Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రిటర్న్ గిఫ్ట్

[వసుంధర గారు రచించిన ‘రిటర్న్ గిఫ్ట్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

అడుసు-

కొందరు చూసుకోకుండా తొక్కుతారు.

కొందరు కావాలనే తొక్కుతారు.

ఎలా తొక్కినా బురద కడగాలి కదా! ఆ కడగడంలోనే రాజకీయరంగంతో నేరసామ్రాజ్యం అనుసంధానమౌతుంది.

ఇది సమాజంలో సామాన్యుల అవగాహనకందదు. కానీ రాజకీయాల్లో సామాన్యులక్కూడా నిత్యజీవితసత్యం.

ఆ సత్యాన్ని వ్రతంగా స్వీకరించినవారి రిటర్న్ గిఫ్టులతో నడిచే సమాజం పురోగతి ఎలా ఉంటుంది?

తెలుసుకుందుకు ఓ చిన్ని ప్రయత్నం ఈ కథ.

***

బాపన్న, చెవులయ్య సామాన్యులు కారు. సమాజంలో సమఉజ్జీలు.

బాపన్న అధికార జాగిలం పార్టీలో ఓ అగ్రనేత. చెవులయ్య ప్రతిపక్ష మకరం పార్టీలో ఓ అగ్రనేత.

రెండు పార్టీలూ నిప్పూఉప్పూ. అందువల్లనేమో ఆ ఇద్దరిమధ్యా పచ్చగడ్డేస్తే భగ్గుభగ్గు.

బాపన్నపై అవినీతి ఆరోపణలొచ్చినా, వాళ్లింట్లో విషాదం జరిగినా- చెవులయ్య ఇలాకాలో పండగే పండగ.

చెవులయ్య విషయంలో బాపన్న ఇలాకాలోనూ డిటోడిటో.

అలాంటిది మూడు వారాల క్రితం జరిగిందా విశేషం!

అదేంటంటే..

బాపన్న కూతురు సులేఖ అందమైనది, చదువుకున్నది.

ఆమె తెలివైనది కూడా అనడానికి నిదర్శనం- యోగేష్‌ని ప్రేమించడం.

యోగేష్‌ని ఆమె పక్కనుంటే – మరీ దొండపండుకి కాకిముక్కులా తోచకపోయినా – అందంలో ఆమెకు ఏమాత్రం సాటి రాడనిపిస్తుంది.

ఆ మాట ఇంట్లో ఆమె తల్లి, చెల్లి అన్నారు. ఆమె స్నేహితురాండ్రూ అన్నారు.

‘అందం కొరుక్కు తింటామా?’ అంది సులేఖ.

ఆ ఒక్క మాట నచ్చింది ఆమె తండ్రి బాపన్నకి.

అంతగా అవసరమైతే ఏ ఎప్‌స్టెయిన్నో పట్టుకుని అందాన్ని కొనుక్కు తినొచ్చుకదా అనుకుంటాడాయన.

ఆయనకిష్టమైనది సమాజాన్ని కొరుక్కు తినడం. అందుకు సింహంలా సింగిల్‌గా వెళ్లాలనుకోడు. తోడేళ్లలా గుంపుగా వెడతాడు. అతడి పార్టీ సింబల్ జాగిలమైనా- బొమ్మ పోలికలు తోడేలుకి దగ్గర్లోనే ఉండడం కాకతాళీయం కాదు.

యోగేష్ తండ్రి పశుపతి డబ్బు, హోదాలో బాపన్నని మించినవాడు. సమాజాన్ని కొరుక్కు తినడానికి తగిన సహచరుడు.

కన్నబిడ్డలకంటే ఎక్కువగా తన భవిష్యత్తునే పట్టించుకుంటాడు కాబట్టే- బాపన్నకి కూతురి నిర్ణయం నచ్చింది.

సులేఖ ప్రేమకు వత్తాసు పల్కడమే కాదు- ఆలస్యం అమృతం విషం అనుకుంటూ- వెంటనే పశుపతిని కలిశాడు.

