Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాఫల్యం-15

శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

వృత్తివాళ్లయినా ఆ ప్రాంతపు యాస ప్రభావం వాళ్లమీద ఉంటుందనిపించింది పతంజలికి ఆయన పూజ చేసేటపుడు మంత్రాలు మాత్రం సుస్వరంగా చక్కగా ఉన్నాయి.

క్రిందికి దిగి, కోఠీకి బస్సు ఎక్కడ ఆగుతుందని అడిగాడు. “జర ముందుకు పో. బస్టాప్‌ ఉంటాది” అని చెప్పాడాయన.

బస్సులు అప్పటికే బాగా రద్దీగా ఉన్నాయి. ప్యాంటు జేబులోని డబ్బును ఒకసారి తడిమి చూచుకొన్నాడు.

“జాగ్రత్తగా ఉండాలి. బస్సులో” అనుకున్నాడు.

ఏదో బస్సు వచ్చింది. “కోఠీకి పోతుందా” అనడిగాడు కండక్టరును. “ఎక్కు జల్ది” అన్నాడతను ఎక్కి టికెట్‌ తీసుకున్నాడు. నిలబడే ప్రయాణించాల్సి వచ్చింది. పదినిమిషాల్లో కోఠీలో దింపాడు.

ఒకరిద్దర్ని అడిగితే గుడి గురించి తెలియదన్నారు. మద్రాసులో ఇంటర్‌ పరీక్షలపుడు కూడ రోజూ స్వామి దర్శనం చేసుకొనే వెళ్లేవాడు. ఇప్పుడు డిగ్రీ చదువు కూడ ఆయన అనుగ్రహం పొంది ప్రారంభించాలని.

చివరికి దొరికింది. చాలా పురాతన ఆలయం. నరసింహుడు లక్ష్మీదేవి కొలువుతీరి ఉన్నారు. స్వామికి వెండిమీసాలు, కళ్లు, అమ్మవారికి వెండి కిరీటం, ముక్కుపుడక అలంకరించారు. పూజారి షర్టు వేసుకుని ఉన్నాడు. ఆయన చదివే మంత్రాలు కూడ సరిగ్గా అర్థం కాలేదు. “లక్ష్మీనారాయణ్‌” అన్న పదం మాత్రం అర్థమయింది.

స్వామి తీర్థ ప్రసాదం తీసుకున్నాడు. నుదుట కుంకుమ ధరించాడు. భక్తి పారవశ్యంలో మళ్లీ దుఃఖం వచ్చింది.

“తండ్రీ చల్లగా చూడు. నా డిగ్రీ పూర్తయింతర్వాత అహోబిలం వస్తాము” అని ప్రార్థించాడు.

కాసేపు కూర్చుని బయటకు వచ్చాడు.

తొమ్మిదిన్నర దాటింది. కడుపులో ఆకలి కరకరలాడుతూంది. రోడ్డుకటువైపు ‘హోటల్‌ హరిద్వార్‌’ అని బోర్డు కనపడుతూంది. రోడ్డు దాటి వెళ్లాడు. కుర్చీలో కూర్చొని ధరల పట్టిక పరిశీలించాడు అన్నీ చాలా ఖరీదుగా ఉన్నాయి. టిఫిన్‌ బండ్లేవీ కనబడలేదు.

“సరే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదుకదా!” అనుకొని రెండిడ్లీ, సింగిల్‌ వడ ఆర్డరిచ్చాడు.

“సాంబార్‌ అలగ్‌ దేనా, నైతో ఇడ్లీమే దాల్‌నా?” అని అడిగాడు సర్వరు. “ఇడ్లీమే దాలో, అలగ్‌ నై” అన్నాడు. అలాగయితే సాంబారు ఎక్కువొస్తుందని కడుపునిండుతుందని.

ఒక స్టీలు గిన్నెలో ఇడ్లీలు, వడ వేసి, నిండా సాంబారు పోసి, పైన చట్నీ కూడ వేసించ్చాడు సర్వరు. సాంబారు ఘుమఘుమలాడుతూ పొగలు కక్కుతూ ఉంది. రెండు స్పూన్లు కూడ యిచ్చాడు. అద్భుతంగా ఉంది. చిన్న స్టీలు బకెట్‌తో సాంబారు కూడ తెచ్చి పెట్టాడు.

వేసిన సాంబారంతా కాసేపటికే పీల్చుకొన్నాయి ఇడ్లీలు వడ. మళ్లీ సాంబారు వేసుకున్నాడు. తినడం పూర్తయేసరికి పొట్ట నిండిపోయింది. బిల్లు చెల్లించి బయటకు వచ్చాడు.

బస్టాప్‌లో అడిగి యూనివర్సిటీకి వెళ్లే బస్‌ ఎక్కాడు. కాసేపటికి సీటు దొరికింది. హైదరాబాదు మహానగరం అందాలను వీక్షిస్తూ కూర్చున్నాడు. ‘ఎక్స్ టర్నల్‌ ఎక్జామ్స్‌ బోర్డుకు పోవాలంటే ఎక్కడ దిగాలి’ అనడిగితే ఎవరూ చెప్పలేకపోయారు. గద్వాలలో సాగర్‌ బావ ఆర్ట్స్‌ కాలేజి దగ్గర అని చెప్పినట్లు గుర్తు. సరే అనుకొని ఆర్ట్స్‌ కాలేజికి టికెట్‌ తీసుకున్నాడు. దిగేటప్పటికి పదకొండు కావస్తూంది.

అక్కడ ఉన్నవాళ్లను అడిగితే, “కొద్దిగా వెనక్కు వెళ్లి రోడ్డు దాటితే ‘ఎక్జామినేషన్‌ బ్రాంచ్‌’ వస్తుంది. అక్కడ అడగండి” అన్నారు.

