మౌలబలం: ఈ బలం తమ ఉనికి మాత్రం రాజు మీదే ఎక్కువ ఆధారపడి, రాజునుండి సర్వదా మెప్పు కోరుతుంది. వంశపారంపర్యంగా నమ్మకంగా రాజును సేవించిది కనుక ఈ సేనాభాగం చాలాముఖ్యమైనది.
భృతబలం: ఇవి ఎల్లప్పుడు రాజుకు విధేయంగా ఉంటాయి. ఇవి రాజుకు సమీపంలో ఎల్లవేళలా ఉంటాయి. భృతబలమంటే అప్పటికి అప్పుడు జీతం ఇచ్చి సమకూర్చు కొనేది. యుధ్ధం అంటువస్తే ముందుండేది ఈ బలమే!
శ్రేణిబలం: ఈ బలగం దేశాభిమానం కలిగి ఉంటుంది. యుధ్ధం వలన కలిగే లాభ నష్టాలు ఈ బలం సమంగా అనుభవిస్తుంది.
సుహృద్ బలం: మిత్ర సామంతరాజుల వలన సమకూరే సైన్యం.
ద్విషద్ బలం: ఒకప్పుడు శత్రువుగా ఉండి జయింపబడటం వలనకానీ, సంధిమూలంగా కాని రాజుకు వసపడ్డ సామంతుడు సహాయార్థం పంపే బలాన్ని అమిత్రబలం అని కూడా అంటారు.
అటవీబలం: పుళిందులు,శబరులు వంటి మొదలైన ఆటవిక జనంతో కూర్పబడిన సైన్యం.
చతురంగ బలాలు: అంటే,రథా సైన్యం–గజ సైన్యం–అశ్వక సైన్యం–పదాతి సైన్యం.
సేనలను ఇలా విభజించి పేర్లతో పిలుస్తారు.
రథాలు | గజాలు | అశ్వాలు | కాల్బలం | ||
1 | పత్తి | 1 | 1 | 3 | 5 |
2 | సేనాముఖం (3 పత్తులు) | 3 | 3 | 9 | 15 |
3 | గుల్మము (3 సేనాముఖాలు) | 9 | 9 | 27 | 45 |
4 | గణం (3 గుల్మములు) | 27 | 27 | 81 | 135 |
5 | వాహిని (3 గణాలు) | 81 | 81 | 243 | 405 |
6 | పృతన (3 వాహినీలు) | 243 | 243 | 729 | 1215 |
7 | చమువు(3 పృతనలు) | 729 | 729 | 2187 | 3645 |
8 | అనీకిని (3 చమువులు) | 2187 | 2187 | 6561 | 10935 |
9 | అక్షౌహిణి(పది అకినీలు) | 21870 | 21870 | 65610 | 109350 |
పది అకినీలు ఒక ‘అక్షౌహిణి’ అవుతుంది. ఎనిమిది అక్షౌహిణీలు ‘ఏకము’, ఎనిమిది ఏకాలు ‘కోటి’, (ఇప్పటి కోటి కాదు). ఎనిమిది కోట్లు కలిపితే ‘శంఖం’, ఎనిమిది శంఖాలు ‘కుముదం’, ఎనిమిది కుముదాలు ‘పద్మము’, ఎనిమిది పద్మాలు ‘నాడి’, ఎనిమిది నాడులు కలిపితే ‘సముద్రం’, ఎనిమిది సముద్రాలు అంటే 366917189200 మంది గల సేన. దీన్ని ‘వెల్లువ’ అని అంటారు. రామాయణంలో సుగ్రీవుని వద్ద ఇటువంటి ‘వెల్లువలు’ డెభై వరకు ఉండేవి. అంటే 256842399744000 మంది అన్నమాట. వీరిలో అరవై ఏడు కోట్ల మంది సైన్యాధి పతులు ఉండేవారు. వీరందరికి ‘నీలుడు’ అనే వానరవీరుడు సర్వసైన్యాధిపతిగా ఉండేవాడు. ఇలా రాజులు తమ సైన్యవిభజన చేసేవారు.
మీలో ప్రతివారు నేను బోధించిన విషయాలు ఆచరించాలి. అలా మీజీవితాలు లోక కల్యాణం కొరకు శ్రమిస్తూ నిస్వార్థంగా సార్థకం చేసుకోండి.
