[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
15
జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్.. ఏప్రిల్ 22, 2025.. అక్కడ పర్యాటకులు సేదతీరుతున్నారు. ఒక్కసారిగా సాయుధులైన ఉగ్రమూకలు వారిమీద విరుచుకుపడ్డాయి. పేరు అడిగి, మతం అడిగి, గుర్తింపులు తెలుసుకొని మరీ ఏరి ఏరి 26 మందిని హతమార్చారు. చనిపోయిన వారిలో ఒక భర్త ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, ఒక సోదరుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు.. కండ్ల ముందే వారు విగతజీవులు అవుతుంటే నుదుటన సిందూరం కరిగిపోతుంటే మహిళలు నిస్సహాయులై చూస్తూ ఉండిపోయారే తప్ప ఏమీ చేయలేకపోయారు. వారు మనసులో ఏం శాపమిచ్చారో ఏమో తెలియదు కానీ, పక్షం రోజులు గడవకముందే ఆ ఉగ్రమూకలు.. వారి స్థావరాలు అన్నీ కూడా భూస్థాపితమైపోయాయి. వందలాది ఉగ్రవాదులు సమాధి అయిపోయారు. ఆ ఆపరేషన్‌కు పేరు ఆపరేషన్ సిందూర్ అని పెట్టారు. దానికి నాయకత్వం వహించి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారు ఇద్దరు మహిళలు. ఒకరు వ్యోమికాసింగ్, మరొకరు సోఫియా ఖురేషీ.
ఇక ఇది చదవండి.. ‘రావణుడు మార్గమందు కనపడిన రాజ కన్యలను, రుషి కన్యలను, దేవకన్యలను, దానవ కన్యలను హరించెను. వానికి సుందరియైన కన్యగాని, స్ర్తీ గాని కనబడగానే అతడు ఆమె బంధువులను చంపి ఆమెను విమానములో నిర్బంధించెను. ఈ విధముగా అతడు నాగ, రాక్షస, అసుర, మనుష్య, యక్ష, దానవ కన్యలను విమానము మీద ఎక్కించుకొని తీసుకొని పోయెను. ఆ కన్యలందరూ దుఃఖించుచూ శోకాగ్నివలన, భయము వలన జనించిన అగ్నిజ్వాలలతో సమానమైన కన్నీటిని విడచిరి. భయముచేత, శోకముచేత కన్నీళ్లు కార్చుచున్న, ఎట్టి దోషములూ లేని ఆ కన్యల చేత ఆ విమానము నదులచేత, సముద్రముల వలె నింపబడెను. ఆ విమానములో ఉన్న వందలకొలది నాగ గంధర్వ కన్యలు, మహర్షుల కన్యలు, దైత్య, దానవ కన్యలు ఏడ్చిరి.
పొడవైన జుట్టు, చాలా అందమైన శరీరము, పూర్ణచంద్రుని వంటి ముఖము, బలసిన ఉరోజములు, వజ్రములు పొదిగిన వేదిక వంటి నడుముగల ఆ స్త్రీలు దేవతాస్త్రీల వలె ఉండిరి. రథముల ఇరుసుల వలె ఉన్న పిరుదులతో మనోహరముగా ఉన్న చక్కని నడుములు గల ఆ స్త్రీలు శోక దుఃఖములతో కలత చెంది ఉండిరి. వాళ్ల నిట్టూర్పుల గాలుల చేత అంతటా ప్రజ్వలింపచేయబడిన పుష్పకము నిరోధింపబడిన అగ్నులు గల అగ్ని కుండముల వలె ఉండెను. రావణునికి చిక్కిన యౌవనమధ్యమునందున్నఆ స్త్రీలు సింహము వశములో ఉన్న ఆడలేళ్ల వలె దైన్యము చెందిన ముఖములతో, నేత్రములతో శోకాక్రాంతలైరి.
