Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సగటుమనిషి స్వగతం-4

[‘సగటు మనిషి స్వగతం’ అనే కాలమ్‍ని అందిస్తున్నాము.]

నోరా వీపుకు తేకే అని ఒక వాక్యం  వుంది. సగటు మనిషికి ఈ వాక్యం నిత్య జీవితంలో ఎంతగా ఉపయోగపడుతుందో బాగా తెలుసు. ఎందుకంటే, ఎప్పుడూ, అందరినీ నమ్మి అన్ని విషయాలూ మాట్లాడేస్తూంటాడు. తరువాత దెబ్బతింటూంటాడు. అయినా మనుషులను నమ్ముతాడు. నమ్మి నోటి తాళాలన్నీ తీసేస్తూంటాడు. వీపుపై తాళం మోత మాధుర్యాన్ని అనుభవిస్తూంటాడు. ఏమైనా అంటే ఓ హిందీ కవిరాసినట్టు ‘బస్ యహీ  అపరాధ్ మై హర్ బార్ కర్తాహూ, ఆద్మీహూ, ఆద్మీ సే ప్యార్ కర్తా హూ’ అంటాడు. ఈ మధ్య ఎక్కడో గొప్పగా ఈ మాటలన్నాడు. ఒకప్పుడు ఈ మాటలంటే అందరూ నవ్వేవారు. గొప్పగా చూసేవారు. కానీ, ఈ మధ్య ఈ మాట అనగానే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా రియాక్టయ్యారు. ఒక్కరు గానీ, మెచ్చలేదు. బాగా చెప్పారూ అనలేదు.

కొందరు బూతులు మాట్లాడుతున్నాడు సగటు మనిషి అని కోపం ప్రదర్శించారు. ఇంకొందరు, సగటు మనిషికి ఇవేం మాటలు అని తిట్టారు. కొందరయితే, ‘వీడు గే’ అని ఈసడించారు. సగటు మనిషికి అర్థం కాలేదు. సగటు మనిషికి  గే అంటే, ఎల్లప్పుడూ ఆనందంగా, హాయిగా, చురుకుగా, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూండేవాడు అన్న అర్థం మాత్రమే తెలుసు. నేను అన్నది, నేను మనిషిని, మనిషిని ప్రేమించే తప్పు నేను చేస్తూనే వుంటాను అని. చాలా గొప్ప భావన అది. మానవత్వాన్ని ప్రదర్శిస్తాను అని చెప్పటం అది. దాన్లో బూతు ఏముంది? దాన్లో కోపం తెచ్చుకునేదేముంది?

ఇంతలో నాకు ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది.

వీళ్ళంతా నన్ను తిడుతున్న సమయంలో కొందరు యువతీ యువకులు ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వచ్చేశారు. గే బూతు కాదు. గే, లెజ్బియనిజం, బైసెక్షువల్, ట్రాన్స్‌జెండర్ మా హక్కు. ‘అది బూతు కాదు. అది యూతు’ అంటూ అరవటం మొదలుపెట్టారు.

“ఒక ఆడదాని కోసం మగవాడు పిచ్చివాడవటం బూజు పట్టిన పాత కథ. మగవాడికోసం మగవాడు చచ్చిపోవటం, ఒక తృతీయా ప్రకృతి కోసం ఒక పురుషుడు సర్వం వదిలేయటం అభ్యుదయం, అభివృద్ధి..” అంటూ ఆవేశంతో నినాదాలివ్వసాగారు.

‘నేను కథ రాస్తే ఇలాంటి కథలే రాస్తాను. భార్యను మరో అమ్మాయికి వదలి, తాను మరో అబ్బాయి వెంట పోవటం, భార్యను మరో మగాడికి వదిలి, తృతీయా ప్రకృతితో హాపీలీ ఎవర్ ఆఫ్టర్ జీవించటం నేను రాసే కథలు. అందుకే నాకు అవార్డులొస్తాయి. మగవాళ్ళంతా నన్ను గొప్ప రచయిత్రి అంటారు. నా చుట్టూ తిరుగుతారు’. అంది ఒక అభ్యుదయ హక్కోద్యమ రచయిత్రి. ఆమె అలా మాట్లాడుతూంటే ఆమెను విభిన్న కోణాలలో తమ సెల్ ఫోన్లలో వీడియో తీసేందుకు జర్నలిస్టులంతా పోటీలు పడ్డారు.

