Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాఫల్యం-31

శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

[ఎండు చేపల ఎరువు తెచ్చి వేసిన నిమ్మతోట పాడయిపోతుంది. డబ్బు వృథా అవుతుంది. వివిధ పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతుంటాడు పతంజలి. రెండు ఎద్దులనూ తోకోనికే తక్కువ ధరకు ఇచ్చేశారు. గణపతిని సంతలో అమ్మేస్తారు. కానీ అది ఆ వీళ్ళని వదలలేక, తిండి తినకుండా ఉండి పోతుంది. వారంత తర్వాత కొన్నవాళ్ళు గణపతిని తెచ్చి ఇచ్చేసి డబ్బు తీసుకుపోతారు. మస్తాన్ వలీ అనే అనే అతను నీళ్ళ బండికి ఎద్దు కావాలని వచ్చి గణపతిని కొనుక్కుంటాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పి గణపతిని అప్పగిస్తారు. మల్లినాధను శ్రీశైలంలో వేద పాఠశాలలో చేర్పిద్దామని తలుస్తారు. – ఇక చదవండి.]

ల్లినాధ కూడ దానికే మొగ్గుచూపాడు. నాన్నతో పాటు శ్రీశైలం వెళ్లి వేదపాఠశాలలో చేరాడు. కరివెనవారి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో భోజన వసతి. నలుగురు విద్యార్థులకు ఒక గది యిచ్చారు. వెల్దుర్తి నుండి శ్రీశైలానికి డైరెక్ట్‌ బస్సు సౌకర్యం ఉంది. అనంతపురం శ్రీశైలం బస్సు. దేవస్థానం వారిదే. అర్టీసీ వారి వల్ల ఆ బస్సు రీప్లేస్‌ చేయబడలేదు.

చిన్నాడు తొమ్మిదో తరగతిలోకి వచ్చాడు. వాడు చాలా తెలివైనవాడు. ఏ సబ్జెక్టులో నూటికి 90 మార్కులకు తగ్గవు. వాడి భవిష్యత్తు గురించి పతంజలికి ఎన్నో ప్రణాళికలున్నాయి.

ఇంటర్మీడియట్‌ బోర్డు (ఎ.పి) వారు గత సంవత్సరం నుండే ప్రయివేటు అభ్యర్థులను అనుమతిస్తున్నారు. మహితని ఇంటర్‌ పరీక్షలకు కట్టించాడు పతంజలి. కర్నూలులోనే సెంటరుంటుంది. ఐదు రూపాయలు చలానా పంపి బోర్డు నుండి అటెండెన్స్‌ ఎగ్జంప్షన్‌ కోసం దరఖాస్తు తెప్పించాడు. వెల్దుర్తిలోనే చిన్న ఫోటో స్టూడియో వెలసింది. ఫోటోలు తీయించి, ఫారం నింపించి, 50 రూపాయలు ఎగ్జంప్షన్‌ ఫీజు చలానా కట్టి, పంపించాడు. ఆర్ట్స్‌ గ్రూపే. మహిత టెంత్‌ పాసయింతర్వాత రెండు సంవత్సరాలు దాటింది కాబట్టి, ఫస్టియర్‌ సెకండియర్‌ పరీక్షలన్నీ ఒకేసారి రాయవచ్చు. కర్నూలు నుండి అన్ని సబ్జెక్టులకూ అపోలో గైడ్స్‌ కొనుక్కొని తెచ్చిచ్చాడు. మహిత ఉత్సాహంగా చదువుకోసాగింది.

సెయిల్‌ వారి పరీక్షకు బొంబాయి వెళ్లడానికి పతంజలి సిద్ధమయ్యాడు. కానీ, పి.ఓ. పరీక్షలలాగే కష్టంగా ఉంటుందనుకున్నాడు. పైగా బొంబాయి వెళ్లి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమనిపించి, విరమించుకున్నాడు.

తర్వాత జి.ఐ.సి (జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ యిండియా) వారి ఎ.ఎ.ఏ. (అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌) పరీక్ష కర్నూలులో వ్రాశాడు. న్యూమరికల్‌ ఎబిలిటీ మాత్రం అతనికి కొరకరాని కొయ్యగా మారింది.

రాధాసారుకు అసిస్టెంటు డైరెక్టరుగా ప్రమోషను వచ్చింది. ఆయనను కర్నూలుకే బదిలీ చేశారు. ఆయన వెళ్లి ఛార్జి తీసుకుని, విద్యానగర్‌లో ఇల్లు తీసుకుని, వెల్దుర్తి నుండి మారిపోయాడు.

పొలంలో హైబ్రీడ్‌ తెల్ల జొన్నవేశారు. తోకోడు దాన్ని ‘అయ్యపురెడ్డి జొన్న’ అంటాడు, హైబ్రీడ్‌ అనే పదం పలకడానికి రాక. వాడికిచ్చిన ఎద్దులతోనే బాడుగకు దుక్కి దున్నడం, గుంటక తోలడం గొర్రు తోలడం లాంటి పనులు చేస్తున్నాడు. ఈమధ్య వాడికి కూతురు పుట్టింది. కొత్తూరు సుబ్బరాయుడి కృపవల్ల కలిగిన పిల్ల కాబట్టి, పతంజలి ఆ చంటిదానికి ‘నాగమణి’ అని పేరు పెట్టాడు.

