[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
మా వూరి పీర్లు చెప్పినట్లు జరగలేదు!
ఈ సమ్మత్సరం మా చెరువుకు సరిగా నీళ్లు రాలేదు. మంచి వానల కాలంలో పెద్ద వర్షాలు రాలేదు. చెరువుకు నాలుగు నెలల నీళ్లు మాత్రమే వొచ్చినాయి. కట్టకిందపల్లె పెద్దమనుషులందరూ శింగనమల తలబాలకట్ట మింద వీటింగు పెట్టుకొని మాట్లాడి, దేవుని మీద భారమేసి, వొంటికారు పంట పెట్టుకుండేకీ, రోజు మార్చి రోజు చెరువు తూములు ఎత్తేకీ తీర్మానం చేసి ఆ ప్రకారమే పంటబెట్టినారు.
మాకు ఈ సమ్మత్సరం మా వూరి మాగాణి కింద ముక్కాలు ఎకరా మాత్రమే గుత్తకు మడి దొరికింది. దాన్ని సీతయ్య కయ్య అని అంటారు. శివపురం దారిలో, గుల్లేవాళ్ల బావి పక్కనే వుంటాది. దాంట్లో కేసరొడ్లు, చెన్నంగొడ్లు (తోకొడ్లు) మాత్రమే పండుతాయి. ఢిల్లో భోగాలు పండవు. ఆ మడి మా వూరోళ్లది కాదు. అనంతపురం బాపనోళ్లది. మాకు రెండు దున్నపోతులు మాత్రమే వుండాయని, తమ పొలాలకు తగినంత పశువుల ఎరువు మేము వెయ్యలేమని, మా వూరి కోమటోళ్లెవురూ మాకు కోరుకో, గుత్తకో పొలాలు ఈలేదు. గుత్తి, ప్యాపిలు, పెద్దవడుగూరు ఇంగా ఎక్కడెక్కడో వుండే బాపనోళ్ల భూములకు విపరీతమైన గిరాకీ. నాయన ఆకులమ్మి నాలుగు బువ్వగింజలు తీసుకొని రావడానికే కష్టమయితా వుండాది. ఇంగెప్పుడు ఆ వూర్లకుపోయి వాళ్ల ఇండ్లు కనుక్కొని వాళ్ళను బంగపోయి బతిమాలేది? అందుకే వచ్చే సమ్మత్సరం ఎట్లన్నాగానీ ఎలకంటి చిన్నపాపయోళ్ళ రెండెకరాల మోతలగడ్డ మడి గుత్తకు చేసుకోవల్లని నాయన ముందుగానే అడిగినాడు. అమ్మయ్య వాళ్లింట్లో అంట్లు తోమేపనులు చేస్తావుండాది కాబట్టి చిన్నపాపయ్య రోంత తలకాయి వూపి, తమ మడికి ఇరవై బండ్ల ఎరువు తోలల్లని సూచన చేసినాడంట.
ఈ సమ్మత్సరం రెండు మూడెకరాలు గుత్తకు దొరికినా, చెరువుకు వొచ్చిండే ఈ తక్కువ నీళ్లను నమ్ముకొని పంట పెట్టుకుంటే, తీరా వరిమడి, వెన్నుపోయేటప్పుడు చెరువులో నీళ్ళు అయిపోతే అప్పుడేం గతి? పంట పెట్టుకోండే ఖర్చుల కోసరం చేసిన బాకీలు తీరకుంటే అప్పుడెవురు దిక్కు? వోర్నాయనో, ఈసారి గుత్తకు ఎక్కువ పొలం దొరక్కపోవడమే మంచిదయ్యిందని నాయన వూరట పడతావుంటే విని, నిజమే అనుకోసాగినాను నేను. చిన్నపీర్ల పండగప్పుడు పెద్ద ఆజీస్వామి చెప్పిండే మాటలు గుర్తుకొచ్చి, అవన్నీ వుత్త సుళ్ళ కూతలనిపిచ్చింది నాకు. ఆ పండగ రోజంతా మనసులో మెదలసాగింది.
మా వూర్లో చిన్నపీర్ల పండగ తోజు
మా వూర్లో చిన్నపీర్ల పండగంటే మా చుట్టుపక్కల పల్లెల్లో భలే పేరు. పీర్లు ఏటికి పొయ్యేనాడు వూరంతా పండగ. ప్రతింటికీ బంధువులొచ్చి వాల్తారు, మా ఇంటికి మా గుత్తి అనంతపురం చిన్నాయన చెన్నప్ప, పత్తికొండ నుండి మా పెద్దమ్మ రెండు దినాలు ముందే వొచ్చివారు. ఆ చెన్నప్ప చిన్నాయన చాలా తెలివితో యాభై సిరిచాపలు చుట్ట చుట్టుకొని పీర్ల పండగనాడు అమ్ముకోవల్లని ‘గట్టా’ యేసుకొని వొచ్చినాడు.
మా వూర్లో పీర్ల పండగను వూరి పెద్దమనుషులందరూ అన్ని కులాల వాళ్లూ కలుసుకొని మాట్లాడి చేస్తారు. మా వూర్లో తురకోళ్ల ఇండ్లుండేది పదైదే! వాళ్ళందరూ పేదోళ్లే! ఎవురికీ మాగాణి కానీ ఎలిపొలం గానీ లేదు. అందరూ కూలిచేసుకొని బతికేవాళ్లే. ఇరవై ముప్పయి పల్లెల్లో పేరుకెక్కిన మా వూరి పీర్లు పెద్ద ఆజీ స్వాములకు మాన్నెం కింద వొగ ఎకరా పొలం గుడకా లేదు. పీర్ల ముల్లాసాబు వాళ్లకు మాత్రం, మావూరి మాగాణిలో వరిమళ్ళు కోసినప్పుడు మిగతా ఆయగాళ్లకు ఇచ్చే మాదిరిగానే ఫకర్దీన్ కుటుంబం వాళ్లకు కల్లాల్లో ‘మ్యార’ గింజలు పెడతారు.
ఆ పొద్దు చిన్నపీర్ల పండగ పెద్ద సరిగెత్తు. మా అమ్మయ్యా, పెద్దక్కా ఇల్లు అలికి లోగిట్లో ప్యాన్నీళ్లు చల్లి ముగ్గులు పెట్టినారు. నాయన ఆకుల గంపెత్తుకొని యాటికీ పోలేదు. జేజి గుడకా ఇల్లు అలికి, కొట్టం కిందా ఇంటి ముందరా ప్యాన్నీళ్ళు చల్లింది. పెద్దక్క జేజి వాళ్ళ ఇంటి ముందర గుడకా ముగ్గు బెట్టింది. ఆనెంక అమ్మయ్య పరమాన్నం చేసింది. పప్పూ, బువ్వ వండింది.
ఆ పొద్దు మాకు వొంటిపూట బడి. ఉదయం పూట బడి ఇడిసే ముందుగా మా హెడ్మాష్టర్‌సారు ఈ మద్యాన్నమూ, రేపూ బడికి శెలవు అని లాంగ్‌బెల్లు కొట్టిచ్చినాడు. దాంతో పిల్లోళ్ళందరూ ఆనందంతో కేకలు వేసుకుంటా కట్ట తెగినప్పటి చెరువునీళ్ళ మాదిరి స్కూలు మూడు వాకిండ్ల గుండా బయటికొచ్చి ఇండ్లకు పరుగెత్తినారు.
నేను, పిల్లోళ్ళందరూ వెళ్ళిపోయినంక మా హెడ్మాష్టర్‌సార్ దగ్గరికి పోయి, ‘ఈ పొద్దు మా ఇంటికి భోజనానికి రాండి సార్! మానాయన నిన్ను పిల్చమన్న్యాడు సార్’ అని ఉత్సాహంతో పిల్చినాను.
‘లేదు రా నారాయణా, ప్రొద్దున్నే బడగొర్ల నాగిరెడ్డి వొచ్చి భోజనానికి వాళ్ళింటికి రమ్మని పిల్చినాడ్రా! రేపు వడుగూరు చండ్రాయుడోళ్ళు వాళ్లింటికి రావల్లని పిల్చినారప్పా! మీ నాయనతో చెప్పు, ఇంకొకసారి ఎప్పుడయినా వస్తాన్లే’ అని మా సారు అంటానే నా మొగం సప్పగయింది. మవునంగా ఇంటి మొగం పట్టినాను. బడగొర్ల నాగిరెడ్డోళ్లూ, వడుగూరు చండ్రాయుడోళ్ళూ దండిగా భూములుండే షావుకార్లు. వాళ్ళ ముందర మేమెంతటోళ్ళం? ఆ పెద్దోళ్లు పిల్చినంక సారు మా పేదింటికి యెట్లొస్తాడు? మా సారుకు పేదోళ్లూ, షాపుకార్లూ అనే తేడాలుంటాయా? అయినా ముందుగల్గ వాళ్ళు పిలిచినప్పుడు వొస్తానని మాటిచ్చినంక మా ఇంటికెట్లొస్తాడు? నిన్ననే మా నాయనొచ్చి పిలిచింటే ఎంత బాగుండేది?
ఆలోచిస్తా ఇంటికొచ్చినాను. చాలా దినాలయినంక గుత్తి అనంతపురం చిన్నాయనా, పత్తికొండ పెద్దమ్మా వొచ్చినారని మా అమ్మయ్య కుంటి చిన్నాయనకూ, జేజికీ అందరికీ మా యింట్లోనే భోజనాలు ఏర్పాటు చేసింది. అందరమూ ఇంటి ముందరుండే అరుగుమింద కూర్చొని భోంచేసినాము. పరమాన్నమూ, చిత్రాన్నమూ దేవరకొండమింద సమారాధనప్పుడు తినిండేదే! మల్లా యిప్పుడు పరమాన్నమూ చిత్రాన్నమూ తినేదానికంటే, కుంటి చిన్నాయనా జేజీ వాళ్లతో కలిసి అందరమూ మా యింట్లో భోంచేయడం నాకు భలే సంతోషం కలిగిచ్చింది.
