[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకుంది
“ఇక నించి బాత్ రూమ్స్ కడగదుట. బట్టలు ఉతకదుట. గిన్నెలు తోమటానికి ఒక్క పూటే వస్తుందిట. ఎలాగండి ఈ పనివాళ్ళతో చస్తున్నాం! వాళ్ళు కలెక్టర్స్.. గవర్నర్స్! మనం వాళ్ళకి సేవకులం లాగా ఉంది పరిస్థితి” అంది కామక్షి ఉస్సురంటూ కుర్చీలో కూర్చుని.
కామాక్షి ఆ స్కూల్లో సైన్స్ టీచర్.
***
“అవునండి. మేమూ వాళ్ళు కోరే ‘హిరణ్యాక్ష వరాలు’ తీర్చలేక చస్తున్నాం. ఏ రోజు ఏ మూడ్‌లో ఉంటారో.. ఏ పని ఎగ్గొడతారో తెలియక సతమతమవుతున్నాం. పండగ అంటారు.. చావులంటారు.. దినాలంటారు.. బర్త్ డేలంటారు. మనకి లేనన్ని వేడుకలు.. సరదాలు వాళ్ళకి. ఒక్క పూట సెలవు పెట్టాలంటే మూడు నెలలు ఆలోచించాలి. హెడ్ మిస్ట్రెస్‌ని మంచి చేసుకోవాలి. మన అవసరం గురించి ఒప్పించాలి.”
“మనం అటు పాశ్చాత్యులమూ కాదు. ఇటు భారతీయులమూ కాదు. విదేశాల్లో రేట్స్ ఫిక్స్డ్. వచ్చి టక టకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. ఇది చేస్తాం.. అది చెయ్యం అనే చాయిస్‌లు ఉండవుట. మా బంధువులావిడ చెప్పింది. వాళ్ళని చూసి ఇలాంటివి నేర్చుకోరు. ‘అక్కడ పని వాళ్ళు కార్లో వచ్చి పని చేస్తారుట కదా’ అనడుగుతున్నది మొన్న మా పనమ్మాయి. ఎక్కడ లేని నీటూ.. గోటు వీళ్ళకి. అక్కడ రవాణాకి ఉన్న సదుపాయం అదొకటే అని తెలియదు వీళ్ళకి. కారు అంటే అదేదో స్టేటస్ సింబల్ అనుకుంటున్నారు!”
“త్రిశంకు స్వర్గంలో బతుకుతున్నట్టుంది మన బతుకు. బట్టలకి మిషన్లు.. గిన్నెలకి మిషన్లు.. పెట్టుకుని వీళ్ళని మానిపించేస్తే కానీ రోగం కుదరదు” అంది సోషల్ టీచర్ ప్రమీల.
***
“అమ్మా.. రొట్టెలు చేస్తా, కూరొండుతా, కూరలు తరిగి పెడతా.”
“సోమవారం చీపురు ముట్టుకోను.. కాబట్టి ఇల్లు చిమ్మి.. తుడవటం ఆ రోజు చెయ్యను.”
“బాత్ రూంలో నేల మాత్రం కడుగుతాను.. వాష్ బేసిన్ కడగను.. కమోడ్ కడగను. మేం మాత్రం మనుషులం కాదా” అని మొన్న మా పనమ్మాయి లెక్చర్ ఇచ్చిందండి.”
“జీతాలు వేలల్లో కావాలిట. మనకి కావలసిన పనులు చెయ్యరుట. వాళ్ళకి నచ్చినవి చేస్తారుట. ఇలాంటి పని వాళ్ళని రమ్మనాలా.. వద్దనాలా తెలియట్లేదండి” అన్నది అప్పుడే స్టాఫ్ రూం లోకి వచ్చిన తెలుగు టీచర్ అరుంధతి.
