“సంజనా”
ఆ అందమైన డిజైనర్ ఆవేదనని ఎవరూ పట్టించుకోలేదు. శివ మంటల్లోకి పరిగెత్తడానికి ప్రయత్నించాడు.
ఒకవేళ పోలీస్ కానిస్టేబుల్ అతన్ని అడ్డుకోకపోతే అతను మంటల్లోకి దూకి, కాలి బూడిదయ్యేవాడు.
శివని ఆపడానికి కానిస్టేబుల్ అక్కడున్నవారి సహాయం కోరాడు.
“సార్, ఈ షాప్ నాది. నా భాగస్వామి సంజన మేడమ్ లోపల ఉండిపోయారు. షాపు కాలిపోతే పోయింది. కనీసం ఆమెను బయటకు తీసుకురండి.”
ఆ అందమైన ముఖంలో కన్నీళ్లు చూసి కఠిన హృదయం గల పోలీసు కూడా కరిగిపోయాడు. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు.
“సోదరా, నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. ఈ మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయనీ, లోపల ఏదీ మిగలదని అంటున్నారు. లోపల ఉన్నవాళ్ళు, లోపల ఉన్న సరుకు శాశ్వతంగా పోయినట్టే.”
శివ లోపలికి వెళ్ళడానికి మరొకసారి ప్రయత్నించాడు. కాని అరడజను మంది జనాలు అతనిని గట్టిగా పట్టేసుకునేసరికి ఏమీ చేయలేకపోయాడు.
నిలుచోలేకపోయాడు. దేనిపైనా దృష్టి నిలపలేకపోయాడు. అతనికి కళ్ళు తిరిగాయి, పడిపోబోయాడు.
అదృష్టవశాత్తూ కానిస్టేబుల్ అతనిని తన చేతుల్లో పట్టుకుని, ఆపై అతనిని దూరంగా పడుకోబెట్టాడు.
***
ఇంతలో అక్కడ శివ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది – కారణం ఎవరో ఫోన్ చేసి మూడే పదాలు – కేవలం మూడు పదాలు – “శివ షాపు తగలబడిపోతోంది” అని చెప్పడమే. వాటినే మరోసారి చెప్పి, లైన్ కట్ చేశారు.
మాల్య ఫోన్ తీసింది. తన మొబైల్‌లో శివకి ఫోన్ చేసింది. ఆ సమయంలో శివ వినూతో మాట్లాడుతుండం వల్ల ఫోన్ ఎంగేజ్ అని వచ్చింది. ఆపై మాల్య సంజనకి ఫోన్ చేసింది. ఆమె నెంబరు కూడా బిజీగా ఉంది.
ఆమె షాపుకి వెళ్లాలని అనుకుంది. ఆపై తనకి మంచి ఆలోచన వచ్చింది. పద్మకి ఆ రోజు ఆలస్యం అవుతుందని చెప్పింది, ఎందుకంటే ఆమె బ్యాంక్ బ్రాంచ్‌కి ఆడిటర్లు వచ్చారట. పద్మ అయితే షాపుకు చాలా దగ్గరగా ఉంటుంది.
మాల్య తన మొబైల్ నుంచి పద్మకి ఫోన్ చేసింది. పద్మ అప్పుడే బ్యాంకు నుంచి బయటకి వస్తోంది. విషయం తెలుసుకుని వెంటనే శివ సిల్క్స్‌కు వెళ్లమని ఆమె తన డ్రైవర్‌కి చెప్పింది.
మంటలు ఇప్పుడు ఉధృతంగా ఉన్నాయి. మంటలు ఇరవై అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. షాపు కనబడడం లేదు. ఆ ప్రదేశం భయంకరంగా రద్దీగా ఉంది. జనాల్ని దాటుకుంటూ షాపు ముందుకి చేరుకోవడానికి ఆమెకి పది నిమిషాలు పట్టింది.
“శివా శివా”
శివ లాగే ఆమె కూడా షాపులోకి వెళ్లాలని అనుకుంది. పోలీసు ఆమెను ఆపాడు.
