Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాతి పర్రెలలో నుంచి..-9

[స్వీయ కథనాత్మక ఆత్మకథని అందిస్తున్నారు ప్రముఖ రచయిత డా. శాంతి నారాయణ.]

మాలపున్నమ పండగ – నూరు యాటలు తెగాల్సిందే!

బెణకప్ప పండగ (వినాయక చవితి) వెళ్లిపోయింది. రెండు మూడు వారాలు నుండి వాన రాక ఎర్రనేల చేన్లల్లో శెనక్కాయ పైర్లు వాడుబట్టినాయి. మిగతా పైర్లన్నీ బాగుండాయి. శెనక్కాయ చేన్లల్లో అక్కిడి వేసిన సద్దపంట  వొచ్చింది కొంతమందికి. ఇంగ రెండుదినాలకు మాలపున్నమ పండగొస్తాదని నాయన ఆకులమ్ముకొని నాలుగైదు శేర్లు సద్దలు తెచ్చినాడు. అమ్మయ్య రెండు శేర్ల సద్దలు చాటా జల్లెడతో ఇసకా, రాయీ, రప్పా, పెల్లా లేకుండా చేసింది. సద్దలు ఇసుర్రాయితో ఇసురుకొని వచ్చేకి అమ్మయ్యా, నేనూ గాండ్లపర్తి వెంకటరెడ్డోళ్ల ఇంటికి పోయినాం. ఆ ఇంటి వసారాలో ‘నడవకు’ ఇరువైపులా నడుములెత్తుండే పెద్ద అరుగులు, ఆ అరుగుల పైకి ఎక్కడానికి గోడవారగా నాలుగు మెటికలు. పెద్దోళ్లు, మొగోళ్లయితే అరుగు మీద రెండు చేతులూ వెనక్కి వూదబొడిసి నడుములు పైకెత్తి ఎగిరి కూర్చోగలరు కాని నాయెత్తుండే పిల్లోళ్లూ, ఆడోళ్లూ ఆ అరుగుల మీదికి మెటికలెక్కి పోవల్సిందే!

నేనూ, అమ్మయ్యా ఆ ఇంటి సుబ్బమ్మ నడిగి అరుగు మిందికి ఎక్కినాం. అంతకు ముందే  వొచ్చిన బూదేటి పుల్లన్నోళ్లు సద్దలన్నీ ఇసురుకొని డబరాగిన్నెలోకి పిండిఎత్తుకొని కిందికి దిగినారు. అప్పటికే ఏడెనిమిది ఇండ్లోళ్లు సద్దపిండి ఇసురుకొని పోయినారంట.  అమ్మయ్య, చిన్న పిండిపరకతో నున్నగ నూకి అదంతా పక్కనుండే తవుటి గంపలో వేసింది. ఆ పిండి అంతా సుబ్బమ్మోళ్లు పశువులు తాగే కడుగునీళ్ల తొట్లోకి వేస్తారంట! అదంతా చెప్పుతా అమ్మయ్య ఇసుర్రాయి ముందు వొగకాలు చాపుకొని, ఇంకొగ కాలు మడుచుకొని కూర్చుంది. నేనూ అమ్మయ్య మాదిరే కూర్చుండాను.

ఆ ఇసుర్రాయిని చూసినప్పుడల్లా నేను అబ్బురపోతావుంటాను. దాన్ని మాటిమాటికీ పక్కకు ఎత్తి పెట్టేకి వీలుకాదు. అందుకే సుబ్బమ్మోళ్ళ నాయన అరుగుమీద గార గచ్చును నునుపు చేయిచ్చినాడు. కిందిరాయి మధ్యలో ఇనపశీలను గట్టిగా భద్రంగా దిగగొట్టినారు. పైరాయిని కింది రాయి మింద పొందెయ్యాలంటేనూ, ఇసిరేదంతా అయిపోయినంక మధ్యలో మిగిలిండే పిండిని బయటికి తీయడానికి పైరాయిని పైకి ఎత్తల్లంటేనూ ఇద్దరు మనుషులు ఉండాల్సిందే. పై రాయి చివర టెంకాయ పీచుపెట్టి దిగగొట్టిన గుంజను పట్టుకొని, మధ్యలో వుండే జడిగంలో గింజలు పోసి ఒక్కరే ఇసిరేకి అయ్యెల్లేదు. అందుకే అమ్మయ్య నన్ను పిల్చుకొనిపోయింది.

ఇసుర్రాయి గుంజను అమ్మయ్య ఎడమ చేతితో, నేను కుడిచేతితో పట్టుకొని తిప్పినాం అమ్మయ్య కుడిచేతితో సద్దగింజలు జడిగంలోకిపోస్తా ఇసుర్రాయి పాటలు పాడుతూ ఇసిరింది. అమ్మయ్య ఇసురుతా, అలుపూ సొలుపూ ల్యాకుండా ఇసుర్రాయి పాటలు పాడుతా వుంటే ఎంతద్భుతంగా వుందో! యాపనికి పోతే ఆ పాటలు పాడేకి, అవన్నీ అమ్మయ్య ఎప్పుడు నేర్చుకుందో! అమ్మయ్యకు రానిపని యేందీ లేదేమో అనుకుంటా నేను అమ్మయ్య చేయికి చేయి తోడేసినాను. ఇసిరేటప్పుడు నాకు తెలుస్తావుంది. ఇసుర్రాయి బరువంతా అమ్మయ్యే తన చేతికి తీసుకుంటా వుందని. ఆ మాదిరిగా వొగ అర్దగంట సేపు ఇసుర్రాయి విసరి, పిండినంతా డబరాలోకి ఎత్తుకొని, ఆ పక్కా ఈపక్కా పడిండే అలాకయిన పిండినంతా పిండిపరకతో నున్నగా వూడ్చి తవుటిగంపలోకి వేసి ఇంటికొచ్చినాం.

రేపే ‘మాలపున్నమ పండగ’, సందుసందులోనా ఏడెనిమిది యాటలు (పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు) కట్టేసినారు. ఎప్పుడెప్పుడు పొద్దుమునుగుతుందా, యెప్పుడెప్పుడు యాటలు  కోస్తామా అని యెదురు చూస్తా వుండారందరూ. పొద్దు మునుగుతానే గబక్కన నాలుగు మెతుకులు మింగి యా సందులోవాళ్ళు ఆ సందులో యాటలు కోసే పని పట్టిచ్చినారు. చేన్లున్నోళ్ళు పొట్టేళ్ళను బ్రమ్మాండంగా మేపినారు. గొర్లమందలో కొనుక్కోని తెచ్చిన పొట్టేళ్ళకంటే రైతులు మేపిన పొట్టేళ్ళ మాంసానికి భలే గిరాకి. అట్లనే దాండ్ల రేటు కూడా ఎక్కువే. చెన్నారెడ్డి చిన్నాయన తమ పొట్టేలికి నూర్రుపాయల రేటు పెట్టినాడు. తలకాయబుట్టా, చర్మమూ పోనూ మాంసం ఇరవై కేజీలకు పైనే పడుతుందని, పది కుప్పలు వేస్తానని, కావల్సినోళ్ళు ముందే చెప్పల్లని అన్న్యాడంట. కావల్సినోళ్లు, వాళ్ళ ఇంటికాటికిపోయి పొట్లిని ఎత్తిచూసి కూర ఇరవై కేజీలకు పైనే పడుతుందని అనుకొని, వెంటనే మాకొగ కుప్ప, మాకొగ కుప్ప కావల్లని అడ్మాన్సు గుడకా ఇచ్చినారంట. అది తెలిసి నాయన అమ్మయ్యను అడిగి, నిన్ననే చిన్నాయనతో మాకొగ కుప్ప కావల్లని చెప్పి వొచ్చినాడు. అందుకే పొద్దు మునుగుతానే కడుపులోకి ఇంతేసుకొని చిన్న డబరాగిన్నె, కత్తిపీట తీసుకోని బయలుదేరినాడు నాయన, నేనూ నాయన వెంటపోయినాను.

చెన్నారెడ్డోళ్ల లోగిట్లో అప్పుడే యాటకోసి చర్మం ఇడిపిచ్చినారు. ఎంటికలప్ప మామ, యాటను కోసి చర్మం యిడిపిచ్చే దాంట్లో భలే పనివాడంట! వసారాలో వొగ కొక్కీకి తలకిందులుగా వేలాడేసిన పొట్లి దట్టంలో నుండీ వొక్కొక్క భాగాన్ని మచ్చుగత్తితో నరుకుతా కింద తడక మీదికి వేస్తావుండాడు. మాంసం కుప్పలోళ్ళందరూ తడక చుట్టూరా కూర్చొని కత్తిపీటలతో కోసిన కండల్నీ, ఎముకల్నీ, దొమ్మకాయల్నీ, వట్టకాయల్నీ శుభ్రంగా కడిగి, పొట్టపేగుల్నీ ముక్కలు ముక్కలుచేసి అలాద అలాదాగా కుప్పలుగా వేస్తా వుండారు. దూరంగా కాసుకోనుండే కుక్కలు, మొద్దుమీద చెన్నారెడ్డి మచ్చుగత్తితో ఎముకల్ని తునకలు చేసేటప్పుడు ఎగిరిపడే యెముకలకోసరం గుడ్లిడుస్తా, ఎగిరొచ్చిన తునకల్ని గబక్కన ఎదురుకొని తింటా వుండాయి. ఈ లోపల కోట్లో  మసూదు మామ చెవి గూగుల్నీ, కాళ్ల బొమికల్నీ కాల్చుకొని  వొచ్చి ముక్కల్ని తలా నాలుగిచ్చినాడు చెన్నారెడ్డి, నేనూ, బూదేటోళ్ల పుల్లిగాడూ, జానగొండ నారాయణగాడూ కరుం కరుం అని నములుతా భలే రుచిగా వుండాయని తిన్న్యాం. అవి తినేకే మేము పిల్లోళ్లం యెదురు చూస్తావుంటిమి.

