Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-3

[శ్రీ శరన్నవ రాత్రుల సందర్భంగా కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

3

రామాయణ వ్యతిరేకతను పెరియార్ చాలా ముందుకు తీసుకొని వెళ్లారు. రావణుడికి సంబంధించి చాలా చాలా అంశాలు మనం తరువాతి వ్యాసాల్లో చర్చించవచ్చు. కానీ.. రామస్వామి నాయకర్ రామాయణ వ్యతిరేకతను ఎలా పెంచుకుంటూ వెళ్లాడో కొంత చర్చించాల్సి ఉంది. రావణుడు ద్రవిడుడు, తమిళుడు అని పెరియార్ ఫిక్స్ చేసేశారు. రావణుడు తమిళనాడుకు చెందినవాడేమీ కాదు. విశ్రవసుని కుమారుడు.. అతని తండ్రి పులస్త్యుడు.. పులస్త్యుడు ఏడుగురు ప్రజాపతులలో ఒకడు కావడంతో, రావణుడు కూడా గొప్ప వాడు.. బ్రహ్మ వంశానికి చెందినవాడు, చాలా మహాపురుషుడనే భ్రమలో ఉండిపోయారు చాలామంది. అసలు రావణుడు లంకకు రాజెలా అయ్యాడో.. లంక ఆయన సొంతమా? లేక అక్కడ సెటిలరా? ఈ విషయాలపై ప్రజలను మభ్య పెడుతూ వచ్చారు. ఎక్కడో ఉత్తర భారతం నుంచి లంకకు వచ్చి సెటిలైన వాడు రావణుడు. ఉత్తరప్రదేశ్ లోని బిస్రాఖ్ పట్టణం రావణుడి జన్మస్థానంగా కొంతమంది చరిత్రకారులు విశ్వసిస్తారు. అక్కడ రావణుడి జన్మస్థానం, రామాయణ సంస్కృతి ఇప్పటికీ కనిపిస్తాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ.. లంక మాత్రం అతని జన్మస్థానం కాదు. తన అన్న కుబేరుడు కట్టుకున్న లంకను బలవంతంగా లాక్కొని దానికి రాజయ్యాడే తప్ప.. అతను సొంతంగా సంపాదించిందేమీ లేదు. పెరియార్ రావణుడు తమిళుడని.. తమిళులను రాక్షసులుగా కించపరిచారంటూ పెద్ద అపవాదే వేశారు. మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో చాలా జాతుల వారి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది రకరకాల జాతుల వారి గురించి చదువుకున్నాం. గంధర్వులు అంటే సాంస్కృతిక పరంగా ఉన్నతమైన జీవులుగా మనకు కనిపిస్తారు. ఫైన్ ఆర్ట్స్‌లో వారు నైపుణ్యం ఉన్నవారు. గంధర్వ గానం అన్న మాట మనలో విననివారే ఉండరు. వారు సంగీత ప్రియులు. ఇక యక్షులు ప్రకృతి సంపద రక్షకులు. వీరి నివాస స్థలాలు మౌంట్ కైలాస్, మానస సరోవర ప్రాంతంగా మన చరిత్రకారులు ఒక అంచనా వేశారు. అంటే ప్రస్తుతం టిబెట్ ఉన్న ప్రాంతంలో అన్నమాట., కిన్నెరలు, సిద్ధులు, నాగులు.. ఒక్కో జాతికి చెందినవారు. రాక్షసులు అన్నది జాతి వాచకం కాదు.. అది గుణ వాచకం మాత్రమే. ఇంకా లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే.. వాల్మీకి రామాయణంలోనే సుగ్రీవుడు, భూమిలోని అన్ని వైపులా జీవులను, లక్షణాలను వర్ణిస్తూ వెళ్లాడు. (మరింత వివరాలకు నా రామంభజే శ్యామలం లో సుగ్రీవుడి అట్లస్ నాలుగు వ్యాసాలను చదువవచ్చు.) దక్షిణ ప్రాంతంలో ఉన్న వివిధ ప్రదేశాలను వివరించినప్పుడు అందులో అనేక రాజ్యాలను అక్కడి జీవుల లక్షణాలను కూడా వివరిస్తాడు. ఇక్కడెక్కడా రాక్షస శబ్దం కనిపించదు. మరి పెరియార్ తమిళులందరినీ రాక్షసులని అంటూ ఎందుకు కించపరిచినట్టు?

