[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
కొంతమంది పల్లెపడుచులూ నెరజాణలే!
ఆత్మతృప్తి పొందుతూ తిరుగు ప్రయాణం బస్సెక్కినాను. రాప్తాడు దాటినంక చేన్ల పైర్లల్లోనుంచీ తేలి వొస్తున్న చిరుగాలిలోని మధురమైన పరిమళం ముక్కుపుటాలను తాకుతా వుంటే ఏదో గొప్ప రిలీఫ్‌తో మనసూ శరీరమూ ఊరట పడసాగినాయి. తీయటి ఆలోచనలతో మరూరు దగ్గర బస్సు దిగినాను. రోడ్లో నుంచి ఊర్లోకి బండిజాడ! బస్ స్టాప్ పక్కనే, పాత చింతవనం మధ్యలో బ్రిటీషోడు కట్టించిన ఇన్స్పెక్షన్ బంగ్లా భద్రంగా ఉంది.దాన్ని చూసి, బండమీద పల్లిలో కాకుండా ఈ వనములో హై స్కూల్ ఏర్పాటు చేసి వుంటే,నిరుపయోగంగా వున్న బంగ్లా చక్కగా ఉపయోగపడేది కదా అని అనుకుంటా, ఒకసారి చూద్దామని లోపలికి పోయి చూసి ఆశ్చర్య పోయినాను. ఎంత భద్రమైన కట్టడమో!ఏ చారిత్రక ప్రయోజనం కోసం కట్టినారో!
మరూరులో పెట్టిన సైకిల్ ఎక్కి బండమీదపల్లెకు బయలుదేరినాను. మరూరు దగ్గర నుంచి దాదాపు బండమీదపల్లె వరకూ అన్నీ చిన్నచిన్న గులకరాళ్ల చేన్లేనని ఇంతకుముందే చెప్పినాను కదా, అటువంటి చేన్ల మధ్యలో, పాత కంకర రోడ్లో సైకిల్ తొక్కుతా ముందుకు పోతా ఉండాను. చేన్లలో దూరంగా అక్కడక్కడ మనుషులు పొలం పనులు చేసుకుంటా ఉండారు. కొన్ని చేన్ల చెలికల్లో కంది ఎర్రజొన్న పైర్లు కొన్ని పట్టెల్లో సద్ద ఉలవపైర్లు వొక రకంగా ఉండాయి. వొక సద్ద చెలికలో వొక ఆడమనిషి సద్దకంకుల్ని తెంపుకుంటా రోడ్డు వైపొస్తావుంది. రోడ్లో కొంచెం ఎగుమిట్ట రావడంతో నేను బరువుగా మెల్లగా సైకిల్ తొక్కుతా ముందుకు పోతా వుండాను.ఆమె వొక నుసిదగ్గు దగ్గింది.నేను పక్కకు తిరిగి ఆమె వైపు చూసినాను. వయసుకొచ్చిన పడుచు పిల్ల!మొరటుగా ఉన్నా పొంకంగా అందంగా ఉంది. ప్రాయంలో ఉండే ప్రతిదీ అందంగా బాగుంటాదని అందుకే అన్నారేమో అని అనుకుంటా ముందుకు పోతా ఉండాను.
“ఏమి సారూ! కంకులేమన్నా కావల్లనా?” అని అడిగిందామె. నేను సైకిల్ నిలిపి, “నువ్వు ఇస్తానంటే నేనొద్దంటానా?” అని నర్మగర్భంగా అడిగినాను. ఆమె గుడకా చాలా గడుసుగా, “నువ్వు వద్దనవనే, నేను గుడకా ఇత్తానంటా ఉండేది! కాబట్టినోనివి దెగ్గిరికొచ్చి తీసుకుందువురా మల్ల!” అంటా సిగ్గులు పోసాగింది. ఆమె మాటలూ ఆ వోరచూపులూ మొరటు వొయ్యారమూ చూస్తా ఉంటే నా నరాలు జిల్లుమనసాగినాయి. నేను దగ్గరికి పోతే చాలు, కందిచెట్ల చాటుకు నన్ను లాక్కొని పోయేదాని మాదిరి ఆమె ఊపు కనిపించింది. మనసు తహతహలాడసాగింది. పోదామని వూకిస్తా, అటూ ఇటూ గమనించినాను. దూరంగా, అక్కడొకరు అక్కడొకరు ఆడోళ్ళు మొగోళ్ళు ఉండారు. ‘ఉంటే వుండనీ! వాళ్లు చూస్తారేమిటి? అవకాశమొచ్చింది. వొచ్చిన అవాకాశాన్ని జారవిడుచుకోకుండా తొందరగా పదా’ అని మనసు ఉసికొల్పసాగింది. సైకిల్ దిగి, రోడ్డు పక్కన నిలిపి, స్టాండ్ వేసి, రెండడుగులు చేని వైపు వేసినాను. వెంటనే అంతరాత్మ హెచ్చరించి.
“నువ్వు రోడ్డు పక్కన సైకిల్ పెట్టి, చేన్లో కంది చెట్ల చాటుకు పోయినప్పుడు నీ మాదిరే ఎవరైనా సైకిల్లో వొచ్చి, నీ సైకిల్ని చూస్తే, వాళ్లకు అనుమానం రాదా?” అనే సందేహాన్ని వెలిబుచ్చింది. వెంటనే, అవును కదా అని గుర్తుకు తెచ్చుకొని, సైకిల్ దగ్గరకొచ్చి, ‘మరి సైకిల్ ఎక్కడ పెట్టల్ల?– చేన్లోకి దొబ్బుకొని పోయి, చెట్ల చాటున కింద పండేస్తే సరిపోతాది కదా!– అవునూ, పని అంతా ముగించుకొని, చేన్లో నుంచి సైకిల్ దొబ్బుకొని వొచ్చేటప్పుడు ఎవరైనా చూస్తే? థూ థూ! — ఇప్పుడు సైకిల్ లేకుంటే బాగుండేది! అయినా నాకు అనుభవం లేదు కదా, కొంతమంది కొత్త పెండ్లికొడుకులు శోభనం రోజు ఫెయిల్ అయినారని అనుకుంటా ఉంటారు కదా, అట్ల నేనూ ఫెయిల్ అయితే అప్పుడెట్ల? — అయినా ఈ మొరట మనిషితో ఎందుకులేబ్బా!’ అనుకుంటా వెనకంజ వేసినాను. నా తటపటాయింపును చూసి, “ఏమయివారూ, సూత్తావుంటే శానా పిరికోని మాదిరుండావే! సరే నువ్వేమొత్తావులే గానీ నేనే వొత్తాను, తొక్కుతావా?” అని అడుగులు ముందుకేసింది. ఆమె నర్మగర్భంగా మాట్లాడిన మాటలు నాకు అర్థమైనాయి. ఈమె చాలా బరితెగించిన దాని మాదిరుందే! అనుకుంటా కొంచెం జంకినాను. ఆమె నన్ను చూస్తా, ‘నన్ను సైకిల్లో నన్నా ఎక్కిచ్చుకోని పో సారూ’ అని దగ్గరికి రాసాగింది. స్కూలు వొదిలింటారు. మరూరు పిల్లలు ఎదురై చూస్తే ఎంత అసహ్యం అని అనుకుంటా సైకిల్ ఎక్క సాగినాను. నా పిరికితనాన్ని గమనించి ఆమె, ‘ నీకు తొక్కే అనుబోగం బొత్తిగా లేనట్లుండాదే! ఇట్లా వానివి ఇంగ నన్నేమి తొక్కుతావు పోప్పోవ్!’ అని వెటకారంగా అనింది. ఆ మాటల్లోని వెటకారమూ, అట్లా వానివి ఇంగ నన్నేం తొక్కుతావు అన్న మాటల్లో దాగిన బూతూ, అయివారూ సారూ అనిన మనిషి, పోప్పా చాలుగానీ అని రాగం తీస్తా ఈసడించిన విధానమూ నా మగతనాన్ని తాకింది. అవమానంతో మనసు చివుక్కుమనింది.
నిజమే, ఏ ఆడదైనా, ఇష్టపడిన మగవాడు తిరస్కరిస్తే కోపంతో రగిలిపోతాదని అనడానికి పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కదా! ఈమె కూడా ఆ విధంగానే నా మగతనములోని పిరికితనాన్ని గమనించి, భగ్నమైన ఆశతో రగిలిపోయి ఉంటుంది. రగిలిపోక ఏం చేస్తుంది పాపం! తమకంతో అర్ధనగ్నంతో ప్రవరుణ్ణి కౌగిలించుకోబోయిన వరూధిని మాదిరి ఈ అమాయకురాలు బరితెగించలేదు కదా! అందుకే తిరస్కారంగా,ఇంక పోవయ్యా చాలుగాని, అని తన కోపాన్ని వ్యక్తం చేసింది.
మనసులో అనుకుంటా అవమానంగా ఫీలయితా బండమీదపల్లెకు చేరుకుండాను.
కర్నూలు బిఇడి కాలేజీలో పండిట్స్ ట్రైనింగ్!
గురువు చిత్తరంజన్ దాస్ గారు కర్నూలు బిఇడి కాలేజీ నుంచి పండిట్స్ ట్రైనింగ్ అప్లికేషన్ తెప్పించినాడు. నేను వివరాలన్నీ భర్తీ చేసి కర్నూలు కాలేజీకి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపినాను.ఈ నెలలోపలే పండిట్స్ ట్రైనింగ్ అడ్మిషన్స్ ఉంటాయని మిత్రుడు రామ్మూర్తి ఉత్తరం రాసినాడు. నేను వెంటనే తిరుపతికి నాగ సిద్ధారెడ్డి గారికి జాబు రాస్తా, కర్నూలు బిఇడి కాలేజీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైనింగ్ సీటు వచ్చే విధంగా చూడమని కోరినాను. ఆయన వారం దినాలకి బదులు రాస్తా, నువ్వేమీ దిగులు పడొద్దు,అక్కడ మిత్రుడు మద్దయ్య, తెలుగు లెక్చరర్ నీకు ఏ సహాయం కావాల్సినా చేస్తాడు, నీకు ఒక వారం లోపల ఇంటర్వ్యూ కార్డు వొస్తుంది, రాగానే వెంటనే వెళ్లి ట్రైనింగ్‌లో జాయిన్ అయిపో అని సూచించినాడు. ఆయన చెప్పినట్లుగానే ఇంటర్వ్యూ కార్డు వొచ్చింది. వెంటనే స్కూల్లో రిలీవై రిలీవింగ్ సర్టిఫికెట్ తీసుకుండాను. హెడ్మాస్టర్ దగ్గర దాచి ఉంచిన 50 రూపాయలు వాపస్ తీసుకొని, చేబదుళ్లు, అంగట్లో చేసిన అప్పులు అన్ని తీర్చేసి, మిగిలిన 20 రూపాయలకు తోడుగా హెడ్మాస్టర్ దగ్గర 50 రూపాయలు అప్పుగా తీసుకొని, రావలసిన సెప్టెంబర్ జీతం రాగానే ఇస్తానని చెప్పి బయలుదేరినాను.
