Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాఫల్యం-18

శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

పావుతక్కువ ఏడుకు ‘కార్వార్‌’ బస్‌ ఎక్కి కూర్చున్నారు.

***

రాత్రి పదిగంటలకు భోజనానికి ఒక దగ్గర ఆపాడు బస్సు. బెంగుళూరు దాటిన రెండు గంటల తర్వాత మొదలయింది కీకారణ్యం. పోను పోను ఘాట్‌ రోడ్డు దాదాపు వంద కిలోమీటర్లుంటుందని చెప్పాడు కండక్టరు.

అక్కడ భోజనం బాగుంది. హోటలు పేరు ‘అడయార్‌ ఆనందభవన్‌’. మీల్సుకు బదులు రొట్టెలు తిన్నారు. వేడిగా, మృదువుగా ఉన్నాయి. వాటిలోకి శనగలు, ఉర్లగడ్డలు, క్యారెట్‌, క్యాబేజీ, పచ్చి బటానీ కలిపి చేసిన కూర యిచ్చాడు. అది పొగలు కక్కుతూ చాలా రుచిగా ఉంది. దానిలో వేసిన మసాలా వాసన చాలా కమ్మగా ఉంది.

బాజిరెడ్డికి బాగా నచ్చింది. హోటల్‌ బయట కాఫీ కౌంటరుంది. అందరూ కాఫీ తాగుతున్నారు. కండక్టరు చెప్పాడు కన్నడంలో “మీరు కూడ తాగండప్పా. ఇక్కడ కాఫీ చాలా బాగుంటాది” అన్నాడు అర్థమయింది.

ఫిల్టర్‌ కాఫీ అది. పరమాద్భుతంగా ఉంది. మళ్లీ బస్సు బయలుదేరింది. పతంజలికి నిద్రపట్టలేదు. ప్రతిచోట ‘హెయిర్‌పిన్‌ కర్వ్‌ అహెడ్‌. డ్రైవ్‌ కేర్‌పుల్లీ’ అని బోర్డులున్నాయి. డ్రైవరుకు సమాంతరంగా ఉన్న రెండు సీట్లలో వీళ్లిద్దరూ కూర్చున్నారు. బాజిరెడ్డి గాఢంగా నిద్రపోతున్నాడు. పతంజలి బస్సు హెడ్‌ లైట్ల వెలుగులో రోడ్డును చూస్తూ కూర్చున్నాడు. శుక్లపక్షమేమో వెన్నెల పరచుకొని చుట్టు పక్కల కనపడుతూంది.

పాములా రోడ్డు మెలికలు తిరుగుతూ ఉంది. 90 డిగ్రీల కోణంలో బస్సును టర్న్‌ చేయడం పూర్తయ్యీ కాగానే మళ్లీ అంతటి మలుపు. డ్రైవరు తదేక దీక్షతో నడుపుతున్నాడు. అతని చోదన విన్యాసకౌశలం పతంజలికి అద్భుతమనిపిస్తుంది. ఎందుకో అతని గీతావాక్యం గుర్తొచ్చింది.

 “యోగః కర్మసు కౌశలమ్‌”

తాను చేసే పనియందు నైపుణ్యమే యోగమని భగవానుడు సెలవిచ్చి ఉన్నాడు. అది ఏ పనైనా సరే. ‘ఈ డ్రైవరు కూడ ఒక యోగి’ అనుకున్నాడు. రోడ్డుకొక వైపు కొండ. దానిమీద కాఫీ ప్లాంటేషన్లు. మరొక వైపు లోయ చాలా చోట్ల రక్షణ గోడ కూడలేదు. బస్సు అదుపుతప్పితే అంతే. లోయలో దాని ఆనవాలు కూడ దొరకదు.

పతంజలి తననే గమనిస్తూండడం డ్రైవరు గమనించాడు. ఒక్క క్షణం తల తిప్పి పతంజలిని చూసి చిరునవ్వు నవ్వాడు. పతంజలి చూపుడు వేలు బొటన వేలు కలిపి గుండ్రంగా చేసి, పైకెత్తి, డ్రయివరు వైపు చూపుతూ అభినందించాడు ‘సూపర్‌’ అన్నట్లుగా. ఏ భాషతోనూ పనిలేని పొగడ్త అది. డ్రయివరు కొంచెం తలవంచి ఆ పొగడ్తను స్వీకరించాడు.

దాదాపు రెండున్నర కావస్తుండగా ఒక చోట ఆపాడు బస్సు. అదీ నిర్జనారణ్యమే. అక్కడ ఒక హోటలుంది. రోడ్డు పొడవునా రెండు వైపులా బస్సులు, ఇతర వాహనాలు నిలిచి ఉన్నాయి. టీ, కాఫీ అమ్మే కౌంటరు మాత్రమే తెరచి ఉంది. చాలామంది తాగుతున్నారు.

బాజిరెడ్డి పిలిస్తే లేవలేదు. పతంజలి టీ తాగాడు చాలా బాగుంది. అంత వేసవిలో కూడ చిరుచలిగా ఉంది వాతావరణం.