అప్పుడర్థమయింది.. నేను అన్న దాన్లోని ‘ఆద్మీ’ అన్న పదం వీళ్ళకెలా అర్థమయిందో!!!!

ఆద్మీ అంటే మనిషి అని అర్థం. మర్ద్ అద్మీ హూ అంటారు. అంటే, మగమనిషిని అని అర్థం. అయితే, ఆద్మీ అంటే, మగవాడు, ఔరత్ అంటే, స్త్రీ. కాబట్టి, ఆద్మీ హూ, ఆద్మీ సే ప్యార్ కర్తాహూ అంటే, నేను మగవాడిని మగవాడిని ప్రేమిస్తాను అని వీళ్ళు అర్థం చేసుకున్నారు. హతవిధీ!!!!

ఈ హతవిధీ అని పైకి అనాలంటే భయం వేస్టోంది. మళ్ళీ ఈ హతవిధి ఎవరెలా అర్థం చేసుకుంటారో అన్న భయం నా నోరు నొక్కేసింది.

ఆ తరువాత గమనిస్తూంటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయాన్నీ, అసలు విషయాన్ని గమనించకుండా, తాము ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అలా, తమకెలా అర్థమయితే అలా అర్థం చేసుకోవటమే కాకుండా, అదే అసలు అర్థం అని పట్టుబట్టి వాదించటమే కాదు, అవసరమయితే తిట్లకూ, హింసకూ కూడా వెనుకాడటంలేదు.

పదాల అర్ధాలు మారటమే కాదు, పదాలను అర్ధం చేసుకునే విధానమూ మారిపోతోంది. ఏ మాటంటే ఎవరికి ఎందుకు కోపం వస్తుందో తెలియటంలేదు. ఎవరికి ఎందుకు అవమానమవుతుందో తెలియటంలేదు.

ఒకప్పుడు బక్కోడా, నల్లోడా, కర్రోడా, ఎర్రోడా, పొట్టోడా,  ఇలా పిలిచి ఏడ్పించుకుంటూ ఆడుకునేవారు పిల్లలు. ఇప్పుడిలా పిలిస్తే, బాడీ షేమింగ్, అపార్థేయిడ్, కలర్ డిస్క్రిమినేషన్..ఇలా ఏవేవో పెద్ద పెద్ద మాటలంటున్నారు. యుద్ధానికి వస్తున్నారు.

నేనేమీ గాజులు తొడుక్కుని కూచోలేదు అంటే, ఒకప్పుడు వేరే రకంగా అర్ధమయ్యేది. ఇప్పుడు ఆడవాళ్ళని అవమానిస్తున్నాడని గోల జరుగుతుంది.

ఆమధ్య ఒకరోజు మా ఆఫీసులో ఒక కొలీగ్ కి ఏదో వివరిస్తూ, ‘ఇది చాలా సింపుల్, చిన్న పిల్లలకు  కూడా సులభంగా అర్ధమవుతుంది’ అన్నాను.

మరుసటి రోజు మా అఫీసర్ నుంచి పిలుపు వచ్చింది. నేను నా కోలీగుని కులం ఆధారంగా దూషించానని, అతడికి తెలివిలేదని అవమానించాననీ ఫిర్యాదు చేశాడు నా కొలీగు. ఇంతకీ నా కొలీగుదే కులమో ఆ రోజు దాకా నాకు తెలియదు. ఆ రోజునుంచీ అతడితో మాట్లాడాలంటేనే భయం పట్టుకుంది సగటుమనిషికి.

