[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
మావూరి ఉగాది పండగా – వనభోజనాలూ!
ఉగాది పండగొచ్చింది. వూరంతా సంబరపడిపోతా వుంది. సందు సందులోనా గుండూ బండ దగ్గర పూర్ణం రుబ్బుతా ఆడోళ్ళంతా హడావుడిగా వుండారు. ప్రతి ఇంట్లోనుంచీ పండగ పదార్థాల వాసన మనుసును వూరిస్తా కొన్ని ఇండ్లల్లో నుంచీ పొయ్యిలమీద శెనగ బ్యాళ్లు వుడుకుతా వుండే వాసన, కొన్ని ఇండ్లల్లో నుంచీ పెనుముల మింద కాలుతున్న ఓళిగల కమ్మని వాసన మరి కొన్ని ఇండ్లల్లో నుంచీ పప్పు తిరగవాతల ఘాటు వాసన, మునక్కాయల చారు వాసన ఘుమఘుమాలిస్తా వుండాయి.
ఓళిగల కోసరం పొయ్యిమీద అమ్మయ్య పెట్టిన సిలవరి తపెలలో కందిబ్యాళ్లు వుడుకుతా వుండాయి. చుట్టపక్కలోళ్లందరూ ఓళిగలకు శెనగబ్యాళ్ల పూర్ణం చేస్తారు. శెనగబ్యాళ్ల పూర్ణంతో చేసిన ఓళిగలంటే అమ్మయ్యకూ నాయనకూ ఇష్టముండదు. కడుపులు, వుబ్బరిస్తాయని విపరీతంగా పిత్తులు వొస్తాయని, కందిబాళ్ల పూర్ణంతో చేసే ఓళిగలు పొట్టకు మంచివని సులభంగా అరుగుతాయని, రుచిగా కూడా వుంటాయని అందుకే నాయన చాలా ఇష్టంగా కందులు తెస్తాడు. కందిబ్యాళ్లు కూడా మిషన్లో తయారయి అంగట్లో అమ్మేటివి బాగుండవని, కందులు తెచ్చుకొని ఎర్రమన్ను నీళ్లల్లో నానబెట్టి ఆరబెట్టి ఇంట్లో తయారుచేసుకుండే కంది బ్యాళ్లు చాలా శ్రేష్టమని నాయనకు నమ్మకమైన గ్నానం. అందుకే, కందిబ్యాళ్ల పూర్ణంతో చేసే ఓళిగలంటేనే నాయనకు ఇష్టం. నాయనకే గాదు మా వూర్లో అందరికీ ఓళిగలంటేనే ఇష్టం. ఓళిగలు చేసేది సరిగా రానివాళ్లే పూర్ణం కుడుములు చేసుకుంటారు. కుడుములంటే నాయనకూ అమ్మయ్యకూ ఇష్టమే వుండదు.
అమ్మయ్య తెల్లవారుజామున్నే లేచి తలస్నానంచేసి, తలవెంట్రుకలు పాతచీరతో తుడుచుకొని, వెంట్రుకల్లోని తేమంతా పొయ్యేందుకు వొగ పొడిబట్టను వెంట్రుకలకు చుట్టుకొని కొప్పు గట్టుకొని పొయ్యిమింద బ్యాళ్లకు పెడుతుంది. ఉగాది పండుగంటే అమ్మయ్యకు భలే నిష్ట. తలస్నానం చెయ్యకుండా వంటపనికి దిగదు. పొయ్యిమింద బ్యాళ్లు వుడికే లోపల అమ్మయ్య చెల్లెండ్లిద్దరికీ తలస్నానాలు చేయిస్తావుంటే, నాయన కొట్టంగోడ నీడలో గోనిపట్ట మీద కూర్చొని క్షవరం చేయిచ్చుకుంటా వుండాడు. నిన్న అమావాస్య అని అమాసనాడు క్షవరం చేయిచ్చుకోగూడదని, అందుకే ఈ పొద్దు చేయిచ్చుకోవల్లని మంగలి నరిగన్నకు నిన్ననే చెప్పినాడు నాయన. మాట ప్రకారమే నరిగన్న చిన్నాయన, అడపం తీసుకోనొచ్చినాడు, వస్తానే ‘‘యేమొదినా, వోళిగలకు కందిబ్యాళ్లు యేసినట్లుందే! అందురూ! అగ్గవ అని సెనిగిబ్యాళ్లు యేత్తారు గానీ కందిబ్యాళ్ల వోలిగలే వోలిగలొదినా!’’ అంటా అమ్మయ్యను పలకరిచ్చి, మంగలి పెట్టెలో నుంచి, టెంకాయి చిప్పమాదిరుండే ఇత్తడి గిన్నెను బయటికితీసి, “రోన్ని వుడుకు నీళ్లూ రోంత కొబ్బర్నూనీ తీసకరాపో బంగారూ” అని నాకు చెప్పినాడు. నేను చెంబుతో పొంతలో కాగిన వుడుకునీళ్లు తెచ్చి ఆ చిన్నాయన మంగలి గిన్నెలో వేసినాను. కొబ్బరి నూనె సీసా తెచ్చి అయప్ప సాన్రాయి మీద నాలుగు చుక్కలు వేసినాను. మడిచిన మంగల కత్తిని బయటకి తీసి సాన్రాయి మీద తిప్పిచ్చి మళ్లిచ్చి కత్తిని నూరి సానపెట్టుకుండాడు ఆ చిన్నాయన.
మా నాయనది బట్టతలకాయి. నన్నెత్తి మీద వెంట్రుకలే లేవు. అక్కడక్కడ గరక పాసలు (గరిక పోసలు) మాదిరి అయిదారు వెంట్రుకలుండాయి. అందుకే చెవులపైనా మెడ వంపుల మీదా పెరిగిన వెంట్రుకల్ని మిషన్‌పట్టి, పది నిమిషాల్లో క్షవరం చేసినాడు సరిగన్న. కత్తితో గడ్డం కొరిగి మీసాలు వొత్తినాడు. నాయన గడ్డం చాలా బిరుసుగా వుందేమో, కత్తితో కొరుగుతా వుంటే “శానా మంటగా వుంది నారిగా, యింగొగసారి కత్తి బాగా నూరుకోరా” అని నాయన అనడంతో నేను మళ్లీ సాన్రాయి మీద నాలుగు కొబ్బరి నూనె చుక్కలు వేసినాను. ఆ చిన్నాయన మళ్లీ కత్తి నూరుకోసాగినాడు. “ఆ పకారంగా యెల్లేగొడ్డు మాదిరి గడ్డం పెంచుకుంటే యా కత్తులు తెగుతాయి?” అని అమ్మయ్య కువాడమాడింది. “అట్లేం గాదులే వొదినా! కత్తే పాతబడి మొద్దుదైపోయింది. కొంతమంది గడ్డాలు బొగు బిరుసుగా వుంటాయొదినా. మా అన్నయ్య గడ్డం మేలనుకో! ఆ కురవ కొమ్ము బావ, అట్టేవాల్ల నారాయిని మామ గడ్డాలు సూడల్ల, పనసకాయి మిందుండే తోలుమాదిరి, ముండ్లపంది యీపు లెక్కన యెంత గరుగ్గా వుంటాయో” అని అంటా గడ్డం తీసినాడు. ఆయప్ప మాటలు విని అమ్మయ్య పక్కున నగింది. క్షవరం చేసేది అయిపోయినంక నరిగన్న చిన్నాయన, నాయన కాలిగోర్లన్నీ తీసినాడు.
అమ్మయ్య చెల్లెళ్ళకూ, తమ్మునికీ స్నానం చేయిచ్చి, నాయనను జలాటి బండ దగ్గరికి పిల్చి, నన్ను పొంతలో నీళ్లు తోడుకొని రమ్మని చెప్పింది. నేను రెండు డబరా గిన్నెల్లో తోడుకోని వొచ్చి బకీట్లో పోసినాను. అమ్మయ్య, పొయ్యిమింద వుడుకుతా వుండే బ్యాళ్లను గెంటిలో తీసుకొని, మెత్తగ వుడికినాయని తెలుసుకొని, “నేను బ్యాల్లు వొంచి వొత్తాను, నువ్వు బండమింద కుచ్చోని, తలకాయి మింద నాలుగు చెంబులు నీళ్ళు పోసుకో బిరిగ్గ పండగపూట ద్యావరమూల తళిగె యెయ్యల్ల గదా, మంగలాయప్పతో సవురం సేపిచ్చుకో నుండే తలకాయిని నేను ముట్టుకోను? యెంత చెప్పినా యినవు. పండక్కంటే రొండు దినాలు ముందుగా సవురం సేయిచ్చుకుంటే యేమయితాండె” అని అమ్మయ్య నాయనను దండిచ్చింది. నాయన ఇంకేం మాట్లాడకుండా జలాటి బండమీద కూర్చొని క్షవరం చేయిచ్చుకొనుండే తలకాయి మింద నాలుగు చెంబులు నీళ్లు పోసుకుండాడు. అంతలోనే అమ్మయ్య వొచ్చి నాయన తలకాయిని సీకాయినీళ్లతో తిక్కి, వీపు రుద్ది నీళ్లు పోసింది.
స్నానం చెయ్యకుండా మిగిలిండేది ఇంగ నేనొక్కన్నే. అందరికంటే ముందే నేను స్నానం చెయ్యల్లనుకుండాను. మామిడాకులూ, వేపపూతా పీక్కొని వొచ్చినంక నన్ను స్నానం చెయ్యమని చెప్పింది అమ్మయ్య. సరే అని నేను నా జతగాడు ఈడిగోళ్ళ కొండన్న కోసరం ఎదురుచూస్తా, వాడు ఎంతసేపటికీ రాకపోయేసరికి, ఎలకంటి చిన్నపాపయ్యోళ్ల మామిడి వనం దగ్గరికి బయలుదేరినాను. అంతలోనే కొండన్న రావడంతో ఇద్దరమూ ఎల్లవారినాం.
పాపయ్యోళ్ల మామిడి వనమంటే అది వనమేమీ కాదు. యా కాలంలో మామిడి వనం వుండేదేమో కానీ ఇప్పుడు ఏడెనిమిది చెట్లే వుండేది. అవి గుడకా చాలా పాతచెట్లు. అయినా మామిడిపండ్ల కాలంలో ఆ చెట్లల్లో నాలుగైదు కొమ్మలు కాయలు కాస్తాయి. ఆ కాయలు మాగినా గుడకా చాలా పుల్లగుంటాయి. చాలా చెట్లన్నీ ముసిలివై పురుగు తొలిసి ఎండిపోవడంతో దాండ్లను రంపాలతో కోయిచ్చి అనంతపురంలో వుండే వొగ రంపంమిల్లుకు తోలిచ్చినాడంట పాపయ్య! మిగిలిండే ఏడెనిమిది మామిడిచెట్లను అట్లనే వొదిలేసినాడంట, తోటను సాగుచేసే వాళ్ళు లేకనో, బావిలో నీళ్ళు లేకనో, పాపయ్యోళ్లు తోటను గాలికి వొదిలేసినారు, వొదిలేసి ఎన్నేండ్లయిందో యేమో గుర్తులే లేవు. అప్పుడెప్పుడో కపిల బావి వుండేదేమో! ఇప్పుడది వొగ నీటిగుంత మాదిరి వుండాది. మేము చాలామంది పిల్లోల్లము, దున్నపోతుల్ని, గిత్తల్ని, ఎద్దుల్ని ఆ బావి గుంత నీళ్లల్లోకి తోలి దాండ్ల పయి కడిగి దాండ్ల మీదెక్కి కేకలేస్తా బాయంతా నీళ్లల్లో తిరిగేవాళ్లం.
అట్లాటి పాపయ్యోళ్ల మామిడి వనం దగ్గరికి చేరుకుండాం నేనూ, కొండన్నా. అప్పటికే చాలా మంది మామిడాకులు పీక్కోడానికి అవస్తపడతావుండారు. బావిగడ్డ పక్కనుండే జీ మానుకింద దిక్కుమాలినంత జీ ఆకు రాలింది. దాన్ని చూస్తానే నా మనసు పీకింది. అయితే, రాలిన ఆ జీ ఆకునూ, మామిడాకునూ ఎవురూ వూడ్చుకొని పోకుండా మా వుప్పరోళ్ల ఎరప్ప మామ బిడ్డ అంజినమ్మ, ఆ ఆకునంతా వూడ్చి జీచెట్టు పక్కనుండే గుంతలో పోస్తావుందని తెలిసి నా మనసంతా జీ ఆకు మింద నుంచీ, వొచ్చిన పనిమిందికి మళ్లింది.
అంజినమ్మ, వొచ్చినోళ్ళను ఎవుర్నీ మామిడి కొమ్మలు విరచకుండా మామిడాకుల్ని మాత్రమే పీక్కొని పోవల్లని చెప్పుతావుంది. పాతకాలం మామిడి మాన్లు ఆకాశానికి పెరిగినాయి. కింద కొమ్మల్లో మామిడాకులన్నీ ముడసకపోయినాయి. వాకిలి తోరణాలకు కట్టేకి పనికిరావు. బాగుండే ఆకులన్నీ నిన్ననే చాలామంది వొచ్చి పీక్కొని పోయినారంట! బాగుండే ఆకులు, పైన చిటారు కొమ్మల్లో వుండాయి. ఆ కొమ్మల వరకూ ఎక్కితే తప్ప మంచి మామిడాకులు పీక్కోడానికి వీలుగాదు. మామిడి కొమ్మలు చాలా పెలుసుగా వుంటాయని రోంత బరువయితే చాలు, పుటక్కని విరుగుతాయని, చెట్టు పైకొమ్మల్లోకి ఎక్కద్దని అమ్మయ్య భయం చెప్పింది. పై కొమ్మలెక్కితే తప్ప, ఇంటి వాకిలి తోరణాలకు మామిడాకులు తీసుకొని పోడానికి వీలుగాదు. కొండన్న గాడేమో, కొమ్మలు నేలకు తగులుతావుంటేనే చింతచెట్టు ఎక్కడానికే భయపడతాడు. ఎట్ల చెయ్యల్లబ్బాని ఆలోచిస్తా కడాన వుండే మామిడిచెట్టు దగ్గరికి పోయిచూసినాను. పెద్ద ఎర్రచీమలు దిక్కుల్యాకుండా పారాడుతా వుండాయి. దాండ్లను చూస్తానే భయమయింది. సమ్మత్సరం కిందట వొగసారి మిషన్ కుళ్లాయి మామోళ్ళ వొట్టేరు మడి దగ్గరుండే మేడిమాను ఎక్కినప్పుడు ఇట్లాంటి పెద్ద ఎర్రచీమలే నిక్కర్లోకి దూరి చిల్లికాయికి కుట్టినాయి, కుడతానే బొబ్బలెక్కి మంట పుట్టడంతో గభాలున కిందికి దుమికి నిక్కరంతా యిదిలిచ్చి నొప్పితో అల్లాడుకుంటా ఇంటి కొచ్చినాను.
అదంతా గుర్తు చేసుకుంటా అంజినమ్మను అడిగి పుల్లలపరక ఇప్పిచ్చుకొని దానితో చీమల్ని చెదరగొట్టుకుంటా మామిడిమాను మొదిట్లోకి ఎక్కి, ఆట్నుంచి చీమల్లేని కొమ్మకు జాగ్రత్తగా ఎక్కి, వొగ ఇరవై రెమ్మల్ని గబాగబా పీకి కిందికేసి జాగ్రత్తగానే చెట్టు దిగి వూపిరి పీల్చుకుండాను. ఇద్దరమూ తలా పది మామిడి రెమ్మల్ని తీసుకొని వస్తా వడుగూరు చండ్రాయునోళ్ల చేనిగట్టు మీదుండే వేపమాను కిందికి పోయినాం. అంతకు ముందే చెట్టెక్కిన కొమ్ముమామను చూసి “మామా పూత బాగుండేటివి మాకూ వొగ పది మండలు పీకి కిందికెరు” అని అడిగినాను. ఆ మామ మంచి పూతుండే వేపమండల్ని పీకి, కిందికేసి, చెట్టుదిగొచ్చి, మా చేతుల్లో వుండే మామిడి రెమ్మలు నాలుగు ఇప్పిచ్చుకుండాడు. చింత చిగురు రోంతకావల్లేమోరు అని అడుగుతా రెండు కణికెల నిండా చింతచిగురు పెట్టినాడు కొమ్ముమామ.
