ప్రతి నెలా ఆఫీసుకి వచ్చే సాధారణ, చూస్తే ఇబ్బంది లేని బ్యాంకు స్టేట్‌మెంట్‌ను అనుకోకుండా శివ చూడటంపై రాజశేఖర్ ఎందుకు అరిచాడు? శివ తెలుసుకోవటానికి ఆసక్తిగా ఉన్న ఆ స్టేట్‌మెంట్‌లో ఏదో రహస్యం ఉండాలి.
రాజశేఖర్‌కు తెలియకుండా ఆ స్టేట్‌మెంట్ కాపీని బ్యాంకు నుండి పొందటానికి ఒక మార్గం వెతకాలి.
మర్నాడు శివ బ్యాంక్ మేనేజర్‌ను కలిసాడు. అతని కళ్ళ నిండా నీళ్ళు!
“సార్, దయచేసి మీరు నాకు సహాయం చేయాలి.”
“ఏమైంది?”
“మీరు నా యజమానికి ఇవ్వమని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను బస్సులో దాన్ని పోగొట్టాను సార్. ఈ సంగతి ఇప్పుడు రాజశేఖర్ గారికి తెలిస్తే, నన్ను ఉద్యోగంలోంచి తొలగిస్తారు. సార్, దయచేసి అనారోగ్యంతో ఉన్న నా తల్లి, పెళ్లికాని అక్క గురించి ఆలోచించండి. నా కుటుంబంలో సంపాదించే ఏకైక సభ్యుడ్ని నేనే. దయచేసి … “
“సరే, ఆ స్టేట్‌మెంట్ మీ ఏకైక సమస్య అయితే, బాధపడద్దు. రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడకు రండి. నేను మీకు మరో ప్రింట్ అవుట్ ఇస్తాను. ”
“థాంక్యూ సార్. మీరు నా ఉద్యోగాన్ని కాపాడారు సార్. సార్, దయచేసి నా బాస్ రాజశేఖర్ గారికి ఈ విషయం చెప్పకండి. ”
“అలాగే. నేను చెప్పను.”
***
రెండు రోజుల తరువాత, తన చొక్కా లోపల సురక్షితంగా ఉంచిన బ్యాంకు స్టేట్‌మెంట్ డూప్లికేట్ కాపీతో శివ ఆసుపత్రిలోకి ప్రవేశించాడు.
జెకె హాస్పిటల్ ఉదయం కార్యకలాపాలతో సందడిగా ఉంది. కంప్యూటరైజ్డ్ డే-బుక్‌లో ఆనాటి లావాదేవీల ఎంట్రీలు వేస్తూ శివ తన పనిలో లీనమైపోయాడు. సమయం 10 గంటల 55 నిమిషాలు.
శివ కాఫీ తాగడానికి లేద్దామని అనుకుంటుండగా, రాజశేఖర్ అతని డెస్క్ దగ్గరకు వచ్చాడు.
“ఇది క్రితం నెల బ్యాంక్ స్టేట్‌మెంట్. ఈ స్టేట్‌మెంట్‌లోని ప్రతి ఎంట్రీని నగదు పుస్తకంతో పూర్తిగా తనిఖీ చేయాలి.
మనం చేసిన అన్ని నగదు డిపాజిట్లకు బ్యాంకు వాళ్ళు క్రెడిట్ ఇచ్చారో లేదో చూడాలి. ఈ పని పూర్తి చేయకుండా నువ్వు ఈ రోజు ఇంటికి వెళ్ళవు.”
“అలాగే సర్.”
రాజశేఖర్ వెళ్లిన వెంటనే ఆ స్టేట్‌మెంట్‌ని చూశాడు శివ. అది చాలా విచిత్రంగా ఉంది. ఈ స్టేట్‌మెంట్ మూడు రోజుల ముందే వచ్చింది. స్టేట్‌మెంట్‌ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైనదయితే, మూడు రోజుల పాటు ఖాళీగా ఎందుకు కూర్చున్నట్టు?
రాజశేఖర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్‌ను శివ తనిఖీ చేశాడు.
₹ 24,45,783.65.
