[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే ప్రత్యేక వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
2
మనిషిని, అతనిలోని అత్యంత ఉదాత్తమైన, అంతర్నిహితంగా ఉన్న శక్తుల స్థాయికి ఒక మానసిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, నైతిక, సౌందర్యప్రియ జీవిగా చేర్చగల సంస్కృతిని సాధించిన ఏకైక నాగరికత భారతీయ నాగరికత. సునిశితమైన అవగాహనతో, వివేచనాత్మక పరిగణనతో మన నాగరికతను, ఇతిహాసాలను, పురాణాలను పరిశీలిస్తే ఎంత ఉన్నతమైనవో, అపారమైన మేధ కలిగినవో.. సమస్త విశ్వానికి ఎంతటి మార్గదర్శకత్వం చేస్తున్నవో అర్థమవుతుంది. తొలినాటి చిన్న చిన్న భారతదేశ జాతులు తమ ప్రవర్తనా ప్రమాణాన్ని, మార్గాన్ని సహజంగా అన్వేషించుకుంటూ సమాజ స్వభావాల నుంచి జీవిత రూపాన్ని సాంఘిక రాజకీయ వ్యవస్థలను వెలువరిస్తూ, శక్తిమంతమైన జీవశక్తితో అభివృద్ధి చెందాయి. ఇవన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి వృద్ధి అవుతున్న సాంస్కృతిక సాంఘిక ఏకత్వంగా పరిణమించాయి. అంతగా ముఖ్యం కాని విధానాలలో కానీ, రూపాలలో కానీ, వైవిధ్యాన్ని పొందే గొప్ప స్వేచ్ఛను అనుమతించే ఒక చైతన్యాన్ని, నిర్మాణాన్ని ఈ జాతులు పెంపొందించుకున్నాయి.
ఇతర దేశాల్లో మాదిరిగా, ఇతర జాతుల్లో మాదిరిగా కర్కశమైన ఏకత్వానికి చోటివ్వలేదు. ఏ సంస్కృతికి ఆ సంస్కృతి భిన్నమైనా.. ఒక సామాన్యమైన ఆధ్యాత్మిక చైతన్యం, జీవిత ప్రేరణ ఈ జాతులన్నింటి మధ్యన మృదువైన ఏకత్వాన్ని పెనవేశాయి. మహా రాజ్యాలు, సామ్రాజ్యాలు ప్రబలంగా విస్తరించినప్పుడు కూడా చిన్న రాజ్యాలు, గణతంత్ర సంస్థలు, జాతులు మొదలైనవి విలక్షణంగా సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక నిర్మాణంలో కొత్త రూపంలో చేర్చటం జరిగిందే తప్ప వాటిని నాశనం చేయటం కానీ, నిర్మూలించడం కానీ జరుగనే లేదు. నాగరికత వికాసంలో నిలువలేక పోయినవీ, అవసరం తీరిపోయినవీ ఏవైనా ఉంటే అవి వాటంతట అవే కృశించి, నశించిపోయాయి. కొత్త పరిస్థితులకు, వాతావరణానికి అనువుగా మారగలిగిన సమాజాలు, నాగరికతలు నిలబడ్డాయి. రామాయణ కాలం నుంచి కూడా విశ్వజనీనమైన సంస్కృతి పరంపరగా కొనసాగుతూనే వచ్చాయి. రామాయణంలో నిషాదుడైన గుహుడి రాజ్యమైనా, తరువాత పెద్ద రాజ్యమైన కిష్కింధ అయినా, ఆ తరువాత రావణుడి లంక అయినా.. ప్రజానుకూల మార్పులకు లోనయ్యాయే తప్ప నశించిపోలేదు. అలా అని రాముడి మహా సామ్రాజ్యంలో కలసిపోయి సమసిపోలేదు. చక్రవర్తి నశింపజేయనీయలేదు. నాలుగు భిన్నమైన సాంస్కృతిక సమాజాలను రాముడు ఏకం చేశాడు. మనం ఇవాళ అనుకునే భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు మూలం ఇక్కడ ఉన్నది. రామాయణం లోని సార్వకాలీనమైన అంశం ఇదే. అదే సమయంలో ప్రాచీన భారతీయ వ్యవస్థలో వికృత నిరంకుశత్వానికి, రాచరిక హింసా ప్రవృత్తికి, అణచివేతకు అవకాశమే లేదు. అటువంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారీ వాటిని నిర్దయగా అణచివేయడమే జరిగింది. ఇందుకు ఉదాహరణమే రామాయణం. రావణ వధ.
