[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]
పెట్రోమ్యాక్స్లైటు – వొగ అద్భుతం!
నేను పొద్దు మునగక ముందే దొడ్లోకిపోయి గడ్డివామిలో నుంచి నాలుగు కట్టల్ని పీకి మోపు గట్టుకోని వొస్తా చావిట్లో లైట్ల తిమ్మన్న మామను చూసినాను. ఒగడే వుండాండు, బిరీన వొచ్చి మామ దగ్గర కుచ్చుంటే ఆ లైట్లు యెట్ల పనిచేస్తాయో అడిగి తెలుసుకోవచ్చు. పీర్ల పండగనాడే మామ దగ్గరికిపోయి అంతా తెలుసుకోవల్లనుకొని, ఆ గలాటాలో కష్టమని వద్దనుకుండాను, ఎన్నిసార్లు ఇంటికాటికి పోయినా ఆ మామ యెప్పుడూ దొరకలేదు ఈ పొద్దు వొగడే వుండాడని బిరబిరా ఇంటికిపోయి గడ్డిమోపు కొట్టంలో యేసి, అమ్మయ్యతో చెప్పి, చావిడి కాటికి పరిగెత్తిపోయినాను.
మాకు మామ వరసయిన లైట్ల తిమ్మన్న, చావిట్లో కుచ్చోని పెట్రోమ్యాక్స్ లైట్లనూ, డూము లైట్లనూ రెడీ చేస్తా వుండాడు. నాకు ఆ లైట్లను చూసినప్పుడల్లా భలే ఆశ్చర్యమయితాది. మామ ఇప్పుడు తీరుబడిగా వుండాడని సంతోషపడతా పలకరిచ్చి, మామ దగ్గర కుచ్చుండాను.
నాకు తిమ్మన్న మామంటే భలే సంబరం. వరసయినోళ్లు యెవురు కనిపిచ్చినా జాంతానమాడతా బాగా నవ్విస్తాడు. నేను దగ్గర కుచ్చుంటానే తమాషాగా మాట్లాడతా, వొగ హ్యాండలుండే లైటునూ, రెండు డూము లైట్లనూ యెలిగిచ్చేకి రెడీ చేస్తావుండాడు. నేను ఆ లైట్లను గురించి ఆసక్తిగా అడుగుతావుంటే, ‘యేమోయ్, నువ్వూ లైట్లు తెచ్చి నాకు పోటీగా రావల్లనుకుండావా?’ అని కువాడమాడతా, పెట్రోమ్మాక్స్ లైట్లో వొక్కోభాగం పేరేమిటో అది యెట్ల పనిచేస్తాదో చెప్పుతా, తన పని తాను చేసుకోసాగినాడు.
పెట్రోమ్యాక్స్ లైట్ కిందభాగంలో చిన్న కుండమాదిరుండే ట్యాంకులో రెండు సీసాల గబ్బునూనె (కిరసనాయిల్) పోసినాడు. గాలిగొట్టే పంపులోవుండే బుష్ సరిగా వుందో లేదో సరి చూసినాడు. కిరసనాయిల్ బయటకి రాకుండా వాల్పిన్ సరిచేసినాడు. ప్లేటుజులా పైనుండే గ్ల్యాస్ కవర్ బయటికితీసి శుభ్రంచేసినాడు. కంపెనీ ఫిక్స్చేసిండే ఎల్ పైపునూ, బెండ్ పైపునూ నిగాగ చూసినాడు. బెండ్ పైపు పైభాగంలో పైపుకు బిగిచ్చిన ఇత్తడి నాజల్, దానికిందుండే మట్టి నాజల్ను, చూసి నేను నోరెల్ల బెట్టినాను, నేను చూస్తావుండంగనే తిమ్మన్న మామ వొగ ప్యాకెట్లోనుండి చిన్న వలమాదిరిగా, గొర్లోళ్ల సద్ది చిక్కెం మాదిరిగా, మెత్తని సిల్కుదారాలతో అల్లిండే వొగ బుల్లి గండ్లసంచిని తీసి, అది లైటువొత్తి అని చెప్పి, దాన్ని మట్టి నాజల్కు తొడిగిచ్చి, దానికే వొచ్చిండే దారంతో బిగిచ్చినాడు. కిరసనాయిల్ ట్యాంక్ బయటుండే పంపుతో శానాసేపు గాలికొట్టి, నాజల్ను మెల్లగా తిప్పుతా అగ్గిపుల్ల గీసి అంటిచ్చినాడు. గుప్మని అంటుకొని, మంట పైకిలేచింది. పైపు గుండా వేపరైజర్ ఎక్కువగా పోతావుందని చెప్పి, నాబ్ను తిప్పుతా తగ్గిచ్చి క్లీనింగ్ పిన్నుతో మెల్లగా తాకిచ్చినాడు. వెంటనే తెల్లనికాంతితో లైటు వెలగసాగింది. అద్భుతమయిన వెలుగు! ఆ వెలుగులో నుండి సురు అంటా శబ్దం! నేను ఆశ్చర్యంతో చూస్తా మురిసిపోయినాను. ఇదంతా తిమ్మన్న మామ నాకు పాఠం మాదిరి చెప్పుతావుంటే నేను శ్రద్దగా విన్నాను.
‘అంతా తెల్లోని, ఇంగిలీసోని మహిమోయ్!’ అని దాన్ని కనిపెట్టినోన్ని మెచ్చుకుంటా, డూమ్ లైటును రెడీ చేయసాగినాడు. ఈ డూము లైట్లో బెండ్ పైపు వుండదని, పైభాగంలో కిరసనాయిలు పోసే ట్యాంకు, ఇత్తడితో చేసిండే ట్యాంకు పెద్ద రింగ్ మాదిరి రౌండుగా వుంటాదని, ఈ ట్యాంకు వొగ పక్కనుండే ఈ పంపుతో గాలికొట్టల్లని, కుండమాదిరి కిందుండే కిరసనాయిల్ ట్యాంక్ పైన, పెట్రోమ్యాక్స్ లైట్లో వుండే బెండ్ పైపూ ఎల్ పైపూ మట్టి నాజల్, ఈ డూమ్ లైట్లో వుండవని, మిగతాగ్లాస్ కవర్, చిక్కెం మాదురుండే వొత్తీ నాబ్ అవన్నీ వుంటాయని, మూడు కాళ్ల స్టాండ్ కింద బిగిచ్చిండే ఈ లైట్నే డూమ్లైట్ అంటారని, మూడు కాళ్ల స్టాండ్ కింద వొగ చెక్క పలకను బిగిస్తారని ఆ పలకే యిది అని పలకను చూపిచ్చి, పెండిండ్లప్పుడు రాత్రిపూట మెరవణిలో, జాతర్లలో ఈ డూమ్ లైటును భుజం మింద తలకాయల మింద యెత్తుకొని మనుషులు మోస్తా నడుస్తారని, పేట్రోమ్యాక్స్ లైట్లూ, డ్యూమ్ లైట్లూ రాకముందు మనూర్లో మాదిరే అన్ని పల్లెల్లోనా మెరవన్లకూ, జాతర్లకూ రాత్రిపూట దివిటీలుండేటివని అంతా వివరంగా చెప్పినాడు తిమ్మన్న మామ. దివిటీలంటానే, వూర్లో జానగొండ పెద్దనారాయణా, కొత్త కురవోళ్ల లింగన్నా, ఇంగా ఇద్దురు ముగ్గురి పెండ్లిండ్లప్పుడు. పెండ్లి మెరవణిలో చాకల చౌడక్క కొడుకులు దివిటీలు పట్టుకోనుండేదంతా మనసులో మెదిలాడింది.
చాలా దినాల్నుంచి తెలుసుకోవల్లని అనుకోనుండే పెట్రోమాక్స్ లైట్ల సంగతి తెలుసుకున్నెందుకు సంతోషపడతా, బడగొర్ల నాగిరెడ్డోళ్ల పెండ్లిమెరవణి మొదలయ్యేకల్లా బువ్వ తిని రావల్లని ఇల్లు చేరుకుండాను.
