Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-10

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

 

10

కవిసమ్రాట్ విశ్వనాథ వారు చమత్కరించినట్టు ‘ఇది యొక విచిత్రము’ అని అనుకోవాలి మన చరిత్రకారులు, హేతువాద, కమ్యూనిస్టులు, భారతీయ సాంస్కృతిక విధ్వంసకారుల పోకడలను చూసి. రావణుడు లంకలో పుట్టి.. పెరిగి పెద్దవాడై సమ్రాజ్యాన్ని ఏలాడా? లేక సెటిలరా? పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ (ముందటి వ్యాసాల్లో పేర్కొన్నట్టు) తమిళుడు లేదా ద్రావిడుడైన రావణుడిని తమిళేతరుడైన రాముడొచ్చి హతమార్చాడన్నారు. రామరావణ యుద్ధంలో చనిపోయిన వారందరూ తమిళులేనని కూడా సూత్రీకరించారు. ఉత్తరాది వారైన ఆర్యులెవరూ కూడా చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారని పేర్కొన్నారు. పుస్తకాలు రాశారు. ఉద్యమాలు చేశారు. రామాయణాన్ని తగులబెట్టండన్నారు. తమిళ స్వాభిమానాన్ని నిలబెట్టండని పిలుపునిచ్చారు. ప్రతి తమిళుడూ రావణుడిని పూజించాలని, రామాయణాది గ్రంథాలను విసిరి పారేయాలనీ అన్నారు. పెరియార్ రామస్వామి రాసిన నాటకాలనే చరిత్రగా, వాల్మీకి రాసిన రామాయణంగా ఇంటర్‌ప్రెట్ చేస్తూ వచ్చారు.

వాల్మీకి రామాయణం రావణుడి పుట్టుక గురించి కానీ, ఎదుగుదల గురించి కానీ మొదటి ఆరు కాండల్లో పెద్దగా చర్చించలేదు. రాయలేదు. రావణుడి పుట్టుక గురించిన చర్చలో ఉత్తర కాండలో విస్తృతంగా వస్తుంది. రావణ వంశ చరిత్రను గురించిన ప్రస్తావన ఉంటుంది. ఉత్తరకాండ రెండవ సర్గ నుంచే రావణుడి మూల పురుషుడి చర్చతో మొదలవుతుంది. బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైన పులస్త్యుడు ప్రజాపతి. అతడు రుషి సంప్రదాయాన్ని స్వీకరించి మేరు పర్వతం దగ్గరకు వెళ్లి దానికి ఒక వైపు ఉన్న తృణ బిందు ఆశ్రమంలో నివసించాడు. ఇది రెండో సర్గలోని మొదటి ఏడు శ్లోకాలు చెప్తున్న సారాంశం.

