Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సాఫల్యం-43

శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

[వారం రోజుల్లో సర్వీస్‌ కమీషన్‌ నుండి, మరో నాలుగు రోజుల్లో ఆర్‌.జె.డి రాజమండ్రి వారి నుండి ఆర్డర్స్‌ వస్తాయి. శ్రీకాకుళం జిల్లా ‘పలాస’ అనే ఊరికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, జూనియర్‌ లెక్చరర్‌ ఇన్‌ ఇంగ్లీష్‌గా పోస్టింగ్‌ ఇస్తారు. జాయిన్‌ అవడానికి నలభై ఐదు రోజులు టైమిచ్చినా, వెంటనే చేరితే ప్రమోషన్లకు మంచిదని శ్రేయోభిలాషులు చెప్పిన మేరకు పలాస బయల్దేరుతాడు పతంజలి. మార్గమధ్యంలో విజయవాడ దిగుతాడు. అక్కబావల ఇంటికి వెడతాడు. అందరూ కలసి దుర్గ గుడికి వెళ్ళివస్తారు. మర్నాడు మద్రాసు – హౌరా మెయిల్ ఎక్కి పలాస చేరుకుంటాడు. ముందుగా ఒక లాడ్జిలో దిగి మర్నాడు కాలేజీలో చేరుతాడు. ప్రిన్సిపాల్ గారు ఆదరంగా మాట్లాడి క్లర్కుకి పిలిచి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోమంటాడు. తోటి లెక్చరర్‍లను పరిచయం చేసుకుంటాడు. పిల్లలకి పాఠాలు బాగా చెప్తాడు. కర్నూలు జిల్లాకి చెందిన పిటి సార్ మల్లికార్జున్‌తో స్నేహం కలుస్తుంది. లైబ్రేరియన్ సూర్యనారాయణ ఇంటికి మారిపోతాడు పతంజలి. – ఇక చదవండి.]

క్యాంపస్‌లోనే షటిల్‌ కోర్టువుంది. నెట్‌ కట్టి నలుగురు షటిల్‌ ఆడుతూంటే జెండా దిమ్మమీద కూర్చుని చూడసాగాడు పతంజలి. నెలకు ఇరవై రూపాయలు అందరి దగ్గరా వసూలు చేసి ‘కాక్స్‌’ కొంటారట. ఎవరి బ్యాట్‌ వారికుంది. దీంట్లో కూడా ఆధ్వర్యం మల్లిదే.

“రేపట్నుంచి మా స్వామి కూడ ఆడతాడు” అని ప్రకటించేశాడు.

సాయంత్రం లాడ్జి ఖాళీ చేసి సూర్యనారాయణ ఇంటికి మారాడు పతంజలి. రైల్వే క్వార్టర్స్‌ అవి. ఒక టౌన్‌షిప్‌లా ఉందది. రైల్వే ఉద్యోగులు క్వార్టర్స్‌లో కొంత భాగాన్ని అద్దెకిచ్చుకుంటారు. లైబ్రేరియన్‌ ఉన్నది క్వార్టర్‌ వెనుక వైపున ద్వారం ఉన్న పోర్షన్‌. ఒక పెద్ద రూము. చిన్న వంటిల్లు. పెరట్లో బాత్‌రూం, లెట్రిన్‌. అద్దె నూట ఇరవై రూపాయలట.

గదిలో డబుల్‌ కాట్‌ ఉంది. వంట గదిలో పాత్ర సామాను కిరాణా డబ్బాలు, సీసాలు అన్నీ ఉన్నాయి. అతను వంట చేసుకుంటాడట. సొంతవూరు వైజాగ్‌. అక్కడ అన్న వదినె ఉంటారు. ఇతను నెలకోసారి పోయి వస్తూంటాడు. తన క్వాలిఫికేషన్‌కు తగిన ఉద్యోగం కాదని నిరంతరం మధన పడుతూంటాడు. అతనిదీ, పీడీది గెజిటెడ్‌ హోదా కాదట. వాళ్ల పే స్కేలు కూడ జెయల్స్‌ కంటె తక్కువట. ‘వేరీజ్‌ ది లాజిక్‌?’ అనేది అతని ఊతపదం.

పెరట్లోనే నుయ్యి ఉంది. నీళ్లు బాగా పైకే వున్నాయి. మంచినీళ్లు. తియ్యగా ఉన్నాయి. చిన్న ప్లాస్టిక్‌ బొక్కెనతో తోడుకోవాలి. రెండు ఊర్లలో ఇలాగే ఉంటుందట. పలాసాలో మాత్రం ఎండాకాలం నీటికి ఎద్దడిగా ఉంటుందట. ఉద్యోగస్థులందరూ కాశీబుగ్గలోనే నివాసం ఉంటారని చెప్పాడు సూర్యానారాయణ.