పశుపతి కూడా బాపన్నని తక్కువగా చూడలేదు. ‘వచ్చినవాడు ఫల్గునుడు’ అన్న భావాన్నే ప్రకటించాడు.

రెణ్ణెల్లక్రితం వైభవంగా యోగేష్‌కీ, సులేఖకీ నిశ్చితార్థం వేడుక- అదే పెళ్లి అన్నంత ఘనంగా జరిగింది.

అసలే అర్జునుడు. ఆపైన పాశుపతాస్త్రం. ఇక రాజకీయాల్లో బాపన్నకు తిరుగుండదని ఊరంతా కోడై కూసింది.

కానీ దురదృష్టం –

వైభవంగా రాజసూయం చేసిన పాండవులు – స్వయయంకృతాపరాధంతో అవమానాల పాలై – ఇంద్రప్రస్థ వైభవాన్ని కోల్పోయి అరణ్యవాసానికి వెళ్లారు.

స్వయంకృతాపరాధం లేకపోయినా – బాపన్న ఇంట్లోనూ విషాదానికి తావొచ్చింది.

నెల్లాళక్రితం యోగేష్ వ్యాపార రీత్యా ఇటలీ వెడుతున్నాడు. అనుకోకుండా అతడి విమానం ప్రమాదానికి గురైంది.

నిశ్చితార్థపు పెళ్లికొడుకు- పెళ్లిపీటలు ఎక్కకుండానే నిర్యాణం చెందాడు.

ఆ వార్త వింటూనే షాక్ తిన్న సులేఖ కుప్పలా కూలిపోయింది.

ఆడపిల్ల!

ప్రేమించేముందు కాస్త ముందూ వెనకా ఆలోచించినా – ఆ ప్రేమకు అటూఇటూ కూడా అందరి ఆమోదం లభించేసరికి, మనసుని పూర్తిగా యోగేష్‌తో నింపేసుకుంది. అతడి సమక్షంలో స్వానుభవమైన స్వీట్ నథింగ్స్ – ఆమెను కలల ప్రపంచానికి పరిమితం చేశాయి. ఆమెకిక భావి జీవితమంటే యోగేష్, యోగేష్, యోగేష్!

యోగేష్ అకాలమరణం ఆ భావిని శూన్యం చేసేసింది.

సులేఖని హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ఐసియులో మూడు రోజులుందామె. తర్వాత మామూలు మనిషి కావడానికి మరో నాలుగు రోజులు!

అప్పుడు మొదలైంది పరామర్శల పర్వం.

మంచికో చెడ్డకో- మన సంప్రదాయంలో చాలామంది ఖచ్చితంగా పాటించేది పరామర్శ పేరిట ఓదార్పు!

ఒకోసారి అది మండువేసవిలో చన్నీటి వానజల్లులా అలరించినా- ఒకోసారి మూలిగే నక్కకి తాడిపండూ కాగలదు.

పైగా కొందరు ఓదార్చుతుంటే- ఇల్లు కాలిపోతున్న మంటల్లో చుట్టంటించుకుందుకొచ్చినట్లుంటుంది.

ఐతే బాపన్నకి అభినందనలే తప్ప ఓదార్పులు నచ్చవు.

ఠాగూర్ సినిమాలో చిరంజీవికి ‘క్షమించడం’ అన్న పదం నచ్చనట్లు- తనకు ఓదార్పు నచ్చదని ఆయన ఓ సందర్భంలో ఓ అనుచరుడితో అన్నాడు. అతగాడు వెంటనే, ‘భలే డైలాగ్ సార్! సోషల్ మీడియాలో పెడదాం. చిరంజీవి పేరెత్తి నప్పుడల్లా, జనం మిమ్మల్నీ తల్చుకోవాలి’ అని తెగ ఉత్సాహపడ్డాడు. అప్పుడు బాపన్న, ‘రాజకీయాల్లో అలా దేనికీ కమిటైపోకూడదు. ఏమో, ఏదో రోజున మనమే జనం మధ్యకు ఓదార్పు యాత్రకి వెళ్లాల్సొస్తే! ఈ వీడియో చూపించి జనం మనల్ని ఆట పట్టించరూ!’  అని అతణ్ణి వారించాడు.