ఎద్దుల బండిమీద పెండ్లి మెరవణి!
ఎనిమిది గంటలకల్లా పెండ్లిమెరవణి ప్రారంభమయింది. బండికి దేశెపెద్దులు కట్టినారు. అంతకు ముందే బండినీ ఎద్దుల్నీ అలంకరించినారు. బండి పరమ మీద అడ్డంగా వొగ చెక్క పలకను బిగిచ్చి దానిమింద భవానీ జంఖానం పరిచినారు. పెండ్లి కూతురూ, పెండ్లి కొడుకూ కొత్త బట్టలు కట్టుకొని జంఖానం పరిచిండే పలకమింద కుచ్చుండారు. ఇద్దరి మెడల్లో నక్కీలేసి కూర్చిండే పెద్ద పూలహారాలేసినారు. ఎర్రమ్మ పట్టుచీర కట్టుకోనుంది. నడుముకు బంగారు డాబు పెట్టుకుంది. గొంతులో వేసుకోనుండే రాళ్ల నెక్లీస్, ఐదు సరాల బంగారు గొలుసూ పూలహారాల మధ్యలో నుంచీ కనిపిస్తావుండాయి. జడలో నాగరా, బిల్లా, పాపిటలో నుంచీ నుదిటి మిందికి వేలాడే బంగారు పొపిటబిల్లా, రెండు చేతుల రెట్టల మింద రాళ్ళు పొదిగిచ్చేండే బంగారు వొంకీలూ, చేతుల్లో నాలుగు నాలుగు గాజులూ అన్నీ లైట్ల వెలుతుర్లో తళతళ మెరుస్తా వుండాయి. బజార్లో జనమంతా ఆ బంగారు నగల్ని జూసి ముక్కుల మింద వేలేసుకుండారు.
మెరవణి బండి చావిడి దగ్గరికొచ్చి నిలబడింది. మంగళవాద్యాలు బ్రమ్మాండంగా మోగుతా వుండాయి. ఆడ కట్టిసాము మొదలయింది. మావూరికి మామూలుగా గాజులు అమ్మేకి వొస్తావుండే అసానప్పా, మావూరి బోయోళ్ల నాగప్పా ఇద్దరూ కట్టిసాము చేసినారు. వాళ్లిద్దరూ పందెం కోళ్ల మాదిరి కట్టిసాము చేస్తావుంటే, చూసేకే భయమయింది నాకు. ఇద్దర్లో వొగడు యామారినా రెండో మనిషి, వొడుపుగా కొట్టే బోనాకట్టి దెబ్బకు తలకాయి పగలగొట్టిచ్చుకోవల్సిందే అనిపిచ్చింది. ఇద్దరూ కట్టిసాము చేసినంక అసానప్ప వొక్కడే చేతితో కట్టి తిప్పుతా వుంటే అది, చక్రం తిరిగినట్ల తిరుగుతా వుంది. చేతిలో బోనాకట్టి అట్ల తిరిగే తప్పుడు రాళ్లు విసిరినా చెట్మని యెగిరి పోతాయంట! ఆయప్ప కట్టెను ముందు వైపున యెంత స్పీడుగా తిప్పుతాడో చెయ్యి వెనక్కి, వీపుపక్క తిప్పి, అంతే స్పీడుగా తిప్పుతావుంటే, రెండు చేతుల్లోనా రెండుకట్టెలు పట్టుకొని, వొగదాన్నొకటి తగలకుండా అంతే వేగంగా తిప్పుతావుంటే జనం చూసి అశ్చర్యపడతా చప్పట్లుగొట్టి కేకలేసినారు. నేనయితే ఆ కట్టి సామును చూసి ఎంత గొప్ప విద్యయిది అని ఆశ్చర్యపోయినాను. ఇంతద్భుతంగా కట్టిసాము నేర్చుకున్నోన్ని, ఐదారుమంది వొచ్చి యెదిరిచ్చినా యేమీ చేసుకోలేరేమో అనుకుండాను.
కట్టిసాము అయి పోయినంక ఇరుసులెత్తే ఆట మొదలయింది. అక్కడ మూడు ఇరుసులు తెచ్చేసినారు. ఒంటిరుసు, రెండిరుసులను జమటగా తాపిచ్చిన ఇరుసు, మూడిరుసులను వొగటిగా తాపిచ్చి చేసిన ఇరుసు, అట్ల మూడు ఇరుసులు తెచ్చేసినారు. ఒంటిరుసు సుమారు యాభై కేజీలు, రెండిరుసుల జమట తొంభై తొభైఐదుకేజీలు, మూడిరుసుల జమట నూటా నలభైకేజీలు బరువుంటాయంట! వయసొచ్చిండే దూడపిల్లోళ్లు, న్యాలమింద పండేసిండే వొంటిరుసు వొగ మొనను వొంటి చేతితో పట్టుకొని ఈడ్చి పైకి లేపి, రోంతసేపు గాలిలో నిలబెట్టి కిందికేసినారు. నాలుగైదు మంది చేత్తో గాలిలో రోంతసేపు నిలబెట్టి ఆనెంక ఆ యిరుసును చేతితోనే పైకి యెగేసి గాల్లోనే రెండో కొనను పట్టుకుండారు. అట్లపట్టు కున్నెప్పుడు వాళ్ళమోచేతుల పైనుండే కండరాల్లో నరాలు ఉబ్బుకుండాయి. ఒంటిరుసును ఎత్తేది అయిపోయినంక జనం మధ్యలోకి రెండిరుసుల జమటను వేసినారు. దాన్ని వొంటిరుసును ఎత్తినట్టే బోయోళ్ల సజ్జల రాంపుల్లయ్య ఎత్తినప్పుడు అందరూ చప్పట్లు కొట్టినారు. రెండిరుసుల జమటనూ రాంపుల్లయ్యతోపాటు ఇంగొక్కడే ఎత్తినాడు. ఆనెంక మూడిరుసులపై జమటను ఇద్దరు బలమైన మనుషులు కష్టపడి మనుషుల మధ్యలోకి తెచ్చేసినారు. ఇద్దరు ముగ్గురు ఆ యిరుసు మొనను కొనలాగి పైకి లేపడానికే సాధ్యం కాలేదు. అట్లాదాన్ని బోయోళ్ల సజ్జల రాంపుల్లయ్య తన బలాన్నంతా ఉపయోగిచ్చి లాగి పైకిలేపి గాల్లో నిలబెట్టి మొనగాడని పిచ్చుకుండాడు. నాగిరెడ్డి మామ, రాంపుల్లయ్య మెడలో పూలహారమేసినాడు. బోయోళ్ళంతా కేకలేస్తా రాంపుల్లయ్యను పైకెత్తినారు.
ఇరుసులెత్తేది అయిపోయినంక పెద్ద నల్లగుండును జనం మధ్యలోకి దొర్లిచ్చుకుంటా వొచ్చినారు. ఆ గుండు బరువు ఇన్నూరు కేజీ లంట! ఆ గుండును ఐదారు మంది యువకులు తెచ్చినారు. ఇద్దరు కష్టపడి జానెడెత్తు పైకి లేపినారు. ముగ్గురు నలుగురు మోకాళ్ళ వరకు పైకి లేపి కిందికేసినారు. వడ్డె శ్రీరాములు, సజ్జల రాంపుల్లయ్య కష్టపడి నడుముల వరకు పైకి లేపి కిందికేసినారు. నాగిరెడ్డి పిలిపిచ్చినాడేమో శివపురం నుండి పట్రోళ్ల చిన్న వెంకటస్వామి వొచ్చినాడు. జనం మధ్యలోకొచ్చి అంగీ ఇప్పి పక్కకేసి, నడికట్టు గట్టిగా బిగిచ్చినాడు. వొగ టవ్వాల తీసుకొని రెండు మొనలనూ అరచేతులకు చుట్టుకొని గుండు కిందికి దూర్చి గుండును వొక్కపూపుతో పైకెత్తి కొంచెం వెనక్కి వొంగి దొమ్మల మిందనుండి గుండును పైకి జరుపుకుంటా భుజమ్మిందికి ఎత్తుకొని వెనక్కి నూకినాడు. అందరూ అబ్బురపోతా చప్పట్లుకొట్టినారు. నాగిరెడ్డి మామ ఆయప్ప మెడలో గుడకా పూలహారమేసినాడు. చక్రాయపేట నల్లపరెడ్డి గుడకా ఈ గుండునూ, ఇరుసునూ ఎత్తేదాంట్లో పేరుమోసినోడు. ఈ నాగిరెడ్డోళ్లకూ, నల్లపరెడ్డోళ్లకూ సరిపోదు. అందుకే ఆయప్ప రాలేదు.
