[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
22
రామాయణంలో రావణుడి కుటుంబం, ఆయన సోదరుల కుటుంబాలు, రావణుడి వెంట నడిచిన రాక్షస సేన గురించిన ఆసక్తికరమైన చర్చ విస్తృతంగా జరుగుతున్నది. వాల్మీకి తన రామాయణంలో రావణుడు, అతని సోదరుల కుటుంబాలు, అతని వెంట నడచిన రాక్షసుల గురించి మనం చర్చించినంత విస్తారంగా చర్చించలేదు. ఆయా సందర్భాలలో ఆయా ఘటనలలో మాత్రమే వారి ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఎవరన్నది ఒక మాటలో చెప్తూ ముందుకు సాగాడు. యుద్ధకాండలో ఫలానా వారు రంగంలోకి దిగుతున్నప్పుడు వారు ఎవరన్నది చెప్పి వదిలేస్తాడు తప్ప వారి గురించిన పూర్వాపరాల గురించిన పెద్ద చర్చ జరుగదు.
ఉత్తరకాండలో రావణుడు, అతని సోదరులు, చెల్లెలి వివాహాల ప్రస్తావన 12వ సర్గలో వస్తుంది. రావణుడు లంకను ఆక్రమించుకొని అక్కడ రాజ్యాభిషక్తుడైన తరువాతే వివాహం చేసుకున్నాడు. ముందుగా చెల్లెలు శూర్ఫణఖను రాక్షస నాయకుడైన విద్యుజ్జిహ్వుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ తరువాత ఒకసారి వేటకు వెళ్లిన సందర్భంలో మయుడి కూతురు మండోదరిని చూశాడు. అప్పుడు మయుడు రావణుడికి తన కూతురును ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయించాడు. ‘అప్పుడు దైత్యేందురడైన మయుడు రావణుడి హస్తము చేత తన కుమార్తె హస్తమును గ్రహింపజేసి, నవ్వుచు అతనితో “రాజా ఈమె అప్సరసయైన హేమ గర్భమునందు పుట్టిన మండోదరి అను నా కుమార్తెయైన కన్యక. ఈమెను పత్నిగా స్వీకరింపుము.” అని పలికెను. అంతట రావణుడు ‘తప్పక అట్లే చేసెదను’ అని అక్కడే అగ్నిని ప్రజ్వలింపజేసి ఆమెను వివాహమాడెను. (ఉత్తరకాండ 12వ సర్గ 14-21 శ్లోకాలు)’.
మండోదరికి చెల్లెలు ఉన్నట్టు ఆమె పేరు ధాన్యమాలిని అని రామాయణేతర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈమె ద్వారా రావణుడు నలుగురు కుమారులను కన్నాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది. కానీ అలాంటి చెల్లెలు ఉన్నట్టు మనకు ఉత్తరకాండలో కనపించదు. మండోదరి తల్లి హేమ. ఈమె మయుడి భార్య. అప్సరస. దేవతలు హేమను మయుడికి ఇచ్చి పెండ్లి చేసిన విధానం, ఒక కూతురిని కన్న తరువాత ఆమె దేవతల పనిమీద పదునాలుగేండ్లు వెళ్లిపోయిన విధానం, అప్పుడు మండోదరి అనే పేరు గల కుమార్తెను వెంట పెట్టుకొని ఆమె కోసం భర్తను వెతుక్కుంటూ అతను తిరుగుతున్న సమయంలో రావణుడు కనిపించిన విషయమూ, మయుడు తిరుగుతున్న సందర్భంలో రావణుడు కనపడిన అంశాన్ని రామాయణంలోని ఉత్తరకాండలో పూర్తిగా వివరించారు. అక్కడ అతనికి రెండో కూతురు ధాన్యమాలిని అనే ఆమె ఉన్నట్టు పేర్కొనలేదు. తాను మండోదరిని వెంటపెట్టుకొని భర్త కోసం అన్వేషిస్తున్నానని చెప్పాడే తప్ప మయుడు మరో కూతురు ప్రస్తావన చేయలేదు. ఇక అదే పన్నెండవ సర్గలోనే మేఘనాథుడు అనే కొడుకుకు మండోదరి రావణుడి ద్వారా జన్మనిచ్చినట్టుగా పేర్కొన్నారు. 28 నుంచి 32 శ్లోకాల వరకు మేఘనాథుడి జన్మ వృత్తాంతం క్లుప్తంగా ఉంటుంది.
