[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘సగటు ఉద్యోగి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉదయాన్నే సూర్యునికి బై చెప్పి
కార్యాలయపు కలుగులోకి దూరి
కృత్రిమ దీపాల వెలుగుల్లో
కర్తవ్యపు ధాన్యాన్ని విసిరి విసరి
అలసి సొలసి
బయటకు అడుగులు వేస్తే
పరిచయమైన వెలుగు మాయం
ప్రకృతి ప్రసాదించిన వెలుతురూ మాయం
నలుపు దుప్పటి
నిండుగా కప్పుకున్న ఆకాశానికి
అక్కడక్కడా చుక్కల వెండి మరకలు
ఎక్కడో ఓ అక్కడ
చందమామ బంగరు చిరుగు
నెలవు వీడేవేళ
ఉత్సాహం నిండిన ఈ దేహానికి
ఉదయం నవ్వుతూ వీడ్కోలు చెబితే
కొలువు చేసొచ్చి
అలసి సొలసిన ఈ ఆకారానికి
రాత్రి జాలిగా స్వాగతం చెబుతుంటుంది
ఆరు రోజులూ, వారంలో అదే క్రమం
ఓ కొసన వెలుగులు పండిన ఉదయం
మరో చివరన చీకటి నిండిన రాతిరి
ఆదివారం మాత్రం ఆటవిడుపుల్లా
పగలూ సాయంత్రాల విశ్రాంతి జాడలు
అవును,
నేను ఉద్యోగిని కదా
ప్రభువులవారికో
ప్రయివేటుదారులకో
సొంతం అయిన కార్యాలయాల్లో
కాలాన్ని తాకట్టు పెట్టి
దైహికమైనదో.. మేధోపరమైనదో
ఏదో ఓ శ్రమను అమ్మకం చేస్తూ
బతుకు సరుకులను.. భవిష్యత్తు భరోసాను
నిరంతరం కొనుగోలు చేస్తున్న
మనిషిని కదా నేను..!
సగటు ఉద్యోగిని కదా నేను..!!
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
