Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-13

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

13

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే, గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్।

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం, చకార చండతాండవం తనోతు నః శివః శివమ్॥

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ, విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని।

ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే, కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ॥

ఇది శివతాండవ స్తోత్రం.. చాలా ప్రసిద్ధమైంది. ఇది రావణుడి రచనగానే చలామణిలో ఉన్నది. దీనికి రెండు రకాల కథనాలు మనకు కనిపిస్తాయి. మహాదేవుడి దర్శనం కోసం దక్షిణ సముద్ర తీరం లోని లంక నుంచి పాదయాత్ర చేసుకుంటూ కైలాసానికి వచ్చిన రావణుడు పరమేశ్వరుడిని శివతాండవ స్తోత్రం చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకున్నాడని ఒక కథనం ప్రచారంలో ఉన్నది. రెండో కథనం అందరికీ తెలిసిందే. అలకాపురికి వెళ్లి అన్న కుబేరుడిని జయించిన తరువాత పుష్పకం స్వాధీనం చేసుకుని తిరిగి లంకకు వెళ్తుండగా కైలాస పర్వతం దగ్గర ఆగిపోవడం, నంది అడ్డగించడం, ఆ తరువాత కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించిన సందర్భంలో రావణుడు శివతాండవ స్తోత్రం చేశాడని ప్రసిద్ధి. ఈ విషయంలో ఎవరికీ ఇప్పటివరకైతే అభ్యంతరం లేదు. అయితే, దీనికి వాల్మీకి రామాయణంలో మాత్రం ఎలాంటి ఆధారం దొరకదు. అంతమాత్రం చేత ఇది రావణుడిది అవునని కానీ, కాదని కానీ చెప్పలేము. మనకు కొన్ని స్తోత్రాలు పురాణేతిహాసాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. భాగవత సారాంశంగా నారాయణీయం వెలుగులోకి వచ్చింది. జగద్గురువైన శ్రీకృష్ణుడు రణక్షేత్రమైన కురుక్షేత్రంలో భగవద్గీతను బోధించాడు. కానీ, వాల్మీకి రామాయణంలో శివతాండవ స్తోత్రం రావణుడు స్తుతించినట్టుగా ఎక్కడా కనిపించదు. ఉత్తరకాండలో ఎక్కడైతే కైలాస పర్వతాన్ని రావణుడు ఎత్తిన సందర్భంలో ముందుగా ఆయన శివుడిని నిందించాడే తప్ప స్తుతించలేదు. తాను వస్తున్నానంటేనే శివుడు భయపడాలి కానీ.. భయపడకుండా నాట్యం చేస్తున్నాడేంటని మండిపడ్డాడు కూడా. కైలాసాన్ని ఎత్తిన తరువాత శివుడు తన బొటనవేలితో దాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చినప్పుడు ఆ మహాపర్వతం కింద చేతులు చిక్కుకుని నలిగిపోవడంతో ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి తన మంత్రులు, సోదరులు హితవు చెప్పిన తరువాత కానీ రావణుడు శివుడిని స్తోత్రం చేశాడు. తనను కాపాడాలని వెయ్యేండ్లపాటు రావణుడు శివుడిని ప్రార్థించాడని ఉత్తరకాండలోని 15వ సర్గలో మనం చదువవచ్చు. చివరకు శివుడు ప్రసన్నుడై రావణుడిని కరుణించి అతడి చేతులకు విముక్తి కలిగించి వరాలచ్చి పంపించాడు. వెయ్యేండ్లపాటు మహాదేవుని కొలిచిన రావణుడు ఎలాంటి స్తోత్రం చేశాడన్నది? ఏ స్తోత్రం చేశాడన్నది మాత్రం ఎక్కడా ప్రస్తావన కూడా లేదు. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, అదే ఉత్తరకాండలో రావణుడు చంద్రుని మీదకు యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు దివారాత్రులకు భంగం కలుగకుండా ఉండేందుకు, కాల గమనానికి అవాంతరాలు రాకుండా ఉండటం కోసం రావణుడిని బ్రహ్మ వారిస్తాడు. అంతే కాకుండా దీనికి ప్రతిగా అతడికి మహేశ్వర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రం పేరు శివనామాష్టోత్తర శతరూప మహామత్రం. పాఠకుల సౌలభ్యం కోసం ఈ మహామంత్రంలోని కొన్ని శ్లోకాలను మాత్రం ఉదహరిస్తాను.