పయిటాల దాటింది. వూరంతా సందడి సందడిగా వుంది. ఆజీస్వాములకు మొక్కుబడి వుండేవాళ్ళ ఇండ్ల దగ్గర్నుండీ తప్పెట్లతో, మ్యాళాలతో పానకాలు బయలుదేర్నాయి. మా యింటికి పడమటి పక్కనుండే జోడోళ్ళ ఇండ్లకాడ భలే సందడిగా వుంది. వాళ్ళు పక్కీర్లయినారు. జోడోళ్ళ పెద్దోబన్న పెద్ద కొడుకు ఓబిలేశు ఈ పెద్ద సరిగెత్తునాడు పీరును ఎత్తుకుంటాడు. అందుకే ఆయప్ప పొద్దున్నుండీ ఏమీ తినకుండా వొక్కపొద్దు వుండాడంట! పెద్దోబన్న మూడో కొడుకు పేరు ఆజీస్వామి పేరేనంట! వాడు నా కంటే రోంత చిన్నోడే, ఆదెప్ప. ఆజెప్ప అని పలకడానికి బాగుండదని వానికి ఆదెప్ప అని పేరు పెట్టినారంట. ఆదెప్ప, ఆదెన్న అనే పేర్లుండే వాళ్ళు మా వూర్లో చాలామంది వుండారు. ఆ పేర్లన్నీ మా వూరి ఆజీస్వాముల పేర్లేనంట!
జోడోళ్ళ పెద్దోబన్న తమ్ముడు చిన్నోబన్న వాళ్ళు అనంతపురంలో కాపురముండారు. వాళ్ళు ప్రతి సమ్మత్సరమూ మా వూరి చిన్న పీర్లపండగ పెద్ద సరిగెత్తునాడు అనంతపురం నుండి టైరు బండి మింద చాలా బజ్జరీగా వస్తారు. ఇప్పుడొచ్చినట్లుందేమో అందుకే ఆ జోడోళ్ళ ఇండ్లకాడ చాలా సందడిగా వుంది. ఈ సమ్మత్సరం గుడకా వాళ్ళు ఆజీ పీర్లకు రెండు పెద్ద వెండి గొడుగులు చదివిస్తారని నాయన చెప్పినాడు. వాళ్ళు బండి మింద పీర్లసావిడి దగ్గరికి బయలు దేరినట్లుందని మాకు అర్థమయింది.
***
మేము పిల్లోళ్లందరమూ చావిడి కాటికి యెల్లవారినాం. వొద్దన్నా వినకుండా తమ్ముడు పెద్దన్న మా వెంటబడినాడు, వాన్ని సంకలో ఎత్తుకొని పోవడం నాకు తప్పలేదు. వాన్నీ, వానికంటే ముందు వెంకటలక్ష్మినీ మోసిమోసి నా సంకలో కాయలు కాసినాయి. అందువల్ల వాన్ని ఈసారి భుజంమీద ఎత్తుకొని చావడి దగ్గరికి పోయినాను. పీర్ల చావడి దగ్గర అప్పటికే పిల్లా బిసుకు జనం చేరుకుండారు. టౌన్నుంచి వొచ్చిన బ్యాండుమేళగాళ్లు, డోళ్లు వాయించే వాళ్లు విచిత్రమైన డ్రస్సులేసుకొని, టోపీలను పెట్టుకొని అవేంటివో కొత్తరకము మేళాలు వూదుకుంటా డోళ్లు వాయిచ్చుకుంటా వొచ్చినారు. వాళ్ల వెనక అనంతపురం చిన్నోబన్నోళ్ల టైరు బండి వొచ్చింది. బండి మింద జోడోళ్లంతా పానకాల ముంతలు పట్టుకుండారు. ఆదెప్ప వొగ పెద్ద ఇత్తడి పళ్ల్యాన్ని తలకాయి మింద పెట్టుకుండాడు. పళ్లెంలో పీర్లకు చదివిచ్చే నక్కీ పరుపు గుడ్డలూ, వెండి గొడుగులూ తళతళ మెరుస్తా వుండాయి. బండి చెక్క పలకలకూ, నొగలకూ రంగు కాగితాలు అతికిచ్చినారు, బండికి కట్టిన దేశిపెద్దులు భలే తోజుగా వుండాయి. కొమ్ములకు రంగు పూసినారు. గగ్గెర్లుండే కొమ్ము కొప్పులకు రంగు రంగుల రిబ్బన్లు కట్టినారు. వీపుల మింద గౌశెన్లు వేసినారు. నొసటి మీద అద్దాల కుచ్చులు వేెలాడేసినారు. మెడలకు గజ్జెల పట్టీలు కట్టినారు. ఎద్దుల ముంగాళ్ల గిట్టెలపైన నల్లకంబడి పోగులు చుట్టినారు. బండి ముందుకు వొస్తావుంటే జెనం అబ్బురపోయి చూస్తావుండారు.
నాకయితే ఆ బండినీ, ఎద్దుల్నీ, ఆ తోజునూ చూసి వొళ్లు జలదరిచ్చసాగింది. శరీరం నిండా యేందో తెలీని సంతోషం పారాడసాగింది. అంతలోనే పూలంపల్లి నరసింహారెడ్డోళ్ళ కోడెగిత్తల బండి జోడోళ్ల బండిని దాటుకొని ముందుకొచ్చింది. జోడోళ్ల గుంపంతా దాన్ని అటకాయిచ్చింది. అనంతపురం నుండీ వొచ్చిన రౌడీల మాదిరుండే దూడ పిల్లోళ్లందరూ నరసింహారెడ్డోళ్ల బండిని ముందుకు రాకుండా ఆపినారు. జోడోళ్లు ఎప్పుడూ అంతే! అందరూ మా కులమోళ్లే. దుడుకెక్కువ. భలే ‘గత్తు’ చేస్తారు. ఆ గత్తు జూసి ఎదటోళ్లు రోంత భయపడతారు. మల్లా ఈడుండే జోడళ్లందరివీ కొట్టాలే! అందురూ కూలికి పోయి బతికేవాళ్ళే! అయితే వాళ్లది తప్పయినా సరే, గత్తు జేసి ఎదటోళ్ల నోరు మూపిస్తారు. ఈడుండే వాళ్లకు తోడు అనంతపురం నుండి ఆర్భాటంగా వొచ్చినోళ్ళు తోడయితే వాళ్లను పట్టేకుండదు. అందుకే నరసింహారెడ్డోళ్ల బండిని ముందుకు రానీకుండా అడ్డమొచ్చి రగడ పెట్టుకుండారు.
అయితే వూరి పెద్దమనుషులందరూ ఆజీ స్వాములకు చక్కెర చదివిచ్చేకి, మా వూరి బండే మొదట రావల్లని, మూడు నాలుగేండ్ల కిందటే తీర్మానం చేసిండేది అందరికీ తెలుసు. అది కాదని టౌన్నుండి ఆర్భాటంగా వొచ్చినోళ్లు మా బండే ముందుండల్లని అని అంటే యెవురొప్పుకుంటారు? అందుకే వూరి పంచాయితి ప్రసిడెంటు సుంకురంగప్పా, కొత్తకురవోళ్ల నారాయణప్పా, వడుగూరు చండ్రాయుడూ, యర్రప్పగారి అంజినప్ప ఇంకా ఐదారు మంది పెద్ద మనుషులు, రగడ చేసుకుంటా వుండే గుంపులోకి దూరి, గత్తు చేస్తావుండే టవునోళ్లను దండిచ్చి నిలబెట్టినారు, పెద్దమనుషులకు సపోర్టుగా పల్లెలోవుండే అన్ని కులాలవాళ్లూ ఏకమైనారు. అది గమనిచ్చి, బండ్లో వుండే జోడోళ్ల చిన్నోబన్న గొంతు పెంచినాడు. పోయిన సమ్మత్సరం చెప్పిన మాటలు గుర్తుచేసి, ‘మీ టవున్లో మీ డౌలంతా చూపిచ్చుకోండి. ఈ పల్లెలో ఆ పప్పులేం వుడకవ్’ అని తెగేసి చెప్పినాడు ప్రసిడెంటు సుంకు రంగప్ప. మా వూరోళ్లందరూ అతని మాటల్తో గొంతు కలిపినారు. దాంతో పక్కనుండే మంచికంటి నాగరంగయ్య కొంచెం బాధతో, నిష్ఠూరంగా ‘ఓబన్నా, మావూరి పీర్ల దేవుళ్లకు మీరు అంత ఖర్చుబెట్టి వెండిగొడుగులూ, విలువైన పరుపులూ తెచ్చినారన్న మూలాజా గుడకా వీళ్లకు లేనప్పుడు మీకెందుకంత తాపత్రయం? రెండడుగులు ముందేం, వెనకేం? వూరకనే గలాటా చెయ్యకుండా అవి పీర్లకు చదివిచ్చి పోండి’ అని అక్కన్నుండి వెళ్ళిపోయినాడు. అతని మాటలు అందరికీ అర్థమయినాయి.
‘రొండు వెండి గొడుగులు తెస్తే మాత్తరం వూరి కట్టుబాట్లను పక్కన పెట్టల్లనా?’ అని అందరూ గొనగసాగినారు. మా నాయన రోంత ధైర్యంగా ముందుకుపోయి, ”దేవుల్లకు ముడుపులు సదివిచ్చేకి ముందూ యెనకా అనేది యేముంది వోబన్నా?’ ఆజీసాముల దయవల్ల మీరు లక్షణంగా బతుకుతా, పతి సమ్మత్సరమూ దేవుల్లకు మొక్కుబడి తీర్చుకుండేకి వస్తావుండారు. మీరు రావడం పీర్ల పండక్కి వొగ కళ! అట్లాదాన్ని పవురుసాలకు పోయి యాల చెడుపుకుంటారు? ప్రశాంతంగా జరిగే పండగనాడు యాల ఈ పట్టింపులు’ అని మెత్తగనే చెప్పినాడు. మానాయన మాటల వల్లనో, వూరంతా వొగే మాటమింద వుండారని అర్థమైందో యేమో, జోడోళ్ల గుంపు రోంత వెనక్కి సల్లుకుంది.