ఇక రాముడి విషయంలోనైతే పెరియార్ రాసిన కథలు అన్నీ ఇన్నీ కావు.. గమ్మత్తేమిటంటే.. రాముడు ఏకపత్నీ వ్రతుడు.. కానీ అయోధ్యకాండలో మంథర కైకేయిని రెచ్చగొడుతూ రామస్య పరమా స్త్రియా అన్న మాట వాల్మీకి వాడటంతో రాముడికి అనేక మంది స్త్రీలు ఉన్నారనే అర్థం వస్తుంది. దీంతో రాముడికి చాలా మంది భార్యలు ఉన్నారని ఏకపత్నీ వ్రతుడు కాదని పెరియార్ దుమ్మెత్తి పోశారు. ఈ మాట అనే నాటికి రాముడికి కానీ అతని సోదరులకు కానీ ఒకే వివాహం అయింది. అంతకు మించి ఇతర స్త్రీలు ఉన్నట్టు వాల్మీకి ఎక్కడా రాయలేదు. మంథరతో సంభాషణల్లో ‘ఇప్పుడు రాముడు దశరథుడి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యానికి అర్హుడు. వంద సంవత్సరాలు పరిపాలించిన తరువాత రాముడి స్థానంలో భరతుడు రాజ్యానికి వస్తాడు‘ అని కైకేయి అంటుంది. ఈ క్రమంలో అప్పటిదాకా నీవు దాసీలాగా కౌసల్యను సేవించుకుంటూ ఉండాలి. అప్పటికి నీ కోడళ్లు కూడా అలాగే ఉండాలి.. నీ కుమారుడు రాముడి సేవకుడిగా ఉంటారు.. రాముడి స్త్రీలంతా సంతోషంగా ఉంటారు అని మంథర అంటుంది. ఆనాటి సమాజంలో బహు భార్యాత్వం అన్నది కామన్ ఎలిమెంట్. కానీ, రాముడు ఏకపత్నీవ్రతాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచాడు.

శూర్ఫణక దగ్గర కూడా ఈ విషయాన్ని స్పష్టంగానే వ్యక్తపరిచాడు. కాబట్టి ఆ ‘భావి’ స్త్రీలకు అవకాశమే లేదు. కానీ.. పెరియార్ చాలా దారుణంగా రాముడి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ లైంగిక సుఖాల కోసం రాముడు చాలామంది స్త్రీలను పెండ్లి చేసుకున్నాడు అని రాసుకుంటూ వచ్చారు.

ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని కూడా తన రామాయణ వ్యతిరేక ప్రచారానికి పెరియార్ బాగా వాడుకున్నారు. రావణుడితో జరిగిన యుద్ధంలో ఉత్తర భారతీయ ఆర్య(బ్రాహ్మణ) దేవతలెవరూ మరణించలేదట. ఇందులో ఎన్ని పదాలు.. అర్థాలు ఉన్నాయో చూడండి. ఉత్తర భారతీయులు, ఆర్యులు లేదా బ్రాహ్మణులు, దేవతలు.. ఇలా తనకు తోచిన రీతిలో పదబంధాన్ని పెరియార్ సృష్టించారు. ఈయన ఈ వ్యాఖ్యానానికి అర్థం ఏమని తీసుకోవాలో తెలియదు. ఉత్తర భారతీయులంతా ఆర్యులని అనుకోవాలా? లేదా వారంతా బ్రాహ్మణులేనని అనుకోవాలా? లేదా దేవతలుగా భావించాలా? ఆర్య శబ్దాన్ని పూజనీయుడు, గౌరవనీయుడని అన్ని నిఘంటువులు చెప్తున్నాయి. ఈ వివాదానికి మూల కారకుల్లో ఒకడైన మాక్సు ముల్లరు కూడా తాను రాసింది తప్పు బాబోయ్ అని మొత్తుకొన్నాడు. కానీ మన వాళ్లు మాత్రం దీన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు ఇవాళ్టికీ. రావణుడి భార్య మండోదరి, కొడుకు ఇంద్రజిత్తు కూడా ఆ రావణుడిని ఆర్యపుత్రా అని సంబోధించినట్టు వాల్మీకి రామాయణంలో స్పష్టంగా కనిపిస్తుంది. విచిత్రమేమిటంటే.. పెరియార్ అన్న పదమూ, ఆర్య అన్న పదమూ ఒకే అర్థాన్ని సూచిస్తాయి. ఉత్తర భారతీయులు యుద్ధంలో చనిపోలేదని పెరియార్ విచిత్రమైన వాదన చేశారు. అసలు రాముడు వచ్చిందే భార్య, తమ్ముడిని వెంటపెట్టుకుని. ఆయన వెంట ఏ సైన్యమూ రాలేదు కదా! ఆయనకు సహకరించింది.. లంక దాకా వెంట నడిచింది కూడా కిష్కింధ సైన్యమే. అంతకు మించి ఆయన వెంట ఎవరూ రానే లేదు. అలాంటప్పుడు వాళ్లెవరూ చనిపోలేదని మాట్లాడటమే విడ్డూరం. మరి రావణాది ప్రభృతులంతా కలిసి వేల మంది వానరులను హతమార్చారు కదా.. దాని గురించి పెరియార్ ఏమీ మాట్లాడలేదు. రాముడిని పట్టాభిషక్తుడిని చేయడానికి ముందు భరతుడిని పదేండ్ల పాటు మేనమామ ఇంటికి పంపించి దశరథుడు కుట్ర చేశాడని మరో నింద వేశారు. అసలు రామపట్టాభిషేక నిర్ణయం ఎలా జరిగిందో ఒకసారి అయోధ్య కాండను వివరంగా చదివితే అర్థమవుతుంది. ద్రావిడ అస్తిత్వాన్ని నాశనం చేయడం కోసమే ఆర్య బ్రాహ్మణులచేత రామాయణం రాయబడిందని పెరియార్ పేర్కొన్నారు. వాల్మీకి రామాయణాన్ని తన భావజాలానికి అనుగుణంగా, తన ఎజెండాతో తప్పుగా అన్వయించి, వక్రీకరణలు చొప్పించి పెరియార్ తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ద్రవిడ ఉద్యమానికి తిరుగులేని నాయకత్వం వహించాడు. తమిళనాడులో బ్రాహ్మణుల పట్ల తన వ్యతిరేకతను ఏనాడూ ఆయన దాచుకోలేదు. ఎందుకంటే ఆర్య బ్రాహ్మణుల సంస్కృతిని తమిళ బ్రాహ్మణులు కూడా అనుసరిస్తున్నారని.. వారి ద్వారానే రామాయణం రాయబడిందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. తాను సంపాదకత్వం వహించిన పత్రికలో ఆయన రాసిన వ్యాసాల్లో చాలా స్పష్టంగానే తన వైఖరిని వెల్లడించాడు. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను ప్రశంసిస్తూ.. అక్కడ యూదుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని ఆ దుస్థితి తమకు రాకుండా జాగ్రత్తపడాలని తమిళనాడు బ్రాహ్మణులను హెచ్చరించారు కూడా. రామాయణం, మనుస్మృతులను దహనం చేసే సంప్రదాయానికి కూడా పెరియార్ రామస్వామి నాయకర్ శ్రీకారం చుట్టారు. విచిత్రమేమిటంటే.. ఈయన పేరులోనూ రామ శబ్దం ఉండటం. తమిళనాడులో రాముడిని, రామాయణాన్ని వ్యతిరేకించిన, సమర్థించిన చాలామంది పేర్లలో రామ నామమే ఉండటం విశేషం. ఎంజీ రామచంద్రన్ కానీ, పసుంబన్ ముత్తు రామలింగర్ (నేతాజీ అనుచరుడు), పీఎంకే నేత రాందాస్, డీఎండీకే నేత పనృతి రామచంద్రన్ ఇలా చాలా పేర్లు చెప్పుకోవచ్చు. తమిళనాడు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన సర్ సీవీ రామన్, రఘురామరాజన్ ఇలా ఎంతమంది రామనామంతో తరించారో చెప్పలేము. రామాయణంపై తమిళ రాజకీయాల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో.. తమిళనాడులో రామాలయాలు కూడా అంతే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాదు ప్రాచీన కవులు, రచయితల ద్వారా కంబ రామాయణం నుంచి ఎంతో మంది రామాయణంపై రచనలు చేశారు కూడా.