మళ్లీ బస్సు బయలుదేరింది. ఈసారి డ్రయివరు మారాడు. అంతవరకు కండక్టరుగా చేసినతనే డ్రయివరు. ఇద్దరూ డ్రైవర్లనన్నమాట. మొదటి డ్రయివరు, డ్రైవరు సీటు వెనుక ఉన్న బెర్త్‌లో పడుకొని నిద్రబోయాడు. కాసేపటికి పతంజలికి కూడ నిద్రపట్టింది. మెలకువచ్చేసరికి బస్సు ‘కార్వార్‌’ బస్టాండులో ఆగి ఉంది. ప్రయాణీకులందరూ దిగిపోతున్నారు. బాజిరెడ్డి కూడ లేచి, పతంజలిని చూసి చిరునవ్వు నవ్వాడు.

“ఈ టర్నింగులమీద టర్నింగులకు సరిగ్గా నిద్రపట్టల్యాసామీ! నీవేమో బాగా నిద్రబోతివి” అన్నాడు. పతంజలి నవ్వాడు. కొందరంతే సరిగా నిద్రపట్టలేదు కొంచెం కూడ తినలేకపోయాను. ఇట్లా అనుకొని సంతృప్తి చెందుతారు. ఎవరికీ హాని చేయని బలహీనతల్లో ఇదొకటి.

బస్టాండులోనే కాలకృత్యాలు తీర్చుకున్నారు. అక్కడ విచారిస్తే, పదిమైళ్ల దూరంలో ‘తదిడి’ అన్న ఊరుందనీ, అదంతా సముద్ర తీరమనీ, ఎండు చేపలు అక్కడి నుండి చాలాచోట్లకు ఎగుమతి చేస్తారనీ చెప్పారు. దాని తర్వాత గోవా బోర్డరు ఎంతో దూరముండదని తెలిసింది. కార్వార్‌ కూడ పెద్ద టవునే.

కర్నాటక సముద్ర తీరప్రాంతం సౌత్‌ కెనరా. నార్త్‌ కెనరా అన్న రెండు జిల్లాలుగా ఉందని తెలుసుకున్నాడు. కన్నడభాష బాగానే అర్థమవుతుంది. లిపి కూడ తెలుగును పోలి ఉంది. మనుషులు స్నేహపాత్రులు. ఏదడిగినా వివరంగా, కొన్ని ఇతర విషయాలు కూడ జోడిరచి చెబుతున్నాడు. చక్కని గైడెన్స్‌ యిస్తున్నారు.

రామ్మూర్తి బావ పనిచేసే కెనరా బ్యాంకు పుట్టినిల్లు ఈ ప్రాంతమేనేమో అనిపించింది పతంజలికి.

కార్వార్‌ నుండి గోవాకు వెళ్లే బస్సులు కూడ ఉన్నట్లు గమనించాడు. ‘వాస్కోడగామా’ అని రాసి ఉంది. బస్సులపై. గుంటూరు హుబ్లీ ప్యాసింజరులో ఒక పెట్టి మీద ఆ పేరు చూసినట్లు గుర్తు.

బాజిరెడ్డి ‘నిమిత్త మాత్రంభవకౌంతేయ’ అన్నట్లుగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నాడు. అంతా సామి చూసుకుంటాడులే అన్న భరోసా.

‘తదిడి’ బస్సు వచ్చింది. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఊరు దాటగానే సముద్రం. ఇద్దరూ సముద్రాన్ని చూడటం అదే ప్రథమం. ఆ అనంత జలరాశి వాళ్లను చకితులను చేస్తూంది. రోడ్డుకు ఒక వైపు సముద్రం. ఒక వైపంతా కొబ్బరి తోటలు. మధ్యలో చిన్న ఊర్లు తగులుతున్నాయి. అరగంట లోపే ‘తదిడి’లో దిగారు.

సముద్రఘోష ఎడతెగకుండా వినిపిస్తూంది. పూర్తి పల్లెటూరు. ఆడవాళ్లు పైటలు లేకుండా తిరుగుతున్నారు. కేవలం జాకెట్‌ ధరించి. వారి వక్షోజ సంపదను నోరుతెరుచుకుని చూడసాగాడు బాజిరెడ్డి.

“ఇదేంది సామీ, శానా విచిత్రంగా ఉండాదే. రైకల మీద ఏమీ కప్పుకోకుండా తిరుగుతాండారు” అన్నాడు. “అది వాళ్ల ఆచారమేమోగానీ నీవు అట్లా చూడొద్దు. ఏమయినా అనుకుంటారు” అన్నాడు పతంజలి.

“కరెక్టు. ఈడెవడో చిత్తకార్తి నాకొడుకని తన్నినా తంతారు” అన్నాడు బాజిరెడ్డి.

బలహీనతను అంగీకరించే సంస్కారి అతను.

కనీసం ఒక కాఫీ హోటలయినా లేదు. అన్నీ పెంకుటిళ్లు. సముద్రపు ఒడ్డున పడవలు నిలిపి ఉన్నాయి. ఇసుక తెలుపు రంగులో సూర్యకాంతిలో మెరుస్తుంది.

అక్కడ అరుగుమీద ఒక పెద్దాయన కూర్చాని ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి తాము వచ్చిన పని చెప్పాడు పతంజలి. అతనికి కొంచెం తెలుగు అర్థమవుతంది.

“మీకు ఎంతకావాలి?” అని అడిగాడు

“ఒక లారీ లోడు 13 టన్నుల కెపాసిటి”.

