Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో కొత్త పరిణామాలు

[రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో – రష్యా గురించి, ఉక్రెయిన్ గురించి వివరిస్తూ అంతర్జాతీయంగా సంభవిస్తున్న కొత్త పరిణామాలను ప్రస్తావిస్తున్నారు ఆర్. లక్ష్మి.]

రష్యా ప్రత్యేకత:

సహజ వనరులు:

హజ వాయువు, చమురు, కలప, వజ్రాలు, సీసం, బాక్సైట్, నికెల్, పాదరసం, వెండి, బంగారం, రాగి వంటి అనేక సహజ వనరులకు ఆలవాలం రష్యా. ప్రపంచం మొత్తంగా ఉన్న సహజ వనరులలో రష్యాది 20 శాతం. రష్యా జాతీయ సంపదలో 95% పైగా ఈ సహజ వనరులను దేశ ఆర్థికంలో సమర్థవంతంగా వినియోగించుకోగలగడం ద్వారా సమకూరినదే.

తీరప్రాతం:

22,400 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాలతో, 37,000 కిలోమీటర్ల తీరప్రాంతంతో ప్రపంచంలోనే అది పెద్ద భూవైశాల్యం గల దేశంగా రష్యా అలరారుతోంది. పడమరన అట్లాంటిక్, ఉత్తరాన ఆర్కిటిక్, తూర్పున పసిఫిక్ మహా సముద్రాల గుండాను, దక్షిణంలో కాస్పియన్, బాల్టిక్, నల్ల సముద్రాల వరకూనూ రష్యా తీరప్రాంతం విస్తరించి ఉంది.

నదులు – జలవనరులు:

రష్యాలో సుమారు 100,000 వరకు నదులు ఉన్నాయి. వీటిలో పొడవు అధికంగా ఉన్న నదులూ ఎక్కువే. యూరప్ లోని సరస్సులలోనే అతి పెద్దవైన సరస్సులు రెండూ రష్యాలోనే ఉన్నాయి. సైబీరియాలోని ‘బైకాల్’ సరస్సు నీటి నిల్వ సామర్థ్యం ప్రపంచంలో మరే దేశంలోని సరస్సుకూ లేదు. ఏ విధంగా చూసినా రష్యా ఒక స్వయం సమృద్ధమైన దేశం అన్నది వాస్తవం.

అన్నీ విశిష్టతలే:

విస్తీర్ణంలో రష్యా కెనడా కంటే రెట్టింపు పెద్దది. యు.కె. కంటే 70 రెట్లు పెద్దది. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో రష్యా కూడా ఒకటి. రష్యా తలసరి ఆదాయం 8,748 డాలర్లు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రష్యాకు 23000 మైళ్ళ తీరప్రాంతం ఉన్నప్పటికీ సముద్రానికి నేరుగా దారి లేదు. ఉత్తర తీరమంతా అధిక భాగం ఆర్కిటిక్ వలయంలోనికి వస్తుంది. అక్కడ ఏడాది పొడవునా మంచే. సైబీరియా నివాస యోగ్యం కాని భాగం.

సెయింట్ పీటర్స్‍బర్గ్, బాల్టిక్ సముద్రతీరం నవంబర్‍లో గడ్డ కట్టి ఏప్రిల్‍లో సాధరణ స్థితికి వస్తాయి. ఆ కారణంగా ఏడాదికి 6 నెలలు అక్కడి కార్యకలాపాలన్నీ స్తంభించిపోతాయి. ‘ఓల్గా’ నది రష్యా నడుమ నుండే ప్రవహిస్తున్నప్పటికీ దాని గమ్యం కాస్పియన్ సముద్రం. పశ్చిమ తీరంలో కూడా రష్యాకు అనుకూలమైన వాతావరణం ఉండేది అయిదు ఆరు నెలలే. అక్కడ 5 డిగ్రీల ఉష్ణోగ్రతతో మిగిలిన సంవత్సరమంతా అననుకూలమే.

కానీ పడమటి యూరపియన్ దేశాలకు ఏడాదిలో 9 నెలలు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆ కారణంగా రష్యాకు పడమటి దిక్కు నుండి కవ్వింపు చర్యలూ అధికమే. 1812లో నెపోలియన్ దురాక్రమణ తరువాత అవకాశం దొరికినప్పుడల్లా ఆ దేశాలు రష్యాను అంతో ఇంతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి.

ఆ రీత్యా పడమర హద్దు భద్రత రష్యాకు చాలా కీలకమైనది. ఏమార్చడానికి ఏ మాత్రం వీలు కానిది. మధ్యధరా ప్రాంతంలో రష్యా నౌకలు/కార్గోలు కంటబడితే 8 నాటో దేశాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఏనాటి వైరమో – దాన్ని ఉపేక్షించేందుకూ వీలు లేదు. అమెరికా ఉక్రెయిన్‍ను, నాటోలో చేరే దిశగా ప్రోత్సహించడానికైనా, ఉక్రెయిన్ నాటోలో చేరడానికి సన్నద్ధం కాగానే రష్యా అంత తీవ్రంగా స్పందించడానికైనా ముఖ్యమైన కారణం అదే.