కర్నూల్లో పండిట్స్ ట్రైనింగ్ చేరడానికి పోతా ఉండానని నిన్న చెప్పగానే కళావతి ముఖం వాడిపోయింది. ఇప్పుడు బయలుదేరే ముందుగా చెప్పడానికి పోతే ఏడుస్తుందేమో! ఏడుస్తుందని కనిపించకుండా నేను వెళ్ళి పోవడం ధర్మం కాదు కదా! క్లాసు జరుగుతున్నప్పుడు వెళ్లి చెప్పితే తానొక్కతే బయటికి రాలేదు, తాను బయటికి వొచ్చి, నా ముఖంలోకి చూసి కన్నీళ్లు కారుస్తా ఏదో మాట్లాడుతుంది. ఆ కన్నీళ్లు, ఆ మాటలు, కష్టాలతో బాధలతో గాయపడిన నా హృదయానికి చల్లని లేపనమవుతాయి. కాబట్టి ఇంటర్వెల్ బెల్లు కొట్టగానే ఆ క్లాసుకు పోయేది మేలనుకొని, స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని టీచర్లతో మాట్లాడసాగినాను. అంతలోనే బెల్ కొట్టినారు. నేను వెంటనే ఆ క్లాస్ కి పోయి విషయం చెప్పినాను. అందరూ బాధపడినారు. ఒకరిద్దరు మగ పిల్లలూ ఆడపిల్లలందరూ కన్నీళ్లు కార్చినారు. నాకు చాలా బాధయింది.
ఆ పిల్లలకూ నాకూ ఏర్పడిన గురు శిష్య బంధం కేవలం ఐదు నెలలు మాత్రమే! ఈ మాత్రానికే హృదయంలో ఏదో చెప్పరానిది గిజగిజ తనకలాడసాగింది. అమాయకులైన ఆ పిల్లల్లోనా అంతే! ముఖ్యంగా ఆడపిల్లల్లో! ఇంక కళావతి ముఖం కాంతి విహీనమైంది. కళ్లల్లో నుంచి నీళ్లు ధారగా కారిపోతావుండాయి. ఆ కన్నీళ్లు నా హృదయాన్ని మెత్తగా కోయ సాగినాయి. బాధపడతా గద్గద స్వరముతో ‘ఇప్పుడే వెళ్లిపోతారా?’ అని మాత్రం అడిగింది. మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరుతాను అని అన్నాను.
“నేనూ, ఈశ్వరీ, భాగ్యా రూమ్ దగ్గరికి వొస్తాము” అని అనింది కళావతి.
“ఇప్పుడు పలకరిస్తా ఉండాను కదా! మళ్లీ రూమ్ దగ్గరికి ఎందుకొస్తారు?” అని నవ్వుతా అడిగినాను.
“ఏమి,రాకూడదా? వీళ్లెవరూ రాకపోయినా నేనొస్తాను, అంతే!” అని ఖరాఖండిగా చెప్పింది కళావతి. ఆ స్వరంలో, ఏదో వొక అనురాగపు హక్కు ధ్వనించింది. నేను ఆమె ముఖంలోని వేదనను చూసి కాదనలేకపోయినాను. సరే ముగ్గురూ తొందరగా రండి అని చెప్పి, టీచర్సందరికీ వీడ్కోలు పలికి రూముకు చేరుకుండాను.
నాగమణెమ్మ గారు చల్లని చేతులతో పెట్టిన భోజనం తిని, బయలుదేరడానికి సిద్ధంగా ఉండాను. ఇంటి ఉత్తరం నడవగుండా లోపలికొచ్చిన అమ్మాయిలను పలకరిస్తా, ఏమి భాగ్యా, మీ సారు వెళ్లిపోతా ఉండాడని పలకరించేకొస్తిరా? రూమ్ లో ఉన్నాడు, పొండి అన్న మాటలు నాకు వినిపించినాయి. నేను రూములో నుంచి బయటకొచ్చి, రండి రండి అని పిలిచినాను. వొచ్చి కూర్చుండారు.
“బాగా చదువుకోండి రా! ఈసారి మీకు పబ్లిక్ పరీక్షలు కదా! జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావల్ల! మళ్లీ మిమ్మల్ని కలుస్తానో లేదో” అంటా ఉంటే, నా గొంతు బొంగురు వోయింది. కళావతి గట్టిగా ఏడ్చేసింది. ఈశ్వరమ్మ కన్నీళ్లు పెట్టింది. భాగ్య కొంచెం గట్టిపిల్లేమో, వాళ్లిద్దర్నీ ఓదార్చసాగింది. ఆ అమ్మాయి, బావి పక్కనే ఉన్న పోస్టుమాస్టర్ తిప్పారెడ్డి కూతురు. నేను వాళ్ళ దగ్గరికి జరిగి, ఏడుస్తున్న కళావతి కన్నీళ్లు తుడిచి, తలనిమురుతా, “పిచ్చిపాపా, ఊరుకో! ట్రైనింగ్ అయిన తర్వాత నీ కోసమైనా మళ్లా ఈ ఊరికే వస్తానులే!”అని ఓదార్పు మాట అన్నాను.
“నిజంగా వస్తారా?” అని ఏడుపు లోనే నవ్వుల్ని చిలకరించింది. ఆ నవ్వుల చూపులు చల్లగా హృదయాన్ని తాకినాయి.
వాళ్లను స్కూలుకు పంపి లగేజీ తీసుకొని పోవడానికి మరూరు పిల్లవాడిని సహాయంగా పిలుచుకొని బయలుదేరి మరూరు దగ్గర అనంతపురం బస్సెక్కినాను.
పొలాల మధ్య రోడ్లో మెల్లగా బస్సు పోతావుంది. మనసులో ఏవేవో జ్ఞాపకాలు, ఆరాటాలు మెదల సాగినాయి. ఒక ప్రాంతం తోనా ఒక ఊరితోనా ఊరి మనుషులతోనా కొంతమంది వ్యక్తులతోనా మనసు ఏర్పరచుకున్న పరిచయాలు, మనసుతో కల్పించుకున్న బంధాలు ఎంత బలమైనవి! మనసును ఎంతగా లాగుతాయి! ఏ ప్రాణికీ లేని ఈ మానసిక బంధం మనిషిని ఎంత మెత్తగా నలుపుతుంది! ఇందుకేనేమో, నండూరి సుబ్బారావు తన ఎంకి పాటల్లో అంత అద్భుతంగా, గుండెల్లో దిగబడే విధంగా మధురమైన ప్రేమ భావనను అభివ్యక్తం చేసిండేది!
ఎంకి పాటలు గుర్తుకు రాగానే “ఎనక జలమములోన మనమెవరిమోలేనంటి,సిగ్గొచ్చి నవ్వింది సిలక నాయెంకి, ఎన్నాళ్లు మనకోలే ఈ సుకము లాంటి, కంటనీరెట్టింది జంట నా యెంకి” అనే నండూరి పాదాలు గొంతులో రాగాలు పోయినాయి. ఎందుకో కనుగుడ్ల మీద, ఒక తీయని కన్నీటి తెర కమ్ముకుంది
***
కర్నూలు బిఇడి కాలేజీలోని పండిట్స్ ట్రైనింగ్‌లో 29-12-1969వ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు చేరినాను. చేరిన వెంటనే లెక్చరర్ మద్దయ్య సార్‌ను కలుసుకొని నమస్కరించి నాగ సిద్ధారెడ్డి గారిని గుర్తు చేసినాను. ఆయన ఆప్యాయంగా పలకరించి,ఏ అవసరమొచ్చినా నాతో చెప్పు నారాయణా అని భరోసా ఇచ్చినాడు. కాలేజీలో చేరిన తరువాత నాకన్నా ముందు బ్యాచ్‌లో చేరి ట్రైనింగ్ అవుతున్న నా విద్వాన్ క్లాస్‌మీట్ రామ్మూర్తిని కలుసుకుండాను. అతడూ వాళ్లన్న మారుతీ రామారావూ ఒకే రూములో ఉండారు. మారుతీ రావు బీఈడీ చేస్తా ఉండాడు. ఆయన అకడమిక్ ఇయర్ చివరి వరకు, అంటే ఏప్రిల్ వరకు ఉంటాడని, రామ్మూర్తి, పరీక్షలు ముగించుకొని వెళ్ళిపోయినంక మారుతీ రావుతో పాటు ఆ రూములో నేను ఉండవచ్చునని నిర్ణయించుకుండాను.
కాలేజీలో చేరినానే గాని పాఠాలు జరగడం లేదు. ఈ రోజు జనవరి రెండవ తేదీ. లెక్చరర్ శేషయ్య సార్ మా క్లాసుకు వచ్చి అటెండెన్స్ తీసుకొని విద్యార్థులందరినీ పరిచయం చేసుకుండాడు. నా పేరు చెప్పగానే “ఓహో నువ్వేనా శాంతినారాయణ? నువ్వు అష్టావధానాలు చేస్తున్నావా? వెరీ గుడ్! ఈ మధ్యనే ఎక్కడో నువ్వు అష్టావధానం చేసినట్లుందే! ఈరోజు పేపర్లో వార్త వచ్చింది, చూశావా?” అని అడిగినాడు. చూడలేదని, చూస్తాను సార్ అని కూర్చుండాను. కాలేజీలో మొదటి రోజే నేను అష్టావధానిగా మా లెక్చరర్ ద్వారా విద్యార్థులందరికీ పరిచయం కావడం గర్వంగా ఫీల్ అయినాను. నాతోపాటు ట్రైనింగులో చేరిన విద్యార్థులు చాలామంది మా విద్వాన్ క్లాస్‌మీట్స్ కావడం మరింత సంతోషాన్ని కలిగించింది. శివగౌడు, నందవరం కేశవరెడ్డి, ఆచారి ఇంకా కొంతమంది మా విద్వాన్ క్లాస్ మీట్స్ ట్రైనింగులో చేరినారని గుర్తించి, సంతోషపడినాను. వాళ్లు కూడా పండిట్స్ ట్రైనింగ్ మొదటి బ్యాచ్‌లో చేరలేదంటే, వాళ్లూ నా మాదిరే ఆర్థికమైన ఇబ్బందులతో చేరలేదేమో అనుకున్నాను. శివగౌడు, కేశవరెడ్డి, ఆచారి నా బ్యాచ్‌లో చేరడంతో లీలావతి గుడకా చేరిందేమోనని శివగౌడును విచారించినాను. చేరలేదన్నాడు మిత్రుడు. పోనీలేబ్బా, చేరి ఉంటే, మళ్లీ ఆ పాత జ్ఞాపకాలు ఆ చూపులు ప్రారంభమైతే, ఏ సాహసమూ చేయలేని ప్రేమ విషయంలో అసమర్థుడనయిన నాకు అనవసరమైన ఆ మూగ ప్రేమా ఆ నాన్సెన్సంతా నరకయాతన కలిగించేవని, అది తప్పిందని కొంచెం ఊరట చెందినాను.
