[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
చిల్లాకట్టి
చిల్లాకాము ఆడేకి పిల్లోళ్లందరమూ రెండు గ్రూపులయినాం. మా గ్రూపులో నేనూ, జానగొండ నారాయణా, కొండన్నా, సుబ్బిరెడ్డీ వుండాం. అవతలి గ్రూపులో ఓబుళనారాయణా, కోనయ్యా, పుల్లన్నా, అనుమన్నా వుండారు. చింతొనం (చింత వనం) పక్కనే పడమటి వైపున సంతకనుం వంక వుంది. దానికి ఆ పేరు యెట్లొచ్చిందో ఎవురికీ తెలీదు. ఆ కనుమ యా కాలంలో వుండేదో గుర్తులు కూడా లేవు. తాడిపత్రి అనంతపురం రోడ్డుకు దక్షిణం వైపున్న బోదగుట్టా కొసిగుట్టా, ఢమాం గుట్టల్లో పడిన వాననీళ్లన్నీ, కింద గొందిలోకొచ్చి, వొట్టేరు గుండా, రోడ్లోని మోరీకింద దూరి, మా వూరి చెరువు కాలువ గట్లను తెంచుకొని చింతొనం పక్కనుంచీ మడికట్ల మింద పారి, మరవంకలో కలుసుకుంటాయి. ‘సంతకనుం వంక’, చెరువు కాలువగట్లను తెంచి పారడంవల్ల అక్కడ కాలువ, వెడల్పుగా వుంటాది. పూర్వకాలం నుంచీ వంక పారుతా వుండడం వల్లనేమో, పడమటి ఇసవొగదిబ్బల మధ్యలో నుంచీ వొచ్చిన మా వూరి ‘శ్రీరంగరాజు చెరువు’ కాలువ ఆ వంకకు దారిచ్చి మళ్ళీ ఇసకదిబ్బల మధ్య ముందుకు పోతాది. వర్షాకాలంలో ఆ వంక పారినప్పుడల్లా అక్కడ ఇసకదిబ్బల మధ్య కాలువంతా పూడిపోయి, వంక నీళ్లూ కాలువ నీళ్లూ అన్నీ ఏకమై చింతొనం పక్కనుంచీ పారి, దగ్గరుండే వరిమళ్లను అన్నింటినీ ఇసకతో నింపి రైతులకు నష్టం కలిగిస్తా వుంటాయి. ఆ నష్టాన్ని యెవురూ అపలేక పోవడంతో వంక పారినప్పుడల్లా దిగువ వైపునుండే రైతులందరూ వొచ్చి, పూడిపోయిన కాలువను యెల్లేసుకొని నీళ్లను దిగవకు నడుపుకుంటారు.
రైతుల ఇబ్బంది సంగతి అట్ల పక్కన బెడితే, చింతొనం పక్కనుండే ఆ వంక ఇసక, మా వూరి పిల్లోళ్లందరూ తీరిక కాలంలో సాయంత్రం పూటలా, వెన్నెల కాలంలోనా బలిగుడు (చెడుగుడు) ఆడేకీ కుస్తీపట్లు పట్టేకి భలే అనుకూలంగా వుంటాది. ఆ వంక ఇసవొగదాటినంక, మంచి గట్టి నేల చదరంగా వుంటాది. అక్కడ వూర్లోని పిల్లోళ్లందరూ చిల్లాకట్టి (చిల్లా కాము), బొంగరాలాట ఆడుకుంటారు. కొంచెం న్యాల (నేల) గట్టిగా వుండేచోట జానెడు పొడవూ, రెండంగుళాల వెడల్పు రెండంగుళాల లోతుతో ‘బద్ది’ తొగినాం. మొదట ఎవురు చిల్లాకాము తీసుకోవల్లో నిర్ణయిచ్చేకి రాగిబొట్టును గాల్లోకి ఎగిరేయల్ల! మాలో ఎవరిదగ్గరా దమ్మిడీ గానీ, బొట్టుగానీ లేదు. అక్కడంతా వెతికి వొగ బోకుపంచి తీసుకొని, దాన్ని చిన్నగా గుండ్రంగా, బొట్టంత బిల్లజేసి, వొగపక్క ఇంటూ గుర్తు, ఇంకొగ పక్క రౌండు గుర్తు పెట్టి వొగ గుర్తుకు రాజు, మరొగ గుర్తుకు రాణి అని పేర్లు పెట్టినాం, మా గ్రూపు వాళ్ళు రాజును, అవతలి గ్రూపు వాళ్ళు రాణిని కోరుకుండారు. నేను ఆ బిళ్లను పైకెగిరేసినాను. అది గిరగిర తిరుగుతా వొచ్చి, కిందపడింది. పైన రాజు గుర్తు కనిపిచ్చింది. దాంతో మాగ్రూపు వాళ్ళకే మొదట చిల్లను కొట్టే అవకాశమొచ్చింది. మా గ్రూపులో కూడా నేనే మొట్టమొదట చిల్లను కొట్టేకి దిగినాను.
బద్దిమీద అడ్డంగా చిల్లనుపెట్టి బద్దిలో కాము కొననుపెట్టి అవతలి గ్రూపువాళ్లు ఎక్కడెక్కడ నిలబడినారో గమనిస్తా, చిల్ల ఎవురికీ దొరకనట్ల కాముతో చిల్లను దూరంగా చిమ్మినాను. దూరంగా ఎదురుగా నిలుచుకోనుండే కోనయ్య చిల్లను పట్టుకుండేకి చూసినాడు. సాధ్యం కాలేదు. చిల్ల ఎవరికీ అందనంత ఎత్తులో స్పీడుగా ముందుకు పోసాగింది. అనుమన్న దాన్ని పట్టు కుండేకి పైకెగిరి కిందపడి దొల్లెట్లాడి దుమ్ము నాక్కుండాడు.
కిందపడిన చిల్లను కోనయ్య చేతికి తీసుకుండాడు. నేను వుండే కాము కట్టెను బద్దిముందర అడ్డంగా పెట్టినాను. కోనయ్య, చిల్ల నేలమింద పడిండేచోట నిల్చుకొని బద్ది దగ్గర పెట్టిన కట్టెకు తగిలే విధంగా చిల్లను విసరినాడు. అది కట్టెకు (కాముకు) దూరంగా పడింది. కట్టెను తాకితే నేను ఔట్ అయేవాన్ని. తాకలేదు. మా వాళ్లంతా చప్పట్లు కొడతావుంటే నేను ఆ చిల్లను తెచ్చుకొని, బద్దికి ముందర నిలువుగా కింద బెట్టి ముందు వైపుండే చిల్లమోటు మింద కాముతో చిన్నగ తాడిచ్చినాను. చిల్ల గిరగిర పైకెగిరింది. ఎగిరిన చిల్లను నిగాగ చూసి కాముతో జాడిచ్చి కొట్టినాను. అది ఫర్లాంగు దూరం పోయి పడింది. దాన్ని పట్టుకోడానికి నలుగురూ నాలుగు చోట్ల నిల్చుకోనుండే అవతలి గుంపోళ్లు అనుకోనంత దూరంగా పోయి పడింది చిల్ల. వాళ్లు అబ్బురపోయినారు.