అతను వీళ్లిదర్నీ ఒక యింటికి తీసుకొని వెళ్లాడు. “సిద్దరామప్పా, సిద్దరామప్పా” అని పిలిచాడు. లోపల్నించి ఒకతను వచ్చాడు. ప్యాంటు షర్టు, చేతికి వాచి, కొంచెం ఆధునికంగా ఉన్నాడు. అతను సిద్దరామప్పతో మాట్లాడి వీళ్లిదర్నీ పరిచయం చేశాడు.

“ఆప్‌ కో హిందీ మాలూం” అనడిగాడతడు.

సమస్య తీరిపోయినందనుకొన్నాడు పతంజలి. ఔనని చెప్పాడు.

“హిందీ అయితే నాకూ కొంచెం మేలే” అన్నాడు బాజిరెడ్డి. కర్నూలు నిమ్మకాయల సాయబులతో మాట్లాడి కొంచెం అలవాటయింది.

విషయం అర్థమయింది సిద్దరామప్పకు. అతడు ఏజంటులాంటివాడని గ్రహించాడు పతంజలి.

“తీన్‌ చార్‌ జగేమే ఇస్తమాల్‌ కర్నాహోగా, తేరాటన్‌ గాడీ కో భరానే కేలియే దో దిన్‌ లగే గా. మచ్చీ కా ఆఠ్ సౌ రుపయే హోగా. మేరా కమీషన్‌ ఆప్‌ కా మర్జీ. ఆప్‌ ఖుషీ సౌ జోదేతే, వోలూంగా” అన్నాడు.

“పహలే హీ బోలియే మెహనత్‌ ఆప్‌ కా హై. బాద్‌ మే జగడానై హోనా” అన్నాడు పతంజలి.

“ముఝే పచాస్‌ రూప యే దీజియే బస్‌” అన్నాడు.

“లోడింగ్‌ కరనే కేలియే?”

“పచాస్‌ రూపయే లేతే”

తగ్గించమంటే కాసేపు తర్జనభర్జన తర్వాత ఏడువందలకు 13 టన్నుల లారీలోడు నింపేటట్లు, కూలీలకు, కమీషన్‌ ఒక వంద మొత్తం ఎనిమిది వందలకు బేరం కుదిరింది. “తిక్కనాయండ్ల మాదిరున్నారు ఇంత అగ్గవా?” అన్నాడు బాజిరెడ్డి ఊరుకోమనట్లు సైగ చేశాడు పతంజలి.

ఉల్లిపాయలు వేసే గోనె సంచులు పెద్ద పెద్దవి కుట్టి. వాటిల్లో చేపల ఎరువుని నింపుతారట. గోనె బస్తాలకు ఏమీ ఇవ్వక్కరలేదు. లారీ గోవా నుండి గాని కార్వార్‌ నుండి గాని మాట్లాడుకోవాలంట. గోవాలో లారీ బ్రోకర్‌ ఆఫీసులో తనకు తెలిసినవాళ్లున్నారట. తానే అరేంజ్‌ చేస్తాడట. దానికి తానేమీ ఆశించడట. బహుశా వాళ్లే వస్తారేమో అనుకున్నాడు పతంజలి.

తనతో పాటు ఇద్దర్నీ తీసుకుని పోయి ముగ్గురు నలుగురికి పరిచయం చేశాడు. వాళ్లతో వేరే భాషలో మాట్లాడాడు. కొంకిణి భాషేమో అని అనుకున్నాడు.

ఇసుకలో చేపలు ఎండబెట్టి ఉన్నాయి. తీరం వెంబడి చాలా దూరంగా అవే కనబడుతున్నాయి. ఎండిన చేపలను తీసిన తర్వాత జల్లెడ పడుతున్నారు. చాలా పెద్ద జల్లెడ. నాలుగడుగుల పొడవు. రెండున్నర అడుగుల వెడల్పు ఉంది. రెండు వైపులా ఇద్దరు పట్టుకోడానికి పిడులున్నాయి. చేపలకంటిన యిసుక తొలగిపోయి పొట్టు, పొలుసులు, వేస్ట్‌ అంతా క్రిందికి పడిపోయి, ఆ చేపలను పెద్ద పెద్ద తాటాకుబుట్టలలో నింపుతున్నారు. ఆ క్రింద మిగిలిన చెత్తనే ఎరువుగా వాడతారని అర్థమయింది.

ఎల్లుండి కల్లా రడీ చేస్తామని చెప్పారు. అంతకుముందే వచ్చిన వేస్ట్‌ను మన ఎరువు దిబ్బల్లాగా కుప్పలు పోసి ఉన్నారు. గోనెల్లోకి నింపేటప్పుడు మనం దగ్గరుండాలి. లేకపోతే ఇసుక, పెద్ద పెద్ద ఎముకలు, ఫిష్‌ వేస్ట్‌ కానివి కూడ నింపేస్తారనీ జాగ్రత్తగా లోడ్‌ చేయించుకోవాలనీ చెప్పాడు సిద్ధరామప్ప. ఏరోజు కారోజు గోనె సంచుల్లో నింపి ఒకచోట పేర్చుకుంటే బాగుంటుంది. చివరి రోజు లోడ్‌ చేసుకోవచ్చు అన్నాడు.