అన్నీ తీసుకొని ఇంటికొచ్చినంక, చింతచిగురును చూసి భలే సంతోషపడింది అమ్మయ్య. నన్ను మెచ్చుకుంటా, నాకు స్నానం చేపిచ్చింది అమ్మయ్య. పెద్దక్క అప్పుడే పెదగొర్ల నరసమ్మోళ్ల ఇంటికాటికి పోయి గుంటికింద పూర్ణం రుబ్బుకోని వొచ్చినట్లుంది. మస్తుగా పూర్ణం వాసన వస్తావుంది. పెద్దక్కా, వెంకటలక్ష్మీ చాటలోకీ వేపపూతనంతా విడిపిచ్చినారు. బారెడు పురికోసుల్ని రెండు తీసుకొని నాయన మామిడాకులతో తోరణం చేసేకి కూర్చుండాడు. ఎండిన వొగ చొప్పదంటును చీల్చి పదీ పదైదు ఈనెలు తయారుచేసినాడు. నేను మామిడి రెమ్మల్లో పచ్చగా, న్యాతగా, పొడుగ్గా వుండే మామిడాకులు పీకి వొక్కొక్కటి నాయనకు అందిస్తావుంటే, పురికోసు మిందపెట్టి తొటిమ భాగాన్ని వెనక్కి మడిచి ఈనెతో కుట్టసాగినాడు. కుట్టిన ఆకులన్నీ ఎచ్చు తగ్గులు లేకుండా సమానంగా, చిక్కెగా జరిపినాడు.
మూడు తోరణాలు తయారైనాయి. రెండు పెద్దవి, వొగటి చిన్నది. పెద్ద తోరణాలను ఇంటి తలవాకిలికీ, పశువుల కొట్టం తడక వాకిలికీ కట్టినాడు. తోరణాల ఆ చివరా ఈ చివరా చిన్న చిన్న మామిడి రెమ్మల్ని, వేపపూత మండల్నీ మేకులకు వేలాడగట్టినాడు, చిన్న తోరణాన్ని ఇంట్లో దేవరమూల కిందిభాగంలో వుండే చిన్న గూటిపైన సన్నని మేకులకు బిగిచ్చినాడు. ఇంతలోనే మాదిగోళ్ల వెట్టి ఓబన్న చిన్నాయన, భుజానికి కొత్త దుప్పటి జోలిగా కట్టుకోని జోలినిండా జిల్లడాకులూ, తంగెడపూలూ, వేపాకూ పోసుకొని వొచ్చి ఇంటి ముందర చల్లిపోయినాడు. అట్ల ఎందుకు చల్లిపోతారో నాయనను అడిగినాను. ఆ పచ్చని ఆకులూ, పూలూ పెద్దమ్మ, మారెమ్మ దేవతల పూజకు చల్లే పొలి వస్తువులని, ప్రతి ఇల్లూ పచ్చగా వుండల్లని కోరుతా అవి చల్లుతారని నాయన చెప్పినాడు.
అమ్మిడిపొద్దు దాటింది. కొట్టంలోని వంట జాగాలో అన్నమూ, చిత్రాన్నమూ, చింతచిగురు పప్పు, మునక్కాయ చారూ, మామిడికాయ వూరుమిండి అన్నీ తయారయి తావుండాయి. పొయ్యి దగ్గర కూర్చొని వంటజేస్తా వుండే అమ్మయ్య పక్కన కూర్చుండాన్నేను. ఎండిన జెముడు కట్టెలు పొయ్యిలోకి పెడతానే భగభగ మండి రోంత సేపటికే బూడిదయి పోతావుండాయి. కొట్టం నిండా పొగ చుట్టుకుంది: పొయ్యిలో జెముడు కట్టెలు పెడితే భలే పొగ వస్తాదంట, బోదకొట్టానికి కిటికీలూ, గవాక్షులూ లేవు. లేచిన పొగంతా వాకిలిగుండా బయటికి పోవాల్సిందే! ఎండాకాలం! పొయ్యి దగ్గరుంటే వేడి! అప్పుడప్పుడు వూదుగొట్టంతో గాలి వూదల్ల! పొద్దున్నుంచీ పొయ్యి దగ్గరుండే అమ్మయ్య మెడచుట్టూరా, మొగం నిండా చెమట కారుతా వుంది. రవికంతా చెమటతో తడిసి పొయ్యింది. అమ్మయ్యను చూసి నాకెట్లో అనిపిచ్చింది.
ఇంట్లో ఆడోళ్లు వంటచేసి పెడితే మొగోళ్లు లక్షణంగా తింటారు. తింటా తింటా, ఉప్పు, కారమూ తగినట్ల ల్యాకపోతే యెంతగా తిడతారో! కొంతమందయితే నోటికొచ్చినట్ల కూస్తారు. ‘నిజంగా పొయ్యిదగ్గర కూర్చొని, పొయ్యి వూదుకుంటా, పొగతో కండ్లు మండుతావుంటే. కండ్లల్లో నీళ్లు కారుతా వుంటే తుడుచుకుంటా, ఎండల కాలంలో చెమట కార్చుకుంటా, యాల పొద్దుకు ఇంటందరికీ వంట వండిపెట్టడమంటే ఎంత కష్టం! వంటపని యా మొగోడూ చెయ్యరెందుకో?’.
ఆలోచనచేస్తా వూదుకొట్టం తీసుకొని నేను పొయ్యూదినాను. పొయ్యిమిందనుంచి పప్పుకుండను కిందికి దించి, పప్పులోని నీళ్లను వొగ గిన్నెలోకి వొంచింది అమ్మయ్య. మెత్తగా వుడికిండే కందిబ్యాళ్లూ, వంకాయ, ఇసవొగచెంచిలాకూ, చింతచిగురులోకి తగినంత ఉప్పు వేసి, పప్పుకుండను చుట్టకుదురు మీదపెట్టి, మసిగుడ్డతో రెండు అరికాళ్ల మధ్యలో పప్పుకుండకు గట్టిగా వొత్తి పట్టుకొని పప్పుగిత్తెతో మిషను మాదిరి పప్పు రామింది అమ్మయ్య. అంత గట్టిగా పప్పుగిత్తెతో పప్పు రాముతావుంటే చూస్తా, కుండ పగిలిపోతుందేమోనని నేను భయపడసాగినాను. అమ్మయ్య సులకాగ వొగ అరనిమిషంలో పప్పురామి, పప్పుగిత్తెను కొంచెం పైకెత్తి కుండలోనే చేతులతో గిరగిరా తిప్పింది. దానితో, పప్పుగిత్తెకు అంటుకున్న పప్పంతా కడిగినట్ల కుండలో పడిపోయింది. పప్పుగిత్తెను బయటకితీసి ఎడమ అరచేతికి తాకిచ్చి, చేతిని నాలుకతోనాకి, ఉప్పు కారమూ సరిపోయిందని తలకాయి వూపి, నా అరచేతికి పప్పుగిత్తెను తాకిచ్చి, ‘‘ఉప్పు కారమూ సరిపోయిందేమప్పా?’’ అని అడిగింది. నేను అరచేతికి అంటుకున్న పప్పును నాలుకతో నాక్కొని ‘‘ఇసవొగచెంచిలాకూ, చింతచిగురు పప్పు అద్భుతంగా వుంది మా” అని మురిసిపోతా చెప్పినాను. అమ్మయ్య సంతోషపడతా, పప్పులోనుంచీ గిన్నెలోకి వంచిన ఎసురును మళ్లీ పప్పులోకి పోసి కంచుగెంటెలో నూనె, తిరగవాత గింజలు, కరేపాకు, తెల్లవాయిలు వేసి పెద్దక్క చేతికిచ్చి, మాడిపోకుండా చూడమని చెప్పింది. పెద్దక్క సన్నని మంట మీద తిరగవాత గెంటెను పెట్టి అన్నీ వేగిన వాసన రాగానే, గెంటె కింద బూడిదను మసిగుడ్డతో తుడిచి, మూకటి తీసి పప్పుకుండలో తిరగవాత పెడతానే కమ్మని వాసన ముక్కుల్లోకి వొచ్చింది. ఆ తర్వాత పూర్ణం నీళ్లతో మునక్కాయల చారు చేసింది అమ్మయ్య. పెద్దక్క దానికి గుడకా తిరగవాత పెట్టింది.
వంటలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంగ ఓళిగలు కావల్ల. తడిపి, రోట్లో దంచి పెట్టిన మైదాపిండి ముద్ద నుంచి నిమ్మకాయంత తీసుకొని రెండు అరచేతులతో పెద్దగోళీ మాదిరి చేసి, మంచినూనె పూసిన ఓళిగరేకు మిందపెట్టి ‘లట్టెనికె’తో గుండ్రంగా పల్చగా లేత తమలపాకంత మందంగా తీడి, పున్నమినాటి చందమామను చేసింది అమ్మయ్య. దాన్ని చూసి, మైదా పిండి వుంటల్ని లట్టెనికెతో నేను తిక్కుతాను మా అని అడిగినాను. “పలకమింద అచ్చిరాలు రాసేదనుకుండావేమప్పా? పెద్దయినంక నేర్చుకుందువు లే! ఇబ్బుడు వూరకనే సూత్తా వుండు” అంటా అమ్మయ్య డబరా గిన్నెలోని పూర్ణం తీసుకొని చిన్న ముద్దజేసి, ఆ ముద్దను, పల్చగా తీడిన మైదా రేకు మధ్యలో పెట్టి, వొయినంగా మైదారేకుతో పూర్ణం ముద్దను కప్పి, ఆముద్దను బాగా నూనె పూసిన ఓళిగరేకు మిందపెట్టి, మళ్లీ లట్టెనికతో పల్చగా తీడి, పచ్చివోళిగ చందమామను చేసింది అమ్మయ్య. దాన్ని చూసి నేను అబ్బురపోయినాను. మైదారేకులోపలుండే పూర్ణమంతా రేకు రూపమై పోయింది. అంత పల్చగా వున్న ఆ వోళిగను విరిగిపోకుండా అమ్మయ్య వేడి పెనుం మీద వేయడం చూసి మరింత అబ్బురపోయినాను. మడికయ్యల్లో వరినాట్లు వేసే దాంట్లో, వరికోత కోసే దాంట్లో అమ్మయ్య ఎంత పనిమంతురాలో వోళిగలు చేసే దాంట్లో గుడకా గొప్ప పనిమంతురాలని మురిసిపోయినాను. దేవరమూల పూజచేసేకి నాయన పిలచడంతో అమ్మయ్య మిగతా వోళిగలు మళ్లీ చేసుకోవచ్చునని అంతటితో ఆపుజేసింది. పెద్దక్క నేను వంట జాగాలో నుంచీ అన్నమూ కూరలూ అన్నీ ఇంట్లోకి చేర్చినాం. అమ్మయ్య చెమట ముఖం కడుక్కొని ఆరిన వెంట్రుకల్ని వుల్లుల్లుగా కొప్పుకట్టుకుంది. చెక్కపెట్టెలో పెట్టిన కొత్తబట్టలు బయటికి తీసి అందరికీ ఇచ్చింది. నేను కొత్త అంగీ, కొత్త కాకీ నిక్కరా తొడుక్కొని, గూట్లో పెట్టిండే అద్దం ముక్క తీసుకొని చూసుకుంటా సంబరపడినాను. చెల్లెళ్ళిద్దరూ చీటీగౌన్లు తొడుక్కొని చాలా బాగుండాయని మురిసిపోయినారు. పెద్దన్నకు కొత్త అంగీ తొడిగిచ్చి తలదువ్వి ముద్దుపెట్టుకుంది. అమ్మయ్య. నాయన కొత్త ముతకపంచను గోసిపోసి కట్టుకొని చిన్న కంచార్తిలో ఆముదంనూనె వేసి, వొత్తిని అంటిచ్చినాడు.
కొత్త ముతకపంచను గోసిపోసికొని, ఉత్తపయిమింద టువ్వాలు కప్పుకొని దేవరమూల గూటి దగ్గర రాముల పటం పెట్టి, గూటికి ఎదురుగా కూర్చుండాడు. మేము పిల్లోళ్లందరమూ నాయన దగ్గర కూర్చుండాం. నాయన ఎడమచెయ్యి అరచేతిలో కొంచెం కుంకుమ వేసుకొని రెండు నీళ్లచుక్కలు దాంట్లో కలిపి, వేలితో సాది, గూటికి రెండు పక్కలా నామాలు పెట్టినాడు. వొగ వూదుకడ్డి (వూదుబత్తి) పుల్లతీసుకొని కుంకుమలో అద్ది తాను నామం పెట్టుకొని, మాకు అందరికీ నామాలు పెట్టినాడు. అమ్మయ్య కొట్టంలోకి పోయి కొత్త చీరకట్టుకొని వొచ్చి, పదారుమూర్ల చీర కుచ్చెండ్లు దండిగా పడినాయని తృప్తిపడతా, అద్దంలో ముఖం చూసుకొని కుంకుమబొట్టు పెట్టుకుంటా ‘పూసలాయప్ప వొచ్చినప్పుడు వొగ సన్న అద్దం తీసుకోనుంటే బాగుండేది’ అని, అద్దం ముక్కను దువ్వాన్ల గూట్లో పెట్టింది. చేతులు కడుక్కొని, చేసిండే పదార్థాలన్నీ వొగ విస్తరాకులో వడ్డించి, విస్తరాకును కొత్త చాట (చేట) లో పెట్టి నాయన చేతికిచ్చింది. నాయన దేవరమూల తళిగె పెట్టినాడు. నాలుగు వూదు కడ్డీలను అంటిచ్చి రాముల పటానికీ, దేవర మూలకూ ఆరతిచ్చి (హారతి ఇచ్చి) రెండు వూదుకడ్డీలను రాములు పటానికి చెక్కినాడు. రెండు వూదికడ్డీలను మూలలో గూటికిందుండే మైనానికి చెక్కినాడు. బొచ్చు పీకిన టెంకాయకు పసుపూకుంకుమా అంటిచ్చి పటానికీ, దేవరమూలకూ తిప్పి గుండ్రాయి మింద గురిచూసి కొట్టినాడు. టెంకాయ కరెక్టుగా కోసినట్లుగా పగిలింది. టెంకాయ నీళ్లను కంచు గ్లాసులోకీ కారించి టెంకాయొప్పులను పీకి తళిగెకు రెండు పక్కలా పెట్టి దేవునికి మొక్కు కుండాడు. నాయన కత్తితో కోసినట్లుండే టెంకాయొప్పులను చూసి, ‘‘టెంకాయి సక్కగా పగిలినట్లే అన్ని సక్కరమంగా జరిగేతట్ల చెయ్ సామీ’’ అని అమ్మయ్య మొక్కుకుంది. పిల్లోల్లందరమూ మొక్కుకుండాం. నాయన టెంకాయ తీర్థం అందరికీ పోసి పైకి లేచి తలవాకిలి దగ్గర కడప్మానుకు రెండు ఊదుబత్తులు తిప్పి, టెంకాయ కొట్టి, మొక్కుకుండాడు. అట్లే పెద్దమ్మ గుడిగోడల దగ్గరా వొగ టెంకాయ కొట్టినాడు. మేము నాయన పక్కన నిలబడి పెద్దమ్మ తల్లికి మొక్కుకుండాం. అమ్మయ్య ఇంగో విస్తరాకులో వండిన పదార్థాలన్నీ వేసుకొని వొచ్చి పశువుల్ని కట్టేసే గాటిదగ్గర పెట్టింది. నాయన గాటిబండకు నీళ్ళుచల్లి, కడిగి, పసువూ, కుంకుమా పెట్టి వూదుబత్తులతో గాటికి ఆరతిచ్చి టెంకాయకొట్టి మొక్కుకుండాడు. మేము పిల్లోలందరమూ మొక్కుకుండాం.