“మీరా మంటలని చూడలేదా? ఇంకొక అడుగు వేస్తే మీరు కూడా మాడి మసైపోతారు. మేము మీ శరీరాన్ని కూడా గుర్తించలేం. కొద్ది నిమిషాల క్రితం ఒక వెర్రి యువకుడు మంటల్లోకి దూకడానికి ప్రయత్నించాడు. నేను అతనిని ఆపాను. అతను మూర్ఛపోయాడు. అతను అక్కడ ఉన్నాడు.”
శివ అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని పద్మ చూసింది.
“శివా” అంటూ ఆమె అతని దగ్గరికి పరిగెత్తి అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించింది. చాలా మంది సహాయం కోసం వచ్చారు. శివని సురక్షితంగా పద్మ కారులోకి ఎక్కించారు.
కారు బయలుదేరబోతుండగా ఒక వ్యక్తి ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
“మేడమ్, ఈ ఫోన్ అతని జేబు నుండి పడిపోయింది”
ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఇసాబెల్స్ ఆసుపత్రికి వెళ్ళమని ఆమె డ్రైవర్‌ని ఆదేశించింది.
ఆమె మాల్యకి ఫోన్ చేసింది.
“శివ క్షేమమే, కానీ అపస్మారక స్థితిలో ఉన్నాడు. సంజన గురించి ఏమీ తెలియలేదు. నేను శివని ఇసాబెల్స్‌కు తీసుకువెళుతున్నాను.
మీ అమ్మకి అప్పుడే ఏమీ చెప్పద్దు. కాని వీలైనంత త్వరగా ఇక్కడకి వచ్చేయ్. ఒక్కదాన్నీ నా వల్ల కాదు.”
***
డ్యూటీ డాక్టర్ సరళమైన పద్ధతుల ద్వారా శివకి స్పృహ తెప్పించాడు. శివ ముఖంపై చల్లటి నీళ్ళు చల్లి మేల్కొలిపాడు. డాక్టర్ అతని పల్స్, బిపి చెక్ చేశాడు. ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకోమని చెప్పాడు.
స్ట్రాంగ్ బ్రూ తన నరాలను సక్రియం చేసిన తర్వాతే శివ పూర్తిగా స్పృహలోకి వచ్చాడు. అప్పుడే అతను ఈ సంఘటన పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకోగలిగాడు.
అతను బెంగగా ఉన్న పద్మ ముఖాన్ని చూశాడు.
“పిన్ని” అంటూ అతను ఆమెను కౌగిలించుకుని చిన్నపిల్లలా ఏడుస్తున్నాడు.
“పిన్నీ, అంతా అయిపోయింది. సంజన, షాపు, చీరలు, డబ్బు, కంప్యూటర్లు, డ్రాయింగ్‌లు అన్నీ నాశనం అయిపోయాయి. పిన్నీ, ఇక నేను బ్రతికి ఏం లాభం?
దయచేసి, సంజన మేడమ్‌తో పాటు నన్ను కూడా మంటల్లో కాలిపోనివ్వండి. ఆమె లేకుండా నేను ఉండలేను. ఆమె నా కోసమే చనిపోయింది పిన్నీ. నేను మాత్రమే బ్రతికి ఉండడంలో న్యాయం లేదు.”
పద్మ శివని ఓదార్చడానికి ప్రయత్నించింది. కానీ ఏదీ పని చేయలేదు. అప్పటికి మాల్య వచ్చింది.
ఆమె శివ పక్కన కూర్చుని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తోంది.
“బాధపడకు శివా. మనం మన ఇంటిని అమ్ముదాం, అప్పుడు నీ షాపుని తిరిగి పొందవచ్చు. శివా, ఈ అక్క ఇంతకంటే ఏమి చేయగలదు?”
మాల్య తన తమ్ముడితో పాటు ఏడుస్తూ ఉంది.