“ఈ మూడు రోజులూ మేం ఉండటానికి ఇక్కడేం వసతులు లేవా?” అని అడిగాడు పతంజలి.

“ఇక్కడేం ఉండవు. ఆరు కిలోమీటర్ల దూరంలో గోకర్ణం ఉంది. అక్కడ హోటళ్లు, లాడ్జిలు ఉంటాయి.”

“ఇక్కడ్నించి గోకర్ణానికి బస్సులున్నాయా?”

“ఒక్కటే ఉంది. ఇక్కడికి దగ్గరలో ‘మత్స్యగుండం’ అనే ఊరుంది. గోకర్ణానికి మత్స్యగుండానికి మధ్య షటిల్‌ అది. రోజులో నాలుగుసార్లు అటూ, నాలుగుసార్లు ఇటూ తిరుగుతుంది. కాసేపట్లో గోకర్ణం వైపు వెళ్లే టైమైంది”.

పతంజలి బాజిరెడ్డితో అన్నాడు “ఐతే మనం గోకర్ణం పోదాం. అక్కడెక్కడయినా లాడ్జిలో ఉండి స్నానం, టిఫిన్‌ చేసి వద్దాం.”

“కరెక్టు” అన్నాడు బాజిరెడ్డి.

అందరూ రోడ్‌మీదికి వచ్చారు. కాసేపట్లో బస్సొచ్చింది. కిటకిటలాడుతూ ఉంది. బస్సుపైన కూడ కొంతమంది ఎక్కారు. కండక్టరు వీళ్లను చూసి “ఎక్కడికి?” అని అడిగాడు కన్నడంలో. “గోకర్ణం” అన్నాడు సిద్ధరామప్ప. “పైన ఎక్కండి లోపల చోటులేదు.”

అప్పుడే బాజిరెడ్డి బస్సు వెనక ఉన్న నిచ్చెన ఎక్కసాగాడు, “రా సామీ” అంటూ పిలుస్తూ.

పతంజలి కూడ పైకి చేరుకున్నాడు. వీళ్లతోబాటు మరి ఇద్దరెక్కారు. కండక్టర్‌ పైకి వచ్చి అందరికీ టికెట్లిచ్చాడు.

“ఈ రూట్లో ఒకే బస్సు ఇది. ఎప్పుడూ యిట్లే ఉంటుంది” అంతా ఘాట్‌ రోడ్డే దిగువన సముద్రం.

“మన రేనాట కూడ బచ్చుల మీదెక్కుతారు. ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల రూట్లో” అన్నాడు బాజిరెడ్డి ఇదేమీ విచిత్రం కాదన్నట్టు.

అప్పటికి పది కావస్తుంది. దిగి రోడ్డు వెంట నడవసాగారు. బాజిరెడ్డితో చెప్పాడు పతంజలి.

దక్షిణ భారతదేశంలోని అతి పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివక్షేత్రం, ఇది ఇక్కడ లింగం రావణుడు ప్రతిష్ఠించాడు. శివుని అనుగ్రహం పొంది, ఆత్మ లింగం సాధించి వెళుతూంటే సాయంకాలమవుతుంది. అప్పుడు వినాయకుడు పశువుల కాపరి రూపంలో….” అని చెప్పుకుంటూ పోతుంటే బాజిరెడ్డి

“నేను సముద్రంలో పూజ జేసుకొచ్చా. కూసింత ఈ లింగం బట్టుకొని నిలబడు. అసలు కింద బెట్టమాకు. తొందరగ వచ్చేత్తా అంటాడు. నేను మూడుసార్లు పిలుచ్చా రాకపోతే కిందపెట్తా అంటాడా పిల్లోడు. రావనాసురుడు రాకముందే మూడుసార్లు పిలిచి కింద పెట్టేచ్చాడు. అది యన్టీవోడు ఎంత పీకినారాదు” అన్నాడు.

“అమ్మో నీకంతా తెలుసే”

“భూకైలాస్‌ సినిమాలో చూపిచ్చిండ్లా, యా నాటిమాట” యన్టీఆర్‌ పుణ్యమా అని మన పురాణాలు ఇతిహాసాలు అందరికీ తెలిసినాయనుకున్నాడు పతంజలి.

ఎదురుగా వస్తున్న మనిషిని లాడ్జిల గురించి అడిగారు.

“పెద్దలాడ్జీలు అంతగా లేవు. గుడి పూజార్లు, కొందరు బ్రాహ్మలు వాళ్ల యింట్లోనే భోజనం, టిఫిన్‌ పెట్టి, మిద్దె మీద చిన్న రూముల్లాంటివి ఇస్తారు.” అన్నాడాయన.

ఊరంతా ఎర్రటి దుమ్ము. ఆ దుమ్ములో కూడ శివుడు కనిపస్తున్నాడు పతంజలికి. అనిర్వచనీయమయిన ఏదో ఒక పవిత్రత ఆ ఊరినంతా వ్యాపించి ఉంది. కమర్షియల్‌ హంగులు ఇంకా కలుషితం చేయని క్షేత్రం అని తెలుస్తూ ఉంది.

నాలుగడుగులు వేశారో లేదో, ‘మార్కండేయవిలాస్‌’ అన్న బోర్డు కనబడింది. బోర్డు దుమ్ము పట్టి ఉంది. గట్టిగా లాగితే ఊడివచ్చేలా ఉంది. బయట ఒక ముసలాయన నిలబడి ఉన్నాడు.