చేలో కలుపుతీయాలన్నా, చుట్టూ కంచె కట్టించాలన్నా వందలు వందలు ఖర్చవుతున్నాయి. అయినా కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. బావిలో ఇంకో బోరు వేయిద్దామంటే వేలతో పని. నీరు పడకపోతే వృథా అవుతుంది. మొత్తానికా పొలం పతంజలి కుటుంబానికి ‘వైట్‌ ఎలిఫెంట్‌’గా మారింది. పతంజలి ట్యూషన్ల సంపాదనలో సింహ భాగం అదే తీసుకుంటుంది.

రాయలసీమ గ్రామీణ బ్యాంకు వారి నుండి కడపలో ఇంటర్వ్యూకు రమ్మని కాల్‌ లెటరు వచ్చింది. పతంజలి బయలుదేరి సాయంత్రంకి నంద్యాల చేరుకుని అక్కడి నుండి ప్రొద్దుటూరు వెళ్లాడు. మేనత్త అల్లుడిని చూసి సంబరపడిరది.

“ఎంతవాడివయ్యావురా పతంజలీ!” అంటూ అక్కున చేర్చుకుంది.

వసుధ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, బి.కాంలో చేరిందట.

“బాగున్నారా, బావా! మీరు యూనివర్సిటీ ర్యాంక్‌ హోల్డర్‌ అయినందుకు నా కంగ్రాట్స్‌!” అన్నది మెరుస్తున్న కళ్లతో. వసుధ చీరలు కడుతూంది. బొంబేడయింగ్‌ లైట్‌ పింక్‌ శారీ మీద తెల్లని ఎంబ్రాయిడరీ వర్కు. మాచింగ్‌ జాకెట్‌. అందం యవ్వనం కలిస్తే ఎంత కనువిందు చేస్తాయో అర్థమయింది పతంజలికి. తనను బహువచనంలో సంబోధించడం గమనించాడు.

“ఇదిమిటి కొత్తగా? మీరు, మీరు అని మొదలుపెట్టావు?” అంటే, “అదంతే!” అంది కొంటెగా నవ్వుతూ. పతంజలి మనసు పులకరించింది.

భువనకు సంబంధాలు చూస్తున్నారట. భువన టెన్త్‌తో ఆపేసింది. తొందరగా గృహిణి పాత్రలో ఒదిగిపోవాలని తహ తహాలాడుతూంది. వీళ్లిద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం, దొంగ చూపులు చూసుకోవడం గమనిస్తూంది భువన.

రాత్రి భోజనాలు చేసి మిద్దె మీద పడుకున్నారు.

“ఒక పాట పాడండి బావా, చాలా రోజులయింది!” అన్నది వసుధ.

“భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు” అంటూ మధురంగా పాడి వినిపించాడు.

చప్పట్లు కొట్టింది వసుధ. వారి హృదయాలలో మెదులుతూన్న ప్రేమానురాగాలకు దర్పణంలా ఉంది ఆ పాటలోని భావం.

“వసుధా. ఇక నీ వంతు. ‘మరుగేలరా! ఓ రాఘవా!’ వినిపించవా?” అని అడిగాడు మరదలిని.

చక్కగా పాడిందా పాటను. “ఈ మధ్య నేర్చుకున్న దేదయినా పాడు” అన్నాడు.

“విన్నపాలు వినవలే వింత వింతలు.

పన్నగపు దోమ తెరపైకెత్తిలేవయ్య” అన్న అన్నమయ్య కృతి వసుధ గాత్రంలో తీయగా పలికింది.

బి.కాం. ప్రయివేటు కాలేజీలో చేరానని, గవర్నమెంటు కాలేజీలో సీటు రాలేదని చెప్పింది. ‘గ్రామీణ బ్యాంకులో సెలక్టవుతే చేరతారా?” అని అడిగింది.

“చూద్దాం రావాలి కదా!” అన్నాడు.

“మీకున్న మెరిట్‌కు మీకు ఆఫీసరుద్యోగమే వస్తుందిలెండి”

“ఏమో వసుధా! మ్యాథ్స్‌ అంత బాగా చేయలేకపోతున్నాను. రిటన్‌ టెస్ట్ లయితే రాస్తున్నాను గాని ఒక్కదానికీ ఇంటర్వ్యూ రాలేదు”

“నాకు ఇంగ్లీషుతో ప్రాబ్లం. మీకేమో మ్యాథ్స్‌. బాగుంది” అంటూ కిలకిలా నవ్వింది. ఆమె నవ్వుతూంటే ఆరాధనగా చూస్తుండిపోయాడు.

పొద్దున్నే భువన చేసిన దోసెలు తిని, కడపకు బయలుదేరాడు. వసుధ కాలేజీకి వెళ్లడానికి రడీ అయింది. లేతాకు పచ్చ రంగు చీర కట్టుకుంది. తలంటు పోసుకుంటేమో జుట్టు గాలికి ఎగరకుండా వెనక క్లిప్‌ పెట్టుకుంది. వసుధకు నుదురు విశాలంగా ఉండదు. రెండు వైపులా జుట్టు ఒక డిజైన్‌లాగా కప్పేస్తుంది. చిన్న స్టిక్కరు పెట్టుకుంది.