నేను కొట్టిన చిల్ల అంత దూరం పోతాదని నేను గుడకా అనుకోలేదు. అప్పుడర్థమయింది, నాయన చిల్లను అట్లెందుకు చేసినాడో, కామును పట్టుకుండేకి ఎంత వాటంగా చేసినాడో అని! అందరమూ చిల్ల దగ్గరికి పోయినాం. వాళ్లందరూ చాలా ముందుకు పోయి అక్కడక్కడ నిలబడినారు. ‘ఏమప్పా, రెడీనా?’ అని గట్టిగా అరిచినాను, వాళ్లు కూడా ‘ఆ.. ఆ..రెడీ’ అని అరిచినారు. నేను అందర్నీ గమనిస్తా, కాముతోనే చిల్లను సరిగాసర్ది, మోటు మింద గట్టిగా తట్టినాను. అది చాలా పైకెగిరింది. కింద పడతావుండే చిల్లను, ఇంతకు ముందు కంటే దూరంగా కొట్టల్లని వొగడుగు వెనక్కేసి కామును గట్టిగా జాడిచ్చి ముందుకు అన్న్వాను. కాము, చిల్లకు తగల్లేదు. చిల్ల కింద పడింది. అవతల గ్రూపోళ్లు గట్టిగా కేకలేసినారు. ఒకటి తప్పిపోయింది, ఇంగా రెండవకాశాలు వుండాయి కదా అని అనుకుంటా రెండోసారి చిల్లను ఎగిరేసి కొట్టినాను. రెండోసారీ గురితప్పింది. దాంతో అవతల గ్రూపోళ్లు ఎగిరి గంతులేస్తా, నారాయణగాడు అయిపాయ! అని అరచబట్టినారు. నేను నిబ్బరిచ్చుకొని చిల్లను జాగ్రత్తగా ఎగిరిచ్చి కోపంతో దంచినాను, చిల్ల బాణం మాదిరి దూసుకొని పోయి ఫర్లాంగవతల పడింది. అవతలి గ్రూపులో కేకలు తగ్గినాయి.
మల్లా చిల్ల దగ్గరికి చేరుకుండాం.. మా గుంపోళ్లందరూ నన్ను మెచ్చుకుంటా “ఇంగ తగ్గ గూడదు లే నారాయనీ!’ అని ప్రోత్సహించినారు. దాంతో ఇంగ తగ్గలేదు నేను. చిల్లను వాళ్లకు దొరకనీకుండా కొట్టుకుంటా పోతానే వుండాను. అక్కడుండే బయలు దాటి బీటిమడికట్లలో సుమారుగ వొగ మైలుదూరం పోయినంక నేనే ఇంక వద్దనుకొని చాలిచ్చుకుండాను. అక్కన్నుండి చిల్లాకాము బద్ది వరకు, ఓడిపోయినోళ్లు ‘గచ్చ గచ్చ గచ్చ’ అంటా నిలపకుండా పరుగెత్తల్ల. ఆ నలుగురూ వొగరి తర్వాత వొగరు ‘గచ్చ గచ్చ’ అనుకుంటా పరుగెత్తినారు. అయినా బద్దికాటికి చేరుకోలేకపోయినారు. దాంతో మేము వాళ్ళను వొదిలేసినాం.
ఈసారి వాళ్లు ‘చిల్లాకాము’ పట్టుకుండారు. మేము బద్దికి యెదురుగా దగ్గర దగ్గరగా నిలబడినాం. మొట్టమొదట కోనయ్య చిల్లను చిమ్మినాడు. జానగొండ నారాయణ గాడు అందేటంత ఎత్తులో చిల్ల వొచ్చినా పట్టుకోలేకపోయినాడు. అది వానికి నాకూ మధ్యలో కిందపడింది. నేను చిల్లను చేతికి తీసుకుండాను. కోనయ్య బద్ది దగ్గర తన కామును అడ్డంగా పెట్టినాడు. నేను గురిజూసి చిల్లను విసిరినాను. అది పోయి ‘కాము’ను తాకింది. దాంతో కోనయ్య ఔటయినాడు. రెండోవానిగా పుల్లన్న వొచ్చి, బద్దిలో కామును వూదబొడిసి చిల్లను చిమ్మినాడు. అది నారాయణ గానికీ నాకూ అందకుండా పైకి లేచింది. సుబ్బిరెడ్డి పరుగెత్తుకుంటా వొచ్చి గాల్లోనే పట్టుకుండాడు. దాంతో రెండోవాడు పుల్లన్న ఔటయినాడు.
మూడోవానిగా ఓబుళ నారాయణ కామును తీసుకొని బద్ది దగ్గరికొచ్చి చిల్లను స్పీడుగా చిమ్మినాడు. అది మాకు ఎవురికీ అందకుండాపోయి కిందబడింది. సుబ్బిరెడ్డి చిల్లను చేతికి తీసుకొని బద్ది దగ్గర అడ్డంగా పెట్టిన కాముకు గురిచూసి విసిరినాడు. అది కాముకు తగలకుండా పక్కన పడింది. దాంతో ఓబుళ నారాయణ చిల్లను కాముతో తట్టి ఎగరేసి కొట్టినాడు. అది మాకెవురికీ అందకుండా పోయింది. ఓబుళ నారాయణ, చిల్లపడిన చోటికి వొచ్చి రెండోసారి ఎగరేసి కొట్టడానికి పూనుకుండాడు. నేను వొక్క నిమిషం ఆగమని చెప్పి సుబ్బిరెడ్డిని ముందువైపు నిలబెట్టి, మిగతా ఇద్దరినీ నువ్వక్కడా నువ్విక్కడా నిలబడి చిల్లవైపే చూడండి అని చెప్పి, నేను సుబ్బిరెడ్డికి నేరుగా వెనక కాకుండా కొంచెం పక్కన నిలబడి రెడీ అన్న్యాను, ఓబుళ నారాయణ చిల్లను ఎగిరిచ్చి కొట్టినాడు. వెదురు చిల్ల ఆడతా వొచ్చింది. నేను సులభంగా దాన్ని పట్టుకుండాను. దాంతో మూడవవానిగా ఓబుళ నారాయణ ఔటయినాడు. చిల్లను కొట్టిన దగ్గర్నుంచీ జానగొండ నారాయణ సులభంగా ‘గచ్చ గచ్చ’ అనుకుంటా బద్ది దగ్గరికి పరుగెత్తినాడు. తర్వాత అనుమన్న గాడు కాముతో బద్దిలో నుండి చిల్లను చిమ్ముతానే కొండన్న సులకాగా పట్టుకుంటాడు. అంతటితో వాడూ ఔటయినాడు. అంతలోనే అమ్మయ్య వనభోజనం తినేకి పిలిచింది. చిల్లాకాము ఇంకొగటి, కొండి, కట్లు, మంచాల్, నరహాల్, గిలిగిలి, పట్టకార, పిల్ల అని కొలిచే ఆట యెప్పుడు ఆడుదాం అని సుబ్బిరెడ్డిగాడు అడిగినాడు. బువ్వతిన్నెంక కోతి కొమ్మచ్చి ఆడి, ఆ తర్వాత ఆడుదాం అని అనుకొని, వనభోజనం బువ్వ తినేకి అందరమూ చెట్లకిందికి చేరుకుండాం.
చిన్ననాటి నేస్తం జానగొండ నారాయణతో రచయిత
రెండు ఈత చాపలు పరచుకొని అందరమూ రౌండుగా కూర్చొని చింతచెట్టు నీడలో చల్లని గాలిలో పప్పన్నం తింటా వుంటే ఎంతబాగుండాదో! పప్పు ఎంత కమ్మగా వుందో! పప్పు, వూరుమిండి వొగింటోళ్ళు చేసిండేది ఇంకొగ యింటోళ్లకూ వాళ్లు చేసిండేవి వీళ్లకూ కొద్ది కొద్దిగా బదులుకు బదులు యిచ్చి పుచ్చుకొని అవన్నీ తింటా వుంటే భలే సంతోషమయింది నాకు. వూరందరూ వోగేచోట కలిసేటట్లు నూరు చింతచెట్లో, మామిడిచెట్లో వుండే వనమయితే ఎంతబాగుంటాదో కదా అనిపిచ్చింది నాకు.