నాలుగు దినాలు గడిచినా క్లాసులు సరిగా జరగలేదు. 8వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులని తెలిసింది. క్లాసులు జరగనప్పుడు ఇక్కడ ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులే గాని ప్రయోజనం ఏమీ లేదనుకొని ఊరికి పోతే, మాగాణిలో కూలిపనులు ఉంటాయని, వెంటనే బయలుదేరి సొంతూరు బండమీద పల్లికి చేరుకుండాను. అనుకున్నట్టే మాగాణిలో మడి దున్నే పనులు దండిగా ఉండాయి. నేను ఊరు చేరుకుండే నాటికే నాయన వరిససి పోసినాడు. తమ్ముడు పెద్దన్న, కోరుకు చేసుకున్న జొన్ను మడిలో ఇరుసాలు బుడదమడక దున్ని, పెళ్ళతొక్కి పెట్టినాడు. ఇంక అన్నీ కూలి పనులే! మాగాణిలో మడకబాడుగ దినానికి నాలుగు రూపాయలు చేసినారు. పయిటాల అన్నం పొద్దు తర్వాత సాయంకాల వరకు మళ్లల్లో పారతో గెనాలు చెక్కడానికో, పెల్ల తొక్కడానికో, వరినారు మోయడానికో, మడికయ్యల్లో నారు కట్టలు నెరేయడానికో పోతే మూడు రూపాయల కూలి! ఆ లెక్కన రోజూ ఏడు రూపాయలు కూలి డబ్బులు చేతికి రావడం చూసి చాలా ఆనందమైంది. నా ఉద్యోగం కంటే ఇదే బాగుందే అనిపించింది. అందుకేనేమో నాయన, నేను ఈ కూలి పనులకు దూరమై ఇంటికి కూలిదుడ్లు తీసుకొని రాకపోగా ఇంటి నుంచే చదువు ఖర్చులకు డబ్బులు ఆశిస్తా ఉండానని బాధను వెల్లగక్కుతా వుంటాడు. నిజమే! ఎల్లకాలమూ ఈ విధంగా కూలిపనులు ఉండవు కదా! ఉండినా, కూలోళ్లమే కదా! చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే ఈ కూలి బతుకు ఉండదు కదా!
ఆలోచిస్తా, అలవాటు తప్పినందువల్ల కూలి పని పరువైనా ఓపిక తెచ్చుకొని సహనంతో చేయసాగినాను. మద్యాహ్నం తరువాత కూలి దొరకనప్పుడు ఇంటిదగ్గర చెట్టు కింద కూర్చొని నవలలు కథలు చదవసాగినాను. ‘మృగనయని’ చారిత్రాత్మక నవలను చాలా ఆసక్తిగా, రెండు దినాల లోపల చదివేసినాను. ఒక పల్లెటూరి అందాల మోహనాంగి మృగనయని! వీరవనిత మంచాల మాదిరి గొప్ప సాహస పరాక్రమవంతురాలు! విలువిద్యా లాఘవం అమోఘంగా తెలిసిన లావణ్యవతి! ఉదాత్త భావనా మగ్న మానసురాలు! అవివాహిత! ఆమె అన్న అటల్ సింగ్! ఆమెకు అన్ని విధాలా సరితూగలిగిన స్నేహితురాలు లాఖీ! చాలా కొంటె పిల్ల! నవ యవ్వన సౌందర్య రూప మనోహరి! ఎవరూ లేని అనాథ! ఎక్కడో అంతరాంతరాళాల్లో దాగిన యవనోద్రేకంతో ఊగిసలాడుతున్న ముగ్ధమోహనాంగి! తన స్నేహితురాలైన మృగనయన సోదరునిపై మొహం పెంచుకున్న ప్రేమ మూర్తి!
ఈ విషయ ప్రస్తావనలతో నవల ప్రారంభమై, మనసును తన వెంట లాక్కొని పోయింది. మృగనయన, లాఖీల కోమల భావనలు, ఆ భావనలకు విరుద్ధంగా వారి మృగయా వినోదము, జంతువులను వేటాడడంలో వారి బాణప్రయోగ హస్త లాభవము, క్రూర జంతువులను కూల్చడంలో వారి నైపుణ్యము,వారి పక్కనున్న పూజారి వేదాంతము అన్నీ ఉదాత్తంగా వర్ణింపబడి పాఠకున్ని అబ్బురపరుస్తాయి.
పట్టుకున్న నవలను వదలకుండా చదివినాను. రాజుల కుతంత్రాలు, కుట్రలు, కామోద్రేకాలు అద్భుతంగా వర్ణింపబడినాయి. అటువంటి కుతంత్రాలతో రాజ్యమేలుతున్న ఒక మహమ్మదీయ రాజు, మృగనయన, లాఖీల అందచందాలను పరాక్రమాదులను తెలుసుకొని, వారిని ఎలాగైనా తన దగ్గరకు రప్పించడానికి తన వేగులను పంపుతాడు. ఆ సమయంలోనే మృగనయనకు పరిచయమైన పూజారి, మాన్సింగ్ మహా రాజుకు ప్రీతిపాత్రుడై, మృగనయన లాఖీల వృత్తాంతం రాజుకు విన్నవిస్తాడు. రాజు మారువేషంలో ఆ పల్లెకు పోయి మృగనయన విలువిద్యా పాటవానికీ పరాక్రమానికీ ఆశ్చర్య చకితుడై, ఆమె సమ్మోహన రూపలావణ్యాలకు ముగ్ధుడై, ఆమెకు ముత్యాలహారాన్ని బహూకరించి, లాఖీని అభినందిస్తాడు. మృగనయన సామాజిక స్థితిగతులను లెక్కచేయకుండా పూజారి ద్వారా తన మనోగతాన్ని మృగనయనకు తెలియజేసి, ఆ నిరుపేద ధీరవనితను పెళ్లి చేసుకుంటాడు. ఉదాత్తంగా సాగిన మృగనయన నవలలను చదివి భవిష్యత్తులో ఇటువంటి చరిత్రాత్మక నవలను రాయాలని అనుకుండాను.
దాదాపు మూడు వారాలలో 10 దినాలు మాగాణిలో మడక దున్ని, మధ్యాహ్నం నుంచి ఇతర కూలిపనులకు పోయి 55 రూపాయలు కూలి చేసి, నేను 25 రూపాయలు తీసుకొని, నాయనకు 30 రూపాయలు ఇచ్చి, వంటకు కావలసిన దినుసులన్నీ తీసుకొని బయలుదేరి కర్నూలుకు చేరుకుండాను.
సంక్రాంతి సెలవులు వెళ్లిపోయి కాలేజీ రీవోపెన్ అయిన వారం దినాల వరకు క్లాసులు సరిగా జరగలేదు. కాలేజీ లైబ్రరీలో అడవి బాపిరాజు గారి గోనగన్నారెడ్డి నవలను తెచ్చుకొని, రెండు దినాలలో మొత్తం చదివేసినాను. అది గుడకా చరిత్రాత్మక నవలే! చక్కని భాష! శిష్ట వ్యావహారికం! ముగ్గురు యువతుల పరాక్రమం, ఉదాత్త జీవితం, ఆదర్శప్రేమ అప్రతిమానమైనవి. ప్రపంచంలో అన్నింటికన్నా సుందరమైనదీ, మనిషిని మనిషిగా ఆవిష్కరించేదీ బ్రహ్మానందాన్ని కలిగించేదీ ప్రేమ ఒక్కటే అని యువతులు ముగ్గురు తమ జీవన విధానాల చేత వ్యక్తపరుస్తారు. గొప్ప శైలీ విన్యాసంతో నవల మనసును పరవశింపజేసింది. ఎంతో మంది వీరుల, వివిధ దేశాల రాజుల, నాయకుల పేర్లను, వారి వైవిధ్యమైన జీవన రీతులను రచయిత చిత్రించిన తీరు అద్భుతం అనిపించింది. నవల చదవడం ముగించేసరికి హృదయములో వలపుమొలకలు మొలకెత్తినాయి. మమతల మల్లెలు విరబూసినాయి. కొత్త కొత్త ఇతివృత్తాలతో ఏదేదో రాయాలన్న తపనను నవల ప్రేరేపించింది.
కర్నూలు రాష్ట్ర రాజధానిగానే ఉంటే..?
నవల చదివిన తర్వాత రెండు మూడు రోజులు కర్నూలు పట్టణాన్ని పరిశీలించినాను. అనంతపురానికి వెళ్లే రోడ్డుపక్కనే మా కాలేజీ! కాలేజీ వెనకాల, దక్షిణం వైపున్న హాస్టల్ బిల్డింగే పట్టణానికి దక్షిణం హద్దు! ఉత్తరం ముఖంగా కాలేజీ! దాని ముందర వొక చిన్న గ్రౌండు! అనంతపురం డిగ్రీ కాలేజీ బిల్డింగూ, గ్రౌండూ చూసినంక వాటి ముందర ఇవి చాలా నఫరగా అనిపించినాయి. ఈ మాత్రం కాలేజీని కర్నూలు పట్టణానికి ఇంత దూరంలో ఎందుకు కట్టినారబ్బా, టౌన్లో ఈ మాత్రం స్థలం ఎక్కడా దొరకలేదా అని అనుకుండాను. కాలేజీకి పడమర వైపు అనంతపురం రోడ్డు పక్కనే ఉన్న బిర్లా సబ్బుల ఫ్యాక్టరీని చూసి, ఓయమ్మా-ఎంత పెద్ద ఫ్యాక్టరీ, సుమారుగా యాభై అరవై ఎకరాలు ఉంటాదేమో అని ఆశ్చర్యపోయినాను. ఫ్యాక్టరీలో ‘నిరాల’ సబ్బు తయారవుతుందంట! అది బట్టలుతికే సబ్బంట! దేశంలో పేరు మోసిన కంపెనీలు టాటా బిర్లా! ఆ బిర్లా వాళ్లు ఇంత దూరం వొచ్చి సబ్బుల ఫ్యాక్టరీ కట్టినారని తెలుసుకొని విస్తుపోయినాను.
అనంతపురం రోడ్లో అట్లే టౌన్ వైపు ముందుకు పోయినాను. కుడి వైపున, మా కాలేజీకి ఉత్తరం దిక్కులో మొదట అన్నీ క్వార్టర్స్ కనిపించినాయి. దాన్నంతా ‘బి’క్యాంప్ అని,ఇంకా కొంచెం ముందున్న క్వార్టర్స్‌ను ‘సి’ క్యాంపు అని తెలుసుకుండాను. ఆ క్వార్టర్సన్నీ, కర్నూలును ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా చేసినప్పుడు పెద్దపెద్ద అధికారులు, మధ్యతరగతి అధికారులు ఉండడానికి కట్టిన క్వార్టర్సని తెలియగానే, రాష్ట్ర రాజధానిని కర్నూలుకు ఇచ్చినట్లే ఇచ్చి మూన్నాళ్ళ ముచ్చట చేసి, కడాకు రాజధానిని హైదరాబాదుకు తన్నుకొని పోయినదంతా గుర్తుకొచ్చి, శ్రీ బాగ్ వొడంబడిక ప్రకారం కోస్తాంధ్ర రాజకీయ నాయకులు రాయలసీమకు రాజధానిని గానీ కృష్ణా జలాలను గానీ దక్కనీయకుండా చేసిన కుతంత్రాన్ని తలుచుకొని బాధపడినాను. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని అంతా భవిష్యత్తులో ఒక మంచి నవల రాయల్లని అనుకుండాను.
‘సి’ క్యాంప్ క్వార్టర్స్ నుంచి తూర్పుకుపోయే రోడ్డు నంద్యాల కడప లకు పోతాదని తెలుసుకొని, కొంచెం ముందుకు పోయినాను. అనంతపురం రోడ్లో నుంచి నంద్యాల వైపు తిరిగిన రోడ్లో మొదట మాత్రమే కొన్ని ఇండ్లు కనిపించినాయి. ఆ ఇండ్ల తర్వాత అన్నీ రేగడి పొలాలే! జొన్న వేసినారు. అక్కన్నుంచీ మళ్లా అనంతపురం రోడ్లోకి వొచ్చి, ముందుకు పోయినాను. ఎడమ పక్కన ఒక గుడి కనిపించింది. అది బిర్లా మందిరమంట! దానికి ఎదురుగా రోడ్డుకు తూర్పు వైపునున్న ప్రదేశమంతా ఖాళీ స్థలమే! ఆ స్థలమంతా గుంతలు గుంతలుగా ఎందుకుందో అర్థం కాలేదు. కొంచెం సేపు ఆలోచన చేసినంక అర్థమయింది, రాజధాని వచ్చినప్పుడు క్వార్టర్సూ ఇతర ఆఫీసు కార్యాలయాలన్నీ కట్టడానికి మట్టిని తవ్వినప్పుడు ఏర్పడిన గుంతలని! అట్లే ముందుకు పోయి, రోడ్డుకు అడ్డంగా వచ్చిన పెద్ద కాలువను చూసి అబ్బురపోతా, దొమ్మలు గుద్దుకుండాను. అది కెసి కెనాలంట! ఆ పేరు వినగానే, మా కుటుంబమంతా ప్రొద్దుటూరు దగ్గరున్న సీతంపల్లికి కేసీ కెనాల్ కాలువ పనులకు వలస పోయిన సంగతి గుర్తుకొచ్చింది.
