. ఇంతవరకూ నేను బ్రాహ్మణుల ఇండ్లల్లో వాళ్ళ చేతి వంట తినింది ఇదే ప్రప్రథమం! వంటలు ఎంత అద్భుతంగా చేసుకుంటారు వీళ్ళు! అందుకే అన్నారేమో, బ్రాహ్మణో భోజన ప్రియః అని అనుకుంటా, విస్తరాకు తీసుకొని పోయి బయట చెత్త కుప్పలో వేసి దొడ్లో ఎంగిలి చేయి కడుక్కొని వొచ్చినాను. నాగమణెమ్మ నన్ను చూస్తా, ఏమీ అనుకోవద్దప్పా, కొంచెం శుద్ధి పెట్టు నారాయణా అని అడిగింది. అంటే ఏమిటో అర్థం కాలేదు నాకు. నాగమణెమ్మ చెప్పింది.తిని తీసేసిన విస్తరి కింద నీళ్లు చిముకరించి, కుడి అరచేతితో రౌండుగా అలికి, దొడ్లో చేయి కడుక్కుంటా ఇదేమి ఆచారమో రామ్మూర్తి వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవల్లనుకుండాను.

ఆధిపత్యం కోసం తల్లి వంటి కాంగ్రెస్ పార్టీని చీల్చి..

హెడ్మాస్టర్ బుడ్డయ్య నాయుడు తాడిపత్రి ప్రాంతం వాడు. అనంతపురం జిల్లా తూర్పు ప్రాంతమైన తాడపత్రి ఏరియాలో కొంచెం రాజకీయ చైతన్యం ఎక్కువ. ఆ ప్రాంతం వాడు కావడంతో బుడ్డయ్య నాయుడుకు రాజకీయాల పైన ఆసక్తి ఎక్కువే. నిన్న ఏదో లోకల్‌గా చెరువు దగ్గర గంగమ్మ పూజ ఉండడంతో స్కూల్ క్లాసులు అన్నీ లెటాఫ్ చేసి టీ కాఫీలు తెప్పించుకొని టీచర్లందరమూ హెడ్మాస్టర్ రూములో కూర్చొని రాజకీయాలను గురించీ, మొన్ననే జరిగిన రాష్ట్రపతి ఎన్నికలను గురించీ మాట్లాడుకుంటా వుండాం.

‘మొత్తానికి నీలం సంజీవరెడ్డికి ఇందిరాగాంధీ మంచి గుణపాఠమే చెప్పింది! ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసింది నెహ్రూ ఫ్యామిలీ! అటువంటి నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ! ఆమె మాటను మన్నించకుండా అహంకారంతో రాష్ట్రపతి పదవికి పోటీ చేసి భంగపాటు పొందడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ చీలికకు కారకుడయినాడు’ అంటా బుడ్డయ్య నాయుడు సంజీవరెడ్డిని విమర్శించి ఇందిరాగాంధీని సమర్థించినాడు

‘నిజమే సార్, సంజీవరెడ్డి అహంకారి కావొచ్చు! అయితే లాల్ బహుదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కావాల్సినోడు! కానీ కాంగ్రెస్ సిండికేట్ లోని పెద్దలు కామరాజ్ నాడర్, నిజలింగప్ప, సంజీవరెడ్డి! ప్రధానంగా ఈ ముగ్గురి ఆశీర్వాదం వల్లనే ఆ రోజు ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి పదవి దక్కింది! అది ఆమెకు తెలుసు! ఆ కృతజ్ఞతా భావం గుడకా లేకుండా ఈ మహాతల్లి ఇందిరాగాంధీ, నీలం సంజీవరెడ్డికి పోటీగా వి.వి.గిరిని రాష్ట్రపతి ఎన్నిక పోటీలో నిలిపి, తెరచాటున రాజకీయం చేసి, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండని పార్లమెంట్ సభ్యులకు చెప్పడం ఏ నీతి అనిపించుకుంటుంది?’

ఇట్ల నేను గట్టిగానే వాదించినాను. స్టాఫ్‌లో హెడ్మాస్టర్ బుడ్డయ్య నాయుడునే ఎక్కువ మంది సమర్థించినారు. సమర్థిస్తా, ఇంతకూ ఎందుకు ఇందిరాగాంధీ తన సొంత పార్టీ నాయకున్ని తిరస్కరించిందన్న ప్రశ్న లేవనెత్తినారు.

ఈ దేశంలో దేశాధిపతి, రాజ్యాంగ అధినేత, ప్రథమ పౌరుడు రాష్ట్రపతే! అయినా అధికారమంతా ప్రధానమంత్రి చేతుల్లోనే ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు, పార్లమెంటులో ఫ్లోర్ లీడర్ గా నాయకత్వం, ప్రధానమంత్రి చేతుల్లోనే ఉండిపోతా వుండాయి. పార్లమెంటులో ముఖ్యమైన బిల్లులన్నీ చట్టాలు కావల్లంటే బిల్లుల పైన రాష్ట్రపతి ఆమోదముద్ర ఉండాల్సిందే! రాష్ట్రపతి సంతకానికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే దేశాధినేత రాష్ట్రపతే! అటువంటి రాష్ట్రపతి, పదవీ బాధ్యతలు చేపట్టకముందే పార్టీకి రాజీనామా చేయల్ల! రాజీనామా చేసిన తర్వాత పార్టీకీ రాష్ట్రపతి అభ్యర్థికీ సంబంధాలన్నీ తెగిపోయినప్పుడు, పార్టీ ఫ్లోర్ లీడర్ చేతుల్లోనే పార్టీ ఉంటాది! పార్టీ ఫ్లోర్ లీడర్ ఇందిరాగాంధీ! ఇన్నాళ్లు పార్టీ పెద్దల కనుసన్నల్లోనే ఇందిరాగాంధీ నడిచింది! తనను నడిపిన పెద్ద మనుషుల్లో ఒకడైన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయితే, రేప్పొద్దున పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లుల పైన అతడు సంతకం పెట్టకపోతే అప్పుడు తన పరిస్థితి ఏమిటి? అతడు తన చెప్పు చేతుల్లో ఉండే మనిషి కాదు! ఊరకనే కొరివితో తలకాయ గోక్కోడమెందుకు? ఇదంతా ఆలోచన చేసి, తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం తన రబ్బర్ స్టాంపు మాదిరి ఉంటాడని అనుకున్న వి.వి గిరిని స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పోటీలో నిలబెట్టి, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండని కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ పరోక్షంగా సంకేతాలిచ్చి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించింది ఇందిరాగాంధీ! దీన్ని బట్టి ఆధిపత్య తత్వం ఎవరిదో, జాతీయ కాంగ్రెస్ పార్టీని చీల్చిందెవరో చెప్పండి అని ప్రశ్నించినాను.

