Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రుధిర స్వప్నాలు

[ధూళిపాళ అరుణ గారు రచించిన ‘రుధిర స్వప్నాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

క్కడ..
నెత్తుటి ముద్దల వర్షంలో తడిసి
సతత హరితాలు
ఎర్రగా మెరుస్తున్నాయి
గోడకు దిగ్గొట్టిన మేకులా
గాలి కొయ్యబారి ఆగిపోయింది
అదుపులేని శబ్ద ప్రకంపనాలు
ధరణి దేహాన్ని చీలుస్తున్నాయి
భూసారం పెటేలున పేలిపోతూ
పొగగా ఆకాశంలోతేలుతోంది

వేలప్రాణాలను ఒకేసారి తాగుతున్నా
తీరని మృత్యుదాహార్తిలో
శూన్యాన్ని శాపంగా అందిస్తూ
భీతావహంగా నవ్వుతూ
కలవరపెడుతున్న కాలం

కడుపారగ తిన్న ఆహారంతో
బలిసిన రాబందుల
రెక్కల చప్పుళ్ళ నడుమ..
గడ్డకట్టుకుపోయిన నవ్వులు
మాయమవుతున్నాయి మౌనంగా
బతుకు ఆశలు కుప్పకూలి
యుద్ధపు చీకటి కూడళ్లలో
రుధిరాన్ని స్వప్నిస్తున్నాయి

ఏ కాలపు తీరానికి చేరువగా
వేకువ వికసిస్తుందో తెలియక
బిగబట్టిన ఊపిరి కింద
చావుబతుకుల పోరాటంతో
క్షణాలను లెక్కిస్తూ
అఖాతపు అంచులకు వేలాడుతూ
అ.. ర.. ణ్య రోదన..!!!

Exit mobile version