మొదట నరసింహారెడ్డోళ్ల బండీ, దాని వెనక జోడోళ్ళ టైరు బండీ గుండం చుట్టూ తిరిగి పీర్లకు వస్తువులూ, చక్కెరా సదివిచ్చినారు.
సుంకు రంగప్పశెట్టి ధైర్యమూ, తెగవా చూసి నాకు భలే సంతోషమైంది. మా వూరోళ్ల ఐకమత్యం బొగు నచ్చింది. మా నాయన పెద్దోళ్ల మధ్యలోకి దూరి అంతబాగా మాట్లాడడం నేను యానాడూ విన్లేదు.
పీర్లకు చక్కెర సదివిచ్చినంక ఎద్దుల బండ్లు వొక్కొక్కటి బజారు గుండా తూర్పు పక్క పోతావుంటే ఆ పన్యారం చక్కెర కోసరం బీదాబిక్క ఎగబడినారు. నా తమ్మున్ని కిందికి దించి నేనూ నరసింహరెడ్డోళ్ల బండిదగ్గరికిపోయి పన్న్యారపు చక్కెర కోసరం చేయి చాపినాను. నన్ను చూచి నరసింహారెడ్డి తమ్ముడు రామిరెడ్డి ‘యేమోరు రా, రా’ అని అంటా శెనక్కాయ విత్తనాల బేసనాలూ, పప్పులూ కలిపిన చక్కెర కనికెట్నిండా పెట్టినాడు. నేను దాన్ని కండ్లకు అద్దుకొని నోట్లో వేసుకొని మిగతాది తమ్ముని జోబీలోకి పోసినాను. వాడు మురిసిపోతా గబగబా బొక్కలాడినాడు.
సాయంకాలం చీకటిపడే సరికి ఎద్దుల బండ్ల సందడి తగ్గింది. నేను ఇంటికి పోయి, అమ్మయ్య ఇచ్చిన ఇత్తడి తట్టలో చక్కెర తీసుకొని వొచ్చి ఆజీస్వాములకు చదివిచ్చేకి ఇచ్చినాను. అక్కడ పీర్ల దగ్గర నిష్టగాకూర్చున్న ఫక్రదీన్‌యేందో మంత్రం మాదిరి తురకంలో చదివి ఆ ప్లేటును తిరిగి ఇచ్చినాడు. రాత్రి పెద్దాజీస్వామిని ఎత్తుకుండేకి తెల్లవారుజామునుంచి ఎంగిలి గుడకా మింగకుండా వొక్కపొద్దుండాడు ఫక్రదీన్. అందుకే మొగమంతా వాడిపోయింది. అక్కడ మల్లెపూలు, మెల్లగా కాల్తా వుండే వూదికడ్డీలూ, గంధమూ ఇంకా యేంటేంటివో అన్నీ కలిసి మంచి సువాసన మత్తెక్కిస్తావుంటే ఆట్నుంచీ రాల్యాక రాల్యాక ఇంటికొచ్చి, పీర్లకు సదివిచ్చిన చక్కెర ఇంటందరికీ పెట్టినాను. అందరూ ప్రసాదం మాదిరి కండ్లకద్దుకొని చప్పరిచ్చినారు.
చిన్న సరిగెత్తు నాట్నుంచీ ఆరిపోని గుండంలో ఈపొద్దు భారీగా చింత మొద్దులూ, తొడుగులు తొడుగులు కల్లాకంపావేసి పెదింత మంట లేపి, గుంపులు గుంపులుగా గుండం దగ్గర అలావు తొక్కుతారు. ముసిలీ ముతకోళ్లు తప్పా వూరంతా చావిడి దగ్గరికి చేరుతారు. అందుకే తొందరగా బువ్వతిని చావిడి దగ్గరికి యెల్లవారినాను. ”నువ్వు అలావు తొక్కేసోటికి పోవద్దప్పా” అని అమ్మయ్య హెచ్చరిచ్చి పంపిచ్చింది.
నేను, చిన్నప్ప చిన్నాయనా చావిడి కాటికి పొయ్యేటప్పటికే రెండు బండ్లనిండా చింతమొద్దులూ, యాపమొద్దులూ వొచ్చినాయి, రెండు బండ్లనిండా కల్లతోపులు వొచ్చినాయి. గుండంలోకి పచ్చి మొద్దులూ కల్లావేసి గబ్బునూనె పోసి అగ్గిపుల్ల గీసి అంటిచ్చినారు. గబ్బునూనె దెబ్బకు మంటలు ఆకాశానికి ఎగిరినాయి. అగ్గి మినుగుర్లు పైకిలేచి జనం మీద పడతావుండాయి. గుండానికి కొంచెం యెడంగా ఉప్పర భీషన్నా, రొట్టే పుల్లప్పగార్ల బోదగడ్డి కొట్టాలుండాయి, అందుకే మంటలు ఆ పక్క ఎగరకుండా వూరి తలార్లూ యెట్లోళ్లూ రాగాల కట్టెల్తో మంటల్ని అదువు జేస్తావుండారు. జానగొండోళ్ళ ఇంటి ముందరుండే వేపమాను కొమ్మలు గుండం పక్క వుండేటివి, మంటలు పైకి లేచినప్పడల్లా కమరకపోతావుండాయి.
‘అంతింత పెద్ద మొద్దులు యాట్నుంచి తెచ్చినార్రా?’ అని చిన్నాయన అడిగినాడు. అవన్నీ రోడ్డు పక్కన గవర్మెంటోళ్లు నలభై యాభై యేండ్లనుండీ పెంచిండే మాన్లని ప్రతి సమ్మత్సరమూ వొగ మాను కొట్టుకోనొచ్చి గుండంలోకి యేస్తావుండారని, కడాకు బాట మాన్లన్నీ గుండంలో బూడిదైపోతాయని పక్కనుండే బచ్చునాగప్ప కొడుకు రామయ్యశెట్టి చెప్పి కొంచెం దిగులు పడినాడు. ఈయప్పేంది ఇట్లంటా వుండాడు? బాట మాన్లు కాకుంటే గుండంలోకి యింగేమెయ్యల్ల అని నేను మనసులోనే అనుకుంటా శెట్టిని తిట్టుకుండాను.
రామయ్య శెట్టి చాలా మంచోడు. నా క్లాసుమీటు బచ్చు నాగభూషణం వాళ్ల పెద్దన్నయ్య. పెదగొర్ల నరసమ్మ ఇంటి పక్కన్నే చిల్లరంగడి పెట్టుకుండారు. గింజలకు సరుకులిచ్చే దాంట్లో వరట్ట రంగయ్య మాదిరి అంత మోసంచేసే రకంకాదు రామయ్య. అట్లా మనిషి, బాటమాన్లను గురించి వూరకనే యాల దిగులు పడతాడు? అని నేను రోంతసేపు ఆలోచన చేసి, పచ్చి మొద్దులు సరిగా కాల్లేదని తలారి అనుమన్న మాటిమాటికీ గబ్బునూనె పోసినప్పడల్లా పైకి లేస్తావుండే మంటలు వైపు బోదగడ్డి కొట్టాల వైపూ చూడసాగినాను.
గుండం దగ్గర అలావు తొక్కడం మొదలయింది. మా వూరివాళ్ళు చాలరని శింగనమల నుండి, శివపురం నుండి తప్పెట్లు కొట్టే మాదిగోళ్లను పిలిపిచ్చినారు. సుమారుగ పది తప్పెట్లు మోగుతా వుండాయి. అలావు తొక్కేవాళ్లు వొగ గుంపు తర్వాత మరొగ గుంపు కాళ్లకు గజ్జెలు కట్టుకొని, చేతుల్లో కట్టెలు పట్టుకొని ‘సావసేన్‌సాయి భోం ధూళా’ అంటా కేకలు వేసుకుంటా తప్పెట్లకు అనుకూలంగా అలావు తొక్కుతా, తొక్కేవాళ్ల అడుగులకు అనుకూలంగా తప్పెట్లు కొడతా వుంటే చూసే వాళ్ళందరూ మురిసిపోతావుండారు. నాకయితే, నేనూ పోయి అలావు తొక్కే వాళ్లతో కలసి అలావు ఆడల్లనిపిచ్చింది. వెంటనే అమ్మయ్య చెప్పిండే మాటలు గ్నాపకమొచ్చి, ఉత్సాహాన్ని లోపలే అదుముకుంటా అలావు తొక్కేవాళ్ళను చూడసాగినాను. ఎంతసేపు చూసినా అదే అలావు గదా అనుకుంటా రోంతసేపు చూసి ఇంటికిపోయి పండుకుండాను. పండుకుంటా, తెల్లవారుజామున మరిచిపోకుండా నన్ను లేపల్లని అమ్మయ్యతో గట్టిగా చెప్పినాను. చెప్పినట్లుగానే అమ్మయ్య నన్ను లేపింది. నేను తర్రాబర్రా ముఖం కడుక్కొని చావడి దగ్గరికి పరుగెత్తినాను. వొగ దినమంతా నిష్టగా వొక్కపొద్దుండి, తెల్లవారుజామున తూరుబ్బావి దగ్గర చన్నీళ్లు పోసుకొని తప్పెట్ల మధ్యా, మేళాల మధ్యా పరుబ్బట్టల మీద నడుస్తూ తూలుతా వొచ్చి ఆజీ పీర్లను ఎత్తుకుండేది చూడడం నాకు భలే ఇష్టం. అందుకే పరుగెత్తి పోయినాను. గుండంలో అగ్గి నిప్పులు ఖణ ఖణమంటా సెగలు గక్కుతావుండాయి. యెట్టోళ్లు గుండం చుట్టూరా క్లీన్ చేస్తా వుండారు. సుంకు రంగప్పా, కురవ నారాయణప్పా, ఉప్పర అంజినప్పా పీర్లదగ్గర అరుగు మింద కూర్చొనివుండారు. పీర్లను ఎత్తుకుండేవాళ్లను అప్పుడే బావిదగ్గరికి పిల్చుకొని పోయినారని జనమంతా ఆదరా బాదరా అక్కడికి పరువెత్తుతావుండారు.