ఈ దృష్టి కోణంతో మన ఇతిహాసాలను అధ్యయనం చేయకుండా నిర్దిష్టమైన అజెండాతో దుర్వ్యాఖ్యానాలు చేయడం వల్ల రావణుడు అత్యున్నతుడయ్యాడు. లౌకిక విలువల పేరుతో, ఆర్య ద్రావిడ సిద్ధాంతాల పేరుతో ఒక అజెండా ప్రకారం శ్రీరాముడిని దుర్మార్గుడిగా చిత్రించి.. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడంతో పాటు, రావణుడిని వేనోళ్లా కీర్తించడం జరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే వాస్తవికమైన రావణుడి వ్యక్తిత్వాన్ని దృశ్యమానం చేయాలని ఈ చిన్న ప్రయత్నం.
రావణుడిని వేనోళ్లా కీర్తించడం, పూజలు చేయడం ఇవాళ కొత్తగా జరుగుతున్న విషయమేం కాదు. ఒక పొలిటికల్ ఎజెండాతో ఈ వాదన ప్రారంభమైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడులో 1916లో జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది. డాక్టర్. సి నటేశ ముదలియార్, టీఎం నాయర్, పీ త్యాగరాయశెట్టి ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ స్థాపించడానికి ప్రధాన కారణం.. ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో సివిల్ సర్వీసు ఉద్యోగాల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండటం. బ్రాహ్మణేతరులు తక్కువగా ఉండటంతో ఈ బ్రాహ్మణ అధికారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది. దక్షిణభారత దేశంలో యాంటీ బ్రాహ్మిణ్ ఉద్యమం జస్టిస్ పార్టీతోనే మొదలైంది. సివిల్ సర్వీసు ఉద్యోగాల్లో ఒక్క బ్రాహ్మణుడు కూడా ఉండటానికి వీల్లేదంటూ ఉద్యమం చేశారు.
1919లో మొంటాగ్యూ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల నేపథ్యంలో తొలి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జస్టిస్ పార్టీ పాల్గొన్నది. దాదాపు పదిహేడేళ్లపాటు ఐదుగురు మంత్రుల్లో నలుగురు జస్టిస్ పార్టీ వారే కొనసాగారు. ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి కుల ఆధారిత రిజర్వేషన్లను విద్యారంగంలో ప్రవేశపెట్టారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఈ పార్టీ కొనసాగింది. అయితే 1937 ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయింది. తరువాత చాలా కాలం కోలుకోలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని తిప్పికొట్టడానికి హిందీ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరులూదింది.
1944 లో పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ ఆధీనంలోకి వచ్చిన తరువాత దీని రూపురేఖలు మారిపోయాయి. ద్రవిడ ఆత్మాభిమానం పేరుతో ద్రవిడ ఉద్యమానికి నాయకర్ శ్రీకారం చుట్టారు. జస్టిస్ పార్టీని ద్రవిడర్ కజగం అనే స్వచ్ఛంద సంస్థగా మార్చారు. అయితే 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పెరియార్‌తో విభేదించిన ఒక గ్రూపు తమదే ఒరిజినల్ జస్టిస్ పార్టీ అని చెప్పుకొని పోటీ చేసింది. భారతీయ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద కార్యక్రమాలు చేపట్టిన పార్టీగా జస్టిస్ పార్టీని చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నట్టు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. సివిల్ సర్వీసులు, రాజకీయాల్లో బ్రాహ్మణులు ప్రవేశించకూడదని ప్రత్యక్షంగా ఉద్యమం చేసింది జస్టిస్ పార్టీ. ఈ ఉద్యమమే తమిళనాడులో బ్రాహ్మణుల జంధ్యాలను బజార్లలో పబ్లిక్‌గా తెంపివేసి వాళ్ల పట్ల ఒక వ్యతిరేక ఆందోళనను తీవ్రంగా ప్రదర్శించింది. ఈ ఉద్యమమే ఈనాటి హేతువాదులు, కమ్యూనిస్టులు, లిబరలిస్టులు, కుల అస్తిత్వ వాదులు ‘బ్రాహ్మణ భావజాలం’ అన్న పదాన్ని ఖాయం చేయడానికి కారణమైంది.
