Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రెడ్ బుక్లో ఓ పేజీ

[పి.ఎల్.ఎన్. మంగారత్నం గారు రచించిన ‘రెడ్ బుక్లో ఓ పేజీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రాష్ట్రంలో ఎన్నికల ఊపు జోరందుకుంది.

“ఈ సారి ఎవరు వస్తారంటావు?” అంటే..

“ప్రభుత్వం మారాలి” అన్న వాళ్ళే ఎక్కువ. అధికారపార్టీ ఎన్ని తాయిలాలు అందించినా ప్రజల ‘ఆశ’ ఆకాశం వైపే చూసింది.

మాదే హవా.. ముప్పై ఏళ్ల రాజ్యం ఇక మాదే అనుకున్నా.. అంతా క్షణాల్లో మారిపోయింది. ప్రజా తీర్పు ననుసరించి. అలా జరుగుతుందని మహామహా వాళ్ళే అనుకోలేదు.

జోస్యం నిలబడలేదు. అంతటా ఆశ్చర్యం. దిగ్బ్రాంతి.

పార్టీ అధినేత ‘రామిరెడ్డి’ మాట ఎలా ఉన్నా..

అప్పటి వరకూ మున్సిపల్ చైర్మన్‌గా ఉండి, ఇప్పుడు మాజీ అయిన పల్నాడు మున్సిపల్ చైర్మన్ ‘కడియాల దేవబాబు’ కి ఉన్న పరిస్థితి చిక్కులు తెచ్చి పెట్టింది.

అప్పట్లో..

తన నియోజకవర్గానికి ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన కోసం వెళ్లిన ప్రతిపక్షం నాయకుల కార్లపై రాళ్ల దాడి చేయించాడు దగ్గరుండి మరీ. పోలీసు కేసు అయినా వెరవలేదు. పరిపాలన మాదే.. ఇకముందూ మేమే అన్న ధీమాతో.

అతనికి తోడు ఆ దేవబాబు బావమరిది ఒకడు రౌడీషీటరు.

అలాంటి వాటికి ముందుండేవాడు. ఇక అడ్డేముంది. అనుకుంటే.. అయిపోవడమే. తగ్గేదే లేదు మరి. అయితే, ఇప్పుడు అనుకున్నదొకటీ.. అయ్యింది ఒకటీ అన్నట్లు ఆ ఎలక్షన్లలో ఓడిపోయాడు దేవబాబు.

***

కొత్త ప్రభుత్వం ‘రాయుడు’ వర్గం అధికారపగ్గాలు చేపట్టగానే..

కక్ష సాధింపు చర్యలకు అవకాశం ఇవ్వకుండా ‘అజ్ఞాతం’ లోకి వెళ్ళిపోయాడు.

అలా ఎందుకంటే..

కొత్త ముఖ్యమంత్రి గారి కుమారుడు.. ‘సోమేశ్వరరావు’ అలియాస్ ‘సోమేశ్’ గత పాలనలో తమకూ, తమ పార్టీ వాళ్ళకీ కలిగిన కష్ట నష్టాల్ని ఎప్పటికప్పుడు తన డైరీలో నోట్ చేసుకునేవాడు..

ప్రతిదీ గుర్తుంచుకోలేడు కాబట్టి.

దాని బైండింగు మంచి ‘ఎర్ర రంగు’లో ఉండడంతో.. తోటి వాళ్ళందరూ దానిని ‘రెడ్ బుక్’ అని పిలుచుకునేవారు.

ఆవేశం వచ్చినపుడు..

“చర్యకు.. ప్రతి చర్య ఉంటుంది” అంటూ ఆ పుస్తకాన్ని చూపించేవాడు సోమేశ్.

అయితే, అప్పటి ఆ సరదా మాట ఇప్పుడు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది ఎదుటి వరుసలో వాళ్ళకి.

***

“తెలీదు సార్! మా ఆయన దేవబాబు ఎక్కడికి వెళ్లిందీ? తెలీదు. ఫోను కూడా పని చెయ్యడం లేదు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నదీ మాకు తెలీదు” అంటూ కన్నీళ్ళతో చేతులు జోడించింది ఆ మహా ఇల్లాలు. మూడు నెలలు గడిచినా.. పరిస్తితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది.

“నిజం సార్! మాకేం తెలీదు. మా మాట నమ్మండి. ఇక్కడిక్కడే ఉంటే ఎపుడో అపుడు, ఎవరికో ఒకరికి కనిపించి ఉండేవాడు కదా! అలా కనిపించలేదంటే.. బహుశా దేశంలోనే లేడేమో!” సందేహం వెలుబుచ్చాడు వరుసకు బాబాయి అయిన తిరుపాలు.

“ఆ ప్రయత్నమూ అయ్యింది. ఆ పేరు గలవాడెవ్వడూ.. ఇప్పటి వరకూ విమానం ఎక్కినట్లు దాఖలాలు లేవు. అందుకే అడగడం” హుంకరించాడు స్టేషను ఎస్.ఐ.

***

అలా చీకట్లోకి, వెనకడుగులు వేసిన దేవబాబు..

సెల్ నెంబరు మార్చేయ్యడమే కాదు, బంధువులు ఎవరితోనూ కూడా కలవకుండా.. మాట్లాడకుండా పోయాడు. దాంతో అతని ఆచూకీ తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది.

అతన్ని పట్టుకోలేనందుకు పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది.

ఈ క్రమంలో అతని బ్యాంకు ఖాతాలపై దృష్టి పెట్టారు పోలీసులు. మనిషి కనిపించక పోయినా బ్రతుకు తెరువుకి డబ్బు కావాలి కదా! అన్నట్లు.

అనుకున్నట్లుగానే ఫలితం కనిపించింది.

ఫోన్ నెంబర్ మార్చేసినా.. ఆ నెంబరుతో ‘ఫోన్ పే’ వాడుతున్నట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో..

హైదరాబాదు మల్కాజిగిరి ప్రాంతంలో కస్తూరి కాలనీలో నివాసం ఉన్నట్టు.. అక్కడి పోలీసులు గుర్తించారు. ఆంధ్రా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ కాలనీలో ఉండే ‘మస్తాన్ సాయి’ చికెన్ షాప్‌లో ఆ తరచూ చికెన్ కొంటూ ‘ఫోన్ పే’ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం అందింది.

ఆ విషయం పూర్తిగా నిర్ధారించుకున్నాక..

ఒక ‘నిఘా టీం’ను హైదరాబాదుకు పంపించారు.

అతని కదలికలపై కన్నేసిన పోలీసులు ఓసారి చికెన్ కొంటుంటే ‘రెడ్ హేన్డెడ్’గా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆరు నెలలపాటు ఇబ్బంది పెట్టిన కడియాల దేవబాబు.. ఆచూకీ చివరికి అతని కోడి మాంస ప్రియత్వం పట్టించింది.

టెక్నాలజీ అభివృద్ధి మానవ మేధని దాటి పోలేదు కదా!

Exit mobile version