రాయలసీమకు తెల్లవాళ్లు పెట్టిన బిక్ష కె.సి కెనాల్!
రోడ్డు పక్కన మోరీ వారన నిల్చుకొని కాలువను చూసినాను. ఒక పెద్ద ఏరు మాదిరుంది! నీళ్లు సుళ్లు సుళ్లు తిరుగుతా పోతా ఉండాయి. కాలువ వెడల్పు దాదాపు తొంభై నుంచి నూరడుగులు ఉంటాదనుకుండాను. కాలువను గురించి పూర్తి వివరాలు పెద్దవాళ్లను అడిగి తెలుసుకోవల్లనుకుండాను. కాలువ రెండు వైపులా సిమెంటుతో లైనింగ్ వేసి ఇరువైపులా మెట్లు కట్టినారు. కాలువ ఫుల్లుగా పోతావుంది. మెట్ల మీద కూర్చొని కొంతమంది బట్టలు ఉతుకుతా ఉండారు. వాళ్లను చూసి, ‘ఎంత ధైర్యం వీళ్లకు? కాలుజారి కాలువలోకి పడితే, ఈత రాకుంటే, అంతే సంగతులు కదా! బహుశా వాళ్లకు ఈత వొస్తాదేమో! ఈత వచ్చే స్నేహితులతో కలిసి వొచ్చి వొకసారి కాలువలో ఈదులాడల్ల’ అని అనుకుంటా ముందుకు పోయినాను. ఎడమవైపున, కాలువ దగ్గర నుంచి ఉత్తరం దిక్కుకు రోడ్డు వారగా ఉండేది కర్నూలు మెడికల్ కాలేజీ అని తెలుసుకొని అబ్బురపోయినాను. కాలేజీ మొత్తం ఏరియా 120 ఎకరాలని తెలిసి మరింత అబ్బురపోయినాను. కాలేజీకి ఎదురుగా తూర్పు వైపున చిన్న చిన్న సందులు గొందులతో ఒక పల్లె మాదిరి ఊరు! కేసి కెనాల్ దగ్గర్నుంచి సుమారు రెండు మైళ్ల దూరం పోయినంక పెన్నానది మాదిరి ఏదో ఏరొచ్చింది. దాన్ని చూసి నేను తుంగభద్రా నది అనుకుండాను. కాదంట! హంద్రీనది అంట! తుంగభద్రా నది, కర్నూలు టౌన్ పక్కనే, ఉత్తరం వైపున ఉంటాదంట! ఆ నదే రాయలసీమకు హద్దంట! నది అవతలి గట్టు నుంచి తెలంగాణ అంట! అది తెలుస్తానే, కర్నూలు అవతలికి పోయి తుంగభద్రానదిని చూడల్లని అనిపించింది. సైకిల్ లేకుండా ఈ రోజు అంత దూరం పోయి రావడం కష్టం అనుకొని, హంద్రీ బ్రిడ్జిని దాటి, అవతలికి పోయినాను. పోతానే ఎడమవైపున్నది మెడికల్ కాలేజీ హాస్టలంట! బ్రహ్మాండమైన బిల్డింగు! అది, రాష్ట్ర రాజధాని కర్నూలులో ఏర్పాటైనప్పుడు ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాస భవనమని చంద్రశేఖర కల్కూర చెప్పడం విని మురిసిపోయినాను.
మరుసటి రోజు వీలు కల్పించుకొని పొద్దుగలగ బయలుదేరి నేరుగా తుంగభద్రా నది ఒడ్డున ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి చేరుకొని, నది వైపు చూసి అబ్బుర పోయినాను. నది ఇసుకతిన్నెలు కనిపించకుండా పారుతా ఉంది! నదీ ప్రవాహం తగ్గిందని, తగ్గినా అన్ని నీళ్లు ప్రవహిస్తున్నాయని, నదికి వరదలొస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందోనని తనివి తీరా చూసినాను. ఇటువంటి నది మా అనంతపురం జిల్లా మధ్యలో ప్రవహిస్తే ఎంత బాగుండేదో కదా అని ఆశపడినాను. ఎండల కాలంలో సాయంకాలం పూటల నది గట్టున ఇసుకతిన్నెల మీద కూర్చొని సూర్యాస్తమయ సమయంలో ఎర్రని ఆకాశం వైపు చూస్తూ కాలం గడపడం ఎంత అదృష్టమో అని లేని అదృష్టాన్ని కాసేపు కలగన్నాను.
కర్నూలుకు తూర్పు వైపు దిగువన హంద్రీనది తుంగభద్రలో కలుస్తాదని, ఇంకా కొంచెం కిందికి పోయినంక తుంగభద్ర కృష్ణా నదిలో కలుస్తాదని, పడమటి కనుమల్లో వేరువేరు ప్రాంతాల్లో పుట్టిన నదులు ఇంత దూరం ప్రయాణం చేసి నల్లమల కొండలకు ఎగువ భాగంలో సంగమేశ్వరం దగ్గర ఏకమవుతాయని తెలుసుకోగానే మనసులో కొంచెం సేపు ఏవేవో భావాలు మెదిలాడినాయి. ఏదో సినిమాలోని “ఆడవే జలకమ్ములాడవే” అనే పాట గుర్తుకొచ్చింది. సంగమేశ్వర దేవాలయం దగ్గర తుంగభద్ర కృష్ణలో లీనమై చివరికి తన పేరునూ తన ఉనికినే కోల్పోవడం మనసులో మెదిలింది. ఎక్కడో పుట్టి పెరిగి పెద్దదై, ఇంకొకరి జీవితంలోకి ప్రవేశించి, చివరికి తన ఆస్తిత్వాన్ని పోగొట్టుకునే హిందూ స్త్రీని ఊహించుకొని కొంచెం సేపు మౌనంగా ఉండి పోయినాను.
తుంగభద్రాతీరం నుంచి టౌన్లోకి వొచ్చి పెద్ద బురుజును చూసినాను. దాని పేరు కొండారెడ్డి బురుజంట! టౌన్ నడిబొడ్డులో అద్భుతమైన ఎర్రరాయితో నిర్మించిన బురుజు బ్రహ్మాండంగా ఉంది! దాన్ని గురించీ మిగతా కర్నూలు పట్టణంలోని ముఖ్యమైన కట్టడాలను గురించీ తెలుసుకోవల్లని కొండారెడ్డి బురుజుకు సమీపంలోనే బస్టాండ్ దగ్గర కల్కూర హోటల్ దగ్గరికి పోయి చంద్రశేఖర్ కల్కూర గారిని కలుసుకుండాను.
కల్కూర గారు నాకంటే దాదాపు ఆరు సంవత్సరాలు పెద్దవాడని తెలిసింది. తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకున్న వ్యక్తిగా కనిపించినాడు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరి సర్వోత్తమరావుతో బాగా పరిచయం ఉన్నట్లు చెప్పినాడు. నా చదువును గురించీ ఆశావాదితో నాకున్న సాన్నిహిత్యాన్ని గురించీ తెలుసుకొని చాలా ప్రేమగా ఆదరించినాడు. మధ్యాహ్నం ఆయన హోటల్లోనే ఆతిథ్యం ఇచ్చినాడు. నేను ఆయన వాత్సల్యానికి పరవశించి పోయినాను. నా ఆసక్తిని గుర్తించి నాకు కర్నూలు పట్టణ ప్రాముఖ్యతనంతా పూసగుచ్చినట్లు చెప్పసాగినాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్లందరూ ఎన్నో కారణాలవల్ల తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1911లో ఆంధ్ర మహాసభను స్థాపించి 1913లో బాపట్లలో మొదటి మహాసభను నిర్వహించి తమ ఆకాంక్షను వ్యక్తం చేసినారు. మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న తమ ప్రజల కోసం, తమ ప్రాంత అస్తిత్వ సంరక్షణ కోసం ఆంధ్ర మహాసభను ఆంధ్రోద్యమ సంస్థగా మార్చుకొని, ప్రతి సంవత్సరమూ ఒక్కొక్క ప్రాంతంలో మహాసభలను నిర్వహించి వాటి ద్వారా తమ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియపరుస్తూ వొచ్చినారు.
ఆంధ్రోద్యమం ఒక కార్మికోద్యమం మాదిరి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసే రూపంలో కాకుండా ప్రభుత్వానికి నిరసన తెలిపే పద్ధతిలో కొనసాగింది. ఆంధ్రోద్యమం ప్రారంభమయ్యే నాటికి మద్రాసు నగరంలో 60 శాతం మంది ప్రజలు తెలుగువారే! అంతేకాదు, మద్రాస్ నగరంలోని అనేక పరిశ్రమలు, తెలుగు వార్తాపత్రికా కార్యాలయాలు, వార పక్ష మాస పత్రికలు, సినిమా ఇండస్ట్రీ మొదలైనవన్నీ ఆంధ్రులవే! మద్రాస్ ఆదాయంలో మూడింట రెండు వంతులు ఆంధ్రుల నుంచే! అయినా ప్రభుత్వ పెత్తనంతా తమిళులదే! దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రులకు, ఆంధ్రభాషకు గుర్తింపే ఉండేది కాదు! ఉన్నత విద్యాసంస్థలన్నీ తమిళనాడులోనే! ఉన్నత విద్యావంతుల శాతమూ ఉన్నతోద్యోగాలూ జడ్జీల పదవులూ అన్నీ వాళ్ళవే! ఈ చారిత్రక వాస్తవాలన్నీ తెలుగు వాళ్లను, ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతీయులను బాధించినాయి.
ఆ రోజుల్లో ప్రధానమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే! కమ్యూనిస్టు పార్టీ, జస్టిస్ పార్టీల వంటివి ఒకటి రెండు నామమాత్రంగా ఉండేవి. ఆంధ్రోద్యమ నాయకులందరూ ఆ సమయంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ నాయకులే! వారిలో ఎక్కువ భాగం, అన్ని విధాలా సంపన్నులైన-రాజకీయ చైతన్యవంతులైన కోస్తాంధ్ర నాయకులే! అందువల్ల పదైదు ఇరవై సంవత్సరాల పాటు జరిగిన ఆంధ్ర మహాసభలలో, ఆ సభలు చేసిన తీర్మానాలలో, రాయలసీమ నాయకుల అభిప్రాయాలను, శతాబ్దాలుగా వెనకబాటుతనంతో మగ్గిపోయిన రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రాంతీయ వివక్ష ధోరణులు బయటపడసాగినాయి.
ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు – ధిక్కార స్వరాలు – శ్రీ బాగ్ ఒడంబడిక!