కానీ పెరియార్ మొదలు పెట్టిన రామాయణ వ్యతిరేకత తరువాతి కాలంలో తమిళుల స్వాభిమాన నినాదానికి పునాది అయింది. సంస్కృతం, హిందీ భాషల పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. చివరకు ఉద్యమాలు చేయించింది. ఉత్తర భారతీయుల పట్ల వ్యతిరేకతకు ఆలంబన అయింది. ఉత్తరాది వారు దక్షిణాది వారిని దోచుకున్నారన్న కథకు మూలమైంది. ‘తమిళుల స్వాభిమానం, ఉత్తరాది వారి అరాచకాలు’ అన్న పునాదుల పైనే పెరియార్ ద్రవిడ ఉద్యమం కొనసాగింది. కేవలం తమిళ అస్తిత్వం తప్ప మిగతా వేటినీ ఆయన పట్టించుకోలేదు. ఈ తమిళ స్వాభిమానం అన్న నినాదం ముందుకు తీసుకొని పోవటంలో పెరియార్ పూర్తిగా సక్సెస్ అయ్యారు కూడా. వాల్మీకి రామాయణ సంవాదం అనే పేరుతో 140 పేజీల మరో పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు. పెరియార్ బాటలో తమిళనాడులో పలువురు రచయితలు నడిచారు. నవళార్ సోమసుందర భారతీయార్ అనే రచయిత ‘కైకేయి శీలం, దశరథుని వ్యసనాల లొంగుబాటు’ అన్న పుస్తకం రాశారు. రాముడికి చాలా దుష్ట చర్యల్లో, విద్రోహ చర్యల్లో పాత్ర ఉన్నదని ఈ రచన అభివర్ణించింది. మద్రాస్ లోని తమిళ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.ఏఏ మనవాళన్ రామ కథైవుమ్, రామాయణాంగళుమ్ అన్న రెండు రచనలు చేశారు. ఈయన కంబ రామాయణంతో మిల్టన్ రచించిన ప్యారడైజ్ లాస్ట్ లోని వస్తువును పోలుస్తూ తులనాత్మక అధ్యయనం చేశారు.

మద్రాసు సంస్కృత కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సీఆర్ శ్రీనివాస అయ్యంగార్ 1925లో వాల్మీకి రామాయణాన్ని తమిళంలోకి అనువదిస్తూ.. దశరథుడిపై 20 అభియోగాలు తమదైన ఇంటర్ప్రెటెషన్‌తో లేవనెత్తారు. అంతే కాకుండా రాముడు అనేక స్త్రీలను పెళ్లి చేసుకున్నాడని, సీత పట్టమహిషి మాత్రమేనన్నారు. సంభోగానందం కోసమే అనేక మందిని పెండ్లాడాడు అని తీవ్రమైన, ఆక్షేపణీయమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలు కూడా తరువాత తమిళ ద్రవిడ ఉద్యమంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవిడ రాజకీయాల్లో బలమైన ఆయుధంగా రామాయణ వ్యతిరేకత ఉపయోగపడింది. ఎంతలా అంటే ప్రపంచంలో ఉన్న తమిళులందరిదీ ఒకే జాతి అయినందున.. తద్వారా తమిళులు ఎక్కడ ఉన్నా.. ఏ పని చేసినప్పటికీ వారిని గుడ్డిగా సమర్థించాల్సిందేనన్న దశకు ఈ ఉద్యమం చేరుకున్నది. క్రమంగా ఈ స్వాభిమానం కాస్తా దురభిమానంగా మారిపోయింది. శ్రీలంకలో సింహళులు, తమిళుల మధ్య జరిగిన పోరాటంలో మన దేశంలోని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తమిళుడూ లంకలోని తమిళులకు సంపూర్ణ మద్దతునిచ్చారంటే పెరియార్ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. తమిళుల హక్కుల పోరాటానికి మద్దతునివ్వటంతో పాటు, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ)కి డీఎంకేతో పాటు తమిళ పార్టీలన్నీ కూడా మద్దతునిచ్చాయి. ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే.. టైగర్స్‌కు ఆయుధాలు సరఫరా చేయడం, తమిళనాడులో షెల్టర్ ఇవ్వటం దాకా కూడా వెళ్లింది. కోయంబత్తూరు పేలుళ్లు, రాజీవ్ గాంధీ హత్య వంటి విషాదాలు తరువాతి కాలంలో మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చోటు చేసుకోవడానికి ఈ రకమైన దురభిమానమే కారణమైంది.