“మీరు షాపునైతే తిరిగి ఇస్తారు, అక్కా. కాని సంజనను ఎవరు నాకు తిరిగి ఇస్తారు? ఆమెలాంటి మరో దేవదూతను నేనెక్కడ చూస్తాను?”
మాల్య, పద్మ శివని కౌగిలించుకుని గట్టిగా ఏడుస్తున్నారు.
కొంత సేపటి తరువాత మాల్య అతనితో అంది “శివ నువ్వు మంచివాడివి. దేవుడు నిన్ను నిరాశపరచడు.”
“అయ్యో, మొత్తం తగలబడి పోయింది. ఇది నిరాశపరచడం కాకపోతే, మరేమిటి? దయచేసి దేవుడి గురించి మాట్లాడద్దు. దేవుడు లేడు.”
***
ఆడవాళ్ళిద్దరూ శివను బలవంతంగా కారులోకి ఎక్కించారు.
ఆసుపత్రి పక్కనే ఉన్న భవనంలో పండుగ వాతావరణం కనబడుతోంది.
“మాత అంబికా దేవి వచ్చారు” వీధిలో నడుస్తూ ఎవరో అన్న మాటలు పద్మ వింది. ఆమెకెంతో కోపం వచ్చింది.
“మాల్య, నేను ఆవిడని చూడాలనుకుంటున్నాను. గొప్ప అబద్దాలకోరు – శివ జీవితంలో ఎంతో పైకొస్తాడని సిగ్గు లేకుండా మనతో చెప్పింది.
ఆమె నమ్మిన ప్రభువు ప్రపంచంలోనే గొప్ప మోసగాడు అని నేను ఆమెకు చెప్పబోతున్నాను. ఆయన మన శివ నుండి అన్నీ పట్టుకుపోయాడా లేదా? అలా చేస్తే మనం ఆయనను దేవుడు అని ఎలా అంటాం?
కాదు, అతను ఒక దొంగ. మంచివారి నుండి ప్రతిదీ లాక్కోవడానికి ఇష్టపడతాడు. ఆ పాపాత్ములు, మోసగాళ్ళు, మీ బాబాయిలు మాత్రం దినదినాభివృద్ధి చెందుతున్నారు.
ఇదేనా ఆ ప్రభువు న్యాయ భావన? ప్రపంచం మొత్తం నాశనమైనప్పటికీ నేను పట్టించుకోను. నా శివకి న్యాయం కావాలి. అంతే.”
శివ మీద ఉన్న మమకారంతో పద్మ అలా ప్రవర్తించింది.
మాల్య ఆమెను నియంత్రించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. కానీ కుదరలేదు.
“పద్మా, శివ ఇప్పటికే సర్వనాశనం అయ్యాడు. ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఎందుకు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు? రా, ఇంటికి వెళ్దాం.”
పద్మ ఉన్మాదంలో ఉన్నట్టుగా మళ్ళీ అవే మాటలు పలికింది.
“ఈవిడ నాకు చెప్పింది, శివ జీవితంలో పైకి వస్తాడు అని. చెప్పలేదా? నువ్వు కూడా ఆరోజు నాతో బాటే ఉన్నావుగా?
నేను ఆమెను అడుగుతాను, ‘జీవితంలో పైకి ఎదగడం అంటే మీ నిర్వచనం ఇదేనా?’ మంటల్లో సర్వస్వం కోల్పోడమేనా? ఆఁ?”
మాల్య ఆమెను వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. కానీ పద్మ ఆమెను దూరంగా నెట్టి శివ చేతులు పట్టుకుని ఆ భవనంలోకి నడిచింది.
***
ఆమె ముఖంలోని ఉద్వేగాన్ని చూసి ఎవరూ పద్మను ఆపడానికి ప్రయత్నించలేదు.
పద్మ శివని అంబికా దేవి వద్దకు లాక్కెళ్ళింది.
