Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-14

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

14

ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడి చేయగానే పాలస్తానాకు మద్దతుగా ఉద్యమిస్తారు. భారత పార్లమెంటులో పాలస్తీనా పేరు రాసి ఉన్న చంక సంచీ వేసుకుని వస్తారు. ఫేసుబుక్కుల్లో, సోషల్ మీడియాలో గగ్గోలు పెడతారు. పహల్గామ్‌లో దాడి జరిగి హిందువులు చచ్చిపోతే.. టెర్రరిజానికి మతం లేదు.. మానవత్వం లేదు.. అని ఉపన్యాసాలు దంచేస్తారు. కర్ణాటకలో సుహాస్ శెట్టిని చంపేస్తే.. నోట మాట రాదు. ఉత్తరప్రదేశ్‌లో ఇక ముస్లిం లాయర్‌ను వ్యక్తిగత కక్షతోని ఎవరో హత్య చేయగానే మనువాదుల దుర్మార్గం.. బ్రాహ్మణిజం, హిందూ టెర్రరిజం అని.. భారత్ మతోన్మాద దేశమని తెగ వాపోతుంటారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించారంటారు. అదేమని నిలదీస్తే.. ‘నేను సతీసహగమనం ఉన్న సనాతనాన్ని వ్యతిరేకిస్తున్నాను.. విధవకు శిరోముండనం చేసే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాను.. బాల్య వివాహాలు చేసే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాను..’ అంటూ అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇవన్నీ సనాతన ధర్మం అనబడే దానిలో ఎక్కడున్నాయో అనేవాడికి అస్సలు తెలియదు. ఒకానొక కాలంలో ఒకానొక ప్రాంతంలో పరిమితమైన కొన్ని దురాచారాలను పట్టుకొని సనాతన ధర్మానికి ఆపాదిస్తూ.. మొత్తం ధర్మానికి ఆపాదించేసి తిట్టేస్తుంటారు. అన్నింటికీ మించి విచిత్రంగా పాకిస్తాన్‌కు ఆనందంగా మద్దతు ఇస్తుంటారు. టెర్రరిజానికి వ్యతిరేకం.. పాకిస్తాన్‌తో యుద్ధానికి కూడా వ్యతిరేకం అని ప్రవచనాలు చెప్తుంటారు. వీళ్లే రామాయణంలో రావణుడిని పొగుడుతుంటారు. జై శ్రీరావణ నినాదాలు చేస్తుంటారు. రావణ పూజలు చేస్తుంటారు. వీటన్నింటి మధ్య ఒక అద్భుతమైన లింక్ ఉంటుంది. ఎవర్నైతే మన ఇతిహాసాలు, పురాణాలు, విలన్లుగా పేర్కొన్నాయో.. వాళ్లను హీరోలుగా చేయడానికి తెగ తాపత్రయపడుతుంటారు. అందులో భాగంగానే రావణ భజన. రాముడిని తిట్టడానికి ఉత్తరకాండలోని శంబూక వధ, సీతా పరిత్యాగం వంటి కతలు బాగా అక్కరకొస్తాయి. అలాంటప్పుడు అదే ఉత్తరకాండలో రావణుడి ‘మహత్తర’ గాథను కూడా చెప్పారు కదా.. అది మాత్రం వీరికి అక్కరకు రాలేదు. దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే దాన్ని పట్టుకుంటే రావణుడిని అతడి కుటుంబాన్ని తిట్టాల్సి వస్తుంది కాబట్టి. వీళ్లు చెప్పినట్టు.. వంద సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నట్టు.. రావణుడు చాలా గొప్పవాడు.. బాగా చదువుకున్నవాడు, తన ప్రజలను అద్భుతంగా పాలించాడా? ఇది