అక్కడే ‘బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్ టర్నల్‌ ఎక్జామినేషన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదు’ అన్న బోర్డు కనపడిరది. ‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాడు.

వరుసగా కిటికీలున్నాయి. ప్రతి కిటికీలో ఒక కౌంటరు కిటికీలకు మధ్యలో నోటీసు బోర్డులున్నాయి. వాటిని చూసుకుంటూ వెళుతూంటే తనకు కావలసిన నోటిఫికేషన్‌ కనబడిరది. ఈ మధ్యే వచ్చినట్లుంది. గద్వాలలో చదివిన వివరాలే. అప్లికేషన్‌, ప్రాస్పెక్టస్‌, సిలబస్‌, మాడల్‌ కొశ్చన్‌ పేపర్లు మొత్తం పన్నెండు రూపాయలు. చివరి తేదీ ఇంకా దాదాపు నెల ఉంది. ఒకే అప్లికేషన్‌.

‘ఫార్మ్స్‌’ అని ఉన్న కిటికీ వద్ద అడిగాడు.

“చలాన్‌ లానా పైసే నైలేతే” అన్నాడు కౌంటర్లో వ్యక్తి.

ఆ ప్రక్కనే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ శాఖ ఉన్నట్లు తెలుసుకొని వెళ్లాడు. కిటకిటలాడుతూంది బ్యాంకు. చలానాఫారం తీసుకున్నాడు. మూడు భాగాలుగా ఉంది. ఒకటి బ్యాంకుకు, ఒకటి యూనివర్సిటీకి, ఒకటి విద్యార్థికి అని రాసి ఉంది దాని మీద.

దాని మీద వివరాలన్నీ నింపి, పన్నెండు రూపాయలు కౌంటర్లో ఇచ్చాడు. మూడు కాపీలమీద దభీ దభీమని స్టాంప్‌ వేసి, ఒకటి చింపి, మిగతా రెండూ పతంజలికిచ్చాడు.

మళ్లీ వచ్చి చలాన్‌ కౌంటర్లో యిచ్చాడు. అది తీసుకుని, రశీదు పతంజలికిచ్చి, ఒక పెద్ద బ్రౌన్‌ కవరిచ్చాడతను.

బయట పెద్ద పెద్ద చెట్లున్నాయి. అక్కడే క్యాంటీనుంది. బండరాళ్లున్నాయి. కొన్ని హాయిగా కూర్చునే లా ఉన్నాయి. కూర్చుని కవరు తెరిచి చదివాడు.

మూడు ఫోటోలు అతికించాలి. వాటిమీద గెజిటెడ్‌ ఆఫీసరు సిగ్నేచర్‌తో అటెస్టేషన్‌ చేయించాలి. అప్లికేషన్‌ ఫాంలోనే హాల్‌ టిక్కెట్లు రెండు కాపీలున్నాయి. S.S.C ఇంటర్‌, పాస్‌ సర్టిఫికెట్స్‌ మార్కు మెమోలు, T.C లేదా మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ అన్నీ ఒరిజినల్స్‌ జతపరచాలి. రిజిస్ట్రేషన్‌ కార్డు మీద విద్యార్థి వివరాలు వ్రాయాలి. సొంత అడ్రస్‌ వ్రాసి, (వారిచ్చిన కవర్లమీదే), వాటిని కూడ జతపరచాలి. పార్ట్‌ 1, పార్ట్‌ 2 లకు కలిసి రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 75, ఎక్జామినేషన్‌ ఫీజు రూ. 50 మొత్తం రూ. 125. ఫీజు కూడ చలానా రూపంలోనే కట్టాలి.

పతంజలికి చప్పున తట్టింది. మనవైపు ‘స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ ఉండదు. కాబట్టి ఇక్కడే చలానా కట్టేసి, తీసుకుని వెళితేసరి. అప్లికేన్‌తోబాటు పంపవచ్చు. రెండింటికీ ఒకే చలాన్‌ కట్టొచ్చు.

వెంటనే బ్యాంకుకు వెళ్లి చలానా కట్టాడు. రెండు రశీదులూ (యూనివర్సిటీ కాపీ,) జాగ్రత్తగా అదే కవర్లో పెట్టుకున్నాడు. మళ్లీ ఆర్ట్స్‌ కాలేజి దగ్గరకొచ్చి బస్సెక్కాడు కోఠీకి. అక్కడ సుల్తాన్‌ బజార్లో వరుసగా పెద్ద పెద్ద బుక్‌ షాపులుండటం గమనించాడు. అక్కడ పుస్తకాలన్నీ దొరకవచ్చు అని భావించాడు.

బస్సులో కూర్చొని సిలబస్‌ స్టడీ చేశాడు. మాడల్‌ క్వశ్చన్‌ పేపర్సు కూడ. గ్రూపుల్లో అన్నీ ఎస్సే టైపు ప్రశ్నలే. పది ప్రశ్నలిచ్చి ఏవయినా ఐదు రాయాలి. ఒక్కో ప్రశ్నకు ఇరవై మార్కులు. ఇంగ్లీషు, సంస్కృతం మాత్రం వేరుగా ఉన్నాయి.

బస్సు దిగి బుక్‌ షాపులవైపు వెళ్లాడు. ‘రాజ్‌కమల్‌ బుక్‌ సెల్లర్స్‌’ అనే బోర్డు పతంజలిని ఆకర్షించింది. చాలా పెద్ద షాపది. జనంతో కిటకిటలాడుతూంది. పొడవైన బల్లకు అటువైపున నలుగురు సేల్స్ మెన్‌ చకచకా పుస్తకాలు తీసి ఇస్తున్నారు. Payments అని ఉన్న చోట ఒకాయన డబ్బు తీసుకొని, బిల్లు ఇస్తున్నాడు.