ఈ ఇరుసులెత్తేదీ, గుండెత్తేదీ చూసినంక నాకు ఆశ్చర్యమైంది, మా వూరోళ్లూ, మా కట్టకింద పల్లెలోళ్లూ ఎంత బలవంతులు! ఎంత నైపున్నెముండేవాళ్లు? పూర్వం భీముడు వాళ్ళమ్మయ్య వొడిలో నుంచి జారి బండమింద పడితే ఆ బండ పగిలి పొయ్యిందంట! ఇదంతా చూస్తావుంటే అది నిజమే అయ్యింటాదేమో! అనుకుంటావుంటే మా చెరువులో మరవ దగ్గరుండే వడ్డిమాన్రాయి గుర్తుకొచ్చింది. అది పండగలప్పుడు కోడెగిత్తలో, ఎద్దులో లాగే సోగబండంత వుంటాది. అట్లాంటి సోగబండను వొగ వడ్డెవాళ్లాయప్ప వొగడే బండ్లో యేసుకొని పోతావుంటే ఆ బరువుకు తట్టుకోల్యాక ఆ బండి యిరిగి పొయ్యిందంట! ఇరిగి పోతానే ఆ సోగబండను ఆ వడ్డోళ్ళమనిషి పక్కకు నూకి పోయినాడంట! అప్పటినుంచీ దాన్ని వడ్డిమాన్రాయి (వడ్డెవాని రాయి) అని అంటా వుండారంట! ఆ రాయిని తలుసుకుంటా వుంటే మా వూరి మంటిపుల్లప్ప గ్నాపకమొచ్చినాడు.
సమ్మత్సరానికి మూడు సార్లే స్నానం చేసే మా వూరి మంటి పుల్లప్ప
మావూరి మంటి పుల్లప్ప కురవోళ్ళాయప్ప! మా దేవరకొండకు పసులు తోలుకొని పోయి కాసుకొని వొస్తాడు. మా నాయనకంటే పదీ పదైదేండ్లు పెద్దోడంట! ఇప్పుడు సుమార్గ డెబ్బైయేండ్లు వుంటాయంట! నేను చిన్న పిల్లప్పట్నుంచీ చూస్తావుండాను. ఆయప్ప మంచి చలికాలం గుడకా పయిమింద అంగీ తొడుక్కోడు. మోకాళ్లదంకావుండే దప్పమయిన సల్లడం తొడుక్కోని లాడీలతో నడుముకు బిగిచ్చుకొని దిగుముడి వేసుకోనుంటాడు. లాడీలు కిందికి యాలాడుతావుంటాయి, తలకాయి మింద అడ్డంగా ముతక కంబడి యేసుకుంటాడు.
మంటిపుల్లప్ప మామ, సమ్మత్సరానికి మూడుసార్లే స్నానం చేసేది. ఉగాది పండగప్పుడూ, సంకురాత్రి పండగప్పుడూ, పీర్ల పండగప్పుడూ, అంతే! డెబ్బైయేండ్ల కాలంలో యానాడేగానీ దగ్గిందీ లేదు, తుమ్మిందీ లేదు! జ్వరమంటే యేందో తెలీదంట! దినామూ రాగిసంగటే తినేది? అమ్మిడి పొద్దప్పుడు ఏడు రాగిముద్దలు సులకాగా తింటాడు. పండగలప్పుడు చిన్నబక్కీటు నిండా పరమాన్నం తాగి చాట బువ్వ తింటాడు. వొగసారి పందెం వేసుకొని చాటెడు పూర్ణకుడుములూ, ముంతెడు పరమాన్నమూ, చాటెడు అన్నమూ తిని పందెం గెలుసుకుండాడంట! అట్లావాడు గుండ్లు ఎత్తేదీ, ఇరుసులెత్తేదీ నేర్చుకోనుంటే యా ఉత్సవాలకు పోయినా సులకాగ పందెం గెలుసుకోని రాగలిగేవాడని వూరంతా అనుకుంటారు.
ఆ మంటి పుల్లప్ప పశువులు కాసేకి దేవరకొండకు పోయి వొగనాడు కొండ శిగలో ఎండిపోయిన యాపచెట్టును కింద బుటానికి గొడ్లితోకొట్టి కిందపడేసి కొమ్మలూ రెమ్మలూ అన్నీ నరికేసి, పండెండు అడుగుల ఎత్తూ, రెండడుగుల మందమూ వుండే ఆ యాపమొద్దును నిలబెట్టి, వీపుకు కరిపిచ్చుకొని సులకాగ కొండ దిగి వూర్లో కొస్తానే జనమంతా చూసి అబ్బురపోయి నారంట! అట్లాంటివాడు మా మామ మంటిపుల్లప్పను తలుచుకుంటే యెంటికలు నిక్కబొడుచు కుంటాయి. పాతకాలం మనుషులు అంతబలమైన వాళ్లు కాబట్టే మా శింగనమల చెరువు కట్టను కట్టేటప్పుడు అంతంత పెద్ద రాతి బండల్ని ఎత్తింటారని అనుకుంటా, నాగిరెడ్డోళ్ళ పెండ్లి లడ్డు తినకపోయినా, మెరవణిలో ఇరుసులూ, గుండ్లూ ఎత్తిండే మా వూరి మొనగాళ్లను తలుచుకుంటా సంతోషంగా ఇంటికొచ్చినాను.
ఐదో తరగతిలోకి నేను, చెరువులోకి నీళ్లు
నేను ఐదో తరగతిలో చేరినాను. మరుసటి దినం నుంచీ నాలుగు దినాలు బ్రమ్మాండంగా వాన కురిసింది. మా శింగనమల చెరువులోకి దండిగా నీళ్లొచ్చినాయి. వొచ్చిండే నీళ్లు వొగపంటకు సరిపోతాయని ఇంగా ఆరెద్దుల (ఆరుద్ర) కార్తేనని, వానలొచ్చే కార్తెలు ఇంగా చాలా వుండాయని ఈసారి మాగాణి కింద యిబ్బంది ల్యాకుండా రెండు పంటలూ పండుతాయని రైతులందరూ మాట్లాడుకొని చెరువు తూములెత్తిచ్చి మళ్ళల్లో శాడకేసి నార్లుపోసినారు. పోసిండే నలభై దినాలకే మళ్లు నాటినారు. నాటిన నాలుగయిదు దినాలకు నాలుగు వానలు బాగాపడడంతో అందరి మళ్ళల్లోనా చినుకులకు నానిన వరినాట్లన్నీ పచ్చగయినాయి. చూస్తా చూస్తావుండంగనే కొత్త పిలకలు పుట్టి గంటలు గంటలు పగిలి, మడికయ్యల్లో నీళ్లు కనిపిచ్చకుండాయి.