నేను జనం లోపలికి పోకుండా పెదగొర్ల నరసమ్మోళ్ళ అరుగుమింద మా చిన్నప్ప చిన్నాయన పక్కన నిల్చుకోని చూస్తావుండాను. పీర్లను ఎత్తుకుండే వాళ్లు బావిదగ్గర నీళ్ళాడి పరుపు గుడ్డలు మింద చేతులుకట్టుకొని మెల్లగా వొస్తా వుండారు. చాకలోల్ల చెన్నప్ప అన్నదమ్ములు ముగ్గురూ ఉతికిన పంచల్ని నేలమీద వొగ దాని తర్వాత వొగటి పరుస్తావుండారు. అది చూసి, మా తెలుగు బుక్కుల్లో ఎవురో రాజు తన ఆస్థానంలోకి పట్టుపరుపుల మీద నడుచుకుంటా పొయ్యిండే సంగతి మనసులో మెదిలింది. ఆ రీతిగా, పీర్లనెత్తుకోడానికి పరుపు గుడ్డల మీద వొచ్చే వాళ్లు ఇప్పుడు సాక్షాత్తు దేవళ్ళే అని పెద్దోళ్లు వీళ్ల అడుగుల కింద పరుపు గుడ్డలు పరిచేకి ఏర్పాటు చేసినారేమో అని అనుకుండాను.
ఆజీ స్వాములు వొగ పరుపును దాటి ముందుకొస్తానే, ఆ దాటొచ్చిన పరుపును గబగబా చుట్టి చాకలి చెన్నప్ప, ముందర పరుస్తావుండే తన మనుషులకు విసిరేస్తా వుండాడు. పరుపు గుడ్డలకు ఇరువైపులా జనం ముందుకు దూసుకొని వస్తావుండారు. వూరి తలార్లు బోనాకట్టెలతో జనాన్ని వెనక్కి నెట్టుతా వుండారు. ఇరువైపులా పది తప్పెట్లు మోగుతా వుండాయి. మేళాలు ‘తూతూతుతుతూ పైనిండింది” అని వూదుతావుండాయి. పరుపు గుడ్డల మింద నడిచొస్తావుండే ఆ దేవుళ్ళకు, వెనక్కి తోకలిడిచిన తలకట్లూ, నడుములకు బిగిచ్చిన నడికట్లూ తడితడిగా బిగుసుకుండాయి. జుబ్బాలూ, బిల్లగోసి పంచెలూ తడితడిగా వుండాయి. చలికి స్వాములిద్దరూ వొణుకుతా వుండారు. వాళ్ళు వొణక లేదని, ఆజీ స్వాములు వాళ్ల పయిలోకి వొచ్చినారని, అందుకే రెప్పలు కొట్టకుండా యెక్కడో చూస్తావుండారని నా పక్కనుండే వాళ్లు అంటా వుంటే నేను చెంపలేసుకుండాను. జనమంతా గగుర్పాటుతో ఆశ్చర్యంగా చూస్తావుండారు.
ఆజీ స్వాములు చావడి మోటువరకు వొచ్చినారు. పెద్దమనుషులందరూ పైకి లేచి చావడి అరుగు అంచుల మింద నిలబడి గట్టిగా అరుస్తా, జవాన్ని కంట్రోల్‌చేస్తావుండారు. ముల్లాసాబులూ, పకీర్లయినోళ్ళూ పీర్లను బయటికి తెచ్చి, ఎత్తుకుండేవాళ్లకు అందిచ్చేకి ఏటవాలుగా ఎదురుగా పట్టుకుండారు. డూములైట్లను భుజాల మింద ఎత్తుకున్నోళ్లు, పెద్దమనుషులు చెప్పినట్ల పరిచిన పరుపులకు ఇరువైపుల ఇద్దరూ, పీర్లదగ్గర ఇద్దరూ గుండం చుట్టూరా కొంచెం యెడంగా నలుగురూ వుండారు. ఆ లైట్ల వెలుతుర్లో చావడి దగ్గర పట్టపగలైంది. లైట్ల వెలుగులో పీర్లకు కట్టిన నక్కీ పరుపులూ, పైన తలకాయల చుట్టూ వెదురు పుల్లలకు చెక్కిన వెండి గొడుగులూ, గొడుగుల కింద లోలాకులూ, జుంకీల మాదిరి వేలాడే సన్నని వెండి గుండ్లూ, పాలిష్‌పెట్టినారేమో తళ తళ మెరుస్తావుండాయి. మా వూరి ఆజీ పీర్లకు పరుపుగుడ్డలు కట్టినట్ల ఇంగెెక్కడా ఇంతందంగా కట్టరంట! అందుకే మా అజీ స్వాములు భలే అందంగా వుంటారు.
ఇంగ రెండు పరుపులు దాటితే, నీళ్లాడి వొస్తావుండే స్వాములు పీర్లదగ్గరికి చేరుకుంటారు. తప్పెట్లూ, మేళాలూ వూపందుకుండాయి, పెద్దాజీ స్వామి ఫకర్దీన్‌పయిలోకి వొచ్చినాడేమో ఆయన తూలుతా నడుస్తావుండాడు. యాలనో ఆయన పెద్దాజీ పీరు పక్కచూస్తా కండ్లనీళ్లు పెట్టుకుంటా వుండాడు. చాకల చెన్నప్ప కడసారిగా పరుపు గుడ్డను గుండం వరకూ పరిచినాడు. తలార్లు జనాన్ని గుండం దగ్గర రాకుండా బోనాకట్టెలతో వెనక్కి నెడుతా వుండారు. ఫకర్దీన్ ఇంక చాతకాదన్నెట్ల పరుగెత్తిపోయి పెద్దాజీ పీరును ఎదురుకొని ఎత్తుకుండాడు. ఆజీ స్వామి పయిలోకి వొచ్చినాడేమో, ఆయన, ఆయన స్వాధీనంలో లేడు. పీరు బరువుగా వుందేమో, ఎత్తుకొని తూగబట్టుకుండే స్థితిలో లేడు. పక్క నుండే భక్తులు, పీరు వెనక పరదాగుడ్డ కిందుండే పీరు బొంగును ఫకర్దీన్‌నడికట్టులోకి దూర్చినారు. ఆజీస్వామి జనాన్ని తీసుకుంటా తొట్రుపడతా పరుపుగుడ్డ మీదనే గుండం దగ్గరికి చేరుకుండాడు. వెనకనే చిన్నాజీస్వామి. గుండంలో కణికెడులావు నిప్పులు ఖణ ఖణ మంటా సెగలుగక్కుతా వుండాయి. దగ్గరికి పోవల్లంటేనే భయమయితాది. అగ్గినిప్పులు గుండం గుంతలో పట్టక, బయటకొచ్చినాయి.
అట్లాటి అగ్నిగుండంలోకి ఆజీస్వాములు దుమికి ఎగురుతా గబగబా అవతలికి పోయినారు. ఆస్వాముల వెంట ఇరవైముప్పై మంది భక్తులు నిప్పుల మింద పరుగెత్తినారు. మల్లా ఆజీస్వాములు వెనక్కి తిరిగి నిప్పుల మీదనే ఇవతలివైపొచ్చినారు. గుండంలో నడిచేటప్పుడు వాళ్ళ పాదాలు నిప్పుల్లో జానెడు లోతులో వుండాయి. దాన్ని చూస్తా జనం అబ్బుర పోతా ఆజీస్వాములకు చేతులెత్తి దండం పెట్టసాగినారు. తప్పెట్లూ, మేళాలూ ఆగిపోయినాయి. పెద్దమనుషులు జనాన్ని తోసుకుంటా స్వాముల దగ్గరికి పోయినారు. నేను చిన్నాయన దగ్గర్నుంచి ఆటికి పరువెత్తి పోయినాను. జనమంతా క్షణ కాలం నిశ్శబ్దమయినారు. ఒగ ముల్లాసాబు పెద్దమనుషుల కోరిక మేరకు ఆజీ స్వాములను, భవిష్యత్తును గురించీ, పంటల్ని గురించీ, వాన్లను గురించీ, చెర్లోకి నీళ్లొచ్చే విషయాన్ని గురించీ, తురకంలో అడిగినారు. పెద్దాజీస్వామి తురకంలోనే మెల్లగా చెప్పినాడు. ఈ సమ్మత్సరం వానలు బ్రమ్మాండంగా పడతాయని, చెరువు మరవ పారుతాదని, మంచి పంటలు పండుతాయని పెద్దాజీస్వామి చెప్పినాడంట. దాంతో జనం సంతోషంతో కేకలేసినారు.
జరిగిపోయిండే దాన్నంతా గ్నాపకం చేసుకొని మనస్సు నిరాశపడసాగింది. పీర్ల పండగ వెళ్లిపోయి మూడు నెలలు కావొచ్చినా, చెరువు నిండలేదు. చెర్లోకొచ్చే తడకలేరూ ఆకులేటివంకా వొగ రోజయినా పెద్దగా పారలేదు. అరకొర వానలతో వొగ పంటకు మాత్రం సరిపొయ్యే నీళ్లొచ్చినాయి. ఆజీ పీర్లేమో, చెరువునిండి మరవ పారుతాదని, మంచి పంటలు పండుతాయని గట్టిగా చెప్పినాయి. పీర్లస్వాములు చెప్పినారని, రెండు మూడెకరాలు గుత్తకు తీసుకొని బాకీలెక్కువచేసి పంటలు పెట్టింటే ఎంత కష్టమయ్యిండేది? అంతా గుడ్డిగా జనం నమ్మడమే గానీ రాబొయ్యే కాలంలో జరగబొయ్యే దాండ్లను గురించి యా దేవుళ్లు చెప్పుతారు? అన్నీ వోటికూతలు! అనుకుంటా అసంతృప్తి చెందినాను.
శెనక్కాయ మండల కోసరం చెలకోల దెబ్బలు!