ఉదయం టమోటా పప్పు చేసుకున్నాడు. స్టవ్‌ మీద అన్నం వండాడతను. మెయిన్‌ రోడ్‌ మీదకు వెళ్లి పెరుగు తెచ్చుకున్నారు. బియ్యం కూడ వైజాగ్‌ నుండి తెచ్చుకుంటాడట.

ఉదయం ఇద్దరూ వాకింగ్‌ కని హైవేవెంట రెండు కిలోమీటర్ల వరకు నడచుకుంటూ వచ్చారు. అక్కడ ఒక పంజాబీ దాబా ఉంది. అక్కడ రెండు పరోటాలు తిని టీ తాగారు. వస్తూ వస్తూ తోటకూర, వంకాయలు, మామిడికాయ తెచ్చుకున్నారు.

స్నానం చేసి పూజ చేసుకున్నాడు పతంజలి. గూట్లో వెంకటేశ్వరస్వామి పటం మాత్రమే ఉంది. అగరువత్తుల పాకెట్‌ పెట్టుకున్నాడు.

పతంజలి తాను వంట చేస్తానన్నాడు. కందిపప్పు మామిడికాయ తోటకూర కలిప్పి పప్పు చేశాడు. వంకాయ కూర చేశాడు. పదకొండు ముప్పావుకు భోజనం చేశారు. సూర్యనారాయణకు పతంజలి వంట బ్రహ్మాండంగా నచ్చింది.

“ఆడవాళ్లు మీ ముందు బలాదూర్‌ మాస్టారు!” అన్నాడు.

పన్నెండుకు రెడీ అయ్యి కాశీబుగ్గ బస్టాండులో రిక్షా ఎక్కి కాలేజీ చేరుకున్నారు. ఎక్కడయినా రెండు గదులు చూడమని కొలీగ్స్‌కు చెప్పాడు. ఇన్‌లాండ్‌ కవర్లు తెప్పించుకున్నాడు తవిటయ్యతో. వివరంగా అమ్మానాన్నలకు, వసుధకు, అక్కాబావలకు, రాధాసారుకు, మునికి, విడిగా జాబులు రాశాడు.

పతంజలి పాఠాలు బాగా చెబుతాడని పేరొచ్చింది. పిల్లలతో స్నేహంగా ఉంటున్నాడు. షటిల్‌ ఆడటం కూడ నేర్చుకున్నాడు. సర్వీస్‌ రిజిస్టరు ఓపెన్‌ చేశారు పట్నాయక్‌ గారు.

పోలీస్‌ కాలనీలోనే ఒక పోర్షన్‌ ఖాళీ అవుతుందని మల్లి చెప్పాడు. ఆ కాలనీలోనే అతను, కామర్స్‌ మాస్టారు, జువాలజీ మాస్టారు ఉంటున్నారట. సాయంత్రం వెళ్లి చూశారు. ఇల్లు చాలా బాగుంది. అద్దెకిచ్చే పోర్షను రెండుగదులు. చాలా విశాలంగా ఉన్నాయి. ఒకటి పడక గది. ఒకటి వంటిల్లు. వంటింట్లో స్టవ్‌లు పెట్టుకోడానికి గట్టులాగా ఉంది. వంటిట్లోంచి పెరట్లోకి తలుపుంది. ముందు చిన్న వరండా. దానికి కటాంజనం (గ్రిల్స్‌), తలుపు ఉన్నాయి. పెరడు కామన్‌. నుయ్యి ఉంది. ఒక మూల రెండు బాత్‌ రూంలు రెండు లెట్రిన్‌లు ఉన్నాయి. గిన్నెలు కడుక్కోడానికి, బట్టలు ఉతుక్కోడానికి ప్రత్యేకంగా స్థలం ఉంది. కొన్ని పూల మొక్కలు, ఒక బచ్చలి తీగె, ఒక నిమ్మచెట్టు, ఒక గన్నేరు, ఒక నందివర్ధనం ఉన్నాయి.

ఇంటి ఓనరు పేరు జగన్నాధరావు. పోలీసు శాఖలో సి.ఐ.గా రిటైరైనాడు. నక్సలైట్లను సమర్థవంతంగా అదుపు చేసినందుకు ముఖ్యమంత్రి ద్వారా పతకాన్ని అందుకున్నాడట. గోడకు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఆయనకు పతకం బహూకరిస్తూన్న ఫోటో ఉంది. “సి.యం. గారి ఊరు మా వూరికి దగ్గరే నండి” అని చెప్పాడు పతంజలి.

అద్దె నూట యాభై రూపాయలనీ, కరెంటు ఛార్జీలకు గాను పది రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పాడాయన. పతంజలి తగ్గించమని అడగలేదు. కారణం ఇల్లు చాలా బాగుంది. గోడల్లో పెద్ద షెల్ఫ్‌లు, వాటికి తలుపులు ఉన్నాయి. రెండు రూములకు పెద్ద కిటికీలున్నాయి. వెంటనే నెలరోజులు అద్దె అడ్వాన్సుగా యిచ్చాడు. వీలు చూసుకొని ఫ్యామిలీ తెచ్చుకుంటానన్నాడు.