వాళ్లలో ఒక స్త్రీ ఇతను నన్ను భక్షించి వేయునా అని అనుకొనుచుండెను. మిక్కిలి దు:ఖించుచు మరొక స్త్రీ ఇతడు నన్ను చంపివేయునా అని అనుకొనుచుండెను. ఈ విధముగా ఆ స్త్రీలందరూ కలిసి తల్లులను, తండ్రులను, భర్తలను, సోదరులను స్మరించుచు దుఃఖశోకములతో కూడినవారై ఏడ్చిరి. నేను లేకుండా నా పుత్రుడు ఎట్లుండునో కదా! నా తల్లి ఎట్లుండునో కదా! నా సోదరుడు ఎట్లుండునో కదా.. అని అనుచు ఆ స్త్రీలు శోకసాగరములో మునిగిరి. భర్త లేకుండా నేనేమి చేయుదును? ఓ మృత్యు దేవతా! నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. దుఃఖము అనుభవించవలసిన నన్ను తీసుకొని పొమ్ము. పూర్వజన్మలో నేనెట్టి పాపము చేసి ఉన్నానో కదా! ఈ విధముగా దుఃఖము చెంది శోకసాగరములో పడిన మాకు ఈ దుఃఖమునకు అంతము కనబడుటలేదు. ఎందుచేతననగా బలవంతుడైన రావణుడు దుర్బలులైన మా భర్తలను ఉదయించుచున్న సూర్యుడు నక్షత్రముల వలె నశింపజేసినాడు. ఏమి ఆశ్చర్యము! ఈ మహా బలవంతుడైన రాక్షసుడు ఇతరులను చంపు ఉపాయములున్నందుకు సంతోషించుచున్నాడు. కానీ చెడ్డపనులు చేయుచున్న తనను గూర్చి అసహ్యించుకొనుటలేదు. ఈ దురాత్ముని పరాక్రమము ఇతడు చేసిన తపస్సు మొదలైన వాటికి అన్ని విధాల తగి ఉన్నది. కానీ పరస్త్రీ స్పర్శరూపమైన ఈ పని మాత్రము తగినది కాదు. దుర్బుద్ధి అయిన ఈ రాక్షసాధముడు పరభార్యలయందు అభిలాష కలిగి ఉన్నాడు. అందువలన ఇతడు స్త్రీ మూలముననే మరణించగలడు’ (1-20 శ్లోకాలు.. ఉత్తరకాండ 24వ సర్గ).
ఈ రెండు అంశాలలో సిమిలారిటీ కనిపించిందా? అక్కడ భార్యల ముందు భర్తలను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. మహిళలను, మీ గోడు మోడీకి చెప్పుకోండని వారిని వదిలేసి వెళ్లారు. ఇక్కడ కూడా భార్యల ముందు భర్తలను హతమార్చిన రావణుడు ఆ స్త్రీలను ఎత్తుకొని పోయాడు. పహల్గామ్లో స్త్రీలు తమను కూడా చంపేయాలని, భర్త లేకుండా తాము ఉండజాలమని ఉగ్రవాదులను బతిమాలుకున్నారు. ఇక్కడ తమను బంధించి తీసుకొని వెళ్తున్న రావణుడిని ఏమీ చేయలేక.. భర్తను వదిలి ఉండలేక, తమకు మరణాన్ని ఇవ్వాలని మృత్యుదేవతను కోరుకున్నారు. పహల్గామ్లో ఉగ్రవాదులు పాక్ ప్రేరిత మతోన్మాదంతో రెచ్చిపోయారు. 26 మంది పురుషులను పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ రావణుడు భర్తలను చంపేసి, కుటుంబసభ్యులను చంపేసి.. అవధులు లేని కామంతో ఆ స్త్రీలను లంకకు తరలించుకొనిపోయాడు. దేశంలోని కోటానుకోట్ల స్త్రీల శాపం పాకిస్తాన్లో ఉగ్రమూకల స్థావరాలను, వందమందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఆ ఆపరేషన్ సిందూరానికి ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. ఇక్కడ రావణుడికి కూడా ఈ స్త్రీలందరి శాపం తగిలింది. రావణ వధకు సీతాదేవి నాయకత్వం వహించింది. స్త్రీ శాపం ఎంత బలీయమైనదో రామాయణం నుంచి పహల్గామ్ దాకా ప్రతిఫలిస్తూనే ఉన్నది.