నేను దినామూ పొద్దన బడి వొదుల్తానే వొగసారీ, సందకాడ వొగసారీ మడికాటికి పోకుండావుంటే మనసు నిమ్మలంగా వుండదు. మా దొడ్డికాడ ఇరుక్కంతు దాటి, శింగనమలకు పోయే గడ్డదావ మింద వొగ ఫర్లాంగు దూరం పోతానే ఆ దావ (త్రోవ) రెండుగా చీలిపోతాది. ఎడమ పక్కదావ, చాకిరేవుగుట్ట పక్కనెళ్లి శింగనమలకు పోతాది. కుడిపక్క దావ పగ్గం పొడవయినంక కట్టదిగి రుద్రవరం వెంకట్రామయ్యోళ్ళ మడికీ, మంచికంటి చిన్న రంగయ్యోళ్ల తగ్గుమడికీ మధ్యలో గంగయ్య బావి పక్కనుంచి గోవిందరాయనిపేటకు పోతాది. గంగయ్య బావి, తలిపిరి బావి. అది ఎండకాలంలో గుడకా చిన్నగ పారుతావుంటాది. ఆ తలిపిరి కాలవగట్టు గుండా ముందుకుపోతే రుద్రవరం సూరయ్యోళ్ల జొన్నుమడి వస్తాది. ఆరెకరాల ఆ మడి చుట్టూరా కాలవే! దాని తూరుపు గట్టు గెనుము గుండా ముందుకు పోతే, పైన్నుంచీ వచ్చే మళ్ళమీది నీళ్లూ చాకిరేవుగుట్ట బుగ్గనీళ్లూ అన్నీ కలిసి వొగ వంకమాదిరి పారుతా వుండాయి. ఆ కాలువ, మాగాణి పంటలప్పుడు ఎప్పుడు చూసినా మోకాలిలోతు నీళ్లతో పారుతా వుంటాది. అట్ల పారే నీళ్లను యాకాలంలో యా పెద్దోళ్లు ఏర్పాటు చేసినారో యేమో, రెండు కాలువలకు మళ్లించి, వొగటి సోదనపల్లి కాలువలోకి, ఇంకొగటి పోతురాజుకాలువ గ్రామ పొలాలకూ పొయ్యేటట్ల చేసినారు.
నిక్కర పైకెత్తుకొని ఆ కాలువలో దిగి, నిరుడు ఈ నీళ్లన్నీ యాడుండెనో అనుకుంటా, కాళ్లను దొబ్బుతా వుండే నీళ్లను చూసి నవ్వుకుంటా, అవతల గట్టెక్కినాను. గట్టు సుమారుగ బయలుగా వుంది. ఆ చుట్టు పక్కల వాళ్లందరూ మళ్లు కోసినప్పుడు ఇక్కడే కల్లాలు వేసుకుండేది. గట్టు పక్కనే, మరవంకలో నుంచీ వచ్చే సోదనపల్లి కాలువ మీదుండే పెద్ద వుద్దిబండ దాటి పైకెక్కుతానే మోతలగడ్డ! మా వూరి మడికట్లు అన్నిటిపైకి బ్రమ్మాండమయిన భూములు మోతలగడ్డ పొలాలే అని అందరూ అంటా వుంటారు. మోతలగడ్డ దాటుతానే చెరువు మరవ వంక! నేను మోతల గడ్డ మీద అడుగు పెట్టి, ఉత్తరం వైపుండే గోవిందరాయుని పేటకు పోయే దావ గెనుము మీదికెక్కినాను. దావ గెనుము పక్క నుండే మా ఎలకంటి పాపయ్యోళ్ల మడికయ్యల్లోని వరిపైరును చూస్తానే మనసు పొంగిపొయ్యింది.
నిన్నలేని అందమేదో పైరుమీద కాంతి తెరలు తెరలుగా పారాడతా వుంది. పట్టెలు పట్టెలుగా వుండే పచ్చని చీరను మోతలగడ్డనిండా యెవురో ఆరేసినట్లుండాది. నేను గెనుము దావెంట మరవ వంక వరకూ పోయి మడిలో నిలువు గెనాలూ, అడ్డగెనాలు అన్నీ తిరిగి అక్కడక్కడ పడిన చిన్న చిన్న గుమ్మళ్లను కాళ్లతో తొక్కి పూడ్చి, మళ్ళీ పైపక్కకు వొచ్చినాను. అంతలోనే లింగనపల్లి చెన్నారెడ్డి చిన్నాయన యూరియా మూటెత్తుకొని వొచ్చి, దావ గెనుము పక్కన దించి, నన్ను చూసి, ‘యేమి సన్నా నారాయనీ, ఈసారి మొత్తం మోతలగడ్డపైకీ మీ పంపేరా, బొగు నాన్నెంగా వుండేది! గొర్లమంద, పచ్చిమంద తోలీడం వల్లనోయేమో పైరు శానా సొగుసుగా వొస్తాంది. నువ్వు గుడకా దినామూ వొచ్చి, గెనాలన్నీ తిరిగి, యాడే గానీ గుమ్మళ్లు పడకుండా సూత్తా, నీళ్లు కయ్యల్లో నాలుగు మూలలా సక్కరమంగా ఆల్తిగా పారేతట్ల సేత్తా వుండడం వల్లనే పాపోడా, మడి ఇంత బాగుండేది’ అని నన్ను మెచ్చుకుంటా, యూరియాను వొగ డబరా గిన్నెలోకి వొంచుకొని, గిన్నెను ఎడమ చేతితో కడుపు ఎడమ పక్కకు ఆనిచ్చుకొని కుడిచేయి పిడికిలితో యూరియాను తీసుకుంటా మడి కయ్యల్లో చల్లుకుంటా ముందుకు పోతావుండాడు.
నేను మా మడికయ్య మోట్లో వుండే హద్దురాయి మీద కూర్చొని చుట్టూరా వుండే మాగాణివైపు చూస్తా వుంటే శరీరం నిండా యాలనో చెప్పలేనంత సంతోషం పొంగిపోసాగింది. ప్రతి సమ్మత్సరమూ ఇట్ల చెరువు నిండితే మాగాణంతా వరి పైర్లతో ఎంత బాగుంటాదో! ఈ పల్లెల వాళ్ళంతా ఎంత సంతోషంగా వుంటారో! ఇంత పెద్ద మాగాణి! చూట్టూరా యా పక్క జూసినా పచ్చగా కలకలలాడతా ఎంత బాగుందో! ఇంత పెద్ద చెరువును ఎవురో మహాను భావుడు శ్రీరంగదేవరాయలు కట్టిచ్చినాడంట, ఎప్పుడు కట్టిచ్చినాడో! చెరువు కట్టిచ్చినప్పటికే చెరువు కింద మాగాణి మూడువేల ఎకరాలని మొత్తం రాయలసీమలోనే కంభం చెరువు. బుక్కపట్నం చెరువుల తర్వాత ఈ చెరువే పెద్దదని నాయన చెప్పుతా వుంటాడు.
రాయల సీమంటే యాటి వరకూ వుందో! ఆ చెరువులన్నీ యెక్కడుండాయో! అవెట్లుం డాయేమో గానీ ఈ చెరువును మాత్రం, ఉత్తరం పక్కా దక్షిణం పక్కా వుండే కొండలకు ఆనిచ్చి ఎంత బాగ కట్టిచ్చినారో! చెరువు కట్టడానికంటే ముందు, ఆ తడకలేరు, ఈ మరవంక గుండా పోతావున్నేమో! ఆ వంక, ఈ మోతల గడ్డకు ఎగవన రెండు పాయలుగా చీలి పారడం వల్లనేమో, వొండుమన్నంతా పేరుకొని ఇదొక దిబ్బమాదిరి యేర్పడినట్లుండాది! వొండుమన్ను అయినందు వల్లనేమో, ఈ మోతలగడ్డ మళ్లు, మొత్తం మాగాణి పైకీ మంచి సత్తవైన భూములని అంటా వుంటారు.