నా ప్రశ్నలతో బుడ్డయ్య నాయుడు కొంచెం హర్ట్ అయినాడు. సహజంగా రెడ్డి కులస్తులంటే కమ్మవాళ్ళకు సరిపోదు. బుడ్డయ్య నాయుడు తాడిపత్రి ప్రాంతం కమ్మ కులస్తుడు. అందుకే సంజీవరెడ్డి మీద సదభిప్రాయం లేదు. తన అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి అతడు, అనంతపురం జిల్లాకు ఎంతో అన్యాయం చేసిన ప్రాంతీయ ద్రోహి అనీ అదనీ ఇదనీ చాలా గట్టిగా వాదించినాడు. ఆ విషయంలో బుడ్డయ్యనాయుడును నేను సమర్థించినాను. అనంతపురానికే కాదు, మొత్తం రాయలసీమకే అన్యాయం చేసిన వ్యక్తి అని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరై కొత్తగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలును మూన్నాళ్ల ముచ్చట రాజధానిగా చేసి, కోస్తా జిల్లాల కాంగ్రెస్ నాయకుల ఇష్టాప్రకారం ఆంధ్రరాష్ట్ర రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో విలీనం చేయడానికి చాలా కుయుక్తులతో సహకరించిన అపర చాణిక్యుడు సంజీవరెడ్డి అని చెప్పి బుడ్డయ్య నాయుని కోపాన్ని తగ్గించినాను. తమ తమ స్వార్థం కోసరం అధికారం కోసరం రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారని అందరూ అంగీకరించినారు. అయితే ఎంత స్వార్థం ఉన్నా ఆదిపత్య భావజాలం ఉన్నా సంజీవరెడ్డికి కొన్ని నైతిక విలువలు ఉన్నాయని, బస్సుల జాతీయీకరణ విషయంలో సుప్రీంకోర్టు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, లోక్సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే పార్టీలకు అతీతంగా వ్యవహరించవలసిన పదవి కాబట్టి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం గొప్ప ఆదర్శవంతమైన నైతిక విలువలని అందరమూ అనుకుండాం.

***

ఉద్యోగ జీవితంలో నెలరోజులు గడిచిపోయినాయి. పల్లెటూరు కదా, కొత్తగా వచ్చిన తెలుగు పండిట్ పాఠం అద్భుతంగా చెప్పుతాడన్న విషయం ఊరంతా పాకిపోయింది. ఊరి పెద్దలు చాలామంది పరిచయమైనారు. అందరూ ఆత్మీయంగా గౌరవించసాగినారు. ఉద్యోగ ప్రారంభ జీవితం ఎంతో తృప్తిగా గడవసాగింది.

హెడ్మాస్టర్ బుడ్డయ్యనాయుడు కొంచెం సాహిత్య అభిమాని. అందుకే, నేను ఉద్యోగంలో చేరి, నా పాఠాలతో పిల్లలకూ ఊరి పెద్దలకూ ప్రీతిపాత్రుడైనానని తెలుసుకొని, స్కూల్లో ఒక మంచి సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేద్దామని, ఆశావాది పరిచయమా అని అడిగినాడు. అతనితో నాకున్న సాన్నిహిత్యాన్ని తెలిపినాను. హెడ్మాస్టర్ హై స్కూల్లో సారస్వత సంఘ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేద్దామన్నాడు. సరే అన్నాను నేను.

మా సి బండమీదపల్లె కాని ఎం బండిమీదపల్లెలో సారస్వత సభ ఏర్పాటయింది. ఆశావాది ముఖ్య అతిథిగా వొచ్చినాడు. పక్కన ఉన్న కనగానపల్లెలో నా మాదిరే గ్రేడ్ 2 పండితునిగా పనిచేస్తున్న నా విద్వాన్ మిత్రుడు వీరభద్రాచారిని విశిష్ట అతిథిగా ఆహ్వానించినాం.

ఆశావాది జనరల్‌గా సాహిత్యం గురించి చక్కగా కమ్మని కంఠంతో ప్రసంగించినాడు. వీరభద్రాచారి శతకాలను గురించి మాట్లాడినాడు. చివర నన్ను మాట్లాడమన్నాడు హెడ్మాస్టర్. నేనెప్పుడూ బయట సభల్లో ఉపన్యాసం చేయలేదు. మొదట కొంచెం భయపడినాను. నోరు ఆరిపోయింది. కొంచెం నీళ్లు తాగి, వసుచరిత్ర పైన మాట్లాడినాను. కంఠస్థమైన పద్యాలను పేర్కొంటూ తృప్తిగానే ప్రసంగించినాను. ముగ్గురమూ మొన్నటి వరకూ విద్యార్థులమే! ఇప్పుడు ముగ్గురమూ తెలుగు అధ్యాపకులమైనాం! మా ఇద్దరి కంటే ఆశావాదికి సభానుభవం ఎక్కువ. అందుకే నీలాజాలంగా మాట్లాడినాడు ఉపన్యాసకునిగా ఈ సభ నాకు మొదటిది!