రావణుడు తన సోదరులకు కూడా పెండ్లిళ్లు చేసిన వృత్తాంతం కూడా ఉత్తరకాండ 12వ సర్గలో మనం చూడవచ్చు. కుంభకర్ణుడికి వైరోచనుడనే రాక్షసుడి మనవరాలు వజ్రజ్వాలను ఇచ్చి పెళ్లి చేశాడు. విభీషణుడికి గంధర్వరాజైన శైలూషుని కూతురు సరమతో పెళ్లి జరిపించాడు. (ఉత్తర కాండ 12 వ సర్గ, 22-27 శ్లోకాలు). ఇక్కడ కుంభకర్ణ, విభీషణుల సంతానానికి సంబంధించిన వివరాలు మనకు కనిపించవు. యుద్ధకాండలో కుంభకర్ణుడి సంతానం యుద్ధంలో పాల్గొన్నట్టు ఉన్నది. అయితే మయుడు రావణుడితో మాట్లాడుతున్నప్పుడు తనకు మాయావి, దుందుభి అనే కుమారులు జన్మించినట్టు చెప్తాడు. ఆ దుందుభినే వాలి హతమారుస్తాడు. యుద్ధకాండ ఏడవ సర్గలో మధువు భార్య కుంభీనసను చెల్లెలిగా వాల్మీకి పేర్కొన్నాడు. ఈమె గురించిన పూర్తి వివరాలు తరువాతి రామాయణాల్లో వచ్చాయే తప్ప వాల్మీకి రామాయణంలో మాత్రం కనిపించదు.
ఇక రావణుడి కుమారుల విషయానికి వస్తే.. ముందుగా మేఘనాథుడు మండోదరికి జన్మించిన విషయం ఉత్తరకాండలో చెప్పాడు. ఇతర కుమారుల గురించి అక్కడ కొనసాగింపు లేదు. సుందరకాండలో అశోక వనాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు అక్షయ కుమారుడు రావణుడి చిన్న కుమారుడని వాల్మీకి పేర్కొన్నాడు. అక్షయ కుమారుడు చాలా చిన్నవాడు. చాలా అందమైన వాడు. మహా బలశాలి. అతడిని చూసి ఆంజనేయుడు కూడా సమ్మోహితుడయ్యాడు. అతడిని పట్టుకొని ఆకాశంలో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి మరీ చంపాడు హనుమంతుడు.
ఇక యుద్ధ కాండలోని అరవై తొమ్మిదో సర్గలో రావణుడి నలుగురు కుమారుల ప్రస్తావన వస్తుంది. కుంభకర్ణుడు చనిపోయిన తరువాత రావణుడు ఏం చేయాలా అని బాధ పడుతున్న సమయంలో రావణుడి కుమారులు యుద్ధోత్సాహులై ఉరుకురికి వస్తారు. ఈ నలుగురు, రావణుడి ఫలానా భార్యకు జన్మించారని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే.. రావణుడికి ఎంతమంది భార్యలు అన్న విషయాన్ని ఇదమిత్థంగా వాల్మీకి చెప్పలేదు. సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకలో ప్రవేశించిన సందర్భంలో రావణుడి శయనాగారానికి కూడా వెళ్లాడు. అక్కడ ‘రావణుని శయనాగారములో, హనుమంతుడు నిద్రించుచున్న రావణునీ, భార్యలపై అధికానురాగవంతుడైన ఆ మహాత్ముని పాదముల చెంత నిద్రించుచున్న విచిత్ర వర్ణములతో ఉన్న, కొంచెము పక్కకు ఒరిగిన బంగారు కిరీటములతో పొడవుగా, విశాలముగా బలిసి ఉన్న అతని వక్షస్థలము పూసికొనిన ఎఱ్ఱని చందనముతోనూ, ఉత్తరీయముగానూ, అత్యుత్తమమైన పీతాంబరము పరిధానీయముగాను ధరించెను. ఆ రావణుని భార్యల ముఖములు చంద్రుని వలె ప్రకాశించుచుండెను. వారు అందమైన కుండలములు ధరించిరి. వారు ధరించిన పుష్పమాలలు వాడిపోలేదు. అలంకారములు మాయలేదు. రావణుని భుజముల దగ్గర, తొడల దగ్గర పడియుండి నిద్రించుచున్న ఆ స్త్రీలు నృత్తమునందు, వివిధ వాద్య వాదనమునందు నేర్పు గలవారు. రావణుని భార్యలందరూ మదము చేతను, రతికేళుల చేతను అలసిపోయినవారై ఎక్కడ అవకాశము దొరికిన అక్కడ శయనించిరి (సుందరకాండ, పదవ సర్గ, 25-35). ఉత్తర కాండలో కానీ, సుందరకాండలో కానీ, రావణుడి భార్యల సంఖ్య చెప్పలేదు. మేఘనాథుడు మినహా మిగతా కుమారులు మండోదరికి జన్మించిన వారా లేక.. ఇతర భార్యల సంతానమా అన్న విషయం స్పష్టంగా లేదు.