మా నాయన సీలుకురాకు కుప్పల్ని యెక్కువ తక్కువలు సరిచేసి,  కడాన తక్కెడతో తూకమేసినాడు.  వొక్కొక్క కుప్ప రెండున్నర కేజీ తూగింది. అందరితోపాటు నాయనా పది రూపాయలు చెన్నారెడ్డి చిన్నాయనకు ఇచ్చి వొగకుప్పను డబరా గిన్నెలోకి ఎత్తుకుండాడు. సీలుకురాకులోకి కలపడానికి తరంగాని యెముకల్నీ, గిట్టల్నీ నాలుగు ముక్కలు చెన్నారెడ్డిని అడిగి, పక్కన వొగ గుడ్డలో కట్టి, గిన్నెలో పెట్టి పైకి లేచినాడు నాయన.

ఇద్దరమూ ఇంటికొచ్చేటప్పుడు గుడ్డలో కట్టిన ఎముకలు యాల నాయనా అని నేను నాయనను అడిగినాను. అవి వరిమడిలో కమురేసేకి అని చెప్పినాడు. అట్లంటే యేందో నాకు అర్థం కాలేదు. మేము కూరతీసుకొని వచ్చేటప్పటికి అమ్మయ్య మసాలా అంతా నూరి గిన్నెలో రెడీగా పెట్టుకోనుంది.

కంచంలో పొప్పెముక కొడితే కాశీలో గంట గొట్టినంత పుణ్ణెమంట!

పొయ్యి అంటిచ్చమన్న్యాడు నాయన. అమ్మయ్య ఆకాశంలో చుక్కల్ని జూసి ‘యింగా గొరుకొయ్యలు నన్నెత్తికి రాలేదు అద్దరేత్తిరి గుడకా కాలేదు. అబ్బుడే నాలిక పీకుతాందా? ఉచ్చలు బట్టుకోలేడు మొగోడు’ అంటా పంగిచ్చింది..

‘అద్దరేత్తిరి అయ్యింది లేయే! ఈ పొద్దు పున్నమ కదా, పైకి జూడు సందమామ నన్నెత్తి (నడినెత్తి) దాట్నాడు. తొలికోల్లు కూసేలోపల, సీలుకురాకు తింటేనే పున్నెం. తొలికోడి కూసే లోపల కంచంలో పొప్పెముక కొడితే కాశీలో గంట గొట్టినంత పున్నెమని పెద్దోళ్లు వూరికే సెప్పింటారా? లెయ్, లెయ్’ అంటా నాయన తొందరపెట్టినాడు. అప్పుడే చుట్టుపక్కల ఇండ్లల్లోనుండీ సీలుకురాకు వండుతావుండే మసాల వాసన నోరూరిస్తావుంది.

నాయనకు సీలుకురాకు అంటే భలే యిష్టం! నాకూ నాయన బుద్ధులే. అమ్మయ్య మా ఆత్రాన్ని జూసి పొయ్యి అంటిచ్చింది. పొంతపొయ్యి మీద కురాకు కలిపి పెట్టి, రెండో పొయ్యి మీద రొట్టెలు చేసేకి పెనుం పెట్టింది. నేను రోంతసేపు పండుకుంటానని ఇంట్లోకి దూరుకుండాను.

ఎంతసేపయిందో యేమో నన్ను తట్టిలేపి ముఖం కడుక్కోమనింది అమ్మయ్య, నేను ముఖం కడ్కుకొని వొస్తానే,  యేమప్పా అట్ల నిద్రబోయిన్నావు? యెంత లేపినా లెయికుండా, అట్ల పండుకుండావ్‌ యాల? మీ నాయన కురాకు అయితానే పల్లెంలో పొప్పెముక కొట్టి తిని, కాశీలో గంటగొట్టినంత పున్నెం దెచ్చుకొని, గొరకబెట్టి ఫుల్లుగ నిద్రబోయి, కోడికూత యినపడిందేమో యిబ్బుడు లేసి, మల్లా వొగిడుపు యిడుత్తావుండాడు’ అని నాకు సద్దరొట్టి సీలుకూరా పెట్టింది. నాయన అప్పడే వొగసారి తిని, నిద్రబోయి లేచి, ఇంకా తెల్లవారకనే రెండోసారి తినేకి కూర్చుండాడని అమ్మయ్య చెప్పడం విని నేను అబ్బురపోయినాను.

తెల్లారింది. అమ్మిడి పొద్దు గాకముందే సందులో అందరూ మాలపున్నమ పండగ నంజిరి తిని యిండ్ల ముందర కూర్చుండారు, ఎంగిలి యెముకల కోసరం ఇండ్లముందర కుక్కలు కొట్లాడతా వుండాయి. నిన్న రాత్రి గుడ్డలో కట్టుకోనొచ్చిన ఎముకల్ని, పొట్టపేగుల్ని తీసుకొని మడి దగ్గరికి పోదాం రమ్మని నన్ను పిలిచినాడు నాయన. అమ్మయ్య నాలుగు ఎండిన జెముడు పుల్లలేసిన గంపను నా నెత్తి మిందపెట్టి, అగ్గిపెట్టె చేతికిచ్చి, పోతా పోతా దొడ్లో రోంత వరిగడ్డి తీసుకొని పోండని చెప్పింది. అమ్మయ్య చెప్పినట్ల నేనూ నాయనా మా వరిమడి దగ్గరికి పోయినాం. నాయన మడిలో రెండుచోట్ల గెనాల మింద వరిగడ్డి, జెముడు పుల్లలు పెట్టి అగ్గిపుల్లగీసి పుల్లల్ని అంటిచ్చి, మంట మింద ఎముకలూ, పొట్టపేగులూ వేసినాడు. రోంత సేపటికి కమురువాసన కమ్ముతుంది. నాయన మాదిరే చుట్టు పక్కల చాలా మంది మళ్లల్లో కమురు పొగలేపుతా వుండారు. ఇదంతా చూస్తా ‘యెందుకు నాయనా అందరూ ఇట్ల చేస్తావుండారు?’ అని ఆసక్తిగా అడిగినాను.

‘ఇట్ల పైర్లో కమురు పెడితే, ఈ వాసన బీల్చి, పైర్లు సంతోషపడి మంచి పంట లిత్తాయప్పా’ అని నాయన కారణం చెప్పినాడు. నాయన చెప్పింది విని, ‘పైర్లు యెట్ల సంతోషపడతాయబ్బా?’  అని  నాలో నేను ఆలోచించుకుంటా రోంతసేపు మడి దగ్గరే వుండి నాయన వెంట ఇంటి కొచ్చినాను. సందకాటికంతా మాలపున్నమ పండగ అయిపొయ్యింది.

మాలపున్నమ వెళ్లిపోయిన మూడో దినమే బ్రమ్మాండంగా వర్షం పడింది. బెణకప్ప పండగ అయిపోయినంక బెణకప్ప (గణపతి) పూర్ణకుడాలు దిక్కులేనన్ని తిని బొజ్జ (కడుపు) బరువై, యాడో పండుకోనుంటాడని, అందుకే వానరాదని, మాలపున్నమ నాడు జోకుమారుడు ఎముకలన్నీ తిని, అవి గొంతులో అడ్డం పడినంక నీళ్లకోసరం వానదేవునికి మొరపెట్టు కుంటాడని, ఆ జోకుమారుని మొర విని వానదేవుడు కరుణించి వాన కురుస్తాడని, అందుకే మాలపున్నమ వెళ్లిపోతానే బ్రమ్మాండంగా వానపడిందని జనమంతా అనుకోబట్టినారు. అది నిజమో, కాదో నాకు తెలేదు గానీ, ఎలిపొలాల్లోని పైర్లు పూర్తీ ఎండిపోకముందే వరసగా నాలుగైదు దినాలు మంచి వానలు పడడంతో మా వూరి చేన్లే కాదు చుట్టుపక్కల రెండామడల దూరం మెట్టపొలాలన్నీ కళకళలాడసాగినాయి.

దినామూ పచ్చిగడ్డి కోసుకొని వచ్చేకి గుట్టల్లోకి, చేన్లల్లోకి, మళ్లల్లోకి, వంకగట్ల మిందికీ పోయి పొలాలను చూసేకొద్దీ నాకు చదువుమీద భలే శ్రద్ధపుట్టసాగింది. ‘‘కుంటి చిక్కర్లు’’ యావీ లేకుండా నేను శ్రద్ధగా బడికి పోతావుండాను.

జీరంగుల ఆట – ఎరబొబ్బిలి గాడు

మాకు దసరా సెలవులు వొదిలినారు. మామూలు మాదిరిగానే చెల్లెలు పెద్దక్క గాటిపాట్న ప్యాడా కసువు నూకితే, నేను దేవరకొండకు పోయి పసులకు గడ్డి కోసుకోనొచ్చి గాట్లో వేసి అమ్మిడిపొద్దు బువ్వ తిని దున్నపోతుల్ని మేపుకోనొచ్చేకి తోలుకొని పోతాను. రొండు దినాల్నుంచి జతగాళ్లందరమూ పసువులు తోలుకోని రెడ్డోళ్ల గొందిలోకి పోతావుండాం. గొందిలో అయితే జీరంగులు దండిగా ఉంటాయని, దాండ్లను పట్టుకోనొచ్చి ఆడుకోవచ్చునని అనుకుండాం. అందుకే అమ్మయ్యనడిగి సుమారుగ దారమూ రెండు ఖాళీ అగ్గిపెట్టెలూ ఇప్పిచ్చుకోని అంగీ జోబీలో పెట్టుకుండాను. వొగ పావన్ని నానబెట్టిండే బియ్యమూ ఒగ బెల్లపుంటా నిక్కర జోబీలో పోసుకోని, దున్నపోతులు తోలుకుంటా జతగాళ్ళందరమూ సంతకనం వంక గుండా గొందికాటికి యెల్లవారినాం. మా ఊరోళ్ళు ఊరబసువుల్ని గొందిలోకి తోలుకొని పోవల్లంటే సంతకనం వంక గుండా పోవాల్సిందే! వంకకు ఇరువైపులా శెనిక్కాయ చేండ్లు.