“బర్రి బర్రి” అంటా వీళ్లను ఆహ్వానించాడు. కావిరంగు పంచె గోచి పోసి మోకాళ్ల వరకు పైకి కట్టుకున్నాడు. మెడలో యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, నుదుట విభూతి రేఖలు తీర్చిదిద్దినట్లున్నాయి. గంధం కుంకుమ ధరించాడు. సాక్షాత్తూ శివస్వరూపంలా ఉన్నాడు.

అప్రయత్నంగా ఆయనను అనుసరించారిద్దరూ “ఎక్కటి నుంచి వచ్చారు? దర్శనానికేనా” అనడిగాడు కన్నడంలో. ఆయనకు హిందీ రాదట. వీళ్లకు కన్నడం చూచాయగా అర్థమయితుంది గాని, మాట్లాడ్డం రాదు.

పతంజలి తాము వచ్చిన పని వివరించాడు. “మూడు రోజులుంటామనీ, గది కావాలనీ, భోజనం టిఫిన్‌ పెట్టాలనీ ఎంతవుతుందనీ” అడిగితే “డబ్బుదేముంది” అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడాయన. తన వెంట రమ్మని ఇంటి వెనక్కు తీసుకొని వెళ్లాడు. అక్కడ తాటి నిచ్చెన ఉంది ఎక్కడానికి వీలుగా తాటి మొద్దులు వెడల్పుగా ఉన్నాయి. ఎక్కి వెళితే చిన్న గది ఉంది. మట్టి నేల. శుభ్రంగా ఉంది. రెండు చాపలు పరచి ఉన్నాయి. గోడలో చిన్న చిన్న గూళ్లు రెండున్నాయి. ఇరవై ఐదు క్యాండిళ్ల బల్బు చూరుకు వేలాడుతుంది.

పైకప్పు కూడ తాటి దూలాలమీద వెదురు చాపలు వేసి దాని మీద ఏదో గడ్డి కప్పినట్లున్నారు. ఒకవైపు చిన్నకిటికీ. అది తెరిస్తే సముద్రం కనపడుతూంది. ఒడ్డున శివుని దేవాలయము గోపురంతో సహా. బ్యాగులు ఆ గూట్లో పెట్టుకోమని చెప్పాడాయన. స్నానం, వగైరా క్రింద అని చెప్పాడు. బ్రష్‌, పేస్టు తీసుకొని టవళ్లు భుజాన వేసుకుని క్రిందికి వెళ్లారు. పెరట్లో బావి ఉంది. చేయి వంచితే ఇంచుమించు అందేంత పైకి ఉంది నీరు. దూరంగా లెట్రిన్‌. దాని తలుపు చివికిపోయి నామమాత్రంగా ఉంది.

కాలకృత్యాలు కార్వార్‌ బస్టాండులోనే పూర్తయ్యాయి. మొహం కడుక్కొని నూతి దగ్గర స్నానాలు చేశారు. ఆ నీరంతా మొక్కలకు పోయేలా చిన్న కాలువలు తీశారు. ఒక మూల రెండరటి చెట్లు. కూర అరటిగెలలు దిగి ఉన్నాయి. నంది వర్ధనం చెట్టు విరగకాసి ఉంది. చామంతులు, చెండు పూలు (ముద్ద బంతి) కళ కళలాడుతూంది పెరడు.

ముసలాయన వీళ్లను లోపలికి తీసుకొని వెళ్లాడు. ఒక చిన్న హాల్లో చాపలు పరచి ఉన్నాయి. కూర్చోమని చెప్పాడు.

 “కాత్యాయనీ!” అని పిలిస్తే రెండు కంచు గ్లాసుల్లో కాఫీ తీసుకొని వచ్చింది ఒక ముత్తయిదువ. ఇద్దరికీ యిచ్చింది. ఆయన ఆమెకు వీళ్ల గురించి చెప్పాడు. ఆయన పేరు ‘ముచికుందప్ప’ అని చెప్పాడు అడిగితే. ఒక్కతే కూతురనీ, పెళ్లి చేసి పంపారనీ, అల్లుడు కార్వార్‌ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో అర్చకుడనీ వాళ్లకు ఇద్దరు కొడుకులనీ చెప్పాడు.

“రోజూ ‘తదిడి’ పోయి సాయంత్రానికి వస్తాము” అంటే “బస్సులు సమయానికి ఉండవనీ, అద్దెకు సైకిళ్లు ఇప్పిస్తాననీ చెప్పాడు.

“టిఫను, టిఫను” అన్నాడు బాజిరెడ్డి.

టిఫను టైం అయిపోయిందనీ, ఒక గంట ‘తాళితే’ వంటవుతుందనీ, ఈలోగా దర్శనం చేయిస్తాననీ చెప్పాడు. వీళ్లకు అర్థం కావాలనీ ప్రతిదీ అభినయించి చూపుతున్నాడు.

కాత్యాయనమ్మ కాశెపోసి నేతచీర కట్టుకుంది. కొద్దిగ లావుగా పచ్చగా ఉంది. నుదుట కుంకుమబొట్టు మెరుస్తూంది. చేతికి మట్టిగాజులు మెడలో నల్లపూసలు తప్ప ఏ నగలూ లేవామెకు.