అమ్మిడి (అంబలి) పొద్దు అన్నం తిన్నెంక నాయన, పక్క నుండే చింతచెట్టు పైకొమ్మకు ఉయ్యాల కట్టినాడు. రెండు తాళ్ళకూ మధ్యలో మూరెడు పొడవుండే గట్టికట్టెను బిగిచ్చి, కట్టె మింద కూర్చున్నోళ్ల కాళ్లు నేలకు తగిలేటట్ల చేసినాడు. ఇంకొగ కొమ్మకు జానగొండ నారాయణ గానికి వాళ్లన్న ఇంకొగ ఉయ్యాల కట్టిచ్చినాడు, నేను మా ఉయ్యాల్లో కిందికి కాళ్లు వూదబొడిసి వూగుతా కాళ్లుచాపి పైకెత్తి వూగినాను. నేను అట్ల వూగుతావుంటే చూసి తమ్ముడు పెద్దన్న ‘నేమా వూగుతా’ అంటా గోముజేసినాడు. నేను ఉయ్యాల వూగడం ఆపినాను, అమ్మయ్య, వాన్ని నా తొడల మీద నాకు ఎదురుగా కూర్చోబెట్టింది. వాని కాళ్లను నా వెనక్కి వేసుకొని చేతులతో రెండు తాళ్లనూ గెట్టిగా పట్టుకోమని చెప్పి నేను నేలకు కాళ్లు తన్ని ముందుకు వూగినాను, వాడు నా తొడల మీద కూర్చోవడంతో ఉయ్యాల స్పీడుగా ముందుకు పోలేదు. వాడు గట్టిగా వూపమన్న్యాడు. అమ్మయ్యా పెద్దక్కా వుయ్యాలను వెనక్కిలాగి గట్టిగా వూపినారు. ఉయ్యాల స్పీడుగా వెనక్కి ముందుకూ వూగుతా వుంటే వానికి యేమయ్యిందో యేమోగానీ పకపవొగ నవ్వసాగినాడు. అట్ల ఎంతసేపు వూగినా వానికి తృప్తిగాలేదు. ఉయ్యాల ఆపి, వాన్ని వొక్కన్నే కూర్చోబెెట్టి, తాళ్లు గట్టిగా పట్టుకోమని చెప్పి, గట్టిగా వూపినాను. ఉయ్యాల పైకి లేచింది. కండ్లు తిరిగి నాయేమో వాడు భయపడతా గోంగలుపెట్టి యేడ్చినాడు. వాడు తాళ్లు వొదిలేసి కింద పడతాడేమోనని మేమందరమూ నవ్వుకుంటా అంతే జాగ్రత్తగా, వెనక్కి వొచ్చిన ఉయ్యాలను గబుక్కున ఆపి వాన్ని పట్టుకొని కిందికి దింపినాం. వాడు యేడ్చుకుంటా నాయన దగ్గరికి పరువెత్తినాడు. దాంతో వాడు మల్లా ఉయ్యాల జోలికిరాలేదు.
నేను, చెల్లెళ్లను రోంతసేపూ, వాళ్ళు నన్ను రోంత సేపూ వొగరికొగరం ఉయ్యాల వూపుకుంటా సంబరపడినాం. మేము ముగ్గరమూ కలిసి అమ్మయ్యను రోంతసేపు ఉయ్యాల వూపినాం. అమ్మయ్య భయపడతా చాలనింది. తర్వాత నేనూ జానగొండ నారాయణా రోంతసేపు, నేనూ కొండన్నా రోంతసేపూ. ఉయ్యాల కట్టె మీద ఎదురెదురుగా నిల్చుకొని, వొగరి వైపు నుంచి వొగరివైపు కాళ్లతో ఉయ్యాల కట్టెను అదుముతా బలంగా నూకుతా వుంటే ఉయ్యాల చుక్కలను అంటి వొచ్చినట్లు ఆ పైకీ ఈ పైకీ వూగసాగింది. అట్లా మేము అలసిపోయేదంక ఊగినాం.
మా ఆడపిల్లోళ్లను చూసి చౌడమ్మ, అనంతమ్మ, అంజినమ్మ వొచ్చినారు “వాళ్ల్లూ రోంతసేపు వూగుతారు, దిగు బంగారూ!” అని అమ్మయ్య నాకు చెప్పింది. “చౌడమ్మ నన్ను వుయ్యాల వూపుతానని చెప్పి నాతో చింతాకు పెట్టిచ్చుకుంది. ఆ యమ్మ నన్ను ఉయ్యాల వూపకుంటే నేనియ్యను పో!” అంటా నేను బెట్టుజేసినాను.
“అవునేమే, సౌడీ? అయితే రోంతసేపూపు, మీ మామ కొడుకే గదా!” అని అమ్మయ్య నాకు వత్తాసు పలికింది. “పోత్తా, నేనూపను! చింతాకు పీకిత్తాడని వూరకనే అట్లన్న్యాను.” అంటా ఆ పాప సిగ్గు పడింది. “నువ్వు రోంతసేపు వూపితే నా కొడుకు నిన్ను ముడేసుకోడు లేయే వగలాడీ! వూపూపు” అంటా అమ్మయ్య జాన్తనమాడింది.
“ఈ కర్రోన్ని యెవురు ముడేసుకుంటార్లే అత్తా!” అంటా రోంత మూతి ముడిచి నన్ను ఉయ్యాల వూపింది చౌడమ్మ. “నా కొడుక్కేమే, గోపాల కిట్నుడు! సూత్తావుండు బ్రెమ్మాండంగా సదువుకోని, పెద్దాపీసరయి, దేవకన్నెను తెచ్చుకుంటాడు!” అంటా అమ్మయ్య నన్ను పొగుడుతా వుంటే నేను సిగ్గుతో నవ్వుకుంటా మా వుయ్యాలను ఆడోళ్ళకు వొదిలేసి జతగాళ్ల దగ్గరికి పోయినాను.
కోతికొమ్మచ్చి
జతగాళ్లందరమూ వంక పక్కన ఇసకదిబ్బ మీదుండే చింతమాను దగ్గరికి పోయినాం. అది కొంచెం ఎత్తుమింద వుందని, ఆ మానుకింద వనభోజనాల పొయ్యిలు గాలికి సరిగా మండవని, ఎవురూ దానికిందికి పోలేదు. ఆ చింతమాను కొమ్మలు, మనుషులు నిలబడితే అందేటట్ల వుండాయి. మొదులు (కాండం) కూడా ఎక్కువగా లేదు. ఎక్కడానికి అనుకూలంగా వుండాది. చెట్టుకింద మెత్తని ఇసక. కొమ్మల మిందనుండీ కిందపడినా దెబ్బలు తగలవు. అందుకే మా జతగాళ్లం సందు దొరికినప్పుడల్లా ఆ చెట్టుమిందే కోతికొమ్మచ్చి ఆడతా వుంటాం.
చింతమానుకింద అందరమూ గుండ్రంగా నిలబడి చేతులుచాచి, అరచేతులు చరసుకుంటా (కొట్టుకుంటా) అప్పట్లు వేయసాగినాం. అట్ల ఆరుసార్లు అప్పట్లు వేసినాం, ప్రతిసారీ అందరమూ అప్పట్లు (చప్పట్లు) కొట్టి, చేతులు ముందుకు చాచి అరచేతులు వెల్లకిల పెట్టసాగినాం. ఏడోసారి కొండన్న గాడొక్కడే అరచేతులు బోర్ల తిప్పినాడు. అందరమూ “కొండిగాడే దొంగ” అని అరచినాం.
దొంగను చెట్టుకు దూరంగా వొగ గుండ్రని గీత మధ్యలో నిలబెట్టినాం. వానికి ఎదురుగా చెట్టుకు ఇంకొగ వైపున వొగ రాయి పెట్టి, దానికి కొంచెం యెడంగా దాని చుట్టూ మూడు గీతలు గీయసాగినాను నేను. అంతలోనే మిగిలిన వాళ్లందరూ చెట్టెక్కి తలా వొగ కొమ్మ మీదికి పోయినారు. నేను రాయి చుట్టూ మూడోగీత గీసి ‘రెడీ’ అని పరువెత్తిపోయి చెట్టెక్కినాను. నేను రెడీ అంటానే కొండిగాడు తాను నిలబడిండే చోట్నుంచీ పరువెత్తి వొచ్చి, నేను గీతలు గీచిన రాయి చుట్టూ బిరబిర మూడుసార్లు తిరిగి, మమ్మల్ని అంటేసేకి చెట్టెక్కినాడు. వానికి చిక్కకుండా మేమందరమూ వొగ కొమ్మ మిందనుంచీ మరొగ కొమ్మలోకి దాటుకుంటా కోతుల మాదిరి పోతావుండాం. కోనయ్యను చూసి చిటారు కొమ్మమీదుండే రెండు చిన్నకోతులు ఎదురు తిరిగి, ‘కొర్ కొర్’ మంటా మీరుకోసాగినాయి. నేనూ, కోనయ్యా కొమ్మను అల్లాడిస్తా దాండ్ల మాదిరే తలకాయలు ముందుకు చాపి, ‘కొర్ కొర్’ మని గట్టిగా అన్న్యాం. అవి అక్కన్నుంచి. ఇంకొగ కొమ్మమానికి ఎగిరి కిందికి పోసాగినాయి. దాండ్లను జూసి కొండిగాడు భయపడతా కిందికి జారినాడు. అది చూసి మేము నవ్వును ఆపుకోలేక పోయినాం. మా సందడికి కోతులు పరుగెత్తి పోయినాయి.