నాకు బుద్ధి వొచ్చినప్పట్నుంచీ చూస్తావుండాను. నాయన వొక్కడే కాదు, మావూర్లో శూద్రోళ్లందరు పశువుల గాటికీ, పొలాల దగ్గరికి మడకలు కోటేరేసుకొని పోయి, అక్కడ పశువులకు కట్టిన కాడికీ, టెంకాయలు కొట్టి మొక్కుకొని వస్తారు. పశువుల గాడూ, కాడీ, పొలాలూ ఇవన్నీ మనుషులకు అన్నం పెట్టేటివని, అందుకే మనిషి దాండ్లకు పూజ చేస్తావుండాడని అర్థం చేసుకొని రకరకాలుగా ఆలోచనచేస్తా ఆకలే మరిచిపోయినాను.
టెంకాయలు కొట్టి దేవుళ్లందరికీ మొక్కుకున్నెంక అందరమూ ఆవురావురమంటా భోజనానికి కూర్చుండాం. సమ్మత్సరము తర్వాత మళ్లీ వోళిగభోజనం అని పిల్లోళ్లందరమూ కడుపులు రెండింతలు చేసుకొని వోళిగల పక్కచూస్తా, నాలుకలు చప్పరిస్తా వుండాం. అమ్మయ్య అందరికీ తలా వొగ వోళిగ, పళ్యాల్లో వేసి మామిడికాయ వూరుమిండి నంజుకుండేకి పెట్టింది. నాయనకు రెండు వోళిగలు వేసి సన్నగిన్నెలో వుండే నేతిబొట్టు కొంచెం వొంచింది. మొన్న సంకురాత్రి పండగనాడు పులగమూ శెనక్కాయల పొడిలో రోంత నెయ్యి కలుపుకొని తినిండే రుచి గ్నాపకమొచ్చి మాకూ రోంత నెయ్యి వెయ్యమని అమ్మయ్యను అడగల్యాక, అమ్మయ్య పక్కా నేతిబొట్టుగిన్నె పక్కా చూడసాగినాం.
“యేమట్ల జూత్తాండారు? అందురూ నెయ్యి యేసుకోని తినేకి, యేమి, ఇంట్లో పాలిచ్చే ఆవులూ, యెనుగొడ్లూ వుండాయనుకుండారా? మీ నాయన సిగ్గిడిసి అడిగితే ఆ పెదగొర్ల నరసమ్మ నాలుగు ‘తొటుకులు’ నేతిబొట్టు, సెటాకంత గిన్నెలో యేసిచ్చిందంట! పండగపూట అట్లడిగేకి మీ నాయనకు రోంతన్నా బిడిం కాలేదేమో! ఎనుగొడ్డునో, ఆవునో తెచ్చుకున్నెంక అందరమూ నెయ్యేసుకోని తిందాం లేండప్పా! ఆ జానగొండోల్లింట్లో రొండణాలిచ్చి అర్దసేరన్ని పాలు తెప్పిచ్చినా. వోళిగలేకి కాసిన్ని పాలు పోసుకొని మెత్తగ పిసుక్కొని తింటే యెంత కమ్మగా వుంటాదో సూడండి”, అని వేడివేడి పాలు, చిన్న పిల్లలకు వామూ వజా నూరిపోసే ‘పాలడి’లో పట్టినన్ని పాలు పోసింది. అమ్మయ్య చెప్పినట్ల వేడివేడి వోళిగల్లోకి వేడివేడి పాలు పోయిచ్చుకొని, మెత్తగ పిసుక్కొని తింటావుంటే భలే మధురం అనిపిచ్చింది.
అందరి భోజనాలూ అయిపోయినంక ఆయిగాళ్లు, చాకలోళ్లూ, మంగలోళ్లూ, లోపల తడిబట్టలు పరిచిన మలక పుటకలూ, రెండుమూడు గిన్నెలూ తీసుకొని వొచ్చినారు. అమ్మయ్య వాళ్ళకు పండగ వంటలన్నీ పెట్టి పంపిచ్చింది. అది చూసి నాకు భలే సంతోషమయింది. ఎందుకో నాకు తెలియదు.
సంకురాత్రి పండగనాటి కంటే ఉగాది పండగ నాటి భోజనాలు వేరేగా వుండాయి. చుట్టుపక్కల పల్లెల్లో అంతా ఈ మాదిరిగానే ఈ పండగలు జరుగుతాయి. అట్ల ఎందుకు జరుగుతాయో తెలియదు. నిజానికి సంకురాత్రి పండగప్పుడు రైతుల ఇండ్లల్లోనే కాకుండా కూలోళ్లందరి ఇండ్లల్లోనా తిండిగింజలుంటాయి. పశువులకు దొడ్లల్లో మ్యాత (మేత) లుంటాయి. బావుల్లో నీళ్ళుంటాయి. పొలాలన్నీ పచ్చగుంటాయి, మరి యాలనో ఉగాదినే పెద్ద పండగంటారు. ఇదే నాయనను అడిగినాను. తెలుగు సమ్మత్సరము ఉగాది నుండే ప్రారంభమైతాదని, చెట్లల్లో పాత ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లొస్తాయని, సంకురాత్రి పండగప్పుడు దండిగా పనులుండడం వల్ల జనం తీరుబడిగా పండగ చేసుకోరని, ఉగాది పండగప్పుడు వ్యవసాయం పనులేమీ వుండవు కాబట్టి అందరూ తీరుబడిగా ఇండ్లన్నీ క్లీన్ చేసుకొని, మట్టి మెత్తుకొని, సున్నాలు పూసుకొని, కొత్త ఇండ్ల మాదిరి తయారుచేసుకొని ఈ పండగను చేసుకుంటారని చెప్పినాడు.
నాకయితే పల్లెజనాలకు సంకురాత్రి పండగే ముఖ్యమైన పండగని అనిపిస్తాది. యా పండగయినా, రేయింబగలూ కష్టం చేసుకుంటా బతికే పల్లెల వాళ్లకు, పండగ దినం రెస్టు తీసుకొని, దినామూ తినే తిండి కంటే వేరే రకమయిన వోళిగలో, పూర్ణ కుడాలో, పాయసమో, స్పెషల్‌గా చేసుకొని, ఆబువ్వా, చిత్రాన్నమూ, పప్పు, చారూ ఇంకా రెండు మూడు రకాల వంటలు చేసుకొని తినడం, కొత్త బట్టలు వేసుకోవడం, సందకాటి వరకూ పండరి భజనలూ, చెక్క భజనలూ, కోలాటలూ ఆడుతా మురిసిపోతా చేసిన కష్టాన్నంతా మరిచిపోవడం చాలా ఇష్టమయినవి.
ఈ పండగలే ల్యాకుంటే బీదాబిక్కికి ఇట్లాంటి తిండి తినేకి అవకాశముండదు గదా! ఈ పండగలు వారానికొగటి వొస్తే ఎంత బాగుంటాదో! వొస్తే బాగుంటాది గాని మాయట్లా పేదోళ్ళకందరికీ వారానికొగసారి ఈ రకమయిన తిండి తినేకి సాధ్యమయితాదా? పండగకు కొత్త బట్టలు కుట్టిచ్చేకీ, పండగ భోజనం చేసుకుండేకీ నాయనా అమ్మయ్యా యెంతగా యెదారు పడినారో తనకు తెలుసు. వారం దినాల కిందట వొగనాడు రాత్రి పొద్దుబోయేదంకా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటా వుంటే వాళ్ల మాటలు తనకు వినిపిచ్చినాయి. షావుకార్లు ఎప్పుడయినా ఇంట్లో నాలుగయిదు రకాల వంటలు చేసుకొని హాయిగా తింటారు. పేదోళ్లేమో ఈ పండగలు యాలోస్తాయో తమను ఇబ్బంది పెట్టేకి అని మనసును నొప్పిజేసుకుంటారు. ఇబ్బంది పడతా, బరువు పడతా బాధనంతా లోపలే దిగమింగుకొని చేసుకుండే పండగలు పండగలేనా?.
ఇదంతా అనుకుండే సరికి ఉగాది పండగ నాకు సంతోషం కలిగిచ్చలేదు. అందుకే ఇంకెప్పుడూ పండగకు నాకు కొత్త బట్టలు కావల్లని అమ్మా నాయనల్ని అడగకూడదనుకుండాను. ఇంట్లో కొంచెం జరుగుబాటున్నప్పుడు, వాళ్లు సంతోషంగా కొనిచ్చినప్పుడే కొత్తబట్టలు వేసుకోవల్లని అనుకుండాను. కష్టపడి చదువుకొని, యాదయినా వొగ ఉద్యోగం సంపాదిచ్చుకొని, నాయన మాదిరి కాకుండా నాలుగెకరాలు పొలం కొనుక్కొని, కూటికీ గుడ్డకూ అంగలాయగూడదని మనసులో అనుకుండాను.