“బి.ఏ ఎక్స్‌ టర్నల్‌ పుస్తకాలు కావాలి” అని అడిగాడు ఒకతని దగ్గరకు వెళ్లి.

ఆ చివరకు వెళ్లమని సూచించాడతను. ఆ చివర ఒక పెద్దాయన నిలబడి ఉన్నాడు.

“ఆవో బేటా ఆవో” అని ఆహ్వానించాడు.

“బి.ఎ. మే తుమారా గ్రూప్‌ క్యాహై?

“ఎకనమిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇంగ్లీష్‌ లిటరేచర్‌”

“మీడియం?”

“ఇంగ్లీష్‌”

“సెకండ్‌ లాంగ్వేజ్‌?”

“సాంస్క్రిట్‌”

“‘అచ్ఛా బేటా, గైడ్స్‌ చాహియే యా టెక్స్ట్‌?”

“సిర్ఫ్‌ టెక్స్ట్‌ చాహియే కాకా” అన్నాడు పతంజలి. హుబ్లీ ప్రయాణం వల్ల తనకూ హిందీ ఒక మోస్తరుగా వస్తూన్నట్లు గమనించాడు.

“అభీ నికాలూంగా పాంచ్‌ మినిట్‌ ఇంతజార్‌ కరో” అని లోపలికి వెళ్లాడు కాకా.

రెండు చేతులతో పుస్తకాలు మోసుకుని వచ్చి కౌంటరు మీద పెట్టాడు.

“సబ్జెక్ట్ కే అనుసార్‌, అలగ్‌ అలగ్‌ కరూంగా” అన్నాడు.

“ఏ సబ్‌ ఎక్స్‌టర్నల్‌ వాలోంకో హైనా?” అని అడిగాడు పతంజలి.

“రెగ్యులెర్‌, ఎక్స్‌టర్నల్‌ వాలోంకా సిలబస్‌ ఏక్‌ హీ రహతా బేటా. కుఛ్‌ ఫర్‌ క్‌ నహీ” అన్నాడు పెద్దాయన.

ఇంగ్లీషులో నాలుగు ప్రోజ్‌, పొయిట్రీ, షార్ట్‌ స్టోరీస్‌, గ్రామర్‌), సంస్కృతం మొత్తానికి ఒక్కటి, గ్రూపు అన్నింటికీ పేపరుకు ఒక్కటి చొప్పున పాఠ్యపుస్తకాలున్నాయి. ఇంగ్లీష్‌ లిటరేచర్‌కు మాత్రం లిటరరీ క్రిటిసిజం, ఇండో ఆంగ్లియన్‌ లిటరేచర్‌, క్రిటికల్‌ ఇంటర్‌‌ప్రటేషన్‌ అని మరికొన్ని బుక్స్‌ ఉన్నాయి.

“కృపాకరకే ముఝె సిలబస్‌ కే అనుసార్‌, ఏ సబ్‌ చెక్‌ కర్‌ నే దీజియే” అన్నాడు.

“జరూర్‌ జరూర్‌ అందర్‌ ఆజావ్‌, బీతర్‌ ఏక్‌ టేబుల్‌ హై, ఉస్‌ పర్‌ రఖ్ కర్‌ దేఖో” అన్నాడు కాకా.

పతంజలి లోపలికి వెళ్లి టేబుల్‌ వద్ద కూర్చొని, సిలబస్‌ దగ్గరుంచుకొని, ప్రతి సబ్జెక్ట్‌లోని విషయసూచిక ప్రకారం ట్యాలీ చేసుకోసాగాడు. అన్నీ సరిపోయాయి. పూర్తవడానికి అరగంటపైనే పట్టింది.

తెలుగు అకాడమీ ప్రచురణలు చాలా చౌకగా ఉన్నాయి. ఇంగ్లీషు లిటరేచర్‌ మాత్రం ఖరీదెక్కువున్నాయి. పెన్ను తీసుకొని, కింద పడి ఉన్న ఒక చిత్తు కాగితం మీద అన్ని పుస్తకాల ధరలు వరుసగా రాసి, కూడాడు. ఆరువందల పదిరూపాయలయింది.

బైటికి వెళ్లి అన్నీ సరిపోయినాయని చెప్పాడు. “బిల్లు వేయించమంటారా?” అని అడిగాడాయన.

“దీనిమీద ఏమయినా కన్సెషన్‌ దొరుకుతుందా?” అని అడిగాడు పతంజలి.

“మాలిక్‌కు పూఛేంగే” అంటూ క్యాష్‌ కౌంటర్‌ దగ్గర పతంజలిని తీసుకువెళ్లాడు.

“నమస్తే సర్‌. అయాం ఫ్రం కర్నూల్‌. ఆయామ్‌ ఎ పూర్‌ స్టూడెంట్‌. ప్లీజ్‌ గివ్‌మీ సం కన్సెషన్‌” అని అడిగాడాయనను ఎంతో మర్యాదగా.

పతంజలి మాట తీరు, వినయం, మాలిక్‌ గారికి నచ్చాయి.

“వుయ్‌ గివ్‌ ట్వంటీపర్సెంట్‌ ఫర్‌ గైడ్స్‌. బట్‌ ఇటీజ్‌ నాట్‌ పాజిబుల్‌ ఫర్‌ టెక్స్ట్ బుక్స్‌” అన్నాడాయన చిరునవ్వుతో. “ఎనీ హౌ, అయ్‌విల్‌ ట్రై టు హెల్ప్ యు, యంగ్‌మ్యాన్‌” అంటూ ఒక్కో పుస్తకం రేటు బిల్లు బుక్‌ వెనక పెన్సిల్‌తో రాసుకొని టోటల్‌ చేశాడు.