శివ చుట్టూ చూశాడు. అడ్మిన్ విభాగంలో పనిచేస్తున్న మిగతా ఇద్దరు అమ్మాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ప్రతిసారీ నవ్వుతున్నారు. ఆఫీసు బాయ్ బయటకు వెళ్ళాడు. రాజశేఖర్ సంజన గదికి వెళ్ళాడు.
శివుడి చర్యలను చూడటానికి ఎవరూ లేరు. అంతకుముందు రోజు బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అతను తన చొక్కా లోపల నుండి నెమ్మదిగా బయటకు తీశాడు.
అతను దానిని త్వరగా తెరిచాడు, రాజశేఖర్ ఇచ్చిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో పోల్చి చూశాడు. అప్పుడు అతను మేనేజర్ నుండి వచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం బ్యాంక్ బ్యాలెన్స్‌ని తనిఖీ చేశాడు.
₹ 6,45,783.65.
పైసలు అవే. రూపాయల సంఖ్యలో చివరి ఐదు అంకెలు ఒకే విధంగా ఉన్నాయి. కాకపోతే లక్షల స్థానంలో ₹ 18 లక్షలు తేడా ఉంది.
శివ రెండు స్టేట్‌మెంట్లను జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. అతను వాటిని ఒక్కో లైన్‌ని చూడడం ద్వారా పోల్చాడు. అదృష్టవశాత్తూ – పని పట్ల శ్రద్ధ ఉన్న, తెలివైన శివకి మోసాన్ని గుర్తించడానికి ఇరవై నిమిషాల సమయం పట్టింది.
నగదు డిపాజిట్ చేయడానికి రాజశేఖర్ ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లేవాడు. ఆ పని కోసం అతను ఎప్పుడూ శివని గాని లేదా మరెవరినైనా ఎప్పుడూ అనుమతించడు.
‘అంత నగదుతో నేను ఎవరినీ నమ్మలేను సార్’ తన చిత్తశుద్ధికి చాలా సంతోషించే డాక్టర్ కన్నప్పన్‌తో చెప్పేవాడు రాజశేఖర్.
శివ చెక్కులను డిపాజిట్ చేయడానికి, డిడిలు మరియు చెక్ పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవడం, చెక్కుల తదుపరి సేకరణ, ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులు మరియు రుణ ఖాతాలను నిర్వహించడానికి బ్యాంకుకు వెళ్లేవాడు.
రాజశేఖర్ ఆసుపత్రి నగదును జమ చేసినప్పుడల్లా అతను ₹ 50,000 లేదా ₹ 1,00,000 నొక్కేసేవాడు. ఈ మొత్తం ఎవరికీ తెలియకుండా ఉండటానికి అతను చలాన్ల యొక్క కౌంటర్ ఫాయిల్స్ పాడు చేసేవాడు.
బ్యాంకు నుండి నెలవారీ స్టేట్‌మెంట్ వచ్చిన వెంటనే అతను దానిని అధ్యయనం చేసి, ఆపై కలర్ జిరాక్స్ సెంటర్ నడుపుతున్న తన స్నేహితుడైన కంప్యూటర్ నిపుణుడి సేవలను ఉపయోగించి నకిలీ స్టేట్‌మెంట్ తయారుచేస్తాడు.
తన కన్నా ముందు బ్యాంకు స్టేట్‌మెంట్‌ను ఎవరినీ చూడనివ్వకపోవడానికి కారణం అదే. అందుకే మేనేజర్ బ్యాంక్ కవర్ స్టేట్‌మెంట్ ఓపెన్ కవర్‌లో ఇచ్చినప్పుడు అతను శివపై అరిచాడు.
ఆ నకిలీ స్టేట్‌మెంట్‌లో రాజశేఖర్ నొక్కేసిన డబ్బు తాలూకూ డిపాజిట్లు కనిపిస్తాయి.
ఇప్పుడు కూడా అతను శివుడికి నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు, దానిని ఖాతాల పుస్తకాలతో ధృవీకరించమని కోరాడు. అది ఖాతా పుస్తకాలతో సరిగ్గా సరిపోయింది.
కానీ రాజశేఖర్‌కు తెలియని విషయం ఏంటంటే, శివ దగ్గర అసలైన బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉంది. పైగా నిజమైన మరియు నకిలీ స్టేట్‌మెంట్ మధ్య ₹ 18 లక్షల తేడా ఉంది.