మాగాణిలో వరిమళ్లు కోసినారు. చెరువులో నీళ్లు అయిపోవడంతో సరిగ్గా నీళ్లందని కొన్ని మళ్లు బొందుపోయినాయి. కొంతమందికి ఒగ రకంగా పంట చేతికొచ్చింది. మేము గుత్తకు చేసిన సీతయ్య మడిపంపు కొంచెం తగ్గులో ఉండే చవుటి బంకనేల కావడంతో కేస రొడ్ల పంట బాగానే అయింది. ఎనిమిది మూటల వడ్లు చేతికొచ్చినాయి. అప్పులోళ్ళకి పోను మూడు మూటలు ఇంటికి వొచ్చినాయి. మడి కట్టుగుత్తకు చేయడంవల్ల వరిగడ్డి అంతా మాకే వొచ్చింది. ఆలాకు చేయకుండా వాడుకుంటే, ఆరేడు నెలలకు పశువుల మ్యాత సరిపోతాది. నాకూ, పెద్దక్కకూ ఇంగా వరిమడి కోయడం రాదు. వొగ ఆదివారం అమ్మయ్య వెంట నేను వరిమడి కోసేకి పోయి వంగిన వెంటనే కొడవలితో వేలుకోసుకొని నొప్పితో అమ్మా అని గట్టిగా అరిచినాను. అమ్మయ్య రక్తము కారుతా ఉండే నా వేలి పక్క చూసి బాధపడతా తన చీర కొంగు చించి కట్టుకడతా కన్నీరు కారుస్తా నన్ను ఓదార్చింది. వేలు తెగిన బాధ కంటే నేను వరికోత కోయలేకపోయినందుకు, మూడు తవ్వలు ఢిల్లీ భోగాలొడ్లు కూలి తీసుకురాలేకపోయినందుకు ఎక్కువగా బాధపడినాను. ఆ బాధ నన్ను ఊరకనే వున్నీయలేదు. బడి వదులుతానే, కోసిండే మళ్లల్లోకి పోయి పరిగలు వేరుకొని దినానికొగ ముంతెడు వడ్లు ఇంటికితెచ్చి బాధను రోంత తగ్గిచ్చుకుండాను. పెద్దక్క ప్రతిదినమూ పరిగలు వేరుకొని సాయంత్రానికి రెండు మూడు తవ్వల వడ్లు తీసుకురాసాగింది. మడి కోతలన్నీ అయిపోయేటప్పటకి కూలిగింజలు, పరిగల గింజలు అన్నీ మూడు మూటలు జమయినాయి. పండిచ్చిండేవీ, కూలిగింజలూ అన్నీ కలసి ఐదారు నెలల బత్తెం గింజలని అనుకుండారు నాయనా అమ్మయ్య.
ఆరు పల్లాలు వడ్లగింజలు ఇంట్లోకి వచ్చేసరికి ఆరు మంది ఇంట్లో పండుకోవడానికి చాలా ఇరుకయ్యింది. ఎండాకాలంలో అందరూ బయట పండుకోవచ్చు. ఈ చలికాలంలో బయట పండుకోవడం కష్టం. అంతా ఆలోచించి ముందు ముందుకు వొగ ఎనుం గొడ్డును తెచ్చుకున్న్యా, మూడు పశువులకు సరిపోయే విధంగా గాటిపాడును వొదిలి, కొట్టంలో వొగ అరగోడ కట్టుకుంటే అక్కడ వంట చేసుకుంటే బాగుంటాందని నేను చెప్పడంతో నాయన ఒప్పుకుండాడు. పడిపోయిన పెద్దమ్మ గుడి రాళ్లన్నీ బయటకు తీసి ఆ మట్టికి మళ్లల్లో ఉండే బంకమన్ను కలిపి అసులు చేసినాడు నాయన. రాళ్లన్నీ పొందిచ్చి వరుస వరుసకు మధ్యలో అసులేసి నాలుగడుగుల ఎత్తు అరగోడను లేపినాం అందరమూ కలిసి. గాటిపాడు కంటే రెండడుగుల ఎత్తు ఉండేటట్ల అరగోడకు కొట్టం పడమటి కొమురు గోడకు మధ్యలో మట్టిని నింపినాం. నింపిన మట్టి మింద ఏడెనిమిది కడవల నీళ్లు పోసినాం. సాయంకాలానికి మట్టి అంతా బిగుసుకుంది. అరగోడంతా బాగా ఆరింది.
మరుసటి దినం బిగుసుకున్న నేల మింద దమ్మెసతో నాయన నాలుగైదుసార్లు గట్టిగా తట్టడిసినాడు. అరగోడను ఆనుకొని ఇటిక పెల్లలతో వొగ పొయ్యి, దాని పక్కన పొంతపొయ్యి తయారుచేసినాడు. రెండు మూడు దినాలు ఆరినంక ఎర్రమన్నూ, ప్యాడా కలిపిన అసులుతో అర గోడనూ, మిగతా గోడలనూ అమ్మయ్య, పెద్దక్క చిక్కెగ మెత్తినారు. మల్లా రెండు దినాలు అయినంక గోడలకు సున్నం కొట్టి, కింద నేలంతా ప్యాడ నీళ్లతో అలికినారు. ఇప్పుడు అది వంట రూము మాదిరయింది. కొట్టం వాకిలి దగ్గర్నుంచి పశువులు పైకెక్కడానికి వీలుగాకుండా మనుషులు మాత్రమే పొయ్యేకి వీలుగా చేసుకొని, ఇంట్లో ఉండే పొయ్యినంతా తీసివేసి వంట రూమును కొట్టంలోకి మార్చుకుండాం. ఇంట్లో వంట చేసుకుండే చోట ఈత బర్రెలతో అల్లిన గాదెను పెట్టుకుని దాంట్లోకి ఎండిన వొడ్లన్నీ పోసుకోవడంతో ఇప్పుడు అందరూ చలికాలంలో ఇంట్లో పండుకోవడానికి వీలైంది.
మా ఊరికి మాగాణి ఉన్నంత ఎలిపొలం లేదు. ఊరికి మూడు పక్కలా కొండలూ ఉత్తరం పక్కన మాగాణి ఉండడంతో చేనుపొలం చాలా తక్కువ. కొంతమందికి మాత్రమే కొండలవారగా చేన్లుండాయి. ఆ చేన్లున్న రైతులు మాత్రమే తీగ శెనక్కాయ పంట పెడతారు. తీగ శెనక్కాయ ఆరు నెలల పంట. ఈ సమ్మత్సరం చెరువుల్ని నింపే వర్షాలు పడలేదు గానీ ఎలి పొలం పంటలకు సరిగ్గా సరిపోయే వర్షాలొచ్చినాయి. వేరుశెనగ వేసినోళ్లకు మంచి పంట యింది. వేరుశెనగలో అక్కిడిలో వేసిన సద్ద, అలసంద, పెసర, కంది ఇంకా రెండు మూడు రకాల పునాసి గింజల పంట గుడకా బాగయింది.
రైతులు చేన్లలో వేసిన వేరుశెనగంతా పలుగు గుంటకలతో పాసినారు. పాసిన వేరుశెనగంతా కుప్పలు కుప్పలు వేసి, అదంతా చేన్లోనే బాగా ఎండిన తరువాత, బండ్లల్లో తోపులేసుకుని దొడ్లల్లోకి తోలుకొని, వాము లేస్తారు. పనులన్నీ అయిపోయినంక తీరిగ్గా వాముల్ని పగలబీకి రాగాల కట్టెలతో శెనక్కట్టినంతా చిదగ్గొట్టి తూర్పుపోసి శెనక్కాయలను రాసులు పోస్తారు. ఎండిన శెనక్కట్టెను విడిపిచ్చడానికి వొగరిద్దరు మగకూలోళ్ళు తప్ప ఎక్కువమంది కూలోళ్ళతో అవసరముండదు. ఆ ఇద్దరు ముగ్గురు మగకూలోళ్ళు శెనక్కట్టెను చిదగ్గొట్టడం తెలిసినోళ్ళే అయ్యిండల్ల. అందుకే ఇంటి మనుషులో, ల్యాకుంటే జీతగాళ్ళో ఆపని చేస్తా ఉంటారు. అటువంటప్పుడు శెనక్కట్టెను చిదగ్గొట్టడానికి మా ఊర్లో బీదా బిక్కిని రైతులెవురూ పిల్చరు. చేన్లు లేనోళ్లకు శెనక్కాయలు తినే అదష్టం ఉండదు. చేన్లల్లోకి పోయి శెనక్కాయలు యేరుకొని తిందామంటే ఆటికీ రానీయరు. శెనక్కాయ పాసిన చేన్లల్లో అక్కిడివేసిన పూనాసి గింజల పంట ఉంటాది కాబట్టి, అక్కడికి పోవడానికి వీలుకాదు. మాకేమో శెనక్కాయలు తినల్లని భలే ఆశ. మా ఆశ ఎట్ల తీర్చుకోవల్ల? ఇవే ఆలోచన్లు.