యుద్ధకాండలో కుంభకర్ణ వధానంతరం రావణుడి కుమారుల ప్రస్తావన వస్తుంది. “గొప్ప బలము గల కుంభకర్ణుడు యుద్ధమునందు చంపబడినాడని విని రావణుడు దుఃఖ సంతప్తుడై మూర్ఛ చెంది నేలపై పడిపోయెను. ‘పినతండ్రి’ మరణించినట్టు విని దేవాంతక, నరాంతకులు, త్రిశిరస్సు, అతికాయుడు దు:ఖముచేత పీడితులై ఏడ్చిరి. రాముని చేత సోదరుడైన కుంభకర్ణుడు చంపబడినట్టు విని అతని సవతి తల్లి పుత్రులైన మహోదర మహా పార్శ్వులు దుఃఖాక్రాంతులైరి”(యుద్ధకాండ 68వ సర్గ, 6-8 శ్లోకాలు). దీనితో రావణుడికి మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు, అక్షయ కుమారుడితో పాటుగా త్రిశిరస్సు, నరాంతక, దేవాంతకులు, అతికాయుడు అనే కుమారులు ఉన్నట్టుగా అర్థమవుతున్నది.
ఆ తరువాత రావణుడి నలుగురు కుమారులతో పాటు, రావణుడికి సోదర వరస అయిన మహోదర, మహా పార్శ్వులు కూడా ఒకేసారి యుద్ధానికి బయలుదేరారు. ఈ మహోదర, మహాపార్శ్వులు కుబేరుడి తమ్ముళ్లు. వీరు రావణుడి వెంటే నడిచారు. యుద్ధానికి వెళ్లిన వీరిలో నరాంతకుడిని వాలి కుమారుడైన అంగదుడు హతమార్చాడు. మరో కుమారుడు దేవాంతకుడిని హనుమంతుడు పిడికిలితో గుద్ది చంపాడు. మరో కుమారుడు మహోదరుడిని రామ సేతువు నిర్మించిన నీలుడు పెకిలించిన పర్వతముతో మీద పడి చంపాడు. త్రిశిరస్సును హనుమంతుడు చాలా భయంకరంగా చంపేశాడు. ఎలా చంపాడో చూడండి. ‘భయంకరమైన ఆ శక్తిని హనుమంతుడు విరిచివేయుట చూచి వానరులు సంతోషించి మేఘముల వలె గర్జించిరి. పిమ్మట రాక్షస శ్రేష్టుడైన త్రిశిరస్సు ఖడ్గమును ఎత్తి దానిని హనుమంతుని వక్షఃస్థలము మీద లోతుగా గ్రుచ్చెను. ఖడ్గ ప్రహారమును తిన్న పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ త్రిశిరస్సు వక్షఃస్థలము మీద అరచేతితో కొట్టెను. గొప్ప తేజస్సు గల త్రిశిరస్సు హనుమంతుని అరచేతి దెబ్బ తగులుట చేత స్పృహ తప్పి, చేతిలోని ఆయుధమును జారవిడచి నేలమీద పడిపోయెను. పర్వతము వంటి వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు క్రింద పడిపోవుచున్న అతని ఖడ్గమును తీసుకొని ఆ రాక్షసులందరినీ భయపెట్టుచూ గర్జించెను. ఆ రాక్షసుడు ఆ ధ్వనిని సహించక పైకెగిరి, హనుమంతుడిని పిడికిలిచే కొట్టెను. హనుమంతుడు ఆ పిడికిలి దెబ్బకు చాలా కోపించి త్రిశిరస్సును, కిరీటమునందు పట్టుకొని కిరీటములతోనూ, కుండలములతోను కూడిన అతని శిరస్సులను, దేవేంద్రుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని శిరస్సులను ఖండించినట్లు వాడియైన ఖడ్గముతో ఖండించెను. విశాలమైన ఇంద్రియములు, ప్రజ్వలించుచున్న అగ్నుల వంటి నేత్రములు గల పర్వతములతో సమానములైన ఆ త్రిశిరస్సు తలలు, ఆకాశ మార్గమునుండి జారవిడిచిన నక్షత్రముల వలె నేలమీద పడినవి (ఉత్తర కాండ 70వ సర్గ, 40-48). హనుమంతుడు త్రిశిరస్సును చంపిన తీరు ఇది. ఏ సినిమా నాటకీయత కూడా ఈ నిజమైన యుద్ధానికి సాటి రానే రాదు. మహాపార్శ్వుడిని రుషభుడు అనే వానరుడు గదతో కొట్టి చంపాడు. మిగిలిపోయిన అతికాయుడిని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రముతో చంపాడు.