పయిటాల దాటినంక చావడి దగ్గర పండరి భజనా, చెక్కభజనా మొదలయినాయి. ఊరంతా పెద్దోళ్లూ, పిల్లోళ్లూ, బీదాబిక్కీ అందరూ కొత్తబట్టలు కట్టుకొని వొచ్చి చావడి దగ్గర ఆలకూడినారు. అంతకు ముందే వూరి పెద్దమనుషులు చాలా ఆలోచన చేసి, పల్లెటూరి ఆటలు ఆడేచోట దుమ్ము లెయ్యకుండా బాగా నీళ్లు చల్లిచ్చినారు.
భజన చెన్నప్ప నాలుగైదు నెలల నుంచీ రాత్రి పూట కొంత మంది ఆడపిల్లోళ్లకూ, మగపిల్లోళ్లకూ పండరి భజన నేర్పిచ్చినాడు. అమ్మయ్య నన్నూ పోయి నేర్చుకోమని చెప్పింది. ఎందుకో ఇష్టం ల్యాక నేను పోలేదు. ఈ పొద్దు ఆ భజన చెన్నప్ప, శిష్యులందరూ రంగురంగుల గుడ్డలేసుకొని, తలకాయలకు రిబ్బన్లు చుట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని వొచ్చి చావడి దగ్గర గుండ్రంగా నిలబడినారు. వాళ్ళ మధ్యలో నిల్చుకొని చెన్నప్ప, తాలం కొడతా, భక్తిపాటలు పాడతా వాళ్ళతో పాడిస్తా పండరి భజన చేయిచ్చినాడు.
‘బంగారు సింగారు పాగాలు చుట్టనేలరా
పచ్చలు తాపిన పీటముండగ,
ఇటుక పీట మింద నిలువానేలరా
ధరణిలో దండిగ బ్రాహ్మణులుండగ,
గొల్లవాని గర్భమునందు కోరి పుట్టగనేలరా
పండరినాథుని సేవించకుండా
పామరులమై పాటపాడితే
పాడిపంటల చింతలు తీరునా
ఆడిపాడితే ఆశలు తీరునా’
అంటూ పాటలు పాడిచ్చినాడు. ఆ తరువాత కోలాటం వేయిచ్చినాడు. భజనకంటే కోలాటం నాకు బాగా నచ్చింది. గజ్జల అడుగులకు అనుకూలంగా కోలాటం కట్టెల్ని చేతుల్లో తిప్పుతా కొడతా వుంటే ఆ శబ్దం ఎంత బాగుందోనని ఆసక్తిగా చూడసాగినాను. కోలాటం ఆడే వాళ్లందరిలో ముగ్గురు నలుగురు భలే సొగసుగా ఆడతా వుండారు, వాళ్లందరి పైకీ మిషను కుళ్లాయప్ప మామబిడ్డ చౌడమ్మ చాలా చలాకీగా, లాయిగ్గా, ఆడతావుంటే అట్లే కన్నార్పకుండా చూసినాను. ఆ పాప నా ఈడిదే! యెందుకో బడి మానేసింది. చదువుకుంటా వుంటే రోజూ బడికొచ్చేది కదా! అని అనుకుండాను.
సాయంత్రం పోతులయ్య స్వామికి కొంతమంది పెద్ద రైతులు పన్న్యారపు బండ్లు కట్టినారు. గౌసెన్లు వేసి, రంగు పూసిన కొమ్ములకు కొమ్ము కొప్పులేసి, కొమ్ముల మధ్య రంగు రంగుల కుచ్చులేసి, మెడల్లో గలగంటల పట్టీలూ, కాళ్లగిట్టల పైన గజ్జలూ కట్టిన ఎద్దులు. గునక పరుగు తీస్తావుంటే, పన్న్యారపు బండ్ల సందడిని చూసి భలే సంతోషమయింది నాకు. పొద్దుమునిగి చీకటి పడేలోపల పన్న్యారపు బండ్లన్నీ వూర్లోకి తిరిగొచ్చినాయి. బజార్లో ఎద్దులబండ్లు మెల్లగా ముందుకు సాగిపోతావుంటే, బెండ్లూ, బెత్తాసులూ, బూందీలూ కలిసిన బొరుగుల పన్న్యారం కోసరం బీదాబిక్కి జనమంతా ఎగబడినారు. నేను నిక్కర జోబీనిండా, పెద్దక్క డబ్బాపావు నిండా పన్న్యారం పెట్టిచ్చుకొని ఇంటికొచ్చినాం. పొద్దుమునిగే సమయానికి మా వూరి ఉగాది సంబరం ముగిసింది. అమ్మయ్య దీపం ముట్టిచ్చింది. బుడ్డీ దీపం గ్లాసు మసిబారి నల్లగయింది. మసి తుడిచేటప్పుడు గ్లాసు పగల కొడతామని, ముగ్గు పిండి లేదని, ప్యాడతో గ్లాసును తిక్కి, పొడిబట్టతో తుడచమని నాయనకు చెప్పింది అమ్మయ్య. నేను కొంచెం ప్యాడ తీసుకొని వొచ్చి నాయన చేతికిచ్చినాను, నాయన వొనారుగా బుడ్డీగ్లాసులోకి రోంత ప్యాడవేసి, లోపలికి రెండు వేళ్లుపెట్టి తిక్కి, నీళ్లతో కడిగి పొడిబట్టతో తుడిచినాడు. గ్లాసు కన్నిగా, తెల్లగా, కొత్తదానిమాదిరి తయారైంది.
నాయన బుడ్డీదీపం బర్నల్ని ముందుకు తిప్పినాడు, వొత్తి బయటికొచ్చింది. వొత్తి పైన ‘కొడిగట్టిన దాన్ని నలిపి కొడినంతా తీసివేసి బర్నలును వెనక్కి తిప్పినాడు, వొత్తి లోపలికి పోయింది. వొత్తిని ఎత్తుగా లేపితే దీపం పెద్దదై గ్లాసంతా పొగ సూరుతుందని చెప్పి, ఆల్తిగా పెట్టి, బుడ్డీని అల్లాడిచ్చి, కిరసనాయిల్ చాలా తక్కువగా వుందని సీసాలోని కిరసనాయిల్ని బుడ్డీలోకి కొంచెం పోసి చిమ్నీ పెట్ట్టి వొత్తి ముట్టిచ్చి, చిమ్నీమీద గ్లాస్ బిగిచ్చి బర్నర్ దీపాన్ని కొంచెం పెంచుతానే తెల్లని వెలుతురు ఇంటినిండా పరచుకుంది. అదంతా చూస్తా మనిషి చీకటిని పారద్రోలడానికి ఎంత ఆలోచన చేసినాడో! మట్టిగిద్దెలో ఆముదం నూనెపోసి దూదొత్తిని వెలిగించుకున్న మనిషి, ఈ గబ్బునూనెను (కిరసనాయిల్ని) ఎట్ల కనుకుండాడో! బుడ్డీ దీపాన్నీ దానిమీద పెట్టే గ్లాసునూ ఎట్ల తయారుచేసుకుండాడో! వొగచోటనుండి ఇంకొగ చోటికి తీసుకోని పోడానికి అనుకూలంగా లాంతర్ని ఎట్ల కనిపెట్టినాడో! లాటిన్ టిన్నులో వుండే కిరసనాయిల్, వొత్తి గుండా దీపానికి ఎట్ల అందుతాదో అని ఆలోచిస్తా అంతా ఆశ్చర్యంగా చూడసాగినాను. టౌన్లల్లో ఈ బుడ్డీదీపాలూ, లాంతర్లతో పనిలేకుండా అన్నీ కరెంటు దీపాలే నంట! వూరకనే వేలితో ఇట్ల స్విచ్ వొత్తుతానే అట్ల లైటు వెలుగుతాదంట! అదెట్లనో, ఎప్పుడు చూస్తానో అని అనుకోసాగినాను.