తనంత తానుగా మరొక దేశం అంతర్గత రాజకీయాలలో కలగజేసుకున్న సందర్భాలు కానీ, దేశాలపై ‘శాంతి పరిరక్షణ’ పేరుతో దాడులు జరిపిన సందర్భాలు కానీ రష్యా చరిత్రలో (ఇటీవలి) లేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

ఉక్రెయిన్:

ప్రపంచంలో అందుబాటులో ఉన్న టైటానియం నిల్వలలో 20% ఉక్రెయిన్‍లోనే ఉన్నాయి. దీనిని విమానాల తయారీలో వినియోగిస్తారు. 2021లో ఉక్రెయిన్ నుండి టైటానియం దిగుమతి చేసుకున్న దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది. రష్యా, టర్కీ కూడా ఈ వరుసలో ఉన్నాయి. లిథియం, ఇనుము, బొగ్గు వంటి భూగర్భ వనరులూ ఉక్రెయిన్‍లో అపారంగా ఉన్నాయి.

అదీ కాక, ఉక్రెయిన్‍కు చక్కటి చమురు రవాణా వ్యవస్థ ఉంది. ఆ దేశపు ఆ రవాణా రుసుము సుమారుగా 7 బిలియన్ డాలర్లు. అది ఉక్రెయిన్ జి.డి.పి.లో 4%.

2019లో రష్యా చమురు, సైబీరియా సహజ వాయువు యూరోపియన్ యూనియన్‍కు సరఫరా చేయటానికి ఉక్రెయిన్ భారీ చమురు రవాణా వ్యవస్థను వినియోగించుకునేలా ఉక్రెయిన్ రష్యాల నడుమ అవగాహనతో కూడిన ఒప్పందం కుదిరింది. ఇది అమెరికాకు ఏ మాత్రం మింగుడు పడని పరిణామం. రష్యా, ఉక్రెయిన్‍లు పరస్పర సహకారంతో ముందుకు సాగిపోతే, ఉక్రెయిన్‍కు మాట సాయం, ఆర్థిక సాయం పేరుతో రష్యా బూచిని చూపించి తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉండదు సరి కదా, రష్యా మరింత బలపడిపోవడం అనే పెను ప్రమాదానికి అవకాశం ఇచ్చినట్లే.

ఫలించని అష్టదిగ్బంధనం:

ఉక్రెయిన్‍పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ అమెరికా, యూరోపియన్ యూనియన్ – రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ లోని బ్యాంకులలో రష్యా ఖాతాలను స్తంభింపజేశాయి. మాస్టర్ కార్డ్, ఆపిల్ పే వంటి సేవలనూ నిలిపివేశాయి. ఇవే కాక మరిన్ని ఆంక్షలూ జాబితాలో ఉన్నాయి. ఈ ఆంక్షల కారణంగా రష్యా ఉక్కిరిబిక్కిరి అయితీరుతుందని ఆ దేశ జి.డి.పి. 10% కోసుకుపోతుందని నాటో దేశాలు భావించాయి. తీరా వాస్తవంలో ఆ తగ్గుదల కొంచెం అటూ ఇటూగా 2% మించలేదని ప్రపంచ బ్యాంకు అధ్యయనాలు తేటతెల్లం చేశాయి.

అయితే యుద్ధం ప్రభావం చాలా దేశాలపై ప్రతికూల ప్రభావాలను చూపించింది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటడం, ఆహార ధాన్యాల కొరత వంటి షరా మామూలు సంక్షోభాలకు రష్యా, ఉక్రెయిన్‍లూ మినహాయింపు కాదు.

రష్యాను కట్టడి చేయాలనుకున్న దేశాలకు ఇప్పుడు అంతర్గత సంక్షోభాల తోటే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. ఎప్పటికప్పటి అవకతవకల కారణంగానో ఆయా దేశాల బ్యాంకింగ్ రంగమూ సంక్షోభంలో పడింది. అమెరికా కైతే సంచి లాభం చిల్లు పూడ్చినట్లు ఆయుధాల అమ్మకంతో లాభాలు సంక్షోభాలను చక్కదిద్దుకోవడానికైనా సరిపోతాయో లేదో తెలియదు.

మారుతున్న సమీకరణాలు:

రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇరాన్, సౌదీ అరేబియాలు షియా/సున్నీ వివాదాలను ప్రక్కనబెట్టి దేశాల పురోగభివృద్ధి దిశగా ఆలోచించడం మొదలుపెట్టడం ఒక మంచి పరిణామం.

ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలో రష్యా లావాదేవీలన్నీ చైనా కరెన్సీ యువాన్‍లలోనే అని పుతిన్ బాహటంగా ప్రకటించారు. సౌదీ, చైనాకు ఎగుమతి చేసే చమురుకు చెల్లింపులను చైనా కరెన్సీలో తీసుకునేందుకు కొంత వరకూ సుముఖంగానే ఉంది.

చమురు అమ్మకం ధరలపై సీలింగ్ ఉండాలన్న అమెరికా ప్రతిపాదనను సౌదీ నిర్ద్వందంగా త్రోసిపుచ్చింది. ఒపెక్ దేశాలు, రష్యా, సౌదీ చెట్టాపట్టాలుగా సాగటానికి నిర్ణయించుకుంటే పెట్రోల్ విపణిలో డాలర్ ఆధిపత్రానికి గండి పడటం ఖాయమన్న వాదనలూ సత్యదూరం కాదు.

Exit mobile version