ఈ క్రమంలోనే అనీబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని జస్టిస్ పార్టీ వ్యతిరేకించింది. ఎందుకంటే హోంరూల్ ఉద్యమం కూడా బ్రాహ్మణులు అనబడేవారికి మేలు చేసేదిగా జస్టిస్ పార్టీ భావించింది. గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమాన్ని కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో వ్యతిరేకించింది. తమకు ప్రత్యేక ద్రవిడ దేశం కావాలన్న డిమాండూ చేసింది. దీన్ని గాంధీజీ వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీలోనూ బ్రాహ్మణాధిపత్యం ఉన్నదని ఆ పార్టీ చేపట్టిన స్వాతంత్ర్యోద్యమానికి కూడా సహకరించలేదు. కేవలం ఉద్యోగాల్లో అత్యధికులు ఉన్నారన్న కారణంతో మొదలైన ఉద్యమం సర్వ అనర్థాలకు బ్రాహ్మణులే మూలం అని ఇవాళ ఫేస్‌బుక్కుల్లో పోస్టర్లు వేసే స్థితికి తీసుకొని వచ్చింది.
పెరియార్ తన ద్రవిడ ఉద్యమంతో ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య తీవ్రమైన అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఉత్తరాది వారు ఆర్యులనీ, దక్షిణాది వారు ద్రవిడులని ఖాయం చేసేశారు. తమ వాదనకు బలం చేకూర్చడానికి వారికి బాగా పనికొచ్చిన అంశాలు హిందీ భాష, రామాయణం. ఉత్తరాది భాష అయిన హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని హిందీ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ఈ వ్యతిరేకత ముఖ్యంగా తమిళనాడులో కొనసాగుతునే ఉన్నది. ఇక రెండవది రామాయణం. ద్రవిడ ఉద్యమానికి దీనికి మించిన బ్రహ్మాస్త్రం మరొకటి లేదనే చెప్పాలి. రాముడు ఆర్యుడని.. ఈ ఆర్యుడైన రాముడు ససైన్యంతో ద్రవిడ రాజైన రావణుడిపైకి దండెత్తి అతడిని కుట్ర పూరితంగా హతమార్చాడని ఒక వాదనను ప్రజల్లోకి పెరియార్ తీసుకొని వెళ్లారు. అంతే కాకుండా రావణుడికి పెద్దఎత్తున పూజలు చేయడం ప్రారంభించారు. దసరా పండుగకు వార్షికోత్సవాలు నిర్వహించారు.
‘రామాయణ ఏ ట్రూ రీడింగ్’ అన్న పేరుతో పెరియార్ ఈవీ రామస్వామి రామాయణంపై ఒక రచన చేశారు. ఇది దేశంలోనే అత్యంత వివాదాస్పదమైంది. దీని హిందీ అనువాదం (సచ్చీ రామాయణ్) ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 1969లో నిషేధించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టులో ప్రచురణకర్త తీవ్రంగా వాదించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాపీలన్నీ వాపస్ చేసేయాలని ఎక్కడా అమ్మకూడదని అలహాబాద్ హైకోర్టు నిషేధం విధించింది. 1976 సెప్టెంబర్ 16 న సుప్రీం కోర్టు ఈ పుస్తకంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఊరట కల్పించింది. కానీ, యూపీ ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును అప్పుడు పట్టించుకోలేదు. పుస్తకాన్ని మార్కెట్లోకి రానివ్వలేదు. 1995లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చాక పుస్తకాన్ని తిరిగి ప్రచురించి 1995 సెప్టెంబర్‌లో పెరియార్ మేళా నిర్వహించి మార్కెట్లోకి తెచ్చారు. తరువాత ఈ పుస్తకాన్ని పలు భాషల్లోకి అనువదించారు కూడా. పెరియార్ కూడా తన రామాయణ గాథను పూర్తిగా తమిళుల కోణంలోనే రాశారు. తమిళుల స్వాభిమానం దృష్టితోనే చూశారు. ఈ విషయాన్ని ఆయన తన ముందుమాటలో స్పష్టంగానే వ్యక్తీకరించారు. తమిళులను చిన్న చేయడం కోసం మాత్రమే రామాయణం వంటి పుస్తకాలు వచ్చాయని తీవ్రంగా నిందించారు కూడా.