ఇంకొగ కిరసనాయిల్ బుడ్డీ నేను అంటిచ్చినాను. అది గ్లాస్ లేని వొట్టి సీసా బుడ్డి. కొంచెం వెడల్పుగా ఎత్తుగా లేని పొట్టి సీసాబిరడా మధ్యలో పెద్ద మేకుతో బొక్కబెట్టి, పేడిన బట్టపేలిక జానెడు వొత్తిని బిరడా బొక్కగుండా సీసా లోపలికి దూర్చి, సీసాలో కిరసనాయిల్ పోసి, బిరడా బిగిచ్చి, అంటిస్తే అది బర్నలులేని పేదోళ్ల దీపమయితాది. దాన్ని పశువుల కొట్టంలో పెట్టొచ్చినాను.
పదీ పదైదు దినాల నుంచీ సరిగా చదువుకోలేదని ఉగాదినాడు చదువుకోవడం మొదలు పెట్టేది మేలని ఇంట్లో బుడ్డీదీపం వెలుగులో పుస్తకం తీసి చదువుకోసాగినాను, బయట గాలి లేదు. ఆకు అల్లాడ లేదు. లోపల ‘ఉమ్మరం’. చెమటలు పట్టినాయి. బుడ్డీ తీసుకొని బయటికొచ్చి అరుగు మింద కూర్చుండానో లేదో మెల్లగా గాలి తోలబట్టింది. హాయిగా వుంది. నాయన రెండు పద్యాలు చదమన్న్యాడు. చదివి తాత్పర్యం చెప్పినాను. అమ్మానాయన సంతోషపడినారు. అంతలోనే గాలి ఎక్కువైంది. బుడ్డీ దీపం ఆరిపోయింది. అది చూసి, “పిల్లోడు రాత్రిపూట చదుకుండేకి, యెట్లన్నాగాని లాటిన్ తీసుకొచ్చేది మేలు”, అని నాయనతో చెప్పింది అమ్మయ్య. కరువు కాలంలో అంతరేటు పెట్టి లాటీన్ తెచ్చుకుండేకి మనట్లా వాళ్లకు సాధ్యం కాదని, వూర్లో మంచి ఆసాములే లాటిన్లు తెచ్చుకోలేదని, చేతిలో దుడ్లు మెదిలాడితే సూత్తామని నాయన లాటీను సంగతి దాటేసినాడు.
శ్రీరామనవమి – మా వూరి శ్రీరాముడు రాతికంబం!
ఉగాది పండగైన తర్వాత శ్రీరామ నవమి వొచ్చింది. ఈ పండగను మా వూర్లోనా, మా చుట్టు పక్కల పల్లెల్లోనా శూద్రజనం ఎవురూ చేసుకోరు. పెద్దమనుషులందరూ మా ఇంటి దగ్గరుండే రాముల గుడికాడ ఆలకూడి, రాత్రికి ఆకుపూజ చేయిచ్చల్లని అనుకుండారంట! మా వూరి రాముల గుడిలో రాముని విగ్రహమేమీ లేదు. చుట్టూరా నాలుగు మెటికలు (మెట్లు) వుండే అరుగు మీద మధ్యలో ఆరడుగుల రాతి స్తంభానికి మైనం మెత్తినారు. ఎన్నేండ్ల నుంచో మైనం మెత్తబట్టి ఆ రాతిస్తంభం నల్లగా మారిందో తెలీదు గానీ అదే రాముని విగ్రహం! ఆ అరుగు నాలుగు మూలల్లో నున్నగా, పెద్దదేవాలయాల్లోని స్తంభాల మాదిరిగా మలిచిన స్తంభాలు, స్తంభాలపైన రాతి దూలాలు, దూలాల పైన గోపురం! వొగ స్తంభం పక్కన పైన్నుంచీ ఇనప గొలుసుతో వేలాడ గట్టిన పెద్ద కంచు గంట, నాలుగు వైపులా గోడలు లేని గుడి!
రాముల వారికి రాత్రి ఆకుపూజకు దాసప్ప ఏర్పాటు చేసుకుండేకి పది కట్టలు తమలపాకులు తెప్పిచ్చినారు. ఇంతకు ముందు ఎప్పుడో చేయిచ్చిన నిలువెత్తు వెదురు దబ్బల చట్రం, చట్రం మధ్యలో రాముల వారి రూపంలేని విగ్రహం కనిపిచ్చే విధంగా వుంది. ఆ చట్రం చుట్టూరా బెత్తెడు బెత్తెడు సందులు వదలి, అడ్డంగానూ, నిలువుగానూ మంచి వెదురు దబ్బలకు చిన్న మేకులు దిగగొట్టి, పైన గోపురం మాదిరి తయారుచేసినారు. అడ్డంగానూ, నిలువుగానూ గదులు గదులుగా కనిపించే ఆ వెదరు చట్రంలో రెండంగుళాల గ్యాపుతో అడ్డంగా పురికోసులు బిగిచ్చి, మూడు మూడు తమలపాకుల్ని అడ్డంగా, నిలువుగా దారాల మధ్యలో దూర్చి, మొత్తం తమలపాకుల దేవాలయాన్ని తయారుచేసి రాముల వారి విగ్రహానికి ఆనిచ్చి నిలబెట్టినాడు దాసప్ప, రాత్రి, లక్ష్మినరసయ్య పూజారి వొచ్చి పూజ చేయసాగినాడు. భజన పాటలు పాడేవాళ్లు తాళం కొట్టుకుంటూ –
‘రామ జోగి మందూ గొనారే
వో జనులార మీరు
రామజోగి మందూ గొనారే’
అని భక్తరామదాసు పాడిండే పాటల్ని పాడినారు. రామేవాళ్ల నారాయణ మామా, ఎర్రప్ప కొడుకు మల్లయ్య మామా, లింగనపల్లి చెన్నారెడ్డీ ఇంకా ఎడెనిమిది మందికి ఆ పాటలన్నీ కంఠాపాఠం అయినాయేమో సులభంగా పాడినారు. నాయన కూడా వాళ్లల్లో కూర్చోని తాళం కొడతా పాడినాడు.
వన భోజనాలు, మా వూరి ఆటలూ!
భక్తిపాటలు పాడేదంతా అయిపోయినంక మంగళహారతి పాట పాడతా వుంటే పూజారయవారు హారతిచ్చినాడు. ఆ తర్వాత అందరికీ శ్రీరామనవమి పానకం పోసినారు. సాయంత్రం, చాటింపు వేయిచ్చినట్లుగా మరసటి రోజు వూరందరూ వనభోజనాలకు పోవల్లనుకుండారు.
తెల్లారింది. మంచాల పాలయిన ముసిలోళ్ళు తప్పా, పిల్లాజల్లా, కుండా సట్టీ బ్యాళ్ళు, బియ్యమూ, ఉప్పు, కారము, తాడూ, పరకా, చాపలూ, జంఖానాలూ అన్నీ తీసుకొని మా వూరోళ్ళందరూ వనభోజనాలకు బయలుదేరినారు. వనభోజనాల నాడు వూర్లో ఎవురూ పొయ్యిలో అగ్గి వెయ్యకూడదని రెండు దినాల ముందే చాటింపేసినారు. అట్ల వూర్లో పొయ్యిలో అగ్గి వెయ్యకుండా వూరు మొత్తం, వూరికి ఎడంగా చెట్లకిందికి పోయి అక్కడే వండుకొని అక్కడే తిని, పొద్దు మునిగినంక వూరు చేరుకుంటే వూరికి మంచి జరుగుతాదని, వర్షాలు పడతాయని పల్లెలోళ్ళ నమ్మకం. ఆ నమ్మకం తరతరాలుగా కొనసాగుతావుందంట! అందుకే మా పంచాయితిలో వుండే నాలుగు పల్లెలోళ్లే కాకుండా, మా పంచాయితికి పక్కనుండే పెరవలి పంచాయితి పల్లెలు, సాములూరు, కేశేపల్లి, నడిమిదొడ్డి ఇంగా చాలా పల్లెలోళ్ళు గుడకా శ్రీరామనవమి మరుసటిదినమే వనభోజనాల కోసరం వూర్లొదిలి తోటల్లో, చేన్లల్లో, రోడ్లపక్కనా వుండే చెట్లకిందికి చేరుకుండారు!
