[డా. లక్ష్మీ రాఘవ రచించిన ‘రెప్పల చాటు దూరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
చిన్న ఊర్లో ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్గా పని చేసిన రాఘవరావు గారికి రిటైర్మెంట్ తర్వాత ప్రపంచం చాలా నెమ్మదించింది. రెండేళ్ల క్రితం భార్య అనుకోకుండా కాలం చేసిన తర్వాత జీవనసరళిని మార్చుకుని ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు. ఇప్పుడు ఆయనకి తెలిసిన ప్రపంచమల్లా ఉదయం పేపరు, సాయంత్రం మామిడి తోట దాకా నడక, నెలకోసారి వచ్చే పెన్షన్. అలా కొన్ని నెలలు నడిచాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా టి.సి.ఎస్.లో పని చేస్తూ ఉన్న కొడుకు శ్రవణ్ ‘రిటైర్ అయ్యారు కదా ఇప్పటికైనా వచ్చి తన దగ్గరికి వచ్చి ఉండమ’న్నాడు. వూరు వదిలి కొడుకు దగ్గరికి వెళ్ళి పోవడం ఇష్టం లేకపోయినా, కొద్ది రోజులు పదమూడేళ్ళ మనమడు అభినవ్‌తో గడపాలన్న ఇష్టంతో ఈసారి బయలుదేరారు.
పొద్దున శ్రవణ్, కోడలు వారిజ ఉద్యోగానికి, అభినవ్ స్కూల్‌కు వెళ్లిపోతే ఒంటరితనం ఎక్కువైంది. అందరూ కలిసి కూర్చోగలిగేది రాత్రి పూట భోజనాల దగ్గరే. అక్కడా మౌనమే! పాత కాలంలో భోజనం అంటే అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినే సమయం. కానీ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు కానీ, తలలు మాత్రం ఫోన్లలో వంగి ఉంటాయి. ఫోన్ల వల్ల వచ్చే నిశ్శబ్దం కంటే, మనుషుల మధ్య పెరిగిన ‘దూరం’ వల్ల వచ్చే మౌనం ఎంత భారంగా ఉంటుందో తెలియవచ్చింది. శ్రవణ్‌తో ఎన్నోసార్లు చెప్పాలనిపించేది. అవకాశమే కలిసి రాలేదు. ఈ రకం వాతావరణం చూడడానికా నేను వచ్చింది? అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు.
కనీసం తన వైపునుండీ ప్రయత్నం చేయాలనిపించి ఒక రోజు సాయంత్రం తన చిన్నప్పటి జ్ఞాపకాలను అభినవ్‌తో పంచుకోవాలని ఆశగా పిలిచారు. “ఒరేయ్ అభి, మా చిన్నప్పుడు వాన పడితే..” అని మొదలుపెట్టారు. అభి ఫోన్ చూస్తూ, “ఒక్క నిమిషం తాతా, ఇన్‌స్టాలో ఒక రీల్ చూస్తున్నా” అన్నాడు. ‘వీడికి ఫోన్ మీద ఉన్న శ్రద్ధ నా మీద లేదు’ అనుకుంటూ లోలోపల బాధపడ్డారు.
శ్రవణ్ నాన్నఇక్కడ అందరినీ కలిస్తే బాగుంటుందనిపించి ఒక గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాడు. అందులో శ్రవణ్ ప్రెండ్స్‌ను, కొందరు బంధువులను కలవచ్చునని రాఘవరావుకి చాలా సంతోషం వేసింది.. అందరూ వచ్చారు. పరిచయాలయ్యాక కొద్దిసేపు మాటలయ్యాయి. తర్వాత పెద్దవారు మాట్లాడాలని ప్రయత్నిస్తే ఎదుటివారు సెల్ఫీ తీసుకోవడం, మళ్ళీ మాట మొదలుపెట్టగానే “ఒక్క ఫోజ్ ప్లీజ్” అనడం.. ఏమిటో ఒక్కసారిగా అందరూ బిజీగా ఉన్నట్టు అనిపించింది. గమనిస్తే అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. అభిని పిలిచారు. “వుండు తాతయ్యా ఈ ఫొటోలు వెంటనే స్టేటస్లు పెట్టాలి” అని తుర్రుమన్నాడు!
స్టేటస్‌లో పెట్టడం అంటే అర్థం కాలేదు ఆ క్షణాన.