మాత ఒక బృందంతో భజనలు పాడుతున్నారు. పద్మ గదిలోకి దూసుకురావడం చూసి, అంబికా దేవి అందరినీ ఆపమని సంకేతాలు ఇచ్చారు.
“ఎందుకమ్మా, అంత కోపంగా ఉన్నావు? ఆమె పద్మను ఆప్యాయంగా అడిగారు.
పద్మ క్రోధంతో ఎగిరిపడింది.
“ఈ అబ్బాయిని చూడండి. అతని ముఖం చూడండి. మేము జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని మీకు తెలుసు. వీడు జీవితంలో ఒక్క పైసా కూడా దొంగిలించలేదు. మేము ప్రజలకు సహాయం చేసాము. మేము మంచివాళ్ళం.
మేము ఎవ్వరినీ బాధపెట్టలేదు. మేము ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇతని బాబాయిలు ఆస్తులను చేజిక్కించుకుని మమ్మల్ని వీధిలో నిలబెట్టినప్పుడు కూడా మేము వారిని ఏమీ చేయలేదు.
ఈ అబ్బాయి, అనేక కోట్ల ఆస్తికి వారసుడు, చిన్న జీతానికి గుమస్తాగా పనిచేశాడు. పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభమైనప్పుడు సర్వస్వం అగ్నికి ఆహుతి అయ్యింది.”
పద్మ కోపం మాతను ప్రభావితం చేయలేదు. ఆమె వదనంలో శాంతి, ప్రేమ మెరుస్తున్నారు.
భౌతిక దృష్టిలో అంబికా దేవికి పద్మ మాట్లాడిన ఒక్క మాట కూడా అర్థం కాలేదు.
కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఆమెకు ప్రతిదీ తెలుసు. ఏది జరిగిందో, ఏం జరగబోతోందో తెలుసు. ఆ దైవిక జ్ఞానం ఆమె నుండి బలమైన మాటల రూపంలో వెల్లడయింది.
“నా ప్రభువు విషయంలో తప్పులు వెదకాలని ప్రయత్నించవద్దు. ఆయన మీ నుండి ఏదైనా తీసుకుంటే అది మీ చేతులను ఖాళీ చేయడమే, తద్వారా మీరు మరింత పెద్దదాన్ని, మంచిదాన్ని అందుకోవచ్చు.”
“నేను ఈ చె… ని నమ్మను…”
అంబికా దేవి ఆమె మాటలను పూర్తి చేయనివ్వలేదు.
“ఇంక మాట్లాడద్దు. వెంటనే ఇక్కడ్నించి వెళ్ళిపొండి.”
ఏమి చేయాలో పద్మకు తెలియలేదు. అంబికా దేవి తన బృందానికి సంకేతాలు ఇచ్చారు. వారు భజనలను తిరిగి ప్రారంభించారు.
ఓడిపోయిన పద్మ శివని వెంటబెట్టుకుని అక్కడ్నించి కదిలింది.
***
మాల్యా ఆందోళనగా తన కారు బయట నిలబడి ఉంది. రాత్రంతా అందుబాటులో ఉండమని డ్రైవర్‌కి చెప్పి, పద్మ కారును ఇంటికి పంపించింది.
శివని ఒక సెకను కూడా ఒంటరిగా వదిలేయడానికి ఇష్టపడలేదు వాళ్ళిద్దరూ. శివని వెనుక సీటు మధ్యలో కూర్చోబెట్టారు. పద్మ, మాల్య అతనికి చెరోపక్కనా కూర్చున్నారు.
కారు బయల్దేరుతుండగా శివ సెల్‌ఫోన్ రింగ్ అవడం పద్మకు కనిపించింది. ఆమె డ్రైవర్‌ను బండి ఆపమంది.
ఇది మరింత దుర్వార్త అవుతుందని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. సంజనకి ఏం జరిగిందో ఎవరో చెప్పబోతున్నారు.
ఆ సంభాషణ శివ వినడం పద్మకు ఇష్టం లేదు.