నమస్తే దేవ దేవేశ సురాసుర నమస్కృత

భూతభవ్య మహాదేవ హరపింగళ లోచన

బాలస్త్వం వృద్ధరూపీచ వైయాఘ్రవసనచ్ఛద

అరుణేయోపి దేవత్వం త్రైలోక్య ప్రభురీశ్వరః

హరో హరితనేమిస్త్వం యుగాంతదహనోనలః

గణేశో లోక శంభుశ్చ లోకపాలో మహాభుజః

మహాదేవో మహాశూలీ మహాదంష్ట్రో మహాభుజః

కాలశ్చ కాలరూపీచ నీలగ్రీవ మహోదరః

వేదాంతగో వేదమయ: పశూనాం పతిరవ్యయః

శూలధృచ్ఛూలకేతుశ్చ నేతా గోప్తా హరిశ్శివః

ఈ మహామంత్రం మొత్తం 30 శ్లోకాలను కూడుకొని ఉన్నది. దీన్ని ఒకసారి మాత్రమే చదివి ఫలాన్ని పొందాలని.. దుర్వినియోగం చేయవద్దని బ్రహ్మ రావణుడికి ఉపదేశిస్తాడు. బ్రహ్మ ఉపదేశించిన ఈ మహామంత్రం మొత్తంగా పేర్కొన్నారు. ఉత్తరకాండలోని ఈ సర్గను ప్రక్షిప్తమని పేర్కొన్నారు. కానీ, యుద్ధ కాండలో వాల్మీకి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పూర్తిగా ప్రస్తావించాడు. మరి అలాంటప్పుడు కైలాస పర్వతాన్ని ఎత్తిన సందర్భంలో శివతాండవ స్తోత్రాన్ని పఠించినట్టయితే.. దాన్ని కూడా పూర్తిగా ప్రస్తావించేవారు కదా.. ఈ స్తోత్రం రామాయణంలో అయితే లేదు. కాకపోతే ఇది అనంతర కాలంలో వచ్చి ఉండవచ్చు. రావణుడి పేరు మీద చలామణి అయి ఉండవచ్చు. నా ఈ సందేహాన్ని పండితులైన పెద్దలు తీర్చాలని వినతి.

ఖడ్గ రావణ మంత్రం

అయితే రావణుడు మంత్రాధిదేవత అన్నది మన పురాణాలు మరో రూపంలో చెప్తున్నాయి. రావణుడి పేరిట మనకు ఖడ్గరావణ మంత్రం ఉన్నది. పురాణాలలో కానీ, ఇతిహాసాలలో కానీ, ఇతరత్రా కానీ.. మహర్షులు, బ్రహ్మర్షుల పేర్లతో మంత్రాలు ఉన్నట్టు పెద్దగా కనిపించదు. ఏ వశిష్ఠుడి పేరుతోనో, విశ్వామిత్రుడి పేరుతోనో మంత్రాలు ఉన్నట్టు మనకు పెద్దగా కనిపించదు. కానీ, ఇద్దరు ప్రతినాయకుల పేర్లతో మాత్రం మనకు రెండు మంత్రాలు కనిపిస్తాయి. వారిలో ఒకరు రావణుడు, రెండవ వాడు కార్తవీర్యార్జునుడు. రావణుడి పేరుతో ఖడ్గరావణ మంత్రం ప్రసిద్ధి చెందింది. ఈ రెండు మంత్రాలు కూడా శాక్తేయ తంత్రానికి సంబంధించినవి. ఖడ్గరావణ మంత్రం శాక్తేయ తంత్రానికి సంబంధించినదే. దీని గురించి కూడా రామాయణంలో మాత్రం లేదు. కాకపోతే.. కైలాసాన్ని ఎత్తిన సందర్భంలో మహాశివుడు రావణుడికి చంద్రహాసమనే గొప్ప ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చాడు. కానీ, ఈ ఖడ్గానికి ఖడ్గ రావణ మంత్రానికి సంబంధం లేదనే చెప్పాలి. ఇది పూర్తిగా శక్తి తంత్రానికి సంబంధించింది కాబట్టి రావణుడు శక్తి ఉపాసకుడిగా భావించాల్సి ఉంటుంది. కానీ, రామాయణంలో మాత్రం అతను స్త్రీలోలుడిగానే కనిపించాడు తప్ప అమ్మవారిని ఉపాసించినట్టు లేదు. అయితే ఖడ్గరావణ మంత్రం మాత్రం చాలా ప్రసిద్ధమైంది. ఆ మంత్రం ఇదీ..