భార్యాభర్తలిద్దరూ నిరంతరం నవ్వుతూనే ఉండటం గమనించాడు పతంజలి. ఇద్దరి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తూంది. దీన్నే “బ్లిస్” అంటారేమో తృప్తి (contentment) వల్ల వచ్చిన ఆనందమంది.

దైవదర్శనంతో ప్రారంభిస్తే, వచ్చినపని నిర్విఘ్నంగా పూర్తవుతుందని పతంజలి చెప్పాడు బాజిరెడ్డితో. “కరెక్టు” అన్నాడాయన. ఏకీభవించడంలో బాజిరెడ్డి మొనగాడు.

షర్టు విప్పేసి, భుజాన టవలు కప్పుకొని బయలుదేరారు ముచికుందస్వామి వెంట. గుడి అరకిలో మీటరు కంటె ఎక్కువ లేదు. సముద్రుడు తన అలలతో గుడి ప్రాకారాన్ని స్పృశిస్తున్నాడు. లోపలికి వెళ్లారు. డైరెక్టుగా గర్భగుడిలోకి వెళ్లారు. చిన్న లింగం. ఆవు చెవి ఆకారంలో ఉంది. సంకల్పం చెప్పి, గోత్ర నామాలతో అభిషేకం ప్రారంభించాడాయన. ఆయనలాగే ముగ్గురు నలుగురు అర్చకులు భక్తులతో అభిషేకాలు చేయిస్తున్నారు. సుస్వరంగా నమకం, చమకంలోని తొలి పనస చెప్పి అభిషేకం చేయించాడు. పతంజలి కూడ ఆయనతో గొంతు కలిపాడు. ఆయన ప్రశంసగా తల ఊపుతూ కొనసాగించాడు. ఆయన వేగాన్ని అందుకోలేకపోయాడు పతంజలి. స్వహస్తాలతో అభిషేకం చేస్తూన్నందుకు బాజిరెడ్డి పరమానందం పొందాడు.

అభిషేకం తర్వాత బిల్వపత్రాలు, పూలతో అర్చన చేయించి హారతి యిప్పించాడు. ఎవరి పూజ వారిదే.

అరటిపండు ప్రసాదం, తీర్థం స్వీకరించి బయటకు వచ్చారు. “నమక చమకములు బాగా సెప్తివే” అన్నాడాయన.

 “మా సామికి రాని పని లేదు. సేజ్జం జేచ్చాడు. బియ్యే సదువుతుండాడు” అన్నాడు బాజిరెడ్డి గర్వంగా.

ఆ మహాశివ క్షేత్రంలో స్వామికి అభిషేకం చేసుకునే అవకాశం అదృష్టం కలిగినందుకు పతంజలి మనస్సు తృప్తితో, భక్తితో నిండిపోయింది.

అప్పటికి పన్నెండయింది. ఆకలి నకనకలాడుతుంది. ఇంటికి వెళుతూనే కాత్యాయనమ్మ విస్తరాకులు వేసింది. బాదం ఆకులతో కుట్టినవేమో ఆకుపచ్చగా మెరుస్తున్నాయి. ముందు కొద్దిగా ఉప్పు వడ్డించింది. తర్వాత రోట్లో నూరిన చింతకాయ తొక్కు. తర్వాత పొగలు కక్కే అన్నం. బియ్యం కొంచెం ముతకగా ఉన్నాయి. అన్నంలావుగా ఉంది. అన్నం మీద నెయ్యి వేసిందామె. చింతకాయ తొక్కుతో కలిపి తింటుంటే అద్భుతంగా ఉంది రుచి. మళ్లీ అన్నం పెట్టి ‘కూటు’ వడ్డించింది. సాంబారుకు పప్పుకు మధ్యస్థంగా గరిట జారుగా ఉందది. దాన్ని కూటు అంటారని ఆమె చెప్పింది. మిరియాల ఘాటు తెలుస్తూంది. కొబ్బరి కోరు వేసి, కొంచెం బెల్లం వేసింది. రెండుసార్లు కలుపుకున్నారు. మళ్లీ అన్నం తెస్తే ఇంక చాలన్నారు. మజ్జిగాన్నం తినడానికి కడుపులో చోటేది?

రెండు సిల్వర్‌ గ్లాసులలో మజ్జిగ ఇచ్చి, తాగందే ఊరుకోలేదా అన్నపూర్ణమ్మ. పల్చని మజ్జిగ అమృతంలా ఉంది. సన్నగా పచ్చిమిర్చి అల్లం, కొత్తిమీర తరిగివేసి పోపు పెట్టింది. కుండలో మజ్జిగేమో కొంచెం మట్టి వాసన వేస్తూ, చల్లగా కమ్మగా ఉంది.

పైకి వెళ్లి చాపల మీద కాసేపు నడుం వాల్చారు. రెండు గంటలకల్లా లేచి బయలుదేరారు. దగ్గరలోని సైకిలు షాపుకు తీసుకెళ్లాడు ఆయన. రోజూ తదిడి వెళ్లి వస్తారనీ, తన దగ్గరే బసచేశారనీ చెప్పాడు. ఒకరకంగా సైకిళ్లకు ‘షూరిటీ’ ఇచ్చాడన్నమాట.