ఏ దేశ విద్యావిధానం మరో దేశ విద్యావిధానాన్ని పోలి ఉండదు. ఆ కాలానికి ఆ దేశ ప్రజల యొక్క ఆశయాలను, ఆచార వ్యవహారాలనూ, వేషభాషలను బట్టి అక్కడి సంస్కృతి, సంప్రదాయలపై అక్కడి విధ్య ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై మీరు కొంత అధ్యాయనం చేయండి. మీకు ఎన్నో వింతలు, కష్టాలు ఎదురౌతాయి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి విజయం మీదే! ఇవిగో రక్షరేఖలు, వీటిని మీరు మెడలో హారంగా ధరించండి ఎట్టి దుష్టశక్తి అయినా, మంత్ర తంత్ర విద్యలు మీపైన పనిచేయవు. ఈ భూమిపై ఎంతటి దుష్టశక్తి అయినా న్యాయంకోసం పోరాడే మిమ్ము ఏమి చేయలేదు. స్వశక్తిని నమ్ముకున్నవారికి ఎన్నడూ ఓటమి ఉండదు. ఇక్కడకు మూడు రోజుల ప్రయాణ దూరంలో దక్షణ దిశగా వెళితే అరణ్యంలో ‘రితధ్వని’ మహర్షి ఆశ్రమం ఉంది. వారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం పొందిన అనంతరం మీ దేశ పర్యటన ప్రారంభించండి. నేడు కార్తీక పౌర్ణమి మంచి రోజు, బయలుదేరండి” అన్నాడు.
విజయుడు, జయంతుడు సదానందుని పాదాలు తాకి ‘సెలువు గురుదేవ’ అన్నారు.
“విజయోస్తూ, చిరంజీవ సుఖీభవ” అని సదానందుడు ఆశీర్వదించాడు. సహవిద్యార్ధులకు అభినందనలు తెలుపుతూ ఇద్దరు మిత్రులు సాయుధులై దక్షణ దిశగా తమ ప్రాయాణం కొనసాగించారు.
మొదటిరోజు అరణ్యమార్గాన ప్రయాణం చేస్తూవారు చంపక దేశం నగర సరిహద్దుల లోని దేవాలయం చేరుకుని దైవదర్శనం అనంతరం చేరువలోని పెద్ద వేపచెట్టుకింద విశ్రమించారు.
***
”రాకుమారి సుగంధి ఇలారా! మంత్రి కుమార్తె భువనా! నువ్వు మధ్యలో మాట్లాడకు అమ్మాయ్. ‘మింగమంటే కప్పకు కోపం వదలమంటే పాముకు కోపం’ అలా ఉంది నా పెళ్ళాం వద్ద నా పరిస్ధితి. నేను నంది అంటే తను పంది అంటుంది. నేను మీకు కథ చెపుతాను వినండి” అన్నది ఇక ఇక అనే మాటలు నేర్చిన మగ రామ చిలుక.
“అప్పుడే మొదలు పెట్టావా నీ వాగుడు, ఈ వాగుడుకాయతో నేను కాబట్టి కాపురం చేస్తున్న అదే మరోకరైతే ఎప్పుడో పోయేవారు” అంది మాటలు నేర్చిన ఆడ రామ చిలుక అయిన ఇక ఇక భార్య బెక బెక.
“ఏమిటే నీ గోల? ‘ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లు’ ప్రతిదానికి నాపైన పడతావు. మాట్లాడే ముందు ఎవరున్నారో చూసుకోవా? ఏమిటా మాటలు? వీళ్ళు పెళ్ళి చేసుకుని ఓ ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళు. వాళ్ళని కూడా నీలా తయారు చేయాలనుకుంటున్నావా? కమ్మటి కథ చెపుతాను విను. అనగనగా ఒక అడవిలో….”
“ఈ సామెతలకు ఏమి కొదువలేదు” అన్నది బెకబెక.
“మహానుభావా మేము దేవాలయానికి వెళుతున్నాం వచ్చాక తీరుబడిగా నీ కథ వింటాం” అన్నది భువన.
“అలాగే ఇద్దరుగా వెళ్ళి నలుగురుగా రండి” అన్నాడు ఇకఇక.
“ఏయ్ ఏమిటా మాటలు తప్పు కదూ” అన్నది సుగంధి.
“ఇక ఇక మాట ఇలలో సత్యం, నేను అన్న మాట తప్పక నెరవేరుతుంది మిమ్ములను చేపట్టబోయేవారు మీకు దేవాలయం వద్ధ కనిపిస్తారు” అన్నాడు ఇకఇక.
“మీరు వెళ్ళండి అమ్మ, మా ఆయన జోతిష్యం పిచ్చి ముదిరింది.” అన్నది బెకబెక.