“అమ్మా! బావను బస్సు ఎక్కించి నేను కాలేజీకి వెళతాను. నాదీ ఆ దారే గదా!” అని అమ్మకు చెప్పి, “పదండి బావా!” అంది వసుధ.

పతంజలి స్నఫ్ కలర్‌ సియారాం ప్యాంటు మీద లేత గోధుమ తెలుపు చెక్స్‌ ఉన్న ఫుల్‌ షర్టు టక్‌ చేసుకున్నాడు. బాటా వారి కవాడిస్ వేసుకున్నాడు. కలసి వెళుతున్న మేనల్లుడినీ కూతుర్నీ చూస్తూ అనుకుంది మేనత్త.

“భువనకు ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తే, వీడికి మంచి ఉద్యోగం వస్తే వీళ్లిద్దరికీ ముడిపెట్టేస్తే సరి. చిలకాగోరువంకల్లాగున్నారు.”

ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. భుజాలు తగులుతున్నాయి. అగస్తీశ్వరస్వామి గుడి దాటారు.

“కడప బస్సులు ఇక్కడ కూడ ఆగుతాయి. కానీ సీట్లు దొరకడం కష్టం” అన్నది వసుధ.

“లేదులే. బస్టాండులోనే ఎక్కుతాను. కాసేపు నీతో గడిపినట్లుంటుంది” అన్నాడు ఆమె కళ్లల్లోకి చూస్తూ.

“సరే” అన్నది కళ్లు వాల్చుకుని.

“నీకభ్యంతరం లేకపోతే మనిద్దరం కలసి ఏదైనా తీసుకుందాం”

“ఇప్పుడే కదా టిఫిన్‌ చేశాం”

“ద్రవరూపంలో” ఆ మాటకు వసుధ నవ్వింది. “పదండి” అన్నది.

ఒక కూల్‌ డ్రింక్ షాపు దగ్గరకు వెళ్లారు. “నీకేదిష్టం?” అనడిగితే తడుము కోకుండా “బాదంపాలు” అంది.

ఇద్దరూ చల్లని బాదంపాలు తాగారు. పతంజలి డబ్బులిచ్చాడు. మళ్లీ నడవసాగారు.

“వ్యవసాయం కుదేలయిపోయింది వసుధా! నిమ్మతోట ఎండిపోయింది. ప్రస్తుతం ట్యూషన్లే మా కుటుంబానికి ఆధారమయ్యాయనుకో”

“అధైర్యపడకండి బావా! మీరు చాలా తెలివైనవారు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది” అన్నది మరదలు. అప్రయత్నంగా ఆమె చేయిపట్టుకున్నాడు. వసుధ విడిపించుకోలేదు. ఆమె చేయి వెచ్చగా, ఆమె స్పర్శ ఆత్మీయంగా ఉంది.

బస్టాండులో కడప బస్సు సిద్ధంగా ఉంది. జమ్మలమడుగు నుండి వచ్చింది. బస్సులో బ్యాగ్‌ పెట్టివచ్చాడు. కాసేపటికి డ్రైవరు కండక్టరు వచ్చాడు.

వసుధ పతంజలిని ఆత్మీయంగా చూసి, “మరి నేనుంటా బావా!” అన్నది. ఈసారి ధైర్యంగా ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని, “వెళ్లొస్తాను” అని చెప్పి, బస్సెక్కాడు.

గంటన్నరలో కడప చేరుకున్నాడు. గ్రామీణ బ్యాంకు హెడ్‌ ఆఫీసు నాగరాజు పేటలో ఉందట. కాల్‌ లెటర్లో అడ్రస్‌ యిచ్చారు. బస్సు దిగి రిక్షాలో ఆఫీసుకు వెళ్లాడు. ఇంటర్వ్యూ 11 గంటలకు అప్పటికి పది దాటింది.

ఛైర్మన్‌ గారి ఛాంబరు ముందున్న బెంచీల మీద అభ్యర్థులందరూ కూర్చున్నారు. నల్లరంగు నేమ్‌ ప్లేట్‌ మీద బంగారు రంగు అక్షరాలు మెరుస్తున్నాయి. “కృపా సాగర్‌ కుండే, ఛైర్మన్‌” అని.

అరగంట తర్వాత పతంజలి పేరు పిలిచారు. లోపలికి వెళ్లి అందరినీ విష్‌ చేసి కూర్చున్నాడు. ఒకాయన సర్టిఫికెట్స్‌ పరిశీలించాడు. ఛైర్మన్‌గారు కూడ చూసి,

“వెరీగుడ్‌! సోయు అరె ప్రొడక్ట్‌ ఆఫ్‌ ఉస్మానియా. వెరీ నైస్‌ యు స్టుడ్‌ థర్డ్‌ ఇన్‌ ఎగ్జామ్స్‌. మిస్టర్‌ పతంజలీ ఇన్‌ విచ్‌ కాలేజి హ్యావ్‌ యు స్టడీడ్‌?”

“ఐ స్టడీడ్‌ యాజె ప్రయివేట్‌ క్యాండిడేట్‌ రైట్‌ ఫ్రం మై ఇంటర్మీడియట్‌ సర్‌!” అన్నాడు వినయంగా.

“దెన్‌ వాట్‌ డిడ్‌ యు డు ఆల్‌ దీస్‌ ఇయర్స్‌?”