రెండ్రోజులకు ఆదివారం వచ్చింది. పతంజలి తనతో వెయ్యి రూపాయలు తెచ్చుకున్నాడు. మల్లితో కలిసి బజారుకు వెళ్లి రెండు స్టవ్‌లు ఒక చాప, దిండు, దుప్పటి కొన్నాడు. కిరణా సామాన్లు, అవి పోసి పెట్టుకోడానికి డబ్బాలు, సీసాలు కొన్నాడు. ఆ ముందు రోజే లక్ష్మీనరసింహస్వామి పటం తెచ్చుకొని, పూజ చేసి పాలు పొంగించాడు.

మెల్లగా వండుకోవడం ప్రారంభించాడు పతంజలి. ఏదో ఒక ఐటం, అన్నం రెండు పూటలకూ ఒకేసారి చేసుకుంటున్నాడు. ఇంటివారికి పాలు పోసే వారితోనే అరలీటరు పాలు పోయించుకొని, కాఫీ టీలకు పోను మిగిలినవి తోడు పెట్టుకుంటున్నాడు. ముందుగదిలో ఇంటివారిదే ఫ్యాన్‌ ట్యూబ్‌ లైట్‌ ఉన్నాయి. వంటింట్లో అరవై క్యాండిల్స్‌ బల్బు ఉంది.

సప్లిమెంటరీ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్ట్స్‌ ఫేలయిన సెకండ్‌యిర్‌ పిల్లలకు వారం రోజులు ప్రిపరేషన్‌ హాలిడేస్‌ యిచ్చారు. సప్లిమెంటరీ తర్వాత దసరా వెకేషన్‌ దాదాపు పదిరోజులు వస్తుంది.

పరీక్షలలో ఇన్విజిలేషన్‌ డ్యూటీ చేశాడు. తర్వాత లెక్చరర్లకు స్పాట్‌ వాల్యుయేషన్‌ డ్యూటీ వేస్తారట. సబ్జెక్ట్‌ వైజ్‌గా రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో ఉంటుందట. పతంజలికి ఇప్పుడు డ్యూటీ వేయరని, మార్చి పరీక్షల తర్వాత వేయవచ్చనీ చెప్పారు కొలీగ్స్‌. అన్ని సబ్జెక్ట్స్‌ కంటే ఇంగ్లీష్‌కీ స్పాట్‌ వాల్యుయేషన్‌ ఎక్కువ రోజులుంటుందట.

తొలి జీతం అందుకున్నాడు. పధ్నాలుగు వందలు వచ్చింది పతంజలి కేమీ థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. కారణం తానంతవరకూ సంపాదించినవాడే కనుక.

దసరా సెలవులు రేపటి నుండి ప్రారంభవుతాయనగా ముందురోజు సాయంత్రం జనతా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు పతంజలి. ఆ రైలు విచిత్రంగా ఉంది. హౌరా నుండి మద్రాసు వెళుతుంది. మధ్యలో పాల వ్యాగన్లు, గూడ్సు వ్యాగన్లు కూడ ఉన్నాయి. పేరుకు ఎక్స్‌ప్రెస్‌ గాని, దాదాపు అన్ని స్టేషన్లలో ఆగుతుంది. సాయంత్రం ఐదుకు పలాసలో బయలుదేరి మర్నాడు ఉదయం ఎనిమిదికి విజయవాడ చేరాడు. ఆ రోజంతా అక్కయ్య వాళ్లింట్లో ఉండి, రాత్రి గుంటూరు నుండి ప్యాసింజర్లో డోన్‌ చేరుకొని, ఉదయం కర్నూలు లోకల్‌లో వెల్దుర్తి చేరుకున్నాడు.

పలాస విశేషాలన్నీ అందరితో పంచుకున్నాడు పతంజలి. రాత్రికి గాని వసుధతో ఏకాంతం దొరకలేదు. అతన్ని అల్లుకుపోయింది వసుధ.

“మీరు లేకుండా నేనుండలేను బావా!” అంది బేలగా.

“ఇల్లు చూశాను వసుధా. దసరా సెలవుల చివర్లో బయలుదేరదాం” అన్నాడు ఆమె ముంగురులు సవరిస్తూ. దాదాపు నెల రోజుల ఎడబాటు వారి మధ్య మరింత అనురాగాన్ని పెంచింది. అతని ఎదమీద తలపెట్టి పడుకొని, “ఎంత ఎంత ఎడమయితే అంత తీపి కలయికా” అంటూ పాడింది వసుధ. “మీకు ఒక సర్‌ప్రైజ్‌” అన్నది. ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె కళ్లు మెరుస్తున్నాయి.  “చెప్పు మరి” అన్నాడు. ఆమెను మరింత హత్తుకుంటూ మెల్లిగా చెవిలో చెప్పింది గుసగుసగా

“మనం త్వరలో అమ్మానాన్నలం కాబోతున్నాం బావా?”

