Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-17

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

17

రాముడు చాలా బలవంతుడని, శక్తిమంతుడని శూర్ఫణఖ వచ్చి చెప్పడానికంటే ముందే రావణుడికి తెలిసింది. అందుకే అనేక ఏండ్లుగా తన స్వాధీనంలో ఉన్న దండకారణ్యంలోని జనస్థానాన్ని కోల్పోయినా.. అకంపన, మారీచాది వ్యక్తులు సలహా మేరకు ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ అతనికి తాను కోల్పోయిన అధికారం తిరిగి తెచ్చుకోవడం ప్రాధాన్యం కానే లేదు. ఇతడు మారీచుడి నుంచి లంకకు తిరిగి వచ్చిన తరువాత శూర్ఫణక వచ్చింది. శూర్ఫణఖ వచ్చి రావణుడికి రెండు విషయాలు చెప్పింది. మొదటిది రావణుడు రాజ్యం ఎలా చేస్తున్నాడో.. అతని తీరు వల్ల రాజ్యానికి ఎంత నష్టం జరుగుతుందో ఏమాత్రం భయపడకుండా పేర్కొన్నది. మిగతా వారంతా అతడికి భయపడినవారే తప్ప ధైర్యం చేసి చెప్పినవారు లేరు. రాజ్యంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుసుకొని.. తదనుగుణంగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజు కార్యాచరణ చేపట్టకపోతే.. రాజ్య భ్రష్టుడైపోతాడని శూర్ఫణఖ రావణుడిని నిందించింది. ‘నీవు బుద్ధిమంతులైన దేవ గంధర్వ దానవులతో విరోధము పెట్టుకున్నావు. కానీ, గూఢచారులను ఏర్పరచుకొనక చపలచిత్తుడివిగా ప్రవర్తిస్తున్నావు. ఇట్టి నీవు రాజు ఎట్లు కాగలవు? నీవు చపల స్వభావము కలవాడవు, బుద్ధిహీనుడవు, తెలుసుకొన దగిన విషయాలు తెలుసుకొనుటలేదు. నీవు రాజు ఎట్లు కాగలవు? గూఢచారులను, కోశాగారమును, పరిపాలనా వ్యవహారమును ఏ రాజులు తమ అధీనములో ఉంచుకొనజాలరో ఆ రాజులు సామాన్య జనులతో సమానులు. రాజులు దూరముగా ఉన్న విషయాలను గూఢచారుల ద్వారా చూడగలుగుతుంటారు. గాన, రాజులను దీర్ఘదృష్టి గలవారు అందురు. గూఢచారులను ఏర్పాటు చేసుకొనకుండా ఉన్న నీ చుట్టూ ఉన్న మంత్రులందరూ సామాన్యులని తలచెదను. అందుచేతనే నీవు జనస్థానములోని నీ వాళ్లందరూ చంపబడిననూ తెలుసుకొనలేకపోయితివి’ (7-11 శ్లో. అరణ్యకాండ 33 వ సర్గ). అంతే కాదు.. ఒక రాజుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ముఖ్యమైందో శూర్ఫణఖ రావణుడికి వివరించింది. అయోధ్యకాండలో రాముడు భరతుడికి ఇదే విషయాన్ని బోధిస్తాడు. రాజ్యం చేసే రాజు శత్రు శిబిరాలతో కలిపి కనీసంగా 15 చోట్ల నిపుణులైన గూఢచారులను ఏర్పాటు చేసుకోవాలని వివరిస్తాడు. ప్రజలను ఎలా పాలించాలి? అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలన్న దానిపై రామాయణంలో చెప్పినట్టుగా మరోచోట పెద్దగా కనిపించదు. రాజు అనేవాడు ఎట్లా ఉండకూడదో శూర్ఫణఖ అరణ్యకాండలో పేర్కొంటే.. రాజు అనేవాడు ఎలా ఉండాలో.. ఎలా వ్యవహరించాలో అయోధ్యకాండలో భరతుడికి రాముడు బోధించాడు. ఈ రెండు కూడా ఈ రోజుకూ మన పాలకులు కచ్చితంగా అనుసరించాల్సిన విధానాలివి.