“పిచ్చి నా పెళ్ళామా, వీరికి కల్యాణం త్వరలో జరగబోతుంది. ‘దేవుడు వరమిచ్చినా పూజారి ఒప్పనట్లు’ నా మాటలు నువ్వు నమ్మడం లేదు” అన్నాడు ఇకఇక.
సుగంధి, భువనలు చిలుకల మాటలకు నవ్వుకుంటూ నగర పొలిమేరలలోని దేవాలయానికి రథం పైన బయలుదేరారు. నలుగురు సైనికులు గుర్రాలపై వారికి రక్షణగా వారిని అనుసరించారు.
***
‘కాపాడండి’, ‘రక్షించండి’ అన్న మగవారి గొంతుకలు దేవాలయం చేరువలో వినిపించడంతో విజయుడు, జయంతుడు ఇరువురు అటుగా పరుగు తీసారు.
అక్కడ ఆరుగురు ధృఢకాయులు రాజభటులను గాయపరచి, ఇద్దరు స్త్రీలతో కత్తి యుధ్ధం చేస్తున్నారు.
కత్తులు దూసిన మిత్రులు ఇరువురు ఆరుగురు ధృఢకాయులను గాయపరచి బంధీలుగా చేసారు.
“అమ్మాయిలు, ఈ అరణ్యంలో మీరు ఎందుకు ఉన్నారు? ఈ భటులు ఎవరు? ఈ దొంగలను ఎదిరించి కత్తి యుధ్ధం చేసి మిమ్ములను మీరు రక్షించుకున్నందుకు మీకు అభినందనలు” అన్నాడు విజయుడు.
“మహావీరులకు వందనాలు. సమయానికి వచ్చి కాపాడారు. ఈమె ఈ దేశపు యువరాణి సుగంథి, నేను మంత్రి కుమార్తెను. నా పేరు భువన. దైవదర్శనానికి వచ్చిన మాపై ఈ దొంగలదాడి జరిగింది” అన్నది భువన.
“నేను అంగ దేశపు యువరాజును, నా పేరు విజయుడు, ఇతను నా బాల్యమిత్రుడు మామంత్రి కుమారుడు జయంతుడు దేశాటన చేస్తూ ఈ దారిన వెళుతుంటే మీ భటుల పిలుపుకు ఇలా వచ్చాము” అన్నాడు విజయుడు.
ఇంతలో చంపా నగర సేనాని కొందరు భటులతో యువరాణి వారిని వెదుకుతూ వచ్చారు. జరిగిన విషయం వచ్చిన వారికి తెలియజేసింది భువన.
“మహావీరులు మాతో రాజధానికి విచ్చేసి మా ఆతిధ్యం స్వీకరించండి” అన్నది భువన.
‘అలాగే’ అన్న మిత్రులు సుగంధి, భువనలతో కలసి రథం ఎక్కారు.
అంతఃపురంలో జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది సుగంధి.
“నాయనా విజయా మీనాన్నగారు నా బాల్య మిత్రులు. చాలాకాలం ఇరువురం ఒకే ఆశ్రమంలో ఉన్నత విద్యాభ్యాసం చేసాము. మీరు ఇలా ఎందుకు ప్రయాణం చేస్తున్నారు?” అన్నాడు రాజుగారు.
తము ఎందుకు వెళుతున్నామో తెలియజేసాడు విజయుడు.
“మా అతిథులుగా మీరు ఇష్టం వచ్చినన్ని రోజులు హాయిగా మా వసంత మంటపంలో సకల మర్యాదలతో ఉండవచ్చు” అన్నాడు రాజుగారు.
“మన్నించాలి నేడు మాత్రమే మేము ఇక్కడ ఉంటాము. రేపు ఉదయం వేకువనే ప్రయాణం చేస్తాము” అన్నాడు విజయుడు.
“మీయిష్టం వెళ్ళి విశ్రాంతి తీసుకొండి” అని రాజుగారు వెళ్ళిపోయాడు.
సుగంధి, భువనలతో కలసి మిత్రులు ఇరువురు వసంత మంటపం చేరారు.
అక్కడ రెండు చిలుకలు మనుషుల భాషలో పోట్లాడుకుంటూ ‘కొండను తొవ్వి ఎలుకను పట్టినట్లు’ అడవంతా గాలించి నిన్నుచేసుకున్నాను కదూ అందుకు నాకు ఇలా జరగవలసిందే” అన్నాడు ఇకఇక.
“ఏమిటి? నేను ఎలుకనా? ‘కాకిముక్కుకు దొండపండు’లా నాకు నువ్వు దొరికావు. ఏం చేస్తాం? ‘చాదస్తపోడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు’. నావల్ల కాదు నిన్ను మార్చడం. ‘తను వలచిందే రంభ తను మునిగిందే గంగ’ అన్నారు” అన్నది బెకబెక.
