Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రోహిత్ వేముల కోసం!

[‘రోహిత్ వేముల కోసం!’ అనే అనువాద కవితని అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. మూలం మౌమితా ఆలం.]

~~

ఇక్కడ దేవుడేమీ ఇసుక కుప్పల మీద పడుకోడు!
మధ్య రాత్రి చలికి వణుకుతున్న
దిక్కు లేని వీధి కుక్కలు చనిపోతాయి!
వీధి దీపం దగ్గర పుట్టిన పసిపాప తల్లి
పాడైపోయిన రొట్టెను ఏరుకుంటూ ఉంటుంది!
అటు కుక్క గాని, ఇటు నవజాత శిశువు గాని
అలా ఆ తల్లి చేయడాన్ని ఏమీ అనుకోవు!
ఎందుకంటే భారతదేశం చాలా
అభివృద్ధి చెందిన దేశం కాబట్టి!
**
దేవుడికీ ఒక వంశవృక్షం ఉంది!
ఏ దేవుడికి ఉంది?
ఎవరైతే అధికారంలో ఉంటారో
వాళ్ళని బట్టి దేవుని ఎన్నిక ఉంటుంది!
**
అందరి దేవుళ్ళు ఒకటే నైజంతో ఉంటారు!
అధికార మదంతో, తమవైన
లక్ష్యాలతో కుట్రలతో, మోసాలతో ఉంటారు!
విధ్వంసాన్ని, తిరిగి కట్టడాన్ని
ఒకటే శ్వాసలో రచిస్తూ ఉంటారు!
**
కానీ ఆ వెలిగే నక్షత్రాలు మాత్రం
చిరస్మరణీయమైనవి. ఆరాధనకు నోచుకున్నవి!
ఈ భూమ్మీద మానవులే
తృణీకరించబడ్డవారుగా మిగిలిపోయారు!
**
అవును ప్రియమైన రోహిత్!
నువ్వన్నట్లు మన పుట్టుకలు
ప్రాణాంతకమైన ప్రమాదాల లాంటివే!
**
రోహిత్! గాఢాంధకారం కమ్ముకునే,
నా ఖాళీ రాత్రులలో
నిన్ను బాగా అర్థం చేసుకున్నాను!
అవును కదా!
మనమంతా కూడా
నక్షత్ర ధూళితోనేగా తయారైంది మరి?
ఏదో ఒక రోజు మనమంతా కూడా
ఈ భూమి మీద నక్షత్రాలుగా వెలిగిపోతాము!
అంతేనా?
మన దేవుళ్ళకి,
మన సొంత దేవుళ్ళకి
అందమైన మనుషుల దేవుళ్ళకి కూడా
మనము ఒక లేఖ రాస్తాం!
అచ్చం నీలాగే రోహిత్!

మూలం: మౌమితా ఆలం
అనువాదం: గీతాంజలి

~~

Notes: నక్షత్ర ధూళి పద ప్రయోగం అంటే రోహిత్ వేములకి చాలా ఇష్టం. రోహిత్ వేములకి Carl Sagan అంటే చాలా ఇష్టం. Carl Sagan ఒక రచయిత. ఆయనలాగా రోహిత్ కూడా ఎంతో రాయాలనుకున్నాడు. మంచి రచయిత కావాలనుకున్నాడు. అంతరిక్షం మన లోపలే ఉంది. మనమంతా కూడా నక్షత్ర ధూళితో తయారు కాబడ్డ వాళ్ళం! మనం ఈ అంతరిక్షాన్ని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి ఒక రహదారి లాంటి వాళ్ళం అనే Carl Sagan కోట్ అంటే రోహిత్‌కి చాలా ఇష్టం.

Exit mobile version