ఆ గొడవ అంతటితో ఆగలేదు.  ఆ కులానికి చెందిన ఉద్యోగుల సంఘం వాళ్ళు సగటుమనిషిని కలసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఆట్రోసిటీ కేసు పెడతాము. జైలు కెళ్తావు. ఉద్యోగం పోతుంది అని బెదిరించారు. ఆ రోజునుంచీ  ఎవరికేదయినా వివరించాల్సి వస్తే, ఎంత చెప్పాలో అంతే చెప్పి బ్రతుకు జీవుడా అని బయటపడుతున్నాడు సగటుమనిషి.

ఇదంతా సగటు మనిషికి భయం కలిగిస్తున్నది.

ఎందుకని మనుషుల్లో ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకునే శక్తి నశిస్తోంది? ఎందుకని ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు మనుషులు?

ఈ పరిస్థితి మామూలు సగటు మనుషుల్లోనే కాదు, దేశభవిష్యత్తు నిర్దేశకులు, భాగ్యవిధాతలయిన రాజకీయ నాయకులలో మామూలు మనుషులకన్నా అధికంగా కనబడటం సగటు మనిషి గమనించాడు. రాజకీయ నాయకులయితే ఇష్టం వచ్చినట్టు, అడ్డూ అదుపూ లేకుండా నోటికెంత వస్తే అంత మాట్లాడేస్తారు. వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ వాళ్ళు, వీళ్ళని సమర్ధిస్తూ వీళ్ళవాళ్ళు.. అబ్బబ్బ.. అదొక పచ్చి, పిచ్చి రచ్చ రచ్చ వాదన రోదన యుధ్ధ సమాన పిచ్చాపాటీ. ఈ మధ్య ఈ యుధ్ధంలాంటి వాదనల్లో టీవీ యాంకర్లు కూడా సమానంగా పోటీ పడుతూ తమ తమ అభిప్రాయాలు వినిపించేస్తున్నారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకమైన అభిప్రాయం చెప్పే వారిని అదిలించి, బెదిరించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నోళ్ళు మూయించేస్తున్నారు. తటస్థంగా వుండి, చర్చకు వచ్చినవారి అభిప్రాయాలను వినిపించి ప్రజలు ఒక నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేయాల్సిన యాంకర్లు, తామే స్వయంగా చర్చించేవాళ్ళకన్నా ఎక్కువగా అభిప్రాయాలు చెప్పేస్తూంటే, ఇక చర్చ ఏముంది? ప్రేక్షకులకు నిజానిజాలు తెలిసేదేముంది? త్వరలో రాజకీయ నాయకులేకాదు, యాంకర్లు కూడా, స్టూడియోకు వచ్చిన గెస్టులతో బాహాబాహీ, ముక్కాముక్కీ, పిక్కాపిక్కీలలో పాల్గోంటారనిపిస్తుంది.

రాజకీయ నాయకులు, యాంకర్లేకాదు మేధావులుగా పేరొందిన వారు, మేధావులుగా గుర్తింపుపొందిన మహాముఠాల మేధావోత్తమ రచయితలు, కవులు కూడా ఎంత పడితే అంత, ఏంతొస్తే అది, ఎలా తోస్తే అలా అర్ధం చేసుకోవటమూ, మాట్లాడేయటమూ చూస్తూ సగటు మనిషి విస్తుపోతూ, చస్తూ, అస్తు అస్తు అంటూ మస్తుచుస్తుసుస్తుమాటలు వింటూ సుస్తీ అయిపోతున్నాడు. ఒకాయన పురాణాలు చరిత్ర కావంటాడు. కోట వేంకటాచలం గారికి చరిత్ర తెలియదంటాడు. తనకు నచ్చనివి మాట్లాడేవారెవరికీ ఏమీ తెలియదంటాడు. అలాంటివాడు, ఓ కాల్పనిక సినిమా చూసి అసలు చరిత్ర అదే అంటాడు. కాదన్న వారిపై కదం తొక్కుతాడు. అరే,  చరిత్ర గురించి మాట్లాడేవారికి చరిత్ర గురించి ఏమీ తెలియకపోవటం, ఆద్మీ అంటే మగవాడని అర్థం చేసుకోవటానికీ తెడా ఏమీ లేదనిపిస్తుంది.