మా ఊరు గొంది, రెడ్డిపనిచేసే వెంకటనారపరెడ్డోళ్ల సొంతమంట! ఢమాంగుట్టకూ కొసిగుట్టకూ నడమధ్యలో, బోదగుట్ట నారవ కాట్నుంచీ సుమారుగ పదీ పదైదు ఎకరాల గొందిచేను భలే బాగుంటాది! అ చేనుకు దిగదాల అడ్డంగా కట్ట ఉంటాది. దాన్ని రెడ్డోళ్ల కుంటకట్ట అంటారు. పూర్వకాలంలో అదొగ కుంటగా, ఆ కట్ట, కుంటకట్టగా పెద్దగా వుండేదేమో! ఇప్పుడదంతా కిందికి నగ్గిపోయి మూడడుగుల ఎత్తంత ఉంది. వానలెక్కువ పడితే, కొండల దడుల్లో నుంచీ నీళ్లు జారొచ్చి, ఆ కుంటలో నిలుస్తాయి. ఎక్కువయినవి, కుంటకు పడమటి పక్కనుండే బండ మీద నుంచి కిందికెళ్ళిపోతాయి. రోంత కిందికి పోతానే, కొసిగుట్టకు ఇంగొగ పక్కనుంచి వచ్చే నీళ్లు కలుసుకుంటాయి. అన్నీ కలిసి సంతకనం వంక గుండా అనంతపురం తాడిపత్రి రోడ్డు మోరీ కింద దూరి, మా వూరి చెరువు కాలవగట్లను తెంచుకోని మాగాణి మళ్ల మింద పారుతా కిందికి పోయి, చెరువు మరవంకలో కలుస్తాయి. ఆ మరవంక అట్లే కిందికిపోయి, కూతలేరుని కలుపుకొని ఇంకా దిగువన పెన్నానదిలో కలుస్తాదంట!

అట్లాటి గొందిలోకి పసువుల్ని తోలుకొనిపోయి, ఢమాంగుట్ట దడికెక్కిచ్చి జతగాళ్ళందరమూ కుంటకట్ట మీదుండే జీ చెట్టు కిందికొచ్చి కూర్చుండాం. ఈ సమ్మత్సరం వానలు బాగా పడినాయని నారపరెడ్డోళ్లు కుంట చేనునూ, కొసిగుట్ట దడిపక్కనుండే చెలికల్నీ బోయోళ్లకు గుత్తకిచ్చినారంట! అందుకే ఆ బోయోళ్ల మనుషులు కుంటవారనా, చెలికల్లోనా సద్దా, జొన్న, ఉలవ పంటలు పెట్టి పసులు యావీ కుంటచేన్లోకి రాకుండా కాపలా వుండారు. వాళ్లను చూసి మేము మా పసువుల్ని కొండలోకి తోలి కుంటకట్ట మిందికి చేరుకుండాం.

అందరమూ జీరంగులను గురించి మాట్లాడుకోసాగినాం. పంట పెట్టిండే చెలికల గట్లల్లో ఉండే కలీ పులీ తుమ్మచెట్లల్లో జీరంగులు దండిగా ఉంటాయని ఆటికి పోతే చేనోళ్లు అరుస్తారని, ఎట్ల జెయ్యల్లనో అందరమూ రోంతసేపు ఆలోచనచేసినాం. ఈ పొద్దు యెట్లన్నా గానీ జీరంగుల్ని పట్టుకొని పోవాలనుకుండాం. అంతలోనే సద్దచెలికల్లో నుంచీ మా పుల్లిగాని జతగాడు బోయోళ్ల ముక్కోడొచ్చినాడు. అందరమూ వానితో రోంతసేవు వొద్దికగా మాట్లాడుతా మా జోబిలో నానిండే బియ్యాన్ని తలాకిన్ని పెట్టి రెండు బెల్లపొడకలు ఇచ్చి అందరమూ తింటా వాన్ని జతజేసుకుండాం. ఆనెంక కుంటకట్టకు దిగువ పక్కనుండే చెలిమిలో నుంచి పారుతా, టెంకాయ పాల మాదిరి కమ్మగా ఉండే నీళ్లను కడుపునిండా తాగినాం. నాకైతే ఆ పారే నీళ్లను చూసి భలే సంతోషమయింది. ఆ పారే నీళ్లు సుమారుగ నాలుగయిదెకరాల వరిమడికి సరిపోతాయనిపిచ్చింది. అయితే ఈ కుంటకట్ట కిందుండేది అర్దెకరానే! సన్నొడ్ల పైరు బ్రమ్మాండంగా వెన్ను పోతావుంది. మడికయ్యల పక్కనుండే కాలువ పొర్ర గుండా పోయే నీళ్లు, బండల మీదా రాళ్ళ సందుల్లోనా కిందికి గలగల పారుతా, గుట్ట దడికింద దిగువ పక్కనుండే మిషను కుళ్లాయి మామోళ్ల వొట్టేరు మడికి పోతావుండాయి. మా వూరి చెరువుకు నీళ్లు రాక, మాగాణంతా బీడున్న్యా, ఆ మామోళ్ల వొట్టేరు మూడెకరాలు వొగ పంట తప్పకుండా పండుతాదని, అందుకే చౌడమ్మంటే తనకిష్టమని మనసులో అనుకుంటా ఆ ముక్కోనెంట సద్ద చెలికల కాటికి జతగాళ్లతో కలిసి పోయినాను.

ఆడ, రెండు చిన్న తుమ్మచెట్లు, పదీపదైదు కలీ పులీచెట్లు వుండాయి. సుమారుగ ఇరవై జీరంగులు, తుమ్మచెట్లల్లో అయిదారు ఎరబొబ్బిలిగాళ్లు కనిపిచ్చినాయి. నేను వొగ ఎరబొబ్బిలిగాన్ని (ఎర జీరంగి మగది) వొయినంగా పట్టుకుండాను. అయితే అది తన తలకాయిని కిందికి వొంచి నా వేలు తాకుతానే బాణం మొన మాదిరుండే మెడను పైకెత్తి వేలిచర్మాన్ని గట్టిగా పట్టుకొని కొరికింది. నొప్పి కావడంతో నేను వొలిగుడ్డతో గట్టిగా కొట్టినాను. అది కింద గడ్డిలో పడింది. నేను వొల్లిగుడ్డను దాని మిందేసి వొయినంగా రెండు రెక్కల్ని అదిమి పట్టుకుని పైకెత్తి చూసినాను. ఆ పక్క వొగటీ, ఈ పక్క వొగటీ రెండు మీసాలు ఎల్లుకొని వుండాయి. కనుగుడ్లు మిటకరిస్తా వుండాయి. ఎర్రని రెక్కల చిప్పలు తళతళల మెరుస్తూ వుండాయి. బాణం మొన మాదిరుండే తలకాయి చిప్ప రకరకాల రంగులతో తళతళ మెరుస్తా ఎంత బాగుందో! పుల్లిగాడు నా దగ్గరుండే దారం తీసుకోని ఇంతకుముందు నన్ను కరిచిండే మెడ సందులోకి దారంపోగును వేస్తానే అది మెడను పైకెత్తింది. దాంతో దారం దాని మెడలో కరుసుకుంది. దారం మొనతో దాని తలకాయికి బిగిచ్చి, ఇంకొగమొనను చేత్తో పట్టుకొని, ఎరబొబ్బిలి జీరంగిని గాల్లోకి వొదిలేసినాను. అది జియ్యిమని రెక్కలాడిస్తా, ఎగిరిపోల్యాక పైన ఆడతా వుంటే చూసి ఆనందపడతా దారంతో దాన్ని నా ఎడమ అరచేతిలోకి వేసుకొని రెక్కల చిప్పల్ని రోంతసేపు సాది, నా ఎరబొబ్బిలి జీరంగిని అగ్గిపెట్టెలో వేసుకుండాను. మల్లా వొగజీరంగిని పట్టుకొని వేరే అగ్గిపెట్టెలో పెట్టుకుండాను. జతగాళ్ళందరూ తలా వొకటీ, రెండు జీరంగుల్ని పట్టుకుండారు. ఆనెంక జీరంగులు తుమ్మ్యాకు బాగా తింటాయని, తుమ్మ చెట్లల్లో తలాపిడికెడు ఆకు పీక్కొని జీరంగులుండే అగ్గిపెట్టెల్లోకి దురికినాం.

అందరమూ పసువుల పక్క చూసి అవన్నీ గడ్డిమేసుకుంటా గుట్ట పైదాలకు పోయినాయి,  ఇప్పుడే కిందికి దిగిరావనుకొని కుంటకట్ట మిందికి తిరిగొచ్చినాం. అందరమూ అగ్గిపెట్టెల మూతలు తీసి చూసినాం. అన్నీ తుమ్మ్యాకు తింటా వుండాయి. ముద్దు ముద్దుగా మూతులు సాపి ఆకులు తింటా వుంటే ఏదో సన్నని శబ్దమొస్తావుంటే ఎంత బాగుందో! అందరమూ దారాలను పట్టుకొని జీరంగులని ఎగిరేసినాం. అవి రెక్కల్ని స్పీడుగా అల్లాడిస్తా పైకెగిరి మెడల్లో కట్టిండే దారాల వల్ల దూరంగా ఎగిరిపోల్యాక మా దగ్గరే తిరుగుతా వుండాయి. పైనుండే దొప్పల కింద తూనీగల రెక్కల మాదిరుండే పల్చని రెక్కలు ఎంత స్పీడుగా ఆడుతాయేమో ‘జీ’ అంటా చేస్తా వుండే శబ్దం వినడానికి యెంతో బాగుంది. అట్లా జీరంగుల్ని రోంతసేపు ఆడిచ్చినంక అందరమూ దాండ్లను అరచేతుల్లో వాలిచ్చుకుండాం. పాపం రెక్కలు ఆడిచ్చి అలసిపోయినాయేమో! అరచేతుల్లో మెల్లగా అడుగులు వేస్తా ముందు పక్కనుండే చేతులతో మూతుల్ని తుడుసుకుంటా వుండాయి. ఆ చేతులకు కింది పక్కన సన్నని ఈకలుండాయి. నల్లజీరంగుల్ని దగ్గరగా చూస్తావుంటే బంగారు రంగూ ఎరుపు నీలం రంగులూ అన్ని రంగులూ కలిపి ఎవురో ఆ రెక్కల చిప్పల్నీ తలకాయల్నీ చేసి అతికించినట్ల మెరుస్తా ఉండాయి. అరచేతుల్లో నాలుగు కాళ్లతో మెల్లిగా నడుస్తా ముందరుండే చిన్న ఈకల కాళ్ళనే చేతుల మాదిరి పైకెత్తి మూతుల్ని తుడుసుకుంటా వుంటే ఎంతో అందంగా కనిపించినాయి జీరంగులు. తెలియని వాళ్ళు దాండ్లను చూస్తే, కరుస్తాయేమోనని భయపడతారు. కానీ అవి మూతులతో కరచవు.