“కల్టివేషన్‌, సర్‌!”

“వెరీగుడ్‌. సోయు ఆరె ఫార్మర్‌!”

“ఐ యాం ప్రౌడ్‌ టుబి, సార్‌”

“దట్స్‌ ది స్పిరిట్‌ యువర్‌ మార్క్స్ ఆర్‌ ఆల్పో అమేజింగ్‌. ఆల్‌ ది బెస్ట్‌. యు కెన్‌ గో”.

రెండో ఫ్లోర్‌లో ఉన్న ఆ ఆఫీసు నుండి క్రిందకు దిగి వచ్చాడు పతంజలి. తన మెరిట్‌ వాళ్లు గుర్తించారు. కాలేజీలో చదువుకోలేదన్న న్యూనతాభావం కూడా ఎగిరిపోయింది. రిక్షాలో కడప బస్టాండుకు వెళ్లాడు. కర్నూలు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ఒంటిగంటకుందని చెప్పారు. అప్పుడు పన్నెండు దాటింది.

అక్కడే ఉన్న ‘మణీస్‌ కేఫ్‌’లో భోజనం చేశాడు. భోజనం చాలా బాగుంది. మజ్జిగ పులుసు ఇంట్లో అమ్మ చేసినట్లు గానే ఉంది. ఒంటి గంటకు బస్సెక్కి, ఏడు గంటలకు కర్నూల్లో దిగాడు. అక్కడ నుండి వెల్దుర్తి చేరుకున్నాడు.

ఒకరోజు కర్నూలు నుండి విశ్వేశ్వర శాస్త్రి గారు మనిషిని పంపారు. వచ్చినాయన ‘రాయలసీమ సాహితీ సమాఖ్య’ గౌరవ కార్యదర్శియట. ఆయన పేరు మాణిక్య ప్రసాద్‌. మార్కండేయశర్మ గారిల్లు ఇదేనా అని అడుగుతూ వచ్చాడు. శర్మ ఆయనకు చాపవేసి కూర్చుండ బెట్టాడు. పతంజలి కూడ యింట్లోనే ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు.

“విశ్వేశ్వర శాస్త్రి గారు మా సంస్థకు గౌరవాధ్యక్షులు. మీ విద్వత్తు గురించి శాస్త్రి గారు మాకు చెప్పారు. అవధాని సత్తములుగా మీ పేరు, పౌరాణికులుగా మీ ప్రఖ్యాతి మేము విని ఉన్నాము. నేను ఉస్మానియా కళాశాల తెలుగు విభాగం అధిపతిగా పని చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మా సంస్థ వార్షికోత్సవానికి లబ్ధప్రతిష్ఠులైన కవులనో, రచయితలనో, సాహితీవేత్తలనో ఆహ్వానించి, వారిని సన్మానించడం రివాజుగా చేస్తున్నాము. ఈసారి హైదరాబాద్‌ నుండి డాక్టర్‌ అంశుమంతుల తిరుమలావధాని గారిని ఆహ్వానించాము. విశ్వనాధవారి ‘రామాయణ కల్పవృక్షం’పై వారి సాహిత్యోపన్యాసం మా కళాశాల ‘కళాసాంస్కృతిక వేదిక’లో ఏర్పాటు చేసినాము. వచ్చే ఆదివారము సాయంత్రం ఆరు గంటలకు. మీరు సభకు అధ్యక్షులుగా ఉండాలని మా కోరిక. మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించడానికే విశ్వేశ్వరశాస్త్రిగారు నన్ను పంపించినారు.”

“అంతటి సాహిత్యవేత్త సభకు నేను అధ్యక్షుడినా? ‘నశోభతేసభామధ్యే హంసమధ్యే బకో యధా’ అని హితోపదేశకారుడన్నట్లు అది శోభనివ్వదు” అన్నాడు మార్కండేయశర్మ.

వచ్చినాయన ఆశ్చర్యపోయాడు “స్వామీ మీరు వినయసంపన్నులని. ఇలాగే అంటారని శాస్త్రిగారు చెప్పనే చెప్పారు. సరిగ్గా మీరు అదే విధంగా స్పందించారు. మీరు అనుమతించక తప్పదు”

“సరే. తప్పక వస్తాను లెండి”

“అయితే ఆహ్వాన పత్రికలో మీ పేరు వేయించుకుంటాము.”

మార్కండేయ శర్మ మోములో మొగమాటం మొగ్గ తొడిగింది. “మీ ఇష్టం” అన్నాడు ఆయన. మాణిక్యప్రసాద్‌ సెలవు తీసుకుని వెళ్లి పోయాడు.

“తిరుమలావధాని గారి గురించి తెలుసుకదా! నాయనా!”