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన ఆంధ్రాప్రాంతం విద్యా వికాసాలకు దూరమైందని చెప్పుకున్నాం. విద్యాభివృద్ధికి కొంత దూరమయినా ఆర్థిక అభివృద్ధి విషయంలో కోస్తా ప్రాంతం, సర్ ఆర్థర్ కాటన్ దొర కృషి కారణంగా రాజమండ్రి దగ్గర గోదావరి నదిపైన నిర్మాణమైన ధవలేశ్వరం ఆనకట్ట వల్లను,విజయవాడ దగ్గర కృష్ణానది పైన నిర్మాణమైన కృష్ణా బ్యారేజీ వల్లను సుసంపన్నమైంది. అటు వ్యవసాయాభివృద్ధి పరంగాను, ఆర్థికాభివృద్ధి పరంగాను, ఇటు విద్యా విషయంలోనూ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ప్రాంతం దత్త మండలాలని, అటువంటి దత్త మండలాలలో మొదట విద్యా వికాసం జరగాలని, ఆంధ్ర మహాసభలలోని నాయకులందరూ చర్చించి పూర్తి వెనకబడిన అనంతపురంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నెలకొల్పడానికి అంగీకరించినారు. అందుకు ఒకరిద్దరు కోస్తా ప్రాంత నాయకులు విముఖత చూపడంతో ఆ విషయం పైన మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో, సెనేట్ కమిటీలో, ఆంధ్ర మహాసభ మీటింగ్సులో చర్చకు పెట్టి, చివరికి శాసనమండలిలో సభామోదం కోసం ఓటింగ్ జరిపినారు. ఆ ఓటింగులో ప్రవేశపెట్టిన బిల్లు 35-20 ఓట్ల తేడాతో దత్త మండలాలకు అనుకూలంగా నెగ్గింది. దత్త మండలాల వాళ్లు, (అప్పటికి ఈ జిల్లాలకు రాయలసీమ అనే పేరు లేదు) ఆంధ్ర విశ్వవిద్యాలయం తమ ప్రాంతానికి ఈరోజో రేపో తప్పకుండా వొస్తుందని అనుకుంటున్న సమయంలో 1926లో అనూహ్యంగా కోస్తా నాయకులు తమ రాజకీయ పన్నాగంతో ఆ విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడకు ఆ తర్వాత విశాఖపట్నానికి తన్నుకొని పోయినారు.
ఆంధ్ర మహాసభలోని సోదర కోస్తా కాంగ్రెస్ నాయకులు చేసిన నమ్మకద్రోహాన్ని దత్త మండలాల నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. మనమెక్కిన చెట్టుకొమ్మను మన చేతులతోనే నరికించి, కిందపడిన మనమీద పెదవుల పైన సానుభూతి చూపే మనస్తత్వం గల కోస్తా కాంగ్రెస్ నాయకుల పైన దత్త మండలాల్లో అగ్రహజ్వాలలు పెల్లుబికినాయి. ఎవరికో ఎవడో, వాని పరిపాలన సౌకర్యం కోసం దత్తత ఇస్తే ఆ జిల్లాలను దత్త మండలాలని అనడమేమిటి, అసహ్యంగా అని మన ప్రాంత నాయకులందరూ గాడిచర్ల హరి సర్వోత్తమరావు నేతృత్వంలో నంద్యాలలో సమావేశమై చర్చించి, చిలుకూరి నారాయణ రావు గారు సూచించిన రాయలసీమ పేరును ఏకగ్రీవంగా ఆమోదించి, అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని రాయలసీమగా పేర్కొనసాగినారు. అంతటితోనే తృప్తి పడక ఆంధ్ర మహాసభకు ప్రతిద్వంద్వంగా రాయలసీమ మహాసభను ఏర్పాటుచేసి, ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాయలసీమకు కలిగే లాభమేమిటని, మేము ఇంకా కోస్తాంధ్ర నాయకుల మాయమాటలకు మోసపోలేమని, మాకు మద్రాసు రాష్ట్రమే అన్ని విధాలా అనుకూలమని, కోస్తాంధ్ర నాయకుల ప్రత్యేక రాష్ట్రవాదాన్ని పరోక్షంగా వ్యతిరేకించసాగినారు. దాంతో కోస్తా నాయకులలో ఆందోళన మొదలైంది. రాయలసీమ సీనియర్ కాంగ్రెస్ నాయకులను బుజ్జగిస్తూ దువ్వుతూ పొగడుతూ కొంతమందిని తమ వైపు తిప్పుకోసాగినారు. అదంతా గమనించిన, కోస్తా కాంగ్రెస్ నాయకుల నక్కజిత్తుల వ్యవహారాలను పసిగట్టిన కల్లూరు సుబ్బారావు, మదనపల్లి రామకృష్ణారెడ్డి, హాలహర్వి సీతారామిరెడ్డి, పప్పూరు రామాచార్యులు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు మొదలైన కొంతమంది, కోస్తా కాంగ్రెస్ నాయకుల కుయుక్తులను కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వొచ్చినారు. కోస్తావాళ్లు వెలువరించే వార్తాపత్రికలకు సమవుజ్జిగా పప్పూరు రామాచార్యులు ‘సాధన’ పత్రికను స్థాపించి, దానిని వాయిస్ ఆఫ్ రాయలసీమగా నడుపుతూ, కోస్తా కాంగ్రెస్ నాయకులు రాయలసీమ అభివృద్ధికి ఏ విధంగా మోకాలడ్డుతున్నదీ రాయలసీమ వాసులకు మద్రాసునగరం ఏ విధంగా అనుకూలమైనదీ వివరిస్తూ వ్యాసాలు రాయసాగినాడు.
అటువంటి పరిస్థితులలో కోస్తా కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర మహాసభ రజతోత్సవాలను 1937 అక్టోబర్ 25, 26 తేదీలలో విజయవాడలో భారీ ఎత్తున నిర్వహించినారు. ఆ ఉత్సవాలలో మొదటిరోజు రాయలసీమ కాంగ్రెస్ నాయకులైన కడప కోటిరెడ్డిని, రామకృష్ణారెడ్డిని, గద్దె రంగయ్యనూ, చల్లపల్లి రాజావారు అంబారీలతో ముస్తాబు చేయించి పంపిన ఏనుగుల మీద ఎక్కించి ఊరేగించినారు. దాంతో రాయలసీమ నాయకులెవరూ నోరు విప్పరని అనుకున్నారు. ఒక మోతాదులో రామకృష్ణారెడ్డీ, తీవ్ర స్వరంతో గుత్తి కేశవపిళ్లె, కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు ఇంకా కొంతమంది, రాయలసీమ వాసుల మద్దతు లేకుండా ప్రత్యేక రాష్ట్రం రాదని, రాయలసీమ వాళ్ల మద్దతు కావాలనుకుంటే, ప్రత్యేక రాష్ట్రం కోసం చేసే తీర్మానంలో రాయలసీమ సమగ్రాభివృద్ధికి మేము ప్రతిపాదించే అంశాలు పొల్లు పోకుండా చేర్చాలని డిమాండ్ చేసినారు. దాంతో రాయలసీమ సహకారం లేకుండా ప్రత్యేక రాష్ట్రం రావడం అసాధ్యమని గ్రహించిన కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య వంటి సీనియర్ నాయకులు రాయలసీమ వాసుల డిమాండ్లలో న్యాయం ఉందని గ్రహించి, ఆ మేరకే తీర్మానం చేయించడానికి తేదీనీ స్థలాన్నీ ఖరారు చేసుకున్నారు. ఆ మేరకే 1937 నవంబర్ 16వ తేదీన మద్రాసులో కృష్ణాపత్రిక యజమాని కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో సమావేశమైనారు. ఆ ఇంటి పేరు శ్రీ బాగ్! ఆ రోజు ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని చేసుకున్న ఒడంబడికను శ్రీ బాగ్ ఒడంబడిక అంటారు. మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు 1) రాష్ట్రరాజధాని-హైకోర్టులలో రాయలసీమ వాసులు దేనిని కోరుకుంటే దానిని వారికి వదిలేయాలి. 2) దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ నీటి అవసరాలన్నీ తీరిన తర్వాతనే కృష్ణా జలాలు కిందికి వదలాలి. 3) కొత్త రాష్ట్ర శాసనసభలో కోస్తా జిల్లాలకూ రాయలసీమ జిల్లాలకూ సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి. 4) ఆంధ్ర విశ్వవిద్యాలయ కేంద్రం మరొకటి అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 5) రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో ఒక ప్రాంతం వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే మరొక ప్రాంతం వ్యక్తిని ఉపముఖ్యమంత్రిగా చేయాలి. ఈ ఐదు అంశాలను ఇరు ప్రాంతాల నాయకులూ అంగీకరిస్తూ ఆ శ్రీబాగ్ ఒడంబడిక మీద సంతకాలు చేసినారు. అయితే 1941 లోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందే, బ్రిటిష్ ప్రభుత్వం, రాయలసీమ-నెల్లూరు-చిత్తూరు జిల్లాలలో 36 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి, నిర్మించ తలపెట్టిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును కోస్తా కాంగ్రెస్ నాయకులు చాలా తెలివిగా, రెండవ ప్రపంచ యుద్ధ విషయాలను బూచిగా చూపి, తమిళ నాయకుల చేత తిరస్కరింపజేసి, శ్రీబాగ్ ఒడంబడిక అంగీకార పత్రం పైన సంతకాలు చేసిన నాలుగు సంవత్సరాల లోపే ఉల్లంఘించడం, మానవత్వం లేని సిగ్గూ శెరమూ లేని నమ్మకద్రోహ చర్య! ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలుకు రాజధాని రావడం, అది మూణ్ణాళ్ల ముచ్చట కావడం కూడా వాళ్ళు పన్నిన కుట్రలో భాగమే కావొచ్చు!
చంద్రశేఖర కల్కూర గారు ఆవేదనతో సంగ్రహంగా చెప్పినదంతా విని నా గుండె బరువయ్యింది. ఈ దేశాన్ని కొంతకాలం పాటు దోచుకున్న బ్రిటిష్ వాళ్లు కూడా చేయని ద్రోహాన్ని, చేయని నష్టాన్ని, భవిష్యత్తులో పూడ్చుకోడానికే సాధ్యం కానీ నష్టాన్ని సోదర ఆంధ్ర నాయకులు ఈ రాయలసీమకు చేసినారు కదా! ఇంతకు మించిన నమ్మకద్రోహం ఇంకేముంటుంది? ఇంతకు మించిన కళంకమైన మానవ ద్రోహచింతన మరొకటి ఉంటుందా? అని హృదయం ఘోషించింది. ఆయన మాటలు విని చాలాసేపు కోలుకోలేక పోయినాను. చివరికి ఆయనే నన్ను ఓదార్చినాడు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆంధ్రుల చిరకాల కోరికకు అనుగుణంగా పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష బూని చివరికి ప్రాణాలు కోల్పోయినాడని, దానితో దేశ రాజకీయాలలో కదలిక వొచ్చిందని, అన్నిటి పర్యవసానంగా 1953 అక్టోబర్ ఒకటవ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పుతూ మూణ్ణాళ్ళ ముచ్చటగా మారిన కర్నూలు రాజధాని నగర విశేషాలను వివరించినాడు. ప్రస్తుతమున్న 120 ఎకరాల మెడికల్ కాలేజీలోని భవనాలు కొత్తరాష్ట్ర తాత్కాలిక సచివాలయం కోసం కట్టిన కట్టడాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధానికి ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. అంతకుముందే సచివాలయం కోసం కట్టిన భవనాలలో 1956 జులై 21వ తేదీన, భారతదేశ ఆర్థిక మంత్రి కృష్ణమాచార్యులు గారు ప్రారంభించినారని, వైద్య కళాశాలకు డాక్టర్ సి వెంకట రామయ్య గారు మొదట ప్రిన్సిపాల్ అని కల్కూర గారు చెప్పగా ఆయన జ్ఞాపకశక్తికి నేను అబ్బురపోయినాను. కర్నూలలో ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టే నాటి ఆంధ్రరాష్ట్రానికి అసెంబ్లీ భవనమని, జిల్లా పరిషత్ ఆఫీసు అప్పటి రెవిన్యూ బోర్డు అని, టౌన్ మోడల్ హై స్కూల్ భవనమే 1953 నుండి 1955 వరకు ఎమ్మెల్యే హాస్టల్ అని, ఎస్ పి బి సి కళాశాల భవనమే ఆనాటి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అని, కొత్త సంసారం ఎక్కడో వొకచోట తాత్కాలికంగా కాపురం చేయాలి కదా అని ఆయన నవ్వుతూ, మూడేండ్లకే ఆ కొత్త సంసారం భగ్నమైపోయిందని ఒక నిట్టూర్పు విడిచినాడు.
