[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
23
మనకు ఉన్న ఇతిహాసాలు ప్రధానంగా రెండు. అవి రామాయణం, మహా భారతం. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే రామాయణం దైవ గాథ అయితే, భారతం వీర గాథ. దైవం అంటే మత విషయకమైంది అవుతుంది కాబట్టి.. మత విభేదాలు రావటం సహజం. అందుకే బౌద్ధుల కాలం నుంచే రామాయణంపై దాడి మొదలైంది. బౌద్ధులు ప్రధానంగా వినిపించే జాతక కథల్లోకి రామాయణాన్ని చొప్పించి.. రామాయణ గాథలో మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించారు. ఆరుద్ర గతంలో ‘రాముడికి సీత ఏమవుతుంది’ అన్న పేరుతో ఒక విమర్శనాత్మక గ్రంథాన్ని వెలువరించారు. ఇందులో జాతక కథలతో పాటు.. వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో రామాయణాన్ని పోలి ఉన్న, సీతారాముల పాత్రలను పోలి ఉన్న కథలను, గాథలను గురించిన విస్తృతమైన చర్చ చేశారు. వాల్మీకి రామాయణ గాథ జాతక కథల్లోకి వెళ్లేసరికి ఎన్ని రకాలుగా మార్పులకు లోనైందో స్పష్టంగా అర్థమవుతుంది. రామ కథను బౌద్ధులు తమ మతానికి అనుకూలంగా తిరిగి రచించారు. దశరథ జాతక కథలో రాముడిని బోధిసత్వుడిగా, సీత రాముడి సహోదరిగా, రావణుడు మంచివాడుగా కనిపిస్తారు. ఇక్కడ దేవతారాధన అనే భావన కనిపించదు. మత సాంస్కృతిక ఆధిపత్య పోటీలో భాగంగా ఇతిహాసాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం బౌద్ధ కాలంలోనే జరిగింది. అంతకుముందు జైనులు కూడా రామాయణాన్ని చెప్పినప్పటికీ, రాముడిని ఆదర్శ రాజుగా చూపించారు.
తరువాతి కాలంలో రాముడి కథను ఆధారం చేసుకొని వరుసగా నాటకాలు వచ్చాయి. రెండో శతాబ్దం నుంచి ఈ రామ ఆధారిత నాటకాలు సంస్కృతంలో అధికంగా వచ్చాయి. భాసుడు, కాళిదాసు, భవభూతి, జయదేవుడు మొదలైన వారందరూ కూడా నాటకాలు రాసిన వారే. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
| నాటకం పేరు | రచయిత | అంచనా కాలం |
| ప్రతిమా నాటకం | భాసుడు | క్రీ.పూ.2 – క్రీ.శ. 1 శతాబ్దం |
| అభిషేక నాటకం | భాసుడు | క్రీ.పూ. 2 – క్రీ.శ. 1 శతాబ్దం |
| ప్రమేయ సముద్రం (రామ కథాంశాలు) | భాసుడు | అదే కాలం |
| ఉత్తర రామచరితం | భవభూతి | క్రీ.శ. 8వ శతాబ్దం |
| మహావీరచరితం | భవభూతి | క్రీ.శ. 8వ శతాబ్దం |
| జానకీహరణం | కుమారదాసుడు | క్రీ.శ. 4వ–5వ శతాబ్దం |
| రామాభ్యుదయం | యశోవర్మదేవుడు | క్రీ.శ. 7వ శతాబ్దం |
| సీతారామ విజయం | అజ్ఞాత రచయిత | క్రీ.శ. 9వ–10వ శతాబ్దం |
| రామ చరితం (నాట్యరూపం) | సంధ్యాకర నంది | క్రీ.శ. 11వ శతాబ్దం |
| అనర్ఘ రాఘవం | మురారి | క్రీ.శ. 9వ శతాబ్దం |
| బాల రామాయణం | రాజశేఖరుడు | క్రీ.శ. 9వ–10వ శతాబ్దం |
| సీతాపరిణయం | వత్సరాజు | క్రీ.శ. 12వ శతాబ్దం |
| రాఘవ పాండవీయం (ద్వ్యర్థి కావ్యం) | కవిరాజు | క్రీ.శ. 12వ శతాబ్దం |
నాటకాలు రాస్తున్నప్పుడు సహజంగానే కథలో మార్పు వస్తుంది. నాటకీయత చోటు చేసుకుంటుంది. భాసుడి ప్రతిమా నాటకంలో వాల్మీకి రామాయణాన్ని దైవ భావనల కంటే మానవీయ భావోద్వేగాలు ప్రధానంగా కనిపిస్తాయి. భవభూతి రామాయణాన్ని కరుణ, ధర్మ సంఘర్షణ కోణంలో రచించాడు. ఉత్తర రామచరితం ప్రధానంగా సీతా వియోగం ఆధారంగా సాగుతుంది. రాజశేఖరుడు సంప్రదాయ పద్ధతిలో, రాజరిక దృష్టితో రామాయణం రచించారు. ఈ నాటక ఇతివృత్తాల్లో సీతా వియోగం, శంబూక వధ ప్రధాన వస్తువులుగా మారాయి. సీత పాత్రను విక్టిమ్‌గా చేయడంలో, రాముడి పాత్రను డిఫెన్స్ లోకి పడేయటంలో ఈ ఇతివృత్తాలు ప్రధాన భూమిక పోషించాయి. శంబూక వధ, రాముడి వ్యక్తిత్వంపై మరక వేయడానికి పుట్టకొచ్చిన కథ.
