[సంచిక పాఠకుల కోసం ‘రెండు రెళ్ళు ఆరు’ అనే సినిమా లోని రెండు పాటలని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
‘రెండు రెళ్ళు ఆరు’ (1986) జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం. చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, రజని, ప్రీతి నటించారు. మూడు పాటల్లో రెండు పాటలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. సంగీతం రాజన్-నాగేంద్ర.
పాట-1:
అ: కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే ముద్దర వేసి ప్రేయసీ! కౌగిలి అందుకో
ఆ: కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి దస్ఖతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో
అ: చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా
ఆ: జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
వరదల్లె పొంగునా కడలింట చేరునా
అ: శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే
ఆ: చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే
చెలి జంట చేరునా చెలిమల్లె మారునా
అ: నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు
ఎరుపెక్కిపోవునా ఎన్నెల్లు పండునా
ఆ: దరి చేరి కూడా దరఖాస్తులేలా
ఈ పాట లింక్: https://www.youtube.com/watch?v=ZOmh7OGNyow
అన్నమయ్య పదాలలో పాటంతా సాగే ఒక సూత్రం ఉంటుంది. ఒక్కోసారి ఆ సూత్రం పదం రూపంలో వస్తుంది. ఉదాహరణకి:
బ్రహ్మ కడిగిన పాదము (ఇందులో సూత్రం ‘పాదం’)
ఈ పాదమే కదా ఇల ఎల్ల కొలిచినది (ఇందులో కూడా సూత్రం ‘పాదం’)
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను (ఇందులో సూత్రం ‘మంత్రం’)
ఆదిమూలమే మాకు అంగరక్ష (ఇందులో సూత్రం ‘రక్ష’)
ఈ సంప్రదాయంలోనే వేటూరి ఈ పాటలో ‘దరఖాస్తు’ని సూత్రంగా చేసుకున్నారు. పాట సీస పద్యాన్ని గుర్తు తెస్తుంది. మొదటి చరణంలోని తొలి నాలుగు పాదాలు, రెండవ చరణంలోని తొలి నాలుగు పాదాలు కలిపితే ఒక సీస్ పద్యంలా ఉంటుంది.
ఇదో ప్రేమగీతం. పాడినవారు బాలు, జానకి. రాజేంద్రప్రసాద్, ప్రీతి మీద చిత్రీకరించారు.
అ: కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో
ముద్దులతోనే ముద్దర వేసి ప్రేయసీ! కౌగిలి అందుకో
ఆ: కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో
దగ్గర చేరి దస్ఖతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో
పల్లవిలో దరఖాస్తుకి సంబంధించిన పదజాలం వస్తుంది – ‘ముద్ర’ (స్టాంప్), ‘దస్ఖతు’ (సంతకం). ముద్దుల ముద్ర అనేది తెలిసిన ప్రయోగమే. కానీ దరఖాస్తు అనే సూత్రం వల్ల దానికి స్టాంప్ అనే అర్థం వచ్చింది. నాయకుడు పాడేటపుడు ‘ప్రేయసీ! కౌగిలి అందుకో’ అనటం నాయిక పాడేటపుడు ‘ప్రేయసి కౌగిలి అందుకో’ అనటం ఔచిత్యభంగం కాకుండా తీసుకున్న జాగ్రత్త.
అ: చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా
ఆ: జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
వరదల్లె పొంగునా కడలింట చేరునా
అ: శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే
చిరుగాలి మబ్బుకి దరఖాస్తు పెట్టుకుందట. ఎందుకు? కురవమని. ఎవరైనా దరఖాస్తు పెట్టుకుంటే సొంత లాభం కోసం పెట్టుకుంటారు. కానీ ఇక్కడ లోకోపకారం కోసం దరఖాస్తు. తమ ప్రేమ అంత స్వచ్ఛమైనదని ఆ జంట చెప్పుకుంటున్నారు. వాన నదికి దరఖాస్తు పెట్టుకుంటే అది కడలిలో కలిసింది. ఆ నీరే మళ్ళీ మబ్బుగా మారి కురుస్తుంది. అదీ లోకోపకారమే. ఇక్కడ ‘కడలింట’ అనేది భాష మీద పట్టుంటే తట్టే పదం. ‘కడలి ఒడికి చేరటం’ అనేది మామూలే. కడలి ఇంటికి చేరటం అనేది చమక్కు. ‘శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే’ అంటే పెళ్ళి జరిగితే దరఖాస్తు అమోదించినట్టే.
