నువ్వన్నావు నా గురించి నీకేమి తెలుసని
నేనన్నాను ప్చ్.. నాకేమి తెలియదని
నువ్వన్నావు నేనంటే నీకెందుకంత ప్రేమని
నేనన్నాను జాబిలి అంటే
ఎవ్వరికి ఇష్టముండదని
నువ్వన్నావు మరి నన్ను వదలి వెళ్ళవు కదా అని
నేనన్నాను కలలో కూడా నీ తోటే నేనని
నువ్వన్నావు ఫారిన్ ఛాన్సని రేపే ప్రయాణమని
నేనన్నాను నీ కల నిజమైందని త్వరగా తిరిగిరమ్మని
నువ్వన్నావు నాన్న మాట కాదనలేనని పెళ్ళికి తొందరని
నేనన్నాను నీ తరువాతే నాకెవరైనా అని
నువ్వన్నావు చెల్లి పెళ్లి చేయాలని కట్నం కావాలని
నేనన్నాను నా మనస్సు నీదని ధన దాహం తీరనిదని
నువ్వన్నావు తల్లితండ్రుల మాట జవదాటనని
నేనన్నాను నీమాట కాదనలేనని..
నువ్వన్నావు నిన్ను ఎన్నటికి మరువనని నా హృదయం నీదని
నేనన్నాను నీకు హృదయమే లేదని అది ఒక రుద్రభూమి అని
డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.