బతుకునిచ్చిన గురువు దగ్గర బంటునే!

గురువు హెడ్మాస్టర్ సార్ తన అన్న కుమార్తె పెళ్లి పత్రిక పంపుతూ లీవు పెట్టి ఒకరోజు ముందుగా రమ్మని ఉత్తరం రాసినాడు. నేను ఆయన చెప్పినట్లుగానే పోయినాను. కళ్యాణ మండపం ఊరికి చాలా దూరంగా ఉంది. పెళ్లి పందిరి ఆర్భాటంగా వేసినారు. కానీ వసతులు తక్కువ. పనిచేసే వాళ్లూ తక్కువే! సార్ పెద్దకొడుకు రవీంద్రనాథ్ ఒక్కడే చేతికి ఎదిగిన మనిషి. నేను పనిలో చొరబడి, బిందెతో నీళ్లు మోసుకొని వొచ్చి నాలుగు డ్రమ్ముల నిండా నింపినాను. చిన్న చిన్న పనులన్నీ చేసి భోంచేసి, రాత్రి పండుకోడానికి పాతూరులో ఉన్న ఆశావాది రూముకు చేరుకుండాను. ఈ మధ్యకాలంలో రాత్రిపూట ఎప్పుడు అనంతపురంలో నిలవాల్సి వచ్చినా మిత్రుడు ఆశావాది రూములోనో బాలన్న రూములోనో ఉంటున్నాను.

రాత్రి ఆశవాదితో సాహిత్య విషయాలు చర్చించుకుంటా సంతోషంగా గడిపి ఉదయమే పెళ్లి దగ్గరికి చేరుకుండాను. పందిరి కింద కుర్చీలు సర్దడమూ నీళ్లు తెప్పించడమూ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సార్ కొడుకు మాదిరి పనులు చేస్తా ఉండాను. పెండ్లికి శింగనమలకు శెట్టిగారు కొంతమంది వొచ్చినారు. వాళ్లందరికీ నేనూ నా జీవితమూ హెడ్మాస్టర్ సార్ నన్ను విద్వాన్ కోర్సులో చేర్చిన విషయమూ విద్యార్థిగానే నేను శింగనమల హైస్కూల్లో అష్టావధానం చేసిన సంగతీ సత్యమూర్తిస్వామి నన్ను అభినందించిన సంగతీ తెలుసు! అదంతా తెలిసిన సంస్కారవంతులైతే నన్ను హెడ్మాస్టర్ సార్ వాళ్ళ ఇంటి మనిషిగా జమ కడతారు! ఆ సంస్కారం లేని మూర్ఖులుగా అతగాళ్లు నన్ను పనిమనిషిగా ఎగతాళిగా మాట్లాడినారు. నేను స్వయంగా వెళ్లి బండిలో వంటకట్టెలు తెప్పించి వంటవాళ్ళ దగ్గర వేయించి, పెళ్లి పందిరి దగ్గరికొచ్చి కుర్చీలన్నీ సర్దుతా ఉండాను. నన్ను చూస్తా ఒకతను “ఏమప్పా, నీ తమ్ముడు కట్టలు తెప్పించినాడా లేదా? తెప్పించకుంటే ఆడ పనిచేసే ఆ పిల్లోడు నీ తమ్మునికి నమ్మినబంటు, వానితో చెప్పు తెప్పిస్తాడు” అని పెళ్లికూతురు తండ్రితో (సారోళ్ల అన్నతో) అన్నారు. కట్టలు అనే మాట నేను తప్పుగా కట్టెలు అని విని, కట్టెలు వచ్చినాయయ్యా అని అన్నాను. ఆ మాటకు ఒక శెట్టి, వచ్చినాయా? ఏమిటివి వొచ్చినాయి? అని అంటూ పక్కనున్న మనిషితో, యెవుని చింతవానిది అని వెకిలిగా నవ్వసాగినాడు. వెకిలిగా నవ్వుతా, వాళ్ళన్న మాటలు నన్ను అసహ్యంగా తాకినాయి. వాళ్లడిగిన కట్టలు ఇస్పేటాకుల కట్టలని నాకు వెంటనే స్ఫురించినాయి. గట్టిగానే నోరు విప్పి “అవునయ్యా, యెవుని ఆలోచన వానిది! మీ ఆలోచనంతా ఇస్పేటాకుల కట్టలమీద! నా ఆలోచనంతా వంటకట్టెల మీద! నేను మీరనుకుండే అయ్యవారుకు శిష్యుణ్ణీ బంటునే కాదు, ఆయన ఇంటి మనిషిని! అయ్యవారి శిష్యులంటే ఇట్ల ఉండల్లని మెచ్చుకుండేది పోయి, ఏదో ఎగతాళిగా మాట్లాడుతా వుండారు! నేను ఇప్పుడు ఇక్కడ పని మనిషినేకాదు, ఆయన శిష్యునిగా తెలుగు పండితుణ్ణి! గవర్నమెంట్ ఉద్యోగస్తున్ని! రేప్పొద్దున, మీ హైస్కూల్‌కు, కాదు కాదు, మీ ఊరి హై స్కూల్‌కి తెలుగు పండితునిగా వస్తాను! మీ పిల్లల్ని హైస్కూల్లో చేర్చడానికి వచ్చినప్పుడు నా స్థాయి ఏమిటో, ఎవరి చింత ఏమిటో మీకే అర్థమవుతుంది” అని సీరియస్ గానే జవాబిచ్చినాను.