ఇదంతా, కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ నొసటి వ్రాతను చెడిపి, పచ్చని మాంగళ్యాన్ని తెంచిపడేసినారని బాధపడుతూ రూముకు చేరుకుండాను.
ఉపన్యాసం అందరికీ సాధ్యం కాని ఒక గొప్ప కళ!
ట్రైనింగ్ కాలేజీలో పాఠాలు బాగా జరుగుతా ఉండాయి. నాకు టీచింగ్ ప్రాక్టీస్ కోసం 8వ తరగతి ఇచ్చినారు. ఆరేడు తరగతులకు పాఠాలు చెప్పిన అనుభవం ఉంది. అందుకే ప్రాక్టికల్ క్లాసుకు ఏడవ తరగతి ఇస్తారనుకుండాను. ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ఎక్కడా లభించలేదు. తీరా ప్రాక్టికల్ క్లాసుకు పోవడానికి ఒక గంట ముందు టెక్స్ట్ బుక్ చేతికొచ్చింది. పద్యభాగంలో ఏదో ఒక పాఠం బోధించమన్నారు. నాకు పద్యభాగం చెప్పడం చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే సంతోషంగా పాఠానికి చెందిన ఉపక్రమణిక హాయిగా చెప్పి, పిల్లల్ని పాఠం వైపు సులభంగా మళ్ళించినాను. కానీ పాఠం సరిగా ప్రిపేర్ కానందువల్ల పాఠ్య బోధన చక్కగా చేయలేకపోయినాను. మనసు నిండా అసంతృప్తి అలముకుంది.
చిన్న తరగతులైనా పెద్ద తరగతులైనా ఎంత పెద్ద పండితులైనా తరగతి గదిలో బోధించబోయే పాఠ్యాంశాన్ని బాగా చదివి ప్రిపేరయి క్లాసుకు పోకుంటే పాఠం చెప్పడం సులభం కాదనిపించింది.ఇక మీదట ప్రాక్టికల్ క్లాస్ ఏది వచ్చినా ఆ తరగతి పాఠ్య పుస్తకాన్ని బాగా చదివి చక్కగా ప్రిపేరయి పాఠం చెప్పాలనుకుండాను.
ప్రాక్టికల్ క్లాసులు అన్నీ అయిపోయినంక కాలేజీలో విద్యార్థులతో సారస్వతోపన్యాసాలు ఏర్పాటు చేసినారు. విద్యార్థులలోనే ఒకరు సభాధ్యక్షులు, ముగ్గురు ఉపన్యాసకులు. ఈ కార్యక్రమాలు వారం రోజులు జరిగినాయి. మిత్రులు కొంతమంది చక్కగా మాట్లాడినారు. కొంతమంది సభాకంపంతో సరిగా మాట్లాడలేకపోయినారు. నా వంతు దగ్గరయ్యే కొద్దీ మనసులో ఆందోళన మొదలైంది. అందరూ నేను, అష్టావధానినని, ప్రాచీన సాహిత్యం బాగా చదువుకుండానని, కావున అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలనని అనుకోవడమే కాకుండా బాహాటంగానే మాట్లాడుకో సాగినారు. దాంతో ఆందోళన మరింత ఎక్కువ కావొచ్చింది. ఇది ఇట్లుంటే, చేతిలో చిల్లి గవ్వలేక అన్నిటికీ ఇబ్బంది కలగసాగింది. ఈ ఫిబ్రవరి నెలలో అయినా బండమీదపల్లెలో పని చేసినప్పుడు రావలసిన జీతాల ఆరియర్స్ రాకుంటే నా గతేమిటి అని మనసులో దిగులు గూడు కట్టుకోసాగింది.
మారుతీరావు తమ్ముడు, నా క్లాస్ మీట్ రామ్మూర్తి ట్రైనింగ్ ముగించుకొని వెళ్లిపోయిన తర్వాత వాళ్లన్న రూములో ఏర్పడిన ఖాళీలో నేను చేరినానని ఇంతకుముందే తెలిపినాను కదా, ఆ రూములో చేరడానికి నా అభిలాష వొక కారణమైతే, మారుతీరావు ఒక్కడే రూము బాడుగ భరించడం కష్టమవుతుందని నన్ను ఆ రూములో చేరమని రామ్మూర్తి తల్లి నాగమణెమ్మ చెప్పడం మరొక కారణం. ఆ రూములో నేను చేరిన కొన్నాళ్లకు నా విద్వాన్ మిత్రుడు మరొకడు నన్ను బ్రతిమాలడంతో మా రూములోకి చేర్చుకుండాను. అతన్ని మారుతీరావు అనుమతితోనే చేర్చుకుండాను. అతడు చేరిన కొన్నాళ్లకు మారుతీరావు మాలో ఇమడలేకపోయినాడు. పైగా నా కోసరం వచ్చే విద్వాన్ మిత్రుల తాకిడి ఎక్కువైంది. దాంతో ఆ సున్నిత బ్రాహ్మణ మిత్రుడు వాళ్లవ్వను వండి పెట్టడానికి పిలిపించుకొని వేరే రూములోకి వెళ్లిపోయినాడు. నాకు తన రూములో చోటిచ్చి నాకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉన్న మిత్రుడు నా కారణంగా వేరే రూముకు పోవలసి వచ్చిందని చాలా బాధపడినాను. ఆయన వేరే రూముకు వెళ్లిపోయిన తర్వాత నాకు దినదిన గండం ఎక్కువ కాసాగింది.
ఎన్ని ఇబ్బందులున్నా, తరగతిలో సారస్వత కార్యక్రమాలలో మునిగిపోతా, సాయంకాలం పూట్ల గ్రౌండ్లో బ్యాడ్మింటన్ ఆడుతా, కేసి కెనాల్లో ప్రవహించే నీటి పరవాలను చూసి మురిసిపోతా బాధలన్నీ మరిచిపోసాగినాను. ఈ మానసిక సంఘర్షణ సమయంలోనే కాలేజీలో సారస్వతోపన్యాస కార్యక్రమాలలో ప్రసంగించడానికి నా వంతొచ్చింది. అభ్యుదయ కవిత్వం నేను మాట్లాడవలసిన అంశం. మాట్లాడవలసిన అంశాన్ని ముందు రోజంతా మనసులో అనుకోవడం వల్ల బాగా మాట్లాడాలని, మాట్లాడగలనని భావించినాను. నా విద్వాన్ మిత్రులందరూ ఆ విధంగానే భావించినారు. వేదిక దగ్గరికి పోయి చాలా ఎమోషనల్ గా రెండు నిమిషాలు మాట్లాడినాను. అంతే! నోరు ఆరక పోయింది. మాటలు పెగలడం లేదు! మెదడు మొద్దు బారిపోయింది! అసలు నేనేమి మాట్లాడుతా ఉండానో నాకే అర్థం కాలేదు! ఆందోళన ఎక్కువైంది! ఆందోళన ఎక్కువైతే ఏమి జరుగుతుందో నాకు తెలుసు! అందుకే హుందాగా, క్షమించండి ఏమీ మాట్లాడలేకపోతున్నాను అని ఒక్క మాట చెప్పి వచ్చి కూర్చుండాను.
ఆవేశంతో తారాస్థాయిలో మొదలైన నా ప్రసంగాన్ని సడన్‌గా నిలిపివేయడంతో మిత్రులు కొందరు ఆశ్చర్య పోయినారు. కొందరు భయపడినావని అన్నారు. మరి కొంతమంది ఎమోషన్ వల్ల అట్లయిందేమో అన్నారు. నా గురించీ నా సత్తా గురించీ క్లాస్ అందరికీ తెలుసు! కాబట్టి ఎవరూ ఎగతాళిగా నవ్వలేదు. అయితే ఏవేవో చెప్పాలనుకున్న నేను,ఎందుకు మాట్లాడలేకపోయినానో, ఎందుకు నోరు ఆరకపోతుందో ఆలోచించసాగినాను. భయమా అంటే కాదు.
కొంతమంది పేపర్ చేతులో పట్టుకొని మాట్లాడతా ఉంటే వాళ్ల చేతులు వొణుకుతా ఉంటాయి. ఆ మాదిరిగా నా చేతులు ఏమీ వొణకవు. మరెందుకు నాలుక ఆరిపోతుందో, మాటలు ఎందుకు రావో అర్థం కాలేదు. ఎంత తెలిసినా వేదిక మీద మాట్లాడడం అందరికీ సాధ్యం కాదేమో! వేదిక మీద చక్కగా మాట్లాడడం కూడా ఒక గొప్ప కళేమో! అందుకే కావొచ్చు, అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, వేదికల మీద చక్కగా మాట్లాడడం కోసం అడవుల్లో వొక గుండెక్కి రాళ్ళనూ రప్పలనూ చెట్లనూ పుట్లనూ మనుషులుగా భావించి ప్రసంగించడం నేర్చుకుండాడంట!నేను ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మంచిదేమో!
ఆ రోజంతా ఇదే ఆలోచనతోనే గడిపినాను.
హృదయానికి దగ్గరైన నవల ‘బలిపీఠం’
గురువుగారు హెడ్మాస్టర్ సార్ గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల పెండింగులో ఉన్న సెప్టెంబర్ నెల జీతం బండమీదాపల్లె నుంచి ఎం ఓ ద్వారా వొచ్చింది. హెడ్మాష్టర్ బుడ్డయనాయుడు నామీద ప్రేమతో ఎమ్‌వో చేసినాడు. బండమీదపల్లె నుంచి కర్నూలు పండిట్స్ ట్రైనింగుకు వొచ్చేవాడు ఆయనతో నేను అప్పుగా ఇప్పించుకొని వొచ్చిన 50 రూపాయలు పట్టుకోకుండా జీతం అంతా పంపిన ఆయన మంచితనానికి మురిసి పోయినాను. ఆయనతో నాకున్న పరిచయం కేవలం ఐదు నెలలు మాత్రమే! ఆ కొద్దిపాటి పరిచయంతోనే నేను అడగగానే ఆయన నాకు 50 రూపాయలు అప్పు ఇవ్వడమూ ఇప్పుడు నా జీతంలో తన బాకీకి చెల్లు వేసుకోకుండా మొత్తం పంపడమూ నన్ను కాసేపు ఆలోచింప జేసినాయి. ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి నమస్కరిస్తా, ఆయనకు వెంటనే 50 రూపాయలు ఎంఓ చేసి, మిగిలిన డబ్బుల్లో 50 రూపాయలు నాయనకు పంపి, కర్నూలు విద్వాన్ మిత్రుల చేబదుళ్లను తీర్చి ఊపిరి పీల్చుకుండాను. మనసు నిమ్మలపడింది.