జీరంగులతో ఆడుకుండేదంతా అయిపోయినంక మిషను కుళ్లాయప్పోల్ల వొట్టేరు మడికి పైపక్కనుండే మేడిమానులో కోతి కొమ్మచ్చి ఆడుకుందామని ఆటికి పోతావుండాం. గొందిచేను కుంటకట్ట కిందుండే చెలిమిలో నుంచీ కిందికి వొట్టేరు మడికి పోయ్యేనీళ్లు వొగ బండమింద నుంచి గలగల మంటా పారుతాండాయి. నీళ్లు పారిపారి బండ పాచి పట్టింది. మేము పాచి పట్టిండే బండ మింద మెల్లగా దాటుకుంటా కిందికి పోయినాం. అయితే పుల్లిగాడు యెక్కడ్నో చూస్తా పాచి పట్టిండే బండమింద అడుగుపెట్టి సరక్కనజారి కింద పడి దొర్లాడినాడు. వాడు పడిండేది చూసి అందరమూ కడుపులు చెక్కలయ్యేటట్లు నవ్వుతా వాన్ని పైకెత్తినాం. అదృష్టంవల్ల వానికి యేమీ కాలేదు.

అందరమూ వాలుగా ఉండే బండ దిగినాం. ఆ బండమింద ఇప్పుడు నీళ్లు పారుతా పాచి పట్టింది. నీళ్లు పారకుంటే అది జారేబండ. ఇంతకు ముందు ఎన్నోసార్లు మేమంతా ఆ బండ మీద కాలు చాపి కూర్చోని పిర్రల కింద రాతిపలకలు పెట్టుకోని కిందికి జారే వాళ్ళం. గొందిలోని పసులు, మ్యాకలు, గొర్లు కాసుకుండేకి వచ్చే పిల్లోళ్లందరూ ఆ జారే బండ మింద జారుతా ఆడుకుంటారు.

జారే బండ దిగుతానే నీళ్లు పారి పారి అక్కడ సొంటిగఢ్డ, గరక నట్టంతా జోములెత్తింది. ఆ జోములెత్తిండే ఆ నట్టుమింద జిగట జిగటగా నూనె తెట్ట గట్టినట్ల మెరుస్తా వుంది. ఆడ నీళ్లను కిందికి పోనీకుండా కుళ్లాయి మమోళ్లు కాలవ పొర్రను చేసుకొని వాళ్ళ వొట్టేరు మడికి తిప్పుకుండారు. వొట్టేరు మడి చదరంగా కాకుండా పెద్దపెద్ద వుద్దరాల గెనాలతో డొంపులు డొంపులుగా వుంది. సన్నొడ్ల వరిపైరు కంకులన్నీ అర్రులొంచి గాలికి వూగుతా వుంటే మంచి శబ్దమొస్తాంది.

వొట్టేరు మడిలో కుళ్లాయి మామా, ఆయప్ప బిడ్డలూ ఆడొగరు ఆడొగరు పనిచేసుకుంటా ఉండారు. ఆయప్ప చూస్తే మమ్మల్ని మేడిమాను ఎక్కనియ్యడు. మానెక్కి మేము కోతికొమ్మచ్చి ఆడుతా పైరంతా గబ్బు లేపుతామని గెనాలన్నీ నల్దొక్కుతామని మాను దగ్గరికే రానియ్యడు. అందుకే ఆయప్ప ఇంటకెళ్లిపోయేదంకా జముడు చెట్లు, పులీ కలీచెట్ల చాట్న రోంతసేపు సన్నగా మాట్లాడుకుంటా తొంగిచూడసాగినాం.

ఆ మేడిమాను మింద కోతికొమ్మచ్చి ఆడుకోవడం మాకు భలే ఇష్టం. చెట్టు మొదులు మూడడుగుల ఎత్తుగుడకా వుండదు. కొమ్మలన్నీ పైకి కాకుండా పక్కలకు పోయి పిల్లోళ్ళు ఎక్కి  పోయ్యేకి భలే అనుకూలంగా ఉంటాయి. చెట్టు కింద పైరేందీ పెట్టరు. అయినా మేము పరిగెత్తుతా గెనాలు గబ్బులేపుతామని ఆ మామ దాని దగ్గరికి రానియ్యడు. రోంత సేపయినంక కుళ్లాయి మామ గిత్తల్ని పగ్గాలతో పట్టుకోని వెళ్లిపోయినాడు. ఆయప్ప దూరంగా పోయినంక జతగాళ్లందరూ నన్ను ఉసిగొల్పినారు చౌడమ్మను అడగమని. ఆ వగలాడి వగలు మాటలు మాట్లాడుతాది గానీ మేడిమాను ఎక్కనిస్తాదో లేదో అనుకుంటా దగ్గరికి పోయి అడిగినాను. నేను జీరంగిని పట్టిస్తానని ఆశ చూపినాను. చౌడమ్మ రోంత బింకం తగ్గిచ్చి, మా అక్కయ్యని అడుగు అనింది. రామలక్ష్మమ్మను చూడడమంటే, మాట్లాడడమంటే నాకు చాలా ఇష్టం. ఆ యమ్మ ఎంత అందంగా ఉంటాదో! అంత చక్కగా పెద్దమనిషి మాదిరి మాట్లాడుతాది. నేను రామలక్ష్మమ్మ దగ్గరికి పోయి అడిగినాను. మెల్లిగా నవ్వుతా గెనాలు తెగిపోకుండా మానికొమ్మలు విరిగిపోకుండా ఆడుకోండని చెప్పింది రామలక్ష్మమ్మ. కోతికొమ్మచ్చి ఆడిండే దానికంటే ఆయమ్మ నవ్వుతా మాట్లాడిండేది నాకు ఎంతో సంతోషం కలిగిచ్చింది. మా కులంలోనే కాదు, మా ఊర్లోనే ఎవురూ అంతందంగా లేరని యాలనో వుబ్బిపోతా జతగాలందర్నీ రమ్మని మేడిమానెక్కుతా చౌడమ్మకు జీరంగినిచ్చేకి దగ్గరికి పోయినాను, చౌడీ, తీసుకోకుండా నీ చెల్లెలు పెద్దక్కకు యియ్యని చెప్పింది. ఆనెంక గంటసేపు జతగాళ్లందరము కోతి కొమ్మచ్చి ఆడుకొని పసువుల్ని ఇంటికి తోలుకొని వస్తా రేపు బ్యాల్లోళ్ల చేన్లకాటికిపోయి తూనీగలు, సీతాకోకచిలుకల్తో ఆడుకోవల్లనుకుండాం.

తూనీగలుంటే పచ్చని పంటలున్నట్లే!

నిన్న అనుకున్నెట్లే మేము జతగాళ్ళం అందరమూ బ్యాల్లోళ్ల గొంది పక్క పసువుల్ని తోలుకొనిపోయి గుట్ట లెక్కిచ్చి కిందికొచ్చి జవుకు నీళ్లల్లో రోంతసేపు ఆట్లాడుకోని బ్యాల్లోళ్ళ చేన్ల గట్ల మిందికి పోయినాం. ఆ చేన్లన్నీ చెలికలు చెలికలుగా వుండాయి. వొగ యెకర మంత చెలిక యాదీ లేదు. అన్నీ సన్నసన్నవే! చెలికల నిండా పొచ్చిక రాళ్లే! చేని నిండా  నట్లు గట్లే! అందుకే బ్యాల్లోళ్లు ఆ చేన్లల్లో శెనక్కాయి పెట్టారు. ఎరజొన్న మధ్య మధ్యలో కంది అక్కిడి వేసినారు.

వానలు బాగా పడడంతో నట్లనిండా, గట్లనిండా పరకల గడ్డీ, న్యారేడు గడ్డీ చిప్పరా పిల్లి బిసరా పచ్చగ పెరిగి వెన్నుబోయినాయి. ఎరజొన్న కంకులు ఇంకా పిసుకుళ్లు పట్టలేదు. కంది చెట్లన్నీ పూతబూస్తా ఉండాయి. బ్యాల్లోళ్ల లింగన్న పగ్గాలతో గిత్తల్ని పట్టుకోని నట్లమింద పచ్చిగడ్డి మేపుతా ‘యాటికి లే, అందురూ ఇట్లొత్తిరి’ అని అడిగినాడు. తూనీగలు పట్టుకుండే కని మేము చెప్పినాం. ‘పట్టుకోర్రి, పట్టుకోర్రి’ అని ఒప్పుకుండాడు లింగన్న. మేము సంతోష పడతా గట్లల్లోకి పోయినాం.

