[‘రియర్ విండో’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
[ఈ వ్యాసం కేవలం ఒక పరిచయమో, సమీక్షో కాదు. ఇది ఈ చిత్రం పై విశ్లేషణ. ఈ చిత్రం నాకు ఎందుకు నచ్చిందో చెప్పే ప్రయత్నమిది. చిత్రం కథ మొత్తం ప్రస్తావించబడింది. సినిమా కళని ఈ చిత్రం ప్రభావవంతంగా ఎలా ఆవిష్కరించిందో ఇందులో వివరించబడింది. చిత్రం చూసినవారు పూర్తిగా చదవవచ్చు. చూడనివారు కొంతవరకు చదవవచ్చు. వ్యాసంలో ఒక హెచ్చరిక (spoiler warning) ఉంటుంది. చిత్రం చూడాలనుకునేవారు అక్కడ చదవటం ఆపివేయవచ్చు. – వ్యాసకర్త]
మనందరికీ పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అదో దురద. మనింట్లో బాగోతాలు మాత్రం ఎవరికీ తెలియకూడదు. ‘రియర్ విండో’ (1954) లో నాయకుడు కాలు విరగ్గొట్టుకుని తన అపార్ట్‌మెంట్లో ఉండటంతో కాలక్షేపం కోసం వెనక ఉన్న కిటికీ (రియర్ విండో అంటే ఇదే) నుంచి కనపడే అపార్ట్‌మెంట్లలో జరుగుతున్న బాగోతాలన్నీ చూస్తూ ఉంటాడు. వాళ్ళ కిటికీలు రోజులో ఎక్కువ కాలం తెరిచే ఉంటాయి. వేసవి ఒక కారణం. నాకనిపించింది ఏమిటంటే ఎంత వేసవి అయినా ఎవరూ అలా కిటికీలు తెరిచి ఉంచుకోరు. తెరిచినా ఈ పెద్ద మనిషి చూస్తున్నాడని తెలియకుండా ఉండదు. ఇక్కడే సినిమా భాషని దర్శకుడు హిచ్‌కాక్ తెలివిగా వాడుకున్నాడు. మొత్తం చిత్రమంతా నాయకుడు చూస్తున్న దృశ్యాలే మనమూ చూస్తాం. అంటే నాయకుడి కిటికీని బయట నుంచి మనం అసలు చూడం (చివర్లో తప్ప). ఇతరుల కిటికీలే చూస్తాం. దాంతో నాయకుడి కిటికీ కూడా ఎవరన్నా చూడొచ్చు అనే భావన కలగకుండా చేశాడు. నా అభిప్రాయంలో సినిమా అంటే కొంత కృత్రిమత్వం ఉంటుంది. అది కొంత అపనమ్మకాన్ని కలిగిస్తుంది. ఆ అపనమ్మకాన్ని పక్కనపట్టేసి సినిమా చూడాలి, అంతే! దీన్నే suspension of disbelief అంటారు.
ఈ సినిమాలో వేసిన అపార్ట్‌మెంట్ ఆవరణ సెట్టు అద్భుతమనే చెప్పాలి. అపార్ట్‌మెంట్లే కాక కొంచెం వీధి, వీధి అవతల రెస్టారెంట్ కూడా కనపడతాయి. నాయకుడి పేరు జెఫ్. న్యూ యార్క్ నగరంలో ఉంటాడు. అతనొక పత్రికలో ఫొటోగ్రాఫర్. ప్రపంచమంతా తిరుగుతాడు. ఘర్షణలు జరిగే ప్రదేశాల్లో ఫోటోలు తీస్తాడు. అతని దగ్గర దూరంగా ఉన్న వస్తువుల్ని బాగా చూడగలిగే లెన్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం కాలు విరగటంతో రోజంతా వీల్ చెయిర్లో ఉంటాడు. ఆ మాటకొస్తే రాత్రి కూడా అందులోనే పడుకుంటాడు. అతనికి ఒళ్ళు మర్దనా చేయటానికి స్టెల్లా అనే నడివయసు నర్సు వస్తుంది. ఆమెకి చనువు ఎక్కువ. జెఫ్ కూడా ఆమెతో తాను చూసిన విషయాలు చెబుతాడు. అతను చూసే ఇళ్ళలో ఒక ఇంట్లో ఒక బ్యాలే నర్తకి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక శిల్పకారిణి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటుంది. ఒక ఇంట్లో ఒక సేల్స్‌మన్, అతని భార్య ఉంటారు. ఒక ఇంట్లో ఒక సంగీతకారుడు ఉంటాడు. ఒక ఇంట్లో ఒక జంట ఒక కుక్కని పెంచుతూ ఉంటారు. ఒక బుట్టలో ఆ కుక్కని కిందకి పంపితే అది కాసేపు పెరట్లో తిరిగి మళ్ళీ ఈల వేసి పిలవగానే బుట్టలో పైకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.