పడమటి దిక్కునుంచి తూర్పు దిక్కుకు కోడిగుడ్డు మాదిరి కనిపిస్తావుండే ఈ మోతల గడ్డ మొత్తం యాభైరెండెకరాలంట! చెరువు మరవ దగ్గరుండే తూము గుండా పారే పెద్ద కాలువ, గుట్టదడి వారగా శివపురం దాటుకోని వొచ్చి, పిల్లిగుండ్లకాడ మా వూరి పొలాలకు తిరిగేచోట వొగపెద్ద తీరుపెట్టినారు. ఆ తీరునుంచి దుముకి వొచ్చేనీళ్లు వొగ సపరేటు కాలవ గుండా సోదనపల్లి యేటికాలవ పైన్నుంచీ ఇవతలికి వొచ్చేకి ‘ఉద్ది’ ఎంత అద్భుతంగా కట్టినారో, ఆ ఉద్ది వరకూ సాగొచ్చిన మా మోతలగడ్డ కాలువే శివపురం మాగాణికీ. మా వూరి మాగాణికీ హద్దంట! పూర్వకాలం నుంచే మా మోతలగడ్డ కాలువకు సపరేటుగా వొగ నీరుగట్టోన్ని ఏర్పాటు చేసినారంట! ఇట్లాటి గడ్డలో వొగ రెండెకరాలు మాకు సొంతముంటే ఎంత బాగుండేదో!
ఆలోచన చేస్తా లింగనపల్లి చెన్నారెడ్డి చిన్నాయన వైపు చూసినాను. మడి కయ్యల్లో ఆ చిన్నాయన చల్లుతావుండే యూరియా కుప్పలుగా కుప్పలుగా పడతావుంది. ఆ చిన్నాయనకు యూరియా చల్లేది సరిగా రాలేదనుకుంటా. వారం దినాల కిందట నాయన యూరియా చల్లినదాన్ని గుర్తు చేసుకుండాను. నాయనకు డబరాగిన్నెలో యూరియా పోసి నేను అందిస్తావుంటే, యాడేగానీ రెండు రవ్వలు వోకేచోట పడకుండా యెంత అద్భుతంగా చల్లినాడో నాయన! కయ్యలో నాలుగు మూలలా తిరుగుతా పిడికిట్లోని యూరియా రవ్వల్ని విసిరి, చల్లుతావుంటే అవన్నీ సన్నగా, తెల్లగావుండే వడగండ్ల మాదిరి మాటిమాటికీ కయ్యల్లో గలగలగలమంటా పడతావుంటే ఆ శబ్దం ఎంత బాగొచ్చిందో! అట్లే నారకయ్యల్లో మొలకలు చల్లినప్పుడు కూడా ఎంత బాగున్నిందో!
మా చెరువు తూము అద్భుత నిర్మాణం!
అదంతా అనుకుంటా వుంటే వరినారు సంగతులన్నీ గుర్తుకొచ్చినాయి. ఊర్లో పెద్ద మనుషులు చెరువు తూములెత్తే సంగతీ కాలువలు తీసే సంగతి చాటింపేయిచ్చినారు. మరుసటి దినమే రైతులంతా ‘పంగులు’ వేసుకొని పెద్దకాలువ దళ్ళన్నీ (దడులు) నరికి చిదుగూ బొదుగూ అంతా యెల్లేసినారు. రెండెకరాలకు వొగ మనిషి లెక్కన రైతులంతా రెండు దినాలు పోయి కాలువను తీసినారు. పెద్ద మనుషులు కాలువతీసే పనికి పిల్లోళ్ళను వొప్పుకోరని నాయనే పోయినాడు, కాలువ కింద పల్లెలోళ్లందరూ వాళ్ళ వాళ్ళ హద్దుల వరకు కాలువ తీసేదంతా అయిపోయిన మరుసటి దినం పూలూ, పండ్లూ, టెంకాయలూ వొగ కొత్తగంపలో పెట్టుకొని తప్పెట్లూ మేళాలతో పెద్దమనుషులందరూ చెరువు కాటికి బయలుదేరినారు. ఆదివారం కావడంతో నాయన వెంట నేనూ పోయినాను. చాలా దినాల నుంచి చెరువును చూడల్ల చూడల్ల అనుకుంటా వుండే నేను చెరువును చూస్తానే అబ్బురపోయినాను. మరవ పారేకి ఇంగ మూరెడే వెలితుండేది. నాయన నన్ను చేయిపట్టుకొని మరవకట్ట మీదనుంచీ చెరువుకట్టకాటికి పిల్చుకొని పోయినాడు. కట్టెక్కి చూసినాను. కంటి చూపువరకూ నీళ్లే! చెరువు సముద్రం మాదిరి వుందని అందరూ అంటావుంటే సముద్రం యెట్లుంటాదోనని అనుకుంటా నీళ్లను చూస్తా ‘అబ్బబ్బబ్బా’ అని దొమ్మలు కొట్టుకుండాను.
పెద్దోళ్లు పిల్లలెవుర్నీ నీళ్ల దగ్గరికి రానీకుండా చెరువుకట్ట మెటికల మింద మధ్యలో కూర్చోబెట్టి అందరూ తూము దగ్గరికి పోయినారు. అక్కడ బిల్లమాదిరి వొకబావి వుంది. దాని పైన వొగపెద్ద చెక్క దూలం, బావి గోడల్లోకి పొందేసినారు. ఆ దూలం మధ్యలో రోకలి లావంతటి వొగ స్క్రూ పైకి యెల్లుకోని వుంది. ఆ బావికి ఎదురుగా మెటికల అవతల నీళ్లల్లో నాలుగు కాళ్ల రాతిమంటపం వుంది. బావికి ఎదురుగా, మంటపం పైనుండే రాతి దూలం మధ్యలో నుంచీ కింద నీళ్ళలోపలి వరకూ పెద్ద కపిల బావి మోకు మాదిరి పెదింత లావుతో వొగ ఇనప గొలుసుంది. దాన్ని రాతిదూలం పైన రెండు గజాల పొడవుండే ఇనప గడారుకు ముడేసినారు. గడారుకు రెండు పక్కలా రెండు సైజు రాళ్లుండాయి. తూము బావి దగ్గరుండే దడిమింద నుంచీ మంటపం మిందికి అడ్డంగా నిచ్చెన వేసి ఏడెనిమిది మంది పూలూ, టెంకాయలూ, పసుపూ, కుంకుమా తీసుకొని పైకెక్కినారు. కట్టదగ్గర తూముబావి పక్కన నిల్చుకొని మంగలోళ్లూ మేళాలు వూదుతా, మాదిగోళ్లు తప్పెట్లు కొడతావుంటే, మంటపం పైకి ఎక్కినోళ్ళు గంగమ్మకు పూజచేసి టెంకాయకొట్టి పూలూ, పండ్లూ, టెంకాయొప్పులూ పసుపూ, కుంకుమా నీళ్ళలోకివేసి మొక్కుకుండారు.
అక్కడ ఏమి జరుగుతావుందో, తూమును ఎట్ల యెత్తుతారోనని పిల్లోల్లం మేము కండ్లు కొట్టకుండా చూస్తావుండాం. చూస్తా వుండంగనే ‘తల్లీ, గంగమ్మ తల్లీ, అందర్నీ సల్లంగ సూడు తల్లీ’ అని అంటా, ఇనప గొలుసు కట్టిన గడారును ఆ పక్క నలుగురూ ఈ పక్క నలుగురూ పట్టుకొని తమ బలమంతా చూపి కష్టపడి వొగ అడుగెత్తు పైకిలేపి గట్టిగా అరుస్తా గడారు కిందికి రెండు పక్కలా సైజు రాళ్లు జరిపినారు. అంత బలమైన మనుషులు అంత కష్టపడతా అంతబరువుగా గడారును ఎత్తినారంటే, క్రింద యేముందో, దేన్ని పైకెత్తినారో నాకు అర్థం కాక, బావి తూము దగ్గరికి పోయి నాయనను అడిగినాను, నాయన తూమును గురించి అంతా చెప్పినాడు.