రావణుడి వ్యక్తిత్వాన్ని పొగిడేవారు.. జై శ్రీరావణ అని కీర్తించేవారు.. శూర్ఫణఖను తొలి మహిళా బాధితురాలిగా జాలిపడేవారు.. అదే శూర్ఫణఖ రావణుడి వ్యక్తిత్వాన్ని గురించి అతనితోనే చెప్పిన మాటలు చదవండి.. ‘రావణా! నీవు దురాశాపరుడవు. మదించి యున్నావు. ఇతరుల ఆధీనములో ఉన్నావు. అందుచేతనే నీ దేశములో వచ్చిన భయమును తెలుసుకొనజాలకున్నావు. తీక్ష్ణమైన స్వభావము కలవాడు, అల్పముగనే ఇచ్చేవాడు, ఏమరిపాటుగా ఉన్నవాడు, గర్వించినవాడు, శకుడు అయిన రాజుకు ఏమైనా కష్టం కలిగినప్పుడు ఎవ్వరూ అతని వద్దకు వెళ్లరు. చాలా గర్వము గలవారు, సమీపించుటకు శక్యము కానివారు, తనను తానే గొప్పగా భావించేవాడు, కోప స్వభావుడైన రాజును ఆపత్కాలములో స్వజనమే చంపివేయుదురు’ (14,15,16 శ్లోకాలు, అరణ్యకాండ, 33 వ సర్గ). రావణుడు ఎంత దారుణమైన పరిపాలకుడో.. ప్రజలను కూడా దగ్గరకు రానివ్వని అహంకారియో, నిరంతర అనుమానాస్పదుడో.. తనకు తాను మేధావినని తలంచేవాడో.. (ఇప్పటికీ మన మేధావుల సంఘాలు ఇలాంటివే) శూర్ఫణఖ విస్పష్టంగా చెప్పింది. రావణ భక్తులు అతడి వ్యక్తిత్వం గురించి అతని సోదరి అన్న మాటలు చూసి ఏమంటారో మరి..

శూర్ఫణఖ ఊహించినట్టుగానే రావణుడు ఆమె మాటలతో రెచ్చిపోయాడు. అప్పటికే అతడికి అకంపనుడు రాముడి గురించి చెప్పి ఉన్నాడు.. అంతకంటే తీవ్రంగా తన ఆధిపత్యాన్నే సవాలు చేసేటట్టుగా శూర్ఫణక తనను నిలదీయడంతో రావణుడు కోపోద్రిక్తుడై ఏమిటీ రాముడు అని చిరాకు పడ్డాడు. దీంతో రాముడి గురించి శూర్ఫణఖ మరింత వివరణ ఇచ్చింది. ‘ఇంద్రధనస్సు వలె ఉన్న, ప్రజ్వలించుచున్న నారాచబాణములను ప్రయోగించెను. రాముడు భయంకరములైన బాణములను ఎప్పుడు తీయుచుండెనో, ధనుస్సును ఎప్పుడు లాగుచుండెనో, బాణాలను ఎప్పుడు ప్రయోగించుచుండెనో నాకు కనపడలేదు. ఇంద్రుడు వర్షించిన రాళ్ల వానచే సస్యము నశించినట్టు బాణ వర్షముచేత ఆ సైన్యము చంపబడుట మాత్రమే నాకు కనపడినది. ఒంటరివాడైన ఆ రాముడు పాదచారిగా ఉండి, ఒకటిన్నర ముహూర్తముల (ఒక గంట పన్నెండు నిమిషముల) కాలములో, భయంకరములైన రూపములు గల పదనాలుగు వేల మంది రాక్షసులను ఖరుణ్ణి, దూషణుణ్ణి వాడియైన బాణములచేత సంహరించినాడు’ (5-11 శ్లో. అరణ్యకాండ 34వ సర్గ).