ఒలంపిక్స్ పోటీల్లో బరువెక్కువుందని ఒక ఆటగత్తె అనర్హురాలని నిర్ణయిస్తే, ఆమె అనర్హతకు దేశ ప్రధాని కారణం అనటమే కాదు, అలా కార్టూన్లు గీయటం, వ్యాఖ్యానించటం, రూల్ ఈస్ రూల్ అని అన్నవారిని ఇష్టమొచ్చినట్టు  హేళన చేయటం.. ఈ చేస్తున్నవారంతా ఆలోచనాపరులుగా, మేధావులుగా, తెలివైనవారుగా గుర్తింపు పొందిన వారవటం చూస్తూంటే, సగటు మనిషి ఎందుకని జీవితంలో ఏ ఎదుగుదల లేక సగటు మనిషిగా మిగిలిపోయాడో అర్ధమవుతున్నది.

సగటు మనిషి ప్రతి దాన్లో లాజిక్ చూస్తాడు. అర్థాలు, ఆధారాలు వెతుకుతాడు. నిజమని నిర్ధారించుకున్న తరువాతే స్పందిస్తాడు. ఈలోగా పుణ్యకాలం దాటిపోతుంది. ఈ కాలంలో ముందు నోటికొచ్చింది అనేయాలి. అర్థం వున్నా లేకున్నా పెడార్థాలు ఎడాపెడా తీసేయగలగాలి. పేరున్న వారిని విమర్శించేయాలి. కాదన్నవారితో వాదించాలి. తిట్టాలి. తిట్టించుకోవాలి. నానా కంగాళీ చేయాలి. పరువు ప్రతిష్ఠ, లాజిక్, అర్థం పర్థం అనర్థం దురర్థం అంటూ ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఇంకేం, క్షణాల్లో సగటు స్థాయి దాటి అసామాన్య స్థాయికి ఎదిగిపోవచ్చు. ఇదంతా సగటు మనిషికి చేతకాదు కాబట్టే సగటు మనిషిగా మిగిలిపోతున్నాడు సగటు మనిషి.

ఇదే రకంగా ‘తా వలచింది రంభ, తా మునిగింది గంగ’ అన్నట్టు తనకెలా అర్థం మయితే అదే అసలు అర్థం అన్నట్టు గొప్ప గొప్ప సాహిత్య సృజనకారులుగా గుర్తింపు పొందినవారు కూడా ప్రవర్తించటం అర్థం చేసుకోవటం సగటు మనిషిని ఆశ్చర్యాంబుధులబధిరలోకాలలోలోతుల్లోకి నెట్టేస్తోంది. గొప్పాతిగొప్పాతి అత్యాతి సామూహిక  సాహిత్యాచార సాహిత్యముఠాల వాళ్ళంతా, తాము సృష్టించిందే సాహిత్యం, తమ వెంట వున్నవారిదే సాహిత్యం మిగతాంతా చెత్తాతిచెత్తాతి చెత్తల్లో పనికిరాని చెత్తల్లోకే చెత్త అన్నట్టు మాట్లాడుతూంటే, ఆ చెత్తాతిచెత్తాతి చెత్తల్లోకే పనికిరాని చెత్తల్లోకే చెత్తల్లో అట్టడుగున వున్నట్టుగా ఆ రోతలరాతల కోతలరాయుడి మాటలు తమని కానట్టే రచయితలంతా మిన్నకుండటం, మౌనంగా అర్ధామోదం తెలుపుతున్నట్టుండటం అనర్థ దాయకమన్న ఆలోచన కూడా లేనట్టుండటం, వీరంతా సమాజానికి దిశానిర్దేశనం చేసే రచయితలు కావటం కూడా, ఆద్మీ హూ ఆద్మీ సే ప్యార్ కర్తా హూ అంటే స్వలింగసంపర్కంలా అర్థమయ్యే మనుషుల లాంటి వారే అనిపిస్తుంది. ఇంత బధిరబాబుల్లా సాహిత్య సృజనకారులెలా మారిపోయారో అనిపిస్తుంది. ఇదంతా సగటు మనిషిలో అంతులేని ఆశ్చర్యపుటలల సునామీని రగిలిస్తోంది. మళ్ళీ అదే ప్రశ్నను కలిగిస్తోంది.