ఈ మేరు పర్వతం ఎక్కడ ఉన్నది? ఈ మేరువు గురించి పరిశోధకులు చాలా రిసర్చ్ చేశారు. మన ఇతిహాసాల్లో, పౌరాణిక గాథల్లో మేరు శిఖరం గురించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తాయి. రామాయణంలోనే కిష్కింధ కాండలో 44వ సర్గలో ఉత్తర దిక్కున ఉన్న అట్లస్‌ను సుగ్రీవుడు సవివరంగా చెప్పుకొస్తాడు. మైనాక పర్వతం దాటిన తర్వాత శైలోద నది ఉంటుంది. దీని తరువాత మేరు పర్వతం ఉన్నదని చెప్పాడు. ‘ఉత్తర కురురాజ్యం జంబూద్వీపానికి 24 వేల యోజనాల దూరంలో ఉన్నద’ని సుగ్రీవుడు చెప్పాడు. ఉత్తరాన శూన్య ప్రదేశం లేదా నిర్జన ప్రదేశం దాటిన తరువాత చైనా తర్వాత రష్యా ప్రాంతం ఒకనాడు పెద్దగా జనాభా ఉన్న ప్రాంతం కాదు. ఎందుకంటే అతి మంచు ప్రాంతం కావడం వల్లన అక్కడ జీవజాలం తక్కువగా ఉన్నదని పేర్కొన్నాడు. దీని తరువాత కిర్గిస్తాన్ ఉన్న ప్రాంతాన్ని ఉత్తర కురురాజ్యంగా వర్ణించాడు. కల్హణుడి రాజతరంగిణిలో లలితాదిత్య ముక్తాపీడుడి కాలంలో ఉత్తర కాశ్మీర్‌కు అవతల ఉన్న రాజ్యాల గురించిన వర్ణనలో కాంభోజ, తుశాల, భౌత్త, వాలకంబుధి, ఉత్తర కురు, స్త్రీరాజ్య అని మరి కొన్ని రాజ్యాల గురించి చెప్పుకొచ్చాడు. ఉత్తర కురు తరువాత స్త్రీ రాజ్యం గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉన్నది కానీ, వివరాలు లేవు. మహాభారతం ప్రకారం నీల పర్వతానికి దక్షిణాన, మేరు పర్వతానికి ఉత్తరాన ఉత్తర కురురాజ్యం ఉన్నదని పేర్కొన్నారు. ఈ రాజ్యం చాలా విశాలమైనది. దేవతలు, గంధర్వులు, కిన్నర, కింపురుష, అప్సర స్త్రీలు ఉన్నారని సుగ్రీవుడు చెప్పాడు. ఇదే సందర్బంలో అనేక పర్వతాలలో దేవసఖ, కాల, నీల, సుదర్శన, కైలాస, క్రౌంచ, మైనాక, సోమగిరి, మేరు పర్వాతాలను గురించి విస్తారంగా చెప్పుకొచ్చాడు. దేవసఖ (శీషపంగ్మ) నేపాల్‌లో ఉన్నది. ఉత్తరాన కైలాసం ఉన్నది. కైలాసంతో పాటు 8 వేల కిలోమీటర్ల ఎత్తు ఉన్న పర్వతాలు 14 ఉన్నాయి. ఉత్తరాన కుబేరుడి అలకాపురి ఉన్నదని సుగ్రీవుడు చెప్పాడు. కైలాస పర్వతానికి 177 కిలోమీటర్ల దూరంలో అలకాపురి గ్లేసియర్ ఉన్నది. దీని తరువాత సుదర్శన పర్వతం కనిపిస్తుంది. కైలాసానికి మరి కొంత దూరంలోనే క్రౌంచ పర్వతం ఉన్నది. దీని తరువాత కిర్గిస్తాన్ వరకు కారాకోరం పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. కజకిస్తాన్ ప్రాంతంలోని అల్టాయ్ పర్వతాన్ని రామాయణంలో నీల పర్వతంగా పేర్కొన్నారు. ఆ తరువాత పామిర్స్ పర్వత శ్రేణులను మేరు పర్వతంగా పిలిచారు. దీని తరువాత సోమగిరి పర్వతం ఉన్నది. కిష్కింధకు ఉత్తరాన ఉన్న భూభాగం గురించి సుగ్రీవుడు చెప్పిన అంశాలివి. మేరు పర్వతం మన దేశానికి ఉత్తరం వైపున రష్యాకు సమీపంలో పామిర్స్ పర్వతాలను మేరు పర్వతంగా సుగ్రీవుడు పేర్కొన్నాడు.

ఈ అంశాన్ని గురించి మరింత పరిశోధన జరిగింది. కోట వెంకటాచలం తన జంబూద్వీపము దాని విభాగములు అన్న గ్రంథంలో మేరువు ఎక్కడున్నది.. దాని వివరాలు ఏమిటన్నది చర్చించారు. ఇందుకు సంబంధించి ఆయన ఒక పటాన్ని కూడా అందించారు. దీని ప్రకారం.. ‘లంకకు 90 డిగ్రీల వద్ద తూర్పున యుండిన యవకోటి యను పట్టణమున్నది. దానికెదురుగా రోమకమను పట్టణముండి యున్నది. దూర్పు దిక్కు కెదురుగా నుండినది పడమరదిక్కు అని ప్రసిద్ధము. ఇప్పుడు జంబూద్వీపము చుట్టునుగల నిరక్షరేఖ మీదుగా దక్షిణ సముద్ర తీరమున గల లంక నుండి బయలుదేరి నడిచిన తూర్పున 90 డిగ్రీ వద్ద యవకోటి పట్టణమును, దానికి 90 డిగ్రీల దూరమున అంటే 180 డిగ్రీల దూరమున ఉత్తరాన సిద్ధపురి పట్టణమును దానికి తొంబది డిగ్రీల దూరమున అనగా లంకనుండి తూర్పుగా 270 డిగ్రీల వద్ద రోమక పట్టణమును గుర్తిస్తూ.. దక్షిణం వైపు వెళ్తే లంకకు జేరుదుము. అనగా లంకకు సరిగా 180 డిగ్రీల దూరంలో సిద్ధపురి యున్నదన్నమాట. ఈ దృష్టితో పటము మీద మన పూర్వులు పురాణములలో చెప్పబడిన నవ వర్షములను గుర్తించుదము. దక్షిణమున భారత వర్షము, దానికుత్తరమున హిమాలయ పర్వతము, దానికుత్తరమున కింపురుష వర్షము, దానికుత్తరమున హేమకూల పర్వతము, దానికుత్తరమున హరివర్షము, దానికుత్తరమున నిషధ పర్వతము, దానికుత్తరమున ఇలావృత వర్షమును గలవు. ఇలావృత మధ్యమున మేరువు గలదు. లంక నుంచి 90 డిగ్రీల సరళ రేఖలో మేరువు దానికుత్తరమున రమ్యక వర్షమును, దానికుత్తరమున శ్వేత పర్వతము, దానికుత్తరమున హిరణ్యక వర్షమును, దానికుత్తరమున శృంగవాన్ పర్వతతము దానికుత్తరమున ఉత్తర కురువర్షము గలవు.’