‘అయ్యో నారాయణా, మేము నిన్ను చూసి కాదు, నీ అవతల పని చేసే పిల్లోడిని చూసి అన్నామప్పా, ఏమీ అనుకోవద్దు’ అని సర్దుకుండారు వాళ్లు. గురువుగారు కూడా ఇటువంటి కుసంస్కారులతో ఇస్పేటాకులు గానీ ఇంకేవీ గానీ ఆడకూడదు! ఎవరైనా పెద్ద ఆఫీసర్లు చూస్తే ఎంత అసహ్యం! సార్ వాళ్ళ అన్నను ఈ శెట్టిగారు ఏమప్పా అని సంబోధించడం, సార్ను అయ్యవారు అయ్యవారు అని అగౌరవంగా అనడం, ఇదంతా సంస్కారహీనులకు విద్య విలువా విద్యా బోధకుల విలువా తెలియని మూర్ఖులకు సార్ చనువు ఇవ్వడం వల్లనే కదా! సప్త వ్యసనాలలో ముఖ్యమైన జూదం, మద్యపానం దగ్గర ఎంతటి వాడైనా గౌరవం కోల్పోతాడేమో అనుకొని బాధపడినాను.

తెలుగు పండిట్ గా తొలి జీతం సంగతులు

2-8-1969వ తేదీ నాడు తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరినానని చెప్పినాను కదా, చేరింది అప్రూవ్డ్ పోస్ట్ లోనే అయినా గ్రాంట్ వొచ్చేకి మూడు నాలుగు నెలలు పట్టవచ్చునని, అంతవరకు జీతాలు రావనుకొని అదే విషయం నాయనకు ముందుగానే చెప్పినాను. తిండి తీర్థాలకు నానా ఇబ్బందులు పడుతూ, విద్యార్థుల ముందు నిల్చుకొని పాఠాలు చెప్పేటప్పుడు అన్నీ మర్చిపోసాగినాను. అటువంటి సమయంలో హైస్కూల్ క్లర్క్ లక్ష్మీనారాయణ నెలన్నర దినాలకే మీ జీతం శాంక్షన్ అయింది సార్, ఆఫీసులో గట్టిగా మాట్లాడి శాంక్షన్ చేయించుకొని వొచ్చినాను. మన హెడ్మాస్టర్ సార్ కూడా డిప్యూటీ సెక్రటరీ గారికి చెప్పడం వల్లనే సాధ్యమైంది అని చల్లని వార్త చెప్పినాడు. నాకు పరమానందం అయ్యింది. అంతలోనే పూర్తి జీతం రాలేదని తెలిసి అసంతృప్తి చెందుతా 134 రుపాయలు తొలి జీతం తీసుకుండాను. ఆ ఆనందంతో టీచర్స్ అందరికి టీ పార్టీ ఇచ్చిన్నాను. ఐదు రూపాయలు ఖర్చయింది. మరుసటి దినం ఆదివారం కావడంతో ఊరికి బయలుదేరి అనంతపురంలో అరటిపండ్లు పూలు తీసుకొని ఊరికి చేరుకొని జీతం విషయం చెప్పగానే అమ్మయ్య సంతోష పడింది. పూర్తి జీతం రానందుకు నాయన గొనిగినాడు.

నేను 50 రూపాయలు చేతికి నాయన చేతికిచ్చినాను. నాయన ఆ డబ్బుల్ని విసిరి కొట్టినాడు. అయినా మనసును కంట్రోల్ చేసుకొని దూరంగా పోయి మౌనంగా కూర్చుండాను. అమ్మయ్య కాగితాలన్నీ ఏరుకొని వొచ్చింది. ఆవేశం తగ్గినంక నేను నోరు విప్పినాను.

“నాది కలెక్టర్ ఉద్యోగమని, వేలకొద్దీ జీతం వస్తాది అనుకుండారేమో! నేను జూనియర్ తెలుగయ్యవారిని! నాకు నెలకు జీతం 168 రుపాయలే వొచ్చేది! ఈ నెల వొచ్చింది 134 రుపాయలే! ఉద్యోగం వొచ్చేవరకు అనంతపురానికి ఎన్నిసార్లు తిరిగినానో మీకు తెలీదా? పోయినప్పుడల్లా ఐదారు రూపాయలు ఖర్చు. అదంతా ఎవరిచ్చినారని అనుకుండారు మీరు? ప్రతిసారీ హెడ్మాస్టర్ సార్ ఇచ్చినాడు. అదంతా 45 రూపాయలు అయింది. అది ఆయనకు తిరిగి ఇవ్వల్లా వొద్దా? ఆటికీ రాత్రిపూట అనంతపురంలో నిలిచినప్పుడల్లా స్నేహితులు బాలన్న దగ్గరా ఆశావాది దగ్గరా వుండి ఆ పూట అక్కడే భోంచేస్తూ ఉంటాను. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నాకు ఖర్చులే ఉండవా? పొద్దున్నే లేస్తానే ఒక కప్పు కాఫీ అయినా తాగల్లనా వొద్దా? ఉద్యోగంలో చేరిన తర్వాత గుడకా చింత తొక్కూ చిట్లం పొళ్ళతోనే కూడు తినల్లనా? నెలకు ఎనిమిది రూపాయలు ఇస్తే రోజూ వొక పూటకు సరిపోయేటట్లు హోటల్ వాళ్ళు కాసింత పప్పు చారు ఊరుమిండీ పంపుతారు. అది గుడకా తెప్పించుకోవల్లనా వొద్దా? ఇంక లాటినూ స్టౌవ్ లకు కిరసనాయిలూ బట్టల సబ్బులూ ముఖం సబ్బూ కావల్లంటే అక్కడ నాకు అంగడి ఏమైనా ఉందనుకుండారా? చాకలోళ్లు బట్టలు ఫ్రీగా ఉతికి ఇస్త్రీ చేసిస్తారని అనుకుండారా? ఆ ఖర్చులన్నిటికీ చేసిన చేబదుల్లు తిరిగి ఇవ్వొద్దా నేను?”

