Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-21

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

21

రావణుడి గొప్పతనాన్ని ప్రతిష్ఠించడం కోసం అనేక రామాయణాల్లోని అంశాలను తీసుకొని వచ్చి, అవన్నీ కూడా రావణుడి వ్యక్తిత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. రావణుడి శివతాండవ స్తోత్రం విషయంలో కానీ, రావణుడి ప్రతిభా వ్యుత్పత్తుల అంశంలో కానీ, రావణుడి కుటుంబ సంబంధమైన అంశాలలో కానీ అనేక రకాల రామాయణాల్లో ప్రస్తావనలో ఉన్న విషయాలను తీసుకొని వచ్చి.. వాల్మీకి రామాయణంలోని రావణుడి వ్యక్తిత్వానికి ముడిపెట్టి.. అతడిలో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం జరుగుతూ వస్తున్నది. రావణుడు రాక్షసుడు కాదు అని నిరూపణ చేసేందుకు ఎక్కడలేని తవ్వకాలూ వందల ఏండ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. దేవతలు అంటే ఆర్యులు, రాక్షసులు అంటే ద్రావిడులు అన్న వాదనా పెద్ద ఎత్తున జరిగిందే.

రామాయణమైనా, రాముడైనా, రావణుడైనా సరే.. ఎవరిని విశ్లేషించాలన్నా, దేని గురించి చర్చించాలన్నా.. మూల చరిత్రే ప్రామాణికం కావాలి. వాల్మీకికి ముందు రావణ ప్రస్తావన లేదు. వేదంలో సీత ప్రస్తావన ఉన్నప్పటికీ, రామాయణంలోని సీతకు వేద సీతకు ఎలాంటి సంబంధం లేదు. రామాయణంలోని సీత జనకుడికి నాగలి దున్నుతున్నప్పుడు లభించిన ఆడపిల్ల మాత్రమే. వేదిక్ గాడ్స్‌లో భూమికి సంబంధించిన ఒకానొక దేవతగా భూదేవికి ప్రతిరూపంగా సీత పేరు మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. సంతాన్నాన్నిచ్చే దేవతగా, పంటల దేవతగా సీతను పేర్కొన్నారు. రామాయణంలో సీత భూమిలో దొరికిన అమ్మాయే తప్ప భూదేవి కాదు. భూదేవి కూతురు కాదు. జనకుడికి కూడా ఆయన నాగలితో భూమి దున్నుతున్నప్పుడు దొరికిన అమ్మాయి తప్ప వేదకాలం నాటి సీత కాదు. రామాయణంలోని సీత భూమిలో లభించింది కాబట్టి.. వేదంలోని సీతతో మన పూర్వీకులు రెండింటినీ సమన్వయం చేయటానికి ప్రయత్నించారే తప్ప ఈ రెండూ ఒకటి కాదు. వేదాల్లో స్థాన రక్షక దేవతలలో సీత పేరు కనిపిస్తుంది. ఈ పేరు వ్యవసాయ సంబంధమైనది. వ్యవసాయ సంబంధమైన దేవతలలో మొదటగా చెప్పుకోవలసింది పంటపొలాల రక్షకుడిని. పొలానికి రక్షక దేవతగా ‘క్షేత్రస్యపతి’ అనే దేవుడు(4.57) ఉన్నాడు. ఈ సూక్తంలో పశువులను, గుర్రాలను భూమికి ఇవ్వాలని, స్వర్గాన్ని, భూమిని మొక్కలతో, నీటితో, మధువుతో నింపాలని క్షేత్రస్యపతిని ప్రార్థించారు. ఆయనతో పాటు.. సవిత, ఉషస్సులు, పర్జన్యుడిని కూడా వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రార్థించారు. (7.35.10). పంటలకు సంబంధించి స్తుతించే సూక్తంలో ఒక మంత్రం (4.57.6) లో సీతా (నాగటిచాలు) శబ్దం కనిపిస్తుంది. వ్యవసాయానికి ఆశీస్సులు, పంటలను ఇవ్వాలని ఈ మంత్రంలో ఆమెను ప్రార్థించారు. తరువాత ఈ సీతను ఇంద్రాణిగా, ఇంద్రుడి భార్యగా కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన పొలానికి పతి అని చెప్పడం వల్ల మాత్రమే. (2.17.9) ఇక్కడ సీతను పంటల దేవతగా మాత్రమే చూశారు. నాగటిచాలు మాత్రమే సీత. ఈమెకు సవిత పుత్రిక అన్న పేరు కూడా ఉన్నది. ఇది మనకు తైత్తిరీయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. తరువాత మనకు అథర్వ వేదంలో భాగంగా ఉన్న సీతోపనిషత్తు సీతను శబ్ద బ్రహ్మ స్వరూపిణిగా, అవ్యక్త స్వరూపిణిగా వర్ణిస్తుంది. రామాయణంలోని సీత, ఈ వేదంలో కనిపించే సీత కాదు. కాకపోతే.. రామాయణంలో సీత అయోనిజగా యజ్ఞ భూమిని దున్నుతుండగా నాగటిచాలుకు తగిలి బయటకు వచ్చింది. రామాయణంలోని బాలకాండ 66వ సర్గలో జనకుడు తనకు సీత ఎలా లభించిందో స్పష్టంగా చెప్తాడు. ‘నేనొకప్పుడు యజ్ఞ భూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా సీత అను కన్య నాగలి నుండి బయటకు వచ్చి నాకు లభించినది. భూమినుంచి బయటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. అయోనిజ అయిన ఈమెను వివాహమాడవలెనన్నచో పరాక్రమమే శుల్కమని నేను నిశ్చయించితిని. మహా మునీ! భూతలము నుంచి ఆవిర్భవించి నా కుమార్తెగా పెరుగుచున్న ఈమెను వివాహము చేసుకొనుటకు ఎందరో రాజులు వచ్చిరి..’’ ఇలా జనకుడు సీత వృత్తాంతము చెప్పారు. యజ్ఞ భూమి నుంచి బయటకు వచ్చింది కాబట్టి.. సీతాదేవిని వేదాలలో పేర్కొన్న సీతతో అన్వయం చేసుకొని ఉండవచ్చు. రామాయణంలోని సీతకు వేదాలలోని పురాతన దేవత సీత పేరును స్వీకరించారు తప్ప రాముడి భార్య అయిన ఆమె వేదాలలో కనిపించదు.