“రామాయణానికి ఏ చరిత్ర ఆధారం లేదు. అదొక కల్పిత రచన. దాని ప్రకారం రాముడు తమిళుడు కాదు. తమిళ దేశానికి చెందినవాడు కాదు. అతను ఉత్తర భారతం వాడు. అతను చంపిన రావణుడు లంకకు రాజు. లంక అంటే దక్షిణ తమిళనాడు. కించిత్తు అయినా తమిళ సంస్కృతి (తిరుక్కురల్ సంస్కృతి) రాముడిలో లేదు. అతనికి లాగానే అతని భార్య కూడా తమిళ గుణగణాలు లేని ఉత్తర భారత మనిషి. తమిళనాడుకు చెందిన మగవాళ్లను కోతుల్లాగా, రాక్షసుల్లాగా అసహ్యంగా చిత్రించారు. రామాయణ యుద్ధంలో ఉత్తర భారతానికి సంబంధించిన వాడెవడూ బ్రాహ్మడు లేక ఆర్యుడు (దేవుడు) ప్రాణాన్ని పోగొట్టుకోలేదు. ఒక ఆర్యుడి కుర్రాడు జబ్బు వచ్చి చచ్చాడని వాడి కోసం ఒక శూద్రుడు తన ప్రాణాన్ని పణంగా చెల్లించాడు. యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లంతా తమిళులు మాత్రమే. వాళ్లనే రాక్షసులున్నారు. రావణుడు రాముడి భార్యను ఎత్తుకెళ్లాడు. ఎందుకంటే అతని చెల్లెలి అవయవాల్ని కోసి కురూపుని చేశారు. రావణుడు చేసిన ఈ పనికి లంకనెందుకు తగులబెట్టాలి? లంకావాసుల్ని ఎందుకు చంపాలి? ఈ కథ యొక్క ఉద్దేశ్యం తమిళులను నీచంగా చూపించడం, తమిళనాడులో ఇంకా ఈ కథను గౌరవించడం అంటే ఆ ప్రజల స్వాభిమానాన్ని దెబ్బతీయటం, కించపరచటమూ అవుతుంది. రాముడిలోగానీ, సీతలో కానీ దైవాంశమైనది కూడా ఏమీ లేదు. స్వతంత్రం లాంటిది వచ్చిందని అనుకుంటున్న తరువాత తెల్లవాళ్ల విగ్రహాలు తీసేశారు. వాళ్ల పేర్లున్న స్థలాలను మార్చి వాటికి బదులు భారతీయుల పేర్లు పెట్టారు. అట్లాగే తమిళుల గౌరవాన్ని కించ పరిచే ఆర్య దేవుళ్లను వాటి ప్రాముఖ్యతను తీసి అవతల పారేయాలి. నరనరాల్లో ద్రావిడ రక్తం పారుతున్న ప్రతి తమిళుడు ఈ పని చేయించటం తన కర్తవ్యంగా భావించి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది” (రామాయణం యథార్థ పరిశీలన పెరియార్ వీ రామస్వామి తొలి పలుకు).
రామాయణంపై ఈ విధమైన ఆలోచన చేయడం పెరియార్‌కు మాత్రమే చెల్లింది. అది తమిళులపై తీవ్రంగా ప్రభావం చూపించింది. వాల్మీకి రామాయణంతో ఎంతమాత్రం సంబంధం లేని అనేక సొంత కథనాలను రామాయణ పాత్రలకు ఆపాదించి ఈయన నిందించారు. రాముడు ఒక దుర్మార్గుడు, పచ్చి అబద్ధాలకోరు, ద్రోహి, టక్కరివాడు, కుట్రదారు, ఏ దయ లేని రాతి గుండెవాడు, అసూయాపరుడు, తాగుబోతు, మాంసభక్షకుడు, ఎదురుపడి పోరాడలేక మాటుకాచి అంబుల్ని వేసి అమాయకులను చంపేవాడు, దుర్మార్గులతో సఖ్యత చేసే ముఠాదారు, పౌరుష హీనుడు వంటి అన్ని అవలక్షణాలు ఉన్న వాడిగా పెరియార్ తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అదే సమయంలో రావణుడు ఎంతో చదివిన ఒక విద్యావంతుడు, ఒక మహాముని, పాత గ్రంథాలు (వేదశాస్త్రాలు) క్షుణ్ణంగా తెలిసిన పండితుడు. తన ప్రజలను, బంధువులను దయతో పాలించి కాపాడే రక్షకుడు, ధైర్యవంతుడు, మహాశక్తిమంతుడు, వీరోచితంగా పోరాడే సైనికుడు, ఎంతో పవిత్రుడు, భగవంతుడికి ప్రియమైన కుమారుడు, ఎన్నో వరాలు పొందినవాడు అని రావణుడి వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేశారు. ఈ పది మేలు గుణాలు రావణుడికి ఉన్నాయని వాల్మీకే అనేక సందర్భాల్లో పొగిడారని కూడా పెరియార్ తన గ్రంథంలో పేర్కొన్నారు.