సుమేరు: పృథ్వీ మధ్యే శ్రూయతే దృశ్యతే నతు.. అని యామల్ తంత్ర గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ అక్కడ మేరువు కనిపించదు. ఈ తంత్ర గ్రంథాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు. విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం మేరు పర్వతం తూర్పున మందాచలం, పశ్చిమాన సుపార్శ్వం, ఉత్తరాన కుముద, దక్షిణాన కైలాస పర్వతాలు ఉన్నాయని చెప్పున్నది. దీనిక ప్రకారం కూడా పామిర్స్ శ్రేణులు భారతానికి ఉత్తరాన మేరువుగా సూచన చేస్తున్నాయి. ఈ విశ్వోద్భవ శాస్త్రం బౌద్ధ మతానికి సంబంధించింది. దీని ప్రకారం కూడా మేరువుకు దక్షిణాన జంబూద్వీపం ఉన్నది. భౌద్ధంలోనే అభిధర్మ కోశ భాష్యం ప్రకారం ఈ మేరువు 80 వేల యోజనాల వెడల్పు, 80 వేల యోజనాల ఎత్తు కలిగి ఉన్నది. భాగవతం కూడా దీని ఎత్తును 84 వేల యోజనాలుగా పేర్కొన్నది. భూమిని పాతాళంతో, స్వర్గంతో కలుపుతుందని భాగవతం చెప్తుంది. జైన విశ్వోద్భవ శాస్త్రంలో కూడా ప్రపంచం మధ్యలో లక్ష యోజనాల విస్తీర్ణంలో మేరువు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇది మేరువు గురించిన అధ్యయనం. రావణుడి పితామహుడు అంటే తాతగారు అయిన పులస్త్య ప్రజాపతి నివాసం మేరువు. ఈ మేరువు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది. ఈ పులస్త్యుడు.. రాజర్షి అయిన తృణబిందు కూతురును వివాహమాడి.. పౌలస్త్యుడనే కుమారుడికి జన్మనిచ్చాడు. ఇతడు తండ్రి బాటలో పయనించాడు. వేదాధ్యయనం చేశాడు. తపశ్శాలి. ఈ పౌలస్త్యుడే విశ్రవసుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఈ విశ్రవసుడికి భరద్వాజ మహర్షి తన కూతురును ఇచ్చి వివాహం చేశాడు. ఈ భరద్వాజ ఆశ్రమం.. ప్రస్తుతం ఉన్న ఉత్తర ప్రదేశ్ లో ఉన్నది. ప్రయాగ్ రాజ్ సమీపంలో దీని ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి. భారత పురాతత్త్వ శాఖ మాజీ డైరెక్టర్ బీబీ లాల్ ఈ ఆశ్రమ ఆనవాళ్లను కనుగొన్నారు. భరద్వాజ ఆశ్రమం ఉన్న ఉత్తరప్రదేశ్ లోనే బిస్రాఖ్ (ప్రస్తుత పేరు) అన్న ప్రాంతంలో విశ్రవసుడు ఆశ్రమం నిర్మించుకొని వేదాధ్యయనం చేస్తూ నివసించాడు. ఆయన పేరు మీదనే ఆ ఊరికి బిస్రాఖ్ అన్న పేరు వచ్చింది. భరద్వాజుడి కూతురును వివాహం చేసుకున్న విశ్రవసుడు ఆమె ద్వారా వైశ్రవసుడు అనే కుమారుడిని కన్నాడు. అతడే కుబేరుడు. తండ్రి బాటలోనే తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ధనాధ్యక్ష పదవి సంపాదించుకున్నాడు. తరువాత తండ్రి విశ్రవసుడి దగ్గరకు వెళ్లి తనకు ఓ పర్మినెంట్ ఇల్లు కావాలని అడిగాడు. దానికి విశ్రవసుడు ఆయనకు లంకా నగరాన్ని చూపించాడు. ‘పుత్రా.. దక్షిణ సముద్ర తీరమునందు త్రికూటమను పర్వతమున్నది. దాని పైభాగమున మహేంద్రుని నగరము వంటి విశాలమైన నగరమున్నది లంక అను, రమ్యమైన ఇంద్రుని అమరావతి వంటి ఆ నగరమును రాక్షసుల నివాసార్థమై విశ్వకర్మ నిర్మించెను. నీవు ఆ లంకలో నివసించుము. నీకు క్షేమముగుగాక.. అక్కడ ఇప్పుడు ఎవరూ లేరు. విష్ణువు భయముచేత రాక్షసులందరూ అక్కడి నుంచి రసాతలము క్రిందికి వెళ్లిపోయినారు. ఈ విధముగా ఇప్పుడు లంక శూన్యముగా ఉన్నది. దానికి ప్రభువు ఎవరూ లేరు. పుత్రా నీవు అక్కడ నివసించుటకు సుఖముగా వెళ్లుము’ (రామాయణం ఉత్తరకాండ 3వ సర్గ 21-30 శ్లోకాలు).