బ్యాలే నర్తకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మగవాళ్ళెందరో ఆమె ఇంటికి వస్తారు. ఆమె వారిని ఊరిస్తుంది కానీ హద్దుల్లో ఉంచుతుంది. బ్రతకనేర్చినది. సంగీతకారుడు అవకాశాలు లేక నిరాశలో ఉంటాడు. ఒంటరిగా ఉన్న మహిళ తోడు కోసం పరితపిస్తూ ఉంటుంది. జెఫ్ స్టెల్లాతో “ఆమె మళ్ళీ ఒంటరిగానే మద్యం తాగి పడుకుంది” అంటాడు. “పాపం. ఏదో ఒకరోజు ఆమెకి ఆనందం దక్కకపోదు” అని ఆమె అంటే “అంటే ఒక మగాడి ఆనందం హుళక్కే అన్నమాట” అంటాడతను. పెళ్ళి చేసుకుంటే మగాడి ఆనందం పోతుందని అతని భావన. అతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది. కానీ ఆమె పెళ్ళి ప్రస్తావన తెస్తే అతనికి నచ్చదు. “నాతో నువ్వేం సుఖపడవావు?” అంటాడు. అతను ఎందుకు అలా అంటాడో మన ఊహకే వదిలేశాడు దర్శకుడు. అతను చెప్పే సాకు “నేను ఒకరోజు ఒకచోట ఉంటే ఇంకోరోజు ఇంకో చోట ఉంటాను. ఎలా కుదురుతుంది?” అని. ఫోటోగ్రాఫర్లు పెళ్ళి చేసుకోరా?
జెఫ్ కిటికీలోంచి చూసేవాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవలసింది సేల్స్‌మన్ గురించి. అతని భార్య జబ్బుతో మంచంలో ఉంటుంది. కానీ మరీ కదలలేని స్థితి ఏమీ కాదు. ఆమె భర్తతో ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుంది. నాకనిపించింది ఏమిటంటే భర్త సరిగా సంపాదించట్లేదని ఆమె ఏడుపు. అతను పక్క గదిలో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటే ఈమె మంచం నుంచి లేచి వచ్చి అతన్ని చూసి నవ్వుతుంది. ఇదంతా జెఫ్‌కి కనిపిస్తూ ఉంటుంది. ముందే చెప్పానుగా – చిత్రంలో మనం చూసేవన్నీ జెఫ్ చూసే దృశ్యాలే. ఆరోజు సాయంత్రం జెఫ్ గర్ల్‌ఫ్రెండ్ లీసా వస్తుంది. మంచి భోజనం తీసుకుని వస్తుంది. అతన్ని ఏదన్నా ఫ్యాషన్ పత్రికలో చేరమంటుంది. అలాగైతే అతను న్యూ యార్క్‌లోనే ఉండొచ్చు. అతనికది ఇష్టం లేదు. “నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తాను” అంటుంది. అది చాలా కష్టమని అతనంటాడు. ఆమె అలిగి వెళ్ళిపోతుంది. కానీ ఆమెకి అతనంటే ప్రేమ. అతన్ని వదలటం ఆమెకి సాధ్యం కాదు. లీసా ప్రేమతో జెఫ్‌ని వేధిస్తుంది. సేల్స్‌మన్ భార్య ఈసడింపుతో అతన్ని వేధిస్తుంది.