ఆమె కారు నుండి దిగి, పది అడుగుల దూరం నడిచి ఆ కాల్ తీసుకుంది.
శివ ఇప్పుడు ఒక జీవచ్ఛవంలా ఉన్నాడు. శివ గట్టిగా అరిస్తే మాల్యకు ఉపశమనంగా ఉండేది. బదులుగా అతను ఒక రాయిలా స్తంభించిపోయాడు. తన తమ్ముడి కోసం మాల్య హృదయం విలపిస్తోంది.
పద్మ పది నిమిషాల కన్నా ఎక్కువసేపు ఫోన్ మాట్లాడింది.
***
ఆమె తిరిగి వచ్చినప్పుడు చిన్నగా నవ్వింది.
ఆమె శివ చేతిని పట్టుకుని కారులోంచి దింపింది. అతన్ని కౌగిలించుకుని నుదిటిపై ముద్దు పెట్టుకుంది.
“అభినందనలు, శివా. నీ భాగస్వామి సంజన సురక్షితంగా ఉంది. ఆమె అపోలో ఆసుపత్రి ఐసియులో ఉంది. వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడారు. ఫస్ట్ డిగ్రీ బర్న్స్, ఇంకా కుడి కాలులో కాంపౌండ్ ఫ్రాక్చర్ అయింది.
కానీ ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. అయితే తను ఇంకా అపస్మారక స్థితిలో ఉంది. డాక్టర్ కన్నప్పన్ కంగారుగా ఉన్నారు. మనమంతా తన వద్ద ఉండాలని ఆయన కోరుకుంటున్నారు” అని చెప్పి, “మాల్య, మనం ఇక్కడ నుండి అపోలోకు వెళ్దాం. నేను మీ అమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తాను” అంది.
శివ గట్టిగా వెక్కిళ్ళు పెట్టి, పెద్ద గొంతులో రోదించాడు. వాళ్ళిద్దరూ అతన్ని ఏడవనిచ్చారు.
***
సంజన సురక్షితంగా ఎలా ఉంటుంది? ఆమెను ఎవరు రక్షించారు? ఆ ఘోరమైన అగ్ని ప్రమాదం నుండి ఎవరో ఆమెను రక్షించినప్పటికీ, ఆమెకు ఫస్ట్ డిగ్రీ బర్న్స్ మాత్రమే ఎలా అయ్యాయి?
ఈ ప్రశ్నలు అందరి మనస్సులలో ముఖ్యంగా శివలో ఆధికంగా ఉన్నాయి. విధికి తప్ప మరెవరికీ సమాధానాలు తెలియవు. మంచి చెడు శక్తుల విచిత్రమైన పరస్పర చర్య ద్వారా సంజన రక్షించబడింది.
***
అందంగా, అమాయకంగా కనిపించే ఆ ఇద్దరినీ చంపడానికి లతకి మనసొప్పలేదు. అదే సమయంలో ఆమె తన ప్రేమికుడిని కోల్పోవటానికి ఇష్టపడలేదు. ఈ పని చేయడానికి తాను నిరాకరిస్తే అతన్ని కోల్పోతుంది, అయితే వెల్డింగ్ కుమార్ ఈ పనిని ఏ విధంగానైనా మరొకరి చేత చేయిస్తాడు.
కాబట్టి పాపం, లతకి తన ప్రేమికుడికి విధేయత చూపడం తప్పదు; అయితే దాదాపు అసాధ్యమైన పనిని – ఆ ఇద్దరినీ రక్షించడాన్ని- స్వయంగా చేపట్టింది.
దాదాపుగా అసాధ్యమని తెలిసినా ఆమె షాపుని కూడా కాపాడాలని కోరుకుంది.
తన ప్రేమికుడికి అవసరమైన సమాచారం సేకరిస్తున్నప్పుడు, ఆమె సంజన, శివ ల్యాండ్‌లైన్ నంబర్లు, ఇంకా డాక్టర్ కన్నప్పన్ మొబైల్ నంబర్ కూడా సేకరించింది.