“ఇట్‌ కమ్స్‌ టు సిక్స్‌ హండ్రెడ్‌ అండ్‌ టెన్‌. ఐ విల్‌ గివ్‌ యు టెన్‌ పర్సెంట్‌. ప్లీజ్‌ పే ఫైవ్‌ హండ్రెడ్‌ అండ్‌ ఫార్టీ రుపీస్‌” అన్నాడు “థాంక్యూ సార్‌” అన్నాడు పతంజలి.

వివరంగా బిల్లు రాసి ఇచ్చాడు. జేబులోంచి డబ్బు తీసి ఆరు వంద రూపాయల నోట్లు యిచ్చాడు. ఇంతలో నోటు బుక్కులు కొనుక్కుంటే మంచిది కదా అనిపించింది. లాంగ్‌ సైజ్‌, వైట్‌ పేజీస్‌, 200 పేజెస్‌ నోటు బుక్స్‌ ఉన్నాయా అని అడిగితే.

“ఉన్నాయి. మేమే తయారు చేయించాం. తక్కువ ధరలో ఉన్నాయి” అని చెప్పారు.

అట్టమీద ‘నీల్‌కమల్‌’ అని ముద్రించి ఉన్న నోట్‌ బుక్స్‌ చూపించారు. పేపరు మాత్రం న్యూస్‌ప్రింట్‌ అనీ వైట్‌ పేపరు కాదనీ చెప్పారు. ఒక్కో నోట్‌బుక్‌ నాలుగు రూపాయలనీ డజను తీసుకుంటే 20% తగ్గిస్తామనీ చెప్పారు. అవీ ఒక డజను ఇవ్వమన్నాడు.

మంచి పెన్నులు చూపించమన్నాడు. ‘మర్చెంట్‌’ బ్రాండ్‌ పెన్‌, ‘కేమ్లిన్‌’ ఇంక్‌ బాటిల్‌ తీసుకున్నాడు. పెన్‌ రూపాయిన్నర ఇంక్‌ రెండు రూపాయలు. ఇంకా అయిదు రూపాయలు వెనక్కొచ్చాయి. “చాలా దూరం వెళ్లాలి. జాగ్రత్తగా ప్యాక్‌ చేయండి” అని అభ్యర్థించాడు.

రెండు అట్టపెట్టెల్లో ప్యాక్‌ చేసి ట్వయిన్‌ దారంతో నాలుగువైపులా గట్టిగా కట్టి యిచ్చారు. వాటిని షాపులోనే ఒక ప్రక్కగా ఉంచమని అడిగాడు. బిల్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. మిగిలిన డబ్బు నూట యాభై వరకు ఉంది. షాపు రాత్రి పదిగంటల వరకు తెరచి ఉంటుందని తెలుసుకున్నాడు.

టైము చూస్తే పావు తక్కువ రెండయింది. వెంటనే ఇమ్లీబన్‌ బస్టాండుకు వెళ్లి కర్నూలు బస్సుకు వెళ్లిపోవచ్చు. కాని, ఛార్జీ చాలా ఎక్కువ. సాయంత్రం కాచిగూడ – కర్నూల్‌ టౌన్‌ ప్యాసింజరుంటుంది. అది రాత్రి ఒంటిగంటకు చేరుకుంటుంది. దానికి బదులు రాత్రి 9:30 బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ ఉంది. అది సికింద్రాబాదులో బయలు దేరుతుంది. ఛార్జీ ఎక్కువే గాని బస్సంత కాదు. డైరెక్ట్‌గా వెల్దుర్తిలో దిగవచ్చు.

ఎదురుగ్గా ఒక మెస్‌ కనబడిరది. వెళ్లి భోజనం చేశాడు. భోజనంలోకి పూరీలు రెండిచ్చారు. చిన్న కప్పుతో అన్నం. అధరువులన్నీ చిన్న చిన్న కప్పుల్లో చుట్టూ పేర్చారు. పటాటోపమే గాని కడుపునిండలేదు.

ఎదురుగ్గా షోలే సినిమా పోస్టర్‌ పెద్దది కనబడింది. క్రింద ధియేటర్ల పేర్లు రాసి ఉన్నాయి. రామకృష్ణ 70 ఎం ఎం అని చదివాడు. బ్రాకెట్లో అబిడ్స్‌ అని ఉంది. టైం ఇంకా పదినిమిషాలు మాత్రమే ఉంది. మధ్యాహ్నం 2:30 కి మ్యాట్ని, రిక్షావాడిని పిలిచి అడిగితే “బారాణా” అన్నాడు. “ఆఠాణా” అని పతంజలి అంటే సరే అని ఎక్కించుకున్నాడు.

దేశమంతటా మార్మోగిపోతున్న సినిమా ‘షోలే’ దాన్ని చూడాలని అనిపించింది పతంజలికి. పది నిమిషాలలో ధియేటర్‌ దగ్గర దింపాడు రిక్షావాలా. అతనికి అర్ధరూపాయి బిళ్ల ఇచ్చి లోపలికి నడిచాడు.