బడగొర్ల నాగిరెడ్డోళ్ళు తమ చేన్లోనుండి శెనక్కట్టినంతా దొడ్లోకి తోల్తా ఉండారని, బండ్లతోపులు శివపురం దావలో దొడ్ల సందుల్లో వస్తా ఉండాయని, దొడ్లల్లో ఉండే చెట్ల కొమ్మలకు తగిలి శెనక్కాయ మండలు కింద పడతాయని, అవి యేరుకొని, జోబీల నిండా శెనక్కాయలు తెచ్చుకోవచ్చని, నలుగురైదుగురు జతగాళ్ళం ఆ దావ (దారి) పక్క పోయినాం. మేము అనుకున్నెట్లనే రెండు బండ్లు, శెనక్కట్టి తోపుల్తో వస్తా ఉండాయి. మేము రొంటాలకు కూర్చున్నట్ల కూర్చొని దొడ్ల సందుల్లోకి బండ్లు రాగానే పైకి బండి జాడలోకి వొచ్చినాం. అక్కడ గుల్లేవాళ్ళ దొడ్లో, నారపరెడ్డోళ్ళ దొడ్లో వుండే తుమ్మచెట్ల కొమ్మలు ఆ పక్క ఈ పక్క బండి జాడ పైన ఉండాయి. బండ్ల నొగల మింద జీతగాళ్లు కూర్చొని బండ్లు తోల్తా వుండారు. తుమ్మచెట్ల కొమ్మలు తగులుకొని ముందరొచ్చే బండితోపులో నుండి శెనగమండలు సుమారుగా కింద పడినాయి. మేము సంబరపడతా ఆ శెనగమండల్ని వెంపర్లాడతా యెదురుకుండాం. ఆ సంబరంలో రెండో బండి వెనక వొస్తావుండే నాగిరెడ్డి మామను గమనిచ్చలేదు. ఆయప్ప చెలకోల భుజాన తగిలిచ్చుకొని వొగ పెద్ద జోటీతో కొమ్మల్లో ఇరుక్కోండే శెనగమండల్ని కిందికి గెడుపుతా వస్తా ఉండాడు. మా చేతుల్లో ఉండే శెనక్కాయ మండల్ని గమనిచ్చి ‘లే, దొంగనాకొడకల్లారా! అదే పనిగా దొడ్లసందుల్లో కాసుకోనుండి, శెనక్కాయమండల్ని దెంకపొయ్యేకి వొచ్చినారేమోరు?’ అంటా చేతిలో ఉండే జోటీని కిందపడేసి చెలకోల తీసుకోని మమ్మల్ని జవిర్నాడు. కొండిగానికి చెలకోల దెబ్బ బాగా తగిలింది. నా చేతికి చెలకోలవార తగిలి వార్సక పోయింది. శివపురం నుండి వెనక వొస్తా ఉండే వడ్డె పెద్దన్న ‘యేంది నాగిరెడ్డీ! పసికందమ్మలను సెలకోల్తో అట్ల జవిరితివి? తినే కాయలు కాబట్టి రెండు మండలు పీక్కుండారు పాపం’. అంటా నాగిరెడ్డిని దండిచ్చినాడు. ఆ శెనక్కాయలు తినకుంటే మీ పానాలు పోతాయా? అని మా పక్క జాలిగా చూసినాడు.
‘మీదేం పోతాదప్పా, రేయింబగళ్ళు కష్టపడి పండిచ్చినోనికి తెలుస్తాది రైతుల బాధ అంటే ఏందో? పిల్లనాకొడుకులు నాలుగు మండలు తీసుకుంటే ఏమైతాదిలే అని ఊరకనే వుంటే ఇతగాల్లు శెనిక్కట్టి బండిని దొడ్లోకి రానిత్తారా?’ అని ఆ పెద్దయ్యను తగులుకుండాడు నాగిరెడ్డి. ఆయప్ప ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. నాకు చెలకోలదెబ్బ కంటే నాగిరెడ్డి తిట్టిన తిట్లు చాలా నొప్పి కలిగిచ్చినాయి. ఇంగెప్పుడూ ఆ గబ్బు నా కొడుకు శెనక్కాయల కోసరం నానా కూతలు అనిపిచ్చుకోకూడదని అనుకుంటా చేతికి తగిలిన దెబ్బ సుర్రుమంటా వుంటే బాధపడతా చావిడి దగ్గరికి వొచ్చి కూర్చుండాను. ఇంటికి పోబుద్ధి కాలేదు. పోతే అమ్మయ్యకి తెలుస్తాది, తిడతాది. అమ్మయ్య తిట్టినా పర్వాలేదు. ఎంత తిట్టినా ఆ కాపోని మాటలు మాదిరి బాధపెట్టవు కదా! ఇంటికి పోయేదే మేలు అనుకుంటా మౌనంగా ఇంటికి పోయినాను. అమ్మయ్య అరుగు మీద కూర్చోనుంది.
‘యాటికి బొయ్యింటివప్పా! యాల అంత సప్పగుండావు?’ అని అమ్మయ్య అడిగింది. నేను ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండాను.
‘యెవురో సెలకొల్తో జవిరి నట్లుందే! చెయ్యంతా వార్సకపొయ్యిందే! సెప్పు నాయనా, యా బేవర్సి నా కొడుకు కొట్న్యాడో సెప్పు, వాని కంపమిడిపిత్తాను. వానిసేతిలో పుండుబుట్ట వానికి ధూము తగలా! సెప్పు నాయనా! యాదన్నా తప్పుడు పనిచేసినావా?’ అంటా కతికిచ్చి అడిగింది. అమ్మయ్య అట్ల అడుగుతా వుంటే నాకు కండ్లల్లో నీళ్ళొచ్చినాయి. నా కండ్లల్లోకి చూసి అమ్మయ్య గుడకా యేడుస్తా నన్ను దగ్గరకు తీసుకుని గుండెలకు అత్తుకొని అడిగింది. నేను జరిగిందంతా యేడ్చుకుంటా చెప్పినాను. పెద్దక్కా, వెంకటలక్ష్మి అందరూ యేడ్చబట్టినారు. అమ్మయ్య గట్టిగా నోరుచేసేది విని, జేజి వొచ్చింది. చిన్నాయన బోనాకట్టిని వూదబొడుచుకొని కుంటుకుంటా వొచ్చినాడు. అమ్మయ్య తిడతావుండేది విని, చుట్టుపక్కలోళ్ళంతా జమయినారు. నా చేతిమిందుండే వాతను చూసి అందరూ బాధపడినారు. అమ్మయ్య, జేజి నన్ను వెంటబెట్టుకొని నాగిరెడ్డోళ్ళ ఇంటికాటికి పోయినారు. అరుగుమింద నాగిరెడ్డి పెండ్లామూ, తల్లీ కూర్చోని వుండారు. వాళ్లకు నా చేయి చూపిచ్చి, ‘యేమమ్మా మీరు సావుకార్లతే అయితిరిపో, పసిగందమ్మను సెలకాల్తో యిట్లనా కొట్టేది? మావాడు ఏమి తప్పుడు పనిచేసినాడని ఆయప్ప పసువును కొట్టినట్ల కొట్టినాడు? మావాడు మీ కొంపల్లోకొచ్చి యేమి దొంగతనం చేసినాడా? చెట్టుకొమ్మకు తగులుకోని కింద దావలో పడిండే రొండు శెనక్కాయి మండల్ని పసిపిల్లోల్లు తీసుకుంటే వాల్ల్లను సెలకాల్తో కొడతాడా నీ మొగుడు? యేమి మొగలాయి ఉందనుకుండారా?’ అని గట్టిగా మాట్లాడింది అమ్మయ్య. అమ్మయ్య నోరు విని ఆ గేర్లో ఉండే కురవోల్ల ఆడోళ్ళందరూ వొచ్చినారు. ‘మీరన్నా చూడండమ్మా పసువును కొట్టినట్ల కొట్టినాడు’ అంటా అందరికీ నా చెయ్యి చూపిచ్చి, జరిగిండేదంతా చెప్పింది. నా చేయి చూసి, ‘అయ్యో! పాపం వాత పడింది! చెట్లకొమ్మలకు తగులుకోని కిందబడిన శెనక్కాయి మండలు రొండు తీసుకుంటే తీసుకోండేరు, వాల్ల సేతల్లో ఉండే మండల్ని గుంజుకోని పిల్లోల్లను రోంత బెదిరిచ్చి పంపల్లగానీ మల్లా యింత ఇదిగానా కొట్టేది?’ అని తలాకొగమాట మాట్లాడినారు.
నాగిరెడ్డి తల్లి నాగమ్మా, పెండ్లామూ కొంచెం గట్టిగానే మాట్లాడినారు. అమ్మయ్య నాగంబాము మాదిరి పైకి లేచి బండబూతులు తిట్టింది. జేజి నోరు విప్పి గట్టిగానే దండిచ్చింది. అమ్మయ్య నోటిని తగులుకున్నోళ్లు ఎవరూ మాట్లాడలేరు. అదంతా తెలిసి రామేవాళ్ళ నారాయణరెడ్డి పెండ్లాం రామక్క వొచ్చి అంతా తెలుసుకొని, అమ్మయ్యనూ, జేజినీ వూరడిచ్చి ఇంటికి పిలుచుకోనొచ్చింది. ఇంత రచ్చకు నేను చేసిన పొరపాటే కారణమనుకొని బాధపడసాగినాను. అమ్మయ్య నన్ను ప్రేమగానే దండిచ్చి బాధపడింది. చిన్నాయన, జోడోళ్ళ పెద్ద కుళ్లాయప్ప ఇంటివైపుండే గోడమీద కూర్చొని నానా మాటలు అంటా ఉండాడు.
‘ఇంగ ఊరికే ఉండప్పా! ఇద్దరమూ వాల్ల నోట్లోకి గడ్డి పెట్టి వొచ్చినాములే’ అంటా అమ్మయ్య చిన్నాయనకు నచ్చజెప్పింది.
‘గడ్డి కాదొదినా, ఆ నాగిరెడ్డిగాని నోట్లోకి రోంత పీ పెట్టిరాల్సిండె! ఇసారి నాకు కనబడనీ, వాని కత సెప్పుతాను’ అంటా చిన్నాయన ఇంగా ఏదో వొదురుకుంటా కూర్చుండాడు. అమ్మయ్య లోగిట్లో నిలబడి చిన్నాయనను ఇంట్లోకి రమ్మని పిలుస్తా వుంది. అంతలోనే, బడగొర్ల నాగిరెడ్డి ఇంట్లో చెప్పినారేమో, అమ్మయ్యను దండిచ్చేకని జోడోళ్ళ సందులోకొచ్చి పెద్ద కుళ్లాయప్పోళ్ళ ఇంటిముందర నిల్చుకొని ‘యేమమ్మా కేశమ్మా, యేందో శానా జంపుగా మాట్లాడొచ్చినావంటనే! అంత పౌరుషముండే దానివి నీ కొడుకుని దొంగతనానికి యాల పంపిచ్చినావు?’ అని గట్టిగా మాట్లాడినాడు.