ప్రాథమిక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో రావణుడి వ్యక్తిత్వాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాను. రావణుడు పుట్టడానికి ముందే అతడి తండ్రి విశ్రవసుడే ఒక దుర్మార్గుడు, నీచుడు పుట్టబోతున్నాడని చాలా క్లారిటీ ఇచ్చాడు. ఉత్తరకాండ 9వ సర్గలో ఈ మాట ఉంది. ఈ రావణుడి తండ్రి అయిన విశ్రవసుడికి తన కూతురు (రావణుడి తల్లి) కైకసిని సుమాలి ఒక విధంగా ఎర వేశాడు. కుబేరుడిని చూసి అతడి డబ్బును చూసి అట్లాంటి కొడుకు కావాలని, అంతటి సంపద కావాలని కైకసిని విశ్రవసుడి దగ్గరకు పంపించాడు. రావణుడు ఎట్లా పుట్టాడో కూడా ఇదే ఉత్తరకాండలో చెప్పారు కదా.. మరి ఎన్టీయార్ లాగానే రావణుడు ఉన్నాడనుకుంటే ఎట్లా? నల్లని కాటుక కుప్పవలె శరీరము, ఎర్రని పెదవులు కలిగిన వాడుగా పుట్టాడు. అతడి తరువాత అతి భయంకరమైన, ప్రపంచంలో మరెక్కడా లేనంత ప్రమాణము కలిగిన శరీరము కలిగిన కుంభకర్ణుడు పుట్టాడు. ఆ తరువాత వికృత రూపం కలిగిన శూర్ఫణక పుట్టింది. ఆ తరువాత విభీషణుడు పుట్టాడు. ఇదీ సీక్వెన్స్. ఆ తరువాత రావణ కుంభకర్ణులు మహారణ్యంలో పెరిగారు. ఇది చదవండి. ‘గొప్ప తేజస్సు గలవారు, లోకమునకు ఉపద్రవము కలిగించు వారు అయిన ఆ కుంభకర్ణ దశగ్రీవులు ఆ మహారణ్యంలో పెరిగిరి. కుంభకర్ణుడు మిక్కిలి మదించి ధర్మాత్ములైన మహర్షులను నిత్యమును భక్షించుచు తృప్తి చెందక మూడు లోకాలలో సంచరించెను. ధర్మాత్ముడైన విభీషణుడు మాత్రము నిత్యము ధర్మమునందే సిద్ధుడై స్వాధ్యాయము చేయుచు ఆహార నియమము పాటించుచు, ఇంద్రియములను వశములో ఉంచుకొని ఉండెను. (36-38 ఉత్తరకాండ 9వ సర్గ). ఈ మూడు శ్లోకాలను గమనించినప్పుడు కుంభకర్ణ, విభీషణులు ఎలా పెరిగారో వివరంగా చెప్పారు. రావణుడి గురించి ఎక్కడా ఒక్కమాట కూడా చెప్పలేదు. గొప్ప తేజస్సు గలవారు అన్నారే తప్ప గొప్పవారు, మంచివారు అని అనలేదు. తేజస్సు గలవారు అన్న మాట వెంటనే లోకమునకు ఉపద్రవము కలిగించు వారు అని కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ తేజస్సు అంటే కేవలం గ్లో అని అనుకోవాలి తప్ప మరే అర్థం నాకైతే తోచటం లేదు. ఇద్దరు కొడుకులు, కూతురు దారితప్పి ప్రవర్తిస్తుంటే.. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన తల్లి.. పెద్ద కొడుకును రెచ్చగొట్టి ‘కుబేరుడు ఎట్లా ఉన్నాడు.. నువ్వు ఎట్లా ఉన్నావు.. ఇద్దరు అన్నదమ్ములే కదా.. అయినా అతడికీ, నీకు ఎంత తేడా ఉందో చూడు.. నువ్వు కూడా మీ అన్నలాగే తయారుకావాల’ని ఫుల్లుగా రెచ్చగొట్టింది. దీంతో రావణుడు రెచ్చిపోయాడు. బ్రహ్మకోసం ఘోర తపస్సు చేసి వరాలు పొందాడు (43-47 ఉత్తరకాండ 9వ సర్గ ). ఇదిగో ఈ తపస్సు చేయడం అన్న మాట మాత్రమే అతడి జ్ఞానానికి సంబంధించిన ఏకైక