“విన్నాను నాన్నా. మహా పండితుడట కదా”

“అవును. అద్భుతంగా అవధానం చేస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖకు అధ్యక్షుడు. తెలుగులో తొలి పి.హెచ్‌.డి ఆయనదే నంటారు. ‘ప్రాజ్ఞ్నన్నయ యుగము’ అని నన్నయ్యకు పూర్వం శిలా శాసన, తామ్ర శాసన గతమయిన, ఇతరత్రా తాళపత్ర లభ్యమయిన కవిత్వంపై పరిశోధన చేశాడాయన. ఆదివారం నీవూ రా. పోదాము”

“తప్పకుండా వస్తాను నాన్నా”

ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకే బయలుదేరి బస్సులో కర్నూలు చేరుకున్నారిద్దరూ. రిక్షాలో ఉస్మానియా కాలేజీ చేరుకున్నారు. ఐదున్నర కల్లా వేడుక జరిగే హాలు చేరుకున్నారు. మాణిక్య ప్రసాద్‌ శర్మగారిని సాదరంగా ఆహ్వానించి వేదిక ముందున్న కుర్చీలలో మొదటి వరసలో కూర్చో బెట్టాడు. పతంజలిని చూపించి, “వీడు నా కుమారుడు” అని చెప్పాడు శర్మ ఆయనకు. “మీరు చెప్పకుండానే తెలిసిపోతూన్నది. మీ పోలికలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి” అన్నాడాయన నవ్వుతూ.

కాసేపట్లో విశ్వేశ్వరశాస్త్రిగారు వచ్చారు. శర్మగారిని కౌగిలించుకొని కుశల మడిగారు.

సరిగ్గా ఆరుగంటలకు తిరుమలావధాని గారిని తీసుకొని వచ్చారు నిర్వాహకులు. ఆయను జెడ్.పి. గెస్టు హౌస్‌లో దింపారట. అందరూ లేచి నిలబడి ఆయనకు అభివాదాలు చేయసాగారు. చేయెత్తు మనిషి. తెల్లని అంచు ధోవతి, దానిమీద గోధుమ రంగు ఖద్దరు చొక్కా ధరించాడు. దాని మీద హాఫ్‌ కోటు వేసుకున్నాడు. నుదుట నల్లని చాదు చుక్క. తెల్లని జుట్టును వెనక్కి దువ్వి ముడి వేశాడు. ఆయన కళ్లు తీక్షణంగా ఉన్నాయి. వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడు. విశ్వేశ్వర శాస్త్రిగారు శర్మగారిని అవధానిగారికి పరిచయం చేశారు.

మాణిక్యప్రసాద్‌గారు వెళ్లి కళాశాల ప్రిన్సిపాల్‌ ‘హక్‌’ గారిని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. క్రమంగా కుర్చీలన్నీ నిండిపోయాయి. మాణిక్య ప్రసాద్‌ అందరినీ వేదిక మీదకు ఆహ్వానించాడు. అందరికీ పుష్ప గుచ్ఛాలిచ్చారు విద్యార్థినులు.

“కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఆర్థికోపన్యాసకులు సంజీవ రెడ్డిగారు ప్రార్థన చేస్తారు” అని ప్రకటించాడు. ఆయనెవరో ఎంతకూ రాలేదు. వేదిక మీద తన తండ్రి మాణిక్య ప్రసాద్‌ను పిలిచి ఏదో చెప్పడం గమనించాడు పతంజలి.

“మార్కండేయ శర్మ, నేటి మన సభాధ్యక్షుల వారి కుమారులు శ్రీ పతంజలి శర్మగారిని ప్రార్థన చేయవలసిందిగా మనవి” అని మైకులో పిలిచారు.

పతంజలి కళవళపడ్డాడు. వెంటనే సంభాళించుకొని మెట్లెక్కి వేదిక మీదకు వెళ్లాడు. ‘శుక్లాంబరధరం’ పాడితే మోనోటనస్‌గా ఉంటుంది. క్షణాల్లో నిర్ణయించుకున్నాడు. మైకు అందుకొని అల్లసాని పెద్దన గారి మను చరిత్ర నాందీ పద్యం

“అంకము జేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ
బాల్యాంక విచేష్ట తొండమున నవ్వలిచన్‌ గబళింపబోయి
అవంక కుచంబుగాన కహి వల్లభ హారముగాంచివే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్‌”

అంటూ భూపాల రాగంలో ఆరోహణ అవరోహణలు నేర్పుగా పలికిస్తూ ఆలపించాడు పతంజలి.

సభలో కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. అవధానిగారు పతంజలిని తన వద్దకు పిలిచి, ప్రశంసించారు. “పెద్దన గారి భావ చిత్రం మా కళ్లముందు ఆవిష్కరించావు నాయనా విద్యాభివృద్ధిరస్తు”.

ప్రిన్సిపాల్‌గారు వక్తను సభకు పరిచయం చేశారు.

“ఈనాడు సుదినం. తిరుమలావధాని గారు మన సదస్సును పావనం చేశారు. తెలుగు వారు గర్వించదగ్గ సాహితీ దిగ్గజం ఆయన. యన్‌.టి రామారావు గారు కూడ తాను నిర్మించే పౌరాణిక చిత్రాల విషయంలో అవధాని గారి సలహాలు తీసుకుంటారు. ఆయన చేతి మీదుగా ఎంతోమంది పిహెచ్‌.డి.లు చేశారు” అంటూ వారిని సముచితంగా పొగిడారు. హక్‌ గారు మాట్లాడుతూంటే పతంజలికి ఆజంసారు గుర్తొచ్చారు. ఆయనా ఇలాగే తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతారు.