గట్ల మిందా నట్ల మిందా ఉండే గడ్డిలో నుంచీ, వెన్నుపోతావుండే గడ్డి వెన్నుల్లో నుంచీ, పులీచెట్ల కలీచెట్ల పూతల్లో నుంచీ యేందో తెలీని కమ్మని వాసన ముక్కుల్లోకి ఎక్కుతా వుంటే ఎంత బాగుందో అనిపిచ్చసాగింది. ఆ వాసనకు దిక్కులేనన్ని తూనీగలూ, సీతాకోకచిలుకలూ, పచ్చని చిప్పర గడ్డి మింద రోకలిబండ పురుగులూ ఇంకా యేంటివేంటివో ఆనందంగా ఎగురుతా చెట్ల మింద వాలుతా పాకుతా పారాడుతా ఉంటే ఎంత ఆనందంగా ఉందో! అవన్నీ కండ్లకు ఎంతందంగా కనిపిస్తా వుండాయో! వానలొచ్చే కాలంలో వానలొచ్చి చేన్లన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతా ఉంటే ఇవన్నీ ఎంత సంతోషంగా పారాడుతా వుండాయో! ఇవన్నీ యిట్లా ఆనందంగా ఎగురుతా ఉంటే పచ్చని పంటలున్నట్లే కదా! ప్రతి సమ్మత్సరం ఇట్లుంటే ఎంత బాగుంటాదో!

గడ్డినట్టులో వొగ రాయి మింద కూర్చొని నా యంతకు నేను ఆలోచిస్తా మురిసిపోతా ఉండాను. ‘ఏమి లే నారాయనా, తూనీగలు దండిగా తిరుగుతా ఉండాయి, పట్టుకుందాం రా లే’ అని పుల్లిగాడు పిలుస్తానే నేను పైకిలేచి వాళ్లెంట తూనీగను పట్టుకుండేకి పోయినాను. బోదగడ్డి వెన్నుమింద వొగ తూనీగ వాలింది. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటా కుడి చెయ్యి మూడేళ్లు ముడుచుకోని బొట్నేలు చూపుడేలును ముందుకు చాపి తూనీగను పట్టుకుండాను. మూతిపైన బుడ్డీలాటీను గ్లాసు మాదిరి రౌండ్‌గా వుబ్బుకోని మెరుస్తా వుంది. గుడ్లు మిటకరిచ్చి చూస్తా వుంది. కడుపు లావుగా ఉంది. తోక ఎంత పొడవుగా ఉందో! తోకమింద అడ్డంగా రంగురంగుల గీతలు! తోక కడాన, పిర్రలేమో వుబ్బుకోనుండాయి. కడుపు కింద మూడు జతల కాళ్లు! ముందరుండే కాళ్ళనే చేతుల మాదిరి పైకి లేపి మూతిని తుడుచుకుంటా వుంది. కాళ్ళకు పైనుంచి కిందిదాకా రంపాల మాదిరి ఈకలు, నీలుక్కోనుండాయి. కడుపు బానకడుపు! కడుపు పైన రెండు జతల రెక్కలు బంగారు కాంతితో ఉల్లి పొరకంటే ఇంగా పల్చగా ఉండాయి. అంత పల్చగా ఇంగ యేందీ ఉండదేమో అన్నెట్లుండాయి. రెక్కల కింద వొగ పుల్ల పెడితే రెక్కలపైన అద్దంలో మాదిరి కనిపిస్తా ఉంది.

అందరూ అవస్తపడి తలా వొగ తూనీగను పట్టుకోనొచ్చినారు. ఐదూ ఐదు రకాల రంగులతో ఎంతందంగా వుండాయో! రామాంజిగాడు తన వేళల్లో ఉండే తూనీగను ఎడమ చెయ్యి అరచేతిలో మెల్లగా పెట్టినాడు. అది రోంత సేపయినంక ముందరి చేతులతో మూతిని తాకిచ్చుకోని కాళ్లతో ఆపక్కా ఈపక్కా నడుస్తా స్పీడుగా రెక్కలు కొడతా పైకిలేచింది. ఆ రెక్కల స్పీడు చెప్పేకి సాధ్యం కాదు. అట్లా స్పీడుగా నాలుగు రెక్కలూ కొడతా ఉంటే వొగ ఫ్యాన్‌ తిరిగినట్ల ఎంతద్భుతంగా కనిపిస్తావుందో! తూనీగ పైకి లేచి, కాకి మాదిరో, గువ్వ మాదిరో నేరుగా ముందుకు పోకుండా, పక్కకూ ముందుకూ పోతా ఉంటే ఎంతందంగా కనిపిస్తా వుందో!

పుల్లిగాడు తన వేళ్ళ మధ్యలో ఉండే తూనీగను అరచేతిలో పెట్టుకుండాడు. దొంగ నాయాలు వాడు, ఎంత గట్టిగా పట్టుకుండాడో యేమో ఒగ రెక్క ఊడిపోయి వాని చేతిలో పడింది. అది చూసి వాన్ని అరిచినాను. వొగ రెక్క ఊడిపోవడంతో ఆ తూనీగ పైకి ఎగిరేకి ఇబ్బంది పడతా ఉంటే చూసి బాధయింది నాకు. ఆ తూనీగ రెక్కలు గోధుమ రంగుతో ఎంత బాగుండాయో! అది కష్టపడతా మూడు రెక్కలనే స్వీడుగా కొడతా పైకెగిరిపోయింది. అంత స్పీడుగా ఆడేటప్పుడు పడిపోని రెక్క, మనిషి పట్టుకుంటానే ఎట్లా పడిపోయిందో ఆలోచన చేస్తా నా తూనీగను చేతితో తాకితే దాని రెక్కలు రాలిపోతాయేమో అని అనుమానపడతా మెల్లగా వొదిలేసినాను. వొదిలేసి ఆనందంగా అందంగా అది రెకల్ని ఫ్యాను మాదిరి తిప్పుతా  ఫైకెగిరిపోతా ఉంటే చూసి ఊపిరి పీల్చుకుంటా సంతోషపడినాను.

తూనీగ రూపాలనూ అవి యెగిరిపోయేదాన్నీ చూస్తా, స్కూల్లో వెంకటస్వామి సార్‌, తూనీగలను చూసే తెల్లోడు యెలీక్యాప్టర్‌ కనుకుండాడని చెప్పిండే మాటల్ని గుర్తుకు తెచ్చుకుండాం అందరమూ! తూనీగ మాదిరి ఎగిరే యెలీక్యాప్టర్‌ను చూడల్లంటే యాటికి పోవల్లనో చూసేకి వీలయితాదో కాదో అనుకుంటా గట్లల్లో పిల్లి బెసరకాయల కోసరం జతగాళ్లతో కలిసి తిరగసాగినాను.

లెక్కలేనన్ని రంగుల్లో సీతాకోక చిలకలు

బ్యాల్లోళ్ల చేన్ల గట్లల్లో పిల్లి పెసర తీగల్ని వెతుక్కుంటూ అందరం పెదగొర్ల నరసమ్మోళ్ల చేని మ్యారగట్టు దంకా పోయినాం. ఆ చేను కంచి రాళ్ల గుట్ట దంకా ఆనుకొని, ఉత్తరం పక్క అనంతపురం తాడిపత్రి రోడ్డు వరకు ఉంది. బ్యాల్లోళ్ల చేన్ల మ్యారలో కంచిరాళ్ల గుట్ట దడి కిందుండే నట్లల్లో రకరకాల గడ్డిపూలూ, పసురాకు పూలూ, ఎర్రగురగా, తెల్లగురగ పూలు, కందిపూలూ, ఆముదం పూలూ, జిల్లేడు పూలూ, కలీపులీ చెట్ల పూలూ విపరీతంగా వుండాయి. నరమ్మోళ్ల చేన్లో వేసిండే శెనక్కాయ చెట్ల పూలు పచ్చగా విరగబూసినాయి. ఆ పూలన్నిట్లో నుంచీ వొస్తా వుండే మంచి వాసన పీల్చుకుంటా ఆ మ్యారలో ఉండే పిల్లి పెసరకాయల్ని పీక్కోని బాగా బలిసిండే గింజల్ని తినుకుంటా రకరకాల రంగుల్లో ఎగురుతా వుండే సీతాకోకచిలుకల్ని చూడసాగినాం.

అన్ని సీతాకోకచిలకల్ని వొగేసారి చూసి అందరమూ మురిసిపోయినాం. నాకైతే చెప్పలేనంత ఆనందం కలిగింది. దాండ్ల నన్నిటినీ వొగ పెద్ద వెదురు జల్లలో వేసుకోని దినామూ చూడల్లనిపిచ్చింది. కొండ దడిగట్టులో పక్కపక్కనుండే కలీపులీచెట్ల పూలమిందా,  జిల్లేడు చెట్ల పూల మిందా వాలిండే ఇరవై ముప్పై సీతాకోకచిలకల్ని గమనిచ్చి అందరమూ కింద కూర్చోని, మాట్లాడకుండా, శబ్దాలు చెయ్యకుండా, సైగలు చేసుకుంటా మెల్లిగా ఆ చెట్ల కాటికి పోయి శానా దగ్గరగా చూసినాం.