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. రావణుడు సీతాపహరణం తప్ప మరే తప్పు చేయలేదు అన్నవారికి కొంతైనా అర్థమవుతుందేమోనని పైన కోట్ చేసిన దానిలోనే రావణుడి కామ పైశాచికం ఏమిటన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తాను వెళ్తున్న దారిలో కన్యలను, స్త్రీలను ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అంటే వివాహితులైన వారిని కూడా విడిచిపెట్టకుండా ఎత్తుకెళ్లాడంటేనే అతడు ఎంత విమనైజరో అర్థమవుతుంది. పైగా అతనికి తన పర భేదం లేదు. వావి వరుసలతోనూ సంబంధం లేదు. ఎక్కడ పడితే అక్కడ.. ఎవరు కనిపిస్తే వారిని ఎత్తుకొని రావడం అనుభవించడం.. వానిది ఇదే పని. సుందరకాండలో ఆంజనేయుడు లంకలో సీతాన్వేషణ చేస్తున్న సందర్భంలో రావణుడి అంతఃపురాలు అనేకంగా కనిపించాయి. ఆయన భార్య మండోదరిని మాత్రమే కాదు.. వందలమంది స్త్రీలను ఆంజనేయుడు చూశాడు. స్త్రీ అంటేనే అనుభవించదగినది అని అనుకొనే క్యారెక్టర్ రావణుడిది.
దేవలోకంలో యుద్ధం చేసి అక్కడి నుంచి వెనుతిరిగిన రావణుడు తన అన్న కుబేరుడి భవనంలో (అప్పటికే అతడిని జయించి స్వాధీనం చేసుకున్నాడు). సేదతీరాడు. ఆ సమయంలో అప్సరస అయిన రంభ.. రావణుడికి కనిపించింది. ఆమె కుబేరుని కొడుకు నలకూబరుని ప్రియురాలు. అతడి దగ్గరకు వెళ్లడానికి చక్కగా అలంకరించుకొని వెళ్తండగా రావణుడి కంటపడింది. రావణుడు ఆమెను ఎలా చూశాడో చదవండి. ‘అందమైన కటి ప్రదేశము గలదానా! నీవు ఎక్కడికి వెళుచున్నావు? నీవు స్వయముగా ఎవనికి భోగసిద్ధిని కూర్చుటకై వెళ్లుచున్నావు? ఇది నిన్ను అనుభవించనున్న ఎవనికి అభ్యుదయము కలిగే సమయము? పద్మము, కలువ వంటి సుగంధము గల అమృతము వంటి నీ అధరామృతమును ఆస్వాదించి ఇప్పుడు ఎవడు తృప్తి చెందనున్నాడు? భయ స్వభావము గలదానా! బంగారు కుంభముల వలె ఉన్న బలసిన ఎడములేని ఈ నీ కుచములు ఎవని వక్షఃస్థలమును స్పృశించనున్నవి? బంగారు వడ్డాణము అలంకరించి బంగారు చక్రమువలె ఉన్న విశాలమైన స్వర్ణము వంటి జఘనమును ఎవడు అధిరోహించనున్నాడు? ఇప్పుడు నాకంటె గొప్పవాడు ఎవడున్నాడు? ఇంద్రుడా? విష్ణువా? లేక అశ్వినీ దేవతలా? ఓ భయ స్వభావము గలదానా నివు నన్ను దాటి వెళ్లుచున్నావు. ఇది మంచిపని కాదు. విశాలమైన కటి ప్రదేశము గలదానా, సుందరమైన ఈ శిలాఫలకము మీద విశ్రమించుము. నేను తప్ప ఈ మూడు లోకములలో ప్రభువైన వాడు ఎవ్వడూ లేడు. మూడు లోకముల ప్రభువునకు కూడా ప్రభువూ, మూడు లోకములకు పాలకుడూ అయిన రావణుడు వంగి నమస్కరించుచు నిన్ను ప్రార్థించుచున్నాడు. నన్ను పొందుము(20-27శ్లోకాలు, ఉత్తరకాండ, 26వ సర్గ).’ అని అన్నాడు. కానీ ఆమె బతిమాలింది. ఇలాంటి పని కూడదని చెప్పింది. తాను తన అన్న కుమారుడి ప్రియురాలినని వివరించింది. తనకు కోడలి వరుస అవుతానని దీనంగా చెప్పింది. అయినా ఆమెను తాను చూపిన శిలాఫలకంపైనే రావణుడు రేప్ చేసి వదిలేశాడు. రంభ ఏడ్చుకుంటూ తన ప్రియుడైన నలకూబరుడి దగ్గరకు వెళ్లి రావణుడి దౌష్ట్యాన్ని పూర్తిగా వివరించింది. దీంతో కోపోద్రిక్తుడైన నలకూబరుడు.. ఇకముందు ఇష్టం లేకుండా ఆడవాళ్లను అనుభవించాలని ప్రయత్నిస్తే చస్తాడని రావణుడిని శపిస్తాడు. ఇష్టం లేకుండా స్త్రీని పొందాలనుకోవడం ఎంత నేరమో మనం ఇటీవల సినిమాల్లో చూసి ఆహా ఓహో అని ప్రశంసిస్తున్నాం. హిందీలో పింక్ అనే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ అయిన సినిమా అది. దాని కథాంశం కూడా మహిళలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా పొందాలని ప్రయత్నించిన వారు దోషులుగా నిలబడటమే. రామాయణంలోని రావణుడి క్యారెక్టర్ ప్రపంచంలోని విమనైజర్లందరిలోని అన్ని కోణాలను ఏదోరకంగా ప్రతిఫలింపజేస్తుంది. మనం మహాభారతంలోని కీచకుడిని స్త్రీలోలురకు ప్రత్యామ్నాయంగా పిలుస్తాం కానీ.. రావణుడిని మించిన వాడా అతడు?
ఇక్కడ మరో విషయాన్ని కూడా పరిశీలిద్దాం. కైలాసం దగ్గర శివుడితో పరాభవాన్ని చవిచూసి చావుతప్పి కన్నులొట్టబోయి బయటపడ్డ రావణుడి బుద్ధి మాత్రం కొంచెం కూడా మారలేదు. దారిలో మహిళను చూడగానే లోపలి అపరిచితుడు ఒక్కసారిగా బయటకు వచ్చేస్తాడు. కైలాసం నుంచి హిమవత్పర్వత ప్రాంతాల నుంచి పయనిస్తుండగా దారిలో ఒక కన్య తపస్సు చేసుకుంటూ కనిపించింది. అంతే.. రావణుడికి పిచ్చెక్కిపోయింది. వెంటనే పుష్పకము ఆపి ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలు పెట్టాడు. అదీ చూడండి.. ‘మంగళప్రదురాలా! ఏమిది? నీవు నీ యౌవనమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు. నీ ఇట్టి సౌందర్యమునకు విరుద్ధముగా ఇట్టి ప్రవర్తన యుక్తము కాదు కదా. సాటిలేని నీ రూపము పురుషులకు కామోనార్థమును కలిగించునది. తపస్సు చేయుటకు తగినది కాదు. ఇది లోకప్రసిద్ధమైన నిర్ణయము కదా.. ఓ భద్రురాలా నీవు ఎవరిదానవు? నీ భర్త ఎవరు? నిన్ను అనుభవించు పురుషుడు లోకములో పుణ్యాత్ముడు’ ( 1-7 శ్లోకాలు, 17వ సర్గ ఉత్తరకాండ). మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే.. రావణుడు తనకు కనిపించిన ప్రతి స్త్రీతోనూ మాట్లాడే విధం ఎట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాను ఎత్తుకొచ్చిన స్త్రీలైనా, రంభ అయినా, వేదవతి అయినా, చివరకు సీతాదేవి అయినా సరే.. అతని చూపు, అతని చేష్టలు, క్రూరత్వం అంతా కూడా భయంకరమైన