“అతికాయుడు ఆ బాణమును చూచి అనేకములూన వాడియైన బాణములతో దానిని కొట్టెను. గరుత్మంతుని వంటి వేగముగల ఆ బాణము గొప్ప వేగముతో అతని దగ్గరకు వెళ్లెను. అతికాయుడు తన మీదకు వచ్చిన, ప్రజ్వలించుచున్న యమునితోను, మృత్యు దేవతతోను, సమానమైన ఆ బాణమును చూచి, చేష్టలలో ఏమాత్రము కంగారులేని వాడై, దానిని శక్తితోను, రుష్టితోను, గదతోను, కుఠారముతోను, శూలములతోను, బాణాలతోను కొట్టెను. అగ్నివలె మండుచున్న ఆ బాణము ఆశ్చర్యకరమైన రూపము గల ఆ ఆయుధములన్నింటినీ వ్యర్థములుగా చేసి ఆ అతికాయుని కిరీటాలంకృతమైన శిరస్సును గ్రహించి హరించెను” .రావణుడి కుమారులు, అతని సవతి సోదరుల బలాబలాలను, యుద్ధం చేసిన తీరును యుద్ధకాండ లోని 67 నుంచి 71 సర్గల్లో అద్భుతంగా వర్ణించాడు వాల్మీకి.
కుంభకర్ణుడికి కుంభుడు, నికుంభుడు అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరి గురించి కూడా యుద్ధకాండలోని 76, 77 సర్గల్లో యుద్ధానికి బయలు దేరుతున్న సందర్భంలోమాత్రమే వాల్మీకి వర్ణిస్తారు.
కుంభకర్ణుడి కుమారులు కుంభుడు, నికుంభుడు రాముడి సేనతో యుద్ధం చేస్తారు. కుంభ నికుంభులతో పాటు యుపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు అనే రాక్షసులు యుద్ధరంగంలోకి దిగారు. వీరందరినీ కూడా వానరులే హతమార్చారు. కుంభుడిని సుగ్రీవుడు చంపాడు. ఈ కుంభుడి వీరత్వాన్ని గురించి సుగ్రీవుడు ఏమన్నారో చూడండి..
“ఓ కుంభుడా.. నీ పరాక్రమమూ, బాణవేగమూ కూడా చాలా ఆశ్చర్యకరమైనవి. రాక్షస పక్షపాతమునందూ, ప్రభావమునందూ నీవూ, రావణుడు కూడా సమానులు. ప్రహ్లాద, ఇంద్ర, కుబేర, వరుణులతో సమానుడవైన ఓ కుంభుడా నీవొక్కడివే మహా బలవంతుడైన నీ తండ్రిని పోలి పుట్టినావు. శూలము హస్తమునందు గ్రహించి శత్రు సంహారము చేయు మహా బాహువైన నిన్నొక్కడినే జితేంద్రియుణ్ణి మనో వ్యథలు బాధింపజాలనట్లు దేవతలు బాధింపజాలరు. ఓ గొప్ప బుద్ధి కలవాడా, నీ పరాక్రమము చూపుము. నేను చేయు పనులను కూడా చూడుము. నీ పెద్ద తండ్రియైన రావణుడు వరమును పొంది యుండుట చేత దేవదానవులను ఎదిరించగల్గుతున్నాడు. కానీ నీ తండ్రి కుంభకర్ణుడైతే సహజమైన పరాక్రమము చేతనే సురాసురులను ఎదిరించగలిగినాడు. నీవు ధనుర్యుద్ధమునందు, ఇంద్రజిత్తుతోనూ, ప్రతాపమునందు రావణుడితోను సమానుడవు” (యుద్ధకాండ, 76వ సర్గ 71-79 శ్లోకాలు).