రోట్లో అలసంద బ్యాళ్లట్లావి రుబ్బే గుండుకు పైపక్కన గట్టిగా వొగ గుంజను దిగగొట్టింటారు గదా, ఆ మాదిరిగా కోడిగుడ్డు మాదిరుండే వొగ పెద్ద ఇనపగుండుకు పై భాగంలో కొక్కీ వుంటాదంట, ఆ కొక్కీకి బిగించి కట్టిండేదే ఆ గొలుసంట! కింద అడుగు భాగంలో గారతో కట్టిన వొగ రాతిగూడు వుంటాదంట! ఆ గూటి పైన వొగ అడుగు మందముండే పెద్ద కాలుబ్బండను మూసి చుక్కనీరు కారకుండా గారతో మెత్తినారంట, బండ మధ్య భాగంలో, ఇనపగుండు కింది భాగం మాత్రమే పట్టేటంత గుండ్రంగా బొక్కను తొలిచినారంట, కింద రాతి గూటిలో నుంచీ కట్టకింద, బయట వరకూ వొగ సొరంగం వుంటాదంట, మంటంపైన ఇనపగొలుసును ఎడెనిమిది మంది పైకెత్తితే, కిందుండే గూటిబండ బొక్కకు గట్టిగా అతుక్కోనుండే గుండు పైకి లేస్తాదంట! లేస్తానే నీళ్ళు, విపరీతమైన ఫోర్పుతో రాతి గూట్లో నుంచి సొరంగం గుండా బయటికి కాలువలోకి పోతాయంట అట్ల పోయే నీళ్ళను అదుపు (కంట్రోల్) చేసేకి బావి తూములో అడుగు భాగంలో వొగ భద్రమైన చెక్కపలక, సొరంగానికి అడ్డంగా వుంటాదంట! నీళ్ళల్లో మంటపం కిందుండే తూముగుండును మాటి మాటికి పైకెత్తడానికీ కిందికి దించడానికీ నీరుగట్టోనికి సాధ్యం కాదని, తూము బావిలో కింద నీళ్లను కంట్రోల్ చేసే చెక్కపలకను అడ్డంపెట్టి నారంట. దానికి రోకలంత లావుండే వొగ ఇనపరాడును అమర్చి, పైభాగంలో స్క్రూ మాదిరుండే రాడుకు వొగ బోల్టాను బిగిచ్చినారంట! ఆ బోల్టాను స్పానర్తో తిప్పితే ఇనపరాడూ దానితో పాటు కిందుండే పలకా పైకి లేస్తానే నీళ్లు కట్టకిందనుంచీ బయటి కాలువలోకి దుముకుతాయంట! నాయన చెప్పినదంతా విని నేను అబ్బురపోతావుండాను.
అంతలోనే మంటపం పైనుండే వాళ్లు కిందికి దిగొచ్చి, తూము బావికి పూజచేసి టెంకాయలు కొట్టి, పసుపూ, కుంకుమా, పూలూ అన్నీ బావిలోకి వేసి మొక్కుకుండారు. వెంటనే పెద్ద నీరుగట్టి సంజప్ప మామ స్పానర్తో తిప్పి ఇనప రాడును పైకి లేపినాడు. అప్పుడు నాకు బావిలోకి తొంగి చూడల్లని పించింది. కానీ బావిగోడ పిల్లోళ్లకు అందనంత ఎత్తులో వుంది. తూము పలకను సంజప్ప పైకి లేపుతానే అందరూ బిరబిరా కట్టెక్కుతా వుంటే నేనూ ఎక్కి చూసినాను. నీళ్ళు తూములో నుంచీ, కట్టకింద నుంచీ బయటికి నురగలు గక్కుతా వొచ్చి, ముందర, బావి మాదిరుండే తొట్లో సుళ్లు తిరుగుతా మూడు పక్కలా వుండే పెద్ద బొక్కల గుండా కాలువలో ముందుకు పరుగులు తీస్తా పోతావుండాయి. ఆ నీళ్లవెంట, కాలువ గట్టు మింద ఆయిగాళ్లు తప్పెట్లతో, మేళాలతో ముందుకు పోతావుండారు. వాళ్ల వెనక పెద్దోళ్లూ, పిల్లోళ్ళూ నడుస్తావుండారు. శుభ్రంగా వుండే వొట్టి కాలవలో నీళ్లు పరుగెత్తుతావుంటే, పిల్లోళ్లు కేకలేసుకుంటా పరుగెత్తుతా వుండారు.
మరసటి దినమే మోతలగడ్డ కాలువ నీళ్ళు పొలాల్లోకి వొచ్చినాయి. వరినారు పోసేకి నాయన రెండు మడికయ్యలకు నీళ్లు పెట్టినాడు. కయ్యల్లో చీలినపర్రెల్లోకి నీళ్లు దూరుకుంటా నాలుగు పక్కలా కలుసుకుంటా వుంటే, బీటిమడి మట్టిలో నుంచి మంచి వాసన బయటకొస్తావుంటే, ఉగాది పండగనాటి వోళిగల వాసన కంటే కమ్మగా వుందనిపిచ్చింది నాకు. రెండు దినాలు కయ్యలు బాగా కుమల నానితే మంచిదని నాయన మడక కర్రూ, నగా, మేడితోకా అన్నీ కంసల ఆచారి దగ్గర సగేయిచ్చినాడు. ఈత నారతో పేడిన మోకును మడకకు కట్టి చెలకోలకు కొత్త వార’ను ముడేసి అన్నీ రెడీ చేసుకుండాడు నాయన. వారం దినాల కిందటే వెంకట నారపరెడ్డోళ్ల దగ్గర మూటకు రెండు మూటల వడ్లు ఇచ్చేటట్ల మాట్లాడి వొగ మూట (వొగపల్లా=నూరు శేర్లు) విత్తనాలొడ్లు ఢిల్లీ భోగాలు తెచ్చినాడు. వడ్లు ‘కేడి’ల్యాకుండా బ్రమ్మాండంగా వుండాయి. నారపరెడ్డోళ్ల విత్తనాలొడ్లు అంటే మంచి పేరు.ఆ పొద్దు నారకయ్యలు దున్నేకి బయలుదేరి నన్నూ రమ్మన్నాడు నాయన. దున్నపోతుల్ని కాడిగట్టి కాడి మీద మడకను తిప్పేసికట్టి కోటేరేసినాడు. కోటేరుతో మడికాటికి ఇద్దరమూ చేరుకుండాం. నాయన దున్నపోతుల్ని తూర్పు మొగంచేసి నిలబెట్టినాడు. కాడి మింద కోటేరు వేసుకొని వొచ్చిన మడకను కిందికి దించి, మడక నొగను కాడిమీదపెట్టి, ఈత మోకుతో మడకను బిగిచ్చి కట్టి కర్రుమీద మడకను నిలబెట్టినాడు. దున్నపోతుల (గోగునారవి) ముగుదాళ్ళకు కట్టిన పగ్గాలను రోంత సల్లుగా మడక మేడితోక చిల్లకు తగిలిచ్చి మేడితోకకు మొక్కుకొని, ఎడమచేతితో మేడితోక పట్టుకొని కుడి భుజంపైన చెలకోల వేలాడేసుకొని, పోతుల్ని అదిలిచ్చినాడు నాయన.
నేను మడక మేడితోక పట్టుకొని..
మెత్తగా నానిన నేలలో మడక కర్రు జేనెడులోతు లోపలికి దిగి, మెత్తని వొండుమట్టిని పగలజీల్చుకుంటా ముందుకు పోతావుంది. నేను మడక వెనకలే నాయనెంట పోతావుండాను. నాయన కయ్యలో కోండ్రవేసినాడు. ఆ కోండ్రలో నుంచి మడకను కుడిపక్కకు పోనిచ్చి రెండోకోండ్రవేసినాడు. రెండోకోండ్రలో కడావరకు పోయి మడకను ఎడమ పక్కకు తిప్పి మొదటి కోండ్రలో మిగిలిండే గడ్డను దున్నినాడు. అట్ల ఐదురౌండ్లు వేస్తానే మొదట కోండ్రంతా అయిపోయి రెండో కోండ్రలో సగం గడ్డ మిగిలింది. రెండోకోండ్రలో నుంచీ మళ్ళీ మూడో కోండ్రవేస్తా అంతా చూపిచ్చినాడు నాయన. నేను నిగాగ అంతా గమనిచ్చినాను.