ఆ రాత్రి అంతా సద్దుమణిగాక ఒక సీసా పగిలిన శబ్దం, “వద్దు” అనే అరుపు వినిపిస్తాయి. ఎవరూ పట్టించుకోరు. జెఫ్ కూడా పట్టించుకోడు. అర్థరాత్రి దాటాక జెఫ్‌కి మెలకువ వస్తుంది. వర్షం మొదలవుతుంది. సేల్స్‌మన్ అపార్ట్‌మెంట్ కిటికీలన్నీ పరదాలు వేసి ఉంటాయి. అతను ఒక పెట్టె పట్టుకుని బయటకు వెళతాడు. జెఫ్ మేలుకునే ఉంటాడు. గంటన్నర పోయాక సేల్స్‌మన్ తిరిగి వస్తాడు. మళ్ళీ పెట్టె పట్టుకుని వెళతాడు. కాసేపటికి మళ్ళీ తిరిగి వస్తాడు. జెఫ్‌కి ఇదంతా వింతగా ఉంటుంది. కానీ నిద్రకి ఆగలేక పడుకుంటాడు. కాసేపటికి సేల్స్‌మన్ తన భార్యని వెంటబెట్టుకుని ఒక పెట్టె పట్టుకుని బయటకి వెళతాడు. జెఫ్ ఇది చూడడు.
మర్నాడు స్టెల్లాతో “రాత్రి పెట్టె పట్టుకుని వెళ్ళాడు. రాత్రి పూట ఏం పని?” అంటాడు. “తన సామాన్లు జారవేస్తున్నాడన్నమాట. ఆమెని వదిలిపోతాడు. పిరికిపంద!” అంటుందామె. “ఒక్కోసారి ఉండటమే దుర్భరమవుతుంది. పారిపోవటమే మంచిది” అంటాడతను. “అయితే మాత్రం చెప్పకుండా పోతే వాడు నీచుడే” అంటుందామె. ఇంతలో సేల్స్‌మన్ తన కిటికీలో నుంచి బయటకి చూడటం కనిపిస్తుంది. గంభీరంగా కలయజూస్తాడు. జెఫ్, స్టెల్లా కిటికీ నుంచి దూరంగా జరుగుతారు. “తప్పు చేసినవాడే ఎవరూ చూడట్లేదు కదా అని అలా చూస్తాడు” అంటాడు జెఫ్. కుక్క కింద ఉన్న పూల మొక్కల దగ్గర తవ్వటం కనిపిస్తుంది. అవి సేల్స్‌మన్ పెంచిన మొక్కలు. స్టెల్లా వెళ్ళాక జెఫ్ తన పెద్ద లెన్స్‌తో సేల్స్‌మన్ ఇంటిలోకి చూస్తాడు. అతను పెట్టె శుభ్రం చేసుకుంటాడు. ఒక కత్తి, చిన్న రంపం పేపర్లో చుట్టి పెడతాడు. జెఫ్‌కి అతను భార్యని చంపి ముక్కలుగా కోశాడని అనుమానం వస్తుంది. సాయంత్రం లీసా వస్తే అదే చెబుతాడు. ఆమె “పిచ్చి ఆలోచనలు మాను” అంటుంది. ఇంతలో సేల్స్‌మన్ ఒక పెద్ద ట్రంకు పెట్టె తాడుతో కట్టడం కనిపిస్తుంది ఇద్దరికీ. లీసాకి కూడా అనుమానం వస్తుంది. అమె సేల్స్‌మన్ పేరు తెలుసుకుంటుంది. అతని పేరు థోర్వాల్డ్.
జెఫ్ కెమెరామన్ కావటంతో అతని దగ్గర కెమెరాకి సంబంధించిన పరికరాలు చాలా ఉంటాయి. దూరంగా ఉన్నవారిని నిశితంగా చూడటానికి ఉపయోగపడతాయి. అప్పట్లో ఫ్లాష్ బల్బులు ఉండేవి. అవి కూడా తర్వాత జెఫ్‌కి ఉపయోగపడతాయి. థోర్వాల్డ్ ఒకవేళ నేరం చేసినా అతను కిటికీలు, పరదాలు వేసుకోకుండా ఎందుకు ఉన్నాడు అనే ప్రశ్న తర్వాత ఒకరు జెఫ్‌ని అడుగుతారు. వేసవిలో కిటికీలు, పరదాలు వేసేస్తే ఇంకా అనుమానాస్పదంగా ఉంటుంది. అలా ఉండకూడదనే అతను మామూలుగా ప్రవర్తిస్తున్నాడని జెఫ్ అంటాడు.