కొండిగాడు మళ్ళీ చెట్టెక్కి మమ్మల్ని అంటేసేకి నేనుండే కొమ్మ మిందికొచ్చినాడు. నేను ఆ కొమ్మమింద నుండి కింది కొమ్మమిందికి దాటుకుండాను. వాడూ ఆ మాదిరిగానే దాటుకుండాడు. నేను వానికి చిక్కకుండా కింద ఇసకలోకి దుంకినాను. వాడు ఆ కొమ్మ చివరి కొచ్చి, వేలబడి, నా దగ్గరికి దుంకి (దుమికి) నన్ను ముట్టేసి, “నారాయని గాడు దొంగ, నారాయని గాడు దొంగ” అని గట్టిగా అరిచినాడు. అందరూ అరుచుకుంటా చెట్టు దిగొచ్చినారు.
“ఇప్పుడు నేను ‘కోతి కొమ్మచ్చి దొంగ’ను. దొంగ కోసరం గుర్తు పెట్టిండే చోట నేను నిలబడినాను. మళ్లీ అందరూ చెట్టెక్కినారు. ఈసారి అనుమన్న గాడు, రాయి చుట్టూరా మూడు రౌండ్లు గీతలు గీసి, అందరూ చెట్టెక్కినారని గమనిచ్చి రెడీ అని పరుగెత్తిపోయి చెట్టెక్కి, గుల్లి ఉపాయంతో కిందుండే కొమ్మమీదికి పోయినాడు. నేను దొంగోని స్థలం నుంచి స్పీడుగా పరుగెత్తి చెట్టక్కబోయినాను, అనుమన్నగాడు తానుండే కొమ్మ కొనకుపోయి, నేను చెట్టెక్కగానే, తటక్కన కిందికి దుంకి గీతల మధ్యలోని రాయిని అంటేసి, నన్ను మళ్లీ దొంగను చెయ్యలని అనుకున్నెట్లుంది. అది నా మనసులో మెదలగానే, నేను చెట్టక్కకుండా, వాడుండే కొమ్మ దగ్గరికి పోయి కొమ్మను కిందికి లాగుతానే వాడు ‘దబ్బని’ ఇసకలో పడినాడు. నేను వాన్ని పట్టుకొని అనుమన్నగాడు దొంగ అని గట్టిగా అరిచినాను. అందరూ కేకవేసినారు. అనుమన్నగాడు, “నేనొప్పుకోను, ఈడు చెట్టెక్కకుండా నన్ను అంటేసినాడు” అంటా గత్తుజేసినాడు. “చెట్టెక్కి అంటేస్తేనే అంటేసినట్లా? అదేంగాదు. అయితే నువ్వు గానీ వాళ్లు గానీ చెట్టెక్కక ముందే నేను స్పీడుగా పరిగెత్తొచ్చి అంటేస్తే అది అంటేసినట్ల కాదా!?” అని నేను వాన్ని నిలదీసినాను. అందరూ, “అవును, నారాయనిగాడు చెప్పేదే కరెట్టు. ఇబ్బుడు నువ్వే దొంగ” అని గట్టిగా అరచినారు, వాడు నోరుమూసుకుండాడు.
అట్ల చాలాసేపు కోతికొమ్మచ్చి ఆడుకుండాం. రోంతసేపయినంక ‘కొబ్బరిసిన్ని’ ఆడల్లునుకొని అందరూ వాళ్ల వాళ్ల చెట్ల దగ్గరికి పోయి నీళ్లు తాగి ఐదు నిమిషాలయినంక మళ్లీ చెట్టుకిందికి చేరుకుండాం.
నేను భీషన్న చేనికాడ బాటమాన్ల పక్క చూసినాను, ఆడ కురవగేరోళ్ళు చిల్లా కట్టి ఆడతా వుండారు. వాళ్లంతా మాకంటే పెద్దోళ్లు, ఈ చింతమాన్ల కిందికంటే బాటమాన్ల కింద భలే నీడ వుంటాది. అవన్నీ చాలా పెద్ద జీ (జివ్వి) మాన్లు. వొగదాని కొమ్మలు ఇంకొక దాని కొమ్మలకు ఆనుకొని వుంటాయి. అయితే అయిదారు మాన్లే వుండేది. రోడ్డు పక్కనుండే ఆ మాన్ల కిందికి వనభోజనాలకు పోతే రోడ్డు మింద బస్సులూ, లారీలూ తిర్లాడతా వుంటాయని, చిన్న పిల్లోళ్లు చెట్లనీడలో రోడ్డు మింద ఆపక్కా ఈపక్కా పరుగెత్తితే ప్రమాదమని మా గేరోళ్ళు ఆటికి పోలేదు. అంతేగాకుండా జీమాన్ల కొమ్మలు పెలుసుగా వుంటాయని, వుయ్యాలలు కట్టి పెద్దోళ్లు వూగితే తటక్కన కొమ్మలిరిగితే చాలా ప్రమాదమని, జీమాన్ల మింద ‘కోతికొమ్మచ్చి’ ఆడుకోడానికి వీలుగాదని మా నాయన చెప్పడంవల్ల మా గేరోళ్ళందరమూ చింతొనం చెట్ల కిందికే వొచ్చినాము.
కొబ్బరిసిన్ని
భీషన్నోళ్ల చేనిదగ్గరుండే జీ మాన్లకంటే, కొండలసందులో వుండే బాటమాన్లు బ్రమ్మాండంగా వుంటాయి. రోడ్డుకు రెండు పక్కలా వుండే ఆ జీ మాన్ల కొమ్మలు రెండు పగ్గాల పొడవుతో చేన్లల్లోకి సాగి, భలే గుబురుగా వుంటాయి. వనభోజనాలకు ఆ చెట్లకిందికి పోవడమంటే నాకు చాలా ఇష్టం. ‘చిల్లాకట్టి’ ఆడుకోడానికి అక్కడుండే తువ్వ చేన్లు బాగా చదునుగా, పరుగెత్తేకి అనుకూలంగా వుంటాయి. చెట్ల నీడకింద ‘కొబ్బరిసిన్ని’ కూడా బాగా ఆడుకోవచ్చు. అయితే ఆ దరిదాపుల్లో నీళ్లుండవు. పైగా మా గేరోళ్ళకు ఆ బాటమాన్లు రోంత దూరం! అందుకే నాయన, ఆటికంటే చింతొనమే మేలని అన్న్యాడు. ఆ బాటమాన్లు మావూరి తూరుపు గేరోళ్ళకూ, మాదిగోళ్లకూ దగ్గర. వాళ్లందరూ నీళ్లకడవలెత్తుకొని, వనభోజనాలకు ఆ మాన్లకిందికి పోయినారు.
మేము కోతికొమ్మచ్చి ఆడిండే చింతమాను కిందనే మెత్తని ఇసవొగమింద గుండ్రంగా నిలబడి మళ్లీ చప్పట్లు కొడతా అప్పట్లు వేసినాం. ఈ సారి పుల్లన్న దొంగయినాడు. వాడు వొగచోట నిలబడి కిందికి వొంగి చేతుల్ని పాదాల మీద మోపినాడు. వరసగా నిలబడిండే మేము వొక్కొక్కరు పరువెత్తిపోయి వాని వీపుమీద చేతులు గట్టిగామోపి, కాళ్ళు రెండూ ఆ పక్క వొగటి ఈ పక్క వొగటి చాపి వానికి తగలకుండా వాని అవతలికి దుంకల్ల! (దుముకల్ల). ఎవురు దుంకలేక పోతే వాడే దొంగయితాడు.