ఒక్కొక్కటి ఇలావరిగా అడుగుతా ఉంటే ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపు నేను మౌనంగా ఉండి మళ్ళీ నోరు విప్పినాను. “ఈ ఉద్యోగం టెంపరరీనే! అంటే తాత్కాలికమే! కర్నూలులో ఐదు నెలలు పండిట్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోకుంటే నన్ను ఎప్పుడైనా ఉద్యోగం నుంచి తీసేయ్యొచ్చు! కాబట్టి వొచ్చే జనవరిలో కర్నూలు ట్రైనింగ్ కాలేజీలో చేరుతాను. ఆ ఐదునెలల ఖర్చుల కోసం ఇప్పుడొచ్చే జీతాలలో నెల నెలా కొంత నా దగ్గరే పెట్టుకుంటాను. ట్రైనింగ్ ముగించుకొని వొచ్చిన తర్వాత హెడ్మాస్టర్ సార్ నన్ను శింగనమలకే వేయిస్తానని మాటిచ్చినాడు. ట్రైనింగ్ అయిపోయి మళ్లీ ఉద్యోగం లోకి చేరిన తర్వాత ఉద్యోగం పర్మనెంట్ అయితాది. అప్పుడు భయం ఉండదు. ప్రతి సంవత్సరం జీతం పెరుగుతాది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను దుబారా ఖర్చులు చేయనని గుర్తుపెట్టుకోండి! మీరు అడిగినా అడగకపోయినా నిరాడంబరంగా బతుకుతా ఇంటికి నెల నెలా డబ్బులు పంపుతాను. పంపడం నా బాధ్యత. నేను డబ్బులు పంపనని, కుటుంబాన్ని పట్టించుకోనని కలలో కూడా అనుకోకండి. అయితే ఇంకెప్పుడూ నన్ను మానసికంగా హింస పెట్టద్దండి. నా బాధ్యత నాకు తెలుసు.” అంటా ఉంటే అనుకోకుండా గొంతు బొంగురు పోయింది. కండ్లల్లో నుంచి జటజట నీళ్లు కారినాయి. అది చూసే అమ్మయ్య కూడా ఏడుస్తా నన్ను ఓదార్చింది.

జాతీయ పతాకం పైన ఒట్టేసుకొని..

మా బండమీదపల్లె హైస్కూల్లో ప్రతి శుక్రవారం ప్రార్థన సమయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాడు హెడ్మాస్టర్ బుడ్డయ్య నాయుడు. ఆయన చాలా క్రమశిక్షణగా నీతీ నిజాయితీగా ఉంటాడు. తన స్కూల్ విద్యార్థుల గుడకా ఆ మాదిరిగానే ఉండాలని ఆశిస్తాడు. అందుకే ప్రతి శుక్రవారం ప్రార్థన సమయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ముందు హెడ్మాస్టర్ బుడ్డయ్య నాయుడు ఒక పదైదు నిమిషాలు పిల్లలకు క్రమశిక్షణ గురించి మంచి మంచి మాటలు చెప్పుతాడు. శుక్రవారమే ఎందుకు జెండాను ఎగురువేయాలనో కారణం చెప్పుతూ, అది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినమని వివరిస్తాడు. మా విద్యార్థులు కళావతి, ముత్యాలమ్మ, భాగ్యమ్మ ముగ్గురు ‘విజయీ విశ్వతిరంగా ప్యారా’ అనే జండా గీతాన్నీ జాతీయ గీతాన్నీ పాడుతా ఉంటే పతాకం వైపు చూస్తా నేను ఒళ్ళు గగుర్పాటు పొందుతాను. స్వాతంత్ర్య సమరయోధుల పట్ల, జాతీయ నాయకుల పట్ల, జాతీయచిహ్నమైన త్రివర్ణ పతాకం పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు కలుగుతాయి నాకు. ఏదైనా ఎప్పుడైనా నేను చెప్పేది నిజమని నమ్మించడానికి జాతీయ పతాకం మీద గానీ, జీవితాన్నీ విజ్ఞానాన్నీ అందిస్తున్న అక్షరాల మీద గానీ ఒట్టేసి చెపుతా ఉంటాను.

దినాలు గడిచే కొద్దీ విద్యార్థులు నాకు చాలా సన్నిహితం కాజొచ్చినారు. ముఖ్యంగా అమ్మాయిలు నాతో సన్నిహితంగా మాట్లాడానికి ఆరాటపడుతున్న విషయం నేను గమనించ సాగినాను. అందులో కళావతి పెద్దమ్మాయి. దాదాపు పదైదు సంవత్సరాల వయస్సు. తన వయస్సును అదేపనిగా ఆ అమ్మాయే చెప్పడం నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించ సాగింది. రెండు మూడు సార్లు నాకోసమే ఇంట్లో చేయించుకొని వొచ్చినానని అత్తిరసాలు ఒకసారి, కజ్జికాయలు ఒకసారి, కారంచుట్లు లడ్డుముద్దలు ఒకసారి ఇస్తా, అదేపనిగా నా చేయిని తాకించి సిగ్గులొలక సాగింది. అట్ల చేసినప్పుడల్లా ఒళ్లంతా గిలిగింతలు పెట్టినట్లయ్యేది నాకు. వెంటనే తేరుకొని, “కళావతీ,ఇట్ల నువ్వు ఒక్కదానివే ఒంటరిగా రావడం బాగుండదు కదా” అని మెల్లగా వొకరోజు మందలించినాను.

“మీరొక్కరే వంట చేసుకొని తింటా ఉంటే బాధయితాది సార్! అందుకే ఇంట్లో చేయించుకొని వొచ్చినాను. మాది ఈ ఊరు అయ్యుంటే రోజూ మా ఇంట్లో నుంచి నీకు క్యారియర్ తెచ్చేదాన్ని! ఆ ఈశ్వరమ్మనూ భాగ్యమ్మనూ పిలిస్తే, మధ్యలో మేమెందుకు, నువ్వొక్కదానివే పోయేకి భయమా అని మూతి ముడుస్తారు సార్!” అని అమాయకంగా చెప్పి, “మాది పక్కనే, గాండ్లపర్తి సార్! మా ఇంటికి ఒక ఆదివారం రండి సార్” అని గోముగా పిలిచి అయిష్టంగా, వెళ్లలేక వెళ్లలేక వెళ్ళిపోయింది.

