[సాహిత్య అకాడమీ ప్రచురించిన, డా. జె. చెన్నయ్య గారు రచించిన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు దేవులపల్లి రామానుజరావు’ పుస్తకం చదివాకా కలిగిన భావనలతో, డా. మారంరాజు వేంకట మానస రచించిన కవిత ఇది]
~
కష్టంబొక్కింతయు లేదు నాకు
నగర నడివీధుల నడవగన్
శిష్టంబగోద్యమ వీరులు పరిచె
పూలబాట నా యింటి ముంగిటన్
అక్షరాస్యత కరువు జూచిననాడు
లక్ష్యంబుగ వీరి రాతలు యుచ్ఛ్వాసంబున నిల్చెన్
అభ్యుదయ భావములన్నేర్చి నవాబ్లను
రక్తముడకంగ తరిమికొట్టెన్
వాగ్బంధన శాశనమును సైతం లెక్కచేయక
తెలంగాణాంధ్రులయందు తెగించి పత్రికల్ నడిపెన్
ఓర్వలేక సభాపందిళ్ళు కూల్చినా
ప్రసంగాల్హెచ్చి గగనపుటంచును తాకెన్
రామానుజుని వంటి సాహితీవేత్తలు
భవ్య‘శోభ’లు నింపె భాగ్యనగరంబునన్
తెలుగువాని తెగువ దేశంబు మెచ్చగా
తేజరిల్లె దివ్య సంస్కృతిచటన్
తెలంగాణమ్మున కవులు పండితులేరనగ
ఇదుగోయని చూపెద సారస్వత నవనీతమున్
ఉద్యమ కాలమున కూడా పచ్చతోరణముల్ వెలయ
నవ్యకాంతులు జిమ్మె తెనుగు వాడలన్
ఫిరంగుల రజాకార్ల భయమికలేక యీనాడు
స్వతంత్ర్యముగ పట్టణ వీధుల కాలుమోపితిన్
వెనుకటి వారు పెట్టిన భిక్షయే కదా నాకిదియని
సగర్వముగ వేనోళ్ళ కొనియాడితిన్
రాయంచ నడకల రాజ్ఞిని నేను
స్వేచ్ఛగా వినువీధుల తిరిగివొచ్చెదన్
కష్టంబొక్కింతయు లేదు నాకు
నగర నడివీధుల నడవగన్