ఇక కుంభకర్ణుడి రెండో కుమారుడు నికుంభుడిని హనుమంతుడు ఎదుర్కొని మెడను విరిచేసి చంపేశాడు. విభీషణుడి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి వివరాలు వాల్మీకి రామాయణంలో కనిపించవు. సుందరకాండలో అశోకవనంలో ఉన్న సీతకు తోడుగా నిలిచిన త్రిజటను విభీషణుడి కూతురుగా చెప్తారు. బహుశా విభీషణుడు సాత్వికుడు కాబట్టి, రాముడి పక్షానికి వెళ్లాడు కాబట్టి, సీతకు అనుకూలంగా మాట్లాడిన త్రిజటను విభీషణుడికి కూతురుగా చెప్పి ఉండవచ్చు. కానీ త్రిజట ఒక వృద్ధ రాక్షసి. విభీషణుడితో సంబంధం లేనే లేదు. సుందరకాండలోని 27వ సర్గలో సీతను బాధిస్తున్న రాక్షస స్త్రీలను త్రిజట అనే వృద్ధ రాక్షసి అడ్డుకొని పరుషమైన మాటలు మాట్లాడవద్దని హెచ్చరించింది. తనకు నిద్రలో వచ్చిన స్వప్న వృత్తాంతమును వెల్లడించింది. ఇది త్రిజట స్వప్నం పేరుతో ప్రసిద్ధి చెందింది. కానీ, ఈమె విభీషణుడి కూతురు అనటం సరైనది కాదు.
విభీషణుడి భార్య సరమ మాత్రం సీతకు రక్షకురాలిగా వ్యవహరించినట్టు యుద్ధకాండ చెప్తుంది. రాముడి మాయా శిరస్సును తెచ్చి సీత ముందు పెట్టినప్పుడు సరమ సీతకు వాస్తవాన్ని బోధించి వ్యాకులతను తగ్గిస్తుంది. ఆ తరువాత రావణుడు ఏం చేస్తున్నాడో.. యుద్ధ సన్నాహాలు ఎలా జరుగుతున్నాయో, సీతను వదిలేయాలని రావణుడి తల్లి కైకసి తదితరులు ఏమేమి హితములైన మాటలు చెప్పారో కూడా ఆమె వివరిస్తుంది. రావణుడి మెండితనాన్ని కూడా తెలిపింది. రావణుడి కుటుంబాన్ని, అతని సంతానాన్ని గురించిన అపప్రథలన్నింటికీ కూడా వాల్మీకి రామాయణమే స్పష్టమైన సమాధానం చెప్తుంది.
రామాయణంలో మనకు కనిపించే రాక్షస పాత్రలన్నీ కూడా వాటి వాటి స్వభావాలు, రూపాలను అనుసరించి పేర్లు కలిగి ఉంటాయి. మహోదరుడు అంటే పెద్ద పొట్ట ఉన్నవాడు అని అర్థం, మహా పార్శ్వుడు అంటే పొడవైన చేతులు కలిగిన వాడని అర్థం. ఇలా ఒక్కో రాక్షసుడి పేరు ఆయా స్వరూప స్వభావాలను అనుసరించి ఉంటాయి. ఒకే పేరు గలవారు కూడా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు. రామాయణంలో మనకు కనిపించే కొన్ని రాక్షస పాత్రలు ఇవి.
రావణ వంశం
- రావణుడు
- కుంభకర్ణుడు
- విభీషణుడు
- ఇంద్రజిత్ (మేఘనాదుడు)
- అక్ష కుమారుడు
- త్రిశిరస్సు
- నరాంతకుడు
- దేవాంతకుడు
- అతికాయుడు
- కుంభుడు
- నికుంభుడు
లంకా ప్రధాన సేనాధిపతులు
- ప్రహస్తుడు
- ధూమ్రాక్షుడు
- అతికాయుడు
- మహోదరుడు
- నికుంభుడు
- కుంభుడు
- వజ్రదంష్ట్రుడు
- ప్రజఙ్ఘుడు
- అకంపనుడు
- సుపార్శ్వుడు
- విరూపాక్షుడు
- యూపాక్షుడు
యుద్ధ కాండలో హతమైన రాక్షసులు మాత్రమే (రామలక్ష్మణులు, వానరుల చేతుల్లో సంహారమైన వారు)
- ధూమ్రాక్షుడు
- అకంపనుడు
- ప్రహస్తుడు
- అతికాయుడు
- నరాంతకుడు
- దేవాంతకుడు
- త్రిశిరుడు
- వజ్రదంష్ట్రుడు
- కుంభుడు
- నికుంభుడు
- మహోదరుడు
- సుపార్శ్వుడు
- విరూపాక్షుడు
- యూపాక్షుడు
- కాలనేమి
- అక్షకుమారుడు
- ఇంద్రజిత్ (మేఘనాదుడు)
- కుంభకర్ణుడు
- రావణుడు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
