Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రోబో చేసిన మేలు

[బాలబాలికల కోసం ‘రోబో చేసిన మేలు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

నాకు చిన్నప్పటినుండి అగ్గి పెట్టలతో రైలుబొమ్మ చేయడం, పనికి రాని చిన్న పాకింగ్ పెట్టలతో అందమైన బొమ్మ ఇళ్ళు కట్టడం ఇంకా ఇలాంటివి ఎన్నో చేయడం హాబీ.

ఇప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇంజనీరింగ్ చదివి మంచి రోబోటిక్ ఇంజనీర్ అవ్వాలని నా కోరిక.

మా మామయ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి జర్మనీకి వెళ్ళి రోబో టెక్నాలజీలో స్పెషల్ ఇంజనీరింగ్ కోర్సు చేసాడు.

మన దేశానికి వచ్చినపుడల్లా నాకు బోలెడు రోబో కబుర్లు, అవి మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగ పడతాయో చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచేవాడు.

“మరలా సంవత్సరం తరువాత వస్తాను. అప్పుడొక రోబో తెస్తాను, అది మనకు సంఘానికి ఉపయోగపడేట్టు తయారు చేస్తాను” చిరునవ్వుతో చెప్పాడు మామయ్య.

మామయ్య మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఇక ఎప్పుడప్పుడు సంవత్సరం రోజులు గడుస్తాయా అని ఎదురు చూడసాగాను.

మామయ్య రోబో టెక్నాలజీ గురించి వాటి ఉపయోగాల గురించి నాకు వారం వారం సందేశాలు పంపుతుంటే ఎప్పుడప్పుడు రోబోని చూద్దామా దానిని తాకుదామా అనే ఉబలాటం నాలో పెరిగి పోసాగింది!

అలా ఊహిస్తుండగానే గిర్రున సంవత్సరం తిరిగిపోయింది.

మామయ్య జర్మనీనుండి వచ్చాడు. ఆయనతో పాటు ఓ పెద్ద పెట్టెను తీసుకువచ్చాడు.

“అరేయ్ కిట్టూ, నీవు ఎదురు చూస్తున్న రోబోని తెచ్చాను” అని పెట్టెను తెరిస్తే రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు వైర్లు అందులో ఉన్నాయి. ఇదేమి రోబో అని ఆశ్చర్యపోయాను.

నా ఆశ్చర్యం గమనించి మామయ్య “ఈ పార్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం కలిపితే మనమనుకున్న రోబో తయారు అవుతుంది” చెప్పేసరికి అవన్నీ ఎప్పుడు  కలుపుతాడో  అనే ఆసక్తి నాలో పెరిగి పోయింది.

“చూడు కిట్టూ, అన్నీ బిగించి రోబోకి ఒక రూపుతెచ్చి దాని బ్యాటరీని ఆక్టివేట్ చేస్తాను. అది అప్పుడు హుషారుగా పని చేస్తుంది” చెప్పాడు మామయ్య.

మామయ్య బోలెడు వైర్లు ఒకదానికొకటి కలిపాడు, సెన్సార్స్ ఉన్న కన్నుల లాటి వాటి రోబో మొహంలో అమర్చాడు. దాని చేతులు కాళ్ళు మనం చెప్పే కమాండ్స్‌కి అనుగుణంగా కదిలేటట్లు ప్రొగ్రామ్ చేసాడు! దాని కడుపులో కంప్యూటర్ లాటి అమరికలు కూడా ఉన్నాయి.

అంతా అయ్యాక దానికి టేబుల్ మీద ఉన్న కప్పులు, గిన్నెలు తీసుకుని తన దగ్గరకు రమ్మన్నాడు. అది వింతగా నడుస్తూ కప్పులు గిన్నెలు తెచ్చింది.

“ఇటువంటి పనులేకాదు అందరికీ ఉపయోగ పడే విధంగా దీనిని మార్చాలి” అని మామయ్య ఆలోచించసాగాడు.

“రాత్రికి ఆలోచించి రేపు ప్లాన్ చేద్దాం” అని తన గది లోకి వెళ్ళాడు.

పొద్దున మామయ్య టిఫెన్ చేసాక  రాత్రి తనుచేసిన ఆలోచన వివరించాడు.

“కిట్టూ టెక్నాలజీ అనేది ఫన్ కోసం కాదు అది సంఘానికి మేలు చేయాలి అందుకే నేను చేసిన రోబోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) కూడా జోడించాను. దానికి కొన్ని సందేశాలు అందిస్తే బాంకులకు, అడవికి సంబంధించిన సెన్సార్లకు కలిపితే అది దొంగలను, అడవిలో ఎర్రచందనం దొంగలను గుర్తించి పోలీసులను అలర్ట్ చేయగలదు అది మన రోబో చేసే మేలు.”

మామయ్య మాటలు విని ఆశ్చర్యపోయాను. ఆయన చేసిన రోబో అద్భుతం. అది చేసే మేలు అద్భుతం. సంతోషంతో చప్పట్లు కొట్టాను.

మా కాలేజీలో ఫిజిక్స్ సార్‌కి చెబితే ఆయన వచ్చి చూసి మామయ్యను ఎంతో మెచ్చుకుని కాలేజీలో అందరికీ మామయ్య చేసిన గొప్పపని చెప్పాడు. ఈ విషయం తెలిసి పోలీస్ డిపార్టుమెంటు మామయ్యని సన్మానించింది.

అప్పుడే నేను కూడా రోబో సైంటిస్టు అవ్వాలని ఎ.ఐ.లో స్పెషలైజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం చెబితే నాన్న అమ్మ, మామయ్య అందరూ మెచ్చుకున్నారు.

Exit mobile version