గంటకు బాడుగ పావలా. పొద్దున్నించి సాయంత్రం వరకైతే రూపాయిన్నర. రాత్రి 8 గంటలకు తెచ్చివ్వాలి. ఇవ్వకపోతే మరో అర్ధరూపాయ వరుసగా సైకిళ్లు స్టాండ్లు వేసి ఉన్నాయి. వెనక మడ్‌గార్డు మీద తెల్లని పెయింట్‌ వేసి ‘శరవణ’ అని కన్నడంలో రాసి సైకిలుకు నంబర్లు వేసి ఉన్నారు. ఆ అంకెలు కూడ కన్నడంలోనే ఉన్నాయి.

రెండు సైకిళ్లు ఇచ్చాడాషాపతను. రెండూ హెర్కులిస్‌ సైకిళ్లే. ధృఢంగా ఉన్నాయి. నల్లగా మెరుస్తున్నాయి. అడ్వాన్సు ఇవ్వబోతే వద్దన్నాడు “ఆయన చెప్పింత తర్వాత తిరుగేముంది” అని దానర్థం.

తదిడికి వెళ్లడం మాత్రం చాలా సులభం. అంతా దిగుమారు (down) ఘాట్‌ రోడ్‌లో టర్నింగ్‌లు తిరుగుతూ అరగంటలో తదిడి చేరుకున్నారు. బాజిరెడ్డికూడ అవలీలగా సైకిలు తొక్కాడు.

సిద్ధరామప్ప వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. “ఏమప్పా ఇంత బిడువు చేస్తిరి” అన్నాడు. ఇసుకలో నడుచుకుంటూ వెళ్లారు. ఇద్దరు కూలీలు, ఒక మగ, ఒక ఆడ సిద్ధంగా ఉన్నారు. ఫిష్‌ వేస్ట్‌ అంతా ఒక చోట కుప్పపోసి ఉంది. గోనె సంచులు కట్‌ చేసి కుట్టిన పెద్ద పెద్ద ఖాళీ బస్తాలు తెచ్చి ఉన్నారు.

చేపల చెత్తను చేతులతో విదిలించి, ఇసుక రాలేలా చేసి సంచుల్లో నింపసాగారు. ఆ ఆడమనిషి ధృఢంగా ఉంది. జాకెట్టు మీద ఏ అచ్చాదనాలేదు. ఆమెకా ధ్యాసేలేదు. నవ్వుతూ పని చేస్తూంది. బాజిరెడ్డి నోరు తెరుచుకొని ఆమె వక్షోజాలవైపే చూడడం గమనించి, మోచేత్తో పొడిచాడు పతంజలి.

తప్పయిపోయిందన్నట్లు చూసి చూపులు మరల్చుకున్నాడు బాజిరెడ్డి. ఆయన చూపుల్లో కామ భావన కంటే కుతూహలం ఆశ్చర్యమే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయను కున్నాడు పతంజలి. అయినా వాళ్లు ఇంకోరకంగా అర్థం చేసుకుంటే కష్టమని ఆయన్ను వారించాడు.

సాయంత్రం ఆరు లోపల దాదాపు ఇరవై గోతాలయ్యాయి. అన్నిటినీ మోసుకొచ్చి రోడ్డు పక్కన పేర్చారు. దాదాపు అలాంటివి వందకు పైగా వస్తాయన్నాడు సిద్ధరామప్ప. ఒక్కో బస్తాలో నూట ఇరవై కేజిల దాకా తూగుతుందని చెప్పాడు.

అడ్వాన్సు ఏమీ అడగకపోవటం ఆశ్చర్యం కలిగించింది. నమ్మకమే దేనికైనా ప్రాతిపదిక. ఇద్దరూ గోకర్ణం బయలుదేరారు. అంతా ఇప్పుడు ఎగుమారు (up) కొన్ని చోట్ల తొక్కలేక దిగి సైకిళ్లను తోసుకుంటూ నడిచారు. గోకర్ణం చేరుకోడానికి గంటకు పైనే పట్టింది.

పార్వతీ పరమేశ్వరులిద్దరూ ముందున్న చిన్న అరుగుమీదే కూర్చుని రేపటికి చిక్కుడు కాయలు వలుచుకుంటున్నారు. వీళ్లిద్దర్నీ చూసి నవ్వుతూ ఆహ్వానించారు. కాత్యాయనమ్మ వేడిగా కాఫీ యిచ్చింది.

రాత్రికి మాత్రం రోజూ టిఫినే పెడతారట. మధ్యాహ్నం తిన్నది సైకిలు తొక్కడం వల్ల హరించుకుపోయిందెప్పుడో. సముద్ర తీరం కాబట్టి చల్లగా ఉన్నా, ఒళ్లంతా చిరచిరగా వుంది. పెరట్లో నూతి దగ్గర హాయిగా స్నానాలు చేశాడు. కాసేపు అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నారు. పైకి వెళ్లి ఇద్దరి డబ్బులూ దాదాపు మూడు వేల ఐదు వందలు ఒక గుడ్డలో కట్టి, ముచికుందస్వామికి దాచమని ఇచ్చారు. ఆయనేమీ వద్దనలేదు. లోపలికి తీసుకుపోయి ఒక చెక్క భోషాణంలో దాచాడు. దానికి తాళం వేసి, తాళం చెవి బోడ్లో దోపుకున్నాడు తాడు కట్టి.