***
“మా అత్తగారు పెద్దావిడ. వయసు 90 ఏళ్ళు. కాళ్ళు, చేతులు పట్టుండట్లేదు. యూరినల్స్‌కి వెళ్ళాలి అనిపించాక అక్కడికి వెళ్ళేవరకు ఆపుకోలేక పోతున్నారు. అక్కడ.. ఇక్కడ కాస్త పడితే.. నేను ఆ రూం తుడవనంటుంది మా పనమ్మాయి. మీ బట్టలు ఉతుకుతాను కానీ పెద్దామె బట్టలు.. వాసన.. ఉతకను అంటుంది. పోనీ డైపర్ వేద్దామా అంటే ఆవిడ సమస్య ఎప్పుడూ ఉండదు. ఆవిడ వేసుకోవటానికి ఇష్టపడట్లేదు” ఏం చెయ్యాలో తోచట్లేదండి అన్నది డ్రాయింగ్ టీచర్ సీత.
“ఏమండి సీత గారూ.. మొహం పీక్కు పోయినట్టుంది. ఒంట్లో బాగా లేదా? ఈ రోజుల్లో దేన్ని అశ్రద్ధ చెయ్యలేమండి. ఓ సారి డాక్టర్ దగ్గరకి వెళ్ళి రండి” అన్నది కామాక్షి టీచర్.
“ఆఁ మన గురించి మనం పట్టించుకునే టైమెక్కడండి. ఆ మధ్య మా మేనకోడలు చూసి ‘బాగా ఎనిమిక్‌గా ఉన్నావు అత్తా. రెగ్యులర్‌గా మందులు వాడాలి. లేకపోతే ముందు ముందు పెద్ద సమస్యల్లోకి దింపుతుంది’ అని చెప్పింది.”
“ ‘గోడ దెబ్బ చెంప దెబ్బ’ గా ఉందండి నా పరిస్థితి! ఇందాక మా అత్తగారి సమస్య.. పనిమనిషి తంతు చెప్పా కదా!”
“ఇక మా అబ్బాయి ఏదో కోర్స్ చేస్తున్నాడు. ఆన్లైన్ క్లాసులని రూంలో నించి బయటికి రాడు. వాడికి అన్నీ రూం లోకే సప్లై. మా ఆయనకి ఇటు పుల్ల తీసి అటు పెట్టే అలవాటు లేదు. అదేమంటే చిన్నప్పటి నించి మా అమ్మ అలవాటు చెయ్యలేదు. ఇప్పుడు నువ్వు పనులు చెయ్యమన్నా నాకు చేతకాదు అంటారు. పెద్దావిడకి సమస్తం చేసి.. మా ఆయనకి, అబ్బాయికి అన్నీ అందించేసరికి తల ప్రాణం తోకకి వస్తోందండి” అన్నది సీత.
‘రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు’ ఉంది మన బోటి ఉద్యోగినుల పరిస్థితి. నాదే సమస్య అనుకున్నాను. పాపం సీతగారిని, ఆవిడ ఆరోగ్యాన్ని చూస్తుంటే.. చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళందరి పరిస్థితి ఇలా ‘మూడు రోగాలు..ఆరు కష్టాలుగా’ ఉన్నది.
“ఒక్కోసారి చదువుకుని ఉద్యోగం చేసి మనకంటూ వ్యక్తిత్వం ఉండాలి అనుకుని ఆడవాళ్ళం కోరి కష్టాలు తెచ్చుకుంటున్నామేమో అనిపిస్తోందండి. అటు పాతకాలపు ఇంటి పనులు, బాధ్యతలు తప్పట్లేదు. ఇటు ఉద్యోగం తాలూకు డిమాండ్స్ తప్పట్లేదు. మనది రెండు గుర్రాల సవారీ. ఈ పరిస్థితుల నించి మనం ఎప్పటికైనా బయటపడతామంటారా” అన్నది ప్రమీల.
“ఆఁ ఇంకేం బయటపడటం. మనది పద్మ వ్యూహం.. లోపలికెళ్ళటమే కానీ బయటికి రాలేని అభిమన్యులం” అని ముక్తాయించింది సీతా టీచర్.