పుల్లన్నగాడు దొంగగా కిందికి వొంగి పాదాల మింద చేతులు మోపినాడు. వాడు ముందే జంపోడు. అందరూ వాన్ని జంపోడని అంటారు. వాడు వొంగినప్పడే అనుమన్న గానంత ఎత్తుండాడు. వాని వీపుమీద చేతులు మోపి ఇపుడు అవతలికి ఎగరల్లంటే పొట్టివాళ్లకు కొంచెం కష్టం. సరే, నేనే పరుగెత్తిపోయి పుల్లిగాని వీపుమీద చేతులుమోపి, ఆ పక్కా ఈపక్కా కాళ్లు చాపి సులభంగా అవతలికి యెగిరినాను. నారాయణ, సుబ్బిరెడ్డి, కోనయ్య యెగిరినారు, ఇంక మిగిలిండేది పొట్టివాళ్ళిద్దరే, ఓబుళ నారాయణ, అనుమన్నా వాళ్లను ఎట్లన్నాగాని దొంగల్ని చెయ్యల్లని పుల్లిగాడు పాదాల మింద నుంచీ చేతులు రోంత పైకిలేపినాడు. అది చూసి అనుమన్నగాడు కొట్లాటకు యేసుకుండాడు. మొదటి రౌండులో చేతులు పాదాల మీద మోపాల్సిందేనని మేము గట్టిగా చెప్పడంతో వాడు పాదాలమీద మోపినాడు. కష్టపడి వాళ్లిద్దరూ అవతలకి ఎగిరినారు. దాంతో ‘కొబ్బరిసిన్ని’ మొదటి రౌండు అయిపోయింది.
రెండో రౌండులో దొంగ, చేతులు మెడాల్ని (మెడిమలు) తాకేటట్ల వొంగల్ల! పుల్లన్న, ఆ మాదిరిగానే వొంగినాడు. నేను పరుగెత్తిపోయి, వాని వీపుమీద చేతులు బలంగా మోపి అవతలికి యెగిరినాను. జానగొండ నారాయణగాడూ యెగిరినాడు. సుబ్బిరెడ్డి దుబ్బోడు. బలంగా పుల్లిగాని మింద చేతులుమోపి గునికిస్తానే, పుల్లిగాడు పట్టుదప్పి కిందికి పడినాడు. వాని మీద వీడూ పడినాడు. అదిచూసి అందరమూ కడుపులు చెక్కలయ్యేటట్ల నవ్వుకుండాం. పుల్లన్న తన స్థలంలోకి వొచ్చి మళ్ళీ వొంగినాడు, సుబ్బిరెడ్డి రెండోసారి కష్టపడి యెగిరినాడు. మిగతావాళ్లూ యెగిరినారు. మూడో రౌండులో పుల్లన్న చేతులు మోకాళ్ల వరకూ వొంచినాడు, జానగొండ నారాయణ సులభంగానే యెగిరినాడు. మిగతావాళ్ళెవురూ యెగర్లేకపోయి, దొంగలయినారు. వొక్కొక్క దొంగ వొంగడమూ వాని మిందచేతులు మోపి యెగరడమూ వొగరిద్దరు చాతగాక కింద పడడమూ అందరమూ, పకపవొగ నవ్వడమూ ఆ మాదిరిగా పయిటాల బువ్వపొద్దు వరకూ ‘కొబ్బరిసిన్ని’ ఆట ఆడి, మా వనభోజనాల మాన్లకిందికి చేరుకుండాము. ఎండ విపరీతంగా వుంది. చెట్టుకింద ఎంత నీడున్నా బీటిపొలాల్లో నుంచీ సెగ కొడతావుంది. ఆకల్లాడ లేదు. బొత్తిగా గాలి లేదు. పెద్ద వాళ్లందరూ టువ్వాళ్లతో, కొంగులతో గాలి విసురుకుంటా వుండారు. ఆటలమీదికి మళ్లిన మాకు ఎండ అని అనిపించడమే లేదు.
బలిగుడు
పొద్దు వాలింది. రోంత గాలి తగుల్తావుంది. మల్లా అందరమూ ఇసవొగదిబ్బమీదుండే చెట్టుకాటికి చేరుకుండాం. ఈసారి బలిగుడు (చెడుగుడు-కబడి) ఆట ఆడేకి, మాకంటే రోంత పెద్దోళ్లు కొమ్ము మామా, అనుమంతరెడ్డి, వెంకట్రెడ్డి, రామాంజినేయులూ మాతో కలుసుకుండారు. మా జట్టులో పెద్దోళ్లు వెంకట్రెడ్డి రామాంజనేయులూ మిగతా నలుగురు, నా జతగాళ్లు. అవతలజట్టులో పెద్దోళ్లు కొమ్ముమామా, అనుమంతరెడ్డి, మిగతా నలుగురు, అనుమన్నగాని జతగాళ్లు.
“ఇసకలో చెడుగుడు ఆటకు గీతలు గీసినాం. రెండు జట్లకు మధ్యలో పది అంగలు వేసి చక్కగా వొగ గీత గీసినాం. ఆ గీత రెండు కోనల్లో నుంచీ కుడి వైపుకూ ఎడమవైపుకూ పది పది అంగలేసి నిలువుగా రెండు గీతలు చేసినాం. నిలువు గీతలకు చివర రెండు వైపులా మల్లా రెండు అడ్డగీతలు గీసినాం. ఇప్పుడు మధ్యగీతకు రెండు వైపులా రెండు సరిసమానమైన గదులు ఏర్పడినాయి. చిన్న చిన్న అంగలు, వొక్కొక్క అంగ అందాజుగా రెండడుగుల లెక్క ప్రకారం వొక్కొక్కగది ఇరవై అడుగులు పొడవూ, ఇరవై అడుగులు వెడల్పూ కొలతలు వేసినట్లుండాయి. రెండు గదుల్లోనా మళ్ళీ మధ్యలో రెండు అడ్డగీతలు గీసినాం. ఈ గీతల్ని తాకే (టచ్ లైన్స్) గీతలంటారు. వొక్కొక్క జట్టులో వుండే ఆటగాళ్లందరూ వొక్కొక్క గదిలో వెనక వైపున ఎదురెదురుగా నిల్చుకొని వుంటారు. వొగ జట్టులోని వొక్కొక్క ఆటగాడు మధ్యలో వుండే గీతదాటి, గుడు..గుడు..గుడు అని వూపిరి వదలకుండా గుడుగుతా టచ్ లైన్ దాటి అవతల నిల్చుకోనుండే ఆటగాళ్లను తాకి, వాళ్లెవరికీ చిక్కకుండా గుడుగుతా వొచ్చి, జట్ల మధ్యలో వుండే గీతమీదికి వస్తే ఆ తాకినోడు ఔటయి బయటికి పోవాల్సిందే! గుడుగుతా పోయినోడు, తాకే గీతను తాకకుండా వొచ్చినా, గుడిగేవాన్ని అవతలి జట్టువాళ్ళు పట్టుకొని మధ్యలో వుండే గీతను తొక్కకుండా చేసినా వీడూ ఔటయి బయటికి పోవాల్సిందే! వీడు గుడుగుతా పోయినప్పుడు, వీడు ముట్టేస్తాడని అవతలి జట్టు ఆటగాళ్లు గదిగీతలు హద్దులు దాటిపోతే, దాటి పోయినోళ్లందరూ ఔటయినట్లే లెక్క.