మెయిన్‌ గేటుకు ప్రక్కన గోడమీద ‘TR ఎస్టేట్‌’ అని బంగారు రంగు అక్షరాలు తాపడం చేసి ఉన్నాయి. ‘ఆహ్వానం’ హోటలు ప్రక్కనే ఉంది. రెండు జంట ధియేటర్లు. రెండిటిపేరు రామకృష్ణ ఒకటి 70 ఎంఎం మరొకటి 35 ఎంఎం వాల్‌ పోస్టర్ల మీద తేదీ చూస్తే సినిమా విడుదలై దాదాపు సంవత్సరం దాటిపోయినట్లు తెలుస్తుంది. స్క్రీన్‌ ముందుగా ఉండే క్లాసుకు టికెట్టు తీసుకున్నాడు. లోపలంతా చీకటిగా ఉంది. గేట్‌మ్యాన్‌ టార్చి వెలుగు చూపిస్తూ వెళ్లి ఒక చోట కూర్చోబెట్టాడు. సినిమా ప్రారంభమై పోయింది. కూర్చుని తదేక దీక్షతో సినిమా చూడసాగాడు. లోపల చాలా చల్లగా ఉంది. ఎ.సి కదా అనుకున్నాడు. కర్నూల్లో ఎ.సి ధియేటర్లు లేవు. టికెట్‌ కూడ ఎక్కువే. ఇక్కడ నేల టికెట్టు ధర కర్నూల్లో బాల్కనీ టిక్కెట్టంత ఉంది.

ఇంటర్వెల్‌, లైట్లు వెలిగాయి. చుట్టూ చూశాడు. ధగధగ మెరిసిపోతుంది ధియేటర్‌. ఇరువైపులా NTR నటించిన పౌరాణిక చిత్రాల్లోని తైలవర్ణ చిత్రాలు గోడలకు అమర్చారు. బైటికిపోయి కాఫీ తాగుదామనుకొని, రేటు విని మిన్నకున్నాడు.

సినిమా పూర్తయింది. ఒక అద్భుతమయిన అనుభూతిని మిగిల్చింది పతంజలికి. ఆ విశిష్టమయిన సౌండ్‌ సిస్టమ్‌. చాలా పెద్ద స్క్రీను ‘పోష్‌’గా ఉన్న సీట్లు. తన జీవితంలో అలాంటి సినిమా. అలాంటి ధియేటర్లో చూడటం అదే ప్రధమం పతంజలికి. వచ్చి అంతకాలమయినా జనం బాగానే ఉన్నారు.

బయటకు వచ్చేసరికి వేడిగా అనిపించింది. సమయం ఆరుదాటింది. సుంకన్నకు తోకోనికి బట్టలు కొందామని అబిడ్స్‌ సెంటర్‌కు వెళ్లాడు. “భాగ్యలత ఎంపోరియం” అని పెద్ద షాపు కనబడిరది.

వెళ్లి షర్టు గుడ్డలు కావాలి అని అడిగాడు మొదటి అంతస్తుకు వెళ్లమన్నారు. క్రింద అంతా చీరలు. పైన మూడో అంతస్తులో రెడీమేడ్‌. మధ్యలో పురుషుల విభాగం.

మొదటి అంతస్తులో వెళ్లి చూశాడు. కొంచెం పాలిస్టర్‌ కలిసిన టెరికాటన్‌ షర్ట్‌ తానుల్లోంచి చూపించసాగాడు సేల్స్‌మన్‌. తోకోనికి ముదురాకు పచ్చ రంగు తెల్లని చిన్న గళ్లున్న గుడ్డ సెలెక్ట్‌ చేశాడు. మీటరు 18 రూ. చెప్పాడు. రెండుంబావు మీటర్లు కావాలి ఫుల్‌ షర్టుకని చెప్పాడు. చింపమని చెప్పాడు సుంకన్నకు డార్క్‌ బ్రౌన్‌ కలర్‌ మీద లేత పసుపురంగు చారలున్న దాన్ని తీసుకున్నాడు. వాళ్ళీద్దరూ ఫుల్‌ షర్టులే వేసుకుంటారు కాని భుజాల క్రింద వరకు మడుస్తారు.

పై అంతస్తుకు వెళ్లి లుంగీలు టవళ్లు తీసుకొన్నాడు. లుంగీలు చాలా బాగున్నాయి. పన్నెండున్నర రూపాయి ఒక్కోటి. గళ్లలుంగీలు ముదురు రంగువి తీసుకున్నాడు. టర్కీ టవళ్లయితే చాలా రకాలున్నాయి. పది రూపాయలలోపు. రెండు టవళ్లు పెద్ద సూజువి తీసుకున్నాడు.

క్రిందికి వచ్చి అన్నీ బిల్లు వేయించాడు. 82 రూ. అయింది. తన ఫీల్డుమేట్స్ కు బట్టలు తీసుకన్నందుకు చాలా సంతోషించాడు. అన్నీ ఒక పెద్ద కవర్లో పెట్టియిచ్చారు.

చాలా టైముంది రైలుకు. అబిడ్స్‌ నుండి నడుచుకుంటూ, కోఠీకి వచ్చాడు. పుస్తకాలపార్సిళ్లు తీసుకొని, మాలిక్‌కీ పెద్దాయనకీ కృతజ్ఞతలు చెప్పి బస్టాప్‌కు వచ్చాడు. సికింద్రాబాద్‌ వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాడు. ముప్పావుగంట పట్టింది. దిగటానికి.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పట్టపగల్లా ఉంది. ఎనిమిది దాటింది. ఒకేసారి ‘ఏదైనా తిని లోపలికి వెళ్లిపోతే సరి’ అనుకొని ఎదురుగా ఉన్న ‘అల్ఫా’ హోటల్లోకి నడిచాడు. ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నారందులో. అందులో టీ, బిస్కట్లు, బన్నులు ఇలాంటివే ఉన్నాయి. ఎవరో తింటూండగా చూసి ఒక క్రీమ్‌ బస్‌, నాలుగు ఉస్మానియా బిస్కెట్లు కొనుక్కొని తిన్నాడు. టీ తాగాడు చాలా బాగుంది.

