[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
12
రావణుడు తొలినాటినుంచీ శివభక్తుడేనా? ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందని అందరూ అనుకోవచ్చు. ఆ ప్రశ్న తలెత్తడం కూడా సహజమే. ఎందుకంటే రావణుడు శివభక్తుడు అవునా కాదా అనే ప్రశ్నే తలెత్తకూడదదు. ఎందుకంటే మనం ఇంతకాలం చూసిందీ.. విన్నది, చదువుకొన్నది కూడా రావణుడు మహా శివభక్తుడేనని. శివుడికి పరమ ప్రియ భక్తులలో అగ్రగణ్యుడు రావణుడనే మనకు తెలుసు. అసలు రావణుడు నిజంగా దైవభక్తుడేనా? అంటే కాదనే చెప్పాలి. మనం ముందుగానే చెప్పినట్టు రావణ కథ ఉత్తర కాండలోనే ఉన్నది. ఇక్కడే రావణుడి వ్యక్తిత్వం ఏమిటన్నది మనకు ఆవిష్కారమవుతుంది. రావణుడు ఒక సారి బ్రహ్మకోసం తపస్సు చేశాడు. మరొకసారి.. తప్పనిసరిగా పరమేశ్వరుడి పాదాలు పట్టుకొన్నాడు. రావణుడు పుట్టిన తరువాత వాళ్లమ్మ గారైన కైకసికి.. సవతి కొడుకు కుబేరుడిని చూసి తీవ్రమైన అసూయ కలిగింది. అతడు ధనాధ్యక్షుడు కావడం, అంతులేని సంపదను సాధించడం, పుష్పక విమానం లాంటి అద్భుతమైన విమానంలో విలాసవంతంగా తిరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయింది. తన కొడుకులు ఎలాగైనా కుబేరుడిని మించిన వారు కావాలని, అతడిని మించిన ధనాధిపతి కావాలని, అధికారం సంపాదించాలని కోరుకుంది. అప్పటికి కైకసి భర్త కానీ, మామగారు కానీ.. మహర్షులు, బ్రహ్మర్షులు. కానీ కైకసి మాటతో రావణుడికి కుబేరుడిపై తీరని అసూయ, ద్వేషంతో పాటు మితిమీరిన ఆగ్రహం కలిగింది. వెంటనే తల్లికి ప్రామిస్ చేశాడు. ‘తల్లీ, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా.. తేజస్సు చేత నా సోదరునితో సమానుడను గాని, అధికుడను గాని కాగలను. మనస్సులో ఉన్న సంతాపమును విడువుము’ (ఉత్తరకాండ 9వ సర్గ, 43-47 శ్లోకాలు). అదే కోపంతో తపస్సు చేయాలని బయలుదేరాడు. అన్నదమ్ములు రావణ, కుంభకర్ణ, విభీషణులు ముగ్గురూ పశ్చిమ సముద్ర తీరంలో గోకర్ణ క్షేత్రం వెళ్లి అక్కడ బ్రహ్మకోసం తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మనుంచి వరాలు పొందాడు. ‘నిత్యుడవైన ప్రజాపతీ! నన్ను పక్షులు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, దేవతలు చంపజాలకుండునట్లు వరమిమ్ము. నాకు ఇతర ప్రాణుల విషయమున చింత ఏదీ లేదు. మనుష్యులు మొదలైన ప్రాణులందరూ తృణముల వంటి వారని తలచెదను’ (ఉత్తరకాండ 10 వసర్గ 15-20శ్లోకాలు). బ్రహ్మ అతను కోరిన వరాలు ఇచ్చాడు. రావణుడు కోరని కోరికలు కూడా మరీ ఇచ్చాడు. విభీషణుడికి, కుంభకర్ణుడికి కూడా వరాలు దక్కాయి. ఈ వరాలు అన్నవి ఒక టార్గెటెడ్ లక్ష్యం కోసం సాధించినవి. అయితే. కుబేరుడి మీద కోపంతో, కుబేరుడిని సాధించడం కోసం.. తనకంటూ సూపర్ స్టేటస్ సంపాదించుకోవడం కోసం సంపాదించినవి. ఆ వరాలు వచ్చీ రావడం తోనే రావణుడు మొట్టమొదట చేసిన పని కుబేరుడిని తన నివాసం నుంచి (లంక) బెదిరించి మరీ నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టాడు. తన తల్లికి సవతి కొడుకు పై ఉన్న కసిని తీర్చాడు. కానీ కుబేరుడి ఆధిపత్యం తగ్గనే లేదు. అతడు లంకను వదిలాడు కానీ.. అలకాపురికి వెళ్లి మరో అద్భుత నగరాన్ని నిర్మించుకున్నాడు. కానీ, అక్కడ కూడా కుబేరుడిని సుఖంగా ఉండనివ్వలేదు. వర గర్వంతో ఎవరిని పడితే వారిని వేధించడం.. వాళ్లపై అత్యాచారాలకు ఒడిగట్టడంతో శత్రువులు పెరిగిపోయారు. దీంతో కుబేరుడు అతడికి మంచి చెప్పాలని చూశాడు. తనను లంక నుంచి వెళ్లగొట్టాడన్న కోపం పెట్టుకోలేదు. సవతి తమ్ముడని ద్వేషించలేదు. తన తరఫున ఒక ప్రతినిధిని పంపించి అతడికి సలహా ఇచ్చాడు. ఇక్కడ కుబేరుడు తన ప్రతినిధితో చెప్పించిన మాట అతడిని భయంకరమైన కోపం తెప్పించింది. ‘రాక్షస రాజా నీవు అనేకమార్లు నన్ను నిరాకరించినావు. బాలుడు అపరాథము చేసిననూ అతనిని బంధువులు రక్షించవలెను కదా.. నేను రుద్రుని అనుగ్రహము సంపాదించు వ్రతమును అవలంబించి నియమవంతుడనై ఇంద్రియములను నిగ్రహించుకొని ధర్మమును ఉపాసించుటకై హిమవత్పర్వతముపైకి వెళ్లితిని. అక్కడ నేను పార్వతితో కూడి సర్వ సమర్థుడైన పరమేశ్వరుణ్ణి చూచితిని. దైవ వశముచేత నా ఎడమకన్ను అక్కడ ఉన్న పార్వతిదేవిపై ప్రసరించినది. రాక్షసరాజా! ఈమె ఎవరై ఉండునా అను ఉద్దేశముతోనే నేను అట్లు చూచినాను. కాని మరో కారణము చేత కాదు. పార్వతి సాటిలేని రూపము ధరించి అక్కడ ఉండెను. దేవి దివ్య ప్రభావము చేత నా ఎడమకన్ను మాడిపోయినది. దాని కాంతి బూడిద చల్లిననట్టు పచ్చగా అయిపోయినది. పిమ్మట ఆ పర్వతము మీదనే మరియొక విశాలమైన చరియకు వెళ్లి ఎనిమిది వందల సంవత్సరములు మౌనముతో ఆ మహా వ్రతము ఆచరించితిని. ఆ నియమము పూర్తి అయిన పిమ్మట అక్కడ సమర్థుడైన మహేశ్వరుడు సంతోషించిన మనస్సుతో నాతో, ‘ధర్మములు తెలిసిన, మంచి నియమములు గల ఓ కుబేరా! నీ విషయమునందు నేను సంతోషించితిని. ఈ వ్రతమును పూర్వము నేను చేసితిని. ఇప్పుడు నీవు చేసినావు. ఇట్టి వ్రతము చేయగల మూడవవాడు ఎవ్వడూ లేడు. చేయుటకు చాలా కష్టమైన వ్రతమును పూర్వము నేనే కనుగొన్నాను. అందువల్ల ఓ కుబేరా! నీవు నాతో స్నేహమును అంగీకరించుము. తపస్సు చేత జయించబడిన మిత్రుడవు కమ్ము అని నాతో స్నేహం చేశాడు. ఈవిధంగా నేను శంకరునితో స్నేహము పొందాను.’(ఉత్తరకాండ 13వ సర్గ, 16, 32 శ్లోకాలు) అని చెప్పాడు. దేవతలు తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా నచ్చజెప్పాడు. కుబేరుడు తన దూతతో చెప్పించిన మాటలు రావణుడికి పట్టరాని కోపం తెప్పించింది. అన్నింటికీ మించి మహేశ్వరుడు తన ఫ్రెండ్ అని చెప్పడాన్ని రావణుడు అస్సలు తట్టుకోలేకపోయాడు. రావణుడు ఏమన్నాడో చూడండి. ‘ఆ కుబేరుడు చెప్తున్నది నాకు హితము కాదు. ఆ మూఢుడు తనకు మహేశ్వరునితో మైత్రి ఏర్పడినట్లు చెప్పుకొనుచున్నాడు కదా.. వాడి మాటల వల్ల బహు పరాక్రమము చేత మూడు లోకములను జయించవలెనని నిర్ణయించుకున్నాను’ (ఉత్తరకాండ 13 వ సర్గ, 33-41 శ్లోకాలు). కుబేరుడితో