“ఇప్పుడు సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ మార్కండేయ శర్మగారు మాట్లాడతారు”

మార్కండేయ శర్మ లేచి మైకు నందుకున్నాడు “సభాయై నమః. తిరుమలావధానులవారికి సాహితీ వందనం. వారి యింటి పేరులోనే అంశుమంతుడైన భాస్కరుడున్నాడు” అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత శర్మ తన గంభీర స్వరంతో ఈ శ్లోకం పాడారు.

“జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే”

అత్యున్నతస్థాయిలోని ఆయన శృతికి మైకు తట్టుకోలేకపోయింది. “విశ్వనాధ వారు మన తెలుగు జాతికి వరం. కొడిగడుతున్న సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయ దీపాన్ని, తన రచనల తైలంతో తడిపి ఎగదోసి, మళ్లీ జాజ్వల్యమానంగా ప్రకాశింప చేస్తున్న కవి రవి. ‘నిరంకుశాః కవయః’ అన్న సూక్తి ఆయనకు చక్కగా వర్తిస్తుంది. నిర్భీతిగా తన భావాలను వ్యక్తం చేయగల మహోన్నతుడు. ఆయన గురించి మరొక్కమాట చెప్పి ముగిస్తాను. విశ్వనాధ వారి కల్పవృక్షంలో మన తెలుగుతనం గుబాళిస్తుంది. రామచంద్రుని బారసాల నుండి వివాహము వరకు, ఇతర కాండలలో అక్కడక్కడ మన తెలుగు పద్ధతులు, ఆచారాలు జొప్పించాడాయన. విశ్వనాధ వారిని గూర్చి అవధాని గారు ప్రసంగించి, తమ సాహితీ విజ్ఞానాంబుధిలో మనల్నందరినీ ఓలలాడిస్తారాని భావిస్తూ, సెలవు”

నాన్న తక్కువగా మాట్లాడినా, అద్భుతంగా చెప్పాడనిపించింది పతంజలికి. ‘బ్రీవిటీ ఈజ్‌ ది సోల్‌ ఆఫ్‌ విట్‌’ అని విశ్వకవి విలియం షేక్‌స్పియర్‌ అన్నాడు కదా – అనుకున్నాడు.

తిరుమలావధాని గారి ప్రసంగం ప్రారంభమయింది. మంద్ర గంభీరమైన ఆయన స్వరం హాలంతా వ్యాపించింది. ముందు తమ గురువర్యులైన రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారిని, స్మరించుకున్నాడు. కల్పవృక్షంలోని పదుల కొద్దీ పద్యాలను అలవోకగా, అరమోడ్పు కళ్లతో ఆయన తనదంటూ ప్రత్యేకమయిన ఒక రాగంలో చదువుతూ, వాటిలోని గూఢార్థాలను వివరిస్తూంటే శ్రోతలు ముగ్ధులైనారు. దాదాపు గంటన్నర సేపు సాగిన ఆయన ఉపన్యాసం గంగాఝరిని తలపించింది. ఎక్కడా తడబడలేదు. తడుముకోలేదు. గుర్తు తెచ్చుకొనే ప్రయత్నమూ చేయలేదు.

పతంజలికి అబ్బురమనిపించింది. విశ్వనాధ సాహిత్యం తానూ చదివాడు గాని, యింత లోతుంటుందని తెలియదు.

అవధాని గారికి ఘన సన్మానం జరిగింది. మార్కండేయ శర్మకూ శాలువా కప్పి గౌరవించారు. సభానంతరం ప్రిన్సిపాల్‌గారి రూములో అందరూ కూర్చున్నారు. అవధానిగారు పతంజలిని చూసి శర్మగారితో అన్నారు

“మీ వాడు ఏం చేస్తున్నాడు?”

“బి.ఎ. పూర్తయిందండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు”

“గ్రూప్ సబ్జెక్టులు ఏమి తీసుకున్నావు నాయనా?” అని అడిగాడాయన.

పతంజలి బదులిచ్చాడు. “సెకండ్‌ లాంగ్వేజ్‌ సంస్కృతం. ఎకనామిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇంగ్లీషు లిటరేచర్‌ తీసుకున్నాను సర్‌”

“మీది యస్‌.వి యూనివర్సిటీ కదా!”

“కాని నేను ఉస్మానియాలోనే ఎక్స్‌టర్నల్‌గా చేశానండి”

“వెరీగుడ్‌, మరి గైడెన్సు?”

“సంస్కృతం మా నాన్నగారు. విశ్వేశ్వరశాస్త్రి గారు వ్యాకరణం చెప్పారు. మిగతావి నేనే స్వంతంగా చదువుకున్నాను. ఇంగ్లీషు మీడియం”

“ఎంత శాతం సాధించావు?”

“అగ్రిగేట్‌ 85 శాతం వచ్చింది సర్‌”

“ఇంగ్లీషు లిటరేచర్‌లో?”

“మూడువందలకు రెండువందల యాభై ఆరు వచ్చాయండి”

మార్కండేయ శర్మ కల్పించుకొని చెప్పాడు.

“అంతేకాదు స్వామీ. యూనివర్సిటీ ఎక్స్‌టర్నల్‌ అభ్యర్థులందరిలో మూడవ స్థానంలో నిలిచాడు మావాడు. ర్యాంక్‌ సర్టిఫికెట్‌ కూడా యిచ్చారు”

అవధానిగారు పతంజలిని పిలిచి తన వద్ద కూర్చోబెట్టుకొని భుజం మీద చేయివేశారు.