‘ఏమిటీ పిల్ల? ఎందుకు నేనంటే అంత ఇది? ఇది అమాయకమైన గురుభక్తేనా? అయినా చాలామంది గురువులు ఉన్నారు కదా, వాళ్లెవరిమీదా లేని గురుభక్తి నామీదే ఎందుకు? నాలో ఏముంది ఆకర్షణ? నా పాఠమే కదా! లీనమై పాఠం చెప్పితే విద్యార్థులు ఇంత యిదిగా పడి చస్తారేమో! నారాయణస్వామీ చిన్న కృష్ణారెడ్డీ జగన్మోహన్ చౌదరీ ఇంకా ఏడెనిమిది మంది మగపిల్లలూ ఇలాగే కదా! అయితే వాళ్లంతా ఈ బండమీదపల్లె పిల్లలే అయినా, కళావతి మాదిరి ప్రేమతో వాళ్లిండ్లకు పిలిచింది గానీ ఇండ్ల నుంచి ఏదైనా తెచ్చి ఇచ్చింది గానీ ఎప్పుడూ జరగలేదు! వాళ్లెవరికీ లేని వాత్సల్యం ఈ పిల్లకే ఎందుకు? ఏదో ఋణానుబంధమేమో! ఒక మనిషికి ఒక మనిషి మీద ఆకర్షణ ఏర్పడడానికి కారణాలు ఏమిటో?’

ఆలోచిస్తా రాత్రి పొద్దుబోయే వరకూ మేల్కుండాను. ఆలోచనల నిండా ఉమావతి, మీనాక్షి, వనజాక్షి, సుంకులు, లీలావతి రామలక్ష్మి, జనాభాయి ఇంకా ఎవరెవరో మెదల సాగినారు. ఈ ఆలోచనలకంతా ఈ పిల్ల కళావతే కదా కారణం అనుకొని మనసులో తిట్టుకుండాను. అయినా నిద్ర రాలేదు. చివరికి కారిపోవలసింది కారిపోక తప్పలేదు. ఆ విధంగా వరుసగా రెండు మూడు రోజులు అదే పనే!

రేతస్సు ఎంతో విలువైనదని ఒక్కొక్క బిందువు ఉత్పత్తి కావడానికి ఎన్నో రక్త కణాలు అవసరమని అది వృథా కానీయడం ఆరోగ్యానికి మంచిది కాదని పెద్దలంటారు. శివుని రేతస్సును భరించడానికి శక్తి స్వరూపిణి అయిన పార్వతికి మాత్రమే సాధ్యమైందని, వేటకు పోయి (మృగయా వినోదం) గిరికాదేవిని మనస్సులో తలచుకొని రేతస్ఖలనం చేసుకొని వెంటనే దాని ప్రాధాన్యతను గుర్తించినందు వల్లనే, పక్షిభాష తెలిసిన ఆ రాజు ఒక పక్షిని పిలిచి,స్ఖలనమైన రేతస్సును ఒక ఆకు దుప్పలో పెట్టి తన భార్య గిరికకు పంపినాడు కదా, ఆ ఆకుదొప్పను ముక్కున కరచుకొని పోతున్న పక్షిని ఒక డేగ వెంటాడి పోట్లాడడం వల్ల దొప్పలో నుంచి తొణికి కింద పడబోతున్న రేతస్సు బిందువును సరస్సులోని ఒక చేప మింగడం వల్లనే కదా మత్స్యగంధి పుట్టింది, ఆ మత్స్యగంధే కదా వ్యాసమహర్షి తల్లి! అవన్నీ నమ్మశక్యంగానే కథలే కావొచ్చు! అయినా ఆ కథల్లో రేతస్సు యొక్క ప్రాధాన్యత బలంగా చెప్పబడింది కదా! అటువంటి విలువైన రేతస్సు వారానికి రెండు మూడు సార్లు కామ వాంఛతో అనవసరంగా పోగొట్టుకోవడం అంటే నేనై నేను నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కదా!

ఇదంతా ఆలోచన చేసి నాలుగో రోజు తెల్లవారుజాముననే లేచి నా మానసిక బలహీనతను నేనే నిందించుకొని, ఇంకెప్పుడూ ప్రయత్న పూర్వకంగా అట్ల చేసుకోకూడదని, నాకు గౌరవనీయమైన జాతీయ పతాకం పైన ఒట్టేసి నిర్ణయించుకుండాను.

ఆ ఆలోచనల వల్లనే ఈతి బాధలన్నీ మరిచిపోతున్నానేమో!