పతంజలి హృదయం పులకరించింది. “నిజంగా!” అన్నాడు. “ధ్యాంక్యూ ఫర్‌ దిస్‌ ప్రమోషన్‌ గిఫ్ట్‌” అన్నాడు.

“మీక్కూడా” అన్నది మరదలు దటీజ్‌ వసుధ.

“అయితే ఈ శుభ సందర్భంలో నోరు తీపి చేసుకుందామా?” అన్నాడు కొంటెగా.

“ఇప్పటికే నోరంతా తీపెక్కి ఉంది. కొత్త పద్ధతి ఏదైనా వుంటే చెప్పండి”

“వేరే పద్ధతులున్నాయి కాని ఇద్దరి నోళ్లూ ఒకేసారి తీపి చేసుకోవాలంటే దీన్ని మించిన మార్గం లేదు.” అంటూ ఆమె చిగురు టధరాలను అందుకున్నాడు. ఇద్దరూ కాసేపు గాఢ చుంబన సౌఖ్యాన్నినుభవించారు. ఒకరి నుండి ఒకరు అనురాగాన్ని జుర్రుకున్నారు. స్త్రీ పురుషుల జన్మ చరితార్ధమయ్యే సంతాన సౌభాగ్యం కలుగుతున్నందుకు దంపతులిద్దరూ పొందిన పరమానందానికి ప్రతీకయే ఆ ముద్దు. అది కామావేశజనితం కాదు, పరస్పర కృతజ్ఞతాభావ వ్యక్తీకరణ. సృష్టికర్తకు భార్యభర్తలు చేసే వందనం. ది రెస్ట్ ఈజ్‌ సైలెన్స్‌.

మర్నాడు వసుంధర వదినె నుండి జాబు వచ్చింది. దసరాకు ఇద్దర్నీ చిత్తూరు రమ్మని ఆహ్వానం. భువన దంపతులు కూడ వస్తున్నారట.

“వెళదామండీ! ముఖ్యంగా మా తమ్ముడిని చూడాలనిపిస్తూంది” అన్నది వసుధ.

“తప్పకుండా” అన్నాడు పతంజలి. కాసేపు ఆలోచించాడు.

“వసుధా. నాకో ఆలోచన వచ్చింది. మనం చిత్తూరు నుండి వెల్దుర్తికి వెనక్కి రావలసిన పనిలేదు. తిరుపతికి వెళితే అక్కడ నుండి పలాసకు డైరెక్ట్‌ ట్రెయిన్స్‌ ఉంటాయి. అన్నయ్యకు లెటర్‌ వ్రాసి రిజర్వేషన్‌ చేయించమని కోరతాను. ఒకే?” అన్నాడు.

నాలుగురోజులు వెల్దుర్తిలో ఉన్నారు. ఒకపూట కర్నూలుకు వెళ్ళి ఆత్మీయులందరినీ కలిసివచ్చారు. దుర్గాష్టమి రోజు వర్ధనమ్మ భక్ష్యాలు, అలసంద వడలు, వాంగీబాత్‌ చేసింది. రాత్రి మార్కండేయశర్మతో చెప్పాడు.

“నాన్నా! ఇక నుండి ప్రతి నెల మీకు ఐదు వందలు డి.డి. తీసి పంపుతాను. చిన్నోడి బాధ్యత కూడ నాదే”

“మంచిది నాయనా!” అన్నాడు తండ్రి.

మహర్నవమినాడు ఉదయం బయలుదేరి డోన్‌లో చిత్తూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. సాయంత్రానికి చిత్తూరు చేరుకున్నారు. భువన వాళ్లప్పటికే వచ్చి ఉన్నారు. తోడల్లుడు తమకు తాండూరుకు ట్రాన్స్‌ఫరయిందని చెప్పాడు. వాళ్లు కూడ అమ్మనాన్నలు కాబోతున్నారు. భరత్‌ అక్కలను బావలను చూసి సంబరపడ్డాడు. ఇంటర్లో సి.యి.సి. గ్రూపు తీసుకున్నాడట.

దసరా పండుగ ఉత్సాహంగా జరుపుకున్నారు. వసుంధర వదినె చెల్లెళ్లకు మరుదులకు ఘనంగా బట్టలు పెట్టింది. వాళ్లకు పొడులు, పచ్చళ్లు ప్యాక్‌ చేసిచ్చిందామె. వసుధ వాళ్లకు దసరా మరుసటి రోజు తిరుపతి హౌరా ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్‌ చేయించాడు పెద్ద తోడల్లుడు. ఆ డబ్బు పతంజలి ఇవ్వబోతే

“ఉండనీ లేవయ్యా, అది నాకు మరదలు కాదు, కూతురు,. కూతురికా మాత్రం పెట్టలేమా?” అన్నాడాయన.