లిఫ్ట్ అడగడం ద్వారా వారిలో ఒకరిని కాపాడగలనని ఆమెకు తెలుసు. ఆమెను డ్రాప్ చేయడానికి శివ ముందుకు రావడంతో అతడు రక్షించబడ్డాడు.
లా బాంబా ఉపకరణాన్ని మండించడానికి ముందే ఆమె తన మొబైల్ ఫోన్ నుండి రెండు కాల్స్ చేసింది.
మొదటి కాల్ అపోలో ఎమర్జెన్సీకి. ఆమె తనను తాను శివ సిల్క్స్‌లో పనిచేస్తున్న సేల్స్ గర్ల్‌గా చెప్పుకుని, అగ్ని ప్రమాదం జరిగిందని, తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నారని వారికి చెప్పింది.
అపోలో వారి ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ షాప్‌కి సమీప ప్రదేశమైన గ్రీమ్స్ రోడ్ నుండి వస్తుందని లత భావించింది. సైరన్లు మోగిస్తూ వచ్చినా పదిహేను నిమిషాలు పట్టవచ్చు.
అప్పటికి మంటలు మొదలవుతాయి, పైగా అగ్నిమాపక సిబ్బంది షాపు లోపల చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసేస్తారు.
సమీప ఫైర్ స్టేషన్ మైలాపూర్ అని ఆమె తెలుసుకుంది, అక్కడ్ని నుండి ఫైరింజన్ పది నిమిషాల్లోపు ఈ ప్రదేశానికి చేరుకుంటుంది.
అపోలోకి ఫోన్ చేసిన తరువాత, ఆమె ఫైర్ సర్వీస్‌కి ఫోన్ చేసింది.
***
లత దురదృష్టం కొద్దీ, ఆమె అంచనాలు రెండూ తప్పాయి. మైలాపూర్ ఫైర్ స్టేషన్ ఆమె ఫోన్ అందుకున్నప్పటికీ వాహనం వెంటనే బయల్దేరలేదు.
వారు విలువైన పది నిమిషాలు కోల్పోయారు. వారు మౌంట్ రోడ్ యూనిట్ నుండి బ్యాక్ అప్ ఫైరింజన్ కోసం కబురుపెట్టారు.
కానీ అది చాలా దూరంలో ఉంది. మంటలు ప్రారంభమైన పదిహేను నిమిషాల తర్వాత రెండు ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి.
అపోలో విషయంలో పొరపాటు విపర్యయంలో ఉంది. వారి అంబులెన్స్ గ్రీమ్స్ రోడ్ ఆసుపత్రి నుండి వస్తుందని లతా అంచనా వేసింది.
అపోలో అంబులెన్సులు వైర్‌లెస్ నెట్‌వర్క్ ద్వారా ఆసుపత్రికి అనుసంధానించబడ్డాయని ఆమె ఊహించలేదు.
లత ఫోన్ అందుకున్న వ్యక్తి – తాను పంపిన అంబులెన్స్ డ్యూటీలో ఉన్న వైద్యుడితో ఆసుపత్రికి తిరిగి రావడాన్ని గుర్తించాడు.
ఆ అంబులెన్స్ ఒక రోగిని మైలాపూర్‌లో దింపింది. ‘శివ సిల్క్స్’ అనే పట్టు చీరల షాపులో అత్యవసర పరిస్థితి అని వారికి కబురు అందినప్పుడు, ఆ వాహనం కేవలం ఒక వీధి దూరంలో ఉంది.
ఇది ఆరు నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. అంటే అంబులెన్స్ ప్రమాదం జరగడానికి మూడు నిమిషాల ముందే చేరిపోయింది. సమయం 8.57 మాత్రమే అయ్యింది. మంటలు రాత్రి 9 గంటలకి మాత్రమే అంటుకుంటాయి.
అంబులెన్స్ డ్రైవర్ వాహనం షాపు బయట ఆపి, ఎవరు గాయపడ్డారని వాకబు చేశాడు.