అంటే.. పులస్త్యుడి కొడుకైన విశ్రవసుడి కొడుకైన వైశ్రవణుడు లేదా కుబేరుడు ఉత్తర ప్రదేశ్ లోని బిస్రాఖ్ నుంచి బయలుదేరి ఎప్పుడో విశ్వకర్మ అనే ఆర్కిటెక్ట్, రాక్షసుల కోసం కట్టిన ఒకానొక నగరం.. లంక. ఆ లంకలో అంతకుముందున్న రాక్షసుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి విష్ణుమూర్తి వారిని తరిమేస్తాడు. ఆ లంకలో కుబేరుడు నివాసమున్నాడు. అలా పారిపోయిన వారిలో సుమాలి అనే అసురుడు కొన్నాళ్లు రసాతలంలో అండర్‌గ్రౌండ్‌లో ఉండి.. తరువాత మళ్లీ వెలుగులోకి వస్తాడు. అలా బయట తిరుగుతున్నప్పుడు ఒక రోజు ఈ లంకలో ఉన్న కుబేరుడు తన తండ్రి అయిన విశ్రవసుని చూసేందుకు వెళ్తూ వెళ్తూ ఈ సుమాలి కంట పడ్డాడు. ఆ కుబేరుడి వైభవాన్ని చూసి సుమాలి కళ్లు బైర్లు కమ్మాయి. ఇంటికి పోయాక చాలా ఆలోచించాడు. మనం ఏం చేస్తే సదరు కుబేరుడిలాగా తయారవుతాం అని తెగ మధన పడ్డాడు. చివరకు అతనికి సూపర్ ఐడియా వచ్చింది. తనకు పెళ్లి కాని కూతురు ఉంది. ఆమె పేరు కైకసి. ఆమెకు పెళ్లీడు వచ్చింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి.. విశ్రవసుడు అనే ఆయన ఉన్నాడు. అతను చాలా మంచివాడు. బుద్ధిమంతుడు. ప్రజాపతి వంశంలో పుట్టినవాడు (బ్రాహ్మణుడు అని అనలేదు). నువ్వు అతడిని వరించుము. నీకు కుబేరుడు లాంటి కొడుకులు పుడతారు అని కన్విన్స్ చేశాడు. దీంతో ఆ కైకసి.. తన తండ్రి చెప్పినట్టుగా విశ్రవసుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్లింది. సాయంకాల అగ్నిహోత్రము అంటే హోమం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లిన కైకసి విశ్రవసుని పాదాలను చూస్తూ.. తాను తన కాలి బొటనవేలిని మాటిమాటికి రాస్తూ నిలుచుందిట.. (పెళ్లిచూపుల్లో సిగ్గు పడతారే అలాగా). హోమం తరువాత విశ్రవసుడు ఆమెను పలుకరించాడు. కొద్దిసేపు మాటల తరువాత విశ్రవసుడు ఏమన్నాడో చదవండి. ‘ఓ మంగళప్రదురాలా నీ మనస్సులో ఉన్న కారణమేదో నాకు తెలిసినది. ఓ మత్త గజగమనమా.. నీకు నా వలన పుత్రులు కలుగవలెనని కోరిక ఉన్నది. కానీ నీవు నా వద్దకు దారుణమైన సంధ్యా సమయమున వచ్చినావు. అందువల్ల నీకు ఎట్టి పుత్రులు కలిగెదరో వినుము. నీకు భయంకరులు, భయంకరమైన ఆకారము కలవారు, క్రూరులైన బంధువుల యందు ప్రీతి కలవారు, క్రూరములైన పనులు చేయువారు అయిన రాక్షసులు పుత్రులుగా పుట్టెదరు’ (ఉత్తరకాండ 20-22). కైకసి మాత్రం తనకు అలాంటి కొడుకులు వద్దంటే వద్దని బతిమాలుకుంది. దీంతో ఆయన నీకు మూడో కొడుకు మాత్రం ధర్మాత్ముడిగా పుడతాడు అని చెప్పాడు.