ఇక రావణుడి ప్రస్తావనకు వస్తే.. వేదాలలో రావణ శబ్దం కూడా కనిపించదు. రామాయణానికి ముందు రావణ శబ్దమే లేదు. రావణుడు పుట్టినప్పుడు అతని పేరు దశగ్రీవుడు మాత్రమే. కైలాస పర్వతం కింద చేతులు నలిగిపోయిన తరువాత నొప్పి తట్టుకోలేక అరిచిన అరుపు వల్ల అతనికి రావణ అనే పేరు వచ్చింది. అంతకు మించి మరేమీ లేదు. ఇక వేదవతిని చెరబట్టాలని చూశాడని, ఆమె తనకు తాను ఆహుతి చేసుకుంటూ రావణుడికి శాపమిచ్చినట్టు పేర్కొన్న కథనం కూడా ఆనంద రామాయణంలోనిది మాత్రమే. ఇదంతా వాల్మీకి తరువాత వచ్చినదే.

వేదాల్లో దేవతలు, రాక్షసులు, భూత, పిశాచాల గురించిన ప్రస్తావన విస్తృతంగానే ఉన్నది. అయితే వేదాలలో దేవతలకు పురాణాల్లో దేవతలకు పేర్లు ఒకటే అయినా స్వరూప స్వభావాల్లో, ప్రాధాన్య, ప్రభావాల్లో కూడా చాలా తేడా ఉంటుంది. వేదాలలో పేర్కొన్న దేవతల పేర్లు పురాణాల్లో పేర్కొన్న దేవతల పేర్లు ఒకటి కావడం వల్ల ఈ రెండింటి రూపమూ ఒక్కటే అన్న భ్రమల్లో మన వాళ్లు ఉంటారు. అంతే కాదు.. కొందరు వేద రూపాలను పురాణ రూపాలతో ఒకటి చేసి విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల అనేక రకాల అపవాదాలకు కారణాలు ఏర్పడుతున్నాయి.