రాముడి గురించి మాట్లాడేవారు.. అతడి ధనుర్విద్యను గురించి కూడా మాట్లాడితే బాగుండేది. వాళ్లూ, వీళ్లూ చెప్పడం కాదు.. సాక్షాత్తూ రావణుడి సైనికుడు, అతడి చెల్లెలు, రాముడి చేత దెబ్బ తిన్న మారీచుడి లాంటి వాళ్లే అద్భుతంగా వివరించారు. ఇంత జరిగిన తరువాత కూడా రావణుడు పెద్దగా స్పందించలేదు. ఆ తరువాత ఇక శూర్ఫణఖ బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించింది. అదేమిటంటే.. సీత అందాన్ని చెప్పి రెచ్చగొట్టడం. మీరూ చదవండి. ‘రాముని భార్య విశాలమైన నేత్రములు, పూర్ణ చంద్రుని వంటి ముఖము గలది. భర్తకు చాలా ప్రియురాలు. ఆమె ఎల్లప్పుడూ భర్త హితమునే కోరును. అందమైన జుట్టు, ముక్కు, తొడలు గల సౌందర్యవతియైన ఆ కీర్తిమంతురాలు జనస్థానమునకు దేవతవలె, రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశించుచున్నది. ఆమె శరీర కాంతి శుద్ధమైన బంగారము వర్ణము వంటిది. మంగళప్రదురాలైన ఆమె గోళ్లు ఎఱ్ఱగానూ ఎత్తుగానూ ఉండును. నడుము సన్నగా ఉండును. విదేహ రాజకుమారియైన ఆమె పేరు సీత. ఇట్టి సౌందర్యము గల దేవతా స్త్రీని గానీ, గంధర్వ స్త్రీని గానీ, యక్ష స్త్రీని గానీ, కింనర స్త్రీని గానీ, భూలోకములో ఉండే మనుష్య స్త్రీని గానీ నేనెన్నడూ చూడలేదు. సీతను భార్యగా పొందగలిగినవాడు, సీత ఆనందపూర్వకముగా ఎవనిని కౌగిలించుకొనునో అతడు, అన్ని లోకములలోనూ దేవేంద్రుని కంటే కూడా గొప్పవానిగా జీవించును. మంచి శీలము, శ్లాఘించదగిన శరీరము, భూలోకములో సాటిలేని రూపముగల ఆమె నీకు తగిన భార్య అగును. నీవు ఆమెకు తగిన భర్తవు అగుదువు. గొప్ప భుజములు కలవాడా! విశాలమైన జఘనము, బలిసిన కటి ప్రదేశము, స్తనములు, సుందరమైన ముఖము గల ఆ సీతను నీకు భార్యగా చేయుటకై తీసుకొని వచ్చుటకు నేను ప్రయత్నము చేయగా క్రూరుడైన లక్ష్మణుడు అవయవములు ఖండించి విరూపను చేసినాడు. పూర్ణ చంద్రునితో సమానమైన ముఖము గల ఆ సీతను చూచినచో నీవు ఇప్పుడే మన్మథుని బాణములకు లొంగిపోదువు’. (14- 22 శ్లో. అరణ్యకాండ, 34 వ సర్గ).

సీత గురించి అకంపనుడు చెప్పిన దానికి, శూర్ఫణఖ చెప్పిన దానికి హస్తి మశకాంతరం ఉన్నది. అందువల్లనే రావణుడు ఇక ఆగలేదు. రాముడు బలవంతుడా కాదా అన్న మీమాంసకు చాన్స్ ఇవ్వలేదు. రాముడితో పెట్టుకోవద్దు అన్న ఆలోచన రానే లేదు. రావణుడి కళ్ల ముందు కేవలం సీత మాత్రమే ఉన్నది. శూర్ఫణఖ వర్ణించిన సీత అందం గురించిన వర్ణనలు మాత్రమే చెవుల్లో మార్మోగుతున్నాయి. వెంటనే గాడిదలు పూన్చిన రథాన్ని ఎక్కి ఏ మారీచుడి సలహా మేరకు సీతాపహరణం గురించి తన తొలి నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడో.. అదే