ఇది ఇప్పటివరకు రాజశేఖర్ మోసం చేసిన మొత్తం.
శివుడు చాలా వేగంగా ఆలోచించాడు. తన మోసం గురించి శివకి తెలుసు అని రాజశేఖర్‌కు తెలిస్తే, శివని చంపడానికి కూడా వెనుకాడడు. ఇప్పుడు శివుడి సమస్య ఏమిటంటే, ఈ దొంగతనం గురించి ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలా అని.
***
రాజశేఖర్ భోజనానికి బయలుదేరే సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు శివ వేచి ఉన్నాడు. తరువాత అతను అసలు, నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను తీసుకొని డాక్టర్ కన్నప్పన్ గదికి పరిగెత్తాడు.
శివుడి దురదృష్టం, ఆ సమయంలో కన్నప్పన్ మూడ్ బాలేదు. ఒక ప్రముఖ కార్డియాక్ సర్జన్ తన రోగులలో ఒకరికి చేసిన బై-పాస్ శస్త్రచికిత్సలో కొన్ని సమస్యలు ఉన్నాయి.
శివ ఆయన సమయం కోసం వేడుకున్నాడు, ఆయన్ని కలిసాడు.
“ఏం కావాలో చెప్పు.”
“సర్, మన బ్యాంక్ అకౌట్‌లో పెద్ద సమస్య ఉంది. మీరు చూడాలి.. ” అంటూ శివ రాజశేఖర్ మోసం గురించి చెప్పడం ప్రారంభించాడు.
కానీ డాక్టర్ కన్నప్పన్ ఆసక్తి చూపలేదు.
“బ్యాంకులో సమస్య ఉంటే రాజశేఖర్‌కి లేదా సంజనకు చెప్పు. నన్ను ఎందుకు బాధపెడుతున్నావు?”
ఇంతలో ఒక నర్సు గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది.
“రోగి ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అనస్థీషియన్ కంగారుపడుతున్నారు” అంది.
శివ ఉనికిని పట్టించుకోకుండా కన్నప్పన్ నర్సు వెనుక పరుగెత్తారు.
నిరుత్సాహపడిన శివుడు తన సీటుకు తిరిగి వచ్చాడు. అతను అన్నం తినలేదు. తను ఫిర్యాదు చేయగల మొదటి వ్యక్తి కన్నప్పన్ గారే కొట్టిపారేస్తే, ఇంక ఫిర్యాదు చేయదగ్గ రెండో వ్యక్తి – వారి కుమార్తె సంజన. ఆసుపత్రి పరిపాలన బాధ్యతలు ఆమె చూస్తుంది.
శివ ఆమెను ఇంతవరకు కలవలేదు. చూడను కూడా చూడలేదు. రాజశేఖర్ ఆమె పిఏ కావడంతో – శివ ఆమెని చూడటానికి ఖచ్చితంగా అనుమతించడు.
ఇప్పుడు ఒకే ఒక అవకాశం ఉంది. శివ ఆసుపత్రి కాకుండా వేరే చోట సంజనను కలవాలి.
మధ్యాహ్నం తరువాత శివుడు సంజన గురించి సమాచారం సేకరించి ఆసుపత్రి చుట్టూ తిరిగాడు.
ఆమె ఎక్కడ ఉంటుందో, ఆమె ఎప్పుడు సాధారణంగా కార్యాలయాన్ని వదిలి ఇంటికి వెళ్తుందో తెలుసుకొన్నాడు. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీసంట్ నగర్ లోని కర్పగం గార్డెన్ ప్రాంతంలో ఉంటుంది. ప్రతిరోజూ ఐదు నుండి ఆరు మధ్య ఎప్పుడైనా ఇంటికి బయలుదేరుతుంది.
సాయంత్రం నాలుగు గంటలకు శివ ముఖం విచారంగా పెట్టి రాజశేఖర్ ముందు నిలబడ్డాడు.
“నేను మా అమ్మని మెడికల్ చెక్ అప్ కోసం తీసుకెళ్ళాలి. దయచేసి ఈ రోజు తొందరగా వెళ్ళడానికి అనుమతి కావాలి” అన్నాడు.