విషయం. మన ఇతిహాసాల్లో పురాణాల్లో చదువుకోవడం, జ్ఞానం సంపాదించడం కామన్ ఎలిమెంట్. అంతే కాకుండా స్త్రీ పురుషులిద్దరూ కూడా సరి సమానంగానే చదువుకున్నవారే. మనకు ఇదే రామాయణంలోని అరణ్యకాండలో మేధావులైన స్త్రీలు కనిపిస్తారు. అలాగే రావణుడు కూడా చదువుకుని ఉండవచ్చు. చదువుకున్నంత మాత్రాన.. క్యారెక్టర్‌ను ఎలా డిసైడ్ చేస్తారు? చదువుకున్న రాక్షసులు ఎందరు లేరు మన కళ్లముందే. బ్రహ్మదేవుడు వరాలిచ్చినప్పుడు అతడు కోరుకున్న వరం కూడా అతడి క్యారెక్టర్‌ను డిసైడ్ చేసింది. తనకు ఫలానా ఫలానా వాళ్ల నుంచి చావు వద్దని కోరుకున్నాడే కానీ.. మరో వరం కోరుకోలేదు. ఎందుకంటే తన తాత, తల్లి మాదిరిగానే రావణుడు కూడా చాలా ఆంబీషియస్ పర్సనాలిటీ.. అందుకు తగ్గట్టుగానే వరం పొందిన వెంటనే ఫస్ట్ అటాక్ చేసింది అన్న పైనే. తన తల్లి, తాత కోరికలు తీర్చడమే లక్ష్యంగా అన్న కుబేరుడిని టార్గెట్ చేశాడు.. లంకను ఆక్రమించుకున్నాడు. అక్కడితో ఆగకుండా అతడు మరెక్కడో దూరంగా కట్టుకున్న సిటీని కూడా ధ్వంసం చేసి అతడి సంపదనంతా కొల్లగొట్టి లంకకు తెచ్చుకున్నాడు. అక్కడితో ఆగాడా అంటే అదీ లేదు.. వరుసగా దాడులు చేసుకుంటూనే పోయాడు. కనిపించిన రాజ్యాన్నల్లా ఆక్రమించుకుంటూ పోయాడు. సంపదనంతా దోచుకుంటూ పోయాడు. కైలాసం నుంచి కన్యాకుమారి వరకు యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుష, దేవ లోకాలన్నింటిని ఒక్కసారిగా తిరగేసి వచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో అసాధారణంగా రెచ్చిపోయాడు. కిష్కింధలో వాలిని, పశ్చిమ సముద్రంలో కపిలుడిని మాత్రం జయించలేకపోయాడు. వాలితో మాత్రం సంధి కుదుర్చుకున్నాడు. కుబేరుడిని జయించి లంకను ఆక్రమించుకున్న తరువాత అక్కడి నుంచి రావణుడి దండయాత్ర కైలాసం నుంచి మొదలైంది. శివుడి పర్వతాన్ని పెకిలిద్దామనుకొని భంగపడ్డాడు. ఆ తరువాత మరుత్తుడిని జయించాడు. తరువాత అనరణ్యుడిని హతమార్చాడు. అక్కడి నుంచి బయలుదేరి కాలకేయులను వధించాడు. వరుణ పుత్రులను ఓడించాడు. యమలోకానికి వెళ్లి యముడిని జయించాలని వెళ్లాడు. అతడితో యుద్ధం చేశాడు. చివరకు బ్రహ్మదేవుడు అడ్డుకోవడంతో యముడు యుద్ధాన్ని ఆపేశాడు. అక్కడి నుంచి బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లి పరామర్శలు చేసి వచ్చాడు. అక్కడి నుంచి సూర్య చంద్రులను జయించాలని వెళ్లాడు. దారిలో మాంధాతతో యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. చివరకు ఆయన తాత పులస్త్యుడు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది. చంద్రుడితో యుద్ధాన్ని ఆపడానికి బ్రహ్మదేవుడే అడ్డుపడాల్సి వచ్చింది. అతడి కొడుకు మేఘనాథుడు ఇంద్రుడిని గెలిచి ఇంద్రజిత్తు అయ్యాడు. నిరంతరం