“నాయనా, సరస్వతీ దేవి అనుగ్రహం నీ మీద పూర్తిగా ఉంది. నీవు ప్రార్థనా పద్యం పెద్దనగారిది పాడినప్పుడే వీడు సామాన్యుడు కాదని అనుకున్నాను. ఎక్స్‌టర్నల్‌గా చదివి అన్ని మార్కులు తెచ్చుకున్న వారు చాలా అరుదు. ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంలో నీవు సాధించింది అపూర్వం. నీవు తప్పకుండా యమ్‌.ఎ. ఇంగ్లీషు చెయ్యి. లెక్చరర్‌గా ఉద్యోగం వస్తుంది. పుట్టపర్తి సాయిబాబాగారి కాలేజీల్లో నేనే నీకు ఇప్పిస్తాను. ఆయన నా మాట కాదనరు. హైదరాబాదులో ఎ.బి.సి.డి అనే సంస్థ ఉంది. ఆల్‌ బ్రాహ్మిన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ అని దాని విస్తృతార్థం. జి. పుల్లారెడ్డిగారి లాంటి మహాదాతలు దానికి పోషకులు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు వసతి కల్పించి, ఉచితంగా చదువు చెప్పిస్తారు. శర్మగారూ! మీ వాడిని నా వద్దకు పంపండి. మా యూనివర్సిటీలోనే ఎమ్‌.ఎ ఇంగ్లీషులో చేర్పిస్తాను. మీకేమీ భారం ఉండదు.”

మార్కండేయ శర్మ వినయంగా అన్నాడు. “క్షమించాలి. తమ ఔదార్యానికి కృతజ్ఞతలు. వాడు నా పెద్ద కొడుకు. యింటి బాధ్యతలన్నీ వాడే నిర్వహించాలి. మీరన్న చదువు వాడు ప్రయివేటుగా చదువుకుంటాడు”

అవధానిగారు నిరుత్సా పడ్డారు. “సరే కానివ్వండి” అన్నారు.

అందరూ అవధానిగారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరుతున్నారు. పతంజలి ఆయనకు పాదాభివందనం చేశాడు. ఆయన ఆశీర్వదించి చెప్పాడు. “వెంటనే నేను చెప్పింది చేయి. బి.ఎ. ఎప్పుడయింది?”

“గత సంవత్సరం డిసెంబరులోనండి”

“అంటే వచ్చే సంవత్సరం నీవు ప్రీవియస్‌, ఫైనల్‌ రెండూ కలిపి రాయవచ్చు. హైదరాబాదుకు వచ్చినపుడు మా యింటికి రా. నీకు ఏం సహాయం కావాలన్నా సంకోచించకుండా నన్నడుగు నాయనా” అన్నాడాయన.

తండ్రీ కొడుకులిద్దరూ రిక్షాలో బస్టాండు చేరుకున్నారు. తొమ్మిది దాటింది. బస్సులన్నీ వెళ్లిపోయినాయి. చిత్తూరు ఎక్స్‌ప్రెస్‌ ఉంది. అది వెల్దుర్తి ఆగదు.

“డోన్‌ టికెట్‌ కొడతాను. బైపాస్‌లో దిగుతారా?” అన్నాడు కండక్టరు సరే అని ఎక్కి కూర్చున్నారు. పదిగంటలకల్లా బైపాస్‌లో దిగి రైల్వేస్టేషన్‌లో నుండి ఊర్లోకి వచ్చారు.

***

గణపతికి నీళ్లబండి లాగడం అలవాటయింది. వలీ కూడ అలవాటయ్యాడు. మధ్యలో ఒకసారి దస్తుమియ కట్ట దగ్గర కనబడిరది. బండి నొగల మీద వలీ కూర్చుని తోలుతున్నాడు. అసలు అది ఒక బరువే కాదన్నట్లుగా చకచక నడుస్తున్నాడు గణపతి. పతంజలిని చూసి వలీ దిగి నమస్కరించాడు. గణపతి ఒళ్లంతా నిమిరాడు పతంజలి. “చూశావా నా కొత్త ఉద్యోగం?” అన్నట్లుగా పతంజలి చూచింది. కట్టమీద కూరగాయలమ్ముతున్నామె దగ్గర నాలుగు తోటకూర కట్టలు కొనుక్కొచ్చి గణపతికి తినిపించాడు.

“ఎలా వుంది వలీ మా గణపతి?”

“సాచ్చాత్తు నందీస్వరుడే మీ యింట్లో పుట్టినాడయ్యా, అంత నెమ్మదైన పసరాన్ని చూడలేదు. ఒక్క రోజులో బండి అలవాటు చేసుకునింది. దీని అస్తవాసి నాకు నీళ్ల వర్తనలు పెరిగినాయయ్యా” అన్నాడు వలీ.

“సరే వెళ్లండి. గణపతిని జాగ్రత్తగా చూసుకో” అన్నాడు పతంజలి.