“మొదలయింది మీ తగవు” అన్నది సుగంధి.
“ఏమిటి ఈ చిలుకలు మాట్లాడుతున్నాయి వింతగా ఉందే!” అన్నాడు జయంతుడు.
“అవును ఇవి మా రాజకుమారి పెంపుడు చిలుకలు, మాటలు మా రాజకుమారి నేర్పింది. సూక్తులు,సామెతలు, పాటలు, కథలు అన్నివచ్చు వీటికి, మీరు తోట లోనికి వెళ్ళండి” అన్నది చిలుకలను భువన.
“ఆగు భువనా, నువ్వు అక్కడే ఆగు. నేను చెప్పిన జోస్యం నిజం అయింది, ఇద్దరుగా వెళ్ళి నలుగురుగా వచ్చారు. అయ్య మీరెవరో మంచి వాళ్ళలాగా ఉన్నారు చూడటానికి. నాపేరు ఇకఇక. ఇది నాభార్య బెకబెక. ‘రాయి దొరికితే కుక్క ఉండదు, కుక్క ఉంటే రాయి దొరకదు’ అలా ఉంది దీన్ని కట్టుకున్నాక నా పరిస్ధితి. అయినా నాకు తెలియకు అడుగుతా మీరు బ్రహ్మచారులే కదా” అన్నాడు ఇకఇక.
“అవును మేము బ్రహ్మచారులమే” అన్నాడు జయంతుడు.
“మాబాగానే దొరికారు మాకు, ‘డోలు వచ్చి మద్దెలతో మొర పెట్టుకుందట’. అయినా ‘పిల్ల కాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ’ అని పెళ్ళాం పెట్టే బాధలు ఇంతంత కాదు. బ్రహ్మచారులకు చెప్పి ప్రయోజనం ఏముంది” అన్నాడు ఇకఇక.
“బాగుంది మీ తగువు తీర్చడానికి కాదు వారు ఇక్కడికి వచ్చింది, ఈరోజు మాత్రమే ఇక్కడ ఉండేవారిని ప్రశాంతంగా ఉండనివ్వండి” అన్నది భువన.
“వాళ్ళు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటాం అంటే వద్దంది ఎవరంటా? ‘చకనమ్మ చిక్కనా అందమే!’. కోపంలోకూడా నువ్వు చక్కగానే ఉన్నావు భువనా! అయినా రోజు ఉండే కష్టాలను ఎప్పుడో వచ్చే సుఖాల కోసం వద్దనకూడదు. మీ మాటలు ఎలా ఉన్నాయంటే ‘దున్నపోతు ఈనిందిరా అంటే దూడను కట్టెయ్యమన్నాడంట’. వాళ్ళు ప్రశాంతంగా ఉంటానంటే మేము వద్దనం! అయినా ‘ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందట’. వీళ్ళు వచ్చారని మమ్మల్ని పొమ్మంటున్నావే భువనా, వాళ్ళు ఒక్కరోజు ఉండేవాళ్ళు మేము రోజు ఉండి వాళ్ళం. ‘తేలుకుట్టిన దొంగల్లా’ ఉండటం మావల్ల కాదు. వెళ్ళము గాక వెళ్ళం” అన్నది బెకబెక చిలుక.
“మీ నలుగురుకి సంసారి బాధలు ఏం తెలుస్తాయి, మీరు జంటలు చూడటానికి బాగానే ఉన్నారు, మీరు పెళ్ళిచేసుకొండి అప్పుడు తెలుస్తాయి సంసారి బాధలు” అన్నాడు ఇకఇక.
“తప్పుకదూ ఎదుటివారి మనసు తెలుసుకోకుండా ఇలా మాట్లాడకూడదు” అన్నది సుగంధి.
” ఉన్నమాటే అన్నాను, ఏమే బెకబెక, జయంతుడు భువన, సుగంధీ విజయుడు జంటగా ఎలా ఉన్నారు?” అన్నాడు ఇకఇక.
“ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీ ఎంపిక, జోస్యం సరైనదే” అన్నది బెకబెక.
“మన పెళ్ళయిన నాటినుండి ఇన్నేళ్ళకు నాతో నువ్వు ఏకీభవించిన విషయం ఇదొక్కటే” అన్నాడు ఇకఇక.
చిలుకల మాటలకు అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.
సుగంధి, భువనలు స్వయంగా వడ్డిస్తుంటే, విజయుడు, జయంతుడు రాత్రి భోజనం చేయసాగారు.