ఈ ద్రవిడ ఉద్యమం నుంచే సుదీర్ఘకాలంగా తమిళనాడును ఏలుతున్న ద్రవిడ మున్నేట్ర కజగం, అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఆవిర్భవించాయి. పెరియార్ వాదాన్ని అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, ఇప్పుడు స్టాలిన్లు ముందుకు తీసుకొని వెళ్లారు. వెళ్లుతున్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం తన రాజకీయాలను ద్రవిడ ఉద్యమ పునాదులపైనే బలంగా నిర్మించుకున్నది. డీఎంకే పార్టీ రామాయణాన్ని, రాముడిని పూర్తిగా తిరస్కరించింది. రామసేతు నిర్మాణం ధ్వంసం చేసే ప్రాజెక్టుకు బహిరంగంగా మద్దతు తెలిపింది. ఈ దశలో రాముడి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ డిఎంకే అప్పటి అధినేత కరుణానిధి ప్రకటనలు కూడా చేశారు. పెరియార్ పరిభాషలోనే రాముడిని నిందిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తరువాత రామ సేతు ధ్వంస రచన ఆగిపోయినప్పటికీ.. సనాతన ధర్మం అన్నది ద్రవిడ కాన్సెప్ట్‌కు వ్యతిరేకమన్న కచ్చితమైన అభిప్రాయంతో డీఎంకే బలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. సనాతన ధర్మం మొత్తం కూడా ఉత్తరాదికి సంబంధించినదేనని.. డెంగీ, మలేరియా లాంటి ఒక వైరస్ లాగా దాన్ని ద్రవిడులపై రుద్దుతున్నారని దాన్ని నిర్మూలించాలని కరుణానిధి మనుమడు ఉదయనిధి స్టాలిన్ స్పష్టమైన అభిప్రాయమే చెప్పుకొచ్చారు. ఇది పెద్ద వివాదంగా మారింది. రైటిస్టులంతా వ్యతిరేకిస్తే.. లెఫ్టిస్టులంతా దాన్ని సమర్థించడానికి రకరకాల సాకులు వెతుక్కొని ఇంటర్‌ప్రెటేషన్లు ఇస్తూ వచ్చారు. తరువాత ఆ పార్టీకే చెందిన డీ రాజా కూడా రాముడికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారు. తమిళనాడులోనే కాక, దక్షిణ భారతదేశంలో ఫెమినిజానికి, హేతువాదానికి, లిబరలిజానికి.. ఇతర వాదాలన్నింటికీ కూడా పెరియార్ రామస్వామి నాయకర్ ప్రారంభించిన రామాయణ వ్యతిరేకతే పునాదిగా ఈనాటికీ ఉపయోగపడుతున్నది. తెలుగునాట కూడా ఈ తెగులు వ్యాపించడంలో ద్రవిడ ఉద్యమం, జస్టిస్ పార్టీ రాజకీయాలు కమ్యూనిస్టులకు బాగా ఉపయోగపడ్డాయనటంలో సందేహం లేదు. ముందుగా చెప్పినట్టు ఉత్తరాదిన ముఖ్యంగా రామజన్మభూమి అయోధ్య నెలకొని ఉన్న ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో రామాయణంపై, రాముడిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి కూడా పెరియార్ పుస్తకాన్నే వాడుకున్నారంటే.. దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ పుస్తకాన్ని ప్రచారంలోకి తేవడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించకపోయినప్పటికీ.. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం దూకుడుగా వెళ్లటమే కాకుండా వేలాది పుస్తకాలు హిందీ వెర్షన్‌లో పెరియార్ పుస్తకాన్ని సచ్చీ రామాయణ్ పేరుతో అచ్చు వేయించి పంచిపెట్టారు.

ఇదీ రామాయణంపై ద్రవిడ ఉద్యమ ప్రభావం.

(ఇంకా ఉంది)

Exit mobile version