మారీచుడి దగ్గరకు మళ్లీ వెళ్లాడు. ఈసారి సలహా అడగలేదు. తాను చెప్పింది చేయాలని ఆదేశించాడు. పాపం మారీచుడేమో ఇంకోసారి చెప్పాలని ప్రయత్నించాడు కానీ.. ఆతని మాటలను రావణుడు చెవికెక్కించుకోదలచుకోలేదు. రెండోసారి అతడు ఫిక్స్ అయి వచ్చేశాడు. ఇక తప్పక మారీచుడు రాముడిని దారి మళ్లించడానికి బయలుదేరాడు. ఈ విధంగా తనకు అత్యంత అనుకూలుడైన, ప్రతిభావంతుడైన మంత్రిని సీతాపహరణానికి ఎరగా వాడుకుని అతడిని నిర్దాక్షిణ్యంగా పోగొట్టుకున్నాడు. మారీచుడిని పంపించిన వెంటనే రావణుడు పంచవటికి వెళ్లాడు. అక్కడ సీతను చూడగానే అతడికి మతిపోయింది. వివశుడైపోయాడు. ఆమెను వర్ణించడం మొదలు పెట్టాడు.. “నీ తెల్లని దంతములు సమములై కొనలు దేరి నున్నగా ఉన్నవి. విశాలములైన నీ నేత్రములు నిర్మలములుగా ఉన్నవి. వీటి కొనలు ఎఱ్ఱగా ఉన్నవి. కనుగ్రుడ్లు నల్లగా ఉన్నవి. విశాలమైన నీ జఘనము బలిసి ఉన్నది. తొడలు ఏనుగు తొండమువలె ఉన్నవి. శ్రేష్టములైన మణుల చేత అలంకరింపబడిన అందమైన ఈ స్తనములు దగ్గరగా గుండ్రముగా పెరిగి ఉన్నవి. కొంచెము కదులుచున్నవి. బలిసి ఎత్తుగా ఉన్న ముఖములతో మనోహరములై కాంతి గల ఈ స్తనములు తాటిపండ్ల వలె ఉన్నవి.” (7-19, అరణ్యకాండ 46వ సర్గ). ఇంతటి అందాల రాశి తనకు పట్టమహిషిగా కావాలని బలంగా కోరుకున్నాడు. ఇద్దరి మధ్య పెద్ద డిస్కషనే అయింది. సీతాదేవికి తాను ఎవరినో, తాను ఏమిటో, తన శక్తి సామర్థ్యాలు ఏమిటో పూర్తిగా విడమరచి చెప్పుకొచ్చాడు. సీతాదేవి కూడా ఊరుకోలేదు.. తానేమిటో.. తన భర్త అయిన రామచంద్రుడు ఎవరో, ఎలాంటివాడో, ఎంత శక్తిమంతుడో కూలంకశంగా వివరించింది. తాను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి చుప్‌చాప్‌గా వెళ్లిపోవాలని స్పష్టంగా చెప్పింది. తనను బలవంతంగా అపహరించుకొని వెళ్తే రాముడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో స్పష్టంగా వివరిస్తుంది. కనీసం నాలుగు సర్గల్లో సీతారావణ సంవాదం జరుగుతుంది. ఈ నాలుగు సర్గల్లోనూ రావణుడి బలమూ బలహీనతలు, రాముడి బలము.. సీత మీద ప్రేమ ఎలాంటిదో చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇంత జరిగిన తరువాత కూడా రావణుడి మైకం వదలలేదు. ఆ రాముడి వల్లనే ఖరదూషణాది తన సైన్యం అంతా మట్టి కొట్టుకుపోయిందన్న ఆలోచన రాలేదు. జనస్థానంపై తన అధికారం పోయిందన్న ఇంగితం లేకుండా పోయింది. నిజానికి తన సైన్యాన్ని అంత దారుణంగా చంపి, తన అధికారంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతాన్ని తనకు కాకుండా చేసినందుకు రాముడిపై రావణుడు పగ తీర్చుకోవాలి. కానీ రావణుడికి అవేవీ ముఖ్యం కానే లేదు. సీత మాత్రమే కావాల్సి వచ్చింది. ఆమెను బలవంతంగా ఎత్తుకొని వెళ్లిపోయాడు. పర్ణశాల దగ్గర మాటలతో వర్కవుట్ కాలేదు.. దీంతో లంకకు వెళ్లగానే తన వైభవాన్నంతా చూపించాలని డిసైడ్ అయ్యాడు. లంకకు చేరుకోగానే మొదట అంతఃపురములో ఉంచాడు. తరువాత కొద్ది మంది సైన్యాన్ని పిలిచి జనస్థానానికి వెళ్లాలని సూచించాడు. 