ఓం నమః పశుపతయే ఓం నమో భూతాధిపతయే ఓం నమోరుద్రాయ

ఖడ్గరావణ విహర విహర సరసర నృత్యనృత్య శ్మశాన భస్మార్చిత శరీరాయ

ఘంటాకపాల మాలాదిధరాయ వ్యాఘ్రచర్మపరిధానాయ శశాంకకృత శేఖరాయ

కృష్ణసర్ప యఙ్ఞోపవీతినే చలచల వల్గువల్గు అనివర్త కపాలినే హనహన

భూతాన్ త్రాసయ త్రాసయ మండలమద్యే కటకట రుద్రాంకుశేన

శమయ ప్రవేశయ ప్రవేశయ ఆవేశయ ఆవేశయ చండాసి ధరాధిపతి

రుద్రాఙ్ఞాపయ స్వాహా

ఈ మంత్రం జపిస్తే రావణుడు ప్రత్యక్షమవుతాడని ప్రసిద్ధి. భూతకృత్యాది గ్రహబాధల్ని తొలగించి భూతగణాల్నీ వశం చేసుకోగల మహామంత్రమని దీనికి ప్రసిద్ధి. సాధారణంగా భూత సంబంధ మంత్రాలు వామాచార పద్ధతిలో వినియోగిస్తారు. కానీ, ఖడ్గరావణ మంత్రం శక్తి ఉపాసకులు సాధారణ మార్గంలో కూడా ఉపాసిస్తారు. ఈ మంత్రాన్ని జపిస్తే భూత భయం, మృత్యు భయం పోతుందని బలమైన విశ్వాసం.

ఈ ఖడ్గరావణ మంత్రం గురించి, దాని లోతుల గురించి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తన సీతాయాశ్చరితం మహత్ అన్న ఉపన్యాసంలో విపులంగా చర్చించారు. యుద్ధకాండలో రామరావణుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అది మన సినిమాల్లో జరిగినట్టు కాదు. రాముడిని రావణుడు ముప్పు తిప్పలు పెట్టాడు. బాణాలతో ఊపిరి సలపకుండా చేశాడు. నుదుటిపై బాణాలు గుచ్చుకున్నాయి. ఒక దశలో రాముడికి ఏం చేయాలో కూడా తోచలేదు. ‘నశక్నోతి బాణమాదాతు తూణీరాంధ్రఘునందన:’ అని అన్నారు. అంబులపొది నుంచి బాణాలను తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా చేశాడు. అంత శక్తిమంతుడు రావణుడు. విశ్వనాథ వారు ఏవిధంగా పేర్కొన్నారో చదవండి. “శక్త్యుపాసకులుంటారు కొందరు మీలో. తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై, అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తభివిష్యతి.. ఎవడు ఈ ఖడ్గమాల శక్తిని దేవతయినటువంటి అమ్మవారిని కొలుస్తాడో వాడు సప్తద్వీప అయిన వసుంధరకు సామ్రాజ్యం వహించేటటువంటి ఖడ్గమును పొందుతాడని దీని అర్థం. అదే ఖడ్గమాలా స్తోత్రం. అదే ఖడ్గమాలా స్తోత్రం ఏమంటుందో జాగ్రత్తగా చూడండి. తాదృశం ఖడ్గమాప్నోతి అని ఉన్నది. అది పొందాడు రావణాసురుడు అమ్మ వారినుంచి. అప్పటి నుంచే రావణాసురుడికి ఖడ్గరావణుడని పేరు. వాడంతే కాదు. రావణాసురుడెటువంటి వాడంటే; వాడొక మంత్రాధి దేవత కూడా. ఇక్కడొక చిన్న రహస్యం. భారత భాగవత రామాయణాలున్నాయి. అనేకమంది మహానుభావులు, రుషులు, ఉన్నారు. వశిష్ఠుని ప్రార్థించేందుకు వశిష్ఠ మంత్రం ఎక్కడన్నా ఉన్నదా? చెప్పండి. విశ్వామిత్రుని ప్రార్థించే విశ్వామిత్ర మంత్రం ఉన్నదా? లేదు. కానీ ఖఢ్గరావణ మంత్రం ఉన్నది. ఇంత పురాణ జగత్తులో రెండే రెండు మంత్రాలున్నాయి. ఒకటి ఖడ్గరావణ మంత్రం, రెండు కార్తవీర్యార్జున మంత్రం. ఖడ్గ రావణ మంత్రం జపిస్తే రావణాసురుడు ప్రత్యక్షమవుతాడు. ఇట్లా వాడొక మంత్రాధిదేవత అన్నమాట. అంతేగానీ రావణుడంటే మజా కాదు. అట్టి రావణాసురుడు రాముణ్ణి చచ్చేట్టుగా కొట్టింది. ఇంకొక రహస్య చెబితే కానీ రామాయణం అంటే ఏమిటో మీకు బాగా అర్థం కాదని మనవి చేస్తున్నా. మనవి చేసే కదా ఉపన్యాసం మొదలు పెట్టింది.”