వొగొగ సీతాకోకచిలక రెక్కలు వొగొగ రంగులో ఉండాయి. అన్ని రంగులు, ప్రపంచంలో ఎక్కడా వుండవేమో! అన్ని రంగులతో దేశంలో యా జంతువూ వుండదేమో! నేను ఏడెనిమిది రంగుల సీతాకోకచిలకల పక్క అట్లే చూసినాను. దీండ్లకూ తూనీగ మాదిరే రెండు జతల రెక్కలుండాయి. రెక్కల మింద నిలువుగా నాలుగు రంగుల చారలుండాయి. పక్కకొమ్మలో వొగ పువ్వుమింద వాలిండే సీతాకోకచిలక రెక్కల మింద తెలుపూ ఎరుపూ పసుపూ రంగుల్తో నాలుగు అడ్డచారలూ దాండ్ల మింద రంగురంగుల బొట్లూ ఎంతందంగా వుండాయో! ముందు పక్కనుండే రెక్కలు రోంత పెద్దగా, వెనక పక్కనుండే రెక్కలు రోంత సన్నగా వుండాయి. పూల మింద వాలిండే అన్ని సీతాకోకచిలక రెక్కలూ పైకి ఎత్తుకోనుండాయి. వొగపువ్వు మింద నుంచి ఇంగొగ పువ్వు మిందికి ఎగిరేటప్పుడు దాండ్ల రెక్కలు తాటాకుతో చేసిండే విసనకర్ర రెక్కల మాదిరి కనిపిస్తాండాయి. తలకాయలు తూనీగల తలకాయల మాదిరి కాకుండా సన్నగా ఉండాయి. తలకాయ ముందు భాగంలో నుంచి కిందికి నల్లదారం మాదిరి వొంగిండే వొగ ఎంటిక (వెంట్రుక) మందమంత తొండంతో పూల మిందుండే దేన్నో జుర్రుకుంటా వుంది. నేను చూస్తా వుండే సీతాకోకచిలక ఆరు కాళ్లతో వొగ పువ్వు మింద నుంచి మరొగ పువ్వు మిందికి నడుస్తావుంది. దాని ఆరు కాళ్లు పొట్టలో నుంచి ఆ పక్క మూడు ఈ పక్క మూడు పుట్టుకోనొచ్చినట్లుండాయి. కడుపు కొంచెం పొడవుగా కిందికి జారినట్లుంది. ఆరు కాళ్లూ టెంకాయ నారపాసల మాదిరుండాయి. ప్రతి కాలికీ కడుపు దగ్గరా, మోకాలి దగ్గరా పాదం దగ్గర కీల్లుండాయేమో! అది తిరిగినట్లల్లా వొంగుతా వుండాయి. తలకాయికి రెండు పక్కలా రెండు కొమ్ముల మాదిరి గబ్బయిటాకు పువ్వు (ఉమ్మెత్త పువ్వు) మధ్యలో తీనెల మాదిరి పొడవుగా ఎల్లుకోనుండాయి. ఆ కొమ్ముల కడాన కొమ్ము కొప్పుల మాదిరి, అగ్గిపుల్లల కొప్పుల మాదిరి యేంటివో బుడ్డగిచ్చి వుండాయి. తలకాయి మీదుండే ఆ కొమ్ముల మధ్యలో రోంత కింద పక్కనుండే బొచ్చులో సన్నగా కండ్లుండాయి.

నేను చూస్తా ఉండే సీతాకోకచిలకను అంతా గమనిస్తా మెల్లగా నా రెండేళ్లతో దాని రెక్కల్ని పట్టుకొని, దగ్గరికి తీసుకొని, మురిసిపోతా ఎడమ చెయ్యి అరచేతిలో నిలబెట్టి వేళ్ళను పక్కకు తీసినాను. అది రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపొయ్యింది. నేను నా వేళ్ళను చూసుకుంటా ఆశ్చర్యపోయినాను. నా బొట్నేలికీ దాని పక్కనుండే వేలికీ మూడు నాలుగు రంగుల పౌడరు అంటుకోనుంది. నా జతగాళ్లు వొగొగరు వొగొగ రంగుండే సీతాకోకచిలకను పట్టుకోని వదిలేసినారేమో వాళ్ళ వేళ్ళకు ఆ రంగు పౌడరు అంటుకోనుంది. దాండ్ల రెక్కల మింద ఆ రంగు పౌడరు ఎట్లుందో, ఎట్లొచ్చిందో ఆశ్చర్యపోతా దేవుడు వొగొగ దానికి వొగొగ అందాన్నిచ్చి పుట్టిచ్చినాడేమో అనుకుంటా గొందికల్ల పోయినాం. పోతావుంటే వొగ నట్టుమింద ఐయిదారు రోకలి బండలు మా కాళ్ళ శబ్దాలు విన్న్యాయేమో సరక్కన గుండ్రంగా ముడుచుకుండాయి. నేను కిందికివొంగి ముడుచుకోనుండే ఒగ రోకలి బండను పట్టుకోని అరచేతిలో పెట్టుకోని దాన్ని కాళ్లను లెక్కబెట్టి చూసినాను. సన్నని నారపాసల తుంటల మాదిరుండే దాని కాళ్లు ఎన్నున్నాయో లెక్కబెట్టేకి సాధ్యం కాలేదు. జిత్తెడు పొడవుండే రోకలిబండ పురుగు ముడుచుకున్నెంక రూపాయి బిళ్ళంతయ్యింది. రింగులు రింగులుగా వుండే శరీరాన్నంతా అది ఎంత అద్భుతంగా ముడుచుకుందో చూసి దాన్ని అదే గడ్డినట్టు మింద వొదిలేసినాను.

అందరమూ బిరబిరా పోతావుండాం. మమ్మల్ని చూసి వగ తొండాబిక్కి రెండు కాళ్లతో గునగునా పరిగెత్తిపోయి  వొగరాయి మింద నిలిచి తలకాయి యెత్తెత్తి చూడసాగింది. దాన్ని చూస్తా మా పుల్లిగాడు తటెక్కన న్యాలమింద బోర్లా పాట్నా పండుకోని కాళ్ల బొట్నేళ్లు న్యాలకు ఆనిచ్చి రెండు చేతులూ వూదబొడిసి తొండాబిక్కిని ఎక్కిరిస్తా దాని మాదిరే తలకాయిని మాటిమాటికీ పైకెత్త సాగినాడు. వాని చేష్టలు చూసి అందరమూ నవ్వుకుంటా గొందిలేకి పోయినాం.

మా అమ్మయ్య వారం దినాల నుండీ చింతకాయలూ, తెల్లజొన్నల్లో వుండే నల్లమట్టి పెల్లలూ ఎక్కువగా తినసాగింది. అదిచూసి, యెందుకు మా మట్టి పెల్లలు తింటావుండావు  అని అడిగినాను. ‘తినబుద్ధి అయితా వుంది బూసీ,’ అని అమ్మయ్య సిగ్గుపడసాగింది. యెందుకో నాకు అర్థం కాలేదు. మజ్జిగ కోసరం పోయినప్పుడు రామేవాళ్ల రామక్కత్తను అడిగినాను. ‘ఇంగో నాలుగైదు నెల్లకు నీకు యింకొగ తమ్ముడొత్తాడ్రా’ అని ఆ అత్త చెప్పింది. మా నలుగురికీ యింగొగడు తోడయితాడని అప్పుడు నాకర్థమైంది.

వరి మళ్లన్నీ వెన్ను పోతావుండాయి. మా ఢిల్లీభోగాల మడి మొత్తం వెన్నుపోయి, రిక్కరిక్కలుగా వుండే వెన్నులు అన్నీ సరిసమానంగా వొగేఎత్తుతో కొలత పెట్టినట్లు నిక్కబొడుచుకొని ఎంతందంగా వుండాయో! కేసరొడ్లు సన్నొడ్లు వొంకొడ్లు చెన్నంగి వొడ్లూ ఇంగ యావడ్ల పైర్లూ ఇట్లుండవెందుకో! వొక్కొక్క కయ్యలో వెన్నుబోయిన పైరు, రోడ్డు పక్కనుండే కంకరమదిర మాదిరి, ఎంత బాగుందో! చూసేకొద్దీ మల్లా మల్లా చూడల్లని పిస్తావుంటే పది వెన్నుల్ని కలిపి చెంపకు ఆనిచ్చుకొని దినామూ మురిసిపోసాగినాను.

చూస్తా చూస్తా వుండంగనే వెన్నులన్నీ గింజపట్టి అర్రులొంచినాయి. వొక్కొక్క వెన్నులో నూటాయాభై నుంచీ ఇన్నూరు గింజలుండాయి. ఇంగ ఇరవైదినాలకంతా మళ్లన్నీ కోతకొస్తాయి. నాయన వరినాట్లు తేరుకున్నెంక కలుపు తీయిచ్చి పైరుకు పిండి చల్లే వరకూ సక్రమంగా ఆకులగంప ఎత్తుకొని పోలేదు. దాంతో ఇంట్లో వుండే బూగింజలు (బువ్వ గింజలు) అన్నీ అయిపోయినాయి. అమ్మయ్యకూ కూలిపనులు లేవు. ఇంట్లో జరగడం కష్టమైపోయింది. నాయన ఆకులమ్ముకొని వొచ్చేకి ఇంగా రెండుమూడు దినాలు పడతాది. అంతవరకూ ఎసిట్లో బియ్యపు గింజలకు ఎట్లజెయ్యల్లనో యేమో! రాత్రి బుడ్డీదీపానికి గబ్బునూనె కూడా లేదు. అదెట్ల జెయ్యల్లనోయేమో, ఇప్పటికే వరట్టరంగయ్య దగ్గర కాఫీపొడికీ, బెల్లానికీ, అగ్గిపెట్టికీ, గబ్బునూనెకూ సుమారుగ మూడు రూపాయలు బాకీ అయ్యింది, మల్లా గబ్బునూనెకు పోతే యేమంటాడో యేమో, బుడ్డీ అంటిచ్చకపోతేమానె, దేవరమూల గూట్లో దీపాంతిలో రోంత ఆముదమూ దూదీ వుంటే దాన్ని ముట్టిచ్చి రోంతసేపు దీపం పెట్టుకోవచ్చు. రోంత గంజి చేసుకుండేకి గుడకా నాలుగు నూకలు లేవే, రాత్రికి పిల్లోల్లను యెట్ల పస్తుపండబెట్టేది అని అమ్మయ్య చాలా దిగులుపడింది.

అమ్మయ్య తాను ఇంటి పనిచేసే చిన్నపాపయ్యోళ్ల ఇంటికి పోయి వొగ మూట వడ్లు నాగుకు అడుగుదామనుకుంది. మొన్ననే రెండు మూటల యూరియా కోసరం నూరు రూపాయలు అప్పుజేసినాడు నాయన, ఆ అప్పుకు గాను నాలుగు మూటలు వడ్లు కల్లంలోనే కొలిచిస్తానని పాపయ్యకు కాగితం  రాయిచ్చొచ్చినాడు. ఇప్పుడు మల్లా వొగ మూట వడ్లు నాగుకు ఇమ్మని అడిగితే పాపయ్య ఇస్తాడో లేదోనని వాళ్ళను అడగడం వద్దనుకొంది అమ్మయ్య. గుళ్లే మునెప్ప దగ్గరికి పోయి వొగ నూర్రుపాయలు అప్పు అడగచ్చు, ఆయప్పేమీ లేదనడు. అయితే నూర్రుపాయలకు సుంగిడి పల్లావడ్లు అడుగుతాడు. ‘నెల దినాలకే నూర్రుపాయలకు వొగ మూట ఢిల్లీభోగాల వడ్లు వడ్డీకింద ఇయ్యల్లంటే మాటలా? తనకు చెప్పకుండా తెచ్చుకుంటే నాయన యేమంటాడోయేమో’ అని భయపడి మునెప్పను అడగడము వొద్దనుకుంది అమ్మయ్య.