ఆధునిక కాలంలో బ్రిటిష్ వాళ్లు, వాళ్ల ద్వారా క్రైస్తవ మిషనరీలు చొచ్చుకొని వచ్చిన తరువాత పురాణాల మీద, ముఖ్యంగా రామాయణం మీద దాడి తీవ్రమైంది. మహాభారతంలో కూడా ప్రక్షిప్తాలు అనేకం వచ్చి చేరాయి కానీ, ప్రధాన కథను మార్చే ప్రయత్నం పెద్దగా చేయలేదు. కానీ రామాయణ గాథలో మాత్రమే కొత్తగా ఇంటర్‌ప్రెటేషన్లు వచ్చి చేరాయి. పుంఖానుపుంఖాలుగా ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. బ్రిటిష్ విద్యావిధానం వచ్చిన తరువాత బెంగాల్‌లో మైఖేల్ మధుసూదన్ దత్ దగ్గర నుంచి రామాయణం మీద దాడి ప్రారంభమైంది. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. బెంగాల్‌లో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరగడంతో అక్కడి సాహిత్యం మాత్రమే యావత్ దేశానికి ఆదర్శంగా, గొప్ప సాహిత్యంగా పరిగణింపబడుతూ వచ్చింది. అయితే రామాయణాన్ని సొంతం చేసుకున్న రచయితలు కూడా సీతపై ఉండే సానుకూల భావనల తోటి జానపద కథల్లోనూ, పాటల్లోనూ, ఇతర కావ్యాల్లోనూ అటువంటి కథలకు ఆమోదం తెలుపుతూ వచ్చారు. దీనివల్ల రాముడి వ్యక్తిత్వానికి జరుగుతున్న నష్టాన్ని సమర్థించేందుకు వీరు అనేక రకాలుగా ధర్మపరమైన సంజాయిషీలు ఇచ్చుకుంటూ వచ్చారు. డాక్టర్ కామిల్ బుల్కే (Dr. Camille Bulcke) అనే బెల్జియంకు చెందిన పరిశోధకుడు ‘రామకథ ఉత్పత్తి వికాస్’ అనే పేరుతో ఉద్గ్రంథాన్ని వెలువరించారు. దాదాపు అయిదు వందల పేజీలకు పైగా ఉన్న ఈ గ్రంథంలో వాల్మీకి రామాయణంతో పాటుగా జైన, బౌద్ధ రామాయణాలు, దేశ, విదేశీ రామకథల రూపాంతరాలు, కాలక్రమానుగతంగా కథలో, కథనంలో వచ్చిన మార్పులను వివరించారు. ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది’ అన్న గ్రంథానికి కూడా ఇది ప్రధాన రిఫరెన్స్ అని చెప్పవచ్చు. కామిల్ బుల్కే రాసిన ఈ గ్రంథం రామాయణ చారిత్రక వికాసాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. బాలకాండలోనూ, ఉత్తరకాండల్లోనూ వచ్చి చేరిన ప్రక్షిప్తాలను కూడా ఆయన పేర్కొన్నారు (నా ‘రామం భజే శ్యామలం’ గ్రంథంలో ఈ ప్రక్షిప్తాలను గురించిన చర్చ ఉన్నది). జైన, బౌద్ధ రామాయణాలు, ఇతర గాథల్లో రాముడు దేవుడు కాదు, రావణుడు మహా పండితుడు, లక్ష్మణుడు హింసా ప్రవృత్తి కలవాడు అని చిత్రించిన కొత్త భావనలను ఆయన వ్యాఖ్యానించారు. భక్తి ఉద్యమం దేశమంతటా విస్తరించిన క్రమంలో రామాయణం మరింతగా ప్రజల్లో ఎలా నిలిచిపోయిందో వివరిస్తారు. తులసీదాస్ అవధి, తమిళ కంబరామాయణం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో తమ తమ సామాజిక అవసరాలు, సమకాలీన అంశాలకు తగినట్టుగా రామాయణం ఎలా మార్పులకు లోనైందో కూడా ఆయన వివరిస్తారు. రామాయణం ఒక చారిత్రక సాంస్కృతిక ప్రవాహంగా కామిల్ బుల్కే అభిప్రాయపడ్డారు.