ఆ: చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే
చెలి జంట చేరునా చెలిమల్లె మారునా
అ: నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు
ఎరుపెక్కిపోవునా ఎన్నెల్లు పండునా
ఆ: దరి చేరి కూడా దరఖాస్తులేలా
రెండో చరణంలో శృంగార భావాలు వస్తాయి. కానీ ఎక్కడా శ్రుతి మించని భావాలు అవి. ప్రాయం రాగానే చలిగాలి గిలిగింతలు పెడుతుంది. ఇక్కడ చలిగాలి ప్రకృతికి సంకేతం. అప్పుడు తోడు కావాలనిపిస్తుంది. అదే దాంపత్యమౌతుంది. నెలవంక దరఖస్తు అనే చోట జంధ్యాల చిత్రీకరణ అద్భుతం. నాయకుడు నాయిక చెంప మీద గోటితో గీటుతాడు. అదే నెలవంక. అప్పుడు అమ్మాయి చెక్కిళ్ళు ఎరుపెక్కుతాయి. శృంగారం పండుతుంది. ఎన్నెల్లు పండాయన్నారు. ఇంత నర్మగర్భంగా శృంగారాన్ని చెప్పటం వేటూరికే చెల్లింది. ఒకటయ్యాక ఇంక దరఖాస్తులు అవసరం లేదుగా. అందుకే దరి చేరి కూడా దరఖాస్తులేలా అన్నారు.
ఇక్కడ వ్యాకరణపరంగా కూడా జాగ్రత్త తీసుకున్నారు. మొదటి చరణంలో మొదటి పాదంలో ‘కరిమబ్బు’ రెండో పాదంలోని ‘నవ్వునా’ అనే క్రియకి కర్త. ‘కరిమబ్బు నవ్వునా’ అనే భావం ఉంది. అలాగే మూడు, నాలుగు పాదాలలో ‘సెలయేరు పొంగునా’ అనే భావం ఉంది. రెండో చరణంలో మూడు, నాలుగు పాదాలలో ‘చెక్కిళ్ళు ఎరుపెక్కిపోవునా’ అనే భావం ఉంది. అయితే మొదటి, రెండో పాదాలలో ‘తొలి ఈడు’, ‘చెలి’ అని రెండు కర్తలున్నాయి. మిగతా చోట్ల వచ్చినట్టుగా రాస్తే
చలిగాలి దరఖాస్తు వినకుంటే తొలి ఈడు
చెలి జంట చేరునా చెలిమల్లె మారునా
అని రాయాలి. ఇది గందరగోళానికి దారి తీస్తుంది. ‘తొలి ఈడు చెలితో చేరునా’ అనే అర్థం వస్తుంది. అందుకే ఇలా రాశారు-
చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే
చెలి జంట చేరునా చెలిమల్లె మారునా
దాంతో ‘చెలి జంట చేరునా’ అనే వాక్యానికి ‘చెలి సఖుని జంట చేరునా’ అనే అర్థం వస్తుంది. వ్యాకరణం గురించి వేటూరి ఇంత శ్రద్ధ తీసుకునేవారు.
ఇక్కడ ‘గోరింటాకు’ చిత్రంలోని కొమ్మకొమ్మకో సన్నాయి పాట గురించి ఒక ఇంటర్వ్యూలో వేటూరి చెప్పిన సంగతులు గుర్తు చేసుకోవాలి. ఆ పాటలో ఒక పాదం మార్చాలని అనుకుంటే వేటూరి అందుబాటులో లేక ఆత్రేయ చేత రాయించారట. ఆ పాదం-
కొంటె వయసు కోరిక లాగ గోదారి ఉరకలు చూడు
రికార్డింగ్ కూడా అయిపోయింది. వేటూరి వింటే ఇందులో వ్యాకరణ దోషం కనిపించింది. “‘నువ్వు కొంటె వయసు కోరిక లాగ మారి గోదారి ఉరకలు చూడు’ అనే అర్థం వస్తోంది. కానీ అసలు అర్థం ‘కొంటె వయసు కోరికల్లాంటి గోదారి ఉరకలు చూడు’ రావట్లేదు” అన్నారట. ఆత్రేయ కొట్టిపారేశారట.