ఒక చేత్తో తన బ్యాగు, ఒక పుస్తకాల పార్సెలు, మరొక చేత్తో బట్టల బ్యాగు. ఇంకోపార్సెల్‌ పట్టుకొని నడవడం కష్టంగా ఉంది. పెద్ద బరువేం కాదు గాని, రెండు ఒకే చేత్తో పట్టుకోవడం కష్టంగా ఉంది.

అల్ఫా హోటల్‌ బయట తోపుడు బండ్ల మీద గ్లూకోజ్‌ బిస్కెట్లు రాసులుగా పోసి ‘అమ్ముతున్నారు. చాలా మటుకు విరిగిపోయి ఉన్నాయి. కిలో రెండు రూపాయలే. ప్యాకెట్ల కంటే చౌక. అందులోనైనా మొత్తం బిస్కెట్టంతా ఒకేసారి తినేయలేం కదా అని పిల్లల కోసం ఒక కిలో కొన్నాడు.

ఆ బన్ను, బిస్కెట్లు కడుపు నింపలేదు. బయట రెండరటిపళ్లు కొన్నాడు. స్టేషన్‌లోకి వెళ్లారు. తొమ్మిది కావస్తూ ఉంది. జనరల్‌ టికెట్‌ కౌంటరు వద్ద పెద్ద క్యూ ఉంది. పావుగంట తర్వాత తనవంతు వచ్చింది. “ఒకటి వెల్దుర్తి. బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌” అని చెప్పి టికెట్‌ తీసుకున్నాడు.

“బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ ఎనిమిదో నంబరు ప్లాటు ఫారంపై ఉన్నది” అంటూ హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో చెబుతున్నారు మైకులో ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి ప్లాటు ఫారం చేరుకున్నాడు. స్టీమ్‌ యింజన్‌ పొగలు కక్కుతూ, ఆవిరి వదుల్తూ, నానారభసా చేస్తూన్నది.

ఇంజను వెనకే రెండు జనరల్‌ బోగీలున్నాయి. పెద్దగా రష్‌ లేదు. వెళ్లి కూర్చున్నాడు. ఇంకా ఇరవై నిమిషాలుంది కదలటానికి. రెండరటి పళ్లు తినేసి, క్రిందికి దిగి, ప్లాట్‌ఫారంమీద కొళాయిలో నీళ్లు తాగివచ్చాడు. తను కూర్చున్న సీటుకు ఎదురుగ్గా పైన బల్ల ఖాళీగా ఉంది. తలవైపు పార్సిల్స్‌ రెండూ పెట్టుకొని, తన బ్యాగు బట్టల బ్యాగు పెట్టుకొని, పైకెక్కి పడుకున్నాడు. క్రింద కూర్చున్నతన్ని “మీరెక్కడికి” అని అడిగి ‘కర్నూలు వరకు’ అని తెలుసుకుని, “దయచేసి మీరు కర్నూల్లో దిగేటపుడు నన్ను లేపండి” అని చెప్పి నిద్రపోయాడు. పగలంతా తిరిగితిరిగి రావడం వల్ల గాఢంగా నిద్రపట్టింది పతంజలికి.

తెల్లవారుజామున మూడున్నరకు రైలు కర్నూలు చేరింది. క్రిందనున్నతను దిగిపోతూ, పతంజలిని కుదిపి, “కర్నూలొచ్చింది!” అని చెప్పాడు.

పతంజలి దిగి బాత్‌రూంకు పోయి వచ్చి, క్రింద కూర్చున్నాడు. మరొక ముప్పావుగంటలో వెల్దుర్తిలో దిగాడు సామానుతో.

***

ఇల్లు చేరే సరికి నాలుగున్నరే అయింది. సామాను ఒక మూలన దించి మళ్లీ పడుకున్నాడు తమ్ముళ్ల దగ్గర పాణినికి మెలకువవచ్చి అన్నయ్యను చూచి, ఇటువైపు తిరిగి పతంజలి పొట్టలో దూరి పడుకున్నాడు. తమ్ముడిని దగ్గరగా హత్తుకొని నిద్రపోయాడు.

లేచేటప్పటికి ఎనిమిదయింది. కాల్యములు కృత్యములు ముగించుకొని పార్సిల్స్‌ విప్పి, తండ్రికి అన్నీ వివరించాడు.

“సంస్కృతంలో పాఠ్యాంశాలు ఏవి నాయనా?” అని అడిగారు తండ్రి.

టెక్స్ట్‌ బుక్‌ చూసి చెప్పాడు.

“లీలాశుకుని ‘కృష్ణ కర్ణామృతం’ 25 శ్లోకాలు, దండి ‘దశకుమార చరిత్ర’ పూర్తిగా శ్రీ హర్షుని నైషధం 25 శ్లోకాలు, మేఘ సందేశం కాళిదాస కవి విరచితం 25 శ్లోకాలు పెట్టారు నాన్నా. సందర్భ సహిత వ్యాఖ్యలు, వ్యాసరూప ప్రశ్నలు, ప్రతిపదార్ధ తాత్పర్యములు ఇది మొదటి పేపరు.

ఇక రెండవ పేపర్లో’ ‘శబ్ద మంజరి’ పూర్తిగా, పది సమాసాలు, ఒక 20 పంక్తుల గద్యాన్ని సంస్కృతంలోంచి ఇంగ్లీషులోనికి అనువాదం. పాణిని వ్యాకరణం రెండు పరిచ్చేదాలు, పాఠ్యాంశంకాని ఒక శ్లోకానికి విమర్శనాత్మక ప్రశంస.”