వెనకింటి జోడోళ్ల నాగమ్మ పెద్దమ్మను వొగ నాలుగు శేర్ల నూకలు బదులు అడుగు దామనుకొని ‘తూ.., తూ.., సరి కులస్తుల్ని అడిగేబదులు, పస్తు పండుకుండేది మేల’ని బాధపడసాగింది అమ్మయ్య. సాయంకాలం అయితా వుంది. నన్నూ, పెద్దక్కనూ పక్కన కూర్చోబెట్టుకొని అమ్మయ్య దిగులుపడతా వుండంచూసి నాకు మనసంతా యెట్లో అయిపోయింది. వొగపక్క అమ్మయ్య మింద కోపం కూడా  వొచ్చింది నాకు. యాది బజార్లో అమ్మేకొచ్చినా ముందూ యెనకా చూడకుండా చాటలు చాటలు వడ్లు పోసి అమ్మయ్య యాల కొనల్ల? ఇంటి పరిస్థితి తనకు తెలీదా? ఉన్నప్పుడు తను జీనుత్తంగా వుండకుంటే యెట్ల?

ఈ సమయంలో చిన్నాయనోళ్ళన్నా వుంటే బాగుండేది! అమ్మయ్య వాళ్ళిద్దరితో వూరకనే, చిన్నదానికి కొట్లాడింది. మూన్నెళ్ళనుండీ వాళ్ళతో మాటలే లేవు. నార్పల దగ్గరుండే సుల్తాన్‌పేటకు వెళ్ళిపోయినారు. ఇంతకు ముందొగసారి చిన్నాయనోళ్ళు సుల్తానుపేటలో వడలూ, గుగ్గిళ్ళూ అమ్ముకుంటా చాలాదినాలు ఆడనే వుండారు. ఇప్పుడు ఆటికే పోయినారు. పోతాపోతా చిన్నాయన నన్ను దగ్గరికి పిల్చి వొగ అర్ధణా చేతికిచ్చి కన్నీళ్ళుబెట్టి ‘బాగా సదుకోప్పా’ అని చెప్పినాడు. అప్పుడు చాలా బాధయింది నాకు. నేనూ కన్నీళ్ళుపెట్టినాను. మడికోతలప్పటికి వస్తానులే అని బండెక్కిపోయినారిద్దరూ.

అమ్మయ్యను మనసులో వొగవైపు తిట్టుకుంటానే యింకొగ పక్క యాది కొనినా అమ్మయ్య దాచుకొని తిన్లేదు గదా, పైగా పిల్లోళ్లు, బజార్లో అమ్మేటివన్నీ కొనిచ్చుకొని మాకు చూపిస్తా వెక్కిరిచ్చుకుంటా తింటావుంటే, మేము కండ్లు కండ్లు యిడుస్తా చూస్తావుంటేనే కదా, అమ్మయ్య పౌరుషానికి పోయి ఆ ప్రకారంగా చాటలు చాటలు గింజలు అలాకుజేసి కొనిచ్చిండేది? అని మనసులో అమ్మయ్య మింద కోపం తగ్గిచ్చుకొని నేనూ దిగులు పడసాగినాను. అంతలోనే మా వెనకింటి చాకల చౌడక్క పెద్దమ్మ యేదో పనిమింద ఇంటి ముందుకొచ్చి, యేం పెద్దులూ, యింగా పొయ్యి అంటీ లేదా అని అడిగింది. యెవరమూ నోరు విప్పలేదు. చౌడక్క పెద్దమ్మ కతికిచ్చి గట్టిగా అడిగింది. అమ్మయ్య కండ్లనిండా నీళ్లుపెట్టుకొని ఉన్న సంగతి చెప్పింది. వెంటనే ఆ పెద్దమ్మ ఇంటికి పోయి వొగ డబరాగిన్నెలో ఐదు శేర్ల బియ్యం తెచ్చిచ్చింది. పిల్లోల్ల ముఖాల్లో యేందో తెలియని సంతోషం కనిపిచ్చింది. నాకయితే చెప్పలేనంత దుఃఖమొచ్చింది. నేను బాధపడితే అమ్మయ్య ఇంకా బాధపడతాదని లేచి బయటకొచ్చి, దొడ్డి దగ్గరికి గడ్డికట్టలు తెచ్చేకి పోయినాను. గడ్డివామి కూడా అయిపో వొచ్చింది. వానలు బాగొచ్చినాయి కాబట్టి పెద్దక్కా, నేనూ పొద్దున వొగరూ సందకాడ వొగరూ మాగాణి పిల్లకాలవ గట్లమింద, మడిగెనాలమింద, వంకదళ్ల మింద పెరుగుతావుండే పచ్చిగడ్డిని కోసుకొని  వొచ్చి పశువులకు వేస్తావుండడం వల్ల వరిగడ్డి వాడకం తక్కువైంది. అందుకే అది ఇంకా రోంతవుంది.

మూడు దినాలయినంక నాయన  వొచ్చినాడు. అమ్మయ్యను దండిచ్చినాడు, ఇంటి పరిస్థితులన్నీ తెలుసుకొని బాధపడినాడు చెయ్యి దుబారా తగ్గిచ్చుకోమని అరిచినాడు. మరుసటి దినం పొద్దున్నే నాయన చిన్న పాపయ్యోళ్ళ ఇంటికి పోతా నన్నూ పిల్చుకొని పోయినాడు. మడికోత విషయం మాట్లాడి ఇంటి పరిస్థితి చెప్పి వొగ మూట వొడ్లు, బదులు అడిగినాడు నాయన. పాపయ్య రోంతసేపు గొనిగి ‘బదులంటే అయ్యెల్లేదు వెంకటస్వామీ! నెల దినాలయినంక కదా నువ్విచ్చేది! కేసరొడ్లు (కేసరివడ్లు బియ్యం ఎర్రగా ముతకగా వుంటాయి) పాతవి వుండాయి. నాగుకు అయితే ఇస్తాను. నాగుతో కలిపి ఢిల్నీభోగాలొడ్లు వొగటింకాలు మూట, కల్లంలోనే కొలిచి యిచ్చేటట్టయితే తీసుకొని పో!’ అని ముజిగుంబరం ల్యాకుండా చెప్పినాడు పాపయ్య. వేరే నిర్వాకం (గత్యంతరం) ల్యాక నాయన సరే అన్నాడు. నేనూ అమ్మయ్యా రెండుసార్లు తిరిగి ఆ మూట వడ్లు ఇంటికి చేర్చినాం. వెంటనే మూడు గంపల్లోకి వొడ్లను మాదిగిండ్ల దగ్గరుండే రోళ్ల బండ మిందికి చేర్చినాం.

మా బండమీదపల్లి బండమీద సుమారుగ ఇరవై రోళ్లుండాయి. వూరందరూ వడ్లు దంచుకుండేది ఆ బండమీదనే? అమ్మయ్యా, నేనూ, పెద్దక్కా మూడు రోకండ్లతో వడ్లు దంచేకి దిగినాం. మూడు రోకండ్లతో వొగరి తర్వాత వొగరు రోకలిపోటు వెయ్యడం చాలా కష్టం. నాకూ పెద్దక్కకూ ఇంకా బాగా అలవాటు కాలేదు. అందుకే ముగ్గురము దంచేటప్పుడు రోకల రోకలి తగలి పొన్ను శబ్దాలు రావడం చూసి, కాళ్లమీద రోకలి పడితే కష్టమని, పెద్దక్కను వొద్దని చెప్పింది అమ్మయ్య. పక్కన రెండు రోళ్లదగ్గర, బోయ పెదనాగప్పోళ్లూ, మాదిగ పెద్దవోబన్నోళ్లూ మూడు రోకండ్లతో వడ్ల మింద, వొగరి తర్వాత వొగరు పోటేస్తా, కాళ్ళతో వడ్లను రోట్లోకి తోస్తా దంచుతా వుంటే ఎంతో అద్భుతం అనిపిచ్చింది నాకు. అమ్మాయ్యా, నేనూ రోంతసేపు దంచినాం, దంచేటప్పుడు అమ్మయ్య రోంత ఆయాస పడసాగింది. అమ్మయ్య ‘నిండుమనిషి’ (గర్భవతి) కదా! అందుకే ఆయాసపడతా వుందని అర్థం చేసుకొని అమ్మయ్యను బలంతంగా కూర్చోమని చెప్పి పెద్దక్కా, నేనూ నాలుగు వాయిల్లో వడ్లన్నీ దంచినాం. నిలుచుకొని, నేల (బండ) రోటి మింద వడ్లను రోకండ్లతో పోటేస్తా, కాళ్ళతో తోసుకుంటా దంచడం బాగుందని, చాలా సులభమని అనిపిచ్చింది నాకు.

మా వూరి వడ్లబండ కొంచెం ఎత్తులో వుంటాది. అందుకే దంచిన వడ్లనూ, అలసంద, పెసర గింజలనూ, తూరుపు పోసుకోడానికి గాలి బాగా తగుల్తా (వస్తా) వుంటాది. పెద్దక్కా నేనూ వాయిలు వాయిలుగా దంచుతూ వుంటే, అమ్మయ్య దంచినవడ్లను తూరుపు వేయసాగింది. ముగ్గురమూ వొగ గంట సేవు పోరాడినంక రెండు చిన్నగంపల నిండా ముడిబియ్యం అయినాయి. పెద్ద గంపనిండా వరిపొట్టు  వొచ్చింది. అన్నీ ఎత్తుకొని ఇంటికి చేరుకుండాం.