నవంబర్ నెల వొచ్చినా నాకు జీతం రాకపోవడంతో మానసికంగా కృంగిపోసాగినాను. ఉద్యోగంలో చేరిన మొదటి నెల ఆగస్టు జీతంలో 134 రూపాయలు మాత్రమే చేతికొచ్చింది ఆ తరువాత జీతం రాలేదు. ఇంట్లో అనుమానాలూ సూటిపోటి మాటలూ హృదయాన్ని నలిపివేయ సాగినాయి. ఊరికి పోయి తల్లిదండ్రులకు ముఖం చూపబుద్ధి కాదు! అయినా పోకతప్పదు! పోయి బియ్యము, చిట్లంపొల్లు, చింత తొక్కు తెచ్చుకోక తప్పదు! ఊరికి పోయినప్పుడు 25-30 శేర్ల బియ్యమూ అవిన్ని ఇవిన్ని వంట దినుసులూ మోసుకొని, ఉదయం 6 గంటలకు బస్సెక్కి అనంతపురంలో తాడపత్రి బస్టాండ్ దగ్గర దిగి, అక్కన్నుంచి ధర్మవరం బస్సునో హిందూపురం బస్సునో అందుకోవల్ల! ఆ బస్సుల కోసరం నానా అవస్థలు పడి పవర్ ఆఫీసు దగ్గరికి చేరుకోవల్ల! ఉదయం 8 గంటల లోపల ఆ రూట్లో వెళ్లే బస్సులు రెండే రెండు! కష్టపడి అక్కడికి పోతే, స్టాండ్ కండక్టర్, బ్రతిమాలినా, దగ్గరి పల్లెలకు టికెట్లు ఇవ్వడు! మొదట దూరం వాళ్లకు టికెట్ ఇచ్చి ఆ తర్వాత దగ్గరి పల్లెలకు ఇస్తాడు! బస్సెక్కే లోపల సీట్లన్నీ నిండిపోతాయి! మరూరు బస్ స్టాపింగ్ వరకూ నిలుచుకొని పోవాల్సిందే! ఆ టైం లోపల పోయి, మరూరు దగ్గర బస్సు దిగి, నాలుగైదు మైళ్లు ఆదరా బాదరా నడిస్తే తప్ప స్కూల్ టైముకు బండమీద పల్లెకు చేరుకోలేను! ఆ బస్సుల్ని అందుకొని మరూరు దగ్గర దిగితే, మా హైస్కూల్ కు వచ్చే పిల్లల సహాయం దొరుకుతుంది! అట్ల మా బడి పిల్లల్ని కలుసుకుంటానే అంతవరకు పడిన కష్టమంతా మరిచిపోతాను!

వారానికి వొకసారీ రెండు వారాలకు వొకసారీ ఊరికి పోవడమెందుకు, ఈ అవస్థలు పడడమెందుకు, ఒకేసారి రెండు నెలలకు సరిపోయేటన్ని బియ్యమూ వంట దినుసులూ తెచ్చుకుందాం అనుకుంటే, అది ఇంకొక రకమైన బాధ! ఒకేసారి అన్ని బియ్యం తెచ్చుకోవడానికి ఇంట్లో రెడీగా ఉండవు! ఉండినా అన్ని మూసుకొని, రద్దీగా ఉండే బస్సులో ఎక్కడమూ దిగడమూ చాలా కష్టమైతాది! ఎట్లో కష్టపడి తెచ్చుకుందామనుకుంటే, బియ్యం మూటకు బస్సులో లగేజ్ చార్జెస్ రాస్తారు! పోనీ, నాయనను వెంట పిలుచుకొని వొస్తే బస్సు చార్జీలు భరించడం కష్టం!

భరించలేని ఈతి బాధలు! ఈ బాధలన్నీ భరించినా, జీతాలు రాకపోవడంతో జీవితం మీదే విరక్తి కలగసాగింది! నెలలో రెండు మూడుసార్లు అనంతపురానికి పోయి, జిల్లా పరిషత్తులో జీతాల విషయం కోసం ప్రాధేయపడసాగినాను. నేనే కాదు, నాతోపాటు చేరిన అన్ ట్రెండ్ తెలుగు పండితులందరూ జీతాలు రాక అల్లాడిపోసాగినారు! జిల్లా పరిషత్తు అదొక పరస! అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ వరకు దాదాపు అందరూ అవినీతిపరులే! అవినీతికి తోడు, దురహంకారం! సంబంధిత సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంటును మా జీతాల విషయం అడిగితే అతడు పురుగును చూసినట్ల వ్యవహరించ సాగినాడు. మూడు నాలుగు సార్లు గురువుగారి దగ్గరికి పోయి మొరపెట్టుకుండాను. ఆయన రెండు సార్లు నా వెంట జిల్లా పరిషత్తుకు వొచ్చి,సెక్షన్ ఆఫీసర్‌కు చెప్పినాడు. గ్రాంట్ రానిదే తాము ఏమీ చేయలేమని, మూడు నాలుగు నెలలు ఓర్చుకుంటే ఆ తర్వాత అన్నీ సవ్యంగా జరిగిపోతాయని ఆయన బదులు చెప్పినాడు. అది విని గురువుగారు కూడా కొంచెం ఓపిక పట్టమన్నాడు. చేసేది ఏమీ లేక నిరుత్సాహంతో ఆశావాదిని కలుసుకొని, రాత్రి అక్కడే ఉండి ఉదయమే మరొక రూటు బస్సెక్కి, పాలచెర్ల దగ్గర దిగి, స్కూలుకు చేరుకొని, పిల్లల ముందు పాఠం చెప్పడానికి నిల్చుకోగానే అన్నీ మర్చిపోకపోయినాను. ముఖ్యంగా కళావతిలోని ఆరాధనా భావాన్నీ ఆ చిరునవ్వులనూ చూసి, ఈతి బాధలతో సతమతమైపోయిన హృదయం, అన్నీ మర్చిపోయి తేలికపడింది. ఒకరకంగా ఆ అమ్మాయి మృదువైన పలకరింపూ, నిన్న నేను కనిపించనందుకు వెలుబుచ్చిన నిట్టూర్పూ, జబ్బుతో మూలుగుతున్న శరీరానికి-వేదనతో బరువైన గుండెకు ఒక సరికొత్త మెడిసిన్ అనిపించింది. కళావతి అమ్మాయి కాదు,ఒక నవ యవ్వన యువతి! కళావతి కారణంగా గుర్తుకొచ్చే నా ప్రేమమూర్తులను గురించి చేసే ఆలోచనల వల్లనే, గుండెను గాయం చేస్తున్న ఈతి బాధలనుంచి బయటపడసాగినాను.

అట్ల చేయడానికి అంతరాత్మ వొప్పుకోలేదు!