14 వేల మంది సైన్యంతో దుర్భేద్యంగా ఉన్న జనస్థానానికి 8 మందిని మాత్రం పంపిస్తే.. ఏం ప్రయోజనం? ఆ విషయం తనకూ తెలుసు. నామమాత్రంగా పంపించాడే తప్ప మరేమీ లేదు. అతనికి సీత ముందు మండోదరి సహా మిగతా రాణులందరూ అప్రధానులైపోయారు. సీతను పట్టమహిషిని చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ముందుగా లంకకు తీసుకొని రాగానే ఆమెను ఒక అంతఃపురంలో ఏకాంతంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచాడు. ఆమె మూర్ఛ నుంచి ఎప్పుడు తేరుకుంటుందా అని ఎదురుచూశాడు. ఆమె తేరుకోగానే ఆమెను బలవంతంగా తీసుకొని బయలుదేరాడు. దేవతల గృహాలతో సమానమైన తన గృహాన్ని కలియదిప్పి చూపించాడు. ప్రతి అంతఃపురంలో వేలకొలది స్త్రీలు ఉన్నారు. ఇంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ.. అతడికి తృప్తి లేదంటే.. ఎంతగా విమనైజరో అర్థం చేసుకోవచ్చు. సీతాదేవికి తప్పనిసరి పరిస్థితులు కల్పించడం కోసం బెదిరింపులు కూడా చేశాడు. ‘సీతా! ముసలివాళ్లు, బాలులు అయిన రాక్షసులు కాక 32 కోట్ల మంది రాక్షసులున్నారు. భయంకరములైన పనులు చేయువారందరికీ నేను ప్రభువును. ఏ చిన్న పని పడినను వెయ్యిమంది ముందుకు వచ్చుచుందురు. ఈ సమస్తమైన రాజ్యసంవిధానము, నా జీవితము కూడా నీమీద ఆధారపడి ఉన్నది. నీవు నా ప్రాణముల కంటె గొప్పదానవు. నేను పెద్ద సంఖ్యలో ఉత్తమ స్త్రీలను సంపాదించుకొని వచ్చినాను. ఆ స్త్రీలందరకూ నీవు ప్రభువుగా ఉండుము. ప్రియురాలా! నీవు నా భార్యవు అగుము. నీవు మరొక ఆలోచన ఎందుకు చేసెదవు? నేను చెప్పిన మంచి మాటను అంగీకరించుము. కామము తపించిపోతున్న నన్ను అనుగ్రహింపుము’(14-18 శ్లో. 55 వ సర్గ, అరణ్యకాండ) .

‘సీతా ధర్మలోపము కలుగనున్నదని సిగ్గుపడవద్దు. నీకు దైవవశముచేత లభింపనున్న ఈ సంబంధము ధర్మ శాస్త్రములలో రుషులచేత అంగీకరింపబడినదే. సుందరమైన నీ పాదములను స్పృశించి నమస్కరించుచున్నాను. నామీద శీఘ్రముగా అనుగ్రహము చూపుము. నేను నీకు వశుడనైన దాసుడను. కామపీడితుడనైన నేనే ఈ శూన్యములైన (నా వంటివాడు చెప్పకూడదని) మాటలు చెప్పుచున్నాను. రావణుడు ఏ స్త్రీకి నమస్కరించడు కదా’ (34-36 శ్లో. 