చేయడానికి పనేమీ లేక, ఖాళీ అంబులెన్స్‌లో కూర్చుని ఏం చేయాలని, డాక్టర్ కూడా డ్రైవర్‌తో పాటు వెళ్ళాడు.
కొద్దిసేపు చుట్టూ చూసి వారు షాపులోకి ప్రవేశించినప్పుడు సమయం సరిగ్గా రాత్రి 9 గంటలు.
సరిగ్గా ఆ సమయంలో డిజైన్ గదిలో మంటలు మొదలయ్యాయి.
గది మంటలు రేగడం, ఒక అమ్మాయి మంటల వైపు పరుగెత్తటం వారు చూశారు.
అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం తెలుసుకోవాలనుకుంది సంజన. ఆమె ఆ గది తలుపు తెరవగానే ఓ కాలుతున్న వస్తువు ఆమె నుదిటిపై పడింది.
ఆమె మూర్ఛ పోయింది. వాసంను పోలిన మరొక వస్తువు తన కాళ్ళపై పడడం ఆమెకు తెలియలేదు.
ఆ సమయంలో మంటలు ఇంకా వ్యాపించలేదు. డాక్టర్, డ్రైవర్ ఆ యువతిని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లారు.
అంబులెన్స్ ఇప్పుడు సైరన్లు మ్రోగిస్తూ అపోలోలోని బర్న్స్ యూనిట్ వైపుకు పరుగెత్తుతోంది. డాక్టర్ కనీసపు ప్రథమ చికిత్స అందించాడు. ఫస్ట్ డిగ్రీ బర్న్స్‌కి చికిత్స చేయడానికి, కుడి కాలు ఫ్రాక్చర్‌కి చికిత్స చేయడానికి ఆయన ERకి కబురందించాడు.
ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకునేసరికి అంబులెన్స్ జాడ లేదు. అందువల్ల మంటలు పూర్తిగా రేగక ముందే సంజనను భద్రంగా కాపాడినట్టు ఎవరికీ తెలియదు.
శివ సమీపంలోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో లతను దింపిన వెంటనే ఆమె మరో రెండు కాల్స్ చేసింది.
అగ్ని ప్రమాదం గురించి చెప్పడం కోసం శివవాళ్ళింటి ల్యాండ్‌లైన్‌కు ఒకటి. మరొకటి డాక్టర్ కన్నప్పన్‌కు – ఆయన కూతుర్ని తీవ్రమైన కాలిన గాయాలతో అపోలోకు తీసుకువెళ్ళినట్లు సమాచారమిచ్చే ఫోన్.
డాక్టర్ కన్నప్పన్ వెంటనే అపోలోకి ఫోన్ చేశారు. ఆ రోజు కాలిన గాయాలతో ఎవరూ చేరలేదని వారు మొదట చెప్పారు.
కన్నప్పన్ ఒక నిట్టూర్పు విడవడానికి ముందే ER ఆపరేటర్ ఉత్సాహంగా అరిచాడు.
“ఇది విచిత్రమైన సంఘటన, డాక్టర్. ఇప్పుడే మాకు కాల్ వచ్చింది, మైలాపూర్ వద్ద శివ సిల్క్స్ అనే షాపుకి అంబులెన్స్ పంపారు.
మొదట మంటలు లేవని చెప్పడానికి డ్రైవర్ ఫోన్ చేశాడు. కానీ మంటల గురించి చుట్టూ ఆరా తీస్తున్నప్పుడు, మంటలు రేగడంతో, వారు 25 – 27 ఏళ్ల మహిళను కాపాడగలిగారు. వారు కాలిన గాయాల విభాగానికి తీసుకు వెళ్తున్నారు.”
కన్నప్పన్ ఫోన్ డిస్‌కనెక్ట్ చేసి వెంటనే అపోలోకు తీసుకెళ్ళమని తన డ్రైవర్‌కి గట్టిగా కేకలేస్తూ చెప్పారు.
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.