ఒక బియ్యం బస్తాలో కొన్ని గిన్నెలు, ప్లేట్లు, గరిటెలు కూడ కట్టిచ్చింది వదినె. మధ్యాహ్నం తిరుపతిలో రైలెక్కి మరుసటి రోజు ఉదయం పదిగంటలకు పలాసాలో దిగారు. స్టేషన్‌లో ఓవర్‌ బ్రిడ్జి మీద, రిక్షాలో వెళుతూంటే కొందరు స్టూడెంట్స్‌ పతంజలికి వినయంగా నమస్కారం పెట్టడం గమనించింది వసుధ.

“మా బావ ఇక్కడ కూడ పాపులర్‌ అయినాడే!” అంది.

“ఏమిటో పిల్లల అభిమానం మరి” అన్నాడు.

“విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే అన్నారు కదాí” అన్నది వసుధ.

“అమ్మో! గట్టిదానివే”

“ఏదో మీ సావాసం వల్ల” అన్నది నవ్వుతూ.

రిక్షా యింటిముందాగింది. సి.ఐ.గారి భార్య, కూతురు ఎదురొచ్చారు. పళ్లెంలో ఎర్రనీళ్లు దిష్టి తీసి ఇద్దరినీ లోపలికి తీసుకుపోయారు. “గొప్ప సక్కనిదండీ మాస్టారూ, అమ్మగారు” అన్నదామె. ఆ రోజు వంట చేసుకోవద్దని, భోజనాలు వారింట్లోనని చెప్పారు.

మధ్యాహ్నం ఉల్లికాడలు,  పెసరపప్పు కూర, వంకాయ బంగాళదుంప బటాణి ముద్ద కూర, ముక్కల పులుసు చేసిందామె. వాళ్లమ్మాయి వసంతకు తెగ నచ్చేసింది వసుధ.

“మిమ్మల్ని అక్కా అంటాను” అంది.

భోజనం చేసి చాప దుప్పటి వేసుకొని పడుకున్నారు. “మనం మంచి పరుపు దిండ్లు కొనుక్కుందాం బావా!” అంది వసుధ. సి.ఐ. గారింట్లో గ్యాస్‌ స్టవ్‌, కుక్కరు, ప్రెషర్‌ పాన్‌ చూసింది వసుధ.

“ఏమండీ, బావా!” అన్నది గోముగా

“మనం కూడ వీలు చూసుకొని గ్యాస్‌ స్టవ్‌ కుక్కరు కొనుక్కోవాలి. భువనక్క వాళ్లు అప్పుడే కొనేసుకున్నారు.”

“కొందాం! ఈరోజు సాయంత్రమే పరుపు కొనుక్కొద్దాం” అన్నాడు.

సాయంత్రం మల్లి వచ్చాడు. “అమ్మయ్యా! మీరొచ్చారు స్వామికి వండుకొనే బాధ తప్పింది” అన్నాడు.

వసుధ అన్నది “మీ గురించి బావ చెప్పారు. నన్ను మన రాయసీమలోలాగా ‘అమ్మయ్యా!’ అనకండి మీ చెల్లెలిననుకోండి”

“నన్ను కూడ స్వామి అనకండి” అన్నాడు పతంజలి.

ఇద్దర్నీ ఒక షాపుకు తీసుకొని వెళ్లాడు. ‘తాళాసు బ్రదర్స్‌’ ఆ షాపు పేరు. ఆ షాపు యజమాని “రండి మాస్టారూ!” అని ఆహ్వానించాడు. “పీడీగారు బాగా పరిచయం మాకు. మీరు ఇంగ్లీషు బాగా చెబుతారని మా అమ్మాయి చెప్పింది. ‘నీలిమ’ అని మీ కాలేజీలోనే ఫస్టియర్‌ బైపిసి.” అన్నాడు.

“మాస్టారికి పరుపు కావాలట” అన్నాడు పీడీ.

“తీసుకోండి మాస్టారూ! మీకంటేనా!” అన్నాడతను.

కంపెనీ పరుపులు చాలా ఖరీదుగా ఉన్నాయి. మామూలు బూరుగు దూది పరుపు పెద్దది తీసుకున్నారు. రెండు గాడ్రెజ్‌ కుర్చీలు, చిన్న టీపాయి తీసుకున్నారు. డోరు మ్యాట్లు, డోర్‌ కర్టెన్‌, కిటికీల కర్టెన్స్‌ తీసుకున్నారు. వంటింట్లో గోడకు అమర్చుకొనే స్టీలు స్టాండు, మంచినీళ్ల కుండ పెట్టుకునే ఇనుపస్టాండు తీసుకున్నారు. అంతా నాలుగు వందలయింది. పతంజలి డబ్బులివ్వబోతుంటే మల్లి కళ్లతోనే వారించాడు.