రెండోకయ్యలో మొదటి కోండ్రవేసి మడక నాచేతికిచ్చి నన్ను తోలమన్న్యాడు నాయన. నేను రోంత జంకుతా మేడితోక మీద ఎడమ చెయ్యేసి కుడిచేత్తో చెలకోల పట్టుకొని పోతుల్ని గట్టిగా అదిలిస్తా చెలకోలతో వొకయేటు కొట్టినాను. కొడతానే పోతులు పరువెత్తినాయి. నా చేతిలోని మేడితోక జారిపోయింది. మడక పక్కకు వొరిగిపోయింది. నేను బురదలో పడిపోతావుంటే నన్ను నాయన పట్టుకొని ‘పోతుల్ని అంత గెట్టిగా అదిలిచ్చి కొడితే యెట్లరా? మడక యెడం పక్కకు వొరగబట్టి సరిపాయ. కుడిపక్కకు వొరిగితే, కర్రు కాల్లకు తగుల్తాది కదరా తిక్కనాయలా’ అని దండిచ్చి ప్ప్..ప్ప్..ప్ప్.. అనుకుంటా పోతుల్ని నిలబెట్టినాడు.
పక్కకు వొరిగిన మడకను సరిగా నిలబెట్టినాడు. మడక మేడితోక చేతిలో నుంచి జారి మడక పక్కకు వొరిగి పోతానే నాకు భలే భయమయ్యింది. మడక తోలడం, చూసినంత సులభం కాదనుకొని గెనుం మింద నిల్చుకొని, కాలికి కర్రుతగిలి ఏమన్నా అయ్యింటే ఎంత అపశకునం అయ్యిండేది అనుకుంటా వుంటే రోంతసేపు మనసులో భయం పుట్టింది.
రెండు కయ్యల్లో నాయన ‘ఇరుసాలు’ దున్ని బయట బీటికయ్యలో మడకను ఇడిసినాడు. దున్నిన కయల్లో నాయన పెల్లలు తొక్కుతావుంటే చూసి నేనూ పెల్లలు తొక్కేది నేర్చుకొని తొక్కసాగినాను. నాయన పారతో గెనాలను జివురుతా బురదలోపలికి తొక్కుతా వుంటే అదంతా నిగాగ గమనిస్తా నా పని ముగిచ్చినాను. నాయన దున్నిన కయ్యల్లోకి తీరుగుండా కాలవనీళ్లు పల్చగాపెట్టి తీరు ముగేసినాడు. నేను ఆ లోపల దున్నపోతులను కాలువలో పయికడిగి పోతురాజు కాలువ గట్లమిందికి తోలి ఇద్దరమూ అమ్మిడిపొద్దు బువ్వకు బయలుదేరినాం. పొద్దున రెండు కాగుల్లో నానబోసిన విత్తనాల వడ్లను నాయన సందకాడ గంపల్లోకి పొయ్యల్లన్న్యాడు నేను నాలుగు వేపాకు రెమ్మల్ని పీక్కోని వొచ్చినాను. నాయన వరిగడ్డిని గంపల్లో పల్చగా పరిచి, లోపల గంప చుట్టూరా వేపమండలుపెట్టి, అరుగు చివరగంపల్లోకి నానిన వడ్లను నీళ్లతో గుమ్మరిచ్చినాడు. నీళ్లన్నీ వొడిగిపోయిన తర్వాత గంపల్లో వడ్లను గట్టిగా అదిమి వొత్తి, పైన వేపమండలేసి, లోపల గంపచుట్టూరా వుండే వరిగడ్డినంతా మడిచి, వడ్లగింజలు పైకి కనిపిచ్చకుండా ఇంకా కొంచెం వరిగడ్డి కప్పి, గంపమింద బరువైన రాళ్ళెత్తినాడు. పొద్దునా సందకాడా రాళ్ళు పక్కకుతీసి గంపమీద రెండ్రెండు కడవల నీళ్లు మరిచిపోకుండా మూడు దినాలు పొయ్యల్లని చెప్పినాడు.
ఐదో దినం అరుగుమింద దుప్పటి పరిచి మొలక గంపల్ని గుమ్మరిచ్చినాం. మొలక బ్రమ్మాండంగా వొచ్చింది. గడ్డగట్టిన మొలకనంతా పులిమి అంతా గంపలకెత్తినాం. రెండుసార్లు తిరిగి నేనూ పెద్దక్కా మొలకగంపల్ని మడికయ్యల కాటికి చేర్చినాం. నాయన కయ్యల్లో పిట్టక తోలుతావుండాడు. అది అయిపోయినంక పాకుమాను తోలల్ల! ఇంట్లో సొంత పాకుమాను లేదు. మోతలగడ్డ దిగవ పక్కన రొట్టే పుల్లప్ప గుడకా ఆ పొద్దే నార పోసేకి కయ్యల్లో పాకుమాను తోల్తావుండాడు. అది ఇప్పిచ్చుకొని వస్తానన్నాడు నాయన. నేనూ పెద్దక్కా పిట్టక తోలిండే కయ్యల్లో పెల్లంతా నున్నగ తొక్కేలోపల నాయన దున్నపోతుల్ని కాడికట్టు కొనిపోయి పుల్లప్పగారి పాకుమానును మోకుకు కట్టుకొని బీటిమళ్లల్లో గెనాల దగ్గర పైకి ఎత్తుకుంటా వొచ్చినాడు. అంతలోనే అమ్మయ్య సద్దిగంప ఎత్తుకొని వొచ్చింది. వెంకటలక్ష్మీ, పెద్దన్నా వొచ్చినారు. మేము పెల్లంతా తొక్కిన కయ్యల్లో నాయన పాకుమానుతోలి చదును చేసినాడు. కయ్యలు రెండూ అద్దాలమాదిరి తయారైనాయి. బీటికయ్యల్లో కాడి ఇడిసి కాలువనీళ్లల్లో కాళ్లూ మొగమూ కడుక్కొని బువ్వగంప దగ్గరికి వొచ్చినాడు నాయన. అందరమూ అమ్మిడిపొద్దు బువ్వ తినేకి కూర్చుండాం. తాగే నీళ్లకడవ ఎత్తుకొని రాలేదు, కాలువ నీళ్లుంటాయని. పైగా వెంకటలక్ష్మి వూర్లోనుంచి మడికాటికి కడవెత్తుకొని వొచ్చేకి చాతకాదని. కాలువనీళ్లు వొగచోట గుంతలో తేరినాయని, కురాకు తెచ్చిన క్యారియర్ని కడిగి, ఆ నీళ్లను ముంచుకొని వొచ్చింది అమ్మయ్య. తేరిన కొత్తనీళ్లు కమ్మగా వుండాయని అందరమూ తాగినాం.
బువ్వ తిన్నెంక మడికయ్యలో వొగమూల, దేవరమూలకు ముఖంచేసి బురదతో వొగచిన్న అరుగును చేసివాడు నాయన. గట్టి బురదను తీసుకొని పిడికిలితో మూడు మట్టిబొమ్మల్ని చేసి, అరుగు మింద రోంత వాలుగా ఆ బొమ్మల్ని నిలబెట్టినాడు. అమ్మయ్య అందిచ్చిన మలక పుటక తీసుకొని పుటకలోని వడ్ల మొలకల్ని బొమ్మల ముందు సన్నసన్నగా మూడు కుప్పలుపోసి బొమ్మలకు మొక్కుకొని కయ్యలో మొలక చల్లినాడు, మొలకగింజలు నాయన చేతిలోనుండి కయ్యలోకి పడతావుంటే, లచ్చిమిదేవి గజ్జలు కట్టుకొని ఆడతావుందని అమ్మయ్య మురిసిపోయింది.