ఎనిమిదిన్నరకు కాత్యాయనమ్మ పిలిచింది. కొంచెం చిన్న సైజు బాదం ఆకులు వేసి ‘ఉప్పుడు పిండి’ వడ్డించింది. ఆకుల నిండా దానిమీద చట్నీ పోడి వేసి నెయ్యి పోసింది. కంచు తపేలాలో బొగ్గుల పొయ్యి మీద వండినట్లుంది. దాంట్లో కూడ పెసరపప్పు, మిరియాలు వేసింది. అద్భుతంగా ఉంది.

“మా అమ్మ కూడ సేం ఇలాగే చేస్తుంది” అన్నాడు పతంజలి. “కానీ మేము మిరియాలు వెయ్యం”

రెండోసారి కూడ పెట్టించుకొని సుష్టుగా తిన్నారు. పైకి వెళ్లి సంచులు తలక్రిందపెట్టుకొని, చాపల మీద పడుకున్నారు. కిటికీ తెరిచి ఉంచారు. చల్లనిగాలి విసురుగా వీస్తూనే ఉంది రాత్రంతా ఒళ్లెరగకుండా నిద్రబోయారిద్దరూ.

ఉదయం లేచి ఎనిమిది కల్లా తయారుయ్యారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చిపోవడం కష్టం కాబట్టి ఇప్పుడు తినేసి, కొంత క్యారియర్‌ కట్టిస్తాను తీసుకు వెళ్లమన్నాడాయన. వేడి వేడి “బిసిబెళిబాత్‌” పెట్టింది అన్నపూర్ణమ్మ తల్లి. అన్ని రకాల కూరగాయలు. కందిపప్పు బియ్యం కలిపి వండుతారది. కర్నాటకలో ఫేమస్‌. వెల్దుర్తిలో వర్ధనమ్మ కూడ చేస్తుంది అప్పుడప్పుడు. అమ్మ చేసేది కొంత ఘాటుగా వుంటుంది. ఇది ప్లెయిన్‌గా ఉంది.

ఒక ఇత్తడి టిఫిన్‌ క్యారియర్లో బిసి బెళిబాత్‌ పెట్టిచ్చాడు ముచికుందస్వామి. పెట్టుకుని తినడానికి రెండు ఆకులు, ఒక హస్తం ఇచ్చాడు. అన్నీ ఒక చేతి సంచీలో పెట్టుకొన్నారు. సైకిలు హ్యాండిల్‌కు బ్యాగ్‌ కట్టుకొని, ఇద్దరూ సైకిళ్ల మీద ‘తదిడి’ చేరుకున్నారు.

ఈ రోజు ఇంకో చోట కూలీలు మారారు, నిన్నటి కంటే పెద్ద కుప్పే. మధ్యాహ్నానికి ముఫ్పై బస్తాలయ్యాయి. నిన్న సాయంత్రం పేర్చిన చోటే పేర్చారన్నీ సిద్ధరామప్ప ఇంటిముందు అరుగు మీద కూర్చుని, ఆకుల్లో ‘బిసిబెళిబాత్‌’ వడ్డించుకొని తిన్నారు. ఇంకా వెచ్చగా ఉంది సిద్దరామప్ప చెంబుతో నీళ్లు తెచ్చిస్తే తాగారు.

మళ్లీ రెండు గంటలకు మరో చోట పని మొదలయింది. ఇక్కడ ముక్కలే కాకుండా పెద్ద పెద్ద ఎండిన చేపలు కూడ ఉన్నాయి. వాటిని చితకొట్టి బస్తాల్లో వేశారు. ఇసుక బాగా దులిపించి, వేయిస్తున్నారు. కొన్ని పాము ఆకారంలోని చేపలు కూడ ఎండినవి వచ్చాయి. మధ్యలో ఎండ్రకాయలు (పీతలు) వస్తే తీసేయించారు. మొత్తం మీద ఈ ఎరువు పొడిపొడిగా నాణ్యంగా ఉంది. సాయంత్రానికి ఇరవై బస్తాలు నింపి, పేర్చారు.

లారీ కోసం మనిషిని కార్వార్‌కు పంపించాననీ, రేపు రాత్రికి లోడ్‌ చేయిస్తాననీ చెప్పాడు సిద్ధరామప్ప. కర్నూలుకు పద్దెనిమిది వందలు అడిగారనీ, డ్రైవరు బేటా యాభై రూపాయలనీ, దారిలో అతని భోజనం ఖర్చులు మనమే పెట్టుకోవాలనే చెప్పాడు. ఒకవేళ కార్వార్‌లో ‘వేబ్రిడ్జి’ మీద తూకం వేస్తే, పదమూడు టన్నులకు ఎక్కువ తూగితే అదనంగా ఇవ్వాలని చెప్పాడు. మీరు సరే అంటే ఒక వంద రూపాయలు బయానాగా యిచ్చి రేపు పొద్దున్న పంపి ఖాయం చేస్తానన్నాడు. రేపు రాత్రి ఏడుగంటలకు లారీని రమ్మంటాననీ, మీరు గోకర్ణం నుండి ఏకంగా వచ్చేస్తే మంచిదన్నాడు. హిందీలో అతను చెప్పిందంతా చక్కగా అర్థమయింది.

(సశేషం)

Exit mobile version