మా గేర్లోవుండే సుమారు యాభై యిండ్లోళ్లం వూరికి పడమట పక్క నుండే చింతొనం (చింత వనం) చెట్ల కిందికి చేరుకుండాం. ఏడెనిమిది చింతచెట్లు ఆకులన్నీ ముదిరి గుబురుగా వుండాయి. పొద్దు ఇంకా వూరగొండ అవతలే వుందేమో కొండనీడ, చింతొనమంతా పరుచుకుంది. గుబురుగా వుండే వొగచెట్టు కిందికి మా యింటోల్లూ, జానగొండోళ్లూ, బూదేటి పుల్లన్నోళ్లూ ఇంకా రెండిండ్లోళ్లు చేరుకుండాం. మాకు ఎదురుగా వుండే చెట్టు కింద మిషన్ కుళ్లాయి మామోళ్లూ, ఉప్పర నారాయణప్పోళ్లూ ఇంకా నాలుగిండ్లోళ్లూ చేరుకుండారు. ఆ చెట్టుకింద కుళ్లాయి మామోళ్ల బిడ్డల్ని ముఖ్యంగా చౌడమ్మను చూసి నాకు భలే సంతోషమయ్యింది. సందకాడదంకా వాళ్లందరితో కలిసి కోతికొమ్మచ్చీ, ఉయ్యాలాటా ఆడల్లని మనసు ఉబలాటపడింది.
నేను పొయిగుండ్లకు సరిపొయ్యే మూడు రాళ్లను తెచ్చినాను. దాండ్లను మట్టంగా సర్ది పొయిగుండ్లను చేసినాడు నాయన. పెద్దక్క, మంచికంటి రామరంగయ్యోళ్ల తోటదగ్గరికి పోయి రెండు బిందెలు నీళ్లు ఎత్తుకొని వొచ్చింది. నాయన చింతమానెక్కి వొట్టిపుల్లలన్నీ మచ్చుగత్తితో కొట్టి కిందికేసినాడు. అమ్మయ్య మొదట పప్పుకు కుండలో ఎసురుపెట్టి పొయ్యి అంటిచ్చింది. చింతొనం కడానుండే చెట్లో చింతాకు ఇంకా బలసలేదని అమ్మయ్య చెప్పడంతో నేను ఆటికిపోయి చెట్టెక్కినాను. నన్ను చూసి చౌడమ్మ, అనంతమ్మ ఇంకా అయిదారు మంది వొచ్చి చెట్టెక్కినారు. నేను చిగురు బాగా వుండే వొగ కొమ్మపైకి ఎగబాకుతా చిటారుకొమ్మ దగ్గరికి పోయి చింతచిగురు జవిరి నిక్కర జోబీల్లో దురుక్కోసాగినాను. చెట్టు మొదులెక్కి, కొమ్మల మీదికి పొయ్యేకి భయపడతా నాపక్క చూస్తా ‘‘నాకూ రోంత పీకియ్యి నారాయణా’’ అని చౌడమ్మ ప్రాధేయపడింది. “పీకిస్తే నాకేమిస్తావు” అని నవ్వుతా అడిగినాను. “యేమియ్య ల్లప్పా నీకు”, అని వడ్డారంగా ప్రశ్నవేసింది చౌడమ్మ. “మల్ల నన్ను ఉయ్యాల వూపుతావా?’’ అని నేను గోముగా అడిగినాను. సరే అనింది చౌడమ్మ. నేను సంతోషపడతా చింతచిగురు పీకి వొగ జోబీలో వుండేదంతా చౌడమ్మకు పెట్టినాను. అది చూసి, వేరే కొమ్మ దగ్గరుండే అనంతమ్మ “నాకూ రోంత పీకియ్యి బూసీ,” అని అడిగింది. నేను ఆయమ్మకూ రోంత చిగురు పీకిచ్చినాను. ఆ తర్వాత మళ్ళా చిటారు కొమ్మకు పోయి రెండు జేబీల నిండా చిగురు పీక్కొని కిందికి దిగొచ్చి అమ్మయ్య దగ్గర చాపమింద పోసినాను. అమ్మయ్య ‘నా బంగారు కొండ’ అని మెచ్చుకుంది. వెంకటలక్ష్మి చిగురంతా వొలిచింది. పెద్దక్క, దూరంగా పోయి పెదగొర్ల నరసమ్మోళ్ల యాతం (ఏతం) కయ్యల్లో పాయలాకూ, ఇసవొగచెంచిలాకూ, అటకమామిడాకూ పీక్కొని వొచ్చింది. పదైదు దినాల కిందట నాలుగు ఉగాది చినుకులు రాలిండె కదా, అందుకే ఆ కయ్యల్లో అట్లాటి ఆకు మొలచిందని కొంత మంది పీక్కోని వొచ్చినారు.
మేము దిగిండే చింతమాను కింద పొయ్యిలకు దూరంగా మొగోళ్ళు ఏడెనిమిది మంది చేరుకొని సవాలు చేస్తావుండారు. ఇంకొగ చెట్టు కింద ముసిలోళ్లయిన ఆడోళ్ళు గుంపుగా చేరి మాట్లాడుకుంటా వుండారు. మిగతా ఆడోళ్ళందరూ వంటపనుల్లో మునిగిపోయినారు. అమ్మయ్య అమ్మిడిపొద్దు మీరి పోతాదని తాపత్రయ పడతా పెద్దక్కను పొయ్యి దగ్గరే కూర్చోబెట్టి తాను వంకాయలూ, ఉల్లిగడ్డలూ తరుగుతా వుంది. బట్టబయల్లో ఏమీ అడ్డం లేనందువల్ల పొద్దున పూట గాలి వీస్తావుంది. గాలికి పొయ్యి సరిగా మండడం లేదు. పెద్దక్క, పొయ్యి దగ్గర అవస్థ పడతావుంది. అక్కడే వుంటే, అమ్మయ్య నన్నూ పొయ్యి దగ్గర కూర్చోమంటాదని అనుకొని అమ్మయ్యతో చెప్పి నేను మెల్లగా అక్కన్నుంచీ జారుకొని, చిల్లాకట్టె తీసుకొని జతగాళ్ల దగ్గరికి పోయినాను. జానగొండ నారాయణ, ఈడిగోళ్ల కొండన్నా, పుల్లన్నా, రామాంజినేయులూ ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి చింతొనుముకు దూరంగా బయల్లో ‘చిల్లాకట్టె’ ఆట ఆడేకి పూనుకుండాం. అందరమూ అమ్మిడి పొద్దు బువ్వ తిన్నెంక కోతికొమ్మచ్చి, ఉయ్యాలాట ఆడల్లని అనుకుండాం.
నాయన నాకు, పోయినేడు మంచి చిల్లాకట్టె (చిల్లాకాం) చేసిచ్చినాడు. నా రెట్టంత లావుగా సక్కగా వుండే ఎండిన వేపకొమ్మను తుండ్లుచేసి, గజం పొడవుండే వొగ తుండును తాటంతా పగిలిపోయిన గాజుసీసా ముక్కతో జివిరేసి, ఆ వేపతుండు కట్టెను చుట్టూరా నలభై యభైసార్లు గీకి గీకి లావు తగ్గించి, ఇంచుమించు చెలకోల కట్టెంత సైజు చేసినాడు. ఇంకొగ వేపతుండును జిత్తెడు జిత్తెడు సైజులో తెగగొట్టి, వొక్కొక్క తుండును మచ్చు కొడవలితో గీకి, లావు తగ్గించి, రెండు మోట్లనూ జివిరి, కొంచెం కొస్సిగా జేసినాడు. అట్ల తయారుచేసిచ్చిన చిల్లాకట్టెను నేను జాగ్రత్తగా కొట్టంచూరులో దాచిపెట్టుకొని, ఈ రకంగా జతగాళ్ళతో కలిసి అట్లాడుకుండే సమయంలో బయటికి తీస్తావుంటాను. నాయన చేసిచ్చిన నాలుగు చిల్లల్లో వొగటి ఎక్కడో పడిపోయింది. కాము (కట్టె) మాత్రం భద్రంగా వుంది.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