ఈ మధ్య వచ్చే థ్రిల్లర్ సినిమాల్లో నాయకుడికి లేదా నాయికకి చిత్రం పొడుగునా ఎన్నో అవాంతరాలు వస్తాయి (ఉదాహరణకి తెలుగులో వచ్చిన ‘మృత్యుంజయ్’ సినిమా). ఇక దారి లేదు అనిపిస్తుంది. కానీ నాయకుడు/నాయిక తెలివితో ఆ అవాంతరాల్ని అధిగమిస్తారు. ఇది ప్రేక్షకులకి అమితమైన ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి స్క్రీన్‌ప్లే నిర్మాణానికి హిచ్‌కాకే ఆద్యుడేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో పలుచోట్ల సాక్ష్యాలనుకున్నవి నిరుపయోగంగా మారతాయి. నాయకుడు నిరుత్సాహపడతాడు. మళ్ళీ కొత్త సాక్ష్యం దొరికితే ఉత్సాహం వస్తుంది. ఒకసారి నిరుత్సాహపడినప్పుడు “నేను ఇతరుల మీద గూఢచర్యం చేసినట్టే ఇతరులు కూడా నన్ను మైక్రోస్కోప్ కింద పురుగులాగా చూస్తూ ఉండొచ్చుగా” అంటాడు. హిచ్‌కాక్ సినిమాల్లో లోపాలు లేని పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. తేడా ఏమిటంటే కొన్ని పాత్రలకు తమ లోపాలు తెలుసు. కొన్ని పాత్రలకి తమ లోపాలు లోపాలుగా అనిపించవు. సంభాషణల్లో ఈ తేడా తెలిసిపోతుంది. అదే హిచ్‌కాక్ చిత్రాల్లో గొప్పతనం.
Spoiler warning: ఈ క్రింద మిగతా చిత్రకథ, ముగింపు ప్రస్తావించబడ్డాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపివేయగలరు.
సినిమాలో ఇంత హంగామా చేసి చివరికి థోర్వాల్డ్ హత్య చేయలేదని చెబితే ప్రేక్షకులకి నిరాశ ఖాయం. కాబట్టి ముగింపు ఏమిటో ఊహించటం పెద్ద కష్టం కాదు. అయితే ఈ సినిమాలో ఉత్కంఠకి లోటు ఉండదు. ఉత్కంఠ అంతా హంతకుడు పట్టుబడతాడా? లీసా, జేమ్స్ ప్రమాదంలో పడతారా? అనే విషయాల్లోనే ఉంటుంది. చూస్తేనే మజా. ఎంత చదివినా సినిమా చూస్తే కానీ హిచ్‌కాక్ ప్రతిభ అర్థం కాదు. ఆయనే ఒకసారి అన్నాడు – “ప్రేక్షకులకి తెలియకుండా హఠాత్తుగా బాంబు పేలితే అది సస్పెన్స్ కాదు. ప్రేక్షకులకి బాంబు ఉందని చూపించి అది ఎప్పుడు పేలుతుందో వారికి తెలియకపోతే అది అసలైన సస్పెన్స్” అని. ఈ సినిమాలో హత్య జరిగిందా లేదా అన్నది ప్రశ్న కాదు. హంతకుడు ఎలా పట్టుబడతాడా అనేదే ప్రశ్న. మొదట్లో జెఫ్ మాటలు స్టెల్లా, లీసా నమ్మరు. కానీ తర్వాత వారికీ అనుమానం బలపడుతుంది. జెఫ్ అయితే కదలలేడు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళని ఆపటం జెఫ్‌కి కష్టమవుతుంది. వాళ్ళు ప్రమాదంలో పడితే? ఈ సన్నివేశాలే ఉత్కంఠ కలిగిస్తాయి. కాకపోతే కరడుగట్టిన హంతకుడిలా థోర్వాల్డ్ తాపీగా పనులు చేసుకోవటం కొంచెం అవాస్తవికంగా ఉంటుంది. ముందే చెప్పానుగా సినిమా అన్నాక కొంచెం కృత్రిమత్వం ఉంటుంది.