“నెలకింతని కడతారు లెండి” అన్నాడు.

“నెలకు వందరూపాయలు కడుతూండండి మాస్టారు. మీకు ఏం కావలసినా తీసుకువెళ్లండి” అన్నాడాయన. తాళాసు వీరభద్రం అని పలాసలో పేరు పొందిన వ్యాపారవేత్త ఆయన.

అన్నీ రిక్షాలో వేసుకొని ఇంటిక వచ్చారు. మల్లితో అన్నాడు పతంజలి. “మీ చెల్లెలు ఏవో కావాలంటుంది యింకా. కనుక్కో”

“చెప్పమ్మా”

“గ్యాస్‌ స్టవ్‌. కుక్కరు, ప్రెషర్‌ పాన్‌ కావాలన్నయ్యా!”

“పలాసలో హెచ్‌.పి గ్యాస్‌ డీలరు మన స్టూడెంటే ఒకప్పుడు. అతన్నడుగుదాం. నాకు మొన్ననే సెకండ్‌ సిలిండర్‌ కూడ యిప్పించాడు. వాళ్లది ‘గరుడఖండి’ అని పక్క ఊరే. ఇంక కుక్కర్‌ పాన్‌ వైజాగ్‌ నావల్‌ క్యాంటీన్‌లో తెప్పించుకుందాం. అక్కడ సేల్స్‌ టాక్స్‌ మినహాయింపు ఉంటుంది. తక్కువ రేటుకే వస్తుంది” అన్నాడు మల్లి.

రాత్రి ఉప్మా చేసుకొని తిని పడుకున్నారు.

పిల్లలందరూ ఇంగ్లీషు మాస్టారికి అభిమానులైపోయారు. “మాస్టారూ! ట్యూషన్‌ చెపుతారండీ!” అని అడగసాగారు. తుంబనాధంగారితో ఈ విషయం ప్రాస్తావిస్తే, ఆయన ఇలా అన్నాడు. “బేషుగ్గా చెప్పండి. మన వాళ్లు చెబుతున్నారు ఇళ్ల దగ్గర. నేనూ కొన్ని సంవత్సరాలు చెప్పానులెండి. ఇప్పుడు ఓపిక లేక మానేశాను. పెద్దవాణ్ని ఒకటి చెబుతాను ఏమనుకోవద్దు. మనవాళ్లు కొందరు క్లాసులో సబ్జెక్టుకు న్యాయం చేయకుండా, కాంప్లికేట్‌ చేసి, పిల్లలు ట్యూషన్‌కు వచ్చేలా చేసుకుంటారు. అది ఆత్మద్రోహం తప్ప మరొకటి కాదు. క్లాసులో పూర్తి న్యాయం చేస్తూనే, బ్యాక్‌వర్డ్‌ పిల్లలకు ఇంట్లో శిక్షణయివ్వాలి. ఏమంటారు?”

“మీతో ఏకీభవిస్తాను సార్‌. నా వ్యక్తిత్వానికి అలాంటి చీప్‌ ట్రిక్స్‌ సరిపడవు” అన్నాడు పతంజలి.

పిల్లలకు ఒ.కె. చెప్పేశాడు. మొదట ఫస్టియర్‌ పదిమంది, సెకండియర్‌ పదిమందితో రెండు బ్యాచులు పెట్టాడు. మ్యాథ్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మేస్టర్లు సంవత్సరానికి మూడు వందలు తీసుకుంటున్నట్లు తెలుసుకున్నాడు. తాను రెండు వందలే తీసుకుంటానని  చెప్పాడు. నెలరోజుల్లో నాలుగు బ్యాచ్‌లు అయ్యాయి. ఒక్కో బ్యాచ్‌ ముఫైమంది. ముందు రూమంతా పిల్లలే ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ట్యూషన్లు జరుగుతాయి.

ఉదయం 11 గంటల వరకు సి.ఐ గారింటి ముందు (ఆయన రిటైరయినా ఆయన్ను అందరూ సి.ఐ గారనే అంటారు) పిల్లల సైకిళ్లు బారులు తీరతాయి.

ప్రతి శనివారం టెస్ట్‌ పెడతాడు పిల్లలకు. రోజూ పావుగంట జనరల్‌ గ్రామర్‌, స్పీకింగ్‌ స్కిల్స్‌ సాధన చేయిస్తాడు. అచిరకాలంలోనే పతంజలి పేరు మార్మోగసాగింది.