బెల్జియంకు చెందిన ఈ కామిల్ బుల్కె రామాయణాన్ని భాష, సాహిత్య, సాంస్కృతిక చరిత్రగా భావించారు. అదే సమయంలో భారతీయులైన రోమిలా థాపర్, డీడీ కొశాంబి వంటి వారు మాత్రం మార్క్సిస్టు చారిత్రక భౌతికవాద దృష్టితో రామాయణంలో సామాజిక విశ్లేషణను చేస్తూ వచ్చారు. రామాయణం అనేది భారతీయ జీవన సంప్రదాయానికి ప్రతిబింబమని కామిల్ బుల్కె నిర్వచించారు. కానీ, రోమిలా థాపర్, కొశాంబి దీనిని రాజకీయ దృష్టితో వ్యాఖ్యానించారు. రామాయణం అనేది వర్గ పోరాటంగా, ఆర్థిక అసమానతలు, రాజ్యాధికారం, ఆక్రమణలు, ఉత్పత్తి, అనుత్పత్తి వర్గాల మధ్యన సంఘర్షణ వంటి సమకాలీన అంశాలను ఆపాదిస్తూ పోయారు. మార్క్సిస్టు చరిత్రకారులు ఏ విధంగా రామాయణాన్ని ఏమార్చారో మనకు అర్థమవుతుంది. తరువాత ముందరి వ్యాసాల్లో చెప్పుకున్నట్టు జస్టిస్ పార్టీ వచ్చిన తరువాత కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు బలం పెంచుకోవడం మొదలయ్యాక, రామకథ మీద వ్యతిరేక ప్రచారం తీవ్రమైంది. రామ కథ మీద దాడి అంటే ప్రధానంగా రాముడి మీదనే దాడి జరగటం.. ఆయన వ్యక్తిత్వం మీద దాడి జరగటం.
కమ్యూనిస్టు భావజాలం ప్రబలుతున్న క్రమంలో సాంస్కృతిక విధ్వంసం ప్రధాన అజెండాగా మారిన తరువాత రాముడి మీద, కృష్ణుడి మీద దాడులు తీవ్రమయ్యాయి. ఈ దాడి విషయంలో ఎంతవరకు వెళ్లారంటే.. రాముడికి పరమ భక్తుడైన ఆంజనేయుడు, కృష్ణుడికి పరమ భక్తుడైన అర్జునుడు, రామ కృష్ణులను యుద్ధంలో ఎదుర్కోవడం.. వాళ్లను తిట్టడం దాకా వెళ్లింది. రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం, లవకుశ, గయోపాఖ్యానం వంటివి సినిమాలుగా, నాటకాలుగా రావడం.. వాళ్ల మధ్యన గొడవలు.. తిట్టుకోవడాలు.. రాముడు చేసిన కార్యాలను, కృష్ణుడు చేసిన పనులను అధర్మ కార్యాలుగా చెప్పటం వంటివి పెచ్చుమీరాయి. కోతులే సాయం చేయకపోతే నువ్వు గెలిచేవాడివే కాదని ఆంజనేయుడి చేత అనిపించడం, తాటకను చంపినప్పుడు నీ ధర్మం ఏమైపోయిందని లవకుశుల చేత తిట్టించడం, నల్లపిల్లివోలె వెన్నెను దొంగలించే దొంగవని కృష్ణుడిని అర్జునుడి చేత తిట్టించడం జరిగింది. 1930ల నుంచి కూడా ఈ రకమైన రచనలు బాగా పాపులర్ అయ్యాయి. చిలకమర్తి వారి గయోపాఖ్యానం ఆ రోజుల్లోనే లక్ష కాపీలు అమ్మినట్టు తెలుస్తున్నది. అంటే ఇవి ఎంత పాపులర్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. చివరదాకా అనేక రకాలుగా తమ దైవాలను తామే తిట్టడం.. ఆ తరువాత ముగింపు మాత్రం ఆ దైవాలను మంచివాళ్లుగా చూపిస్తూ.. క్షమించమని అడుగటం చేయించటం ద్వారా ఏదో ఒక లాజికల్ కన్‌క్లూజన్ ఇవ్వటం జరుగుతూ వచ్చింది. కృష్ణార్జున యుద్ధంలో అర్జునుడి