ఈ పద్ధతులతో మా బలిగుడు (కబడి) ఆట మొదలయింది. మాకంటే వయసులోనా, వొడ్డూపొడవులోనా కొంచెం పెద్దగా వుండే వాళ్లతో ‘బలిగుడు’ ఆడేకి మాకెవురికో ఇష్టం లేదు. అయితే వాళ్ళై వాళ్లొచ్చి మాతో కలసి ఆడతామని అడిగితే, వొద్దని చెప్పేకి మాకు నోరు రాలేదు, వాళ్లందరూ దినామూ పలకరిచ్చే వుండూరోళ్ళే! వాళ్లల్లో కొమ్మాయప్పా, వెంకట్రెడ్డి కనిపించినప్పడల్లా తమాషాగా మాట్లాడతా మమ్మలందర్ని ఆటపట్టించేవాళ్లే! అట్లాటోళ్లు పిల్లోళ్ల మాదిరి వొచ్చి, మాతోపాటు బలిగుడు ఆడతామంటే వొద్దని అనలేం గదా! అందుకే అందరమూ సరే అన్న్యాం. మేము ఆట పద్ధతులన్నీ చెప్పినాం. సరే అన్న్యారు వాళ్లు.
అవతలి జట్టులో నుంచి మొదట అనుమన్నగాడు, జట్ల మధ్యలో వుండే గీతదాటి ఇవతలికి వొడుపుగా వొచ్చి గుడుగుతా, తాకే లైన్ కాలితో తాకి, కుడిచెయ్యి ముందుకు చాపి మమ్మల్ని ముట్టేకి చూసినాడు. వాన్ని పట్టుకుండేకి వెంకట్రెడ్డి గునికిస్తానే, వాడు పరుగెత్తిపోయినాడు, తర్వాత మా జట్టులో నుంచీ కొండన్నగాడు గుడుగుతా పోయినాడు. తాకే గీతమింద అడుగు పెడతానే కొమ్ముమామ, వాని చేయిపట్టుకొని లాగి అదంబట్టుకుండాడు. దాంతో, మొదట మా జట్టులో వొగడు ఔటయినాడు. మా కందరికీ పట్టుదల పెరిగింది. అవతలి జట్టు కొమ్ముమామ తైతక్క తైతక్క తైతక్క అని గుడుగుతా వొచ్చినాడు.
“తైతక్క తైతక్క యేంది మామా? గుడు గుడు గుడు అని అను. ఇదేందో కొత్తది, మేమొప్పుకోం!” అని ఓబుళ నారాయణ అడ్డం తిరుక్కుండాడు. “యెట్ల గుడిగితే మీకేమోరు? వూపిరిడిసకుండా గుడిగితే సాలు గదా, తైతక్క తైతక్క అని అంటేనేం, రామక్క రామక్క అని అంటేనేం, కోనయ్య కోనయ్య అని అంటేనేం” అంటా కొమ్మాయప్ప అడ్డం మాట్లాడినాడు.
“పో, మామా నువ్వంతా సొట్ట మాటలు మాట్లాడతావు! ఇందుకేనా అందరూ నిన్ను సొట్టోడు, కొమ్మోడని పిల్చేది!” అంటా కోనయ్య నవ్వుకుంటానే అడ్డం చెప్పినాడు. “పోన్లె కోనయ్యా! వూపిరిడచకుండా యెట్ల గుడిగితే మనకేం లే! వూరకనే కొమ్మోడు కొమ్మోడు అని గుడుగు మామా” అని నేను సర్దిచెప్పినాను. ఆ మామ ఆ మాదిరిగానే గుడుగుతా వుంటే మేమంతా నవ్వుకుంటా ఆయప్పను పట్టుకుండేకి పూనుకుండాం. అందరమూ పూర్తీ వెనక్కి జరిగినాం. నేను మా జట్టు చివర్లో కొంచెం వొంగి నిల్చుకుండాను. ఆయప్ప తన పొడువు చేతుల్తో మా వాళ్లను సోపుకుంటా వొచ్చి పంగ చాపినాడు. నేను వొడుపుగా పోయి ఆయప్ప కాళ్లకిందికి దూరి కిందపడేసినాను. మా వాళ్లందరూ ఆయప్ప మిందపడి అదంబట్టినారు.
లే..లే..లే.. సంపితిర్రా అని అంటా కొమ్ముమామ సోలిపోయి ఆటలో నుంచీ ఔటయినాడు. ఆ మాదిరిగా నాలుగయిదు సార్లు మా జట్టోళ్ళూ, అవతల జటోళ్ళూ ఆ పక్కా ఈ పక్కా చెడుగుడు ఆడేటప్పటికి పెద్దోళ్ళు నలుగురూ ఔటయిపోయి, “పిల్ల నాయల్లు మీరంతా బలే అసాద్యుల్రా” అని అనుకుంటా బయట కూర్చుండారు. ఆనెంక రోంతసేపు ఆడి, “పొద్దు మునుగుతాంది, ఇంగరాండిరా! అని పెద్దోళ్లందరూ పిలచడంతో ఆట చాలించినాం. చెట్ల కిందికి పోయి ఉయ్యాల తాళ్లు వూడబీక్కొని మా వాళ్లతోపాటు వనభోజనాలు ముగిచ్చుకొని వూర్లోకి బయలుదేరినాం.
పొద్దున్నుంచీ ఇంటి మింద యెవురికీ ధ్యాసే లేదు. దున్నపోతులు ఇంటికొచ్చినాయో లేదో! పొద్దస్తమానమూ ఆట్లాడుకోకుండా మద్దెలో రోంత ఇంటికల్ల పోయి చూసిరాకుంటే యెట్లరా, అని నాయన అంటానే నా మనసు ఇంటి పక్క మళ్లింది. దున్నపోతులు ఇంటికొచ్చినాయో లేదో అని మనసు గుంజులాడింది.
“ఇంటికి రాకుండా యాటికి బోతాయిలే, నువ్వంతాను” అని అమ్మయ్య అనడంతో నాయన ఇంకేమీ మాట్లాడ లేదు. నసుకుపడే సరికల్లా వూరోళ్లందరి మాదిరిగానే మేమూ ఇల్లు చేరుకుండాం. కొట్టంలో దున్నపోతుల్ని చూసి సంతోషపడినాను.
మావూర్లో మొదటి లడ్డుపెండ్లి!
ఎండల కాలమొస్తానే మా వూర్లోనే కాదు, చుట్టు పక్క పల్లెల్లో అంతలక్కా పెండ్లిండ్లు బొగు జరుగుతాయి. ఊర్లో మా కులస్తుల్లో, అయినపొయినోళ్ళ ఇండ్లల్లో పెండ్లిండ్లు జరిగితే, మాకు పిల్లోళ్లకు భలే సంబరం! మా వూర్లో చుట్టుపక్కల పల్లెల్లో ఎవురింట్లో పెండ్లి జరిగినా దాదాపు అందరూ వాళ్లిండ్లకాడనే చేస్తారు. ఇండ్ల ముందర సందుంటే, ఆ సందులోనే నాలుగు మూలలా నాలుగు గుంజలు పాతుతారు, మ్యాలగాళ్లు మ్యాలం వాయిస్తా వుంటే, పెండ్లి పందిరేస్తారు. దాదాపందరూ గుంజలపైన నాలుగు పక్కలా నాలుగు సివ్వలు కట్టి దాండ్ల పైనఅడ్డంగా వాసాలేసి, వాసాల పైన కొత్త తడకలూ తడకలపైన ఆకులతో వుండే చిన్న చిన్న జీకొమ్మలేస్తారు. బాగా కలిగినోళ్లు టెంకాయపట్టలు తెప్పిచ్చి నాలుగు పక్కలా గుంజలకు బిగ గడతారు. మా వూర్లోనా మాకు ఆమడ దూరంలో యాడేగానీ టెంకాయచెట్లు లేవు. మల్ల వాళ్లు టెంకాయ పట్టల్ని యాట్నుంచీ తెప్పిస్తారో నాకు అర్థమే కాదు.