మర్నాడు జెఫ్ తన స్నేహితుడైన పోలీస్ డిటెక్టివ్‌కి ఫోన్ చేస్తాడు. స్టెల్లాకి కూడా అంతా చెబుతాడు. ఆమె అతని మాటలు నమ్ముతుంది. “బాత్రూమ్‌లో ఆమెని కోసి ఉంటాడు.. ఆ ట్రంకు పెట్టె త్వరగా తీసుకెళ్ళకపోతే లీకు అవుతుంది” అని తన ఊహలన్నీ జోడిస్తుంది. థోర్వాల్డ్ సామాన్లు తరలించే సంస్థ చేత ట్రంకు పెట్టె తరలిస్తాడు. తర్వాత డిటెక్టివ్ వస్తాడు. జెఫ్ చెప్పింది విని విచారణ చేయటానికి వెళతాడు. అపార్ట్‌మెంట్ కోసం థోర్వాల్డ్ తీసుకున్న లీజు అయిపోవచ్చిందని, నిన్న పొద్దున్న అతను భార్యని రైలెక్కించి వచ్చాడని, త్వరలో ఇల్లు ఖాళీ చేస్తాడని అంటాడు. ఇదంతా అపార్ట్‌మెంట్ పర్యవేక్షకుడికి థోర్వాల్డ్ స్వయంగా చెప్పాడు. థోర్వాల్డ్ భార్యతో వెళ్ళటం ఇంకో ఇద్దరు చూశారు. జెఫ్ ఆ మాటలు నమ్మడు. సోదా చెయ్యమంటాడు. రేపటికి సాక్ష్యాలన్నీ మాయమవుతాయి అంటాడు. చట్టపరమైన అనుమతి లేకుండా సోదా చెయ్యటానికి వీలు లేదు. అలా చేస్తే పోలీసు డిటెక్టివ్ ఉద్యోగం పోతుంది. జెఫ్‌కి విసుగు వస్తుంది. అతనికి థోర్వాల్డ్ హత్య చేశాడని నమ్మకం. రాత్రి పూట పెట్టె పట్టుకుని అన్నిసార్లు ఎందుకు వెళ్ళాడనేది అతని ముఖ్యమైన ప్రశ్న. డిటెక్టివ్ అనేదేమిటంటే రాత్రిపూట పెట్టె పట్టుకుని వెళ్ళినంతమాత్రాన హత్య చేశాడని అనలేమని. అయినా ట్రంకు పెట్టె ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటానని అంటాడు. వెళ్ళేముందు థోర్వాల్డ్ పోస్ట్ బాక్స్‌లో దొరికిన ఉత్తరం కూడా చదువుతాడు. అంతవరకు దాచాడు. అది థోర్వాల్డ్ భార్య రాసింది. క్షేమంగా చేరుకున్నానని. దానితో జెఫ్ నిరుత్సాహపడతాడు. ఆమె బతికి ఉన్నందుకు సంతోషించాలి కాని నిరుత్సాహం ఎందుకు? మనిషి ప్రవృత్తి ఇంతే. తాను బలంగా అనుకున్నది తప్పు అని తెలిస్తే మొదట కలిగేది నిరుత్సాహమే. అది ఎంత భయంకరమైన అభిప్రాయమైనా!
తర్వాత జెఫ్ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చూస్తాడు. ఆమె బాగా తయారయ్యి బయటకి వెళుతుంది. రోడ్డుకి అవతల ఉన్న రెస్టారెంట్‌కి వెళుతుంది. జెఫ్ అంతా కెమెరా లెన్స్‌లో నుంచి చూస్తాడు. ఇంతలో థోర్వాల్డ్ లెన్స్ దృష్టిలోకి వస్తాడు. ఇక్కడ హిచ్‌కాక్ గొప్పతనం మరోసారి రుజువవుతుంది. కథ అయిపోయింది, వేరే కథ మొదలయింది అనిపించేలా చేసి మళ్ళీ ఒక మలుపు తిప్పుతాడు. థోర్వాల్డ్ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళి తన బట్టలన్నీ మంచం మీద పెట్టుకుంటాడు. తన భార్య హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అందులో నుంచి నగలు (నగలంటే మన దేశంలో నగలు కాదు. చిన్న నగలు. అమెరికన్లు భారీ నగలు వాడరు) తీస్తాడు. అందులో ఎంగేజ్‌మెంట్ ఉంగరం, పెళ్ళి ఉంగరం ఉంటాయి. థోర్వాల్డ్ ఎవరికో ఫోన్ చేస్తాడు. తర్వాత మళ్ళీ బయటకి వెళతాడు. లీసా జెఫ్ ఇంటికి వస్తుంది. జెఫ్ జరిగినదంతా చెబుతాడు. “ఏ ఆడదీ తన నగలు తీసుకువెళ్ళకుండా వేరే ఊరికి వెళ్ళదు (ఇది అమెరికన్ల పద్ధతి అనుకోవచ్చు). నాకు ఆడవాళ్ళ సంగతి తెలుసు” అంటుంది లీసా. “మరి ఆమె అతనితో వెళ్ళటం సాక్షులు చూశారే?” అంటాడతను. “ఆ వెళ్ళింది ఒక స్త్రీ. ఆమే అతని భార్య అని చెప్పలేం కదా” అంటుంది ఆమె. అవును వెళ్ళేటప్పుడు ఆమె తలపై హ్యాట్ ధరించింది. ఆమె ముఖం సాక్షులు చూసి ఉండకపోవచ్చు. ఈ మాటతో జెఫ్‌లో మళ్ళీ ఉత్సాహం వస్తుంది.