55వ సర్గ, అరణ్యకాండ). చూడండి.. తాను ఎంతమంది స్త్రీలను తన కామదాహాన్ని తీర్చుకోవడానికి వాడుకున్నాడో సవివరంగా విడమరచి చెప్పాడు. విచిత్రమేమంటే.. ఆ ఆడవాళ్లందరికీ బాస్ గా ఉండవచ్చని సీతకు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు. అమ్మ విషయంలో ఇలా చేయవచ్చా అంటే వాడొక మూర్ఖుడు కాబట్టి అలా చేశాడు. వాడి అంతఃపురాన్ని చూస్తే.. అక్కడున్న ఆడవాళ్లను చూస్తుంటే, వాడొక వేశ్యావాటికను నడుపుతున్నట్టున్నది. ఆ వేశ్యావాటికకు విటుడు ఈ రావణుడు ఒక్కడే. సీతను సాధించడానికి వాడు దేనికైనా సిద్ధపడ్డాడు. మొత్తం రాజ్యమే తన ఆధీనంలోకి తెస్తానన్నాడు. తన స్త్రీలందరికీ బాస్‌గా ఉండాలనడం కంటే దౌర్భాగ్యం ఏమీ లేదు. తాను అనుభవించే స్త్రీలకు సీతమ్మ బాస్‌గా ఉండటం ఏమిటి? ఎంత నీచమైన ఆలోచన. చివరకు ఆమె కాళ్లను పట్టుకున్నాడు. ఎవరికీ నమస్కరించని తాను కాళ్లు పట్టుకున్నానంటే తాను ఎంత తపిస్తున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఇదీ రావణుడి వ్యక్తిత్వం.. అత్యంత భయంకరమైన వ్యక్తిత్వం ఉన్నవాడిని, నీచుడిని ఎలా గొప్పగా కీర్తిస్తారో అర్థం కాదు. కనీసం ఏ ఒక్క కోణంలోనైనా రావణుడు గొప్పవాడిగా కనిపించాలి కదా.. కనీసం మంచివాగిగానైనా కనపడాలి కదా..

చివరకు ఏ రాముడైతే.. శత్రు దుర్భేద్యమైన లంక దరిదాపుల్లోకి కూడా రాడన్న ధీమాతో ఉన్నాడో.. ఆ రాముడి దూత హనుమంతుడు లంకలోకి ప్రవేశించి చైత్య ప్రాసాదాన్ని ధ్వంసం చేశాడు. అక్ష కుమారుడిని హతమార్చి మరీ వెళ్లాడు. అంతేకాకుండా కొద్ది కాలానికే సమస్త వానరసేనతో లంకలో కాలుమోపాడు. అయినా అతడికి సీతను విడిచిపెట్టాలని ఏ కోశానా కలుగలేదు. తమ్ముళ్లు చెప్పినా తలకెక్కలేదు. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఏం చేయాలో చెప్పండని అడిగాడు. చివరలో కండిషన్స్ అప్లై అన్నాడు. సీతను విడిచి పెట్టాలన్న ఒక్క మాట తప్ప ఏది చెప్పినా చేస్తానన్నాడు. తన మొత్తం జీవితంలో మంత్రులు చెప్పినట్టు చేస్తానని రావణుడు అనడం అదే మొదటిసారి. చివరిసారి కూడా. “రాముని ప్రియురాలైన భార్యయైన సీతను రాక్షసులు సంచరించు దండకారణ్యమునుంచి తీసుకొని వచ్చితిని. మందగామినియైన ఆ సీత నా శయనమును ఎక్కుటకు అంగీకరించుటలేదు. ఈ మూడు లోకాలలో సీతతో సమానురాలైన స్త్రీ మరొక స్త్రీ ఉన్నదని నేను భావించను. ఆమె నడుము సన్ననిది. కటి ప్రదేశము విశాలము. ముఖము శరత్కాల చంద్రుని వలె ఉన్నది బంగారు ప్రతిమ వలె ఉన్న ఆమె మయుడు నిర్మించిన మాయవలెనున్నది. మృదువైన ఆమె పాదముల అడుగు భాగములు ఎఱ్ఱగా ఉన్నవి. నేలపై చక్కగా ఆను ఆ పాదముల గోళ్లు ఎఱ్ఱగా ఉన్నవి. అట్టి పాదములను చూచి నా కామము వృద్ధి పొందుచున్నది. హోమము