ఆ వూర్లో ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజి కూడ ఉంది. బి.ఎ.లో అడ్వాన్స్‌డ్‌ ఇంగ్లీష్‌ ఉంది. డిగ్రీ విద్యార్థులు కొందరు వచ్చి కోచింగ్‌ ఇవ్వమని కోరారు. డిగ్రీ ఇంగ్లీషు వాళ్లు కూడ వస్తామన్నారు. అవి మొత్తం రెండు బ్యాచ్‌లు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు పెట్టాడు. వాళ్లు కూడా దాదాపు యాభైమందయ్యారు.

కొందరు అన్‌ఎంప్లాయిడ్‌ గ్రాడ్యుయేట్స్‌, పి.జి. హోల్డర్స్‌ అప్రొచ్‌ అయ్యారు పతంజలిని. కాంపిటీటివ్‌ ఎక్జామ్స్‌కు పనికొచ్చే విధంగా, స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో కోచింగ్‌ కావాలని వారి కోరిక. రాత్రి 8 నుండి తొమ్మిది వరకు వాళ్ల బ్యాచ్‌. వాళ్లు ఇరవై రెండు మంది. వారికి ఫీజు మూడు వందలుగా నిర్ణయించాడు. ఐదు నెలలకోర్సు. డిగ్రీ వాళ్లకు కూడ మూడు వందలే.

క్లాసులో కూడ విపులంగా చెప్పేవాడు. నోట్స్‌ ఇచ్చేవాడు.

గ్యాస్‌ కనెక్షన్‌ వచ్చింది. గ్యాస్‌ స్టవ్‌ కూడ గ్యాస్‌ డీలర్‌ వద్దే తీసుకున్నారు. వైజాగ్‌ నావల్‌ క్యాంటీన్‌ నుండి ప్రెషర్‌ కుక్కరు, ప్రెషర్‌ పాన్‌ తెప్పించాడు మల్లి. వసుధకు వంట పని సులువైంది. ఆమెకు ఐదో నెల వచ్చింది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మాతృత్వం వల్ల కొత్త నిగారింపు వచ్చింది కొంచెం ఒళ్లుచేసి, మరింత అందంగా తయారైంది.

సి.ఐ గారికి, ఆయన భార్యకు వసుధంటే ప్రాణం. ఆయన బజారు నుండి పండో ఫలమో, స్వీటో ఏదో ఒకటి తెచ్చిచ్చేవాడు. ఆమె కొన్ని వంటకాలు పంపేది.

నెలలు నిండే కొద్దీ వసుధకు కష్టమని ‘సుమీత్‌’ మిక్సీకొన్నారు. ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్ధతిలో. వసుధ వద్దన్నా వినకుండా పనిమనిషిని పెట్టాడు పతంజలి. ఆమె పేరు దాలమ్మ. ఒక కంట్లో పువ్వు వేసింది. మొగుడు రిక్షా వేస్తాడు. ఆమెకు నెలకు పదిహేను రూపాయలు. దాలమ్మ కూతురు జానకి. దానికి పదేళ్లుంటాయి. దాలమ్మ భర్త తాగడు. భార్యను బాగా చూసుకుంటాడు.

వసుధకు ఎనిమిదో నెల నడుస్తూండగా చిత్తూరునుంచి తోడల్లుడు జాబు వ్రాశాడు. తొమ్మిదోనెలలో వసుధను కాన్పుకు తీసుకొని పోతామనీ, పిల్చుకొని రావడానికి భరత్‌ వస్తాడనీ, మంచిరోజు చూసి ప్రయాణం కమ్మనీ దాని సారాంశం.

తొమ్మిదో నెల మొదటి వారంలోనే భరత్‌ వచ్చాడు. తిరుపతి నుండి డైరెక్ట్‌గా హౌరా రైల్లో. ఈ విషయం నాన్నకు రాసి ఉన్నాడు పతంజలి. తండ్రి బదులు వ్రాశాడు.

“చిరంజీవి పెద్దవాడికి, ఆశీః. కోడలిని ముందుగా వెల్దుర్తికి పంపవలసినది. ఇక్కడి నుండే చిత్తూరు పంపుతాము. మాకు ఆ పిల్లను చూడాలనిపిస్తూన్నది. “

భరత్‌ వస్తూనే, “ఏంది బావా, నీ పేరు చెప్పి ఇల్లు చూపించమంటే నలుగురైదుగురు చూపించడానికొచ్చినారు?  నీవు బాగా పాపులర్‌ అయినావే” అన్నాడు.

“మీ బావ ఎక్కడున్నా పాపులరేరా” అన్నది వసుధ.

భోజనాల టైంలో గిన్నెలు కంచాలు పెట్టడం. తిన్న తర్వాత అవన్నీ తీసి, నీళ్లు చల్లి బట్టతో తుడవటం, బావి నుండి నీళ్లు తోడటం లాంటి పనులన్నీ బావ చేస్తూండటం గమనించాడు భరత్‌.

“అక్కా బావ చాలా మంచోడు గదే” అన్నాడు వసుధతో. “మీ ఇద్దరూ ఫ్రెండ్స్‌ లాగా ఉంటారు.”