డిటెక్టివ్ వస్తాడు. జెఫ్, లీసా తమ అభిప్రాయాలు చెబుతారు. డిటెక్టివ్ వాటిని కొట్టిపారేస్తాడు. ఆడవాళ్ళ మనస్తత్వాలని బట్టి కేసులు తేలవని అంటాడు. అతను తనిఖీ చేశాడు. ట్రంకు పెట్టె రైల్లో వెళ్ళిందని, అందులో థోర్వాల్డ్ భార్య బట్టలున్నాయని, తాళం విరిగిపోవటంతో తాడు కట్టాడని చెబుతాడు. గమ్యస్థానంలో థోర్వాల్డ్ భార్య ఆ పెట్టెని తీసుకుని వెళ్ళిందని చెబుతాడు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. జెఫ్ మళ్ళీ నిరుత్సాహపడతాడు. లీసా “ఎవరైనా ఇప్పుడు మనిద్దరినీ చూస్తే ఒకతను తన భార్యను చంపనందుకు మనం బాధపడుతున్నాం అంటారు. ఆమె బతికి ఉన్నందుకు సంతోషించు” అంటుంది జెఫ్‌తో. మన మాటే నెగ్గాలి అనుకోవటం కంటే మంచే జరిగింది అనుకోవటం ఎప్పటికైనా మంచిదే. ఇలాంటి పాత్రలు ఉండబట్టే హిచ్‌కాక్ సినిమాలు కేవలం థ్రిల్లర్లు కాదు మనసుని తాకే థ్రిల్లర్లు. కాసేపటికి కుక్కని ఎవరో చంపేశారని దాని యజమానురాలు ఏడుపులు వినిపిస్తాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ బాల్కనీల్లోకి వచ్చి చూస్తారు. థోర్వాల్డ్ మాత్రం ఇంట్లోనే ఉండిపోతాడు. జెఫ్ ఇది గమనిస్తాడు. కుక్కకి ఏదో తెలిసిందని, అందుకే అతను కుక్కని చంపేశాడని జెఫ్, లీసా అనుకుంటారు. ఇది చివరి మలుపు.
మర్నాడు జెఫ్, లీసా, స్టెల్లా ముగ్గురూ థోర్వాల్డ్ ఏం చేస్తున్నాడో చూస్తుంటారు. జెఫ్ పూల మొక్కల కింద అతను ఏదో పాతిపెట్టాడని గ్రహిస్తాడు. అది పసిగట్టినందుకే కుక్కని చంపేశాడని అర్థమవుతుంది. థోర్వాల్డ్ శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు. అతన్ని ఆపటానికి జెఫ్ ఒక ఉపాయం చేస్తాడు. ఒక కాయితం మీద “ఆమెనేం చేశావు?” అని రాసి ఒక కవర్లో పెట్టి లీసాకిచ్చి ఆ ఉత్తరాన్ని థోర్వాల్డ్ తలుపు కింద నుంచి వేసి రమ్మని పంపిస్తాడు. లీసా అలాగే చేస్తుంది. థోర్వాల్డ్ ఉత్తరం రాగానే తీసి చూస్తాడు. వెంటనే తలుపు తీస్తాడు. చుట్టుపక్కల చూస్తాడు. లీసా దాక్కుంటుంది. ఇదంతా జెఫ్, స్టెల్లా చూస్తుంటారు. సెట్టు వేసిన పద్ధతి వల్ల అంతా కనపడుతుంటుంది. ఈ సెట్టు అద్భుతమని మరోసారి చెప్పకతప్పదు. జెఫ్‌కి అంతా కనిపించేలా మరీ సౌకర్యవంతంగా సెట్టు వేశారా అని కూడా అనిపిస్తుంది. లీసా తిరిగి జెఫ్ దగ్గరకి వస్తే అతను ఆమెని ఆరాధనగా చూస్తాడు. అతనికి సాహసమంటే ఇష్టమని మనకి అర్థమవుతుంది. అసలు సాహసం ఉంటేనే అతనికి లైంగిక ఉద్దీపన కూడా కలుగుతుందేమో అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళనే అడ్రినాలిన్ జంకీస్ అంటారు. అంటే సాహసం చేసినప్పుడు విడుదలయే అడ్రినాలిన్ హార్మోన్ మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. అందుకే అతను స్థిరమైన ఉద్యోగం కాక ఘర్షణలు జరిగే ప్రాంతాలు వెళ్ళి ఫోటోలు తీసే ఉద్యోగం ఎంచుకున్నాడు.