“బ్యాంక్ స్టేట్‌మెంట్ పని ఏమైంది?”
“నేను పూర్తి చేశాను సర్. మీరు ఇప్పుడు చూస్తారా? ”
“అవసరం లేదు. నేను రేపు చూస్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు. కానీ నెలకు ఒకసారి మాత్రమే తొందరగా వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుందని గుర్తుంచుకో.”
“థ్యాంక్యూ సర్.”
తన చొక్కా లోపల ఆసుపత్రి నుండి రహస్యంగా బయటకు తెస్తున్న పేపర్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాడు శివ.
***
పావు తక్కువ ఐదు కల్లా డాక్టర్ కన్నప్పన్ యొక్క రాజభవనం లాంటి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు శివ. అతని అభ్యర్ధన ఉద్వేగభరితమైనప్పటికీ, సెక్యూరిటీ గార్డు అతన్ని లోపలికి అనుమతించలేదు. శివ దూరంగా వెళ్ళినట్లు నటించాడు, కాని రెండు బ్లాకుల దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు వెనుక దాక్కున్నాడు.
శివ సంజనను చూడలేదు. కానీ అతనికు ఆమె కారు తెలుసు. అతను హాస్పిటల్ యొక్క ప్రత్యేకమైన పార్కింగ్ స్థలంలో బూడిద రంగు ఫోర్డ్ ఫియస్టాను చూశాడు మరియు దాని లైసెన్స్ ప్లేట్‌ను కూడా గుర్తుంచుకున్నాడు.
శివ నలభై ఐదు నిమిషాలు వేచి ఉన్నాడు. ఆపై ఆ వీధిలోకి రావడానికి ఫియస్టా ఒక పదునైన మలుపు తీసుకోవడం చూశాడు. అతను ఇంటికి పరిగెత్తి గేట్ల దగ్గర నిలబడ్డాడు.
సెక్యూరిటీ గార్డు కూడా కారును చూసి పెద్ద గేట్లు తెరుస్తున్నాడు. సంజన వెనుక వైపు కూర్చుని ఉండాలి. షట్టర్లు పైకి ఉండడంతో శివ ఆమెను చూడలేకపోయాడు.
కారు వేగాన్ని తగ్గించడంతో శివ కారు దగ్గరకు పరిగెత్తి కోపంగా వెనుక కిటికీ గ్లాసును గట్టిగా తట్టాడు. ఆకస్మిక దాడికి సంజన భయపడింది. ఇది దోపిడీ ప్రయత్నం అని ఆమె భావించింది.
ఆమె భయపడింది. ఆమె కారు యొక్క అవతలి వైపున ఉన్న షట్టర్లను కిందకి దించి, పెద్ద గొంతుతో “సెక్యూరిటీ” అని అరిచింది.
అతన్ని చూసిన క్షణం నుంచీ శివ ప్రవర్తనని అనుమానించిన సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు అతను ఖచ్చితంగా నేరస్థుడని భావించాడు. మందపాటి కర్రతో శివని తలపై గట్టి కొట్టాడు.
“అమ్మా…” అనే శివ బాధాకరమైన అరుపు విని సంజన కారులోంచి దిగింది. గార్డు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శివ నుదిటి నుండి రక్తం వస్తోంది.
శివ తన ఎడమ చేత్తో తన గాయాన్ని కప్పి చాలా వేగంగా మాట్లాడాడు.
“మేడమ్, నేను జెకె హాస్పిటల్‌లో పని చేస్తున్నాను. నేను చాలా ముఖ్యమైన పని గురించి మిమ్మల్ని చూడటానికి వచ్చాను. ఎవరో మిమ్మల్ని మోసం చేస్తున్నారు మేడమ్” అన్నాడు.
అప్పుడే సంజన శివ వైపు చూసింది. శివ పొడవైనవాడు, అందగాడు, కండలు తిరిగిన శరీరం! అతని పెద్ద కళ్ళు, పదునైన ముక్కు, మృదువైన రూపం అతన్ని చాలా అందంగా చేసింది. అతని చూపుల్లోని వాస్తవాన్ని సంజన గ్రహించింది. ‘ఈ అబ్బాయితో నాకు ప్రమాదం లేదు.’