ట్రైనింగుకు చెందిన పుస్తకాలు ఏవీ పెద్దగా చదవాల్సిన పని లేకపోవడంతో ముప్పాళ రంగనాయకమ్మ రాసిన బలిపీఠం నవలను లైబ్రరీ నుంచి తెచ్చుకొని రెండు దినాలలోపల చదివేసి, ఆ కథా వస్తువూ రచనాశైలీ ముగ్దుణ్ణి చేయడంతో రెండు దినాలు మౌనముద్రాంకితుణ్ణి అయిపోయినాను.
ప్రపంచంలో ఇంత నీచంగా భర్తను అవమానం పాలు చేసిన వాళ్లుంటారా? అదీ ఆ భర్త,విధవరాలై ప్రాణం పోయే సమయంలో సుమంగళిగా చనిపోవాలని అనుకుంటున్న స్త్రీని ఆమె కులాన్ని గుడకా లెక్కచేయకుండా ఆమెను పెళ్లి చేసుకొని బ్రతికించుకున్న వ్యక్తి! అతడు మరొక స్త్రీ పైన అనురాగం పెంచుకొని కూడా తనకోసం ఆ ప్రేమను త్యాగం చేసి వచ్చి తనను ఉద్ధరించిన వ్యక్తి! అటువంటి భర్తను కోర్టుకీడ్చి, నీచమైన మార్గంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, సిగ్గు లేకుండా స్త్రీలోకమంతా తలదించుకునే విధంగా దుర్భాషలాడి, తప్పిదాన్నంతా అతని మీద మోపుతుంది! పరాజితురాలవుతుంది! అతని వల్ల పుట్టిన పిల్లల్ని అతనికివ్వదు! మనసు చెదిరిపోయి అతడు ఒక సేవాసమాజానికి వెళ్లిపోతాడు! ఆమె ఉద్యోగం ఊడిపోతుంది! ఆమె వెనకటి భర్తకు చెందిన తల్లిదండ్రులు అంటే అత్తమామలు ఆమె వ్యవహారాన్నంతా గమనించి దగ్గరికి రానీయరు! ఆమెకు పిల్లల పోషణభారం భరించరానిదవుతుంది! తన మాదిరే వర్ణాంతర వివాహం చేసుకొని, తన మాదిరి కాకుండా,సంతోషంగా కులాచారాలన్నీ వొదులుకొని హాయిగా జీవిస్తున్న చెల్లెల్ని చూసి బాధపడతా, తన గడచిన వృత్తాంతాన్నంతా స్మరించుకుంటుంది! కానీ ఏం ప్రయోజనం? పశ్చాత్తాపం చెందడానికి కూడా వీలుగానంతగా ఆరోగ్యం దెబ్బతినిపోయింది! అటువంటి దయనీయ స్థితిలోకి జారిపోయిన ఆ అగ్రవర్ణ దురహంకార స్త్రీని, సేవాసమాజానికి వెళ్లి పోయిన అతడు తిరిగొచ్చి ఆమెను సంతోషంగా చేరదీసి ఆమె కోరికను తీరుస్తాడు!
ఎంతో ఉన్నతమైన ఆదర్శంతో సాగి, గుండెల్ని నలిపేసిన నవలను చదివి నాలో పుటమరిస్తున్న భావాలను తలచుకొని, కులాంతర వివాహాన్ని గురించి తీవ్రంగా ఆలోచన చేసినాను. చేస్తూనే ఆరుద్ర గారి ‘త్వమేవాహం’ కవితా సంపుటిని, కొమ్మూరి వేణుగోపాలరావుగారి పెంకుటిల్లు నవలను చదివినాను. అవేవీ బలిపీఠం నవల మాదిరి నా హృదయానికి దగ్గర కాలేదు.
ఈ విధంగా పాఠ్యేతర సాహిత్యం చదువుతున్న సందర్భంలోనే మా బిఇడి కాలేజీ వాళ్ళు సినారే గారి సాహిత్యోపన్యాసాన్ని ఏర్పాటు చేసినారు. కాలేజీ విద్యార్థులే కాక టౌన్లో నుంచి సభకు చాలామంది విద్యావంతులొచ్చినారు. ఆడిటోరియం అంతా జనంతో కిటకిటలాడుతా వుంది. సినారేగా ప్రసిద్ధి పొందిన సి.నారాయణరెడ్డి గొప్ప సాహిత్య వ్యక్తే కాదు, సినీగేయ రచయితగా ప్రఖ్యాతిగాంచిన నాడు. అందుకే జనం మూగినారు.
సినారె వేదిక మీదికి రాగానే కరతాళ ధ్వనులు మిన్ను ముట్టినాయి. మనిషి పంచ కట్టుకొని చేతులకు చిన్న కప్స్ ఉన్న సిల్కు జుబ్బా తొడుక్కొని, ఎర్రగా చాలా అందంగా ఉండాడు. అద్భుతమైన వర్చస్సు! అంత్యాను ప్రాసలతో అద్భుతమైన తనదైన శైలితో మాత్రా చందస్సులో రాసిన గేయాలను మధ్య మధ్యలో వినిపిస్తా రమణీయంగా మాట్లాడినాడు.
బాపూజీ నీ పుట్టినరోజు
భగవానుడే పుట్టినరోజు ॥బాపూజీ॥
హరి, జనుడై పుట్టిన రోజు
హరిజనుడే పుట్టిన రోజు ॥బాపూజీ॥
అంటూ పాడిన గేయం నా గుండెల్ని హత్తుకుంది. మాత్రాబద్ద చందస్సులో రాస్తే ఆ మాదిరి పాడుతా చదవొచ్చునని, ఆ పద్ధతి, చదివే వారినీ వినే వారినీ కదిలిస్తుందని బలంగా అనుకుండాను. వెంటనే తిరుపతిలో ఉన్న విద్వాన్ మిత్రులకు జాబు రాసి, సినారె గారి కర్పూర వసంతరాయులు అనే కావ్యాన్ని తెప్పించుకొని చదివి, మురిసి పోయినాను. కావ్యంలోని రమణీయ సన్నివేశాలున్న భాగాలను కంఠస్థం చేస్తే ఆ కావ్యాన్ని గురించి చక్కగా ఉపన్యసించవచ్చునని నిర్ణయించుకుండాను.
అర్థరహితమైన సాహసం అనర్థదాయకం!
కాలేజీలో ఐదారు మంది తప్ప మిగతా వాళ్ళందరూ మంచి మంచి డ్రెస్సులు వేసుకొని కాలేజీకి వొస్తారు. కొందరైతే రోజుకొక డ్రెస్‌తో వొస్తారు. వాళ్లను చూసి మనసులో ఏదో అసంతృప్తి కలుగుతుంది. ఏవేవో ఆలోచనలు వొస్తాయి. వెంటనే, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే కదా అనుకుంటాను. నాకున్నది నాలుగు జతల బట్టలే! అందుకే బట్టలు చాకలి వాళ్లకు వేయను. వేస్తే, వాళ్ళు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడానికి నాలుగైదు రోజులు పడుతుంది. అటువంటప్పుడు చాలా కష్టం! పైగా, చాకలి వాళ్లకు వేస్తే బట్టలు చాలా తొందరగా చినిగిపోతాయి. ప్రతిరోజూ నేను మా ఊరి నుంచి శింగనమల హైస్కూల్‌కు పోయేటప్పుడు చాకిరేవు గుట్ట దగ్గర చాకలోళ్లు బట్టలు ఉతికేది చూసినాను. వాళ్లు, మాసిపోయిన బట్టలన్నీ చౌడుగుంతల్లో నాన బెడతారు. చౌటినీళ్లల్లో బాగా నానిన బట్టలను డ్రమ్ముల్లో, సిల్వరి అండాలలో దురికి, పెద్ద పొయ్యిల మీద ఉడకబెడతారు. ఉడకబెట్టిన బట్టల్ని నాలుగైదు బండల మీద గట్టిగా ఉతుకుతారు. ఉతికిన బట్టల మీద చౌవుటినీళ్ళు చిముకరించి నున్నని ఇసుక వేసి కాళ్లతో రుద్దుతారు. అట్లా రుద్దినప్పుడు పాతబట్టలు పిగిలి, చినిగిపోతాయి. అట్ల చినిగిపోయిన బట్టల్ని చూసి, అమ్మయ్య నాలుగైదు సార్లు చాకలోళ్లతో కొట్లాడిన సంగతి నాకు బాగా గుర్తు.
చాకలోళ్లు బట్టలు ఉతికే సంగతి గుర్తుకొచ్చి, వాళ్లకు బట్టలు వేయడం మానుకొని, ప్రతి ఆదివారం కేసి కెనాల్ దగ్గరికి పోయి సబ్బుతో బట్టలు నేనే ఉతుక్కొని వొస్తావుండాను. నాతోపాటు వీరభద్రాచారి నా రూములో ఉన్న బాలభాస్కర్, మద్దిలేటి వొస్తారు. ఈరోజు ముగ్గురమూ బ్యాగుల్లో మాసిపోయిన బట్టలన్నీ పెట్టుకొని కేసీ కెనాల్ దగ్గరికి పోయినాం. కాలువ ఫుల్లుగా పారుతా వుంది. అందుకే ఆచారి నీళ్ల దగ్గరికి పోకుండా రెండు మెటికల పైన కూర్చొని బకీటుతో నీళ్లు తెచ్చుకొని సబ్బుతో బట్టలు ఉతుకుతున్నాడు. ఆ ఉతికిన బట్టల్ని పారే నీళ్లలో నేను ముంచి తీసి ఇచ్చినాను. ఉతికిన బట్టల్ని, కాలువ గట్టుపైన పచ్చికలో ఆరవేసి, అవి ఆరే వరకూ నేనూ మద్దులేటీ నీళ్లలో మామూలుగా ఈదులాడుతాం.