‘ఆట పట్టించడానికి ఇప్పుడున్న పాత వీడియోలకి కొరతా?’ అనలేదు అనుచరుడు. జనం నవ్వుకుంటారని నోటిని అదుపు చేసుకునే రోజులు ఎప్పుడో పోయాయని బాపన్నకి తెలియదని అతడనుకోడు.

అదీకాక రాజకీయాల్లో ఓదార్పు కూడా స్టేటస్ సింబల్! ఎంతమందొస్తే అంత గొప్ప. వచ్చినవాళ్లు ఎంత గొప్పయితే అంత గొప్ప! ఫాలాక్షుడికి నీలకంఠంలా ఓదార్పూ అక్కడ ఓ ఆభరణమే!

బాపన్నకు నచ్చినా, నచ్చకపోయినా – విధేయులూ, కానివారూ కూడా- సులేఖనీ, బాపన్ననీ ఓదార్చడానికి బారులు తీరారు. అది మామూలే!

కానీ విధేయులు కానివారిలో చెవులయ్య కూడా ఉంటే అది మామూలు విషయమా?

యోగేష్ విమానప్రమాదంలో కాక ఏ కారు ప్రమాదంలోనో పోయుంటే, దాన్ని చెవులయ్యకి ముడిపెట్టే అవకాశమున్న రాజకీయ పరిస్థితి. జరిగిందానికి చెవులయ్య పండుగ చేసుకునే మనఃస్థితి. కానీ అనూహ్యంగా ఇప్పుడీ సానుభూతి!

చెవులయ్య అనుకోకుండా అడుసు తొక్కలేదు కదా అని ఒక్కరనుకోలేదు. అయినా అందుకు ఆస్కారమేదీ?

“మన పార్టీలు వేరు కావచ్చు. పంథాలు వేరు కావచ్చు. కానీ కష్టాల్లో మనంమనం ఒక్కటే!” అన్నాడు చెవులయ్య తన రాకకు ఆంతర్యాన్ని బాపన్నకు సూచిస్తూ.

ఆశ్చర్యంగా దానికి బాపన్న కూడా, “సుఖసంతోషాల్లో ఎవరైనా కలుపుతారు భుజం. పార్టీలు, పంథాలు- వాటి ఇజాలు వేరైతేనేం- ఇలాంటప్పుడు పక్కన నిలబడ్డమే హ్యూమనిజం.  ఈ కలయిక నాకు గొప్ప గిఫ్టు” అంటూ సానుకూలంగా స్పందించాడు. అంతేనా – ఆయనతో భుజం కలిపి సెల్ఫీ కూడా తీసుకున్నాడు.

ఆ దృశ్యం అన్ని టీవీ చానెల్సుకీ పోస్టరై, ఒకరోజంతా పదేపదే దర్శనమిచ్చింది ఊరూవాడా.

చెవులయ్య పార్టీ మారతాడా అన్న ఊహాగానాలూ మొదలయ్యాయి.

కానీ, చెవులయ్య ముందుగానే జాగ్రత్త పడ్డాడు, “ఇది మా మకరం పార్టీ సంస్కారానికి సంబంధించిన చిన్న విషయం! అంతకుమించి దీన్ని భూతద్దంలో చూడొద్దు” అని మీడియాకి వివరణ ఇచ్చాడు.

“చెవులయ్య ఏదో పెద్ద ప్లానుమీదున్నాడు. పార్టీలో చేరనిచ్చారో మీకే ఎసరెట్టేస్తాడు. చటుక్కున నమ్మెయ్యకండి. ముందు జాగ్రత్తకి చెబుతున్నాను” అని ఆ రాత్రే బాపన్నని హెచ్చరించింది భార్య కౌసల్య.