ఇంగ, వొగ గుంతరోట్లో పోసి ముడిబియ్యం దంచల్ల. మా ఇంట్లో రోటికుదురు లేదు. చాకల చౌడక్క వాళ్లింట్లో వుంది. కుదురును ఎవురూ వేరే యింటికియ్యరు. అందుకే అమ్మయ్య డబరానిండా ముడిబియ్యం నన్ను వేసుకొని రమ్మనింది. ఇద్దరమూ వాళ్లింటికి పోయినాం. చౌడక్క వాళ్ళింటి వసారాలోని అరుగులో రోలును భలే బాగా పొందేసి, అరుగు కట్టినారు. కుర్చీలో కూర్చున్నెట్ల మూడు పక్కలా ముగ్గురు కూర్చొని రోట్లో ముడిబియ్యం పోసి, కుదురు పెట్టి, మూడు రోకండ్లతో దంచేకి ఆ రోలు చాలా అనుకూలంగా వుంది..! అమ్మయ్యా, నేనూ ఎదురూ బదురూ కూర్చొని ముడిబియ్యం అన్నీ దంచినాం. దంచిన బియ్యమన్నీ తెచ్చి మా అరుగు మింద దుప్పటి పరిచి చెరిగింది అమ్మయ్య. సుమారుగ వొగ తవ్వనిండా తవుడు వొచ్చింది. అది, కడుగునీళ్ల తొట్లేకి వేసి తాపితే దున్నపోతులు నీళ్లు భలే తాగుతాయని, వొగ డబ్బాపావునిండా తీసుకొనిపోతే వడుగూరోళ్లు చెంబునిండా మజ్జిగ పోస్తారని నేను సంబరపడినాను.

పొయ్యిలో కట్టెలు అయిపో  వొచ్చినాయి. వరిమళ్ల కోతలు మొదలయి నంక పొయ్యిలో కట్టెలు కోసరం యెంపర్లాడేకి సాధ్యం కాదని వూరోళ్లందరూ దేవరకొండలో జెముడు కట్టెలు కొట్టుకొని వచ్చేకి పూనుకుండారు. ఆలస్యమయితే మంచి మొద్దులుండే జెముడు చెట్లు దొరుకవని, నేను శనివారం బడికి శెలవు బెట్టి రెండు దినాలు కట్టెలు కొట్టేకి పోతే మేలని చెప్పింది అమ్మయ్య. సరే అని నేనూ పెద్దక్కా గొడ్లీ, మచ్చుకొడవలి తీసుకొని కొండకు బయలుదేరినాం. వద్దని చెప్పినా వినకుండా అమ్మయ్య కూడా మా వెంట  వొచ్చింది. దేవరకొండలో వూరందరూ ముసురుకుండారని మేము ‘ఢమాం గుట్ట’ పైకి పోయినాం, అక్కడా అయిదారు మంది జెముడు చెట్లు నరుకుతా వుండారు. నేనూ, పెద్దక్కా వొగ నారవ పక్క నుండే పెద్ద జెెముడు చెట్టును చూసి సంతోషపడినాం. ఢమాం గుట్ట మీదుండేటివన్నీ గుండు జెముడు చెట్లని, దాండ్లల్లో మొద్దులు లావుగా వుండవని ఎవురూ ఆ గుట్టకు పోరు, జెముడు చెట్లకంటే ఆ గుట్టలో కలీచెట్లూ, పులీచెట్లూ, బలుజుచెట్లూ, జానచెట్లూ యెక్కువగా వుంటాయి.

నేను మూతికి టువ్వాలు చుట్టుకొని గొడ్లితో జెముడు రెమ్మలన్నీ జాగ్రత్తగా భయపడతా భయపడతా కొట్టేసినాను. నిరుడు, ఇట్లాటప్పుడే, అమ్మయ్యా, నేనూ జెముడు రెమ్మలు నరికేటప్పడు జెముడు పాలుచిట్లి, ఇద్దరి ముఖాలూ పెదింతలావు వాసినాయి. నాకయితే జెముడు పాల దెబ్బతో ముఖమంతా వాసి కండ్లు రెండూ పూడక పోవడంతో వారం దినాలు అల్లాడిపోతిని. ఆ పాలు కండ్లల్లో పడితే కంటిచూపే పోతాదంట! అందుకే పెద్దక్కా, నేనూ ముఖాలకు పూర్తిగా గుడ్డలు కట్టుకొని, రెండు పెద్ద జెముడు చెట్ల రెమ్మలన్నీ, పాలు ముఖాల మీదికి యెగరకుండా యెంతో వొయినంగా జివిరేసి పెద్ద కొమ్మలను నరికేసినాం. మధ్యలో మనిషెత్తు నిలబడిన మొదళ్ళను కింద బుడం వరకూ నేను నరికి కింద పడేసినాను. కిందపడిన ఆ పచ్చి మొద్దుల్ని చూస్తానే నాకు మా ఇంటి వొంకిరి దూలాల మీద అడ్డంగా వేసిన జెముడు దంతెలు గుర్తుకొచ్చినాయి. అట్ల గుర్తుచేసుకుంటా మా యింటి పూర్వీకుల బతుకుల్ని గురించి ఆలోచిస్తా, జెముడు మొద్దుల్ని నిలువుగా రెండ్రెండు దబ్బలుగా పగలజీల్చినాను, జెముడు మొద్దుల మధ్యలో నిలువుగా తొర్రలుంటాయి. ఆ తొర్రల నిండా గట్టిచీడ వుంటాది. మొద్దుల్ని దబ్బలుగా చీలుస్తానే జెముడు పాలు కారబట్టినాయి. ఈసారి మేము జాగ్రత్తపడడంతో ముఖాల మీద పాలు పడలేదు. మెడకింద అక్కడక్కడ పడి తోలువాసింది. మొద్దుల నుండీ కారుతా వుండే పాల చుక్కలు గట్టిపడి జిగటగా మారిపోవడం చూసి, ఈ పాలనుండీ ఎవురైనా మందు కనుక్కోవచ్చునని అనుకుంటా ముఖానికి చుట్టుకోనుండే టువ్వాల విప్పబీకినాను.

జెముడుచెట్లను ఆ మాదిరిగా నరికి దబ్బలు చేసిపోతే, పాలన్నీ కారిపోయి, పసిమంతా బాగా ఆరిపోతే, బరువు తగ్గిపోతాయి. మధ్యలో రెండుసార్లు  వొచ్చిచూసి, బాగా ఆరిన తర్వాత ఎత్తుకొనిపోయి ఇండ్లదగ్గర మండీ పేర్చుకుంటారు మావూరోళ్లు. అక్కడ ఆ మొద్దులు రెండు వారాలుండినా వేరే వాళ్లెవురూ ముట్టుకోరు. ఇది మా పల్లెల్లో వుండే వొగ మంచి కట్టుబాటు. కట్టెలే కాదు, వరిమళ్లుకోసి, కల్లాల్లో కుప్పలేసి  వొచ్చినా రాత్రిపూట మా కట్టకింద పల్లెల వాళ్లెవురూ ముట్టుకోరు, కల్లాలన్నీ అయిపోయినంక వరిగడ్డి వాములన్నీ నాలుగైదు నెలలు పొలాల్లోనే వుంటాయి. యానాడూ వొగ గడ్డికట్ట తక్కువైందీ లేదు. శానా అరుదుగా, మాగాణి లేని ఆ యెగవపల్లెల్లో వుండే పరంబోకు నాయాళ్లు వొగరిద్దరు చేసిండే లేకిపనులవల్ల ఈ మధ్యలో మా వూరోళ్లు కోతల కాలంలో రాత్రిపూట కల్లాల దగ్గరికి కావలి పోతావుండారు గానీ, మా పల్లెలోళ్లు యానాడూ దొంగతనం చేసిందే లేదని అనుకుంటా ముగ్గురమూ ఇంటికి బయలుదేరినాం. వస్తా వస్తా గుట్ట దడిలో ఇరగ్గాసిన అడవి పండ్లచెట్ల పక్క చూసినాం. మాగిన కలీపండ్లు నల్లగా, పులీపండ్లు తెల్లగా, బలుసుపండ్లు ఎర్రగా జానపండ్లు గోరింటాకు మాదిరి కనిపిచ్చడంతో ముగ్గురమూ పీక్కుంటా తినుకుంటా గుడ్డల్లో మూటగట్టుకోసాగినాం. కలీపండ్లు తియ తీయగా, పులీపండ్లు పుల్లపుల్లగా వుండాయి. బలుసుపండ్లు ఎర్రగా పూర్తి మాగినవి చాలా తియ్యగా వుండాయి. ఆ పండ్లమీద ఎక్కువగా కండే వుండదు. ఎన్ని తినినా తిన్నట్లే వుండదు, పైగా బలుసుచెట్ల కంపలు చాలా కొస్సిగా వుండి ఆ పండ్లు పీక్కుండేటప్పుడు ముండ్లు, సూదుల మాదిరి గుచ్చుకొని, వేళ్ల మొనల్లో రక్తం కారుతావుంటే పండ్లతోపాటు వేళ్లనూ నోర్లల్లోపెట్టుకుంటా నవ్వుకుంటా సుమారుగ పీక్కుడాం. నాలుగు దినాల కిందట బోయోళ్ల నారమ్మా, రంగమ్మా ఆ పండ్లన్నీ పీక్కోని గంపల్లో పోసుకొని అమ్మేకి  వొచ్చినప్పడు బలుసుపండ్లూ, జానపండ్లూ కొనియ్యమని చిన్నోడు పెద్దన్న ఎంత యేడ్చినా అమ్మయ్య కొనియ్య లేదు. ఇప్పుడు వాని కోసరమే సుమారుగ పీక్కుండాం.

ఈ పండ్లు అన్నిటికంటే నాకు జానపండ్లు భలే ఇష్టం. అవి రెండు రెండు విత్తనాలతో పిల్లివట్టకాయల మాదిరి బొగు సొగసుగా, దవనం కలర్లో చాలా బాగుంటాయి. తీపి పులుపులతో తినడానికి చాలా రుచిగా వుంటాయి. అన్ని రకాల పండ్లనూ వేరేవేరే గంట్లు కట్టుకొని, ముగ్గురమూ ఇంటిదావ పట్టినాం.

(ఇంకా ఉంది)

Exit mobile version