Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాత్రి వెలుగు

[కరణం హరి కిషన్ గారు రచించిన ‘రాత్రి వెలుగు’ అనే కవితని అందిస్తున్నాము.]

గటి వెలుగు ఒక ప్రహసనం,
లోకం కోసం తొడిగిన వేషాల రంగుల వేడుక!
క్షణక్షణం అంతరాయాలు, పనుల హడావిడులు,
మోగే ఫోన్ల గోలలు, నిరంతర ఒత్తిళ్ళు..
పగటి వెలుగులో జగతి పరుగు,
నేనొక ముసుగు ధరించిన బొమ్మను!
కానీ.. రాత్రి వస్తుంది,
శాంతించిన సమయపు తీరాలను తాకుతూ వస్తుంది.
ఫోన్ల సవ్వడి ఆగిపోతుంది,
మాట్లాడే మనుషుల హోరు శమిస్తుంది.
బయటి ప్రపంచాన్ని చూసే కంటికి విశ్రాంతి,
లోపలి ప్రపంచాన్ని వెతికే మనస్సుకు ప్రశాంతత!
రాత్రి నిశ్శబ్దంలోనే వికసిస్తుంది ఆత్మ వెలుగు!
నన్ను వీడిపోయిన మనుషుల జ్ఞాపకాలు,
దూరమైన ఆలోచనల ఊరేగింపులు..
నాలోని ముసుగులను ఒక్కొక్కటిగా తొలగించి,
నన్ను నేనుగా నా ఎదుట నిలబెట్టే వేళ ఇది!
సూర్యుడు చీకటిని తోలేస్తాడంటారు,
వెలుగుతో లోకాన్ని నింపుతాడంటారు.
కానీ నాకు తెలుసు..
బాహ్య ప్రపంచాన్ని చూపేది పగటి వెలుతురైతే,
నాలోని అజ్ఞానపు చీకటిపై కాంతిని ప్రసరించేది ఈ రాత్రే!
ఏకాంతపు అద్దంలో నా లోపాలను నాకు ఎరుక పరిచేది ఈ సమయమే!
రాత్రి అంటే కేవలం చీకటి కాదు,
అది నా అంతరంగ జ్ఞాన ప్రయాణానికి తొలి పొద్దు.
బాహ్య ప్రపంచపు శబ్దాలన్నీ ఆగిపోయిన ఈ ప్రశాంతతలోనే..
నేను నన్ను వెతుక్కునే పరమ సత్యం దొరుకుతుంది!

Exit mobile version