ఇంతే కాదు.. విశ్వనాథ వారు ఇంకా ఏమన్నారో చదవండి. “శ్రీవిద్య అని ఒక విద్య ఉంది మన దేశంలో. ఆ విద్యలో అయిదు ఆమ్నాయాలున్నాయి. ఆమ్నాయమంటే కొన్ని మంత్రముల సంపుటి. 1. ప్రాణామ్నాయం, 2. దక్షిణామ్నాయం, 3. పశ్చిమామ్నాయం, 4. ఉత్తరామ్నాయం, 5. ఊర్థ్వామ్నాయం. ఈ అయిదు కూడా సంపుటీకృత మంత్రాలు. ఈ మంత్రాలన్నీ ఓంకారము లోనివే. ప్రణవమే యిలా పరుచుకుని ఉన్నది. దక్షిణామ్నాయమంతా విష్ణు మంత్రాలు. ఈ రీతిగా ఉన్నది మంత్ర సమామ్నాయం. కాగా శ్రీవిద్యాపరమ రహస్య మంత్రాలన్నీ సంపుటీకరించుకొని ‘కామకళా విలాసం’ అని ఒక మహాగ్రంథం ఉన్నది. అద్వైత సిద్ధాంతానికి తల్లిలాంటిదా పుస్తకం. మన తెలుగుదేశంలో సంప్రదాయ సిద్ధంగా ఉండే మూడే మంత్రాలొస్తున్నాయి. శ్రీదేవీ మహామంత్ర దక్షిణామ్నాయ మంత్ర త్రయమే ఉన్నది. ప్రథమ మంత్రం పేరు దత్తాత్రేయ మంత్రం. రెండవది ఖడ్గరావణ మంత్రం, మూడవది బేతాళ మంత్రం. ఈ మూడే మంత్రాలు.. ఈ దక్షిణం అమ్మవారియొక్క దక్షిణం లేదూ.. అది..”