‘యేందప్పా ఈసారి అను, యేం జంపుగా అనక, భయిపడతామనుకుండావా? అసలు నువు మనిసివేనా? నీకూ మావాని యీడు పిల్లోల్లుండారే! తుమ్మాన్ల కొమ్మలు తగులుకోని కిందపడిండే శెనిక్కాయి మండలు రెండు తీసుకోనుండే పసికందులు నీకు దొంగల మాదిరి కనిపిచ్చినారా? దొంగలని ఆ పసిపిల్లల్ని సెలకాల్తో కొడతావేమప్పా? దొంగలైతే చావిట్లో పంచాయితీ పెట్టించి తప్పు మోపల్సిండె. పెద్దమనుసులు యెవురి నోట్లోకి ఇంత మూత్తా వుండ్రో అదీ తెలుత్తా ఉండె! పిల్లోల్లను కొట్టిండేది గాక దొంగతనం మోపి దండిచ్చేకి వొచ్చినావా ఇంటికి?’ అంటా అమ్మయ్య బడగొర్లాయప్పను అంటుకుంది. ఆ యప్ప రోంత నోరు తగ్గిచ్చి యేందో అనబోయినాడు. అంతలోనే మా కుంటి చిన్నాయన ‘యేందోరు బడగొర్లోడా, యింగా నోరెత్తుతాండావ్? యింగొగ మాట మాట్లాడినావంటే తలకాయి పగల్దెంగుతా! సొంతం తోడబుట్టినదాన్ని ముండమోపిచ్చి, ఆ యమ్మ ఆస్తినంతా దెంగేసినోనివి నువ్వు దొంగనాకొడుకు. నీ బతుకు నాకు తెల్దేమోయ్?’ అంటా అబ్బళ్ళు కొరికినాడు.
‘యేందిలే కుంటోడా శానా జాత్తీ మాట్లాడతాండావ్’ అంటా నాగిరెడ్డి ముందుకు వొచ్చినాడు. గోడమీద కూర్చోనుండే చిన్నాయన వొగపెద్ద కాలుపురాయిని పైకెత్తి నాగిరెడ్డి తలకాయి మింద వేసేకి వూకిచ్చినాడు. అంతలోనే చాకల చౌడక్క పెద్ద కొడుకు చెన్నప్ప పరిగెత్తి వొచ్చి నాగిరెడ్డిని పక్కకు గుంజినాడు. చెన్నప్ప రాకుంటే అప్పుడు ఏమి జరిగేదో తలుచుకొని నేను భయపడినాను. తమలపాకులు అమ్ముకొని నాయన రేపొస్తాడు. వొచ్చినంక ఈ సంగతంతా తెలుసుకొని యేమంటాడో యేమోనని మనసులో భయపడసాగినాను. అయితే నాయన నన్నేమీ అనలేదు. దాంతో నా మనసు రోంత ఊరట పడింది. కానీ జరిగిండేదంతా మాటిమాటికీ గుర్తుచేసుకుని బాధపడతా యెట్లన్నగాని బాగా చదువుకోవల్లను కుండాను. మా ఊరోళ్లందరి పైకి పెద్ద చదువులు చదువుకొని ఊరంతా మెచ్చుకుండేటట్ల తయారుకావల్లనుకుండాను.
సంకురాత్రి శెలవులొచ్చినాయి. ఎలకంటి చిన్న పాపయ్యశెట్టి మోతల గడ్డలో ఉండే రెండెకరాల మడి మాకు కోరుకు ఇస్తానని వొప్పుకున్నాడంట. ఆ సంగతి చెప్పి, యెట్లన్నా గానీ ముంగార్లకల్లా దిబ్బలో ఇరవై బండ్ల ఎరువు జమ జెయ్యల్లన్న్యాడు నాయన. పశువుల కిందికి ఆకు అలమూ చెడిదీ పడిదీ తెచ్చి పరచల్ల, పనుల్లేని కాలం కాబట్టి ఇంటందరూ పొద్దునా సందకాడా బీటి పొలాల్లోకి పోయి దినామూ నాలుగు గంపలు ప్యాడకాళ్లు వేరుకొని వొచ్చి పాపయ్యోల్ల మడిలోనే వొగ ఎరువు దిబ్బ వెయ్యల్లని అందరికీ గట్టిగా చెప్పినాడు.
మోతల గడ్డలో పాపయ్యోళ్ల మడి ఢిల్లీభోగాల వడ్లు పండే మంచి అప్పుటమైన న్యాల! అదొక్కటే కాదు, మోతల గడ్డలో ఉండే పొలాలన్నీ ఢిల్లీభోగాలు పండేటివే. వొచ్చే ముంగార్లకు అట్లాంటి మడి కోరుకు దొరికినందుకు నాకు భలే సంతోషం అయింది. ఇరవై బండ్లు ఎరువు అయ్యేటట్లు దొడ్లో దిబ్బను పెంచల్ల! బాగా ఎరువేస్తే ఆ మడిలో, మూడుపుట్ల వొడ్లకు తక్కువ కాకుండా పంటొస్తాది. సమ్మత్సరమంతా ఢిల్లీ భోగాలు అన్నం తినొచ్చు.
ఇంట్లో అందరమూ పాపయ్యోళ్ళ మోతలగడ్డ మడీ, ఎరువుదిబ్బను గురించే ఆలోచించసాగినాం. నేను వచ్చే వరిమళ్ళ కోతలప్పటికి వరి కోయడం నేర్చుకోవల్లను కుండాను. యెట్ల నేర్చుకోవల్ల? ఆలోచనచేసినాను. పెద్ద కొడవలి గాకుండా చిన్న కొడవలి లిక్కితో మరవయేట్లో జమ్మును కోసుకొని వొచ్చి దాన్ని గాటిపాట్న పశువులకిందికి వేస్తే దిబ్బలో ఎరువూ పెరుగుతాది, కొడవలితో గడ్డీగాదం కొయ్యడమూ తెలుస్తాదని నాయనతో చెప్పినాను. నాయన ఇంట్లో పనికిరాని రెండు ఇనపతుంటలు తీసుకొనిపోయి కంసలాచారికిచ్చి రెండు కొడవండ్లు చేయమని చెప్పినాడు. కంసలాచారి రెండు దినాలయినంక మంచి చెక్కపిడి వేసి గడ్డికోసే కొడవండ్లు రెండిచ్చినాడు. దాండ్లను ఇంటికి తెచ్చి, పశువులు తాగే కడుగునీళ్ళతొట్టి అంచులమీద నూరి పదునుబెట్టి ఇచ్చినాడు నాయన. ఆ తొట్టి సానరాయితో చేసిండేదని చెప్పి, దాని మింద కొడవలి నూరి పదునుపెట్టేది చూపిచ్చినాడు.
అమ్మిడి (అంబలి) పొద్దు బువ్వతిని జానగొండోళ్ళ నారాయణ, జోడోళ్ళ ఓబిలేసు వాళ్ళతో కలిసి యేటి మడుగు దగ్గరికి పోయి చూసినాను. దబ్బజమ్ము బ్రమ్మాండంగా పెరిగింది. దాన్ని పశువులు తినవు. అందుకే అట్ల పెరిగిందేమో అనుకుండాను. జానగొండ నారాయణ జమ్ము కోసేది చూపిచ్చినాడు. ఎడమచేత్తో జమ్మును జానెడెత్తుపైన, చేతినిండా పట్టుకొని కుడిచేత్తో కొడవలి పట్టుకొని ‘ఇదో, ఇట్ల కోసి వోదులెయ్యల్ల’ అని చూపిచ్చినాడు. ఆ జతగాడు చెప్పినట్లే మెల్లగా జమ్ము కోసి వోదికేసినాను. అతగాడు పదినిమషాల్లో మోపుకు అయ్యేటంత జమ్ము కోసి అంతా మడుగులో నుండీ తెచ్చి గట్టుమింద వేసి నా దగ్గరికొచ్చి నా కొడవలి తీసుకొని పరపరపరా కోసి చూపిచ్చినాడు. నేను, మడి కోసినప్పుడు వేలు తెంచుకోనుండే విషయాన్ని గుర్త్తుచేసుకొని భయపడతా జమ్ము కోసినాను, వొగ అరగంటకల్లా జతగాడు కోసినంత కోసి అంతా బయటికి తెచ్చినాను. జమ్మును మోపు కట్టేది గుడకా వాడే చూపిచ్చినాడు. జతగాళ్ళతోపాటు జమ్ము మోపెత్తుకొని ఇంటికి రావడం చూసి అమ్మయ్య భలే సంతోషపడి, ఆ జమ్మునంతా కొడవలితో చక చక చకా తుండ్లుచేసింది. నేను జమ్ము తుండ్లనంతా పశువుల కింద పరిచినాను.
ఆ రకంగా రెండు మూడు రోజులయ్యేసరికి నాకు కొడవలితో జమ్ము కోసి, మోపుకట్టి, ఎత్తుకొని రావడం బాగా అలవాటయింది. వరిమడి కోయడానికీ, మడుగుల్లో పుల్లజమ్మూ, దబ్బజమ్మూ కోయడానికీ చిన్న కొడవలి లిక్కి పనికిరాదని, అది వరిమళ్ళల్లో గెనాల మింద పెరిగిండే పచ్చిగడ్డి కోయడానికీ, వర్షాకాలంలో చేన్ల గట్లమీదా కొండల్లో, గుట్టల్లో, నట్లల్లో పెరిగిండే సొంటి గడ్డి, గరికా, చిప్పరా అట్లాంటి పశువులమ్యాత కోయడానికి మాత్రమే కొడవలి లిక్కి పనికొస్తాదని తెలుసుకుండాను.
సంకురాత్రి పండుగ దగ్గర్లో వుంది. నేనూ, పెద్దక్కా ఈటిడిసిన కొండకింది చేన్లల్లోకి శెనక్కాయలు గోక్కొని వచ్చేకి ఇనప్పెంకులు తీసుకొని పోయినాం. రెండు మూడు నెలలు కిందటే నాయన. అడుగు భాగమంతా చిల్లులు పడిండే వొగ పాత ఇనపగోళాన్ని కంసలాచారి దగ్గరికి తీసుకొనిపోయి శెనక్కాయలు గెదిరే పెంకుల్ని చేయిచ్చుకొని వొచ్చినాడు. ఆచారి గోళం అడుగు భాగాన్నంతా రేకులు కత్తిరిచ్చే ఇనపకత్తిరితో రౌండుగా కత్తిరిచ్చి, ఆ ఇనపతుక్కునంతా పక్కకు పడేసి, గోళం కంట్లాన్ని శానంతో ఆరు ముక్కలు చేసి, ఇనప రేకును కత్తిరిచ్చినాడు. కత్తిరిచ్చిన రేకులు చేతులకు కుచ్చుకోకుండా ఆకురాయితో రాకేసి ఇచ్చినాడు. పట్టుకుండేకి వాటంగా రోంత వంపు తిరిగిన పెంకులు, చేన్లల్లో గోకడానికి భలే పనికొస్తాయి.