“అలా అందర్నీ అనుమానించకూడదు. చెవులయ్య గిఫ్టిచ్చాడు. కాదనకూడదు. మా ఇద్దరి సెల్ఫీకీ కాపీ తీయించి ఫ్రేం కట్టి బెడ్రూంలో మన డ్రెస్సింగు టేబులుమీద పెట్టుకుంటా. అది నాకు ఇన్‌స్పిరేషన్” అన్నాడు బాపన్న.

ఇన్‌స్పిరేషన్ దేనికీ అనడగలేదు కౌసల్య.  ఆయన్ను తక్కువ అంచనా వెయ్యకూడదని తెలుసామెకి.

మర్నాటికల్లా బాపన్న-చెవులయ్యల భుజం-భుజం సెల్ఫీ బెడ్రూంలో డ్రెస్సింగ్ టేబుల్ పైన ఫ్రేం కట్టుకుని వెలసింది….

తర్వాతి కథకి నేపథ్యం మూడు ఫోన్ కాల్సు.

మొదటికాల్

“నేను- కిషోర్ని మాట్లాడుతున్నా. ఎలాగున్నావ్ సూర్యం?”

“హాస్పిటల్నించి డిశ్చార్జయి మూడ్రోజులైంది. బాగానే ఉన్నానండి”

“డాక్టరిచ్చిన డిశ్చార్జి సర్టిఫికెట్లో ఏం రాశాడు?”

“మతి చెదిరి హాస్పిటల్లో చేరిన నన్ను నెల్లాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాననీ, అప్పుడప్పుడు తలతిక్క పన్లు చేసినా, నావల్ల ఎవరికీ ప్రమాదముండదనీ, మామూలుగా బయట తిరగొచ్చనీ రాశాడాయన”

“గుడ్! నువ్వెప్పుడు బయట తిరిగినా ఆ సర్టిఫికెట్ జేబులో ఉంచుకో”

“సరేనండి!”

“ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. ఈ సాయంత్రం ఆరింటికి రెయిన్‌బో పార్కుకెళ్లు. చెవులయ్య కూతురు వందన తెలుసుగా. ఆ టైముకి అక్కడుంటుంది. నువ్వా అమ్మాయిని కత్తితో బెదిరించి కిడ్నాప్ చెయ్యాలి”

“అది బిజీ టైం. జనం ఎక్కువుంటారు. వీలౌతుందా?”

“జనం సంగతి నీకు కొత్తా, నాకు కొత్తా! చాలామంది చోద్యం చూస్తారు. పిరికివాళ్లు భయపడి ఆమడ దూరం వెడతారు.  ధైర్యవంతులు మొబైల్సులో విడియో తీస్తారు. నిన్నడ్డుకునేవాళ్లొక్కరుండరు”

“ఉంటే?”

“నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఐతే ఆ ప్రయత్నంలో ఆ అమ్మాయికి చిన్న గాయమైనా అవకూడదు. అది ముఖ్యం”

“అలా ఎలా? అప్పుడా అమ్మాయే నన్ను కరిచేసి పారిపోవచ్చు”

“ఆ వందన ఉత్త పిరిగ్గొడ్డు. నువ్వు కత్తి చూపించగానే మూర్ఛపోయినా ఆశ్చర్యం లేదు”

“ఇంతకీ కిడ్నాప్ చేసి ఆ అమ్మాయినెక్కడికి తీసుకెళ్లాలి?”

“ముందు కిడ్నాప్ కార్యక్రమం మొదలెట్టు. తర్వాత కథ దానంతటదే నడుస్తుంది”

ఫోన్ కట్‌చేసి మొబైల్లోంచి సిమ్‌కార్డు తీసి సిగర్‌లైటరుతో అంటించేశాడు కిషోర్.