ఖడ్గ రావణ మంత్రం గురించి అనేక పండితులు మరింత వివరంగా లోతుల్లోకి వెళ్లి మరీ వివరించారు. ముందుగానే చెప్పినట్టు శాక్తేయ తాంత్రిక ఉపాసనల్లో దీనికి ప్రాధాన్యమున్నది. అయితే రామాయణంలో శక్తి ఉపాసన ప్రత్యక్షంగా కనిపించదు. కానీ, పరోక్షంగా కనిపించేదంతా అమ్మవారి ఉపాసనే. అందుకే సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకే రామాయణాన్ని పిలిచారు. రామాయణం అంతా సీత గమనమే. మన వేద వేదాంగాలలో, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాల్లో కూడా రహస్య కథాకథన సంప్రదాయం ఉన్నదని పండితులకు తెలియని విషయమేం కాదు. రామాయణంలో కూడా పైకి కనిపించే సోషియో ఫాంటసీ కథ వేరు.. అంతర్లీనంగా ప్రవహించే సీతాగమనం వేరు. ఇదే అంశాన్ని విశ్వనాథ వారే మరింత లోతుగా విశ్లేషించారు. “రామాయణంలో లేని ఒకటి వాల్మీకి చెప్పాడు. సీతాయాశ్చరితం మహత్ అని. వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. ఈ రామాయణం తల్లి సీత యొక్క చరిత్రట. ఇదెక్కడా రామాయణంలో రాలా. ఈ మాట మొదట్లో అన్నాడు. మళ్లీ ఎక్కడా ఈ మాట రాలేదు. రామాయణ శబ్దాన్ని విచారిద్దాం. రామాయణం సంధి చెయ్యాలంటే రామ+ఆయనం= రామాయణం. ఇంతే కాకుండా ఇంకో చమత్కారం ఉందిక్కడ. ఈ సవర్ణ దీర్ఘ సంధిలోనే అ+అ =ఆ వస్తుంది. ఆ+ఆ=ఆ వస్తుంది. రెండూ ఒకటే. అక్కడ రెండు పొట్టి అచ్చులున్నా దీర్ఘమే వస్తుంది. రెండు దీర్ఘాలున్నా దీర్ఘమే వస్తుంది. మొదటి దాని చివర దీర్ఘముండి.. రెండో దాని ముందు హ్రస్వమున్నా దీర్ఘమే వస్తుంది. రామ+ఆయనం =రామాయణం. రామా+ఆయనం=రామాయణం. రామా అంటే స్త్రీ. లోకంలో సీతమ్మను మిగిలిస్తే స్త్రీ ఎవరు. కనుక ఈ స్త్రీ శబ్ద వాచ్యురాలు తల్లి యొక్కతే. అందుచేత రామాయణం అంటే సీతాచరితం అన్నమాట. ఈ సీతను జనక మహారాజు భార్య కన్నదా? యజ్ఞ ధాత్రి దున్నుతుంటే నాగేటిచాలుకి పెట్టి తగిలింది. ఏముందని తీశాడో ఏమో తెలియదు. తీరా తీస్తే అందులో పిల్ల ఉన్నది. అప్పటి నుండి పెరిగింది సీతమ్మవారివలె. ఆమె అయోనిజ. ఈమె పూర్వజన్మలో వేదవతి. రావణుడితో విరోధం పట్టి ఒరే నీ డొక్క చీలుస్తానురా అని అన్నది. సాక్షాత్ శ్రీ పరమేశ్వరి.. రాముడిచేత రావణుడిని సంహరింపజేసేందుకు అమ్మవారు పుట్టింది. ఇది రహస్యం. శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్త: ప్రభవితుమ్ అన్నారు భగవత్పాదులవారు. శివుడు శక్తితో కూడితేనే తప్ప సృష్టికర్త కాలేడు. ఇట్లాంటి అమ్మవారి ప్రయాణమే రామాయణం. ఇలాంటి సర్వశక్తిమంతురాలిని రావణుడు ఎత్తుకెళ్లాడు. అమ్మవారిని ‘బలాత్’ తీసుకెళ్లాడట రావణుడు. బలవంతంగా తీసుకెళ్లాడనే అర్థంలో వాడలేదు వాల్మీకి యీ పదాన్ని. ఎట్లా బలాత్కరించగలడు? ‘హూత్’ అని బెదిరిస్తే బయలుదేరిందా ఆవిడ? పోనీ కర్ర చూపించి నువ్వు లేస్తావా లేదా అంటే బయలుదేరిందా? అదేమీ కాదు. ‘బల్’ అనే ధాతువునకు అర్థము సంస్కృత భాషలో ప్రాణము అని అర్థము. సంస్కృతభాష ధాతు జనితమని ఇదివరకే చెప్పాను. అంటే తల్లి వాడి ప్రాణాలలోనే ఉన్నది. అమ్మవారిని రమ్మన్నాడట మనసులో. అందువల్లనే ఆవిడ వచ్చింది. ఆమెను ఎవరూ తీసుకొని రాలేదు. అతను లంక అంతా ఆమెను తిప్పుతూ దేశం మొత్తాన్ని వర్ణించుకుంటూ చూపించాడు.”

ఇది విశ్వనాథ వారు చేసిన వ్యాఖ్యానం. రావణుడి శక్తి ఉపాసన వెనుక రహస్య కథాకథనం ఇదేనేమో. అందువల్లే.. అతడు ఖడ్గరావణుడయ్యాడు. దక్షిణామ్నాయ మంత్రత్రయంలో ఒక మంత్రానికి అధిష్ఠాన దేవత అయినాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version