ఉత్తరం చూసి థోర్వాల్డ్ కాస్త ఖంగు తిన్నా తన పని తాని చేసుకుంటూ ఉంటాడు. జెఫ్ క్రితం రోజు తాను నగలు చూసినపుడు పెళ్ళి ఉంగరం చూశానంటాడు. పాశ్చాత్యదేశాల్లో పెళ్ళి ఉంగరం చాలా ప్రధామైనది. పడుకునేటప్పుడు కూడా భార్యాభర్తలు తమ పెళ్ళి ఉంగరాలు తీయరు. అలాంటిది థోర్వాల్డ్ భార్య పెళ్ళి ఉంగరం వదిలేసి వెళ్ళిందంటే అది అబద్ధమని వారు తేల్చుకుంటారు. ముందు పూల మొక్కల కింద తవ్వి చూస్తే ఏదైనా ఆధారం దొరకొచ్చని అనుకుంటారు. థోర్వాల్డ్‌ని ఎక్కడికైనా పంపిస్తే తవ్వి చూడవచ్చు. జెఫ్ ఫోన్ డైరెక్టరీలో నంబర్ చూసి థోర్వాల్డ్‌కి ఫోన్ చేస్తాడు. “చనిపోయిన మీ ఆవిడ ఆస్తి సంగతి మాట్లాడాలి. ఫలానా చోటికి రా” అంటాడు. థోర్వాల్డ్ బయల్దేరుతాడు. స్టెల్లా, లీసా ఒక పార తీసుకెళ్ళి పూలమొక్కల కింద తవ్వుతారు. అక్కడేం లేకపోయేసరికి అసహనంతో లీసా థోర్వాల్డ్ ఇంట్లోకి వెళ్ళటానికి వెనక ఉన్న ఇనప మెట్లు (అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాడే మెట్లు) ఎక్కుతుంది. బాల్కనీ నుంచి కిటికీ మీదకి కాలు పెట్టి లోపలికి వెళుతుంది. లోపల వెతికితే ఆమెకి నగలు దొరుకుతాయి. ఇంతలో థోర్వాల్డ్ తిరిగివస్తాడు. ఆమెని పట్టుకుంటాడు. ఆమె “జెఫ్, జెఫ్” అని అరుస్తుంది. జెఫ్ ఇదంతా చూసి పోలీసులకి ఫోన్ చేసి ఒకతను ఒక స్త్రీ మీద దాడి చేస్తున్నాడని, వెంటనే రమ్మని చెబుతాడు. లీసా థోర్వాల్డ్‌తో పెనుగులాడుతుండగా పోలీసులు వస్తారు. లీసా అప్పటికే తనకి దొరికిన పెళ్ళి ఉంగరాన్ని చేతి వేలికి పెట్టుకుంది. పోలీసులతో మాట్లాడుతూనే చెయ్యి వెనక్కి పెట్టి ఆ ఉంగరాన్ని జెఫ్‌కి కనపడేలా చూపిస్తుంది. పోలీసులకి మాత్రం ఏమీ చెప్పదు. ఆమె దొంగ అని భావించి పోలీసులు ఆమెని అరెస్టు చేస్తారు. థోర్వాల్డ్ నుంచి తప్పించుకోవటానికి ఆమె మారుమాటాడకుండా అరెస్టు అవుతుంది. థోర్వాల్డ్‌కి ఆమె ఉంగరాన్ని ఎవరికో చూపించటం కనపడుతుంది.