ఎందుకని మనుషులకు చిన్న చిన్న విషయాలు కూడా సవ్యంగా అర్థం కావటం లేదు? ఎందుకని మనుషులు తమ పరిధిని దాటి అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం లేదు? ఎందుకని ఎవరికివారు తమ చుట్టూ గిరి గీసుకుని దాన్ని ఇంకా సంకుచితం చేసుకోవాలనుకుంటున్నారు తప్పించి తమ పరిధిని విశాలం, విస్తృతం చేసుకోవాలని ప్రయత్నించటం లేదు? ఎందుకని ప్రతి ఒక్కడూ తనకే అంతా తెలుసు, ఇతరులకేమీ తెలియదు, తానేంచేస్తే అది గొప్ప అని నమ్మి అలా ప్రవర్తిస్తున్నాడు. వినదగునెవ్వరు చెప్పిన అన్నది కేవలం సగటుమనిషికే పరిమితమయింది. వినినంతనే వేగపడక వివరింపదగున్ అన్నమాటను పట్టుకుని, వివరించాలనుకుంటే వినేదెవరు? ఎవరికి వారికి వారికి తెలిసిందే నిజం. వారికి వచ్చిందే గ్న్యానం.

సగటు మనిషి మేధావి కాదు. ఉద్యమ రచయిత కాదు. కాబట్టి ఉట్టిగా ప్రశ్నించి వదిలేయడు. ద్వేషాలు రెచ్చగొట్టి ఊర్కోడు. గోడలు పగలగోట్టటమే నా పని అని  వేరేవారితో  విరగ్గొట్టించి  పక్కకు తప్పుకోడు.

సగటు మనిషికీ సమస్యలన్నిటికీ మూలం ఎదురుగా కనిపిస్తున్న దాన్ని సరిగ్గా చూడగలగటం నేర్పించని విద్యావిధానం అనిపిస్తుంది. క్లాసుల్లో భాషల క్లాసులకు ప్రాధాన్యం ఇవ్వకుండా సబ్జెక్టులకే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల భాషను అర్థం చేసుకునే శక్తి, భాష సౌందర్యాన్ని అనుభవించే శక్తి నశిస్తోంది. అసలయిన కవిత్వాన్ని సరయిన కవిత్వాన్ని సరైన విధంగా అందించకుండా, పదాల శక్తిని, పదాలలో ఒదిగిన సౌందర్యాన్ని, పదాలలోని భావాన్ని, ఒక పదం వాడటంలోని ఔచిత్యాన్ని, పదంలో పైకి కనబడకుండా లోలోపల నిండిన అనేకానేక భావాలను అర్థం చేసుకుని అనుభవించే శక్తిని బాల్యంనుంచీ ఇస్తే అప్పుడు సందర్భాన్ని బట్టి ఆద్మీ అంటే మనిషి అనీ, మగవాడు అనీ అర్థం చేసుకుంటారు. లేకపోతే, రోబోట్‌లా ఏది అర్థమయితే, ఎంత అర్థమయితే అంతే అనుకుంటారు. పశు రోబోట్లలా అనవసరమైన అన్ని విషయాలకూ ఆరాటపోరాటరాట్లాటలాడుకుంటూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. అంతవరకూ సగటు మనిషి మాట్లాడటం మానేయటమో, మాట్లాడితే, ఎదుటివాడు అనర్థపుటపార్థం తీసేలోగా తానే అర్థం చెప్పి క్షమార్పణలు చెప్పుకుని చెంపలేసుకుని గప్‌చుప్‌గా వుండటం తప్ప వేరే మార్గంలేదు. కానీ, మౌనంగా వుండేంత విచక్షణ వుంటే సగటుమనిషి ఎలా అవుతాడు?

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version