వేదాలు అమూర్తమైన పర బ్రహ్మాన్ని సూచిస్తాయి. ఇందులో దేవతలు శక్తులుగా ఉంటాయి. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి దేవతలు అస్తిత్వానికి, రూపానికి, గుణానికి అతీతమైన పరబ్రహ్మానికి సంకేతాలు. యజ్ఞాలు, కర్మకాండల ద్వారానే ప్రకృతిలోని శక్తులను పూజించడం ద్వారా అమూర్తమైన పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రధానంగా సాగుతుంది. ఋగ్వేదం ‘అగ్నిమీళే పురోహితం’ అన్న శ్రుతితోనే మొదలవుతుంది. అగ్ని ఆరాధన అక్కడ ప్రధానమైంది. ప్రపంచంలో దాదాపు వంద నాగరికతల్లో కూడా (ఇస్లాం, క్రైస్తవం రావడానికి ముందు వరకు) ఈ అగ్ని ఆరాధన, ప్రకృతి ఆరాధన ఉన్నది. వేదాలలో మనకు అశ్విని కుమారులు, మరుత్తులు, పర్జన్య, సావిత్రి, విష్ణువు, రుద్రుడు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, అదితి, ఆదిత్యులు, బృహస్పతి, బ్రాహ్మణస్పతి, సోమ, వరుణ, మిత్ర, విద్యుత్ వంటి దేవతలు మనకు కనిపిస్తారు. ఈ దేవతలందరికీ కూడా ఒక్కో ప్రత్యేకత అన్నది వేదాలలో చెప్పలేదు. ఎందుకంటే.. ఈ దేవతలందరూ కూడా ప్రకృతి (నేచర్), పదార్థం (మెటీరియల్) కు దగ్గరగా ఉండటమే. ఒక్కొక్కరికీ ప్రత్యేకమైన లక్షణాల కంటే కూడా వారికి ఆధార భూతమైన ప్రకృతి పదార్థాన్ని అనుసరించి చెప్పిన విశేషణాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి దేవత స్వభావంలోనూ చాలా తక్కువగా ప్రత్యేక లక్షణంతో పాటు, ప్రకాశం, శక్తి, దానగుణం, జ్ఞాన గుణం వంటి సామాన్య లక్షణాలు అందరిలోనూ కనిపిస్తాయి. స్వర్గాన్ని, భూమిని సృష్టించడం వంటి కార్యాలను చాలామంది దేవతలకు వేదాలు ఆపాదించాయి. అందుకే వేదాలలోని దేవతలను పురాణాలలోని దేవతల స్వరూప స్వభావాలను పోల్చి చూడలేము. ఋగ్వేదంలో వసుశ్రుతుడు అనే ఋషి అగ్నిని ఉద్దేశించి ఇలా అంటాడు.. ‘అగ్నీ నువ్వు పుట్టినప్పుడు వరుణుడవు. నువ్వు ప్రజ్వలించినప్పుడు మిత్రుడవు అవుతావు; శక్తికి పుత్రుడా! నీలో అందరు దేవతలు ఉన్నారు. నువ్వు భక్తుడికి ఇంద్రుడవు (5.3.1.)’. అంతే కాదు, అగ్నిని ముఖ్య దేవతగా ఆరాధించిన వేద రుషుల దృష్టిలో అగ్నికి భూమి మీద నిప్పు, అంతరిక్షంలో మెరుపు, స్వర్గంలో సూర్యుడు అనే బహు రూపాలు ఉన్నాయి. అంటే వారికి అందరు దేవతలు కూడా ఒకే దేవతకు భిన్న రూపాలు అనే అభిప్రాయం ఉన్నది. వేదాలను అర్థం చేసుకోలేనప్పుడు అపార్థాలే వస్తాయి.