కొండ కింది చేను మావూరి నేసేవాళ్లది. దాంట్లో వాళ్లు అక్కిడి గింజలు వేయలేదేమో, తొందరగా ఈటిడిసినారు. తీగశెనక్కాయపంటను పలుగ్గుంటకతో పాసినంక నేలమింద రాలిన పైకాయలను యేరిస్తారు. ఆ తర్వాత చెక్కల గుంటకతో నిలువుగా, అడ్డంగా రెండుసార్లు తిరగదోలి బయటపడిన కాయల్ని యేరిస్తారు. శెనక్కాయ చేన్లు పాయకముందు (సంక్రాంతి) సంకురాత్రి చినుకులు రాలితే, ఆ త్యామ ఆరినంక శెనక్కాయ పాస్తే, శెనక్కాయలు భూమిలోకి పోవు, రాలిపోనూ రాలిపోవు. చినుకులు రాలకుంటే, గట్టిపడిన చేన్లల్లో ముఖ్యంగా గరుకు నేలల్లో మొరుసు నేలల్లో, రెండు కాండ్లు ఎద్దులు కట్టి పలుగు గుంటక మింద ఇసకమూట వేసి పాసినా, పలుగు నేలలోకి దిగక, శెనక్కాయలు నేలలోనే సుమారుగ మిగిలిపోతాయి, రాలిపోతాయి. అట్లాటి చేన్లల్లో రెండు మూడుసార్లు చెక్కల గుంటకను తోలి, బయటపడిన శెనక్కాయలను యేరిచ్చినంక ఆ చేన్లను ఈటిడుస్తారు. ఈటిడిసిన చేన్లల్లోకి ఎవురైనాపోవచ్చు. పోయి పెంకులతో మట్టిని గెలుకుతా, గోకుతా శెనక్కాయలు యేరుకోవచ్చు.
ఈసారి నేసేవాళ్ల చేన్లో శెనక్కాయలు బ్రమ్మాండంగా కాసినాయని వూరంతా అనుకుంటా వుండిరి. వొక్కొక్క చెట్టు పీకితే ఎడెనిమిది తీగలు, నూటాఇరవై నూటాముప్పై కాయలు కాసినాయని, ఎలి పంటలకు తగినట్ల ఆల్తిగా వర్షాలు పడడంతో మంచి కండగలిగిన ఎర్రనేలల్లో శెనక్కాయపంట బ్రమ్మాండంగా వుందని, నేసేవాళ్ల చేను మాదిరుండే తువ్వన్యాలల్లో ఎకరాకు ఇరవై మూటలకు తక్కువ ఎవురికీ కావని అందరూ అనుకుండారు. అనుకున్నెట్లే చేని పంటలయినాయి, అట్ల మంచి పంట పండిండే నేసేవాళ్ళచేను తొందరగా ఈటిడిసి నారని నేనూ, పెద్దక్కా ఆ చేన్లోకి పోయి పయిటాల వరకు పెంకుల్తో మన్ను కెల్లగిచ్చుకుంటా శెనక్కాయలు యేరినాం. నాలుగైదు పెంకులకు వొగటీ రెండూ శెనక్కాయలు కనిపిచ్చినాయి. వొక్కొక్కసారి వొగపెంకుకు నాలుగైదు కనిపిచ్చినాయి. రోంత మొరుసునేల వుండే చోట పెంకుతో గట్టిగా గోకితే ఏడెనిది కనిపిచ్చినాయి. అట్ల కనిపిచ్చినప్పుడల్లా సంతోషపడతా పయిటాల వరకూ శెనక్కాయలు యేరుకుండాం. పెంకుల్తో మన్ను కెల్లగిచ్చడంతో రెట్టలు నొప్పిపట్టినాయి. కష్టమైనా సరే ఇద్దరమూ ఎనిమిదిసేర్లు శెనక్కాయలు యేరుకొని యింటికొచ్చినంక, శెనక్కాయల్ని చూసి, ‘బాగనే గీక్కొచ్చినారే అని సంబరపడతా ఇద్దరికీ ముద్దుపెట్టింది అమ్మయ్య.
మూడు దినాల కిందట ఆకుల గంపెత్తుకొని ఎగవపల్లెలు చెదల్ల, దంతులూరు, రేగడి కొత్తూరుకు పోయొచ్చినాడు నాయన. నాయన తెచ్చిండే చెయి సంచులన్నీ బయటికి తీసింది అమ్మయ్య. కొర్రలూ, రాగులూ, నాలుగైదు శేర్లు సద్దలూ మూడు నాలుగు శేర్లు పెసులూ రెండు పావులు నూగులూ, ఆముదాలూ చూసి చాలా సంతోషపడింది. పండగకు కావల్సినవన్నీ తెచ్చినాడని నాయనను మెచ్చుకుంది. పెద్దక్కకు పొయ్యిమింద డబరాలో నీళ్లు పెట్టమనిచెప్పి, చాటా, జల్లెడా తీసుకొని నాయన తెచ్చిన పూనాసి గింజల్ని చేసి యెత్తిపెట్టింది. పొయి మింద కాగిన ఉడుకు నీళ్ల తెచ్చి జలాటిబండ దగ్గరుండే బకీట్లో పోసిచ్చినాను. నాయనకు వేడి వేడి నీళ్లు పోసి వీపు రుద్దింది అమ్మయ్య.
ఇంక రెండురోజులే వుండేది సంకురాత్రి పండగ. అమ్మయ్య, ఆ ముందురోజే పెసులు దోరగా వేయించి, ఇసుర్రాయి మధ్యలో, వెదురు దబ్బలేని పాత ఇసన కర్రను పెట్టి పెసరబ్యాళ్లు చేసి, సన్నని నూకను పిల్లోళ్లకు తలాకింత పెట్టింది తినండని. ఆ పెసర బ్యాళ్ల నూకను నోట్లో వేసుకొని నములుతా వుంటే ఎంత కమ్మగా వుండాయో చెప్పేకి వీలుగాదు.
పండగ కంటే ముందు రోజు నడిమిదొడ్డి నుండి వొగ రైతు నాలుగైదు మూటలు చిక్కుడు కాయలు వేసుకోనొచ్చి చావిట్లో పోసినాడు. మా వూర్లో వొక్క తోటే కదా వుండేది! ఆ తోటలో మంచి కంటి రామరంగయ్యోళ్లు ఎప్పుడూ కూరగాయల పంట పెట్టరు. వాళ్ల యింటి వాడుకకు మాత్రమే వేసుకుంటారు. సంవత్సరానికి రెండు పంటలు వరీ, అది కోసినంక శెనక్కాయ వేస్తారు. ఎప్పుడయినా వొగసారి మిరప పంట పెడతారు. అందువల్ల మా వూరోళ్లకు కూరగాయలూ, ఆకుకూరలూ యావి కావల్సొచ్చినా పక్కనుండే పల్లెల్నుంచి రావల్సిందే! మాగాణి లేని పల్లెలు నడిమి దొడ్డీ, స్వాములూరూ, కొర్రపాడూ, చెన్నంపల్లి ఇంకా ఐదారు పల్లెల రైతులు రకరకాల కూరగాయల పంటలు పండిచ్చి, మా వూరికి వేసుకొని వొచ్చి వడ్లగింజలకు అమ్మిపోతారు. కూరగాయలే కాదు, బెల్లం చెరుకులూ, గెనుసుగడ్డలూ, నేతదోసకాయలూ, కర్బూజా పండ్లూ ఇట్లాటివన్నీ మావూరికి వేరే వూర్లనుండి రావల్సిందే!
చిక్కుడు కాయలు చావిట్లో అమ్ముతావుండారని తెలుస్తానే అమ్మయ్య చేటనిండా కేసరవడ్లు తీసుకొని పోయి వొగ అర్ధ దడెము చిక్కుడు కాయలు తెచ్చింది. అందరమూ చుట్టుకొని చిక్కుడు కాయలు వొలిచినాం. దొడ్లో నేను ఇష్టపడి వేసిన గుమ్మడి చెట్టు తీగలు బ్రమ్మాండంగా అల్లుకుండాయి. గుమ్మడి పిందెలు కనిపిచ్చినప్పటి నుండి ప్రతిదినమూ దొడ్లోకి పోయినప్పడల్లా దాండ్లను గమనిస్తా, వొగ చెంబంత వూరుతానే ఎవురికీ కనిపిచ్చకుండా దాండ్ల మింద గడ్డికప్పినాను. అయితే యాలనో, చాలా పిందెలు చచ్చిపోయినాయి. అట్లా చచ్చి పోయిన పిందెల్ని చూసి బాధ బడతా, బతికి బాగా వూరుతా వుండే గుమ్మడికాయల్ని జాగ్రత్తగా చూసుకుంటా వొచ్చినాను. కడాకు నాలుగు కాయలు బ్రమ్మాండంగా వూరి, మాగినాయి. అట్లా మాగిన గుమ్మడి పండ్లను, వండగకు ముందే పీక్కొని వొచ్చినాను, దాండ్లను మా కుంటి చిన్నాయనోళ్లకు వొగటి, ఎలకంటి చిన్నపాపయ్యోళ్లకు వొగటి అమ్మయ్య ఇచ్చింది. వొగ గుమ్మడి పండును నాయన పెదగొర్ల నరసమ్మకు ఇచ్చొచ్చినాడు.
అమ్మయ్య పండగకు ముందురోజే వేంచిన శెనగిత్తనాలూ బెల్లమూ రోట్లో దంచి పొడి చేసి పెట్టింది. అట్లే నూగులూ, బెల్లమూ దంచి పొడిచేసింది. రెండిటినీ చీమలు పట్టకుండా రెండు గిన్నెల్లో ఉట్టి మిందపెట్టింది.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