మా వూర్లోనా, మా చుట్టుపక్కలుండే పల్లెల్లోనా పెండ్లికొడుకునో పెండ్లికూతుర్నో చేసేవాళ్లు, మ్యాలగాళ్లు మ్యాలం పడతావుంటే పందిరేసి, పైన చుట్టూరా మామిడాకుల తోరణం కడతా, బంధువులందరూ రావల్లని వొగ మూల తోరణం కట్టకుండా వొదిలేస్తారు. అట్ల వొదిలేస్తే వొచ్చే బంధువులందరూ రావచ్చునని తెలిపేదానికి గుర్తు! బంధువులందరూ రాకముందే పందిరి తోరణం నాలుగు మూలలా కట్టేది ముగిస్తే, ఆ తర్వాత వొచ్చిన బంధువులు, మేము రాకముందే పందిరేసేది ముగిచ్చినారే అని కోపగిచ్చుకుంటారు. కొంతమంది దాన్ని అవమానంగా భావించి, పందిరి కిందికి రాకుండానే వెనక్కి వెళ్లిపోతారు.
మావూర్లో మ్యాలగాళ్లు నలుగురే వుండేది. ఇద్దరు సన్న డ్రమ్మూ కొడతా వుంటే, తతిమ్మా ఇద్దర్లో వొగడు కిలార్‌నట్టూ ఇంగొగడు బ్యాండు మ్యాలమూ వూదుతారు. సంసారం బాగా జిగి వుండే కాపోళ్లు మా వూరి మ్యాలగాళ్లకు తోడుగా ఇంగా కొంతమందిని అనంతపురం నుండి పిలిపిచ్చుకుంటారు. మా వూర్లో యెవురింట్లో పెండ్లి జరిగినా పిల్లోళ్లకు మాకు భలే సంబరం. మా కులస్తుల ఇండ్లల్లోనో, మా ఇరుగు పొరుగు ఇండ్లల్లోనో పెండ్లి జరిగితే ఇంగా సంబరం. యాలంటే, పెండ్లికి ఇంటోళ్లందర్ని పిలుస్తారు. అట్ల పిలిస్తే ఆ ఇంటోళ్లందరమూ పెండ్లికి పోయి, పొద్దున్నే టిఫను బొరుగుల తిరగవాత (ఉగ్గాణి), మధ్యాహ్నం పరమాన్నం తాగి కడుపు నిండా పొప్పు చారన్నం తినొచ్చు, బొరుగుల ఉగ్గాణి చేసి, వరిగడ్డి పైన పరిచిండే తెల్లని తడిబట్ట మింద పచ్చగా రాసి పోసింటారు. ఆ ఉగ్గాణి రంగూ, వాసనా మాకు పిల్లోళ్లకు భలే ఇష్టం. చూస్తానే నోట్లో నీళ్లూరుతాయి. పెండ్లికి పోతే ఇష్టమైన ఉగ్గాణి తృప్తిగా తినొచ్చు.
అయితే, పెండ్లికి పోవల్లంటే అమ్మయ్యా నాయనా యెనకా ముందూ ఆలోచిస్తారు. పెండ్లికి పోయినంక నాలుగు రుపాయలో, ఐదు రుపాయలో ముయ్యి వేసిరావల్ల, అట్ల నలుగు యేమీ పెట్టకుండా వొట్టిచేతుల్తో పోయి, పెండ్లిభోజనం తినొస్తే మర్యాదగా వుండదని కాబట్టి నలుగుపెట్టేకి చేతిలో దుడ్లు ల్యాకుంటే మా నాయనా అమ్మయ్యా పెండ్లికి పోకూడదను కుంటారు. అప్పుడు మా సంబరమంతా గాలికెగిరి పోతాది.
మావూరి బడగొర్ల నాగిరెడ్డిమామ, తన పెద్దబిడ్డ ఎర్రెమ్మ పెండ్లి పెట్టుకొని, నాయనకు పెండ్లి పత్రిక ఇచ్చి “తప్పకుండా రావల్ల యెంగడసామీ” అని చెప్పిపోయినాడు. పెండ్లి యింగా రెండు దినాలుందనంగా, పెద్దోళ్ల పెండ్లి కనిట్టమంటే ఐదు రూపాయలు నలుగెయ్యల్ల, ఇబ్బుడుండే కసాలాలో ఐదు రూపాయలంటే మాట్లా! ఇంటికి పద్దినాల బత్తెమొత్తాది. వూరకనే, యాల్లే అంటా నాయన పెదవి విరిచినాడు. అమ్మయ్య గుడకా సరేలే అనింది.
నాగిరెడ్డి మామోళ్ళు ఇంటికాడ కాకుండా బజార్లో పెండ్లి బజ్జిరీగా చెయ్యల్లని, పెండ్లి పందిరేసినారు. పందిరికి రెండు పక్కలా కాపోళ్ళ ఇండ్లే. అందుకేనేమో తూరుపు గేరోళ్ళూ, పడమటి గేరోళ్ళూ ఆ పక్కా ఈ పక్కా పారాడేకి ల్యాకుండా మొత్తం వాళ్ళిండ్ల ముందర పందిరేసి, లోపల యేముండేదీ కాన్రాకుండా చుట్టూరా పందిరెత్తున తడకలు కట్టినారు.
నేనూ, పెద్దక్కా పొద్దున్నే బీటిమళ్ళల్లోకి పోయి చెరొగ గంపనిండా వొరికొయ్యలు పీక్కోనొచ్చి కొట్టంలో గాటిపాట్న పరిచినాం. నేను అమ్మిడిపొద్దు బువ్వతిని రోంతసేపు ఐదో తరగతి తెలుగు పుస్తకం చదివేకి కూర్చుండాను. ఐదో తరగతి పాతపుస్తకాలన్నీ నాకు మా హెడ్మాష్టర్ సారు ఎండలకాలం శెలవులకు ముందే వాళ్ళ వూరి నుంచీ తెచ్చిచ్చినాడు. ఇచ్చినప్పుడు నాకు భలే సంతోషమైంది. ఆనందంతో కండ్లల్లో నీళ్ళు మెదిలినాయి. ఇట్లాటి సార్ ట్రాన్స్‌ఫర్ కాకుండా మా వూర్లోనే వుంటే ఎంత బాగుంటాదో అని అనుకుంటా అదంతా గుర్తుకు తెచ్చుకొని చదువుకుంటా వుంటే పెద్దగా బ్యాండుమ్యాళం శబ్దం వినిపిచ్చింది. ఆ శబ్దాలు వింటా, మావూరి మంగలోళ్లకు తోడు ఎవురో కొత్త మ్యాలగాళ్లు వొచ్చినట్లుందని అనుకుండాను. రేపే నాగిరెడ్డోళ్ల ఎర్రెమ్మ పెండ్లి.
ఎర్రెమ్మ నాకంటే నాలుగేండ్లు పెద్దదని అమ్మయ్య చెప్పుతా వుంటాది. ఎర్రెమ్మ తమ్ముడు ఎర్రెప్ప నాకంటే వొగ రెండేండ్లు పెద్దోడు. ఆరో క్లాసు చదువుతా మధ్యలోనే చదివేకి చాతగాక స్కూలు యిడిచిపెట్టినాడు. ఎర్రెప్ప వొచ్చి, రేపు నన్ను వాళ్లక్క పెండ్లికి పిలుత్తాడని మనసులో ఆశపడతా చదువుకోసాగినాను. అంతలోనే కొండిగాడూ, జానగొండ నారాయణగాడూ ఇంగా ఇద్దరు జతగాళ్లొచ్చి చెవిలో “ఎర్రెప్పగానోల్లు పెండ్లికి లడ్డు జేత్తాండారంట, పోయి సూత్తాం రా” అని మెల్లగా చెప్పి పిలిచినారు. నాకు మనసు పీకింది. చదువుకుండే పుస్తకాలన్నీ యెత్తిపెట్టి “రోంతసేపు అట్లాడుకుండేకి పొయ్యొస్తాను మా” అని అమ్మయ్యతో చెప్పి, జతగాళ్లతో కలసి చావిడికల్ల పోయినాను.