పాటు మొత్తం నలుగురు లోకపాలకులను చంపేస్తానని చెప్పాడు. వచ్చిన దూతను చంపేసి.. ఆ శవాన్ని తినేయమని రాక్షసులకు అప్పగించాడు. ఆ తరువాత జరిగిన కుబేరుడితో యుద్ధం సంగతిని ముందరి వ్యాసంలోనే తెలుసుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పరమ శివభక్తుడు, శివుడికి ప్రీతిపాత్రమైన భక్తుడు అయిన రావణుడు ఇలా ఎలా మాట్లాడాడు. మహేశ్వరుడితో మైత్రి అన్న మాట కూడా రావణుడికి నచ్చలేదు. శివుడితో ఫ్రెండ్ షిప్ చేసిన కుబేరుడిని మూఢుడని తూలనాడాడు. శివుడి మీద అనిష్టత ప్రకటించిన తొలి సందర్భం ఇది. శివుడితో స్నేహం అంటేనే చికాకు పడ్డ రావణుడి శివభక్తి గురించి ఆతని భక్తాగ్రేసరులు ఏమని విశ్లేషిస్తారో చూడాలి.
తరువాత రావణుడు శివుడిని స్తోత్రం చేశాడు. వేడుకున్నాడు. శివుడి కోసం విలవిల్లాడిపోయాడు. అది ఎలాగో చూద్దాం. ఇది అందరికీ తెలిసిన కథే. తన అన్న కుబేరుడిని జయించిన తరువాత విజయానికి గుర్తుగా పుష్పకాన్ని లాక్కొని.. అందులో ఎక్కి లంకవైపు బయలుదేరాడు రావణుడు. కుబేరుడి నగరం అలకాపురి కైలాస పర్వతానికి దగ్గర్లోనే ఉంటుంది కాబట్టి.. రావణుడు ఎక్కిన పుష్పకం వెళ్లాల్సిన దారి కైలాసం పైనుంచే ఉంది. ఈ పర్వతం దగ్గరకు రాగానే పుష్పకం ఆగింది. ఇంతవరకు అందరికీ తెలిసిన కథే. ఇది కూడా ఉత్తరకాండలోనే ఉన్నది. ఇక్కడ మనకు తెలిసిన సన్నివేశం.. ఎన్టీరామారావుకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 1960 ల నాటి సీతారామకల్యాణం సినిమాలో చూపించిందీ ఏమిటో కూడా అందరికీ తెలిసిందే. ఇవాళ్టికీ ఆ అద్భుత చిత్రీకరణను చూసి మనం ఆహా అనుకుంటుంటాం. సినిమాలోనూ.. బయట కూడా చాలామంది వివరించే కథనం ఏమిటంటే ‘పర్వతం దగ్గర పుష్పకం అకస్మాత్తుగా ఆగగానే ఎందుకు ఆగిపోయిందని రావణుడు ఆగ్రహంతో ఊగిపోతే.. నారదుడు వచ్చి.. మనవడా.. ఎందుకు అంత ఆగ్రహం? శివపార్వతులు నాట్య లీలావిలాసంలో మునిగి ఉన్నారు.. ఆ సమయంలో ఎవరూ కూడా పర్వత ఉపరి భాగంపై నుంచి పోజాలరు. కాబట్టి.. నువ్వు వినయంగా వెళ్లి ఆ మహాదేవుడిని దర్శనం చేసుకొని ప్రసన్నం చేసుకొని వెళ్లు అని ఉపదేశిస్తాడు. దాంతో రావణుడు పరమేశ్వరుడి దర్శనానికి వెళ్లుతుండగా నంది అడ్డుకుంటాడు. అప్పుడు రావణుడు పర్వతం కింది భాగం నుంచే మహేశ్వరుని ధ్యానిస్తాడు. ఆ తరువాత పర్వతాన్ని పెకిలిస్తూ.. శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తాడు.. దీంతో మహాదేవుడు ప్రసన్నుడై.. దశగ్రీవా నన్ను ఎలుగెత్తి పిలిచిన నీవు ఇకనుంచి రావణ పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని నరవానరులు మినహా మిగతావారెవరి చేతుల్లో మరణం సంభవించకుండా వరమిస్తాడు’ ఇదీ మనకు తెలిసిన కథ. అందరం నమ్ముతున్న కథ. కానీ, మహేశ్వరుడితో స్నేహం ఉన్నదని దూత చెప్పడంతోనే పౌరుషం ముంచుకొచ్చి ఆ దూతను చంపి.. అన్నకుబేరుడిపై యుద్ధం చేసి ఓడించి నానా హంగామా చేసిన రావణుడు అంతలోనే అపారమైన శివభక్తుడు