క్రైస్తవీకరణ మిషన్‌లో భాగంగా వేదాలకు మాక్స్ ముల్లర్ హెనోథియిజం(henotheism) క్యాథనోథియిజం (kathenotheism) అన్న సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. మాక్స్ ముల్లర్ సిద్ధాంతం మీద పెద్ద చర్చే జరిగింది. ఈ సిద్ధాంతం సారాంశం ఏమిటంటే.. దేవతలలో ఒకరి తరువాత ఒకరిని అత్యున్నతమైన దేవతగా భావించటం. వేద ఋషులు ఒక సమయంలో ఒక దేవతను ఆరాధిస్తే.. ఆ దేవతనే అందరికంటే గొప్పవాడుగా చిత్రించారని. కానీ మాక్స్ ముల్లర్ రాసింది శుద్ధ తప్పు.  ఏ మతంలో లేనంత ఎక్కువగా ఈ దేవతలు తరచూ జంటలుగా అంటే పరస్పర ఆధారితులుగా ఏర్పడ్డారు. ఉదాహరణకు వరుణుడు, సూర్యుడు ఇంద్రుడి ఆధీనంలో ఉన్నారు. (1.101.3) ఇంద్రుడూ, మిత్రావరుణులూ, అర్యముడూ, రుద్రుడూ సవిత ఆదేశాలను ధిక్కరించలేదు. వరుణుడూ, అశ్వినులు విష్ణు శక్తికి లోబడ్డారు ఇలా వేదాల్లో దేవతలను మనం చూడాల్సి ఉంటుంది.

స్త్రీలోలుడిగా, దుర్బలుడిగా, తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ భయపడుతూ జీవించేవాడిగా, ఇంద్రియ లోలుడిగా చిత్రించబడిన ఇంద్రుడు, వేదాలలో కనిపించే ఇంద్రుడు కాదు. వేదకాలంనాటి ఇంద్రుడు అందరు దేవతల కంటే కూడా చాలా బలవంతుడు. వేదకాలపు భారతీయులకు అత్యంత ప్రియమైన, శక్తిమంతుడైన దేవత ఆ ఇంద్రుడు. ఈయన శక్తి సామర్థ్యాలను కీర్తించే సూక్తములు దాదాపు 250 వరకు ఉండటం విశేషం. ఋగ్వేదంలోని మొత్తం సూక్తాలలో నాలుగో వంతు ఇంద్రుడిని కీర్తించడానికే ఉన్నాయి. మరే దేవతకు కూడా ఇన్ని సూక్తాలు లేవు. వేరే దేవతలతో కూడా కలిపి స్తుతించిన సూక్తాలను లెక్కలోకి తీసుకున్నట్టయితే కనీసం 300 సూక్తాలైనా ఉంటాయి. ఈయన స్వభావం ఉరుము, పిడుగుకు సంబంధించినంది. అనావృష్టిని చీకటిని పారదోలి నీటిని విడుదల చేయించడమూ, వెలుగును ప్రసాదించడము ఈయన బాధ్యత. ఈయనను యుద్ధరంగ దేవతగా కూడా కొలిచారు.

అట్లాగే రుద్రుడు కూడా. ఈయన మనం ఇప్పుడు అనుకునే రుద్రుడు కాదు. ఈయన మనకు ఋగ్వేదంలో కనిపిస్తాడు. మూడే మూడు సూక్తాలలో రుద్రుడు మనకు ప్రధానంగా కనిపించినప్పటికీ, మొత్తం 75 సార్లు ఈ రుద్రుడి పేరు వస్తుంది. ఈయన శివుడిలాగా కాకుండా, చక్కగా బంగారు నగలు ధరిస్తాడు. రథం మీద కూర్చొంటాడు. ఈయనకు వెయ్యి కండ్లున్నాయి. ఆయన పొట్ట నలుపుగా ఉంటే.. వీపు ఎరుపుగా, మెడ నీలం రంగులో ఉన్నాయి. శివుడి మాదిరిగా చర్మం ధరిస్తాడు. ఈయన చేతిలో విల్లు, బాణాలు, పిడుగు, వజ్రము, గద వంటి ఆయుధాలు ఉన్నట్టు ఋగ్వేదంలో ఉన్నది.