రెండో ఫోన్ కాల్

“హలో, నేను ప్రమీలని. బాగున్నావా సరోజా!”

“నువ్వేం చెప్పినా చెయ్యడానికి సరిపడంత బాగానే ఉన్నాలే! మేటర్ చెప్పు”

“గుడ్! వందనతో ఫ్రెండ్‌షిప్ ఎలాగుంది?”

“పెద్దింటమ్మాయి. స్నేహం లాభసాటిగానే ఉంది?”

“వెరీగుడ్! ఈ సాయంత్రం ఆరు దాటకుండా నువ్వు వందనని రెయిన్‌బో పార్కుకి తీసుకెళ్లాలి”

“ఎందుకు?”

“నో క్వెశ్చన్స్! చెప్పింది గుర్తుపెట్టుకో!”

ఫోన్ కట్‌చేసి మొబైల్లోంచి సిమ్‌కార్డు తీసి ముక్కలుముక్కలు చేసింది ప్రమీల.

మూడో ఫోన్ కాల్

“నేను, రాఘవని మాట్లాడుతున్నా. ఎలాగున్నావ్‌రా శంకర్!”

“ఇప్పటిదాకా బాగానేఉన్నా. తర్వాతది నువ్వు చెప్పేదానిమీద ఆధారపడుంటుంది”

“ఐతే నీకు గుడ్‌న్యూస్! ఈరోజు నీకు చాలా మంచిపని అప్పజెబుతున్నా”

“నీకు మంచనిపించింది నాకూ మంచిదవాలనేముందిలేకానీ, చెప్పు!”

“ఈ సాయంత్రం ఆరింటికి రెయిన్‌బో పార్కులో ఓ అమ్మాయిమీద కిడ్నాప్ అటెంప్టుంది. అది నువ్వాపాలి!”

“కిడ్నాపరెవరు?”

“అది నీకనవసరం. టైమ్ ఆరవకుండా నువ్వు పార్కుకెళ్లు. వందనని స్పాట్‌చెయ్యి. సీను జాగ్రత్తగా వాచ్‌చెయ్యి. ఇంకెవరూ కిడ్నాప్ ఆపరని తోచేదాకా ఆగి అప్పుడు రంగంలోకి దూకు”

“కిడ్నాపరెవరో తెలియకపోతే, నా ప్రాణాలకు ప్రమాదమేమో!”

“నీ ప్రాణాలకేం ప్రమాదంలేదని నాదీ గ్యారంటీ. సరేనా?”

ఫోన్ కట్‌చేసి మొబైల్లోంచి సిమ్‌కార్డు తీసి ఓ గ్లాసులో వేసి దానిమీద యాసిడ్ పోశాడు రాఘవ.

తర్వాతి కథ

రెయిన్‌బో పార్కులో ఏడు రంగుల కొయ్యబల్ల. దానికి అటూఇటూ విరబూసిన గులాబిమొక్కలు.

సాయంత్రం ఆరుకి కాస్తముందు- సరోజ, వందన వచ్చి కూర్చోగానే- ఆ బల్లే విరబూసిన గులాబిలా మారిపోయింది.

వాళ్లిద్దరూ కబుర్లు మొదలెడితే- నెమళ్లు కోయిలల్లా పాడుతున్నట్లుంది.

అంతలో బెంచి వెనుకనుంచి కాలనాగులా లేచి నిలబడ్డాడు సూర్యం. ముందుకొచ్చిన అతడి చేతిలో కాలనాగు కోరలా మెరుస్తున్న బాకు. అది శంఖంలాంటి వందన మెడకు అతిదగ్గర్లో ఉంది.

‘తప్పుకో’ అన్నాడతడు సరోజతో. బుస్సుమన్న ఆ స్వరానికి అదిరి అప్రయత్నంగా పక్కకు జరిగింది సరోజ.