వెంటనే ఆమె గార్డుకీ, డ్రైవర్‌కి ఆదేశాలు ఇచ్చింది.
“అతన్ని వదిలేయండి. డ్రైవర్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు.”
రాజశేఖర్ ఆసుపత్రిలో ఉంటాడని శివుడికి తెలుసు. రాజశేఖర్ అక్కడ అతన్ని చూసినట్లయితే, ఇంకా ఈ వ్యక్తులు ఇక్కడ ఏమి జరిగిందో రాజశేఖర్‍కి చెబితే, అతని వృత్తికి లేదా జీవితానికి మరింత ప్రమాదం. శివ సంజనను వేడుకున్నాడు:
“మేడమ్, దయచేసి వినండి, నేను ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేను. నేను చాలా చెప్పాలి. నేను బాధను భరించగలను. అయితే మొదట నా మాటలు వినండి.”
“నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పుడు చికిత్స చేయకపోతే గాయం పెద్దదై నీకు సెప్టిసిమియా వస్తుంది. నువ్వు ఆసుపత్రికి వెళ్లకూడదనుకుంటే, నేను డాక్టర్‌నే ఇక్కడికి రమ్మని అడుగుతాను.”
సంజన తన మొబైల్‌లోని నంబర్లను నొక్కింది.
***
నలభై ఐదు నిమిషాల తరువాత శివ వారి విశాలమైన డ్రాయింగ్ రూంలో సంజన ముందు కూర్చుని ఉన్నాడు. సంజన ట్రాక్ సూట్, టీ షర్టు లోకి మారిపోయింది.
“నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావా?”
“అవును మేడం.”
“నీ పేరు ఏమిటి?”
“శివ.”
“ఓహ్, అంబికా దేవి సిఫార్సు చేసినది నిన్నే కదూ”
శివ తలూపాడు.
“నేను ఆసుపత్రిలో రెండు గంటలకు పైగా పనిలేకుండా కూర్చున్నాను. నువ్వు నన్ను అక్కడ కలిసి ఉండచ్చుగా.”
“లేదు మామ్. నేను ఆఫీసులో ఈ సమస్య గురించి మాట్లాడలేను. ఎవరికి తెలుసు, నన్ను చంపేసినా చంపేస్తారు. నేను మీ నాన్నగారితో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఆయన వినే మానసిక స్థితిలో లేరు. ”
“విషయం అంత తీవ్రమైనదా?”
“రాజశేఖర్ మీ డబ్బు 18 లక్షలు మోసం చేశాడు. ఇది తీవ్రమైనదని మీరు అనుకోరా?”
“నీకు అనారోగ్యంగా ఉందా ఏమిటి? అతను మాతో పదేళ్ళుగా ఉంటున్నాడు. అతను కొంచెం దురుసు స్వభావం గలవాడు కాని పూర్తి నిజాయితీపరుడు. అతనిపై నిందలు వేయడానికి ప్రయత్నించవద్దు. సరేనా?”
“ఇప్పుడు నా మాట వినండి మేడమ్. మీ నమ్మకమైన సేవకుడి పూర్తి నిజాయితీ గురించి మీకు త్వరలో తెలుస్తుంది.”
శివ రెండు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను బయటకు తీశాడు, జరిగిన మోసం పద్ధతిని వివరంగా చూపించాడు.
సంజన నిర్ఘాంతపోయింది.
“దేవుడా! దయచేసి ఆ స్టేట్‌మెంట్లను నాకు ఇవ్వు. నేను నాన్నతో పాటు ఆడిటర్‌తో కూడా మాట్లాడాలి. ”
శివుడు ఆమెకు పేపర్లు ఇచ్చాడు. ఆమె స్టేట్‌మెంట్‌ని జాగ్రత్తగా అధ్యయనం చేసింది. ఆమె కొద్ది నిమిషాలు ఫోన్‌లో మాట్లాడుతూ గడిపింది. నిజమే, శివ చెప్పింది వాస్తవమే. ఆమె ఆ సాయంత్రం ఆసుపత్రి ఆడిటర్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
***
తన ముందు కూర్చున్న అందమైన అబ్బాయిని సంజన ఇప్పుడు మరోసారి చూసింది. అతనికి చికిత్స చేసిన డాక్టర్, కుట్లు వేయడానికి తగినంత లోతుగా గాయం లేదని చెప్పాడు. అతను గాయానికి కట్టు కట్టాడు, సురక్షితంగా ఉండటానికి యాంటీ-సెప్టిక్ ఇంజెక్షన్ ఇచ్చాడు.