“ఏమయ్యో ఎక్కడ ఉన్నావు? ‘అయిన వాళ్ళంతా ఆ దారినిపోతే, జంగాన్నిపట్టుకు జాము ఏడ్చాడంట’ నీలాంటివాడు, అతిథులు భోజనం చేస్తున్నారు కదా వాళ్ళకు ఆనందం కలిగించే ఏదైనా మంచి కథ చెప్పవచ్చు కదా!”అన్నది బెకబెక.
“బాగుంది నా సాయం కోరుతూ నన్నే ఆజ్ఞాపిస్తున్నవే? ‘కిందపడినా నాదే పైచేయి అన్నాడ’ట నీలాంటివాడు. సరే అమ్మాయ్ భువనా, ‘కొత్త చెప్పేగా కరుస్తుంది, పాత పెళ్ళామేగా అరుస్తుంది’ అని సర్దుకుపోవాలి. నువ్వు మధ్యలో అడ్డు రాకు కథ చెపుతాను వినండి….”
కథ పేరు ‘రొట్టెలవాని కంటే తుంపులవారే మేలు’.
అమరావతి రాజ్య పొలిమేరలలో రామానంద స్వామి ఆశ్రమం ఉండేది. అందులో పలువురు విద్యార్థులకు భోజనం, వసతితోపాటు విద్యాదానం జరుగుతుండేది.
ఒకరోజు పాఠం ముగిసిన అనంతరం విద్యార్థులతో కలసి భోజనశాలకు బయలుదేరాడు రామానందుడు.
శివయ్య అనే విద్యార్ధి “స్వామి రొట్టెలవారి కంటే తుంపులు వారే మేలు అంటారు కదా! ఎందుకు అలా అంటారు” అన్నాడు.
“నాయనా శివయ్య దేనికైనా సమయం సందర్బం రావాలి. త్వరలోనే నీ సందేహానికి తగిన సమాధానం లభిస్తుంది.” అన్నాడు రామానందుడు.
మరుదినం ఆశ్రమ నిర్వాహణ నిమిత్తం దాతలను కలవడానికి ఉదయం అల్పహారం అనంతరం శివయ్యను తోడు తీసుకుని బయలుదేరివెళ్ళాడు రామానందుడు.
వెళ్ళిన పని ముగించుకుని తిరుగుప్రయాణం కొనసాగించారు.
ఆశ్రమానికి చేరుకునే సరికి విద్యార్ధులంతా భోజనం చేస్తున్నారు. వంటచేసిన మనిషి శివయ్యను చూస్తూనే ఒక అరటి ఆకు తీసుకుని విద్యార్థులు అందరి దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఉన్న విద్యార్థులంతా తమ ముందు ఉన్నమూడు ముక్కల్లో ఒక రొట్టెముక్క, కొద్దిగా కూర వంటమనిషి చేతిలోని అరటి ఆకులో వేయసాగారు.
భోజనానికి కూర్చున్న శివయ్యకు, వంటమనిషి తన చేతిలోని అరటి ఆకు అతనిముందు పెట్టి వెళ్ళాడు. అప్పుడే భోజనశాలలో ప్రవేశించిన రమానందుడు “శివయ్య చూసావా నీసాటి విద్యార్థులకు మూడు రొట్టెలు మాత్రమే వడ్డించబడ్దాయి. కానీ నీకు తలా ఓ రొట్టె తుంపు ఇచ్చేసరికి దాదాపు పది రొట్టెలు వచ్చాయి. ఇదే రొట్టెలవాని కంటే తుంపులవాడే మేలు అంటే” అన్నాడు. “నాడు నువ్వు అడిగిన ప్రశ్నకు నేడు ఇది సమాధానం” అన్నాడు.
విషయం అర్థమైన శివయ్య చేతులు జోడించాడు.
నవ్వూతు శివయ్య పక్కనే భోజనానికి కూర్చున్నాడు రామానందుడు.
“కథ బాగానే ఉంది. ‘పని లేని మాచకమ్మ పిల్లి పాలు పితికిందంట’ ” అన్నది బెకబెక.
“నేను చాలాకాలం చూస్తున్నా! ‘ఉరిమి ఉరిమి మంగళంమీద పడినట్లు’ ఎప్పుడు నాతో తగాద పడతావు. భువనా నువ్వు చెప్పు – ‘మిట్టన ఉన్నా యేనుగే, పల్లాన ఉన్నా యేనుగే’ కదా” అన్నాడు ఇకఇక.
“ఆపుతారా మీ గోల, అతిథులు విశ్రమింబోతున్నారు” అన్నది భువన.
(సశేషం)
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.