‘లేచి నాతోరా’ అన్నాడతడు వందనతో. మళ్లీ బుస్సుమన్న ఆ స్వరానికి బెదిరి అప్రయత్నంగా లేచినిలబడింది వందన.

బల్లకటూఇటూ ఉన్న ఆ ఇద్దరూ నాలుగడుగులేసి బల్ల అడ్డు తొలగించుకున్నారు.

అతడామెను పార్కు వెనక్కీ నడిపిస్తుంటే ఉన్నట్లుండి, “హెల్ప్” అని అరిచింది సరోజ.

దగ్గర్లోని సామాన్యులు చోద్యం చూస్తున్నారు. పిరికివాళ్లు ఆమడదూరం వెళ్లారు. ధైర్యవంతులు విడియోకి మొబైల్సు సిద్ధం చేస్తున్నారు.

అంతలో సూర్యం వెనుక శంకర్ ప్రత్యక్షమయ్యాడు. అతడి రెండుచేతుల్నీ గట్టిగాపట్టి వెనక్కిలాగాడు.

శంకర్ కిందపడ్డాడు. అతడిపై పడ్డాడు సూర్యం. వందన ముందుకి పరుగెత్తబోయి నాలుగడుగులు పడగానే భయంతోనో ఏమో కుప్పకూలింది.

కాసేపు శంకర్-సూర్యం పెనుగులాట. సులభంగానే శంకర్ సూర్యంనుంచి బాకును వేరు చేశాడు. అప్పటికి ప్రేక్షకుల్లో చలనం కలిగి అతడికి సాయమొచ్చారు. సూర్యాన్ని పోలీసులకి అప్పగించారు…

చూపించిందే పదేపదే చూపిస్తూ రోజుకి ఇరవైనాలుగు గంటలు కాలక్షేపం చెయ్యడానికి తాపత్రయపడే మీడియాకి- ఇలాంటి ఘటనలు గొప్ప ఆసరా. వాళ్లు ఆరాలు మొదలెట్టారు.

సహజంగా అనుమానం ముందు బాపన్నమీదకి వెళ్లింది.

కానీ ఇటీవలే చెవులయ్య బాపన్న ఇంటికెళ్లి మరీ స్నేహహస్తం చాపాడు. ఆ ఫొటో మరోసారి టివి ఛానెళ్లలో పలుమార్లు ప్రసారమై- ఆ అనుమానానికి చెక్ పెట్టింది.

రాజకీయాల్లో పండిన బాపన్న తీరికూర్చుని ఎందుకు చెవులయ్య జోలికెడతాడు?

ఇక కిడ్నాపరు విషయానికొస్తే, సూర్యం రౌడీషీటరు కాదు. అతడికి క్రిమినల్ రికార్డు లేదుకానీ సైకలాజికల్ ప్రోబ్లమ్సు ఉన్నాయి. ఏడాదికి మూడు నాలుగుసార్లు క్లినిక్‌లో చేరి అవసరాన్నిబట్టి వారాలో నెలలో గడిపొస్తుంటాడు.  అప్పుడప్పుడు తలతిక్కగా ప్రవర్తించినా, ఎవరికీ ప్రమాదకారి కాదన్న డాక్టర్ సర్టిఫికెట్ ఒకటి అతడి జేబులో ఉంది.

“అతడికి ప్రాంక్స్ చేసి రీల్సు చెయ్యడం ఇష్టం. కానీ పద్ధతిగా నిర్వహించలేడు. ప్రాంక్స్ వద్దని గట్టిగానే హెచ్చరించాను. సరేనన్నాడుకానీ, ఒకోసారి తనమీద తనకే అదుపుండదతడికి. వందన కిడ్నాప్ ప్రయత్నం ప్రాంక్ అని నా అభిప్రాయం. లేకుంటే వందన, అతణ్ణెదిరించిన శంకర్‌- చిన్న గాయమైనా లేకుండా బయటపడగలరా? అదీకాక వందనని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏంచెయ్యాలోకూడా అతడు ప్లాన్ చేసుకోలేదు” అన్నాడు అతడికి చికిత్స చేస్తున్న డాక్టరు.