అతని నుదిటిపై మందపాటి కట్టు అతన్ని దుర్బలంగా చేసింది, అదే సమయంలో వింతగా, అతన్ని మరింత అందంగా చేసింది.
పాపం, ఆసుపత్రి డబ్బును రక్షించడానికి చాలా సాహసం చేశాడు. ఆమె హృదయంలో అతని పట్ల అభిమానం కలిగింది.
“చాలా ధన్యవాదాలు, శివా. గార్డు చేసిన తప్పిదానికి నేను మరోసారి క్షమాపణలు కోరుతున్నాను. తప్పంతా నాదే. నేను అలా అరిచాను.
దయచేసి కొంతసేపు ఇక్కడే ఉండు. మొదటి అంతస్తులోని గెస్ట్ బెడ్ రూమ్‌ను ఉపయోగించుకోవచ్చు. నీ కోసం ఆహారాన్ని సిద్ధం చేయమని నేను వంటమనిషిని అడుగుతాను.”
“థాంక్స్, మేడమ్. అయితే అవన్నీ అవసరం లేదు మేడమ్. నేను ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. నేను ఇంటికి చేరుకోవడానికి మరో రెండు గంటలు పడుతుంది. నా ఇంట్లో వాళ్ళు ఆందోళన చెందుతారు. తలపై ఈ కట్టు చూస్తే, వాళ్ళింకా బెంగ పడతారు. దీని గురించి వాళ్ళకేం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు.”
“మీరు ఉండేది ఎక్కడ?”
“పురసవాక్కం. అబిరామి మాల్ వెనుక. ”
వారు ఆస్పిరాన్ గార్డెన్ రోడ్‌లో ఉన్న బంగ్లాను విడిచి, శివ ఉండే త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ వైపుకి బయలుదేరారు.
“నేను నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. నీ తలకి ఉన్న కట్టు గురించి మీ వాళ్ళకి నేను చెబుతాను.”
“మీకెందుకు ఇబ్బంది మేడమ్? మా ఇల్లు చాలా దూరంలో ఉంది.”
“నువ్వు మా కోసం అక్షరాలా రక్తం చిందించావు. ఈ మోసాన్ని తెలుసుకోవడానికి నువ్వు సాహసం చేశావు. నీ కోసం మేము చేయగలిగేది ఇదే. నీ బండి ఉందా?”
“లేదు మేడమ్. నేను బస్సులో వచ్చాను. ”
“రా వెళ్దాం.”
వారు భారీ పోర్టికోలోకి రాగానే ఇద్దరు డ్రైవర్లు వారి వైపు పరుగెత్తటం ప్రారంభించారు.
“నాకు అకార్డ్ కీస్ ఇవ్వండి! నేనే డ్రైవ్ చేస్తాను. ”
డ్రైవర్లలో ఒకరు ఆమెకు కీస్ అందించాడు.
“రా, శివ, ఎక్కు.”
శివ గోల్డెన్ కలర్ హోండా అకార్డ్ కారు ప్యాసింజర్ సీటులో కూర్చున్నాడు. సంజన డ్రైవర్ సీటులోకి ఎక్కి వాహనాన్ని పోనిచ్చింది.
ఆమె గేటు దగ్గర వాహనాన్ని ఆపింది. గార్డు అటెన్షన్‌లో నిలబడ్డాడు.
“విను, ఈయన మన ఆసుపత్రిలో ఒక అధికారి. నన్ను లేదా నాన్నని చూడటానికి ఇక్కడకు వచ్చినప్పుడల్లా లోపలికి రానివ్వండి. సరేనా? ”
“సరే మేడం.”
గార్డు ఇప్పుడు శివని గౌరవంగా చూస్తూ అతనికి గట్టి సెల్యూట్ కొట్టాడు.
“క్షమించండి, సార్.”
“పర్వాలేదు.”
(ఇంకా ఉంది)
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.