విచిత్రమేమిటంటే.. తమిళులను రాక్షసులని, అసురులని ఉత్తర భారతీయులు నిర్వచించారని దుర్భాషలాడారు. అలాంటప్పుడు 16 వేల మంది మహిళలను ఎత్తుకెళ్లిన నరకాసురుడు, బాణాసురుడు, బకాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారంతా ఎవరు? ఎక్కడివారు?
ప్రాగ్జ్యోతిష పురం నిర్మించినవాడు నరకుడు. ప్రస్తుతం అస్సాం రాజధాని గువాహటి యే నాటి ప్రాగ్జోతిషపురం. ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు నరకుడిని హతమార్చాడు. దీనికి కామరూప నగరంగా కూడా పేరున్నది. సతీదేవి శరీరభాగాల్లో ఒకటి ఇక్కడ పడటంతో ఇక్కడ కామాఖ్యాదేవి అవతరించింది. కామదేవుడైన మన్మథుడు పుట్టిన నగరం కూడా ఇదే. నరకుడి తరువాత అతని కుమారుడు భగదత్తుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు. ప్రాగ్జ్యోతిష పురానికి అంటే గువాహటికి ఈశాన్యంవైపు సోనిపత్ నగర కేంద్రంగా తేజ్‌పూర్ ఉన్నది. ఈ నగరంలోని అగ్నిగఢ్ ప్రాంతం బాణాసురుడి నివాసం. ఇక్కడే ఉషాఅనిరుద్ధుల పరిణయం జరిగింది. మహాదేవుడు, శ్రీకృష్ణుడి మధ్య జరిగిన యుద్ధం తాలూకు చారిత్రక ప్రదేశాలు మనకు కనిపిస్తాయి కూడా. బెంగాల్ లోని బీర్‌భూమ్ జిల్లాలో ఏకచక్రపురం అనే గ్రామం ఉన్నది. ఇది బకాసురుడి నివాస స్థానం. లక్క ఇంటి నుంచి తప్పించుకున్న తరువాత పాండవులు కొంతకాలం ఈ గ్రామంలోనే ఉన్నారు. ఇక్కడే భీముడు బకాసురుని వధించాడు.
ఇక హిరణ్యకశిపుడు హిండౌన్ నగరానికి చెందినవాడు. ప్రస్తుతం రాజస్థాన్ లోని కరౌలి నగరానికి సమీపంలో ఉన్న ఒక మున్సిపాలిటీ ఇది. ఆరావళి, వింధ్య పర్వత శ్రేణులు ఈ మున్సిపాలిటీ సమీపం లోనే ఉన్నాయి. ఇక్కడ చరిత్రాత్మకమైన ప్రహ్లాదుడు, నరసింహుడు, హిరణ్యకశిపుడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక్కడి ప్రహ్లాద్ కుండ్ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నది. హిరణ్యకశిపుడి బావి, నరసింహుడి ఆలయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి.
ఘటోత్కచుడు హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతానికి చెందినవాడు. ఇతని తల్లి హిడింబ పేరుతో ఇక్కడ దేవాలయం కూడా ఉన్నది. కురుక్షేత్ర యుద్దంలో కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించిన తరువాత అతని తల ఉత్తరాఖండ్ లోని చంపావట్‌లో పడింది. అక్కడ ఘటోత్కచుని ఆలయం కూడా ఉన్నది.
వీళ్లంతా ఎవరు? ఉత్తర భారతదేశానికి చెందినవారే కదా! సింపుల్ లాజిక్.. దేవతలు.. రాక్షసులు అలియాస్ అసురులు అన్న మాట గుణాన్ని బట్టి వచ్చింది కానీ, ఇవి రెండు కూడా సమాజాలు లేదా జాతులు కానే కావు. మంచి, చెడు.. ఈ రెండు లక్షణాలే వారికి ఆయా పేర్లుగా వచ్చాయి. ఇప్పటికీ ఆడపిల్లలపై అత్యాచారాలకు ఒడిగట్టిన వారిని కీచకులని ఎందుకంటారు.. అది లక్షణం కాబట్టి. కానీ.. పెరియార్ రామస్వామి మాత్రం తన సొంత ఇంటర్‌ప్రిటేషన్ ఇచ్చి తమిళులు మొత్తాన్ని అసురులుగా పేర్కొంటూ విపరీతమైన వ్యాఖ్యానాలు చేయడంతోపాటు.. ఆర్య, ద్రావిడ ఉద్యమానికి ఈ పిచ్చి కథలను దన్నుగా వాడుకున్నారు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