యుద్ధాలతోనే రావణుడి జీవితం గడిచింది. మొదట తాత, తరువాత తల్లి, ఆ తరువాత తాను.. తనను రెచ్చగొట్టడానికి చెల్లి, మంత్రులు.. ఒకరేమిటి.. ప్రతి ఒక్కరూ రావణుడిని రెచ్చగొట్టి జనాల మీద పడి పీక్కుతినేలా చేశారు. రావణుడు ఎవరినీ వదిలిపెట్టలేదు. చివరకు చెల్లెలు శూర్ఫణక భర్తను కూడా చంపేశాడు. అన్నా నా మొగుడిని చంపావేమిటని శూర్ఫణక రావణుడి దగ్గరకు వచ్చి వాపోయింది. ‘రాజా బలవంతుడవైన నీవు నాకు బలాత్కారముగా వైధవ్యము కల్పించినావు. నీవు కాలకేయులని ప్రసిద్ధి చెందిన పదునాలుగు వేల మంది దైత్యులను యుద్ధములో నీ పరాక్రమము చేత చంపివేసినావు. నాయనా! నా ప్రాణాలకంటే కూడా ప్రియుడైన బలవంతుడైన నా భర్త వారిలో ఒకడు. సోదరుడను పేరుతో నా శత్రువై నీవు అతనిని కూడా చంపి వేసినావు. రాజా! బంధువైన నీవే స్వయముగా నాకు గొప్ప ఆపద కలగజేసినావు. నాకు నీవే వైధవ్యము కలిగించినావు. యుద్ధాలలో ఇంటి అల్లుణ్ణి నీవు రక్షించవలెను కదా.. అట్టి అల్లుణ్ణి నీవే స్వయముగా చంపికూడా సిగ్గు చెందుటలేదు’ (24-30 ఉత్తరకాండ 24 వ సర్గ). కానీ రావణుడు చాలా లైట్ తీసుకున్నాడు. ఏదో చూసుకోలేదు.. అలా జరిగిపోయింది అంతే.. నువ్వేం బాధపడకు.. నీకు సోదరుడి వరుస అయిన ఖరుడి దగ్గర ఉండిపో.. అతడిని దండకారణ్యానికి పంపిస్తున్నాను. అతడు నువ్వేం చెప్తే అది చేస్తాడు అని చెప్పి పంపించాడు. ఆమె దండకారణ్యానికి వెళ్లిపోయింది. రావణుడు సోదరుడి వరుస అయిన ఖరునితో వెళ్లి దండకారణ్యంలో ఉండాలని అంటే దాని అర్థం ఏమిటి.. అతడితో సంసారం గడపమనా? లేక.. అతడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడ నీవు ఉండిపో అని అర్థం చేసుకోవాలా? అతను నీకు తోడుగా ఉంటాడు. దండకారణ్యంలో నువ్వు ఏదంటే అదే జరుగుతుంది అనే అర్థం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. యుద్ధకాండలో అగ్నిప్రవేశానికి ముందు శ్రీరాముడు కూడా సీతాదేవిని నీవు ఎక్కడికైనా వెళ్లవచ్చు.. ఎవరి దగ్గరకి అయినా వెళ్లవచ్చు అని సూచించాడు. ఆ మాటలకు అర్థం కూడా ఇదే. ఎక్కడికి వెళ్లినా నిన్ను వాళ్లు జాగ్రత్తగా చూసుకుంటారు. దేవతలా కొలుస్తారు. నీకు తోడుగా ఉంటారు అని. కానీ మన మేధావులు కానీ, రామాయణ వ్యతిరేకులు కానీ దీన్ని వక్రీకరించి రాముడి వ్యక్తిత్వాన్ని, సీతాదేవి సౌశీల్యాన్ని దారుణంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారు. వీళ్లు మాత్రం రావణుడికి సంబంధించిన ఈ ఎపిసోడ్ ను కన్వీనియంట్ గా మరచిపోయారు. కానీ, దండకారణ్యానికి సీతారాములు వచ్చినప్పుడు రాముడిపై మోహపడి.. విఫలమైన తరువాత తానే రావణుడిని సీతాపహరణానికి ఎగదోసి.. తన భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్నదా అని కూడా అనిపిస్తుంది.