ఎలా అయ్యాడన్నది ప్రశ్న. ఉత్తరకాండలోని 15, 16 సర్గల్లో ఇదే కథను ఎలా చెప్పారో చదవండి. ‘పుష్పకంలో బయలుదేరిన రావణుడు.. కైలాసం దగ్గరకు రాగానే పుష్పకం ఆగిపోయింది. అదేమిటని ఆశ్చర్యపోయిన దశగ్రీవుడు పుష్పకం నుంచి కిందకు దిగి.. అక్కడ వానర రూపంలో ఉన్న నందిని చూసి పుష్పకం ఆగిపోవడానికి కారణం తెలుసుకున్నాడు. అప్పుడు నంది మాట్లాడుతూ.. పరమేశ్వరుడు పార్వతీదేవితో లీలామానుషుడై నర్తిస్తున్న విషయాన్ని వివరించాడు. ఆ కారణంగా పర్వతం పైభాగం నుంచి చిన్న పక్షి కూడా ఎగురదని.. అటోమేటిగ్గా ఆగిపోతుందని, అలాంటి వ్యవస్థ ఉన్నదని వివరించాడు. అంటే.. బహుశా మన ఫోన్లు పనిచేయకుండా జామర్లు పెడతారే, అలాంటిదే అప్పుడున్న టెక్నాలజీ కావచ్చు. దీంతో రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. కోపంతో ఊగిపోయాడు. “ఎవరీ శివుడు? నేను వస్తున్నానని తెలిసి నాకు భయపడాల్సిన అవసరం ఉన్నదని గుర్తించడం లేదా?” అని ఎగిరెగిరి పడ్డాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన నందిపై కూడా విరుచుకుపడ్డాడు. అక్కడితో ఆగలేదు. కోపంతో ఆ పర్వతాన్ని పెకిలించి అవతల పారేద్దామని మూర్ఖంగా ముందుకెళ్లి దాన్ని కదిలించాడు. లేపాడు. కానీ అతని బలం అంతవరకే పనిచేసింది. పర్వతం పడిపోవడంతో.. దానికింద దశగ్రీవుని చేతులు పడి తీవ్రంగా నలిగిపోయాయి. చేతులను బయటకు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నొప్పికి తాళలేక పెడబొబ్బలు పెట్టాడు. అరిచాడు.. ఏడ్చాడు.. విలవిల్లాడిపోయాడు. చివరకు అతడి వెంట వచ్చిన ఇద్దరు తమ్ముళ్లు, మంత్రులు, ఇతర నాయకులు అందరూ కలిసి ఆలోచించి దశగ్రీవుని దగ్గరకు వెళ్లి.. “అయ్యా, ఇప్పుడు నీకు వేరే అవకాశం ఏదీ లేదు. నువ్వు నీ ఈగోను పూర్తిగా పక్కన పెట్టేసి, ఆ శివుడినే వేడుకో.. తప్పయిందని అను. స్తోత్రం చేయి. నీవే నన్ను ప్రమాదం నుంచి బయటపడేయాలని కోరుకో, ఆ విధంగా ముందు ఈ ప్రమాదం నుంచి బయటపడు” అని సలహా ఇచ్చారు. అప్పుడు ఇక తప్పక, గతిలేక, దాదాపు వెయ్యేండ్లపాటు శివుడికి వేడుకుంటూనే ఉన్నాడు. స్తోత్రం చేశాడు. తనను కాపాడాలని కోటి దండాలు పెట్టుకున్నాడు. చివరకు శివుడు దయతలచి కిందకు వచ్చి.. నువ్వు వెయ్యేండ్ల పాటు ఘోరంగా ఏడ్చావు కాబట్టి.. రావణ పేరుతో ప్రసిద్ధుడవవుతావు అని మరో వరం నరవానరులతో ఇబ్బంది లేదు కానీ మిగతావారితో మాత్రం మరణం రాకుండా వరం తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తరువాత మహాదేవుడితో గొడవ పెట్టుకోలేదు. కానీ తీవ్రమైన భక్తి ప్రదర్శనం ఎక్కడా చేయలేదు. అందుకు సంబంధించిన దాఖలాలు కూడా ఎక్కడా మనకు కనిపించవు. ఇంద్రజిత్తు యుద్ధం సమయంలో యజ్ఞం చేసినట్టు కనిపిస్తంది కానీ రావణుడి విషయంలో అలాంటిదేదీ కనిపించదు. ఇంటర్నల్‌గా ఏమైనా పూజలు చేసుకున్నాడేమో.. వాల్మీకికి వాటిని పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం అనిపించలేదేమో మరి.