“మీ బావ నాకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు రా” అన్నది వసుధ.

“ఏమిటి అక్కాతమ్ముళ్లిద్దరూ నన్నేనా ఆడిపోసుకుంటున్నారు?” అంటూ వచ్చాడు పతంజలి. ట్యూషన్‌ మధ్యలో పిల్లలకేదైనా వర్క్‌ ఇచ్చి, వంటింట్లోకి వచ్చి వసుధతో మాట్లాడి పోతూంటాడు.

“ఆ ఏంలేదు.. మీ బావ పైకి కనబడినంత మంచోడు కాదురా అని చెబుతున్నా మా తమ్ముడితో” అన్నది వసుధ. భరత్‌ నవ్వుతున్నాడు.

ఆదివారం ఒక్కరోజే పతంజలికి ఖాళీ దొరికేది. కాలేజికి వెళ్లి రావటానికి ఒక సైకిలు కొనుక్కున్నాడు. ‘హెర్కులస్‌’ కంపెనీది. డార్క్‌ గ్రీన్‌ కలర్‌. ఆ రోజు సాయంత్రం ముగ్గురూ సినిమాకు వెళ్లారు. “గ్యాంగ్‌ లీడర్‌” చిరంజీవి సినిమా.

ఆ వూర్లో నాలుగు థియేటర్లున్నాయి. పలాసలో ‘వేంకటేశ్వర’ కాశీబుగ్గలో ‘దుర్గా’ భగవతి పిక్చర్‌ ప్యాలెస్‌, ఈమధ్య కొత్తగా ‘హరిశంకర్‌’ కట్టారు. ఇంకా ప్రారంభించలేదు. రెండు కిలోమీటర్ల దూరంలో ‘చినబాడాం” అనే ఊరుంది. అక్కడ ఒక థియేటర్‌ ఉంది. ఆ థియేటర్‌లో సినిమాకు వెళ్లాలంటే రానుపోను రిక్షా మాట్లాడుకోవాలి. రిక్షావాడికి సినిమా టిక్కెట్టు తీయాలి. సినిమా అయిన తర్వాత అతనే ఇంటికి తీసుకొస్తాడు.

పతంజలి వసుధ ఇంచుమించు ప్రతి ఆదివారం సినిమాకు వెళతారు. థియేటర్లు కూడ బాగుంటాయి.

వసుధ, భరత్‌ బయలుదేరేరోజు దగ్గరకొచ్చింది. ముందు విజయవాడకు వెళ్లి, అక్కావాళ్లింట్లో ఒక రోజుండి, మరసటి రోజు వెల్దుర్తికి వెళ్లాలని ప్లాను. ఈ మధ్యే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ అని కొత్త రైలు వేశారు. భువనేశ్వర్‌ నుండి బొంబాయికి వెళుతుంది. పలాసకు రాత్రి పదిగంటలకు వస్తుంది. ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడ చేరుతుంది. దాంట్లో ఇద్దరికీ రిజర్వేషన్‌ చేయించాడు. గుంటూరు నుండి డోన్‌కు రిజర్వేషన్‌ చేయించమని రామ్మూర్తి బావకు రాసి ఉన్నాడు.

రాత్రి కోణార్క్‌కు వాళ్లను ఎక్కించడానికి స్టేషన్‌కు వెళ్లాడు పతంజలి. వాళ్లిద్దరూ బ్యాగులతో రిక్షాలో వెళుతూంటే తాను వెనుక సైకిలు మీద వెళదామనుకున్నాడు. భరత్‌ తెలివైనవాడు. ఆ కాసేపూ అక్కాబావలు కలిసి ఉండాలని, తాను సైకిలు తీసుకొని బావను రిక్షాలో ఎక్కమన్నాడు.

రిక్షాలో వసుధ పతంజలి చేయిని వదలకుండా పట్టుకునే ఉంది. ఇద్దరి మనసుల్లో దిగులు. రైలు సకాలానికే వచ్చింది. యస్‌.త్రి బోగీలో ఎక్కారు. రైలు రెండు నిమిషాలే ఆగుతుంది. ఒక లోయర్‌, ఒక అప్పర్‌ బెర్తు వచ్చాయి.

“జాగ్రత్త బావా, వేళకు తింటారుగా, మీ ట్యూషన్లలో పడి ఆరోగ్యం అశ్రద్ధ చేయకండి.” అన్నది వసుధ. ఆమె కళ్లనిండా నీళ్లు కిటికీలోంచి భర్త చెయ్యి పట్టుకొని వదలటం లేదు.

రైలు కదిలింది. “బై బావా!” అన్నాడు భరత్‌. నాలుగడుగులు రైలుతో పాటు నడిచి ఆగిపోయాడు పతంజలి.

(సశేషం)

Exit mobile version