రామాయణం కంటే ముందే రావణుడి పేరు ఉన్నదేమోనని కొందరి అభిప్రాయం కూడా పొరపాటే. వేదంలో రాక్షసులు, దెయ్యాల గురించిన ప్రస్తావన కూడా ఉన్నది. మనకు వేదాల్లో రాక్షసులు లేదా అసురులు అనే వారు ప్రజలకు మేలు చేసేవారికి, కీడు చేసేవారుగా హానికారకులుగా నిర్వచించబడ్డారు. ఋగ్వేదంలో రాక్షస శబ్దం కొద్ది సార్లే వస్తుంది. అసుర శబ్దం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కో దేవతను ఒక్కో రాక్షస సంహారకులుగా పేర్కొన్నారు. ఇంద్ర వృత్రుల ఉదంతం ఒక ఉదాహరణ. రామాయణంలో రావణుడిని హీరో చేసేందుకు పడిన తపనలో భాగంగా దేవతలంటే ఆర్యులని, అసురులు అంటే ద్రావిడులనే వాదనను తెరపైకి తెచ్చారు. అది తప్పు. కానీ వేద ప్రమాణంలో అసుర శబ్దానికి అర్థం స్పష్టంగానే వివరించారు. బ్రాహ్మణాలలో అసురులకు చీకటికి సంబంధం ఉన్నదని చెప్పారు. రాత్రి అసురులకు, పగలు దేవతలకు సంబంధించినదన్నారు. అథర్వ వేదంలో అసుర శబ్దానికి రాక్షసుడు అని మాత్రమే అర్థంగా పేర్కొన్నారు. అసుర శబ్దంలో ఒక ప్రత్యేకమైన అర్థ ఛాయ ఉన్నట్టు ఏఏ మెక్డోనెల్ తన వేదిక్ మైథాలజీ గ్రంథంలో అభిప్రాయపడ్డారు. మాయాశక్తి, కుయుక్తి, పన్నాగం అన్న అర్థం అసుర శబ్దానికి ఉన్నట్టుగా పేర్కొన్నారు. మాయాశక్తి ఉన్నవాడు అసురుడు అని అన్నారు. ఈ అసురులలో అంతరిక్ష అసురులు ఉన్నారు. భూమి మీద ఉండే అసురులూ ఉన్నారు. వీరిని రక్షస్సులూ, పిశాచులూ అని పిలిచారు. భూమి మీదే ఉండి మనుషులకు హాని కలిగించే వారిని ఉద్దేశించి వాడిన పదమే రక్షస్. ఇది ఋగ్వేదంలో కనీసం 50 కంటే ఎక్కువ సార్లు వస్తుంది. ఈ రక్షస్సులు స్త్రీలకు హాని కలిగించడం, రక్త మాంసాలపై కోరికలతో మనుషులను చంపటం వంటివి చేస్తారు. ఈ అసురులు లేదా రాక్షసుల స్వభావం మనుషుల నిత్య జీవితానికి హాని చేయటమేనని చెప్పవచ్చు. ఈ లక్షణాలనే మాక్స్ ముల్లర్ కానీ, బ్రాడ్కే లాంటి వారు ఆర్య, అనార్య జాతులుగా అభిప్రాయపడి.. దాన్ని ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. ఆ తరువాత తాము చెప్పింది తప్పు అని సవరించుకున్నా.. మన మార్క్సిస్టులు మాత్రం ఈ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ వచ్చారు. చాలామంది రాక్షసుల పేర్లు, దేవతల పేర్లు, వారి స్వభావాల గురించిన చర్చ వేదాల్లో చాలా కనిపిస్తుంది. కానీ, అంతరిక్ష రాక్షసుల్లో కానీ, భూతలం మీద ఉన్న రాక్షసుల్లో కానీ, భూత పిశాచాల ప్రస్తావనల్లో కానీ, దేవతల ప్రస్తావనల్లో కానీ రావణ శబ్దం ఎక్కడా కనిపించదు. రామాయణ చరిత్రలో మాత్రమే రావణుడు తొలిసారి కనిపిస్తాడు. ఆ తరువాతే రావణుడు రకరకాల రామాయణాల్లో, పురాణాల్లోకి విస్తరించాడు. ఈ విస్తరణ జరుగుతున్న కొద్దీ రావణుడు వీరుడయ్యాడు. పండితుడయ్యాడు.  మహాత్ముడయ్యాడు. ప్రజారంజక పాలకుడయ్యాడు. ఎలాంటి తప్పులు చేయని వాడుగా కీర్తించబడ్డాడు. అన్యాయంగా రాముడి చేతిలో చనిపోయిన అమాయకుడిగా చారిత్రకంగా సృష్టించబడ్డాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version