ఇదీ ఉత్తరకాండలో రావణుడి దగ్గర శివుడి ప్రస్తావన వచ్చిన ఒక సందర్భం, శివుడి దగ్గర రావణుడు వ్యవహరించిన తీరుకు సంబంధించిన కథలు. వీటిలో ఎక్కడైనా, ఏ దశలోనైనా అతడు పరమ భక్తి సంగతి దేవుడెరుగు.. అసలు సాధారణ భక్తుడిగానైనా వ్యవహరించాడా? పైగా అహంకారంతో శివుడి పేరెత్తినందుకు ఒకడిని ఛంపాడు. మరొకడిని సాక్షాత్తూ అన్నను పరాభవించాడు. అన్న ఆస్తిని కొల్లగొట్టాడు. చివరకు పుష్పకాన్ని ఆపినందుకు ఏకంగా శివుడినే నిందించాడు. శివుడే తనకు భయపడి తీరాల్సిందేనన్న దురహంకారంతో పెట్రేగిపోయాడు. చిట్టచివరకు పర్వతం కింద చేతులు ఇరుక్కుపోయి పరాభవం ఎదురైన తరువాత కూడా గట్టిగా అరిచాడు తప్ప శివుడిని వేడుకోలేదు. చివరకు మంత్రులు వచ్చి నీకు మరో గతి లేదు అని చెప్పిన తరువాత కానీ, దిక్కులేక మహాదేవుని కాళ్లమీద పడాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా రావణుడు శివపూజాదురంధరత గురించి మరెక్కడా మనకు కనిపించదు. కనిపించిన రెండు సార్లూ కూడా శివవ్యతిరేకిగానే కనిపించాడు. అలాంటప్పుడు ఆతడిని మహాశివభక్తుడని ఏవిధంగా చెప్పగలమో విజ్ఞులు చెప్పాలి. ఇక భూకైలాస్ సినిమాలు, ఆత్మలింగ కథ సరేసరి. ఇప్పుడు మేధావులు రావణుడు ఎంత శివభక్తుడో.. శివుడి ప్రథమ పూజారో ఆతగాడిని ప్రశంసించేవారు చెప్పాలి. ఉత్తరకాండలోని రావణుడి చరిత్రలో ఎంత దారుణమైందో.. దుర్మార్గమైందో చాలా స్పష్టంగానే ఉన్నది. అలాంటప్పుడు ఈ రావణుడికి లేని పోని గొప్పతనాన్ని ఆపాదించే కథలు ఎట్లా పుట్టుకొచ్చాయి? అన్నది ప్రశ్నార్థకమే. వీటికి ఏ రకమైన మూలాధారం లేదు. చివరకు ఈ కథలనే పూర్తిగా నిజం చేశారు. భారతీయ ధార్మికవాదులైనా ఈ నిజానిజాలను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించారా అంటే అదీ లేదు. పైగా రావణుడి శివభక్తిత్వాన్ని వీళ్లు కూడా పూర్తిగా అంగీకరించారనే చెప్పాలి. ఇందుకు ఆధారభూమిక ఏమిటంటే.. రావణుడి పేరుతో కొన్ని స్తోత్రాలు ఉండటం, కొన్ని మంత్రాలు ఉండటం.. వీటిని ఆధారం చేసుకొని రావణుడు శివభక్తుడని ఖరారుచేశారు. అంతే తప్ప రావణుడు గొప్ప శివభక్తుడని చెప్పటం మాత్రం సమంజసమైన విషయం మాత్రం కానే కాదు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