ఆ ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు: https://www.youtube.com/watch?v=qvaw24RsFLo
పాట-2:
విరహవీణ నిదుర రాక వేగేవేళలో
శ్రుతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో
జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీ తోడు కోరేనురా
లేలేత వలపు సన్నాయి పిలుపు
రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళి పందిళ్ళ దాకా
ఎదలో కదిలే ఏవో కథలే ఏమని తెలిపేదిరా
చీకటి పగలు వెన్నెల సెగలు నీ నీడ కోరేనురా
ఈ నాటకాలు మన జాతకాన
రాశాయిలే ప్రేమలేఖ
ఈ దూరమెన్నాళ్ళ దాకా
ఈ పాట లింక్: https://www.youtube.com/watch?v=m2mFQazY4Cg
ఇది విరహగీతం. పాడినవారు జానకి. చంద్రమోహన్, రజని మీద చిత్రీకరించారు.
నిజానికి నాకు రెండు పాటల్లో ఈ పాటే ఎక్కువ ఇష్టం. అది బాణీ మహిమ. కానీ సాహిత్యపరంగా మొదటి పాటే ఉన్నత స్థాయిలో ఉంటుంది.
కథ ప్రకారం రాజేంద్రప్రసాద్, ప్రీతి పాత్రలకి చిన్నప్పుడు పెళ్ళయిపోతుంది. కానీ వారి కుటుంబాలు వేరుగా స్థిరపడతాయి. తమ పేర్లు నచ్చక వారు కొత్త పేర్లు పెట్టుకుంటారు. పెద్దయ్యాక వాళ్ళిద్దరే ప్రేమలో పడతారు. తమకి చిన్నప్పుడే పెళ్ళయిందని తెలియదు. ఇంతలో ఊరి నుంచి పిలుపు వస్తుంది. పెళ్ళయింది కాబట్టి శోభనం ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్ళి ఇష్టం లేక ఇద్దరూ తమ స్నేహితులని తమ స్థానాలలో పంపిస్తారు. ఎలాగోలా పెటాకులు చేసి రమ్మని. ఆ స్నేహితులు చంద్రమోహన్, రజని. ఇద్దరూ ప్రేమలో పడతారు. రజని సందిగ్ధంలో పడుతుంది. ఎలాగోలా తమకి పెళ్ళి జరిగితే బావుంటుందని కలలు కంటుంది. అప్పుడు వచ్చే పాట ఇది.
‘జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా’ అనే పాదంలో ప్రాస ఆకట్టుకుంటుంది. లేత వలపు సన్నాయి పిలుపట. అది పెళ్ళి పందిళ్ళ దాకా దారి తీయాలని ఆమె కోరిక.
తెలుగింటి పెళ్ళికి, సన్నాయి మేళానికి ఉన్న అవినాభావ సంబంధం ఇక్కడ చెప్పకనే చెప్పారు. ‘చీకటి పగలు, వెన్నెల సెగలు’ అనే ప్రయోగం అద్భుతం. అతను లేక ఆమెకి పగలు కూడా చీకటి కమ్ముకున్నట్టు ఉందట. రాత్రి వెన్నెల సెగ పుట్టిస్తోందట. పగలు కాంతివంతంగా, వెన్నెల చల్లగా ఉండాలంటే అతని తోడు కావాలి ఆమెకి. ‘ఈ నాటకాలు మన జాతకాన రాశాయిలే ప్రేమలేఖ’ అనే పాదంలో కథకి సంబంధించిన సూచన ఉంది. వాళ్ళు నాటకం ఆడదామని వచ్చారు. కానీ ప్రేమలో పడ్డారు. నాటకం ముగిసి దూరం సమసిపోవాలని ఆమె కోరిక.