చేసినప్పుడు బయలుదేరిన అగ్నిజ్వాల వలె, సూర్య కిరణము వలె ఉణ్న ఈమెను ఎత్తైన ముక్కుతో, అందమైన నేత్రములతో, సుందరముగా, నిర్మలముగా ఉన్న ఈమె ముఖమును చూడగానే కామమునకు వశుడు అయినాను. ఈ కామము నన్ను క్రోధ సమయమునందు, సంతోష సమయమునందు, శోక సమయమునందు, సంతాప సమయమునందు కూడా సమముగా నిత్యమూ వెంటాడుచున్నది. అట్టి కామముతో నిండియున్నాను. విశాలనేత్రియైన ఆ సీత భర్త కొరకై ఎదురుచూచుచూ ఒక సంవత్సర కాలము ఇమ్మని నన్ను కోరినది. సుందరములైన నేత్రములు గల ఆమె శుభవచనమును నేను అంగీకరించితిని. ఆగకుండా పరుగెత్తిన గుఱ్ఱము వలె నేను కామము వలన చాల అలసిపోయి ఉన్నాను. అనేక జంతువులతో వ్యాప్తమైన క్షోభింప శక్యము కాని సముద్రమును వానరులు, ఆ రామలక్ష్మణులు కానీ ఎట్లు దాటగలరు? లేదా ఒక్క వానరుడు వచ్చి మనకు చాలా నష్టము చేసినాడు. అందుచేత, ఎప్పుడేమి జరుగునో తెలిసికొనుట కష్టము. మీమీ బుద్ధిననుసరించి ఏమి చేయవలెనో చెప్పుడు. మనుష్యుని వలన మనకేమీ భయము లేదు. అయిననూ మీరు ఆలోచించండి. పూర్వము నేను మీతో కలిసి దేవాసుర యుద్ధంలో దేవతలను జయించినాను. మీరు కూడా జయించినారు. రామలక్ష్మణులు సీత జాడ తెలిసికొని సుగ్రీవాది వానరులతో కలిసి సముద్రము అవతలితీరమునందు సముద్ర సమీపమునకు వచ్చినారు. సీతను ఇవ్వకుండగా ఎట్లు ఉండగలమో, రామలక్ష్మణులను ఎట్లు చంపగలమో బాగుగా ఆలోచించి చెప్పుడు. రాక్షసులు తప్ప మరెవ్వడూ వానరులతో కలిసి సముద్రమును దాటి రాజాలడు. అందుచేత నాకే జయము తప్పక లభించును” (12-26 శ్లో. 12వ సర్గ, యుద్ధకాండ).

రావణుడు ఏ దశలోనూ తన కాముకత్వాన్ని దాచుకోలేదు. దాని ముందు సమస్త బంధు జనాలను నాశనం చేశాడు. రాజ్యాన్ని నాశనం చేశాడు. కేవలం తన కాముకత కోసం తన లంకలోని 32 కోట్ల మంది రాక్షసుల జీవితాలను మృత్యు కుహరంలోకి నెట్టేశాడు. తాను రాజ్యం చేసింది, ప్రజలను పరిపాలించింది ఏమీ లేదు. ఒంటినిండా కామం అనే మైకం కమ్ముకొని ఉన్నవాడు.. రాజ్యాన్ని ఏం పాలిస్తాడు? ప్రజలకు మేలేం చేస్తాడు? ఇదీ రావణుడి వ్యక్తిత్వం. ఇందుకు కొందరు పెద్దమనుషులు తమను ఎదిరించిన వాళ్లను హతమార్చి దానికి రాక్షస సంహారం అని పేరు పెట్టుకుంటారని.. ఈ ట్రెడిషన్ రామాయణం నుంచి వచ్చిందని ఫేసుబుక్కుల్లో అవాకులు పేలుతుంటారు. రావణుడు ఏ దశలో.. ఎక్కడ ఏ మేరకు ఏ స్థాయిలో మంచి చేశాడో.. మంచివాడో ఏ హేతువాది అయినా, లిబరలిస్టు అయినా, కమ్యూనిస్టు అయినా చెప్పాలి.. వాల్మీకి రామాయణంలోని.. కనీసం ఉత్తరకాండలోనైనా సరే.. రావణుడికి సంబంధించి ఇసుమంత మంచితనాన్ని వెలికి తీయాలని కోరుతున్నా.

(ఇంకా ఉంది)

Exit mobile version