“భేష్‌! అన్నాడు మార్కండేయశర్మ. “లబ్ధప్రతిష్టులే అందరూ. పాణిని వ్యాకరణం మాత్రం నాకు అంతగా ‘అవలోడన’ కాలేదు. కానీ చూద్దాం” అన్నాడు.

పడసాలలో గూడు శుభ్రం చేశాడు పతంజలి. పాత హిందూ పేపరు పరచి, పుస్తకాలన్నీ దాంట్లో సర్దుకున్నాడు. “అమ్మా! నాకు ఆకలేస్తుందే!” అన్నాడు అమ్మతో.

“రాత్రి అన్నం మిగిలింది నాయనా. చిత్రాన్నం కలిపిస్తానుండు” అన్నది తల్లి.

“అయితే చిత్రాన్నం తిని తోటకు పోయొస్తా. మధ్యాహ్నం భోంచేస్తా” అన్నాడు.

పది నిమిషాల్లో పోపు ఘుమ ఘుమ చిటపటలు ముక్కుకు, చెవులకు విందు చేశాయి. పోపులో సద్ది అన్నం కలిపి, నిమ్మకాయలు రసం పిండి యిచ్చింది. అదేమిటో గాని పండగల్లో చేసుకునే చిత్రాన్నం కంటే ఈ సద్ది చిత్రాన్నం రుచిలో అమోఘంగా ఉంటుదనుకున్నాడు పతంజలి.

జీతగాళ్లిద్దరికీ బట్టలు తెచ్చాననీ, ఎనభైరూపాయలయిందనీ, వాళ్ల కూలీలో మినహాయించుకొందామనీ తండ్రికి చెప్పాడు. ఆయనేం మాట్లాడలేదు.

బట్టల బ్యాగు తీసుకొని తోటకు వెళ్లాడు. వంగ, టమోటా మొక్కలు ఏపుగా పెరిగి, నవనవలాడుతున్నాయి నిండా పిందెలతో. ఒక వారం పదిరోజుల్లో కోతకొస్తాయని అంచనా వేశాడు. నిమ్మతోటంతా తిరిగాడు. రెండు రోజులు గ్యాప్‌ వచ్చినందుకు పండిన నిమ్మకాయలు రాలి ఉన్నాయి. ఈ రోజే అన్నీ ఏరించి రేపు కర్నూలుకు పోయి మండీకి వేయ్యాలనుకున్నాడు. దాదాపు రెండు మూటలవుతాయని అంచనా వేశాడు. నిమ్మ చెట్లల్లో ఎండిన కొమ్మలు ఎక్కువగా కనిపించాయి. అవన్నీ తొలగించాలి.

కాసేపటికి తోకోడు, సుంకన్న వచ్చారు. ఇంజను రూము వద్దే పెద్ద కానుగ చెట్టు ఉంటుంది. దానికింద బాగా చదునుగా ఉండి కూలీలంతా భోజనాలు చేస్తారు. ఇద్దరినీ అక్కడకు తీసుకుపోయి బట్టల కవరు చేతిలో పెట్టాడు.

“నీ దెబ్బ! తెచ్చినావే స్వామీ! తెస్తావో త్యావో అనుకుండాం” అంటూ కవరు తెరిచి బట్టలు చూశారు

“తేకుండా ఎలా వుంటానురా. బాగున్నాయా!”

ఇద్దరికీ బాగా నచ్చాయి. కానీ పతంజలి తోకోనికని తెచ్చింది సుంకన్నకూ, సుంకన్నకని తెచ్చింది తోకోనికి నచ్చాయి.

“పండగనాడు ఈ అంగీ ఏసుకొని, ఈ టవలు భుజానేసుకుంటే, పిల్ల ‘మామా’ అనాల” అన్నాడు తోకోడు.

“అంటాది, అంటాది! బుడ్డక్కకు తెలిస్తే నీ చమడాలొలుస్తది” అన్నాడు సుంకన్న.

“ఆ పిల్ల మీ సెల్లెలు బుడ్డక్కే లేవో” అన్నాడు తోకోడు అందరూ నవ్వుకున్నారు.

నిమ్మచెట్లలో ఎండు పుల్లలు కట్‌ చేయడానికి ప్రత్యేకమయిన కత్తెరలున్నాయి. వాటితో ముగ్గురూ దాదాపు మూడు గంటలు పని చేశారు. పనిలో వాళ్లకేమాత్రం తీసిపోడు పతంజలి. నిమ్మకాయలన్నీ ఏరి ఇంటికి తెచ్చేయమన్నాడు సాయంత్రం. వంగ, టమోట చేసుకు నీరు పెట్టమన్నాడు. ఒంటిగంటకు ఇల్లు చేరుకున్నాడు.

చెల్లి తమ్ముడు కూడ బడి నుండి వచ్చేశారు. వాళ్లు పొద్దున చిత్రాన్నం తిని పోయినారు. తండ్రి తల్లి పదకొండు లోపే భోంచేస్తారు అందరూ ప్లేట్లు పెట్టుకుని కూర్చుంటే అమ్మ వడ్డించింది.

పాణిని, “నేను అన్నయ్య దగ్గర కూర్చుంటా! నాకు అన్నయ్యే కలిపిపెట్టాలి” అన్నాడు. వాడికి ఇప్పటికీ సొంతంగా కలుపుకోవడం రాదు. ప్రతి ఐటం కలిపి వాడి ప్లేటులో పెడితే తింటాడు.