కేసీ కెనాల్ 90 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇరువైపులా దళ్లను పై వరకు వొరుసుకొని నీళ్లు పారుతా ఉండాయి. ఆ పారే నీళ్లలో ఇవతల్లి గట్టు నుంచి అవతలి గట్టుకు నేరుగా స్ట్రైట్ గా పోవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా నాకు సాధ్యం కాలేదు. స్ట్రైట్‌గా పోవల్లనుకుంటే నీళ్లు మనిషిని దిగువకు నూకుతాయి. ఈరోజు చూద్దాం అని మద్దిలేటీ నేనూ నీళ్లలోకి దూకి స్ట్రైట్‌గా అవతలి గట్టుకు చేరుకోవ్లలని విశ్వప్రయత్నం చేసినాం. సాధ్యం కాలేదు. నీళ్లు ఫోర్సుగా నూకుతా వుండడంతో క్రాస్‌గా ఈదుతా చాలా దూరంగా పోయి అవతలి గట్టుకు చేరుకుండాను. ఇవతలి గట్టుకు తిరిగి రావల్లంటే చాలా దూరం పోవల్లని అనుకుంటా పోయి, నీళ్ల ఫోర్సును చూసి కాలువలోకి దూకడానికి చూసినాను. ధైర్యం చాలలేదు. పైగా గసగా ఉంది! మద్దిలేటి దూకుదాం అన్నాడు. అతనికి పారే కాలువ నీళ్లలో ఈదులాడిన అనుభవం బాగా ఉన్నట్లుది. అందుకే దూకుదాం అని తొందర చేయసాగినాడు. నాకు ఇంకా గస తగ్గలేదు! మళ్లా కాలువలోకి దూకకుండా మేము బట్టలు పిండుకున్న దక్షిణం గట్టుకు రావల్లంటే, కాలువ గట్టువెంబడి పోయి, బిర్లా మందిరం దగ్గర అనంతపురం రోడ్డెక్కి, రోడ్లో ఉత్తపయ్యీ డ్రాయర్తో రావల్ల! రోడ్లో పోతూ ఎవరైనా కాలేజీ పిల్లలు చూస్తే ఏం బాగుంటుందనుకొని ధైర్యం చేసి మద్దిలేటితో పాటు కాలువలోకి దూకి, ఫోర్సుగా దొబ్బుతా ఉండే నీళ్లల్లో క్రాసుగా ఈదుకుంటా అతి కష్టం పైన ఇవతలి గట్టుకు చేరుకొని ఊపిరి పీల్చుకుంటా గస పోసుకుంటా, నీళ్ల దగ్గరా అగ్గి దగ్గరా సాహసం పనికిరాదనుకుండాను. అర్థరహితమైన సాహసంతో ఎంత అనర్థం జరిగేదో వూహించుకొని భయపడినాను. ఇంకెప్పుడూ ఇటువంటి అనాలోచితమైన పనులు చేయకూడదని నిర్ణయించుకొని, ఆరిన బట్టలను బ్యాగులో పెట్టుకొని మిత్రులతో కలిసి రూముకు బయలుదేరినాను.
తిరుపతి చూపుల ప్రేమ, ఇక్కడా మొదలయితాదేమోనని భయంతో..
బండమీదపల్లి హైస్కూల్ హెడ్మాస్టర్ నుంచి ఎంఓ వొచ్చింది. అక్టోబర్ నవంబర్ నెల జీతాలను బుడ్డయ్య నాయుడు పంపినాడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం రాసినాను. ఆశావాదికి బట్టల ఖాతాకు ఇవ్వవలసిన 30 రూపాయలు వెంటనే ఎంఓ చేసినాను. ఇంటికి ఒక నూరు రూపాయలు పంపుదామని ఆలోచన చేసి, ఉగాది పండుగ ముందర పంపితే అందరికీ కొత్త బట్టలు తీసుకోవడానికి పనికొస్తాయని, 170 రూపాయలు లెక్చరర్ శేషయ్యగారి దగ్గర ఉంచినాను. నిజానికి నాకు సన్నిహితంగా ఉండే లెక్చరర్ మద్దయ్య. ఆయన మద్యపానానికి బాగా బానిస అయినాడని, కొంతమంది విద్యార్థుల దగ్గర ఇప్పించుకున్న చేబదులు డబ్బులు ఇవ్వలేదని తెలిసి ఆయనకు ఇవ్వడం కంటే శేషయ్యగారికి ఇస్తే బీరువాలో పెట్టినట్లు భద్రంగా ఉంటాయని ఆయన దగ్గరుంచినాను.
మిగిలిన డబ్బులకు రెండు జతల బట్టలు కుట్టించుకుందామని మనసు పీకింది. దానికి ఒక కారణముంది.
దాదాపు నెల రోజుల నుండి మా ట్రైనింగ్ మీట్ ఒకామె ఆకర్షణీయంగా హుందాగా చాలా డిగ్నిఫైడ్‌గా క్లాసుకు రావడం గమనించినాను. మొదట, ఎట్లుంటే నాకెందుకులే అని అనుకుంటా ఆమెను గురించి ఏమీ ఆలోచన చేయకుండా కాలేజీకి వెళ్లొస్తా ఉండాను. రెండు వారాల కిందట కాలేజీ గేటుదగ్గర ఎదురుపడి నన్ను చూసి ఒక చిరునవ్వు చిలకరించి, సిగ్గుపడతా వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆమెను గురించి ఆలోచన చేయసాగినాను.
ఆమె ఎందుకు నన్ను చూసి చిరునవ్వు చిందించి సిగ్గుపడింది? మొన్న నేను ఆవేశంగా ప్రసంగం మొదలుపెట్టిన రెండు నిమిషాలకే ఏమీ మాట్లాడలేక వొచ్చి కూర్చున్నందుకా? నవ్వితే నవ్వింది, కానీ సిగ్గు పడడం ఎందుకు? ఒక యువతి ఒక యువకుణ్ణి చూస్తానే సిగ్గు పడిందంటే దానికి అర్థం ఏమిటి? ఆమెకు నా మీద మనసులో ఎక్కడో ఇష్టం ఉన్నట్లే కదా లెక్క! ఇష్టం లేకుంటే, నా మీద సదభిప్రాయం లేకుంటే, చూడగానే చిరునవ్వు చిందించి ఎందుకు సిగ్గుపడుతుంది?
ఈ ఆలోచన రాగానే మనసులో ఆమెను చూడల్లనిపించింది. వెంటనే తిరుపతి లీలావతి గుర్తుకొచ్చింది. ఆమె మాదిరే ఈమె కూడా చాలా సభ్యతగా ఉదాత్తంగా ముద్దుగా ఉంటుంది. ఎవరితోనా ఎక్కువగా మాట్లాడకుండా గంభీరంగా కాలేజీకి వొచ్చిపోతుంది. అట్లుండడమే ఆమె సౌందర్యం! ఆవిధంగా ఉండడం నాకెంతో ఇష్టం! అందుకే రెండు మూడు సార్లు చూసినాను. కానీ తాను చూడలేదు. చూడకపోయినా తన నడవడికతో నాకు చాలా ఆకర్షణీయంగా కనిపించసాగింది. వారం దినాలలో రెండు మూడు సార్లు మాత్రమే నా కళ్ళల్లోకి చూసింది. ఆ చూపుల్లో అంతులేని సౌందర్యం! ఏవేవో రమణీయమైన సందేశాలు! ఆ సందేశాలకు అర్థం ఏమిటి?
ఈ మాదిరిగానే తిరుపతిలో లీలావతి చూపులు పరిచయమైనాయి. అయితే ఏనాడూ మాట్లాడింది లేదు! మాట్లాడల్ల మాట్లాడల్లన్న వుబలాటంతోనే, అంతులేని ఆశతోనే, ఆరాధనతోనే ఆ తిరుపతి జీవితం ముగిసిపోయింది! అనవసర కాలయాపన మనోవేదన తప్పా అక్కడ ఏమి సాధించినాను? ఇప్పుడు మళ్లీ ఈ చూపుల ప్రేమాయణం తిరుపతిలో మాదిరి కొనసాగుతుందేమో!
అనుకోగానే భయమయింది. వెంటనే, భయపడడం దేనికి?అటువైపు కన్నెత్తి చూడకుంటే సరిపోతుంది కదా అని మనసుకు నచ్చజెప్పుకుండాను. అయినా మనసు అటువైపు చూడల్లని ఆరాటపడసాగింది.
విద్వాన్ మిత్రులందరూ మొల్ల సినిమాను చూసొచ్చి, విద్వాన్ కోర్సులో ఒక పాఠ్యాంశమైన మొల్ల రామాయణాన్ని గురించి చర్చించుకుంటా, అటువంటి కవయిత్రి కుమ్మరి మొల్ల జీవితం పైన సినిమాను తీసినారని, చూడని మిత్రులందరూ చూసి రాండని అన్నారు. ఆ మాటలు ఆమె కూడా వినిందని, మిగతా అమ్మాయిలతో మాట్లాడడం గమనించి సినిమాకు పోవల్లని, ఆమె తప్పకుండా సినిమాకు వొస్తుందని ఆశించినాను.
సినిమా బాగా రద్దీగా వుంది. టికెట్ తీసే ముందు అటూ ఇటూ పరికించి చూసినాను. ఆమె కనిపించలేదు. అయినా వొస్తుందన్న ఆశతో, ఎప్పుడూ తీయని ఫస్ట్ క్లాస్ టికెట్ రూ 1-35 పైసలు పెట్టి తీసుకొని, లోపలికి పోయి చూసినాను. సీట్లన్నీ దాదాపు ఫుల్ అయినాయి. అదేపనిగా సీటు వెతుకుతున్నట్లు నటిస్తా నాలుగు రోలు (వరసలు) తిరిగి చూసినాను. అట్ల చూడడం సిగ్గనిపించింది. “కామాతురాణాం న భయం న లజ్జా న సుఖం న నిద్రా” అనే సంస్కృత సూక్తిని గుర్తుకు తెచ్చుకొని, ఒక మూల సీటు దొరకడంతో పోయి కూర్చుండాను. కూర్చుండాను గానీ మనసు స్మిమిత పడలేదు.బయటికి పోయి కౌంటర్ దగ్గర టికెట్టు మార్చుకొని రూ 1-62 పైసలు పెట్టి బాల్కనీకి పైకి పోయినాను. అక్కడ సిగ్గు వొదిలి తేరిపారజూసినాను. ఆమె ఎక్కడా కనిపించలేదు. నిరాశగా కూర్చుండాను. మనసులో సంఘర్షణ మొదలైంది.
నేను చేస్తున్నదేమిటి? చుట్టూ బాల్కనీలో కూర్చున్న వాళ్లందరూ భోగభాగ్యాలతో తులతూగే వాళ్లు! వీళ్ల మధ్య నిరుపేదనైన నేను! ఇది నా తాహత్తుకు తగిన స్థానమేనా? చదువుకోవడం వల్ల, సెకండ్ క్లాసుకు పోవడం నామోషీగా భావిస్తా వుండాను. జీవితంలో చిన్న స్థాయి నుండి ఒక్కొక్క మెట్టు పైకెదిగి పోవల్ల గానీ వొక్క సారిగా సినిమాలో పైఅంతస్తుకు రావడమేమిటి?ఈ మాదిరిగా నా అభివృద్ధి పెరుగుతుందా? ఉద్యోగజీవితంలో ఇంకా ఒక మెట్టైనా ఎక్కని వాణ్ణి, అమాంతంగా బాల్కనీ ఎక్కి సినిమా చూడడం ఎంత అర్థరహితం? పొరపాటున గురువుగారు ఏదైనా పనిమీద కర్నూలుకొచ్చి ఈ సినిమా చూడ్డానికి వొచ్చి నన్ను చూస్తే ఆయన ఏమనుకుంటాడు?
ఆలోచన చేస్తా నా డౌలు చేష్టలకు, పిల్ల చేష్టలకు నా మీద నాకే అసహ్యం కలిగింది. ఎట్లో సినిమా చూసి బయటికొచ్చి ఆశ్చర్య పోయినాను. ఆమె వొక కుంటి యువకుని చేతిలో చెయ్యేసి నడుస్తూ వుంది! అతడు కుంటివాడైనా నడవలేని స్థితిలో అయితే లేడు! అతడామె బాయ్ ఫ్రెండ్ మాదిరి నడుస్తా వుండాడు! పక్కనే వెళుతున్న నన్ను చూసిందామె! అదే చిరునవ్వే! అదే చూపులే! వాళ్ల అన్యోన్యతను చూసి సిగ్గుపడతా, మామూలు ఆ చూపుల్లో ఏదేదో వుందని భ్రమించిన నా అవివేకాన్ని నిందించుకుంటా, అంగవికలుడైన అతన్ని తన బాయ్ ఫ్రెండ్‌గా చేసుకున్న ఆమె హృదయ సౌందర్యాన్ని మనసులోనే అభినందిస్తా వూరట చెందిన మనసుతో రూముకు చేరుకుండాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