చేత తిట్లన్నీ తిట్టించిన తరువాత.. చివరకు బావా క్షమించాలని అర్జునుడు అడుగటం.. అబ్బెబ్బే.. నిన్ను, నీ ఆయుధ పాటవాన్ని పరీక్షించటానికి మాత్రమే నేను ఈ నాటకమాడానని చెప్పటం ఉంటుంది. లవకుశలో కూడా తండ్రి అయిన రాముడిని అనరాని మాటలన్న కొడుకులు.. చివరకు తల్లి వచ్చి నిలదీసేసరికి.. అమ్మా ఆ మహానుభావుడిని మేము ఎదిరించలేదు.. ఆయన అస్త్రాలను ఉపసంహరించామని మాత్రమే చెప్తారు. దీంతో విషయం సమాప్తమవుతుంది. రామాంజనేయ యుద్ధం కూడా అంతే.. చేయాల్సిన నెగెటివ్ ప్రాపగాండా అంతా ఆంజనేయుడి చేత చేయించిన తరువాత చివరకు నీ శరణాగత ధర్మాన్ని పరీక్షించడం కోసమే ఇదంతా చేసినట్టుగా కవర్ చేస్తారు.
వాస్తవానికి ఈ కథలేవీ రామాయణంలో ఉండవు, భారతంలోనూ కనిపించవు. కానీ అవే పాపులర్ అయిపోయి.. అందులోని కథలే నిజాలైపోయాయి. దాన్ని మనవాళ్లు ఒక వినోదంగా భావించారు. అలాగే చిత్రిస్తూ.. వాటిని నిజాలు చేశారు. ఇది భారతీయ ఇతిహాసాలపై పరోక్షంగా జరిగిన పెద్ద కుట్రగా చెప్పాలి. తరువాతి కాలంలో ప్రత్యక్షంగానే దాడి జరుగుతూ వచ్చింది. ఇంత పెద్ద కుట్ర మరే దేశంలోనూ జరిగినట్టు కనిపించదు. తమిళనాడులో ఆర్య, ద్రావిడ సిద్ధాంతం, భాషా సిద్ధాంతం కూడా ఈ రకమైన కుట్రకు కారణంగా చెప్పవచ్చు. హిందువులు ఆత్మ విశ్వాసం కోల్పోతున్న దశలో ఈ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు, కమ్యూనిస్టుల యాంటీ నేషనల్ ధోరణి కూడా ఈ కుట్రలో భాగంగానే చెప్పవచ్చు. ఉత్తరం నుంచి దక్షిణం దాకా సమస్త భారతావనిని ఏకం చేసిన వాడు రాముడు, తూర్పు నుంచి పశ్చిమం దాకా భారతదేశాన్ని ఏకత్రితం చేసిన కృష్ణుడు. జనపదాలలో అనేక తెగల ప్రజలను, రుషులను, జాతులను సమైక్యం చేసుకుంటూ భారతదేశ అస్మితను నిలిపిన వాడు రాముడు. అన్నీ తానే అయి ప్రజలను రక్షించడంతో పాటు ధర్మాన్ని ప్రతిష్ఠించిన వాడు కృష్ణుడు.. ఇలాంటి మహా పురుషుల వ్యక్తిత్వాలపై ఒక కుట్ర పూరితంగా సాగిన దాడిలో మనకు తెలియకుండానే మనమూ పావులమైనాం. పాత్రధారులమైనాం. మనకు తెలియకుండానే మన గొంతు మనమే కోసుకున్నాం. గయోపాఖ్యానం వంటి కథలు మనం వినోదం అని భావించాం కానీ, దాని వెనుక మూల పురుషుడిని, చారిత్రక మూర్తులను మనమే చిన్న చేసుకున్నాం. వారి వ్యక్తిత్వాలను హననం చేయడం, కామెడీ చేయడం, ధర్మ విరుద్ధంగా చిత్రించుకోవడం వంటివి చేశాం. ఇక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి రచనల ద్వారా మనకు మనమే ఆత్మహత్య చేసుకున్నామనిపిస్తుంది. ఇతరులు చేసిన దానికంటే మనకు మనం చేసుకున్న నష్టమే ఎక్కువ అని చెప్పవచ్చు.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