ఇక రావణుడు ఎలా పుట్టాడో చదవండి.. ‘ఆ కన్య భయంకరుడు, చాలా క్రూరుడు అయిన రాక్షస రూపము గల పుత్రుని కనెను. ఆ పిల్లవానికి పది కంఠములు, పెద్ద కోరలు, ఎఱ్ఱని పెదవులు, ఇరవై చేతులు, పెద్ద నోళ్లు, ప్రకాశించుచున్న జుట్టు ఉన్నది. అతడు నల్లని కాటుక కుప్పవలె నుండెను. అతడు పుట్టగానే నిప్పు ముద్దలు నోళ్లలో ఉన్న ఆడనక్కలు, మాంసము తిను మృగాలు, అపసవ్యముగా, గుండ్రముగా తిరిగినవి. దేవుడు రక్తము కురిపించెను. మేఘములు కటువుగా ఉరిమెను. సూర్యుడు ప్రకాశించలేదు. భూమిపై పెద్ద ఉల్కలు పడెను. భూమి అదిరెను. దారుణములైన గాలులు వీచెను. క్షోభింపశక్యము కాని నదీపతియైన సముద్రము క్షోభ చెందెను‘ (ఉత్తరకాండ 27-31).

రావణుడు పుట్టిన ప్రాంతం ఉత్తర ప్రదేశ్. రాముడు పుట్టిన ప్రాంతం కూడా ఉత్తర ప్రదేశే. ఇక రావణుడు తమిళుడు లేదా ద్రావిడుడు ఎట్లా అయ్యాడు? రావణుడు లంకకు వచ్చిన ఉత్తరాది సెటిలర్. అంటే పెరియార్ కానీ, సోకాల్డ్ హేతువాదులు, లిబరిస్టులు చెప్తున్నట్టు లేదా చెప్పినట్టు అర్యులు అనే మాట జాతి వాచకంగా భావిస్తే.. రావణుడు సదరు జాతికి చెందినవాడిగానే భావించాలి. యుద్ధకాండలో మండోదరి కూడా   “ఆర్య పుత్రా” అని రావణుడిని పిలుస్తుంది. దీనికి ఈ మేధావులు ఏం చెప్తారో చూడాలి.

ఇక రావణుడు లంకకు ఎట్లా చేరుకున్నాడో తరువాతి వ్యాసంలో చర్చించుకుందాం. కానీ లంకకు రావణుడు వచ్చి సెటిలయ్యాడన్నది నిజం. కనీసం కొన్ని తరాలుగా రావణుడి వంశం వాళ్లు లంకలో ఉన్నారంటే లోకల్ అని అనుకోవచ్చు. కానీ, లంకను రావణుడు నేరుగా వచ్చి ఆక్రమించుకున్నాడు. లంకానగరం తన మాతామహులు, తల్లి తరపు తాత సుమాలిది కదా అని అనవచ్చు. కానీ ఆ సుమాలికి సైతం విశ్వకర్మ గిఫ్ట్‌గా ఇచ్చిందే. ఆ తరువాత విష్ణువుతో యుద్ధం తరువాత ఊరొదిలిపెట్టి వాళ్ల తాత వెళ్లిపోయాడు. పారిపోయాడు. రసాతలమనే మరోచోట సెటిల్ అయిపోయాడు. అలా  కొన్నేండ్ల పాటు  పడి ఉన్న తరువాత మరీ ఖాళీగా ఉండటం ఏమిటని.. దాన్ని కుబేరుడికి ఆయన తండ్రి ఉండటానికి అనువుగా ఉంటుందని చెప్పి పంపించాడు. ఆ తరువాత రావణుడు ఆ కుబేరుడిని వెళ్లగొట్టి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ కథ మరింత వివరంగా తరువాతి వ్యాసాల్లో చదువవచ్చు.

(ఇంకా ఉంది)

Exit mobile version