ఆ రాత్రి రాఘవరావు గారికి ఒక విషయం అర్థమైంది తనలాటి పాతతరం వారికి మాటలు కలిపి దగ్గరితనాన్ని పెంచే ‘స్పర్శ’ ముఖ్యం అయితే ఈ తరానికి ‘స్క్రీన్’ అని! రెండురోజులు మౌన౦గా ఉన్నారు. ‘వూరికి వెళ్లిపోతాన’ని శ్రవణ్‌తో చెప్పాలనుకున్నారు. శ్రవణ్ మీటింగ్స్ అంటూ బిజీగా ఉన్నాడు.
ఆ రోజు తాత తన పర్సులో నాన్నమ్మ ఫోటో చూస్తూండడం చూసి “తాతా ఆ ఫోటో ఒకసారి ఇవ్వవా?” అని అడిగాడు అభి.
“ఈ ఫోటో విలువ నీకేమి తెలుసు?” అని ఆయన అంటూ౦డగా అభి సడన్‌గా పర్సు లాక్కోని మేడ పైకి పరిగెట్టాడు. కానీ మళ్ళీ పది నిముషాలలో పర్సు వెనక్కి ఇవ్వగానే తెరిచి ఫోటో తడిమి చూసుకున్నారాయన.
మర్నాడు అభి తన స్మార్ట్‌ఫోన్ తాత ముందుకు చాపాడు.
“తాతయ్యా.. ఒక్కసారి చూడవా?” అన్నాడు.
అందులో.. స్క్రీన్ మీద చూస్తే వెలిసిపోయిన భార్య ఫోటో ఇప్పుడు ‘లైవ్ ఫోటో’లా మారి ఉంది. ఆ ఫోటోలో భార్య కళ్ళు ఆడిస్తూ, నవ్వుతూ ఎదురుగా ఉన్నట్టు అనిపించింది రాఘవరావుకు. జ్ఞాపకానికి శ్వాస వచ్చినట్టయ్యింది. రాఘవరావు గారి చేతులు స్వల్పంగా వణికాయి.
నమ్మకం కుదరక స్క్రీన్‌పై వేళ్లను మెల్లగా ఉంచారు. ఆ స్పర్శలో ఆయనకు భార్య చేతి వెచ్చదనం తాకినట్టనిపించింది.
ఆ క్షణంలో కాలం వెనక్కి తిరిగినట్టయ్యింది పాత ఇంటి మెట్ల దారులు.. భోజనాల దగ్గర నవ్వులు.. అన్నీ ఒక్కసారిగా సినిమాలా ముందుకొచ్చాయి. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి.
“ఇది నిజమా అభీ” అంటూ మరోమారు ఆ ఫోటో ని స్పృశించారు.
అభిని దగ్గరకు తీసుకుని “నిజంగానే నాన్నమ్మ ఎదురుగా నిలబడి ఉన్నట్టుంది రా..” అన్నారు.
“తాతా, చూశావా నేను ఫోను చూస్తూంటే విసుగు వచ్చేది. అదే ఫోను లోని టెక్నాలజీ ఈరోజు నానమ్మను ఇలా నీ ముందుకు తెచ్చింది, ఇప్పుడు చెప్పు నీ సంతోషానికి నా ఫోనే కారణం కదా” అని గర్వంగా చెప్పాడు. “నీ ఫోన్లో ఇంత టెక్నాలజీ దాగుందని నాకు తెలియదురా నాన్నా” అని రాఘవరావు గారు మనవడిని గట్టిగా హత్తుకున్నారు. ఒక నిముషం తర్వాత
“నన్ను క్షమించు రా.. మన మధ్య దూరం పెంచేది ఫోన్లు అనుకున్నాను. కానీ ప్రేమ ఉంటే, ఏ యంత్రమైనా మనుషుల్ని కలిపే వారధి అవుతుంది అని ఈ వయసులో ఈరోజు నేర్చుకున్నాను.”
ఆ గదిలో ఇక నిశ్శబ్దం లేదు.
అక్కడ స్క్రీన్ వెలుగు మాత్రమే కాదు.. హృదయాల మధ్య వెలిగిన అనుబంధ కాంతి ఉంది.
ఆ గదిలో ఇప్పుడు నిశ్శబ్దం లేదు.. ఒక తీయని అనుబంధం ఉంది.