లీసా వెనుక మెట్లు ఎక్కి థోర్వాల్డ్ అపార్ట్‌మెంట్లోకి వెళ్ళటం, అక్కడ థోర్వాల్డ్ ఆమెని పట్టుకోవటం ఇవన్నీ కూడా జెఫ్ చూసినట్టే దూరం నుంచే మనకు కనపడతాయి. ఈ చిత్రం 1954లో వచ్చిందనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. అప్పట్లో ఈ దృశ్యాలు ఎంత ఉత్కంఠ కలిగించాయో మన ఊహకి అందదు. ఆ ఉత్కంఠ అంతా జెఫ్ ముఖంలో కనపడుతుంది. కదలలేక, ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఇక్కడ జెఫ్ పాత్రధారి జేమ్స్ స్టువర్ట్ నటన అద్భుతంగా ఉంటుంది. లీసా తెలివిగా తప్పించుకోవటంతో ఊపిరి పీల్చుకుంటాడు. డిటెక్టివ్‌కి ఫోన్ చేసి లీసా అరెస్టయిన సంగతి, పెళ్ళి ఉంగరం ఆమె దగ్గర ఉన్న సంగతి చెబుతాడు.
థోర్వాల్డ్‌కి జెఫ్ అనేవాడు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడని తెలిసింది. అతను వాకబు చేసి జెఫ్ ఇంటికి వస్తాడు. అప్పటికే చీకటి పడింది. థోర్వాల్డ్ జెఫ్ మీద దాడి చేయబోతుంటే జెఫ్ కెమెరాకి వాడే ఫ్లాష్ బల్బులు వెలిగించి అతని కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చేసి అతన్ని తాత్కాలికంగా ఆపగలుగుతాడు. కానీ వీల్ చెయిర్లో ఉండటం వల్ల అశక్తుడై ఉంటాడు. థోర్వాల్డ్ అతన్ని పట్టుకుంటాడు. కిటికీలోనుంచి కిందకి పడవేయాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో పోలీసులు మళ్ళీ వస్తారు. జెఫ్ కింద పడిపోతుంటే పోలీసులు పట్టుకుంటారు. తర్వాత పెళ్ళి ఉంగరం ఆధారంగా డిటెక్టివ్ థోర్వాల్డ్‌ని ప్రశ్నిస్తే అతను నేరం ఒప్పుకుంటాడు. భార్యని చంపి, ముక్కలు చేసి, పెట్టెలో పెట్టి నదిలో పారేశాడు. ఒక భాగం (తల కావచ్చు) పూలమొక్కల కింద పాతిపెట్టాడు. కుక్క పసిగట్టిందని తెలిసి ఆ భాగాన్ని తీసి ఇంట్లో పెట్టెలో పెట్టాడు. అతనితో కనిపించిన స్త్రీ అతని ప్రియురాలు. ఆమెతోనే ఫోన్లో మాట్లాడేవాడు. ఆమెకి నేరం సంగతి తెలుసు. ఆమే అతని భార్యలా ఉత్తరం రాసింది. ట్రంకు పెట్టె ఆమెకే పంపించాడు.
లీసా, జేమ్స్ చట్టం సాయం కోరినా దొరకలేదు. వాళ్ళే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇది నేరమే. కానీ వారి వివేకం వారికి ఇంకా పెద్ద నేరం జరిగిందని చెబుతోంది. అలాంటప్పుడు ఏం చేయకుండా ఎలా ఉంటారు? మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాం? మనమే ఆ పరిస్థితుల్లో ఉన్నట్టు హిచ్‌కాక్ భ్రమింపజేస్తాడు. జెఫ్ క్లోజప్‌లో ఉన్నప్పుడు కూడా దూరంగా ఉన్న వీధిలో జనసంచారం, సాయంత్రం వేళల్లో పక్కింటి సంగీతకారుడి ఇంట్లో సంగీతం వినపడటం, దూరంగా జరుగుతున్న సంభాషణలు దూరంగా ఉన్నట్టే వినపడటం – ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఈ చిత్రానికి ఉత్తమ ఛాయగ్రహణం, ఉత్తమ ధ్వని ముద్రణ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. జాన్ మైకేల్ హేస్‌కి ఉత్తమ స్క్రీన్‌ప్లే (‘ఇట్ హాడ్ టు బి మర్డర్’ కథ ఆధారంగా), హిచ్‌కాక్‌కి ఉత్తమ దర్శకుడి నామినేషన్లు వచ్చాయి. అయితే అవార్డులు రాలేదు. లీసాగా నటించిన గ్రేస్ కెల్లీకి అదే సంవత్సరం ‘ద కంట్రీ గర్ల్’ చిత్రానికి ఉత్తమ నటి ఆస్కార్ వచ్చింది.