నారకయ్యల్లో వరినార రోంత నిక్కినంక, ఎరువు దిబ్బలోనుండి మడి కయ్యల్లోకి ఎరువు తోలేకి. రొట్టే పులప్పోళ్ల ఎద్దుల బండిని బంగపోయి బతిమాలి మాట్లాడినాడు నాయన. ఎద్దుల బండి వుండే వాళ్లను ఎవరిని అడిగినా వీలుకాదన్న్యారు అందురూ, కడాకు నాయన పుల్లప్పోళ్లకు, వొగనాడు ఎరువు బండి తోలితే రెండు దినాలు వాళ్ల మడి దున్నేకి వస్తానని కరారు చేసుకోని పిలిచినాడు. మోతలగడ్డకు ఎరువు బండ్లు పోవల్లంటే చాలా కష్టం. చూడ్డానికేమో రెండు ఫర్లాంగుల దూరమే వుండేది. అయితే పోతురాజు కాలువ, సోదనపల్లి కాలువలు అడ్డమొస్తాయి. ఏమి చేసినా ఆ కాలువల్ల్లో దిగి మోతలగడ్డకు బండిపోదు. అందుకే వూర్లో నుంచీ ‘ఓని’ దారెంటపోయి, మోతలగడ్డ దిగువ మళ్లల్లోనుంచి ఎగువ మళ్లల్లోకి పోవల్ల. దిగువ మోతలగడ్డ దగ్గర్నుంచీ మా పాపయ్యోళ్ల మడికాటికి ఎరువుబండి రావల్లంటే ఏడెనిమిది మళ్లు దాటుకొని రావల్సిందే! సుమారుగ నలభై మడి గెనాలను బండిజాడకు అనుకూలంగా పారతో తెగ్గొట్టాల్సిందే! నేనూ, నాయనా రెండు పారలు తీసుకొనిపోయి ఎండిన గెనాలను బండి చక్రాలకు అనుకూలంగా తెగగొట్టి జాడ జేసినాం. అదృష్టం కొద్దీ లింగనపల్లి చెన్నారెడ్డి చిన్నాయనా ఇంకా ఆపైనుండే మళ్లవాళ్ళూ రావడంతో మాకు రోంత పనిబరువు తగ్గింది. వాళ్ళూ వాళ్ల మళ్ళకు ఎరువు తోలకముందే గెనాలను తెగ్గొట్టి జాడపెట్టాల్సిందే! అయితే అందరూ ‘బండ్లతో ఎరువులు తోలుకున్నెంక మళ్లీ తెగ్గొట్టిన గెనాలను అందరూ పూడ్చాల్సిందే! పల్లెల్లో పద్ధతులు ఎంత బాగుంటాయో! ‘మా మడి గెనాలు తెగ్గొట్టి ఎవరూ బండి తోలుకొని పోయేకి వీల్లేదు’ అని ఎవురయినా అడ్డ్దం చెప్పితే ఎంత కష్టం! ఎవురెంత కొట్లాడినా, పగదారులైనా మా వూళ్లోనే కాదు మా పల్లెల్లో ఇట్లాంటి సేద్యం పనులకు ఎవురూ అడ్డగిచ్చింది లేదని నాయన చెప్పుతా వుంటే నాకు చాలా సంతోషమయింది.
పుల్లప్పోళ్లు మా ఉప్పరోళ్లే, పెద్ద కుటుంబం. ఎడెనిమిది ఎకరాల మాగాణీ పన్నెండెక రాల అప్పుటమయిన చేన్లూ వుండే రైతులు. వాళ్లకు దున్నపోతులు లేవు. అన్నీ ఎద్దులే! మాకు మామ వరసయితారు, సాధ్యమయినంతవరకూ బురదమళ్లల్లో ఎద్దులతో సేద్యం చెయ్యరు మావూర్లో! అందుకే. మా దున్నపోతుల మడకల కోసరమే, మా ఎరువును తోలేకి వొప్పుకుండారేమో! యా ప్రకారమయితేనేమి, పుల్లప్పోళ్లు ఎద్దుల బండితో రెండుదినాల్లో మా ఎరువు దిబ్బనంతా మడికయ్యల్లోకి తోలినారు. ఎరువు ఇరవైరెండు బండ్లు అయ్యింది. మడి కయ్యల్లో కుప్పజేసిండేది, అదీ ఏడెనిమిది బండ్లు అంతా ముప్పై బండ్లు! చిన్న పాపయ్య పెద్ద కొడుకు వొచ్చి చూసి సంతృప్తిపడినాడు.
వరినార్లు ఇరవై దినాలు అయిపోతానే తూములు పూర్తీ ఎత్తినారు. రైతులందరూ మళ్ళకు నీళ్లుపెట్టి శాడకు వేసుకుండారు. కొంతమంది అడ్డసాళ్లు కూడా తోల్తావుండారు. నాయన వేరేవాళ్లకు మళ్లు దున్నేకిపోయి నాలుగైదు బదులు మడకలు చేసుకుండాడు. వాళ్లందరూ పిట్టకనాడొచ్చి మడిలో పిట్టక మడకలు కట్న్యారు. అప్పుడు నేను నాలుగు దినాలు బడి మానేసి మడిలో పెల్లతొక్కినాను. వాళ్ల మడకల వెనకల నేనూ మడక తోలడం నేర్చుకుండాను, నేను మడక తోలేది చూసి, ‘సదువుకుండే పిల్లోడు బాగ నేర్సుకుండాడు గదన్నా’ అని వాళ్ళు మెచ్చుకుంటా వుంటే నాకు భలే సంతోషమయ్యింది. నేనూ మడకను తోలగలనని ధైర్యమొచ్చింది. ఆ ధైర్యంతో వుబ్బిపోతా, మాగాణి నిండా రైతులు మడకలు తోలుతా పశువుల్ని ఆదిలిస్తా అరుస్తావుంటే సేద్యం తిర్నాలలో వున్నెట్లు మురిసిపోయినాను.
అమ్మయ్య, బదులు మనుషుల్ని చేసింది. వాళ్లంతా రెండు దినాలు వొచ్చి మడి నాటిపోయినారు. మా పాపయ్యోళ్ల వరిమడి పక్కన హద్దురాయి మింద కూర్చొని రెండు నెలలు జరిగిపోయిండే కాలాన్నంతా గుర్తుచేసుకొని, అనలు కొనలు సాగుతావుండే ఢిల్లీ భోగాల వరి పైరును కలజూస్తా ఇంటికి బయలుదేరినాను.
నాయన వొచ్చే సమ్మత్సరం శింగనమల హైస్కూల్లో ఆరో తరగతిలో నన్ను తప్పకుండా చేరుస్తాడు. ఈ సమ్మత్సరం చెరువు కింద రెండు పంటలు పండుతాయి. మంచి టయానికి చిన్నపాపయ్యోళ్ల మోతలగడ్డ మడి కోరుకు దొరకడం అదష్టమే! దేవుని దయతో చెరువుకు నాలుగేండ్లపాటు ఈ మడి మా చేతుల్లోనే వుంటే, నేను చదువుకుండేకి నాయన అడ్డం చెప్పడు. నేను గుడకా భయంగా ఇంటి పనులన్నీ చేసుకుంటా బాగా చదువుతుంటే నాయన తప్పకుండా చదివిస్తాడు.ఆలోచిస్తా, వెంకట్రామయ్యోళ్ల కుంట కట్టమడి దగ్గర కట్టయెక్కి, శింగనమల దావలో కలుసుకుండాను. అంతలోనే పడమటి వైపున, చెరువుకు ఎగదాల వాన దిగినట్లుందేమో మెరుస్తావుంది. నేను పోతా పోతా, మా దొడ్లోని గడ్డివామిలో పశువులకు నాలుగు గడ్డి కట్టల్ని బయటికి పీక్కోని, కట్టగట్టి, నెత్తి మింద పెట్టుకొని ఇల్లు చేరుకుండాను.
(ఇంకా ఉంది)
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.