రాని జీతాల కోసరం అందరము కలసి సంఘంగా ఏర్పడి, పోరాడడానికి అనంతపురం రమ్మని నాతోపాటు అన్ ట్రైన్‌డ్ పండిట్స్‌గా చేరిన మిత్రులు ఉత్తరం రాయడంతో వొకరోజు సెలవు పెట్టి మిత్రులతో సైకిల్ ఇప్పించుకొని బయలుదేరినాను. వొచ్చేటప్పుడు, అనంతపురంలో అర కేజీ కాఫీ పొడి తెమ్మని నాగమణెమ్మ ఐదు రూపాయల నోటు ఇచ్చింది. నేను మరూరులో మా స్టూడెంట్ వాళ్ల ఇంటిదగ్గర సైకిల్ పెట్టి, అనంతపురానికి బస్సెక్కినాను.

కొత్తగా అన్ ట్రైన్‌డ్ పండిట్స్‌గా చేరిన మిత్రులు సుమారు 25 మంది జిల్లా పరిషత్ దగ్గరికి చేరుకున్నారు. అందరమూ మొదట పండిట్ గుమాస్తాను కలుసుకొని, మాకు రావాల్సిన జీతాల విషయం అడిగినాం. అతడు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినాడు. మేము గొడవ చేసినాం. మా గొడవను విని డిప్యూటీ సెక్రటరీ రూమ్‌లో నుంచి పీవన్ వచ్చి, అందర్నీ సార్ రమ్మంటున్నారు అని తెలియజేసినాడు. మేము చేతులు పిసుక్కుంటా, కొంచెం భయపడుతూనే ధైర్యం తెచ్చుకొని, లోపలికిపోయి, మా గోడంతా వెల్లబోసుకుండాం. నవంబర్ నెలలో ఎలాగైనా అరియర్స్‌తో పాటి జీతాలు వొచ్చే విధంగా చూస్తానని ఆయన మాటిచ్చినాడు. ఆయన మీద నమ్మకంతో అందరమూ డిస్పర్స్ అయినాం.

నేను నాగమణెమ్మోళ్లకు కాఫీ పొడి తీసుకొని పోవాలని క్లాక్ టవర్ దగ్గరున్న దుర్గా కాఫీపొడి అంగడికి పోయినాను. షాపు దగ్గర బాగా రద్దీగా ఉంది. నేను ఐదు రూపాయల నోటు ఇచ్చి, అర కేజీ కాఫీపొడి ఇవ్వమని అడిగినాను. షాపాయన, కాఫీపొడి పొట్లం ఇచ్చి, మిగతా చిల్లర 18 -50 రూపాయలు వాపస్ ఇచ్చినాడు. నేను ఆ డబ్బులు తీసుకొని, మనసులో సంతోషపడతా, బస్టాండుకు పోవల్లని రోడ్డు దాటుతా ఉండాను. అంతరాత్మ హెచ్చరించింది.

“నీకు వాపస్ రావాల్సింది మూడున్నర రూపాయలు! అయితే షాపాయన పొరపాటున 18-50 రూపాయలు ఇచ్చినాడు. అంటే నువ్వు ఇచ్చిన ఐదు రూపాయల నోటును పొరపాటున 20 రూపాయల నోటు అని అనుకొని నీకు 15 రూపాయలు అదనంగా ఇచ్చినాడు. దాన్ని నువ్వు టపీమని ప్యాంటు జోబులో వేసుకొని మురిసిపోతా వుండావు! ఇది ఆత్మ వంచన కాదా?” అంటా అంతరాత్మ నిలదీసింది. నేను నాలుగడుగులు పక్కకు వొచ్చి, విఠల్ బిల్డింగ్స్ దగ్గర నిలుచుకొని, కొంచెం సేపు తర్జనభర్జన చేసుకుండాను.

అతడు వ్యాపారస్తుడు. వ్యాపారమే ద్రోహచింతనం. తూకములోనూ క్వాలిటీలోనూ అంగడికి వొచ్చినోళ్లందరికీ మోసం చేస్తా వుంటాడు. అట్లా వాని దగ్గర నిజాయితీగా ఎందుకుండల్ల? పైగా నేను అతని షాపులో దొంగతనం చేయలేదు కదా! అతడు పొరపాటుగా ఇచ్చినాడు! ఇందులో నా తప్పేమీ లేదు కదా! ప్రభుత్వం, నీతిగా నాకు ఇవ్వాల్సిన జీతాలు ఇచ్చి ఉంటే నేను ఈ డబ్బులకు ఆశపడే వాణ్ణికాదు కదా! ప్రతి రూపాయ కోసరం తండ్లాడతా వుండాను. అనుకోకుండా అదృష్టం కొద్దీ 15 రూపాయలు చేతికొచ్చినాయి. చాలా అవసరాలు తీరుతాయి. అని నాకు నేను సమాధానం చెప్పుకొని,నా పద్ధతిని సమర్థించుకుండాను. అయితే అంతరాత్మ నన్ను వొదల్లేదు. ఘోషించింది.

“నీ చదువు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? సాహిత్యం చదువుకుండావు! ఎన్నో నీతి సూత్రాలు వల్లిస్తావు! నీతీ నిజాయితీలన్నీ చదవడానికీ వల్లించడానికేనా? ఆచరణలో నీతినీ నిజాయితినీ పాటించవా? పాటించనప్పుడు వల్లించడానికి నీకేమి అర్హత ఉంది? నువ్వు నీతిమంతునివైతే నిజం చెప్పి, ఆ డబ్బు షాపతనికి వాపస్ ఇచ్చెయ్!”

నోరులేని అంతరాత్మ చాలా సీరియస్‌గా చెప్పింది. నా కాళ్లు దుర్గా కాఫీపొడి షాపు దగ్గరికి అడుగులు వేసినాయి. అతనికి నిజం చెప్పి, 15 రూపాయలు వాపస్ ఇచ్చినాను. నా నిజాయితితో అతని ముఖంలో కృతజ్ఞతా సుమాలు విరబూసినాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version