రావణుడు జీవితమంతా వాణ్ణి గెలవాలి.. వీణ్ణి గెలవాలి అన్న తాపత్రయంతోనే గడిపాడు. తాను ముల్లోకాలకు అధిపతిని కావాలనే ఆశతోనే జీవించాడు. ప్రజలను పట్టించుకున్నదెక్కడ. అయోధ్య కాండలో, యుద్ధ కాండలో రాముడి పట్ల అయోధ్యలోని ప్రజలు ఏవిధంగా ప్రేమను చూపించారో.. అతడు రాజు కావాలని.. అతడి రాజ్యంలో ఎంత సంతోషంగా ఉంటామో వారి ముఖాల్లో వ్యక్తమవుతుంది. పట్టాభిషేకం తరువాత రాముడి రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో కూడా యుద్ధకాండలో మనకు స్పష్టంగానే గోచరిస్తుంది. అదే రావణ రాజ్యమైన లంకలో ప్రజా జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్నకు జవాబు లభించదు. ఒక్క చోట మాత్రం అతడు రాజుగా ఎలాంటి వాడో వాల్మీకి చెప్తాడు. ఇది యుద్ధకాండలో సన్నివేశం. రాముడి సైన్యం లంకకు చేరుకున్న తరువాత యుద్ధం ముంచుకొచ్చిందని గ్రహించిన తరువాత రావణుడు చివరి నిమిషంలో ఒక మీటింగ్ పెట్టాడు. అప్పటిదాకా తాను ఏమని అనుకున్నాడో అది చేసుకుంటూ పోయాడు. ప్రాణం మీదకు వచ్చేసరికి అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఏం చేయాలి అని అడిగాడు. మీటింగ్‌కు వచ్చిన వారిలో ఏ ఒక్కడూ కూడా రావణుడికి ఎదురుచెప్పడానికి సాహసించలేదు. రావణుడు ఏది అంటే దానికి సై అంటూ వచ్చారు. ఇంకాస్త ముందుకు వెళ్లి రావణుడి మెప్పు పొందడానికి రాముడిని నేను చంపుతానంటే నేను చంపుతాను అంటూ పోటీలు కూడా పడ్డారు. రావణుడి అరాచకత్వం ఎలా నడిచిందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. రావణుడంటే అందరికీ భయం మాత్రమే ఉంది. ఎదురు తిరిగి మాట్లాడితే తనను తన కుటుంబాన్ని బతుకనిస్తాడో లేదో నన్న భయమే లంకలో రాజ్యమేలింది. అంతే తప్ప రావణుడు గొప్ప ప్రజాదరణ ఉన్న రాజు ఎంతమాత్రం కాదు. కానీ రావణ భక్తులు మాత్రం అతడు మహానుభావుడు, మార్తాండ తేజుడు, సీతను కేవలం తన చెల్లెలి పరాభవానికి ప్రతీకారంగా మాత్రమే అపహరించాడే తప్ప అతడు తప్పేమీ చేయలేదు.. అని మాట్లాడుతుంటారు. రావణుడికి హితవు చెప్పబోయిన మారీచుడిని బెదిరించి పంపితే.. రాముడి చేతిలో హతమయ్యాడు. ఎవరికి చెప్పి చేశావని నిలదీసిన కుంభకర్ణుడూ చివరకు రావణుడి మాట కాదనలేక వెళ్లి రాముడి చేతిలో మృత్యువాత పడ్డాడు. నువ్వు తప్పు చేశావని రావణుడి మాటను తిరస్కరించి వెళ్లిన విభీషణుడు రావణుడి అనంతరం లంకకు రాజయ్యాడు. రావణుడు వ్యక్తిత్వమే అత్యంత క్రూరమైనది. ఇవాళ మనం చూసే టెర్రరిస్టులతో రావణుడిని చాలా దగ్గరగా పోల్చి చూడవచ్చు. అయితే.. రావణుడు వీరుడే కావచ్చు. ఓడింపశక్యం కాని వీరుడేం కాదు. యుముడిని జయించలేదు. కపిలుడి చేతిలో పరాభవం చవిచూశాడు. వాలి చేతిలో ఓడిపోయాడు. శ్వేతద్వీపం వెళ్లి అక్కడ స్త్రీలచేత అవమానం పాలయ్యాడు. చంద్రుడి దాక వెళ్లి బ్రహ్మ చెప్పడంతో వాపస్ వచ్చాడు. అంతే తప్ప అతడిని అంతోడని.. ఇంతోడని పొగడటంలో అర్థం లేదు. రాముడిని తిట్టాలి కాబట్టి రావణుడిని హీరో చేసే యత్నం చేశారే తప్ప అతడిలో క్రూరత్వాన్ని మించి మరో మంచి గుణమన్నది లేనే లేదు.

(ఇంకా ఉంది)

Exit mobile version