అందరమూ చావిడి కాటికి పోతానే కమ్మని, తియ్యని వాసనొచ్చింది. కుక్కలు నంజరి ముక్కలకోసరం ముక్కుల్తో వాసనబట్టినట్ల, అందరమూ వాసన పీల్చుకుంటా బజార్లో యేసిండే పెండ్లి పందిరికాటికి పోవల్లనుకుండాం. పందిరికాడ ఎర్రెప్పగాడు యాడా కనిపిచ్చలేదు. పెండ్లి కూతుర్ని చేస్తావుండారేమో, అందుకే ఇంటికాడే వుంటాడనుకుండాం. లడ్డు యెట్లుంటాదో, యెట్ల జేస్తారో, యేమిటితో చేస్తారో, లడ్డుంటలంటే వుంటలుంటలుగా వుంటాయో, ఈటికే ఇంత కమ్మని వాసనొస్తావుంటే, ఇంగ తింటే యెట్లుంటాదో అని రకరకాలుగా ఆలోచనచేస్తా మెల్లగా పందిరికాటికిపోయి, తడక సందుల్లో నుంచీ చూడసాగినాం.
గాటిపొయ్యి మింద వొగ పెద్ద గోళంలో శెనిక్కాయినూనె మసులుతా వుంది. వంట జేసేవాళ్లెవురో కొత్తోళ్లు. వొగాయప్ప పెద్ద గండ్ల గెరిటిని గోళం మింద పెట్టి, గెంటిలోకి నీళ్లనీళ్లగా కలిపిండే పచ్చని శెనగపిండిని పోస్తా గెంటిని తిప్పుతావుంటే, ఆ పిండి సన్న సన్న గుల్లలుగా కాగే నూనెలోకి పడతా వుంది. ఇంగొగాయప్ప, గోళంలో పడిండేే పిండి గుల్లల్ని గండ్ల గెంటితో రెండు మూడుసార్లు కలబెట్టి, దేవేసి, నూనె అంతా వొడిగినంక వెడల్పుగా వుండే డబరాగిన్నెలోకి వేస్తా వుండాడు. అది బూందీ అనుకుండాం. ఇంగోగాయప్ప వొగపెద్ద ఇనపగోళంలోకి సుమార్గ నీళ్లుపోసి, దాంట్లోకి అర్ధం డబ్బా చక్కిరి పోసి కలబెడతా వుండాడు. పొయ్యిలో మంట బ్రమ్మాండంగా మండుతా వుంది. రోంత సేపటికే చక్కిరి పాకు తయారయ్యింది. ఆ పాకులోకి వేడివేడి బూందీని పోసి కలబెట్టసాగినారు. అంతా బాగా కలిసినంక దాంట్లో యెందో తెల్లని వుంటలేసినారు. అది పచ్చకర్పూరమంట! అదేసినంక, మల్లా రోంతసేపు కలబెట్టి, పేపర్లు పరిచిండే వెదురు గంపలోకి పోసినారు. అంతకు ముందే వొగ గంపనిండా తయారుచేసి పెట్టినారు. అది లడ్డుబూందీ అని కొండిగాడు చెప్పినాడు. అది వానికెట్ల తెలుసునో యేమో అనుకుండాను.
అట్ల, లడ్డు బూందీ నాలుగైదు గంపలనిండా చేస్తారేమో! రేపు ఎర్రెమ్మ పెండ్లికి పోయి భోంచేసే వాళ్లందరికీ ఈ లడ్డు పెడతారేమో! తినేటప్పుడు, అన్నం పెట్టినట్ల దండిదండిగా పెడతారా? లడ్డు తినేకి బ్రమ్మాండంగా వుంటాదేమో అని ఆశపడతా తడకల సందుల్లోనుంచి చూస్తా నాలుకలు చప్పరిస్తా వుండాం. అంతలోనే నాగిరెడ్డిమామ ఈతబర్ర చేతిలో పట్టుకొని “లే యెవుర్రా ఆడీ” అని అరుచుకుంటా వొచ్చి వొగ పీకు పీకినాడు. బర్రదెబ్బ కొండిగానికి తగిలింది. అందరమూ ఆట్నుంచీ పరిగెత్తినాం. పరిగెత్తి పోతావుండే మమ్మల్ని చూస్తా “యేమోరు, మడ్డ్ద పనుందా ఈడ! ఈ సారి రాండి, మీ కత చెప్పుతాను” అని తిట్టబట్టినాడు నాగిరెడ్డి.
కొండన్న గానికి తగిలిండే దెబ్బ నాకు తగిలింటే, ఇంటి కాడ అమ్మయ్య చూసి, శానా బాధపడతా నన్ను సుమార్గ తిట్టిండేది! ఆ పొద్దు బండితోపులో నుంచి కింద పడిండే శెనిక్కాయి మండలు తీసుకున్నెందుకు ఎంత గొడవైంది? ఇంగెప్పుడూ ఇట్లా యీనం పనులు చెయ్యకూడదని అనుకుంటా ఇంటికొచ్చినాను.
పొద్దన పదకొండు గంటలకు ఎర్రెమ్మ పెండ్లి అయిపోయిందంట. అయిపోతానే భోజనాలుంటాయని తెలిసి అమ్మయ్య మమ్మల్ని పిల్లోళ్లను ఎవుర్నీ బజారుపక్క పంపీలేదు. నేను ఇంటికాడే, చెట్టుకింద, చాప మింద కుచ్చోని చదువుకుంటావుండాను. అమ్మయ్య ఆడపిల్లోళ్ల తలకాయలు దువ్వుతా, పేన్లు చూస్తా, పేండ్లు గుడ్లు పెట్టినాయని ఈరి మానితో ఈరుస్తావుంది. ఈర్సినప్పుడల్లా వెంకటలక్ష్మి అబ్బా సన్నగ మా అని అంటావుంది.
మా ఇంటెనక సందుగుండా యెగవగేరోళ్ళు మాట్లాడుకుంటా పోతావుండారు. “పెండ్లొంటలు బలే బాగచేసినారు! లడ్డు బూందీ బొగు రుసిగా వుందోరు! మనూర్లో ఇదే మొదటి లడ్డుపెండ్లి! నాగిరెడ్డి బిడ్డపెండ్లికి బాగ కర్చుపెట్టినాడు! లడ్డేమో బలే బాగుంది మామా! కానీ వొడ్డిచ్చేవాళ్లే, శానా ఇరుకు సేతుల్తో చూచ్చూసి వొడ్డిచ్చినారు, మల్లా అంతద్దుమానంగా వొడ్డిత్తే యెట్ల మామా? పెండ్లి భోజనమన్నెంక తలా పిటికెడన్నా లడ్డు పెట్టకుంటే యెట్ల! రొండోసారి అడిగిందే ల్యా! ఇంత కర్చుబెట్టి పెండ్లి జేసినోడు, తినే లడ్డు కాడ అంత బిగబట్టి బిగబట్టి పెడితే యెట్ల మామా? పెడితే, తిన్నోళ్లు రొన్నాళ్లు తల్సుకోల్ల” వాళ్ల మాటలింటా, పెండ్లికి పోయినోళ్లకు లడ్డు సరిగా పెట్టలేదని తెలుసుకుండాను.
సాయంకాలం జతగాళ్లతో ఆట్లాడుకుండేకి బయటికి పోయినాను. ఈడిగోళ్ళ కొండన్నగాడూ జానగొండ నారాయణగాడూ పెండ్లికిపోయి లడ్డు తినొచ్చినామని, చానా పీసినోళ్ళు, తలా పిడికెడన్నా లడ్డుబూంది పెట్టల్యా అంటా అంగలార్చినారు. నువ్వెందుకు రాలేదురా అని వాళ్లు అడగలేదు, నేను చెప్పలేదు. సంతకనుం వంక ఇసకలో రోంతసేపు జతగాళ్లతో కలసి ఆడుకుండాను. రాత్రి పెండ్లి కూతుర్నీ, పెండ్లి కొడుకునూ ఎద్దులబండి మింద కూర్చోబెట్టి మెరవణి చేస్తారని జతగాళ్లు చెప్పినారు. అందరమూ మెరవణి కాడ కలుసుకుందామని అనుకుండాం.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