మున్ముందు అతడితో ఎలా డీల్ చెయ్యాలన్నది పోలీసుల సమస్య.

మీడియా ఆ సంఘటనని మూడునాలుగు రోజుల్లో వదిలేసింది.

కానీ జరిగిన ఘటనకు వందన షాక్ తింది. చెవులయ్య ఆమెను హాస్పిటల్లో చేర్చాడు. మామూలు మనిషి కావడానికి ఆమెకు వారం పట్టింది.

వందన ఇంటికొచ్చేక, ఆమెనీ చెవులయ్యనీ ఓదార్చడానికి బంధుమిత్రులూ, అనుచరులూ వగైరా వగైరాలంతా వచ్చారు.

వారిలో బాపన్న కూడా ఉన్నాడు.

ఇద్దరూ ఒకర్నొకరు కౌగలించుకుని సెల్ఫీలు తీసుకున్నారు.

‘బాపన్న, చెవులయ్య కలిసిపోవడం ఇక ఫార్మాలిటీయేనా’- అన్న కేప్షనుతో- ఆ దృశ్యం అన్ని టీవీ చానెల్సుకీ పోస్టరై, ఒక రోజంతా పదేపదే దర్శనమిచ్చింది.

***

రాత్రి తొమ్మిదికి పడకగదిలో మంచంమీద జారగిలబడి కూర్చుని టివిలో వార్తలు చూస్తున్నాడు బాపన్న.

అప్పుడే ఇంటిపన్లు ముగించుకొచ్చిన ఆయన భార్య కౌసల్య, ముఖానికి కోల్డ్‌క్రీమ్‌ రాసుకుందుకు డ్రెస్సింగుటేబులు దగ్గరికెడితే అక్కడ బాపన్న-చెవులయ్యల పాత ఫ్రేం పక్కన తాజా ఫొటోకూడా మరోఫ్రేంలో వెలసింది.

ఆమె చటుక్కున భర్తవద్దకొచ్చి, “ఉన్నట్లుండి మీకా చెవులయ్యమీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది- కొంపదీసి నిజంగానే పార్టీ మారుతున్నారా?” అంది.

“పార్టీ మారడమా, నేనా? అదీ చెవులయ్య ఉండే పార్టీకి!” అన్నాడు బాపన్న.

“మరైతే, ఆయనతో ఈ సెల్ఫీలేమిటీ- మీకంత ముఖ్యమైపోయాయ్” అందామె

“ఓహ్ అదా! నా పోలసీ నీకు తెలుసుగా ఎవరైనా నన్నోదార్చితే, తిరిగి వాళ్లని ఓదార్చేదాకా నాకు నిద్రపట్టదు. అందుకు ఏమైనా చేస్తాను”

“ఐతే?”

“మొదటి ఫొటో చెవులయ్య నాకిచ్చిన గిఫ్టు. రెండో ఫొటో నేను వాడికిచ్చిన రిటర్న్ గిఫ్టు” అన్నాడు బాపన్న.

***

అడుసు-

కొందరు చూసుకోకుండా తొక్కుతారు.

కొందరు కావాలనే తొక్కుతారు.

ఎలా తొక్కినా బురద కడగాలి కదా! ఆ కడగడంలోనే రాజకీయరంగంతో నేరసామ్రాజ్యం అనుసంధానమౌతుంది.

ఇది సమాజంలో సామాన్యుల అవగాహనకందదు. కానీ రాజకీయాల్లో సామాన్యులక్కూడా నిత్యజీవితసత్యం.

ఆ సత్యాన్ని వ్రతంగా స్వీకరించినవారి రిటర్న్ గిఫ్టులతో నడిచే సమాజం పురోగతి ఎలా ఉంటుంది?

జవాబు ఈ కథలో ఉందో లేదో పాఠకులే చెప్పాలి..

Exit mobile version