కాముకత్వంతో కూడుకున్నదే అయింది. రావణుడి ప్రశ్నకు వేదవతి చాలా సౌమ్యంగా జవాబిచ్చింది. తాను కుశధ్వజుని కుమార్తెనని తెలిపింది. విష్ణువు తనకు అల్లుడు కావాలని కాంక్షించిన తన తండ్రిని తనను కామించిన శంభువు అనే దైత్యుడు హతమార్చాడని కూడా వివరించింది. (ఈ ఘటనను కూడా ఎన్టీరామారావు సీతారామ కల్యాణం సినిమాలో రావణుడే చేసినట్టుగా చూపించారు.) కానీ మైకంలో ఉన్న రావణుడు విననే లేదు. ‘తపస్సు అన్నది ముసలివాళ్లకు మాత్రమే తగినపని. సమస్త సద్గుణములు ఉన్నదానవు, మూడు లోకములలో సుందరివి అయిన నీవు ఇట్లు పలుకుట తగదు. నీ యౌవనము దాటిపోవుచున్నది.. ఓ మంగళ ప్రదురాలా నేను లంకాధిపతిని. దశగ్రీవుడు అని ప్రసిద్ధి చెందినవాడను. అట్టి నాకు భార్యవై నీవు సుఖముగా భోగములు అనుభవింపుము.’ (9-23 శ్లోకాలు, ఉత్తరకాండ 17వ సర్గ). అని అనడమే కాక.. ఆమెను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. ఆమె వెంట్రుకలు పట్టుకొని లాగాడు. దీంతో ఆమె కోపోద్రిక్తురాలై.. తన చేతినే కత్తిగా చేసుకొని అతడు పట్టుకొన్న వెంట్రుకలను తెంచివేసింది. అక్కడికక్కడ అగ్నిని ఏర్పాటుచేసుకొని అతడి ముందే అగ్నిలో ఆహుతి అయింది. ఈ వేదవతే.. తరువాత సీతగా జన్మించిందన్న కథనం దీని వెంటే ఉత్తరకాండలో మనం చూడవచ్చు. ఆనాడు వేదవతి పరాయి పురుషుడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి అగ్నిగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకున్నది. ఇది కేవలం వేదవతికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఇది ఈ భారతదేశంలోనే ఉన్న మహత్తరమైన ఆత్మగౌరవ సంకేతం. మొఘలుల నుంచి కాపాడుకోవడానికి ఉత్తర భారతంలో రాణి పద్మావతి వంటి రాజ్ పుత్ స్త్రీలు, అటు పంజాబ్‌లో సిక్కు మహిళలు, ఇలా అనేకమంది వరుసగా అగ్నిగుండాలలో ఆత్మాహుతి చేసుకున్న చరిత్ర మనకు తెలియందేమీ కాదు. ఇది మన సంస్కారం. మన ఆత్మగౌరవం.
రావణుడు ఏ సందర్భంలోనూ, ఏ దశలోనూ తన కాముకత్వాన్ని దాచుకోలేదు. తన కోరికను తీర్చుకోవడానికి ఎన్ని వేషాలైనా వేస్తాడు. రంభను కోరిక తీర్చాలని ఆమెను బతిమాలుకున్నాడు. రెండు చేతులు జోడించి ప్రార్థించాడు. లంకలో సీతాదేవి పాదాలకు నమస్కారం చేసి తన కోరికను తీర్చాలని అదే పనిగా వేడుకున్నాడు. స్త్రీలను అనుభవించడానికి ఎన్ని ఉపాయాలున్నాయో, అన్నింటినీ ప్రయోగిస్తాడు. స్త్రీని అనుభవించడమే లక్ష్యంగా జీవిస్తున్నట్టుగా జీవించాడు. ఆ కాముకత్వంతోనే సీతాపహరణానికి పాల్పడ్డాడు. తన కోరిక కోసం సమస్త రాక్షస గణాలను పణంగా పెట్టాడు. కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. తాను అంతమైపోయాడు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