హైదరాబాదుకు వెళ్లి చదివే ఉద్దేశం పతంజలికి లేదు. తండ్రి ఒంటరివాడౌతాడు. ఒక రోజు దక్కన్‌ క్రానికల్‌లో ఓ.యు. ఎక్స్‌టర్నల్‌ బోర్డువారి నోటిఫికేషన్‌ చూశాడు. ఎమ్‌.ఎ. ఎమ్‌.కాం. పరీక్షలకు దరఖాస్తులు పిలిచారు. ఈ సంవత్సరానికి టైము దాటిపోయిందనుకున్నాడు. కానీ ఉంది. ఇంకా పదిరోజుల టైముంది. వెంటనే వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఈ సంవత్సరం నవబంరులో ప్రీవియస్‌ రాయవచ్చు. వచ్చే సంవత్సరం ఫైనల్‌ వ్రాయవచ్చు. వన్‌ సిట్టింగ్‌ అంటే ఒత్తిడి ఉంటుంది. ప్రీవియస్‌కు కూడ ఇంకా ఆరు నెలలు టైముంది.

తండ్రికి చెప్పి బెంగుళూరు – హైద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో హైదరాబాదుకు బయలుదేరాడు పతంజలి. జనరల్‌ పెట్టి రద్దీగా ఉంది. కర్నూలు వరకు నిలబడి ప్రయాణించి, కర్నూల్లో దిగి టు-టైర్‌ సిట్టింగ్‌ కంపార్టుమెంటు దగ్గరికి వెళ్లి అక్కడ చార్టు పట్టుకొని నిలబడి ఉన్న కండక్టరుకు విష్‌ చేసి సికింద్రాబాద్‌కు సీటిమ్మని అడిగాడు ఇంగ్లీషులో. ఆయన “థర్టీటులో కూర్చోండి వస్తాను” అని చెప్పాడు.

రైలు కదిలింది ఆయన వచ్చి ఎక్సెస్‌ ఛార్జి వసూలు చేసి రశీదిచ్చాడు. ఒక్క పైసా కూడ ఆశించలేదు. పైన రెండు బెర్తులు, పడుకోడానికున్నాయి. క్రింద సిట్టింగ్‌ ప్యాసింజర్లు. కంపార్టుమెంటు నీటుగా ఉంది. రైలు గద్వాల దాటే సరికి నిద్ర ముంచుకు వచ్చింది. నడవాలో పంచె పరుచుకొని బ్యాగ్‌ తలక్రింద పెట్టుకుని పడుకున్నాడు. పతంజలిని చూసి మరో ముగ్గురు అదే పని చేశారు.

ఉదయం ఐదున్నరకు రైలు సికింద్రాబాదు చేరింది. వెయిటింగ్‌ రూములోనే కాలకృత్యాలు, స్నానం ముగించాడు. అల్ఫా హోటల్లో ఇరానీ చాయ్‌ తాగి వెయిటింగ్‌ రూంలోనే కాసేపున్నాడు. ‘హిగిన్‌ బాదమ్స్‌’లో హిందూ పత్రిక కొనుక్కొని వచ్చాడు. అది చదివేటప్పటికి ఎనిమిదిన్నరైంది. బయటకు వెళ్లి ఎవరెస్ట్‌ హోటల్లో టిఫిన్‌ చేసి, యూనివర్సిటీ బస్సు ఎక్కాడు. అక్క వాళ్ళు ఎల్‌.టి.సి. తమిళనాడుకు వెళ్లారు కాబట్టి వాళ్లింటికి వెళ్లేందుకు లేదు.

ఇంతకు ముందు చూశాడు కాబట్టి నేరుగా ఆర్ట్స్‌ కాలేజి దగ్గర దిగి, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ చేరుకున్నాడు. అప్లికేషన్‌, ప్రాస్పెక్టస్‌, సిలబస్‌, మాడల్‌ కొశ్చన్‌ పేపర్లు అన్నీ కలిపి, ఇరవై రూపాయలు. ఎస్‌.బి.హెచ్‌లో చలానా కట్టి అన్నీ తీసుకున్నాడు.

ఒక చెట్టు క్రింద బండరాయి మీద కూర్చుని, నరసింహస్వామిని స్మరించి, దరఖాస్తు ఫారం నింపాడు. ఫోటోలు అతికించడానికి గమ్‌ కూడ ఊరినుండి తెచ్చుకున్నాడు. సిలబస్‌ చూశాడు. ప్రీవియస్‌ నాలుగు పేపర్లు ఫైనల్‌ నాలుగు పేపర్లు ఉన్నాయి. రెండింటినీ ఇప్పుడే నింపాలి. రిజిస్ట్రేషన్‌ ఇప్పుడు చేసుకుంటే వచ్చే సంవత్సరం ఫైనల్‌కు పరీక్ష ఫీజు కడితే సరిపోతుంది.

ప్రీవియస్‌లో పేపరు-1 కు రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. 1. క్లాసిక్స్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ 2. ఫొనెటిక్స్‌, ఏదో ఒకటీ తీసుకోవాలి. సిలబస్‌ చూశాడు. ఫొనెటిక్స్‌ కొంచెం కష్టంగా ఉంది. మొదటి దాంట్లో గ్రీకు రచయితల మహాకావ్యాలు ఒడిస్సీ (హోమర్‌) పోయటిక్స్‌ (అరిస్టాటిల్‌) ఇంకా అలాంటివి మొత్తం ఆరున్నాయి. దాన్ని ఆప్షనల్‌లో రాశాడు. ఫైనల్లో ఆ విధానం లేదు.

(సశేషం)

Exit mobile version