చిలుకముక్కాకు పప్పు, మటిక్కాయ మిరప్పొడి, చారు. రెండు రోజులనుండి సరైన తిండిలేదేమో, పతంజలి బాగా ఇష్టంగా తిన్నాడు. మటిక్కాయ (గోరు చిక్కుడు) మిరప్పొడి వర్ధనమ్మ స్పెషల్‌. మటిక్కాయలు అంగుళం సైజు ముక్కలుగా వలిచి, పీచు తీసి, కంచు తపేలాలో పోపు వేసి, రోట్లో పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బెర, జీలకర్ర వేసి మెత్తగా దంచి, ఆ ముద్దను పోపులో వేసి, మగ్గిన తర్వాత, మటిక్కాయముక్కలు వేసి కలయబెడుతుంది. బొగ్గుల పొయ్యిమీద చాలాసేపు మగ్గుతుంది కూర. దాని రుచి వర్ణనాతీతం. రెండు రోజులైనా చెడిపోదు.

పిల్లలు బళ్లకు వెళ్లిపోయారు. వర్ధనమ్మ కాసేపు వంటింటి గడపమీద పాత చీర తల క్రింద పెట్టుకొని, నడుంవాల్చింది. తండ్రి బయటకు వెళ్లినట్లున్నాడు.

పతంజలి ఇంగ్లీషు పుస్తకం తెచ్చుకొని చదవడం ప్రారంభించాడు. మొదటి పద్యం ధామస్‌ గ్రే రాసిన ఎలిజీ రిటన్‌ ఆన్‌ ది కంట్రీ చర్చ్‌ యార్డ్‌ క్రింద ‘గ్లాసరీ’లో కఠిన పదాలకు అర్థం తెలుసుకున్నాడు. శ్మశానం గురించి అద్భుతంగా వ్రాశాడాయన

‘మెనీ క్రాంవెల్స్‌ & మిల్టన్స్ లై హియర్‌ పరెవర్‌ నాట్‌ టు వేకప్‌ అగెయిన్‌’

ఇలాంటి వాక్యాలు అండర్‌లైన్‌ చేశాడు. యాన్నొటేషన్స్ కోసం పద్యమంతా అవగతమయిన తర్వాత అతని హృదయం బరువెక్కింది అతనికి జాషువా బలిజేపల్లివారు గుర్తొచ్చారు. హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు కూడ ఇంచు మించు ఇలాగే ఉంటాయి.

“ఎన్నాళ్లీ చలనమ్ములేని శయనమ్ము”

“మాయామేయ జగమ్మె నిత్యమని”

అనే పద్యాలు గుర్తొచ్చాయి. వాటిని అద్భుతంగా పాడిన డి.వి. సుబ్బారావుగారి గ్రామ్‌ఫోన్‌ రికార్డు చాలాసార్లు విన్నాడు పతంజలి. రామాలయంలో అప్పుడపుడు వేస్తుంటారు. ఆ పద్యాలన్నీ వచ్చు పతంజలికి. ముఖ్యంగా

“వాకొన రాని గొప్ప ధనవంతుని నిక్కపు పాలరాతి గో

రీ కడ పారవేయబడి…. … అన్న పద్యం చాలా ఇష్టం అది ఆయన పాడుతూంటే కళ్లకు నీళ్లు వస్తాయి.

వెంటనే ‘గ్రే’ పద్యానికి నోట్సు తయారు చేశాడు. సందర్భసహిత వ్యాఖ్యలు తయారు చేశాడు. ఎస్సే కొశ్చన్‌కు ఆన్సర్‌ తయారు చేశాడు. కఠిన పదాలన్నీ ఒక చోట రాసుకున్నాడు. సాయంత్రం శంకరయ్యసారును ఆజంసారును కలిసి రావాలనుకున్నాడు.

నిమ్మ చెట్లకు ఎరువు పెట్టాలి. ఆ విషయం తండ్రితో చర్చించాడు. పశువుల ఎరువుగాక, వేప చెక్క (వేపనూనె ఆడించగా వచ్చే పిప్పి) కూడ వేయాలి. దాదాపు వెయ్యి రూపాయలు కావాలి.

“మన శెట్టి ఉన్నాడు కదా! సాయంత్రం వెళ్లి చెప్పిరా. ఒకవారం రోజుల్లో సర్దుబాటు చేద్దాము.” అన్నాడు తండ్రి. తోట నుండి నిమ్మకాయ మూటలు వచ్చాయి రేపు కర్నూలు వెళ్లిరావాలనుకున్నాడు.

రాత్రి 7 గంటలకు శంకరయ్య సారు యింటికి వెళ్లాడు. ఇంగ్లీషు సిలబస్‌, ఇంగ్లీషు గ్రూపు సిలబస్‌, తెచ్చుకున్న పుస్తకాలు చూపించాడు. శంకరయ్య సారు చాలా సంతోషించాడు. ‘గ్రే’ పద్యానికి తాను వ్రాసిన నోట్సు చూపించాడు. సారు చాలా సంతోషపడుతూ.

“సెంటెన్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కూడ బాగా ఇంప్రూవ్‌ అయింది. కీపిటప్‌ స్వామీ” అన్నాడు.

“ఆజం సారుకు ట్రాన్సఫరయింది తెలుసా” అని అడిగాడు.

“అయ్యో! నాకు తెలియదుసార్‌, ఎక్కడికి బదిలీ చేశారు?”

“సంజామల – మొన్ననే రిలీవయ్యారు. అక్కడ యిల్లు చూసుకుని వచ్చి, కుటుంబాన్ని తీసుకుని వెళతారు. నీకు వచ్చేవారం దొరుకుతారు”

“తప్పకుండా కలుస్తాను సార్‌” అని చెప్పి సెలవు తీసుకొని వచ్చేశాడు.

(సశేషం)

Exit mobile version